తెలుగు భాగవతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉపోద్ఘాతము[మార్చు]

భాగవతం – పురాణం[మార్చు]

“పురా అపి నవ ఇతి పురాణః”. ఎంతో పురాతనమైనదై ఉండి ఎప్పటికప్పుడు సరికొత్తగా స్పురిస్తుండేది పురాణం. భాగవత మహా పురాణం అష్టాదశ పురాణాలలోనిది, కావ్యత్రయం లోనిది. ముందు పురాణం గురించి చూద్దాము. సర్గ, ప్రతిసర్గ, మనువులు, మన్వంతరము, వంశాను చరితములు పురాణానికి పంచలక్షణాలు అంటారు కొందరు. దశలక్షణాలు అంటారు కొందరు. సర్గము – మహదహంకార పంచతన్మాత్ర ఇంద్రియ భూతపంచ ప్రపంచ సృష్టి, విసర్గము – విరాట్పురుషుని వలనం సంభవించిన చరాచర భూత సృష్టి, స్థానము – శ్రీహరి అవతారములెత్తి జగత్తును పాలించుట, పోషణము – శ్రీహరి నిజభక్త జనోద్ధరణము చేయుట, ఊతులు – కర్మవాసనలు, పుణ్యపాపములు, మన్వంతరములు – పదునలుగురు మనువుల చరిత్రలు వారి ధర్మములు, ఈశాను కథలు – శ్రీహరి అవతార కథలు, అతని భక్తుల చరిత్రలు, నిరోధము – శ్రీమన్నారాయణుని యోగనిద్ర, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ముక్తి – అవిద్య త్యజించి నిశ్చల భక్తిచే శ్రీహరి రూపమును స్వస్వరూపముగ నొందుట, ఆశ్రయము – సృష్టి స్థితి లయములు ఎవ్వని వలన గలిగెనవో అతడే (పరమాత్మ) ఆశ్రయము. అలాంటి పురాణాలు మనకి చాలా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి అష్టాదశ పురాణాలు. అవి మత్య్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్పహ్మాండ, బ్రాహ్మ, బ్రహ్మ, వైవర్త, వామన, వాయవ్య, వైష్ణవ, వారాహ,అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాందములు యని 18. వానిని అష్టాదశ పురాణాలు అంటారు. శ్లో. మద్వయం, భద్వయం, చైవ బ్రత్రయం, వచతుష్టయం. అ, నా, ప, లిం, గ, కూ, స్కాని పురాణాని పృథక్ పృథకి. ఇంకా అష్టాదశ ఉపపురాణాలు ఉన్నాయి. అవి – ఉశన, కపిల, కాళి, సనత్కుమార, శంభు, సౌర, దౌర్వాస, నందీయ, నారసింహ, నారదీయ, పారశర, అంగీరస సంహిత, భృగు సంహిత, మారీచ, మానవ, వాశిష్ఠ, లింగ, వాయు పురాణములు – యని 18.

భాగవతం - కావ్యం[మార్చు]

హైందవ సాహిత్యంలో ముఖ్యమైనవి మూడు రామాయణ భారత భాగవత ఇతిహాసాలు. వేదాలు పునాదిరాళ్ళు, ఈ కావ్య త్రయం స్తంభాలు లాంటివి. రామాయణంలో జీవన విలువలకు ప్రాధాన్యం, భారతంలో ఫలవంతమైన జీవనానికి ప్రాధాన్యం. భాగవతంలో పారమార్థానికి ప్రాధాన్యం. అందుకే పోతనామాత్యులవారు గ్రంధారంభం లోనే అన్నారు.


శ్రీకైవల్యపదంబుఁజేరుటకునై చింతించెదన్, లోకర
క్షైకారంభకు, భక్తపాలనకళాసంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁగేళిలోలవిలసదృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు, మహానందాంగనాడింభకున్.

భాగవతంలో రామాయణ భారత కథలు కూడ చెప్పబడతాయి. కావ్య లక్షణాలైన అలంకారాదులు విస్తారంగా గల బహు కథా రత్నాల మణిపూసల సమాహారం భాగవతం. వీటిలో చాలా వాటికి వైయక్తిక సంపూర్ణత కూడ గోచరిస్తుంది. ఈ సమాహారానికి సూత్రంగా శుక మహర్షి పరీక్షిన్మహారాజు లనే స్వర్ణ రజత దారాలు చక్కగ పేన బడ్డాయి. మధుర శృంగారము మధుర వైరాగ్యము కలగలసిన పురాణమిది. అందుకే మధురాధిపతి శ్రీకృష్ణులవారికి ప్రథమపీఠం వేసారు. ఈ మహా పురాణాన్ని వ్యాసమహర్షులవారు సంస్కృతంలో రచించారు. ఈ మూల భాగవత రచనా కాలన్ని నిర్ణయించడం కష్టం. ఇది అతి పురాతనమైనది అన్నది నిర్వివాదాంశం. అట్టి మహాభాగవతానికి తెలుగుసేత బమ్మెర పోతన చేయుట తెలుగజాతి అదృష్టం. ఎనిమిది స్కంధాలు (1, 2, 3, 4 మరియు 7, 8, 9, 10 స్కంధాలు) వీరి కృతి అని మిగిలిన 5, 6 స్కంధాలు గంగన, సింగనల కృతి అని, 11 మరియు 12 స్కంధాలు నారయ కృతి అని స్థూలముగా అనుకోవచ్చు.

పోతన[మార్చు]

పోతన గారి ప్రణీతము అంటే ప్రణిహితమే, ప్రాణిహితమే. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీ. శ. 1378 నుండి 1460 అని పలువుర చే నిర్ణయింపడినది. సంస్కృత మహాభాగవతాన్ని ప్రాంతీయ భాషాంతీకరణ చేసినవాటిలో ఇదే ప్రప్రథమమైనది అంటారు. వీరి ఇతర కృతులు వీరభద్ర విజయము, నారాయణ శతకము, భోగినీ దండకము. వీరు సహజ కవులు. వీరి రచనాశైలి చక్కెరపాకం ఆపాతమథురమని మహాపండితులు పేర్కొంటారు. పండిత పామరుల నిరువురిను మెప్పిస్తుంది. ఇష్టమైన పద్యం లేదా ఇష్టమైన కథనం లేదా మొత్తం గ్రంధం ఏదైనా సరే విడిగా చదువుకోవచ్చు రసపూర్ణంగా స్వసంపూర్ణంగా ఉంటాయి. ఇందుకు భాగవతంలోని ఒక పద్యమేనా రానివాడు తెలుగువాడేకాదనెడి నానుడే నిదర్శనము. భాగవతంలో కథలు, శృంగారాలు, వైరాగ్యాలు, పద్యాలే కాదు వివిధ విషయాల వివరాలు, సాహిత్య ప్రక్రియలు చాలా ఉన్నాయి. వీటిలో పోతన గారి విశిష్ఠత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వీటిని గణించుట కూడ బహు ఆసక్తి కరంగాను, ప్రయోజనకరం గాను ఉంటుంది. అదే భాగవత గణనోపాఖ్యానము.

ఈ అంతర్జాల పుటలు – కంప్యూటరు దస్త్రమలు[మార్చు]

పోతనప్రణీతమైన ఆంధ్రమహాభాగవతమును అనేక మహాపండితులు ప్రసిద్ధ సంస్థలు పుస్తక రూపంలో ముద్రించాయి. అయితే ప్రస్తుత కాలానికి కావలసినట్లు అంతర్జాలం, కంప్యూటర్లలలో చదువు కొనుటకు వీలుగా దిగుమతికి వీలుగా అందిస్తున్నాము. విండోస్ ఉండి ఎమ్ ఎస్ ఆఫీసుల లో యూనికోడ్ లిపితో కావలసిన భాగం సులువుగా చదువుకొనుటకు వీలుగా చేసాము. భారతీయో వంటి ఓపెన్ ఆఫీసులలో కూడ పనిచేయును. ఏ భాగంకావాలంటే అది కాపీ-పేస్టు, వెదుకుటలకు వీలుగా ఉండేలా చేసాము. కొన్ని ముఖ్యమైన పద్యాలను పక్కన ఉటంకించాము. టీక టిప్పణులు (ప్రతిపదార్థములు) సంబంధించిన పద్యం కింద చూపు/దాచు బొత్తముతో ఇచ్చాము. కొన్ని పద ప్రయోగాల వివరణలను సేకరించి విస్తారించి అనుయుక్త/వివరణ పుటలో చూపాము. భాగవతంలో వాడిన ప్రతి అక్షరానికి అక్షరం, ప్రతి పదాలకి పదం, మక్కికి మక్కిగా, పరిశీలించి మధించి విడదీసి దత్తైలుగా చేసి గణాంకాల వివరాలు పుటలో పెట్టాము. వాటిని ఉపయోగించి జనింపజేసిన పటములు, పట్టికాదులు కొన్ని చూపాము. మిగిలిన వివరాలు [1] లో చూడవచ్చు. ఫ్రీలాన్సరులు చేసే సోలో ప్రయత్నాలలో సహజమైన అక్షర దోషాదులు అక్కడక్కడ ఉన్నాయి. సహృదయులు సరిదిద్ది ఈ కృషిని మెరుగు పరచండి.

ఊలపల్లి సాంబశివ రావు గారు[మార్చు]

భావగ్రహణం (conceptualization) చేసి, సంకల్పించి, సంకలనం (compile) చేసిన వారు ఊలపల్లి సాంబశివ రావు గారు. వీరు స్వభావ రీత్యా బహు గ్రంధ పాఠకులు. పౌగండ వయస్సులోనే పూజారి తాతగారి చలవ వలన అనేకమైన ఆధ్యాత్మికాది పుస్తకాలతో పరిచయం కలిగినవారు. వీరు కవి కారు, పండితులు కారు, రచయిత కారు. వృత్తి రీత్యా రాష్ట్ర విద్యుత్ సంస్థలో ఇంజనీరుగా పనిచేసి, తల్లిలాంటి ఆ సంస్థ చల్లని చూపుల వలన బరువు బాధ్యతల అనంతరం, ప్రస్ధుతం భాగవత పురాణ వ్యాప్తికై ఈ పరిశోధాత్మక చిరు యత్నానికి ధైర్యం చేసారు. షిరిడి సాయి అనుగ్రహం వలన వలసిన కావలసినవన్నీ ఆయనే అనుగ్రహిస్తారన్నది వీరి ధైర్యం. వీరు భాగవత గణనాధ్యాయిని అని చెప్పుకుంటూ ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. వీరి తల్లితండ్రులు ఇద్దరూ పుట్టి బుద్దెరిగి పిల్లలను దండించి ఎరుగని సాత్వికులు. తల్లి వెంకటరత్నంగారు పరమ ఉత్తమురాలు. తండ్రి అచ్యుత రామయ్యి గారు రాష్ట్ర రివెన్యూ శాఖలో తూర్పుగోదావరి జిల్లాలో పనిచేసారు. గణితంలో ఉద్దండులు. వీరి పూర్వీకులది కరిణీకపు వంశము. పితామహులు చిట్టిరాజు గారు మాతామహులు సాంబశివరావు గారు కరణాలే. ఇవటూరి భాస్కర రావు, ఛార్టెడు ఎక్కౌంటెంటు గారి పుత్రిక లలితను వివాహం చేసికొన్నారు. వీరికి ఫణి కిరణ్, భాస్కర కిరణ్ అని ఇద్దరు కుమారులు.

కృతఙ్ఞతలు[మార్చు]

ఊలపల్లి సాంబశివ రావు ఊహా (conceptualization) కర్త మరియు సంకలన కర్త , సాంకేతికులు మోపూరు ఉమామమహేశు, వెంకట కణాద, బండి శ్రీనివాస శర్మ ఎగుమతాది కృషి, జొన్నలగడ్డ పతంజలి ఇతర కృషి కర్తలు. ఓ ఎన్ ఎస్, హైదరాబాదు వారు టెక్నికలు కృషి కర్తలు. ఈ కృషికి టెక్నికలుగాను, సాహిత్య పరంగాను, వ్యక్తి గతంగాను సహాయ సహకార ప్రోత్సాహములు చేసిన వారు అనేకులు వారందరికి మా కృతఙ్ఞతలు. ఈ కృషికి ఉపయోగపడిన వివిధ పుస్తకముల రచయితలు, ప్రచురణకర్తలకు మరియు ఈ కృషిని సాధ్యము చేసిన కంప్యూటరులు చేసిన హెచ్ సి ఎల్, డెల్, వ్యూసోనిక్ కంపెనీలకు మరియు సహకరించి ప్రోత్సాహించిన అంతర్జాల సంస్థలకు. అందరికి పేరు పేరునా కృతఙ్ఞతలు.

మూలాలు[మార్చు]

 1. శ్రీమద్భాగవతము : సుందర చైతన్య స్వామి : సెట్టు
 2. శ్రీమద్భాగవత ప్రకాశము ( షష్ఠ స్కంధము వరకు) : 2003లో : మాస్టర్ ఇ కె బుక్ ట్రస్ట్, విశాఖపట్నం : సెట్టు
 3. శ్రీమదాంధ్రమహాభాగవతము, దశమస్కంధము, (టీక తాత్పర్యాదుల సహితము) : 1992లో : శ్రీసర్వారాయ ధార్మిక విద్యాసంస్థ, కాకినాడ - 533001 : సెట్టు.
 4. శ్రీమదాంధ్రమహాభాగవతము (12 స్కంధములు) : 1956లో : వెంకట్రామ అండ్ కో., బెజవాడ, మద్రాసు : సెట్టు
 5. శ్రీమదాంధ్రమహాభాగవతము (12 స్కంధములు) : 1924లో : అమెరికన్ ముద్రాక్షరశాల, చెన్నపట్నము : పుస్తకము
 6. శ్రీమదాంధ్ర మహా భాగవత పురాణరాజము (12 స్కంధములు) – వ్రాతప్రతి – కృషి ఎవరిదో తెలపబడనిది.
 7. శ్రీమదాంధ్ర భాగవతము, సప్తమ స్కంధము టీక తాత్పర్య సహితము : 1968లో : వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్, చెన్నపురి : పుస్తకము
 8. శ్రీమదాంధ్ర భాగవతము (అష్టమ నుండి ఏకాదశ స్కంధము వరకు) : వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్, చెన్నపురి : పుస్తకము
 9. శ్రీ మహాభాగవతము (12 స్కంధములు) : 1983లో : ఆంధ్ర సాహిత్య ఎకడమి, హైదరాబాదు - 500004 : సెట్టు
 10. శబ్దార్థ చంద్రిక : 1942లో : వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్, చెన్నపురి : పుస్తకము
 11. శబ్దరత్నాకరము (బి. సీతారామాచార్యులువారి) : 2007లో : ఆసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ, చెన్నై : పుస్తకము
 12. విద్యార్థి కల్పతరువు (విద్వాన్ ముసునూరి వెంకటశాస్త్రిగారి) : 1959లో : వెంకట్రామ అండ్ కో., బెజవాడ, మద్రాసు : పుస్తకము
 13. విక్టరీ తెలుగు వ్యాకరణము : విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ, 520002 : పుస్తకము
 14. లిటిల్ మాస్టర్స్ డిక్షనరీ - ఇంగ్లీషు - తెలుగు : 1998లో : పుస్తకము
 15. బ్రౌన్స్ ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు : పుస్తకము
 16. పోతన భాగవతము (12 స్కంధములు) : 1990 దశకములో : తితిదే వారి ప్రచురణ : సెట్టు
 17. పెదబాలశిక్ష (గాజుల రామారావు) : గాజుల రామారావు : పుస్తకము
 18. తెవికె - (తెలుగు వికిజిడియా) : అంతర్జాలము
 19. తెలుగు పర్యాయపద నిఘంటువు (ఆచార్య జి ఎన్ రెడ్డిగారి) : 1998లో : విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు - 500001 : పుస్తకము
 20. గజేంద్రమోక్షము : సుందర చైతన్య స్వామి : పుస్తకము
 21. అనంతుని ఛందము : 1921లో : వావిళ్ళ రామస్వామి అండ్ సన్స్, చెన్నపురి : పుస్తకము

పోతన తెలుగు భాగవతము[మార్చు]

పోతన తెలుగు భాగవతము

 1. ప్రథమ స్కంధము  : : అకారాది పద్యసూచిక
 2. ద్వితీయ స్కంధము
 3. తృతీయ స్కంధము
 4. చతుర్ధ స్కంధము
 5. పంచమ స్కంధము (ప్రథమాశ్వాసము)
 6. పంచమ స్కంధము (ద్వితీయాశ్వాసము)
 7. షష్ఠ స్కంధము
 8. సప్తమ స్కంధము
 9. అష్ఠమ స్కంధము
 10. నవమ స్కంధము
 11. దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)
 12. దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)
 13. ఏకాదశ స్కంధము
 14. ద్వాదశ స్కంధము
 15. అకారాది పద్యసూచిక

బమ్మెర పోతన - భోగినీ దండకము[మార్చు]

బమ్మెర పోతన - భోగినీ దండకము

బమ్మెర పోతన - నారాయణ శతకము[మార్చు]

బమ్మెర పోతన - నారాయణ శతకము
నారాయణ శతకము (ద్విపద శతకం)

బమ్మెర పోతన - వీరభద్ర విజయము[మార్చు]

వీరభద్ర విజయము/ప్రథమాశ్వాసము
వీరభద్ర విజయము/ద్వితీయాశ్వాసము
వీరభద్ర విజయము/తృతీయాశ్వాసము
వీరభద్ర విజయము/చతుర్థాశ్వాసము


ఇతర భాగవతములు

నారాయణీయము[మార్చు]

నారాయణీయము