విశ్వరూపసందర్శన యోగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


భగవద్గీత - తెలుగు అనువాదము (విశ్వరూపసందర్శన యోగము)
మదనుగ్రహాయ పరమం[మార్చు]

అర్జునుడిట్లనియె: నన్ను అనుగ్రహించుటకై కరుణతో నీచేత చెప్పబడిన పరమ రహస్యమైన అధ్యాత్మఙ్ఞానముచే నా అఙ్ఞాన మోహమంతా మాయమైపోయినది.

భవాప్యయౌ హి భూతానాం[మార్చు]

హే కృష్ణా! సర్వభూతముల సృష్టి, స్థితి, లయ రహస్యమును గూర్చి నీ శాశ్వతమయిన అవ్యయమైన మహా మహిమను గూర్చి నీవు చెప్పగా నేను సవిస్తారముగా వింటిని.

ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం[మార్చు]

ఓ పరమేశ్వరా! నీ మహాద్భుత విశ్వరూప మహిమను గూర్చి నీవు చెప్పినదంతయు పరమ సత్యమే. ఓ పురుషోత్తమా! అపార ఙ్ఞాన శక్తి తేజములతో కూడిన మహా ఘనమైన నీ అనంత ఐశ్వర్య రూపమును ప్రత్యక్షముగ దర్శించగోరుచున్నాను.

మన్యసే యది తచ్ఛక్యం[మార్చు]

హే యోగేశ్వర ప్రభో! నీ ఘన విశ్వరూపం నాచేత చూడశక్యమైనదని నీవు తలంచుచో అట్టి నాశరహితమైన నీ దివ్య రూపమును నాకు చూపుము.

పశ్య మే పార్థ రూపాణి[మార్చు]

ఓ పార్థా! అసంఖ్యాకములైన, అనేక విధములుగనున్న, అనేక వర్ణములు కలిగిన, అనేకాకృతులలోనున్న నా దివ్య రూపమును చూడుము.

పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ[మార్చు]

ఓ అర్జునా! ద్వాదశాదిత్యులను, అష్ట వసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వనీ దేవతలను, సప్త మరుత్తులను నాలో చూడుము. మరియు మహాశ్చర్యమును కలిగించే పూర్వమెప్పుడూ ఎవ్వని చేత చూడబడని అనేక అద్భుతములను నాలో నిపుడుగాంచుము.

ఇహైకస్థం జగత్కృత్స్నం[మార్చు]

ఓ అర్జునా! నాదేహమందే చరాచర ప్రపంచమునెల్లను ఒకే చోటనున్నట్లు ఇక్కడే ఇప్పుడే చూడుము. మరియు నీవు చూడగోరినదెల్ల నాలోనే చూడుము.

న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ[మార్చు]

నీ స్థూల దృష్టితో నా అనంత స్వరూప మహిమను చూడలేవు. కనుక దివ్యదృష్టి నీకిచ్చుచున్నాను. ఈ ఙ్ఞాన దృష్టితో అపారమైన నా విశ్వరూప వైభవమును గాంచుము.

ఏవముక్త్వా తతో[మార్చు]

సంజయుడిట్లనియెను: ఓ ధృతరాష్ట్ర మహారాజా! మహా యోగీశ్వరుడైన భగవానుడిట్లు చెప్పిన పిమ్మట సర్వోత్తమమైన ఐశ్వర్యరూపమైన తన మహిమాన్విత విశ్వరూపమును పార్థునకు చూపెను.

అనేకవక్త్రనయనమనేకాద్భుతదర్శనమ్[మార్చు]

అనేక వక్త్రములతో, అనేక నేత్రములతో, అనేక అద్భుత దర్శనములతో, అనేక దివ్యాభరణములతో, దివ్యాయుధములతో భగవానుని ఘన దివ్యరూపము శోభిల్లుచుండెను.

దివ్యమాల్యామ్బరధరం[మార్చు]

దివ్యములైన పుష్పమాలికలను, దివ్యములైన వస్త్రములను ధరించి, దివ్య సుగంధ చందనాదుల పూతలతో నిండి, పరమాశ్చర్యకరమై, మహాకాంతివంతమై, అనంతమై, విశ్వతోముఖమై భగవానుని అద్భుత విశ్వరూపము విలసిల్లుచుండెను.

దివి సూర్యసహస్రస్య[మార్చు]

ఆకాశమున ఒక్కతూరి హఠాత్తుగా సహస్ర సూర్యులు ప్రకాశించినచో ఎంతటి చూడశక్యముకాని కాంతిసలుగునో అంతటి అపారకాంతికి ఈ భగవానుని కాంతి సమానమగును.

