వేమన పద్యాలు/జ

వికీసోర్స్ నుండి

జంగమాఖ్య భక్తి సంధివేఱుగలేదు[మార్చు]

జంగమాఖ్య భక్తి సంధివేఱుగలేదు
సగుణభావ మదియ శాస్త్ర విధియు
నిర్గుణంబు వీడు నెఱినేదియెఱుఁగఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి[మార్చు]

జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి
రెంటినందు రిమ్మరేచునపుడు
రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా
విశ్వదాభిరామ వినుర వేమ!

జ్ఞానముద్రచేతఁ గానవచ్చెడితళ్కు[మార్చు]

జ్ఞానముద్రచేతఁ గానవచ్చెడితళ్కు
నదియ మదికి శ్రేష్ఠ మనుచు మునులు
పలికి రదియుఁ దెలియఁ బరమార్థ మగునయా
విశ్వదాభిరామ వినర వేమ!

జ్ఞానవంతుఁ జూచి సహకర్మబుద్ధులు[మార్చు]

జ్ఞానవంతుఁ జూచి సహకర్మబుద్ధులు
వెఱ్ఱియండ్రు ప్రకృతి విడువలేరు
వెఱ్ఱి కవనిఁ బ్రకృతి వెదకినఁ గల్గునా
విశ్వదాభిరామ వినర వేమ!

జ్ఞానుల మని యెంచి చపలాత్ము లగువారు[మార్చు]

జ్ఞానుల మని యెంచి చపలాత్ము లగువారు
తెలివిలేక తమ్ముఁ దెలియలేరు
కష్టగహనమందు కాడ్పడియున్నారు
విశ్వదాభిరామ వినర వేమ!

జాణలనయట్టి చపలాయతాక్షుల[మార్చు]

జాణలనయట్టి చపలాయతాక్షుల
వలపు లరసిచూచి బ్రమయకేల
బయలిరూపులరసి పరికింపగా నేల
విశ్వదాభిరామ వినర వేమ!

జాతిమతము విడిచి చని యోగిగా మేలు[మార్చు]

జాతిమతము విడిచి చని యోగిగా మేలు
జాతితోనెయుండె నీతులెల్ల
మతముఁబట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినర వేమ!

జాతివేఱు లేక జన్మక్రమంబున[మార్చు]

జాతివేఱు లేక జన్మక్రమంబున
నెమ్మదిని నభవుని నిల్పెనేని
అఖిలజనులకెల్ల నాతఁడె ఘనయోగి
విశ్వదాభిరామ వినర వేమ!

జాతసూతకములు సత్యమై యుండంగ[మార్చు]

జాతసూతకములు సత్యమై యుండంగ
నంటిన గుణములు హతమ్ముగాక
యతియుఁగాగనేల నవనిలో జీవుఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

జాతులందు నెట్టిజాతి ముఖ్యముచూడు[మార్చు]

జాతులందు నెట్టిజాతి ముఖ్యముచూడు
మెఱుఁగలేక దిరుగ నేమిగలదు
యెఱుక గలుగు మనుజుఁ డేజాతి గలవాఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

జాతులందు మిగుల జాతియే దెక్కువో[మార్చు]

జాతులందు మిగుల జాతి యే దెక్కువో
యెఱుక లేక తిరుగు నేమిఫలము
ఎఱుక గలుగువాఁడె హెచ్చైన కులజుండు
విశ్వదాభిరామ వినర వేమ!

జదలుదాల్చు టెల్ల జగము ఛీయను టెల్ల[మార్చు]

జదలుదాల్చు టెల్ల జగము ఛీయను టెల్ల
యొడలువిఱచుటెల్ల యోగ మెల్ల
ముక్తికాంతఁ బట్టి ముద్దాడుకొరకురా
విశ్వదాభిరామ వినర వేమ!

జననమరణములకు సంధ్య త్రాడునులేదు[మార్చు]

జననమరణములకు సంధ్యత్రాడును లేదు
సంధ్యత్రాడునులేదు జనని కెపుడు
తల్లి శూద్రురాలు దానెట్లు బాగురా
విశ్వదాభిరామ వినర వేమ!

జననమరణములకు సరి స్వతంత్రుఁడు గాఁడు[మార్చు]

జననమరణములకు సరి స్వతంత్రుఁడు గాఁడు
మొదట కర్తగాఁడు తుదను గాఁడు
నడుమకర్త ననుటనగుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినర వేమ!


జనన మరణములన స్వప్న సుషుప్తులు[మార్చు]

జనన మరణములన స్వప్న సుషుప్తులు
జగములందు నెండ జగములుండు
నరుడు జగమునంట నడుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ!

జన్మమరణ సుషుప్తుల జనము లెల్ల[మార్చు]

జన్మమరణ సుషుప్తుల జనము లెల్ల
జరుగుచుండంగ నరుఁడు తా జంగమమను
నదియుఁ దెలియంగలేర నీయజ్ఞులైన
భూప్రజలు బుద్ధిలేకయు పొసఁగు వేమా!

