Jump to content

కాశీమజిలీకథలు/మొదటి భాగము/రెండవ మజిలీ

వికీసోర్స్ నుండి

రెండవమజిలీ కథ

విను మట్లు మాయావస్త్రములు ధరించి రాజుగా రూరేగింపున కఱిగిన వెనుక వరప్రసాదు లట్టిచీటిని వ్రాసి గోడ కంటించి తమసామగ్రి గుఱ్ఱంబులపై సద్దుకొని యయ్యుత్తమాశ్వము లెక్కి యొరు లెరుంగకుండ నుత్తరమార్గంబునం బడి మునువోలె నతిజవంబునం బోయిరి. అమ్మార్గంబున గడునడవి బలసియుండుటచే నరుగ సంకటమైయున్నను వెరువక వారు వారువముల నేకరీతి నడిపించుచు నడ్డము వచ్చిన క్రూరసత్వంబుల బరిమార్చుచు ఫలహారములచే నాకలి యడంచుకొని మూడుదినము లేకరీతి నడచిరి కాని తెరపి కాన్పించినది కాదు.

మూడవనాడు మధ్యాహ్నంబున వారు పిపాసావివశులై యరుగుచుండ దైవవశంబున నొకచో మధురసలిలవిలసితమగు సరోవరముతీరంబున శాఖాంతకర్షితదిగంతమగు వటవృక్ష మొండు నేత్రపర్వము గావించినది.

దానిం జూచి మిగులసంతసించుచు నాపురుషశ్రేష్ఠు లం దొకచో గుఱ్ఱముల దిగి మార్గాయాసంబు వాయ నత్తటాకంబున జళకేళిందేలి యందు వంట జేసికొని భుజించినవెనుక శీతలసాంద్రచ్ఛాయాభిరామంబగు తత్ప్రదేశంబున దత్సరోవరకమలముకుళసౌరభచోరకంబులగు మలయానిలకిశోరంబులు మార్గశ్రమం బపనయింప హాయిగ నిద్రించి కొండొకవడికి మేల్కని యల్లన నాపాదపచ్చాయంబుల దిలకించుచు నాలుగుదిశలను వ్యాపించియున్నశాఖలు నాల్గంటికి నవసానము గాన్పింపని మిగుల వెరగందుచు ఆహా! యీ వటవృక్ష మెంతవింతగా నున్నదో చూచితిరా? ఇందు మనమెన్నడు జూడని విచిత్రపుపక్షు లెన్నియో కులాయంబుల నిర్మించుకొని హాయిగా విహరించుచున్నవి. మఱియు నుక్కుకంబముల వంటి యూడలచే భరింపబడి నలుదిక్కుల కొసలారయు తలంపునబోలె వ్యాపించియున్న యిన్నగశాఖలంబడి శృంగాటకంబునవలె నిరాటంకంబుగా శకటంబులు సైతము బోవచ్చునుగదా! అని పెక్కుతెరగుల నామ్రానుసోయగము వర్ణించుచుండ రాము డొకయుత్సాహంబు మనంబునం దీపింప వారితో నిట్లనియె.

తమ్ములారా! ఈకొమ్మల పొడవెంత యున్నదో చూతమే! యనుటయు వారు వల్లె యనిన పిమ్మట వెండియు నతం డట్లయిన నెల్లర మొక్కొక్కశాఖం బరీక్షించినచో బెక్కుదినములు పట్టును.

సాంబుడు తక్క దక్కిన నలువురము నాలుగుకొమ్మలవెంట బడిపోయి యా దెసనున్న విశేషంబులం దెలిసికొనివత్తము. అప్పయనంబున కారుమాసములు గడు వేర్పరచుకొనియెదము. ఏపాటి వింతలు గాన్పించినను నమ్మితి దాటింపం మరల తరువు మొదలుచేరవలయును. అందరును జేరుదనుక దక్కినవా రీప్రదేశమున నుండదగినది. ఇదియ ముమ్మాటికిని ప్రమాణమని యొకరిచేతిలో నొకరు చేయివైచికొని తురగములను వస్తువులను గాచుటకై సాంబుని నాతరుమూలంబున నుండ నియమించి తూర్పుదెసకు వసంతుడును దక్షిణమునకు రాముడును బశ్చిమమునకు బ్రవరుండును నుత్తరదిశకు దుండుడును నాకొమ్మ లెక్కి పోయిరి.

వసంతుని కథ

అందు రాజకుమారుండు తూర్పుదెస కఱిగిన కొమ్మమీద భూమిమీదవోలె రెండహోరాత్రంబులు నడిచెను. పిమ్మట నిలువంబడి నడచుటకు వీలు లేక చేతులంగూడ మోపుచు నాలుగుదినములు నడిచెను. పిమ్మట రెండునాళు లంతకన్న సన్నమగుట మఱియు బ్రాకి నడువవలసి వచ్చినది. ఇట్లు ఎనిమిది దివసములు నడచునంత నాకొమ్మ యవసానము గాన్పించినది. ఆ చివర నిలువంబడి చూచిన నొకవింత గనంబడెను. మొదట బ్రళయకాలవాతూలరమాలోలకాలజీమూతమాలికవలె నలుదెసలం గ్రమ్ము ధూమమ్మును అంతలో నాధూమస్తోమం బదృశ్యమై తదందమునుండి ప్రచండమధ్యందినమార్తాండకిరణప్రకాండసముద్దీపితవీతిహోత్రప్రజ్వలజ్జ్వాలామాలికల పోలికను నాలుక దెరచికొని దెస లావరించు పెనుతేజంబును అదియు జూడజూడ నగోచరంబై విద్యుత్ప్రభావిభాసురాభ్రంలిహాగ్రంబులగు కార్తస్వరమయసౌధచయంబులును గాన్పించినవి.

అప్పుడు వెరగుపడి యతం డోహో! ఇది యొకపట్టణమువలె నున్నది. మొదట గనిపించిన వికారములన్నియు నేతన్నగరప్రభావబలంబులే! మేలు మేలు! నాకింకను మొదలు చేరుటకు జాలగడువు గలదు. కావున నింతలో నీపురవిశేషంబు లరసివచ్చెద గాకయని నిశ్చయించి యల్లన నాశాఖాగ్రంబునుండి పుడమికి దిగి ధైర్యసాహంబులే తనకు దోడులై యుండ నాపట్టణమున కరిగెను.

అం దొకమానవుడుగాని జంతువుగాని పక్షిగాని కనంబడలేదు. సాహసముతో బురము ప్రవేశించి యాసౌధంబుల తలుపులన్నియు ముద్రానిగళఘటితములై యుండుటం జూచి యెన్నడును జనసంచారము లేనట్లు తోచినతోడనే యతండు ఔరా! ఇది మునుపు చూచిన కానీనుని నగరముకన్న చిత్రముగా నున్నదే. అతనికన్న బుద్ధిమంతు డీపుర మేలుచున్నవాడు గాబోలు. నిదియుం జూచెదంగాక యని యప్పురవీథులంబడి నడువ సాగెను. అందలి గృహములన్నియు నేకరీతిగా నుండుటం బట్టి తిరిగినవీథినే తిరుగుచు జూచినగృహమునే చూచుచు ననేకవిధంబుల బరిభ్రమించి పెక్కుతడ వావీట మేటివీథులన్నియు దిరిగెను. వచ్చినవీథియుం బోయినవీథియు దెలిసినదికాదు. అట్లు తిరుగుచుండ గొండొకవడికి క్రొత్తవీథి యొకటి కనంబడినది. దీని వెంబడిబోయి యెవ్వరును గనబడకపోయినచో మగిడి చనియెదంగాక యని నిశ్చయించి యావీథింబడిపోవుటయు నందుగూడ మునువోలె నెవ్వరును గనబడలేదు. అంతకు మున్ను చూడని గొప్పకోట యొకటి గాన్పించినది.

దానిం జూచినతోడనే యతని కెడద నొకవిధమగు వేడుక బొడముటయు నిందు దప్పక జను లుందురని తలంచి యక్కోటగుమ్మ మరయు తలంపున ముమ్మారు దానిచుట్టు దిరిగెను. ఎందును ద్వారము గాన్పించినదికాదు.

దాని కతం డొక్కింత చింతించి యిట్టి కోటలోపలకు మార్గ ముండకపోవునా? యెద్దియేని గుప్తముగా నుండవచ్చును. నమ్మఱుగు తెరవరసెదంగాక యని మఱియు నక్కోటచుట్టును, దిరుగుచు నేల నెరియలం బరిశీలించుచుండ నొకదండ నొకగొణ్ణెము గనంబడుటయు దానింబట్టుకొని పైకిలాగినతోడనే యొకగుమ్మము తెరువబడినది. అది గుహలాగున్నను నదియే కోటలోనికి మార్గము కావచ్చునని నిశ్చయించి ధైర్యంబున నందు జొచ్చెను. చీకటిచే కొంతదనుక నతని కేమియు గాన్పించినదికాదు. నడువనడువ మఱల వెల్తురు గానంబడ దొడంగిన సంతసించి యతండు చివర కామార్గముననే కోటలో బ్రవేశించెను.

అయోమయంబగు నక్కవాటం బతండు గోటలో ప్రవేశించిన వెంటనే యెప్పటియట్ల మూసికొని పోయినది. కోటలో బ్రవేశించిన యతనికి మొదట నెవ్వరును గాన్పించలేదు. ఒక యుద్యానవనము గానంబడినది.

అదియు మధురఫలరసాస్వాదనరతమదశుకపికప్రముఖశకుంతసంతానస్వానగాన లసమానంబులగు పాదపకాయమానంబుల నల్లిబిల్లిగ నల్లుకొను వల్లరీసల్లలితలతానితానంబునకు బ్రోదులగు వేదుల జలయత్రవర్థితద్రుమకమనీయదళకిసలయప్రసూనరసపానలోలరోలంబకదంబఝంకారముఖరితంబై యుంట దిలకించి జనసంచారంబులేక యిట్టి మనోహరోద్యానవనం బుండనేరదని నిశ్చయించి యందు విసరు శీతలమందమారుతముల మార్గాయానము వాయ నల్లన నత్తోటం దాటి మఱియుం గొన్నివాకిళ్ళు గడచి విచిత్రవస్తుసిస్తులాలంకృతంబులగు ననేకభవనంబుల గాంచియు మునువోలె నందెవ్వరిం గానక విభ్రాంతస్వాంతుండై అయ్యో! ఇట్టి దేవతాభవనంబుల జనులు లేకుండుట కెద్దియో కారణంబని మఱియు మఱియుం దిరుగుటయు దేవసభం దిరస్కరించు సభయొకటి నేత్రపర్వము గావించిన నచ్చటి కరిగి దాని యలంకారమున దచ్చెరువందుచు నలుదిక్కులం బరికింప నొక దెస సోపానంబులు గానంబడినవి.

అమ్మెట్లెక్కి పోయిన మునుజూచిన సభకన్న వింతయైన రవిరహితమగు మందిరమొండు గానంబడియెను. దానిం దిలకించి మూలనున్న యున్నతసోపానంబులం బడి యరుగుటయు నంతకన్న వింతయగు నిశాంతమొండు చూడంబడినది. ఈరీతి నాఱుమేడలం గాంచి యం దద్భుతమైన యలంకారముగాక మరియెవ్వరినిం గానం దైర్యంబున యెండియు జూచెదంగాక యని యందున్న నారోహణశ్రేణిమీదుగా నెక్కుటయు వేరొక్కచక్కనియంతపురము జూడనయ్యె. అదియు నదివరకు జూచినవికాయముల కన్న రమణీయమగు నలంకారముల శోభిల్లుచుండుటం జూచి యిందు దప్పక జను లుందురని నిశ్చయించి లోని కరుగుటయు నాభవనాంతరంబున హంసతూలికాతల్పమున నిద్రించుచు ననన్యసామాన్యలావణ్యమాన్యయగు కన్యయొకరిత యతనికి నేత్రపర్వము గావించినది.

అక్కాంచనగాత్రిం గాంచి మేను పులకింప నట్టె నిలుచుండ యతం డాహా! యివ్వరారోహనుగేహాలంకారమునకై చిత్రకారుండు బంగారునం గాంచి యిట్లుంచె గాబోలు. నిజముగా నిట్టికాంతలు లోకాంతరములయందైన గలిగియుందురా! కలిగియున్నచో నట్టియన్నుమిన్నుల గాంచువానిదిగదా భాగ్యమని మఱియుం దిలకించి యప్పంకేరుహాసనపై నిజాలోకనజాలంబులు నెరయజిమ్మి యాహా! యిప్పుడ నా కట్టిభాగ్యము సమకూరినట్లు తోచుచున్న దే! ఇది చిత్రంపువాల్గంటి యనుకుంటిగాని కాని యట్టునిట్టూర్పులం గదలు తదీయపయోతరంబులే నయనబంధువులయి చెప్పుచున్నవి. కాదుకాదు. అదియుం జిత్రకారకుని రచనాచమత్కృతియే కావచ్చు. భ్రమస్థితిని లేనిచో నిట్టి విజననికేతమున నేకతమున నేకతమ యిట్టి మనోహారగాత్రి నివసించెడిని? అని యాసందియము వాయ దాయంబోయి యప్పూబోడి మేనిపై గేలిడి యక్కుసుమగాత్రి గాత్రస్పర్శసుఖం బభినయించుచు నౌరా! యేమి నాభాగ్యము ఇప్పొన్నికొమ్మ బంగారుబొమ్మ యనుకొంటిని కాదు. నిజమైన వాల్గంటియే మేలు మేలు. నాకు గన్నులు గలిగినందులకు నేటికిగదా సాఫల్యమైనది.

ఇక్కన్నియు పన్నగ పన్నగవేణియో, యచ్చరమచ్చకంటియో, విద్యాధరవిద్రుమాదరియో, గంధర్వపర్వేందువదనయో, కిన్నరకిన్నరకంఠియో, శక్రచక్రవాస్తనియో, సాధ్యహరిమధ్యయో, సిద్ధపల్లవపాణియో, రంభారంభోరువో, యక్షగజగామినియో, భాస్వరకాంతస్వరగాత్రియో, రతియువతియో కావలయు గానిచో మానిసి ప్రోయాండ్ర కీసోయగము గలదే!

అని పెక్కుగతుల నాచక్కెరబొమ్మ మేనిసొంపు నాపాదమస్తకము వర్ణించుచు నట్టె యయ్యెలనాగ చెక్కిలి గ్రక్కున దద్దయుం బ్రీతి ముద్దుపెట్టుకొని యనాఘ్రాతకుసుమమగు నక్కిసలయపాణి మేనిపొత్తు నాకత్తెనేని జిత్తభవుం బతిచరుంగా చేసికొననే యని మదనవేదనాదోదూయమానసుండై యప్పల్లవపాణి నల్లన లేపబోయియు నిద్రాభంగంబు సేయనోపక తడబడుచుండ నింతలో నత్తలోదరి యదరిపడి లేచినది. అట్లు లేచి యెదురు మదనసుకుమారుండగు నారాజకుమారుం గాంచి యా యించుబోడి మేను బులకింప విభ్రాంతస్వాంతయై యొక్కింతసే పేమియుం బలుక నేరక, ఏమీ? యిది నాకు స్వప్నమా? కాదు. జాగ్రదవస్థగానే యున్నది. ఈగృహంబున నున్న వస్తుజాలంబులన్నియు బ్రత్యక్షముగా జూచుచుంటినే? ఇదిగో నాకన్నులు తెరువబడియే యున్నవి. ఈ యేకాంతప్రదేశమునకు వసంతుంబోలిన యీ పురుషరత్నం బెట్టువచ్చెనో! మదీయభాగ్యదేవత యిట్లు పుత్తెంచెనేమో యరసెదంగాక యని యెట్టకేలకు బికస్వరంబున నతనితో నిట్లనియె.

ఓ మదవతీమదనా! నీవదనంబు జూడ మిగుల సుకుమారవంతుడువుగా గాన్పించుచుంటివి. నీ విక్కాతారంబున నేకాంతముగానున్న యీరాక్షసశుద్ధాంతమున కెట్లు వచ్చితివి? నివాసదేశంలబెద్ది? భవదీయనామాలంకృతంబులైన వర్ణంబుల వివరించి కర్ణానందం బాపాదింపుము. మద్దత్తంబగు నాతిథ్యం బంగీకరించి నన్ను కృతార్ధురాలిం గావింపుమని వినయంబున బ్రార్థించిన దదీయమృదుమధురమనోహరవికస్వరవచనరచనకు బరవశుండై యారాజనందనుం డొక్కింతతడవున కొడలెఱింగి యయ్యంగనామణికి దనవృత్తాంతంబంతయు నెఱింగించి మఱియు నిట్లనియె.

యువతీ! భవదీయకులశీలనామంబు లెఱింగినపిమ్మటగాని యేతదాతిథ్యం బంగీకరింపరాదు. ఇయ్యడవినడుమ నీయంతిపురంబునకు వన్నె యిడుచు నొంటిగా నీ వుండుటకు గతం బేమి? నిన్ను గన్న తల్లిదండ్రు లెవ్వరు? నిన్ను భార్యగా బడసిన ధన్యుని యభిదాన మెద్ది? ఇది రాక్షసశుద్దాంత మంటివి. ఆరాక్షసుం డెవ్వడు? ఇవ్విజననగర మెవ్వరిది? నీవు వనదేవతవని తోచుచున్నది. యదార్థము వక్కాణింపుమని యడిగిన సంతసించి యప్పడతి యిట్లనియె.

