నారాయణీయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

| శ్రీ మేల్పత్తూరు నారాయణ భట్టతిరి కృతం

ముందు మాట

మేలపత్తూరు నారాయణ భట్టతిరి కృతం ఇది నారాయణీయము. శ్రీమన్నారాయణీయము వ్యాస భాగవత పురాణానికి సంస్కృత భాషలో వెలువడిన సంగ్రహ రూపము ఇది. ఈ గ్రంథము కేరళలోని గురువాయూరు క్షేత్రములో వెలసిన శ్రీ కృష్ణుని సంభోదిస్తూ దైవస్తుతి రూపంలో కొనసాగుతూ ఉంటుంది. భక్తి, జ్ఞాన వైరాగ్యములు పెనవేసుకొని సాగిన అద్భుత రచన ఈ కృతి. దీనిని దేశమంతా, ముఖ్యముగా కేరళ, తమిళనాడులలో అధికముగా, పారాయణ చేస్తూ ఉంటారు. మంచి ఆయురారోగ్యాలకు, వ్యాధుల ఉపశమనానికి తిరుగులేనిది నారాయణీయ పారాయణ అని ప్రసిద్ధి పొందింది. ఇది కవిత్వ పుష్టి గల 1036 శ్లోకాలుతో పరిపుష్ట మైన గ్రంథము. ఇది క్రీశ. 1586 లో భట్టతిరి వారిచే వ్రాయబడింది అంటారు. వీరి జీవిత కాలం క్రీస్తు శకం 1560 నుండి 1646/1666 అంటారు. కొందరు నూట ఆరు సంవత్సరాలు జీవించారు అంటారు. కనీసం ఎనభై సంవత్సరాలు జీవించారన్నద నిర్వివాదాంశము.

కేరళలోని నంబూద్రి వంశములో మేలపత్తూరు వారి ఇంట క్రీశ. పదహారవ (16) శతాబ్దములో జన్మించిన నారాయణ భట్టతిరి మంచి సంస్కృత పండితుడు. గొప్ప గురుభక్తి పరాయణుడు. పదహారేళ్ళకే వేద వేదాంగములను అభ్యసించి, వ్యాకరణాది శాస్త్రములను ఔపోసన పట్టాడట. వీరు సంస్కృతములో ఎన్నో గ్రంథాలను రచించారు. వీటిలో శ్రీపాద స్తుతి, గురువాయుపుర స్తోత్రము, నారాయణీయము ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.

ఒక మారు వృద్ధులైన వీరి గురువుగారు రోగగ్రస్తులు అయితే, నారాయణ భట్టతిరి వారు గురు దక్షిణగా తమ భక్తి, యోగ బలములతో గురువు గారి రోగాన్ని తన మీదకు స్వీకరించాడట. పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. అలా ఇరవైఏడేళ్ళకే (27) రోగగ్రస్తుడై ఎన్ని ఔషధములు సేవించినా స్వస్థత చేకూరలేదు. ఈ మళయాళ సంస్కృత కవి తన వ్యాధి ఉపశమనము నిమిత్తము గురువాయూరు వచ్చి తమ ఆరాద్య దైవము గురువాయూరు శ్రీకృష్ణునికి దినమునకు ఒక దశకము, దశకము అనగా సుమారు పది శ్లోకముల స్తుతి, చొప్పున సమర్పించారు. ఆ విధంగా అవిఘ్నంగా శత (100) దశకములు (10) సమర్పించారు. ఈ స్తుతికి ప్రసన్నుడైన భగవానుని అనుగ్రహంతో భట్టతిరి తిరిగి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాడు.

క్షేత్రపురాణము ప్రకారము ఇక్కడి మూర్తి బహు శక్తిమంతము పురాతనము అయినది. ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయ'మనీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి, వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి తీసుకొని వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్‌. వెుదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు.

జాతకరీత్యా పాముకాటు ఉన్న పాండ్యరాజునకు, తెలియకనే జరిగిన పాముకాటు వల్ల ప్రమాదం తప్పిపోవుటకు కారణం, ఆ సమయములో ఆయన గురువాయూరప్పను సేవిస్తూ ఉండటమే అని పండితులు చెప్పారు. అంతట ఆయన గురువాయూరు మందిరాన్ని పునరుద్ధరించినట్లు ప్రతీతి. నేటికీ మహావ్యాధులకు గురైన వారు స్వామిని దర్శించి పారాయణ చేసినచో సంపూర్ణ ఆరోగ్యముతో వర్ధిల్లుతారు అని, క్షేత్రాన్ని దర్శించలేకపోయినా నారాయణీయము పారాయణ చేసినచో సత్పలితాలు ప్రాప్తిస్తాయని నమ్మకం పాతకాలం నుండీ ఉంది.

ఈ పవిత్రమైన విష్ణు క్షేత్రం కేరళ రాష్ట్రంలో త్రిసూరు జిల్లాలో త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే పట్టణము. గురువాయూరును దక్షిణ ద్వారక అంటారు. ఈ క్షేత్రములో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు. గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో ఉన్నాయి. వాటిలో నారాయణీయము విశిష్టమైనది.

ఈ వ్యాసంలోని వివరాలు ప్రధానంగా వికీపీడియా మున్నగు వాని నుండి తీసుకోబడ్డాయి.
- సంకలన కర్త లలిత ఊలపల్లి.

Lalitha53 (చర్చ) 14:53, 7 మార్చి 2018 (UTC)

మూలాలు[మార్చు]

  1. Narayaneeyamu Srimadbagavatha Kadha
  2. శ్రీమన్నారాయణీయము శ్లోక - తాత్పర్యములు
  3. శ్రీమన్నారాయణీయము, (భాగవత సారము), (శ్లోక - తాత్పర్యములు), (తెలుగు), అనువాదకులు - శ్రీమాన్ ఎన్ నరసింహాచార్యులు, ప్రచురణ - గీతాప్రెస్, గోరఖ్ పూర్, ఉత్తర ప్రదేశ్.ఏడవ పునర్ముద్రణ 2014