జనుఁడు తెలివినొంద చంచలింపదు మది[మార్చు]

జనుఁడు తెలివినొంద చంచలింపదు మది
దయయు దైవమొగిని దగులు బుద్ధి
తివురుభానుఁ జూచి తిమిరంబు నిలుచునా
విశ్వదాభిరామ వినర వేమ!

జాణలమని యంద్రు చపలాత్ములగువారు[మార్చు]

జాణలమని యంద్రు చపలాత్ములగువారు
తెలివిలేక తమ్ముతెలియలేరు
కష్టమైన యడవి గాసీలుచున్నారు
విశ్వదాభిరామ వినుర వేమ!

జాతి, మతము విడిచి చని యోగికామేలు[మార్చు]

జాతి, మతము విడిచి చని యోగికామేలు
జాతితో నెయున్న నీతివలదె
మతముబట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినుర వేమ!

జార పురుషుమీఁద సద్భక్తి నిలుపుచు[మార్చు]

జార పురుషుమీఁద సద్భక్తి నిలుపుచు
పతికి నిచ్చకంబు బడయుభంగి
పరముకొఱకు యోగి పాటించు దేహంబు
విశ్వదాభిరామ వినర వేమ!

జాలినొందరాదు జవదాటి కనరాదు[మార్చు]

జాలినొందరాదు జవదాటి కనరాదు
అది మూలమైన ఆత్మమఱుగు
పోరిచేరి పొంది పూర్ణము నందురా
విశ్వదాభిరామ వినుర వేమ!

జీవి జీవిఁ జంపి జీవికి వేయఁగా[మార్చు]

జీవి జీవిఁ జంపి జీవికి వేయఁగా
జీవి వలన నేమి చిక్కియుండె
జీవ హింసలకుఁ జిక్కునె మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

జీవి పోక ముందె జీవ వస్తువు లిచ్చి[మార్చు]

జీవి పోక ముందె జీవ వస్తువు లిచ్చి
జీవి నిలుప వలయు జీవనముగ
జీవి తొలఁగు వెనుక జీవ వస్తువు లేల?
విశ్వదాభిరామ వినర వేమ!

జీవిఁజంపుటెల్ల శివభక్తి తప్పుట[మార్చు]

జీవిఁజంపుటెల్ల శివభక్తి తప్పుట
జీవు నరసిచూడ శివుఁడు గాదె
జీవుఁడు శివుఁడగును సిద్ధంబు దెలియరో
విశ్వదాభిరామ వినర వేమ!

జీవగుణము గల్గుజీవుండు బ్రహ్మంబు[మార్చు]

జీవగుణము గల్గుజీవుండు బ్రహ్మంబు
సాటివచ్చునెట్లు సరవితోడ
నూరికుక్క సింగమొకటి జేయురా
విశ్వదాభిరామ వినర వేమ!

జీవభేద మెఱిగి చెడిపోనివారికి[మార్చు]

జీవభేద మెఱిగి చెడిపోనివారికి
భావిజనుల చెలిమి పట్టుపడదు
ఈశ్వరునినెఱిఁగిన నెఱుగఁడీ జగమును
విశ్వదాభిరామ వినర వేమ!

జీవభావ మెఱుగఁ జెడ దెన్నటికి మది[మార్చు]

జీవభావ మెఱుగఁ జెడ దెన్నటికి మది
దైవమును నెఱుంగఁ దనరుబుద్ధి
తేజ ముదయమందఁ దిమిరంబు నిలువదు
విశ్వదాభిరామ వినర వేమ!

జీవమేడ నుండు భావమెక్కడ నుండు[మార్చు]

జీవమేడ నుండు భావమెక్కడ నుండు
కాఁపురంబు లేడఁ గదిసియుండుఁ
దనరుచున్న రెండిస్థల మేల తెలియరు
విశ్వదాభిరామ వినర వేమ!

జీవలింగపూజఁ జేసినవారికి[మార్చు]

జీవలింగపూజఁ జేసినవారికి
శిలలరూపమందుఁ జింతయేల
చెలఁగి మధువు గ్రోలఁజేదు రుచించునా
విశ్వదాభిరామ వినర వేమ!

జీవిలోననుండు సిద్ధునిగానక[మార్చు]

జీవిలోననుండు సిద్ధునిగానక
తిరుగు నస్థిరంబు వరుసనమ్మి
స్థిరము నస్థిరమును దెలియ జీవికిముక్తి
విశ్వదాభిరామ వినర వేమ!

జీవసంజ్ఞ గలుగు జీవుని తత్వంబ[మార్చు]

జీవసంజ్ఞ గలుగు జీవుని తత్వంబ
జీవపరుని గురుని జెందఁజేసి
తన్ను నిల్పువాఁడు తానె తత్వజ్ఞుఁడౌ
విశ్వదాభిరామ వినర వేమ!

జీవుని దెలిసిన దనుకను[మార్చు]

జీవుని దెలిసిన దనుకను
దేవుని భ్రమఁ బొదలు నరుఁడు దేవుఁడు దలఁప
జీవుండని వివరించిన
భావింపగ ముక్తి బట్టబయలుర వేమా!