Jump to content

ఖడ్గసృష్టి (కవిత)

వికీసోర్స్ నుండి
శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

రెండు రెళ్ళు నాలుగన్నందుకు

గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో

క్క్షేమం అవిభాజ్యం అంటే

జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో


అస్వతంత్రతని జయించడానికి

అహింసాయుధం ధరించామంటూ

రక్తపాతం లేకుండానే

రాజ్యం సంపాదించామంటూ


అవినీతి భారీపరిశ్రమలో

అన్యాయాల ధరలు పెంచేసి

స్వాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకుని

చక్రవడ్డి తిప్పే కామందులకు


క్షణ క్షణం మారుతున్న లోకాన్ని

సరీగా అర్ధం చేసుకున్న వాళ్ళంతా

పేద ప్రజల పక్షం వహించడమే

పెద్ద అపరాధమై పోయింది.


అహింస ఒక ఆశయమే కాని

ఆయుధం ఎప్పుడూ కాదు

ఆశయం సాధించాలంతె

ఆయుధం అవసరమే మరి


ఆశయం ఉండడం మంచిదే కాని

అన్ని ఆశయాలు మంచివి కావు

ఆశయాలు సంఘర్షించే వేళ

ఆయుధం అలీనన్ కాదు


అందుకే అంటున్నాను నేను

అందుకో ఆయుధం అని

ఆచరణకి దారితీస్తేనే

ఆవేశం సార్ధకమవుతుంది


అందుకే సృస్టిస్తున్నాను

అధర్మనిధనం చేసే ఈ ఖడ్గాన్ని

కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది

జనంతో నిర్మిస్తున్న స్వర్గం ఇది

ఈ కతి బూజు పట్టిన భావాలకి

పునర్జయం ఇవ్వడానికి కాదు

కుళ్ళిపోతున్న సమాజవృక్షాన్ని

సమూలచ్చేధం చెయ్యడానికి

దీన్ని

నల్లబజారు గుండెల్లో దించు

దీనితో

కల్లకపటాలను వధించు

ఇది సమానధర్మాన్ని స్థాపిస్తుంది నవీన మార్గాన్ని చూపిస్తుంది

ఈ కత్తి

ఊహాసమూహాల వ్యూహాలు పన్ని

వీరవిహారం చేస్తూ

రణక్షోణిలో జనాక్షౌహిణులు కదలడానికి


అందుకే రాస్తున్నా నొక గీతి

చేస్తున్నా నొక హేతి

రావోయి లోనికి

సందేహం దేనికి


ఇది నిజం

నవధర్మం మానవధర్మం

అణవశక్తి కన్న

మానవశక్తి మిన్న


రావోయి రావోయి లోనికి

సంకోచం దేనికి

నను చూడగా ఇదేవేళ

నా మనహ కార్మికశాల


క్రక్కేది భావాగ్ని సెగలు

క్రమ్మేది దావాగ్ని పొగలు


రావోయి రావోయి లోనికి

రాసేది రవ్యుష్ణ గీతి

చేసేది పవ్యుగ్ర హేతి