తత్రైకస్థం జగత్కృత్స్నం[మార్చు]

అపుడు అర్జునుడు దేవదేవుడగు భగవానుని శరీరములోనే అనేక విధములుగా విభజింపబడిన సర్వ ప్రపంచమును ఒకేచోటనున్న దానినిగా చూచెను.

తతః స విస్మయావిష్టో[మార్చు]

పిమ్మట ధనంజయుడు విస్మయముతో పులకాంకితదేహుడై భగవానునికి సాష్టాంగ ప్రణామము చేసి అంజలి బద్ధుడై ఇట్లనెను.

పశ్యామి దేవాంస్తవ[మార్చు]

అర్జునుడు పలికెను: ఓ దేవాదిదేవా! నీ విరాట్-రూపమునందు సకల దేవతలను, నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను.

అనేకబాహూదరవక్త్రనేత్రం[మార్చు]

ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను.

కిరీటినం గదినం చక్రిణం చ[మార్చు]

హే విష్ణో! కిరీటమును, గదను, చక్రమును ధరించి, అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్నివలెను, జ్యోతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నిరీక్ష్యమై యున్నది.

త్వమక్షరం పరమం[మార్చు]

పరమ - అక్షరస్వరూపుడవైన పరబ్రహ్మపరమాత్మవు నీవే, కనుక అందరికిని తెలుసుకొనదగినవాడవు. ఈజగత్తునకు నీవే పరమాశ్రయుడవు. సనాతన ధర్మరక్షకుడవు. నీవు అవ్యయుడవు. అని నా విశ్వాసము.

అనాదిమధ్యాన్తమనన్తవీర్య-[మార్చు]

నీవు ఆదిమధ్యాంతరహితుడవు. అపరిమితశక్తిశాలివి. అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు. అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్తమొనర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను.

ద్యావాపృథివ్యోరిదమన్తరం హి[మార్చు]

ఓ మహాత్మా! దివినుండి భువివఱకుగల అంతరిక్షమునందతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై యున్నావు. అధ్బుతమైన నీ భయంకరరూపమును చూచి ముల్లోకములును గడగడలాడుచున్నవి.

అమీ హి త్వాం సురసంఘా[మార్చు]

ఇదిగో, ఆదేవతలెల్లరును నీలో ప్రవేశించుచున్నారు. కొందఱు భయపడినవారై అంజలి ఘటించి, నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులును, సిధ్దులును స్వస్తివచనములతోడను, ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు.

రుద్రాదిత్యా వసవో[మార్చు]

ఏకాదశరుద్రులును, ద్వాదశాదిత్యులును, అష్టవసువులును, సాధ్యులును, విశ్వేదేవతలును, అశ్వినీకుమారులును, మరుద్గణములును, పితరులును అట్లే గంధర్వయక్షాసురసిద్దసముదాయములును నిన్నే దర్శించుచున్నారు.

రూపం మహత్తే బహువక్త్రనేత్రం[మార్చు]

ఓ మహాబాహో! అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమునుచూచి, అందఱును భయకంపితులగుచున్నారు. నేనుకూడ భయముతో వణికిపోవుచున్నాను.

నభఃస్పృశం దీప్తమనేకవర్ణం[మార్చు]

ఏలనన హే విష్ణో! నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అదే అనేకవర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ముచున్న విశాలనేత్రములతో, విస్తరించినముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా దైర్యము సడలినది. శాంతి దూరమైనది.

దంష్ట్రాకరాలాని చ తే[మార్చు]

ఓ జగన్నివాసా! కరాళదంష్ట్రలతో (భయంకరమైన కోరలతో) ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్నిజ్వాలలవలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కుతోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్ము.

అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః[మార్చు]

ఇదిగో! (ఇచ్చట చేరియున్న) ఈ ధృతరాష్ట్రపుత్రులు (దుర్యోధనాదులు) ఇతర రాజన్యులతోసహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధానయోధులు అందఱును.

వక్త్రాణి తే త్వరమాణా విశన్తి[మార్చు]

భయంకరములైన కోరలతోగూడిన నీ ముఖములయందు అతివేగముగా పరుగులుదీయుచు ప్రవేశించుచున్నారు. కొందఱి తలలు కోరల మద్యబడి నుగ్గునుగ్గైపోవుచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు.

యథా నదీనాం బహవోఽమ్బువేగాః[మార్చు]

అనేకములైన నదీనదములప్రవాహములన్నియును సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు, ఈ శ్రేష్ఠులైన సమరయోధులు (నరలోకవీరులు) కూడ జ్వలించుచున్న నీ ముఖములయందు ప్రవేశించుచున్నారు.

యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా[మార్చు]

మిడుతలన్నియు మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతివేగముగా పరుగెత్తి, తమ నాశనముకొఱకు అందు ప్రవేశించి, నశించునట్లు ఈ వీరులందఱును తమనాశమునకై అతివేగముగా పరుగెత్తి, నీ వక్త్రములయందు ప్రవేశించుచున్నారు.

లేలిహ్యసే గ్రసమానః సమన్తా-[మార్చు]

హే విష్ణో! ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను అన్నివైపులనుంచి కబళించుచు మాటిమాటికిని చప్పరించుచున్నావు. నీ ఉగ్రతేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి.

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో[మార్చు]

ఓ పరమాత్మా! నీకు నా నమస్కారములు - ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆదిపురుషుడవైన నిన్ను విశదముగా తెలిసికొనగోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎఱుంగలేకున్నాను.

కాలోఽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో[మార్చు]

శ్రీ భగవానుడు పలికెను : నేను లోకములన్నింటిని తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనుకొనియున్నాను. కనుక నీవు యుద్దముచేయకున్ననూ ప్రతిపక్షముననున్న ఈ వీరులెవ్వరును మిగులరు (మిగిలియుండరు).

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ[మార్చు]

కనుక ఓ సవ్యసాచీ! లెమ్ము, కీర్తిగాంచుము. శత్రువులను జయించి సర్వసంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందఱును నాచేత మునుపే హతులైనవారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము.

ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ[మార్చు]

ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ (సైంధవ) కర్ణాది యుద్దవీరులందఱిని నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్దము చేయుము.

ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య[మార్చు]

సంజయుడు పలికెను: ఓ రాజా! శ్రీ కృష్ణపరమాత్మయొక్క ఈ మాటలను విని, అర్జునుడు వణకుచు, చేతులు జోడించి నమస్కరించెను. మఱల మిక్కిలి భయముతో ప్రణమిల్లి, గద్గదస్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను.

స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా[మార్చు]

అర్జునుడు పలికెను: ఓ అంతర్యామి! కేశవా! నీనామగుణప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్దగణములవారెల్లరును ప్రణమిల్లుచున్నారు.

కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్[మార్చు]

ఓమహాత్మా! నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్తయైన బ్రహ్మకే మూలకారకుడవు - కనుక వారు (సిద్దాదులందఱును) నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంతా! ఓ దేవేశా! ఓ జగన్నివాసా! సత్-అసత్లు నీవే. వాటికంటెను పరమైన అక్షరస్వరూపుడవు అనగా సచ్చిదానందఘనపరబ్రహ్మవు నీవే.

త్వమాదిదేవః పురుషః పురాణ[మార్చు]

ఓ అనంతరూపా! నీవు ఆదిదేవుడవు, సనాతనపురుషుడవు, ఈజగత్తునకు పరమాశ్రయుడవు. సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమైయున్నది.

వాయుర్యమోఽగ్నిర్వరుణః శశాఙ్కః[మార్చు]

నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వేలకొలది నమస్కారములు. మఱల మఱల నమస్కారములు. ఇంకను నమస్కారములు.

నమః పురస్తాదథ పృష్ఠతస్తే[మార్చు]

అనంతసామర్థ్యముగలవాడా! నీకు ఎదురుగా ఉండియు, వెనుకనుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మా! నీకు అన్నివైపులనుండియు నమస్కారములు. ఏలనన అనంతపరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించియున్నవాడవు. అన్ని రూపములును నీవియే.

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం[మార్చు]

నీ మహిమను ఎఱుగక నిన్ను నా సఖునిగా భావించి, చనువుచేగాని, పొరబాటువలనగాని, ఓ కృష్ణా! ఓ యాదవా! ఓ మిత్రా! అనుచు తొందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను సంబోధించి ఉంటిని.

యచ్చావహాసార్థమసత్కృతోఽసి[మార్చు]

ఓ అచ్యుతా! విహారశయ్యాసనభోజనాది సమయములయందు ఏకాంతమునగాని, అన్యసఖుల సమక్షమునగాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపఱచి యుండవచ్చును. ఓ అప్రమేయస్వరూపా! నా అపరాధములనన్నింటిని క్షమింపుమని వేడుకొనుచున్నాను.

పితాసి లోకస్య చరాచరస్య[మార్చు]

ఓ అనుపమప్రభావా! ఈ సమస్త చరాచరజగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు. గురుడవు. సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకములయందును నీతో సమానుడెవ్వడును లేడు. ఇంక నీకంటె అధికుడెట్లుండును?

తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ[మార్చు]

కనుక ఓ ప్రభూ! నాశరీరమును నీపాదములకడనిడి, సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు ఐన నీవు నాయందు ప్రసన్నుడవగుటకై నిన్ను ప్రార్ధించుచున్నాను. దేవా! కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును, నా అపరాధములను నీవు క్షమింపుము.

అదృష్టపూర్వం హృషితోఽస్మి[మార్చు]

మునుపు ఎన్నడును చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమును గాంచి, మిక్కిలి సంతసించితిని. కాని భయముచే నామనస్సు కలవరపాటు పొందినది. కనుక చతుర్భుజయుక్తుడవై విష్ణురూపముతోడనే నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశా! జగన్నివాసా! ప్రసన్నుడవు కమ్ము.

కిరీటినం గదినం చక్రహస్త[మార్చు]

కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహూ! విరాడ్రూపా! నీ చతుర్భుజరూపమును నాకు చూపుము.

మయా ప్రసన్నేన[మార్చు]

శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా! నీపైగల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్-రూపమును ప్రదర్శించితిని. అది మిక్కిలి తేజోమయమైనది. అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు మఱి యెవ్వరును చూచియుండలేదు.

న వేదయజ్ఞాధ్యయనైర్న[మార్చు]

ఓ అర్జునా! వేదాధ్యయనములచేగాని, యజ్ఞాచరణములచేగాని, దానములచేగాని, తీవ్రతపశ్చర్యలచేగాని, తదితరపుణ్యకర్మలచేగాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకుదప్ప మఱియెవ్వరికిని చూడశక్యముగాదు.

మా తే వ్యథా మా చ[మార్చు]

ఈ విధమైన ఈ భయంకరరూపమును చూచి, నీవు ఎట్టి వ్యథకును,మోహమునకును గురికావలదు. భయమును వీడి ప్రసన్నచిత్తుడవై శంఖచక్ర గదాపద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజరూపమును మరల చూడుము.

ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా[మార్చు]

సంజయుడు పలికెను: వాసుదేవుడు ఈ విధముగా పలికి, అర్జునునకు తన చతుర్భుజరూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణపరమాత్మ సౌమ్యమూర్తియైన తన కృష్ణరూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను.

దృష్ట్వేదం మానుషం రూపం[మార్చు]

అర్జునుడు పలికెను: ఓ జనార్దనా! మీ అతిసౌమ్యమైన మానవాకృతిని (శ్యామసుందరరూపమును) చూచి, ఇప్పుడు నా మనస్సు కుదుటపడినది. నేను నా స్వాభావిక (సహజ)స్థితిని పొందితిని.

సుదుర్దర్శమిదం రూపం[మార్చు]

శ్రీ భగవానుడు పలికెను: నీవు చూచిన నా ఈ చతుర్భుజరూపముయొక్క దర్శనభాగ్యము అన్యులకు అత్యంతదుర్లభము. దేవతలుసైతము ఈ రూపమును దర్శించుటకు సదా ఉవ్విళ్ళూరుచుందురు.

నాహం వేదైర్న తపసా[మార్చు]

నీవు గాంచిన నా చతుర్భుజరూపమును దర్శించుటకు వేదపఠనములచేగాని, తపశ్చర్యలచేగాని, దానములచేగాని, యజ్ఞకర్మలచేగాని శక్యము కాదు.

భక్త్యా త్వనన్యయా శక్య[మార్చు]

ఓ పరంతపా! అర్జునా! ఇట్టి నా చతుర్భుజరూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావస్థితినందుటకును కేవలము అనన్య భక్తిద్వారా మాత్రమే సాధ్యమగును.

మత్కర్మకృన్మత్పరమో[మార్చు]

అర్జునా! కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలుగలవాడును, ప్రాపంచిక విషయములయందు ఆసక్తిలేనివాడును, ఏప్రాణియందును ఏమాత్రము వైరభావము లేనివాడును ఐన అనన్య (పరమ) భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు.


భగవద్గీత - తెలుగు అనువాదము
భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము