కాశీమజిలీకథలు/మొదటి భాగము/ఎనిమిదవ మజిలీ

వికీసోర్స్ నుండి

ఎనిమిదవ మజిలీ

కృష్ణదేవరాయల కథ

ఎనిమిదవ మజిలీయందుఁ గోపకుమారుఁడు భోజనసామాగ్రి దెచ్చుటకై యంగడికిఁ బోవుచు నొక యింటనున్న విగ్రహమును జూచి యాశ్చర్యపడి యప్పుడే క్రమ్మర నమ్మణిసిద్ధునొద్ద కరిగి స్వామీ యొకయింటిలో ననల్పశిల్పరచనాసమన్వితం బగు నొక విగ్రహమునుఁ బొడగంటిని. అది శిలాదారుమృత్తికాదులచే రచియింపఁబడినట్లు కనంబడదు. యదార్థపు పురుషునివలె నున్నది. ప్రాణములేదు. దేవతావిగ్రహము కాదు. ఉత్సవములు చేయుచుందురు. దాని కథ యెవ్వరినడిగినను చెప్పలేదు. సర్వజ్ఞులైన మీ వలన నాకా వృత్తాంతము విన వేడురపడి వచ్చితి నెఱిగింతురే యనిన నాసిద్ధుండు నవ్వుచు నట్లనియె.

వత్సా! నీకుఁ గలలయందింత వ్యసనమేమి? యంగడికిఁ బోయినవాఁడవు వూరక రానేల సామాగ్రి దెచ్చినపిమ్మట నడిగినఁ జెప్పనా? ఈ వృత్తాంతము మిగుల చిత్రమైనది. భోజనంబైన పిమ్మట సావధానముగాఁ జెప్పవలయును. వడిగాఁబోయి సామగ్రి దెమ్ము. పిమ్మట జెప్పెదనని బ్రతిమాలుకొని యెట్టకేలకు వానిచే నట్లు చేయించి భోజనానంతరమున మనోహరప్రదేశమునఁ గూర్చుండి యమ్మణిచే నాకథ యంతయుం దెలిసికొని యిట్లు జెప్పదొడంగెను.

తొల్లి యాంధ్రదేశాధీశ్వరుం డగు నరసింహదేవరాయలు ధర్మంబున రాజ్యంబు సేయుచుండ హఠాత్తుగా నతని ప్రధాని మరణము నొందెను. తగిన మంత్రి లేనిచో రాజ్యముజేయుట దుర్ఘటమని నరసింహరాజు తెలివిగలవానికి నాయుద్యోగ మిచ్చెదనని దేశదేశంబుల చాటింపించెను. అట్టివార్త విని బుద్ధిమంతులని పేరు పొందినవారు పెక్కండ్రు వచ్చి యాయుద్యోగము తమకిమ్మని వేడుకొనిరి.

రాజు వారి బుద్ధికుశలతకు మెచ్చుకొనక మంత్రిత్వపదవికిఁ దగినవారుకారని వారి ప్రార్థనాపత్రికలఁ ద్రిప్పివేసెను. లోకంబున నేర్పరులని పేరుపొందినవారు గూడ రాయలచే నిరసింపబడుటచే వారికి మునుపున్న కీర్తికిఁగూడ గళంకము రాఁదొడంగినది. అట్టి భయముననే యెట్టివాఁడును ఆపనికి ప్రయత్నము చేయుట మాని వేసెను. రాయలు మంత్రిలేని భారమెక్కుడైనను సహించెను గాని యల్పబుద్దిమాత్ర మా వుద్యోగమియ్య నియ్యకొనఁడయ్యెను.

ఒకనాఁడతండు పెద్దయుంబొద్దు చింతించి కొందరు పరిచారకులం జీరి యొక కాగితముమీద నాలుగంగుళముల గీత సిరాతో గీసి యోరీ! మీరీ కాగితము ప్రతి గ్రామమునకు గొనిపోయి కనఁబడిన వానికెల్ల చూపించుచు నీగీటు చెరపకయే చిన్నదిగాఁ జేయగలరా యని యడుగుఁడు అట్లు చేసినవాని నందల మెక్కించి నాయొద్దకుఁ దీసికొనిరండని యాజ్ఞాపించి పంపెను.

వారాపత్రమును దీసికొని యనేకపట్టణంబుల కరిగి పెక్కండ్రు బుద్ధిమంతులకుఁ జూపించి యాగీటు చిన్నదిగాఁ జేయుడని యడిగిన నెవ్వరు నప్పని జేయలేక పోవుటయేగాక యది యెట్లును నొనఁగూడని పనియని పరిహాసము చేయదొడంగిరి.

అయ్యా! మీ రాజెంత పిచ్చివాఁడోకదా! యేమియు లేనిదానికై యూర కింతప్రయత్నము చేయుచున్నవాఁడని కొందఱును, ఆహా! సిరాగీటు చెరపక యెట్లు చిన్న దగునని కొందరును, మేలు మేలు దీనిని చెరపక హ్రస్వముగాఁ జేయుటకు మా యొద్ద యంత్రశక్తిలేదని కొందఱు నవ్వసాగిరి.

లోకమునఁ దమకుఁ దెలియని పనులు అసంగతములే యని మందమతు లనుకొనిచుందురుకదా? ఎవ్వ రేమనినను గోపముజెందక రాజభటులు తమయేలిక యాజ్ఞ చొప్పున గనంబడిన వారికెల్ల కాగితము చూపింప దొడంగిరి.

ఒకనాఁ డొక్క యగ్రహారమున కరిగి యందలి వారలకుఁ జూపించుచు నొక బడిలో బాలురకుఁ జదువు జెప్పుచున్న యుపాధ్యాయునియొద్ద కరిగి యాతని కాకాగిత మును జూపించి అయ్యా తమ రీ గీటును జెడపక చిన్నదిగాఁ జేయగలరా? యని యడిగిన నతండట్లనియె. చాలు చాలు మీకుఁ బిచ్చిపట్టినదా యేమి. అసందర్భపుమాట లాడుచుండిరి. అట్లు చేయుటకు నా యొద్ద గారడీలేదు. పోపొండు మీకతంబున బాలురు చదువుట మానివేసిరి. అనుటయు వారు నిరాశులై మరలిచనుచుండ, నా బడిలో చదువుకొనుచున్న తిమ్మర్సను పదియారేడుల ప్రాయముగల బ్రాహ్మణకుమారుఁ డామాట లాలించి గురువుతో, అయ్యా మిమ్మెద్దియో యడిగి యూరక భిన్నముఖులై యరుగుచున్న వారే మనవుఁడు అతండు ఓహో! అసందర్భపు ప్రలాపంబులకుఁ దగిన యుత్తరంబెవ్వడియ్యంఁ గలండు సిరాగీటు చెరపక చిన్నది చేయవలయునట. అది బుద్ధి చాతుర్యంబునఁ దీరుప శక్యమైనదికాదు. మనయొద్ద గారడీలులేవు. అది మాకు శక్యముగాదని చెప్పిన నూరకచనుచున్న వారనిన, గురువుగారితో తిమ్మర్సు అయ్యా! ఆ పని నేను జేసెదను. వారిం బిలిపింపుఁడు అనునంతలో వారును ప్రాంత మందేయుండి యామాటలు విని తటాలున మరలివచ్చి యాచిన్నవానికా కాగితమును చూపించిరి.

అది చూచి నవ్వుచు, తిమ్మర్సు మేలు, మేలు యీ పాటి పనికే యింత దూరము వచ్చితిరి. ప్రపంచకంబింత నిపుణతా శూన్యమే యని పరిహసించుచు నా కాగితమును బుచ్చుకొని సిరాతో ఆ గీటు ప్రక్కను వేరొక్క పెద్దగీటు గీచి, ఇప్పుడు మీరు తెచ్చిన గీటు చెరుపకయే చిన్నదికాలేదా? యనిన వారు సంతసించుచు నోహో! నేఁడు మాపుణ్యమున బుద్ధినైపుణ్యముగల నిన్ను బొడగంటిమి. రాజశాసనమును చిత్తగింపుము. మీరిప్పుడు మా సంస్థానమునకు రావలయును. పల్లకీ తెప్పింతుము. పయనము కండని వినయపూర్వకముగాఁ బ్రార్ధించుటయు వారి మాటలును తిమ్మర్సు చేసిన పనియును జూచి యతని యుపాధ్యాయుఁడు మిగుల వెరఁగుపడుచు శిష్యునితో నిట్లనియె.

వత్సా! నీవు చేసినపని యుక్తిగా నున్నది. నిన్నింతవానిగా నేనెరుఁగను. ఈమాత్ర ముపాయము మాకెవ్వరికిం దోచినదికాదు. రాజు వట్టిప్రయత్నము చేయు మన్నాడనుకొంటినిగాని యింత తెలివిగలవాడని యూహింపనై తిని. యిప్పుడు రాజు నీకు గొప్ప బహుమానము చేయగలడని తోచుచున్నది. ఇంకొక్కటి వినుము. నీవు నాకు శిష్యుడవుగదా? శిష్యుని విద్యాగౌరవము గురువుదే యని చెప్పుదురు. నీవుజేసిన పని నేనే జేసితినని రాజుగారితో చెప్పెదను మంచి పారితోషికము దొరకగలదు. రాజ భటుల కెద్దియేల లంచమిచ్చి యట్లనిపించెదను. నీవు సమ్మతింపుము. మొదట దొరికిన బహుమానము గురుదక్షిణగా నిచ్చుట న్యాయమని యడిగినవిని తిమ్మర్సు ఆర్యా! దీనికై నన్నింత బ్రతిమాలవలయునా? ఇది యంతయు మీ యనుగ్రహమే కదా? నిజముగా నీ పని చేసినవారు మీరే కాని నేనా? అని యొడంబడిన పిమ్మట దనకు రాజుగారిచ్చు దానిలో సగము మీకిచ్చెదనని రాజభటుల నొప్పించి శుభముహుర్తమున నాందోళికమెక్కి తగిన వేషముతో జుట్టును రాజకింకరులు గొలిచిరా గతిపయ ప్రయాణంబుల నరసింహదేవరాయలవారి నికటంబున కరిగెను.

ఆ భూభర్త యా వర్తమానమువిని చిరకాలమునకు దగిన మంత్రి దొరికెగదా యని మిగుల సంతోషించుచు నెదురేగి పల్లకిలో గూర్చుండిన యతని వేషముజూచి "అకార సదృశః ప్రజ్ఞ!" అనునట్లు రూపమునుబట్టియే యతని బుద్ధిమాంద్యమును తెలిసికొని, పరీక్షించి చూచెదంగాక యని, దగుసత్కారముతో నతని సభాంతరమునకు గొనిపోయి యుచితపీఠంబునం గూర్చుండబెట్టి నిట్లనియె.

అయ్యా! యీ గీటు నిట్లు చేసినవారు మీరేనా? యని యడిగిన నా బ్రాహ్మణుఁ డెన్నడును రాజసభల కరిగినవాఁడు కాఁడు. సభాకంపముతో నెట్టకేలకు గద్గదకంఠమున నేనే, నేనే యని యుత్తరము చెప్పెను. ఆ స్వరంబుననే యతఁడట్టి నేర్పరి కాఁడని తెలిసికొని రాజు మరల విప్రునితో అయ్యా! మీ బుద్ధిచాతుర్యముఁ బరీక్షింప నింకొక పని చెప్పెదను. అది మీరు చేసినచో నిదియు మీరే చేసినట్లు నమ్మెదనని యా భవనాంతరమం దొకపీఠంబున మంత్రిముద్రికలనుంచి చుట్టును పరుపులు పరిపించి యవి త్రొక్కకయే పోయి యా ముద్రికలఁ దెచ్చుకొనుఁడని చెప్పిన నప్పని కేమియు నుపాయము తోఁచక బ్రాహ్మణుం డాకాశము దెసకు మోమెత్తి యిట్లు చింతించెను.

అయ్యో! యీ రాజు నా కెద్దియో బహుమానము జేయుననుకుంటిని గాని మరలా పరీక్ష జేయునని యూహింపనై తి. ఊరక వట్టిడాంబికముఁ గొట్టుకొనువారి కవమానము రాకుండునా? ఇప్పుడేమి చేయుదును. తిమ్మర్సునుగూడ వెంటబెట్టుకొని యైన రానైతిని దైవ మీయాపద నాకు దాటించినచో నిక నెన్నడును యిట్టి డంబములకుఁ బూనుకొనను. ఇప్పుడు యథార్థము చెప్పకతీరదు. నిజము చెప్పి రాజుపాదంబులంబడియెద ఇంతకన్న వేరొక్క యుపాయము లేదని యూహించి యా వైదికుఁడు గడగడవడకుచు భూవల్లభునితో మెల్లన నిట్లనియె.

దేవా! నేను బ్రాహ్మణుడను. కుటుంబముగలవాఁడను, నన్ను శిక్షింపక మన్నింతురేని యథార్థముఁ జెప్పెద నాకు భయంబున మాట తిన్నగ రాకున్నది. దేవరవారి చల్లనిమాట విని పిమ్మట జెప్పెదనని పలికిన నృపతి వాని పిరికితనమునకు నవ్వుచు బ్రాహ్మణుఁడా వెరవకుము. నీ కేమియు భయములేదు. యథార్థము చెప్పుము. నిను మన్నించితినని పలికిన పిమ్మట నా వైదికుఁడు తెరపితెచ్చుకొని అయ్యా యీ గీటు నేనుగీయలేదు. నాయొద్ద చదువుకొనుచున్న తిమ్మర్సను పేరుగల చిన్నవాఁడు దీని మర్మము గ్రహించెను. వాఁడు మంచిబుద్ధిమంతుఁడు. ఇప్పుడు వానిని బిలిపించినచో మీరు పన్నిన యుక్తులన్నిటినిఁ జేయఁగలవాఁడని పలికిన సంతసించి రాజు ఆ క్షణము భటుల గొందఱంబంపి వేరొక్క చతురంతయానమున సబహుమానముగా నా తిమ్మర్సును రప్పించెను.

రాజు తిమ్మర్సు ముఖవిలాసము జూచినంతటనే యతం డనన్యసామాన్యబుద్ధిచాతుర్యధురంధరుండని తెలిసికొని మిగుల సంతోషముతో గాఢాలింగనము జేసికొని యతనికి కైదండ యిచ్చి సభాంతరమునకుఁ దీసికొనిపోయి బాలుఁడా! యీ గీటు చిన్నదిగాఁ జేసిన వారెవ్వరని యడిగిన గురువేమి చెప్పెనో తనకుఁ దెలియమినతండు శ్లేషగా ఆయ్యా! అది మద్గురుప్రసాదంబున నట్లయినదని యుత్తరము చెప్పెను.

ఆ మాటలాలించి రేఁడు వాని మతిచమత్కృతివేర పరీక్షింప నవసరములేదని యెఱిగియు నెల్లరకు దెల్లము కావలయునని నీకు నేను మంత్రిత్వమిచ్చితిని. ముద్రిక లవిగో పీఠంబుపై నున్నవి. ప్రక్కలనున్న పరుపులఁ ద్రొక్కకయేపోయి వానిఁ గైకొనుమని యాజ్ఞాపించిన దిమ్మర్సు వల్లెయని మెల్లన నా పరుపులు చుట్టుకొనిపోయి యా ముద్రికలం దీసికొని మరల నా చుట్టలవిప్పి రాజుగారి ముందర నిలిచి ఇవిగో తెచ్చుకొంటిని పరుపులు త్రొక్కలేదు. చూడుడని పలికిన నాయుక్తి కెల్లరు సంతసించిరి. రాజు తిమ్మర్సును మిగుల గౌరవపరచి యా దినముననే మంత్రిత్వపదవికిఁ బట్టాభిషేకము జేసెను.

నాఁటినుండియుఁ దిమ్మర్సు వారి యాస్థానమునకు మంత్రియై సకలరాజ్యకార్యములు యథాప్రయోగములుగా నడుపుచుండెను. అతని బుద్దివిశేషముచేతనే కదా ! నరసింహదేవరాయలకుఁ గృష్ణదేవరాయలు జనించెను. ఆ కథ నీవింతకు పూర్వము విన్నదేకదా? తిమ్మర్సు మంత్రియైన కొంతకాలమునకు వృద్ధరాజు పరలోకగతుండయ్యెను. పిమ్మటఁ గృష్ణదేవరాయులు రాజయ్యెను. అష్టదిగ్గజములను బిరుదులు వడసిన కవీంద్రులును బుద్ధివిశారదుండగు మంత్రి తిమ్మర్సును చెంత నొప్పుచుండ నతని వైభ మాఖండలునకైన లేదని చెప్పుట యేమి యాశ్చర్యము. అతండు కవిత్వప్రియుండై భోజుండువోలె వితరణంబునకుఁ బండితబృందంబుల కానందంబు గలిగించుచుండ నతని కీర్తి దిగంతవిశ్రాంతమై యొప్పుచుండెను. కృష్ణదేవరాయల చరిత్రమంతయుఁ జెప్పుటకు బెక్కుదినంబులు పట్టునుగాన బ్రస్తుతోపయుక్తమగు కథను మాత్రము చెప్పెద నాకర్ణింపుము.

తిమ్మర్సుతోగూడ మిగులవిఖ్యాతిగా రాజ్యంబేలుచున్న రాయలకు దాసీపుత్రుడను కళంక మొకటిగూడ దేశంబున వ్యాపించియున్నది. దానంజేసి యతనికిఁ దిగిన రాజులెవ్వరు కన్నె నిత్తునని వచ్చినవారుకారు. అతఁడు బెద్దకాలము వివాహము లేకయే యుండెను. అట్లుండునంత నొకనాఁడు కళానిధియను బ్రాహ్మణుఁ డొకఁడు రాజదర్శనార్ధమైవచ్చి యతనిచే సత్కారములంది. తన విద్యాప్రౌఢిమ యంతయుఁ జూపించిన సంతసించి యతనితో రాయలు అయ్యా! మీ పాండిత్యము మిగులఁ గొనియాడఁదగి యున్నది. మీరు పెక్కు దేశంబులు తిరిగియుందురు. ఎందేని పాండిత్యముగల స్త్రీలను చూచితిరా యని యడిగిన నతండొక్కింత స్మరణ మభినయించి మహారాజా! సేతు హిమాచలాంతరమందున్న భూమియంతయుఁ దిరిగితిని. అందు విద్యావతులైన యువతుల నెందరేనిగంటి వారిం బేర్కొననేల వినుఁడు.

కుంతలదేశంబునకు రాజధానియైన గోపాలపురంబున గోపాలుండను రాజు రాజ్యంబేలుచుండెను ఆ రాజునకుఁ జిరకాలమునకుఁ గళానిలయ యనుపుత్రిక జనించినది. దానిపేరు సార్ధకమైనదిగాని సంజ్ఞామాత్రమునకై యుంచినదికాదు. కళలకును విద్యలకును నివాసభూమియగు నామగువ యిప్పుడు పదియారేడుల ప్రాయము గలిగి యున్నది ఆ చిన్నది యెట్టి రాజకుమారుఁడు వచ్చి యడిగినను దనకుఁ దగినవాఁడు కాఁడని వివాహమాడకున్నది. అనేక విదేశవస్తువిస్తారరుచిరంబగు సౌధాంతరమున వసించి పండితులైన బ్రాహ్మణులకు మాత్రము దర్శనంబిచ్చుచు నే విద్యయం దెంత పాండిత్యమున్న వారినైనను పరీక్షించి యోడించి జయపత్రికలఁ గైకొనుచుండును. పాండిత్యములేని మానవపశువులఁ జూడనని యామె శపథము జేసియున్నది. విద్య మాట యటుండనిమ్ము. ఆ యతివ సోయగ మనిమిషకామినులకైనను లేదని రూఢిగాఁ జెప్పగలను.

సర్వాంగసుందరయగు నత్తలోదరి యొక్కతెయ భూలోకంబులో స్త్రీలలోఁ గాక పురుషులలో సైతము విద్యామహిమచే బొగడఁదగియున్నది. ఆ యొప్పులకుప్పను దేవరవారికి కూర్చినచో జతురాననుండు చతురాననుండని నమ్మెదను.

భూమండలమున బండితరాయలని బిరుదుపొందిన నేనుగూడ నే విద్య యందును నా చిన్నదానితో సమముగా మాటాడనేరం జయపత్రికనిచ్చి యచ్చటినుండియే యిచ్చటికి వచ్చితిని. ఇంతకన్న నాయెఱిఁగినది లేదని చెప్పిన పండితుని మాట లాలించి కృష్ణదేవరాయలు శ్రవణరూపమైన దృగవస్థతోఁగూడ మనస్సంగమ మను రెండవ మన్మథావస్థ పాల్పడెను.

పిమ్మట నాపండితుని యథోచితసత్కారములచేఁ బూజించి యంపి మరికొన్ని దినములకు దన దర్శనంబునకు కొందఱు పండితులు వచ్చుటయు వారి నర్చించిన పిమ్మట బ్రస్తావముగాఁ గళానిలయ వృత్తాంతము మీకేమైనఁ దెలియునాయని యడిగెను. వారును ఆ చిన్నదానిగురించి మున్ను చెప్పిన బ్రాహ్మణునికన్న నెక్కుడుగా స్తోత్రములు చేయ దొడగిరి. నాటినుండియు రాయలు తనయొద్దకు వచ్చెడు పండితుల నెల్ల నడిగి తెలిసికొనుచు నామెయందు బద్ధానురాగుండై యట్లు మన్మథావస్థలకుఁ బాల్పడి క్రమంబున క్షీణింపదొడంగెను.

ఇట్లుండినంత నొక్కనాఁడు తిమ్మర్సు రాజుగారి యవస్థ యంతయుఁ బరిశీలించి శంకాన్వితస్వాంతుడై యక్కారణం బేమని యడిగిన నతండు మంత్రితోఁ తన యవస్థావృత్తాంతమంతయు చెప్పుటయే కాక యాకుముదవదనను దనకుఁ బెండ్లి జేయనిచోఁ గొద్దిదినములలోనే మేనం బ్రాణములు బాయుదునని చెప్పెను. ఆ మాటలాలించి తిమ్మర్సు నవ్వుచు రాజా! నీ కోరిక యసాధ్యముగానున్నదే. ఆ గోపాలుఁడు, మనకంటె నధికారముచేతను సంపదచేతను నధికుడు. అతని కూఁతు నీ కెట్లిచ్చును? ఇదియునుం గాక నీకు దాసీపుత్రుఁడను కళంకము జగద్విదితమై యున్నది. సంపత్కులంబులం దులగానివా డధికునితో సంబంధము చేయఁ దలంచుట పొట్టివాడు పెద్దచెట్ల ఫలములకై చేయి చాచినట్లగు. కోరరాని వస్తువులం గోరి యూరక వెతలఁబడ నేటికి? సాటిబోటిం బెండ్లియాడి వేడుకలం దీర్చుకొనుమని విరక్తి మాటలం బలికిన విని మరుమాటలాడక యిస్సురని నిట్టూర్పు పుచ్చుచుఁ గొండొకవడికి మోమింతయెత్తి యతని మొగంబుపై వేడి చూడ్కులు బరపించుచు నిట్లనియె.

వయస్యా! ఇదియా నీవు చెప్పునది, చాలు. లోకాతీతమతి చమత్కృతిగల హితుండు గలిగియుండు నాకేమి కొరత. నా కార్యమెట్లో సఫలము చేయుదువని సంతసించుచుంటిని గాని తుదకు నీవిట్టి పిరికిమాటలు చెప్పుదువని యెన్నఁడును దలంపనైతిని కానిమ్ము కానిమ్ము దైవంబేమి సేయదలఁచెనో చూచెదంగాక. నేను సామాన్యస్త్రీని బెండ్లియాడను నీకు సామర్థ్యమున్నఁ గళానిలయం బెండ్లి చేయుము. లేనిచో నూరకుండుము నేను సన్యాసినై దేశాటనంబు గావించెద రాజ్యంబు నీవే చేసికొనుమని వైరాగ్యముగాఁ బలుకుటయు తిమ్మర్సు రాజా! నీ వింతటి యల్పకార్యమునకే యలంతి మాటల నాడవలయునా? యొక పడంతుకకు నెక్కుడు ప్రయత్న మేమిటికని యిట్లంటి నిజముగా నట్టి కామితము నీకుఁ గలిగినచో నెట్లో కార్యము సమకూర్చెదం గాని పోనిత్తునా? వినుము. బుద్ధిమంతు డెన్నడును కొంచెము పలికి యెక్కుడు చేయును. నా సామర్థ్యముంతయుఁ గనపరిచి యత్తరుణి నీకుఁగూర్ప యత్నించెను. దైవప్రతికూలమున నొకవేళ కార్యము సఫలము కానినాఁడు మాత్ర మిట్టి యుగ్రప్రతిజ్ఞ పట్టగూడదు. నీవాంఛయంతయు దీర నా నారీమణిని నీకుం జూపించెద. ఇంత పట్టు శపథము చేయఁగలను. దీనికి నీ యభిప్రాయమేమని యడిగిన నతండు మందహాస ముఖారవింద మలంకరింప నతనిని గౌఁగలించుకొని మిత్రమా! నీవు నిక్కముగాఁ దలంచిన పని కాకపోవునా? ఎట్లయినను సరే. యొక్కసారి యక్కలికిని గన్నుల కరవుదీర జూచినం జాలు. అట్టి ప్రయత్నము చేయుమని తొందర పెట్టిన తిమ్మర్సు మరల నిట్లనియె.

రాజా! నీవు చూడగోరిన చేడియ యన్నిటను మిగుల ప్రోఢయని విని యుంటిని. దానింజూడ బాడవేషంబులం గాని పొసంగదు. నీవు నట్టివేషము వేయవలసి యుండును. ఇట్టి రాజవేషము తీసి బ్రాహ్మణవేషము వేయుమని చెప్పుటకు నాకు సందియముగా నున్నది. అని పలికిన నవ్వుచు రాయలు తిమ్మర్సుతో నిట్లనియె. మిత్రుడా! నీవు దీనికై సంకోచమందుచుంటి వేమి. నాయెడ రాజభావము వదలి మిత్రభావముగా మెలఁగుమని యిదివరకే చెప్పియుంటిని. ఈమాట మరచితివా యేమి ఇదియునుం గాక బ్రాహ్మణులు సర్వోత్కృష్ఠులుగదా! అట్టి వేషము వేయుట కేమి నీచము. ఆ పద్మాక్షి నీక్షింప బ్రాహ్మణవేషంబేగాదు, బైరాగివేషంబైనను వేయుమనినచో సిద్ధముగా నుంటినని పలికినఁ దిమ్మర్సు మిగుల సంతసించి కార్యనిర్వాహకత్వమునకు నొడఁబడెను.

అంతట వారొక్క శుభముహూర్తమునఁ దీర్థయాత్రాకైతవంబునఁ బురంబు వదలి యుకచోఁ బ్రచ్ఛన్నముగాఁ బ్రభువేషముల దీసివైచి శ్రోత్రియు బ్రాహ్మణవేషంబు వైచుకొని బ్రాహ్మణత్వం బాకృతిగైకొని నట్లొప్పుచు వేదంబులు వర్ణించుచు ధవళయజ్ఞోపవీతంబుల వ్రేళులకు జుట్టి పనసల రువ్విడుచుఁ జూచువారలకు నేత్రపర్వమాపాదించుచుఁ గతిపయప్రయాణంబు లరిగి యొకనాఁడు సాయంకాలమునకుఁ గాంపిల్యంబను పురంబుజేరి యందు బ్రాహ్మణులలో నన్నదాత లెవరని యడిగి యాపట్టణపు రాజుగారి పురోహితుండుగాఁ దెలిసికొని వారింటికరిగి సోమశర్మయను నా బ్రాహ్మణుడు అప్పుడింట లేకున్నను నతని గృహిణి వాడుక చొప్పున వారి సత్కారములనే నాదరించి వారి విశ్రమింపజేసి యతివేగంబునఁ బాకంబు గావించెను. సద్గుణవంతులగు సతులు దొరుకుట పతుల భాగ్యముగదా! ఇంతలో నాసోమశర్మయు నింటికివచ్చి యెద్దియో విచారముతో నతిథులఁ బరామర్శింపక యొకగదిలోఁ బండుకొని చింతించుచుండెను.

వంటయైన పిమ్మట నతనిభార్య యతిథులతోఁగూడ బతిని భోజనమునకు లెమ్మని పలికిన నతండు ప్రాక్షమిత్రుండగు మంత్రి రే పురిదీయ బడనుండ నాకీ రేయి నన్న మెట్లు నోటికిఁ బోవును? నీవును నతిథులు భుజింపుడు నాకన్న మక్కర లేదని యుత్తరము చెప్పెను. ఆ మాటలు విని యామె మంత్రికెద్దియు నాలోచన తోచలేదా! తోచనినాఁడు మూఁడు దినంబులు మితియిచ్చి యుండెనే ఇంతలో నెవ్వరినేని యడిగి తెలుసుకొనలేకపోయెనో? యూరక చావవలసి వచ్చెనా? పాపమయ్యయ్యో! యని వగవఁ దొడంగినఁ బురోహితుండు భార్యతో, నారీమణీ! మంత్రికిఁ దోచునంత తెలివిగలిగియున్నచో మొదటనే తోచును. ఆతనిబుద్ధి మన మెఱుంగనదియా మూఁడుదినంబులుగాదు, సంవత్సరము మితి యిచ్చినను యతనికిఁ దెలియదు. మరియు నతనికి బోధింపనంత మతిచమత్కృతిగల తిమ్మర్సులిం దెవ్వరున్నారు. పాపమత డూరక చావవలసి వచ్చినది. బుద్ధినైపుణ్యము లేనివాఁడైనను మంత్రి సుగుణంబులకే గొనియాడఁ దగినవాడు సుమీ! క్రూరులగు ప్రభువులయొద్ద నుత్తములు పనికిరారు నాకు మిత్రనాశనశోకంబుగాక వేరొక్కచింత పుట్టుచున్నది. ఈవేళ మంత్రి నురిదీయుచున్నాఁడు. రేపు నన్నెద్దియో యడిగి చెప్పలేకపోయినచో మంత్రివలె నన్ను నురిదీయ నాజ్ఞవేయును. అననుకూలప్రశ్నములకు నుత్తరం బెవ్వఁడు చెప్పగలఁడు. అవివేకరాజును సేవించుటకంటె ముష్టియెత్తుకొనుటయే యుత్తమమని చెప్పుదురు. ఎట్లయినను నీరాజు కొలువు మానుకొనుటయే మేలని విచారముతో బలుకుటయు నా బ్రాహ్మణుని మాటలన్నియు విని తిమ్మర్సు రాయలతో నాలోచించి యా విప్రుదరికరిగి యతని కిట్లనియె.

అయ్యా, మేము యజమానుఁడు భుజింపనిచో భుజించువారముకాము. మీ రెద్దియో యావన్మూలమున విచారించుచుంటిరి. ఆ యాపద యెట్టిదో యెరింగింపుడు. మఱియు నట్టి యాలోచన చెప్పుటకుఁ దిమ్మర్సులు లేరని యంటిరి. తిమ్మర్సును మీ లెరుగుదురా! యని యడిగిన వారి కాబ్రాహ్మణుం డిట్లనియె. ఆర్యులారా! నేను తిమ్మర్సు నెప్పుడును చూచియుండలేదు. కృష్ణదేవరాయల మంత్రియనియు మూడులోకముల నతనికి సమానుఁడగు బుద్ధిమంతుఁడు లేడనియు నతని చర్యలు కథగాఁ జెప్పుకొనుట విని యిట్లంటిని. మొన్న మారాజు మంత్రికి మూడుప్రశ్నము లిచ్చి వానికి నాలుగవనా డుత్తరము జెప్పలేకపోయితివేని నురి తీయింతునని కఠినముగా నాజ్ఞ చేసియున్నాడు. ఆమితి యీరాత్రితో సరిపడినది. వానికి నుత్తరము లతనికిఁ దోఁచకపోవుటయేగాక, యెవ్వరినడిగినను దగిన యాలోచనము చెప్పలేకపోయిరి. ఈలాటివానికఁ దిమ్మర్సు సమాధానముగా చెప్పఁగలడని యందఱు ననుకొనిరి గాని యంతదూర మరిగి తెలిసికొని వచ్చుటకు గడువు చాలినదికాదు. రేపే మంత్రి నురి తీయుదురు. నాకు మంత్రి మిగుల మిత్రుడగుటఁ దోచకున్నది. మీరు భుజింపుడు. నాకు నన్నము నోటికిపోదని పలికిన యజమానుని మాటవిని రాయ లతని కిట్లనయె.

అయ్యా! యీ బ్రాహ్మణుడు తిమ్మర్సునకుఁ బ్రాణమిత్రుఁడు. తీర్థయాత్రకై వెడలెనుగాని యెప్పుడు నతనియొద్దనే యుండువాఁడు, బుద్ధిచే నతనితో సమానుఁడె. ఆ మూఁడు ప్రశ్నములు నెట్టివో చెప్పుడు తప్పక నితఁడు సమాధానము చెప్పును. మీ పుణ్యము బాగున్నది. మీరు చింతింపకుఁడు మీ మంత్రి ప్రాణముల నితఁడు కాపాడగలడు. అని ధైర్యముగాఁ బలుకుటయు నతనిమాట లాలించి యత్యంత సంతోషముతో సోమశర్మ వారికి వందనములు జేయుచు నయ్యా వినుండు మా రాజు పెద్ద సభచేసి మంత్రికిచ్చిన ప్రశ్నములు :-

1. సంతతము భగవంతుడేమి చేయుచుండును?
2. నక్షత్రముల సంఖ్య యెంత?
3. భూమికి నడిభాగ మెద్ది?

అని మూడు ప్రశ్నములిచ్చి నాల్గవనాఁడు తగిన సమాధానము చెప్పనిచో నురి తీతునని యాజ్ఞాపించి మంత్రి నింటి కనిపెను. వానిలో నొక్కదానికైన మంత్రికి నుత్తరము తోచినదికాదు. ఇప్పుడే నేనతని యొద్దనుండి వచ్చితిని. అతండు భార్యా పుత్రులు చుట్టునుం బరివేష్టించి శోకింపుచుండ మరణకృతనిశ్చయుండై చింతించు చున్నాఁడు.

వీనికి మీ కెద్దియేని దోఁచినచో సెలవిచ్చి మంత్రి ప్రాణములు గాపాఁడుడు మీ పుణ్యమెవ్వరికీ రాదని వేడుకొనినఁ దిమ్మర్సు రాయలతో దీనికి మీకేమైనం దోచినదా? అని యడిగిన నతం డీప్రశ్నములకు నిజంబైన యుత్తర మెవ్వండును నియ్యజాలఁడుగాని కపటముచేసి రాజు నొప్పింపవచ్చునని పలికిన విని తిమ్మర్సు. ఔను. ఆలాగుననే చేయవలెను గాని నిజముగాఁ జెప్ప నెవ్వరి తరమని యొండొరులు మాట్లాడుకొనిన వెనుక తిమ్మర్సు సోమశర్మతో అయ్యా! ఈ కార్యము నేను జక్కబెట్టెదను. మీరు భుజింపుఁడు. భోజనంబైన వెనుక మంత్రి నొకసారి మా యొద్దకుఁ దీసికొని రండని పలికిన సంతసించి యా బ్రాహ్మణుఁడు వారితో నానందముగా భుజించిన వెనుక వేగంబున యింటికరిగి యతనితో నిట్లనియె.

అయ్యా! నేఁడు మాయింటికి దిమ్మర్సునకు మిత్రులైన బ్రాహ్మణు లిరువురు వచ్చిరి. వారితో మీప్రశ్నముల వృత్తాంతము చెప్పితిని. వానికి సమాదానము చెప్పెద మని ప్రతిజ్ఞపట్టి మిమ్ముఁ దోడ్కొని రమ్మనిన నేను వచ్చితిని. పోదము రండని పలికిన నమృతోపమానంబులగు నతని మాటలు విని మంత్రి దిగ్గునలేచి సోమశర్మా! ఆ పుణ్యాత్ములెక్కడ నున్నారు త్వరగాఁ బోవుదము రమ్మని యతనివెంట వారింటి కరిగి యందు నా కపటబ్రాహ్మణులం గని సాష్టాంగముగా వారి పాదంబులంబడి పుణ్యాత్ములారా! మీరు నా యాపద బాపుటకై వచ్చిన భగవంతులని తోచుచున్నయది రాజుతో రేపు నే నేమి చెప్పవలయునో బోధించి నాకుఁ బ్రాణదానంబు సేయుఁడు. మీ యుపకార మెన్నటికిని మరువనని పెక్కుగతుల నుతియింపం దొడంగిన నతని లేవనెత్తి తిమ్మర్సు అనఘా! నీ ప్రాణంబులు గాపాడెదము. నీవిఁక చింతింపకుము. రాజు నిన్నడిగిన ప్రశ్నముల కుత్తరములు మాటలచే నీవు చెప్పునవికావు. నేను క్రియలచే జూపించెద రేపుదయమున నీవు రాజనగరి కరిగి తన ప్రశ్నములకు సమాధానము చెప్పుమని యడిగినప్పుడు రాజుతో నిట్లనుము.

అయ్యా! తమ ప్రశ్నములు త్రిలోకజనమేధాభేద్యములు గదా! వాని జెప్పుటకు లౌకికవ్యాపారపారాయణుఁడనగు నా కెట్లు సాధ్యమగును. దురవబోధ్యము లగు వానిం బోధింప నొక విప్రుని నియమించితిని. సెలవైనచో నతనిం బిలిపించెద నని యడిగి యతం డొడంబడినప్పుడు నాకు వార్తనంపుమని చెప్పిన విని మంత్రియు వారి ముఖవిలాసములంబట్టి యట్టి పని సేయు సమర్ధులే యని నమ్మి సంతోషముతో వారిచే ననుజ్ఞాతుండై యింటి కరిగెను.

మఱునాఁడు రాజు సకలసామంతబంధుపారవారసమేతుండై కొలుపు తీర్చి మంత్రిరాక కెదురుచూచుచుండ నింతలో మంత్రియు సంతోషముతో రాజసభ జేరి యథా యోగ్యపీఠంబునం గూర్చుండియుండ రా జతనిఁ జూచి యమాత్యోత్తమా! నా ప్రశ్నలకు నడుత్తరం బూహించితివేని సత్వరంబుగ నుడువుము. లేకున్న నురిస్తంభము కడకుఁ బొమ్మని పలికిన నతం డిట్లనియె.

దేవా! మీ ప్రశ్నలు అమానుషంబులగుటచే నవి సామాన్యముగాఁ జెప్పనలవడునవి కావు. వాని ననుకూలముగా నిరూపించి చెప్పుట కొక పండితుని నిర్దేశించితిని సెలవైనచోఁ బిలిపించెద ననిన రాజు యింక నాలస్యము చేసెద వేమిటికి త్వరగా బిలిపింపుమనిన మంత్రి యప్పుడొక భటునిచే దిమ్మర్సునకు వార్తనంపెను. తిమ్మర్సు సామాన్యవస్త్రములు ధరించి చూచువారెల్ల నోహో! యితండా! రాజప్రశ్నముల డుత్తరము చెప్పువాఁడని పరిహాసము చేయుచుండ రాజసభ కరిగెను. సభ్యులెల్ల నతని జూచి యుల్లసమాడిరి. పిమ్మట నతం డొక పీఠంబున గూర్చునియుండ నతనికి రాజిట్లనియె.

