కాశీమజిలీకథలు/మొదటి భాగము/కథాప్రారంభము

వికీసోర్స్ నుండి

కథాప్రారంభము

మణిసిద్ధుని కథ

క. శ్రీకర శశిశేఖర కరుణాకర వారాణాసీపురాకర గౌరీ
   శా కరధృతమృగ గంగాశీకరవిలసజ్జటావిశేష సువేషా!

వ. దేవా! యవధరింపుము. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన కాశీయాత్రాచరిత్రంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన తొల్లి కొల్లాపురంబున యజ్ఞశర్మయను విప్రుండు గలడు. అతండు వేదవేదాంగంబుల సాంతముగాఁ బరిశీలించి తదుక్తధర్మంబుల ననుష్ఠింపుచు సాధుమార్గంబునఁ బెక్కుధనంబు సంపాదించి సంపూర్ణదక్షిణలతో విధ్యుక్తయాగంబులఁ బెక్కు గావించి శ్రోత్రియవిద్వాంసులలో నుత్తముఁడని వాడుక వడసి కాపురము సేయుచుండ జిరకాలమునకు వీతిహోత్రుని యారాధనావిశేషంబున నతని కొకపుత్రుం డుదయించెను.

యజ్ఞశర్మ మిగుల సంతసించుచు దానధర్మములచేఁ బేదలఁ దృప్తిపరచి జాతకర్మానంతర మాశిశువునకు గుణనిధి యని పేరుపెట్టెను. అగ్నిప్రసాదసంజనితుండగు నబ్బాలుండు శుక్లపక్షక్షపాకరుండువోలె ననుదిన ప్రవర్ధమానుండగుచు నధికతేజస్సమున్నతంబగు నాకారంబు నాకారంబునకెనయగు ప్రజ్ఞయుఁ బ్రజ్ఞానదృశంబులగు గుణంబులుం గలిగి తనపేరు సార్ధకము గావించి తలిదండ్రుల కానందము గలుగఁజేయుచుండెను.

అగ్గుణనిధి యుక్తకాలంబున నుపనీతుండై యధావిధి బ్రహ్మచర్యవ్రతం బాచరించుచు విద్యాభ్యాసంబు గావించుచుండఁ బూర్వజన్మపరిచితంబగు విద్యలు చంద్రునిఁ జంద్రికలువోలెఁ గ్రమంబున నతని నాశ్రయించినవి. అతని పాండిత్యము అనన్యజనదుర్లభంబగు జ్ఞానప్రబోధమునకు హేతువై యొప్పుచుండెను. అతండు సంతతము తత్వవేతృత్వమునుగురించి పరిశ్రమఁ జేయుచుండును. ఒకనాఁడు తండ్రి కుమారుని వివాహము జేసికొమ్మని బోధించిన వారిరువురకు నిట్టి సంవాదము జరిగినది. యజ్ఞశర్మ - వత్సా! నీ కిప్పుడు వివాహము సేయ నిశ్చయించుచుండ మీ యమ్మతోఁ బెండ్లియాడనని చెప్పుచుంటివఁట. ఏమిటికి?

గుణనిధి – తండ్రీ! పెండ్లి యేమిటి కాడవలయును?

యజ్ఞ – సుఖించుటకు, అనందించుటకు.

గుణ - ఏమి సుఖము? ఏమి యానందము?

యజ్ఞ - లోకమంతయు నేసుఖము నేయానందము బొందుచున్నదో నీవు నదియే!

గుణ — తండ్రీ! నేను గొన్నిశ్రుతిసాంప్రదాయముల నడిగెదఁ గోపగింపక తెల్పెదరా?

యజ్ఞ — కోపమేల? అడుగుము.

గుణ – నా కుపనయనము చేయునప్పుడు నామెడలో మూడుపోగులుగల యీయజ్ఞోపవీతము నేమిటికి వైచిరి? దీని సాంప్రదాయ మేమి?

యజ్ఞ - దేహతత్వమిందుఁ దెలుపఁబడుచున్నది. తంతుత్రయము సత్వరజస్తమోగుణములు. వానిలోని తంతువులు సత్యాదిభేదము లనియుఁ దొంబదియారుబెత్తలు తత్వముల సాంకేతిక మనియు దానిముడి యజ్ఞానగ్రంధి యనియు నుపనిషత్తులలో వ్రాయఁబడియున్నది. నీవు చూడలేదా?

గుణ — చూచితిని వివరము తెలిసినదికాదు. వివాహమందు రెండవయజ్ఞోపవీతము వైతు రది యేమి?

యజ్ఞ - అట్టి తత్వములుగల మరియొక్కదేహము భారము వానిమీదఁ బడుచున్నదని తెలుపుటకు.

గుణ —తండ్రీ! వివాహమన శబ్దార్థ మేమి?

యజ్ఞ - ఎడతెగని బరువును మోయుట, అని.

గుణ - స్వామీ! ఈయజ్ఞోపవీతముల నిట్లు పురుషులకు మెడలో వేయుట కేమి ప్రయోజనము?

యజ్ఞ — విద్వాంసుఁ డామాటయే శంకించుకొని వావివలనఁ బంధములఁ దెలిసికొని తత్వ మెరిఁగిన జ్ఞానవంతు డగుటకు. అందులకే యామర్మము తెలిసినవా రగుట సన్యాసులు జన్నిదములఁ దీసివైతురు. దానం జేసియే “జగ మెఱిఁగిన పాఱునకు జందె మేల” యను సామెత వచ్చినది. గుణ — తండ్రీ! సర్వజ్ఞుండవు నీ వెరుంగనిది లేదు. అన్నియుం దెలిసి న న్నిట్లు పెండ్లియాడుమని బోధింతువేల?

యజ్ఞ — వత్సా! వాని సాంప్రదాయములఁ దెలిసికొనుసమయ మిది కాదు. బ్రహ్మచారి గృహస్థుండై పుత్రపౌత్రాదులవలన గలిగిన యానంద మనుభవించి పిమ్మటఁ దురీయాశ్రమము స్వీకరించునపుడు దీనిం దెలిసికొనవలయును. ఇదియే లోకాచారము.

గుణ — ఏకర్మనైనఁ బ్రారంభమునందే హేతువుం దెలిసికొని చేయుట లెస్స కాదా? తన శరీరభారమును వదలించుకొనుటకు గురుతుగా వేయఁబడిన యజ్ఞోపవీత మొండు బరువై యుండు. రెండవదానిం గూడ భరింపుమని చెప్పుచుంటివా? తండ్రీ! యెఱింగియుండియు మంచిదారిఁ జూపక కంటకభూయిష్ఠమగు తెరవు జూపెద వేల?

యజ్ఞ – అయ్యో! పట్టీ! నీ విప్పట్టున నిట్టిమాటలం బలుకరాదు. గృహస్థాశ్రమ మన్నిటికి ముఖ్యమైనది. వినుము.

ఉ. స్నానముజేసి యగ్నిపరి ◆ చర్య నొనర్పుచు వేళలందుఁ గౌ
     పీనముదాల్చి వేదము జ ◆ పించుచు దండము చేతఁబూని వి
     ద్యానిధిబ్రహ్మచారి జఠ ◆ రాగ్ని జ్వలింపఁగ బిక్షగోరి యె
     వ్వానిగృహంబు జేరుఁ దల ◆ ప న్మఱి యట్టి గృహస్థుఁ డల్పుడే!

గీ. ఉర్వి గృహపతి చల్లఁగా ◆ నుంటగాదె
    సాగుచున్నది తాపస ◆ జనతపంబు
    యతుల నియమంబు వడుగుల ◆ వ్రతము భిక్షు
    కులప్రవాసంబు మహిఁ దైర్థి ◆ కులప్రసేవ.

గీ. కాన గృహపతి యందఱి ◆ కన్న నధికుఁ
   "డన్న మన్న మటంచు గృ ◆ హంబుఁ" జేరు
   నతిథిఁ బూజింపు మెపుడు స ◆ త్యముగ దానఁ
   గలుగు సుకృతము కోటియా ◆ గముల రాదు.

తండ్రీ ! సర్వదా దుఃఖభూయిష్టమై వాగురాసమానమగు సంసారమున నేను బ్రవేశింపఁజాలను. అందు బ్రవేశించినవారికి ధనార్జనాసక్తి యుండక తప్పదు. ఎట్లో యొక్కకడుపు పూరించుకొనవచ్చును కాని భార్యాపుత్రాదికుటుంబము పెరిగినప్పుడు వారిం బోషించుటకై గృహస్థు డెట్టికప్టముల బడవలయునో తలంచికొనిన భీతి పుట్టుచున్నది. నిత్యము భార్య జలగవలె రక్తమును బీల్చుచుండఁ దద్భావచేష్టితములచే మోహితుండై మూర్ఖుండు తెలిసికొనజాలక సుఖమని యానందించుచున్నాఁడు. భార్య భోగములచే వీర్యమును ధనమును కుటిలభాషణములచే మనమును హరింపుచుండును. మూఢుఁడు నిద్రాసుఖవినాశమునకై దారసంగ్రహము చేసికొనును. పెక్కేల! బ్రహ్మ పురుషుల వంచించుటకే పెండ్లి కల్పించె. ఇందు రవ్వంతయైన సుఖములేదు. జనకా! జనకాదులవలె గృహస్థుండై జ్ఞానము సంపాదించుట దుర్ఘటము. మహాత్మా! కుమారుండు ప్రాజ్ఞుండని యెఱింగియు సన్మార్గ ముపదేశింపక నరకప్రాయంబగు సంసారకూపంబునఁ బడుమనియెదవేల? నాకుఁ బెండ్లి యక్కరలేదు. అనుగ్రహించి విడువు మని పలికిన విని యజ్ఞశర్మ శరీరమునఁ గంపము జనింపఁ దుఃఖముచేఁ గన్నులనుండి యశ్రువులు ధారగావించుచుండెను.

తండ్రి పరితాపముజూచి గుణనిధి యోహో! మాయమోహబల మిట్టిదే కదా! ప్రాజ్ఞులంగూడ వశపరచుకొన్నది.

శ్లో. ఆదిత్యస్యగతాగతై రహరహ స్సంక్షియతే నాయుషం
    వ్యాపారై ర్బహుకార్యభార గురుభిఃగాలోన విజ్ఞాయతె
    దృష్టాంజన్మజరావిపత్తిమరణాన్ త్రాసశ్చనోత్పద్యతె
    పీత్వా మోహమయీం ప్రమాదమదిరా మున్మత్తభూతం జగత్ .

ఆహా! నిత్యము సూర్యుని యుదయాస్తమయములచేఁ దమయాయువు క్షీణ మగుచుండ వ్యాపారపారవశ్యంబునం జేసి యాలోపము తెలిసికొనలేకున్నారు. తమ కన్నుల యెదుటనే యనేకులు బుట్టుచుండుటయుఁ జచ్చుచుండుటయు నాపదలు నొందుచుండుటయుఁ జూచియు భయమైనఁ బొందకున్నారు. జగంబంతయు నిట్లే యుండుటచే మోహమయంబగు మద్యమును ద్రాగి లోకమునకే వెఱ్ఱియెత్తినదని తలంచుచున్నారు. ఇది మాయాబలము. దీని నతిక్రమించుట కడుంగడుకష్టము. తండ్రీ! యూరడిల్లుము. నా కనుజ్ఞ యిమ్మని పలికి గుణనిధి యవ్వలికిఁ బోయెను.

యజ్ఞశర్మ పుత్రుని మనస్సన్యాసిత్వమునకు వగచుచు నప్పుడప్పుడు కుమారున కామాటయే చెప్పుచు హితులచేఁ జెప్పించుచు నిమ్నాభిముఖంబగు జిలంబునుంబోలె వానిమనస్సు త్రిప్పనేరక కులాభివృద్ధిజెందమికి విచారించుచుఁ గొండొకకాలంబున కతండు నాకం బలంకరించెను. తత్పత్నియు సహగమనము చేసి భర్తం గలిసికొని దివ్యలోకభోగముల ననుభవించుచుండెను.

తలిదండ్రులు స్వర్గస్థులైనంత గుణనిధి యాచింత స్వాంతమ్మున నంటనీయక బంధములు తెగినవని సంతసించుచు నత్యంతవిరాగము గలిగి తత్వజ్ఞానవిశేషములం తెలిసికొను నభిలాషతో గురు నన్వేషించుచుండె. నంత.

గీ. భసితరుద్రాక్షమాలికాలసికగాత్రుఁ
    డురుజటాధారి వ్యాఘ్రచర్మోత్తరీయఁ
    డపరశివుఁ డన దనరు సన్యాసి యొకఁడు
    వచ్చి నివసించె నూరిదేవళమునందు.

గుణనిధి దేవతాదర్శనము నిమిత్తము నాఁటిసాయంకాలమున నాకోవెలకుఁ బోయి యందు రెండవశంకరునివలె నొప్పుచున్న యాసిద్ధుం గాంచి నమస్కరించి యోరగాఁ గూర్చుండి తత్తపోవిశేషముల నరసి స్తోత్రపాఠములు విని సంతసించుచు నింటికిఁ జని యారాత్రి దన్మహత్వమును వితర్కింపుచు మరునాఁ డుదయమున లేచి కాల్యకరణీయంబులం దీర్చుకొని యాసిద్ధునొద్ద కేగి సాయంకాలమువరకు నందే కూర్చుండి వాని విశేసంబులం జూచుచు రాత్రి కింటికిం బోయెను.

ఈరీతిఁ బదిదినములు గడచినంత నాయతీంద్రుడు వాని చిత్తనైర్మల్య మరసి యొకనాఁడు సుమతీ! నీ వెవ్వని కుమారుండవు? నాకడకు నిత్యము నేమిటికి వచ్చుచుంటివి? నీ యభిలాష యేమి? ఏమియు మాటాడక పోవుచుందువే! నీయుదంత మెఱిగింపుమని యడిగిన గుణనిధి వినయవినమితోత్తమాంగుడై యిట్లనియె—

స్వామీ! నేను యజ్ఞశర్మయను బ్రాహ్మణుని కుమారుండ. నాపేరు గుణనిధి యండ్రు. తల్లిదండ్రులు స్వర్గస్థులైరి. నా కెవరును లేరు. మీవంటి సాధువులే నాకు బంధువులు. మీయట్టి మహానుభావులు పామరుల నుద్ధరించుటకే లోకయాత్ర చేయుచుందురు. నా కేకోరికయును లేదు. ఇహపరములయందు రోత పుట్టినది. కైవల్యమునకు సులభమగు మార్గ మేదియో తెలిసికొన నభిలాష కలుగుచున్నది. మత్పురాకృతసుకృతవిశేషంబునం జేసి నాకోరికఁ దీరుపు నట్టి మహనీయులు మీరే యిటకు దయచేసితిరి. నేను గృతార్థుండ నగుదునని ముఱియుచుంటి. ముక్తిమార్గ ముపదేశింపుఁ డిదియే మదభీష్ట మిందులకే మీకడకు వచ్చుచుంటి. కృపాపాత్రుం జేయుఁడని పాదంబులం బడి వేడుకొనియెను.

అప్పు డాసిద్ధుండు వాని లేవనెత్తి వత్సా! నీ బుద్ధిపారిశుధ్య మఱసితిని. పూర్వజన్మవాసనావశంబున నీకు విజ్ఞానం బయత్నోపలబ్ధంబై యున్నయది. నీవు కారణజన్ముఁడవు. నీకు మాయుపదేశముతో బనిలేదు. ఇదివరకే నీవు మనసుచే సన్యాసి వైతివి. ఇప్పుడు కాయమునఁగూడ సన్యాసము స్వీకరింపుము. నీవలనఁ గొన్నిపురాతనగాథలు భూలోకమున వెలయవలసియున్నవి. కావున నొకసహాయునిం గూర్చుకొని ధారుణీకైలాసంబగు కాశీపురంబున కరుగుము. అందలి పరమహంసలతో నీకు సహవాసము గలిగెడిది. దాన ముక్తుడ వయ్యెద విదియే మే ముపదేశించునది. అని పలుకుచుఁ దనమూటనుండి కాంతులు విరజిమ్ము రత్నమొకండు దీసి యతనిచేతం బెట్టి యిట్లనియె.

సుయత్నా! నీ వీరత్నమును ముందిడుకొని పూజించి కన్నులు మూసికొని ధ్యానించినంత భూతభవిష్యద్వర్తమానకాలంబులం జరిగిన కథావృత్తాంతములన్నియుఁ గరతలామలకముగా నీకు దెలియఁబడగలవు. దీనిని సాలగ్రామములవలెఁ బూజించుచుండుము. ఈమణి సిద్ధించుటచే నీవు మణిసిద్ధుండ వనఁబరగుదువు. పొ మ్మింటికిఁ బొమ్మని పలికిన వాని శిరంబునఁ గరం బిడి దీవించి యంపివేసి తా నెందేనిం బోయెను.

అమ్మణిసిద్ధుండు గురూపదిష్ఠమును మంత్రోపదేశముగా స్మరించుకొనుచుఁ దదుక్తప్రకారము వెంటనే గోవిందతీర్థులను యతీంద్రునొద్దకుఁ బోయి సన్యాసము స్వీకరించి మణిసిద్ధయతీంద్రుఁడను పేరుతో బిలువఁబడుచుఁ గాశీపురంబున కరుగ నిశ్చయించి యొకనాఁడు లౌల్యమతియను మిత్రునొద్దకుఁ బోయి యిట్లనియె.

మిత్రమా! నాకుఁ జిన్నతనమునుండియుఁ గాశీపురంబున కరుగవలయునని యభిలాష గలిగియున్నది. నేఁడు గురూపదేశముగూడ నాయభిష్టమునే బలపరచినది. నే నిప్పు డయ్యాత్రకుఁ బోవుచుంటి నొంటిగాఁ దెఱవు నడువఁగూడదని పెద్దలు సెప్పుదురు. నీకు నాయోపిన యుపకారము గావించెద నప్పయనంబునకుఁ దోడువత్తువే యని యడిగిన వాఁడు నవ్వుచు నిట్లనియె.

అయ్యా! తమవేదాంత మంతయు నెక్కడికి బోయినది? తండ్రి యెన్నివిధములఁ బ్రతిమాలినను పెండ్లి చేసికొనక యావగతో నాయనను సమయజేసితివికదా! ఇప్పుడు కాశికిఁ బయనమా? దారిలో మాబోంట్లను దోడుతీసికొనిపోయి చంపుదువు గాబోలు. చాలుఁ జాలు! అయ్యా! వేదాంతులకును దీర్థయాత్రలు కావలయునా? నేను రాఁజాలనని పరిహాసమాడిన విని యాదుష్టునితో మరుమాటాడక యాయోగి వేరొకయాప్తునికడ కరిగి యభీష్టంబు తెలిపిన నతండును నాలుబిడ్డలను విడనాడి యిట్టినడికాలములోఁ బ్రయాసముల కోర్చి కాశీకి వచ్చుటకుఁ వీలులేదని కచ్చితముగా నుత్తరము చెప్పెను.

వెండియు నొకసఖునికడ కరిగియు యతనితో నిట్లనియె — ఆర్యవర్యా! ధాత్రీతలంబునఁ బ్రసిద్ధపట్టణంబు గాశియన విందువుగదా! అందు ముక్తిదాయిని యగు గంగాభవానియు మోక్షలక్ష్మీఘటనాసమర్థుండగు విశ్వనాథుండును ముఖ్యదేవతలని యాబాలగోపాలవిదితమే! తత్పురంబుఁ జూడ నీకు వేడుక లేదా? అప్పురవిశేషంబు లెన్నియేనిం గలవు. వానినెల్ల మార్గంబున వక్కాణింతు. జన్మము సాద్గుణ్యమయ్యెఁడు తోడు రమ్ము. పుత్రమిత్రకళత్రాదులయెడ మమత్వమోహంబు విడువుము. వారు పరలోకసౌఖ్యమునకు శత్రువులు. మేను శాశ్వతంబు గాదు. కాశీపురంబు దర్శనమాత్రమున సంసారతాపత్రయముల యాత్రం బుడిగించునని నుడివిన దడయక మరల నాపుడమివేల్పు మణిసిద్ధున కిట్లనియె.

అయ్యా! కాశీపురం బట్ ప్రభావసంపన్నంబే కాని మార్కం బమితక్లేశజనకం బని చెప్పుదురు. కాశికిఁ బోవుటకంటెఁ గాటికి బోవుటయే సుఖ మన విందును. ఇదియునుఁ గాక దివ్యజ్ఞానసంపన్నులగు మీవంటివారలకు తీర్థయాత్రవలన బ్రయోజనం బేమి? అజ్ఞానులకు మార్గక్లేశంబువలన జ్ఞానంబు కలుగునని తీర్థయాత్ర విధించిరి. మానసతీర్థం బాడనివారికి నాడువారికినిగూడఁ తీర్థయాత్రవలన లాభము లేదందురు. పామరులకు వైకల్పితంబగు యాత్రలకై తమవంటి యతు లతిప్రయత్న మొనరించుట నీతిగాదు. నామాటలం బాలించి యప్పని యుడుగుఁ డనిన నతనితో మారుపలుకక యయ్యతితిలకుండు నింకొక చెలికానిం జేరి —

గీ. విశ్వనాథుండు దేవతావృక్ష మమర
    గంగ దుర్వారపాపప్రభంగ యన్న
    పూర్ణగీర్వాణసురభి యపూర్వపుణ్య
    ఫలదములు తీర్థములు శుభాస్పదము కాశి.

అప్పురంబునకుఁ బోవుచుంటిఁ దోడురమ్మని జీరుటయు నతం డిట్లనియె.

స్వామీ! నామీఁదఁ గోప మూనకుఁడు. కాశీమార్గంబున రోగబాధయుఁ జోరబాధయు మెండఁట. పరలోకతుల్యమగు కాశి కరిగి యొక్కండేని యిక్కడకుఁ జేరినవాఁడు గలఁడే! యట్టి ప్రమాదాస్పదంబగు యాత్ర కిట్టిప్రాయంబున నున్ననే నెట్లు తోడు వత్తునని యుత్తరం బిచ్చిన తత్తరమందినడెందముతో నతండు వెండియుఁ గొండొకకొండికం జేరి యిట్లనియె.

వత్సా! తీర్థయాత్రవలన గలుగు పుణ్య మెద్దానం గలుగదు. అందు గాశి కలుషపిశితరాకాశి. గంగ సంసారతాపభంగ. మణికర్ణిక మోక్షలక్ష్మీశ్రుతిమణికర్ణిక. అన్నపూర్ణ యన్నపూర్ణ. భైరవుం డఘభైరవుండు. అట్టిదానిం జూడబోవుదు. నేఁడు తోడువత్తువే యని యడిగిన నతం డిట్లనియె.

స్వామీ! తమరు వాక్రుచ్చిన వాక్యంబుల కర్థం బేమియో యెరుంగను. తుది నుచ్చరించిన రాకాశి భైరవ పదంబుల కాస్పదం బయ్యవసరంబు. దీని నే నె ట్లెరుంగుదు ననిన వినుడు. మత్పితామహుం డతివృద్ధుండు. అతం డొకప్పుడు తా ననుభవించిన కాశీప్రయాణక్లేశంబు నాతో చెప్పెను. అక్కడ వినిన నిప్పయనం బెవ్వరునుఁ జేయ యత్నింపరు. తా నెవ్వరి ప్రోత్సాహముననో మత్పితామహుం డొకప్పుడు నెలవున సుఖముగా నిలువలేక రాకాశియగు కాశి కరుగ నుత్సహించి కొంతమంది సహకారులతో బయలుదేరెనఁట. బయలుదేరునప్పుడు పాథేయమునకై మోయునంత పిండియుఁ బెసరపప్పు నుప్పును గారంబునుం గలిగిన చింతపండును గొన్నిబట్టలును గొంతసొమ్మును మూటగట్టుకొని యమ్మూట శిరంబునం బూని, పూటకు రెండుయోజనంబులు నడువదొడంగిరి.

మా తాతగా రతినియమస్థు లగుట సత్రంబుల భుజింపఁడు. కుతపకాలంబునకుఁ జేరినయూర నన్నంబు వండుకొనుచుండును. అతినియమస్థు డగుటచే నెక్కుడుగా నాకలియైనప్పుడు రాత్రులఁ బిండి చేసికొని భుజించును.

అటు నడువ నడువ నాయాస మెక్కుడైనకొలదిఁ దినమునకు యోజనత్రయమే నడువసాగిరి. మరి పదిదినములకు పూటకు యోజనము మాత్రము నడువ నాత్రముగా నుండెనఁట. ఇట్లు నడుచుచుండ నొక్కనాఁటి మజిలీ దవ్వుగానుంట విని జామురాత్రి యుండగనే లేచి తోడివారలతోఁ గూడ నడవిమార్గంబునం బడి నడచు చుండెను. అన్నిశాంతంబున ననంతవేగవాతోద్ధూతంబులై జీమూతసంఘాతంబు లొక్కపెట్టున పుడమి యిట్టట్టుగదల గర్జిల్లుచు నాకసంబంతయు నావరించి తళుక్కురను మెరుపులు చూపులకు వెరపు గరపఁ దెరు వెరుంగని యిరులు గ్రమ్మఁ బెనుజడి గుమ్మరింప నొడలు తడిసి గడగడ వడంక నగ్గాలివాన నిలువ నెందుఁ దావు కానక యత్యంతదుఃఖాక్రాంతస్వాంతుడై మత్పితామహుండు మేనిపై నాసబూనక చిత్తం బుత్తలపడ నెత్తిపై నెత్తుకొన్న తడిసినమూటను మాటిమాటికి భుజమున మార్చుకొనుచు నతిక్లేశముతో నడచుచుండెను. అట్టితరి నెట్టిసుమతికైన విసుగు రాకమానునా?

తడిగుడ్డల బిండుకొని గాలివాన యొక్కింత యఁడగినదని సంతసించుచు నడువయత్నించుచుండ నొకదండనుండి ప్రచండకోప మేపార దండధరకింకరులఁ దిరస్కరించు తస్కరు లెదురై బెదరుగదుర నార్చుచు దండంబునఁ మోది యబ్పాటసారుల దోచికొని కట్టుగుడ్డలతోఁ బ్రాణంబుల మిగిలిచి సాగనంపిరి.

నడచునప్పు డతిభారమైన మూటలు లేకపోవుటచే నాఁటి పయన మెంతేనిఁ దేలికయైనది. తెల్లవారిన వెనుక మాతాతగారును సహవాసులును జేతఁ గాసైనను లేకపోవుటచే మేనులు గాసిజెందుటచేఁ గాశిపై గొంతవిసుగుఁ దోప నడచుచు మిక్కిలిదవ్వగు నాఁటి యవసధంబు పయనంబున కంతరంబున నంతరాయము వాటిల్లుటచే మాపునకుఁ జేరుట కడు ప్రయాసమైనది. అట్లు సాయంకాలమునకు శరీరంబులు జేరవైచి వంటజేసికొనుటకుఁ జెంత సామగ్రలేమిం జేసి చింతించుచుఁ దమబడిన బన్నముల నప్పౌరుల కెఱిగించి పాత్రాదికముల సంగ్రహించి యర్ధరాత్రంబున కెట్లో భుజించిరి.

వారిలోఁ గొందరికి నతిసారరోగ మంకురించుటను నమ్మరునాఁడు పయనము సాగించుటకు వీలుపడినదికాదు. అవ్వీటఁగల సత్రంబున రోగావిష్టుల నిలువనీయరు. వారి యామయ మెఱింగి కావలివారలు వారి నందు వెడలగొట్టిరి.

అప్పుడా రోగులఁ దీసికొనిపోయి తోడివా రూరిబయలనున్న మశీదుపైఁ బరుండఁబెట్టిరి. తురక లత్తెర గరసి యతిరయంబున నరుదెంచి పరుసంబులాడుచు రోగుల నడివీధికి నీడ్చి తోడివారలఁ జావమోదిరి. తన్మలమిళితపవనంబులఁ దటాకంబునఁ నుదుకుటచే వారిలో గొంద రధికారనికటంబునకుఁ దీసికొనిపోఁబడి శిక్షతులైరి. అక్కటా! ఆయిక్కట్టు రోగులకన్న తోడివారికే యెక్కుడుబాధ కలగఁజేసినది. పదిదినము లయ్యూర వసించిరి. వారు పడిన యిడుములకు మేరలేదుగదా! రోగులకు గొంచెముఁ జవసత్వములు గలిగినతోడనే క్రమ్మరఁ గాశికి బయనము సాగింతమని కోరిన సహవాసులకు మత్పితామహుం డిట్లనియె.

సీ! కాశి రాకాశి యని యెఱిగియే బుద్ధిమాలి పయనమైతిమి. యీ సిగ్గు చాలదా జ్ఞానముగలవారి కింటికడ మోక్షము రాదా? జ్ఞానము లేనివారలు నీటికాకులవలె మునింగినను ప్రయోజన మేమి? ఇంటికి బోవుదము రండు. ఈపాటి శిక్ష చాలును. అపరాధులవలెఁ జెరసాలఁ బడితిమి. యందులచే దెబ్బలందింటిమి. బ్రాహ్మణుల మయ్యుఁ గడజాతివారిచే నీడ్పింపఁబడితిమి. అయ్యో! ఆ వెతలు తలంచికొనిన గుండె పగిలిపోవుచున్నది. దేవతార్చన జేసికొనుచు నింటికి వచ్చిన యభ్యాగతుల నర్చించుచు సత్కాలక్షేపము జేయుగృహస్థునికిఁ దీర్థయాత్రతోఁ బ్రయోజన మేమి? బ్రతికియుండినఁ బెక్కుమార్గములఁ బుణ్యము సంపాదించుకొనవచ్చును. మరల యింటికి బోవుదము రండని బోధించినఁ గొందఱు సమ్మతించిరి. మఱికొంద ఱతనిమాట బాటింపక వారిని విడిచి యవిముక్తక్షేత్రంబున కఱిగిరి.

మత్పితామహప్రభృతు లారుమాసముల కిల్లు జేరి మఱిమూఁడునెలలకుఁ బూర్వజవసత్వములు గలిగి తిరుగుఁజొచ్చిరి. కాశికిం బోయిన పదుగురిలో నెనమండ్రు దారిలోనే కడతేరిరి. ఇరువు రప్పురవరంబు జేరిరఁట. కొంతకాల మందుండి వారింటికి వచ్చుచుండ మార్గమధ్యంబున కాలధర్మంబు నొందినట్లు చిరకాలమునకుఁ దెలిసినదని యీకథ యొకప్పుడు మాతాతగారు నాకుఁ జెప్పిరి. కాశికిఁ బోయినవాఁడు తిరుగ నింటికిరాఁడని యాబాలగోపాలవిదితమే. మీ రింత చెప్పవలయునా? నామనవి మన్నించి మీరును నప్పయనపువేడుక మరలించుకొనుఁడు. మిత్రుఁడవగుట నింత జెప్పుచుంటివి. ప్రణవాక్షరజపము జేసికొనుచు స్వదేశంబున వసింపుఁడు అని యెంతయో యుపన్యాసముగాఁ జెప్పెను.

మణిసిద్ధుం డద్దిరా! బుద్ధిమంతుడ వౌదు వెంతగాథ జెప్పితివి. చాలుఁజాలునని పలుకుచు వానిని విడిచి వేరొక సఖునిం జేరి యాత్మీయాభిలాష నెఱింగించుటయు నతండును గాశీప్రయాణం బతిప్రయాసజనకంబని నుడివి యనంగీకారము సూచించెను.

ఇ ట్లడిగినవారెల్లఁ గాశీపురంబును నిందించుచుఁ బోవలదని తన్ను మందలింపుచుండ మిక్కిలి పరితపించుచు జాత్యంతరులఁ బెక్కండ్ర నడిగియు విగతమనోరథుండై యొక్కనాఁ డిట్లు తలంచె.

అయ్యో! దైవమా! నే నేమి పాపమాచరించితిని. కాశీనివాసయోగము నాకు లేదు గాఁబోలు! విశ్వనాథసందర్శనంబును, గంగానదీస్నానంబును, నన్నపూర్ణచేతిభిక్షయుఁ, బూర్వపుణ్యఫలంబునం గాక యూరక లభింపవండ్రు. ఈశ్వరానుగ్రహం బెట్లున్నదోగదా యని యనేకప్రకారంబులఁ జింతించుచు గనబడినవారినెల్లఁ గాశికి వత్తురే యని యడుగుచు వెఱ్ఱివానివలెఁ దిరుగఁజొచ్చెను. ఇ ట్లనేకపురంబులు కాశీయాత్రాసహాయనికయి యయ్యతీశ్వరుండు గ్రుమ్మరుచుఁ గాశీపురాయత్తచిత్తుండయి విశ్వనాథుని ధ్యానించుచు నన్నపూర్ణం గొనియాడుచు గంగాభవానిం బొగడుచు నొక్కనాఁ డతం డొకగ్రామాంతరమునఁ జిట్టడవిదారి నడచుచుండ ముందట —

సీ. వాసనల్ వెదజల్లు వనసుమావళి శిఖా
               శ్రవణభూషలు గాఁగ సంతరించి
    పెనుగోచి దిగియఁగట్టినతోలు మొలత్రాట
               వరుసఁ గత్తియుఁ గొడవలియుఁ జొనిపి
    పసిమేత తమి నాల్గుదెసలకొయ్యలఁబారు
               వసులఁ గ్రమ్మరఁ బ్రోగుపరచికొనుచు
    పొగరెక్కినట్టియాఁబోఁతు నెక్కి విచిత్ర
              గతులఁ దోలుచుఁ దురఁగమునుబోలె

గీ. పొదలఁ దూరినపసులు దాపునకు రాగ
    మోవి దగిలించి పిల్లనగ్రోవి పాడి
    కొనుచు మూపునఁ బెనుదండమును ధరించి
    పసులఁ గాచెడు నొకగోపబాలుఁ గనియె.

కనుంగొని వానితో నిట్టి సంవాదము గావించెను.

మణిసిద్ధు — ఓరీ! యెవ్వడవురా నీవు. ఇటు రారా. (అని పెద్ద కేకపెట్టెను)

గొల్లవాడు – (దాపునకు వచ్చి) వోరి వోరి యని పిలిచెదపు నీ నోరేమైన క్రొవ్వినదా? మాల మాదిగ ననుకుంటివా? నాకు పేరు లేదా? మా పెద్దకాపు సైతము పేరుపెట్టి పిలుచునుగదా? ఆ మాత్రము బుద్ధి నీకు లేదా?

మ — ఓరీ యన్నమాత్రముననే నీకు కోపము రావలెనురా?

గొ - అదిగో! రా అంటేగాని నీ నోటితీట తీరదు గాబోలు!

మ — పోనీ నీ యిష్టము వచ్చినట్లు పిలుతునుగాన నీ పేరేమి అబ్బాయీ? యేమి కులమువాఁడవో చెప్పుము.

గొ — ఆలాగున మొదటనే మనవి జేసుకుంటే బాగుండునే? ఔరా! గొల్లోళ్ళు లోకువా బాబూ! నా పుట్టుపూర్వోత్తరము సెప్పుతాగాని నీ పేరు కులము ముందుగా సెప్పుమరి.

మ - నాపేరు మణిసిద్ధుడు. నేను బ్రాహ్మణుఁడను. మా కాపురము కొల్లాపురము.

గొ – నీవు భేమ్మడవైతే బోడిగుండేమి. మాభేమ్మడులాగున లేవేమి?

మ - మీ బ్రాహ్మణుఁడు యేలాగున్నాఁడు చెప్పుము.

గొ - మా భేమ్మని గురువులోడికి యీతరుప్పలా జుట్టు. పొలిమేర రాతిమీద వేసిన కొంగరెట్టలాటిబొట్టు. మెడమీఁద చేపమీసాలవంటి దారాలు వేసుకొని వొంకరబూరాలతో యేటికొకమాటు వచ్చి యెవరినో యొకరిని తెగకాల్చి మరీ వెడతాఁడు. వాఁడిలాగున నీవు లేవేమి?

మ - ఒహో! వారా! వారు వైష్ణవులు. మేము వైదికులము.

గొ - అయిదుకులకు బుజముమీద దారాలు వుండవా?

మ — అవి దారములు కావు యజ్ఞోపవీతములు. వారిలో నేను సన్యాసిని గనుక ఉండవు. గొ - సన్యాసి అంటే తప్పుమాట కాదండి?

మ - తప్పని నీ వెట్లు ఎరుగుదువు ?

గొ - నే నేదైనా తప్పు చేసినప్పుడు మా పెదకాపు నన్ను సన్నాసివెధవ సన్నాసివెధవ అని తిట్టేవాఁడు. అందుకోసరము తప్పనుకున్నాను.

మ - తప్పుకాదు. సన్యాసియనగా భార్యాపుత్రాదులు లేక యొంటరిగా తిరుగుచు నన్నిసంగములు విడిచినవాఁడని యర్థము.

గొ - అయ్యా! సన్యాసిగారు! అన్ని సంగములూ అంటున్నారు. స్త్రీసంగం లేదండి?

మ — మేము పెండ్లియే యాడలేదు .

గొ – అయితే బోగంవాళ్ళని యుంచుకున్నారా యేమిటి?

మ - వాళ్ళను మేము చూడనే చూడము. కామమును జయించినారమురా!

గొ - అదిగో! "నీ" "రా” మాత్రము విడువవు.

మ - పొరబాటున వచ్చినది పోనిమ్ము. ఈ మాటలతోనే సరిపోయినది. నీ పేరు కులము చెప్పితివి కావుగదా.

గొ- నేను గొల్లోరి చిన్నవాణ్ణి. నా పేరు కోటప్ప. మా దీవూరేను.

మ - ఈ యూరనఁగా నేయూరో పేరు చెప్పుము ?

గొ - ఇది శ్రీరంగపురము.

మ - నీకు దలిదండ్రు లున్నారా?

గొ - లేరు. చిన్నప్పుడే చచ్చినారఁట.

మ - మరి యెవరిదగ్గర నున్నావు?

గొ - ఈవూరి పెదకాపుగారి దగ్గర నున్నాను.

మ - ఏమిచ్చుచున్నాడు?

గొ – అన్నం బట్ట యిచ్చుచున్నాఁడు. వారి పశువులను కాచెదను. ఇదంతా వారి పొలమే. వారిది గొప్పకమతము, వాళ్ళింటికి వెళ్ళండి. స్వయంపాకం యిస్తారు.

మ - నాకు స్వయంపాకము అక్కరలేదు. కాని నీకు వివాహమైనదా?

గొ - యిహాహం అంటే యేమిటి? మ - పెళ్ళి.

గొ - (నవ్వి) యింకా కాలేదు.

మ - కోటప్పా! ని న్నొకయుపకారము కోరెదను చేయుదువా?

గొ - నేను సేసేయుపకార మేమిటండో?

మ — నేను కాశికిఁ బోవుచున్నాను. ఒంటరిగాఁ బోఁగూడదు. తోడువచ్చిన నన్నవస్త్రములిచ్చి యే మడిగితే అది యిచ్చి చిత్రమైనకథలుకూడా చెప్పెదను.

గొ - నీవు కాశీవి యెవరి పశువులు?

మ - పశువులు కాయడముకాదు కాశీ యన నొకపట్టణము.

గొ - కాశీ అంటె యెక్కడ నున్నది ?

మ - అది మహాస్మశానము. గంగయొడ్డున నున్నది.

గొ – బాబో! నన్ను గంగయొడ్డుననున్న స్మశానములోనికి రమ్మంటివా?

మ - దాని పేరేకాని స్మశానముకాదు. పెద్దపట్టణము.

గొ – అక్కడకు వెళ్ళడ మెందుకు ?

మ — అది మహాపుణ్యభూమి! అక్కడకుబోయి గంగలో స్నానమాచరించి విశ్వనాథుని దర్శించి యొకరాత్రి వసించినను మరుసటి జన్మమునకు మహారాజై పుట్టుదురు.

గొ - ఎవరు వెళ్ళినానా ?

మ - మనుష్యులు పక్షులు పురుగులు మృగములు మొదలైనవికూడ గంగలో మునిగినంత ముక్తినొందును.

గొ – అక్కడనుంచేనా కాశీకావిడి తీసుకొనివచ్చి ముష్టెత్తుకొనేవాళ్ళు డబ్బిస్తే కాశీపట్టణముఁ జూపించెదరు?

మ - ఔను వారలు యాత్ర చేసినవారే.

గొ - అలాగైతే దాని పుట్టుపూర్వోత్తరమంతా చెప్పుము. విన్నపిమ్మట నాకు బాగున్నదని తోచిన వచ్చెదనని చెప్పుతాను. లేకపోతే రానని చెప్పుతాను.

మ - (ఆ మాటను వినినంత సంతోషించి వానిదరికిఁ జేరి యక్కడనున్న మఱ్ఱిచెట్టునీడం గూర్చుండఁబెట్టి) దాని పూర్వోత్తరమును సంక్షేపముగాఁ జెప్పెదను గాని నీ విదివర కేమైనా కథలు వినియున్నావా? గొ — ఏమిటో పాండవకథంటే పందికథంటే మరి కామమ్మకథంటే యిలాటివే కాని మరి వినలేదు.

మ — నేను చెప్పినది నీవు జ్ఞాపకము వుంచుకోగలవా?

గొ – నాకు కథలంటే మహాయిష్టము. తెలిసేలాగున చెప్పితే జ్ఞాపకముంచుకోగలను గాని గొదవలును పెద్దమాటలుగాను చెప్పకుము.

మ - అలాగునేయని యతని శిరముమీఁద దనహస్త మిడి వానికి గ్రహణశక్తి పూర్ణముగాఁ గలిగించి యక్కథ నిట్లని చెప్పందొడంగెను.

కాశీమహిమ దెలుపు కథ

గోపా! వినుము. తొల్లి త్రిలోకసంచారియగు నారదుండు తీర్థయాత్రకు వెడలి యనేక పుణ్యస్థలంబుల కఱిగి యఱిగి యందలితరంగిణుల నవగాహంబు సేయుచు నొక్కనాఁడు వింధ్యాచలోపాంతకాంతారంబుదరియం జొచ్చె. అదియు నుద్యానవనంబువోలెఁ గమనీయభూరుహలతావృతంబై యొప్పుటం జేసి యమ్ముని స్వాంతంబునకు విశ్రాంతి గలుగఁజేసినది.

పదంపడి యమ్మునియు నర్మదానదిం గృతావగాహుండై మధురఫలరసాస్వాదనమత్తశుకపికస్వానగానంబునకుఁ దానంబులగు మరందబిందుపానాలోలరోలంబనాదంబులు చెవుల కింపు జనింపజేయ నడచు నజ్జడదారి రాక యెరింగి వింధ్యాచలేంద్రుడు జంగమరూపంబున నెదురేగి యర్ఘ్యపాద్యాదివిధుల నమ్మహానుభావు నర్చించి విశ్రయించియున్న కొండొకవడి కిట్లనియె. స్వామీ మునీంద్రా! నా కొక్కసందియంబు గలదు. వక్కాణింపుఁడు. లోకంబున లెక్కకురాని మెట్ట లెన్నియేం గలవు. వానిం బాటింప నేటికిఁ మేటియని పేర్కొనువానిలో హాటకాచలంబును నేనుంగదా మేటులమై యుంటిమి. పక్షపాతంబు మాని మా యిద్దరకుంగల తారతమ్యంబు వక్కాణింప మీరలు సమర్థు లని యడిగిన నజ్జడదారి యెక్కింతసే పూరకుండి శిరఃకంపంబుతో నుస్సు రని యిట్లనియె. గిరీంద్రా! పాపము నీవు లోకంబుపాటి మాటల నాడుచుంటివి. మొన్న నే నమ్మేరుధారుణీధరంబుకడ కరిగితి. అదియు నీ వెట్టట్టు లవంధ్యగర్వంబునం బల్కుచు నిన్ను చిన్నమెట్టలతోటి సాటిగా బేర్కొని తన కెందును సాటియగు నగంబులేదని ముమ్మా రొత్తిపలికినది. మీ యిద్దరతారతమ్యంబులు నొరులకు నరయ శక్యమే! నీకు మేలయ్యెడుంగాక పోయివచ్చెదనని యక్కలహభోజనుం డెందేనిం జనియె.

పిమ్మట వింధ్య యమ్మునితిలకుని పలుకులఁ దలంచి కలకజెందిన డెందంబుతో నౌరా? మేరుగిరి కింత పొగరేల? దానిమదం బుడగింతు నని యాక్షణంబ యవక్రవిక్రమంబునఁ దివిక్రముండువోలె బ్రహ్మాండకరండంబునిండ దనమేను బెంచి నిక్కిచూచుటయు సూర్యాదిగ్రహగమనంబుల కంతరాయంబైన కతంబునం గొన్నిలోకంబు లంధకారంబును గొన్నిదేశంబు లెండయుఁ గొన్నివిషపంబు లివకయుఁ గొన్నిదేశంబుల హిమంబును బీడింపఁదొడంగినది. అయ్యకాండప్రళయోత్పాతం బెఱింగి యింద్రాదిబృందారకసందోహము శతానందుని దరి కరిగి యవ్వెరపుతెరం గెఱింగించిన నవ్విరించియు నయ్యుపద్రవంబు లోపాముద్రామనోహరునివలనంగాని చక్కఁబడదు. అమ్మహానుభావుం డిప్పుడు కాశీపురంబునం గాపురంబు సేయుచున్నవాఁ డతనిం బ్రార్థింపఁబొం డని యాన తిచ్చిన గీర్వాణులు వాణీధవునానతి కాశీపురంబున కరిగిరి.

గోపాలా ! యింతవట్టు కథ స్పష్టంగాఁ దెలిసినదియా! యనిన వాఁ డయ్యా! మీదయచే నంతయుం దెలియుచున్నదిగాని యిం దొక్కసందియం బుదయించె వినుఁడు. వింధ్యంబన మనము చూచు మెట్టలకన్న సున్నితము గలిగియుండవచ్చును గాని మనుష్యునివలె మాట్లాడుటయు నెదుగుటయు నెట్ లుగలిగియున్నదో నాకు విడిపోవకున్నది. దాని నిక్కంబు తెరం గెఱింగింపుఁ డనిన నతండు వానిశంకకు సంతసం బంకురింప వెండియు నిట్లనియె.

భూతలంబున మహానుభావసంపన్నంబులగు కొన్నిగిరులకును మనుష్యులవలె జంగమరూపంబులు గలిగియున్నవి. అవియు భార్యాపుత్రాదులఁ గూడి కాపురంబు సేయుచున్నటుల గ్రంథంబుం వ్రాయబడియున్నది.

హిమాచలపుత్రియగు పార్వతీమహాదేవిని శివుండు పెండ్లి యాడిన కథను నీవు వినలేదు గాబోలు. వింధ్యాద్రియు నట్టి గిరికోటిలోని దగుట నట్లాచరించె. తర్వాత వృత్తాంత మాలకింపుము. ఇంద్రాదు లట్లు కాశీపురంబున కరిగి యప్పుడు మహాను భావత్వ మగ్గించి యాహా! వింధ్యాద్రి మూలంబునగదా మన కేతన్నగరాలోకనకౌతుకంబు సంప్రాప్తించె ధన్యులమైతి మని తలంచి గంగానదిం దీర్థంబులాడి విశ్వనాథు నభిషేకముఖార్చనావిశేషంబుల నారాధించి యన్నపూర్ణను భజించి ఢుండి భైరవాదుల పాదంబుల కెరిగి మరియుంగల శివలింగమూర్తుల నర్చించి యందందు నగస్త్యుని జాడం గనిపెట్టుచు నెట్టకే నొకరీతి నాతపస్వియున్న యిక్క యెఱింగి యొక్కగుహాముఖంబుగా నయ్యాశ్రమంబు సేరిరి.

అక్కుంభసంభవుండును జంభారిప్రముఖబహిర్ముఖుల రాక యెఱింగి పొంగినడెందంబుతో వారి కర్ఘ్యపాద్యాద్యర్చనావిధులం దీర్చి దర్భాసనంబుల నాసీనులం జేసి పదంపడి స్వాగతపూర్వకముగా నాగమకారణం బడుగుటయు నాదేవతలు బృహసృతిముఖంబుగా లోకంబులకు వింధ్యాదిమూలంబునం యుపద్రవప్రకారం బెరిగించి యాబాధ బాపుమని యత్తపోదనసత్తమునిం బ్రార్థించిన నంగీకరించి యతండును వారి నిజనివాసంబుల కనిపె. సుర లరిగిన వెనుక నమ్మునివరుండు కాశీనివాససౌక్యంబునకుం గలిగిన యంతరాయమును దలంచి కలఁగిన మతితో లోపాముద్ర నీక్షించి యిట్లనియె.

కాంతామణీ! నిరంతర మిప్పురంబున ననంతసుఖం బనుభవించుచు నేకాంతముగా వసించియున్న న న్నెట్టెఱింగిరో? నిలింపులు తత్సుఖంబున కంతరాయంబు గలుగజేసిరిగదా! నా గొప్పతనంబే నా కింతముప్పు దెచ్చినది. కటకటా! నాకు సురతటినీజలావగాహనయోగంబు లేదు గాబోలు. పర్వతసంఘంబులనెల్ల గడగడ వడకించు బల్లిదుఁ డొకగిరికి వెరచి నేఁడు నామఱుఁగు గొలవవలెనా! ఇదియు మదీయకర్మఫలంబే గదా! అప్పు డప్పని కెద్దియేని ప్రతిరోధము సెప్పక చెప్పున నొప్పుకొంటి. నీవైనను సెప్పవైతివిగదా! యతివా! యని యనేకప్రకారంబులఁ జింతించుచుఁ బ్రయాణోన్ముఖుండై యప్పురంబు ముమ్మారు వలఁగొని కొంతవడి నడచి యప్పురాభిముఖుండై యిట్లనియె. హా! తల్లీ గంగాభవానీ! నీ చల్లదనంబు విడిచి పరమనిర్భాగ్యుండనై యన్యదేశం బరుగుచుంటి. కరుణించి యనుజ్ఞ యిమ్ము . అన్నపూర్ణ! నీచేతి భిక్షాశనంబు విడిచి వేరొకయెడ కరుగుజనునియెడ గృప విడువకుము. హా! విశ్వనాథ! నిన్ను విడిచిపోవఁ గాళ్ళాడకున్నది. బిందుమాధవా! నాయం దక్కటికముంచుము పోయివచ్చెదను. ఓడుంఠీ! శుండాదండసీత్కారమారుతమ్ముల నెన్నడు తాప మార్చికొందునో? భైరవా! భక్తచకోరబైరవాప్తుండవగు నీపొందు వాసి యేగుటకన్న వ్యసన మున్నదే? మణికర్ణికా! నీ ప్రభాతం బెఱింగియుఁ బెరచోటి కరుగు దురితాత్ముండు గలడే! అని పెద్ద యెలుంగునఁ దద్దయుంబ్రొద్దు గాశిఁ దలంచి కన్నీరు గార గోలుగోలుమని యేడ్చుచుం బలికి యందు వెడలి కతిపయప్రయాణంబుల వింధ్యాద్ రికఱిగెను. అని చెప్పిన గోపాలుం డయ్యా! ఆయూర బాయుట కాయన యంత యడల నేటికి? కార్యంబైన వెనుక మరల నరుగరాదే! యనిన నయ్యతియు వినుము. నీ ప్రశ్నంబున కుత్తరంబు ముందరికథయే చెప్పఁగలదు.

అట్లు లోపాముద్రాసహాయుండై యగస్త్యుండు తనచెంత కఱుదెంచుటయు వింధ్యుండు గర్వంబు విడచి గురుభక్తితో మిన్నంటియున్న తనశిఖరంబులు పుడమి యంట మునియడుగులం బడియె. అప్పుడు మార్గావరోధంబు వాసిన భాస్కరాదిగ్రహంబులు యథామార్గంబుల సంచరించుటచే లోకోపద్రవం బడంగె. పిమ్మట నమ్మునిపతియు నతని శిరంబున గరంబిడి వత్సా! మేము దక్షిణయాత్ర కరుగుచున్నవారము. వచ్చునందాక నీ వీతీరున నుండుము. అట్లుండకున్న మదీయప్రభావం బెఱుంగఁజేసెదనని యతని నొడంబరచి దక్షిణాభిముఖుండై యగస్త్యుండు చనియె. అదియే సుమీ! మరల నుత్తరంబున కగస్త్యుండు రాకునికి గారణంబు. విను మ ట్లయ్యగస్త్యు గడువింధ్యాద్రి నేలం బడనేసి క్రమంబున భద్రాచల పట్టినాచల పుష్పాచల ధవళాచలాది పుణ్యక్షేత్రంబులు సేవించుకొనుచు శ్రీశైలంబున కరిగెను.

ఆ శ్రీశైలశిఖర మీక్షించినంత మేనుం బులకింపఁ దదీయమహిమ దిలకించి యగస్త్యుండు లోపాముద్రతో నిట్లనియె.

పూబోఁడి! చూడు మిది శ్రీశైల మిందు మల్లిఖార్జునదేవుం డేకాంతముగా భ్రమరాంబాసహాయుండై విహరించుచున్నవాఁడు. ఇన్నగాంతరమునుండి కృష్ణవేణి పాతాళగంగ యనుపేరఁ బ్రవహించుచున్నయది ముప్పదియోజనంబుల వైశాల్యంబును నాలుగుద్వారంబులును, సంజీవినీప్రభృతిదివ్యౌషధులును, సంచారవృక్షంబులును, కదళీచందనవిల్వాద్యనేకవనంబులును వరాహనారసింహాదిబిలంబులును, రత్నాకరంబులగు నిధులును, ముక్తిప్రదంబులగు పెక్కుతీర్థంబులును, ననేకకోటిమహాలింగములును గలిగియున్నవి.

ఇం దుండుపాషాణంబు లెల్ల శివలింగంబు లనియుఁ జెంచులు మహర్షు లనియుం చెప్పుదురు. పెక్కేల విన్నీలకంధరు నాలయంపుశిఖరము జూచినంత మోక్షంబు జేకూరు నని తదీయప్రభావంబు పలుదెరంగుల నభివర్ణించుచుండ నాలకించి లోపాముద్ర మౌనముద్ర దిగనాడి మనోహరువదనంబులపై చూడ్కి నిలిపి యెద్దియో యడుగంబోయి యూరకున్న నాసన్న యెఱింగి యమ్మునివరుం డంగనా మణీ! నీ వేల మాటాడఁబోయి యూరకుంటి వెద్దియేని సందియం బున్న నడుగు మని సాదరంబుగా బలికిన నామెయు నతివినయముతో ప్రాణవల్లభునకు నమస్కరించి యిట్లనియె. నాథా! శిఖరదర్శనమాత్రమున ముక్తిప్రదంబయి యీక్షేత్రం బింత ప్రాతంబున నుండ జచ్చినంగాని మోక్షం బీయజాలని కాశి కఱిగి గాశిజెంద నేటికి? మీరును కాశీవియోగసంతాపము పాతాళగంగాప్రవాహశీకరంబుల నార్చుకొనుచు సుఖంబున నిం దుండరాదే? యని యడిగిన పడఁతి సంప్రశ్నమున కగస్త్యుఁడు మెచ్చుకొని యామె సందియంబు వాయ నిట్లని చెప్పందొడంగె. అంగనామణీ! శ్రీశైలాది పుణ్యక్షేత్రంబులు కాశివలె బునరావృత్తి ముక్తిసౌఖ్యం బొనగూర్పజాల. వీయర్థంబు తేటబడ నొకయితిహాసంబు సెప్పెదను నాకర్ణింపుము.

శివశర్మ యను బ్రాహ్మణుని కథ

మధుర యను పట్టణంబున శివశర్మ యసు బ్రాహ్మణుఁడు కలండు. అతండు సమస్తవిద్యలయందుఁ బ్రవీణుండై పండితరాజను బిరుదు వహించి పెక్కురొక్కంబు సంపాదించి గృహస్థధర్మముల యోగ్యవర్తనములచే నాచరించుచుఁ బుత్రులఁ బెక్కండ్రం గని తత్సంతోషంబు గొన్నిదినము లనుభవించిన వెనుక నొక్కనాఁ డంతరంగమున యౌవనంబుపోకను ముదిమిరాకను దలంచి యిట్లు చింతించెను. కటకటా! నా దగు పూర్వప్రాయమంతయు నైహికసుఖంబులకై వృథా వ్యయపుచ్చితి. నాముష్మికం బింతయైనను సంపాదించుకొననైతి. సిరు లశాశ్వతములు. మేను చంచలము, బంధులు మాయాసంబంధు లని యెఱింగియు అనాదియగు నవిద్యచే నవి యన్నియు దిరములై యుండునట్లుగానే వ్యాపారములు జరిపింపబడుచున్నవి. నేనును అట్టి జ్ఞానంబు గలుగఁజేయు గ్రంథములు పెక్కు జదివియు ననుభవంబు లేమిం జేసి యింతవట్టును వట్టి బూటపుదానికై దొరలుచుంటిని. నేఁటి కెద్దియో పూర్వపుణ్యఫలంబునఁ దెలిసికొంటి. ఇప్పుడు తీర్థయాత్రారూపంబునఁ బుణ్యం బుపార్జించెదనని నిశ్చయించి యప్పుడు కొడుకులకు సొత్తంతయుం బంచియిచ్చి యొక్కశుభముహూర్తంబున నిల్లు వెడలి కతిపయప్రయాణంబుల గాశీపురంబున కఱిగెను.

కాశీమహిమ నంతయు నంతకుమున్న చదివినవాఁ డగుట నొరుల సహాయము లేకయే యందలి తీర్థవిశేషంబుల నరయుచుఁ తీర్థోపవాసపూర్వకముగా గంగానదిం గృతావగాహుండై యంగం బుప్పొంగ విశ్వనాథుని దర్శించి యానందబాష్పములతోడ నద్దీపుని కభిషేకంబు గావించి సంపూర్ణమనోరథంబుతో నన్నపూర్ణ నారాధించి వటుకభైరవాదుల యాత్రావిధిం భజించి మఱియు గాశీఖండంబున జెప్పంబడిన శివమూర్తులను తీర్థవిశేషంబులను వెదకి వెదకి వాని నామంబుల నచ్చటివారి కెఱుంగదెల్పుచు నధికనియమంబుమీద నారుమాసంబు లాపురంబున నుండి యమ్మహాదేవు నర్చించెను. పిమ్మట దక్కంగల తీర్థముఖ్యముల సేవించదలంచి యందు వెడలి ప్రయాగ కరిగె. అదియు నెంతధన్యాత్మునైనను రెండుమూడువాసరంబులకన్న నెక్కువ నుండనీయదు. కావున మూడుదినంబు లందలితీర్థదేవతల యథావిధి నారాధించి మరియుం గయయు, గాంచీపురంబు, నుజ్జయినియు, మథురయు ద్వారవతియు, నయోధ్యయు మొదలగు క్షేత్రంబుల కఱిగి యందలి హరిహరుల సమబుద్ధి నారాధించి మాయాపురంబున కఱిగెను.

అదియు హరిద్వారం బనియు, ముక్తిద్వారం బనియుఁ బేర్కొనబడుచుండు. అ ట్లఱిగి శివశర్మ నిర్మలబుద్ధిఁ దీర్ఘోపవాసంబు చేసి యథోక్తరీతి నాతీర్థదేవతల దృప్తిపరచి యందుఁగల చంద్రశేఖరుని పంచాక్షరీమంత్రపారాయణపరుండై మూఁడువాసరంబు లర్పించెను.

అట్లుండ నంత నొకనాఁడు హరిద్వారప్రాంతగంగాతీరంబున మధ్యాహ్నమం దన్నము పచించి పాత్రతో వడ్డించుకొనఁ దలచునంతలో నితాంతమరణవేదన యావిర్భవించి జీవితమారుతముల కెడయయ్యెను.

అట్లు శివశర్మ గంగాతీరంబున జీర్ణదేహంబు విడిచినంతలోఁ దనకన్నులారం గనిన సంగతులన్నియు బహువినోదములుగాను నద్భుతములుగా నుండుటం జేసి యది తనకు భూలోకనివాసంబున కంతరాయంబైన మరణంబుగా నెఱుంగక తా నొకచక్కదేశంబున కేగుచున్నట్లు తలంచెను.

ముందు నద్భుతంబగు తేజఃపటల మొండు తనచెంతకు వచ్చుచున్నట్లు కాన్పించె. అదియు గొంత నిదానించి చూచినకొలఁది నవరత్నఖచితమైనబంగారపుతళ్కుగా నేర్పడియె. అదియు సమీపించినకొలఁది నొకవిమానంబుగాఁ దోచె. అట్టి విమానరత్నంబు దనచెంత నిలిచినం గని యది యొకభాగ్యవంతుని యానసాధన మనుకొని దాని నధిరోహించువేడుక మనంబున నంతరించునంతలో నందుండి యిరువురు పరిచారకులు దిగివచ్చిరి.

వారిం జూచి యతండు వీ రెవ్వనికై వచ్చిరో యెవ్వనివారలో కదా యని వెరగందుచుండ నక్కింకరులును దివ్యభూషణాంబరములఁ గైకొని తిన్నగా నతనిదగ్గరకు వచ్చి శివశర్మా! వీని ధరింపు మనుటయు నాతం డదివరకు దన జీవితకాలములో నంతవిలువగల నగలను బట్టలను జూచియెఱుంగమి మరియు నద్భుత మంది యోహో యిప్పుణ్యాత్ము లెవ్వరో కదా నన్ను మిగుల గౌరవపరచుచున్నవారుఁ వీరి కులగోత్రంబులఁ దెలియుట లెస్సయని వారి నుపలక్షించి యిట్లనియె.

అయ్యలారా! మీ రెవ్వరు? దీని నెవ్వరికై గొనితెచ్చితిరి మీవృత్తాంత మెట్టిదో యెఱింగింపుఁ డనిన వారును జిఱునగవు మొగమునకు నగయై మెరయ నో శివశర్మా! మేము విష్ణుకింకరులము. నీచేసిన సుకృతమునకై వీని నీనిమిత్తమే తీసికొనివచ్చితిమి ఇవ్విమానరత్న మదిష్టింపుము. విష్ణులోకంబున కేగుద మనుటయు నతం డొక్కింత పరిశీలించి తాను జదివిన గ్రంథంబుల నవలోకనంబు జేసికొని యోహో ఇది నాకు మరణావస్థయని తెలిసికొంటి. తీర్థసేవం గావించిన పుణ్యంబే కదా న న్నింతగౌరవపరచుచున్నది. పురాణంబుల జదివినరీతిని మరణాంతరమునఁ బుణ్యాత్ములఁ బుణ్యలోకంబునకుం గొనిపోవు విమానమా యిది? మేలు మేలు! నా పుణ్య మిట్టిదే యని సంతసించి వా రిచ్చిన భూషణాంబరములఁ దాల్చి యక్కింకరు లిరుగెలంకుల వింజామరలు వీవ నవ్విమానరత్నం బధిష్టించి యూర్ధ్వలోకాభిముఖుండై చనియెను. అట్లు కొంతదూరం బఱిగినంత మహిషవాహనారూఢుండై దివ్యపురుషుం డొకఁ డేతెంచి యతనికి నమస్కరించి చనుటయు శివశర్మ విష్ణుకింకరుల నీదివ్యపురుషం దెవ్వఁడని యడిగిన వా రితఁడే కదా భూతసంఘాతంబుల సమయించు యముం డనియు నిది యమలోకపుపొలిమే రనియుఁ జెప్పిరి దాని కతండు వెరగంది యయ్యా! పురాణంబుల యముని రూపము భయంకరముగా వర్ణింపఁబడియున్నదే! ఇంత సౌమ్యుఁడుగా నుండుటకుఁ గతంబేమి యనిన వారిట్లనిరి.

పుణ్యాత్మా! పాపాత్ముల కట్టియేపున గాన్పించును గాని మీవంటి పుణ్యాత్ములకు మాత్ర మిట్టిరూపముతో వచ్చి చూపట్టువాఁడని యెఱింగించుచుండ నవ్విమానరత్న మాలోక మతిక్రమించి మఱియుం బెక్కు భువనంబుల దాటి బ్రహ్మలోకంబునకుం జనినది. ఆలోకం బాలోకోత్సేకంబగుట శివశర్మ కాలోకింప నభూతకౌతూహలం బొదవించె. అంత నక్కింకరు లతని బ్రహ్మసభకుం గొనిపోయి తదీయవృత్తాంతం బెఱింగించిన నవ్విరించియు వింతయేనా యని పెదవి విరచె. పిమ్మట నావిమానంబును విష్ణులోకంబునకుం గదలుటయు శివశర్మ చతురాసనుండు తన్నుగుఱించి యీసడించిన సంగతి విష్ణుకింకరుల నడిగిన వారిట్లనిరి.

