Jump to content

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

వికీసోర్స్ నుండి


భగవద్గీత - తెలుగు అనువాదము (క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము)
ప్రకృతిం పురుషంచైవ[మార్చు]

అర్జునుడిట్లనియెను: హే కేశవా! ప్రకృతియననేమి? పురుషుడెవ్వడు? క్షేత్రమనగానేమి? క్షేత్రజ్ఞుడెవ్వడు? జ్ఞానమనగానేమి? జ్ఞేయస్వరూపమెట్టిది? వీటిని గూర్చి తెలియగోరుచున్నాను.

ఇదం శరీరం కౌన్తేయ[మార్చు]

శ్రీ భగవానుడిట్లనియెను: ఓ అర్జునా! ఈ దేహము క్షేత్రమని చెప్పబడుచున్నది. ఈ క్షేత్ర ధర్మము నెవడెరుంగునో వానిని క్షేత్రజ్ఞుడని ఈ విషయమును తెలిసినవారు చెప్పుదురు.

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి[మార్చు]

మరియు ఓ అర్జునా! సర్వదేహములందుండెడి క్షేత్రజ్ఞుడైన జీవుని నన్నుగా ఎరుగుము. ఇట్లు క్షేత్రక్షేత్రజ్ఞులగూర్చి తెలిసికొనెడి జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా మతము.

తత్క్షేత్రం యచ్చ యాదృక్చ[మార్చు]

ఆ క్షేత్రమేదియో, ఎటువంటిదో, ఎట్టి వికారము కలదియో, దేనివలన బుట్టినదో, ఆ క్షేత్రజ్ఞుడెవ్వడో, ఎట్టి ప్రభావము గలవాడో ఆ సంగతిని సంగ్రహముగా నాద్వారా వినుము.

ఋషిభిర్బహుధా గీతం[మార్చు]

ఈ క్షేత్రక్షేత్రజ్ఞ విషయము మహర్షుల చేత అనేక విధాలుగా వివరింపబడినది. పెక్కు శాఖలు కలిగిన వేదాలలో ఇది పలు విధములుగా విభజించి నిరూపించబడినది. బ్రహ్మసూత్ర పదాలు దీనిని గురించి హేతు బద్ధంగా నిశ్చయించి చెప్పాయి.

మహాభూతాన్యహంకారో[మార్చు]

మహాభూతాలు(ఐదు)అహంకారము, బుద్ధి, అవ్యక్తము(అష్టవిధ ప్రకృతి), ఇంద్రియాలు పది, మనస్సు, ఇంద్రియ గోచరవిషయాలు ఐదూ(మొత్తం 24క్షేత్రాలు)

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం[మార్చు]

ఇచ్చ, ద్వేషం, సుఖఅం, దుఃఖం, శరీరం, చేతనత్వం, పట్టుదల ఇవి వికారాలతో కూడిన క్షేత్రం అని సంగ్రహంగా చెప్పడమైంది.

అమానిత్వమదమ్భిత్వమహింసా[మార్చు]

తనని తాను పొగడక పోవడం, ఢంభము లేకుండా ఉండడమూ, అహింసా, ఓర్పూ, నిజాయితీ, గురు శుశ్రూష, శుచిత్వమూ, స్తిరత్వమూ, ఆత్మనిగ్రహమూ.

ఇన్ద్రియార్థేషు వైరాగ్యమనహంకార[మార్చు]

ఇంద్రియ విషయాలలో వైరాగ్యమూ అహంకారము లేకపోవడము , పుట్టుకలో, చావులో, ముసలితనంలో, రోగంలో, దుఃఖాన్ని, దోషాన్ని నిత్యమూ చూడటమూ,

అసక్తిరనభిష్వఙ్గః[మార్చు]

ఆసక్త భావము లేకపోవడము, పుత్రులు-భార్య గృహము మొదలైన వాటితోతాధాత్మ్యము చెందక పోవడము, ఇష్టాలు ప్రాప్తించినా, ఇష్టం కానిది ప్రాప్తించినా మనస్సుని సమస్థితిలో ఉంచుకోవడమూ,

మయి చానన్యయోగేన[మార్చు]

ఇంకా, నాలోఅనన్య యోగంతో ఉండే వ్యభిచరించని భక్తీ, ఏకాంతంలో గడపడమూ, జనసమర్ధంలో అభిరుచి లేకపోవడమూ,

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం[మార్చు]

19.నిత్యమూ ఆధ్యాత్మ జ్ఞానము ఉండడమూ, 20.తత్వ జ్ఞానము యొక్క లక్ష్యాన్ని దర్శించడము జ్ఞానమని చెప్పబడింది. దానికి భిన్నమైనది అంతా అజ్ఞానము.

జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి[మార్చు]

దేనిని తెలుసుకోవడము వలన జీవుడు అమృతత్వాన్ని పొందుతాడో ఆ జ్ఞేయ వస్తువుని గురించి చెబుతాను. అది లేనిది పరబ్రహ్మము. అది సత్తు కాదని, అసత్తు కాదని చెప్పబడుతుంది.

సర్వతః పాణిపాదం[మార్చు]

దానికి అంతటా చేతులు, కాళ్ళూ, కళ్ళు, తలలూ, నోళ్ళు, చెవులు ఉండి, అది లోకంలో సర్వాన్ని ఆవరించి ఉంటుంది.

సర్వేన్ద్రియగుణాభాసం[మార్చు]

అపర బ్రహ్మము ఇంద్రియాల లక్షణాల ద్వారా ప్రకాశించేది, ఏ ఇంద్రియాలు తనలో లేనిది, దేనిని అంటకుండానే అన్నింటినీ భరించేది, గుణ హీనమైనా కూడా గుణాలను భోగించేది.

బహిరన్తశ్చ భూతానామచరం[మార్చు]

అది(జ్ఞేయము)జీవుళ్ళకు బయటా, లోపలా ఉండేది, కదిలేది కదలనిది కూడా ఐనా, సూక్ష్మము ఐనందువలన తెలియబడదు. (అవిద్వాంసులకు)దూరంగానూ, విద్వాంసులకు దగ్గరగాను ఉన్నది.

అవిభక్తం చ భూతేషు[మార్చు]

ఆ పరబ్రహ్మము విభాగములు లేనిదైనా, జీవుళ్ళలో విభజింపబడి నట్లుగానూ, జీవులను భరించేది, సృష్టి సంహారాలను చేసేదిగా తెలియాలి.

జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః[మార్చు]

వెలుగలకు వెలుగది. (అజ్ఞానమనే)చీకటికి ఆవల ఉన్నదని చెప్పబడుతుంది. అదే జ్ఞానమూ, జ్ఞేయమూ, జ్ఞాన గమ్యమూ అందరి హృదయాలలో సిద్ధించి ఉన్నది.

ఇతి క్షేత్రం తథా జ్ఞానం[మార్చు]

క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం సంగ్రహంగా చెప్పబడినాయి. నా భక్తుడు దీనిని తెలుసుకొని నాభావాన్ని(మోక్షాన్ని) పొందుతాడు.

ప్రకృతిం పురుషం చైవ[మార్చు]

ప్రకృతి పురుషులిద్దరూ అనాది అని తెలుసుకో. వికారాలూ, గుణాలూ ప్రకృతి నుండి పుట్టాయని తెలుసుకో.

కార్యకరణకర్తృత్వే[మార్చు]

కార్యకార్యాల తయారీకి ప్రకృతి కారణము అని చెప్పబడుతుంది. సుఖదుఃఖాల అనుభవాలకు కర్త పురుషుడని చెప్పబడతాడు.

పురుషః ప్రకృతిస్థో హి[మార్చు]

ప్రకృతిలో నిలిచిన పురుషుడు ఆ ప్రకృతి నుండి పుట్టిన గుణాలను అనుభవిస్తాడు. గుణాలతో అతడి సంయోగమే అతడు మంచీ, చెడు జన్మలెత్తడానికి కారణము.

ఉపద్రష్టానుమన్తా చ భర్తా[మార్చు]

ఈ శరీరంలో పరమ పురుషుడు సాక్షి అనీ, అనుమతించేవాడనీ, భరించేవాడనీ, భోగించేవాడనీ, మహేశ్వరుడనీ పరమాత్మ అనీ చెప్పబడుతున్నాడు.

య ఏవం వేత్తి పురుషం[మార్చు]

పూర్వము చెప్పిన విధంగా పురుషుణ్ణీ, గుణాలతో సహా ప్రకృతినీ ఎవరు తెలుసుకుంటారో, అతడు ఎలా ప్రవర్తించినా తిరిగి పుట్టడు.

ధ్యానేనాత్మని పశ్యన్తి[మార్చు]

కొందరు ధ్యానము ద్వారా తమలోనే తమ ఆత్మని ఆత్మ ద్వారా చూస్తారు. కొందరు జ్ఞాన యోగము ద్వారాను, మరి కొందరు కర్మ యోగము ద్వారాను ఆత్మను చూస్తారు.

అన్యే త్వేవమజానన్తః[మార్చు]

ఈ ప్రకారంగా తెలుసుకోలేని వారు కూడా అన్యుల ద్వారా విని, అలా విన్న దానిపై గురి ఉంచిన వారు కూడా సంసారాన్ని తప్పక తరిస్తారు.

యావత్సంజాయతే[మార్చు]

భరతశ్రేష్టుడా ! స్థావర జంగమ రూపమగు ప్రాణికోటి ఏదైతే ఉందో అది క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలననే పుడుతుందని తెలుసుకో.

సమం సర్వేషు భూతేషు[మార్చు]

నశించిపోయే వాటిలో నశించని తత్వముగా, అన్ని భూతాలలో సమంగా ఉన్నపరమేశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, నిజమైన దృష్టి కలవాడు.

సమం పశ్యన్హి సర్వత్ర[మార్చు]

సర్వత్ర సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, తనని తాను హింసించుకోనివాడు. అతడు దానివలన పరమ గతిని చేరుకుంటాడు.

ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని[మార్చు]

అన్ని విధాలైన కర్మలు ప్రకృతివలననే జరుగుతున్నాయని, ఆత్మ ఏమీ చెయ్యదనీ తెలిసినవాడే నిజమైన చూపు కలవాడు.

యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి[మార్చు]

ఎప్పుడైతే(మానవుడు)వేరు వేరుగా కనిపించే ప్రాణికోటి ఏకత్వము మీద ఆధారపడి ఉన్నదని, అక్కడినుండే విస్తరించిందని నిరంతరము చూడగలుగుతాడో అప్పుడు బ్రహ్మాన్ని పొందుతాడు.

అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః[మార్చు]

ఆది లేని వాడు నిర్గుణుడు కనుక, ఈ పరమాత్మ అవ్యయుడు. కౌంతేయా! శరీరంలో ఉన్నా అతడు కర్మ చెయ్యడు. ఆ కర్మ ఫలంతో మలినపడడు.

యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం[మార్చు]

ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మ తత్వం వలన దేనిచేతా అంటబడదో, అలాగే దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటబడదు.

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం[మార్చు]

ఓ భారతా! ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ యావత్తు లోకాన్ని ప్రకాశింప చేస్తాడో, అలాగే ఈ యావత్తు క్షేత్రాన్ని క్షేత్రధారి ఒక్కడే ప్రశింప చేస్తాడు.

క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం[మార్చు]

ఈ ప్రకారంగా క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని, భూత ప్రకృతి నుండి మోక్షం పొందే పద్ధతిని జ్ఞాన దృష్టితో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పరమ పదాన్ని చేరుకుంటారు.భగవద్గీత - తెలుగు అనువాదము
భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము