మోక్షసన్యాస యోగము
భగవద్గీత - తెలుగు అనువాదము (మోక్షసన్యాస యోగము) | సంస్కృత శ్లోకములు→ |
సన్యాసస్య మహాబాహో
[మార్చు]అర్జునుడన్నాడు:ఓ హృషీకేశా! కేశి సంహారా! సన్యాసం యొక్క తత్వాన్ని వేరువేరుగా తెలుసుకోవాలని కోరుతున్నాను.
కామ్యానాం కర్మణాం
[మార్చు]శ్రీ భగవానుడన్నాడు :కామ్య కర్మలని వదిలి పెట్టడం సన్యాసమని ఋషులంటారు. అన్ని కర్మల ఫలాన్ని త్యజించడం త్యాగమని వివేకులు అంటారు.
త్యాజ్యం దోషవదిత్యేకే
[మార్చు]దోషం కల కర్మలని వదలాలని కొందరు పండితులంటారు. యజ్ఞ దాన తపః కర్మలని వదలరాదని కొందరు అంటారు.
నిశ్చయం శృణు మే
[మార్చు]భరత శ్రేష్టుడా! ఈ విషయంలో నా నిర్ణయాన్ని విను. పురుష వ్యాఘ్రమా! త్యాగం మూడు విధాలని చెప్ప బడుతుంది.
యజ్ఞదానతపఃకర్మ
[మార్చు]యజ్ఞ దాన తపః కర్మలను మానరాదు. చేయవలసినదే. వివేకులను శుద్ధం చేసేది యజ్ఞ దాన తపస్సులే.
ఏతాన్యపి తు కర్మాణి
[మార్చు]అర్జునా! ఈ కర్మలను కూడా సంగాన్ని, ఫలాన్ని వదిలి చెయ్యాలని నా నిశ్చితమైన ఉత్తమమైన అభిప్రాయం.
నియతస్య తు సంన్యాసః
[మార్చు]నియత కర్మలను సన్యసించకూడదు. భ్రాంతితో వానిని సన్యసించడం తామసిక త్యాగం అనిపించుకుంటుంది.
దుఃఖమిత్యేవ యత్కర్మ
[మార్చు]శరీరానికి కష్టం కలుగుతుందనే భయంతోనూ, బాధాకరమని కర్మని వదిలేస్తే అది రాజసిక త్యాగం అవుతుంది. దానివలన త్యాగఫలం లభించదు.
కార్యమిత్యేవ యత్కర్మ
[మార్చు]కర్తవ్య బుద్ధితో సంగభావం, ఫలాపేక్ష వదిలి నియత కర్మని చేసినపుడు అది సాత్విక త్యాగం అవుతుందని నా అభిప్రాయం.
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే
[మార్చు]సత్వగుణంతో నిండిన మేధావి సంశయ రహితుడై ప్రతికూల కర్మని ద్వేషించడు.
న హి దేహభృతా శక్యం
[మార్చు]దేహధారికి కర్మలన్నింటిని త్యజించడం సాధ్యం కాదు. కర్మ ఫలాన్ని త్యజించిన వాడే త్యాగి అనిపించుకుంటాడు.
అనిష్టమిష్టం మిశ్రం
[మార్చు]కర్మ ఫలం దుష్టమైనవి, మంచివి, మిశ్రమమైనవి అని మూడు విధాలైన కర్మ ఫలాలు త్యాగులు కాని వారికి మరనణానంతరం లనభిస్తాయి. అవి సన్యాసులకి కొంచం కూడా రాదు.
పఞ్చైతాని మహాబాహో
[మార్చు]ఓ మహానుభావా సాంఖ్య సిద్ధాంతంలో ఏ కర్మలైనా సరే సిద్ధించడానికి ఈఅయిదు కారణాలు కావాలని చెప్ప బడినాయి. వాటిని గురించి విను.
అధిష్ఠానం తథా కర్తా
[మార్చు]అధిష్టానమైన శరీరం, కర్మ చేసే వాడు, వేర్వేరు ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రారబ్ధం ఈ అయిదూ(సర్వ కర్మ సిద్ధికి కారణాలు)
శరీరవాఙ్మనోభిర్యత్కర్మ
[మార్చు]మంచిది కాని, చెడ్డది కాని మానవుడు మనో వాక్కాయములతో ఏ కర్మ చేసినా దానికి ఈ అయిదు కారణమౌతాయి
తత్రైవం సతి కర్తారమాత్మానం
[మార్చు]విషయం ఇలా ఉండగా, అపరిపక్వమైన బుద్ధితో కేవలం తానే కర్తననుకునే మూర్ఖుడు తెలివి తక్కువ తనం వలన సరిగా గ్రహించడు.
యస్య నాహంకృతో భావో
[మార్చు]ఎవరిలో అహంకారం లేదో, ఎవరి బుద్ధి కర్మలో తగుల్కోదో, అతడు ఈ లోకులను చంపినా, చంపినవాడు కాదు. బంధనంలో చిక్కుకోడు.
జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా
[మార్చు]జ్ఞానమూ, తెలుసుకోవలసిన విషయమూ, తెలుసుకునే వాడూ, ఈ మూడూ కర్మని ప్రేరేపించేవి. ఇంద్రియం, కర్మ, కర్మ చేసినవాడు, ఈ మూడూ కర్మని నిర్వహించేవి.
జ్ఞానం కర్మ చ కర్తా చ
[మార్చు]జ్ఞానం, కర్మ, కర్త-ఈ మూడూ గుణ భేధాలని బట్టి మూడేసి విధాలని, గుణాలకు సంబంధించిన సౌఖ్యంలో చెప్పబడినది. అందులో ఉన్నదానిని విను.
సర్వభూతేషు యేనైకం
[మార్చు]అన్ని ప్రాణులలోనూ నాశనం లేని ఒకే సత్తు ఉన్నదనీ, భిన్నమైన వాటిలో అది అవిభక్తంగా ఉన్నదనీ గ్రహించేది సాత్విక జ్ఞానమని తెలుసుకో.
పృథక్త్వేన తు యజ్జ్ఞానం
[మార్చు]వేరు వేరు కనబడే రూపాలలో వేరువేరు జీవుళ్ళు ఉన్నారని గ్రహించేది రాజసిక జ్ఞానమని తెలుసుకో.
యత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే
[మార్చు]ఒక వస్తువే సర్వమూ అని, యుక్తికి విరుద్ధంగా, అసంబద్ధంగా, అల్పత్వంతో పట్టుకు కూర్చునేది తామసిక జ్ఞానమని అనబడుతుంది.
నియతం సఙ్గరహితమరాగద్వేషతః
[మార్చు]సంగభావం లేక, ఫలం మీద ఆశ లేక, రాగ ద్వేషాలు లేక చేసిన నిత్య కర్మ సాత్విక కర్మ.
యత్తు కామేప్సునా కర్మ
[మార్చు]కోరికతో అహంకారంతో బహు శ్రమతో చేసే కర్మ రాజసిక కర్మ.
అనుబన్ధం క్షయం
[మార్చు]బంధనంలో ఇరికించేది, నాశనాన్ని హింసని కలుగచేసేది శక్తి సామర్ధ్యాలు లెక్కించకుండా చేసేది, మోహంతో ఆరంభించబడినదీ అయిన కర్మ తామసిక కర్మ అని చెప్ప బడుతుంది.
ముక్తసఙ్గోఽనహంవాదీ
[మార్చు]సంగభావం నుండి ముక్తుడైన వాడు, అహంకారం లేని వాడు, పట్టుదల ఉత్సాహం ఉన్నవాడు, జయాపజయాల వలన చలించని వాడు అయిన కర్త సాత్వికుడని చెప్పబడతాడు.
రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో
[మార్చు]రాగంతో కూడి ఫలం కోరుతూ, పిసినిగొట్టు తనమూ, హింసా స్వభావం కలిగి, అశుచి అయి, సుఖదుఃఖాలకు లోనయ్యే కర్త --రాజసికుడని చెప్ప బడుతుంది.
అయుక్తః ప్రాకృతః
[మార్చు]ఎలాటి నిగ్రహం లేని వాడు, పామరుడు, సంకుచిత స్వభావం కలవాడు, మొండివాడు, మోసగాడు బద్ధకస్తుడు, విషాదంలో ఉండి ప్రతి దానికి కాలయాపన చేసే కర్త, తామసికుడని చెప్ప బడతాడు.
బుద్ధేర్భేదం ధృతేశ్చైవ
[మార్చు]ధనంజయా! గుణాలనిబట్టి మూడేసి విధాలుగా ఉండే బుద్ధినీ, ధృతినీ గురించి వేరువేరుగా, పూర్తిగా చెబుతాను విను.
ప్రవృత్తిం చ నివృత్తిం
[మార్చు]అర్జునా! ప్రవృత్తి-నివృత్తులు, కార్యాకార్యాలు, భయాభయాలు, బంధ మోక్షాలు---వీటిని వివరంగా చెబుతాను విను.
యయా ధర్మమధర్మం
[మార్చు]పార్ధా! ధర్మాధర్మాలని, కార్యాకార్యాలని సరిగా నిర్ణయించ లేని బుద్ధి రాజసికమైనది.
అధర్మం ధర్మమితి
[మార్చు]అజ్ఞానంతో కప్పబడి అధర్మాన్ని ధర్మంగా, అన్ని విషయాలను విపరీతంగా ఎంచే బుద్ధి తామసిక మైనది.
ధృత్యా యయా ధారయతే
[మార్చు]చలించని యోగంలో మనస్సు, ప్రాణ, ఇంద్రియాల చేష్టలను నిగ్రహించి ఉంచే ధృతి సాత్విక మైనది.
యయా తు ధర్మకామార్థాన్ధృత్యా
[మార్చు]అర్జునా! ఏ పట్టుదల ధర్మ కామార్ధాలనే లౌకిక పురుషార్ధాలని మమకారంతో, ఫలాశతో నిలబెట్టి ఉంచుతుందో అది రాజసిక ధృతి.
యయా స్వప్నం భయం
[మార్చు]పార్ధా! మూర్ఖుడు ఏ ధృతితో స్వప్నాలనీ, భయాన్నీ, శోకాన్నీ, విషాదాన్నీ, మదాన్నీ వదలకుండా పట్టుకుంటాడో అది తామసికము అయిన పట్టుదల.
సుఖం త్విదానీం త్రివిధం
[మార్చు]భరతశ్రేష్టుడా! అభ్యాసం వలన దేనిలో మానవుడు దుఃఖాన్ని అంతమొందించి సుఖపడ కలుగుతాడో ఆ మూడు విధాలైన సుఖాలని గురించి విను.
యత్తదగ్రే విషమివ
[మార్చు]ఏ సుఖమైతే మొదట విషంగా తోచి, చివరకు ఏది అమృతమౌతుందో, ఏది శాంతించిన బుద్ధి వలన లభిస్తుందో అది సాత్విక సుఖం.
విషయేన్ద్రియ సంయోగాద్యత్తదగ్రేఽమృతోపమమ్
[మార్చు]విషయాలు ఇంద్రియాలు సంయోగం వలన మొదట అమృతప్రాయంగా ఉండి, చివరికి విషంలా తయారయ్యేది రాజసిక సుఖం.
బ్రాహ్మణక్షత్రియవిశాం
[మార్చు]పరంతపా! బ్రాహ్మణ , క్షత్రియ, వైశ్య, శూద్రుల కర్మలు వాళ్ళ స్వభావం నుండి జనించిన లక్షణలను బట్టి విభజింప పడినాయి.
యదగ్రే చానుబన్ధే చ సుఖం
[మార్చు]నిద్ర, బద్ధకం, ఏమరుపాటుల నుండి జనించి ముందు నుండి చివరకు భ్రాంతిలో పడేసి ఉంచే సుఖం తామసికం.
న తదస్తి పృథివ్యాం
[మార్చు]భూమిపైనగాని, స్వర్గంలోని దేవతలలో కాని ప్రకృతి వలన పుట్టిన ఈ మూడు గుణాల నుండి విడిపడి ఉన్నప్రాణి ఏదీ లేదు.
శమో దమస్తపః శౌచం
[మార్చు]శమము, దమము, తపస్సు, శౌచము, ఓర్మి, ఋజుత్వము, జ్ఞాన విజ్ఞానాలు, ఆస్థిక భావము---ఇవి బ్రాహ్మణులకు స్వభావ సిద్ధమైన కర్మలు.
శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం
[మార్చు]శౌర్యం, తేజం, పట్టుదల, సమర్ధత, యుద్ధంలో వెన్ను చూపక పోవడం, దానగుణం, ఈశ్వర లక్షణం---ఇవి స్వభావ సిద్ధమైన క్షత్రియ కర్మలు.
కృషిగౌరక్ష్యవాణిజ్యం
[మార్చు]వ్యవసాయం, గోసంరక్షణ, వాణిజ్యం స్వభావ సిద్ధమైన వైశ్య కర్మలు. పరిచర్య భావంతో కూడినవి శూద్రులకు స్వభావ సిద్ధమైన కర్మలు.
స్వే స్వే కర్మణ్యభిరతః
[మార్చు]తన తన కర్మలలోనిమజ్ఞుడైన మానవుడు , తన కర్మలో నిరతుడైన వాడు సిద్ధిని ఎలా పొందుతాడో చెబుతాను విను.
యతః ప్రవృత్తిర్భూతానాం
[మార్చు]ఎవరినుండి జీవుళ్ళు పుట్టుకొస్తారో, ఎవరి వలన ఇది యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆయన్ని తన కర్మ చేత ఆరాధించే మానవుడు సిద్ధిని పొందుతాడు.
శ్రేయాన్స్వధర్మో విగుణః
[మార్చు]బాగా అనుష్టించిన పరధర్మంకన్నా, హీనమైన స్వధర్మం మేలు. స్వభావం చేత ప్రేరేపించబడిన కర్మని చేయడం వలన పాపాన్ని పొందడు. హీనమైన అనగా చెడు అని అర్తమా?
సహజం కర్మ కౌన్తేయ
[మార్చు]కౌంతేయా! సహజమైన కర్మ దోషంతో కూడినను వదలరాదు. పొగ చేత కప్పబడిన అగ్ని లాగా అన్ని కర్మలూ దోషంతోనే మొదలౌతాయి.
అసక్తబుద్ధిః సర్వత్ర
[మార్చు]సర్వత్రా దేనికీ తగుల్కొనని బుద్ధితో, మనస్సుని జయించి, కోరికలలు వదిలి సన్యసించడం ద్వారా కర్మల నుండి విడుదల పొందే ఉత్తమోత్తమమైన స్థితిని పొందుతాడు.
సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ
[మార్చు]నైష్కర్మ్య సిద్ధిని పొందిన వాడు బ్రహ్మ పదార్ధాన్ని ఎలా చేరుకుంటాడో క్లుపంగా చెబుతాను విను. అర్జునా ఇది పరమమైన జ్ఞానాభ్యాసం.
బుద్ధ్యా విశుద్ధ్యా యుక్తో
[మార్చు]విశుద్ధమైన బుద్ధితో కూడుకొని, పట్టుదలతో మనస్సుని నియమించి, శబ్ధాది విషయాలని త్యజించి, రాగద్వేషాలను వదిలి,
వివిక్తసేవీ లఘ్వాశీ
[మార్చు]ఏకాంత ప్రదేశంలో వసిస్తూ, ఆహారాన్ని స్వల్పంగా మాత్రమే స్వీకరిస్తూ, మనోవాక్కాయాలను నియత్రిస్తూ, నిత్యమూ ధ్యాన యోగంలో నిమజ్ఞుడై వైరాగ్యంలో నిలిచి,
అహంకారం బలం దర్పం
[మార్చు]అహంకారాన్ని, బల దర్పాన్ని, కామ క్రోధాలను, పరిగ్రహ బుద్ధిని వదిలి, మమకారాన్ని త్యజించి, శాంతుడై బ్రహ్మ స్వరూపుడు అవడానికి అర్హుడౌతాడు.
బ్రహ్మభూతః ప్రసన్నాత్మా
[మార్చు]బ్రహ్మ భూతుడై ప్రసన్న చిత్తుడైన వాడు దేనికీ శోకించడు. దేనినీ కోరడు. ప్రాణులందరి యందు సమభావం కలిగి నాయందు పరమ భక్తిని పొందుతాడు.
భక్త్యా మామభిజానాతి
[మార్చు]భక్తి ద్వారా నేనెవరినో, ఎలాంటి వాడినో నా పూర్తి తత్వాన్ని గుర్తెరుగుతాడు. నా తత్వాన్ని గ్రహించినందు వలన తరవాత నాలోనే ప్రవేసిస్తాడు.
సర్వకర్మాణ్యపి సదా
[మార్చు]అన్ని కర్మలను సదా చేస్తూనే, నన్ను శరణు పొందిన వాడు నా అనుగ్రహం వలన శాశ్వతమైన అవ్యయమైన పదాన్ని పొందుతాడు.
చేతసా సర్వకర్మాణి మయి
[మార్చు](అర్జునా)మానసికంగా కర్మలన్నింటినీ నాకు సమర్పించి నన్నే గమ్యంగా పెట్టుకొని జ్ఞాన యోగాన్ని ఆశ్రయించి నన్ను నీ చిత్తంలో నిలుపుకో.
మచ్చిత్తః సర్వదుర్గాణి
[మార్చు]మనస్సు నాలో ఉంచితే నా అనుగ్రహం వలన అన్ని అడ్డంకులనూ దాటుతావు. అహమ్కారం వలన వినక పోయావా నశిస్తావు.
యదహంకారమాశ్రిత్య
[మార్చు]అహంకారంతో యుద్ధం చేయనని నిర్ణయించుకున్నా, నీ యీ ప్రయత్నం దండుగ అవుతుంది. నీ స్వభావమే నిన్ను యుద్ధంలో నియోగిస్తుంది.
స్వభావజేన కౌన్తేయ
[మార్చు]అర్జునా! నీ స్వభావ సిద్ధమైన కర్మలకు నీవు బద్ధుడివి. భ్రంతి వలన కర్మ చేయడానికి ఇష్ట పడకపోయినా తప్పని సరిగా చేసి తీరుతావు.
ఈశ్వరః సర్వభూతానాం
[మార్చు]అర్జునా! ఈశ్వరుడు ప్రాణులందరి హృదయాలలోను కూర్చుని, యంత్రం ఉన్న(బొమ్మల వలె)జీవుళ్ళని మాయచేత త్రిప్పుతూ ఉన్నాడు.
తమేవ శరణం గచ్ఛ
[మార్చు]అన్ని విధాల ఆయన్నేశరణు పొందు. ఆయన అనుగ్రహం వలన పరమ శాంతిని శాశ్వతమైన స్థానాన్ని పొందుతావు.
ఇతి తే జ్ఞానమాఖ్యాతం
[మార్చు]ఈ వధంగా నీకు అతి రహస్యమైన జ్ఞానం చెప్పాను. దానిని క్షున్నంగా విమర్శించి తెలుసుకొని, నీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యి.
సర్వగుహ్యతమం భూయః
[మార్చు]అన్నిటికన్నా ఎక్కువైన రహస్యాన్ని మళ్ళీ నాపరమ వాక్కు ద్వారా విను. నాకు చాలా ఇష్టమైన వాడివని నీ హితంకోరి చెబుతున్నాను.
మన్మనా భవ మద్భక్తో
[మార్చు]మనస్సు నాలో ఉంచు, నా భక్తుడివికా నన్ను ఆరాధించు. నాకు నమస్కరించు నన్నే పొందుతావూ. ఇది సత్యం. నీవు నాకు ప్రియుడివి. నీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను.
సర్వధర్మాన్పరిత్యజ్య
[మార్చు]అన్ని ధర్మాలను పరిత్యజించి నన్ను మాత్రమే శరణూ పొందు. అన్ని పాపాలనుండి నీకు నేను మోక్షమిస్తాను. విచారించకు.
ఇదం తే నాతపస్కాయ
[మార్చు]ఈ జ్ఞానాన్ని తపస్సు చేయని వానికి, భక్తుడు కాని వానికి, నన్ను ద్వేషించే వానికీ , ఏ సందర్భంలోనూ చెప్ప కూడదు.
య ఇదం పరమం గుహ్యం
[మార్చు]పరమ రహస్యమైన ఈ జ్ఞానాన్ని నా భక్తులకు చెప్పిన వాడు , నాలో పరమమైన భక్తిని పొంది నన్నే చేరతాడు. ఇందులో అనుమానము లేదు.
న చ తస్మాన్మనుష్యేషు
[మార్చు]మనుష్యులందరిలో అతడికన్నా నాకు ప్రియమైన పని చేసేవాళ్ళు లేరు, అతడికన్నా నాకు బాగా ఇష్టులుండరు.
అధ్యేష్యతే చ య ఇమం
[మార్చు]ధార్మికమైన మన ఈ సంవాదాన్ని జ్ఞాన యజ్ఞంద్వారా ఎవరు అధ్యయనం చేస్తారో వారికి దాని వలన నేను ఇష్టుడిని ఔతాను.
శ్రద్ధావాననసూయశ్చ
[మార్చు]అసూయ లేకుండా శ్రద్ధతో (ఈ గీతను)వినినప్పటికీ ఆ మానవుడు ముక్తుడై పుణ్యాత్ములకు లభించే శుభలోకాలని పొందుతాడు.
కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ
[మార్చు]అర్జునా! నా ఈ మాతటలను(గీత)ఏకాగ్ర చిత్తంతో విన్నావా?ధనంజయా! నీ అజ్ఞానం నశించిందా.
నష్టో మోహః స్మృతిర్లబ్ధా
[మార్చు]అర్జునుడన్నాడు:అచ్యుతా! నీ అనుగ్రహం వలన నాకు మోహం నశించింది. స్మృతి లభించింది. సందేహాలు తీరాయి. నీవు చెప్పినట్లు చేస్తాను.
ఇత్యహం వాసుదేవస్య పార్థస్య
[మార్చు]సంజయుడు ఇలా పలికాడు:- ఇలా వాసుదేవునికీ, మహాత్ముడైన అర్జునుడికీ మధ్య, పులకరింతలు పుట్టించే విధంగా జరిగిన అద్భుతమైన సంవాదాన్ని నేను విన్నాను.
వ్యాసప్రసాదాచ్ఛ్రుతవానేతద్గుహ్యమహం
[మార్చు]పరమ రహస్యమైన ఈ యోగాన్ని, సాక్షాత్తు యోగేశ్వరుడైన కృష్ణుడే స్వయంగా చెబుతూ ఉండగా వ్యాస మహర్షి అనుగ్రహం వలన నేను వినగలిగాను.
రాజన్సంస్మృత్య సంస్మృత్య
[మార్చు]రాజా! కృష్ణార్జునుల ఈ అద్భుతమైన పవిత్రమైన సంవాదాన్ని తలచుకొని తలచుకొని క్షణ క్షణం ఆనందంతో పొంగిపోతున్నాను.
తచ్చ సంస్మృత్య సంస్మృత్య
[మార్చు]రాజా హరియొక్క ఆ అద్భుతమైన రూపాన్ని తలచుకొని తలచుకొని నాకు అమితమైన విస్మయం కలుగుతోంది. మళ్ళీమళ్ళీ ఆనందం కలుగుతుంది.
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర
[మార్చు]యోగేశ్వరుడైన కృష్ణుడూ ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ, సంపద, గొప్పతనం, విజయం, స్థిరమైన నీతి ఉంటాయని నానిశ్చయం.
భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |