కాశీమజిలీకథలు/మొదటి భాగము/పండ్రెండవ మజిలీ

వికీసోర్స్ నుండి

పండ్రెండవ మజిలీ

చేపనవ్విన కథ

మణిసిద్ధుండును గోపాలునితోఁ బదిరెండవమజిలీ చేరి యందొకతోటలో నినుపచిక్కముల వ్రేలగట్టబడి స్త్రీలయాకారముతో నున్న కొందఱఁ బురుషులం గాంచి వారివృత్తాంత మెఱింగింపుమని యడిగిన నగ్గొల్లనికి నయ్యతిపుంగవుండు దన మణిమహిమచే నంతయుఁ దెలిసికొని యక్కథ నిట్లు సెప్పదొడంగెను.

గోపా! యీపురము కళింగదేశమునకు రాజధానియైన ధర్మాపురమని పిలువ బడుచున్నది. దీని సింహధ్వజుఁడనురాజు ప్రభుకీర్తియను మంత్రితోఁగూడి పాలించుచుండెను. ఒకనాఁడు గొందఱు పల్లెవాండ్రు తమకు దొరికిన యద్భుతమైన చేప నొకదాని జీవముతో నుండగానే పారితోషికమందు నాసతో నారాజునొద్దకుఁ దీసికొని పోయిరి.

ఆసింహధ్వజుఁడు వింతవస్తువులనిన మిగుల సంతసించును. దానిం జూచి వెఱగుపడచు గ్రామములోనున్న పెద్దమనుష్యులకుఁ మిత్రులకు సామంతులకు వార్త పంపి యా వింతచేపను జూపించెను. దానిం జూచిన వారెల్ల దమ జీవితకాలములో నటువంటి పెద్దచేపనుఁ జూడలేదని చెప్పదొడంగిరి. అట్లు దానినిఁ గొంతసేపుంచి యారాజు అంతఃపురంబునకు బంపి తన భార్యలకుఁగూడ నావేడుక జూపింప నిశ్చయించి యాపల్లెవాండ్రతో నోరీ! యిది యాఁడుదా? మగదా? యని యడిగెను.

ఆ రాజునకు మిగుల చక్కనివారును యౌవనము గలవారును భార్యలు పెక్కెండ్రు గలరు. అతడు స్త్రీలచర్యలు కడుచిత్రములని యెంచి వారిశుద్ధాంతమునకుఁ బోతుటీఁగనేనియుఁ బోకుండఁ గాపుపెట్టించెను. ఆ చేప మగదియైనచో లోనికిఁ బంపఁగూడదనియే యట్లడిగెను.

ఆ పల్లెవాండ్రు రాజుతో నయ్యా! చేపలలో స్త్రీ పురుష వివక్షత గనిపెట్టుట కష్టము. ఇది యాడుదో మగదో మాకుఁ దెలియదని జెప్పిరి. ఆ మాటలు విని యీ రాజు దాని నంతఃపురమునకుఁ బంపవచ్చునా? పంపకూడదా? యని యాలోచించుచుండ సగము ప్రాణముతోనున్న యా చేప పక్కున నవ్వి గిలగల కొట్టుకొని కొంత సేపటికి బ్రాణములు విడిచినది.

ఆ చేప నవ్వుట చూచి సభవారెల్లరు వెరగుపడిరి. అప్పుడా రాజు సందేహ మందుచు మంత్రిం జూచి యార్యా! ఈ చేప యేమిటికై నవ్వెనో చెప్పఁగలవా? యని యడిగెను. ఆ మాట విని ప్రభుకీర్తి. రాజా! సాధారణముగా మనుష్యులు నవ్విన కారణమే తెలిసికొనుట దుర్ఘటనము. మఱియు విజాతియైన చేప నవ్విన కారణ మెవ్వఁడు చెప్పఁగలడు? తఱచు బాలభావముగల రాజు లీలాటిప్రశ్నములే వైచి ప్రధానుల జిన్నపుత్తు రిది తగనిపని యని యాక్షేపించెను.

ఆ మాట విని కోపించి యారాజు మంత్రీ! చేప యూరక నవ్వదు. కారణ మేదియో యుండకపోదు. ఆ కారణము చెప్పుటకై నీకు నారుమాసములు మితి యిచ్చితిని. అప్పటికి జెప్పకపోయితివేని నిన్నుఱి దీయింతునని కఠినముగాఁ బలికి సభ చాలించి యప్పుడే యతం డంతఃపురమునకు బోయెను.

అప్పు డచ్చటివారెల్ల రాజశాసనము కడుక్రూరముగా నున్నదని నిందించిరి. మంత్రియు నేమియుంబలుకక చిన్నబోయి రాజుగారి నొవ్వనాడుటచేతనే యిట్టియాజ్ఞ యిచ్చెనని పశ్చాత్తాపమందుచు విచారముతో నింటికిఁబోయి చింతాసదనంబునం బండుకొని పెక్కుతెరంగుల ధ్యానించుచుండెను.

కొంతసేపునకు భోజనమునకు లెమ్మని పరిచారకలువచ్చి పిలచిరి. అతఁడు వారికి నుత్తరమే చెప్పలేదు. దాన శంకించుకొనుచు వాండ్రు అతని భార్యతో నా మాట చెప్పిరి. అప్పుడప్పడఁతి పతియొద్దకు వచ్చి భోజనమునకు లెమ్మని పిలిచినది. ఆమె మాటలు బాటింపక చింతిపుచుండెను. పిమ్మట నామంత్రికూఁతురు లవంగి యనునది మాతృబోధచేవచ్చి తండ్రిని లేపెను. దానితో నతఁడు నేను భోజనము చేయను. మీరు భుజింపుఁడు అని మాత్రమే చెప్పెనుగాని యెంత యడిగినను కారణము చెప్పఁ డయ్యెను.

అప్పు డాలవంగి ప్రద్యుమ్నుఁడను తన యన్నయొద్దకుఁబోయి అన్నా! మన తండ్రి యెద్దియో విచారముతో నుండి భోజనమునకు లేవకున్నాడు. ఎవరుపోయి లేపినను గారణము చెప్పక యూరక లేవననుచున్నాడు. నీవుకూడ వచ్చి పిలువుము నీతో నేమైన మాట్లాడునేమో యనుటయు నా ప్రద్యుమ్నుఁడు వేగము దండ్రియొద్దకు వచ్చి యతని ప్రక్కలోఁ గూర్చుండి నాయనా! భోజనమునకుఁ లేవననుచున్నారఁట కారణమేమి? యేదియైన మావలనఁ దీరవలసిన కార్యమున్న జెప్పుఁడు. ప్రాణంబు లిచ్చియైనఁ జేయుదుము. ఊరకిట్లు పట్టుపట్టవచ్చునా! చిన్నవారము మేము గోపగించినప్పుడు మీరు దీర్చవలసినదికాని మిమ్ముఁ దీర్చ మే మెంతవారము లెండని ప్రార్థించిన విని మంత్రి పుత్రుని గౌఁగిటలోఁ జేర్చుకొని ప్రత్యుమ్నా! మీరందరు పిల్లవాండ్రగుటచే మీతో జెప్పలేదు. కోపగించికాదు. ఏమని చెప్పుదును? నాకాయుర్దాయ మిఁక నారుమాసము లున్నది. ఈ యవివేకపురాజు తానడిగిన ప్రశ్నము చెప్పుటకు నారు మాసములు మితియెచ్చి చెప్పలేకపోయినచో నన్నురి దీయుటయేకాక మన యాస్తి యంతయు లాగికొని మిమ్మదంబరను లేవఁగొట్టునట! ఇట్టిదారుణ మెందైనగలదా?

అన్నన్నా! చేప నవ్వుటయేమి ఆ రహస్యము చెప్పకబోయిన నన్నురిదీయుట యేమి? చేప నవ్వినకారణ మెవ్వఁడు చెప్పఁగలడు? ఈ లవంగికిఁ బెండ్లియైన జేయలేకపోయితిని. నీవు గడుపిన్నవాఁడవు. నా యనంతరము మీ రేమైపోయెదరోయని విచారించుచుంటిని. ఇట్టి విచారముతోనుండ నోటి కన్నము రుచించునా? యని పలికి పుత్రుం గౌఁగలించుకొని యేడువసాగెను. లవంగియు ప్రభుకీర్తి భార్యయు నామాట విని విచారింపఁదొడఁగిరి.

అప్పుడు ప్రద్యుమ్నుడు తండ్రి నూరడింపుచు మీ రిప్పు డూరక చింతింపకుఁడు. ఇంక నారుమాసములు మితియున్నదిగదా! దైవమింతలో మనకేదైన నుపాయము తోపింపఁడా? దైనయత్నములేక యేకార్యము జరుగదు! నేను దేశాటనముచేసి యాకారణము తెలిసికొని వచ్చెద. లోకమున బుద్ధిమంతు లుండకపోరు. కావున నాకు సెలవీయుఁడు. మీరు భోజనమునకు లెండనిపలికినఁ బుత్రునిధైర్యమునకు సంతసించి ప్రభుకీర్తి భజించెను. అప్పుడే ప్రయాణమునకు లేచి సవరించుకొనుచున్న యన్నగారినిఁ జూచి లవంగి యిట్లనియె. అన్నా! నీ వెన్నఁడును ఇల్లువిడిచి యడుమలఁబడన వాఁడవు కావు. ఒంటిగా దేశాటనము చేయలేవు. నేనుగూడ నీతో వచ్చెదను. తీసికొని పొమ్మని చెప్పిన నతం డెట్టకేల కియ్యకొనెను. వారిరువుర ప్రయాణమును విని మంత్రి విచారముతో నిట్లనియె.

అయ్యో! నా పసికూనలారా? రాజు నన్నారుమాసములపైన నుఱితీయించును. మిమ్ముఁ జూడనిచో నిప్పుడే ప్రాణములు పోఁగలవు. ఈయారుమాసములైన గన్నులకుఁ గనబడకుండ దూరముగాఁ బోయెదరా? దైవ మెట్లుచేయదలఁచిన నట్లుచేయక మానఁడు. మీరు పోవల దింటనే యుండుఁడని పలికినఁ దండ్రి నెట్లో సమాధానపరచి మంచిలగ్నమున వారిరువురు పరదేశమునకుఁ బోయిరి.

వారి కశ్వగమనమున మిగుల నేర్పుగలిగియున్నది. మంచివేగముగల గుఱ్ఱము లెక్కి సాయంకాలమునకే విశేషప్రయాణము చేసిరి. నడుమనడుమఁ జిన్నగ్రామములలో నివసించుచు నాలుగుదినములకు నమారావతి యనుపట్టణము చేరిరి. అందు సత్రములో బసచేసి యా యూరివింతలన్నియుఁ జూచుచు దమకు బుద్ధిమంతులని తోచిన వారినెల్లఁ జేపనవ్విన కారణ మడుగుచుఁ బదిదినము లందుండిరి. వారి మాట వినినవారెల్ల పరిహాసముచేయుచు నీపాటిపనికై యింతప్రయత్నము చేయవలెనా యని నవ్వసాగిరి.

మఱియొకనాఁడు సాయంకాలమున నూరంతయుఁ దిరిగివచ్చి ప్రద్యుమ్నుఁడు లవంగి కిట్లనియె. అమ్మాణీ! మన మీయూరువచ్చి పదిదినములైనది. మనమాట యెవ్వరినడిగినను నవ్వుచుండిరిగాని తగు నుత్తరము చెప్పరైరి. అంత బుద్దిమంతు లీయార లేనట్లు తోచుచున్నది. మఱియు కోటగోడమీఁద నొక శాసనము జూచితిని. ఈపట్టణపు రాజకూఁతురు ప్రభావతి యనునది సకలవిద్యలయందుఁ బ్రౌఢురాలనియుఁ జతురంగములో నామె నోడించినవారితో పెండ్లిచేయుదుమనియు వ్రాయఁబడియున్నది. ఓడిపోయినచో నురిదీయుదురఁట ! దానితో జతురంగమాడి యనేకు లురిదీయబడిరి. మన యిరువురకుఁ జతురంగమందు మిగుల పాటవము గలదు గదా! నేను రేపుపోయి దాని నోడించివత్తునే? యనుటయు నతని కా లవంగి యిట్లనియె.

అన్నా! మన మొకకార్యమునకై వచ్చి వేరొకకార్యమునకుఁ బ్రయత్నింప నేటికి? మనపనియైన వెనుక నెన్నికార్యములేనియుఁ జేయవచ్చును. ఇదియునుం గాక యొకవేళ నోడిపోయినచో నేమి చేయనగు. జయాపజయము లెవ్వరు చెప్పఁగలరు? పోవలదుడుగుమని పలికిన నతండు నవ్వుచు నన్నుఁ జతురంగములో నోడించువా రీమూఁడులోకములలో గలరా? నా చాతుర్యము నీ వెఱుంగనిదా? ఎఱింగియు నట్లనినచో నేనేమి చెప్పుదునని పలుకుచు నెట్టకేల కాపొలఁతి వియ్యకొనఁ జేసెను.

అంత మరునాఁ డతఁడు చక్కగా నలంకరించుకొని కోటయొద్ద కరిగి యచ్చట నున్న యుద్యోగస్థులతో నేను ప్రభావతితోఁ జతుగంగ మాడెదననియు నచ్చటికిఁబోవ నుత్తరమీయవలయుననియుఁ జెప్పుకొనెను.

ఆమాట లాయుద్యోగస్థులు విని అయ్యో కుమారా! నీ రూపముజూడఁ గడువింతగానున్నది. నీకు బ్రతికునం దాసలేదా యేమి? యూరక యేల చావఁ బ్రయత్నించెదవు? అవిగో పుఱ్ఱెలను చూడుము. నీవంటివారే వచ్చి ప్రభావతితోఁ జదరంగమాడి యోడిపోయి యుఱిదీయఁబడిరి. పోపొమ్మని పలికిన నతండు నవ్వుచు అయ్యా నా బ్రదుకు జోలి మీకేల? నేను ప్రభావతితోఁ జదరంగమాడ వచ్చితిని. యీ వార్త రాజుతోఁ జెప్పుడు. అంతియ మీరు చేయునది. లేనిచో శాసన మేటి కిందు వ్రాసితిరి? అని ధైర్యముగాఁ బలికిన వారు, బాబూ! మాకేమి? నీకై చెప్పితిమిగాని వేరుకాదు. నీ యిష్టము అని పలికి యా వార్త రాజునకుఁ దెలియఁజేసిరి. జయభద్రుఁడును ఆ వార్త కూఁతునకుఁ దెలియఁజేసెను.

ప్రభావతియుఁ బెక్కుదినములనుండి యెవ్వడు దనతోఁ జదరంగమాడ కుండుటచే నప్పుడు మిగుల సంతసించుచుఁ బ్రవేశపెట్టవచ్చునని క్రింది యధికారుల కాజ్ఞాపత్రికలం బంపినది. వానిం జూచుకొని యా యుద్యోగస్థులు ప్రద్యుమ్నుని నొకదాదివెంట నంతఃపురమునకు బంపిరి. అతనిం జూచినవారెల్ల కాలముమూడినవానిగాఁ దలంచుచుఁ జింతింపఁదొడంగిరి.

ఆదాది ప్రద్యుమ్నునిఁ జతురంగకేళిగృహంబునకుఁ దీసికొనిపోయి యొక పీఠంబున గూర్చుండఁబెట్టెను. ఆతం డాయింటి యలంకారమున కచ్చెరువందుచుఁ బ్రభావతి రాక కెదురుచూచుచుండెను.

ఇంతలో నొకబంగారుబల్లపై నమర్చిన గళ్ళబల్లనుఁ బల్లవపాణులు కొందరు దెచ్చి ముందుపెట్టిరి. అంత నాకాంత యశేషపురుషమోహనవేషంబుతోఁ జెలికత్తెయల చేతు లూతగాఁ బూని యచ్చోటి కరుదెంచి యతని చూపులకు మిరుమిట్లు గొలుపుచుఁ దళుక్కురని మెరయుచు నా బల్ల కవ్వలనున్న పైగద్దియం గూర్చుండి యూడిగింపుచేడియ లిరుగడ నిలిచి వింజామరలు వీవ నా ప్రద్యుమ్నునితోఁ జతురంగ మాడఁదొడంగినది.

అమ్మదవతి మొదట నతని నేమియుఁ బల్కరింపక తన వాలుదళ్కుచూపు లొకసారి యతని మొగముపైఁ బరగించినది. దానంజేసి యతని హృదయము చెదరిపోయినది. వెఱ్ఱివానివలె నొడలెఱుంగక యక్కురంగనయన సోయగం బుపలక్షించుచు నాటయం దించుకేనియు జ్ఞానముంచలేదు. మరియు నిత్తరుణీకక్షమూలకాంతి కంచుకిని జించుకొని బయల్పడఁ జేయెత్తి బలముసద్దునప్పు డతని దృష్టియంతయు, నా ప్రాంతమందే సంచరించుచుండినది. గెలుపు సంతసంబున వేగిరించి యమ్మించుఁబోఁణి బలము నవతరించునెడ రత్నపుటుంగరముల రంగునకు మెఱుఁగిడు నంగుళులు దన కరంబునకుం దగిలెనేని మేనెల్లం బులకలుబొడమ నతండంతటితోఁ దన మేను సార్ధకమైనట్లు సంతసించుచు ఈ తీరున నా ప్రద్యుమ్నుఁ డా ప్రభావతి రూపవిలాసవిభ్రమములకు వలలోఁబడి కొట్టుకొనుటం జేసి నడుమ రెండాట లోడిపోయెను.

అప్పుడతఁడు తన మోసము తెలిసికొని యౌరా! దీనితో మగవాఁడు చతురంగ మాడి గెలువలేడు. ఇది యాటయందు మిగుల పాటవము లేనిదైనను పురుషులకుఁ దనరూప మెరవైచి వశము చేసికొనుచున్నది. అన్నన్నా! విష్కారణము రెండాట లోడిపోయితినే ? ఇదిగో మూడవయాట తెలివితో నాడి సులభముగాఁ గట్టి వేయుదునని యాడి యా యాట నశ్రమముగాఁ దానిం గట్టివైచెను. అయినను రెండాటలు వరుసఁ బ్రద్యుమ్నుండే యోడెను. గావున సంపూర్ణముగా నోడినట్లే తలంచి యయ్యువతి యతని రాజభటుల యధీనము చేసినది.

ప్రద్యుమ్నుఁడు తన్ను రాజభటులు దీసికొనిపోవ, నయ్యో! నేను బూర్తిగా నోడిపోలేదు. శాసనమున వ్రాసినట్లుగాక వేరొకలాగునఁ జేయవచ్చునా? న న్నె ట్లురి దీయుదురు? యీసారి మరల నాడినచో నన్నియాటలు నేనే కట్టివేయగలను. ఈ మాట రాజుతోఁ జెప్పుడని యా కింకరులను వేడుకొనుటచే వార లావర్తమానము రాజుగారికిఁ దెలియజేసిరి. ధర్మాత్ముఁడైఁన జయభద్రుఁ డావర్త విచారింప దగినదేయని యూహించి యా సందియము దీరువఱకు బ్రద్యుమ్ను నుఱిదీయ వలదని యాజ్ఞజేసెను. ఆ వార్త యూరంతయు వ్యాపించుటచే బౌరులందరు గుంపులుగాఁగూడి చెప్పికొన సాగిరి.

లవంగి యన్న వర్తమానము విని మిగుల విచారించుచు నయ్యో నేనన్నట్లే యైనది! దాని యందమేమో యతని మోసపుచ్చినది. కాని నిజముగాఁ జతురంగములో నతని నోడించువారు లేరు. అగ్ని చెంతబెట్టిన వెన్నువలె నెంత ధైర్యశాలియైనను మగవాని మననుఁ గాంతలచెంతఁ గరుగక మానదు. కానిమ్ము ఉరితీయుట మూఁడు దినములవరకు నాపిరిగదా! నేను రేపు పోయి దాని నోడించి యతని చెర విడిపించెద నని తలంచి మఱునాఁ డుదయంబున నొరులకుఁ దెలియకుండఁ బురుషవేషము వైచికొని యా కోటయొద్దకు బోయి యా యుద్యోగస్థులతో నయ్యా! నేను రాజపుత్రికతో జతురంగమాడ వచ్చితిని. లోనికి దెలియఁజేయుఁడని పలికినది.

ఆ మాటవినిన వారు అయ్యో మూర్ఖుడా! నిన్నను వచ్చినవాఁడు నీకేమి కావలయును. పోలిక మీ యిరువురది యొక్కటిగానే యున్న దే! అతనికైన ప్రాయశ్చిత్తము నీవు వినలేదు. కాఁబోలు! అయ్యయ్యో! ఒకరికైన మరణము జూచియు రెండవవా రామెతోఁ జతురంగమాడ వత్తురేమి ? మాకుఁ జూడ గష్టముగా నున్నది. ఆమెతో మనుష్యమాత్రుఁడు చతురంగమాడి యోడింపలేడు. వట్టిభ్రాంతి యేల పొందెదవు? వచ్చిన దారింబట్టి పొమ్మని పలికినవారి మాటలు పాటిసేయక నేను ప్రభావతితోఁ జదరంగమాడక మరలనని గట్టిగా బలికినది.

అప్పుడా యుద్యోగస్థులు కాలము మూడినప్పుడు మేము చెప్పుమాటలు రుచించునా? యని పనికి యా వర్తమానము ప్రభావతికి దెలియజేసి యామె సెలవు గొని యక్కపటపురుషు నంతఃపురమునకుఁ బంపిరి. అందు బ్రద్యుమ్నునింవలె నుపచారములు చేయించి గద్దియం గూర్చుండబెట్టిన కొంతసేపటికి ప్రభావతి చెలికత్తెలతోఁ గూడవచ్చి యక్కలికితోఁ జదరంగమాడఁ దొడంగినది. అప్పుడు ప్రభావతి పెక్కుచిట్టకములు చూపి తటమటింపఁ దలంచినదిగాని యదియును ముదితయే యగుటచే దాని విలాసము లేమియు నామె మనంబునకు వికారము గలుగఁజేసినవి కావు.

లవంగియు మనంబున దాని యందమున కాశ్చర్యమంది నోహో! దీని సోయగమునకుఁ బురుషులు వలపుజెందుట యేమి యద్భుతము? నన్నుఁగూడ మరులు గొల్పుచున్నది. దీనియాట యంత విన్నాణముగాలేదు. రూపముచేతనే రాజకుమారుల నోడించుచున్నయది అని యూహించుచు సులభముగా ప్రభావతిని లవంగి మూడాటలు గట్టివైచి గెలిచితినని పెద్దకేక పెట్టినది. అప్పు డచ్చటనున్న మచ్చెకంటులెల్ల నచ్చెరువు జెందుచు నౌరా! యీతండు మిగుల చతురుండు ఇంతబుద్ధిమంతు నిదివరకు మేము చూడలేదు. అని స్తుతులు చేయుచు నా వార్త రాజుగారికిఁ దెలియజేసిరి.

ఆ రాజు మిగుల సంతసించుచు నతనికే తన కూఁతునియ్య నిశ్చయించి దైవజ్ఞుల రప్పించి యప్పుడే శుభముహూర్తము నిశ్చయింప జేసెను. ప్రభావతియు నా లవంగి మెడయందు పూవులదండవైచి యతనినే వరించినట్లు తెలియజేసినది. ఆ మరునాఁడే జయభద్రుఁడు ప్రద్యుమ్నుని విషయమై సభ చేసెను? ఆ సభకు లవంగి గూడ వచ్చి కూర్చుండెను. అంతట నారాజు సభ్యులతో బ్రద్యుమ్నుఁడు చేసిన పని యంతయు జెప్పి యితని నురిదీయుటచే దాను వ్రాసిన శాసనమున కేమైన విరుద్ధ మగునా యని యడిగెను.

ఆ ధర్మసందేహ మెవ్వరును జెప్పలేక రాజుతో ఇట్లనిరి. అయ్యా వీని నురిదీయుట నంతఃపురస్త్రీదర్శనదోషంబునంగదా? అట్టియువతి యీ రాజపుత్రుని యధీనమైనది. కావున నితని యిష్టము చొప్పున జేయుట లెస్సయని మాకుఁ దోచినదని సభ్యు లేకవాక్యముగా బలికిరి.

అందులకు జయభద్రుఁడు సంతసించి యా ధర్మసందేహము జెప్పుటకుఁ బురుషవేషముగానున్న లవంగినే నిర్ణయించెను.

అప్పుడా లవంగి లేచి వారు పూర్వమువ్రాసిన శాసనమంతయుఁ జదివి సభ్యులారా! యీ శాసనపత్రిక నంతయును వినియుంటిరిగదా! ఆ ప్రద్యుమ్నుఁడు మూడాటలు నోడిపోయినచో నుఱిదీయురీతి దీనిలో వ్రాయబడియున్నది. వైషమ్యము వచ్చినప్పుడేమి చేయవలసినది దీనిలో వ్రాయలేదు ఇది వ్రాయువాని తెలివి లోపము గాని మఱియొకటికాదు. దానికి మనమిప్పు డేమి చేయుదుము. కావున దీనిఁబట్టిచూడ నత నుఱిదీయు నవకాశము గొంచము గాన్పించదు. ఈతండు గట్టిగా నడిగినచో మనos తప్పుగానున్నది. అతనిచేత మరలనాడించి యప్పుడు జయాపజయములు నిశ్చయింపఁదగినది. అతం డడిగినను అట్లు చేయకపోవుట మనదే తప్పు. కావున నతని విడిచివేయదగినదే యని తీరుపు చెప్పెను.

ఆ యుపన్యాసము విని సభ్యులెల్లరు తదీయపాండిత్యవిశేషమునకును వక్తృత్వమునకును సంతసించుచు నందుల కeమోదించిరి. అప్పుడు జయభద్రుడు లవంగిచెప్పిన తీర్పుప్రకారము ప్రద్యుమ్నుని విడిచివేయ నాజ్ఞయిచ్చెను.

ప్రద్యుమ్నుని చెరవిడిచిన వెనుక లవంగి యేకాంతముగా నతనిం గలిసికొని యాప్రభావతిని నీవే పెండ్లి చేసుకొమ్మని చెప్పెను. లవంగి పురుషవేషము వైచినప్పుడు ప్రద్యుమ్నుడు వలెనే యున్నది. కావున బ్రద్యుమ్నుడే పెండ్లికుమారుడై యాలోపల సంచరింపదొడంగెను. ఆ భేద మెవ్వరును గ్రహింపలేకపోయిరి. లవంగియు రహస్యముగా నాయూర సత్రములోనే యుండెను.

అంత నారాజు శుభముహూర్తమునఁ బ్రద్యుమ్నునికిఁ బ్రభావతినిచ్చి పెండ్లి చేసెను. నిత్యము చూచుచున్న వారికిసైతము పురుషవేషము వైచిన లవంగికిని ప్రద్యుమ్నునికిని భేదము గనిపెట్టశక్యము గాదనినచో నొక్కసారి చూచిన ప్రభావతి మాత్ర మేమి యానవాలు పట్టగలదు.

ప్రద్యుమ్నుడు ప్రభావతితో (ప్రద్యుమ్నుడు ప్రభావతితో వలెనే) కొన్ని దినము లందుండి యదేష్టకామంబు లనుభవించెను. అప్పుడప్పు డతఁడు రాత్రుల యందు సత్రమునకుఁబోయి చెల్లెలి క్షేమ సమాచారములు గనుంగొనుచుండును.

ఇట్లు కామతంత్రుఁడై తండ్రిమాట మరచిపోయియున్న ప్రద్యుమ్నుని నొక నాఁడు లవంగి మందలించి యిట్లనియె అన్నా! నీవు భార్యాలోలుండవై తండ్రిమాట మరచిపోయితివి. మనమువచ్చి నెలయైనది. ఇక అయిదుమాసములే మితియున్నది. వచ్చిన కార్య మేమియుం గాలేదు ఇంతదనుక నీవు క్రొత్త పెండ్లికొడుకువని యోర్చి యూరకుంటిని. ఎన్ని దినంబులున్నను నీ కిచ్చటినుండి రాబుద్ధిపొడమదు. నీవు భార్యతో నిందు సుఖం బుండుము. నేను పోయి కార్యము సాధించుకొని వత్తునని పలికిన నులికిపడి ప్రద్యుమ్నుడు. అమ్మాణీ! నన్ను భార్యాగలోలునిగా దలంచుచుంటివే ? నాకు దండ్రికంటె భార్యయెక్కువా? ఈ దినమున నేనును ప్రయాణమున కాలోచించుచుంటిని. పోదము రమ్ము అని పలికి యతఁడు ప్రభావతితో నెద్దియో మిష చెప్పి యా దివసంబున నర్ధరాత్రంబున లవంగితోగూడ నొకయడవిమార్గంబునం బడి పోయెను పితృభక్తియుక్తులు స్వప్రయోజనముల గణింతురా! ఆ యిరువురు గుఱ్ఱములులేక కాలినడకనే పోయి తెల్లవారుదనుక నడచి నడచి యాయాసముజెందుచు నుదయకాలంబున నొక తటాకము గనంబడుటయు దత్తటంబున గూర్చుండి గమనాయాసము వాపికొనిరి. పిమ్మట నడవలేక సరస్సులో స్నానముచేసి యందే తాము తెచ్చుకొనిన యాహారపదార్థములు భుజించి యాకలి యడంచుకొనిరి.

అది మిగుల నడవిగానుండుటచే రాత్రి కెద్దినేని గ్రామము జేరవలసియున్నది. కావున సునాయాసముగా నున్నను మరల నడువసాగిరి. అట్లు సాయంకాలమువఱకు నడచినను చిన్నపల్లెయైనఁ గనబడినదికాదు. భయపడి పెందలకడ నొ చెట్టుక్రింద బస చేసి ప్రద్యుమ్నుడు ఆయుధపాణియై తెల్లవారువరకు నిద్దురజెందక మృగబాధ రాకుండఁ గాపాడుచుండెను. ఆ మఱునాఁడు సాయంకాలమువఱకు నడచిరి. గ్రామమేదియుఁ గానంబడలేదు. అప్పుడు భయపడి ప్రద్యుమ్నుడు చెల్లెలితో అమ్మాణీ! మనము దారి కానిదారినివచ్చి యడవిలోఁ బడితిమి. ఎంతనడచినను పురమేదియుఁ గనంబడకున్నది. మనము తెచ్చిన యాహారవస్తువులు కొంచెముగా నున్నవి. నీకునడుమ మిగులశ్రమగా నున్నట్లు తోచుచున్నది. నేను రావలదని చెప్పినను వినక పోతివి. ఇప్పుడేమిచేయుదుము అని విచారించుచు మరల నాదినము మధ్యాహ్నము వఱకు నడిచిరి.

అందొక గొప్పమఱ్ఱిచెట్టు గనంబడినది. దానినీడ దట్టముగా నుండుటచే మార్గాయాసముచే నొడలెఱుంగక గాఢముగా నిద్రపోవుచున్న లవంగిని జూచి ప్రద్యుమ్ను డాత్మగతంబున నిట్లని తలంచెను.

అయ్యో! యీచిన్నది మిగుల సుకుమారముగలది. అంతఃపురములలో సంచరింపఁదగినది. తండ్రి యిడుములు దలంచి నాతోఁగూడ వచ్చినది. ఆహా! దీనిపితృవాత్సల్యము మిగులఁ గొనియాడదగియున్నది! కటకటా! చిగురుటాకులకన్నను మెత్తనగు దీనియడుగు లెట్లు పొక్కులెక్కినవో? యిక్కుసుమకోమలి నింటియొద్దనుండక తోడవత్తునన్నంతమాత్రముననే తీసికొనిరావలయునా! నేనే కఠినాత్ముండ. అయ్యో! యీ ప్రాంతమం దెచ్చటను నీరు దొరకనట్లున్నది. ఇది లేచి దాహమని యడిగిన నేమి చేయుదును? ఈలోపలనే జలముండుతా వరసిన మేలుగదా! యని నిశ్చయించి మెల్లన నామఱ్ఱిచెట్టెక్కెను. ఆమ్రాను మిగుల గొప్పదగుటచే చివరకొమ్మలకెక్కి నలుదెసలు పరికించుచుండెను. ఇంతలో నావృక్షము కోటరమునుండి యద్భుతమైన కృష్ణసర్ప మొకటి పైకొమ్మమీఁదునకుఁ బ్రాకదొడంగినది. దానిఁజూచి ప్రద్యుమ్నుఁడు వెరవక వరలోనున్న సూరకత్తి పెరికి యొక్క వ్రేటున నాసర్పముతల నరికివైచెను. ఆకృష్ణసర్పము తలదెగి ప్రాణములఁ బాసి మృతినొందినది.

ఆ మానుచివర భైరవపక్షులు రెండు గూడుకట్టుకొని కాపురముచేయుచు సంవత్సరమునకు రెండుసారులు గ్రుడ్లు బెట్టుచుండును. పెట్టిన గ్రుడ్లనెల్ల నీకృష్ణసర్పము పసిగట్టి వచ్చి భక్షించుచుండును. ఈరీతి బెద్దకాలము జరిగినంత నేఁటికి దానికి గాలము మూడి ప్రద్యుమ్నుని చేతిలో మృతినొందినది. ఆపద జూచి యా యాఁడుపక్షి యిట్లనియె నాథా! మనకుల మభివృద్ధినొందకుండ జేయుచున్న యీ దుష్టసర్పమును నేఁ డెవ్వఁడో పుణ్యాత్ముఁడు చెట్టెక్కి చంపివేసెను. మన కిటుమీఁద బిల్లలు నిలుతురు. అతండు మనకు గొప్ప యుపకారము గావించెను. వానికిఁ బ్రతిక్రియ యెద్దియేని జేయుమని బోధించిన నామగపక్షి సంతసించుచు భార్యకిట్లనియె.

బోటీ! మనము పక్షులమైయుండియు మనకన్న నధికులకు మనుష్యుల కేమి యుపకారము చేయఁగలము? అయినను నీవు చెప్పితివిగాన గృతజ్ఞతయైనం జూపవలయు నని పలికి మెల్లన నతనియొద్దకుఁ బోయి మ్రొక్కి మనుష్యభాషలో నిట్లనియె.

ఆర్యా! నీవు మాకుఁ జేసిన మేలు చిరకాలమువఱకు చెప్పుకొనఁదగియున్నది. కులము నిలిపితివి. మీవంటిసాధులకుఁ పరోపకారపారీణత సహజమైనను మాకృతజ్ణత యిట్లు ప్రేరేపించుచున్నది. మనుష్యసంచారశూన్యంబగు నీకాంతారమునకు నీవు రాఁగతంబేమి? నీయుదంతం బెరిగింపుమని యడిగిన నాపక్షిపతినీతికి మెచ్చుకొని ప్రద్యుమ్నుఁడు తనవృత్తాంతమంతయు నెఱింగించి యాచేప నవ్విన కారణము తెలిసికొనుటకే వచ్చితినని చెప్పెను.

అప్పు డాపక్షి ఆర్యా! అత్యంత నిపుణమతులైన మనుష్యులకుఁ దెలియరాని యంశములు మా బోంట్లకుఁ దెలియునా? యొక విశేషము చెప్పెదను వినుము. ఈకృష్ణసర్పశిరమందుఁ జిత్రమైన మణియొకటి గలదు. వానిం గైకొని యాకోటమార్గంబునం జనినఁ బాతాళలోకంబు గనంబడును. అందొక సుందరి నీకు వశ్యయగును. ఎట్టి సమయంబునను నీ మణి మాత్రము విడిచి యుండకుము. మణివియోగంబున నాకాంతావియోగముగూడ కాఁగలదు. ఆ పాతాళలోకవాసులు చేప నవ్విన కారణము జెప్పగలరని యూహించెదను. అట్లు చేయుమని బోధించిన సంతసించి యతం డందున్న సర్పశిరస్సు వెదకి తచ్చిరోమణిని సంగ్రహించి మఱియు నా భైరవపక్షిని తాను దలంచుకొని నప్పుడు వచ్చున ట్లొడంబడఁజేసి తదుపదిష్టమార్గంబున రసాతలమునకుఁబోయెను.

అంత నా చెట్టుక్రింద నిద్రబోవుచున్న లవంగి కొంతసేపునకు మేల్కొని కన్నులు నులిమికొనుచు నలుదిసలం బరికించి ప్రద్యుమ్నుం గానక తొట్రుపాటుతో అన్నా! అన్నా! ప్రద్యుమ్నాయని యరవఁజొచ్చెను. ఎందును వాని కంఠధ్వని వినంబడక యత్యాతురముతో అయ్యో! యిదియేమి పాపము! నేను నిద్రలేచి నంతలో నా సోదరుం డెందుపోయెను? ఎక్కడికైనను బోయినచో నాకుఁ జెప్పకుండునా? ఏదియేని క్రూరమృగబాధ జెందియుండ లేదుగద? అట్టి యాపద తటస్థించినప్పుడు చప్పుడు గాకుండానా? పరాక్రమశాలియగు నతని మృగములేమి జేయఁగలవు? అతఁడు ప్రమాదమున నిచ్చటినుండి యెచ్చటికైనఁ బోవలయునుగాని స్వబుద్దిచే నన్నొంటిగా నడవిలో విడిచిపోవు వాఁడుకాడు. యేమి చేయుదును? నాకు దిక్కెవ్వరు? ఔరా! దైవమెట్టి యాపద దెచ్చిపెట్టెనే! నాకీ యడవిలో మరణము విధించెను గాఁబోలు. ఎంతో దిక్కు గలిగియు దిక్కులేనిదాన నైతిని. అవి యనేకప్రకారములుఁ బలవరించుచు నయ్యడవి యంతయుఁ బ్రతిధ్వనులీయఁ బ్రద్యుమ్నాయని యరచుచు సాయంకాలము వఱకు కుమ్మరఁ జొచ్చెను.

అంత నానెలఁత శోకాంధకారంబునకుఁ దోడుగాఁ జీఁకటిగూడ వ్యాపింప దొడంగినది. అప్పుడు వనదేవతయుంబోలె నిర్మనుష్యంబగు నయ్యడవిలోఁ దిరుగు చున్న యా చిన్నదాని హృదయ మెట్లుండునో విచారింపుము ఆ చీఁకటికిఁ దోడుగా మబ్బుపట్టి వర్షము గురియదొడంగినది. ఆ యుఱుములకు మెఱుపులకుఁ దాళలేక యానాళీకవదన హృదయంబున ధైర్యమాపలేక మరణకృతనిశ్చయమై యా మఱ్ఱి మ్రాను మొదలున గొంచెమిమ్ముగా నుండుటంజూచి వర్షమునకుఁ దలదాచుకొనియెను. గాఢాంధకారముగా నున్న యా రాత్రి శర్వరీనిమీలనములుఁబోలె నొప్పుచున్న మెఱపు వెల్తురున నత్తరుణికిఁ గురంగట తురగముపై నెక్కియున్న యొక పురుషుఁడు గనంబడెను. అప్పు డప్పడఁతి యింతింతనరాని సంతసముతో అన్నా! ప్రద్యుమ్నా! యిటురా! ఇదిగో నేనిచ్చట నుంటిని. ఇంతదనుక నెందు బోయితివి? నీకై నేను పెక్కు తెరంగులఁ జింతించుచుంటిని సుమీ! యని పెద్ద కేకలు పెట్టెను

ఆ మాటలు విని గుఱ్ఱముపై నున్న యా పురుషుఁడు భయపడి యేదియో పిశాచము ఆ వృక్షము నాశ్రయించి యున్నది. మనుష్యవాక్యముల బిల్చుచున్నది. ఇందుండినఁ బ్రమాదము రాకమానదు. అని యూహించి పారిపోవఁదలంచు చున్నంతలో మరలఁ దళుక్కుమని మెఱసినది. ఆ వెల్తురున నా పురుషుఁడు లవంగినిం జూచెను. ఆ చిన్నదాని మేనికాంతి మెఱుఁపుతో దులగానుండుటచే వెరగందుచు నతం డౌరా! పిశాచమనుకొంటిని. కాదు కాదు. ఒక యువతివలెఁ గనంబడుచున్నది. యా నెలతుక యొక్కరితయ యిక్కడ నుండుట కేమి హేతువో! అని ధ్యానించుచు గుఱ్ఱముదిగి దాని చెంతకుఁ బోయెను.

ఇంతలో మెఱపు మెఱసినది. అప్పు డొండొరులు బాగుగాఁ జూచుకొనిరి. లవంగి యతని నిజముగాఁ దన యన్న ప్రద్యుమ్నుఁడే యనుకొని అన్నా! యిటురా! నేనిందుంటిని. నీకీ తురగ మెక్కడిది? అని పలుకగా నా చిలుకల కొలికి పలుకులకు వెరగందుచు నా రాజకుమారుఁడా లవంగికి మఱింత దగ్గరగాఁ బోయెను.

అప్పుడా యిమ్ములోనుండి బయటికివచ్చి యా చీకటిలో నా లవంగి యా పురుషునిం గౌఁగలించుకొని యన్నా! నేను పలుమారు పల్కరించినను ననుమానము జెందుచు మాటాడకుంటివేమి? ఎచ్చటికిఁ బోయితివి? నీ యఱిగిన తెరగెల్లఁ జెప్పుమని యడిగిన నతండు తెల్లబోవుచు లవంగి కిట్లనియె. తన్వీ! నేను మీయన్నయగు ప్రద్యుమ్నుడనుగాను. మత్స్యదేశాధీశ్వరుని కుమారుఁడ. నా పేరు జయసేనుఁడం దురు. మాతండ్రి నన్ను వలదని యెంత చెప్పినను వినక నేఁటి యుదయమున సేనలతో వేటకై యీ యడవికి వచ్చిన కొంతసేపటికి మా శిబిరములన్నియు నెగిరిపోవునట్లు గాలి విసరఁదొడంగినది. పిమ్మట నత్యద్భుతముగా వర్షము గురియ మొదలు పెట్టినది. అందు బిడుగులు పడి యనేకులు మృతినొందిరి. కొందఱు పారిపోయిరి. నేనును నా గాలివానకు భయపడి తురగమెక్కి యొక్కరుండ నింటికి బోవలెనని బయలుదేరితిని గాని యింతలో జీకటి పడుటచే దారితప్పినది. ఈ మార్గమున వచ్చితి. ఇందు నీవు గనంబడితివి.

ఈ మహారణ్యములో నీవేటికి వసించితివి? నీవు బిలిచిన ప్రద్యుమ్ను డెవ్వడు? నీ పేరేమి? నీ వృత్తాంతమంతయు జెప్పుమని యడిగిన విని యా లవంగి తెల్లబోయి అయ్యో! నిన్ను మా యన్నయని కౌగలించుకొంటినే. నీవు మఱియొకండవై తివి. అయినను ఆపత్సముద్రంబున నన్ను ముంచిన భగవంతుండు నీవను తెప్పనందించెను కాబోలు ! కానిమ్ము. ఒకరిత నుండుటచే గుండెలు తాళకున్నవి. నా యుదంతము నీ కెఱింగించెద వినుమని యన్నయు దాను నిల్లు వెడలినది మొదలు చెట్టుక్రింద బరుండి నిద్రపోవువఱకు జరిగిన కథయంతయుం జెప్పి పుణ్యాత్మా! నాయన్న యెందుంబోయెనో యెఱుంగను. దిక్కుమాలియున్న నన్ను రక్షింపుమని వేడుకొనినది.

ఇంతలో మఱియు పట్టబగలనునట్లు మెఱసినది. ఆ వెల్తురున నయ్యిరువురు చక్కగా జూచుకొని యొండొరుల సౌందర్యవిశేషముల కచ్చెరువందుచు నొకరి కొకరు వరించిరి. అప్పుడు మేనం బులకలు బొడమ భయము నెపంబున దన్ను గౌగిలించుకొనిన యమ్మించుబోడి యంగస్పర్శంబున నా జయసేనునికి మేన బులకలు బొడమినవి. దానంజేసియే యొండొరుల యభిప్రాయములు వారికి దేటపడినవి.

కొంతసే పట్లన్యాపదేశంబున శృంగారచేష్టల గప్పిపుచ్చిరి గాని చిట్టచివర కా గుట్టుపట్టలేక యారాచపట్టి మంత్రిపట్టి కిట్లనియె. బోటీ! మన మీ లాటి విజనప్రదేశ మందుండియు లజ్జ పెంపునం జేసి గదా? యిట్టు వలపుల వెల్లడిజేయ సందియమందుచుంటిమి. ఇంకను దాచనేల? నాడెందము నీయందము లాగికొనినది. మదనుడు నన్ను వేపుచున్నాడు. క్షణకాలమైన సైపలేకున్నాను. నీ మనోరధమెద్దియో యెఱింగికాని యిష్టము దీర్చుకొనరాదని యుంటిని. వేగ నెఱింగింపుమని యడిగిన యప్పడుచు సిగ్గు విడిచి యతని బిగ్గరగా గౌగలించుకొనుచు నేను నీ యధీననైతి. మరల దీనికి నన్నడుగవలయునా? మదనుడు నిన్నొక్కనినే కాదు. నీ కన్న నెక్కుడుగా నన్నును వేపు చున్నాడని పలికిన సంతసించుచు నా జయసేనుండు పట్టరాని మోహముతో నమ్మగువ బిగియ గౌగలించుకొని ముద్దుగొనుచు మిగుల సంతోషముతో నుండెను. వారిరువురకు నా రాత్రియంతయు నొక క్షణముగా దోచలేదు.

అంత నుదయంబున నమ్మదవతితో గూడ నా జయసేనుండు ఆ తురగమెక్కి తన గ్రామమార్గముగా నడువజొచ్చెను దైవగతిని దారిదప్పి యా గుఱ్ఱము మరియొక దారిని నడిచినది. ఆదారినిం బోవంబోవ నెప్పటికిని దన దేశపుజాడ యేమియు గనంబడిననదికాదు. అప్పుడు వెరగందుచు నాజయసేనుడు దారి తప్పినదని తెలిసికొనియేమియు జేయలేక దైవముమీఁద భారమువైచి యా దారింబడి మూఁడు దినములు పోయెను. అంత నాలుగవదిన ముదయమున వారికొక యుద్యానవనము గనంబడినది. దానిం జూచినతోడనే జయసేనుని కది యొక నగరప్రాంతమని యెంతో సంతోషము జనించినది. దానిలోఁ బ్రవేశించినంత నందెవ్వరు జనులు గనంబడలేదు. వా రా యుద్యానవనములోఁ బ్రవేశించి యందలి వింతలం జూచుచుండ నొక దండవస్తోకశోభాకరం బగు నొక పద్మాకరంబు గనంబడినది. వారు తురగము దిగి యందు మార్గాయాసము వాయఁ గొంతొక సేపు జలకేళిందేలి మరల దురగమెక్కి గమ్యప్రదేశ మరయుచుండ నల్లంత దవ్వులో నొకమేడ కన్నులకు వేడుక గలుగఁ జేసినది.

మిగుల సంతోషముతో నా సౌధము దాపునకుఁబోయి గుఱ్ఱముదిగి యందెవ్వరుం గానక వారు వెరగుజెందుచు లోనికి బోయిరి. లోపల జనులెవ్వరులేరు. అనేక విచిత్రవస్తువులచే నలంకరింపఁబడి యున్నది అందాహారపదార్థము లనేకములు గలవు. ఆ దంపతులా మేడ నలుమూలలు తిరిగి యెవ్వరును లేరని తెలిసికొని మిగుల నాకలి గొనియున్నవారగుట నందున్న మధురపదార్ధములచే నాఁకలి యడంచుకొనిరి. ఇంతలో సాయంకాల మగుటయు నదియేమి చిత్రమో కాని యందు పెక్కుదీపము లెవ్వరును వెలిగింపకయే వెలుఁగుచుండెను. వెరగుఁజెందుచు నవి మణిదీపము లని తెలిసికొనిరి.

అందుపరిభాగమున నొకకగదిలో నద్భుతమైన యలంకారముతో హంసతూలికాతల్ప మొకటి యమర్చఁబడి యున్నది. దానింజూచి యా దంపతులు అదియంతయు భగవంతుడు దమనిమిత్త మమరించి యుంచెనని సంతసించుచు నా తల్పంబుజేరి మన్మథకల్పప్రతాపంబున ననేకబంధగతుల నా రాత్రి రతికేళిం దేలిరి.

అహా! యొకప్పుడు కీడుగూడ మేలునకే కారణమగును. ఆ రీతి వారు మూఁడురాత్రులు యథేష్టకామంబు లనుభవించిరి. అంత నాల్గవనాఁ డుదయంబున నా లవంగి కన్నులు దెరచి చూచినంత ప్రాంతభాగమంతయు మహారణ్యముగా నున్నది. ఆ మేడయు నా తల్పమును జయసేనుఁడుగూడ గనంబడలేదు. అందుల కాశ్చర్య మందుచు మరల గన్నులు మూసికొని యది కలగా దలంచి యొక్కింతసేపు నిదానించి దిరుగగన్నులు దెరచి చూచి యది కలగాదనియు నిజముగా యట్లయ్యెననియు దెలిసికొనినది.

అప్పు డప్పడఁతి మనంబునం బొడమిన చింతాతరంగము లేమని చెప్పుదును? మదిలో నిట్లని తలంచినది. అయ్యో! దైవము నన్నిట్లు పైకెత్తి నేలవైచి కొట్టెనే? యిది యేమి మాయ? జయసేనుఁ డెక్కడికిఁ బోయెను? విదాఘతప్తుండగు వానికి వర్షాగమనంబునఁ జింతించుచున్న నాకీ జయసేనుని యాధారముగాఁ జూపించి మరల నతనింగూడ మాయజేసెనే? ఒకవేళ నిదియంతయుఁ గల కాదుగదా! నేను భ్రమసి నిజమనుకొంటిని. నిజముగా జయసేనుఁ డనువాఁడు నన్నుఁ జేపట్టలేదు. వానితో నేను మేడలో గ్రీడింపలేదు. స్వప్నమహాత్యమే నన్నిట్లు భ్రమపెట్టుచున్నది. అనియూహించి యంతలోఁ గలగాదు నిజమే నేను నిద్ర యెచ్చట బోయితిని? ఇవిగో నా యంగంబుల వాని నఖదంతచిహ్నములు గనఁబడుచున్నవి. దైవప్రతికూలము చేతనే నాకు మరల నీ యాపద తటస్థించినది. నాకుఁ దల్లిదండ్రులును సోదరుడును గనంబడని యప్పుడు సైతమీ జయసేన వియోగంబునంగల దుఃఖము గలుగలేదు. ఈ వియోగ తాపమెట్లు భరింతునని యనేక ప్రకారములఁ బలవరించుచు సీ! లోకంబున సర్వకాలములు దుఃఖముతోఁ గూడికొనినవే కాని స్థిరసౌఖ్యప్రదములు కావు.

శ్లో॥ భోగె రోగభయం కులె చ్యుతిభయం విత్తె నృపాలాద్భయం
      మానె దైన్యభయం బలె రిపుభయం రూపె జరాయాభయం
      శాస్త్రె వాదభయం గుణే ఖలభయం కాయె కృతాంతాద్భయం
      సర్వంవస్తుభయాన్వితం భువినృణాం వైరాగ్యమేవా భయం.

అనునట్లు వైరాగ్యము వంటిది మఱియొకటిలేదు. తండ్రి మరణము దప్పింప నిల్లువెడలితిని దారిలో సోదరునిం గోలుపోయితిని. జయసేనుని బెండ్లియాడి వానితో వియోగమును బొందితిని. దీనిలోసుఖమెంత దుఃఖమెంత తలపోయ దుఃఖమే యధికముగా నున్నది. దైవమేమి చేయునో యట్లు పోవుదాననని తలంచుటకంటె మంచి మార్గములేదు. తండ్రిచావు దప్పింప నా తరమా? యెవ్వరేమైనను సరియే నేనేమి చేయఁగలను. ఇంక యోగం బవలంబించి ముక్తిమార్గ మందెదనని తలంచి యా యడవిలో నిర్భయముగాఁ దిఱుగుచు ఫలములను బర్ణములను భక్షింపుచుండెను. యోగినియై క్రమంబున నయ్యరణ్యములో సంచరించుచుండ నయ్యండజయాన కొకనా డొకచోట గొప్ప కోట యొకటి గనంబడినది.

అది యేదియో పురమనుకొని యవ్వనిత దానిచుట్టును దిరుగ నొకదెస గోపురమును ద్వారమునుఁ జూడనయ్యెను. దానింబట్టి యా మంత్రిపట్టి దేవాలయముగా నిశ్చయించి తలుపులు మూసియుండుటచే జింతించుచు నా తలుపులోనున్న చిన్న తలుపొకటి జేఁతితోఁ త్రోసిచూచెను. దానికి బీగము వైచునప్పుడు గడియలు తగులు కొనమి నా త్రోపుతో నా తలుపు వచ్చినది. మిగుల సంతసించుచు నమ్మించుబోణి యా ద్వారము దారిని లోనికి బోయినంత నదియొక యమ్మవారి గుడివలెఁ గనంబడినది. తన మనోభీష్టము సఫలముజేయ భగవంతుఁడు తన్నచ్చటికిఁ దీసికొని వచ్చెనని సంతోషించుచు నప్పడఁతి యగ్గుడిచుట్టును దిరిగి లోని తలుపులన్నియుఁ దెఱవఁబడియు యుండిన నా దేవతకు నమస్కరించి పెక్కుగతుల స్తుతిఁజేసినది.

ఆ యమ్మవారి పేరు సంయోగినిదేవి యనియు, నచ్చట దేవీనవరాత్రములకు గొప్పయుత్సవము జరుగుననియు దానిం జూచుటకై యనేకజనులు వత్తురనియు నది మిగుల రహస్యప్రదేశ మనియు నా చిన్నది యొకశాసనము మూలముగాఁ దెలిసికొని మిగుల నానందించినది.

ఆ పూజారి దలుపు తాళము వైచునప్పుడు లవంగి యదృష్టమున గడియ దగిలికొనినదికాదు. లేనిచో నితరదినములలో నాయాలయము లోనికిఁబోవ బ్రహ్మకైనను శక్యముగాదు. అందు విలువగల రత్నభూషణము లెన్నియేనిం గలవు. మరియు నాహారపదార్థములు చాలనున్నవి. ఆ చిన్నది వాని నేమియుం బరిశీలింపక యాహారవస్తువులు దీసికొని తినుచు నా యావరణలోనున్న తటాకప్రాంతమందున్న మంటపములోఁ గూర్చుండి యోగినియై నిత్యము దపము జేయుచుండెను.

రాత్రులయందు నిద్రాదివ్యవహారము లా మంటపములోనే చేయుచుండెను. ఇట్లున్న యంత నొక్కనాఁ డర్దరాత్రంబున నద్దేవిని సేవించుటకై దేవలోకమునుండి రంబాదినిలింపకాంతలు వచ్చి యమ్మవారిని సేవించి యరుగుచు మంటపములో నిద్రించుచున్న లవంగిం జూచి తమలో నిట్లు సంభాషించుకొనిరి.

రంభ -- ఊర్వశీ! యిందొక సుందరి యోగినీ వేషముతో నున్నది. చూచితివా?

ఊ - చూచితి నౌరా! దీని రూపము చాల వింతగా నున్నది .

మేన - అక్కలారా! సంయోగినీదేవి యీ యాకృతి బూని యిందు విహరించుచుండ లేదు గదా.

ఊ - యోగినీవేషముగూడ దీని కలంకారముగానే యున్నది సుమీ.

రంభ — ఔను, స్వభావసుందరులకు వికృతసైతము సోయగమే యగునను మాట వినియుండలేదా?

మేనక — ఈ చిన్నది పతిని విడచి యొక్కరితయ యిందుండుటకుఁ గారణమేమియో తెలిసికొనగలరా!

ఊ - (దివ్యదృష్టి నరసి) ఓహో! దీని యుదంతమంతయు దెలిసికొంటి, జెప్పెద వినుడు.

మేనక — సరే! యెట్టిదో చెప్పుము. వినమిగుల గుతూహలముగా నున్నది.

ఊ - దీనిపేరు లవంగి. ప్రభుకీర్తియను మంత్రికూఁతురు. ప్రద్యుమ్నుఁడను పేరు గల దీనియున్నయు నిదియుఁ దండ్రి యాపదఁ దప్పించుటకై యూరువెడలి వచ్చి మార్గంబున బ్రభావతియను చిన్నదానిని జదరంగములో నోడించి యన్నకుఁ బెండ్లి జేసి మరియుం దేశములు దిరుగుచు నన్నతోడను మగని తోడను విడిపోయి విరాగముజెంది యిందుఁ దపము చేయుచున్నది.

మేనక - అక్కా! దీని తండ్రికి వీరిచే దీర్పఁదగిన యాపద యేమి వచ్చినది?

ఊ - సింహధ్వజుఁడను రాజు తనయొద్దకుఁ బల్లెవాండ్రు దెచ్చిన చేప నంతఃపురమునకుఁ బంపుటకై యాఁడుదియా మగదియా యని యడిగెను.

మేనక – అట్లడుగుటకు నతని యభిప్రాయ మేమి?

ఊ - అది మగదియైనచో నంతఃపురస్త్రీలకుఁ జూపింపఁ గూడదని.

మేనక – అంత గట్టివాఁడా? తరువాత.

ఊ - ఆ భేదము చేపలలోఁ గనిపెట్టుట గష్టమని బెస్తలు చెప్పిరి. ఆ రాజు మాటలు విని యా చేఁప పక్కున నవ్వినది .

మేనక - తరువాత.

ఊ -- ఆ చేఁప నవ్విన కారణము చెప్పుటకు వాని కారుమాసములు మితి నిచ్చి యప్పటికిఁ జెప్పనిచో నుఱిదీయింతునని యారాజు మంత్రి కాజ్ఞాపించెను.

మేనక - అన్నన్నా! రాజు లెంత కఠినాత్ములో కదా? చేఁప నవ్విన కారణ మెవ్వఁడు చెప్పగలఁడు అక్కా! ఆ కారణము విన నాకును వేడుక యగుచున్నది. నీకుఁ దెలిసినం జెప్పుము.

ఊ — నాకు బుద్ధిసూక్ష్మతచేఁ గ్రహంపఁదగియుండలేదు. దివ్యదృష్టిచేఁ జూడఁ దేట పడినది. చెప్పెద వినుము.

మేనక - సావధానముగా వినియెదము జెప్పుము.

ఊ -- ఆ సింహధ్వజుఁడు తన భార్యలను దాను గడుజాగ్రత్తగా నంతఃపురముల నుంచి కాపాడుచున్నాననియు, మగచేఁపను సైతము వారికి జూపింపఁగూడదని యట్లడిగెను అట్టి యూహ గ్రహించి యీచేప యీభూపతి యెంతమూఢుఁడో తన యంతఃపురములోనున్న దాదు లాఁడువారో మగవారో యెరుఁగఁడు. నా పరీక్ష యీతనికిఁ గావలసివచ్చేనేయని యాచేప నవ్వినది.

మేనక -- అతని యంతఃపురమున నట్టివారుండిరా యేమి?

ఊ - స్త్రీవేషముతో మగవారు సంచరించుచు నతని భార్యలతోఁ గ్రీడింపుచుండిరిలే.

మేనక -ఊర్వశీ! సాధుసాధు దివ్యజ్ఞానసంపన్న వగు నీకుగాక యీ రహస్యము వక్కాణింప నొరులకు శక్యమగునా? అయ్యో! అట్టిపనికై వచ్చి యీచిన్నది యిట్లు విరాగముతో నున్నదా? పాపము దీని పతి యెవ్వడు. అతం డెందున్నాఁడు?

ఊ - దీని పతి జయసేనుఁడనువాఁడు. ఈ చేడియ వటవృక్షము క్రిందనుండ దారి తప్పి వచ్చి గాంధర్వంబున స్వీకరించెను. ఆ యిరువురు మత్స్యదేశమునకుఁ బోవుచు దారితప్పి యక్షిణీవనమునకుఁ బోయిరి. ఆ యక్షిణి వృత్తాంతము దెలియక యా దంపతులు మూఁడుదినములు దానిమేడలోఁ గ్రీడింపుచుండిరి. అంత నాల్గవ దినమున నా యక్షిణివచ్చి తన శయ్యయందుఁ బండుకొనియున్న యా దంపతులం జూచి చంపక యిరువురను చెరియొక యడవిలోనికిఁ ద్రోసి వేసినది.

మే - పాపము మరల నీ తరుణికిఁ బతితో సంయోగము గలుగునా?

ఊ -- ఈ సంయోగినీదేవి కృపావిశేషమున నీయువతి పతితోడను, సోదరునితోడను శీఘ్రకాలములోనే కలిసికొనఁగలదు.

మే - అట్లయినచో నీ సంయోగినీదేవి నామము సార్థకమేకదా!

ఊ -- దానికేమి సందేహము? ఈమె భక్తపరతంత్రగదా?

రం – అక్కలారా! మనమువచ్చి తడవైనది పోయివత్తమా?

(అని యందరు నిష్క్రమించుచున్నారు. )

ఆ దేవకన్యలు తన్ను గుఱించి సంభాషించుకొనఁ బ్రారంభించినప్పుడే యా లవంగికి మెలకుఁవ వచ్చుటచే వారి మాటన్నియు విని యా సంవాదములోఁ దన యిడుములన్నియు నడఁగు తెరంగు స్పష్టమయ్యెనని యానందపారావారవీచికలం దేలుచు నా లవంగి యిట్లు తలంచెను.

ఆహా! జనులెంత కష్టపడినను దైవానుకూలములేక సుఖములఁ బడయగలరా! సుఖదుఃఖములు దైవాయత్తములు. సుఖము దుఃఖమునకును, దుఃఖము సుఖమునకును నొక్కొక్కప్పుడు కారణమగుచుండును. నాకింతకు బూర్వము గలిగిన దుఃఖమూలముననేగదా యిట్టివిరాగముతో నీదేవాలయమునకువచ్చితిని ఇందు మాతండ్రియిడుములువాయురీతి దేవకన్యకాసంభాషణాశ్రవంబునం దెల్లమైనది. ఇదంతయు దైవము గూర్చినదేకాని వేరుకాదు. మాకు మరల మంచికాలము రానున్నది. పతితో సోదరునితో శీఘ్రకాలములోనే గూడుకొనెదనని యూర్వశి చెప్పినది. ఆమె మాటలు దప్పునా యని యత్యంతసంతోషముతో నారాత్రి నిద్రపోక వేగించినది .

అంత నాకాంత నాల్గవజామున నత్తటాకములో స్నానముచేసి యామంటపములో జపమునకు గూర్చుండబోవు సమయంబున గోపురప్రాంతమం దెద్దియో మనుష్యుల సద్దు వినబడినది. వెరగుపడి యాలవంగి యాగోపురపుదాపునకుఁ బోయి చిన్నగుమ్మము దాపునుండి యా యడవిప్రక్కకుఁ దొంగిచూచెను. అందొక సుందరి మొరపెట్టుచుండ జెరదెచ్చిన దొంగలను పారదోలుచున్న బాలయోగి నొకనిం గనెను. ఆ లవంగి చూచుచుండ నా బాలయోగి తన యోగదండములో నమర్పబడియున్న కత్తిచే నా దొంగల నందరిని నరికివైచి యా చిన్నదాని చెరవిడిపించెను. పిమ్మట నా కొమ్మతోఁ కూడ నా బాలయోగి యా గుడిలోనికి వచ్చురీతి దోచినంత లవంగి మరలఁ బోయి మంటపములోఁ గూర్చుండి జపము చేయుచుండెను. ఇంతలో నా యోగియు నా తరుణియు నా చిన్న ద్వారమునుండి యా గుడిలోఁ బ్రవేశించిరి. అప్పుడు కొంచెము చీఁకటిగానే యున్నది. తెల్లవారలేదు.

అంత నయ్యోగి యయ్యెలనాగతో సంయోగినీదేవి దేవాలయంబునకుఁ బ్రదక్షణము చేయుచుండ నొకదండఁ దటాకము దాపుననున్న మంటపములో రెండవ చండికాదేవివలెఁ దపంబు చేయుచున్న యా లవంగి గనంబడుటచే నాశ్చర్యపడుచు నా చిన్నదానితోఁగూడ నా చేడియకు మ్రొక్కి యందు గూర్చుండెను. లవంగియు నతనికి మరల మ్రొక్కి కన్నులం దెరచి జపమాలికను దొడలపై నిడి యతని నెద్దియో యడుగఁదలంచు నంతలో నెచ్చటినుండియో యొక పురుషుడు ఆకసమునుండి యూడి వచ్చునట్లు వచ్చి యా తటాకములోఁ బడియెను.

ఆ చప్పుడువిని వారు మువ్వురు వెరఁగుపడుచుఁ నయ్యో! పై నుండి వచ్చి దీనిలో నెవ్వడో పడి మునింగెను. ఇది మిగుల వింతగానున్నది. పాప మూరక వాఁడు మృతినొందును. వీనిం బ్రతికించిన మిగుల పుణ్యముగదా యని పలుకుచు నా బాలయోగి యప్పుడే యత్తటాకములో నురికి మునిఁగి యతనిని వెదకిబట్టుకొని పైకిలాగి కొనివచ్చి యొడ్డునం జేరెను. ఆహా! వాని సాహసము మిగుల కొనియాడఁ దగి యున్నది.

అప్పుడా పురుషుఁడు కన్నులు మూసికొని యొగర్చుచు గొండొకసేపునకు మేను దెలిసికొని తన్నా యోగియే బ్రతికించెనని యెఱిఁగి యతనితో నిట్లనియె.

అయ్యా! నీవు నాపాలిటి దైవమని నమ్మెదను. నన్నుఁ జచ్చినవానిఁ బ్రతికించితివి. అయినను నాకీ సమయములో మరణమే మేలని తోచుచున్నది. నావంటి పాపాత్ముఁ డెందైనఁగలడా? యని యెవ్వరినో తలంచుకొని విచారింపఁ దొడంగెను.

అప్పుడా బాలయోగి యతనితో నయ్యా! మీరిట్టి విరక్తిమాట లాడుచుంటిరేమి? యెద్దియేని యాపద జెందితిరా? యీ తటాకములో నాకసమునుండి యెట్లు పడితిరి? ఇది మాకుఁ గడువింతగా నున్నది. మీ వృత్తాంతము గోప్యము కానిదియేని జెప్పుఁడని యడిగిన నా పురుషుఁడు లవంగి విన నతనితోఁ దనకథ నిట్లు చెప్పఁదొడంగెను.

అయ్యా! నేను ప్రభుకీర్తియను మంత్రి కుమారుండను. నాపేరు ప్రద్యుమ్నుఁడు. లవంగియను పేరుగల నా చెల్లెలును నేనును దండ్రి యాపద దాటించుటకై దేశమువదలి యనేక దేశములు దిరిగితిమిగాని యెందును మా కార్యము దీరినదికాదు. అంత నొకనాఁ డచ్చేడియము నేను నొక వటవృక్షముక్రింద నెండకు దాళలేక శయనించితిమి. దానికి నిద్రపట్టలేదు. అప్పుడు లవంగి లేచి దాహమడుగునని తలంచి యా చెట్టెక్కి జలముఁజాడ జూచుచుంటిని. ఇంతలో నా తరు కోటరమునుండి యొకకృష్ణసర్పముపై గూడిలోనున్న భైరవపక్షి పిల్లలనుం దిన బైకిఁ బ్రాకుచుండెను. అది చూచి నేను కత్తితోఁ నా పామును జంపితిని. దానికి సంతసించుచు నా పక్షి నాయొద్దకు వచ్చి కృతజ్ఞత జూపించుచు నా యాగమనకారణం బడిగి సర్పశిరోమణిం గైకొని యా కోటద్వారంబునఁ బాతాళలోకమునకుఁ బొమ్మని యుపాయము చెప్పినది.

దాని మాటప్రకారము శిరోమణిని గైకొని తత్ప్రభావముచే సులభముగాఁ బాతాళలోకమునకుఁ బోయితిని. అన్నన్నా! నాకప్పుడు కొంచెమైనను మా లవంగిమాట జ్ఞాపకముండినతో నట్లు పోవుదునా? అయ్యారే! యా పాతాళలోక వైభవ మేమని వక్కాణింతును. స్వర్గముగూడ దానికి సాటిగాదని చెప్పఁగలను. పాతాళలోకము చీకటిగానుండునని చెప్పుకొనుమాట లబద్దము . అందున్న రత్నరాసులకాంతి యుగ్రముగాక యనేకసూర్యులకాంతివలె వెలుంగుచుండును. దానంజేసి యందు రాత్రియుఁ బగలును భేదము లేదు.

అందు నేను యధేచ్చం గ్రుమ్మరుచుండ నొకదండ నుద్యానవనములో వయస్యలతోడఁ గ్రీడింపుచున్న యొకచేడియం గంటి నా వాల్గంటివంటి సోయగము గల యలనాగ నాకంబుననైనను లేదల చెప్పవచ్చును. దానిం జూచినంత నాకు భైరవపక్షి మాటం జ్ఞాపకమువచ్చినది. నాగశిరోమణిని హస్తంబునంబూని దాని చెంతకుఁ బోయితిని.

అక్కాంతమణియు మణిహస్తుండనగు నన్నుఁజూచి యత్యంత సంతోషముతో వచ్చి యొక పుష్పమాలిక నా మెడలో వైచి యిట్టట్టని నన్నడుగకయే గాఢాలింగనముఁ జేసికొనినది . అంత సోయగముగల కలకంఠివచ్చి మచ్చికతోఁ గౌఁగలించుకొనినప్పు డెట్టి సంతోషము గలుగునో చింతింపుము. నేనును మేనుగరుపార నపారమోదముతో సుఖపారవశ్యంబున నొక నిమిషము మైమరచి యుంటిని.

అంత నన్నెలంతయు నన్నా యుద్యానవనంబున డంబు మీరియున్న క్రీడామందిరమునకుఁ దీసికొనిపోయి చేడియలచే నమరింపఁబడిన కాంచనపీఠంబునఁ గూర్చుండబెట్టి మార్గాయాసంబు వాయ వింజామరచేఁ దానే వీవఁదొడంగినది. ఆహా! అప్పటి యా యానందము దలంచుకొనినంత నిప్పుడు మేనుగరపు జెందుచున్నది. అంత నే నాకాంత చేయు సుపచారములకు వింతపడి యప్పడఁతిని నీవృత్తాంతమేమని యడిగితిని.

అప్పు డచ్చేడియ మొగమునకుఁ జిఱునగవునగయై మెఱయ నాతో నిట్లనియె. ఆర్యా! నాపేరు రత్నాంగి, నేను నాగకాంతను. మణిమంతుఁడను పేరుగల మాతండ్రి నన్నుఁ గొప్పతపంబుజేసి కనెను. నేనొకనాఁడు చేడియలతో నిత్తోటలోఁ గ్రీడింపుచుండ నాత్రేయుండను మహర్షి యిచ్చటికి వచ్చెను. ఆటతొందరచే నేనా యతి రాక బరామర్శింపనైతిని. దాని కతండు గోపించి యీ కాంతకు మనుష్యుండు పతియగు ననియు నిడుమలు గుడుచుననియు శపించెను.

ఆ మాటవిని చెలికత్తియలతో నే నత్తపోధనసత్తముని పాదంబులంబడి ప్రార్ధించితిని. దాన సంతసించి యమ్మునిపతి యువతీ! మనుజవల్లభత్వము నీకుఁ దప్పదు. నాగశిరోమణి హస్తంబున ధరించి వచ్చిన వానినిఁ బతిగా వరింపుము. నీవు సౌఖ్యమందెదవని చెప్పుచునే యంతర్హితుఁడయ్యెను. అమ్మునితల్లజుని వచనంబు దలంచుకొనుచు నే నిందు వేచియుండ నేఁటికి మీరట్లు వచ్చిరి. నేను గృతకృత్య నై తిని. గాంధర్వవివాహంబున నన్నుంస్వీకరించి భోగపరుండవై యీ యుద్యానవనంబునఁ గ్రీడింపుమనుటయు నా మాటకు సంతసించి యమ్మించుబోఁడి నప్పుడ పాణిగ్రహణము చేసికొని నే నా సౌధంబులఁ గొన్ని దినంబులా రత్నాంగిఁ గ్రీడాసౌఖ్యంబు లనుభవించితిని.

అట్టి సౌఖ్యంబు మరగిన నాకు నా యనుంగు చెల్లెలుగాని తండ్రిగాని జ్ఞాపకమే రాలేదు. అంత నొక్కనాఁడు నన్నానెలంత నీ యుదంతమేమని యడిగినంత నా కథ యంతయు నాకుఁ దెప్పున జ్ఞాపకము వచ్చినది. అన్నిటికంటె నాకు నా యనుంగుసోదరి యేమయ్యెనొకో యను విచారము బాధింపఁదొడంగినది. అప్పుడు తటాలున లేచి యెచ్చటికో పరుగిడఁదొడంగితిని. అట్లేమియు మాట్లాడక యూరక యరుగుచున్న నన్నుఁజూచి వెరగుపడుచు నా రత్నాంగి వేవేగము వచ్చి నా చేతులు పట్టుకొని యిట్లనియె.

నాథా! నీ యుదంతము చెప్పుమని యడిగినంత నేదియో తలంచుకొని యూరక పరుగిడుచుంటిరేమి? ఎక్కడకుఁ బోయెదరు! మీ కథ యేమని యడిగెను. అప్పుడా పడఁతికి నా వృత్తాంతమంతయు జెప్ప మా లవంగి యేమైపోయెనో యను చింతతోఁ పరుగిడుచుంటినని చెప్పితిని. దాని కమ్మానిని నవ్వి యాహా! యెన్నఁచో చెట్టుక్రిందఁ దిగవిడిచి వచ్చిన చిన్న దాని నిప్పుడు తలంచుకొని దాని రక్షించుటకై పోవుచుంటిరా? మేలు మేలు. మీ యనురాగము స్తుతిపాత్రమైయున్నది. రేపు పోవచ్చును రండని మరల నంతఃపురమునకుఁ దీసికొని పోయినది.

ఆది మొదలు అచ్చట వింతలు దాని విలాసములు నాకేమియు నుల్లాసమును గలుగఁజేసినవికావు. నేనామఱునాఁడే భూలోకమునకుఁ బయనమైనంత నన్నెలంతయు నాతో దానుగూడ ప్రయాణ మయ్యెను. నేను వలదని యెంత చెప్పినను వినినదికాదు. నేనా రత్నాంగితోఁగూడ మునువచ్చిన మార్గంబుననే భూలోకంబునకు వచ్చితిని.

చెట్టుదిగి యందు లవంగి గానక పదిచిహ్నములంజూచి యేడ్చుచు నోలవంగీ! లవంగీ! యని యయ్యడవి మారుపలుక యూరక యరవఁజొచ్చితిని. అప్పటికి లెక్కించుకొన నెలయైనది . ఇంతదనుక నిందుండునా! యేదియో క్రూరమృగము భక్షించి యుండవచ్చునని నేను నిశ్చయించితిని. దాని బుద్దిని గురించియుఁ నీతిని గుఱించియు రూపమును గుఱించియుఁ దలంచుకొని దుఃఖమాగక బిట్టు శోకించుచు నెట్టకేలకు నా రత్నాంగి యనునయ వాక్యములచే ధైర్యము తెచ్చుకొని యయ్యడవిలో వెదకుచు నడువఁజొచ్చితిని. ఇట్టు నడుచుచుండ మార్గములో నొక చెఱువు గనంబడినది. మణియును నగలును పుట్టంబులును గట్టునఁబెట్టి మే మిరువురము మార్గాయాసము వాయ నందు స్నానము చేయుచుంటిమి. అంతలో నొక గద్దవచ్చి గట్టున బెట్టిన నాగశిరోమణిని దన్నుకొనిపోయి దూరముగానున్న యొక చెట్టుమీద వ్రాలినది. అప్పుడు నేను భయపడుచు భైరవపక్షి మాట దలంచుకొన తటాలున లేచి రత్నాంగికి జెప్పక యది వ్రాలియున్న చెట్టుక్రిందకిఁ బోయితిని. ఆ గద్దయు నన్నుఁజూచి బెదరి మరల నెగిరి వేరొకమ్రానుపై వ్రాలినది. నేనును దాని చెంతఁ బోయితిని. ఈరీతి నా పతంగ మొకచెట్టు మీఁదనైనను నిలువక రాత్రింబగళ్ళు నడుచుచు నన్నుఁ బెద్దయుం దవ్వు దీసికొనిపోయినది నాకప్పుడు మాయాకురంగము వెంటనేగిన శ్రీరాముఁడు జ్ఞాపకము వచ్చెను. అవి వెన్నెలరాత్రు లగుట రాత్రిగూడ దాని విడువక వెంటనంటి యరిగితిని. అంత నది నాల్గవదినము సాయంకాలమున నయ్యడవిలో నుద్యానవనమందున యొక మేడమీఁద వ్రాలినది. దానింజూచి నేను జనరహితమగు నా సౌధంబులోనికి మెల్లనబోయి యాపక్షి చెంత జేరితిని. మరల నాగద్ద తద్దయు వేగముగా నెగరబోవునంతలో దానికాలి పట్టువదలి యామణి యందు జారిపడినది.

అప్పుడు పట్టరాని యానందముతో నా మాణిక్యమును గైకొని నేనా రత్నంగినిఁ దలంచుకొని యెంతదూరము వచ్చితినో తెలిసికొనలేక మిగులఁ జింతించితిని. నేను మిగుల నాకలి గొనియుంటిని గాన నా మేడలో నలుమూలల వెదకితిని అందాహారపదార్ధములు లనేకములు గనంబడినవి. వానిచేఁ గొంత యాకలి యడంచుకొని పైగదిలోనికిఁ బోయితిని. అందొక హంసతూలికాతల్పంబునఁ బదియారేడుంప్రాయముగల కలకంఠి యొకతె నిద్రింపుచున్నది. దానిఁజూచి నేను వెరగుపడి యోహో! యింత సోయగముగల యెలనాగ ఈ మేడలో నేకాంతముగా నుండుటకు గారణమేమియో గదా? యని తదీయరూపవైభవమంతయు వర్ణించుచు పెద్దతడ వక్కడనే నిలువంబడి చూచుచుంటిని.

ఇంతలో నానెలంత మేల్కొని యెదుర నన్నుఁజూచి పండ్లు పటపట గొరుకుచు చీ యీ మనుష్యులకు సిగ్గులేదు. ఎంత చేసినను మరల వచ్చుచుందురని పలికి నేనుఁ జూచుచుండ దను మేను పెంచి మహా యాగ్రహముతో నాకాళ్ళు రెండును గైకొని గిరగిర ద్రిప్పి విసరవైచినది.

అప్పుడు నామేను తెలిసినదికాదు. ఆ విసరున వచ్చి యీ తటాకములోఁ బడితిని. నీటిలోగాక మఱియొక చోటఁ బడితినేని బ్రాణములే పోవును. ఇందె నను నీ దయామూలముగా బ్రతికితిని. ఇదియే నా వృత్తాంతము. అట్టిసోదరిం బాసితిని. రత్నాంగితో వియోగమును బొందితిని. తండ్రినిం బ్రతికించుకొనలేక పోయితిని. ఇట్లు నేను బ్రతికియు నేమి లాభమని పలుకుచుఁ గన్నీరు విడిచెను. అతని చరిత్ర మంతయు విని లవంగియు మేనుగరుపార దేవకన్యకల పలుకులు దలంచుకొని అన్నా! వచ్చితివే యని మనంబున సంతసించుచుఁ దనగుట్టు బయలుపెట్టక యున్నవారివృత్తాంతము గూడ దెలిసికొనఁ దలంచి యూరకుండెను. అప్పుడు దొంగలచేఁ జెరదేఁబడి బాలయోగిచే విడిపింపబడిన చేడియ యతనికథ యంతయు విని యదిరిపడి హా! నాథా! వచ్చితివే యని యతనిం గౌగలించుకొనియెను. దానికి బాలయోగి వెరగుపడెను. అప్పుడా ప్రద్యుమ్నుడు చీఁకటిబాసి వెలుఁగువచ్చినది కావున నా వెలుతురున నానవాలు పట్టి యోహో! నా ప్రాణనాయకియగు రత్నాంగియే యని యవ్వనితను మరల గౌఁగలించుకొని బోఁటీ! నీ విచ్చోటి కెట్లు వచ్చితివి? అన్నా దైవఘటన మిట్టిది కాఁబోలు స్వాగతమేనా? యని యడిగిన నారత్నాంగి మగని కిట్లనియె.

నాథా! వినుఁడు మీరట్లు నన్నాతటాకములో విడిచి మాణిక్యమునకై పక్షి వెంట నరిగిన వెనుక మీరాకకై కొంతసేపు నేనా నీరాకరతీరంబున వేచియుంటిని ఎంత తడవునకు మీరు రాకపోవుటచేఁ బరితపించుచు మీరు బోయిన దారింబట్టి నడచుచుఁ బ్రద్యుమ్నా! యని యరచుచు మిమ్ము వెదికితిని. ఎందునను మీ జాడ దెలిసినదికాదు. అంతరాత్రి పడినది. కటికచీఁకటిలో గుండె రాయిచేసుకొని బ్రతుకు మీఁది యాశవదలి యొక చెట్టుక్రిందఁ బండుకొంటిని ఆ రాత్రి యేమియు నిద్రపట్టినదికాదు. అంతఁ దెల్లవారిన వెనుక మరలఁ నయ్యడవిలో మిమ్ము వెదకుచు నడుచు చుంటిని. ఈరీతి మూడురాత్రులు వెదకినను మీజాడ తెలిసినదికాదు.

అంత నాలుగవనాఁడు రాత్రి యక్కానలో మీకై చింతించుచున్న నా రొద విని దొంగలు వచ్చి నన్నుఁ బట్టుకొనిరి అప్పుడు నాకుఁ బ్రాణముమీఁద యాశవదలినది. స్మృతితప్పి మూర్ఛనొందితిని. పిమ్మట నామ్రుచ్చులు నన్నేమి చేసిరో నే నెఱుంగను. జాముక్రిందట నీ పుణ్యాత్ముఁడు వారింజంపి నన్ను విడిపించెను. ఈతనితో నీ గుడిలోనికి వచ్చి యీ రోగివద్దఁ గూర్చున్న వెంటనే మీరు తటాకములోఁ బడితిరి. ఇదియే నా వృత్తాంతము. మిమ్మును నన్నును నాపత్సముద్రమునుండి దరి జేర్చిన యీ పుణ్యాత్ముని వృత్తాంతమెట్టిదో తెలిసికొనఁదగినదై యున్నదని పలికిన నా ప్రద్యుమ్నుఁ డాబాలయోగికి నమస్కరించి యయ్యా! మీరు మమ్ముద్ధరింపవచ్చిన పరమేశ్వరులని తోచుచున్నది. మీ యభిదానవర్ణంబులం జెప్పి మదీయశ్రవణానందము గావింపుఁడని యడిగిన నవ్వుచు నాబాలసన్యాసి యిట్లనియె.

అయ్యా! మీ చరిత్రము వినిన నాకును మీతో బంధుత్వము గలిగినట్లేయున్నది. నేను మత్స్యదేశపు రాజకుమారుండను. నా పేరు జయసేను డందురు. నే నొక్కనాఁడు వేటకుఁబోయి గాలివానచే సేనలను విడిచి యొక్కరుండ గుఱ్ఱముతోఁ జీఁకటిలో దారితప్పి యొక మఱ్ఱిచెట్టు క్రిందకుఁ బోయితిని. అందొకసుందరి మెఱుపుల వెల్తురు నన్నుఁ జూచి అన్నా! ప్రద్యుమ్నా యిటురా! యని కేకలు పెట్టెను. దానికి నేను అదరిపడి దరికరిగితిని. ఆ చిన్నది నేను ప్రద్యుమ్నుఁడనే యనుకొని తటాలున వచ్చి కౌఁగలించుకొనినది. అప్పుడు కాంతా! నేను ప్రద్యుమ్నుఁడను కాను. నా పేరు జయసేనుఁడని నా యుదంతమంతయుఁ జెప్పితిని. పిమ్మట నమ్మదవతియుఁ దన యుదంతమంతయు జెప్పి యన్నకై చింతింపఁ దొడఁగినది.

నేనును దాని నోదార్చితిని. అదియొక పురుషుని ముట్టుకొని వేరొకని మరల ముట్టుకొనదు. గనుక నన్నే గాంధర్వ వివాహమాడినది. అంత మేమిరువురము ప్రద్యుమ్నుని వెదకుచు నయ్యరణ్యములోఁ దిరుగఁ జొచ్చితిమి. అటు తిరుగుచుండ నొకనాఁడు నీ విప్పుడు చెప్పిన యుద్యానవనమునందలి మేడలోనికిం బోయితిమి.

జనశూన్యమైన యామేడలో మూఁడురాత్రులు మేమిరువురము యదేష్టకామంబు లనుభవించితిమి. అంత నాల్గవదిన ముదయమున నా మేడయు నాలవంగియు నేమై పోయెనో కాని నేను దెల్లవారిలేచి చూడ నొక యడవిలో జెట్టుక్రింద నుంటిని. అప్పుడు భార్యావియోగము సైరింపలేక విరాగముతో యోగినై తిరుగుచుండ నొక నాఁడొక యోగిపుంగవుండు నాకు గనంబడియెను.

అతనికి మ్రొక్కి అయ్యా! నాభార్య యెందున్నది? యెప్పటికేని నేనుఁదానితో గలిసికొందునా ? యని యడిగితిని. అయ్యతి పుంగవుండు నా యెడఁ గనికరించి సంయోగినీదేవి నారాధించినం గలిసికొందురని చెప్పి ఈ యరణ్యము గురుతెరింగించెను. నేనును దిరిగితిరిగి నిన్నరాత్రి కీప్రాంతము జేరితిని ఇందీసుందరిని దొంగలు చెరదెచ్చుట జూచి జాతిధర్మంబు విడువక యోగదండములో నమర్చియున్న కత్తిచే జంపి యీ లతాంగియు నేనునుఁ నీ గుడిలోనికి వచ్చి యీ యోగినియొద్ద గూర్చుండు నంతలో నీవీతటాకములోఁ బడితివి. నిన్ను లేవదీసితిని. ఇదియే నా వృత్తాంతము.

నీవే యాప్రద్యుమ్నుఁడవై యాలవంగియే నీ చెల్లె లైనచో నీవు నాకు బావ వగుదువు ననుటయు నా ప్రద్యుమ్నుఁ డతనిం గౌగలించుకొని బావా! నిక్కముగా నిన్ను వరించినది నా యనుంగు సోదరియే దాని మరల నెట్లు గలిసికొందుము. అయ్యో! దానినిందు విడిచి యొక్క రుఁడ నేనింటికిఁ బోగలనా? దైవము కొంచెము మన కనుకూలుఁడై నట్లు తోచుచున్నది. లవంగికూడ మనతోఁ గలిసినచో నీ యతి కనేక వందనములు పెట్టెదము. ఈ దేవి కనేకముగాఁ బలులిప్పింతుమని యాకురముగాఁ బలుకుచున్న యన్న మాటలను పతి వచనంబులును విని యోగినిగానున్న యా లవంగి, అన్నా! ప్రద్యుమ్నా! యోహో నాథా! మీరింక నాకై చింతింపకుడు నేనే లవంగిని. మనయెడ దైవమునకుఁ బూర్తిగా ననుగ్రహము వచ్చినది. ఈ సంయోగినీదేవి యనుగ్రహమే మరల నందర నిచ్చోటికి చేర్చినది. నా వృత్తాంతము వినుండని తన కథయంతయు వారి కెఱింగించెను. అప్పుడు ప్రద్యుమ్నుడు పట్టరానిసంతోషముతో జెల్లెలిం గౌగలించుకొని కన్నుల నీరు గార్చుచు గొండొక సేపు మేనెఱుంగక దైవమును ధ్యానించుచుండెను.

అంతలో మరల విచారమును దెచ్చుకొని యతండు లవంగి కిట్లనియె. అమ్మా! మన యాపదలన్నియు దైవము దాటించెను. మన తండ్రిమాట మనము మరచియే పోయితిమి. ఆయన బ్రతికియుండిన మనలజూచి సంతోషించునుగదా! అతండు లేనినాఁడు మనలనుజూచి సంతసించువారెవ్వరు? ఇందులకై నాకు విచార మగుచున్నది. యేమి చేయవలయునని పలికిన విని యక్కలికి యన్నా! అందులకై నీవు చింతింపకుము. మనతండ్రి బ్రతుకుమార్గము దేవకన్య లాడుకొనిన మాటలచే దేటపడినది. చేప నవ్విన కారణము నేను జెప్పగలను. కాని లెక్కించిచూడ నేటి సాయంకాలమే మన తండ్రిని నురిదీయు సమయము. ఈ దివసముతో నారుమాసము లైనది ఇంతలో నింటికెట్లు పోగలము. మనగ్రామ మేదిక్కున నున్నదో మన మెఱుగము. దీని కేదియేని యాధారమున్న జెప్పమనిన నతం డిట్లనియె. అమ్మాణీ! ఆ కారణము యథార్ధముగా నీకు దెలిసినచో నేనీ సాయంకాలము లోపుగా మనము మన గ్రామము చేరునట్లు చేయగలను. చూడుమని యప్పు దాత్మగతంబున బూర్వము వరమిచ్చిన బైరవపక్షులం దలంచుకొనియెను.

అంతమాత్రముననే యా పక్షులువచ్చి ముందు వ్రాలినది . దానిం జూచి ప్రద్యుమ్నుడు సంతసించుచు దనకథ యంతయుం చెప్పి సాయంకాలము లోపుగా దమ్ముఁ దమపురమును జేర్చుఁడని వేడుకొనియెను అప్పుడా పక్షులు చెరియొక యిద్దరిని దమ రెక్కలమీఁద నెక్కించుకొని గరుత్మంతుడుబోలె నతిరనంబునఁ బ్రొద్దు గ్రుంకక పూర్వమే మిక్కిలి దవ్వుగానున్న ధర్మాపురమునకుఁ దీసికొని పోయినవి.

ఆహా! వాని గమనవేగ మెట్టిదో చూడుము. అప్పుడా గ్రామ మంతయు హల్లకల్లోలముగా నున్నది. వీధుల గుంపుగుంపులుగా జనులు గూడికొని మంత్రి మాటలు చెప్పుకొనుచుండిరి. ఆయ్యో! ఈ మంత్రికెట్టి యాపద వచ్చినదో చూచితిరా ? యుఱికంబము నొద్దకుఁ దీసికొనిపోయిరి. కొడుకును గూఁతురను గూడ నారు మాసముల క్రిందట దేశాంతర మేగిరఁట వారు దగ్గరలేరు. పాపము భార్య యొక్క రీతియ యా బండి వెనుక నేడ్చుచుఁ బోవుచున్నది. వారేమైపోయిరో తెలియదు. రాజెంత దయాశూన్యుఁడో కాని యతని కొడుకును కూఁతురు నింటికి వచ్చు వరకైన నిలుపరాదు గాఁబోలు. పాపమా మంత్రి నీకేమి కోరిక యున్నదని యడిగిన దన సంతానముఁ జూడఁ గోరికొనియెనఁట. రాజుగారు దానికి సమ్మతింపలేదు. అయ్యో! తుదకు వాని కపరక్రియ జేయువారు గూడ లేరుగదా యని యనేకరీతులఁ బ్రజలు చెప్పుకొనఁ దొడంగిరి. ఆ మాటలన్నియు నాలించుచుఁ బ్రద్యుమ్నుఁడు లవంగియుఁ దిన్నగా నా యురికంబము నొద్దకే యా పక్షుల నడిపించిరి.

అప్పుడు మంత్రి నురికంబమునొద్ద నిలువఁబెట్టిరి. కొందరు పెద్దమనుష్యులు దాపుగా నిలువంబడిరి. మంత్రి భార్య యేడ్చుచు మగని యడుగుల మ్రోలఁబడి యుండెను. చూచు వారందరు కన్నీరు గార్చుచుండిరి. రాజకింకరులు దండనాథునితో అయ్యా! మంత్రి నుఱిదీయుట కనుజ్ఞా? యని యడిగిన నతండు చేయి వీచి యాజ్ఞ యిచ్చెను. అందఱు హరినామస్మరణ చేయుచుండిరి.

పిమ్మట నతని తల నురిత్రాటిలోఁ దగిలించిరి. ఇంతలో నా పక్షులు రెక్కల గాలి చప్పుడువిని యందరు నద్భుతమందుచు నా దిక్కుగాఁ జూచిరి. అంత నాపక్షులు రెండును వారిమ్రోల వ్రాలినవి. అప్పుడు ప్రద్యుమ్నుఁడు లేచి చేయెత్తి యోహో! మంత్రి నుఱిదీయకుఁడు ఉరిదీయకుఁడని కేకలు పెట్టెను. ఆ ధ్వనిని విని యురిదీయువారలు భయపడి మంత్రి శిరస్సును ద్రాటిలోనుండి తప్పించిరి. అక్కటి యధికారి ప్రద్యుమ్నునితో నోయీ! మంత్రి నురిదీయవలదని నిర్భయముగాఁ బలుకుచుంటివి. నీ వెవ్వఁడవు. నీకేమి యధికారమున్నది? నీవు చేఁప నవ్విన కారణము జెప్పఁగలవా యని యడిగినఁ బ్రద్యుమ్నుం డిట్లనియె.

అయ్యా! నేను మంత్రికుమారుండను నా పేరు ప్రద్యుమ్నుఁడు. నేను చేఁప నవ్విన కారణము నిశ్చయముగాఁ జెప్పఁగలను. మంత్రి నురి తీయింపకుఁడు అని చెప్పెను. ఆ మాటలువిని యెల్లరు సంతోషించిరి అప్పుడు దండనాథు డా వార్త రాజునొద్దకు బోయి చెప్పెను. రాజు నురిదీయువారితోఁ బ్రద్యుమ్నుమాట వినువఱకు మంత్రి నురిదీయవలదవి యాజ్ఞాపించి వారినెల్ల రప్పించుకొని ప్రద్యుమ్నా! చేఁప నవ్విన కారణము చెప్పఁగలవా! నీ తండ్రిని విడిపింతు ననుటయు నతం డయ్యా! యా కారణము తప్పక చెప్పెదను. సభ చేయింపు డనుటయు సింహధ్వజుఁ డప్పుడే పౌరులనెల్ల దన యాస్థానమునకు వచ్చునట్లాజ్ఞాపించెను. సామంత నృపాల పౌర పండితయుతుండై యా నృపాలుండు పెద్దకొలువుదీర్చి కూర్చుండెను.

అచ్చటికి లవంగియు, బ్రద్యుమ్నుఁడు, జయసేనుఁడు, రత్నాంగియు వచ్చి యుచితస్థానముల గూర్చుండిరి. మంత్రినిఁగూడ నచ్చటికి రప్పించిరి. కొలువువారెల్ల ప్రద్యుమ్నుని యుపన్యాసమును వినగోరుచున్న సమయంబున రాజు ప్రద్యుమ్నునికిఁ జేప నవ్విన కారణమును జెప్పుటకు సెలవిచ్చెను. అప్పుడు ప్రద్యుమ్నుఁడా వార్త జెప్పుటకుఁ దన ప్రక్కనున్న లవంగివి నియోగించెను. అంత నా నెలఁతయు బతి యనుమతి వడసి లేచి నిలువంబడి సభాసదులకు నమస్కరించి యెల్లరు విన రాజుతో నిట్లనియె. రాజా! భగవంతుడు పశుపక్షిమృగాదికముల కేదియో యొకశక్తి పరి పూర్ణముగా నిచ్చి మనుష్యకోటికి సకలవిధజ్ఞానశక్తియు నొసంగెను. అట్టి మనుష్యజాతియందు జనియించియు గూడని కార్యములయందుఁ బ్రవర్తించు యుక్తాయుక్తవివేకశూన్యులగు మనుష్యులకంటె నితరజాతియే నీతిగలదని చెప్పవచ్చును. పిపీలికాజ్ఞానము విహంగజ్ఞానము పశుజ్ఞానము జలచరజ్ఞానము మనుష్యజ్ఞానమునకు మించి యొప్పును. ఆ చేప యూరక నవ్వినదికాదు. అందుకు మంచికారణమే యున్నది. దానిం జెప్పుమని మీరు మంత్రికి నాజ్ఞాపించిరి. ఆయనకు మారుగాఁ గొమార్తెను నేను జెప్పుచుంటిని. ఆ కారణము వినిన మీకుఁ గోపము రాకమానదు. అందుమూలమున నన్నపరాధినిగా నెంచితరేని రెండవ యుపద్రవము సంప్రాప్తించఁగలదు. రాజాజ్ఞ యెట్టిదైన నడ్డుచెప్పు వారుండరు. కావున నది యెట్టిదైనను క్షమింతుమని నా కభయపత్రిక నిత్తురేని వక్కాణించెద. లేకున్నఁ జెప్పనేరనని సహేతుకముగాఁ బలికిన విని యా నరేంద్రుఁడు తదీయు గంభీరోపన్యాసమునకు సిగ్గుపడుచు నిట్లనియె.

ధరుణీ! చేఁప నవ్విన కారణము నిదర్శనముగాఁ జెప్పితివేని యెంత యపరాధమైన సైరించెద నందులకు సందియ మక్కరలేదు. చెప్పుము చెప్పుమని తొందర జేయుచు నట్టి పత్రిక వ్రాసియిచ్చెను. అప్పుడా చిన్నది, మహారాజా! పురుషులకంటె స్త్రీలకు సాహసము కామము మొదలగు గుణము లారు రెట్లధికమని శాస్త్రములు జెప్పుచున్నవి. వనితలు పరపురుషసంగమాభిలాషినులనికదా? తరుచు నంతఃపురములోఁ బెట్టి కాపాడుచుందురు.

శ్లో॥ నగృహాణీ నవస్త్రాణి నప్రాకార స్స్తిరస్క్రియాః
     నేదృశారాజ సత్కారావృత్తమాభరణం స్త్రీయాః॥

అంతఃపురములును వస్త్రములును ప్రాకారములును తెరలును రాజసత్కారములును స్త్రీల కాభరణములై కాపాఁడజాలవు స్త్రీకి సద్వృత్తమే మంచియాభరణము యని వాల్మీకి చెప్పియున్నాఁడు. నీవు నీ భార్యల ననేక రక్షకభటరక్షితంబులగు నంతఃపురంబులంబెట్టి పోతుటీగనేనియుఁ జొరనీయక పాపాడుచుంటివి. వారు సచ్ఛీలలై యున్న వారనియే తలంచుచుంటివి.

అల్లనాడు పల్లెవాండ్రు చేఁపను దీసికొనివచ్చినప్పుడు దాని నంతఃపురమునకుఁ బంపదలంచి యది యాఁడుదియా మగదియా యని యడిగితివి. అది మగది యేయైనచో మీ భార్యలకు మానహాని వాటిల్లుననియేకదా తలంచితిరి మీ ప్రశ్నకారణ మామత్స్యశ్రేష్టంబు గ్రహించి పక్కున నవ్వినది. ఇదియే చేఁప నవ్విన కారణమని పలికిన విని యా రాజు తల కంపించుచు నిట్లనియె.

ఇది మాకుఁ దెలియని విషయముకాదు. నీవు చెప్పిన సమాధానము సరిపడి యుండలేదు. నే నట్లడిగినంతనే కారణములేక యూరక నవ్వరు. నీవు తగిన నమాధానము చెప్పి యొప్పింపుము. లేకున్న మీ తండ్రి నురితీయింపక మాననని చెప్పిన విని యక్కలికి నవ్వుచు నిట్లనియె.

మహారాజా! మీరెంత పని చేయుటకై న సాహసులే! కానిండు మీ భార్యల యంతఃపురమును గాచుచున్న యాడువాండ్రనెల్లర నిక్కడికి రప్పింపుడు వారిచే నా కారణము చెప్పింతును. మీరు స్వయముగాబోయి యెట్లున్నవారి నట్లు దీసికొని రావలయునని కోరిన నా నృపతి యుచితపరివారముతో నప్పుడపోయి శుద్ధాంతమందున్న స్త్రీలనందరం దీసికొనివచ్చి లవంగిముందు నిలబెట్టించెను.

అప్పుడు లవంగియు వాండ్రఁ బరీక్షించి సన్నని బట్టలు కట్టించి స్నానముచేసి రండని యాజ్ఞాపించినది. వారప్పని కొడంబడిరికారు రాజశాసనము ప్రయోగించుటచే వాండ్రు దాపుననున్న తటాకములో స్నానము చేసివచ్చి సభలో నిలువంబడిరి వారికి స్త్రీచిహ్నము లేమియునులేవు పురుషచిహ్నము లన్నియు స్పష్టముగాఁ గనంబడినవి. అప్పుడా చిన్నది సభ్యులదిక్కు మొగంబై ఆర్యులారా! వీండ్ర జూచితిరిగదా? వీరాడువారో మగవారో తెలిసికొంటిరా? పాప మీ రాజు వీరినందర నాఁడువారనియే తలఁచి యంతఃపురమున గాపుపెట్టి భార్యలశీలముల గాపాడుచున్నానని సంతోషించుచుండెను. తన యంతఃపురమున నున్నవాండ్రు ఆఁడువారో మగవారో తెలిసికొనలేని యీ మూఢుఁడు నన్నాఁడుదియా మగదియా యని యడుగుచున్నాడే! మగదానినైనను నే నేమి చేయుదును. ఇంతకన్న నవివేకి యెందైనం గలఁడా? యని దివ్యజ్ఞానసంపత్తి గల యామీనంబు నవ్వి మేను బాసినది. రాజా! యిప్పుడైన నే జెప్పిన కారణము సరిపడినదియా? ఇట్టి దేవరహస్యము చెప్పుమని యడిగి చెప్పనిచో నుఱిదీయింపఁ బూనిన నీయొద్దఁ గొలువు చేయుటకంటె మహాపాతకము లేదనిచెప్పి యప్పఁడతి పీఠముపైఁ గూర్చుండెను.

అప్పుడు సభాసదులెల్ల కరతాళములు వాయించిరి. రాజు మొగమునఁ గళదప్పినది. సిగ్గున తలవంచుకొని తనకుఁ దాన నిందించుకొనుచు మంత్రి పాదంబులబడి మహాత్మా! నిన్నూరక చంపఁబూనిన నా తప్పు మన్నింపుము. నీ కూఁతురు నాకు మంచిబుద్ధి జెప్పినది . నాకీ రాజ్యమక్కరలేదు . నీవే పాలింపుమని మిక్కిలి దీనుండై వేడుకొనుటయు మంత్రి యతనియందుఁ బ్రసన్నుండై రాజు సంతోషించునట్లు తిరుగా నుత్తరము జెప్పెను.

అప్పుడు సభలో లవంగి చెప్పిన యుపన్యాసమువిని సభాసదులెల్ల విస్మయ సముద్రములో మునిగిఁపోయిరి. లజ్జాభయక్రోధసంభ్రమములతో నాభూపతి యప్పుడె యా యంతఃపురద్రోహులనెల్ల నినుపచిక్కములలో నెక్కించి బిగియగట్టించి యొకతోటలో వ్రేలగట్టించెను.

పిమ్మట రౌద్రావేశముతోఁ గత్తిదీసికొని యంతఃపురమున కరుగుచున్న రాజు సన్నాహముచూచి లవంగి యడ్డపడి భార్యలం జంపవలదని యెన్నియో ప్రతికూల వాక్యములు జెప్పినది. కాని యతని యహంకార మణఁగినదికాదు. భార్యలనందఱ బరిభవించి యారాజు రాజ్యము మంత్రి కిచ్చివేసి తాను తపోవనంబునఁ కరిగెను.

మంత్రియు లవంగివలన వారుపోయిన వృత్తాంతమంతయు విని సంతసించుచు గొడుకును గోడండ్రను గూఁతురును నల్లుండును దన్ను భజింప మహావైభవముతోఁ బెద్దకాలము రాజ్యము గావింపుచు ధరిత్రీతలంబున సకలసౌఖ్యము లనుభవించెను.

గోపా! నీవు చూచిన యినుపచిక్కములలో నున్న వారు అంతఃపురద్రోహులు వారే. తైలసిక్తములగుట వారి కళేబరములు చెడక పెద్దకాలమట్లే యున్నవని చెప్పి మణిసిద్ధ యతీంద్రుఁడు శిష్యునితోఁగూడ బోయిపోయి యొకనాఁడు సాయంకాలమునకు జగన్నాథంబు బ్రవేశించెను.

తో ద క వృ త్త ము

    వాగ్వినితాప్రియ వారిజనాభ
    ప్రాగ్వరముఖ్య సుపర్వగణేడ్యా
    దిగ్వసనాంచిత ధీరజనో క్తి
    స్రగ్విభవార్చిత చంద్రకపర్దాత॥

క. మంగళమగుఁ బ్రజలకు నృప
   పుంగవు లేలుదురు ధర్మబుద్ధిదనర ధా
   త్రిం గోవులకును విప్రుల
   కుం గల్గుశుభంబు మనుజకోటి జెలంగన్.

క. కరలోచన కరితారే
   సర్వ సంఖ్యా కలితశాలి శకదీపిత శా
   ర్వరివత్సరమునఁ గాశీ
   పురయాత్రావసధ చరితముం జేసితిగా.

గద్య-ఇది శ్రీమద్విశ్వనాథ సదనుకంపాసంపాదిత కవితావిచిత్రాత్రేయ ముని

సుత్రామగోత్ర పవిత్ర మధి కులకలశ జలనిధి రాకాకుముదమిత్ర లక్ష్మీ

నారాయణ పౌత్ర కొండయార్యపుత్ర సోమిదేవీ గర్భశుక్తి ముక్తాఫల

విబుధజనాభి రక్షిత సుబ్బన్నదీక్షిత కవి విరచితంబగు శ్రీకాశీ

యాత్రావసధర చరిత్రమను మహాప్రబంధంబునందు

ప్రథమ భాగము సమాప్తము.

శ్రీ విశ్వనాథార్పణమస్తు.

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