గుణత్రయవిభాగ యోగము
భగవద్గీత - తెలుగు అనువాదము (గుణత్రయవిభాగ యోగము) | సంస్కృత శ్లోకములు→ |
పరం భూయః ప్రవక్ష్యామి
[మార్చు]శ్రీభగవానుడిట్లనియెను: సర్వ మునీశ్వరులును ఏ ఙ్ఞానమునెరుంగుట చేత సర్వోత్కృష్ఠమైన చిదానంద స్వరూప సిద్ధిని పొందిరో అట్టి అనంతమైన ఙ్ఞానములన్నిటిలో నుత్తమమైన చిదాకాశఙ్ఞానమును మరల చెప్పుచున్నాను.
ఇదం జ్ఞానముపాశ్రిత్య
[మార్చు]ఈ ఙ్ఞానమును పొంది నాలో నేకమై శోభిల్లువారు సృష్టికాలమున జన్మించరు. ప్రళయ కాలమున దు:ఖ పడరు. అనగా మృతినొందరు.
మమ యోనిర్మహద్బ్రహ్మ
[మార్చు]ఓ అర్జునా! మహద్బ్రహ్మయని చెప్పబడు నామూల ప్రకృతి యోనియందు నేను చైతన్య బీజ రూపమున జీవుని ఉంచుచున్నాను. అందువలన సర్వ భూతముల ఉత్పత్తి కలుగుచున్నది.
సర్వయోనిషు కౌన్తేయ
[మార్చు]ఓ కౌంతేయా! దేవమానవ పశు పక్ష్యాది సకల యోనులందు పుట్టు దేహములన్నింటికిని, మహద్బ్రహ్మయగు మూల ప్రకృతి తల్లి యనియు, పరమేశ్వరుడనైన నేను అందు బీజమునుంచు తండ్రిననియు తెలియుము.
సత్త్వం రజస్తమ
[మార్చు]ఓ అర్జునా! ప్రకృతివలన బుట్టిన సత్త్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములును నాశరహితుడైన గగనాత్మను అనగా దేహిని నశించు దేహదృష్టిలోనే బంధించుచున్నది.
తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్
[మార్చు]పాపరహితుడవగు ఓ అర్జునా! సత్త్వరజస్తమోగుణములలో మొదటిదగు సత్త్వగుణము నిర్మలమైనదగుటచేతను ప్రకాశింపజేయునదై, ఆరోగ్యకరమైనదై, ప్రపంచసుఖములలో సంగమము కలిగించుటచేతను, శాస్త్రఙ్ఞానములో ఆశక్తిని, తృప్తిని కలిగించుటచేతను అంతవరకే ఉంచి బంధించుచున్నది.
రజో రాగాత్మకం విద్ధి
[మార్చు]ఓ అర్జునా! రజోగుణము ఆశాపాశముచే కలిగి ధనాది లోకవిషయములయెడ రాగము కలుగజేయునని ఎరుంగుము. అందుచే రజోగుణము దేహమందున్న ఆత్మను ఐహిక సుఖములందాసక్తిని కలిగించి వాటికై అనేక కర్మలను చేయించి బంధించుచున్నది.
తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం
[మార్చు]హే భారతా! తమోగుణమన్నచో అఙ్ఞానముచే జనించిన దానినిగ నెరుంగుము. అది సర్వజీవులకు మోహమును, భ్రమను కలిగించి, అజాగ్రత్త, సోమరితనము, అతినిద్ర అనువానిచె ఆత్మను బంధించుచున్నది.
సత్త్వం సుఖే సంజయతి
[మార్చు]ఓ అర్జునా! సత్త్వగుణము శాంతిసుఖములను కలిగించుచున్నది. రజోగుణము భోగములకై బాహ్య కర్మాడంబరములను కలిగించుచున్నది. తమోగుణమన్నచో మంచిపనిని చేయించక చెడును చేయించి ప్రమాదమును కలిగించుచున్నది.
రజస్తమశ్చాభిభూయ
[మార్చు]హే భారతా! సత్త్వగుణము రజస్తమోగుణముల కంటే శక్తితోనున్నపుడు వాటిని అణచి ఙ్ఞానసుఖాదులను కలిగించును. అట్లే రజోగుణము సత్త్వతమస్సులకంటే బలముగనున్నపుడు వాటిని అణచి అనేక కర్మలయందు ఆశక్తిని కలిగించును. అట్లే తమోగుణము సత్త్వరజోగుణములకంటే అధికముగ నున్నపుడు ఙ్ఞాన శూన్యతతో ప్రమాదములను కలిగించును.
సర్వద్వారేషు దేహేऽస్మిన్ప్రకాశ
[మార్చు]ఈ దేహమందున్న సర్వేంద్రియములద్వారా విఙ్ఞాన ప్రకాశమే ప్రసరించుచున్నప్పుడు సత్త్వగుణము బాగా వృద్ధి చెంది శోభిల్లిచున్నదని తెలియవలెను.
లోభః ప్రవృత్తిరారమ్భః
[మార్చు]ఓ అర్జునా! రజోగుణము వృద్ధిలోనున్నపుదు లోభత్వము, కామ్యకర్మల నారంభించి వాటిలో మునిగి వర్తించుట, ఇంద్రియనిగ్రహము, మనశ్శాంతిలేకుండుట, మిక్కుటమైన ఆశ మొదలైనవి కలుగుచున్నవి.
అప్రకాశోऽప్రవృత్తిశ్చ ప్రమాదో
[మార్చు]హే కురునందనా! తమోగుణము వృద్ధిలో నున్నపుడు బుద్ధిమాంద్యము, అఙ్ఞాన భ్రమతో కూడిన ప్రమాదములు కలుగుచున్నవి.
యదా సత్త్వే ప్రవృద్ధే తు
[మార్చు]దేహధారియగు జీవుడెపుడు సత్త్వగుణము అభివృద్ధిలో నుండగా మరణించునో, అపుడు ఉత్తమ ఙ్ఞానులు పొందెడు నిర్మలమైన లోకములను పొందుచున్నాడు.
రజసి ప్రలయం గత్వా
[మార్చు]రజోగుణము అభివృద్ధిలో నున్నపుడు మరణించినచో కామ్య కర్మాశక్తులగు మనుష్యుల కుటుంబములందు తిరిగి జన్మించుచున్నాడు. తమోగుణము అభివృద్ధిలోనున్నపుడు మృతినొందినచో ఙ్ఞానహీనులైన మూఢుల వంశమునందుగానీ, పశుపక్ష్యాదులలోగానీ పుట్టుచున్నాడు.
కర్మణః సుకృతస్యాహుః
[మార్చు]సాత్త్వికములైన మంచి కర్మలను చేయుటచే నిర్మల శాంతిసుఖములే ఫలమనియు, రజోకర్మలను చేయుటచే సాంసారిక సుఖదు:ఖములే ఫలమనియు, తామసి కర్మలచే అఙ్ఞానమే ఫలమనియు తత్వవేత్తలు చెప్పిరి.
సత్త్వాత్సంజాయతే జ్ఞానం
[మార్చు]సత్త్వగుణమువలన వివేకముతో కూడిన ఙ్ఞానము కలుగుచున్నది. రజోగుణమువలన తరగని ఆశయను లోభము జనించుచున్నది. తమోగుణముచే అఙ్ఞాన ప్రమాదములు కలుగుచున్నవి.
ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా
[మార్చు]సత్వగుణమందున్నవారు స్వర్గాది ఊర్ధ్వలోకములను పొందుచున్నారు. రజోగుణము కలవారు మధ్యమమగు మనుష్యలోకమును పొందుచున్నారు. నీచగుణవృత్తులు గల తమోగుణము కలవారు అధోలోకమును అనగా మనుష్యులలో హీనులుగాగానీ పశుపక్ష్యాదులుగగానీ జన్మించుచున్నారు.
నాన్యం గుణేభ్యః కర్తారం
[మార్చు]ఎవడు సర్వకర్మలను ప్రేరేపించి చేయునది త్రిగుణాత్మిక ప్రకృతితప్ప అన్యమెవరూ కాదనియు, తానీప్రకృతికంటె వేరైన గగనాత్మ స్వరూపునిగ నెపుడు తెలియునో అపుడు వాడు నా అనంత చిదాకాశ విశ్వగర్భస్వరూపమునే పొందుచున్నాదు.
గుణానేతానతీత్య త్రీన్దేహీ
[మార్చు]దేహోత్పత్తికి కారణభూతములైన ఈ త్రిగుణముల నతిక్రమించి జీవుడు జనన మరణ వార్ధక్య దు:ఖములనుండి విముక్తుడై జననమరణములులేని అమృత చిదాకాశ దైవస్వరూపమును పొంది శాశ్వతముగ శోభిల్లుచున్నాడు.
కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతానతీతో
[మార్చు]అర్జునుడిట్లనియెను: హే ప్రభో! సత్త్వరజస్తమోగుణములను మూడింటిని అతిక్రమించినవాడు ఏ లక్షణములతో నుండును? వాని వర్తన ఎట్లుండును? ఈ త్రిగుణములను వాడెట్లు అతిక్రమించుచున్నాడు?
ప్రకాశం చ ప్రవృత్తిం చ
[మార్చు]శ్రీ భగవానుడిట్లనియెను: హే పాండవా! సంప్రాప్తములైన సత్త్వగుణ సంబంధమగు ప్రకాశమును, రజోగుణ సంబంధమగు కర్మప్రవృత్తిని, తమోగుణ సంబంధమగు మోహమును ఎవడు ద్వేషింపడో, ఇవి విడిచిపోయినచో వీటిని తిరిగి కోరడో అట్టివాడు త్రిగుణాతీతుడగును.
ఉదాసీనవదాసీనో గుణైర్యో
[మార్చు]ఎవడు ప్రకృతిగుణములే ప్రవర్తించుచున్నవని తెలిసి, ఉదాసీనుడై ఉండి, త్రిగుణములచే చలింపక చిదాకాశ స్వరూపస్థితిలో సదా విలసిల్లుచుండునో వాడే త్రిగుణాతీతుడు.
సమదుఃఖసుఖః స్వస్థః
[మార్చు]సమ దు:ఖ. . . అనంత చిదాకాశ స్వరూపమందు స్థిరుడై, సుఖదు:ఖములందు సమముగనుండి, మట్టిని, రాతిని, బంగారమును సమముగ జూచుచు, ఇష్టానిష్ట వస్తుప్రాప్తితో సమచిత్తమునే కలిగి దూషణభూషణములందు చలింపక, ధీరుడై ఎవడు విలసిల్లునో వాడే త్రిగుణాతీతుడు.
మానాపమానయోస్తుల్యస్తుల్యో
[మార్చు]మానావమానములందు సమచిత్తముతోనుండి, శత్రుమిత్రులందు సముడై సర్వ కర్మలను పరిత్యజించి ఎవడు సర్వదా చిదాకాశ దైవప్రఙ్ఞతో ప్రకాశించుచుండునో వాడే త్రిగుణాతీతుడని చెప్పబడుచున్నాడు.
మాం చ యోऽవ్యభిచారేణ
[మార్చు]ఎవడు అచంచలమైన భక్తియోగముతో నన్నే సేవించుచున్నాడో వాడే ఈ త్రిగుణములను సులభముగ నతిక్రమించి బ్రహ్మాకాశ విశ్వగర్భస్వరూపమును పొందుటకఱుడగుచున్నాడు.
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య
[మార్చు]బ్రహ్మణో. . . అవ్యయమైన, అమృతమైన, శాశ్వతమైన, ధర్మ స్వరూపమైన, అఖండానంద స్వరూపమైన బ్రహ్మస్వరూపమునకు ఉనికిపట్టుగ మూలాధార్ముగ నున్నది నేనే కదా.
భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |