సాంఖ్య యోగము
భగవద్గీత - తెలుగు అనువాదము (సాంఖ్య యోగము) | సంస్కృత శ్లోకములు→ |
తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్
[మార్చు]సంజయుడన్నాడు:
ఆ ప్రకారంగా కరుణతో ఆవహింప బడి, కన్నీటితో నిండి కలత పడుతున్న చూపుతో, విషాదంలోఉన్న అర్జునుని చూసి మధుసూదనుడు ఇలా అన్నాడు.
కుతస్త్వా కశ్మలమిదం. . .
[మార్చు]శ్రీ భగవానుడన్నాడు:
ఈ విషమ సమయంలో నీకు ఈ మాలిన్యం ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఆర్యులకు తగినది కాదు. స్వర్గాన్ని కీర్తినీ రెండింటిని చెడగొట్టుతుంది.
క్లైబ్యం మా స్మ గమః. . .
[మార్చు]అర్జునా! బలహీనుడివి కావద్దు. ఇది నీకు శోభించదు. శత్రుసంహారకుడా. క్షుద్రమైన హృదయ దౌబల్యాన్ని విడిచి లేచి నిలబడు.
కథం భీష్మమహం . . .
[మార్చు]అర్జునుడన్నాడు:
మధుసూదనా! -పూజలకి అర్హులైనభీష్మ ద్రోణులకు ఎదురుగా యుద్ధంలో బాణాలు ఎలా వదలగలను?
గురూనహత్వా హి. . .
[మార్చు]మహానుభావులైన గురువులను వధించకుండా ఈ లోకంలో బిచ్చం ఎత్తి అయినా జీవించడమే మేలు. గురువుల్ని వధించి ఆ నెత్తుటితో తడిసిన సంపదలు, భోగాలు ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తాను.
న చైతద్విద్మః . . .
[మార్చు]ఈ రెండింటిలో ఏది మేలో మాకు తెలియడం లేదు. యుద్ధం చేసినా మేము గెలుస్తామో వాళ్ళే గెలుస్తారో, ఎవరిని చంపాక జీవించడానికి ఇష్ట పడమో, ఆధృతరాష్ట్రనందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు.
కార్పణ్యదోషోపహతస్వభావః
[మార్చు]కార్పణ్య దోషం చేత నా బుద్ధి దెబ్బ తిన్నది. ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను. ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి. నీ శిష్యుడిని, నీ శరణు జొచ్చిన నాకు బోధ చెయ్యి.
న హి ప్రపశ్యామి . . .
[మార్చు]ఇంద్రియాలను దహింపచేసే నాయీశోకాన్ని తగ్గించే దేదో నేను తెలుసుకోలేకుడా ఉన్నాను. భూమిలో ఏకచ్చత్రాధిపత్యం కాని, దేవలోకాధిపత్యం కాని దీనిని తొలగించ లేదు.
ఏవముక్త్వా హృషీకేశం. . .
[మార్చు]ఓ రాజా. అర్జునుడు శ్రీ కృష్ణునితో ఈ ప్రకారంగా చెప్పి, యుద్ధం చేయనని గోవిందునితో పలికి మాట్లాడకుండా ఊరకున్నాడు.
తమువాచ హృషీకేశః. . .
[మార్చు]భారతా! రెండుసేనల మధ్య విషాదంలో పడిన అతణ్ణి చూసి హృషీకేశుడు నవ్వుతున్నట్లుగా ఇలా అన్నాడు.
అశోచ్యానన్వశోచస్త్వం. . .
[మార్చు]భగవంతుడన్నాడు :-
శోకింపతగని వాటిని గూర్చి నీవు శోకించుచున్నావు. మరియు నీ ప్రజ్ఞ (బుద్ధి ) నెల్లను ఉపయోగించి మాట్లాడుచున్నావు. పండితులు గతులు కల్గిన మరియు గతులు లేని వాటిని గూర్చి బాధపడరు .
