Jump to content

కర్మసన్యాస యోగము

వికీసోర్స్ నుండి


భగవద్గీత - తెలుగు అనువాదము (కర్మసన్యాస యోగము)సంన్యాసం కర్మణాం కృష్ణ[మార్చు]

అర్జునుడు ఇలా అడిగాడు: - ఓ కృష్ణా ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపుము.

సంన్యాసః కర్మయోగశ్చ[మార్చు]

శ్రీ కృష్ణుడన్నాడు: - కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళతాయి. ఐతే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది.

జ్ఞేయః స నిత్యసంన్యాసీ[మార్చు]

ఎవరైతే ద్వేషించకుండా, కాంక్షించకుండా ఉంటారో, అతడే నిత్యసన్యాసీ అని తెలుసుకో. ఓ మహాబాహూ! ద్వందాలు లేనివాడే బంధాలనుండి తేలికగా విడుదల పొందుతాడు.

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః[మార్చు]

పసివారు (అజ్ఞానులు) మాత్రమే సాంఖ్యమూ, యోగమూ వేరు వేరు అని అంటారు. విద్వాంసులు అనరు. ఎవరైతే ఒకదానిలో సరిగా నిలబడ్డారో అతడికి రెండింటి ఫలం దొరుకుతుంది.

యత్సాంఖ్యైః ప్రాప్యతే[మార్చు]

సాంఖ్యులచేత ఏస్థానం పొందబడుతుందో, ఆస్థానమే యోగులుచేత పొందబడుతుంది. సాంఖ్య యోగాన్ని ఒకటిగా ఎవరు చూస్తున్నారో వాళ్ళే నిజమైన దృష్టి కలిగిన వారు.

సంన్యాసస్తు మహాబాహో[మార్చు]

ఓ మహాబాహో! కర్మయోగం చెయ్యని వాళ్ళకు కర్మసన్యాసాన్ని సాధించడం కష్టం. కర్మ యోగంతో కూడిన మానవుడు త్వరలోనే తేలికగా బ్రహ్మమును చేరుకుంటాడు.

యోగయుక్తో విశుద్ధాత్మా[మార్చు]

కర్మ యోగంతో కూడుకుని, విశుద్ధం ఐన బుద్ధితో మనస్సు, ఇంద్రియాలను జయించి, అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్న వాడు కర్మలను చేసినా బంధంలో చిక్కుకోడు.

నైవ కించిత్కరోమీతి[మార్చు]

పరమసత్యాన్ని ఎరిగిన యోగయుక్తుడు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృసిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకుంటున్నఫ్ఫుడు, ఊపిరి పీలుస్తున్నప్పుడు

ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి[మార్చు]

మాట్లాడుతున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు. కనురెప్పలు తెరుస్తూ మూస్తున్నప్పుడు ఇంద్రియాలు విషయాలలో సంచరిస్తున్నాయని తాను ఏమీ చేయడం లేదనీ భావిస్తాడు.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి[మార్చు]

ఎవరైతే కర్మలను బ్రహ్మముకు అర్పించి, సంగభావాన్ని వదిలి పనిచేస్తారో, అట్టివాడు నీటిలో ఉన్న తామరాకు ఎలా నీటివలన తాకబడదో అలాగే పాపం చేత తాకబడడు.

కాయేన మనసా బుద్ధ్యా[మార్చు]

యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం సంగభావాన్ని వదిలి కేవలం శరీర, మనో, బుద్ధి. ఇంద్రియాలతో మాత్రమే కర్మలు చేస్తారు.

యుక్తః కర్మఫలం త్యక్త్వా[మార్చు]

యోగయుక్తుడైన వాడు కర్మఫలాన్ని వదిలి పెట్టి శాశ్వత మైన శాంతిని పొందుతాడు. యోగికానివాడు కోరికల కారణంగా కర్మఫలానికి అతుక్కు పోయి బంధింప బడతాడు.

సర్వకర్మాణి మనసా[మార్చు]

మానసికంగా అన్ని కర్మల్ను సన్యసించి, పూర్తిగా తనను తాను స్వాధీనంలో ఉంచుకున్న దేహధారి, తొమ్మిది ద్వారాల పురంలో తాను ఏమీ చేయకుండా, ఎవరిచేత చేయించ కుండా సుఖంగా ఉంటాడు.

న కర్తృత్వం న కర్మాణి[మార్చు]

భగవంతుడు కర్తృత్వాన్ని గానీ, కర్మలని గానీ సృజించడం లేదు. కర్మ ఫలంతో సంయోగాన్ని ఆయన చేయడు. ప్రకృతే ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంది.

నాదత్తే కస్యచిత్పాపం[మార్చు]

భగవంతుడు పాపాలను కాని, పుణ్యాలని కాని స్వీకరించడు. జ్ఞానం అజ్ఞానంచేత కప్పబడుతుంది. అందుచేత ప్రాణులు భ్రాంతులౌతారు.

జ్ఞానేన తు తదజ్ఞానం[మార్చు]

ఎవరిలో ఐతే సమగ్రమైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం చేయబడినదో వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యునివలె ప్రకాశింప బడుతుంది.

తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః[మార్చు]

ఆత్మలోనే బుద్ధిని నిలిపి, ఆత్మభావంతో మనసు నింపి, ఆత్మనే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని అత్మాభ్యాసం చేసేవాళ్ళు పాపములు నశింప బడిన వారై తిరిగిరాని స్థితి ని పొందుతారు.

విద్యావినయసంపన్నే[మార్చు]

మహాత్ములు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణుడిలో, గోవులో, ఏనుగులో, కుక్కలో, కుక్కమాంసాన్ని వండుకుని తినే చంఢాలునిలో కూడా పండితులు సమాన తత్వాన్నే చూస్తారు.

ఇహైవ తైర్జితః సర్గో[మార్చు]

ఎవరి మనస్సు సామ్యస్థితిలో నిలిచి ఉంటుందో, వారు ఈ శరీరంలో ఉండగానే సంసారాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మము అన్నింటా సమంగా ఉన్నందున వాళ్ళు కూడా బ్రహ్మమంలోనే నిలిచి ఉంటారు.

న ప్రహృష్యేత్ప్రియం[మార్చు]

స్థిరమైన బుద్ధితో, బ్రాంతి రహితుడై బ్రహ్మతత్వంలోనిలిచి ఉన్న బ్రహ్మజ్ఞాని ప్రియమైనది లభించినపుడు సంతోషించడు అప్రియమైనది లభించినప్పుడు ఉద్వేగాన్ని పొందడు.

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా[మార్చు]

బాహ్య స్పర్శలో తగుల్కోనివాడు, ఆత్మలో ఉండే సుఖాన్ని పొందుతాడు. బ్రహ్మతత్వానుసంధానంలో నిలిచిన ఆ యోగి అనంతమైన ఆనందాన్ని పొందుతాడు.

యే హి సంస్పర్శజా భోగా[మార్చు]

కుంతీకుమారా! బాహ్య విషయ స్పర్శలవల్ల జనించేభోగాలన్నీ దుఃఖాలకు మూలమే. ఆది, అంతములతో కూడుకున్న ఆ క్షణిక సుఖాలలో వివేకవంతుడు రమించడు.

శక్నోతీహైవ యః సోఢుం[మార్చు]

ఏవరైతే ఈ శరీరం ఉండగానే కామక్రోధాల నుండి పుట్టిన ప్రేరణలని తట్టుకోవడానికి సమర్ధుడౌతాడొ, అతడే యోగి, అతడే సుఖవంతుడు ఔతాడు.

యోऽన్తఃసుఖోऽన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ యః[మార్చు]

ఎవరైతే తనలోనే సుఖాన్ని పొందుతూ, తనలో తాను ఆనందిస్తూ తనలో నే జ్ఞాన జ్యోతిని నిలుపుకున్న యోగి బ్రహ్మ స్వరూపుడై మోక్షాన్ని పొందుతాడు.

లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః[మార్చు]

కల్మషాలు నశించి, భేదభావం తొలగిపోయి, మనస్సుని నిగ్రహించి, అన్ని ప్రాణుల హితాన్ని కోరే ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు

కామక్రోధవియుక్తానాం యతీనాం[మార్చు]

కామక్రోధాలనుండి విడిపడి, మనస్సును జయించి, ఆత్మ స్వరూపాన్ని ఎరిగిన యతులకు బ్రహ్మ నిర్వాణస్థితి అంతటా ఉంటుంది.

స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే[మార్చు]

బాహ్యస్పర్శలన్నీ అరికట్టి, దృష్టిని భ్రకుటి మీద నిలిపి , నాసికలో సంచరించేప్రాణాపాలనుసమానం చేసి

యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయ[మార్చు]

ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, మోక్షమే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకుని కోరికలను, భయమును, కోపాన్ని వదిలిన ఋషి ఎప్పుడూ ముక్తుడే.

భోక్తారం యజ్ఞతపసాం[మార్చు]

యజ్ఞాలకు తపస్సులకి భోక్తగా, అన్ని లోకాలకు ప్రభువుగా, అన్ని ప్రాణుల హితం కోరేవాడిగా నన్ను తెలుసుకున్న వాడు శాశ్విత శాంతి పొందుతాడు.భగవద్గీత - తెలుగు అనువాదము
భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము