కాశీమజిలీకథలు/మొదటి భాగము/పదకొండవ మజిలీ

వికీసోర్స్ నుండి

పదునొకండవ మజిలీ

బుద్ధిసాగర కామపాలుర కథ

పదునొకండవ మజిలీయం దడవిలో నొకచోట దలవెండ్రుకలు గలిగియున్న శిలావిగ్రహమునుజూచి యాగొల్లవాఁడు వింతపడిపోయి మణిసిద్ధుని తద్విగ్రహవృత్తాంతము చెప్పుమని యడిగిన నయ్యతిపతి మణివిశేషముచే దానితెరంగంతయు గ్రహించి వెరగందుచు నాకథ యిట్లని చెప్పఁదొడంగెను.

కాంచీపురంబున విష్ణుదత్తుఁడను రాజుగలఁడు. అతఁడు దీర్ఘ దర్శియను మంత్రితో న్యాయంబుగఁ బ్రజల బాలించుచు భూలోకములోఁ దనకుదగిన కన్యక లేదని పలుకుచు నెట్టిసుందరులం దీసికొని వచ్చినను యొప్పుకొనక పెద్దకాలము వివాహము లేకయే యుండెను.

ఇట్లుండునంత నొక్కనాఁడు దీర్ఘదర్శి రాజుతో నిట్లనియె. దేవా! దేవరవారిట్లు వివాహమాడకున్కి రాష్ట్రంబంతయు జింతించుచు యువరాజు నభిలషించుచున్నది. చక్కఁదనంబు లెక్కడికి! ఎట్లు సరిపెట్టుకొన్న నట్లే సరిపడును. నేను మీకు బుద్ధులుగలుపువాఁడనుకాను. మీరే నిదానించి యొకశుకవాణిం బెండ్లియాడి కుల ముద్ధరింపుఁడు. అని పలికిన విని యారాజు మంత్రి కిట్లనియె.

దీర్ఘ దర్శీ! నీవు బుద్ధిమంతుడవుకదా ! నీకు నే నెక్కుడుగాఁ జెప్పనక్కరలేదు. మనము లోకంబున స్త్రీలం జూచుచుంటిమి. చక్కనిదానియందు శీలముండదు. శీలమున్న బ్రీతియుండదు. ప్రీతియున్న చక్కదనముండదు. అన్ని లక్షణంబులుం కలిగి తనయందు ప్రేమగల కలకంఠి దొరుకుట దుర్ఘటము.

నాకు బెండ్లిజేయదలఁచితివేని నిప్పుడు నేనుచెప్పిన లక్షణము లన్నియుం గలిగిన చిన్నదానిని దెచ్చి పెండ్లిజేయుము. లేనిచో నిట్లే యుండెదనని పలికిన విని యామంత్రి వల్లెయని యప్పుడే యట్టికన్యకల నరయుటకై యారాజురూపము పటంబులవ్రాయించి దూతలకిచ్చి నాలుగుదేశంబుల కనిపెను.

పాండ్యదేశమహారాజు సుశీలయను తనకూతుఁరు రూపము పటంబుల వ్రాయించి దానికిఁ దగిన పురుషుని వెదకి, తీసికొని రండని దూతల కాజ్ఞాపించెను.తద్భృత్యులు రాజశాసనప్రకార మాపటంబులం గొని యనేకదేశముం దిరిగి వీరును వారును నొకనాఁ డొకసత్రంబునం గలిసికొని యొండొరులు పలకరించుకొన యా చిత్రఫలకంబులఁ దులగా నిలబెట్టి యిట్టట్టు పరిశీలించి మేనులు పులకింపఁ దలకంపించుచు నోహో! ఇదివఱకింత దేశము దిరిగితిమి గాని యెందును ఇట్టిపొందు గుదిరిన ఫలకంబులం జూడలేదు. ఈరాజునకు నీరాజపుత్రి సరిపడినది. దాంపత్య మనుకూలముగా నుండునని తలంచుచు నొకరి పటంబు లొకరు గైకొని తమతమ యేలికలకడ కఱిగిరి.

విష్ణుచిత్తుఁ డాచిత్తరువు నందున్న మత్తకాశిని రూపంబు పరికించి చూచి తల యూచుచుఁ బ్రతిగాత్రమును వేరువేర వర్ణించుచు మంత్రితో నిట్లనియె. ఆర్యా! నా కీసర్వేందుముఖియందు డెందము దగులుకొనినది. దీనిపేరు సుశీలయట. ఆ పేరు సార్థకమై నిజముగా నిట్టి రూపము గలిగియున్నచో నాచిన్నదానిని నాకుఁ బెండ్లి చేయుమన మిగుల నిరాశతోఁ బలికెను. ఆమాటవిని మంత్రిమిగుల సంతసించి యా రాచపట్టి యట్టిదేయని యతనితోఁ బలుకుచు నప్పుడే పాండ్యదేశరాజునకు సుశీలను మారాజు వివాహమాడ నొడంబడిన వాఁడని శుభలేఖ వ్రాసెను.

పాండ్యదేశపురాజు విష్ణుచిత్తుని చిత్రపటము చూచినది మొదలు సుశీల కతఁడే తగినవరుడని నిశ్చయించెను. అతని మంత్రి వ్రాసిన శుభలేఖచూచి సంతోషముతో నందుల కియ్యకొనినట్లు తెలియపరచుచు శుభముహూర్తముగూడ నిశ్చయించి యప్పటికి దరలిరావలయునని శుభలేఖలు వ్రాసెను. అట్టి శుభలేఖ చదువుకొని విష్ణుచిత్తుడు తన కులాచారప్రకారము సకలవైభవములతోడ నా శుభముహూర్తమునకు దనకత్తి నిచ్చి మంత్రినంపెను. అచ్చట సుశీల తనకు వివాహప్రయత్నము జరుగుచుండ నంతకుమున్ను తాను చదువుకొన్న గురువుగారికి దక్షిణ నియ్యఁదలఁచి సాయంకాలమునఁ జక్కగా నలంకరించుకొని పసిఁడిపళ్ళెరమునిండ బంగారునాణెము లుంచుకొని యాయుపాధ్యాయుని యింటి కరిగి యాయన పాదంబులకు నమస్కరించి యిట్లనియె.

ఆర్యా! నేను మీయొద్ద విద్యాభ్యాసము చేసితిని. మీయాశీర్వచనప్రభావమున నాకీరాత్రి వివాహము జరుఁగబోవుచున్నది. వివాహమైన వెనుక నేను మీయింటికి రాఁగూడదు. తమ రీదక్షిణను స్వీకరించి నాకు వివాహమాడ ననుజ్ఞయిండని వేడుకొనెను. అప్పుడయ్యాచార్యుఁడు తదీయరూపవిలాసవిభ్రమంబులం జూప కామశరపీడితుండై యొడలెఱుంగక వివేకము మొద్దువోవ నాముద్దులగుమ్మ కిట్లనియె. తరుణీ! నాకీధనమేమియు నవసరములేదు. నీధనము నీవే తీసికొనిపొమ్ము. నీయను గ్రహముండినం జాలును అని పలికిన నక్కలికి యతండు గోపముతో నట్లనుచున్నాఁడని నిశ్చయించి అయ్యా! మీ కీధన మక్కరలేనిచో మఱియేమి కావలయును? నేనోపుదేని నిచ్చెదను సెలవియ్యుఁడని పలికిన నావైదికుఁడు వెఱ్ఱినవ్వునవ్వి యిట్లనియె.

తెఱవా! యూరక నోరుతెఱచి యడుగుటయేకాని తుద కియ్యనందువేమో! నిక్కముగా నిచ్చెదనని వాగ్దానము జేసినచో నడిగెదననుటయు నాముగ్ధ యామూర్ఖుని తలంపు తెలిసికొనలేక అయ్యో అయ్యవారూ! మీరు కోరుటయు నేనియ్యననుటయు గలుగునా? నేనంత లోభిదాననుగాను. మీకామిత మేదియో తెలియఁజేయుఁడు. నాకు మీకామిత మీడేర్చుటకంటె నెక్కుడుగలదా? అని పలికిన నతం డయ్యతివ కిట్లనియె.

కామినీ! నీవంటివా రాడితప్పరుగదా! వినుము. నీరూపము త్రిలోకజనమోహనకరము. నిన్ను జూచినప్పుడెల్ల నాయుల్లము రతివల్లభుఁడు విరిమాపుల నేపుమాపుచున్నవాఁడు. ఇంతదనుక నీవు సమారూఢయౌనపురూపు గావునఁ గోరకుంటి. ఇప్పుడు నామనంబు నీసంగమం బభిలషించుచున్నది. ఇదియె నాగోరిక. దీని దీర్చిదవేని గురుభక్తి గలదానవని నిన్ను మెచ్చుకొనెదనని పలికిన నులికిపడి యక్కలికి శివ శివా! యని చెపులు మూసికొని అయ్యో! నీవు నాకుఁ తండ్రివి కావా! ఇట్టి కోరిక నన్నుఁ గోరవచ్చునా? నీకు నన్నిట్లన నోరెట్లాడినది? వేరెద్దియోకోరెద వనుకొంటిని. ఇట్టి నీచపుబుద్ధిగలవాఁడ వని తెలిసికొననైతిని. చాలు చాలు వైదికుఁడా! నీ గుణము తెలిసినది. ఇష్టమైన నీసొమ్ము పుచ్చుకొనుము. లేనిచో బారవేసికొనమని యా పళ్ళెరము నేలపారవై చి గిరుక్కున మరలి మొగంబున చిన్నఁదనము దోప నంతఃపురమున కరిగినది.

పిమ్మట నాబ్రాహ్మణుఁడు తెల్లబోయి యేమియుఁ బలుకలేక ఔరా! నేను గురువునని కొంచమేనియు సంశయింపక యీవగలాడి యెట్లుతిరస్కరించిపోయినది? కానిమ్ము. నాబుద్దినైపుణ్యమంతయు విని యోగపరచి దీనికిని మగనికిని సంబంధము లేకుండఁ జేసెదనని యీసు వహించియుండెను. అంత శుభముహూర్తమున దీర్ఘదర్సిచేఁ దీసికొని రాఁబడిన విష్ణుచిత్తుని కత్తికిని సుశీలకును గొప్ప వైభవముతో బెండ్లిజేసిరి. తండ్రి వివాహపరిసమాపకదివసంబున సుశీలను మితిలేని సారెతో నత్తవారింటి కనిపెను.

ఈలోపలనే సుశీలకుఁ జదువుచెప్పినగురుపు కాంచీపురమున కరిగి పండిత వేషముతో విష్ణుచిత్తుని దర్శనముజేసెను. విష్ణుచిత్తుండు ఆపండితుని మిగుల గౌరవించి కులదేశనామంబులు తెలిసికొని తన యత్తవారియూరే యగుటచే మఱియు సంతసించుచు నతనితో నిట్లనియె.

అయ్యా! మీరాజుకూతురు సుశీల వృత్తాంతము మీకేమైన దెలియునా! ఆచిన్నదాని రూపంబును గుణంబును శీలంబును నెట్టివో చెప్పుఁడని యడిగిన నాబ్రాహ్మణుఁడు సంతసించుచు నిట్లనియె.

అయ్యా! నేనారాజుగారి సంస్థానములో ముఖ్యపండితుండను. ఇదియునుం గాక యాసుశీలకుఁ జదువుచెప్పినవాడను నేనే. ఆమె శీలంబును గుణంబును నాకుఁ దెలిసినట్లు తలిదండ్రులకైనఁ దెలియవు. మీ రడుగుచున్నప్పుడు నిజము చెప్పవలయును. దానిశీలమున కేమిగాని రూపము పైకిజూడ వేడుకగానే గనుపించును. దాని కప్పుడప్పుడు మూర్చరోగము గనంబడుచుండును. ఈ రహస్యము నాకుఁగాక మఱియొకరికిఁ దెలియదు. ఈ గుట్టంతయుఁ గప్పిపుచ్చి రంగులు బాగుగావైచి పటమువ్రాసి పంపిరి. మీరాపటమునుజూచితిరా! యేమి! ఆపటమునుజూచినవారికి నిజముగా నాచిన్నది యట్లే యున్నదని భ్రాంతికలుగక మానదు. మీవంటివారి కాచిన్నది తగదని యెరుగనట్లుగాఁ జెప్పెను.

ఆమాటలు విని యావిష్ణుదత్తుఁడు మనసు చివుక్కుమన, నేమి! దానికట్టి రోగము గలిగియున్నదా! శీలముసంగతిగూడ ననుమానముగానే చెప్పిరి. అయ్యయ్యో! యెరుగక మోసపోతినే! అన్నన్నా! పాండ్యదేశపురాజు నన్నెంత మోసముచేసెను. ఇన్నిదినములు బెండ్లి చేసికొనక చివరకు రోగభూయిష్టురాలిని బెండ్లియాడితినే కానిమ్ము. ఆరాజు నన్నిట్లుమోసము చేసినందుకు దగిన ప్రాయశ్చిత్తము చేసెదను. అతనికూతురు మొగమెన్నఁడును జూడను. అట్లుచూచితినేని మాతృద్రోహము చేసినంత పాపమునకుఁ బాత్రుఁడనయ్యెదనని దారుణముగా శపథము చేసెను. ఆప్రతిజ్ఞను విని యాపాఱుఁడు తన ప్రయత్నము కొనసాగినదికదా యని సంతసించుచు నతనివలన ననుజ్ఞ వడసి తన దేశమునకు బోయెను. తమ కేమియు లాభము లేకున్నను నసూయయే ప్రధానముగాఁగల యాబ్రాహ్మణుఁడు సుశీల కెట్టి యపకారము చేసెనో చూడుము. విలస్వధాన మెట్టిదియే కదా? పిమ్మట నాసుశీలయు గొప్పసారితో నత్తవారిల్లు చేరినది.

ఆమె వచ్చినవార్త విని యాభూభర్త గౌరవింపక దీర్ఘక్రోధుఁడై పరిచారిక వలన నామెకొక మేడ నివసింపఁ జూపించెను. ఆసాధ్వియు నందుఁబ్రవేశించి తన మగనింజూడ నత్యాతురము గలదియై ఆదిత్యునిరాక కెదురుచూచు పద్మినియుంబోలె వేచియుండెను. అట్లుండ నయ్యండజయానకు దినవార పక్షమాసఋత్వనయనంబులు గడచినవి. కాని మనోహరుని దర్శనము లభించినదికాదు. అందులకు జింతించి గడియ యుగముగా గడుపుచున్న యాచిన్నది చిన్నబోయి యొక్కనాఁడు దీర్ఘదర్శికి వార్తనంపి యతనితో నిట్లనియె.

ఆర్యా! నాకు వివాహమై సంవత్సరమైనది. ఇంతదనుక నామనోహరుని మొగమెట్టిదో నేనెరుంగను. ఆయనకు నాయం దెద్దియేని గోపముండఁబోలు. కారణ మేమియు నాకుఁ దెలియదు. దేహమాత్రభిన్ను లగు మీయిరువురిలో నొకరిరహస్య మొకరికిఁ దెలియక మానదు. నాకు నీయందు చనువు గలిగియున్నది. గావున నిట్లడుగు చుంటిని. యథార్ధమెద్దియేని గలిగియున్న వక్కాణింపుమని పలికిన నాకలికి పలుకుల కులికిపడి యాప్రధాని యామెతో నిట్లనియె.

తల్లీ ! నీవల్లభుఁడు నీయందనురక్తుఁడై యున్నవాడేయని యనుకొంటిని . ఇట్లుచేయుచున్న వార్త నాకేమియుం దెలియదు. పరమసాధ్వియగు నీయందేమి తప్పున్నది? యతని యభిప్రాయమెద్దియో గనుంగొని వక్కాణించెదనని యామెతోఁజెప్పి యొక్కనాఁడితఁ డెద్దియో ప్రస్తావముమీఁద నామాట రాజుతో ముచ్చటించెను. అప్పు డతండు అజ్యాహుతివలనఁ బ్రజ్వరిల్లు నగ్నియుంబోలె మండిపడి మంత్రీ! యిట్టి యనవసరప్రశ్నము లెన్నఁడును నాయొద్దఁ దీసికొని రాకుమాయని మందలించి పలికెను.

అప్పుడా ప్రగడ భయపడి మరల నోరెత్తక మెత్తనిమాటలచే నతనిచిత్తమును ప్రసన్నముగఁ జేసికొని యంతటితో నాప్రస్తావము ముగించెను. తర్వాత మంత్రి సుశీలచెంత కరిగి సాధ్వీ! నీపతి నీయందేదియో యీర్ష్యబొందియున్నట్లు కనబడుచున్నది. నీప్రస్తావమే విననొల్లఁడాయెను. కారణము ముందర గనుంగొనియెద. నీవు చింతింపకుము. కాలక్రమంబున నతనిమతి మఱలించి నీయం దనురాగము పుట్టు నట్లు చేసెదనని యవ్వనిత నోదార్చి సమయము గనిపెట్టుచుండెను.

సుశీలకుఁ జదువుచెప్పిన గురువు అంతటితోఁ దృప్తిబొందక మరల నొకనాఁడు విష్ణుచిత్తునొద్దకు వచ్చి యతనితో నిష్టాగోష్ఠిం గాలక్షేపముఁ జేయుచుఁ బ్రశంసగాఁ బాంచాలదేశంబున విక్రమసేనుండను రాజుకూతుఁరు దేవయానయనునది మిక్కిలి చక్కనిదని చెప్పుచు దానిగుఱించి పెక్కుగతుల నుతియించెను. విష్ణుచిత్తుఁ డతని మాటలచే మోసపడి యప్పఁడతిని దనకుఁ బెండ్లిచేయుమని వేడుకొనియెను. అందుల కతండు సమ్మతించి యాదేశమునకఱిగి విక్రమసేనునికడ విష్ణుచిత్తుని యౌన్నత్య మంతయుఁ బొగడి యతని కూఁతు నతని కిచ్చున ట్లొడంబరపించెను.

పిమ్మట నతఁడు విష్ణుచిత్తునొద్దకువచ్చి అయ్యా! దేవయానకు విక్రమసేనుఁడు మీకియ్యనిశ్చయించెను. మీ కిదివరకుఁ బెండ్లియే కాలేదని చెప్పితిని. లేనిచో మీకతండు కూఁతునియ్యఁడు. కావున నిప్పుడున్న భార్య నడవిలో విడిపింప నియోగింపుఁ డని బోధించిన విని యారాజు సమ్మతించి యట్లుచేయ నప్పుడే మంత్రి కాజ్ఞ యిచ్చెను.

దీర్ఘ దర్శి సుశీల నడవిలోనుంచుట తనకిష్టములేకున్నను రాజశాసనమును నతిక్రమింప నశక్యమైనదగుట నందొక విశాలమగు మేడ కట్టించి పెక్కండ్ర పరిచారకులతో సుశీల నా సౌధంబున బ్రవేశపెట్టి క్షేమ మరయుచుండెను. అందులకు సుశీల మిగుల జింతించుచుఁ జచ్చుటకుఁ యత్నించుటయు మంత్రి యోదార్చి యా యుద్యమము మరలించెను.

అంత శుభముహూర్తమున విష్ణుచిత్తుఁడు దేవయానం బెండ్లియాడి యాచేడియ రూపము తనకంత యపురూపముగాఁ దోచమి యథోచితానురాగంబుతో నావిడం గూడి యుండెను.

ఇట్లుండునంత నొకనాఁడు విష్ణుచిత్తుఁడు తనకు వేటయం దభిలాష జనించుటయుఁ దనకోరిక మంత్రితోఁ చెప్పెను. మంత్రియు సమ్మతించి యప్పుడే తగిన సంభారములన్నియు సిద్ధపరచి సుశీలయున్న యడవిలోఁ జాలమృగములున్నవని రాజుతోచెప్పి యాయడవికిఁ దీసికొనిపోయెను. రాజు పెక్కండ్రు మృగములతో నయ్యడివి కరిగి యదేష్టముగా నందు మృగముల వేటాడుచుండ దైవయత్నమున జాముప్రొద్దుండ నద్భుతమైన గాలివాన పట్టినది. అప్పుడు సేనలన్నియుఁ బికాపిక లై పారిపోయినవి. రాజును మంత్రియు నొక చెట్టుక్రింద నిలువంబడిరి. యాచెట్టుకొమ్మ లన్నియు విరుగుచుండుటం బట్టి యందునిలువవెరచి యావానలో బట్టబయలనే తిరుగఁ జొచ్చిరి. అప్పుడు వారికిఁ బ్రాణములం దాశవదలినది. ఇంతలో కొంచెము గాలివాన యణఁగినందున తడిగుడ్డల బిండుకొని గజగజవణఁకుచు నయ్యడవిలో నిలువ యే గుడిసెయేనిం గలదేమోయని యిటునటు దిరుగజొచ్చిరి. అప్పుడు దీర్ఘ దర్శి తాను దలచికొనిన కార్యము దీర్చుట కిదియే సమయమని నిశ్చయించి దైవానుకూలమును గుఱించి సంతసించుచు రాజుతో నిట్లనియె.

దేవా! యీ ప్రాంతమందొక సౌధముండుట నాకు జ్ఞాపకము వచ్చినది. అందొక రాజకుమార్తె నివసించియున్నది. ఆమె మార్గస్తులకు సదుపాయము చేయునని విని యుంటిని. అచ్చటికి బోవుదమే యనుటయు రాజు అంతకన్న మేలుస్నదా ! ఈ రాత్రి యన్నమును బొడిగుడ్డలు నిచ్చువారెవ్వరైన నున్నవారినే దైవముగా జూతుము గదా! యని పనికి యతనితోఁగూడ నామేడ వెదకికొనుచు నడిచెను. ఆ స్థలము మంత్రి యెఱిగియున్నదే. కావున గొంతసేపు త్రిప్పి తుదకు సాయంకాలమున కచ్చటికి దీసికొని పోయెను.

సుశీలకు మంత్రి యంతకుపూర్వమే వార్త నంపియుంచెను. ఆరాత్రి సుశీల యామేడంతయుఁ జక్కగా నలంకరించి దీపములం పెక్కు వెలిగించి యుంచెను. ఆమేడఁ జూచి రాజు మిగులవెరగందుచు మంత్రీ ! యింత వింతసౌధ మెవ్వరిది ? ఇందున్న చిన్నది యెవ్వతె! యెవ్వనికూఁతురు? యెవ్వనిభార్య? మగనితోడనే యిందున్నదా? యని యడిగిన నతనిమంత్రి యిట్లనెను.

దేవా! యీచిన్నది మళయాళదేశపు చక్రవర్తి కూఁతు రనియు విహారార్ధమై యిచ్చటికివచ్చి యిందు మంచిగాలి తగులునని మేడ గట్టుకొనెననియు వినియుంటిని. ఈమెమగఁ డిందుండెనో లేదో నాకు దెలియదు. మార్గస్థులకు మిగుల సదుపాయములు చేయునట. ఇందు గొన్నిదినములుండి మరల స్వదేశమున కరుగగలదనికూడ విని యుంటిని. ఆకథయంతయు మన కేటికి! ఈరాత్రి భోజనమిచ్చి పొడిపుట్టములిచ్చినం జాలదా? యనిపలుకుచు ద్వారముచెంతకుపోయి ద్వారపాలకులతో మంత్రి యిట్లనియె.

ప్రతీహారులారా! మేము మార్గస్థులము. వానతాకుడుచే మిక్కిలి యలసితిమి. మీయేలికసాని యీరాత్రి యిచ్చట మాకు నన్నవస్త్రము లిచ్చి యాదరించునేమో యడిగిరండు అనిచెప్పిన వారు సత్వరముగాఁ పోయి యావర్తమానము సుశీలతోఁ జెప్పిరి. అమాటవిని సుశీల మిగుల సంతసించుచు వారినిసత్కరించి తీసుకొనిరా బెక్కండ్రదూతికల నియమించెను. పరిచారకులు తదానతిపోయి అర్ఘ్యపాద్యాదివిధులం దీర్చి తోడ్కొనివచ్చి యొక విచిత్ర వనాంతరమందుఁ బ్రవేశపెట్టిరి. సుశీల మరికొందరిచేత పీతాంబరములు వారికిఁ గట్టఁబంపించెను. ఆపుట్టంబులఁ గట్టుకొని రాజు తదీయవైభవంబునకు నాదరణంబునకుఁ బెక్కు తెరంగుల సంతసించుచుఁ దన యానందమంతయు మంత్రితోఁ జెప్పుచుండెను.

శ్లో॥ యదైవోపహతం దుఃఖం సుఖం తద్ధిర పాంతరం
      నిర్వాణాయతరుచ్ఛాయా తప్తస్యహివిశేషతః॥

దు:ఖము పూర్వముగాగల సౌఖ్యమే హాయిచేయును. ఎండచేఁ దపింపబడిన వానికేగదా చెట్టునీడ విశేషసుఖరరముగా నుండును. అలాగుననే యడవిలో గాలివానచే మిగుల నలసటజెందిన యారాజునకు సుశీలచేసిన యుపచారము మిగుల నానందకరముగా నుండెను.

అంత కొంతసేపున కాకాంత యత్యంతరుచి గలుగునట్లు పాకముజేసి పైడిపీటల నమర్చి వారింబిలిపించినది. వారు మిగుల నాకలిగొనియున్న వారగుట నాబంగారుపీటలపైఁ గూర్చుండిరి. పిమ్మట నాసుందరి జల్తారుపట్టుచీరం గట్టి మేల్కట్టు జరీపువ్వల మువ్వంచు కంచుకిందొడిగి వెలలేని పెక్కుతొడవులధరించి పదకటకంబుల ఘలుఘల్లుమని మ్రోయ గ్రొక్కాఱు మెఱుంగుతీగెలాగునఁ దళుక్కుమని మెఱయుచు జక్కవకఁవబోలె బైటలో గ్రెక్కిరిసియున్న చన్నుదోయినలదినకస్తూరితాపులు ఘుమ్మని దెసలావరించి నల్లనల్లన జనుదెంచి యోరచూపుల నాభూపాలుం చూచుచు బంగరుపాత్రలతో బంచభక్ష్యపరమాన్నములు వడ్డించినది.

అంత నాభూకాంతుఁడును మంత్రియు నాపదార్ధములు రుచి మెచ్చుకొనుచుఁ దృప్తిగా భుజించిరి. భుజించినప్పు డారాజు అమ్మానిని మేనితావి నాసాపర్వంబు గావించుటయు రెండుమూడు సారులు తల పైకెత్తి చూచెను.

అప్పు డయ్యతివ తనపై నెరపుచున్న వన్నెచూపుల చిన్నెలుకొన్ని పరిశీలించి తదీయరూపవిభ్రమవిలాసము లుల్లాసము గలుగఁజేయఁ గందర్పుఁడు తనడెందము నాసుందరి విభ్రమభ్రమితభ్రూయుగంబు కార్ముకంబుగాఁ జేసి తదీయకటాక్షవీక్షణమార్గంబులఁ బరితాపంబు బొందింపఁ బెంపుచెడి యాపొలఁతి వలపుచూపులం నట్టి చూపులంజూచి మరలించుచు నంతకంతకు కంతుసంతాపము వింతచేష్టలఁ బుట్టింప నతఁడు స్మరాపస్మారంబున మత్తలమందుచుండెను.

అట్టి వికారచేష్టలతోడనే భుజించిన విష్ణుచిత్తుని చిత్తవృత్తి యంతయు గ్రహించి మంత్రి సంతసించుచు నతని నొక భవనాంతరమునకుఁ దీసికొనిపోయి యం దమర్పబడియున్న హంసతూలికాతల్పంబునం గూర్చుండబెట్టెను. అప్పుడు సుశీల పరిచారికలు దెచ్చిన విడియపు చుట్టలు తనకందించుచున్న దీర్ఘదర్శికి రాజిట్లనియె. ఆర్యా! మనము భుజించునప్పుడు నీకుబోధకాని చర్యలుకొన్ని ప్రవర్తిల్లినవి. ప్రాణతుల్యుఁడవగు నీకెఱింగింపకదీరదు. తలచుకొనినంత నా స్వాంతమున వింతయగు సంతసము జనించుచున్నది. అమ్మగువ చిఱునగవు మొగమున నగయై మెలుయ దట్టమగు చూపులు నాపై బరగించి నాచిత్త ముత్తలమందించినది.

మిత్రమా! నీవూరక తలవాల్చికొని భుజించితివికాని, యేమియు నెఱుంగవు. మోహినీదేవతయుంబోలె నున్న యాచిన్నదాని చిన్నె లేమని వక్కాణింతు. నేను మరలఁ జూచునప్పుడు తనచూపు! వేరొకలాగున మార్చుచుఁ దలవాల్చుకొని భుజించు తఱి తన వాలుచూపు తళుక్కులు నాపై నెరయఁజేసినది. పెక్కేల? అక్కలికికి నా యందు మక్కువకలిగినది. ఇదియ నిక్కవంబు. వేరొక్కటికాదు. నేనక్కడకు మరల నరుగవలయు. నొక్కమిశచెప్పుము. అయ్యో! ఇంక కొంతసేపచ్చట నిలువ నీయక యిచ్చటికిఁ దీసికొనివచ్చితివేటికి? వచ్చుట నేనెఱుఁగను సుమీ! నేను విరాళి సైపనోప నాలోపల పురుషు లెవ్వరులేరు. మరల నచటికరిగెద నేమిచేసినను మంచిదే. దీనికి నీవేమి చెప్పదవనుటయుఁ దనప్రయత్నము కొనసాగుచున్నదని సంతసించుచు మంత్రి రాజున కిట్లనియె.

దేవా! దేవరవారి సౌందర్యముజూచినంత యొకమనుష్యకాంత కామించుట యేమి యాశ్చర్యము! దేవతావనితలైనను విరాళిం గుందుచుందురని చెప్పఁగలను. ఈమె సుశీలయైనను నీరూపుఁజూచియే మోహించినది. ఇప్పుడు పరివారికలందరు తమతమ స్థానంబులకుఁబోయిరి. ఆమె యొంటిగానే యుండును. దాహము నెపంబునఁ గ్రమ్మర నచ్చటికరిగి యత్తరుణి చిత్తవృత్తి గనిపెట్టి పైనఁ నాలోచితముగా నడిపింపుఁడు. నేను వెనుకఁ గాచియుండెదనని పలికిన సంతసించి యారాజు మెల్లన లేచి యంతకు పూర్వమే పరిచారికలందరు తమతమ నెలవుల నడఁగి యుండిరిగాన నిశ్శబ్దముగా నున్న యాలోగిటలో నాలుగుమూలలు తొంగితొంగి చూచుచు మరల భోజనశాల కరిగెను.

అంతకుమున్నే యాకాంతయు మంత్రిచే బోధింపఁబడి యున్నది. నిదురింపక నావంటశాలయందే తిరుగుచుండెను. ఇంతలో నారాజా లోనికింజని యవ్వనితం జూచి గద్గతస్వరములో మించుఁబోఁడీ! కొంచెము దాహ మిచ్చెదవాయని యడిగెను.

అప్పు డప్పఁడతి యడుగులు తడఁబడ యొయ్యారముగా నిలఁబడి లేనవ్వుతో మీకు తియ్యని దాహము కావలయునా? పుల్లని దాహము కావలయునా? యని యడిగెను. ఆమాటకతండు సంతసించుచు తియ్యనిదాహమే యిమ్మనిన నమ్మగువయు దియ్యనిదియ్యనా! యని పలుకుచు శర్కరామిళితములైన దుగ్ధంబులు దాహమిచ్చి యింతకన్న రుచికి నాయొద్దనున్నది యధరమేకాని యధికములేదు చవిచూడుఁడని పలికెను.

అప్పుడాచతురుండా ప్రౌఢవచనంబులకు వెరగందుచు నోహో యీబోఁటి మాటలు మిగుల పాటవముగానున్నవి. అధరమనగా దక్కువయనియు నధరోష్టమనియుఁగూడ నర్ధముగదా! అధరోష్టము చవిచూడుమనికూడ సూచించుచున్నది. కానిమ్ము ఎట్లయినను మంచిదియె. యిచ్చట అన్యులెవ్వరును లేరుగదా! నట్టి మాటలతో గాలక్షేపము సేయనేల! తగినట్లే చెప్పెదనని తలంచుచు నారీమణీ! నాకా యధరమే కావలయును. మరొండు వలదు. అని పలుకుచు తటుక్కున నక్కుటిలాలక యధరంబానబోయెను. అమ్మించుఁబోఁడియు నించుక విదళించుకొనుచు నోహో! ఇది యేమి సాహసము. దాహమునకై వచ్చి వెలిపనులు చేయఁబూనితివేటికి! నేను వారాంగన ననుకొంటిరా! చాలుచాలు పోపొండు అనిపలుకుచు దదీయహస్తవిన్యాసంబులు ద్రోసివేయక యనుకూలసూచకముగా మెలంగిన నతండది యెఱింగి యాబోఁటి మాటలు పాటిసేయక, అతివా! మొదట నధరము చవిచూడుమని చెప్పి! పిమ్మటఁ ద్రోసివేయఁ దప్పునే! అంత యెఱుంగని వాఁడనుకొంటివా! శ్లేషలు నాకును వచ్చును. అని పలుకుచు జిట్టకంబులు గావించెను.

అప్పుడా సుశీల యతనిజేఁయి తనచేఁతం బట్టుకొని చాలుఁజాలు? మగవారి వలపులును జలముల వ్రాతయు సమానములైనవి. మొదటనిట్లేచేసి యవసరముతీరిన వెనుక మరలఁ బలుకరింపరు. ఎల్లప్పుడు నిట్లున్న సమ్మతింపవచ్చును. "వ్రతము చెడినను సుఖముదక్కవలయు" ననుసామెత వినియుందురుగదా? అనిన నతండౌ నౌను నన్నట్టివానిఁగా దలఁపకుము. నీయిష్టము వచ్చినట్లు మెలంగెదనని చేతిలోఁ జేఁయివై చెను. పిమ్మట నాకొమ్మ సమ్మతించి నట్లభినయించుచు నతని నంతకుమున్నే యలంకరించయున్న మేడఁమీదకుఁ దీసికొనిపోయి హంసతూలికాతల్పమునఁ జేర్చినది.

మరియు నందు నయ్యిందువదన కొంతసేపు కంఠనాదంబు దంత్రీనాదంబుతో నైక్యమునొంద వీణధరించి సంగీతంబు పాడుచు నతనిమతిఁ గరగఁజేసినది. ఆ భూపాలుండును కాలయాపన సైపక యాపడఁతిచేఁతనున్న విపంచియూడఁబెరికి మోహముతో గందర్పక్రీడారతుండై యవ్వేదండగమనను సంతోషపారావారవీచికల నుయ్యెల లూగించెను.

ఈరీతిఁ గ్రీడించుచుండ వారికారాత్రి యొకగడియలాగైనను వెళ్ళలేదు. వారి వలపు లేమని చెప్పుదును. విష్ణుచిత్త కామత్తకాశిని పరకీయయని యూహించుటచే నంతవలపు గలిగినది. స్వీయ యనితెలిసినచో నట్లుండడుసుమీ? అదియంతయుఁ బ్రచ్ఛన్నముగాఁ జూచుచున్న మంత్రిమిగుల సంతసించెను. తెల్లవారినంత రాజు మంత్రియొద్దకువచ్చి రాత్రిజరిగిన చర్యయంతయుఁ జెప్పి యప్పడంతి చక్కఁదనమును గుఱించియు మక్కువను గుఱించియుఁ బెక్కు తెరంగుల స్తుతిఁ జేయదొడంగెను. అంతనా విష్ణుచిత్తుఁడు మంత్రియనుమతిఁగొన్ని దినములందుండి యాచేడియతో రాత్రింబవ ళ్ళేకరీతిఁ గామక్రీడలం దేలుచుండెను. ఒక్క నాడతని రెండవభార్య పతిజాడ తెలియక యతని వెదుకుటకై పరిచారకుల నంపెను. వారు నెట్టకేలకు రాజున్న తావుదెలిసికొని యతనితో దేవిగారి విజ్ఞాపనము దెలియంజేసిరి.

రాజు సుశీలతో నావార్తఁజెప్పి తనకుఁ బురంబునకరుగ ననుజ్ఞయిమ్మని వేడుకొనెను. సుశీలయు నతనిమరల శీఘ్రముగావచ్చు. నట్లొడంబడఁజేసి యానవాలుగా నతని యుంగరము గైకొని యతని పయనంబున కనుమతించినది.

విష్ణుచిత్తుఁడు నెట్టకేల కారాచపట్టిని విడచి పురంబున కరిగి యందు నిజదర్శనాయత్తచిత్తయైయున్న దేవయానకు సంతోషము గలుగజేసెను.

అచ్చట సుశీలయు గర్భవతియై పదియవమాసంబున నధికరూపసంపన్నుఁడు పరాక్రమశాలియును నత్యంత బుద్ధిమంతుండునునగు పుత్రునింగనియె. ఆవర్తమానము గూఢచారులవలస విని దీర్ఘదర్శి రహస్యముగా నాబాలునకు జాతకర్మాదివిధుల నిర్వర్తించి కామపాలుండని పేరుపెట్టెను. ఆబాలుండును శుక్లపక్షక్షపాకరుండు బోలె దినదినప్రవర్ధమానుండై యధికతేజస్సమంచితుండై యొప్పుచుండె. వాని కైదేఁడులు వచ్చినంత మంత్రియు నంతియప్రాయముననున్న బుద్దిసాగరుడను సార్ధకనామంబు గల తనకుమారునిఁ గామపాలునితో జోడుజేసి యొక గురువునొద్దఁ జదువనేసెను.

సుశీల రూపప్రాయతేజోమనీషావిశేషంబుల నొండొరుల కించుకయేని వాసి లేని యాబాలురిరువును సకలలోకమనోహరులై పదియారేఁడులు ప్రాయము లోపుననే సకలవిద్యలు సభ్యసించి విలువిద్య యందును నసమానపాండిత్యము గలవారైరి. వారు విద్యాభ్యాసము చేయునప్పుడు గొన్నిదినములు మంత్రియింటను కొన్ని దినములు సుశీలయింటను నివసించి క్రీడగాగడిపిరి. ఇంచుకయేని శ్రమముగాఁ దలంపలేదు.

ఆ కుమారు లిరువురు నాకారమాత్రభిన్నులై మనఃప్రాణంబులు నొక్క,టియే యనునంత మైత్రిగలిగి వర్తించుచుండిరి.

విద్యలన్నియుఁ బరిపూర్తియైనంత నొకనాఁడు వారిరువురు నొండొరు లాలోచించుకొని యెవ్వరికినిఁ దెలియకుండునట్లు అడవిమార్గంబునంబడి దేశాటనసేయు తలంపుతో నరిగిరి. దేశాటనంబు పండితధర్మమేకదా ! మంత్రియింటనుండిరని సుశీలయు, సుశీల యింటనుండిరని మంత్రియుఁ దలచుటచేఁ గొన్నిదినముల వఱకు వారి ప్రయాణవార్త యిరువురకునుఁ దెలిసినదికాదు.

ఒకనాఁడు మంత్రి సుశీలయింటికివచ్చి కుమారు లెచ్చట నున్నారని యడిగిన నప్పఁడతియుఁ దడఁబడుచు నయ్యో! కొమారు లచ్చట లేరా? యని యడిగెను. అప్పు డతండు గుండె ఝల్లుమన నక్కటా అచ్చటనుండివచ్చి పెక్కుదినములై నదే. యిచట నున్నారనుకొంటిని. వారు మనలను మోసముచేసి యెచ్చటికోపోయిరి. అయ్యయ్యో! విదేశములలో వీండ్రెట్లు మెలంగఁగలరు ? అతిసుకుమారవంతులే ! అన్నన్నా! జాడైనఁదెలిసినదికాదు. ఏమి చేయుదుము అని యనేక ప్రకారములఁ జింతింపఁ దొడంగెను.

ఆ మాటలు వినుటతోడనే యాచేడియ కత్తిచే నరకంబడిన కదళియుంబోలె నేలంబడి మూర్చిల్లి యెట్టకేలకుఁ దెప్పిరిల్లి పెక్కుతెరంగులఁ జింతింప దొడంగినది.

అప్పుడు మంత్రి దైర్యము తెచ్చుకొని యామెతో నమ్మా! నీవు చింతింపకుము. వారు పండితులై దేశాటనము సేయఁచలంచిరి. చక్రవర్తికన్నఁ బాండిత్యము గలవారికి విదేశములో గౌరవముగా నుండును. వారును శీఘ్రకాలములో రాగలరు. నీవు ధైర్యముగా నుండుమని యామె నోదార్చి తనయింటికిఁ బోయి వారిజాడ తెలిసికొని వచ్చుటకు రహస్యముగాఁ బెక్కండ్ర దూతలంబంపెను.

సుశీలయుఁ బుత్రవియోగశోకంబున గుందుచుండ నొక్కనాఁడు విష్ణుచిత్తుఁ డత్తలోదరుని స్మరించుకొని స్మరసంతాపము జెంది యొక్కండే గుఱ్ఱమెక్కి యయ్యడవిలోనున్న సుశీలమేడకువచ్చి పరిచారకులవలనఁ దనరాక నామెకుఁ దెలియఁ జేసెను. అప్పుడాసుశీల మొగమున విన్నఁదనము దోపనీయక యతని రాకయుఁ దనకొకరీతి ప్రీతిగలుఁగఁజేయ నెదురేగి యతని పాదంబులు గడిగి తడియొత్తి చిత్తము గరుగ మెత్తనిమాటల స్వాగతమడుగుచు లోనికి దీసికొని యొకతల్పమునఁ గూర్చుండ బెట్టెను.

రాజు ఆమించుఁబోణిని మన్నించుచుఁ గుశలప్రశ్నఁ జేసెను. సుశీలయు నతనిచిత్తము జాలిబొడమునట్లు దేవా! దేవరవారికి నేటికి నాకుశలప్రశ్న గావలసి వచ్చినది. పోనిండు ఇదియు నాయదృష్టమే పదియారేఁడులైనది. మీరిచ్చటనుండి యరిగి యొక యుత్తరమైన బంపకపోతిరికదా? ఇంతకు నాదినముల మహిమ యట్లుండ మిమ్ముననవలసిన పనియేమున్నదని నిష్ఠురముగాఁ బలికిన విని యారాజు నామెవచనంబుల కెద్దియో మిషఁ బన్ని తగినట్లుత్తరములు చెప్పెను.

చిరకాలసందర్శనసంభ్రమంబున నతం డత్తలోదరితోఁ గూడి యిష్టాగోష్టి మాటలాడుచు వేడుకతోనుండెను. ఆమె చిత్తము పూర్వమువలె ననురాగయుత్తమై యుండలేదు. దాని కతం డంతరంగమున శంకించుకొనియు నప్ పుడేమియుఁ బ్రశ్న చేయలేదు. తర్వాత నా నాతిచే నమర్చఁబడిన పదార్ధములు భుజించి యమ్మించుఁబోఁణితోఁ బంచశరక్రీడలఁ దేలెను.

అట్లు కొన్నిదినములున్న వెనుక నతండా చిన్నదాని సంభోగసంభాషణక్రీడావిశేషంబులు బూర్వముకన్న నెక్కుడు వైపరీత్యముగా నుండుటఁ జింతించి యొక్క నాడామెతో నిట్లనియె.

నాతీ! నీతీరుచూడఁ బూర్వమునకు మిగుల వైషమ్యముగా నున్నది. నాయందు మక్కువతగ్గెనా? లేక యెద్దియేని కారణమున్నదియా! యెప్పుడును విచారముఖముతో నుందువేమి? ఇదియునుఁగాక నీకును నాకును నిన్నిదినములనుండి స్నేహమున్నను నీయుదంతమే నాకుఁ దెలిసినదికాదు. నీమగండెవ్వఁడు? తల్లిదండ్రు లెవ్వరు? ఒంటిగా నీయడవిలో నుండుటకుఁ గారణమేమియో! తెలియజేయుమని యడిగిన నచ్చేడియ సంతసించుచు నతని కిట్లనియె.

నాధా ! ఈ విషయ మన్యోన్యము దెలియఁదగినదే ముందు మీవృత్తాంతము జెప్పుఁడు. మీకు భార్యలెందరు? సంతాన ముస్నదా ! భార్యలయం దిష్టముగా నుందురా? అని యడిగిన నతండిట్లనియె.

తన్వీ ! నాకు భార్యిలిద్దరు గలరు. పెద్దదానిఁ దలఁపనవసరము లేదు. రెండవ దానిపేరు దేవయాన. దానికి నాయందు మక్కుప యెక్కువగనే యుస్నదిగాని యంత చక్కనిది కాదు. నాకింకను సంతానము గలుగలేదు. ఎందరైనను నీకుసాటివత్తురా యని పలికిన నక్కలికి మరల నిట్లనియె.

దేవా! మీపెద్దభార్య విషయము దలప నవసరము లేదంటిరి. ఆమె యేమి తప్పుజేసినది? కారణమేమియో తెలుపుఁడని యడిగెను. అప్పు డతండు కొంతసేపు ఇతర ప్రసంగములతో నాసంగతి గప్పఁదలంచెను. గాని యమ్మానిని మరియేమియు వినిపించుకొనక యా ప్రశ్నయే పలుమారు చేయఁదొడంగెను. దానంజేసి తుద కతనికి జెప్పక తీరినదికాదు.

బోఁటీ! యాపాటలగంధిపేరు సుశీల. దానితండ్రి కపటముగాఁ బటము వ్రాయించి నాయొద్దకంపెను. నేను బటములోనున్నప్రకార మాసుశీల యందముగా నున్నదనుకొని దాని బెండ్లి యాడితిని. అది మాయింటికి రాకమున్ను దానికిఁ జదువుఁజెప్పిన గురువు నాయొద్దకు వచ్చి దానికి మూర్ఛరోగమున్న దనియుఁ బటఁ ములో వ్రాసినదంతయుఁ గపటమనియు జెప్పెను. అప్పుడు నాకుఁ గోపము రాకుండునా? దానికి బదులు నేను దాని మొగము జూడనని ప్రతిజ్ఞ చేసి యట్లే నడుచుకొంటిని పిమ్మట రెండవ భార్యను బెండ్లియాడుటంజేసి మొదటిదానిని నడవిలోనికిఁ బంపవలసివచ్చినది. అది యిప్పు డెక్కడున్నదో తెలియదు. ఇదియే నావృత్తాంతము. ఇఁక నీవృత్తాంతము చెప్పుమనుటయు నాసుశీల గురువుచేసిన కపటమునకు ముక్కుమీఁద వ్రేలువై చుకొని తలకంపించుచు నోహో! ఇదియా తెలిసినది. అన్నన్నా! బ్రాహ్మణు డెంత దుర్మార్గుడని పలుదెరంగుల జింతించుచుండెను.

అంత నతండు తరుణీ! యూరకుంటవేమి నీకథ చెప్పుమనుటయు సుశీల మరల నిట్లనియె. దేవా! నాకు మీరు చెప్పినమాటలలో గొంచము సందియముండుటచే విచారించుచుంటిని. మీభార్యను గురువు రోగిష్టురాలని చెప్పినంతనే నిజానిజములు పరిశీలింపక విడువవచ్చునా? ఆతని కెద్దియేని యాముద్దియయందుఁ గోపముండి యట్లు చెప్పెనేమో ! మీరు జేసినపని యేమియు నాకు సరిపడినది కాదనుటయు నతండు అబలా! అప్పుడు నాకంత యూహ తోచినదికాదు. ఇప్పుడేమిచేయుదును! ఔను! కొన్ని కపటకృత్యములవలన నట్లు జరుగును. నిజముగా నట్టిదోషములేక యాసుశీల పటములో వ్రాసినట్లే యున్నచో నీతోసమానముగా నుండును. పాప మూరకయే విడిచితినేమో యని పలికిన మరల సుశీల యిట్లనియె.

దేవా! మగవారిచర్య లెప్పుడు నిట్లేయుండును వారెంత పరిశీలింపక చేసినను స్వతంత్రులు గావున సాగుచుండును. నాకథ యట్లుండనిమ్ము. నీ పెద్దభార్య సుశీల నాకుఁజెలికత్తియే. దాని పూర్వోత్తరమంతయు నేనెఱుంగుదును. దానివంటి చక్కనిదియు గుణవంతురాలు నీభూలోకములోలేదు. దాని గురువట్లు చెప్పుటకుఁ గారణము వినుఁడు. సుశీల వివాహదినంబున నలంకరించుకొని గురుదక్షిణనిచ్చుటకై గురువుగారింటికి బోయెను. అప్పు డాబ్రాహ్మణుఁడు అదియిచ్చు గురుదక్షిణ నందు కొనక దానిరూపమునకు వలచి తనతోఁ గ్రీడింపుమని యడిగెను. ఆసాధ్వీ యందులకుం సమ్మతింపక యాపళ్ళెర మచటఁ బారవైచి యహంకారముఖముతో నింటికి బోయినది.

ఆయీర్ష్య లోపల నుంచుకొని యాదుర్మార్గుఁడు మీతోనట్లు చెప్పెనుగాని యథార్థముగాదు. పోనీ యొకటి విచారింపుండు ఆతండూరకవచ్చి యడుగకముందే దాని చెడుగుణంబు మీతోఁ చెప్పుట కవసరమేమున్నది! బుద్ధిమంతులకు దీనిఁబట్టి చూచిన నందలి యథార్థము తేటపడదా! పాపమా సుశీల గురువుచేసిన యవమానము నాతోఁ జెప్పి చింతించినది. దానిగుణ మెవ్వరికైన వచ్చునా ! యని పలికిన నతండు తెల్లబోయి యుల్లంబు దల్లడిల్ల అయ్యో! తొయ్యలీ! ఆగురువు నన్ను మోసము చేసెనే! తెలిసికొనలేకపోతిని. కటకటా! యూరక నాసుగాత్రి నాత్రము నొందించితిని. యని యనేకప్రకారములఁ జింతించుచుండెను.

అతని పశ్చాత్తాపంబు బరిశీలించి యమ్మించుబోఁణి దేవా! కానిండు మించిన దానికి జింతింపనేటికి? ఇప్పుడప్పూఁబోణి నాస్వాదీనములోనే యున్నది. సెలవై నచోఁ బిలిపించెద ననుటయు నతండు సంతసించుచు నయ్యింతి కిట్లనియె. తరుణీ! యయ్యింతి యింతవరకు నిర్దుష్టురాలై యుండినచో వేగఁబిలిపింపుము. దానిపాదంబులంబడి తిరస్కారదోషంబు బాపుకొనియెదను. లేలెమ్మని తొందరపెట్టిన నమ్మత్తకాశిని యతని చిత్తవృత్తి యంతయు బరిశీలించి పశ్చాత్తాప తప్తమయ్యెనుగదా యని సంతసించుచు నిట్లనియె.

ప్రాణనాధా! ఆసుశీల నెచ్చటనుండియో తీసికొనిరానక్కరలేదు. ఇక్కడనే యున్నదిఁ పెక్కేల! నేనే యాసుశీలను. పూర్వజన్మ మందెద్దియో పాతకముచేసి యింతకాలము నీవంటిపతికి నయిష్టురాలనై తిని. మనదీర్ఘదర్శి తనపేరు సార్ధకము నొంద నింతకాలమువరకు నాకుధైర్యము గరపుచుఁ తుదకు మిమ్ము నాచెంతకుఁ దీసికొని వచ్చెను. ఇంతకును దైవానుకూలము వచ్చినది. మీరు చనిన పిమ్మట మీ తేజంబున నాకొకకుమారుం డుదయించెను. వానిరూపము, పరాక్రమము, గుణములు దేవతలకై నను లేవు. వాఁడు మంత్రి కొడుకుతోఁ గూడఁ గొన్ని దినముల క్రిందట నెచ్చటికో పోయెను. దానంజేసి చింతించుచుంటినని తన కథయంతయు దాచక చెప్పి కన్నులనీరు విడువజొచ్చినది.

అప్పుడతం డామెను గౌఁగలించుకొని యోహో! ఆసుశీలవు నీవేనా! తెలిసికొనలేకపోతినే. సాధ్వీ! చింతింపకుము. దైవప్రతికూలమువలననే నాకట్టి బుద్దిపుట్టినది. నీవిట్టి కష్టము లనుభవించుట దైవయుక్తి సుమీ! అన్నన్నా! ఇంతచక్కనిదానిని బ్రాహ్మణుఁ డెంతమాయచేసి మొగముజూడకుండ జేసెను? ఒకసారి చూచిన విడుదునా? అయ్యారే! గాలమంతయు వృధాపోగొట్టకొంటినే!నీప్రాయమంతయు నడవిపాలైనదేయని యడలుచు గుమారసందర్శనమునకుఁ జింతించుచు నప్పుడే యప్పడఁతి నచ్చటనుండి తన పట్టణమునకుఁ దీసికొనిపోయి మంత్రికి వర్తమానము బంపి యతఁడుచేసిన యుపకారము గుఱించి పెక్కుగతుల స్తుతించి యాసుశీల నొక చక్కని యంతఃపురములో బ్రవేశపెట్టి కుమారాన్వేషణార్ధంబు దేశదేశంబులకు దూతలంబంపెను.

భేరుండపక్షి కథ

గోపా! అచ్చట బుద్ధిసాగరుండును కామపాలుండును నిల్లు వదలి యడవిమార్గంబునం బడి నడచినడచి యొకనాఁటిరాత్రికి మధ్యార్జునమను రాజధాని జేరిరి. అందు విత్తముగైకొని యన్నమిడుచున్న యొక పెద్దమ్మ యింటికిఁబోయి పెందలకడ భోజనముజేసి పెద్దమ్మా! మేమీ వీథివేదికపై బండికొనియెదము. ఆప్తరణ మెద్దియేని యిత్తువా! యని యడిగిరి. అప్పుడామె గుండెమీఁదఁ జేయివైచుకొని అమ్మో ! బాలులారా! మీరెఱుగరుకాఁబోలు. ఈ యూర నడివీథిలో బరుండరాదు. పరుండిరేని రాత్రి భేరుండమను పక్షి వచ్చి చంపును. లోపలనే చోటు చూపించెద రండనుటయు వారు నవ్వుచు నోహో! పెద్దమ్మా మమ్మా భేరుండ మేమియుఁ జేయలేదు. మాయొద్దకు దాని యూయువు మూడియే వచ్చును . మేము వీథిలోనే పరుండెద మని యామె వలదని యెంతచెప్పినను వినక వీథితిన్నెపైఁ బండుకొనిరి.

ఆమె చెప్పినమాటలచే వారికి నిద్దుర పట్టినదికాదు. అర్ధరాత్రమైనతోడనే పక్షవిక్షేపవాతంబుల బ్రాంతవృక్షంబుల పెళ పెళనుని కొమ్మలువిరిగి క్షీణదశనొంద నాభేరుండ మతివేగంబున వచ్చి యిచ్చవచ్చిన ట్లయ్యూరంతయుఁ గ్రుమ్మరి దొరికిన జీవకోటిబంచత్వంబు నొందించుచుఁ గ్రమంబున వీథితిన్నెపయిం బరుండియున్న యాకుమారుల నిర్వురం జూచి యత్యాగ్రహముతో జంప మీద కురికినది.

అప్పుడు బుద్దిసాగరుండు తటాలున లేచి కటారి బెరికి దాని రెక్కలు రెండును నరికి పిమ్మటఁ దల తెగవైచెను. ఆర్పులు చెలంగ నది నేలంబడి గిలగిలఁ గొట్టుకొనుచుఁ గొంతసేపటికి బ్రాణము వదలినది. పిమ్మట వారు తెల్లవారుజామున కేక వైచి లేపి పెద్దమ్మా! మేము పోవుచున్నామని చెప్పి యయూరువిడిచి పైకి పోయిరి..

అంత నాయూరిలో నొకచాకలి గొడ్డలి భుజముమీఁదవైచికొని యడవికిఁ బోవుచు వీధిలో జచ్చిపడియున్న యాపక్షింజూచి దానిగుఱించి రాజుచేసియున్న ప్రతిజ్ఞ వినియున్న వాఁడగుట మిగుల సంతసించుచు నలుదెసలు పరికించి యెవ్వరును రాకుండుటం జూచి యప్పు డాగొడ్డలిచే దాని యవయవయము లన్నియు ముక్కలు క్రింద నరికి ప్రోగుగా బెట్టెను. అంతలోఁ దెల్లవారుటయు జనులందరువచ్చి చూచి యది చచ్చినందులకు మిగుల సంతసించుచుఁ జాకలివానిని మిగుల శ్లాఘించిరి. చాకలివాఁడు పక్షిని జంపెనను వార్త గ్రామమంతయు వ్యాపించుటయేగాక రాజుగారికిఁ గూడఁ దెలిసినది.

అప్పుడు సింహకేతుఁడను పేరుగల యారాజు ఆపక్షియొద్దకు వచ్చి చచ్చిపడియున్న దాని యవయవములన్నియుం జూచి వెరగందుచు జాకలివానితో నీది యేయూరు. ఎవ్వడవు? ఇన్ని దినములనుండి చంపలేనిపక్షిని నీదివసంబున నెట్లు చంపితివని యడిగెను. అప్పుడు వాఁడు ధైర్యము తెచ్చుకొని దేవరా! నాది యీ గ్రామమే కాపురము. నేను జాకలివాఁడను. ఈ దినమునఁ దెల్లవారకమున్నె లేచి పొలమునకుఁ బోవుచుండ నాకాపక్షి యెదురుపడి చంపుటకు మీఁదికివచ్చినది. అప్పుడీ గొడ్డలితోఁ బ్రాణమునకు దెగించి యొక దెబ్బ గొట్టితిని. ఆ దెబ్బ దాని తలమీఁద దగిలి నేలంబడినది. పిమ్మట రెండవదెబ్బ మరలఁ దలమీఁదనే గొట్టితిని. దానితోఁ దలచితికి లేవలేక నేలంబడినది. పెక్కు దెబ్బలు గొట్టినతోడనే యది చచ్చెను. ఇదియే నేను జేసినపని యని చెప్పెను. ఆరాజు చింతాక్రాంతుఁడై అయ్యో! నే నీపక్షిని సామాన్యుఁడు చంపలేడుగదా యని తలంచి యట్టివానికి నాకూఁతునిచ్చి వివాహముచేసెదనని ప్రతిజ్ఞచేసి యుంటిని. తుదకంత బలవంతమైనపక్షి యీరజకుని చేతిలో జచ్చెను. అయ్యో! నాచక్కనికూఁతురును జాచిచూచి యీచాకలి కెట్లు పెండ్లి చేయుదును? కటకటా యటువంటి ప్రతిజ్ఞ యేమిటికిఁ జేసితిని? ప్రతిజ్ఞాభంగము గావించినచో సరిరాజులందరు పరిహాసముచేయుదురు పోనీ! యీ పక్షిని వీఁడు చంపలేదేమో యనుకొన్నను చంపిన బలశాలి యెవ్వఁడు బయలుపడకున్నాడు. యిప్పు డేమిచేయుదును? యీ యాపద దొలగించువా డెవ్వఁడైన లేడేయని యనేకవిధముల సంతాపించుచు లోపల నిష్టములేకున్నను వివాహప్రయత్నము చేయుమని యాజ్ఞాపించి దానికిఁ బ్రతికూలమైన చర్యల నాలోచించుచుండెను.

రాజుగారి కుమార్తెనుఁ బక్షిని జంపినందులకుగాను చాకలివాని కిత్తురను ప్రతీతి గ్రామమంతయు వ్యాపించినది.

ఆ వార్త కుమారునిచేఁ పూటకూటి పెద్దమ్మ విని యేమేమీ! రాత్రిఁ బక్షిని చాకలి చంపెనా! యెవ్వరు చెప్పిరి? చీ ఛీ! యిన్నిదినములనుండి యాచాకలి యెచ్చటికిఁబోయెను! ఆ పక్షిని జంపినవారిని నేను చెప్పెదను. వినుండుఁ నిన్నరాత్రి మా యింటికి నిద్దరు రాజపుత్రులు వచ్చిరి. వారు వీథిలోఁ బరుండఁబోవునప్పుడు నేను పక్షిసంగతి చెప్పితిని. దానికి వారు భయపడక నిర్లక్ష్యముచే వీథిలోఁ బరుండి వారే యీ పక్షిని జంపియుందురు. వారు తెల్లవారుజామున నాకుఁ జెప్పి పోయిరి. నిద్రచే నేను బరిశీలింపకపోయితిని. వీథిలోఁ బరుండి బ్రతుకువారు మరియొకడు గలరా ? తప్పక వారే చంపిరని చెప్పగలను. అని పలికిన తల్లిమాటలు విని కుమారుఁ డత్యంతసంతోషముతో రాజుగారియొద్దకుఁ బరుగెత్తుకొనిపోయి తన తల్లి చెప్పిన వర్తమాన మంతయుం జెప్పెను.

అప్పుడారాజు మిగుల నానందమంది యా బ్రాహ్మణకుమారునకు బహుమతి నిచ్చి యా రాజకుమారుల వెదకి తీసికొని వచ్చుటకు నలుదెసలకుఁ బెక్కండ్ర దూతల పంపెను.

వారిలోఁ గొంద రా రాజపుత్రుల నొకసత్రంబునం గాంచి యానవాలుపట్టి వారితో నిట్లనిరి. అయ్యా! తమ రీమధ్యను మద్యార్జునపట్టణమునకు వచ్చి రాత్రియందు దిరుగుచున్న భేరుండపక్షిని జంపిరా! యని యడిగెను. ఆ మాటలు విని బుద్ధిసాగరుండు ఔను మేమే యా పక్షిని జంపితిమి. జంపుట నేరమా! యని పలికెను.

అప్పుడా దూతలు వారికి దండములు పెట్టి అయ్యో ! నేరము కాదు. దానిం జంపిన వారికిఁ దనకూఁతు నిత్తునని మారాజు ప్రతిజ్ఞ చేసియున్నాఁడు. మీరు దానిం జంపి యిటు వచ్చిన వెనుక యొకచాకలి యాపక్షిని నేనే చంపితినని చెప్పి యా రాజపుత్రికనుఁ దనకు బెండ్లి చేయుమని యడుగుచున్నవాఁడు. దాని కతండేమియుఁ జెప్పలేక జింతించుచుండ దైవయోగమునఁ బెద్దమ్మ మూలముగా మీరు చంపినట్లు తెలిసినది. కావున మిమ్ము వెదకికొనుచు వచ్చి యిచ్చట మిమ్ములను బొడగంటిమి. మా రాజపుత్రిక మంచి యదృష్టవంతురాలు. ఆమె యందంబు దేవతాస్త్రీలకైనను లేదని చెప్పగలము. గుణముల కరుంధతియే సాటి. ఆ రాజపుత్రికను మీలో నెవ్వరు పక్షినిం జంపిరొ వారి కిత్తురు వడిగాఁ బోదము రండనిన సంతసించి యా కుమారు లిరువురును నా దూతల వెంట మధ్యార్జునమున కరిగిరి.

ఆ సింహకేతుఁడు వారిరాక విని మిగుల సంతసించుచు నెదురేగి యర్ఘ్యపాద్యాదివిధులతోఁ తోడ్తెచ్చి స్వాగతంబడిగి యద్భుతమైన వారి యాకారగౌరవమునకు వెరగందుచు సవినయముగా నయ్యా ! మీ యిరువురిలోఁ బక్షి నెవ్వరు జంపిరని యడిగెను.

అప్పుడు కామకాలుఁడు తన మంత్రి బుద్ధిసాగరుఁడే యా పక్షిం జంపెనని యా వృత్తాంతమంతయు జెప్పెను. అప్పుడు సింహకేతుఁడు చాకలివాని రప్పించి వారి యెదుటం బెట్టి యడిగిన గడగడ వడంకుచున్న వాని నురితీయుఁడని యాజ్ఞ చేసెను. కామపాలుఁడును బుద్ధిసాగరుండును వాఁడు చేసిన కృత్యమునకు నవ్వుచు దయాహృదయులు గాన వాని నా దండనము నుండి తప్పించి పంపివేసిరి.

పిమ్మట సింహకేతుఁడు బుద్ధిసాగరుని యాకారము సోయగము తనకూఁతురు సుగుణావతి కనుకూలముగా నున్నదని సంతసించుచు శుభముహూర్తమున మిగుల వైభవముతో బుద్ధిసాగరునికిఁ దనకూతురి నిచ్చి వివాహము చేసెను. బుద్ధిసాగరుం డాతరుణితో గొన్నిదినంబులందు గామోపభోగంబు లనుభవించెను. కామపాలుఁడును మిత్రునితో గూడ నందేయుండెను. ఇట్లుండి బుద్ధిసాగరుండును కామపాలుండును దేశాటనంమం దింకను దృప్తి వహింపక సుగుణావతితోఁ జెప్పి యెట్టకేల కామె నొడంబరచి యొకనాఁడు రాత్రి నాయూరు విడిచి యొకమార్గంబునం నడువసాగిరి. ఆ దారినట్లు పోవంబోవ నెందును బురంబు గనంబడినదికాదు. చీఁకటిపడువరకు నడిచిరి గాని యందుఁబయికి దోవ దారి తెలియక యెందైన నివాసయోగ్యమైన ప్రదేశ ముండునేమోయని నలుదెసలఁ గలయజూడ దొడంగిరి.

శరభసాళ్వము కథ

అందొక దెస విశాలశాఖాచ్చాదితంబై న మఱ్ఱివృక్ష మొకటి జూడనయ్యెను. దాని క్రింద భూమియంతయు జక్కగా బాగుచేయఁబడి యున్నది. వా రాశ్చర్యపడుచు నాయడవినడుమ మనుష్యసంచారము లేదు. ఈ చెట్టు క్రింద ప్రదేశము జూడ రాయి గాని తృణముగాని లేక చక్కగా బాగుసేయఁబడియున్నది. దీనిక్రింద రాత్రు లెవ్వరేని వచ్చి ప్రచ్ఛన్నముగా నివసింతురా యేమి! యని యనేకప్రకారముల జింతించుచు నందు గిందుండరాదని నిశ్చయము చేసికొని కొంచెము వెల్తురుండగనే యాచెట్టెక్కి దట్టముగా నల్లుకొనియున్న యొకకొమ్మమీఁద గూర్చుండిరి.

ఇంతలో సాయంకాలమగుటయు మొదట నాచెట్టుక్రింద నద్భుతమైన కోతులును ఎలుగులును గొన్నివచ్చి యా నేలంతయు మిగుల జక్కగా బాగుచేసినవి. అంత జంబుకంబొకటి వచ్చి యాయున్న మృగములతో ముచ్చటింపఁ దొడంగెను. పదంబడి వ్యాఘ్రంబు వచ్చినది. దానివెనుక తోడేళ్ళ గుంపు, దానివెనుక వరాహములును, వానివెనుక మహిషములు వచ్చినవి. ఈరీతి జాతికొక్కటి చొప్పున నన్యోన్య విరోధముగల జంతువులు సైతము నిర్భయముగావచ్చి యా చెట్టుక్రింద నుచిత స్థలముల గూర్చుండి వచ్చిన వానిని, గుశలప్రశ్నలు చేయుచు రాఁబోవు వాని కెదురేగు చుండును.

ఆ రాత్రి జాము ప్రొద్దుపోవు నప్పటికి మృగములతో నాచెట్టు క్రింది భూమి యంతయు నిండినది. నడుమ రెండు మృగములకు మాత్రము చోటుంచినవి. అంత నద్భుతమైన యాకారముతో శరభసాళ్వమను మృగము వచ్చినది. అప్పుడచ్చటనున్న మృగములన్నియు లేచి దానికి దండములు పెట్టినట్లు ముట్టిగాళ్ళు వేయఁదొడంగినవి. అది వానినన్నిటిని నాదరించుచు నడుమ దిగవిడిచిన ప్రదేశమున నామృగములన్నిటికి నభిముఖముగా గూర్చుండెను.

అంతఁ గొంతసేపు పరిశీలించి శరభసాళ్వము తక్కినమృగములనెల్ల స్వాగత మడిగి యిట్లనియె.

మృగములారా అన్ని మృగములు వచ్చినవి గదా నామంత్రియైన భేరుండ మను పక్షి యేమిటికి రాకపోయెను. అదివచ్చు కాలము దాటిపోయినది. దాని కెద్దియో చిక్కు తటస్థించినట్లు తోచుచున్నది. లేనిచో నది యన్నిటికంటెను ముందేవచ్చును. దానివార్త మీలో నొకదానికేని దెలియునా ! అని యడిగెను. అప్పుడు మృగములన్నియుఁ దెల్లబోయి చూడఁదొడంగినవి. అప్పుడు నక్కలిట్లనియె.

దేవా ! మీ మంత్రియైన భేరుండము రాత్రులయందు మధ్యార్జునమను పురంబున కరిగి కనంబడిన జీవకోటిని భక్షింపఁదొడంగినది. ఈరీతి నెనిమిది మాసములు జరిగినదిగాని మాసము క్రిందట నాయూరిరువురు రాజపుత్రులు వచ్చి వీథిలోఁబరుండిరి అప్పుడది వారిని సామాన్యు లనుకొని మహాభీకరముతోఁ జంపఁబోయినది. అందులో నొకఁడు శూరకత్తిచే దానింజంపెను. ఈవార్త మాకు చుట్టములైన జంబుకములు చెప్పినవి. ఇందులోఁ గొంచమైన నసత్యములేదని దేవరవారితో మనవిచేసికొనుచున్నామని పలికి నక్క లూరకుండెను.

అప్పుడు శరభసాళ్వము ముట్టి నేలరాయుచు నే మేమి? భేరుండమును జంపిరా! అయ్యయ్యో అంత బలవంతమైన పక్షియుం జంపఁబడినదియా? అన్నన్నా! మనుష్యులు అసాధ్యులు గదా! అటువంటి సచివుఁడు నాకు దొరకునా! ఔను అది మధ్యార్జునమునకును నేను శ్రీరంగపురంబునకు రాత్రులఁ బోయి జీవహింస జేయుచుంటిమి. ఇది మేమిరువురము ఏర్పరచుకొనిన పద్ధతియే దాని జంపునంత బలము గలవాఁడు లేడనుకొంటింజుఁడీ ? అని పెక్కు గతుల దాని గుఱించి చింతింపఁదొడంగినది. అప్పుడు మృగములన్నియు గన్నులనీరు విడువదొడంగినవి. ఈరీతిఁ గొంతతడవు భేరుండపక్షిని గుఱించి చింతించి యేదియో యాలోచించుచున్న శరభసాళ్వమునకు జంబుకంబు లిట్లనియె.

దేవా ! మీరిప్పుడు చెప్పిన మాటలలో మాకొక భయము గలుగుచున్నది. మన మందరము సంవత్సరమున కొకసారి గదా యీ చెట్టుక్రింద జేరుదుము. అప్పటికిఁగాని మరల మనక్షేమసమాచారములు తెలియవు. నిరుడీ సభకు వచ్చి భేరుండము యీ యేఁట రాకమడిసినది. ఈయేఁడు వచ్చిన మృగములలో మీఁదటి కెన్ని పరలోకమున కేగునో తెలియదు. సామాన్య మృగముల పాటి సేయ నేటికి! దేవరవారుగూడ రాత్రులయందు భేరండమువలె శ్రీరంగపురమున కరుగుచు జీవకోటిని మడియించుచుంటినని సెలవిచ్చిరి. ఈహింస మనుష్యకోటికెల్ల నసహ్యమైనదేకదా! మొన్న భేరుండమును జంపిన శూరులు దేవరవారికిఁగూడ నేది యేనికీడు సంభవింపజేయుదురేమో యని వెరచుచుంటిమి దేవరకెద్దియేని ముప్పు వచ్చినచో మాబ్రతు కేమికావలయును. ఏలికలేక యెవ్వరికైన నిలువవచ్చునా? యిప్పుడిచ్చట నున్న జంతు లన్యోన్య విరోధములు గలిగియున్నను మీ శాసనంబునం జేసి యేమియు నోరు మెదపక శాంతములై యున్నవి. మృగజాతిలోఁ గట్టుండినచో మనుష్యులనఁగా నెంత ? అదిలేమింజేసియేగదా వారు గొన్నిటిచే భృత్యులవలె పనులు చేయించుకొనుచు లొంగనివాని మాయోపాయములచే జంపుచున్నారు. కానిమ్ము దాని మాటకేమి? ఇప్పుడు మీరు శ్రీరంగపురమున కరుగుట మాని వేయుఁడు. లేనిచో మాకెద్దియేని ధైర్యము జెప్పుఁడని పలికినవి మృగములన్నియు దలలూపి సంతసించినవి.

శరభసాళ్వము వాని మాటలువిని చిఱునవ్వునవ్వి యిస్సీ జంబుకములారా? నా బలపరాక్రమములు భేరుండము బలపరాక్రమముల వంటివిగావు. దానికిని నాకును జాల తారతమ్యము గలదు. మీరు నా ప్రాణతుల్యులు గావునఁ జెప్పెద వినుఁడు. భేరుండము ఆయువు భేరుండము కూడనేయున్నది. కావున దానింజంపిరి. నాది అట్లు లేదు. ఈ మఱ్ఱిచెట్టు తొఱ్ఱలో నొక యెలుక యున్నది. నాయాయువు దానిలో నున్నది. దానింజంపినప్పుడుగాని నేను చావను. ఈయడవిలోనికి మనుష్యులు రానే లేరు. ఒకవేళ వచ్చినచో యాచెట్టుతొఱ్ఱలోనున్న యెలుకయునికి యెట్లు తెలుసుకొనగలరు?

తెలిసికొనినను నీచెట్టంతయు నరికినను, నది కనబడదు. ఆ తొఱ్ఱలో నాహారపదార్థము జారవిడిచినచో దానివాసంబట్టి పైకివచ్చును. అది వేరొకలాగున దొరకదు. ఈరహస్యము వారికేమి తెలుయును? మీరందరు నాకు బ్రాణసమానమైన భృత్యులుగనుక చెప్పితిని. మీరు నిర్భయముగా నుండుఁడు. నాకేమియు భయములేదని చెప్పిన యామృగములన్నియు మనంబులం గల యానందమంతయుఁ జేష్టలచేఁ దెలియజేసినవి.

ఈరీతి నిష్టాగోష్ఠి మాటలాడుకొనుచు నామృగములన్నియుఁ దెల్లవారుజాముననే లేచి దేనిజాడ నదిపోయినది. తెల్లవారు నప్పటి కచ్చట నొకటియులేదు. మృగపక్షిభాషావేదులైన యాకుమారులిరువురు నా చెట్టుకొమ్మలసందు నుండి మృగముల సంభాషణమంతయు విని యడలుచు సూర్యోదయమైనంతఁ జూచి యప్పుడు తమ్ముఁ బునర్జీవితులుగా దలంచుకొనిరి.

ఎంత బలవంతులకై నను వింత క్రూరమృగముల నడుమ రాత్రి జిక్కుపడి నప్పుడు ధై ర్యమాగునా! పిమ్మట వారిరువురు మృగములజూడ నా చెట్టు చిట్ట చివర కెక్కి చూచి యెందునుం గనంబడమి సంతసించుచు ముందు శరభసాళ్వము చెప్పిన కోటరము వెదకి కనుంగొని యందులో దమ రాహారముకై తెచ్చుకొనిన మిఠాయి యుండ నొకటి జారవిడిచిరి. రా యుండదొర్లి యాయెలుకయున్న చోటికి బోయినది. దానిందిని యా మూషికము దానిసవంబట్టి యా తొర్రపైకి వచ్చినది. అందు గాచియున్న యాకుమారు లాయెలుకం బట్టుకొని చెట్టు దిగి దానింద్రాళ్ళతోఁ బిగియగట్టి శ్రీరంగపురంబునంగల జనుల యాపద బాపుటకై క్రమంబున జాడుగనుంగొనుచు రెండు దినముల కాపురము జేరిరి.

అందొక శ్రోత్రియబ్రాహ్మణుని యింట బసచేసి రాత్రి భోజనము చేసిన వెనుక యావిప్రునితో నయ్యా ! యీయూరు వింతలేమని అడిగిరి. అప్పుడాతండు కుమారులారా ! యీ పురంబున మఱియేమియు విశేషములులేవు. నిత్యము రాత్రుల శరభసాళ్వమను మృగమువచ్చి కనంబడిన జీవమును భక్షించుచున్నది. దాని కీరాజు ఎందరినో మహాశూరులఁ గాపుంచెను. కాని యేమియు లాభము లేకపోయినది.

అప్పుడీరాజు జనక్షయమునకు వెరచి యా మృగమును జంపినవానికిఁ దన కూఁతు బద్మావతియను దాని నిత్తునని ప్రకటించెను. ఆ వార్తవిని యాచిన్నదాని సౌందర్యమునకు వలచి పెక్కండ్రు రాజకుమారులు వచ్చి రాత్రి వీథిలోఁ బండుకొని శరభసాళ్వముచేతఁ భక్షింపబడిరి. ఇప్పుడెవ్వరును దానింజంపెదనని వచ్చుటలేదు. దాని మూలముగా మిగుల నందగత్తెయగు పద్మావతి జవ్వనముగూడ వృధాచెడిపోవుచున్నది. రాత్రుల వీథిలోనికి బోవక పెక్కు చిక్కులు పడుచున్న మేము జన్మభూమి యైన యీయూరు విడువలేకుంటిమి. ఈయూరి విశేషము మఱియేమియులేదు. మీరు వీథిలోనికిఁబోకుడు. లోననే పండుకొనుఁడని చెప్పిన విని యాకుమారులు మోమునఁజిరునవ్వు మెఱయ నాగృహస్థునితో నిట్లనిరి. అయ్యా! మీరుభయపడకుఁడు మేమా మృగమును జంపుదుము. అది రాత్రి యెంత ప్రొద్దుపోయిన తరువాతవచ్చును? ఏ వీథికి ముందు వచ్చును? ఎందెందు సంచరించునో చెప్పుడని యడిగిన నతం డమ్మయ్యో! ఆ మృగవృత్తాంతము మీరెరుంగరు. మీకంటె బలాధికులు దానిచేత భక్షింపబడిరి. మీ ప్రాయమును రూపమును మనోహరములై యున్నవి. ఇట్టిపిచ్చి యూహలు విడిచి యింటిలో బండుగొనుడు. మీ తల్లిదండ్రులను భార్యలను బిడ్డలను నూరక దుఃఖసముద్రమున మునుఁగజేయఁ కుండని పలికిన వారు నవ్వుచు అయ్యా! మేమూరక యామృగముచేతఁ జచ్చుటకంత వెర్రివారమనుకొంటిరా. పద్మావతియందు మా కాసలేదు. ఈయూరి జనులు యాపద దప్పించుటయే మాయభిప్రాయమని చెప్పి యా బ్రాహ్మణుండడ్డముపడి యెన్నివిధములఁ జెప్పినను లక్ష్యముసేయక యారాత్రి వీథు లందు గస్తుదిరుగ జొచ్చిరి.

అంతట నాశరభసాళ్వము కల్పాంతజీమూతగర్జాసదృశముగా నార్చుచు బేర్చిన క్రోధంబున నాయూరు మీదబడి కనంబడిన దానినెల్ల భక్షించుచు నొక వీథిలోఁ గరవాలస్థులై ధైర్యముగా గ్రుమ్మరుచున్న యా వీరులం జూచి నోరుదెరచికొని మీదకు వచ్చెను.

అప్పుడు కామపాలుఁడు కుడిచేతిలోనున్న యెలుక గొంతుపు గట్టిగా నొక్కి చంపివేసెను. అప్పుడా సాళ్వము కంఠము వెంబడి యూపిరిరాక నేలంబడి తన్నుకొనిచచ్చినది.

పిమ్మట గారవాలమున దాని మెడ నరికి పారవైచి యా కుమారులిరువురు బసయున్న విప్రునింటికి వచ్చి యాయనతో అయ్యా ! మేము శరభసాళ్వమును జంపితిమి. చూచితిరా యని చెప్పిరి. అమాటలకతండు వెరగందుచుఁ గొంతసేపు నమ్మ లేదు. చచ్చి పడియున్నదా నింజూచినంత మితములేని యానందముతో వారిం గౌగలించుకొని కుమారులారా ? మీ ప్రాయమును జూడ మిగుల చిన్నదిగా నున్నది. మీ ప్రజ్ఞ మిగుల పెద్దది మా యూరికి గొప్ప యుపకారము చేసితిరని వారిఁ బెద్దయుంబ్రొద్దు స్తుతించేసి యప్పుడే రాజుగారి కోటలోనికిఁబోయి యాఁ వర్తమానము తెలియఁ జేసెను.

శ్రీరంగరాజు ఆ వృత్తాంతమువినినంత ననంత భూమండలాధిపత్యము సంప్రాపించిన సంతసించు నిరుపేదయుంబోలె జెలంగుచు నతిరయంబున లేచి ఆ మహాత్ములెచ్చట నున్నారో చెప్పుమని అతనినడిగెను.

ఆరాజా గేస్తువలన వారికథవిని యతని వెంట నరిగి యా కుమారులంగాంచి వారి యాకారగౌరవమున కచ్చెరువంది తప్పక వీ రశ్వినీదేవతలేయగుదురు. లేనిచో నింత సొగసును గవగా నుండుటయు నుండు నాయని శంకించుకొనుచు వారిం గౌగలించుకొని యా భూపాలుండు గన్నుల నానందభాష్పములు గ్రమ్మనిట్లనియె.

ఆర్యులారా! మీరు చేసిన కార్యము మనుషులకు శక్యమైనది గాదు. ఎంత లేసి బలవంతులు వచ్చినను నుదయంబున మాకు మరల గనంబడుటలేదు. మీరు దేవతాంశవలన జనించిన వారని దోచుచున్నది. మీ నామంబులందెలిపి వర్ణంబులదెలిపి కర్ణానందముసేయుమ. మఱియు మీ యిరువురిలో శరభసాళ్వమును బరిమార్చిన బలశాలి యెవ్వఁడు! వానిం బేర్కొనినచో వానినే నేనల్లునిగాఁ జేసికొనియెదనని పలుకుటయు నన్నరపతికి బుద్ధిసాగరుం డిట్లనియె.

రాజా ! మేము క్షత్రియులము. నా పేరు బుద్ధిసాగరుండు. ఇతని పేరు కామపాలుఁడు. వీనికి నేను సచివుడ. దేశాటనంబునకై వచ్చి నారము. దీనింబరిమార్చిన ధైర్యశాలి యీతండేయని నిరూపించినంత నా భూకాంతుండితని గౌఁగలించుకొని వత్సా! నా ప్రతిజ్ఞ నెరవేర్చితివి. గ్రామక్షోభంబుడిపితివి. నీ కేమియిచ్చినను ఋణము తీరదు. నా కూతురు పద్మావతి మిగుల రూపవతి. దాని నీకు బరిణయంబు గావించెద సమ్మతమేనా! యనియడిగిన నతండు బుద్ధిసాగరుని మొగము జూచెను. అప్పుడా బుద్ధిశాలి రాజుతో నిట్లనియె.

దేవా ! మీ కూతురు మిగుల చక్కనిదేగదా ! అట్టి దానింబెండ్లి జేయుదునని చెప్పిన నప్పు డొప్పుకొనకుండుట లెస్సగాదు. నా మిత్రు డందుల కంగీకరించెను. అని పలికిన సంతసించి యా శ్రీరంగరాజు దై వజ్ఞనిర్దిష్టమైన శుభముహూర్తమున నా కామపాలునికిఁ బద్మావతి నిచ్చి కడువేడుకతో వివాహంబు గావించెను.

కామపాలుండు బుద్ధిసాగరుని యనుమతి గొని దినంబులందు బద్మావతింగూడ కామసౌఖ్యంబు లనుభవించుచుండెను. అంతనొక్క నాఁడయ్యిరువురు క్రమ్మర నాలోచించుకొని విదేశదర్శనోత్సాహంబున దృప్తివహింపక పద్మావతికి మాత్రము జెప్పి యేకాంతముగా నాయూరు విడిచి యన్యదేశమున కరిగిరి.

చిత్రసేన కథ

ఇట్లు క్రుమ్మరుచు వారొక్కనాఁడు చంద్రగుప్తమను రాజదానింజేరి యందొక విప్రగృహంబున బసచేసి యందుఁ గొన్నిదినంబులుండిరి. ఒకనాఁడు సాయంకాలమున వారు పురవిశేషంబు లరయుతలంపుతో సొంపుగా నలంకరించుకొని యా పట్టణపు వీథుల నరుగుచు నచ్చటచ్చటం గల వింతలఁ బరిశీలించుచు గ్రమ్మర బసలోనికి రాఁదలంచి కోటప్రాంతముగా నరుగుచుండిరి.

అప్పుడు కామపాలుని మేనిమీఁద శుభవాచిక సూచికముగా నొకతలవెండ్రుక పడినది. దానిఁజూచి యతండు జేఁతులతో గొలిచినంత బారకన్న నెక్కువగా నున్నది నైల్యాదిగుణంబులు వర్ణించుచునోహో ! యింత వింత తలవెండ్రుక యే సుందరిదో గదా యిని యూహించుచుఁ దలపైకెత్తి చూచెను. అప్పుడా గోడపైనున్న యుప్పరిగెమీద సఖులతోఁ గొలువుదీర్చి జలకమాడి తలయార్చుకొనుచున్న యా పట్టణము రాజకూఁతురు చిత్రసేన యనునది యెద్దియో పనిమీఁద క్రిందుగాఁ దొంగి చూచినది. అప్పుడా యిరువుర దృష్టులును పురోహితులవలె నా యిరువుర మనంబులకు బ్రహ్మగ్రంధి వైచినవి. వారి సోయగంబు లొండొరులకు వింత సంతసము గలుగఁజేసినవి. అంతటితో దమదృష్టుల మరల్చుకొనిరి.

అప్పుడు కామపాలుండు బుద్ధిసాగరునితో మిత్రుడా! ఇట నిలువుము. నేనొక వింత జూపించెదను. ఆహా! యిప్పుడే యుప్పరిగ నుండి యొక వాల్గంటి తొంగిచూచినది. దాని మొగము మొదట నేను జంద్రబింబమే యనుకొంటిని సుమా! అంతలో నాచిన్నది నన్నుఁజూచి చిఱునగవుతో శిరఃకంపము జేరినట్లు కనంబడినది.

అన్నా! దాని మందహాసము నా డెందమునకు మరులుకొలుపుచున్నది. ఔరా! అంత చక్కని మొగము మనమింతకు ముందెక్కడను జూచియుండలేదు. అయ్యంగన వంగి చూచునప్పుడు చంద్రబింబమును మబ్బుగ్రమ్మినట్లు నెమలిపించము వలెనున్న కేశపాశము మోముతమ్మి గ్రమ్మినది. ఆ వింతచూపు నా మదిం దగిలి యున్నది. ఇప్పుడు నాకుఁ బైకినడువఁ బాదంబులాడకున్నవి. దాని మోము క్రమ్మర జూచినదాక నిచ్చటనే యుండెదనని పలుకుచు విరాళిందూలుచున్న కామపాలునితో బుద్ధిసాగరుం డిట్లనియె.

అన్నా ! నేనా చిన్నదానిం జూడలేదు. యీ వెంట్రుకం బట్టి యూహింప మిగుల రూపవంతురాలగుట కేమియు సందియము లేదు. మఱియుఁ దొంగిచూచి నప్పుడు నిన్నుఁజూచి చిఱునవ్వు వెలయించిన దని చెప్పితివి. ఆ లక్షణము బరిశీలింప నా చిన్నది నిన్ను వలచినట్లు తోచుచున్నది. నీవూరక తొందరపడకము. నీవు వోలె నాచిన్నదియు విరహమందుచునే యుండును. నీకు దృష్టాంతము చూపించెదఁ జూడుము. మనము గొంతసే పిచ్చటనే యుందము. అక్కలికి నిక్కముగాఁ నిన్ను వరించినచో గ్రమ్మరఁ దొంగిచూడక మానదు. ఇదియే తార్కాణమని పలికెను. కొంతతడవు వా రక్కడనే నిలువఁబడి యెద్దియో నిమిత్తము గల్పించుకొని నడుమ తలలు పైకెత్తి చూచుచు గాలయాపన జేసిరి.

చిత్ర సేనయు రాజకుమారుని మోహము జాచినంత స్వాంతమును వింతసంతసము వొడమఁ గొంత సంతాపంబు నొంది యందున్న సుందరులందఱు తనకుఁ బ్రాణసఖులగుట వారితో నిట్లనియె. చెలులారా! మన కోట ప్రక్కగా నిరువురు కుమారు లఱుగుచున్నారు. చూచితిరా! వారిలో నొకసుందరుడు నాడెందమునకు విందు గావించెను. వాని మొగము తొగలరాయని గేరుచున్నది. నేను దైవప్రేరణముచే గ్రిందుగ దొంగిచూచినప్పుడే వాఁడును మీదకు జూచెను. మా యిరువుర చూపులు మనంబులకు ముడిపెట్టితివి. వారికి నా యందనురాగము గలిగినట్ల తన్ముఖవిలాసమే చెప్పినది. అడుగుదాటక యిప్పటికీ నచ్చటనే యుండును. చూతురుగాక యనిన నా సఖులందఱు సంతసించుచు నా సుందరితోగూడ నేలకు దొంగిచూచిరి. ఆ సమయములో బుద్ధిసాగరుండును గామపాలుండును తలలు పైకెత్తి చూచిరి. అప్పుడు కామపాలునికి చిత్రసేనకు నంతరంగములంగల సంశయములు వదలిపోయినవి.

అయ్యండజయాన యట్లే యుండి కామపాలు నంగుళితోఁ జూపించుచు చెలికత్తెలతో నిట్లనియె.

చెలులారా! వారిలో మొదట నన్ను జూచిన చెల్వు డాతడేసుఁడీ! ఆ యిద్దరును రూపంబున సమానులై యున్నను నామనంబు వానియందే లగ్నమైనది. ఆహా! ఆమోహనాంగుడు నన్ను స్వీకరించినచో బచ్చవిల్తుని కాలిబంటుగాఁ జేసికొననే? వానిసోయగంబంతయు పరిశీలింపుఁడు. సుందరులారా! ఇట్టివేళ సిగ్గుపడి యూరకున్న పిమ్మటఁ గమ్మవిల్తుని రాయిడి కెవ్వతె తాళఁగలదు? వానియభిప్రాయము దెలిసినది గద! తెలియకున్నను భయమేమి? ఇప్పుడే యొకయుత్తరము వ్రాసి మీఁద బారవైచెద. ఒక కాగిత మిటు తెండని పలికిన తక్షణమే సఖులచే నందింపఁబడినది. దానియందు గొన్నిమాటలు తొందరగా వ్రాసి పూవులదండలోఁగట్టి యాబంతి సంతోషముతోఁ దన్నే పలుమారు చూచుచున్న కామపాలుని యుదరమునకుఁ తగులునట్లు విసరివైచినది.

అంతకుమున్ను బుద్ధిసాగరునితో నాచిన్నదానిరూపు వర్ణించుచు స్మరసంతాపమందుచున్న కామపాలుఁ డాచీటిని బంతిలోనుండి తీసి యిట్లు చదివెను. ఆర్యా! నామనంబు నీయందు లగ్నమైనది. నీరూపంబును ప్రాయంబును నాచిత్తవిత్తంబులు హరించినవి. ఆయపరాధమునకు నీపాదములకు సంకిలివేయవలెను. నిన్నుఁ జూచినదిమొద లంతవరకు గంతుఁడు లతాంతకుంతముల నాస్వాంతమును సంతాపపెట్టుచున్నవాఁడు. కాలవ్యవధిలేదు దప్పు సైరింపవలెను. మాతండ్రి మిగుల గఠినాత్ముడు. పోతుటీగనేని బరీక్ష సేయక యంతఃపురము జొరనీయఁడు.

నీవు బలవంతుడవై తేని నన్ను రాక్షసవివాహంబున గొనిపొమ్ము. లేనిచో గోడమీదుగా గొలుసు వ్రేలవైచుకొని నేనే నీయున్న తావునకు వచ్చుచున్నదాన ఎట్లు చేయవలయునో సత్వరం బుత్తరం నీయగోరుచున్నదాన. వ్యవధిలేదు. కావున నింతటితో ముగించితిని. దప్పులున్న క్షమింపుఁడు అనియున్న యుత్తరమును బుద్ధిసాగరుడు వినఁ గామపాలుఁడు పలుమారు చదువుకొని మిత్రుఁడా దీని యనురాగంబంతయు నీయుత్తరమే వెల్లడిచేయుచున్నది. కాలవ్యవధి లేమింజేసి యింతకన్న వ్రాయలేఁదట. దా కింకను నెన్ని యూహ లున్నవో! తప్పులు క్షమించవలయునట. దీనిలో నేమి తప్పు లున్నవి. మా యిరువురనడుమఁ దప్పులు గూడగలవా! మంత్రీ! నాకీపుత్రికయందు ప్రీతిగా నున్న దేమి? దాని పేరు వింటివా! చిత్రసేనయట. దాసురాలు చిత్రసేనయని వ్రాలుచేసినది చూడుము. మా యిరువురకు ననురాగ మొండొరులపై సమముగానే యున్నది. వెంటనే ఉత్తర మంపనిచో స్త్రీ హత్యగూడ వచ్చునని వ్రాసినది. కావున నదివ్రాసిన రెండుతెరఁగుల నేది యుచితమో యాలోచించి తీరుగా జాబు వ్రాయవలయును. ఉరక జాగుచేసెదవేల? అని తొందరపెట్టుటయు బుద్ధిసాగరుడు చక్కగా నిదానించి కామపాలునితో నిట్లనియె.

కామపాలా? ఆచిన్నదివ్రాసిన రెండుతెరఁగులు కరణీయములుకావు. ఏమనిన ఈరాజుకన్న మనము బలవంతులమైనను యుద్ధమున జయాపజయము లెవ్వరుజూచినవికావు? దానంజేసి రాక్షస వివాహమున మోసమున్నది. ఇఁక రెండవరీతి, నీనాతి గొలుసుమీఁద గోట దిగివచ్చునప్పుడు చేయిజారినచో ప్రమాదము వచ్చును. ఇదియునుంగాక యప్పు డెవ్వరేనింజూచిన మొదటికే హానియగును. మనకంత యవసర మేల వచ్చినది. నీవు కొంచెము తాళుము. నాబుద్ధిబలముచేత నానాతితో నాయంతఃపురమునందే నిర్భయముగాఁ గ్రీడింప సంఘటింతునని యతనికి ధైర్యము గఱపి ప్రత్యర మిట్లు వ్రాయించెను.

మదవతీ! నీ హృదయసంతాపము వినినంత నాకెంతయుఁ జింతగానున్నది. మదనుండు నిర్దయుఁడై నిన్నేములుకుల నేయుచుండెనో నన్ను గూడా నాశరంబులనే బాధించుచున్నాడు. నాడెందము నీయందము లాగికొని తిరుగనీయకున్నది. మఱియుఁ జూపుగొలుసుల నా పాదంబులకు సంకిలువైచియు నప్పనిసేయనట్లు వ్రాసెదవేల? మన సంతాపముల గలిసికొనిననాఁడు తెలియఁగలవు. ఇప్పుడు నీవు వ్రాసిన రెండు తెరంగులు నాయంతరంగమున కసుకూలింపలేదు. నీవు జలింపక యించుక కాలము సైరింపుము. నీయంతఃపురమునకే వచ్చెద. అప్పుడు నిర్భయముగాఁ గ్రీడింపవచ్చును. తక్కినవిషయము లెఱింగింతున నివ్రాసి యాయుత్తరము కమ్మరఁ బూవుబంతిలోఁ గ్రుక్కి యా మేడమీద కెగరవై చెను. చిత్రసేనయు దానినందుకొని కన్నుల నద్దుకొనుచు నందలి విషయము చదువుకొని వ్రాసిన సాధకబాధకముల గుర్తించి సంతసించుచు నతనిరాక కెదురు చూచుచు దినమొకయేడు లాగున గడుపుచుండెను.

అంత బుద్ధిసాగరుఁడు చంద్రగుప్త మహారాజు నధికారవిశేషములన్నియుఁ దెలిసికొని యతఁడు సూర్యప్రతాపుఁడను రాజునకు గప్పము గట్టుట విని కతిపయప్రయాణంబులఁ గామపాలునితోఁగూడ సూర్యప్రతాపుని పట్టణమున కరిగెను. అందా కుమారు లిరువురు గొన్ని దినంబులుండి తమ విద్యాపాటవంబున సూర్యప్రతాపుని మంత్రిని మెప్పించి యొకనాఁ డతనిచే నేమికావలయునో కోరుకొనుఁడని యనిపించుకొనిరి. అప్పు డాయమాత్యుని సూర్యప్రతాపుని మూలబలము బిరుదములు శిబిరములు గొన్ని దినములు మాతో నుండున ట్లాజ్ఞాపింపుఁడని వేడుకొనిరి.

ఆ సచివు డప్పుడా సేనాధిపతుల రప్పించి వారివెంట నరుగ నాజ్ఞాపించెను. అంత నొకనాఁడు బుద్ధిసాగరుఁడు సూర్యప్రతాపుని వేషమును కామపాలుఁ డతనిభార్య వేషముఁ వైచికొని యా సేనతోఁ గూడ నడుమ నడుమ విడెదలు చేసికొనుచు నొకనాఁటి సాయంకాలమునకు జంద్రగుప్తనగరము జేరిరి.

అంతకుమున్నే సూర్యప్రతాపుఁడు తమ క్రిందదేశముల క్షేమసమాచారములు చూచుటకై వచ్చుచున్నవాఁ డనియు నాయారాజులు సిద్దముగా నుండవలయుననియు యాజ్ఞాపత్రికలఁ బంపిరి. చంద్రగుప్తుడు నా రాజురాక కెదురుచూచు వచ్చినవార్త వినినతోడనే యెదురేగి తనకిరీటమణు లతని పాదపీఠంబుల వెలుగఁజేయ మ్రొక్కిన నక్కపటసూర్యప్రతాపుఁడును నతని మన్నించి లేవనెత్తి గారవించి క్షేమముఁ దెలిసికొనెను.

పిమ్మటఁ జంద్రగుప్తుడు అపూర్వమైన యతిని మర్యాదకు మిగుల సంతసించుచుఁ దగినవిడిదెల నియమించి యందు బ్రవేశపెట్టి యెన్నియేని యుపచారములు చేయించుచుండెను. ఇట్లు రెండు మూడు దినములుండి కపటసూర్యప్రతాపుఁ డొకనాఁడు చంద్రగుప్తునితో రాజా! నీవు మాకేమైన గప్ప మీయవలసియుంటివా? యని యడిగెను. అప్పు డాచంద్రగుప్తుఁడు నమస్కరించి దేవా! నేనేమియు నీయనక్కరలేదు. కావలసిన దేవరవారికి లెక్కలు చూపింతు ననుటయు సంతసించువానివలె నభినయించుచుఁ జంద్రగుప్తా? నీ వెప్పుడును గొదువ పెట్టవు. ఈ పైరాజులు సరిగాఁ గప్పములు చెల్లించుటలేదు. నేనచ్చటికిఁ బోవలసియున్నది. అది యరణ్యప్రాంత మగుటచే స్త్రీలు వచ్చుటకుఁ గష్టముగా నుండును. ఇచ్చటనే యుండిన బాగుండునేమో యని తల పైకెత్తి యర్ధస్వరముతోఁ బలికి శిరఃకంపము చేయుచు, పోనీ యేమిటికిని యంతలో నక్కరలేనట్లు సూచించుటయు నతని యభిప్రాయ మెఱిఁగి చంద్రగుప్తుఁడు చేతులు జోడించి వినయముగాఁ గపటసూర్యప్రతాపున కిట్లనియె.

దేవా! దేవరవారి కేను భృత్యుండ ఇప్పుడు నాతో నెద్దియో చెప్పదలంచి సంశయించి యూరకుంటిరి. అట్టి సందియ మందనక్కర లేదు. దేవరపని యేదియైననుఁ బూనుకొని చేసెద సెలవిండు. ఆకార్యముజేసి దేవరఁ కిదివఱకు నాపైఁగల యక్కటికము వృద్ధిజేసికొనఁ దలంచినాఁడనని ప్రార్థించుటయు జంద్రగుప్తుని వచనంబులకు మిక్కిలి సంతసించువానివలె నభినయించుచుఁ జిఱునగవుతో నతని కిట్లనియె.

చంద్రగుప్తా! నీయట్టివాఁడి వేయని యిదివఱకే నేనెఱుంగుదును. మా కార్యము మరేమియులేదు. మేము యిచ్చటికి దేవితోఁ గూడ వచ్చితిమి. ఇటమీఁద నామెను దీసికొనిపోవ నిష్టములేదు. మేము దిరిగివచ్చునంతదనుక మీ యింట నుంచుదమని తలంచుచుంటిని. ఆ నెలతుకయుఁ బ్రాయముననున్నది. మీ యింట నీడుగల వారెవ్వరేనిం గలరా యనియడిగిన నతండు సంతసించుచుఁ గపటసూర్యప్రతాపునితో నిట్లనియె.

దేవా! ఇంతమాత్రమునకే యింత సంశయింపవలయునా! నాకుఁ జిత్రసేనయను కూఁతురుగలదు. అది పదియారేండ్ల ప్రాయముగలది. దానియంతఃపురము మిగులరక్షకముగానుండును.అచ్చటనే దేవిగారుగూడ నివసింపవచ్చును. ఆమెను నేను మాతృభావముగా జూచెదను. ఏకొరంతయు రానీయను. మీరు పోయిరండు పూవులం బెట్టినట్లు మీ భార్యను మీ కప్పగించెదను. ఇప్పుడూరక చెప్పనేల? అప్పుడామెనే యడిగితెలిసికొనుఁడని పలికిన సంతసించుచునప్పుడే మంచిముహూర్తమని యాకపటసూర్యప్రతాపుఁడు స్త్రీవేషములో నున్న కామపాలుని యారాజు వెంటఁ బల్లకీ నెక్కించి కడు జాగ్రత సుమీయని పలుమారు చెప్పుచుఁ జిత్రసేనయున్న యంతఃపురమునకు బంపించెను.

ఆహా! పోతుటీఁగనేని పరీక్ష సేయక లోనికిఁ జొరనీయని చంద్రగుప్తుఁడు స్వయముగానే కామపాలునిఁ జిత్రసేన యంతఃపురమున కనిపెను. ఎట్టి బుద్ధిమంతునకైనను స్త్రీలనుఁ గాపాడుట కష్టము. అంతకుఁ బూర్వమే యా వార్త వినియున్న చిత్రసేన యతనిరాక కెదురుచూచుచు వచ్చినంత నెదురేగి తన యనురాగంబంతయు వెల్లడిగాఁగ బల్లకీలో నుండి లేవనెత్తి గౌఁగలించుకొని సగౌరవముగాఁ దోడ్కొని పోయి యుచితాసనము మీఁద గూర్చుండబెట్టెను.

అప్పుడు చంద్రగుప్తుడును సూర్యప్రతాపుని యనుమతిప్రకారము ఆరాణి మిగుల సిగ్గుగలది యాయంతఃపురములోఁ రఱుచు స్త్రీలుగూడ నివసింపఁగూడదనియు జిత్రసేనయొక్కయు రాణియొక్కయు నాజ్ఞ లేక లోని కెవ్వరును బోఁగూడ దనియు నంతఃపురచారిణుల కందఱకుఁ దెలియఁజేసెను. దానింజేసి చిత్రసేన కాప్త లైనవారు తప్ప మఱియేస్త్రీయు నాయంతఃపురమునకుఁ బోవుటలేదు.

అప్పుడు వారికెంత స్వేచ్ఛగా నుండునో చింతింపుము. ఇతర జనరహితమగు నయ్యంతఃపురములో వారిరువురు గద్దియఁగూర్చుండి ప్రియాలాపంబు లాడుకొనునప్పుడు చిత్రసేన యతని స్త్రీ రూపము జూచి నవ్వుచు నోహో ప్రియుడా! స్వాభిఖ్యాతిరస్కారంబు సైపక కాముండు నిన్ను స్త్రీనిగాఁ జేసెఁగాబోలు! మేలు మేలు? మీ బుద్దిచాతుర్యము మిగులఁ గొనియాడఁదగియున్నది. క్రూరశిక్షాదక్షుఁడైన మా తండ్రిని మీరొక్కరే వంచించిరి. భళిభళి! యనికొనియాడుచున్న యాచిన్నదాని కాకామపాలుండు ప్రేయసీ! కాముండు నన్నాడుదానిగాఁ జేయుట యేమి లెక్క. సకలజగత్ప్రభువైన శంకరు నంతవాని సగము మగువగాఁ జేసెను. అదియంతయు మీ మహిమయే గదా! మీ విలాసమునకుఁ జిక్కనివాఁ డుండునా యని పలుకుచు నా చిలుకలకొలికిం గూడి యా కామపాలుఁడు మనంబునంగల గోరికలుదీర రతిక్రీడలం దేలెను.

ఈరీతి గామపాలుం డాప్రోయాలు మిన్నంగూడి రాత్రియుఁ బగలనుభేదము లేక నేకరీతి మూడుమాసములు గ్రీడించెను. బుద్ధిసాగరుండు జంద్రగుప్తునిచేత ననిపించుకొని యవ్వలఁ గొంతదూరము బోయి యాసేనలను దిరుగఁ దాను బిలిచినప్పుడు వచ్చున ట్లొడంబడఁ జేసుకొని యథాస్థానమున కనిపెను. పిమ్మట నతఁడు చంద్రగుప్తము జేరియందు బల్జీవేషము వేసికొని వింత వింతయగు పఱుపులు గుట్టు బల్జీ వచ్చినాఁడనియు దూదియిచ్చినచో సులభమగు వెలకే యింతకు మున్నెవ్వరు చూడని పరుపులు గుట్టుననియుఁ గోడప్రక్కను నివసించి యున్నవాఁడనియు నా పట్టణమంతయు జాటింపించెను.

ఆ చాటింపువిని యా యూరిలోని ప్రజలందఱు పాత పరుపులే కాక క్రొత్త పరుపులు కూడఁ జించుకొని యా దూదియంతయుఁ దీసికొని వచ్చి యా కోట గోడ ప్రక్కన రాశిగా వేయదొడంగిరి. బుద్ధిసాగరుండు నా దాపున నివసించి పరుపులు గుట్టుటకై మంచిముహూర్తము వలయువానివలె గాలయాపన జేయుచుండెను. ఆ కోటప్రక్కను పర్వతమువలె దూదిరాసి ప్రోగైనది.

ఇట్లుండనంత నొకనాడు చంద్రగుప్తుని కుమారుడు సత్యవంతుఁ డనువాడు దాసీముఖముగా దన చెల్లెలు స్త్రీరూపములో నున్న పురుషునితో నంతఃపురములో గ్రీడించుచున్నదని విని పరీక్షార్ధమై యర్ధరాత్రంబున నొక్కఁడే యచ్చటికింబోయి తలుపులు బిగించి యుండుట నా కవాటముల యద్దముల పగులఁగొట్టి యా దారిని లోపలకుఁబోయెను. ఆ సమయంబున నాతనికి హంసతూలికాతల్పంబునఁ జిత్రసేన తొడయందుఁ దలజేర్చి పండుకొని యా చేడియ పాడుచున్న వీణాగానంబునకు సొక్కుచు నడుమ నడుమ గుడిచేయి నా నాతి వాతెర నివురుచు నించుక మోమెత్తి చక్కిలి ముద్దు గొనుచుండెడు వారి చిన్నెలన్నియుఁ గనంబడినవి.

అప్పుడు పట్టరాని కోపముతో నా భూపాలకసూనుండు కేల వాలు బూని యుగ్రముగా నతని జంప మీద కుఱికెను. అసడి నంతకు బూర్వమే గ్రహించి కామపాలుడు తటాలునలేచి యతనిం గెలువగల బలము గలిగియున్నను నిలువక వేరొక యద్దము పగులంగొట్టి యా యంతఃపురము దాటి కోట ప్రక్క బుద్ధిసాగరుండు ప్రోగుజేసి యున్న దూదిమీదికి దుమికెను.

ఎంత బలవంతులైనను జారత్వకృత్యమున మెలంగుచున్నప్పుడు సామాన్యులకుఁ గూడ భయపడుచుందురు. సత్యవంతుండు వానిపోకఁ జూచి వెంటదగిలి పోకుము పోకుము యని కేకలు వైచుచు నాతం డరిగినరీతిగానే పోయి యతనితోఁ గూడ గోట గోడ దుమికెను దుమికిన వెంటనే యాదూదిలోఁబడి లేవకున్న సత్యవంతునిం దిరుగఁబడి పట్టుకొని కామపాలుం డతనిచేతనున్న కత్తినే బూని చిత్రవధజేసెను. అంత కామపాలుం డందున్న బుద్ధిసాగరుని లేపి జరిగిన కథ యంతయు నతనితోఁ జెప్పిన సంతసించుచు నప్పుడే యా దూదిరాశిలో నగ్ని యంటించి యతఁడు కామపాలునితోఁగూడ మరల సూర్యప్రతాపుని పట్టణమునకుఁ బోయెను. ఉదయంబున భస్మమైయున్న దూది రాశింజూచి పౌరులందరు బల్జీనిం గానక చింతించుచుఁ బ్రమాదమున నగ్నిపడి భస్మమై దూది చెడిపోయినంత మాటవచ్చునను భయముచే బల్జీ పారిపోయెనని యూహించి యెరుగని వారి కిచ్చినందులకే శాస్తి మనకుం గావలసినదే యని నిందించుకొనుచు బౌరులు చింతించిరి.

మఱునాఁ డుదయంబునఁ చిత్రసేన దనయన్న సత్యవంత్యుడు కామపాలునిం దఱుముకొనిపోయి మృతినొందుట వెనుకనే యఱిగి చూచి చింతించి యంతలో మరలించుకొని యా రహస్య మెవ్వరికిఁ దెలియనీక తండ్రికిట్లు కమ్మ వ్రాసినది.

తండ్రీ ! నిన్న రాత్రి మా యన్న సత్యవంతు డెద్దియో పనికి నా యంతఃపురమునకు వచ్చి యందు నివసించియున్న సూర్యప్రతాపు భార్యంజూచి మోహించెను అతని యభిలాష నేను దెలిసికొని యితరులు రాఁగూడని యీ యంతఃపురమున కేటికి వచ్చితివన్నా యని యడుగుచుండగ యంతలో నతఁడు నిలువలేక నానాళీకవదనపై బడబోయెను. అప్పు డాసాధ్వి వెరచి యటనుండి పరుగున బోయి గోడ దుమికి పారిపోయినది. సత్యవఁతుండు గూడనే బోయెను. ఇరువురు పోయిన పోకయేగాక యింతదనుక రాలేదు. ఇప్పటికప్పుఁడ సమ్మతి జెందియుండఁబోలు. ఎందు బోయిరో తెలియదు. ఈ రహస్యము మీకు దెలియఁ జేసితినని తండ్రి కెఱింగించినది.

అట్టి వార్తవిని చంద్రగుప్తుడు నఱకఁబడిన యరఁటికంబమువలె నేలంబడి కొంతసేపటికి దెప్పిరిల్లి అక్కటా! నా కుమారు డెంతఖలుఁ డయ్యెను. అంతఃపురమున కేటికిఁ బోవలెను? ఆ చిన్నది సామాన్యపురాణి యనుకొనెనా! అయ్యయ్యో! నే నిప్పు డేమి చేయుదును? సూర్యప్రతాపుఁడు వచ్చి నాభార్యను దీసికొని రమ్మని యడిగిన నేమి చెప్పుదును? ఈ మాట యతనికిఁ దెలిసినచో నా రాజ్యము దక్కనిచ్చునా? ప్రాణములతో నుండనిచ్చునా? మొదట నాయొద్ద నుంచుటకే సంశయించెను. దుర్మార్గులగు కొడుకులు గలుగుట పూర్వజన్మపాతకమూలముననే గదా! అన్నన్నా! తలచుకొనిన గుండెలు పగులుచున్నవి. తప్పక నాకు మరణమే తటస్థించును. ఏమి యున్నది. ఏమి చేసినను మేలేయని పలుతెరంగుల నంతరంగమునం దలఁచుచు జావునకు దెగించి యధికదైన్యములో నుండెను!

చిత్రసేన యదియంతయు జూచుచుఁ గపటముగా బుడి బుడి దుఃఖములు పెట్టుచు గుట్టు దెలియనీయక తన కోరిక తీరఁగలదను సంతోషముతో, గామపాలుని రాక కెదురు చూచుచుండెను. ఇట్లుండునంత నొకనాఁడు ప్రాతఃకాలమున భేరీద్వనులు వినంబడినవి. ఆ నినాదముతో గూడఁ జంద్రగుప్తుని గుండెలు పగిలిపోయినవి. ఇంతలో చారులువచ్చి చంద్రగుప్త మహారాజా! సూర్యప్రతాపమహారాజు మీయూరి బయట దోటలో విడిసియున్న వాడు. మిమ్ముఁ దీసికొని రమ్మనిరి. వేగముగా రండనుటయు నా మాట కతఁడు గడగడ వణంకుచు నెట్టకేలకా దూతల వెంబడి మొగమున చిన్నదనము దోప సూర్యప్రతాపుని యొద్దకుఁ బోయెను.

అప్పుడా కాపట సూర్యప్రతాపుఁడు కామపాలునికి మంత్రివేషము వైచి యిష్టగోష్ఠి విశేషముల మాటలాడు కొనుచుండగా వచ్చిన చంద్రగుప్తుని జూచి గౌరవించి యతం డుచితాసనమునఁ గూర్చుండి యున్న వెంటనే యతనితో నత్యాతురముగా నిట్లనియె.

చంద్రగుప్తా! మేము దేశాటనము జేసివచ్చితిమి. ఇంతకాలము నా ప్రేయసిం గాపాడినందులకు జాలసంతసించితిమి. ఆ చేడియం జూడ మిగులఁ దొందరగా నున్నది. వడిగాఁబోయి తీసికొని రమ్మనుటయు, నతండా మాటవిని గడగడ వణంకుచు మేనెల్లం జెమ్మటలుగ్రమ్మ నేమియుం బలుకక పెదవులు దడఁబడఁ జేతులు నలిపికొనుచు చిత్తము చిత్తము అని యెద్దియో చెప్పబోయి భయపడి యూరకుండెను. అంత సూర్యప్రతాపుడు మండిపడి యేమి యూరక నిలుచుంటివి. నామాట నీకు వినంబడలేదా? నాకు భార్యను జూచుటకు మిగుల తొందరగా నున్నదని నీకు తెలియదా? వేగము పోయి తీసుకొనిరా యని మరల బిగ్గరగా బలికెను.

అప్పుడు చంద్రగుప్తుడు చావునకుఁ దెగించి యలంతి యెలుఁగున దేవా! యొక మనవి యున్నది చిత్తగింపుఁ డనుటయు సూర్యప్రతాపుఁడు పెద్దకేక పెట్టి యోహో నీకు మంచి చెడ్డలు తెలియవా? నే నింత యాతురముగాఁ జెప్పుచుండ మధ్యను మనవులను చెప్పెద వేమిటికి? నీ మనవులు పిమ్మటఁ జిత్తగింతును. వేగము పొమ్మనుటయు నతం డేమియుఁ బలుకలేక గద్గదస్వరముతో అయ్యా! మీ భార్యను జాగ్రతగా నంతఃపురములోనుంచి కాపాడుచుండగా సత్యవంతుఁడను వాడు నాకొడు కామెను వరించి యెచ్చటికోఁ దీసికొని పోయెను. ఈ మాట దేవరవారితో మనవి చేసికొనఁజాలకున్నాను దేవరవారి కింత చింత గలుగచేసినందులకుఁ దగిన దండనకుఁ బాత్రుడ నై యుంటి. ఇంతకన్న నే నేమియుఁ జేయునది లేదని పలికి కన్నులనీరు నించుచు నాతని పాదంబులం బడియెను. అప్పుడతండు ప్రళయకాలభైరవుండు వోలె నుగ్రుఁడై సంవర్తపలాహకగర్జారవభైరవంబుగా నోరీ మూర్ఖా! యెంత ద్రోహివి. నీయింట నుంచి నందులకుఁ జక్కగా జేసితివి. ఇప్పుడే నిన్ను యమలోకంబున కనిపెదనని కఠారిం బెరికి యతనిం జంపనుంకించెను.

అప్పుడు మంత్రిగానున్న కామపాలుఁడు అతనిచేయి పట్టుకొని దేవా! శాంతింపుము శాంతింపుము. ఊరక నీనృపాలునిం జంపిన లాభమేమియున్నది. అతండు మనకు వ్యతిరేకముగా నడచుటలేదు. ప్రమాద మెవ్వరికైనను గలుగునుగదా! కొంచెము నిదానింపుడని పలుకుచుఁ గ్రమ్మర సింహాసనముపై గూర్చుండబెట్టెను

అప్పు డహంకారముఖముతోఁ జంద్రగుప్తుని చూచుచు సూర్యప్రతాపుఁడు చంద్రగుప్తా! నా భార్యను నీకుమారుని యధీనము జేసి తెలియనట్టు చెప్పినచో నూర కొందుననుకొంటివా? ప్రాణతుల్యయగు భార్యను విడిచి యెట్లుబ్రతుగఁగలను? అది నీయింటనే యుస్నది. ఎచ్చటనో దాచి ఇంటలేదని చెప్పుచుంటివి. వేగబోయి తీసికొనిరమ్మనుటయు జంద్రగుప్తుఁడు అయ్యో! నే నావాల్గంటి నింట దాచి యిచ్చట మీచే నవమానమును బొంద నేటికి? మీరు వచ్చి నానగరమంతయుఁ బరిశోధింపుడు. దైవసత్యముగా నట్టికపటము చేయలేదు. మీ రంగీకరించినచో మీరాణికన్న మిగులచక్కనిదియగు తొలిప్రాయములోనున్న నాకూతురు చిత్రసేనయనుదానిని మీకు వివాహము చేయుదును. దానికై యనేకరాజకుమారులు వేచియున్నారు. తగిన పతి దొరకమి నింతదనుక దానికిఁ బెండ్లిచేయలేదు. ఈరూపమున నానేరము బాపుకొనఁదలంచితి. నన్ను క్షమించి యట్లనుగ్రహింపుడు. నా కూతురు సౌందర్యాదిగుణంబుల తెరంగు లోకుల నడిగి తెలుసుకొనుఁడని అనేకప్రకారంబులఁ బాదంబులంబడి వేడుకొనుచున్న చంద్రగుప్తునిపైఁ గొంత కనికరించువానివలె నభినయించుచు మంచిది లెమ్ము నేటికి బ్రతికితివి. నిజముగా నీకూఁతురు చక్కనిదే యైనచో మేము బెండ్లి యాడెదము. ఆచిన్నదాని చూతుముగాక యిక్కడికిఁ రప్పింపుమని పలికెను.

అప్పుడు చంద్రగుప్తుఁడు తానుజచ్చి బ్రతికినట్లు సంతసించుచు దనకూఁతు బంగారుపల్లకి నెక్కించి తీసుకొనిరండని యంతఃపురవాసులు కాజ్ఞాపించెను. అంత నంతఃపురపరిచారిణులు తమయేలిక ఆజ్ఞప్రకార మాచిత్రసేనను దీసికొనివచ్చి యొక శిబిరములో నిలిపిరి. ఆ వార్త జంద్రగుప్తుడు సూర్యప్రతాపుని కెఱింగించినంత నతండు తదీయరూపాతిశయంబు బరీక్షించిరమ్మని మంత్రిగానున్న కామపాలుని నియమించెను. ఆకామపాలుఁ డతిసంతోషముతోఁబోయి యం దితరు లుండఁగూడదని యాజ్ఞాపించి యాచిత్రసేనం గాంచి పులకాంకితశరీరుండై ముద్దుపెట్టుకొనుచు బోఁటీ! నేటికిగదా మనము గలిసికొంటిమి. ఇదియంతయు నామంత్రి బుద్ధిసాగరుని బుద్ధినైపుణ్యమేసుమీ! నిన్ను మీతండ్రి మా కిచ్చివేసెను. నీపు మా యధీనవైతివని యత్యంతప్రీతిపూర్వకముగా బలుకుచున్న యతని కాచిన్నది యిట్లనియె.

నాథా! నే నిప్పుడు మీయధీనను కాలేదు. పూర్వమే యైతిని. మా తండ్రి యిప్పుడు మీ యధీనము చేసెను. నా పూర్వపుణ్యము మంచిది. మీ యట్టిపతి యూరక లభించునా! నిష్కారణముగా నా సోదరుం బరిమార్చితిరి గదా యాకోపము లేశమైన మీయెడ నాకు లేదేమి? ఆహా! కామప్రభావంబు అని యద్భుతమందుచున్న చిత్రసేనకు మరల గామపాలుండిట్లనియె. బోఁటీ నేను నీ సోదరునిఁ బగచే బరిమార్చితినా లేనిచోఁ మనగుట్టు బట్టబయలగును. ఈ కోపము మనంబున నుంచుకొనకుము. మఱియు నప్పుడు నీవు మాతో వత్తువా! యింక గొన్ని దినము లిందుండెదవా? యని యడిగిన నమ్మగువ యిట్లనియె. నాథా! దీనికి నన్నేమియు నడుగనక్కరలేదు. మీసెల వెట్లోయట్లే నడుచుకొందునని పలికెను. అట్లా ముద్దియతోఁ కొంతసేపు ముచ్చటించి కామపాలుఁడు మరల సూర్యప్రతాపు నొద్దకు వచ్చెను. అప్పుడు సూర్యప్రతాపుఁడు కామపాలుడు తనతో నేమియు మాట్లాడక మునుపే యెదుట నిలువంబడి యున్న చంద్రగుప్తునితో నిట్లనియె.

చంద్రగుప్తా! నేను భార్యవియోగశోకవ్యగ్రతచే నొకతప్పుపనికి నియమంచితిని. నీ కూతురుఁ జక్కదనము బరీక్షించుటకై నామంత్రిం బంపితిని. ఇతం డెంత నాకాప్తుండైనను బరపురుషుఁడు గదా! పరపురుషుని కన్నులం బడినదానిం బెండ్లియాడుట నాకిష్టములేదు. మఱియు నొకటి వినుము. నా కీకామపాలుండు కేవలము మంత్రియే కాదు ప్రాణసఖుండు రూపంబున నాకన్న నధికుండు. అతండు స్వయముగాఁబోయి నీకూతుం జూచుకొని వచ్చెంగావున నతనికే పెండ్లిచేయుము. నేను నాకిచ్చిన దానికన్న నెక్కుడుగా సంతోషింతుననుటయు జంద్రగుప్తుడు ఎట్లయినను సూర్యప్రతాపుఁడు సంతోషించినం జాలునని తలంచుచు నతని కిట్లనియె.

దేవా ! నేను మీ సెలవుప్రకారము నడచుకొనువాఁడ. మీ యిష్ట మెట్లట్లే చిత్రసేనను కామపాలునకిచ్చి వివాహము చేయుదునని యొడంబడెను. పిమ్మట సూర్య ప్రతాపుఁడు చంద్రగుప్తునితో రాజా! నేను పెద్దకాల మిచ్చట నుండను. శ్రీఘ్రముగా వివాహము గావింపుము. వివాహమైన వెనుక వధూవరులం జూచి సంతసించి పోయెద ననుటయు నాచంద్రగుప్తుఁడు మహాప్రసాదమని పలికి దైవజ్ఞులచే మంచిముహూర్తము పెట్టించి యందుఁ జిత్రసేన గామపాలునకు నధికమహోత్సవముగా బెండ్లిగావింపఁజేసెను.

అహా! బుద్ధిసాగరుని యభిఖ్యసార్ధకమైనదిగాదె. అంత బదిదినము లందుండి సూర్యప్రతాపుడు చంద్రగుప్తునితో వయస్యా! మీ యల్లుని మావూరికిఁ దీసికొనిపోయి తిరుగానంపెద నానతియ్యుఁ డనుటయు నతం డందుల కియ్యకొని చయ్యన వచ్చున ట్లల్లునిచే ననిపించుకొని యారాజు సగౌరవముగా ననిపెను.

ఆసేనలతోఁ గొంతదూరముపోయి వారిద్దరు నాలోచించుకొని సేనలకుఁ బోవుటకు సెలవిచ్చి వేషములు యథాప్రకారముగా మార్చికొని యప్పటియట్ల దేశాటనము చేయఁదొడంగిరి.

వీరట్లు కొంతకాలము దేశాటనముజేసి యొకనాడు శ్రీరంగపురసమీపమునకుఁ బోయి యొకతోటలో విశ్రయించియున్న సమయంబున జల్లగాలి వీచుచుండెను. కామపాలునికి నిద్రపట్టినది. బుద్ధిసాగరుఁడు నిద్రరాక యెద్దియో ధ్యానించుచుండెను. ఆ సమయంబున వారున్న చెట్టుమీద రెండుపక్షులు వాలినవి. అందాడుపక్షి మగపక్షి కిట్లనియె.

నాథా! వింతలేమైనం గలిగినచో వక్కాణింపుము. ఉబుసు బోకున్నది అని యడిగిన దానికి మగపక్షి యిట్లనియె.

కాంతా! వింతలేమియు లేవు. ఇప్పుడు మనమున్న చెట్టుక్రింద బండుకొని యున్న కుమారు లిరువురలో రాజకుమారుఁ డత్తవారింటి కరిగినతోడనే పాపము! కోటబురుజు విరిగి మీఁదపడి చచ్చును. ఇవియే విశేషమని చెప్పెను. అప్పుడాపక్షి రేఁడా? అది తప్పినచో నేమి జరుగునని యడిగెను.

దైవికము నాగండము గడిచెనేని యతండు రాత్రి భుజించు సమయంబునఁ దొలిముద్దలోఁ జాపముల్లు గొంతుక కడ్డపడి చచ్చునని మరల మగపక్షి చెప్పెను. ఆ మాట విని యాడుపక్షి ప్రాణేశా! యొకవేళ నవియుఁ దప్పినచో నేమి జరుగునని యడిగెను. అది తప్పిన పిమ్మట నతం డంతఃపురంబున భార్యతోఁ దాంబూలము వైచుకొనుచుండ దొలియాకులో బురుగు తిని చచ్చునని చెప్పెను. ఆడుపక్షి దైవసంకల్పమువలన నదియు దాటినచో నేమగునని పతి నడిగెను. బోఁటీ! అదియునుఁ దప్పినచో నారాత్రియే యతండు భార్యచేతిలో మృతుడగునని మగపక్షి తన్వీ! అది దాటదు, తప్పక యతఁడు భార్య చేతిలోనే చచ్చును, చచ్చును, చచ్చును, అని ముమ్మారు పలికి, తరుణి! మనమాటలు వినినవాడు ఈరహస్యము వానితోఁ జెప్పినను ఱాయి యగును సుమీ యని పలుకుచు నాపక్షి యాఁడుపక్షితోఁగూడ నెగిరి యెక్కడ కేనిం బోయినది.

పక్షిభాష గుర్తెరింగిన బుద్ధిసాగరుండా సంవాదమంతయు నాలించి పిడుగుపడినవానివలె నిశ్చేష్టితుండై అయ్యో! యిది యేమి పాపము నా కిట్టి ఘోరవార్త వినంబడిన దేమి? ఇదివరకు మాదినము లనుకూలముగా వెళ్ళినవి. మేము ముట్టినదెల్ల బంగారమే యగుచున్నది. ఇప్పుడు జెడుదినములు వచ్చినవి గాఁబోలు. అక్కటా! ఈయాపద నాకుకాక నా మిత్రునకు వచ్చినదేమి? మిత్రవియోగశోకము నేను భరింపగలనా? పక్షిమాట దప్పదు. మాకుఁ దిరుగ సంతోషముతో నిండ్లకుఁ జేరు యోగము లేదు గాఁబోలు! కానిమ్ము. దైవసంకల్ప మెవ్వడు మరలింపఁగలడు? ఏమి జరుగునో చూచెదంగాక యని ఖిన్నవదనుఁడై విచారించుచుండ నింతలోఁ గామపాలుఁడు మేలుకొని వయస్యా! నేను బరుండి చాలాసేపైనది. నన్ను లేపకపోయితివేమి? నాకొక దుస్వప్నమైనది. మనయింటియొద్ద నెవ్వరికై నం గీడురాలేదు గదా? నీ వెద్దియో విచారించుచుంటి వేమని పలుకుచుఁ దనకు వచ్చిన కలయంతయు నతనితోఁ జెప్పి దీనికి ఫల మేమని యడిగిన నతండు మనంబున విచారించుచు నతనితో నిట్లనియె.

కామపాలా! పగలు వచ్చిన కలకు ఫల మేమియు లేదని పెద్దలు చెప్పుదురు. దీనికై నాలోచింపవలసిన పనిలేదు. సాయంకాలమగుచున్నది పోదము లెమ్ము శ్రీరంగపురము ప్రాంతమునందే యున్నది. మఱియు నే నాలోచించునది యేమియు లేదు దూరమార్గగమనభేదంబునంజేసి నా మొగము నీ కట్లు కనంబడుచున్నది. ఇంతకన్న వేరులేదని లోపలఁ జింతించుచున్నను నతనికి ధైర్యము గఱపుచు నాతోట విడిచి సాయంకాలమున కా కామపాలునితోఁ గూడ శ్రీరంగపురము జేరెను. బుద్ధిసాగరుఁడు కామపాలునితోఁ బ్రస్తుతము శ్రీరంగపురము పోవలదని యెన్నియో విధముల బోధించెనుగాని కారణము జెప్పమి నామాట పాటిసేయక పద్మావతియందలి మోహంబునం జేసి యతండు పోవలయునని గట్టిపట్టుపట్టెను. దానం జేసి వారి కచ్చటికిఁ బోక తీరినదికాదు. బుద్ధిసాగరుఁడు కామపాలునితోఁ గనిపెట్టి కోటప్రాంతము నడచుచు బురుజు దగ్గరకు బోవునంత నొక్కత్రోపు ముందరకుఁ ద్రోసెను. అప్పుడే యా బురుజు పెళపెళ విరిగినదిగాని బుద్ధిసాగరుని త్రోపుచేఁ గామపాలునికిఁ జింతాకంత దప్పినది. అచ్చటనున్నవా రది చూచి కామపాలుని బునర్జీవితునిగాఁ దలంచిరి.

పిమ్మట శ్రీరంగరాజు అల్లుని రాక విని సంతోషముతో నెదురేగి యుచితసత్కారములతోఁ దోడ్కొనిపోయి యప్పుడే యావార్త పద్మావతికిఁ దెలియజేసెను . ఆరాత్రి మంచి పిండివంటకములు ఫలోపహారములు మొదలగువానితో వారికి విందుజేసిరి. అప్పుడు బుద్ధిసాగరుఁడు మొగమునందు దైన్యము దోపనీయక యతని దాపుననే భోజనమునకుఁ గూర్చుండి కామపాలుని మొదటే ముద్దఁజేసికొని తినఁబోవు సమయంబున నతని చేయి బట్టుకొని అన్నా! నాకీ ముద్దబెట్టుము దీనిం దిన వేడుక యగుచున్నది . నీకును నాకును నెంగిలిలేదు అని వినయముగాఁ బ్రార్థించిన నతండు నవ్వుచు మిత్రుఁడా! దీనికై నన్నింత బ్రతిమాలవలయునా? యిదిగో బుచ్చుకొమ్మని యిచ్చుటయు దాని నతండు దినక పిమ్మట బ్రచ్ఛన్నముగా దాచెను.

అట్లు ఇష్టగోష్ఠి మాటలాడుకొనుచు భుజించిన వెనుక బుద్ధిసాగరుఁడు కామపాలునితో రహస్యముగా నిట్లనియె. అన్నా! నీవును నేనును నిల్లు విడచినది మొదలు విడవకుండ నొక్కశయ్య బండుకొనుచుంటిమి. నాకు నేఁడు గాలిసోకినదేమోగాని శరీరములో భారముగా నుండుటయేగాక మనమున నెద్దియో భయము గలుగుచున్నది. రాత్రి నీవు నీ భార్యతోఁ బరుండవలసినదేగదా? నే నొక్కరుండ నెక్కడ బండు కొందును. అనుటయు నతండు తొందరపడి ఆయ్యో మిత్రుఁడా ! నాకు నీకంటె పద్మావతి యెక్కువదియా! నీవు వెరవకుము. నేను తోటలోఁ బరుండి లేచినది మొదలు నీమొగము బరీక్షించుచునే యుంటిని. విపరీతముగానే యున్నది. దారిలో గాలిసోకి యుండవచ్చును . విభూతి పెట్టించి యీరాత్రి నీయొద్దనే పండుకొనియెదనని పలికెను.

అప్పుడా బుద్ధిసాగరుఁ డన్నా! అట్లనకుము. చిరకాలమున కిచ్చటికివచ్చి భార్యం జూడక వేరుశయ్యని బండుకొనిన బంధువులు సమ్మతింతురా? పోనీ! యొకటి చేయుము. నీవు నాకతంబున భార్యయొద్దఁ బవళింప మానవలదు. నీ గది దగ్గరే నాకుఁగూడ మంచము వేయించుము. నాకు ధైర్యముగా నుండును అనిన అతండు నెచ్చెలీ దీనికి సంశయమేల! నా గదిలోనే పరుండవచ్చును . నీకును నాకును భేద మున్నదా! యని పలికెను.

బుద్ధిసాగరుం డతనితో అన్నా! మన యిరువురకు నెంత మైత్రి యున్నను నొక్కగదిలోఁ బవ్వళింపరాదు. నీ కిష్టమైనచో నీ భార్య పద్మావతి సమ్మతించునా! ఇతరులు వినినఁ బరిహాసాస్పదముగా నుండును. నీ గదికి దాపుగ నాకు మంచము వేయించుటయే లెస్సయని పలికి యతని నొప్పించెను.

కామపాలుండు అంతఃపురచారిణుల కామాట దెలియజేసిఁ తన గదినిచేరియున్న గదిలోనే యతనికిఁగూడ మంచము వేయించెను.

అంత నంతఃపురకాంతలచే బిలువంబడి కామపాలుఁడు బుద్ధిసాగరునితోఁ గూడ నధికాలంకారశోభితంబగు శుద్దాంతమున కరిగినఁ పద్మావతి యెదురువచ్చి మగని చెట్ట బట్టుకొనియున్న బుద్ధిసాగరుం జూచి కొంచెము తొలఁగెను. కామపాలుం డట్టి సందియము ముందుగానే పోగొట్టెను. ఆ ముద్దియయుఁ దద్దయుం బ్రీతి బతిపాదంబులం గడిగి నెత్తిపై జల్లుకొని కైదండ యిచ్చి చిరకాలదర్శన ననురాగంబు మోముఁదేటబడ నల్లన గదిలోనికిఁ దీసికొనిపోయి హంసతూలికాతల్పమునఁ గూర్చుండబెట్టినది.

ఎరమరికలేక బుద్ధిసాగరుండు వానితోఁగూడఁ బోయి యాశయ్యాతలంబు దాపునం గూర్చుండెను. అట్లు వారిరువురు తల్పంబుజేరినంత పద్మావతియు దాపున శయ్యం జేరియున్న గద్దియందు గూర్చుండి వారికి విడియమిచ్చెను. అత్తరి బుద్ధిసాగరుఁడు కనిపెట్టి చూచుచు నెద్దియో నెపంబున మొదటి యాకందిపుచ్చుకొని దాచి యుండెను. పిమ్మట నా కొమ్మయుఁ బతియనుమతి బుద్ధిసాగరుని రంజింప వీణెంబూని మనోహరరాగంబులతో సంగీతంబు బాడినదిగాని యది యేమియు నతనికి వేడుక కలుగజేసినదికాదు. అట్లు కొంతసేపు వినోదముగాఁ బ్రొద్దు గడపినంత బుద్ధిసాగరుండు మిత్రునికి మరణసమయము సమీపించుచున్నదని మనంబున బెక్కు తెరంగుల నడలుచు నెట్టకేల కతని విడిచి దాపుననున్న గదిలోనికిఁ బోయెను. మంచముమీదఁ గూర్చుండి మనంబున శోకంబాపలేక కన్నులనీరు గాల్వలుగాఁ బ్రవహింపఁ దన మిత్రునితో జరమసంభాషణం బదియేయని పెద్దయలుంగున గామపాలా అని పిలిచెను.

అప్పుడు కామపాలుం డతని గద్గదస్వరం బాలించి యోహో యీతడీ దినమున వెరచియున్నవాఁడు. ఒంటిగాఁ బరుండుటకు వెరచుచున్నవాఁడని నిశ్చయించి తమ్ముఁడా యిటురా యని చీరెను.

అప్పుడు మరల నొక్కసారి యతనిచూచు దాత్పర్యముతో బుద్ధిసాగరుం డా గదిలోని కరిగి కామపాలునిం గౌగలించుకొని మోము వేరొకలాగునఁ ద్రిప్పి వెక్కి వెక్కి. యేడువఁదొడంగెను .

కామపాలుండు వానికి భూతము సోకియే యట్లు భయపడుచున్న వాఁడనుకొని బుద్ధిసాగరా! యింత పిరికివాడ వైతివేమి? బుద్ధిచాళుక్యమంతయు నెచ్చటికిఁ బోయినది? మనల భూతము లేమి సేయగలవు! ధైర్యమవలంబింపుము అంత భయముగా నుండిన నిచ్చటనే పరుండుము. అని వీపు చరచుచు దగ్గరగా గౌఁగలించుకొనెను. బుద్ధిసాగరుం డెంత యాపుకొనినను తన మిత్రునికి మృతి సమీపించినదనియు నిదియే తుది గౌఁగలింత యనియు దుఃఖమాగినదికాదు. కొంతసేపట్లు మిత్రుని విడువలేక బలాత్కారమున గౌఁగిలి వదలి ధైర్యము దెచ్చుకొని మరలఁబోయి గదిలో బండుకొనెను. అంత దైవసంకల్పము వలనఁ గామపాలునికి రతిక్రీడాసౌఖ్యము లనుభవింపకపూర్వమే దారినడిచియున్ననలసటనే వెంటనే గాఢముగా నిద్రపట్టినది.

పద్మావతి కథ

బుద్ధిసాగరుఁడు నిద్రఁబోక పక్షివాక్యము స్మరించుకొనుచు గామపాలుండు భార్యచేతిలో నెట్లు చచ్చునో యని యొకగవాక్షము వెంబడి లోనికిఁ దొంగిచూచుచుండెను. అప్పుడు పద్మావతి మెల్లగ లేచి తన మగఁడు గుర్రుపట్టి నిద్రబోవుట పరిశీలించి నలుదెసలు కలయజూచి బుద్ధిసాగరుఁడు తన్నుఁ జూచుచున్న విషయమెఱుఁగక నా గదిలో నొకమూలనున్న తలుపు తెరచి యాదారిని నేలసొరంగములోని కరిగినది.

అప్పుడు బుద్దిసాగరుఁడు మెల్లనలేచి యా గదిలోనికిఁబోయి దానికిఁ దెలియకుండ వెంబడించి యా సొరంగము దారినే పోవుచుండెను. అట్లు పోవఁబోవ నాదారి యొకమేదరియింటియొద్దకు వెళ్ళినది. పద్మావతియు వాని యింటి కరిగి యరుగుపై గుర్రపెట్టి నిద్రించుచున్న నామేదరిని లేపెను. దానివెంటనే వచ్చి యదియంతయు చూచుచు బుద్ధిసాగరుం డాయింట నొకమూల దాగియుండెను. ఆ నీచుఁడు కోపముతో లేచి చీ నిర్భాగ్యురాలా! యింత యాలస్యము చేసితివేల? యింతసేపు తిండితినక మేలుకొని యుండఁగల ననుకొంటివా? యని చెంపమీద నొక దెబ్బగొట్టెను. అప్పుడు పద్మావతి దవడ రాచుకొనుచు బ్రియుఁడా! కోపము సేయకుము. నే నెన్నఁడేని యింత యాలస్యము చేసితినా? కారణమున్నది వినుము. నా మగఁడైన కామపాలుఁడు బుద్ధిసాగరునితోఁ కూడ వచ్చినాఁడు. ఏకశయ్య నిరువురము బండుకొంటిమి. ఎంత యిష్టము లేకున్నను మగఁడుగదా! నిద్రపట్టువరకైన నుండవలయునా? మన పుణ్యము వలన నతఁడు రతిక్రీడకు దొరకొనకమునుపే బడలికచే నిద్రించెను. లేనిచో నా కీరాత్రియే వచ్చుటకు వీలులేకపోవును. వాని స్నేహితుఁడు బుద్ధిసాగరునికి గాలిసోకినది. అతని మూలముగాఁ గొంత యాలస్యమైనది. లేనిచోఁ బెందలకడరానా? యివిగో భక్ష్యములు భుజింపుము. నేఁడు అల్లుడు వచ్చెనని వింతగా చేసిరి. నా బుద్ధియంతయు నీమీఁదనే యుండుటచే నింతవరకు జవియైన జూడలేదు. అని పసిడిపళ్ళెరము వాని ముందర దుంచినది.

అప్పుడా మేదరవాఁ డాభక్ష్యములను మెక్కుచుఁ దరుణీ! అలాగునా! తెలియదు నిన్ను నిష్కారణముగా గొట్టితినిగదా! యీ తప్పు సై రింపుమని పలుకుచుండెను. అంత నా కాంత ప్రియుడా! నాకు నీ దెబ్బ మేమియు నొప్పిపెట్టలేదుగాని యొకటి వినుము. ఒకవేళ నా మగఁడు ననుఁ దనయూరికిఁ దీసికొని పోవునేమో యని భయమగుచున్నది. దీనికి నేనేమి చేయవలయునో తోచకున్నది. నీ వే మనియెదవని యడిగిన వాఁడిట్లనియె.

మేలు మేలు మగనితో నరిగిన నే నేమి చేయుదును? దీని కెద్దియేని ప్రతిరోధము చెప్పుము. ఇంత యేల ఇప్పు డతండు నీ యంతఃపురములోనే నిద్రించుచున్న వాడుగదా! యీ కత్తి తీసికొనిపోయి వానిని వధింపుము. మన కే యాటంకము నుండదు. అని చెప్పిన విని యవ్వనిత సంతసించుచు ఔనుసుమీ! ఈపని యెంతయు నుచితముగానున్నది. బుద్ధిసాగరుఁడు గూడ నంతఃపురమున బరుండుట మనకొక యుపకారమైనది. నేను తరువాతఁ జెప్పెదనులే! యీ కత్తి నూరినదే గదా! యిటు తెమ్ము. వేగఁబోయెదనని యా కత్తి నందిపుచ్చుకొని రివ్వున మరలి సొరంగములోఁ బ్రవేశించినది.

అది యంతయుఁ జూచుచున్న బుద్దిసాగరుఁడు దానిచివరమాట విని తానే ముందరబోయి కామపాలుని లేపఁదలచెనుగాని దైవసంకల్పమున నాసొరంగములో దాని యడుగుముందు వాని యడుగు వెనుక యగుటచే వడివడిపోయి యేమియుం దెలియక గాఢనిద్రావశంవిదుఁడై యున్న కామపాలుని మెడమీద నాగత్తి వైచి చంపెను. స్త్రీ సాహసము ఎంత ఘోరమైనదో.

శ్లో॥ సుఖదుఃఖ జయపరాజయ జీవిత మరణానియే నిజావంతి।
     ముహ్యంతి తేపిసూనం తత్వవిదశ్చాపి చేష్టితై స్త్రీణాం॥

శ్లో॥ స్మరోనమమపిప్రాప్య వాంఛంతి పురుషాంతరం।
     నార్యస్సర్వస్యభావేన నోహంతె హతదాశయాః॥

సుఖదుఃఖ జయపరాజయ జననమరణముల మహిమ దెలిసికొనిన మహానుభావులు సైతము స్త్రీచేష్టలకే మోహమును బొందుదురు. మఱియు మన్మథుండు మగడైనను పురుషాంతరునిఁ గోరుచుందురు. వారిచిత్తవృత్తి దెలిసికొన నెవ్వనితరంబు.

అట్లు తాను వెళ్ళుసరికే యతనిఁ గడదేర్చినది. కాన నేమియు జేయలేక హా మిత్రుడా! నన్నొంటి విడిచి పోయితివేయని ఘోరముగా నేడువ దొడంగెను. పద్మావతి యప్పుడు అతని గదిలోనుండియే వచ్చెననుకొనెను? తనవెంట వచ్చి తనగుట్టంతయుఁ జూచిపోయెనని యింతయేని యెరుంగదు. గోపా! పిమ్మట నాచిన్నది చేసిన కృత్యము వింటివా? మేనంతయుఁ జీరికొని నగలన్నియు విరజిమ్ముచు అయ్యో! చెలులారా! రండురండు యీ బుద్ధిసాగరుండు నామగనిం జంపి నన్ను బలాత్కారముగాఁ బట్టుచున్నాఁడు. వేగము రండో యని యరచినది.

ఆ కేక విని ప్రాంతగేహములోనున్న సఖులు సఖీ! వెరవకుము వెరవకుము. మేము వచ్చుచున్నామని మరల గేకలుపెట్టి యతివేగముగా నచ్చటికివచ్చి చచ్చిపడి యున్న కామపాలునిపై బడి యొడలెఱుంగక దుఃఖావేశముతో నేడ్చుచున్న బుద్ధిసాగరుని నా గదిలోనే నేడ్చుచు వికారముగానున్న పద్మావతిం జూచి యిది యేమి పాప మితం డిట్టు చచ్చెనేమి యని యడిగిరి. అప్పుడు పద్మావతి వారితో అక్కలారా! నేనేమి జెప్పుదును? ఈ దుర్మార్గుం డంతఃపురములోఁ దనకుఁగూడ మంచమువేయు మనిన నేను మైత్రిచే విడువలేక యట్లనుచున్నా డనుకుంటిని గాని యింతజేయునని యెఱుఁగనైతిని.

నా భర్తకు గొంచెము నిద్ర పట్టగానే వచ్చి యతనిం గడతేర్చి నన్నుఁ దనతో సంభోగింపుమని బలాత్కారము చేయుచున్నాడు. ఇప్పుడు మీరు వచ్చినంత నేమియు నెఱుఁగనివానివలె నతినిపైఁ బడి యేడ్చుచున్నవాఁ డిదియే జరిగిన కథయని గోలుగోలున నేడువదొడంగెను. అప్పుడు కొందరు బోయి శ్రీరంగరాజుతో నావర్తమానము జెప్పిరి. అతండు గుండెలు బాదుకొనుచు సకలబంధుపరివృతుఁడై యంతిపురమునకు వచ్చి కూఁతుం గౌఁగలించుకొని యొకపెట్టున నేకస్వరముగా నేడువదొడంగిరి.

అప్పుడు రాజు పద్మావతి చెప్పిన మాటలన్నియు నిజమేయని నమ్మి పట్టరానికోపముతో నొడ లెరుంగక మిత్రునిపైఁ బడియున్న బుద్ధిసాగరుని లేవనెత్తించి యేమిరా? మిత్రద్రోహి! నిన్నుఁ బ్రాణమిత్రుడని నమ్మి వెంటఁబెట్టుకొని వచ్చినందులకు వీనికి మంచి యుపకారము చేసితివి. ఈ దొంగ యేడుపుల కేమిలే? నీ మొగము చూచినంత మహాపాతకములు సంప్రాప్తించు నిన్నేమిచేసినను తప్పులేదు. మా కొంప ముంచితివి అని యనేక నిందావాక్యము లాడెను. బుద్దిసాగరుఁడు శోకముచేఁ దెలివి తప్పియున్నకతంబున నతనిమాట లేమియు వినిపించుకోలేదు.

పిమ్మట శ్రీరంగరాజు కొంతసే పట్లు చింతించి యూరక కామపాలునిపైఁ బడి యేడ్చుచున్న పద్మావతి నూరార్చి పేర్చిన క్రోధమున బుద్ధిసాగరుం దీసికొనిపోయి యుఱిదీయుఁడని కింకరుల కాజ్ఞాపించెను. యమకింకరులం దిరస్కరించు రాజభటులు మఱునాఁడు బ్రొద్దున నహంకారముతో నతని రెక్కలకుఁ ద్రాళ్ళు బిగించి వీధుల వెంబడి ద్రిప్పుచు వీఁడే మిత్రద్రోహుఁడు చీ యని చూచినవారెల్ల నుమియుఁ గ్రమంబున నతని వధ్యభూమికిఁ గొనిపోయిరి. బుద్ధిసాగరుం డావిషయ మేమియు నెరుంగక పిశాచము పట్టినవానివలె వారితో నడిచెను. అంత వధ్యభూమియందు నుఱిదీయబోవు సమయంబున రాజభటులు బుద్ధిసాగరుని వాడుక ప్రకారము ఓరీ! క్రూరాత్మా! ని న్నిప్పుడు ముఱి దీయఁబోవుచున్నారము. బ్రతుకుదప్ప నెద్దియేని కామిత మున్న గోరుకొమ్ము. ఇత్తుమని గట్టిగా బలుకుటయు నప్పటికిఁ గొంచెము స్పృహ వచ్చి బుద్ధిసాగరుఁడు వారితో నిట్లనియె.

అయ్యో నే నేమి యపరాధము చేసితిని! న న్నేమిటి కురిదీయుచున్నారు? మఱియు నే నిచ్చటి కెట్లువచ్చితిని? నా ప్రాణమిత్రుడు డేడి? యని యడిగిన వారు ఓహో! నీ దొంగవేషమున కేమిలే' నీవు ప్రాణమిత్రుని జంపినందుకుగాను శ్రీరంగరాజు నీకు మరణదండన విధించెను. ఇది వధ్యభూమి. నీవు నీ వార్తయే యెఱుఁగకున్నావు. ఈసారి తెలిసినదా? నీకు మఱి గామిత మేదేని గలిగిన వక్కాణింపుము. దానిందీర్చి శీఘ్రముగా నుఱితీయుదుము అనుటయు నా మాట విని బుద్ధిసాగరుండు ముక్కుమీఁద వ్రేలు వేసికొని రాజకింకరులారా! నా ప్రాణమిత్రుని నేనే చంపితినని మీ రాజు నాకు మరణదండన విధించెనా? మేలు మేలు బాగుబాగు. చక్కగా నిధానించెనే? కానిమ్ము నాకు నీ సమయమందు మరణమే యుచితముగా నున్నది. అట్లయిన వేగ నురిదీయుఁడు నా చెలికానితోఁ గలిసికొనియెదనని తొందరపెట్టెను.

అప్పుడు వాండ్రలోఁ గొందరు బుద్ధిమంతులు వానిమాటలధోరణిచే నేరము చేసినట్లు నమ్మక అయ్యా! నీ వూరక చావనేల? నిజముగా నీవు నేరము జేయనిచో నామాట రాజుగారికి నిదర్శనము చూపుము. నిన్ను విడిచిపెట్టెద రనుటయు బుద్ధిసాగరుఁ డొక్కింత చింతించి చావనిశ్చయించియు నూరక నిందమోసి మృతినొంద నేటికి? నిక్కము బయలుపరచిన పిమ్మట సమసెదంగాక యని తలంచి యా కింకరులతో నిట్లనియె.

భటులారా! అట్లయిన నన్ను మీరాజునొద్దకు తీసికొనిపొండు. పిమ్మట నతనితో నిజము చెప్పెదనని కోరెను. ఆ కోరిక ప్రకారము మతని మరల శ్రీరంగరాజునొద్దకుఁ దీసికొనిపోయి వాని యభిప్రాయము మెఱింగించిరి.

రాజు అహంకార ముఖముతో బుద్ధిసాగరునిం జూచి పాపాత్మా! నీవు నాతోఁ జెప్పవలసిన మాట యేదియో వేగముగా వినిపింపుము. నీ మొగము చూడరాదని పలికెను.

అంత బుద్ధిసాగరుఁడు దీనస్వరముతో రాజా! నా ప్రాణమిత్రుఁడు గామపాలుండు మృతిజెందియుండ నా కీయురిశిక్ష యుచితముగానే యున్నది. ఊరకట్టి నిందమోపి చావరాదని యూహించి యందలి నిజము మీకు వినుపించుటకై వచ్చితిని. మొదట నేను శోకావేశముతో నుండుటచే మీచర్య లేమియు గ్రహింపలేకపోయితిని. ఇప్పుడు నా వెంట నంతఃపురమునకు రండు. అందలి యథార్థమంతయుఁ బ్రత్యక్షపరతు ననుటయు నా రాజు దెల్లఁబోయి వల్లెయని యప్పుడే యతనివెంట గూఁతు నంతిపురి కరిగెను. బుద్ధిసాగరుఁడు రాజును బద్మావతి గదిలోనికి తీసికొనిపోయి యందు మూలగానున్న కవాటము తెరచి యానేల సొరంగము జూపించి దానివెంబడి తనతో రమ్మని చేయి వీచుచుఁ గ్రమంబున నతని నామేదరి యింటికి దీసికొనిపోయి యందు తనపేరుతోనున్న బంగారుబళ్ళెరములు, వెండిగిన్నెలు, నగలు మొదలగు వస్తువులన్నియుం జూపించి కామపాలుని నరికిన కత్తిని రక్తమిళితమై యచ్చటనే బడియున్న దానిం గైకొని పరిశీలించి యా చిహ్నముల రాజునకుఁ జూపించుచు రాత్రి జరిగినకథ యంతయు నతనితోఁ జెప్పెను.

అప్పు డారాజు చిత్త మెట్లుండునో వర్ణింప నశక్యముగదా! శోకమును రోషమును లజ్జయు పశ్చాత్తాపము నొక్కసారి యతనిచిత్తమునం జనించి యుత్తలపెట్ట దొడంగిన నేమియుం జేయఁదోచక బుద్ధిసాగరుని పాదంబులంబడి, మహాత్మా! ని న్నూరక నిందించి శిక్షఁజేయబూనిన నా పాతకమునకు నిర్వృత్తి యెద్దీ? నీవు కటాక్షింపనినాఁడు నాకు మరణమేకాని వేరులేదు. ఈ దుర్మార్గురాలి నిప్పుడే యుప్పుపాతర వేయించెద. నీవు మాత్రము నాయందు ప్రసన్నుఁడవు గమ్మని యనేక విధంబుల వేడికొనియెను.

బుద్ధీసాగరుండు శ్రీరంగరాజును బాదంబులనుండి లేవనెత్తి రాజా! నీ విషయమై నాకుఁ గొంచెమేనియుఁ గోపములేదు. ఇదంతయు మా దినముల మహిమయే కాని వేరుకాదు. ఒకరి ననిన లాభమేమి యున్నది? బ్రహ్మకైనను నెల్లకాల మొక్కరీతిగా వెళ్ళదుగదా? నీవేమియుఁ జింతింపవలసిన పనిలేదు. పద్మావతిని దండించినఁ గామపాలుండు బ్రతుకునా? కావున నెవ్వరి నేమియు జేయకుము నాకు నా మిత్రుని కళేబర మొకపెట్టెలో నమర్చి యిప్పింపుము. అది దీసికొని నేను తీర్థయాత్రలకుఁ బోయెదనని పలికిన నా రాజు అతని యిష్టప్రకారము కామపాలుని శరీరము చెడకుండఁ దైలము రాసి సరిపడిన పెట్టె చేయించి యందులో నా మొండెమునుంచి యది బుద్ధిసాగరుని కిచ్చెను. దానిని నెత్తిమీఁద బెట్టుకొని మోసికొని పోవుచుఁ దన భార్యచర్య లెట్లున్నవో చూచెదఁగాక యని తలంచి యటనుండి కొన్నిదినముల కత్తవారింటి కరిగెను

పిమ్మట శ్రీరంగరాజు బంధువు లెంద రెన్ని చెప్పినను వినక నామేదరివానితోఁడ బద్మావతిం జంపించి యుప్పుపాతర వైచి యా యపకీర్తి భీతిచేతనే కృశించి కొంతకాలములోనే పరలోక మలంకరించెను.

సుగుణావతి కథ

బుద్ధిసాగరుం డత్తవారింటికిఁ బోయినతోడనే మామగారు మిగుల సంతసించుచుఁ దగిన సత్కారము చేసి యతనిరాక కొమార్తెకు దెలియజేసెను.

చిరకాలమునుండి మగనిరాక కెదురు చూచుచున్న యా చిన్నది మితిలేని కుతుకము జెంది యారాత్రిఁ జక్కగా నలంకరించుకొని తదీయదర్శనం బభిలషించుచుండెను. ఇంతలో బుద్ధిసాగరుఁడు రాత్రి భోజనము చేసి కొంతసేపు మామగారితో ముచ్చటించి పిమ్మట తనపెట్టెతోగూడ నంతఃపురమున కరిగెను. ఆ సుగుణవతి తన పతి కెదురేగి పాదంబులం గడిగి శిరమునఁ జల్లుకొని తడియొత్తి సవినయంబుగాఁ గైదండ బూని శయ్యాతలము జేర్చినది.

బుద్ధిసాగరుఁడు పద్మావతి చర్యలు చూచినది మొదలు స్త్రీలందరు దుర్మతులే ననియు నమ్మనర్హులు గారనియు నిశ్చయించియున్న కతంబునఁ దన సతిచేయు సుపచారములన్నియుఁ గపటములే యని తలంచి పాటింపఁడయ్యెను.

పిమ్మట నాకొమ్మయుఁ బతికి వినయముతో సుగంధద్రవ్యము లిచ్చి వీణాగానంబునఁ గొంతసేపు రంజింపఁజేసి తొడలపై నతని పాదంబులఁ జేర్చి యొత్తుచు మెత్తని మాటలచే నతని చిత్తము గనుక నిట్లనియె.

ప్రాణేశా! మీరు నన్ను విడిచిపోయి పెక్కుదినములై నది గదా! యిన్నిదినంబుల దనుక రాకుండుట న్యాయమే? ఇఁక పది దినములు జాగుచేసినచో నాకు మరణమే దిక్కగుసుఁడీ! సతులకుఁ బతిసేవకన్న మిన్నయగు వ్రతమున్నదియా? యని యత్యంతవినయభక్తివిశ్వాసములతోఁ బలుకుచున్న యా చిన్నదాని మాట లన్నియును బూటకములే యని బుద్ధిసాగరుఁడు విశ్వసింపక యూకొట్టుచు దాని చర్యలుగూడఁ బరీక్షింపఁ దలచి యంతలో నిద్రబోవు వానివలె నభినయించుచు బిగ్గరగా గుర్రుపట్ట దొడంగెను.

అప్పుడాఁపడతి మెల్లన వల్లభుని చరణంబులు శయ్యాతలము జేర్చి చప్పుడు గాకుండ మంచము దిగి పసిడి పళ్ళెరములో ఫలములు మొదలగు నుపహారములు వైచుకొని యా యిల్లు వెడలి వీథిఁబడి నడువసాగెను. బుద్ధిసాగరుఁడు నిద్రపోలేదు. ఆ పూఁబోడి ప్రయాణసన్నాహమంతయుఁ జూచి దానితోడ వెన్నంటి యరుగుచు అన్నన్నా, నాతో నిన్నినీతులు బలికి యీ కలికికూడ నెక్కడికో పోవుచున్నది. ఆహా! స్త్రీ స్వభావము.

శ్లో॥ గావోనవతృణానివ గృహ్యంత్యేతా నవం నవం
     శంబరస్యచయా మాయా యామాయా నముచేరపి
     బలెః కుంభీనసస్యైవ సర్వాస్తాః యోషితోవిదుః
     స్త్రీణామగమ్యోలోకేస్మి న్నాస్తికశ్చిన్మహీతలె.

గోవులు క్రొత్తక్రొత్త గడ్డిమేయ గమకించినట్లు స్త్రీలు క్రొత్తవాని నిమిత్తము ప్రయత్నింతురు. స్త్రీలకు బొందనిరానివాఁడు పుడమిలోఁ లేఁడు. ఎట్టి నీచునితోనైనను గూడికొందురు. శంబరుఁడు నముచి కుంభీనసుఁడు లోనుగాఁగల దైత్యచక్రవర్తు లెఱింగిన మాయలన్నియు స్వభావము చేతనే స్త్రీలయందు సంక్రమించి యుండును.

అని మున్ను చదువుకొన్న స్త్రీచేష్టల గుఱించియున్న శ్లోకంబులు బెక్కు చదువుకొనుచు నది పోయినదారినే పోవుచుండెను. ఆ చిన్నది క్రమంబున నూరి బయటనున్న చండికాదేవి యాలయంబున కరిగి తలుపులు తెరచి లోన దీపము వెలిగించి తాదెచ్చిన యుపహారములు నివేదన జేసి చేతుఁలు జోడించి యిట్లు ప్రార్థించెను.

తల్లీ ! నీవు సమస్తచరాచరప్రపంచముల కధికారిణివి. నీ కతంబున జగంబులు నిలిచియున్నవి. నీ మహిమ యవాఙ్మానసగోచరంబు. నా కోరిక ప్రకారము నా మనోహరుని రప్పించి యభీష్టము తీర్చితివి. ఇంక నీ మ్రొక్కు చెల్లించుకొనుము. ఇదిగో! నా తల నీకు బలి యిచ్చుచుంటిని. ముందు జన్మమందుగూడ నా కితండే పతి యగున ట్లనుగ్రహింపుము. నాబుద్ధి నెల్లప్పుడు పాతివ్రత్యంబుననుండ నియోగింపుము. అని వేడుకొనుచు నా దుర్గపాదంబులఁ దనతలఁ గొట్టుకొని మేను విడువ బ్రయత్నించినది.

ఆ యమ్మవా రానాతి పాతివ్రత్యమున కచ్చెరు వందుచుఁ బ్రత్యక్షమై యోహో సాధ్వీ! సాహసము మానుము. నీ సత్యమునకు మెచ్చుకొంటి. నీ కెద్దియేని కామ్యముండినఁ గోరుమని బలికిన విని యక్కలికి మై బులకింప నద్దేవికి మ్రొక్కి పెక్కుతెరంగుల స్తవము జేయుచు నమ్మా నేను నా పతి యనుమతిలేక యేదియుఁ గోరను. ఆయన మా యింట నిద్రబోవుచున్నాడు. సెలవైనచో నింటి కరిగి యడిగి వచ్చెద ననుటయు నాశక్తి యందుల కియ్యకొని గయ్యన రమ్మని పంపెను. అప్పు డాపడఁతి మబ్బునుండి వెడలు మెఱపుతీగెయుం బోలె నా యాలయమునుండి మరలి యింటికి వచ్చినది.

బుద్దిసాగరుండు గుడివాకిటఁ బ్రచ్ఛన్నముగా నిలిచి యామాట లన్నియు విని యున్న కతంబునం దనపతి గుణమునకు మిక్కిలి యానందము జెంది యా సుందరి కన్న ముందే చని యెప్పటియట్ల శయ్యయందు బండుకొని నిద్రపోవుచున్నవానివలె గుర్రు వెట్టుచుండెను.

అంత నా నెలంతయు నంతఃపురము జేరి యందు గాఢనిద్రావశంవదుఁడై యున్న పతిని లేపుటకై సంశయింపుచు నమ్మవారు తనకై వేచియున్నది. కాన నామెకుఁ గోపము వచ్చునేమో యని వెరపుతో నతనిమీఁద మెల్లగాఁ జేయివై చినది. అతడు దద్దరిల్లి లేచి కూర్చుండి యావలించి కన్నులు నులుముకొనుచు నించుఁబోఁణి నన్ను లేపితి వెందులకని యెఱుఁగని వానివలె నడిగెను.

అప్పుడా చిన్నది యతనికి మ్రొక్కి జరిగిన కథ యంతయు జెప్పి కోరఁ దగిన గామ్యము సెలవియ్యుఁడని మగని వేడుకొనెను. బుద్ధిసాగరుఁడా ముద్దియను దద్దయుఁ బ్రీతి గౌఁగలించుకొని వనితా మనకు నమ్మవారిం గోరుటకు సకలైశ్వర్యములు గలిగియున్నవి. కావున వానిం గోరక నీవు చేయివేసినంత చచ్చినవాఁడు బ్రతుకునట్లు వరమడుగుము. దాన మిగుల నుపయోగముగా నుండుననుటయు నా నెలఁత వల్లెయని క్రమ్మర సత్వరముగాఁబోయి తనకై వేచియున్న కాళిని మగఁడు జెప్పిన వరమిమ్మని యడిగినది.

ఆ యమ్మవారు నవ్వుచు జననీ! నీవు కోరిన వరము నా కసాధ్యమైనది. జీవులు పూర్వజన్మకర్మానుగుణ్యముగా మృతినొందుచుందురు. అట్టిదానిని మార్చుటకు నా తరంబుగాదు. అయినను నీ యందుగల తాత్పర్యంబునం జేసి యిచ్చుటకు బుద్దిపుట్టుచున్నది. నాకుఁగల శక్తి యంతయు వినియోగపరచి నీవు ముట్టినంత నొక్కడు మాత్రము బ్రతుకునట్లు వరమిచ్చితిని. ఆ పిమ్మట నా వరము చెల్లదు. ఇంతకన్న నాకు శక్తిలేదు. పోపొమ్మని పలికి యమ్మవారు అంతర్ధానమైనది. పిమ్మట నా కొమ్మయు సమ్మోదమంది యతిరయంబునఁ బతియొద్దకువచ్చి యావర్తమానము తెలియఁజేసినది.

అతండును సంతసించుచుఁ గాంతతో ముచ్చటలాడి చేడియా? నే నీ మధ్యను కాశీపురంబున కరిగితిని. అందుండి నీకై కొన్ని వింతవస్తువులు తీసికొని వచ్చితిని. ఆ పెట్టెలోనున్నవి తీసుకొనుమని చెప్పి తాళము చెవి నిచ్చెను.

ఆ బోఁటియు నతిప్రీతితో నా బీగము తీసి పేటికలో చేయిపెట్టి తడిమెను. ఆ సుందరి చేయి తగిలినతోడనే కామపాలుడు నిద్రమేల్కొనిన వానివలె నాపెట్టె నుండి లేచెను. అదిచూచి యా చిన్నది జడిసి బాగు బాగు ప్రాణనాథా! యిందులో నెవ్వరినోయుంచి నగలని నాతోఁ జెప్పితిరా? నేను జడిసితిసుఁడీ! దీనిలోని వారెవ్వరని యడుగుచుండగనే యందుండి లేచి కామపాలుఁడు బుద్ధిసాగరుని యొద్దకు వచ్చి యా సుగుణావతియే తన భార్య పద్మావతి యనియు నది తన యత్తవారిల్లే యనుకొని యక్కలికి నతని ప్రక్క నుండుటకు మిక్కిలి శంకించుకొనుచు నతని కిట్లనియె.

ఆర్యా! నీ వింత పాపకృత్యమున కొడిగట్టితివేల ? నేను నిద్రబోవుచుండగా నా ప్రక్కజేరి నా భార్యతో మాటాడవచ్చునా ? అట్టి యభీష్టమున్నచో నాతోఁ జెప్పరాదా! నేనే యెప్పింతునే యని కొన్ని నిందావాక్యము లాడెను. అప్పుడు బుద్ధిసాగరుఁ నవ్వుచు నతనితో నతఁడు పరుండి నిద్రపోయినది మొదలు పెట్టెలోనుండి లేచువరకు నడుమ జరిగిన చర్యలన్నియుఁ దెలియజేసి యా చిహ్నముల నెల్ల చూపించుచు మిత్రుని గాఢాలింగనము జేసికొని కన్నుల నానందబాష్పములు గార్చెను.

ఆ వృత్తాంతమంతయు విని కామపాలు డొక్కింతసేపు నిశ్చేష్టితుఁడై యూరకుండి శిరఃకంపము జేయుచుఁ బుద్ధిసాగరుఁడు తన్ను గురించి జేసిన గృత్యములవేఁ తెరంగుల స్తుతిజేయుచు నిట్లనియె. తమ్ముడా మనమువచ్చి పెద్దకాలమైనది. మన తల్లిదండ్రులు శోకవార్ధి మునిఁగి యుందురు. నాకు వారింజూడ మిగుల దొంద రగా నున్నది. మనదేశము పోవలెననుటయు నతండు సమ్మతించి అన్నా! మనము ఒంటిగా బోవుటకంటె భార్యలతోఁ బోయి మన తలిదండ్రులకు వందనము జేసినచో వారు మిగుల నానందింతురు. కావునఁ జిత్రసేన నిచ్చటికిఁ బిలిపించెదను. ఆమె వచ్చిన తక్షణమే పోవుదమనుటయుఁ గామపాలుం డయ్యో తమ్ముడా! నాకు స్త్రీజాతి యం దసహ్యము పుట్టినది. నేనిఁక స్త్రీలను జూడను. నాకు భార్య యక్కరలేదని విరక్తిమాటలు చెప్పెను.

బుద్ధిసాగరు డా మాటలువిని యతనితోఁ గామపాలా! నేనును నీ వలెనే మొదట స్త్రీ జాతియంతయు దుర్మార్గమైనదే నమ్మదగినది కాదని యూహించితిని గాని నా భార్య సుగుణవతి గుణసంపత్తి జూచినది మొదలు అట్టి సంకల్పము మరలినది . స్త్రీలలోఁగూడ యోగ్యులుం యోగ్యులందరిని దృఢముగాఁ జెప్పగలను. దుర్మార్గురాలైన పద్మావతి తాను జేసిన పాపమునఁ దానే చెడిపోయినది. చిత్రసేన మిగుల సాధ్వి యని చెప్పగలను. ఇప్పు డప్పడఁతిని రప్పింతునని చెప్పి యెట్టకేల కతని నొడంబరచి యప్పుడే నమ్మకముగల పరిచారకుల నత్తరుణిఁ దీసికొనివచ్చుటకుఁ బంపెను.

రాజకింకరులు తదాజ్ఞానుసారముగాఁబోయి చంద్రగుప్తునకుఁ గామపాలుని యుత్తరమును జూపించి యెక్కుడువిభముతో నామెం దోడ్కొనివచ్చిరి. కామపాలుఁడు చిత్రసేనం గలిసికొని తమపడిన యిడుమలన్నియుఁ జెప్పుకొనుచుఁ గొన్నిదినంబు లందుండెను. ఒకనాడు శుభముహూర్తమున బుద్దీసాగరుఁడు గామపాలుఁడు భార్యలతో దమ దేశమునకై ప్రయాణముచేసి నడుమ నడుమ శిబిరములు వైచికొని విశ్రమించుచుఁ బోవఁజొచ్చిరి. ఒక్కనాఁడు మధ్యాహ్నమున నొకతోటలో బస చేసిరి. అప్పుడు బుద్ధిసాగరుఁడు దేహబాధకై కొంచెము దూరముగా బోయి యొక చెట్టుక్రిందఁ గూర్చుండెను. అట్టి సమయంబునఁ బూర్వము వచ్చిన పక్షులు రెండును ఆ చెట్టుమీఁద వ్రాలి యిష్టములగు పలుకులు చెప్పుకొనఁ దొడంగినవి.



చిత్రసేనకథ

అప్పు డాఁడుపక్షి మగపక్షితో రేడా! యీతోటలోఁ దిగిన వారెవ్వరవి యడిగెను. మగపక్షి తన్వీ! వీరొక దేశపు రాజకుమారులు. ఈ రాత్రి వీరిలో గామపాలుండను వానిభార్య చిత్రసేన యను చిన్నది క్రీడాలసయై నిద్రించు సమయంబున రవిక విడియున్న యామె స్తనాంతరమం దొకసర్పము విషము గ్రక్కిపోవును. అయ్యబల యొత్తిగిలినంత పాలిండ్లం గల నఖక్షతరక్తమ్మునఁ గలిసి యా విషము తలకెక్కి యక్కలికి ప్రాణంబులం బాయునని చెప్పి యప్పతంగం బంగనతోగూడ నెగిరి యెందేనిం బోయెను.

బుద్దిసాగరుఁ డా పక్షి వాక్యంబులు విని మరల చింత వహించి దానిం దప్పించు నుపాయము వెదకుచు నొరుల కెఱింగించిన వారు రాయి యగుదురను మాట వినుటచే నవ్విధం బెవ్వరికిం జెప్పక యారాత్రి యెట్లో వారా ప్రాంతముననే పండుకొని నిద్రింపక యా సాము రాక కెదురుజూచుచుండెను.

అంత నర్దరాత్ర సమయంబున విచిత్రపటకుటీరములో రతిక్రీడావసులై చిత్రసేనాకామపాలురు గాడనిద్రజెందియుండ నొక కుండలి భూవివరంబునుండి పైకివచ్చి బుసకొట్టుచు నట్టట్టె యా చిత్రసేన స్తనాంతరమందు విషముగ్రక్కి వచ్చినదారింబట్టి పోయినది. ఆహా! పక్షివాక్య మెంత సత్యమైనదో చూడుము. అప్పుడు బుద్ధిసాగరుఁడు మెల్లనబోయి యా పల్లవపాణి దొర్లకుండ దన నాలుకకు గుడ్డచుట్టుకొని తదీయ స్తనాంతరమందున్న విషము నద్దుచుండెను.

అప్పుడు చిత్రసేన దైవయత్నమున మేల్కొని తనచన్నులు నడుమ నాలుకచే నద్దుచుండుట దెలిసికొని యడిరిపడిలేచి యెవ్వడో నన్నుఁ బట్టుచున్న వాఁడని యరచెను. ఆ రోదనేఁ గామపాలుండు మేల్కొని యేమేమి యని యరచెను. పిమ్మట నా కొమ్మ బుద్ధిసాగరుని నానవాలుపట్టి బుద్ధిసాగరుండు దన్ను గామించి పట్టుచుండెననియు నింతలోఁ దనకు మెలకువ వచ్చినదనియుఁ జెప్పి యతని నిందింపఁ దొడగెను.

కామపాలుండు బుద్ధిసాగరుని యందుగల మైత్రిచే నేమియు ననలేదు. కోపదృష్టితో నతనిం జూచి శిరఃకంపముచేసి యతనితో మాట్లాడుట మానివేసెను . "మిత్రదండ మభాషణం" అనునట్లు స్నేహితునితో మాట్లాడకపోవుటయే శిక్ష కావున నట్టి కోపమునఁ దనతో మాట్లాడుకున్నను బుద్ధిసాగరుఁడు కోపింపక నతనితోడనే విడువక పోవుచుండెను. అట్లు బుద్ధిసాగరుడు తన్ను విడువక వచ్చుచుండఁ జిత్రసేనయొక్క బోధచేఁ గామపాలుం డొక్కనా డటుపైనఁ దనతో రాఁగూడదని భృత్యముఖంబుగాఁ దెలియజేసెను. కటకటా! రాజులు దుర్మదాంధులుగదా! అందులకు జింతించి బుద్ధిసాగరుం డయ్యా! నాకీ యాపద యేటికి వచ్చినది? నిజము చెప్పిన నేను శిలయగుదును. చెప్పనిచో నా మిత్రునికి నాయందుఁ గోపము విడువక బెరుగుచున్నది. ఏమి చేయుదును? యిట్టి చింతతో మిత్రునికి శత్రువునై యుండుటకంటె రాయిగా నుండుటయే మేలని తోచుచున్నది.

కామపాలునికి నాయందుఁ గినుక యుండుట తప్పుకాదు. తన భార్యను గామించిన వానియం దెవ్వరికి నీర్ష్యయుండదు? దైవాగతమైన యా సూక్ష్మ మెఱింగికొన నతనికి శక్యమా? ఇంతకు నాపురాణకృతం బిట్లున్నది. యథార్థము జెప్పినచో నిప్పుడు నేను బొందు దుఃఖమతనికిఁ రాగలదు. నాకు శిల యయ్యెడు యోగమున్నది. విధిగతి మహానుభావులైన రాజులే దాటలేకపోయిరి. ఇక మాబోటివారన నెంత.

శ్లో॥ రామేప్రవ్రజనం బలేర్ని యమనం పాఁడోస్సుతానాం వనం
      వృష్టీనాంనిధనం నలస్యనృపతే రాజ్యాత్పరిభ్రంశనం
      కారాగారనిషేవణంచ మరణం సంచిత్యలంకేశ్వరే
     సర్వః కాలవశేన నశ్యతి నరః కోవా పరిత్రాయతే.

అని యనేకప్రకారముల నాలోచించుకొనుచు మెల్లన నతనియొద్దకుఁబోయెను. కామపాలుండును వానిమోము చూడనొల్లక పెడమొగముపెట్టి యతనితో మాట్లాడ లేదు. అట్టి యవమానమునకుఁ జింతించుచు బలాత్కారముగా నతనిచేయి పట్టుకొని మిత్రుడా! నీకు నాయందిట్టి యసూయ యుండదగినదే కాని నా చెప్పబోపు మాటలువిని పిమ్మట నీ యిష్టము వచ్చినట్లు చేయుము. పూర్వస్నేహమునైనను స్మరించి నా వచనంబులు సాంగముగా నవధరింపుము. నావచనాంతమే మదీయజీవితాంతముతోఁగూడ నీ స్నేహాంతమగుచున్నదని పలికినఁ గామపాలుం డీర్ష్యతోడనే యందలి యర్ధంబు గ్రహింపలేక యది యెద్దియో చెప్పుమనునట్లు శిరఃకంపముతో సూచించెను.

పిమ్మట బుద్ధిసాగరుఁడు గన్నుల నీరునించుచుఁ గామపాలునితో శ్రీరంగపుప్రాంతమం దారామములో శయనించియుండఁ బక్షులు చెట్టుమీఁదవ్రాలి సంభాషించి కొనిన తెరంగును కోటబురుజు విరిగినరీతియు భోజనసమయమున తొలిముద్దయందు జేపముల్లు వచ్చుటయు, దాంబూలములోఁ బురుగు లుండుటయు నవి తాను గ్రహించిన విధంబును భార్యచేతిలో మృతినొందుటయు మరల నా పక్షులే తాను దేహబాదకై గూర్చుండియుండగా, జెట్టుమీద వ్రాలి సంభాషించుకొనిన మాటలు నందులకై నాలుకకు గుడ్డకట్టుకొని యా విషం బద్దిన విధముఁ జెప్పి మిత్రడా! యీ రహస్యము పక్షి శాపభీతిచేఁ చెప్పకుంటిని. ఇదియేసుమీ కారణము నాయం దనుగ్రహ ముంచుమీ యనుచుండ నంతకుమున్నె పాదములు మొదలుకొని వ్యాపించుచున్న పాషాణత్వము వక్త్రభాగము నాక్రమించుటచేఁ బిమ్మట మాట్లాడుటకు వీలులేక పోయినది.

అట్లు జరిగిన కథయంతయుజెప్పి పక్షి శాపంబున రాయియైయున్న బుద్దిసాగరుని యాకారమునుఁజూచి కామపాలుఁడు గుండెలు బాదుకొనుచు అయ్యో! మిత్రుడా! నిన్నూరక నిందించితినే! కటకటా! నావంటిపాపాత్ముఁ దెండయిన గలడా? అన్నన్నా! యుపకారము చేసిన నిన్నూరక రాయిగాజేసిన నాపాతకంబున కంతముండునా యమ కింకరులు నన్నేరకమునఁ బడవైచి వేధింతురో! అయ్యో తెలిసికొనలేకపోతినే? యీ వచనాంతమే జీవితాంతమంటివి. చీ! చీ! నా యీర్ష్య నన్నంత శ్రద్ధగా విననిచ్చినది గాదు. స్త్రీమూలముననేగదా నాకీ యాపద వచ్చినది. కపటస్వభావముగల యొక స్త్రీ నిమిత్తము ప్రాణమువంటి మిత్రుని జంపుకొనిన నావంటి మూర్ఖు డెందేని గలడా? నిజముగా నతనికట్టి యుద్దేశమున్నను నా చిన్నదానిని సమర్పింపకుండవచ్చునా? దాని నా కతండేగదా పెక్కిడుములుపడి సంఘటించెను. అక్కటా! నాకై యతఁడుపడిన పాటు తలంచుకొనినంత శరీరము వివశమగుచున్నది. సీ! ఇటువంటి మిత్రుని జంపి బ్రతికియుండుటకంటె నీచమున్నదా యని తలఁచుచు బుద్ధిసాగరా! యని పెద్దయెలుంగున నేడ్చుచు నతని పాదంబుల తన తలవైచి బద్దలుగొట్టుకొనఁబోయెను.

అప్పు డతని సాహసమునకు వెరచి చిత్రసేన వచ్చి చేతులు బట్టుకొని యనేక విదముల నోదార్చినది. ఆ మాటలేమియు బాటింపక బోఁటీ! దూరముగా నుండుము. మిత్రఘాతకుండగు నన్ను ముట్టకుమని పలుకుచుఁ దన తల నూరక యతనిపాదంబులం వైచి రక్తంబుగారఁ గొట్టుకొన దొడంగెను.

ఆ వృత్తాంతమంతయును విని సుగుణావతి గోలుగోలున నేడ్చుచు గుండెలు బాదుకొనుచు నచ్చటికివచ్చి శిలారూపముగానున్న బుద్ధిసాగరునిగాంచి హా ప్రాణనాథా! యని పెద్దకేకలుపెట్టి యా విగ్రహమును గౌఁగిలించుకొన బిట్టుగా నేడువఁ దొడంగినది. ఆ సుగుణావతిం జూచి కామపాలుఁడు అయ్యో సాధ్వీ! నీ మగని నిష్కారణముగా జంపితిని. పాతివ్రతధర్మముచేత నన్ను బ్రతికించితివి. నీవు నీపతిని బ్రతికింపలేవా? నాకై కాదా? నిన్నమ్మవారి నట్టి వరము వేడుకొమ్మనెను. అతని జీవితాంతము వఱకు నా నిమిత్తమే శ్రమపడెను. కటకటా! నేను క్షణములో మేనునిడిచి లోకాంతరమున నతనితో గలిసికొందును అతనితో నీవేమైనం జెప్పగల వార్తలుండిన వక్కాణింపుమని యనేక ప్రకారముల శోకించుచుండెను.

మగఁడు పరదేశమందుండి రాకున్న దుఃఖించుచు శక్తికి నతఁడు వచ్చినతోడనే తన ప్రాణంబుల బలియియ్య మ్రొక్కి యట్లు చేయబూనిన సాధ్వి నిజముగా మగఁడు రాయిగానున్న సమయములో నెంత చింతించునో యూహింపఁదగినదే! ఆ సుగుణావతి శోకముతో నా రాయిం గౌఁగలించుకొనుచుఁ గామపాలునికన్న ముందే ప్రాణములు విడువఁ దలంచెను.

ఆ సమయంబునఁ గామపాలుం డయ్యో! తనకు మిత్రహత్యయేగాక స్త్రీహత్యగూడ సంప్రాప్తించునని వెరచుచు నా తరుణిం బట్టుకొని శోకోపశమనంబు జేయుచు నిట్లనియె.

సాధ్వీ ! మనిద్దర మితనికై మూరక చచ్చిన నేమి లాభమున్నది? అతని బుద్ధి బలమునే నన్ను బ్రతికించుకొనెను. మనముగూడ నీ యడవిలోఁ దపముజేసి యతని శిలాత్వము బాపుదము. నీ చిత్తశుద్ది వలన నతండు తప్పక బ్రతుకగలఁడు. నీవిందు నిష్టబూని యుండుము. నేనును యోగం బవలంబించి యుండెదనని చెప్పిన నప్పడతియు నతండు చెప్పిన యుపాయమునకు సంతసించుచు నప్పుడె శృంగారవేషంబు దీసి పారవైచి యోగిని వేషము వైచుకొని యా ప్రాంతమందే తపము జేయుచుండెను. కామపాలుండును ఆ సేనతోఁగూడ జిత్ర సేనను బుట్టినింటికనిపి యోగియై యాయడవి యందే సంచరించుచుండెను.

గోపా ! నీవు చూచిన రాతివిగ్రహమా బుద్ధిసాగరుని యాకృతిసుమా! వెంట్రుకలు శరీరభిన్నములైనవి కావున శిల కాలేదు. దానంజేసి రాతివిగ్రహమునకు జుట్టు యున్నది. ఇదియే దీని వృత్తాంతము అని చెప్పిన మిగుల సంతసించుచు నా గొల్లవాడు అయ్యో! పాప ముపకారము జేయఁబూనిన బుద్ధిసాగరుఁ డిట్లు ఱాయియయ్యెనే! కటకటా! యీతం డీలాగున నెంతకాల యుండఁదగినది? వీని కెప్పటికేని శాపవిమోచన మగునా? త్రికాలవేదులైన మీరెఱుంగగాని యర్థం బుండదని అడిగిన వాని దయాహృదయంబునకు సంతసించుచు నమ్మణిసిద్ధుం డిట్లనియె.

గోపా! నీకు సంతసమేని వానికి నిజరూపము వచ్చునట్లు నేను చేయఁగలను. చూతువుగాని రమ్మని యతనితోఁగూడ నా శిలావిగ్రహము కడకుఁబోయి దానిపై మంత్రాక్షతలు జల్లినంత బుద్ధిసాగురుఁడు పాషాణత్వము విడిచి నిజరూపము ధరియించి యమ్మణిసిద్ధునిచే దనకు శాపవిమోచనమైనట్లు తెలిసికొని యతని పాదంబులంబడి యనేక ప్రకారముల వినుతించెను. అమ్మణిసిద్దుఁడు బుద్దిసాగరుని లేవనెత్తి గారవించి తన శిష్యునికిఁ దెలియుటకై యతనిచే నతని వృత్తాంతమంతయు మరలఁ జెప్పించెను.

అప్పుడు గోపాలుఁడు. దమగురువుగారి యద్భుతశక్తికి మెచ్చుకొనుచు నా యడవిలో యతివేషముతో దిరుగుచున్న కామపాలుని సుగుణావతిని వెదకి యచ్చటికిఁ దీసికొనివచ్చెను. వారిరువురు నిజరూపము ధరించియున్న బుద్ధిసాగరునిం జూచి యానందపారావారంబున దేలుచు నతనిం గౌఁగలించి పెద్దయుంబ్రొద్దు మాటలు రాక కంఠంబును డగ్గుతికముజెందఁ గన్నుల నానందబాష్పములు గ్రమ్మ దృష్టుల నిరోధింప నేమియుంబలుకక యట్లేయుండిరి.

అంత కొంతసేపునకు నా మువ్వురు మణిసిద్ధుని గోపాలునిఁ బెక్కుగతుల స్తుతిజేసి వారి యనుమతివడసి తమదేశంబునకుఁబోయి తల్లిదండ్రుల కానందము గలుగఁజేసిరి.