Jump to content

వేమన పద్యాలు/బ

వికీసోర్స్ నుండి

బంగరుఁ బొడఁగన్న భామలఁ బొడఁగన్న

[మార్చు]

బంగరుఁ బొడఁగన్న భామలఁ బొడఁగన్న
చిత్తమునను చింత సేయఁడేని
వాఁడె పరమయోగి వర్ణింప జగమందు
విశ్వదాభిరామ వినర వేమ!

బండమీఁద చెలమ పాటించిత్రవ్విన

[మార్చు]

బండమీఁద చెలమ పాటించిత్రవ్విన
నలయి కెక్కుడౌను నాశలేదు
గుంటపట్టు చెలమ కులముద్ధరించురా
విశ్వదాభిరామ వినర వేమ!

బొంది యెవరిసొమ్ము పోషింపఁ బలుమారు

[మార్చు]

బొంది యెవరిసొమ్ము పోషింపఁ బలుమారు
ప్రాణ మెవరిసొమ్ము భక్తిసేయ
ధనమ దెవరి సొమ్ము ధర్మమే తనసొమ్ము
విశ్వదాభిరామ వినర వేమ!

బందెత్రాళ్ళఁ దెచ్చి బంధించి కట్టంగ

[మార్చు]

బందెత్రాళ్ళఁ దెచ్చి బంధించి కట్టంగ
లింగఁడేమి దొంగిలించినాఁడొ
యాత్మలింగ మేల యర్చింపఁజూడరో
విశ్వదాభిరామ వినర వేమ!

బిందురక్తములను బెరసిన దేహంబు

[మార్చు]

బిందురక్తములను బెరసిన దేహంబు
చంద మెఱుఁగక ద్విజశబ్ద మిడఁగ
నడచిన విడుచున నరకంబు మృత్యువు
విశ్వదాభిరామ వినర వేమ!

బిడ్డలను సతులను వేఱైనచుట్టాల

[మార్చు]

బిడ్డలను సతులను వేఱైనచుట్టాల
సంపదల తనువులఁ జాలనమ్మి
సంతసిల్లుచుండు క్షణభంగురము లన్ని
దెలియ నేరఁడేమి దెల్ప వేమ!

బోడితలల జడల బూడిదెపూఁతల

[మార్చు]

బోడితలల జడల బూడిదెపూఁతల
భాషణాసనముల వేషములను
యోగిగాఁడు లోన బాగుగాకుండెనా
విశ్వదాభిరామ వినర వేమ!

బోడితలల నెల్ల బూడిదెపూఁతల

[మార్చు]

బోడితలల నెల్ల బూడిదెపూఁతల
నాసనముల మారు తాపనముల
యోగిగాఁడు లోన బాగు గాకుండిన
విశ్వదాభిరామ వినర వేమ!

బిడియమింతలేక పెద్దనే నేనంచు

[మార్చు]

బిడియమింతలేక పెద్దనే నేనంచు
పొంకములను బలుకు సంకఠునకు
హెచ్చు కల్గదీడ చచ్చినా రాదాడ
విశ్వదాభిరామ వినురవేమ!

బిడియమింతలేక పెద్దను నేనంచు

[మార్చు]

బిడియమింతలేక పెద్దను నేనంచు
బొంకములను పల్కు సుంకుసునకు
ఎచ్చుకలగ దిచట చచ్చినా రాదట
విశ్వదాభిరామ వినురవేమ!

బడుగు నెఱుఁగ లేని ప్రాభవం బది యేల

[మార్చు]

బడుగు నెఱుఁగ లేని ప్రాభవం బది యేల
ప్రోదియిడని బంధు భూతి యేల
వ్యాధి దెలియలేని వైద్యుఁడు మఱియేల
విశ్వదాభిరామ వినర వేమ!

బాపఁ డెముకకూడు భక్షించుచుండును

[మార్చు]

బాపఁ డెముకకూడు భక్షించుచుండును
పేరటంబుఁబోవు పెండ్లి మగువ
కులము మానము వీడ కోర్కెలు మెండాయె
విశ్వదాభిరామ వినర వేమ!

బొమ్మలాటవాఁడు బొమ్మల నాడించు

[మార్చు]

బొమ్మలాటవాఁడు బొమ్మల నాడించు
భువిని జనులుచూఁడ బొలుపుమీఱ
తానుమఱిగియుండి దైవ మాడించురా
విశ్వదాభిరామ వినర వేమ!

బయలు రూపు రూపు బయలునుగాఁ జేసి

[మార్చు]

బయలు రూపు రూపు బయలునుగాఁ జేసి
బయలు రూపు బట్టబయలు చేసి
బయలులోనివాని భావింపఁ దత్వంబు
విశ్వదాభిరామ వినర వేమ!

బయలున బంధము గప్పను

[మార్చు]

బయలున బంధము గప్పను
బయలునఁ బరమాత్మునకును బంధము తొలఁగు
బయలున బంధము లూడిన
నయవర్తన ముక్తిఁగాంచు నరుఁడటు వేమా!

బయలున సర్వము పుట్టును

[మార్చు]

బయలున సర్వము పుట్టును
బయలందే లీనమగును బ్రహ్మం బనఁగా
బయలని మదిలోఁ దెలిసిన
బయలందే ముక్తి బట్టబయలగు వేమ!

బయలులోని బయలు పరికించి చూడక

[మార్చు]

బయలులోని బయలు పరికించి చూడక
బయలు రూపుఁ జూచి వలచెఁగాక
ముఱికిదేహమందు మోహంబు విడదాయె
విశ్వదాభిరామ వినర వేమ!

బారెడేసి జడలు భస్మంబుపూఁతలు

[మార్చు]

బారెడేసి జడలు భస్మంబుపూఁతలు
మరునితోడ మాఱుమలయఁ గలరు
ముంజికోకలెల్ల లంజెకోకలాయె
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రతుకు నిత్య మనుచుఁ బదరుచు వగమీఱ

[మార్చు]

బ్రతుకు నిత్య మనుచుఁ బదరుచు వగమీఱ
విఱ్ఱవీఁగువారు వెఱ్ఱివారు
ప్రాణులెల్ల యమునివారి గొఱ్ఱెలుసుమీ
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రతుకులెల్ల మాయ భవబంధములు మాయ

[మార్చు]

బ్రతుకులెల్ల మాయ భవబంధములు మాయ
తెలివి మాయ తన్నుఁ దెలియ మాయ
మాయ దెలియువాఁడు మర్మజ్ఞుఁడగు యోగి
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రతుకువార లెవరు బ్రతుకకుందు రెవరు

[మార్చు]

బ్రతుకువార లెవరు బ్రతుకకుందు రెవరు
బ్రతికిబ్రతుకలేని ప్రాణు లెవరు
క్షితిని శోధఁజేసి స్థిరమునఁజూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మ గుఱ్ఱ మాయె భవుఁడు పల్లం బాయె

[మార్చు]

దేశదేశములను దిరిగిగాసిలినొంద
నాత్మయందు ధ్యాన మంటుకొనునె
కాసులకును దిరుగఁ గలుగునా మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మ తలనుగొట్టి పారవైచినయప్పు

[మార్చు]

బ్రహ్మ తలనుగొట్టి పారవైచినయప్పు
డడ్డపడగపోవరైరి సురలు
శివుని కరుణలేమి జెడిపోక పోదురా
విశ్వదాభిరామ వినురవేమ!

బ్రహ్మ మనగవేఱె పరదేశమున లేదు

[మార్చు]

బ్రహ్మ మనగవేఱె పరదేశమున లేదు
బ్రహ్మ మనగ దానె బట్టబయలు
తన్నుదా నెఱిఁగినఁ దానెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మ మున్నచోటు పరగంగఁ దెలియక

[మార్చు]

బ్రహ్మ మున్నచోటు పరగంగఁ దెలియక
యెందొవెదుక బ్రహ్మ మేల కలుగు
అంజనంబు లేక యా సొమ్ము దొరకదు
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మ యెవనికొడుకు పరికింపఁగా భువి

[మార్చు]

బ్రహ్మ యెవనికొడుకు పరికింపఁగా భువి
విష్ణు వెవనికొడుకు వెలయఁజూడ
శివుఁడు నెవనికొడుకు సిగ్గెఱుఁగరు జనుల్‌
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మఁ జంపి విష్ణుభాగంబులోఁ గల్పి

[మార్చు]

బ్రహ్మఁ జంపి విష్ణుభాగంబులోఁ గల్పి
విష్ణుఁ జంపి శివునివెలయఁ గల్పి
శివునిఁ జంపి తాను శివయోగి కావలె
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మగ్రుడ్డు మేను ప్రాణమన్నది గాలి

[మార్చు]

బ్రహ్మగ్రుడ్డు మేను ప్రాణమన్నది గాలి
కనులు చంద్రరవులు గారవింప
నింతకంటె బ్రహ్మ మెక్కడనున్నది
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మగుడ్డు ననెడిపట్టణంబులోపల

[మార్చు]

బ్రహ్మగుడ్డు ననెడిపట్టణంబులోపల
బ్రహ్మ మెఱుగలేని బాపఁడేల
తనమనంబు దెలియఁ దానెపో బ్రహ్మంబు
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మఘటము మేను ప్రాణంబు దగ గాలి

[మార్చు]

బ్రహ్మఘటము మేను ప్రాణంబు దగ గాలి
మిత్రచంద్రవహ్ని నేత్రచయము
మఱియుఁ బ్రహ్మ మనఁగ మహిమీదలేదయా
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రాహ్మణుల మటండ్రు బ్రహ్మత్వమదిలేని

[మార్చు]

బ్రాహ్మణుల మటండ్రు బ్రహ్మత్వమదిలేని
బ్రహ్మమద్దియేల? బ్రాహ్మణుఁడటె
బొమ్మవలెను వాడు దిమ్మపై గూర్చుండ
విశ్వదాభిరామ వినురవేమ!

బ్రహ్మనృపతి వైశ్యపతులును శూద్రులు

[మార్చు]

బ్రహ్మనృపతి వైశ్యపతులును శూద్రులు
బ్రహ్మవిష్ణుహరులు పశువు లెన్న
బ్రహ్మముం దెలియక బహురూపులైరిట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మమేడ ననుచు పలుమాఱు లాడేరు

[మార్చు]

బ్రహ్మమేడ ననుచు పలుమాఱు లాడేరు
వెఱ్ఱిమూర్ఖ జనుల విధముఁజూడ
బ్రహ్మ మన్నిటందుఁ బరిపూర్ణమైయుండు
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మమును దెలిసెడు భావమందున నిల్చి

[మార్చు]

బ్రహ్మమును దెలిసెడు భావమందున నిల్చి
తనువు గుడిని జేసి తన్ను నిలిపి
లోకమందు నిలిచి లోఁజూపు చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మమును నెఱుఁగవు భావమందుండిన

[మార్చు]

బ్రహ్మమును నెఱుఁగవు భావమందుండిన
తనువు గుడిగఁ జేసి తన్ను నిలిపి
లోకబుద్ధివిడిచి లోఁజూపు చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మవేత్తల మని పౌరుష మాడేరు

[మార్చు]

బ్రహ్మవేత్తల మని పౌరుష మాడేరు
బ్రహ్మ మనఁగ దాని భావమేమి
తెలుపొ నలుపొ యెఱుపొ తెలిసినఁ బలుకుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!

బ్రహ్మవాదు లెల్ల బ్రహ్మంబనంగను

[మార్చు]

బ్రహ్మవాదు లెల్ల బ్రహ్మంబనంగను
వలను తెలిసిచూడ వద్దనుండు
ముందునున్న యట్టి ముద్రిక కానరో
విశ్వదాభిరామ వినర వేమ!

బీఱుబోవుకులకు బిరుదు మ్రింగుకులంబు

[మార్చు]

బీఱుబోవుకులకు బిరుదు మ్రింగుకులంబు
నెల్ల జీవులకు భరించుకులము
ఇట్టుకులమువారు హరదూరులు
పట్ట గలుగువాఁడు పరఁగ వేమా

బాలచనులఁ బూలబంతులఁ బోల్తురు

[మార్చు]

బాలచనులఁ బూలబంతులఁ బోల్తురు
ప్రాలుమాలినట్టి భ్రష్టు లవని
మాంసఖండమందు మఱియేమియున్నది
విశ్వదాభిరామ వినర వేమ!

బల్లి పలుకులువిని ప్రజలెల్ల తమపనుల్

[మార్చు]

బల్లి పలుకులువిని ప్రజలెల్ల తమపనుల్
సఫలమగునటంచు సంతసించి
కానిపనులకు తమ కర్మమటందురు
విశ్వదాభిరామ వినురవేమ!

బైలున బంధము గలపక

[మార్చు]

బైలున బంధము గలపక
వ్రాలెను పరమాత్మునకును వాంఛిత మొప్ప
బైలున బంధము గలిపిన
కైలాసముఁజేరి ముక్తి గాంచుర వేమా!

బాసలాడనేర్చి పలు మోసములుచేసి

[మార్చు]

బాసలాడనేర్చి పలు మోసములుచేసి
గ్రాసమునకు భువిని ఖలుడవైతి
దోసకారి నీకు దొరుకునా మోక్షంబు!
విశ్వదాభిరామ వినురవేమ!

బుద్ధియుతున కేల పొసఁగని సౌఖ్యంబు

[మార్చు]

బుద్ధియుతున కేల పొసఁగని సౌఖ్యంబు
కార్యవాదికేల కడుచలంబు
కుత్సితునకు నేల గురుదేవతాభక్తి
విశ్వదాభిరామ వినర వేమ!

బూతులేని లంజ భూతంబు కూఁతురు

[మార్చు]

బూతులేని లంజ భూతంబు కూఁతురు
ప్రీతిలేనిపాటు ధాత్రిచేటు
దాతలేని యూరు దయ్యాల పేటరా
విశ్వదాభిరామ వినర వేమ!

బూదిపూఁత లెన్న భుజముల పొంకాలు

[మార్చు]

బూదిపూఁత లెన్న భుజముల పొంకాలు
వ్రాలు లింగములును వరుసమతము
తిక్కడగునుగాక యెక్కఁడ దగ దట్లు
విశ్వదాభిరామ వినర వేమ!

బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు

[మార్చు]

బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు
ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ,
ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము
విశ్వదాభిరామ వినురవేమ !

బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి

[మార్చు]

బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి
మిత్రచంద్ర శిఖులు నేత్రచయము
మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా
విశ్వదాభిరామ వినురవేమ !