అయ్యా ! నీవత్యంత పుణ్యాత్ముండివని మేము నిన్ను వినుతించిన నవ్విరించియుఁ గాశిలో మేను విడువని కొరంతను గురించి యీసడించె. వారణాసిం గాత్రంబు వాయని నరు లెట్టిపుణ్యాత్ములైనను పునరావృత్తిరహితమగు ముక్తిం బడయనేరరని యెఱింగించుచుండ నవ్విమానంబు విష్ణులోకంబునకుం గొనిపోయెను. పిమ్మట శివశర్మ విష్ణులోకంబునఁ బెద్దకాలంబు సుఖించి మరల ధరణీపతియై జనియించి కొంతకాలంబు రాజ్య మేలి కాశిలో నివసించి యందు మేను వాసి పునరావృత్తిరహితమగు శివలోకసాయుజ్య మందె. వాల్గంటీ నీ వింటివిగదా! ఇతరక్షేత్రంబులకుం గాశికింగల వాసి యని యెఱింగించి యగస్త్యుఁడు లోపాముద్రతో శ్రీశైలాదిపుణ్యక్షేత్రంబుల సేవించుకొని నేఁటికిఁగూడ దక్షిణదిశను గాపురంబుండెను .

గోపా! కాశీమహిమంబు వింటివా? పంచక్రోశవైశాల్యంబుగల యాక్షేత్రం బుత్తరవాహినియగు గంగాతీర మందున్నది. అందు విశ్వనాథుండు ముఖ్యదేవత. బిందుమాధవస్వామి క్షేత్రపాలకుండు. భైరవుఁడు పురరక్షకుండు. అన్నపూర్ణ విశాలాక్షి యనుపేరులం బరగియున్న దేవతయే ముఖ్యశక్తి. డుండి మొదలగు వారావరణదేవతలు. మణికర్ణిక తీర్థముఖ్యము. మరియు ననేకకోటిలింగంబులును ననేకకోటిమహాశక్తులుం గలిగియున్నయవి. అప్పురమహిమంబు సంక్షేపంబునం జెప్పితి. షణ్ముఖుండైన నిక్కంబు వక్కాణింప నోపం. డది ముక్తిస్థానంబు. పెక్కేల సేవించినంగాని తద్విశేషంబు లెరుంగఁబడవు. ప్రొద్దు చాల యెక్కినది. తత్సహాయమునకై యేమి యుత్తర మిత్తువో చెప్పుమనిన నా గొల్లచిన్నవాఁ డాకథను విన్నంత గోపభావంబు విడిచి మిక్కిలి గ్రహణశక్తి గలిగి కాశీ ప్రయాణోత్సాహంబు దీపింప నయ్యతిచంద్రునకు వందనం బాచరించి యిట్లనియె. అయ్యవారూ! తమరు నా కిప్పుడు చెప్పిన కథావిశేషములు కాశీప్రయాణమున కుత్సాహంబు గలిగించుచున్నవి. కాని యొండు వినుండు. మొదటినుండియు నాకుఁ గథలయందు తాత్పర్యము ఎక్కువగా నున్నది. నేను మీతో వచ్చునపుడు నడుచు ద్రోవ నెద్దియేని నొకవింత గనంబడిన దానిగురించి నాచేయు ప్రశ్నంబునకుఁ గథామూలముగా నుత్తరం బిచ్చుటకు నొడంబడుదురేని యిప్పుడు మీమూటం బూని వచ్చువాఁడ నట్లియ్యని యాక్షణంబ యింటికి మగిడిబోవువాఁడ నిదియ మదీయవాంచితంబు. దీనిం జెల్లింప నొడంబడుఁడని వేడుకొనుటయు నయ్యతిపతి మిగుల సంతసించి గోపా! నీ కోరిక యిదియేకద. అట్టిప్రశ్నములకు మాటికి విచిత్రములగు కథల మూలముగా నుత్తరము జెప్పువాఁడ. సంశయింపకుము. లేలెమ్ము. పురమ్మున కరిగి నీయజమానుని కెఱింగించి రమ్ము. పొమ్మన నపుడు వా డందులకు వందనపూర్వకముగా నియ్యకొని యాక్షణంబ పురంబున కరిగి యక్కాపునకుం జెప్పి యొప్పించుకొని కావలసిన సామగ్రి కొంత గైకొని కావడి గట్టి యక్కావడి మూపునం బూని తోడరా నొకశుభముహూర్తంబున నామణిసిద్ధయతీంద్రుఁడు కాశీయాత్రకుఁ బ్రయాణము సాగించెను.

అయ్యతిచంద్రుఁడు నియమముగాఁ గాశీయాత్రఁ జేయఁదలఁచుకొనుటంజేసి దారి నడచునప్పుడు మౌనము వహించి ప్రణవాక్షరజపము జేసుకొనుచు నడుచు. గొల్లవా డెద్దియేని నడుగుచుండఁ జేయి వీచి మాట్లాడగూడదని సూచించుచుఁ గాశీనగర దర్శనవ్యగ్రచిత్తుఁడై మనంబునఁగల తొందర నడకయందుఁ గాన్పింప మొదటి మజిలీ చేరెను.

అట్లు చేరి యొకసత్రంబున బసచేసి మౌనంబు విడచి గొల్లవానిఁ జీరి నేనిందు పాకంబు సేసెద సామగ్రి యంతయు నుండెంగాని ఆకులును కట్టెలును గొరంతగా నున్నవి. ఇది యరణ్యప్రాంతము. ఈయూరిబైటనే యవి లభ్యమగును. సరగ నఱిగి సంగ్రహించి రమ్మని చెప్ప వాడరణ్యవాసి యగుట వెరువక యొక్కరుఁడ చని కొన్నికట్టెలం గొట్టి యాకులం గోసి మోపుగట్టి యెత్తుకొనునంతలోఁ బైకిఁ దలయెత్తి చూడఁగా భూమికి నేత్రగోచరమైనయంతదూరములో నొకకీలురథ మరుగుచుండుటఁ జూచి వెరఁగంది యోహో! యిది యేమి వింత! ఈ బండి భూమినంటకయే యరుగుచున్నయది. దీనిచంద మెట్టిదో మనయయ్యవారి నడిగి తెలిసికొనియెదంగాక యని వేగిరముగా నామోపు శిరమునఁబూని యింటి కరిగి యామోపు దింపకయే అయ్యగారూ! అయ్యగారూ! అని యరచెను. ఆ స్వాములవారు మడిగట్టుకొని యితరజాతులతో మాట్లాడరు వాఁ డెంతబిగ్గరగా నరచినను ప్రతివచన మియ్యకపోవుటచే వానికి మిగులకోపము వచ్చినది. మోపు దింపి యీకేకకు మాట్లాడకున్న నిప్పుడే యింటికి బోవుచున్నవాఁడనని మరలఁ బెద్దయెలుగున బిలిచిన నాతపస్వి యదరిపడి వాకిటకు వచ్చి హస్తసంజ్ఞతో నిప్పుడు మాటాడను భోజనమైన వెనుక మాట్లాడెదనని సూచించుచు వాఁడు తెచ్చిన కట్టెలును ఆకులునుం దీసికొని వేగముగా వంటఁజేసి భుజించిన వెనుక నీవలకు వచ్చి గోపాలుని నన్నమునకుఁ బిలిచెను. వాఁడు నేనొక విచిత్రమైన విషయము జూచితిని. దాని పూర్వోత్తర మెట్టిదో చెప్పినంగాని భుజింపననిన నా యతియు వత్సా! భుజింపుము. పిమ్మట స్థిరముగాఁ గూర్చుండి నీయడిగిన దానికింగల కారణంబులు చెప్పెదనని యెట్టకేలకు వాని నొడంబరచి యన్నముబెట్టి భుజించిన వెనుక యొకరమ్యమైనప్రదేశమున వసించి వానిం బిలిచి గోపా! నీవు చూచిన విశేష మెద్దియో చెప్పుమనుటయు వాఁ డిట్లనియె.

అయ్యా! నే నాకులకై పొలమున కరిగినప్పు డొకబండి యాకాసమార్గమునఁ బోవుచున్నది. అందుఁ గొందఱుపురుషులు స్త్రీలతో వినోదముగా మాట్లాడుచున్నట్లు గూడ వినిపించినది. ఇది కడుచిత్రము. దాని వృత్తాంత మెట్టిదో యెరింగింపుఁ డనిన నయ్యతియు దనకు సన్యాసి యిచ్చిన మాణిక్యమును ముందిడుకొని పూజించినంత నమ్మణిప్రకాశంబున నావృత్తాంత మంతయు గరతలామలకముగాఁ బొడగట్టుటయు నద్భుతపడి యతఁడు వానితో నిట్లనియె.

గోపా! నీవు శౌనకమహర్షివోలె బహుకథాశ్రవణకుతూహలుండవు. కావున నీ కాపేరు తగియున్నది. ని న్నిప్పటినుండి శౌనకుండని పిలుచుచుందు. నీవు చూచినది యొకకీలురథము. దానివృత్తాంత మెంతయు విచిత్రమైనది. కథారూపముగాఁ జెప్పినంగాని తెలియదు. సావధానముగా నాలకింపు మనుటయు వాఁడు చాల వేడుకపడి అయ్యా! మీ రక్కథ నాకుఁ జెప్పునప్పుడు గూఢార్థములుగల గీర్వాణపదముల గూర్చినచో గ్రహించుట కష్టముగా నుండును. తేటమాటలతో నెఱింగింపుఁడని వేడుకొనిన మెచ్చుచు నయ్యతిపతి వాని కిట్లని చెప్పదొడంగెను.