ఓ మహారాజకుమారా! మదీయవృత్తాంతం బాకర్ణింపుము. నా పేరు కళావతి. ఇవ్విజననగర మొకబ్రహ్మరాక్షసిచే బాలింపబడుచున్నది. ఆరాకాసి యనేకదేశంబులనుండి దోచికొనివచ్చిన సొమ్మంతయు నీనిశాంతముల నుంచి బీగము వైచుచుండును. మరియు వారంబున కొకసారి వచ్చి యిచ్చట మేడనొకటి గట్టి తెచ్చిన విత్తం బం దుంచి ముద్రలు వైచి యేగుచుండును. ఈసౌధంబు లన్నియు నట్లు కట్టినవే. అది యొకనాడు దేశాటంబునకై వెడలి నా జన్మభూమియైన యవంతిదేశంబునం బడి మహామారియుంబోలె యందలి ప్రజల గసిమెసంగ తదీయదేశపాలకులగు మదీయజననీజనకుల కృపలేక నాకలోకంబున కనిపి రెండేండ్లప్రాయంబు గలిగి బంగరుతొట్టె నిట్టట్టు కొట్టుకొనుచున్న నన్నుమాత్ర మంతమొందింపక తద్దియుంబ్రీతి ముద్దిడుకొని యాతొట్టెతోడ న న్నిక్కడకు దీసికొనివచ్చి కన్నకూతురుంబోలె బెంచుచుండ దల్లి దండ్రుల మరచి నేనింతదాననై తిని. దానినే తల్లియని నమ్మియుంటిని. మాయమ్మయు వారంబున కొకసారి వచ్చి రాత్రుల నాకు బెక్కువిద్యలం గరపుచు విదేశంబుల జరుగు వింతలగు వృత్తాంతముల నెఱింగించుచు నిట్టి యరణ్యంబున నున్నను లోకపరిపాటి యంతయు నాకు జూచినదానికన్న నెక్కుడుగా తెలియజేసినది.

దానం జేసియే సుమా! నే నింతకుమున్న పురుషుల నెరుగకున్నను మిమ్ము గన్నతోడ మర్యాదగల పురుషరత్నమని యూహించితి. ఈరక్కసి లోకంబున నెక్కడే వింతయగు వస్తువున్నను నాకు దెచ్చి యిచ్చుచుండును. మా కోటలోనున్న విచిత్రవస్తువులు నాకలోకంబులో సైతము లేవని చెప్పగలను. మాయమ్మయు నిన్ననే దేశాటనమునకై యరిగినది. మరియు నేడుదినముందనుక రా దిదియ మదీయవృత్తాంతము. నేడు మద్భాగ్యవశంబున మిమ్ముల బొడగంటినని పల్కుచు విభ్రమవిలోకనంబు లతని వదనపద్మంబునం బరగించిన నిండువిల్కాడు పూముల్కుల జురుకుచురుకున నెడద నాటనేయుటయు నాపురుషసింహు మోహ మాపనేరక యమ్మగువను బిగియార గౌగిలించుకొని చెక్కిలి ముద్దిడుకొని నవ్వనితయు దత్తదనుగుణ్యవృత్తుల మెలంగుచు జిత్తంబిచ్చినది.

పిమ్మట నక్కనకాంగి యప్పురుషపుంగవు నభ్యంగనమార్చి తన సూదవిద్యాపాటవంబు తేటపడ నతివిచిత్రములైన పిండివంటలతో రుచిసంపన్నంబైన యన్నంబు బెట్టినది. భోజనంబైన పిదప నయ్యిరువురు నొకవిహారమందిరంబునం గూర్చుండి కప్పురపు వీడియము వైచుకొనుచు గొంతదనుక నిష్ఠాగోష్ఠిం బ్రొద్దుపుచ్చిరి. మఱియు నత్తరుణియు విపంచి ధరియించి పాణికంకణఝణక్కారంబు లెసంగ సప్తస్వరంబు లనురాగంబు బెరుగ బెక్కురాగంబులను జంత్రస్వరములతో గంఠనాదంబు మేలగించి రాల్గరగునట్టు గాంధర్వంబు వెలయించిన నగ్గానంబున మానసంబు నీరుగాగ నన్నరనాథసూను డోహో యని యచ్చెరువందుచు నా పల్లవపాణిని మఱియు మఱియు గౌగలించుకొని ముద్దుబెట్టుకొనుచు బెక్కుతెరంగుల నన్నాతిమానసము గఱుగజేసెను. ఇట్లయ్యిరువురకు మదనుండు సమానుండై యున్నకతంబున వారు బెద్దయుం బ్రొద్దు నొడలెఱుంగని కామావృత్తులం దగిటి విచిత్రబంధంబుల రతికేళిం దేలిరి.

చ॥ పొడమిన నాటనుండియును . బూరుషు పోలికయే యెఱుంగ క
      య్యడవి వసించి లోక విష • యంబుల నేమియు జూడనట్టి య
      ప్పడతి వసంతుని న్సకల , బంధముల న్సమకేళి దన్పె నే
      ర్పడ సహజంబుగాదె రతి , పాటవ మారయ నాడువారికిన్.

మఱియు ననేకవిచిత్రములైన సౌధములను, నవరత్నశోభావిభ్రాజమానంబగు సభాభవనంబులను బహువిధఫలతరుషండమండితములయిన యుద్యానవనము లను జలయంత్రవర్ధితకుసుమకిసలయదళవిలసితములయిన తావుల వెదజల్లు పూవుందోటలను విహరింపుచు స్వర్గసౌఖ్యంబుల మాటుపరచు కోటలో నమ్మేటిబోటితో నంగజవిద్యాపాటవంబు దేటవడ నేడుదివసంబు లొక్కగడియగా గడిపిన నయ్యతివయు నతని చతురతను మెచ్చుకొనుచు నారక్కసి వచ్చుసమయం బాసన్నం బగుటయు నతనితో నిట్లనియె.

నాథా! నేడు దిననాథుం డపరిగిరిశిఖరంబు నధిరోహించినతోడనే వేడుకతో నిక్కడ కద్దానవి యేతెంచెడిని? నీయునికి వినినచో నొడల నసువులు సడలజేయక మానదు.

దాన బెక్కుగతులగొనలు సాగుమన యుత్సాహంబంతయు నుత్పన్నం బయ్యెడుం గదా? కావున నారక్కసి యిక్కడనుండి యరుగుదనుక ని న్నొకగృహగోధికం జేసి భిత్తినత్తించెదను. అప్పాటవంబు అన్నిశాటినివలనం దెలిసికొనినదే. అంతదనుక సైరింపుమని పలికి యక్కలికి యట్లు కావించినది. ఇంతలో బ్రహ్మాండకరండంబు పగుల నార్చుచు నారాకాసి యాకాశమార్గంబున నేతెంచిన నమ్మదవతి యెదురేగి పదములంబడిన నదియు నప్పడతి జడుపుడిపి లేవనెత్తి ముద్దిడుకొని పెక్కుగతుల గారవించెను. మఱియు భోజనంబైన వెనుక తన కవ్వనిత చరణంబు లొత్తుచుండ పెనుపాన్పున బండుకొని తాను జూచివచ్చిన వింతలన్నియు నక్కన్నె కెఱింగింపుచు నలుదెసలం బరికించి యల్లన నిట్లనియె.

బోటీ! నేడు మన లోగిటలో మానిసవాసిన వైచుచున్న దేమి? లాతివార లెవ్వరేని రాలేదుగదా! వచ్చిన వాక్రువ్వు మాక్రూరుల క్రొవ్వుడిగింతు ననుటయు గపటంబున నక్కుటిలాలక యిట్లనియె.

అమ్మా! యీ నట్టడవిలోని కెట్లు మానవులు వత్తురనుకొంటివి. వచ్చినను గుట్టుదెలిసి కోటలోనికి రాగలరా? నేను మాత్రము మానిసినిగానా? నా కంపు నీకు బెట్టగింపుగాదా? నన్ను బరిమార్చినం పరిమార్పు మింతకన్న వింతవారు లేరనుటయు నా మాటల సయిరింపక పశ్చాత్తాపచిత్తమై కూతు నోదార్చి రాత్రిశేషం బెద్దియో గొడవతో గడిపి తెల్లవారినతోడనే యాపువ్వుబోడిం దీవించి యారక్కసి యెక్కడికేనిం బోయినది.

పిమ్మట నా కొమ్మయు సంతసముతో జలకమాడి సింగారించుకొని మరల వసంతుని బురుషునిగా జేసి పన్నీట జలకమార్చి మధురపదార్థంబుల నాకలి దీర్చిన నప్పురుషుండు రాత్రియుం బగలను వివక్షతలేక నేకరీతి శంబరారాతికేళుల నానాతిని సంతోషపరచెను. వారి కవ్వార మొకనిముషమైనం గాలేదు. ఆహా! కామప్రలాపంబు యుగాంతంబులు గడచినను అట్లే యుండునుగదా? విను మట్లయ్యిరువు రా రాకాసి వచ్చుదినంబు దక్క తక్కినదివసంబులనెల్ల నసమశరీరక్రీడల నీడులేని వేడుకతో గడుపుచుండిరి. ఒక్కనా డవ్వేడుకకా డాచేడియతో నిట్లనియె.

అంగనామణీ! మన మీతెఱంగున మఱుంగువడి యియ్యడవినడుమ పాముపడగనీడనున్న భేకంబువలె నీరేద్రిమ్మరి రాయిడి కడలుచు నెంతకాల ముండవలయును. ఎప్పుడో యిది యాకలిగొని యున్నప్పుడు తెప్పున నిన్నుగూడ భక్షింపక మానదు. క్రూరుల నమ్మవచ్చునా? మన మిన్నిశాచారిణిబారి దప్పించుకొని జనపదంబున కఱిగి స్వేచ్ఛావిహారంబుల సుఖింపరాదే యనుటయుం గటకటంబడి యక్కుటిలాలక మగనితో నిట్లనియె.