న త్వేవాహం జాతు . . .
[మార్చు]నేను లేకుంటిననుట ఎప్పటికీ లేదు. నీవు ఎప్పటికీ ఉందువు. ఈ ధరణి ని పాలించు రాజులు కూడా ఎప్పటికీ ఉందురు. ఇక ముందు కూడా మనమందరము లేకపోవుట అనునదే లేదు.
దేహినోऽస్మిన్యథా. . .
[మార్చు]ఈ శరీరంలో దేహధారికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎలాకలుగుతాయో, అలాగే మరోదేహం లభించడం కూడాను. వివేకి ఈవిషయంలో భ్రమపడడు.
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ. . .
[మార్చు]కుంతీకుమారా! ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శలే శీతోష్ణ, సుఖదః ఖాలను కలిగిస్తాయి అవి వస్తూ పోతుంటాయి. నిలకడలేనివి. అర్జునా వాటిని సహించాలి.
యం హి న వ్యథయన్త్యేతే. . .
[మార్చు]పురుషశ్రేష్టుడా! సుఖదుఃఖాలలో సమంగా ఉండే ఏ ధీరుణ్ణి ద్వందాలు భాదించవో అతడు అమృతత్వానికి అర్హుడు అవుతాడు.
నాసతో విద్యతే భావో. . .
[మార్చు]అసత్యానికి శక్తి లేదు. సత్యానికి శక్తి లేకపోవడం అంటూ లేదు. ఈరెండింటి అసలు స్వరూపం తత్వ జ్ఞానులచేత దర్శింప బడినది.
అవినాశి తు తద్విద్ధి. . .
[మార్చు]దేని చేత ఈప్రపంచం యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆ సత్తు నాశరహితమైనదని తెలుసుకో. నాశరహితమైన దానిని ఎవరూ నాశనం చేయలేరు.
అన్తవన్త ఇమే దేహా. . .
[మార్చు]నిత్యమైన నాశరహితమైన పరిణామాలులేని శారీరా ధారి అయిన ఆత్మకు ఇవి అంతమయ్యే దేహాలు. అందుచేత అర్జునుడా యుద్ధం చేయి.
య ఏనం వేత్తి హన్తారం
[మార్చు]ఆత్మ చంపుతుంది అని కానీ, చంప బడుతుంది అనికానీ, ఎవరనుకుంటారో వారు అందరూ ఎరుగని వారే. ఆత్మ చంపదు, చంపబడదు.
న జాయతే మ్రియతే. . .
[మార్చు]అతడు ఎన్నడూ పుట్టేవాడు, గిట్టేవాడూ కాదు. నిన్న ఉండి రేపు లేనివాడూ కాదు. పుట్టుకలేని వాడు, నిత్యమైన వాడు, మార్పులేని వాడు, అతడు పురాతన మైన వాడు, అగు ఈ ఆత్మ శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు.
వేదావినాశినం నిత్యం. . .
[మార్చు]జన్మరహితము, నాశరహితము, అవ్యయము అయిన దీనిని ఎవరు ఎరుగునో ఆపురుషుడ ఎలా ఎవరిని చంపిస్తాడు? ఎవరిని చంపుతాడు?
వాసాంసి జీర్ణాని. . .
[మార్చు]మానవుడు జీర్ణమైన వస్త్రాలను విసర్జించి క్రొత్త వాటిని ఎలా ధరిస్తాడో అలాగే దేహధారి జీర్ణమైన శరీరాలను విసర్జించి క్రొత్తవాటిని స్వీకరిస్తాడు.
నైనం ఛిన్దన్తి శస్త్రాణి. . .
[మార్చు]దీనిని శస్త్రాలు ఛేదించలేవు
అచ్ఛేద్యోऽయమదాహ్యో. . .
[మార్చు]ఇది ఛేధించ రానిది, కాల్చ రానిది, తడప రానిది, ఎండించ రానిది. నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, అచలమైనది.
అవ్యక్తోऽయమచిన్త్యో. . .
[మార్చు]ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. దీనిని నీవు అర్ధం చేసుకుని విచారంచడం విడిచి పెట్టు.
అథ చైనం నిత్యజాతం. . .
[మార్చు]ఇక దీనిని నిత్యం పుట్టేది, నిత్యం గిట్టేదిగా భావించినా మహానుభావుడా|అప్పుడు కూడా ఇలా విచారించ తగదు.
జాతస్య హి ధ్రువో. . .
[మార్చు]పుట్టిన వానికి మరణం ఎలా తప్పదో, అలాగే చనిపోయిన వారికి జన్మ తప్పదు. అందుచేత శోకింపనవసరం లేని దాని కోసం నీవు శోకింప తగదు.
అవ్యక్తాదీని భూతాని. . .
[మార్చు]అర్జునా జీవుని మొదలెక్కడో తెలియదు, మధ్య ఎమిటో తెలియదు, తుది ఎప్పుడో తెలియదు. తెలియని దాని కొరకు విచారించ పనిలేదు.
ఆశ్చర్యవత్పశ్యతి. . .
[మార్చు]దీనిని ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, ఒకరు ఆశ్చర్యంగా చెబుతాడు, ఒకడు ఆశ్చర్యంగా వింటాడు. అయినప్పటికీ ఎవరూ దీనిని తెలుసుకోలేరు.
దేహీ నిత్యమవధ్యోऽయం
[మార్చు]అర్జునా! అన్ని దేహాలలో ఉన్న దేహి నిత్యమైన వాడు కనుక చంపబడడు. అందుచేత ఎవరిని గురించీ నీవు విచారించతగదు.
స్వధర్మమపి చావేక్ష్య న. . .
[మార్చు]స్వధర్మం దృష్ట్యా చూచినా నీవు కంపించ తగదు. క్షత్రియుడికి ధర్మ యుద్ధంకన్నామేలైనది లేదు.
యదృచ్ఛయా చోపపన్నం. . .
[మార్చు]అర్జునా! యాదృచ్చికంగా లభించినదీ స్వర్గద్వారాన్ని తెరిపించేదీ అయిన ఇలాంటి యుద్ధంలో పాల్గొనే అవకాశం అదృష్టవంతులైన క్షత్రియులే పొందుతారు.
అథ చేత్త్వమిమం. . .
[మార్చు]ధార్మికమైన ఈ యుద్ధాన్ని చేయకపోయ్యావో, దానివల్ల స్వధర్మాన్ని, కీర్తిని వదిలినవాడవై పాపం పొందుతావు.
అకీర్తిం చాపి భూతాని. . .
[మార్చు]ప్రజలు నిన్ను అప్రతిష్టకరంగా మాట్లాడుతారు. మానవంతుడికి అపకీర్తి మరణంకంటే బాధాకరం.
భయాద్రణాదుపరతం. . .
[మార్చు]ఈ మహారధులందరూ భయం వలన నీవు యుద్ధం నుండి పారిపోయావని అనుకుంటారు. నీ వీరత్వాన్ని గౌరవించిన వారే నిన్ను చులకనగా చూస్తారు.
అవాచ్యవాదాంశ్చ. . .
[మార్చు]నీ శత్రువులు నిన్ను గురించి పలురకాలుగా అనరాని మాటలంటారు. నీ సమర్ధతని నిందిస్తారు. అంతకన్నా ఎక్కువ దుఃఖకరమైనది ఉంటుందా?
హతో వా ప్రాప్స్యసి. . .
[మార్చు]చనిపోయావా, స్వర్గాన్ని పోందుతావు. గెలిచావా, రాజ్యాన్ని అనుభవిస్తావు. అందు చేత లే కౌంతేయ; యుద్ధం చేయడానికి కృతనిశ్చయుడువై లేచి నిలబడు.
సుఖదుఃఖే సమే కృత్వా. . .
[మార్చు]సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడివికా. ఈ విధంగా నీవు పాపం పొందకుండా ఉంటావు.
ఏషా తేऽభిహితా సాంఖ్యే. . .
[మార్చు]ఇంతవరకు నీకు జ్ఞానాన్ని భోదించడం జరిగింది. ఇక ఈ బుద్ధి యోగాన్ని గురించి వినుము. పార్ధుడా; ఈ జ్ఞానం తోడూ ఉంటే కర్మ బంధాన్ని ఛేదిస్తావు.
నేహాభిక్రమనాశోऽస్తి. . .
[మార్చు]ఇందులో ఆరంభం నిష్ఫలం కావడం కానీ విపరీత ఫలితాలు కానీ ఉండవు. ఈ ధర్మం ఏకొంచం ఆచరించినా భయం నుండి రక్షిస్తుంది.
వ్యవసాయాత్మికా . . .
[మార్చు]కురునందనా! ఇక్కడ నిశ్చయంతో కూడిన బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా ఉంటుంది. నిశ్చయం లేనివారికి బుద్ధులు అనేక శాఖలుగా చీలి అసంఖ్యాకంగా ఉంటాయి.
యామిమాం పుష్పితాం. . .
[మార్చు]అర్జునా; అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు స్వర్గం కంటే వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.
కామాత్మానః స్వర్గపరా. . .
[మార్చు]కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవి, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైస్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.
భోగైశ్వర్యప్రసక్తానాం. . .
[మార్చు]భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్ఛయ జ్ఞానం ఏర్పడదు
త్రైగుణ్యవిషయా వేదా. . .
[మార్చు]అర్జునా! వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి నీవు వాటికి అతీతుడైనై, సుఖదుఃఖాది ద్వందాలని వదిలి, నిత్యముశుద్ధ సత్వములో నిలిచి, యోగక్షేమాలను నర్జించి(వదిలి), ఆత్మజ్ఞానివి కా.
యావానర్థ ఉదపానే. . .
[మార్చు]అంతటా జలం పొంగుతున్నప్పుడు జలకాల శాల ఉపయోగం ఎంతవరకో అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.
కర్మణ్యేవాధికారస్తే. . .
[మార్చు]కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు.
యోగస్థః కురు కర్మాణి. . .
[మార్చు]ధనంజయా! యోగంలో నిలిచి, సంగం వదిలి, కర్మఫలితాలు సిద్ధించడం, సిద్ధించకపోవడం ఈ రెంటినీ సమంగా భావించి కర్మలు చెయ్యి. ఆ సమత్వమే యోగమని చెప్పబడుతుంది.
దూరేణ హ్యవరం కర్మ. . .
[మార్చు]ధనంజయా! సమత్వ బుద్ధితో కూడిన కర్మ కంటే కామ్యకర్మ చాలా అల్ప మైనది. కాబట్టి ఆసమ బుద్ధిని ఆశ్రయించు. కర్మఫలానికి కారకులయ్యేవారు పిసిని గొట్టులు.
బుద్ధియుక్తో జహాతీహ. . .
[మార్చు]సమబుద్ధితో కూడిన వ్యక్తి ఈ జన్మలోనే పుణ్య పాపాలని రెంటినీ వదులుతాడు. అందుచేత నీవు యోగంకోసం ప్రయత్నించు. యోగమంటే కర్మలలో కౌశలమే.
కర్మజం బుద్ధియుక్తా హి. . .
[మార్చు]సమబుద్ధితో కర్మనుండి జనించే ఫలితమునందు ఆసక్తి త్యజించే వివేకులు జన్మబంధం నుండి పూర్తిగా విముక్తులై దుఃఖరహితమైన పదాన్ని చేరుకుంటారు.
యదా తే మోహకలిలం. . .
[మార్చు]ఎప్పుడు నీబుద్ధి మోహమనే బురదని అధిగమిస్తుందో, అప్పుడు వినదగిన, వినిన విషయాలనుండి విముక్తుడివి అవుతావు.
శ్రుతివిప్రతిపన్నా తే . . .
[మార్చు]విన్నవాటితో వేసారిపోయిన నీబుద్ధి సమాధిలో నిశ్చలంగా నిలిచి ఉన్నప్పుడు నీవు యోగాన్ని పొందుతావు.
స్థితప్రజ్ఞస్య కా భాషా. . .
[మార్చు]అర్జునుడు ఇలా అడిగాడు: కేశవా సమాధి కలిగిన స్తితప్రజ్ఞుడి లక్షణం ఏమిటి? స్థిరబుద్ధి కలిగినవాడు ఎలా మాట్లాడుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుచుకుంటాడు?
ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ. . .
[మార్చు]భగవానుడు ఇలా బదులిచ్చాడు: అర్జునా! మనస్సులోని అన్ని కోరికలని ఎప్పుడు విసర్జిస్తాడొ, ఎప్పుడు తనలో తాను తుస్టిని(ఆత్మానందాన్ని) పొందుతాడో, అప్పుడు స్తితప్రజ్ఞుడు అనిపించుకుంటాడుఇక్కడమనస్సు ఆలోచనలకు తావులేదు. స్థితి అయిన సమాధి స్థితిలో ఆలోచనలు వుండవు; స్పృహ వుండదు; మనస్సు నిశ్చలమై వుంటుంది; సమయం తెలియదు. ఇక్కడే సత్యాన్ని లేదా సత్య-స్థితిని పొందవచ్చు,మనస్సు ఆలోచనల స్థితిని దాటినప్పుడే బ్రహ్మo సత్యం తెలుస్తుంది ఈ సమాధి స్థితిలోకి వెళ్ళిన తరువాతే సత్యాన్ని తెలుసుకోవటం జరుగవచ్చుసమాధి స్థితి సత్యాన్ని గురించి ఎవరూ, ఎవరికీ బోధించలేరు.మనస్సు నిశ్చలంగా, స్థిరంగా మనస్సునిలుకడ తెలియర గురువు అనుగ్రహంవల్ల సూక్ష్మత తత్త్వాన్ని… సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని ..గురువు ద్వారానే అతి సులభముగా పొందగలం.
దుఃఖేష్వనుద్విగ్నమనాః. . .
[మార్చు]ధుఃఖాలలో ఉద్వేగం పొందనివాడు, సుఖాలకోసం తహతహ పడనివాడు, రాగ భయ, క్రోదాలని విడిచినవాడు మననశీలుడు, స్థితప్రజ్ఞుడు అనిపించుకుంటాడు.
యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య. . .
[మార్చు]ఎక్కడా దేనికీ తగుల్కోకుండా, శుభాశుభాలను పొందినప్పుడు ఆనందించక, ద్వేషించక నిలిచివుంటాడో అతడి ప్రజ్ఞ స్థిరమైనది.
యదా సంహరతే చాయం. . .
[మార్చు]తాబేలు తన అంగాలను ఉప సంహరించు కున్నట్లుగా, ఇతడు తన ఇంద్రియాలను విషయ వస్తువులనుండి ఎప్పుడు ఉప సంహరించు కుంటాడో అప్పుడు అప్పుడు ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది.
విషయా వినివర్తన్తే. . .
[మార్చు]కోరికలను విడిచిపెట్టిన పురుషుడి నుండి విషయ వస్తువులు దూరంగా పోతాయి. కాని, వాటిపైన అభిరుచి అలాగే ఉంటుంది. పరమాత్మ దర్శనంతో ఆ అభిరుచి కూడా పోతుంది.
యతతో హ్యపి కౌన్తేయ. . .
[మార్చు]అర్జునా! పండితుడి ఇంద్రియాలు కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ క్షోభ పెడుతూ మనస్సును విషయాల మీదికి లాగి వేస్తాయి కదా;
తాని సర్వాణి సంయమ్య. . .
[మార్చు]వాటినన్నింటిని బాగా నిగ్రహించి, యుక్తుడై నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో అతడి ప్రజ్ఞే నిలకడగా ఉంటుంది.
ధ్యాయతో విషయాన్పుంసః. . .
[మార్చు]విషయధ్యానం చేసే పురుషుడికి వాటితో సంగమం ఏర్పడుతుంది. సంగమం వలన కామము, కామం వలన క్రోధం జనిస్తాయి.
క్రోధాద్భవతి సంమోహః . . .
[మార్చు]క్రోధం వలన విభ్రాంతి కలగుతుంది. విభ్రాంతితో మతిమరపు, దానితో బుద్ధి నాశనం కలిగి, బుద్ధి నాశనంతో వ్యక్తి సర్వనాశనం అవుతాడు.
రాగద్వేషవియుక్తైస్తు . . .
[మార్చు]రాగద్వేషాలనుండి విడివడి, స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలతో, స్వాధీనమైన మనస్సుతో విషయ వస్తువులలో సంచరించే మానవుడు ప్రశాంతతని పొందుతాడు.
ప్రసాదే సర్వదుఃఖానాం. . .
[మార్చు]మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతడికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. ప్రసన్నచిత్తుడికి బుద్ధి త్వరలో పూర్తిగా స్థిరత్వం చెందుతుంది.
నాస్తి బుద్ధిరయుక్తస్య న. . .
[మార్చు]నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు. యుక్తుడుకానివానికి ధ్యానం కూడా కుదరదు. ధ్యానం లేనివాడికి శాంతి లేదు. శాంతి లేనివాడికి సుఖమెక్కడ?
ఇన్ద్రియాణాం హి చరతాం. . .
[మార్చు]ఏమనస్సు సంచరించే ఇంద్రియాలకు లోబడి వాటిననుసరిస్తుందో, అది నీటిలో పడవని గాలి లాగివేసినట్లు పురుషుని ప్రజ్ఞని లాగి వేస్తుంది.
తస్మాద్యస్య మహాబాహో. . .
[మార్చు]అందు వలన ఓ మహానుభావుడా! ఎవరి ఇంద్రియాలు విషయ వస్తువుల నుండి అన్ని విధాలుగా నిగ్రహింపబడి ఉంటాయో, అతడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది.
యా నిశా సర్వభూతానాం. . .
[మార్చు]అందరికి ఏది రాత్రియో, సంపూర్ణ నిగ్రహ వంతుడైన మహాత్ముడు ఆ స్థితిలో మేల్కొని ఉంటాడు. ఏ స్థితిలో ప్రాణులు ప్రాణులు మేల్కొని ఉంటారో జ్ఞాని అయిన మునికి అది రాత్రి.
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం. . .
[మార్చు]పరిపూర్ణంగా స్థిరంగా నిలిచి ఉండే సముద్రాన్ని నీళ్ళు ఎలాచేరుకుంటాయో, ఎవరిలోకి అన్ని కోరికలు ప్రవేశించి విలీనమౌతాయో,అతడే శాంతిని పొందుతాడు. కోరికలకు దాసుడైనవాడు పొందలేడు.
విహాయ కామాన్యః సర్వాన్
[మార్చు]అన్ని కోరికలను వదిలి, అహంకార మమకారాలు వీడి సంచరించే పురుషుడు శాంతిని పొందుతాడు.
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ
[మార్చు]ఆర్జునా ఇదే బ్రాహ్మీస్థితి, దీనిని పొందాక ఇక భ్రమించడు. ఇందులో చివరి సమయంవరకు నిలిస్తే బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు.
భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |