వేమన పద్యాలు/గ
గంగ పారు చుండు కదలని గతి తోడ
[మార్చు]గంగ పారు చుండు కదలని గతి తోడ
ముఱికి కాల్వ పారు మ్రోఁత తోడ
దాత యోర్చునట్లధము డోర్వఁగా లేఁడు
విశ్వదాభిరామ వినర వేమ!
గంగిగోవుపాలు గరిటెడైనను జాలు
[మార్చు]గంగిగోవుపాలు గరిటెడైనను జాలు
కడివెడైననేమి ఖరముపాలు
భక్తిగలుగుకూడు పట్టెడైనను జాలు
విశ్వదాభిరామ వినర వేమ!
గింజఁ జెడగనాడ గీడు తోడనె తాకు
[మార్చు]గింజఁ జెడగనాడ గీడు తోడనె తాకు
గింజ గల్గియున్నఁ గీడుపోవు
గింజలు గలవాని లంజలపంచను
గంజి కుండ్రు జనులు కడఁగి వేమా!
గండడైన దొంగ కవులసొమ్మెగ వేసి
[మార్చు]గండడైన దొంగ కవులసొమ్మెగ వేసి
కండకావరాన కదియబలిసి
గండుకుక్కవలెను కాటుకు తిరుగురా!
విశ్వదాభిరామ వినురవేమ!
గంపెడంత తవుడు గంపలోఁ బెట్టక
[మార్చు]గంపెడంత తవుడు గంపలోఁ బెట్టక
చన్నుఁ బట్టనీదు కొన్నబఱ్ఱె
వారకాంత లేల వలతురు నూరక
విశ్వదాభిరామ వినర వేమ!
గాజు కుప్పె లోన కడఁగుచు దీపంబు
[మార్చు]గాజు కుప్పె లోన కడఁగుచు దీపంబు
యెట్టు లుండు, జ్ఞాన మట్టు లుండుఁ
దెలిసినట్టి వారి దేహంబు లందును
విశ్వదాభిరామ వినర వేమ!
గట్టురాళ్ళఁ దెచ్చి కాళ్ళచేతులఁ ద్రొక్కి
[మార్చు]గట్టురాళ్ళఁ దెచ్చి కాళ్ళచేతులఁ ద్రొక్కి
కాసెయులులచేతఁ గాసిఁజేసి
మొఱుపురాళ్ళ కెఱగుమొప్పెల నేమందు
విశ్వదాభిరామ వినర వేమ!
గొడ్డుటావుఁ బితుకకుండఁ గొంపోయిన
[మార్చు]గొడ్డుటావుఁ బితుకకుండఁ గొంపోయిన
పండ్లు నూడఁదన్నుఁ బాలు రావు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ వినర వేమ!
గాడ్దె యేమెఱుంగు గంధంబు వాసన
[మార్చు]గాడ్దె యేమెఱుంగు గంధంబు వాసన
కుక్క యేమెఱుంగు గొప్పబుద్ధి
అల్పుఁడే మెఱుంగు హరునిఁ గొల్చు విరక్తి
విశ్వదాభిరామ వినర వేమ!
గాడ్దెమేనునిండ గంధంబుఁ బూసిన
[మార్చు]గాడ్దెమేనునిండ గంధంబుఁ బూసిన
నేమి యెఱుఁగలేక యెగసితన్ను
నీడుకానివాని నిష్ట మీలాగురా
విశ్వదాభిరామ వినర వేమ!
గడనగల పురుషుఁ గనుగొని
[మార్చు]గడనగల పురుషుఁ గనుగొని
యడుగులకును మడుగు లిడుదు రతివలు ధరలో
గడన విడుపురుషుఁగనుగొని
నడపీనుగ వచ్చెనండ్రు నాతులు వేమా!
గతము చేసినట్టి కర్మబంధము లన్ని
[మార్చు]గతము చేసినట్టి కర్మబంధము లన్ని
తరలిపోవు సత్యగురునివలన
కమ్మరి కొకయేఁడు గుదియకు నొకనాఁడు
విశ్వదాభిరామ వినర వేమ!
గతము చూతమన్న కలఁగన్న యర్థంబు
[మార్చు]గతము చూతమన్న కలఁగన్న యర్థంబు
నడుచు కార్యమేని నమ్మరాదు
క్షణములోని బ్రతుకు సంసార విభ్రాంతి
విశ్వదాభిరామ వినర వేమ!
గద్దె గణము నిద్ర కలలు కోరికలును
[మార్చు]గద్దె గణము నిద్ర కలలు కోరికలును
ముద మొసంగ శకునములకుఁ జెలఁగు
ప్రశ్నలు పదివేలు పరికించి చూడంగ
నవును కాకపోవునగును వేమా!
గొప్పపిఱుఁదు గన్న కుచకుంభములఁ గన్న
[మార్చు]గొప్పపిఱుఁదు గన్న కుచకుంభములఁ గన్న
చెప్పరానిచోటి చెలువుగన్న
ముప్పిరి గొనునయ్య మొనసిన మోహంబు
విశ్వదాభిరామ వినర వేమ!
గోపురములు గుడ్లు కోనేర్లు తేరులు
[మార్చు]గోపురములు గుడ్లు కోనేర్లు తేరులు
ఆకు లసురుగుడులు నడలఁగాను
నేఱు వంతదిఱిఁగియెగఁ బట్టుకొనెనయా
విశ్వదాభిరామ వినర వేమ!
గీము విడిచి సుగుడి గిక్కురుమన కుండు
[మార్చు]గీము విడిచి సుగుడి గిక్కురుమన కుండు
జీవు విడుచువేళ శివునిఁ దలఁచు
మనసు గొల్పకయును మాయచేఁ బొరలెడు
పాపనరుల కేటి పరము వేమ!
గ్రామము భూముల మానుక
[మార్చు]గ్రామము భూముల మానుక
ప్రేమోదయమింత లేక భీకరమతులై
భామల సుతులను వదలుక
బాములఁ బడనేల యడవిపట్టున వేమా!
గాలి గాలి గలసె గగనంబు గగనంబు
[మార్చు]గాలి గాలి గలసె గగనంబు గగనంబు
మన్ను మన్ను గలసె మంట మంట
నీరు నీటఁ గలసె నిర్మలంబయి యుండె
విశ్వదాభిరామ వినర వేమ!
గాలిలేని దీపకళిక చందంబున
[మార్చు]గాలిలేని దీపకళిక చందంబున
నలలుసుళ్లులేని జలధిరీతి
నిశ్చలాత్మయున్న నిర్వికారంబున
ముక్తియండ్రు దాని మొగిని వేమ!
గుణయుతునకు మేలు గోరంతఁ జేసినఁ
[మార్చు]గుణయుతునకు మేలు గోరంతఁ జేసినఁ
గొండయౌను వానిగుణముచేత
కొండకొలఁదిమేలు గుణహీనుఁ డెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ!
గుణవతి యగు యువతి గృహము చక్కగనుండు
[మార్చు]గుణవతి యగు యువతి గృహము చక్కగనుండు
చీకటింట దివ్వె చెలఁగురీతి
దేవియున్న యిల్లు దేవార్చన గృహంబు
విశ్వదాభిరామ వినర వేమ!
గుణహీనజనుని గుణ మెంచగా నేల
[మార్చు]గుణహీనజనుని గుణ మెంచగా నేల
బుద్ధిలేనివాని పూజలేల
మనసు లేనివాని మంత్రంబు లేలరా
విశ్వదాభిరామ వినర వేమ!
గురుఁ డనఁగా పరమాత్ముఁడు
[మార్చు]గురుఁ డనఁగా పరమాత్ముఁడు
పరగంగా శిష్యుఁడనఁగఁ బటుజీవుఁడగు
గురుశిష్య జీవసంపద
గురుతరముగఁ గూర్చు నతఁడు గురువగు వేమా!
గురుఁడనఁగా మొదలంతకు
[మార్చు]గురుఁడనఁగా మొదలంతకు
గురుశిష్యు లనంగ నెల్లకొమ్మలుకాగా
గురువును గానగఁ జాలరు
ధరలోపల మనుజులెల్లఁ దలఁపరు వేమా!
గురుచరణముఁ బట్టఁ గుక్కలు గఱచును
[మార్చు]గురుచరణముఁ బట్టఁ గుక్కలు గఱచును
గురుచరణము విడువఁ గుక్క గఱచుఁ
గుక్కకున్న బుద్ధి గురునకు లేదురా
విశ్వదాభిరామ వినర వేమ!
గురుడనగ ధేనువె తగు
[మార్చు]గురుడనగ ధేనువె తగు
వరశిష్యుడు వత్సమగుచు వర్తింపగా
దరిగలిగిన నప్పుడొసగును
నిరుపమ లక్ష్యామృతంబు నిజముగవేమా!
గురుతు గనుచు చెప్పు గురుడెవ్వడును లేడు
[మార్చు]గురుతు గనుచు చెప్పు గురుడెవ్వడును లేడు
గురుతెరుంగు శిష్యవరుడు లేడు
గురుడు శిష్యుడనుట గుడ్డెద్దు చేనురా!
విశ్వదాభిరామ వినురవేమ!
గురుని పరమగురుని గుఱుతుగాఁ దెలియక
[మార్చు]గురుని పరమగురుని గుఱుతుగాఁ దెలియక
గురువుగాను నుండు గ్రుడ్డిరీతి
గురువుకు గురువైన గురుఁడు ప్రాణేశుండు
విశ్వదాభిరామ వినర వేమ!
గురుని శిష్యుని నియతి గురుతుగా మదిలోన
[మార్చు]గురుని శిష్యుని నియతి గురుతుగా మదిలోన
కానలేడు భ్రాంతిమానలేడు
గురుని శిష్యుడెంచు గురియదే యగునురా
విశ్వదాభిరామ వినురవేమ!
గురునిందజేసి గుట్టెరుంగనివాడు
[మార్చు]గురునిందజేసి గుట్టెరుంగనివాడు
యమునిబాధనందు క్రమముగాను
తేనెలోని ఈగ తెరగున నగునయా!
విశ్వదాభిరామ వినురవేమ!
గురునితోడ బొందు కూడియుండినవాడు
[మార్చు]గురునితోడ బొందు కూడియుండినవాడు
చేరి బ్రహ్మనంటి చెలగియుండు
మరుగు తెలిసెనేని మర్మంబు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ!
గురునిశిక్షలేక గురుతెట్లు కల్గునో
[మార్చు]గురునిశిక్షలేక గురుతెట్లు కల్గునో
అజునికైన వాని యబ్బకైన
తాళపుచెవిలేక తలుపెట్టులూడునో!
విశ్వదాభిరామ వినురవేమ!
గురుల పరమ గురుని గురుతుగా తెలియక
[మార్చు]గురుల పరమ గురుని గురుతుగా తెలియక
గురువు తానుయుండు గ్రుడ్డిరీతి
గురువునకు గురువైన గురువు ప్రాణేశుండు
విశ్వదాభిరామ వినురవేమ!
గురువు చిల్లగింజ కుంభ మీదేహంబు
[మార్చు]గురువు చిల్లగింజ కుంభ మీదేహంబు
ఆత్మ కలుషవంక మడుగుఁబట్టఁ
దెలిసి నిలిచెనేని దివ్యామృతంబురా
విశ్వదాభిరామ వినర వేమ!
గురువు తానయైన హరిని తాఁ జూచును
[మార్చు]గురువు తానయైన హరిని తాఁ జూచును
బ్రహ్మలోక మతఁడు పాఱఁజూచు
శిష్యు నరసిపట్టి చీఁకటిఁ బాపురా
విశ్వదాభిరామ వినర వేమ!
గురువు శిష్యుడనగ కొసలెట్లు మొదలెట్టు
[మార్చు]గురువు శిష్యుడనగ కొసలెట్లు మొదలెట్టు
గురువు శిష్యుడనెడి గురుతులెట్లు
గురున కుండదగిన పరువు లేకుండిన
విశ్వదాభిరామ వినురవేమ!
గురువు సెప్పువిద్య గురువునకును దెలియు
[మార్చు]గురువు సెప్పువిద్య గురువునకును దెలియు
గురువుసెప్పు విద్య గురునయెఱుఁగు
గురువుమహిమ పరమగురునకుఁదెలియును
విశ్వదాభిరామ వినర వేమ!
గురువుఁగూడుఁజేసి గుణము వత్తిగఁజేసి
[మార్చు]గురువుఁగూడుఁజేసి గుణము వత్తిగఁజేసి
సరవిఁగర్మఁ జమితి సమురుఁ జేసి
మూల నొక్కజ్యోతి ముట్టించి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!
గురువుగలుగునాత్మ గురుతెరుంగుదమని
[మార్చు]గురువుగలుగునాత్మ గురుతెరుంగుదమని
కాలమెల్లరిత్త గడపిరయ్య
గురువుదొరుకునపుడు కూలునీ దేహంబు
విశ్వదాభిరామ వినురవేమ!
గురువునకును పుచ్చకూరైన నియ్యరు
[మార్చు]గురువునకును పుచ్చకూరైన నియ్యరు
అరయ వేశ్యకిత్తు రర్థమెల్ల
గురుఁడు వేశ్యకన్న గుణహీనుఁ డేమొకో
విశ్వదాభిరామ వినర వేమ!
గురువులేక విద్య గుఱుతుగా దొరకదు
[మార్చు]గురువులేక విద్య గుఱుతుగా దొరకదు
నృపతిలేక భూమి నియతిగాదు
గురువు విద్యలేక గురుతర ద్విజుఁడౌనె
విశ్వదాభిరామ వినర వేమ!
గుఱుతు తిథులవలనఁ గులమెల్లఁ జెడిపోయె
[మార్చు]గుఱుతు తిథులవలనఁ గులమెల్లఁ జెడిపోయె
స్త్రీల నడతవలన సిగ్గుపోయె
ఏహ్యపల్వలముల నిలయెల్లఁ జెడిపోయె
చాన్లవలన బ్రతుకు సమయు వేమా!