Jump to content

వేమన పద్యాలు/చ

వికీసోర్స్ నుండి

చంద్రునంతవాడె శాపంబుచేతను

[మార్చు]

చంద్రునంతవాడె శాపంబుచేతను
కళల హీనమంద గలిగె గదర
పుడమి జనులకెల్ల బుద్దులిట్లుండురా!
విశ్వదాభిరామ వినురవేమ!

చంపఁదగిన యట్టి శత్రువు తన చేతఁ

[మార్చు]

చంపఁదగిన యట్టి శత్రువు తన చేతఁ
జిక్కెనేని కీడు సేయ రాదు
పొసఁగ మేలు జేసి పొమ్మనుటే చాలు !
విశ్వదాభిరామ వినర వేమ!

చంపఁదలఁచురాజు చనవగ్గలం బిచ్చుఁ

[మార్చు]

చంపఁదలఁచురాజు చనవగ్గలం బిచ్చుఁ
జెఱుపనున్న పగఱ చెలిమిసేయుఁ
గఱవనున్న పాము నెఱికాచుకొనియుండు
విశ్వదాభిరామ వినర వేమ!

చాకి కోకలుతికి చీకాకు పడజేసి

[మార్చు]

చాకి కోకలుతికి చీకాకు పడజేసి
మైలతీసి లెస్స మడచినట్లు
బుద్ధిచెప్పువాడు గ్రుద్దిన మేలయా!
విశ్వదాభిరామ వినురవేమ!

బుద్ధి చెప్పు వాడు గుద్దితే నేమయా ----- అనేది ఒక పాఠం

చక్కఁదనము లేల సంపత్కరము లేల

[మార్చు]

చక్కఁదనము లేల సంపత్కరము లేల
విద్యలేల భూమివిరివి యేల
పుత్రపదవికన్న పుట్టునె పదవులు
విశ్వదాభిరామ వినర వేమ!

చిక్కియున్న వేళ సింహంబునైనను

[మార్చు]

చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్కకుక్క చేరి బాధచేయు
బలిమిలేనివేళఁ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ వినర వేమ!

చక్కెర గలిపియు తినఁగా

[మార్చు]

చక్కెర గలిపియు తినఁగా
ముక్కిన తవుడైన లెస్స మోహము గలుగ
వెక్కురు బానిసయైన
మక్కువఁ గను దివ్యభామ మహిలో వేమా!

చేకొనుచును తనకుఁ జేరి సాగినంతలోఁ

[మార్చు]

చేకొనుచును తనకుఁ జేరి సాగినంతలోఁ
జెడిన ప్రజల రక్షసేయకున్న
తనదుసాగుటేమి తనతనువదియేమి
విశ్వదాభిరామ వినర వేమ!

చచ్చెఁ జచ్చె ననుచుఁ జావుకు వగచెడు

[మార్చు]

చచ్చెఁ జచ్చె ననుచుఁ జావుకు వగచెడు
దీననరుల వెఱ్ఱి దెలుపరాదు
ప్రాణమునకు మృత్యు బంధంబు లుడుగునా
విశ్వదాభిరామ వినర వేమ!

చచ్చువార లెవరు చావనివా రేరి

[మార్చు]

చచ్చువార లెవరు చావనివా రేరి
చచ్చి బ్రతికియుండుజన్ము లెవరు
విచ్చలవిడిగాను వివరించి చూడరా
విశ్వదాభిరామ వినర వేమ!

చచ్చువారిఁజూచి చావని పుట్టని

[మార్చు]

చచ్చువారిఁజూచి చావని పుట్టని
తత్వ మెల్ల నాత్మఁ దలఁపుఁ జేసి
యరసి చూచినట్టి యతనికి మోక్షంబు
విశ్వదాభిరామ వినర వేమ!

చచ్చువారిని గని చావు నిశ్చయమని

[మార్చు]

చచ్చువారిని గని చావు నిశ్చయమని
తత్వమెల్ల నాత్మఁదలచి తెలివి
నదరు బెదరులేక యడరిన ముక్తుఁడు
విశ్వదాభిరామ వినర వేమ!

చెట్టఁబట్టువెనుక చేతాఁకువై యుండు

[మార్చు]

చెట్టఁబట్టువెనుక చేతాఁకువై యుండు
రంతకాఁడు గట్టి పగఱకండ్రు
ఆఁడువారికింత యడఁగుట చెల్లదో
విశ్వదాభిరామ వినర వేమ!

చెట్టుచేనుగొట్టి చుట్టుగోడలఁబెట్టి

[మార్చు]

చెట్టుచేనుగొట్టి చుట్టుగోడలఁబెట్టి
యిట్టునట్టుఁ బెద్దయిల్లు గట్టి
మిట్టిపడును నరుఁడు మీఁదిచే టెఱుంగక
విశ్వదాభిరామ వినర వేమ!

చెట్టునందుఁబుట్టి చెలరేఁగి కాయలు

[మార్చు]

చెట్టునందుఁబుట్టి చెలరేఁగి కాయలు
దనరుఁగాంతితోడఁ దగిలిపండ్లు
పండ్లు దినుచుఁ గాయవర్ణంబు దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!

చెట్టునన విత్తును బుట్టెను

[మార్చు]

చెట్టునన విత్తును బుట్టెను
చెట్టును విత్తున పుట్టెఁ జెలిమి దలిర్ప
చెట్టును విత్తును రెండును
పుట్టిన విధిఁ దెలియవలయు భువిలో వేమా!

చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు

[మార్చు]

చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు
మేలు వచ్చెనేని మెచ్చుఁ దన్ను
చేటు మేలుతలఁపుఁ జేసినకర్మముల్‌
విశ్వదాభిరామ వినర వేమ!

చాడికానిమాట చావడిలో నిక్కు

[మార్చు]

చాడికానిమాట చావడిలో నిక్కు
వెంటఁ బో శునకము వెలయ నిక్కు
స్త్రీలఁజూచినపుడు శిశ్నంబు నిక్కురా
విశ్వదాభిరామ వినర వేమ!

చెడ్డవాని మిగులఁ జెఱుచును దైవంబు

[మార్చు]

చెడ్డవాని మిగులఁ జెఱుచును దైవంబు
అడ్డపడదు వాని కాపదయిన
చెడినచేనుఁ జూచి యొడయఁడు మెచ్చునా
విశ్వదాభిరామ వినర వేమ!

చెడినమానవులను చేపట్టి రక్షించి

[మార్చు]

చెడినమానవులను చేపట్టి రక్షించి
కడకుఁ జేర్చినట్టి ఘనులు దలఁప
కడగి పుణ్యమైనగల శివుసన్నిధి
నెడతెగకయునుందు రెపుడు వేమ!

చెడు గుణంబులెల్ల చేపట్టి శిక్షిం

[మార్చు]

చెడు గుణంబులెల్ల చేపట్టి శిక్షిం
పరమ పదవి సిద్ధపడగ చూపు
నట్టి గురువుని వేడి అపరోక్ష మందరా!
విశ్వదాభిరామ వినురవేమ!

చిత్తమనెడు వేరు శిథిలమైనప్పుడే

[మార్చు]

చిత్తమనేడి వేరు శిథిలమైనప్పుడే
ప్రకృతి యనెడి చెట్టు పడును పిదప
గోర్కులనెడి పెద్దకొమ్మలెండును గదా
విశ్వదాభిరామ వినుర వేమ!

చిత్తము బుద్ధియు మఱచియు

[మార్చు]

చిత్తము బుద్ధియు మఱచియు
హత్తు నహంకారములను నాత్మకు లోగా
మొత్తముగఁ జేయ నేరని
మత్తునకును ముక్తిలేదు మహిలో వేమా!

చిత్తముగలయోగి శివునివలనే యుండు

[మార్చు]

చిత్తముగలయోగి శివునివలనే యుండు
మిథ్యయోగి యుండు మిడుతవలెనె
నిత్యుఁడైన యోగి నీవలె నుండురా
విశ్వదాభిరామ వినర వేమ!

చిత్తవాజి నెక్కి శిక్షింప నేరక

[మార్చు]

చిత్తవాజి నెక్కి శిక్షింప నేరక
తత్తఱించి రౌతు తరల నేల
వారణాసి తనకు వయ్యాళి కాబోలు
విశ్వదాభిరామ వినర వేమ!

చిత్తశుద్ధిగల్గి చేసినపుణ్యంబు

[మార్చు]

చిత్తశుద్ధిగల్గి చేసినపుణ్యంబు
కొంచెమయిన నదియు గొదువ కాదు
విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినర వేమ!

చేతస్సంకల్పంబులు

[మార్చు]

చేతస్సంకల్పంబులు
నీతిని వర్జించి నపుడె నిర్మల పదవుల్‌
ప్రీతిం బొందు నటందురు
భూతములనఁ బరఁగ యోగ పురుషులు వేమా!

చదివి చదివి కర్మసారమ్ము గనలేక

[మార్చు]

చదివి చదివి కర్మసారమ్ము గనలేక
తిరిగి తిరిగి తిరిగి దిమ్మరాయె
మరిగి తిరిగి మొరిగి మత్తిల్లి చచ్చెరా
విశ్వదాభిరామ వినురవేమ!

చదువు చదువ నేల సన్యాసి గానేల

[మార్చు]

చదువు చదువ నేల సన్యాసి గానేల
షణ్మతములఁజిక్కి చావ నేల
అతని భజనఁజేసి యాత్మలోఁ దెలియుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!

చదువు రాదటన్న సామాజికమదేల

[మార్చు]

చదువు రాదటన్న సామాజికమదేల
బుద్ధికుదరకున్న పొందికేల
గురునిగూర్ప ముక్తి కరతలామలకమౌ
విశ్వదాభిరామ వినురవేమ!

చదువులఁ జదివినవారలు

[మార్చు]

చదువులఁ జదివినవారలు
పదవిన్ని బొందంగ లేరు పరమార్థముగాఁ
బెదవులఁ గదలక యుండిన
మదిలో నది రాజయోగమహిమము వేమా!

చదువులందు రాజపదవులందును పాడి

[మార్చు]

చదువులందు రాజపదవులందును పాడి
మొదవులందు స్త్రీల పెదవులందు
నాశ లుడుగునట్టి యయ్యలు ముక్తులు
విశ్వదాభిరామ వినర వేమ!

చదువులందు లేదు శాస్త్రంబులను లేదు

[మార్చు]

చదువులందు లేదు శాస్త్రంబులను లేదు
వేదములను దైవభేదములను
బైటనున్న ముక్తి పాటించ లేఁడయా
విశ్వదాభిరామ వినర వేమ!

చదువులన్ని చదివి చాలవివేకియౌ

[మార్చు]

చదువులన్ని చదివి చాలవివేకియౌ
కపటికెన్న నెట్లు కలుగుముక్తి
దాలిగుంటఁగుక్క తలఁచిన చందము
విశ్వదాభిరామ వినర వేమ!

చదువులెల్ల చదివి సర్వజ్ఞుఁడై యుండు

[మార్చు]

చదువులెల్ల చదివి సర్వజ్ఞుఁడై యుండు
బ్రహ్మవిద్యలెల్ల పదటఁ గలిపి
యిఱుకుయోనిఁ జూచి పరమయోగము మాను
విశ్వదాభిరామ వినర వేమ!

చదువువానికన్న చాకలి తా మేలు

[మార్చు]

చదువువానికన్న చాకలి తా మేలు
కులము వేల్పుకన్న కుక్క మేలు
సర్వసురలకన్న సకలేశ్వరుఁడు మేలు
విశ్వదాభిరామ వినర వేమ!

చనువారెల్లను జనులం

[మార్చు]

చనువారెల్లను జనులం
జనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్‌
వినవలె గనవలె మనవలె
నని మషులకు దెలుసగూడ దంత్యము వేమా!

చన్నులు పరసతి కొప్పిన

[మార్చు]

చన్నులు పరసతి కొప్పిన
చన్నులపై పాప దృఢతఁ జన కటుయునుపే
చన్నులు తగ దాఁగుడిచియు
చన్నులపై తలఁపు వలదు సత్యము వేమా!

చినుఁగు బట్ట కాదు చీనాంబరము గాని

[మార్చు]

చినుఁగు బట్ట కాదు చీనాంబరము గాని
ముఱికియొడలు గాదు ముక్తి గాని
పరమయోగిమహిమఁ బరికింప నరుదురా
విశ్వదాభిరామ వినర వేమ!

చిప్పలోనఁ బడ్డ చినుకు ముత్యం బాయె

[మార్చు]

చిప్పలోనఁ బడ్డ చినుకు ముత్యం బాయె
నీళ్ళలోనఁగలిసి నీరె యాయె
ప్రాప్తము గలచోట ఫలమేల దప్పురా
విశ్వదాభిరామ వినర వేమ!

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ

[మార్చు]

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలిముల్లు
ఇంటిలోని పోరు నింతింత కాదయా
విశ్వదాభిరామ వినర వేమ!

చమురు గలుగు దివ్వె సరవితో మండును

[మార్చు]

చమురు గలుగు దివ్వె సరవితో మండును
చమురు లేని దివ్వె సమసి పోవు
తనువు తీఱె నేని తలపు తోడనె తీరు
విశ్వదాభిరామ వినర వేమ!

చీరగట్టి రాత్రి సిగ్గును నెఱిఁగుండు

[మార్చు]

చీరగట్టి రాత్రి సిగ్గును నెఱిఁగుండు
పగలు చీరవిడుచు పను లదేల
చేడె గాదుర యిది చేవాడికత్తెర
విశ్వదాభిరామ వినర వేమ!

చరణంబులు పదితోఁకలు

[మార్చు]

చరణంబులు పదితోఁకలు
పరగంగా మూడు తలలు బైటనె తిరుగు
వరభూమి తల్లడిల్లగ
నిరవొందఁగ దీని దెలియ నీశుఁడు వేమా!

చిరుతనాడు నీవు చేసిన కర్మంబు

[మార్చు]

చిరుతనాడు నీవు చేసిన కర్మంబు
మరుతువేమొ మదిని మల్లడించి
తరిమి ముట్టు చావు తలపడినప్పుడు
విశ్వదాభిరామ వినురవేమ!

చెఱకులోననైనఁ జెడ్డగుణం బున్నఁ

[మార్చు]

చెఱకులోననైనఁ జెడ్డగుణం బున్నఁ
దీసివేయకున్నఁ దినగఁ బొసగ
దంతిపురము ద్రోహి యాతఁడెట్లుండురా
విశ్వదాభిరామ వినర వేమ!

చెవిని నిలుగట్టి చెప్పెను వేమన

[మార్చు]

చెవిని నిలుగట్టి చెప్పెను వేమన
బట్టబయలనుండు బ్రహ్మమనుచు
బుద్ధిఁ గలిగి యందుఁ బొంది సుఖించుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ!

చావు వచ్చినపుడు సన్యసించునదెట్లు

[మార్చు]

చావు వచ్చినపుడు సన్యసించునదెట్లు
కడకు మొదటికులము చెడినదగును
పాప మొకటి గలదు ఫలమేమి లేదయా
విశ్వదాభిరామ వినర వేమ!


చూచువారికెల్లఁ జూడ వేఱైయుండు

[మార్చు]

చూచువారికెల్లఁ జూడ వేఱైయుండు
చూపుఁజూచి దెలియఁ జూచువారు
చూచి తాముచూపుచూపె తామగుదురు
విశ్వదాభిరామ వినర వేమ!

చూపు వెలయఁజేసి సూక్ష్మంబు వత్తిచే

[మార్చు]

చూపు వెలయఁజేసి సూక్ష్మంబు వత్తిచే
చిత్తమనెడు దివ్వె నెన్నుపఱచి
పాపమనెడు తిమిర మేపాఱ పాపని
పాపజాతి గురుఁడు పశువు వేమా!

చూపులోనిచూపు సూక్ష్మమౌఁ దెలియంగఁ

[మార్చు]

చూపులోనిచూపు సూక్ష్మమౌఁ దెలియంగఁ
జూపులోనిచూపు శుభ్రమాయె
జూపులోనిచూపు సురవరగమ్యము
విశ్వదాభిరామ వినర వేమ!

చూపువలనఁ బుట్టు సుఖదుఃఖములు రెండు

[మార్చు]

చూపువలనఁ బుట్టు సుఖదుఃఖములు రెండు
పతికి సతికిఁ బుట్ట పరగ సుతుఁడు
సతికి సుతునివలన సౌఖ్యంబు గలుగును
విశ్వదాభిరామ వినర వేమ!