అయ్యో! మీ రయ్యసురాంగన పరాక్రమం బెఱిగినచో నట్లనక పోదురుగదా? విను డది మన మెందేగినను దెలిసికొని యొకయడుగున వచ్చి యిరువుర గబళములుగా జేసికొనక మానదు. వారంబున కొక్కరేయిగదా మనకు హాయి తప్పియున్నది. ఊరక యిట్టి సుఖం బేల నేలపాలు గావింపవలయును? ఇంతకన్న జనపదంబుల నేమి వింత లున్నవి? కావున నిట్టి యాలోచన మాని తద్దయుం బ్రీతి నెల్లప్రొద్దుల నాతో నిందు గ్రీడింపుడని పలికిన ముద్దరాలిం బెద్దతడవు బిగియ గౌగిలించుకొని యద్దూరదర్శి దద్దిష్టానుసారముగా మెలగుచు మరికొన్నిదినము లరిగిన వెనుక నొకనా డాచేడియతో నిట్లనియె.

కాంతా! నే డొకయేకాంతంబు గలదది యిట్లట్లని శంకసేయక నా చెప్పినట్టు జేయుదునని నాచేత జే యిడుదువేని నీకు వాక్రుచ్చెదననిన నవ్వనితయు నప్పుడు నాథా! యట్లే కావింతు జెప్పుడని యత్యాతురముతో బ్రతిమాలిన నతండును తా నాలోచించినరీతియంతయు నాతలోదరికి బోధించి యీరేయి నట్టడుగుమని ప్రేరేపించిన నయ్యించుబోడియు దానికారణ మెఱుగనేరక యడుగవలదని మున్ను చెప్పియున్నవాడు గావున మరుమాట పలుకక వల్లెయని మునువోలె వల్లభుని బల్లిం గావించి గోడ నత్తించి యానక్తంచరి వచ్చుదెస బరికించుచుండ నింతలో దానినూర్పులు చెవింబడుటయు నెదురేగి యుపచారపూర్వకముగా తోడ్తెచ్చి భోజనంబు గావించిన వెనుక దానిచరణంబు లొత్తుచు దలవంచుకొనిని యెద్దియో తలంచుకొని పయ్యెట దడువ గన్నీరుగార్చుచు జింతింపదొడంగిని జూచి యోర్వజాలక యపూర్వదేవాంగన యిట్లనియె.

వాల్గంటీ! నేనింట లేనప్పుడు నిన్నొంటిగా నుంటజూచి బంటుతనంబున నెవ్వరేని యవమానంబు గావించిరేమో చెప్పుము. ఇప్పుడ యప్పాపాత్ములయొడ లడవిమృగములపాలు గావించెద లేక నీ కెద్దియేనిం గావలసియున్న వస్తు వెఱింగింపు మది త్రిలోకంబుల నెందున్నను దృటిలో నీముందు దెచ్చిపెట్టెద. వే రెద్దియేనికారణ మున్నచో నుడువు మూరక నాడెందం బాందోళనము నొంద నిట్లు కుందెద వేమిటికి! ఎప్పుడును నా మానసం బలర బెక్కులు పలుకుచుండు నీవు నే డిట్లు కన్నీరు విడుచుచుండుటకు నాచిత్తము తత్తరపడుచున్నది. వేగ నెఱింగింపుమని యారక్కసి పెక్కుతెరంగుల బ్రతిమాలిన నెట్టకేల కయ్యెలనాగ యిట్లనియె.

అమ్మా! నే జింతించుటకు నీ వడిగినదానిలో నొకటియు గారణముగాదు. వినుము. నీవు పెక్కుదేశంబు లరిగి ఘోరకృత్యముల గావింపుచుండ మాంత్రికులు గాని, తాంత్రికులు గాని, పరాక్రమవంతులు గాని నీ కెద్దియేని కీడు గావించినచో నే నేమి చేయుదును? నాదేహ మీయడవిమృగములకు బలియియ్యవలసి వచ్చునుగదా? నీ వరిగినది మొదలు వచ్చుదనుక నా దెసం బరికించుచు వొంటిగా నెన్నినా ళ్ళీయడవిలో వసింపుదును? నీవు రానినాడు నాప్రాణంబులు నిలుచునా! నన్ను గాపాడువా రెవ్వరు? ఇదివరకు జేసిన హింసయు సంపాదించిన విత్తంబును చాలదా? ఊర కేల గ్రుమ్మరియెద వెల్లదినముల నాకడ నుండిన నుండుము. కానిచో నన్నుగూడ భక్షించి యేగు మిదియ మదీయిచింతాప్రకార మని పలికిన విని నవ్వి యవ్వికటముఖి యవ్వనజముఖితో విట్లనియె.

ఓహో! “నెలతా! ఇదియా నీ చింత? చాలు చాలు యీపాటి కూరకుండుము. నన్ను జంపువా డీమూడులోకంబులను లేడు. నే నెక్కడి కరిగినను నా యాయుర్దాయము గోప్యముగా నిక్కడనే యున్నది. ఆ మర్మమెరింగినవాడు గాని నన్ను జంపలేడు. దానిం దెలిసికొన బ్రహ్మవశముగాదు . నేను బ్రతికియుండగా నీకొక యాపద రావిత్తునే! దీనికయి చింతించకుము. నిశాటుల కెల్లకాల మొకచోట నుండుట కులపరిపాటి గాదని బలికిన విని మరల నబ్బోటి యిట్లనియె.

అమ్మా! నీ యాయుర్దాయము గోప్యముగా నున్నదని యన్నంతమాత్రముననే నాకు సమ్మోదంబుగాలేదు. అమ్మరుంగుతెరం గెఱింగినపిమ్మట సరిపడెనని తోచినచో మురిపె మందెదనని తనకు మగడు బోధించినరీతిగా బలికిన నారక్కసి యక్కపటం బెరుగక చెక్కిలి ముద్దిడుకొని కన్నీరు దుడుచుచు నప్పడుచుతో నిట్లనియె.

తన్వీ! అట్లైన నిను, మివ్విజననగరమున కుత్తరంబున నవరత్నసోపానమండితంబున, కనత్కనకవనజకుముదకైరవకల్హారకమనీయపరిమిళితామృతోపమానజలరతంబునై యొప్పు తటాకంబు గలదు. అక్కమలాకరంబున స్నానంబు జేసి దాని ముమ్మారు వలగొని పడమరదెస జూడ నపూర్వమైన కదళీవనం బొండు గాన్పించును. అం దొక్కొక్కబొదికి నూరేసి కప్పురపుటనటులు మనోహరఫలదళవిలసితములయి పెక్కుదినుసులుగా బొడసూపును. దాని నడుమ వింతలగు నాకులను ఫలముల గ్రిక్కిరిసియున్న గెలలును గలిగిన బొదియొకటి కొమరు మిగిలి యున్నది. అబ్బొదినున్న యనటులన్నియు జెలగినచో నడుమ నొకయినుపకవాటంబు జూపట్టు దాని బీగము నీవు పరుండు పర్యంకపేటికయం దున్నది. దాన నత్తలుపు దెరచినచో బ్రశస్తభిత్తికాఘటితనవరత్నప్రధానిరస్తతమస్సమూహంబగు పాతాళగేహంబొకటి పటికంబురాలసోపానములతో గాననగు అందు సుందరమణిస్థంభసంభావితంబగు మంటపంబున వ్రేలంగట్టియున్న పసిడిపంజరములో బంచవర్ణములచిలుక యొకటి గలదు. నాయాయుర్దాయము దానిలో నున్నది. దాని కేమైన బ్రమాదము సంభవించినచో నాకు బ్రాణహాని యగుంగాని వేరొండుమార్గంబున మృత్యువు రానేరదు. ఈరహస్యంబు చతురాస్యుండైన నెఱుంగడు. నాకు బుత్రికవు గాన నెఱింగించితిని.

ఇప్పుడైన నాకు వేరొండుచోట మరణంబు లేదని నమ్మకము కలిగినదా యని తన జీవితరహస్యవృత్తాంతమంతయు నెరింగించిన, సంతసించి యా యించుబోడి యిట్లనియె. అమ్మా! నేటికి నా మనంబు సమ్మోదంబండినది. మున్ను గలిగిన యద టుడిగి నీ వింక జమునికడ కరిగినను భయములేదని యానందమందుచున్న కూతు బెక్కుతెరంగుల గారవించె నింతలో దెల్లవారుటయు నా నిశాటిని కోటదాటి యెక్కడకేనిం బోయినది.

అంత నన్నెలంతయు సంతసముతో దనకాంతుని గోదిత్వంబువాయ బోధించి యభ్యంగనాభ్యవిహారాలంకారాది వ్యాపారముల దీర్చిన వెనుక నొకకనకమణిగణప్రభాసితంబగు సభాంతరమున గూర్చుండియున్నయవసరంబున నయ్యంబుజాక్షి తన కారక్కసి చెప్పినవృత్తాంతమంతయు నింతయేని గొరంతపుచ్చక పూసగ్రుచ్చినరీతి వాక్రుచ్చిన నచ్చెరువందుచు మందహాసంబున వదనం బలంకరింప వసంతుం డంతరంగంబున బెక్కుతెరంగుల నాలోచించుచు దనకపటం బాబోటికి దేటపడనీక మఱునా డుదయంబున లేచి భార్య కెద్దియో మిష జెప్పి మాటుకవాటంబుదారి నక్కోట దాటి యుత్తరంబుగా నరిగిన గనకపద్మమనోహరంబగు సరోవరంబు గాన్పించినది.

అందు గ్రుంకి ముమ్మారు వలకొనినపిదప గనంబడిన కదళీవనంబు జొచ్చి యెట్టకేలకు వెదకి యప్పెనుబొదిం గనుగొని కటారిధార నేకవారంబున దాని నిర్మూలంబు గావించి యయ్యినుపకవాటమును జూచెను. దాని బీగము దెచ్చుట మరలి వచ్చెనుగాన నత్యంత చింతాక్రాంతస్వాంతుడై యోహో! యిప్పుడేమి మోసము రాబోవునో గదా! తాళము మరచివచ్చితిని. మరల నింటి కరిగినచో నాలస్యమగును ఆరక్కసి కీపాటి కొంత పొడకట్టక మానదు. అది వచ్చినచో నన్ను బరిమార్చును.

ఏమి చేయుదునని పెక్కుతెరంగుల జింతించుచు నలవాటు చొప్పున దనచొక్కాయిజేబులో జేయిడిన దాళముచెవి యొకటి చేతికి దగిలినది. అది పైకి తీసి చూచి యోహో! ఇది నాజేబులోని కెట్లు వచ్చినది? దీనికి సరిపడునేమో చూతమని యది యందు దగిలించిన యమరుటయు సంతసించి యటునిటు త్రిప్పిన బీగము వచ్చినది. దాని కచ్చెరువందుచు దైవమే తన కీసహాయము జేసెనని పెక్కువందనములు గావించుచు నమ్మార్గంబున బాతాళగృహంబు సొచ్చెను.

గోపాలా! విను మత్తాళముచెవి యా రక్కసి తన కావృత్తాంత మెఱింగించి యరిగిన పిదప గళావతి పరీక్షార్థమై దాని నప్పేటికలోనుండి పైకిదీసి చూచి మరల దాని నందుంచ నశ్రద్ధగలిగి మంచముమీదనున్న మగని చొక్కాజేబులో వైచిన నా యంగీ నత డుదయమున వచ్చునప్పుడు దొడగికొనెను గాన దాన నది తీయగలిగె లేనిచో నిష్కారణ మతండే మడియవలసి వచ్చును.

వసంతు డట్లు పాతాళగృహము ప్రవేశించి మణికాంతులచే బట్టపగలువలె నొప్పుచున్న యచ్చోట నలుదిక్కుల వెదకి మంటపములో వ్రేలగట్టియున్న పంజరము జేరంజని తలుపు దెరచి చిలుకం బట్టునంతలో దెలిసికొని యప్పలాశిని దిశలధ్రువ నార్చుచు నొక్కపరుగున వచ్చెను. గాని మొదట నతడు చిలుకకాళ్ళను రెండును విరచెను. గాన నది చెరువుగట్టున కాళ్ళు విరిగి పడియెను.

పదంపడి దాని రెక్కలు కంఠమును నులిమి పారవైచిన నదియు నయ్యవయవములు విరుగనార్చుచు గిలగిల దన్నుగొనుచు బ్రాణంబులం బాసెను. ఆహా! పెద్ద జాలమునుండి గాలుండువోలె జీవజాలంబుల సమయించుచు నస్తోకగర్వోద్రేకమ్ముల నా రేద్రిమ్మరి కతనిచేతిలో చావు విధించె గాబోలు. అట్టి దుష్టురాలిం గొట్టిన యతని సుకృతము సురలు సైతము గొనియాడిరి. అ ట్లాఘోరదానవిం దునిమి యతం డత్తటాకంబున నొడలు గడుగుకొని యత్తెరం గాయంగన కెరింగింప నతిత్వరితగతి జనుదెంచెను.

అంతకుమున్ను యన్నెలంతయు మానవాంతకురాలి యార్పులు విని యోహో! ఇది యేమి నాతల్లి యకాలమున వచ్చుచున్నది? విపరీతం బెద్ది బుట్టదుగదా! నా మనోహరురు డొంటిగా నడవి కరిగెనే! యతని యునికి విని వచ్చెనా! ఏమి మోసము గావించునో గదా యనుచు మరికొంతతరి కయ్యడలు వినరామికి వెడద దడబడ దాను మున్ను దీసిన తాళపుచెవిని వెదకి కాన కయ్యో! నానెయ్యంపుజనని బ్రతుకేమయ్యెనో గదా! అకటా! నన్ను బుత్రికయని నమ్మి నాకు దనమరుపు మరుగుతెరం గెరింగించె! నేనును నామగనికపటం బెరుంగక స్త్రీచాపల్యంబున దాచలేమి నాగుట్టు చెప్పితిని. దాని కేమి మోసము గావించెనో గదా యని కన్నీరుమున్నీరుగా బెక్కుగతుల చింతింపుచుండెను.

ఇంతలో నా వసంతుం డయ్యింతి యంతికమునకు వచ్చిన సంతసముతో నెదురేగి పదముల కెరగి యుచితోపదారంబులు దీర్చిన వెనుక స్వామీ! యేమి యింత యాలస్యము చేసితిరి? అకాలమున మా తల్లి ముఖఘోషము వినబడియు, నణగినది. దానిని మీరు చూడలేదుగదా యని యడిగిన నవ్వుచు నతండు ప్రేయసీ! ఇపుడు నీ జనని తటాకతీరమున బెద్దనిద్దుర జెందియున్నది. చూచివత్తువుగాని రమ్మనిన నవ్వనిత యదేమి యట్లనుచుంటిరి. నిజము చెప్పుడు నా గుండెలు కొట్టుకొనుచున్నవని యత్యాతురముతో నడిగిన జరిగిన కథయంతయు నెఱింగించి మిగుల పలవించు నయ్యించుబోడి నోదార్చువాడై యతం డిట్లనియె.

మోహనాంగీ! అట్టి రాకాసి తల్లికై తల్లడించు నీవంటి వెంగలి యెందైనం గలదా! ప్రజలతో దల్లిదండ్రుల బరిమార్చి తన్నెల్లకాలము బందీగృహంబునం బడవైచిన రక్కసియెడ మక్కువగల నీబుద్ధిలోలత బెక్కుగతుల నెన్నదగియున్నదే. చాలు చాలు నీపాటికి నూరకుండుము. కాటుకమోముతమ్మి గ్రమ్మ గన్నీరు వెదజిమ్ముచు నేటికి పరితపించెదపు? తాటకివలె దటాకాంచలమునబడి యున్న దానియాకారము జూచినంత నాకును భీతి వొడమినది. నీ వెట్లు దాని మాతగా నెంచి భయపడక సంచరించితివో యెరుంగ. దీని మరణంబు మనకుగాక త్రిలోకంబులకును సుఖకరమనియు నమ్ముము. అనుదిన మనేకజంతువుల గృతాంతు నంతికమ్మున కనుచు దనుజకాంత నంతంబు జేసిన నాకు బుణ్యమేకాని విశ్వాసఘాతుకపాతకంబు రానేరదు.

దైవకృపచే మన చిక్కులు వాసినవి. ఆనంద మందుమని ఊరడించిన మగని వచనంబుల శోకం బపనయించుకొని యక్కాంత యొక్కసారి దానికళేబరము జూపింపు మని వేడిన నంగీకరించి యితం డయ్యంగనను జయ్యన నయ్యెడకు గొనిపోయి తటాకాంచలమున ఘోరముగా బడియున్న దానిమేను జూపించిన బెంచిన మోహంబున గొంతదనుక చింతించి దానిం దహింప మనోహరు నడిగికొనిన నతం డడిదంబున దదంగకంబులు ఖండించి ప్రాంతశుష్కతరుశాఖల జితి జేర్చి యం దగ్నిం జొనిపి బూతి గావించెను.

పిమ్మట నా దంపతులు శుచిస్నానమునకై ప్రాంతముననున్న సముద్రమున కరిగి యందఘమర్షణసూక్తములతో శుచిస్నానము చేసిరి. అప్పు డప్పారావారతరంగములు పెంపుగ బొంగుచున్నకతంబున నారాయిడి నచ్చేడియ కుడిచేతనున్న నవరత్నస్థాపితమగు కంకణమొండు చీలవదలి సముద్రోదకంబులం బడియెను.

నాథా! మున్నొకసారి యద్దానవి దేవలోకంబున కరిగి యం దాకాశగంగలో నగలును బుట్టంబులును గట్టున బెట్టి రంభాదిదేవకాంతలు జలకేళిం దేలుచుండ నాదండనుండి రంభదియో యూర్వశిదియో మేనకదియో కాని యనర్ఘరత్నరుచులు వెలుగుచున్న కంకణములజత యొకటి దొంగిలించి తెచ్చి నా కిచ్చినది. అదియు నా చేతులకు గొల్చునట్లు సరిపడి యపూర్వతేజం బొనగూర్చినది. నాకున్న వస్తువులన్నిటికన్న దానియం దెక్కున మక్కువ గల్గుటచే నొకప్పుడైనను విడువక దాల్చియుందును.

నేడు మున్నీటితరగలరాయిడి నం దొక్కకడియము జలంబులం బడి మునిగిపోయినది. దానికై వెదకుచుంటిని. ఇది యగాధప్రాంతమగుట దొరకు ననునాస వదలినది. దాని తోడికడియ మిదిగో యెంత చక్కగా నున్నదో చూడుడు. అని తన చేతనున్న రెండవకడియము విడదీసి చూపించిన జూచి వెరగుపడి యతం డోహో! ఇది దేవతాభూషణము గాన నిట్లున్నది. మానవుల యలంకారముల కింత వింత సొబగుండదు. దేవతల నగలన్నియు నీ రీతినే యుండుసు గాబోలు. ఆహాహా! వారి భోగభాగ్యములు! దానికై నీవిక యూరక శ్రమపడకుము. నేర్పరియగు కంసాలి నాకు మిత్రుడొకడు గలడు. వానిచే నిది పోలిక యిచ్చి రెండవది చేయించెదనని తత్కాలోచితవాక్యములచే నామెకు దానియందుగల కోరిక యుడిగించి యత్తరుణీమణి కేలువట్టి మరల కోటలోనికిం దీసికొనిపోయెను.

అంతలో దనమిత్రుల వృత్తాంతము జ్ఞాపకమువచ్చుటయు నట కరుగు సంకల్ప మంకురించినది కాని యక్కోటలోని భవంతుల వింతసొబగెంతయు నతనిస్వాంతమున కడ్డుబడి సాగనిచ్చినదిగాదు. దాన నమ్మానవనాథసూనుం డమ్మానవతిశిరోమణితో నందు గొన్నిదినంబులు స్వేచ్ఛావిహారంబుల గ్రీడింపుచుండెను.

గోపా! అట్లు సముద్రంబునంబడిన యప్పంకజాక్షి కంకణం బొకమత్స్యంబు జాతిస్వబావంబున మ్రింగి క్రుమ్మరుచుండ దాని నొకజాలరి జాలంబునం బట్టి పైకిదీసి యందపూర్వతేజంబున వెలుంగు పెనుమీనంగాంచి దానిమేని యందంబునకు వెరగందుచు దాను దివినచో నొకటి రెండు పూటల యాహారమున నెక్కుడు చాలదనియు నొకఱేనికి గానుకగా నిచ్చిన నచ్చెరువంది యెద్దియేని బహుమాన మిచ్చుననియు నిశ్చయించి కోయక యబ్బోయ ప్రాంతముననున్న వంగదేశాధీశుడగు కందర్పకేతుండను రాజునొద్ద కరిగి తనకడనున్న యవ్వింతచేప నర్పించెను.

ఆ చేపం జూచి యతండును మిగుల నాశ్చర్యపడుచు నప్పల్లెవానికి దగిన పారితోషికంబిచ్చి యంపి యప్పుడది బానిస కత్తిచే దగ్గిరయుండి కోయించి యందు వెలుంగు నపూర్వమణివలయము జూచి చేతంబూని యిటునటు త్రిప్పుచు నాహా! ఇంత వింతయగు కంకణము ధరించు నించుబోడి యెంత వన్నెలాడియోగదా! యే దేశం బలంకరించెనో? దాని భార్యగా బడసిన మగవాడు పూర్వజన్మమున నెంత తపము గావించెనో యని పెక్కుగతుల దానిమూలముగా దద్వస్తుధారిణియగు నారీమణిం బొగడి విరాళిందూలి యట్టి కంకణము ధరించిన కోకస్తని యీలోకములోనిదేగదా. దాని దీసికొనివచ్చి నా కిచ్చినవారికి నాయర్ధరాజ్యం బిచ్చెదనని యప్పుడ ప్రచురపత్రికల వ్రాయించి దేశదేశంబుల వ్యాపింపజేసెను. వానిం జూచినవారెల్ల రాజ్యకాంక్షం గొఁత చింతించిరి గాని యన్వయదేశగోత్రనామంబులు వివరింపమిం జేసి యట్టి యాసల మరలించుకొనిరి.

ఒక్కనా డయ్యూరనున్న వృద్ధభూసురకాంత యావృత్తాంతము విని సంతసముతో నాభూకాంతుని యంతికమున కరిగి యతనివలన జాలరివాడు వలవైచినప్రదేశపుగురుతును కంకణము పోలికయు దెలిసికొని యతనితో నిట్లనియె.

దేవా! నేను దేవరవారు గోరిన నారీమణిం దీసికొని వచ్చెదను. దీనికై చింతింపకుడు. అక్కాంత మీప్రక్క నున్నదిగా భావింపుడు. సకలసాధనసమన్వితంబును విచిత్రవస్తుభూయిష్ఠంబును నగు నొకయోడ నా కిప్పింపు డిప్పుడ యరిగెదనని యడిగిన నతండు సంతసించి యది కోరిన వన్నియు నిచ్చి యంపెను. పిమ్మట నాబడుగుపడతియు నాయోడకు నేలికయై యెక్కి మంచివేళ లంగరులు తీయించి చాపలెత్తించి పల్లెవానికి జేప దొరికిన దిక్కు ననుసరించి యోడ నడిపింపసాగెను.

ఓడ నడచునప్పుడు సముద్రతీరధారుణియంతయు బరీక్షింపుచు నా వృద్ధ పదియేనుదినములు పయనము సాగించెను. పదియారవదినమున సూర్యోదయము కాగనే యొడ్డున గొప్పపొగయు, దానిలోనుండి మంటయు, నవి యన్నియు నడంగిన వెనుక నున్నతములైన మేడలుం గాన్పించినవి.

వానిం జూచి యమ్ముసలిది మిగుల సంతసించి యోడ సరదారులతో నోడ లంగరు వేయుడనియు మరల దాను వచ్చుదనుక గనిపెట్టుకొని యక్కడనే యుండవలయుననియు నాజ్ఞాపించి చింపిరిగుడ్డల గట్టుకొని చిన్నదోనెయొకటి యెక్కి చిరుకోలం ద్రోసికొని యుప్పట్టణపురేవు చేరినది.

మొదట నందెవ్వరిం గానక చింతాకులమానసయై గట్టుపై కెక్కి నలుదెసలం బరికింపుచుండ నొకదండనుండి యిరువురు వచ్చుట గానంబడియె. వారు దానిపుణ్యవశమున నాటి యుదయమున విహారార్థము వెడలిన వసంతుడును కళావతియే. అట్టి వారిం జూచినతోడనే వేడుకతో నాప్రోడ మరల సముద్రతీరమున గూర్చుండి తల విరయబోసికొని గోలుగోలున నేడ్వసాగెను. ఇంతలో నాదంపతులు సమీపించి జనరహితమగు నాప్రదేశమున మానిసి గానంబడిన, సజాతీయవస్తుదర్శనసంతోషంబు మనంబున వెల్లివిరియ నల్లన దానితో నిట్లనిరి.

అమ్మా! నీ వెవ్వరవు! ఇందేల వచ్చితివి? నీయభిదాన మెద్ది? ఇట్లు కుంద గారణ మేమి? ని న్నెవ్వ రిట్లు భంగపరచిరి? నీవెతలతెరం గెరింగించిన మాయోపినంత యుపకారము సేయుదుము. నిక్కము వక్కాణింపుమని స్వాంతనపూర్వకముగా నడిగిన నాదుష్టురా లొక్కింత తలయెత్తి వారల చక్కదనమునకు మిక్కిలి వెరగుపడి మరియు నా నెలతం దిలకించి, ఔరా! ఈ మోహనాంగి నిర్జరాంగనగాని మానవకాంత గాదు. మానిసుల కిట్టి యందము గలుగునా. వంగదేశాధీశుని మరులుకొలిపిన మదవతియు నిదియే. అతని యొద్దనున్న కంకణమునకు జోడైనది దీని దాపలకేల నున్నది. ఔనా, నతం డిట్టి రమణీమణికై విరహమొందుట యుచితమే. నా భాగ్యవశంబున నేటి కెన్నుకొన్న యన్నువ కన్నులం బడినది. దీని నెట్లో మాయచేసికొని పోయెద. అర్ధరాజ్యంబు నాకు దక్కినదని సంతసించుచు నమ్మురిపెము మొగమున దోపనీయక వారి పాదంబులంబడి యిట్లనియె.

అయ్యో! నాకుయ్యేమని వక్కాణింతు, అయ్యయు, నమ్మయువలె మీ రాదరంబున నడుగ నుడువకుని సాధుపరిపాటిగాదు. నాకు లేకలేక యొకకొడుకు గలిగెను. వాడు పుట్టినవేళ యెట్టిదో కాని జాతకర్మాదిక్రియలు నిర్వర్తింపకమున్న తండ్రి నాకలోకం బలంకరించెను. ఆడుదాననైనను నేను ధైర్యము గలదానను గాన భయపడక యెద్దడికోర్చి పిల్లవాని నత్యంతమోహంబునం బెంచి పెద్దవానిజేసి తద్దయు శ్రమపడి బెక్కురొక్కంబు వ్యయపుచ్చి యొకపడుచుం గట్టిపెట్టితిని. ఆ దుర్మార్గు డది కాపురమునకు వచ్చినది మొదలు నాయందుగల భయభక్తులు నానాటికి నీటగలుపుచుండెను. వాని భార్యయు ననార్యకులసంజాతయగుట నాపై మిగుల నీసుగలిగి మగని ననుదినము రోస మెక్కించుచుండును కొడుకు చెడుగైన గోడలు మంచిదగునా?

ఇట్లుండ నొక్కనా డాకోడలు రాకాసి యేమి బోధించెనో యా నిర్భాగ్యు డూరక నాపైబడి చావమోది తలమట్టి యీడ్చి చావుమని సముద్రంబునం బడద్రొబ్బిన మునింగితిని గాని పాపపు పరమేష్ఠి నా కాయువెక్కడ బెట్టెనో చావక యలలం దారువువోలె దేలి యీ రేవునకు గొట్టుకొనివచ్చి గట్టెక్కితి. "పాపీ చిరాయు" వను మాట తప్పునా? మరియు నన్నింక నెన్ని చిక్కుల బెట్టదలచియో దైవము సముద్రంబునం బడినను చావనీయక తేలవైచె. కటకటా! నావంటి పాపాత్మురా లీమూడులోకముల లేదుసుమీ యని యేడ్చుచున్న యన్నాతిం జూచి జూలిపడి వసంతుఁ డిట్లనియె. అవ్వా! మే మివ్వీటి కేలికలమై యుందుము నీవు మా యిరువుర నడుమను దల్లిగా మెలంగుము ఎల్లపనులు నీ మీదుగా నడిపించుకొనియెదము. నీకే కొరంతయు రానీయము. చింతవిడువుము. వేయేల? మేము నీ యాజ్ఞకు లోనై మెలంగువారము. లేలెమ్మని రమ్మని బ్రతిమాలు నా భూపాలసూనుని యనునయవాక్యంబుల దేరినదానివలె నభినయించుచు నతని గుణగౌరవము పెక్కుగతుల గొనియాడి యల్లన లేచిన నతండు తన యుత్తరీయము దానికి గట్టనిచ్చెను . అప్పుట్టంబు గట్టుకొనిన యా దుష్టురాలిని వెంటబెట్టుకొని యాడుతోడు దొరకెనను సంతాసముతో నా రాజకుమారుం డంగనతో ముచ్చటించుచు గోటలోని కరిగెను.

పిమ్మట నా వృద్ధయు వారిద్దరి నడుమ మిగుల నమ్మకమైన వర్తనముల మెలంగుచు నాహారమిచ్చునప్పుడును అలంకరించుచున్నప్పుడును నభ్యంగనాదిసంస్కారముల జరుపునప్పుడుసు వారి చిత్తవృత్తుల కనుగుణ్యమగురీతి నెరపుచు దుదకు వారి దా జెప్పినట్లు నడచుకొనువారిగా జేసికొనియెను.

అతండును తన భార్యకు దోడుగలదు గావున వేటకై యడవి కరిగి రెండు మూడు దినములవరకు యదేచ్ఛముగా గ్రుమ్మరివచ్చుచుండును. ఇట్లు కొన్నిదినముల లరిగిన వెనుక నొకనాడత డడవికరిగిన యప్పు డప్పడతి మెత్తదనము గనిపెట్టి యల్లన యావృద్ధ యిట్లనియె.

వాల్గంటీ! యొంటిగా మన మిక్కోటలో నుంటిమి. కోటదాటినచో బెడిదంపుటడవియు గ్రూరమృగములేకాని మానిసి యెవ్వండును గానంబడడు. నీ మగడు మిగుల బలశాలియగుట నిట్టిచోట మనకే కొరంతయు లేకున్నది. నోటననినం దప్పుగాని మానవశరీరములు శాశ్వతములు గావుగదా. అతడుముందో మనము ముందో యెవ్వరు చూచినారు. మనకన్న నతనికి ముందర మోసము సంభవించినచో మన బ్రతుకేమి కావలయు? నే నిట్లంటినని మరియొకలాగున భావింపకుమీ! ఎన్నడో రాబోవు ననర్థమున కిప్పుడే ప్రతీకారము జింతింపవలయునని శాస్త్రజ్ఞులు చెప్పుదురు. నా జీవితము మీ యధీనము జేసితి. నాకు మీకన్న యాప్తులు లేరుకదా! మీరు క్షేమముగా నుండుట కంటె నాకు గావలసిన దేమున్నది! ఎల్లకాల మిట్లుండ భగవంతుని బ్రార్థించుచుంటిని కాని మన యిష్టానుసారముగా గాలము నడువదు. "కాలోయం దురతిక్రమః" యను వాక్యమునుంబట్టి నే నిట్లు చింతించుచుంటిని.

కావున మగువా నీ మగని యాయుర్విషయమై కాలమితి యెరుగునేమో యడుగుము మనవారికి జాతకముల వలనగాని సాముద్రికమువలనగాని యాయుర్మతి దెలిసి యుండును, అమ్మర్మము మనకు దెలిసినచో నిర్భయమైన యానంద ముందుదముగాక- నే నడుగమనిన ట్లడగకుమీ! యతని మానసమున కేమి తోచునో అట్లడిగి ననాయాస సుమీ యని పెక్కునీతులు దెలిసినదానివలె బోధించుటయు నాలించి యా యిందుముఖి యందు గొన్నివాక్యంబులు తనకు గర్ణకఠోరములుగా నున్నను సైరించి యిదియేమో తన క్షేమముగోరియే యట్లనుచున్నదను నమ్మకముచే మరుమాట పలుకక యట్లడిగెద ననుమాట శిరఃకంపమున సూచించిన నంతటితో నా ప్రస్తావము కట్టిపెట్టి వేరొక్కగోష్ఠిచే బ్రొద్దుపుచ్చుకొనిరి.

ఇంతలో దినాంతమగుటయు వసంతు డింటి కరుగుదెంచిన సంతసించి వారెన్నేని నుపచారంబులం దీర్చిరి. అతండు నిష్టాహారసంతుష్టుండై యీప్సితకామంబుల దీర్చుకొనియె. ఇట్లు నాలుగైదువాసరము లరిగినను కళావతి కాప్రస్తావము తెచ్చుటకు వీలుదొరికినది గాదు. ఒకనా డత డుదయమున వేటకై తొందరగా నటవి కరుగుచుండ నాదండ కరిగి యతని కైదండబట్టి కాని యయ్యండజయాన యిట్లనియె.

నాథా! మీరు సారెసారెకు ఘోరమృగయాసక్తి నడవి కరుగుచుంటిరి. ఒంటరిగా మేమిచ్చోట నుండజాలము. మీ కందేమైన బ్రమాదము సంభవించినచో మాకేది దిక్కు. ఈసారి మమ్ముగూడ దోడ్కొని పోయినం బొండు లేకున్న మీ యాయుఃప్రమాణనిశ్చయం బెరుంగుదురేని వక్కాణింపుడని కేల్వదలక నిర్బంధించిన సంతసించి యాచంచలాక్షిని గౌగిట జేర్చుకొని యతం డా రహస్యం బదివర కెవ్వరికి జెప్పనని నిశ్చయించుకొనియు బ్రయాణపు తొందరచే మరచి యత్తెరవతో నిట్లనియె.

బోటీ! నాకు భయమేమిటికి? వినుము. మదీయ మిత్రుడగు నొక కళాదునిచే నా యాయు నీ కత్తివరలో నుంచబడినది. ఇది నీయొద్ద నుంచికొనుము. దీనికి బ్రమాదము వచ్చిననాడుగాని నాకు బ్రాణభయము రానేరదు. దీనిం గాపాడుకొనుమని నిదానించక యది యమ్మదవతి చేతికిచ్చి తాను వేటకై యటవికరిగెను. ఎట్టి నేర్పరియైనను విధిగతికి బద్ధుడై ప్రమాదము నొందక మానడు.

అతండొకింత నిదానించినచో నా కపటము దెలిసికొనదగినవాడే. "బుద్ధిః కర్మానుసారిణి" యను వచనంబునుం బట్టి యతని కట్టి యూహపుట్టినది కాదు.

పిమ్మట నవ్వరవర్ణిని యవ్వరవృత్తాంతమంతయు నమ్ముసలిదాని కెరింగించిన సంతసించుచు నప్పడతి కిట్లనియె. అమ్మా! మనము వఱయరలు ప్రాణపదముగా గాపాడుకొనవలయును జుమీ. ఎక్కడ దాచెదవోకాని మన బ్రతుకంతయు దీనితో నున్నది. యనిన నదియు నమ్మా! యెక్కడ దాచినను భయమేమి. మనముగాక యన్యు లెవ్వరేనిం గలరా? నిత్యమును జూచుచుండవచ్చును. నీ మంచము తలకడ నునిచెద ననిన నౌను భయమేమి యట్లె యుంచుమని చెప్పినది . అక్కపటం బెఱుంగక యక్కలికి యక్కడనే దాచెను. మఱి వసంతుడును రెండు మూడు దినములలో నిల్లుజేరి యధేష్టకామంబుల సంతుష్టి నొందుచుండెను.