విప్రా! నీవు నా ప్రశ్నములకు లెస్సగా నుత్తరము నీయఁగలవా? అని యడిగిన నతం డివి యెట్టివో తెలుపుఁడనియె రాజు వాని మూఁటిని జదివి వినిపించి సమాధానము చెప్పుమనిన నతం డయ్యా! మీ శంకలు సామాన్యములు గావు. మూఁడు ప్రశ్నములకు నొక దిన ముత్తరమీయ శక్యముగాదు. మూఁడునాళులు గడువిచ్చినచో దినమున కొకదాని కుత్తరమిత్తును. నేఁడు దేని కుత్తరమీయవలయునో నుడువుఁడనిన రాజు దానికి సమ్మతించి మొదటి దినంబున మొదటి ప్రశ్నము, సంతతము భగవంతు డేమి చేయుచుండును? అనుదానికి నుత్తరం బిమ్మనియె.

అప్పుడు తిమ్మర్సు నిలువంబడి, రాజేంద్రా! సకలలోకనిర్మాణరక్షకుండును, సచ్చిదానందస్వరూపుండును, అవాఙ్మానసగోచరుండునగు భగవంతుని దినచర్యలు చెప్పుట సామాన్యము గాదని యెల్లరు నెఱుంగునదియే. భగవదంశచే జనించిన మీ యలంకారములు నాకిచ్చి, నా బట్టలు మీరు గట్టుకొని, మీ సింహాసనముపై నన్ను గూర్చుండబెట్టి నా యెదుట మీరు నిలిచినచో నప్పుడు భగవచ్చర్యలు చెప్పుటకు నర్హత నాకుఁ గలుగును. అనుటయు నతం డందులకు నియ్యకొని తన యాభరణము లన్నియు నూడ్చి యతనికిచ్చి యతఁడు గట్టిన పాతబట్టలు దాను గట్టుకొని యతినిఁ దన సింహాసనమునఁ గూర్చుండబెట్టి తా నతని యెదుటఁ చేతులు జోడించుకొని యిప్పుడు భగవంతుఁ డేమి చేయుచున్నాడో చెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

రాజా! నే నింతకుము న్నెట్లుంటినో యిప్పు డెట్లుంటినో చూడుము. నీ వెట్లుంటివో చూచుకొనుము. మునుపు సామాన్యవిప్రుఁడనైన నే నిప్పుడు కిరీటకేయూరకటకాద్యలంకారములు దివ్యాంబరములు దాల్చి రత్నసింహాసనమునం గూర్చుండి ప్రజాపాలనదక్షుడగు మహారాజునైతిని. పూర్వము మహారాజువగు నీవిప్పుడు సామాన్య బ్రాహ్మణుడవైతివి. భగవంతు డనుదిన మీరీతిని గొప్పవానిని కొలదివానిగాను, కొలదివానిని గొప్పవానినిగాను జేయుచుండును ఈ క్షణంబున భగవంతుడు నన్ను నిన్ను, నిన్ను నన్నునుఁ జేసెను. దీనికి శాస్త్రదృష్టాంతరము-

శ్లో॥ అంబోధిః స్థలతాం జలధితాం ధూళిలవశ్శైలతాం
     మేరు ర్మృణ్కభతాం తృణంకులిశతాం వజ్రంతృణప్రాయతాం
     వహ్నిశ్శీతలతాం హిమందహనతా మాయాతి య స్యేచ్ఛేయా
     లీలాదుర్లలితాద్భుత వ్యసనినే దేవాయ తస్మై నమః॥

అనగా, సముద్రమును దిబ్బగాను, దిబ్బను సముద్రముగాను, అణువును మేరువుగాను, మేరువు నణువుగాను, తృణము వజ్రముగాను, వజ్రాయుధమును తృణముగాను, అగ్నిని మంచుగాను, మంచు నగ్నిగాను నిత్యమును జేయుచున్న భగవంతునకు ననేకనమస్కారంబులు అని చదివి యిదియే భగవంతుని దినచర్యయని యూరకున్న యతని సమాధానమునకు యుక్తికిని నెల్లరు సంతోషించిరి. రాజు తిమ్మర్సు మాటలకు సమాధానము జెంది సవినయముగాఁ దన యాభరణాదికము గైకొని యా దినంబునకు మంత్రితోఁ గూడ దిమ్మర్సును బస కనిపెను.

మరునాఁడు రాజు పూర్వమువలె సభజేసి యా బ్రాహ్మణుని రాక కెదురు చూచుచున్న సమయంబున తిమ్మర్సు యొడినిండ సన్నయిసుక పోసికొని మంత్రితోఁ గూడ రాజసభ కరిగెను.

రాజు వారి నుచితమర్యాదలఁ గూర్చుండఁబెట్టి తిమ్మర్సుతో నార్యా! ఈ దినమున రెండవ ప్రశ్నము నక్షత్రముల సంఖ్య యెంత? అనుదానికి నుత్తరంబీయు డనిన నతం డెల్లరు చూచుచుండఁ దన యొడిలో నున్న యిసుకను రాజుముందరరాశిగా బోసి రాజా! నేను చుక్కల లెక్కఁబెట్టుచో నొక్కొక్క చుక్కకు నొక్కొక్క యిసుము చొప్పున వడిలోవైచితి. ఇన్ని నక్షత్రములైనవి. చూచుకొమ్ము అనిచెప్పి యా యిసుక నతని ముందరఁ బోసెను. ఆ యుత్తరమునకు సభవారందఱు నొకరి మొగం బొకరు చూచుకొనుచు నోహో! ఈ బ్రాహ్మణు డసాధ్యుడు రాజప్రశ్నములకు దగినట్లుత్తరము చెప్పుచున్నాఁడు. కుక్కకాటునకు చెప్పుదెబ్బ యనునట్లు వీని కిట్లే చెప్పవలయును. లేనిచో నక్షత్రము లెవ్వఁడు లెక్కఁబెట్టగలఁడు. అని గుజగుజలాడఁ దొడఁగిరి. ఆ నృపతి యేమియుఁ జెప్పనేరక సరియే యని యొప్పుకొని యా దినంబునకు వారివారి బసల కనిపెను.

మూడవనాఁడు తిమ్మర్సు మంత్రితో నొకచోట నొక స్తంభము పాతించుమని ప్రచ్ఛన్నముగాఁ జెప్పి మునుపటికన్న గొంచెము ప్రొద్దెక్కించి రాజసభ కరిగెను. రాజుగా రతని రాక కెదురు చూచుచు వచ్చినతోడనే బ్రాహ్మణుఁడా! నేడింత యాలస్యము చేసితివి. నీకు వేళ తెలియదా యేమి? త్వరగా మూఁడవ ప్రశ్నము (భూమికి నడిభాగ మెద్ది) అనుదాని కుత్తరంబు చెప్పుమనుటయుఁ దిమ్మర్సు అయ్యా! భూమి యనంతము గదా! దానిం జూపుటకు మంత్రశక్తి కావలసియున్నది. ఆ దేవత నారాధన జేయుచుండుటచే నాలస్యమైనది . క్షమింప వేడెదను. భూమి నడిభాగము చూడ నాస గలిగినచో దేవరవారు బాదచారులై నాతో రావలయును. ఇతరు లెవ్వరును రాఁగూడ దనిన రాజుగా రందుల కొడంబడి. యప్పుడే యతనితో భూనాభిస్తంభమును చూడ వాహనాదికము లేకయే నడువజొచ్చెను.

తిమ్మర్సు ఆ రాజుగారిని కారెండలో నడిపించుచు నిసుక త్రోవలంబడి యడవిలో ద్రిప్పుచుండ గొండొకసేపునకుఁ గ్రిందఁ బాదంబులు మీఁద శిరంబు నెండ వేడిమి నంటుకొని మాడ నారేఁడు నడువ నాయాస మెక్కుడగుటచే నొగర్చుచుఁ బాఱుఁడా నిలునిలు మింకెంతదూర మరుగవలసి యున్నది. నాకు శ్రమగా నున్నది. నడువలేనన రమ్ము రమ్ము దాపునకే వచ్చితిమి . ఈ మాత్రమునకే యాగలేరా? అని నడుచుచుండెను.

మరికొంత దూరమరిగి యా నరపతి యేమయ్యా! నా యాయాసము చూడక యూరక పరుగిడుచుంటివి. నా కాళ్ళంటుకొనుచున్నవి. నేనిక నడువనోపఁ గొంచెము సేపు విశ్రమింపవలయు నని యడుగుచుండ నతఁ డోహో! విశ్రమింపకు విశ్రమింపకుము విశ్రమించినచో నా మంత్రశక్తి కంతరాయము గలుగును. మన మింటికి జేరలేము. ఓపికబట్టి రమ్ము దాపుచేరితిమి. భూనాభి యూరకయే కనుపించునా? యని మరల నడువజొచ్చెను.

ఆ మాటలకు వెఱచి రాజు యెంత కాళ్ళుకాలినను నొప్పి పెట్టినను గూర్చుండక యోపికతో నడువలేక మరికొంత దూరము నడిచెను. పిమ్మట దాహమై నోరెండ జొచ్చి మాటరాక అయ్యో బ్రాహ్మణుఁడా! నన్నూరక చంపెదవా యేమి? నాకు భూమధ్యభాగము జూపింపనక్కరలేదు. నాకింత దాహము దెచ్చియిచ్చి నన్నింటికిఁ జేర్చుము. నీకుఁ జాలపుణ్యముండును. ఇంటికరిగిన వెనుక నీకుఁ బారితోషిక మిత్తునని బ్రతిమాలఁదొడంగెను.

అప్పుడు తిమ్మర్సు రాజుం జూచి యింత యశక్తుఁడ విట్టి కోరిక కోరనేటికి? ఇల్లుచేరుట సామాన్యముగా లేదు. మంత్రిశక్తిన వేగము వచ్చితిమిగాని తిరుగనరుగుటకుఁ బదిదినములు బట్టును. మంత్రశక్తిని బాసి యరిగినచో మృగములు భక్షించును. రమ్ము ప్రాంతములోనే యున్నది అని యెట్లో మరికొంత దూరము నడిపించెనుగాని యతి సుకుమారవంతుఁడగు రాజు వడదాకి మూర్చపడి యేమైననుసరే యని యొక చెట్టునీడం జతికిలంబడి బ్రాహ్మణుఁడా నాకు భూమధ్యభాగ మక్కరలేదు. చూచినదాని కన్న వేయిరెట్లు సంతసించితిని. నాకు దాహముతెచ్చి బ్రతికింపుము. కొంచెము సేపులోఁ బ్రాణము పోవునట్లు తోచుచున్నది. చచ్చినవెనుక నీ ప్రశ్నములతోఁ బని యేమి? నీ మేలెన్నటికిని మరువనన యతని పాదంబులం బట్టుకొని ప్రార్థించెను.

అప్పుడా తిమ్మర్సు రాజా! నీ ప్రాణములవంటివే గదా యితరుల ప్రాణములు. అసాధ్యప్రశ్నలు వేచి యుత్తరము చెప్పలేనిచో మంత్రిని జంపబ్రయత్నించుట నీకు మాత్రము దగునా? నీ విప్పుడెంత పరితపించుచుంటివో మంత్రియు నా దివసమున నంత తపించెనే. ప్రజల న్యాయాన్యాయములఁ బరిశీలించు ప్రభువే యన్యాయముచేయ యత్నించినచోఁ బ్రజలెవ్వరితోఁ జెప్పుకొందురు. ఇటమీఁదట నిట్టి ప్రశ్నములవైచి ప్రజల బాధింపనని ప్రమాణము చేసినచో నా మంత్రశక్తిచే నీ యాపదఁ దృటిలోఁ బాయజేయుదునని విని రాజు బ్రాహ్మణుఁడా! నాకు బుద్ధివచ్చినది. యెన్నడును నిటుమీఁద నిట్టి ప్రశ్నముల నెవ్వరి నడుగను. నీ మంత్రదేవతసాక్షి యని ప్రమాణికము చేసిన తిమ్మర్సు ఆ ప్రాంతమందే పాతించన స్తంభము చెంతకుఁ దీసికొనిపోయి ఇదిగో భూమధ్యభాగము చూడుమని యా స్తంభము చూపించిన రాజు సంతసించి చూచితినిగాని నాకు నాకలియు దప్పియు నగుచున్నది. ఎట్లు తీర్చేదవో నా ప్రాణము నీ యధీనమైనదని వేడిన నతండు రాజా! చింతింపకుము. నా మంత్రశక్తిచే నాహారాదికము నిచ్చటనే పుట్టించెదనని యంతకుమున్ను ప్రచ్ఛన్నముగా నాహారపదార్థములు మంచినీళ్ళును దెప్పించి యందొకచోట దాపించియున్న వాడగుట నొక పొదరింట నుండి యవి తీసికొనివచ్చి భుజింపుమని రాజు మ్రోలనుంచెను..

రాజు వానిం జూచి యతని మంత్రశక్తికి నద్బుతమందుచు నా పదార్ధములనే నాఁకలి యడంచుకొని బ్రాహ్మణోత్తమా! నీ ఋణం బెన్నటికిని దీర్చుకొనలేను. నా రాజ్యంబంతయు నిచ్చినను సరిపడదు. నన్నింటికి జేర్పుము సాయంకాలమగుచున్నది. రాత్రి యీ యడవిలో మృగములబాధ మెండుగా నుండునని తోచుచున్నది నీ మంత్ర శక్తిఁ జూపింపుమనిన నతండు రమ్ము పోదము. నా మంత్రసామర్ధ్యమున జీకటిపడక పూర్వమే యిల్లుజేర్చెద నని పూర్వము మెలికలుగాఁ దీసికొని వచ్చిన మార్గమునగాక విదానముగానున్న దారిని నడచినంత ప్రాంతమందే పట్టణమున్నది. సాయంకాలము లోపుననే యూరుజేరిరి. రాజు తన్నుఁ జచ్చి బ్రతికినవానిగాఁ దలఁచి మరునాటిసభలో నా బ్రాహ్మణుఁడు తన ప్రశ్నములకుఁ జెప్పిన యుత్తరములకై సంతసించుటయేగాక నడవిలో దనకుజేసిన మేలును గురించి పెద్దయుందడవు స్తోత్రములు జేసెను

పిమ్మట మంత్రియు సభ్యులును ఆతఁడు పన్నిన యుక్తులకు వేతెరంగుల సంతసించి మంత్రి యాపదఁ దొలగించుటకు వచ్చిన భగవంతుఁడుగాఁ దలంచి జయ జయధ్వనులతో బెక్కు స్తోత్రములు చేసిరి. రాజును మంత్రియు, తిమ్మర్సును బుష్పములచేఁ బూజించి అయ్యా! తమకిష్టమైన కోరిక యెద్దియేని యుండిన సెలవిండు. దానంజేసి మా కృతజ్ఞత జూపించుకొనియెదమని యడిగిన తిమ్మర్సు వారితో నయ్యా! మీరు సంతసించుటకంటె నాకుఁ గావలసినది యేమియులేదు. మీ యిరువురకు మంచి వాఁడనైతి. ఇదియే పదివేలు. పోయివచ్చెదము సెలవిండు తీర్థయాత్ర కరుగుచున్న వారమని వారిచే సబహుమానముగా ననిపించుకొని యప్పురంబు వెడలి క్రమంబుగఁ గోపాలపురంబు జేరిరి. అందొక శ్రోత్రియబ్రాహ్మణుని యింట బసఁజేసిరి. ఆ విప్రుండును భక్తిపూర్వకముగా వారి కాతిథ్యం బిచ్చి భోజనంబైన వెనుక వినయంబున నాగమనకారణం బడిగిన నతనికి తిమ్మర్సిట్లనియె.

ఆర్యా! మేము విద్వాంసులము. మాకుఁ బెక్కువిద్యలలోఁ బాండిత్యము గలిగియున్నది. ఇప్పుడు కాశి కరుగుచుంటిమి. ఈ పట్టణపు రాజునొద్ద నెవ్వరేని బండితులున్నచో వాదించి రాజుగారిచేఁ బారితోషికంబంది యరుగవచ్చితిమి. అని పలికిన విని యా కుటుంబి పక్కున నవ్వి, యీ రాజునొద్ద బహుమతిఁ తీసికొనివెళ్ళు విద్వాంసుఁడు గలఁడా! పాపము మీరెఱుఁగక వచ్చితిరి. ఈ రాజు కూఁతురు చరిత్ర మీరు వినలేదు కాఁబోలు. ఆ చిన్నది సకలవిద్యలలో నసమానపాండిత్యము గలిగి యున్నది. రూపంబునఁ ద్రిలోకకోకస్తనులుఁ దాని కీడురారు. విద్యారూపంబులఁ బరిశీలించియే దానికి నుభయార్థ ప్రతిపాదకంబగు కళానిలయ యని పేరుపెట్టిరి. ఇదివర కెంతలేసి పండితులు వచ్చినను వారిని సులభంబున నోడించి జయపత్రికల నందు చున్నది. తనకు సాటియగు విద్వాంసుఁడు లేడని పలుకుటయేగాక దేశదేశంబులకు వార్తాపత్రికల బంపుచున్నది. మరియు నది యెట్టి రాజకుమారుఁడు వచ్చి పెండ్లి యాడుమని యడిగినను దన కెనగాడని నిరసించుచున్నది. మీరా తలోదరితోఁ దులగావాదము జేయుదురని నమ్మజాలను. ఊరక మీ గౌరవమేల చెడఁగొట్టుకొనియెదరు? మఱియొకరాజు నాశ్రించరాదా? గౌరవింపక యిచ్చు బహుమానము గొనుటకంటె నీచముండునా? నా మాటవిని రాజనగరి గరుగకుఁడని యుపదేశించిన నవ్వుచు నా పాఱునకు వారిట్లనిరి.

ఆర్యా! ఆ కాంతవలన మాకు లేశమును భయములేదు. దీని తాతలవంటివారి దగ్గర జయపత్రికలను బుచ్చుకొంటిమి. మాకొక యాఁడుది లెక్కా? అనిన నతం డయ్యో! ఆ కన్యను సామాన్యముగాఁ దలంచుచున్నారే. ప్రతి పండితుఁడును మొదట నీలాగుననే బింకముగా బలుకుచుఁ దుదకు నా సుదతితో వాదించి యోడి జయపత్రిక నిచ్చి భిన్నముఖుండై యరుగుచుండును. నేను జెప్పవలసినమాటఁ జెప్పితిని. పిమ్మట మీ యిష్టమనుటయు రాయలు ఆ బ్రాహ్మణున కిట్లనియె.

అయ్యా! ఆ తొయ్యలి మిక్కిలి చక్కఁదనము గలదనియు నెవ్వరిం బెండ్లి యాడలేదనియుం జెప్పితిరిగదా? పెండ్లి యాడనిచో నా చక్కదనమునకు సాద్దుణ్య మేమి? దాని యభిప్రాయుము పెండ్లియే యాడననియా? తగిన వరుఁడు దొరకలేదనియా? దెలుపుఁడనిన నతం డయ్యా! అఖిలవిద్యాపారంగతురాలగు నయ్యంగన పెండ్లియాడక పోవుటకు జోగురాలా యేమి? తనకుఁ దగిన వరుఁడు దొరకలేదనియె మానివేసినది. అధముడగు వరుని వరించుటకంటె వాల్గంటికి హైన్యమున్నదా? మీరింత సాభిప్రాయముగా దానిగురించి యడుగుచుంటిరేమి? అయ్యబల విద్వాంసులైన బ్రాహ్మణులకుఁగాని దర్శనం బియ్యదు. వారై నను నన్యథా బుద్ధిశృంగారవిలోకనములఁ జూపిరేని గ్రహించి యుగ్రదండనలకుఁ బాత్రులుగా జేయును. ఆమెతో మాట్లాడునప్పుడు మిగుల నేర్పుగా మాట్లాడవలయును. మాటలచేతనే లోని యభి ప్రాయము గ్రహింపఁగలదు. అనిచెప్పిన సంతసించి రాజు ఆచేడియ జూడ మిగుల వేడుకపడిన దిమ్మర్సు రాయలతో అయ్యో! యింత తొందరపడియెదవేల? ఇప్పుడు బ్రాహ్మణుఁడు చెప్పినమాటలు వింటివిగద. కడు తెలివిగా నుండవలయు సుమీ ! అది మిగుల జాణ. మాటలచేతనే గ్రహించును. మనగుట్టు బయలైనచో మోసమురాఁగలదు. దానితో నేను మాట్లాడినప్పుడు నీ యభీష్టము తీరులాగునఁ జూచుకొనుము. ఇంతియ నీకు లాభమని కొన్ని విషయములు బోధించి మరునాఁడుదయంబున, బ్రాతకృత్యముల నిర్వర్తించుకొని రాజునగరి కరిగి ద్వారాపాలకునిచేఁ దనరాక రాజున కెఱింగించిన గోపాలుఁడును వారి నుచితసత్కారంబుల నాదరించి సుఖాసీనులైన వారితో వినయంబున నిట్లనియె.

అయ్యా, మీ దేశ మేది? ఇప్పు డెచ్చటికిఁ బోవుచు నిచ్చటికి వచ్చితిరి. స్వాగతంబే కద మీరాక నా కెంతయు సంతోషము గలుగజేసినది. నేను కృతార్థుండనైతి నని పలికిన నారాజు ప్రార్ధనావాక్యంబులకు దగిన ట్లుత్తరము చెప్పి, తిమ్మర్సు రాజా! ఇప్పుడు మేము కాశి కరుగుచున్నాము. మార్గంబున మీయశం బాలించి దర్శనముజేసి పోవుదమని వచ్చితిమి. మేము విద్వాంసులము మీ పుత్రిక పాండిత్యము గలదనియు బెక్కండ్రుఁ బండితుల నోడించెననియు విని యామెం జూచి నేత్రానందము గావించు కొని యామెతో గొంత ముచ్చటించి శ్రోత్రానందము గావించుకొనుటయే మాయభీష్టము. ఇంతకన్న వేరుకోరిక లేదని పలికినవిని, యారాజు మేలు మేలు ఇంతకన్న పండువేది. నాకూఁతురుఁ పండితు లనిన మిగుల సంతసించును. ఆలాగుననే చూడవచ్చును. మీకే విద్యలోఁ బాండిత్యము గలదో చెప్పుడు. ఇప్పుడే చీఁటివ్రాసి యాబోఁటి కనిపెదననిన వారు దమకు సకలవిద్యలలోఁ బాండిత్యము గలిగియున్నదని చెప్పిరి. గోపాలవల్లభుండును వారి స్థితియంతయు వ్రాసి యాచీఁటిని గూఁతున కనిపెను. దానిం జదువుకొని యమ్మదవతి మిగుల ముదముంది తక్షణమే ప్రవేశపెట్టు మని మరల చీఁటివ్రాసి తండ్రి కనిపినది.

రాజాజ్ఞప్రకారము సేవకులు వారిని గ్రమంబున ననేకకక్ష్యాంతరములు దాటించి కళానిలయనిలయంబునకుఁ దీసికొనిపోయిరి. ఆమె చెలికత్తె లాగదియం దొకచో రత్నకంబళి పరచిరి. వారు దానియం దుపవిష్టులైరి. ఆ గదియందు నలుమూలలను తదీయరాణీయకము విబ్రాంతస్వాంతులై చూచుచుండిరో యనునట్లు భూమియందు బ్రసిద్దులైన రాజుల చిత్రపటంబులు దర్పణంబులఁగట్టి యమర్పఁబడియున్నవి. దేవతావిగ్రహముల లెక్కగొన నెవరిశక్యము? త్రిలోకములలో రూపంబునఁ బ్రసిద్ధలైన స్త్రీల పటంబులును వేనవేలు గట్టఁబడియున్నవి. రాజును, తిమ్మర్సును, అందొకచో నొకపటంబున వ్రాయబడిన తమ రూపంబులం జూచి యించుకేనియు భేదము లేకున్నరీతి కెంతయు నద్భుతమందిరి.

మఱియు నందున్న స్త్రీల పటంబులకెల్ల వన్నెయిడుచున్న కళానిలయపటంబును జూచి తదీయవిలాసంబు విలాసంబున గ్రహించి మోహపరవశుండై నేలవ్రాల జొచ్చు నతని వెత యెఱింగి తిమ్మర్సు అట్టె నిలబెట్టి వయస్యా! ఇది యేమి! ప్రతిమఁ జూచినంతనే యింత వికారమందుచుంటివి. నిజముగా నాగజయానత జూచినచో మన గుట్టు బయలు పెట్టెదవని తోచుచున్నది. అట్లు చేసినఁ బ్రాణహానియగును సుమీ ! యెంత తమియున్నను మనంబుననే యడంచుకొని యూరక, వెఱ్ఱిచూపు చూడక యెద్దియో మిషచేఁ దదీయరూపవైభవంబంతయుఁ జూచి, నేత్రపర్వంబు గావించు కొనుము. ఇది బాగుగా జ్ఞాపకముంచుకొనుము. ఇఁక నీకుఁ జెప్పుటకు వీలుండదు. కళానిలయ వచ్చువేళ యైనదని బోధించు సమయమునఁ గళావతి చెలికత్తెయొకతె ప్రక్కనున్న గుమ్మమునకు భిత్తికాతుల్యముగాఁ గన్పడియున్న తెరదప్పించుకొని వచ్చినఁ జూచి రాయలు, గళానిలయయే యనుకొనెను గాని, తిమ్మర్సు చేసిన కనుసన్నచే యట్లూహించుకొనెను. కాని అదియు వారి తెలివిని బరీక్షించుటకై కళానిలయచేఁ బంపఁబడినది. కాని దాని యాటమి తిమ్మర్సునొద్దఁ బనికివచ్చునా? అది యాకారంబున నెక్కుడుగా నున్నను దాని హస్తపాఠంబుల కాఠిన్యమునుఁ బరీక్షించియే తిమ్మర్సు దాని గురుతుపట్టెను. అదియు నిటునటు నొక్కింతసేపు తిరిగి వారు తన్ను దాదిగాఁ దెలిసికొనిరని గ్రహించి వారి బుద్ధకౌశల్యమునకు మెచ్చుకొనుచు నందొక త్రాడులాగిన జల్తారుతోను, బట్టతోనుఁ గట్టబడిన యొక విచిత్రపు జాలరు వారి ముందుగ వ్రేలఁబడినది.

పిమ్మట నాకొమ్మయు లోనికరిగి యత్తరుణితో అమ్మా! వారు విద్యలనెట్టివారో నాకుఁ దెలియదు. లౌకికమం దసమానప్రజ్ఞల గలవారుగా నున్నారు. వారు విద్యలలో నిన్ను జయింతురేమోయని భయమగుచున్నది. ఇదివరకు వచ్చిన పండితు లెల్లఁ నన్నుఁ జూచిన నీవే యనుకొని మర్యాదగా లేవబోయి మాట్లాడుచుండిరి. వీరు నన్ను గౌరవింపక పల్కరింప మానివేసిరి. వీరితోఁ గడుతెలివిగా మాట్లాడవలయుఁ జుమీ యని బోధించిన సంతసించుచు నా కళావతి విద్వజ్జనులు మ్రోలమాట్లాడఁదగిన యలంకారము వైచుకొని యాచెలికత్తెల కైదండంగొని హంసగమనంబునం జనుదెంచి మెఱపువలెఁ దళుక్కుమని మెరయుచు నాగదిలోఁ బ్రవేశించుటయు, అది కళావతియని రాయల కెఱింగించుచు లేవఁబోవున ట్లభినయించుచుండ నయ్యండజయాన హస్తసంజ్ఞచే వారించి నమస్కరించుచు నిట్లనియె.

గళానిలయ - (సంస్కృతములో) శ్లో॥ యూ యంభో భజధ మహీసురా సతింమే.

తిమ్మర్సు – కళాణం భవతు కళాన్వితే భవత్యై.

కళా - దాతవ్యా నివసితుమత్ర సాధ్వనుజ్ఞా

తిమ్మ - స్థాతవ్యం సుఖమబలె బలేనవర్తుం.

అని యిట్లు సంస్కృతముతో శ్లోకపూర్వకముగా నిచ్చిన ప్రశ్నలకు శ్లోకపూర్వకముగానే యుత్తరం బిచ్చినంత వెరగుబడుచు మరల నాంధ్రములో-

కళా - క. వందినమిదె గొనుఁడు ధరా, బృందారకులార

తిమ్మ - సుందరి! కళ్యాణం బందుము

కళా - మీచెంత వసింపందగు గతి నాజ్ఞయిండు

తిమ్మ - వసింపుమిటన్.

అని యిట్లు తనమాటలకు సమముగా నుత్తరము జెప్పినందులకు వెరగుపడుచుఁ దదానతిచే నాచేడియ రత్నకంబళముపైఁ గూర్చుండెను.

అప్పుడు కృష్ణదేవరాయలు తద్రూపలావణ్యరసం బక్షులం గ్రోలుచున్నవాఁడోయన నవ్వనితామణిం జూచుచు నితరేంద్రియవ్యాపారముల మరచి తదాయత్తచిత్తుడై సంభ్రమంబున మేనెల్లం బులకలునిండ మోహపరవశానంద మనుభవింపుచుండెను. ఆ సమయంబున నానారీమణికినిఁ దిమ్మర్సునకును నీరీతి సంవాదము జరిగినది.

కళానిలయ — అయ్యా! తమదేశం బెద్ది?

తిమ్మర్సు - అవంతి.

క - భవదీయాభిదేయవర్ణంబు లెవ్వి ?

తి - తిమ్మయ్యశాస్త్రి యని పేరువ్రాసి చూపి. యీతని పేరు కృష్ణయ్య శాస్త్రి.

క - ఆయనయు మీరును సతీర్థులా? సహాధ్యాయులా?

తి - సహాధ్యాయులమే.

క - మీరేమి విద్యలం జదివిరి?

తి - మాకు సర్వశాస్త్రములయందుఁ బాండిత్యము గలిగియున్నది.

క - మీ విద్యాభ్యాసం బెచ్చట ?

తి - కాశీలో.

క - మీ మతమో?

తి - ఆచరణము ద్వైతము. అద్వైతము నియమము. విశిష్టాద్వైతసహవాసముఁ గలిగియున్నది గాన మాకు మూఁడు మతములు సమ్మతములే.

క - విద్య లెన్నిగా మీరు పాఠము చేసితిరి?

తి - పదునాలుగుగాను, పదునెనిమిదిగాను, అరువదినాలుగు గాను సంఖ్యాభేదముగాఁ జెప్పుచుందురు గాని క్రియాసామరస్యముచే నెట్లు చెప్పినను నొక్కటియే.

క - అన్నిటియందు మీకుఁ బరిశ్రమగలదా?

తి - కలదని చెప్పుట యిది రెండవసారి.

క - మీకు మంత్రశాస్త్రమున స్వతంత్రము గలిగియున్నదా ?

తి - నీ ప్రశ్నలు విపరీతముగానే నున్నవే.

క - ఎందువలన?

తి - నీ కేయే విద్యలలోఁ బాండిత్యముగలిగియున్నదో చెప్పుము.

క - నేనును గొంచెము కొంచముగా నన్ని విద్యలం దడవి చూచితిని.

తి - అదియే నాకు మీ మాటలంబట్టి సందియముగా నున్నది.

క – సందియమేల? దేనిలోనైనను నడుగుఁడు.

తి - సర్వవిద్యలన నేమి ?

క - అన్నియునని.

తి - మంత్రశాస్త్రమెందులోనిది ?

క - అధర్వణవేదములో నంతర్భూతము.

తి - నీవు ప్రకరణము చూచితివా ?

క - చూచితిని.

తి - పునరుక్తదోషమన నెద్ది ?

క - చెప్పినది మరల హేతువులేకయే చెప్పుట.

తి - ఇప్పుడు నీమాటలకు పునరుక్తదోషము పట్టినదా లేదా? అబలాచెప్పుము.

క - ఎట్లు?

తి - సర్వవిద్యలు వచ్చునని రెండుసారులు చెప్పితిని. పిమ్మట నన్ను నీకు మంత్రశాస్త్రమునందు బరిచయముగలిగినదా యని యడిగితివి. అన్ని విద్యలయందు నాకుఁ బరిశ్రమము గలిగిన దనగా నట్లేల యడిగెదవు? మంత్రశాస్త్రము మాత్రము దానిలోనిదికాదా? సర్వవిద్యలు వచ్చినవారికి మంత్రశాస్త్రమందుఁ బరిచయము గలిగి యుండదా! అనవసరమయిన ప్రశ్నముచేయుట శబ్దదోషము కాదాయని చెప్పెను.

క - ఔరా! ఇదియా నాకుఁ బట్టినతప్పు.

తి - ఇది చాలదా! నంతకన్న నధికమేది ?

క - మాటలకేమి ? బలాబలములు విద్యలలో చూపించవలయును.

తి - మాటలే సందర్భముగా రానివారికి విద్యలు బాగుగఁ దెలియునని నమ్మక ముండునా ?

క - వ్యర్ధపు మాటలతోఁ గాలక్షేపము చేయనేల ? నన్ను మీరడిగెదరా ! మిమ్ము నే నడుగుదునా ?

తి - ఎట్లయినను సరే.

క - మొదట నేవిద్యలోఁ బ్రశంస చేయుదము ?

తి - మొదట నే విద్యపుట్టినదో దానిలోనే.

క - మొదటపుట్టినది వేదముగాదా! దానిలోఁ బ్రశంసింతము నేను ప్రశ్న వేయనా ?

తి - మాటిమాటికి నడుగవలయునా?

క - (అరుణము చదివి) దీనికి సూర్యపరముగాక పరబ్రహ్మపరముగా నర్థము జెప్పుడు.

తి - శివా శివా! యని చెవులు మూసికొనియె.

క - ఏమి చెవులు మూసికొనుచున్నారు? నా చదువు మీకుఁ కర్ణకఠోరముగా నున్నదా?

అనుటయు తిమ్మర్సు కళావిలయ కిట్లనియె. కాంతా! దాని యర్థము మాట పైన చూచుకొందము కాని ముందు నీకు వేదము చదువ నధికార మే గ్రంథములోఁ జెప్పబడినదో చెప్పుము. స్త్రీ మూలమునుండి వేదోచ్చారణము వినినవాని చెవులలో యమదూతలు సూదుల జొనుపుదురని శాస్త్రములు చెప్పుచుండలేదా? అనిన విని నప్పడఁతి యుల్లము ఝల్లుమన నేమియు బలుకలేక తెల్లబోయి యొక్కింత తలవాల్చి యంతరంగమున నోహో! ఇతం డెవ్వఁడో గూఢవేషుఁడువలె నున్నాఁడు. ఇంతకు మున్ను వచ్చిన పండితులలో నొక్కండైన నన్నీ ప్రశ్న చేయలేదు. వారు ధనకాంక్షచే నట్లు బలుకలేకపోయిరి. ఇతనికి ధనమం దాశ లేనట్లు తోఁచుచున్నది. కపటంబున నన్ను వంచించుటకై వచ్చినవానివలె నున్నాడు. పరీక్షించెదగాక యని గోడ ప్రక్కల వ్రేలంగట్టియున్న చిత్రపటంబులన్నియు బరిశీలించి చూచి వీరా! తెలిసినది . ఇతండు తిమ్మర్సు. నన్నుఁ దదేకదృష్టిగాఁ జూచుచున్నవాఁడు కృష్ణదేవరాయలు. రాయలకు నాయందనురాగము గలిగియున్నట్లు ఇంతకుమున్నే వినియుంటిమి. అతండు నన్నుఁ జూచుటకై యిట్టి వేషము వైచుకొని తిమ్మర్సుతోఁగూడ వచ్చెను. ఈతండు తిమ్మర్సు కానిచో నన్నిట్లు వంచనచేసి మాట్లాడగలఁడా? అయ్యయ్యో! ఈరాజు నా మానభంగము జేసెనే. ఈ దాసీపుత్రుఁడు నన్నుఁజూడ నర్హుడా? చీ! ఈ నీచుని జంపించినను నాకు దోషములేదు. వీనిని పట్టించెదనని, తిమ్మర్సుతో మాట్లాడుచునే వీరు కేవలము బ్రాహ్మణులుకారు. ఒకఁడు కృష్ణదేవరాయలును, రెండవవాఁడు అతని మంత్రి తిమ్మర్సును నన్నుఁజూచు తాత్పర్యముతో వారిట్టి వేషములు వైచుకొనివచ్చిరి. నా మానభంగము చేసిరి. వీరి నురిదీయ నాజ్ఞయిండని యొక చీఁటివ్రాసి తండ్రికనిపినఁ దానిం జదువుకొని యతం డయ్యో పాప మూరక యింటికి వచ్చిన బ్రాహ్మణులం జంపుమని వ్రాయుచుంటివేమి? రాయలును మంత్రియు నిట్టి వేషముతో నిచ్చటి కేల వత్తురు ? నీవు తలంచినది యసత్యము . వారు వీరగుటకుఁ దగిన నిదర్శనము జూపించిన వెనుకగాని యట్టి యాజ్ఞ యియ్యనని, మరల జీఁటివ్రాసి కూఁతున కంపెను.

దానిం జదువుకొని కళానిలయ అయ్యో! మా తండ్రి యేమియుం దెలియని వాఁడు యెక్కుడు నిదర్శన మిచ్చినగాని యట్టిపని చేయఁడు. ఆలస్యమైనచో గ్రహించి వీరు లేచిపోదురు. కానిమ్ము నే నొక మార్గంబున వీరి నానవాలు పట్టజేసెదనని యూహించి యత్తెరగంతయు జీటిలో వ్రాసి తండ్రి కనిపెను. ఆ రాజు చీఁటిలోనున్న ప్రకారము జరుపఁ బరిచారకుల నియమించెను.

ఆ చిన్నదాని తొట్రుపాటంతయుం జూచి తిమ్మర్సు తమ్మా కొమ్మ గ్రహించి యెద్దియో మోసముచేయఁ బ్రయత్నించుచున్నట్లు తెలిసికొని యచ్చేడియతో, మానినీ! మాకనుష్ఠానమునకు వేళ యతిక్రమించుచున్నది. పోయివత్తుము, సెలవిమ్ము. మరల రేపు ప్రొద్దుట సభచేయుదముగాక యని యడిగిన నా తొయ్యలి యయ్యా! తొందర పడకుఁడు. కొంచెమైన ప్రసంగము జరుగలేదు. మీ మాటలకు సమాధానము చెప్పఁ నప్పువడియుంటిని. తగిన యుత్తరంబిచ్చెదఁ గూర్చుండుఁడని పలికిన నతఁ డంగనా! మరల వత్తుము బాగుగా నాలోచించి యుండుము. పిమ్మటఁ జెప్పెదవుగాని యని పలుకుచు దటాలున లేచి యొడలెఱుంగక మోహపరవశుండైన రాయలను హస్తంబు బట్టి లేవనెత్తి యతనితోగూడ నతిరయంబున నడుచుచు, ముందు సింహద్వారమునఁ జేతు లడ్డముగాఁబెట్టి నిలువఁబడియున్న యొక చాకలివానిఁ జూచి తిమ్మర్సు రాజుతో నిట్లనియె.

