Jump to content

వేమన పద్యాలు/స

వికీసోర్స్ నుండి

సందె వార్చఁగ నేమి జపము సేయగ నేమి

[మార్చు]

సందె వార్చఁగ నేమి జపము సేయగ నేమి
వేదశాస్త్రములను వెలయ నేమి
పడఁతిఁ గనినవాఁడు బాపఁడు గాఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!

సకల శాస్త్రములను జదివియు వ్రాసియు

[మార్చు]

సకల శాస్త్రములను జదివియు వ్రాసియు
తెలియఁగలరు చావు దెలియ లేరు
చావు తెలియలేని చదువులవేలరా
విశ్వదాభిరామ వినర వేమ!

సకలాకారుఁ డనంతుఁడు

[మార్చు]

సకలాకారుఁ డనంతుఁడు
సకలాత్ములయందు సర్వసాక్షియుఁ దానే
సకలమున నిర్వికారుం
డకలంకస్థితిని బ్రహ్మ మగునుర వేమా!

సకలవిద్య లరసి చచ్చి బ్రతుకువిద్య

[మార్చు]

సకలవిద్య లరసి చచ్చి బ్రతుకువిద్య
యొకటినేర మనుచు నుర్విజనులు
కటకటఁ బడుదురు కడహానిఁ దెలియరు
విశ్వదాభిరామ వినర వేమ!

సకలవిద్య లరసి సంతోషపడవచ్చుఁ

[మార్చు]

సకలవిద్య లరసి సంతోషపడవచ్చుఁ
జెయ్యిసాచి కాసు లియ్యఁలేడు
చెలఁగి యొరులకైన చెప్పవచ్చునుగాని
తాను చేయలేఁడు ధరను వేమ!

సాగి పాఱురారు సకలకార్యంబుల

[మార్చు]

సాగి పాఱురారు సకలకార్యంబుల
వాక్ప్రగల్భములచె వరలుచుండ్రు
సాగిపాఱక సఱిసమకూడ దొక్కటి
ధనమదెంతయున్న ధరను వేమా!

సిగ్గటంచనఁ బడు సిగ్గునెచ్చోనుండు

[మార్చు]

సిగ్గటంచనఁ బడు సిగ్గునెచ్చోనుండు
ఆఁకలనుచు నుందు రాఁకలేది
దాఁగియున్న వానిఁ దానేల యెఱుఁగఁడో
విశ్వదాభిరామ వినర వేమ!

సిగ్గు విడువకున్న శివసౌఖ్యమేలేదు

[మార్చు]

సిగ్గు విడువకున్న శివసౌఖ్యమేలేదు
తగ్గ మొగ్గకున్న సిగ్గు విడదు
సిగ్గు విడుచువాఁడు చిరకాల జీవిరా
విశ్వదాభిరామ వినర వేమ!

సిగ్గునేడనుదాగుఁ జీక టేడను దాగు

[మార్చు]

సిగ్గునేడనుదాగుఁ జీక టేడను దాగు
నాఁకలేడదాగు నాత్మలోన
దాగియున్న నిద్ర దాగుట తెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!

సిగ్గువారల మని సృష్టిలోపలివారు

[మార్చు]

సిగ్గువారల మని సృష్టిలోపలివారు
వెఱ్ఱివేమనఁ గని వెఱఁగుపడిరి
తనకుఁ గలుగుసిగ్గు దైవ మెఱుంగురా
విశ్వదాభిరామ వినర వేమ!

సజ్జనముల చెలిమి చాలింపఁగా రాదు

[మార్చు]

సజ్జనముల చెలిమి చాలింపఁగా రాదు
ప్రకృతి నెఱుఁగకున్న భక్తిలేదు
పలువ లెట్టిరీతి భక్తి సల్పుదురయా
విశ్వదాభిరామ వినర వేమ!

సతి యొనర్చు చెడ్డ పతి కవశ్యము వచ్చు

[మార్చు]

సతి యొనర్చు చెడ్డ పతి కవశ్యము వచ్చు
పతియొనర్చు మంచి సతికి సగము
పతి యొనర్చు చెడ్డ సతి కేల రాదురా
విశ్వదాభిరామ వినర వేమ!

సతికి పతికినైన సంపద సంపదే

[మార్చు]

సతికి పతికినైన సంపద సంపదే
పుత్రసంపదలును భువిని మేలు
సరిగముదిసి బ్రతుకు సంపదే సంపద
విశ్వదాభిరామ వినర వేమ!

సతము బాహ్యపూజ చాలఁ జేసినపిదప

[మార్చు]

సతము బాహ్యపూజ చాలఁ జేసినపిదప
కపటము విడలేక కష్టనరులు
ముక్తి నొందలేక మునిగిరి తమమున
విశ్వదాభిరామ వినర వేమ!

సత్య మమరియుండ జ్ఞాన మమరియుండు

[మార్చు]

సత్య మమరియుండ జ్ఞాన మమరియుండు
జ్ఞాన మమరియుండ సత్యముండు
జ్ఞానసత్యములును సమమయిన ద్విజుఁడగు
విశ్వదాభిరామ వినర వేమ!

స్త్రీ నెత్తిన రుద్రునకును

[మార్చు]

స్త్రీ నెత్తిన రుద్రునకును
స్త్రీ నోటను బ్రహ్మకెపుడు సిరి గుల్కంగా
స్త్రీ నెదిరి ఱొమ్మున హరికి
స్త్రీ నెడపఁగ గురుఁడ నీవు దేవర వేమా!

స్త్రీలమాయచేతఁ జిక్కి తాఁ గొన్నాళ్ళు

[మార్చు]

స్త్రీలమాయచేతఁ జిక్కి తాఁ గొన్నాళ్ళు
తగులు గోరునట్లు తగిలిపోవు
తనిసిపోయి తాను దైవంబుచేఁజెడు
విశ్వదాభిరామ వినర వేమ!

స్త్రీలసుఖముఁ జూచి చిత్తంబు నిలుకడ

[మార్చు]

స్త్రీలసుఖముఁ జూచి చిత్తంబు నిలుకడ
సేయని మనుజుండు చెడు నిజంబు
ఏటికట్టు మ్రాని కెప్పుడు చలనంబు
విశ్వదాభిరామ వినర వేమ!

స్త్రీలు కల్గుచోట చెల్లాటములుకల్గు

[మార్చు]

స్త్రీలు కల్గుచోట చెల్లాటములుకల్గు
స్త్రీలులేని చోటఁ జిన్నఁబోవు
స్త్రీలచేత నరులు చిక్కుచున్నారయా
విశ్వదాభిరామ వినర వేమ!

సతుల చూడ చూడ సంసారి కాగోరు

[మార్చు]

సతుల చూడ చూడ సంసారి కాగోరు
సుతులు పుట్ట పుట్ట వెతలు బడును
గతులు చెడగ చెడగ కర్మమంచేడ్చును
విశ్వదాభిరామ వినురవేమ!

సతులఁ జూచి నరుఁడు సౌఖ్యంబు గోరును

[మార్చు]

సతులఁ జూచి నరుఁడు సౌఖ్యంబు గోరును
గతులఁ గానలేఁడు కర్మమందు
గతుల సతులవలనఁ గానంగ లేఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!

సతులఁ బడయ రాదు సుతులఁ బడయరాదు

[మార్చు]

సతులఁ బడయ రాదు సుతులఁ బడయరాదు
వెతలఁ బడినవాఁడు వెఱ్ఱివాఁడు
నేలనున్న ఱాయి నెత్తి కెత్తినయట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

సతులు జపతపములు సలుపంగ సాగిన

[మార్చు]

సతులు జపతపములు సలుపంగ సాగిన
పురుషు లేలయికను పుడమిలోన
పాప మెంచవద్దు పట్టి శిక్షింపుడీ
పుణ్యపురుషు లెల్ల భువిని వేమా!

సతులు సుతులు మాయ సంసారములు మాయ

[మార్చు]

సతులు సుతులు మాయ సంసారములు మాయ
ధనము ఘనము మాయ తనువు మాయ
మాయ గెల్చువాఁడు మర్మజ్ఞుఁడగు యోగి
విశ్వదాభిరామ వినర వేమ!

స్థిరముగాని క్షుద్రపర నటనలుచేసి

[మార్చు]

స్థిరముగాని క్షుద్రపర నటనలుచేసి
హెచ్చుతగ్గు లొంది హీనమతులు
గాడ్దెపిల్ల లరుతుఁ గ్రక్కునఁ జెడుదురు
విశ్వదాభిరామ వినర వేమ!

స్థావరముల భక్షింతురు

[మార్చు]

స్థావరముల భక్షింతురు
భావింపగ జంగమములు బహువిధ రుచుల
ఆవల సకలప్రాణులు
తీవరమునఁ దమ్ముఁ దామె తిందురు వేమా!

స్థూలము కనుగ్రుడ్డు సూక్ష్మంబు కన్పాప

[మార్చు]

స్థూలము కనుగ్రుడ్డు సూక్ష్మంబు కన్పాప
కంటిపాప నుండు కారణంబు
కారణమున బ్రహ్మకళ నెఱుంగఁగవలె
విశ్వదాభిరామ వినర వేమ!

సద్గురు కృపజ్ఞానంబున

[మార్చు]

సద్గురు కృపజ్ఞానంబున
సద్గతి దీపించుచున్న చాలగు చదువుల్‌
సద్గతిఁ గలుగంజేసెడి
సద్గురువే దైవమనుచుఁ జాటర వేమా!

సాధుచరితయైన సతి సత్ప్రవర్తన

[మార్చు]

సాధుచరితయైన సతి సత్ప్రవర్తన
జార యే మెఱుంగు సాధువైన
బ్రహ్మనిష్ఠ నెఱుఁగుఁ బ్రాకృతుఁ డెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ!

సాధుసజ్జనులను సంతరించినవాఁడు

[మార్చు]

సాధుసజ్జనులను సంతరించినవాఁడు
ప్రజల సంతసంబు పఱచువాఁడు
కదిసి శాత్రవులను గరుణఁజూచినవాఁడు
పాదుకొన్న ముక్తిపరుఁడు వేమ!

స్నాన మొనరఁజేసి తద్ధర్మమీయక

[మార్చు]

స్నాన మొనరఁజేసి తద్ధర్మమీయక
నీళ్ళ మునుఁగ నగునె నేర్పు లేక
నీళ్ళయందు కోడినెలవుగా మునుఁగదా
విశ్వదాభిరామ వినర వేమ!

సొమ్ము దొరకుదనుక జ్యోతి యంతియెకాక

[మార్చు]

సొమ్ము దొరకుదనుక జ్యోతి యంతియెకాక
సొమ్ము దొరకునెనక జ్యోతి యేల
దేవుఁడైన వెనుక దేహంబు మఱియేల
విశ్వదాభిరామ వినర వేమ!

సమమునైన దృష్టి సమముగా మదినిల్పి

[మార్చు]

సమమునైన దృష్టి సమముగా మదినిల్పి
బయలురుచులు మాని భద్రముగను
పరగఁజూడ బట్టబయలగు బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

సొమ్ములున్నచోటు శోధింపఁగలుగును

[మార్చు]

సొమ్ములున్నచోటు శోధింపఁగలుగును
సొమ్ములేనిచోట శోధనేల
యంజనంబులేక యా సొమ్ము తెలియదు
విశ్వదాభిరామ వినర వేమ!

సోమయాజి ననుచు సొంపైన శాలువల్

[మార్చు]

సోమయాజి ననుచు సొంపైన శాలువల్
మకర కుండములు మనసుదీర
తా ధిరించు మనకు దానేమి లాభంబు
విశ్వదాభిరామ వినురవేమ!

సోమయాజి ననుచు సొంపుగా వేషంబు

[మార్చు]

సోమయాజి ననుచు సొంపుగా వేషంబు
గట్టి మాంసమెల్లఁ గాల్చితినును
ద్విజుఁడనంగ నేమితేజంబు తనవల్ల
విశ్వదాభిరామ వినర వేమ!

సోమయాజిని బట్టి సొడ్డు వేసెను రంభ

[మార్చు]

సోమయాజిని బట్టి సొడ్డు వేసెను రంభ
యందె సోమయా జనంగఁబట్టి
క్రతువుఁజేయు ఫలము గల్గెరా చేసెఁత
విశ్వదాభిరామ వినర వేమ!

సోమలతల రసము సోలలకొలదిని

[మార్చు]

సోమలతల రసము సోలలకొలదిని
త్రావనేల తామె మేలటంచు
క్రతు ఫలంబు కంఠ గతమగు కాబోలు?
విశ్వదాభిరామ వినురవేమ!

సర్వ మొకటిఁ జూడ సమకూరును ధ్రువంబు

[మార్చు]

సర్వ మొకటిఁ జూడ సమకూరును ధ్రువంబు
రెప్పవేయఁబోక రేయిఁబగలు
పగలులోని పగలు పరమాత్మ చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

సర్వము తానని తెలిసిన

[మార్చు]

సర్వము తానని తెలిసిన
నిర్వాణికిఁ గాక ముక్తి నిలుపఁగ వశమా
ఉర్వెల్లఁ దాను తిరిగిన
పర్వత బిలజలధులందుఁ బడినను వేమా!

స్వానుభూతిలేక శాస్త్రవాసనలచే

[మార్చు]

స్వానుభూతిలేక శాస్త్రవాసనలచే
సంశయంబు చెడదు సాధకునకుఁ
జిత్రదీపమునకు జీఁకటి చెడనట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

సుఖములెల్లఁ దెలిసి చూడంగ దుఃఖముల్‌

[మార్చు]

సుఖములెల్లఁ దెలిసి చూడంగ దుఃఖముల్‌
పుణ్యములును పాపపూర్వకములె
కొఱతవేయ దొంగ కోరినచందమా
విశ్వదాభిరామ వినర వేమ!

సుఖసుఖాన దాను సుగుణుఁడై యుండఁగఁ

[మార్చు]

సుఖసుఖాన దాను సుగుణుఁడై యుండఁగఁ
బ్రకృతి పెండ్లిచేసి పరముఁ జెడిచి
విధులఁ బుట్టఁజేయు విధినిదాఁగానఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

సుతులచేతఁ బుణ్య సుఖముఁబొందుదు నని

[మార్చు]

సుతులచేతఁ బుణ్య సుఖముఁబొందుదు నని
మనుజుఁడుండు కర్మమతముఁ దగిలి
యేనుఁగు పడియున్న నెత్తునా మశకంబు
విశ్వదాభిరామ వినర వేమ!

సుతులు పతులు మాయ సుఖదుఃఖములు మాయ

[మార్చు]

సుతులు పతులు మాయ సుఖదుఃఖములు మాయ
సంస్మృతియును మాయ జాతిమాయ
మాయబ్రతుకుకింత మాయ గల్పించెరా
విశ్వదాభిరామ వినర వేమ!

సుప్తి జాగరముల సొలపులఁ దానుండి

[మార్చు]

సుప్తి జాగరముల సొలపులఁ దానుండి
కప్పుకొన్న మాయఁ గానలేక
దబ్బర నిజములను తానులెస్స గనక
గొబ్బున చెడిపోవు గుణము వేమా!

సూక్ష్మమధ్యమునను సొరిది జీవుం డుండు

[మార్చు]

సూక్ష్మమధ్యమునను సొరిది జీవుం డుండు
స్థూలమధ్యమందు సూర్యుఁ డుండు
నాదబిందుకళల నాబ్రహ్మ ముండురా
విశ్వదాభిరామ వినర వేమ!

సూక్ష్మరూప మెఱిగి సుఖమొందగా లేక

[మార్చు]

సూక్ష్మరూప మెఱిగి సుఖమొందగా లేక
బహుళముగను జదువఁబడుచు నరుఁడు
చావుచేటెఱుఁగని చదువేల చదువునో
విశ్వదాభిరామ వినర వేమ!

సూచికాగ్రదృష్టి సొరిది భ్రూమద్యము

[మార్చు]

సూచికాగ్రదృష్టి సొరిది భ్రూమద్యము
జూచి చూచి మఱియు చూచెనేని
ఆత్మరాకపోక లప్పుడె తెలియురా
విశ్వదాభిరామ వినర వేమ!