ఇట్లుండ యొకనాడు రేయి నా దంపతులు బెద్దయుంబ్రొద్దు గంతుగేళులం దేలి యలసి సొలసి గాఢనిద్రాపరవశులై యున్నవేళ జూచి యా నీచురాలు మెల్లన నవ్వఱ సంగ్రహించి యొక రాయిమీద దానియర లరుగదీయ దొడంగిన నా రాజకుమారునికి మరణావేదన యావిర్భవించి నిట్టూర్పులతో నిట్టటు గొట్టుకొన దొడగిన నా రాయడి కిచ్చేడియ మేల్కని పతిని లేపియు లేవకున్న దొందరపడుచు దలయంపినున్న వఱను వెదకి గానక తటాలున మునలిదియుండు గదిలోని కేగుటయు నదిగేగిరించి వఱయర లరగదీయుచుండ వీక్షించి యేమే నిర్భాగ్యపుముండా! యిట్టి ద్రోహకృత్యమున కొడి గట్టితివి ? ఆయన నీకేమి యపకారము గావించెనే కటకటా! నిన్ను జనని యని నమ్మినందులకు మంచి యుపకారము గావించుచుంటివి. అయ్మో! నేనేయు చేయుదు నెవ్వరు దిక్కని పెద్ద యెలుంగున నేడ్చుచు నవ్వఱయూడ బెరకికొనిన నక్కలికితో నది యిట్లనియె.

పట్టీ! యూరక నన్నేల దిట్టెదవు? నీ మగడు చెప్పిన గుట్టు వట్టిదో నిజమో యని పరీక్షార్థమయి యిటు గావించితిని గాని ద్రోహబుద్ధిగాదు. ఇంత మాత్రమున నతనికి నిజముగా నాయాసము సంభవించినదే చూతము రమ్మని యా గదిలోని కరిగి యతనిం జూడ నఱయరలు నిశ్శేషముగా నరుగదీయలేదు. గాన నించుక ప్రాణము గలిగి యున్న వాడుగాని యా రహస్యమది గ్రహింపలేక చచ్చెనని మిగుల నానంద మందుచు బైకి గళావతికన్న నెక్కుడు చింతించుచు నామెతో నిట్లనియె.

అబలా! ప్రమాదవశంబునం జేసితిని. కానిమ్ము నే నొకసిద్ధౌషధమువలన వీనిని బ్రతికించెద. నీవు చింతింపకుము. చింతించినచో బ్రతుకనేరడు. దానికి ముందు నీవు సముద్రోదకంబుల దలయంటుకొనవలయు. ఆలస్యముచేయక యందుబోదము రమ్ము. అతని వియోగము నీకన్న నాకు వ్యాకులముగానున్నది. అని పలికిన బాప మక్కలి కిదియు నిజమని నమ్మి చింతించుటమాని యమ్మాయలాడితో సముద్రతీరమున కరిగినది.

అప్పు డది పట్టీ! వట్టినేలం గూర్చుండి తల యంటుకొనరాదు. అల్లదిగో ప్రాంతమున నెద్దియో చిన్నదోనె గాన్పించుచున్నది. దానిమీద గూర్చుందువుగాని రమ్మని యచ్చటికిం దోడ్కొనిపోయి యా నావ కొనబల్లమీద గూర్చుండబెట్టియొడలు నలుగిడ కన్నులు మూసికొమ్మని తలమీద పులుసుపోసి యొకచేత రుద్దుచు రెండవ చేత జరుకోలతో నద్దోని త్రోసికొని యొక నిముషములో బెద్ద యోడయొద్ద కరిగినది. అప్పుడు తల రుద్దుటమాని కన్నులం గడిగినం జూచి యాచకోరాక్షి నలుదెసలం బరికించి యెందును భూమిం గానక పెద్దయోడ గాంచి యాముసలిదాని కపటం బెఱింగి యిట్లనియె. ఓసీ పాపాత్మురాలా! నామగ డచ్చట గతచేతనుడై పడియుండ న న్నిక్కడి కేల తోడ్కొని వచ్చితివి. నీ యభిలాష యెద్దియో చెప్పు మూరక యేల శ్రమపెట్టెదవు. నన్ను గూడ జంపినం జంపుము. నీ కపట మెఱుంగక బంగారమువంటి కాపురము నీటగలుపుకొంటినే!

అయ్యో! యెంత కపటము బన్నితివి. కటకటా మన్మథునిబోలు నా మగని నిరపరాధిం జంప నీకు జేతులెట్లాడెను? చీ! కఠినచిత్తురాలా! నీ మొగము జూచిన బాతకమువచ్చునే. ఇదిగో నీవు జంపకున్నను ప్రాణేశ్వరుంబాసి నిముషమైనను దాళ జాల. ఈ సముద్రోదకంబులంపడి లోకాంతరమున నతని గలిసికొనియెద నని లేవ బోవుటయు నట్టెపట్టుకొని లేవనీయక యది యోడవాండ్రం జీరి దీని లోనికి గొంపొండు డని యాజ్ఞాపించిన వారు బలాత్కారముగా నానారీమణిని నోడలోనికి దీసికొనిపోయి రమ్యమైన యొకగదిలో బెట్టి తలుపు బిగించిరి.

పిమ్మట నా ముసలిదియు నోడయెక్కి సరదారులకు బడవ నడుపుడని యాజ్ఞాపించి తానుగూడ నాయువతియున్న గదిలోని కరిగి మగనిం దలంచి నొగిలిన చిత్తముతో నుత్తలపడుచున్న యప్పడుచుతో నిట్లనియె.

కాంతా! నీ కాంతుడు లోకాంతరమున కరిగెను . చింతించిన మరల వచ్చునా? విను మతనికన్న భాగ్యంబునను, రూపంబునను యౌవనంబునను నధికుడైన వాని నీకు బతింగావింతు. పదిదినములు సైరింపుమని యెన్నియో ప్రియోక్తులు చెప్పినది గాని యవి యన్నియు బెడచెవులంబెట్టి పట్టరాని యలుక దాని బెక్కుగతుల దిట్టుచు వైనంబును దూరుచు దనకుదాను నిందించుకొనుచు బెక్కుగతుల వగచుచుండెను.

ఆ నావయు మంచిగాలి వీచుటచే నారుదినములకే వంగదేశపు రేవు చేరనది. తోడనే ముసలిది పిరంగియొకటి వేయించిన నా ధ్వనివలననే కార్యసూచనము దెలిసికొని యా భూపాలుండు చితపరివారంతో నా యోడజేరి ముసలిదాని వలన నన్నెలంత వృత్తాంతమంతయు విని సంతసించి యా చెల్వుంజూచి మూర్చిల్లి యొక్కింతవడికి దెలిసి మోహమాపలేక యప్పుడ యప్పడంతింగూడ దలంచెను. అమ్ముసలిది యొప్పుకొనక కొన్నిదినములు మచ్చిక జేసినగాని యిచ్చగింపదని యడ్డుపెట్టిన నతండు సమ్మతించి యొకయాందోళికమున నబ్బాలికామణిం గూర్చుండబెట్టి తలుపులు బిగించి యపూర్వమగు నొకయంతఃపురమున జేర్చెను.

అందు దగిన పరిచారికల బెక్కండ్ర నునిచి యవ్వనిత మనసు నచ్చిన యుపచారముల జేయించుచు నొక్కనా డంగజతాపతప్తుండయి యతం డచ్చేడియ గవయం బోయిన నామెయు నప్పటికి దనకేమియుం దోచమింజేసి యెద్దియో వ్రతమిషచే సంవత్సరము మితిగోరినది.

ఆ భూపతియు బలవద్రతి కభిమతములేక యట్టి మితి నిచ్చి దిన మొక్కయుగముగా గడుపుచుండెను. అని యెఱిగించి యంతలో బ్రయాణసమయ మగుటయు గథ జెప్పుట చాలించి యయ్యతి గోపా! పైకథ ముందటి మజిలీలో జెప్పెద. నేడు నడువవేళయైనది. లెమ్మననపుడు వాడు తర్వాయికథ విన వేగిరపడుచు గావడి యెత్తుకొని యాసన్యాసితో నడుచుచుండెను. అయ్యతియు మౌనం బవలంబించి ప్రణవాక్షరజపంబు గావించుచు నడుచుచుండ వాడు వినినకథ యంతయు జ్ఞాపకమునకు దెచ్చుకొనుచు నడుమ నొకసారి యయ్యా! యా వసంతుడు మరల బ్రతుకునా యనియు వేరొకసారి యా రాజకుమార్తెను మరల జేరునా యనియు నతడు మిత్రులతో గలసి కొనునా యనియు వారందరు వింటి కరుగుదురా యనియు బల్కరించుచుండ హస్తసంజ్ఞచే వారించుచు నయ్యతి గ్రమంబున మధ్యాహ్నపుమజిలీ జేరును.

అయ్యతి మునువోలె నట ననుష్ఠాన మంతయు దీరిన వెనుక వంటజేసికొని భుజించి యలసట దీరిన కొండొకవడికి నొకచల్లనిప్రదేశమున గూర్చుండి భోజన మైనది మొదలు కథ చెప్పుమని వేపుచున్న యా గొల్లవాని కిట్లని జెప్పదొడంగెను.