రాజా! ద్వారమున కడ్డముగా నిలిచియున్న చాకలివానిం జూచితివా ! ఆ చిన్నది మన స్థితిని గ్రహించి పరీక్షించుటకై యటు నిలిఁపినది . మన మిప్పుడు వానినిఁ జేతులు తీయుమని పలికినంతలో మనలను రాజభటు లాటంకము చేయుదురు. వాని చేతుల క్రిందనుండి దూరియుఁ బోరాదు. దీనికి నేనొక యుపాయముపన్ని వాని చేతులు దీయించెదఁ నంతలో నీవు దాటిపోవలయును. లేనిచో మోసము వచ్చును జుమీ! యని పలికిన సింహద్వారము దగ్గరఁబోయి తిమ్మర్సు రెండుచేతులు పాలనం బునఁ జేర్చి, యోహో! చాకలి మడేలుగారా! దండాలు, దండాలు దండాలండో యని, పెద్ద యెలుంగునం బలికెను. వాఁడెంత దిట్టముగా బోధింపబడిన వాఁడై నను బ్రాహ్మణుఁడు నమస్కరించినంత నూరకుండలేక మరల రెండుచేతులు జోడించి అయ్యయ్యో మీరు గొప్పవారు నాకుదండము పెట్టవచ్చునా? మీకేదండాలని పలుకుచుఁ జేతులెత్తినఁ గృష్ణదేవరాయలు దాటిపోయెను. రాజశాసనము జ్ఞాపకమువచ్చి వాఁడు అయ్యో! మోస మయ్యెనే! నన్నుఁ జేతులు తీయవలదని చెప్పినమాట మరచి దండము పెట్టుటకైఁ జేతులు తీసితిని. ఆ సమయంబున నాతఁడు దాటిపోయెను. రెండవానిని మాత్రము దాట నీయనని రెండుజేతు లడ్డముగాఁ బెట్టెను.

అప్పుడు తిమ్మర్సు బ్రాహ్మణుఁడే కావున వానిని జేతులు తీయమనకయే బాహువులు సందునుండి దూరిపోయెను. కోట దాటినతోడనే రాయలు మంత్రియు నంతకుబూర్వమే సిద్ధపరచియుంచిన యంచెగుఱ్ఱములెక్కి ప్రచ్ఛన్నముగా నిల్లుజేరిరి. బుద్ధిమంతుల కసాధ్యమైన పనులుండునా? వారఱిగిన వెనుక జరిగిన కథ యంతయు నా చాకలి, రాజసమక్షమందా చిన్నదాని కెఱింగించిన విని కళానిలయ యతిశోకముతో వారెంత మోసము చేసితిరో చూచితివా? నిజముగా బ్రాహ్మణులు గారని నేనెంత చెప్పినను వినకుంటివి. తిమ్మర్సు మాయజేసి చాకలివానిచే జేతులు తీయించి రాజును దాటించెను. తాను బ్రాహ్మణుఁడు. అభిమానము వహింపక దూరిపోయెను. దొరికినవారిని వృథాగా వదలితివిగదా! దాసీపుత్రుఁడు నా మానభంగము జేసెను. వానిం జంపించినం గాని నేను భుజింపను . వారిని వెదకిపట్టి తెప్పించి నామ్రోల జంపించినం జంపింపుఁడు లేనిచోఁ బ్రాణంబులు విడుతునని, యెక్కుడుపట్టుగాఁ బలికిన కూఁతు నోదార్చి రాజు మిగులఁ గోపముతోఁ నా క్షణము యాకారములు వ్రాసియిచ్చి, వారు గనబడినచోట రెక్కలు విరుగఁగట్టి నాయొద్దకు దీసికొనిరండని యాజ్ఞాపించి నలుదిక్కులకుఁబంపెను. రాజభటులలోఁ గొందరు వారి నెందును గనుగొనలేక విసిగి మరలివచ్చుచుండఁ ద్రోవలోఁ కాశికరుగుచున్న యిద్దరు బ్రాహ్మణులు కాలవశమున వారి కన్నులం బడిరి.

వీరినే వారనుకొని రాజసేవకులా పాఱులకు సంకెళులువైచి రాజసముఖమునకుఁ దీసికొనివచ్చి రాజద్రోహులం బట్టితెచ్చితిమని విన్నవించిన రాజు వారినందరఁ గూతునొద్ద కనిపెను. బుద్ధిశాలినియగు నమ్మగువ వారింజూచి నవ్వుచు మందులారా! వీరు అంతఃపురద్రోహులుకారు. వీరు నిజముగా బ్రాహ్మణులే, నిష్కారణముగా వీరినేల బట్టితిరి? తిమ్మర్సుతోఁ గూడికొనియున్న రాయలు మీకుదొరుకునా! పోపొండని వారి నదల్చి నిరపరాధులమని మొరపెట్టుచున్న యాపాఱుల కపారసువర్ణం బిచ్చి సంతోషము గలుగఁజేసెను.

పిమ్మట మఱికొందరు రాజభటులువచ్చి అమ్మా! వారు మీరనుకొనునట్లు రాయలును మంత్రియేసుఁడీ! అంచెగుఱ్ఱములెక్కి పరుగిడుచుండ మేమడ్డము వెళ్ళితిమి గాని వారు విచ్చుకత్తులతో మమ్ము బరాభవించిరి. వారికి వెరచి పారిపోయివచ్చితిమి. వారు సాధారణముగా మాకు వశమగుదురా! యెద్దియో, యెక్కుడు ప్రయత్నమున వారిం బరిమార్చ యత్నించుమని పలికి తమ నివాసంబుల కరిగిరి. పిమ్మట నక్కాంత యత్యంతసంతాపముతో అన్నన్నా! నేనొక నీచజాతుల కన్నులంబడితిని కదా? ఒక యధముని కన్నులంబడి వేరొకని నెట్లు పెండ్లి యాడుదును? అయ్యయ్యో! ఆ దురాత్మున కేమి లాభము వచ్చినది? అంతమాత్రముననే నేను వానిం బెండ్లి యాడుదు ననుకొనెనా? తిమ్మర్సుయొక్క బుద్ధినైపుణ్య మంతయు నాయెడ వినియోగ పరచెనే. కానిమ్ము. ఆ దురాత్ము నెట్లయినను సాధించి పిమ్మటఁ బ్రాణంబులు విడుతు నని నిశ్చయించి తండ్రికిఁ గొన్ని రహస్యములు బోధించి యతనిచేఁ గృష్ణదేవరాయల కిట్లు శుభలేఖ వ్రాయించినది.

"రాజాధిరాజ రాజపరమేశ్వరాది బిరుదాంకిత కృష్ణదేవరాయ మహారాజుగారి సన్నిధికి గోపాలవల్లభుఁడు వ్రాయు శుభలేఖార్థములు ఆధునికనృపాలురలో నధికవిఖ్యాతిగల మీకు సకలవిద్యాపరిపూర్ణయగు కళానిలయ యను సార్ధకనామముగల మదీయతనూజ నిచ్చి వివాహము జేయ నిశ్చయించినారము గాన నిందువ్రాసిన శుభముహూర్తమునకు సకలపరివారసహితముగాఁ తరలి రాఁగోరుచున్నాను" అని వ్రాసిన యాచీటి బ్రాహ్మణుల చేతి కిచ్చి యంపిన వా రతిరయంబునఁ గృష్ణదేవరాయల నగరికిఁ జని యా వాచిక మారాజున కెఱింగించిరి. సంతసముతో నతండప్పుడ వచ్చి నిలిచియున్న తిమ్మర్సున కా చీఁటి చూపి యిట్లనియె.

మిత్రమా! నీ యుద్యమ మూరకపోవునా! ఇదిగో చూడుము. నేను గోరిన చిన్నది నన్నే కోరినది. నాకుఁ బెండ్లి కాఁగలదు. వేగమ వివాహసన్నాహము గావింపుమని పలికిన విని నవ్వుచు తిమ్మర్సు రాయల కిట్లనియె. ఔనౌను నీ పెండ్లి జేయుటకే వా రీశుభలేఖ నీ కంపిరి. పాపము నీ వాకపట మెరుఁగక అందలి యంశము లన్నియు నిక్కువమని నమ్మి సంతసించుచుంటివి. వారి యుద్యోగము వినుము. మనము అంతఃపురభంగము జేసితిమని తెలిసికొని కోపముతో నా రాచచిన్నది నిన్ను వివాహమిషచే నచ్చటికి బిలిపించి చంపనిశ్చయించినది. దీనికే సమాధానము చెప్పలేనిచో నా బుద్ధిసూక్ష్మత యేటిది? దీనికి దిరుగ సమాధానము పంపవలసియున్నదని యప్పుడే యిట్లు వ్రాసెను.

"గోపాలభూపాలుఁ డంపిన శుభలేఖార్ధములు చదువుకొని యెంతయు సంతసించి కృష్ణదేవరాయలు వ్రాయునది యేమనగా: మీ కన్యకను స్వీకరించుటకు సమ్మతించడమైనది. మీ శుభలేఖ ప్రకారము తరలివచ్చుటకు మాలో నాచారములేదు. మాకు మారుగా గులాచారప్రకారము కత్తి పంపుచుంటిమి. గనుక వైవాహికక్రియలన్నియు దానికే జరిగించవలయును" అని వ్రాసి యొక కత్తితో నా లేఖను మున్నువచ్చిన బ్రాహ్మణుల చేతికిచ్చి యంపివేసిరి.

అట్టివానిం జదువుకొని యా చిన్నది భళిరే! ఇప్పటికి దాటిపోయిరి. కానిమ్ము. ముందైనను దొరకరా! యెప్పటికైనం బగ సాధించెదం గాక యని మరికొన్ని దినములు గడచిన పిమ్మట తండ్రి పేరుపెట్టి మరల నొక చీటి వ్రాసినది .

"మీ యాజ్ఞానుసారముగాఁ గత్తికి బెండ్లి జేసితిమి. ఇది వసంతకాలముగాన, మీరువచ్చి పైకార్యములు జరిగించుకొనవలయును" అట్టి చీటిం జదువుకొని రాయలు కొంత సంతసించి యంతలో తిమ్మర్సు మాట జ్ఞాపకము తెచ్చుకొని యది కపటమని తెలిసికొని తిమ్మర్సును బిలిపించి యతనిచేఁ బ్రత్యుత్తర మిట్లు వ్రాయించెను. ప్రస్తుతము మాకు రాజ్యకార్యములు తొందరగ యున్నవి. వచ్చుటకు వీలులేదు. తీరికజేసికొని ముందు జాబు పంపెదమని వ్రాసినదానిం జూచి యా చిన్నది కొంచెము చింతించి కానిమ్ము. యెప్పటికైన రాకపోవునా? వాఁడు దొరకకపోవునా? యని యోపికపట్టి మరి కొన్నిదినములు గడపినది. ఇట్లు రెండు సంవత్సరము లుత్తరప్రత్యుత్తరములు తోడనే కాలము జరిగినది. కావి యామె కోపము దగ్గినదికాదు.

మఱియొకప్పు డప్పఁడతి మరల తండ్రిపేరుతో మే మెన్ని యుత్తరములు వ్రాసినను మీరు వచ్చుమాట వ్రాయరు. వివాహమై రెండుసంవత్సరములైనది. మమ్మునుఁ మిమ్మునుగూడ జనులు నిందించుచున్నారు. మీకు వచ్చుటకుఁ దీరికలేనిచో నచ్చటికి మా చిన్నదానినే యంపుచున్నాను. శుభముహూర్తమునఁ గార్యమును జరిగించుకొనుఁడు. ఈడువచ్చిన పడఁతి యత్తవారింటియొద్ద నుండఁదగినదికదా ? దీనికి మీ అభిప్రాయము వ్రాయుఁడు. అని యుత్తరము వ్రాసి యంపిన దానిం జూచి తిమ్మర్సు అమ్మానిని దీర్ఘక్రోధమునకు నాశ్చర్యపడుతు, మీరు వ్రాసిన విషయములకు సమ్మతించింతిమి. ఇచ్చటనే అన్ని కార్యములు జరిపించుకొనియెదము. శీఘ్రముగా నయ్యబల నిందుఁబంపుడని ప్రత్యుత్తరము వ్రాసి యంపెను.

దానిం జదువుకొని యవ్వనిత, తండ్రికావృత్తాంత మెఱింగించి యతఁ డెన్నివిధములచే, బోధించినను వినక కొంతసైన్యమును, దాసదాసీజనంబును వెంటబెట్టుకొని నిక్కముగా నత్తవారింటి కరిగు మెఱుఁగుబోఁడియుం బోలె బయలుదేరి కతిపయప్రయాణంబుల కృష్ణదేవరాయల నగరంబున కరిగెను. ఇంతలో దిమ్మర్సు బాల్యస్నేహితుండు, విచిత్రవస్తునిర్మాణదక్షుండునగు చిత్రకారునిం బిలిపించి యతనితో రాయలవంటి విగ్రహ మొకటి రచింపుమని యారీతి యంతయు బోధించిన, నాచిత్రకారుం డధికప్రయత్నముతో నట్టి విగ్రహ మొకటిచేసి యొకగదిలో మంచముమీఁదఁ బరుండబెట్టెను దానిఁజూచినవారు యథార్థముగాఁ కృష్ణదేవరాయలే నిద్దురపోవుచున్నవాఁడని యనుకొనమానరు. మరియు నాగదిలో నొకమూల నేల సొరంగముండున ట్లేర్పరిచెను. అందున్న వారెవ్వరికినిఁ గనంబడరు. అందులోనివారికి పైవారు గనంబడుచుందురు. ఆ కృత్యము తిమ్మర్సును రాయలును ముచ్చియునుగాక యితరులెవ్వరును నెఱుంగరు. ఆ గది యద్భుతమైన యలంకారములచే నింపంబడినది.

అట్లు తమ గ్రామమునకు వచ్చిన కళానిలయకుఁ దగు విడెదలు నియమించి సకలోపచారములు జరుగునట్లేర్పరిచెను. కళానిలయ వచ్చిన తరువాత ముహూర్తము నెపంబున రెండుమాసములు జాగుజేసిరి. మరియు నొకనాడు గర్భదానమునకు ముహూర్తము నిశ్చయించినట్లు ఆ చిన్నదానికిఁ దెలియజేయుచు మాకు వధూవరుల పీటపై గూర్చుండి యాశీర్వచనములు పుచ్చుకొనుట యాచారము లేదనియు నూరక గదిలోనికిఁ బోవుటయే సంప్రదాయమనియు నాఁడు సాయంకాలమునకే నియమింపఁబడిన గదిలోనికి రావలయుననియుం దెలియఁ జేసిరి.

అట్టి వార్తవిని యక్కలికియు దానేర్పరచుకొనిన కపటకృత్యమున కావిధం బనుకూలముగానే యున్నదని మిగుల సంతసించెను. అంతట సాయంకాలమున రాజ భటులు పల్లకీ గొనిపోయి కళానిలయ నిలయంబున కరిగి ముహూర్తసమయంబునకు నయ్యండజయానను గళ్యాణగేహప్రాంతమునకు దీసికొనివచ్చిరి.

అందు నమ్మకమైన దాదులు కొంచెముగా నుండిరి. వా రాకళానిలయకు మంగళకృత్యములు నిర్వర్తించి దేవీ! నీ పతి యింతకుమున్ను గదిలోని కరిగి నీరాకకు వేచియున్నాడు నీవును త్వరగా నరిగి యతని యభీష్టము నెరవేర్చమని పలికిఁ యుచితసల్లాపముతో నాపల్లవపాణిని లోనికిఁ ద్రోసిరి.

అగ్గజయాన సిగ్గునంబలె కొంతదనుక శృంగారచేష్టల నభినయించుచు నెట్టకేలకు బలాత్కారముగా లోపలికుఁ బోయి తలుపుమూలను నిలువంబడెను. ఆ రాజును తిమ్మర్సును అంతకుఁ బూర్వమే యాగదిలోనున్న నేల సారంగములోఁ బ్రవేశించి యాచిన్నది చేయు కృత్యములం జూచుచుండిరి. దివ్యాలంకారమండితంబగు నాగదిలో గాజు దీపములచే బట్టపగలుగా నుండెను.

ఆ కాంతయుఁ కొంతదనుకఁ దలుపు దెస నిలువంబడి యెంతకుఁ దన్ను గాంతుఁడు బిలువనికి సంకోచమందుచు నతనికి నిద్దురపట్టినదిగా నూహించి సంతోషించుచు నామంచము దాపునకరిగి యందున్న విగ్రహము మొగముపైఁ జూట్కులు నెరయజేసి కన్నులుమూసి యుండుట తిలకించి గాఢముగా నిద్రించుచున్న వాఁడనియే యూహించి యిప్పటికి దనకోరిక భగవంతుడుఁ దీర్చిననాఁడు గదా! యని సంతసించుచు నలుదెసలు బరికించి తన రవికలో మడతలుబెట్టి యిమిడ్చిన కత్తియొకటి దీసి చేతితో సాపుచేసి పిమ్మట నాకత్తి ఝళిపించుచు హుమ్మని యా విగ్రహముపై జందెముపెట్టుగా నొక వ్రేటువేసినది.

అప్పుడు విగ్రహము కడుపుఁలో బోసియుంచిన వసంతము చిమ్మనగ్రోవిని జిమ్మునట్లు వచ్చి యచ్చెలువ కనులంబడిన నక్క త్తిం బారవైచి చేతులతోఁ గన్నులు నులుముకొనుచుండెను. ఇంతలో తిమ్మర్సును రాయలను గోతిలోనుండి పైకివచ్చిరి. ముందు తిమ్మర్సు నేలఁబడియున్న కత్తి నందుకొనెను. రాయలు కళానిలయ చేతులు బట్టుకొని మిత్రుఁడా! ఆ కటారి నిటు తెమ్ము. యీ ద్రోహురాలిం బరిమార్చెదనని యుగ్రముగా బలికి యతని చేతనున్న కత్తినందుకొని యోసి ఘాతుకురాలా! చూడు మిదిగో నన్నుఁ బరిమార్పవలయునవి తెచ్చిన కత్తి నీ ప్రాణంబులే గ్రోలుచున్నది. నీ యిష్ట దైవంబును బ్రార్థించుకొమ్మని పలికిన కత్తిపై కెత్తిన తోడనే యాచేడియ యొడలు గడగడవడఁక దేవా! నే నిప్పుడు నీ యాధీననైతిని! యెందుఁ బోగలను ? నాచేయు విన్నపం బాలించి పిమ్మట వధింపుము. ఇపుడు నీయెడ నేను జేసిన క్రౌర్యముంబట్టి యుడుగక వధించిన బాపంబులేదు. కాని స్త్రీపురుషతారతమ్యంబునంజేసి కొంత పరిశీలింపనగు. ఒక్కొక్క కారణంబునం బుట్టిన కోపంబు ఒక్కొక్క పనితోడన తీరును. ఆ యెత్తిన కత్తి వాల్చనం గాని నాకు వాక్కు రాకున్నది. కంఠగతప్రాణనైన నా మొరవినుట నీకేపాటి లోపంబని ప్రాణభయయార్తయై యేడ్చుచు నున్న యాచిన్నదాని యేడుపు విని సహజకృపాళుండగు నారాజు డెందంబున దొడమిన కనికరంబు పైకి దోపనీయక చాలా చాలు. నీ నీతివాక్యముల కేమిలే ? లోకములో స్త్రీలే దుర్మార్గమతులు వారిలో నీవంటివారు మరియును దురితాత్ములు. అట్టి వారియెడఁ గనికరము చేయుట లోకంబున కపకారము సేతుగా భావింతురు. ఒకవేళ నిప్పుడు చెప్పు నీతివాక్యములు విని నిన్ను విడిచినచో నీబుద్ధి చక్కబడునా ? పాములకుఁ బాలుపోయుట విషవృద్ధికేగదా ! నిన్ను విడువను అయినను నీవు చెప్పునది యెద్దియో చెప్పుము. అంకదనుక వ్రేటువేయను కత్తివాల్చక యిట్లే యుంచెదనని పలికిన నక్కలికి యులుకుచు దయారస మతనిమది మొలకలెత్తు పలుకుల నిట్లనియె.

ఆర్యపుత్రా! శరణాగతరక్షకత్వమే ప్రధానముగా నెంచు నీ యట్టి పుణ్యాత్ములు పెరవారి గుణాగుణతారతమ్యము గణింతురా? స్త్రీలు వ్యధలుగారని మీరెఱుంగనిదా? ఇప్పుడు నే నేమియన్నను అసత్యముగానే తోచును కోపము సేయక స్వపక్షపరపక్షములు విడిచి యొండు వినుఁడు. ఏ దోషము నెఱుంగక పండితగోష్టితో నంతిపురములోనున్న నన్నుఁ గపటముగావచ్చి చూచి నావ్రతభంగముచేసిన మొదటి తప్పు నాయదియో మీయదియో మాధ్యస్తులై విదారింపుడు. ఎంతయాఁడువారైనను శూరతగల రాచవంగడంబునం బుట్టినవారికి బిమ్మటఁ దత్ప్రతీకారము సేయదలంచుట యెక్కుడు తప్పుగాదని బుద్ధిమంతులకుఁ దోచకమానదు అయినను నధికవిద్యాగుణరూపసంపన్నుఁడగు భూపాలుఁడు వచ్చి వరింప వలదని త్రోయుటయుఁ దప్పనిన నేను యెప్పుకొనియెదను. ఇదియె నాకోపంబునకు బలియైనది. మీ యెడ మున్నెంత క్రౌర్యముగలిగి యుండెనో యిప్పుడంత ప్రీతి జనించుచున్నది. నా విద్యారూపంబులు వృథా చేయకుఁడు. మీయెడ నెప్పుడును నెట్టి ద్రోహమును దలపెట్టను. యదార్థముగా మిమ్ముఁ బెండ్లియాడి మీకు ద్రోహముచేసి కాపురమునకు నీళ్ళుబోసికొన నేనంతచేలనా? యొకవేళ నింతకు మున్నెట్లు చేసితినని యనెదరేమో! మిమ్మాఁ బరిమార్చవలెనని యట్లంటిని గాని మనస్ఫూర్తి వరింపలేదు. నా మాట నమ్ముఁడు. దైవసాక్షిగా మిమ్మే పతిగాఁ జేసికొని యనుకూలవర్తనముల మెలఁగుచు హృదయానంద మాపాదించెదను. మున్నునాయెడఁ బొడమిన మోహం బిప్పుడు తలంచుకొనుడు. యెదిరి మనంబెట్లున్నదో గ్రహించు సామర్ధ్యముగల తిమ్మర్సు నామాటలం గల సత్యాసత్యంబులు దేటపడవా! బాగుగా నిదానింపు డని యత్యాతురముగాఁ బ్రార్ధించుచున్న యవ్వధూటి మాటలు నిక్కములేయని నమ్మి తిమ్మర్సు రాజునకు బోధించి యామె జంపుట మానిపించి యామెకు మరియుం గొన్ని బుద్ధులుగరపి భార్యాభర్త లగుటకు వారిరువుర నొడంబరపించెను.

పిమ్మటఁ దిమ్మర్సును కళానిలయ తండ్రియగు గోపాలవల్లభునకుఁ వార్త నంపి యొక శుభముహూర్తమున నధికవైభవ మొప్పఁ గళానిలయకును గృష్ణదేవరాయలకును వివాహమహోత్సవము జరిగించి యతని యభీష్టము తీర్చెను. అధికబుద్ధిమంతుఁడగు తిమ్మర్సును మంత్రిగాఁగల రాయలు కోరినకోరిక దీర్చికొనుట యేమి యాశ్చర్యము.

తర్వాతఁ జిత్రకారుండు తా నధికప్రయత్నముతో నందముగాఁ జేసిన విగ్రహం బట్లు విచ్చిన్నంబగుటకు జింతించి రాయలునొద్ద కరిగి, దేవా! నే నీప్రతిమ నప్రతిమసామర్ధ్యంబునం జేసితి దాని వృథా పారవైచిన నా మనంబునకుం గష్టముగా నుండును, దాని యుదరము మరల బాగుజేసితి నది మీ యాకారమేగాన సప్తసంతానములవలె భూమియందుఁ జిరకాలముండున ట్లేర్పాటు చేయుఁడని వేడుకొనిన నతని మాటలు విశ్వసించి రాయలును తిమ్మర్పును మిగుల సంతోషముతో భూరిశిలానిర్మితంబగు నాలయంబునం బర్యంతమునం బండుకొనియున్నట్లు ఆ విగ్రహమును స్థాపించి దానికి నిత్యోత్సవములు జరుగుటకుఁ బెక్కు అగ్రహారములిచ్చి పరిచారకుల నియమించి నిత్యకళ్యాణములు వెలయఁ జేయించెను.

నాటంగోలె నేఁటి తుదదాక దానికా యుత్సవములు జరుగుచున్నవి. అదియట్లు జరిగి చిరకాలమగుటచే నిప్పుడు దాని దేవతావిగ్రహమని భావింపుచుండిరి. గోపాలా! నీవు చూచిన విగ్రహవృత్తాంత మిది. ఈ రహస్య మెవ్వరును నెఱుఁగరు మద్గురుప్రసాదలబ్దంబగు రత్నప్రభావంబునం జేసి నాకుఁ దేటయైనది. చిత్రకారకుని రచనాచమత్కృతిచే నది యిప్పటికిని చెక్కుచెదరక కొత్తదానివలె నున్నది. దానంజేసియే దాని కన్నులు మూయబడియున్నవి. కథయైనది. లేలెమ్ము. బ్రొదెక్కినది. మరల నడువవలెనని చెప్పిన విని యా గొల్లవాఁ డుల్లంబున నెంతేని సంతసించుచు నతనికి నమస్కరించెను. తరువాత వానితోఁగూడ నాస్వాములవారు క్రమంబునఁ బ్రణవాక్షరజపమ్ము జేయుచు దొమ్మిదవ మజిలీ జేరిరి.