క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

Wikisource నుండి


భగవద్గీత - తెలుగు అనువాదము (క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము)




[మార్చు] ప్రకృతిం పురుషంచైవ

అర్జునుడిట్లనియెను: హే కేశవా! ప్రకృతియననేమి? పురుషుడెవ్వడు? క్షేత్రమనగానేమి? క్షేత్రజ్ఞుడెవ్వడు? జ్ఞానమనగానేమి? జ్ఞేయస్వరూపమెట్టిది? వీటిని గూర్చి తెలియగోరుచున్నాను.

[మార్చు] ఇదం శరీరం కౌన్తేయ

శ్రీ భగవానుడిట్లనియెను: ఓ అర్జునా! ఈ దేహము క్షేత్రమని చెప్పబడుచున్నది. ఈ క్షేత్ర ధర్మము నెవడెరుంగునో వానిని క్షేత్రజ్ఞుడని ఈ విషయమును తెలిసినవారు చెప్పుదురు.

[మార్చు] క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి

మరియు ఓ అర్జునా! సర్వదేహములందుండెడి క్షేత్రజ్ఞుడైన జీవుని నన్నుగా ఎరుగుము. ఇట్లు క్షేత్రక్షేత్రజ్ఞులగూర్చి తెలిసికొనెడి జ్ఞానమే నిజమైన జ్ఞానమని నా మతము.

[మార్చు] తత్క్షేత్రం యచ్చ యాదృక్చ

ఆ క్షేత్రమేదియో, ఎటువంటిదో, ఎట్టి వికారము కలదియో, దేనివలన బుట్టినదో, ఆ క్షేత్రజ్ఞుడెవ్వడో, ఎట్టి ప్రభావము గలవాడో ఆ సంగతిని సంగ్రహముగా నాద్వారా వినుము.

[మార్చు] ఋషిభిర్బహుధా గీతం

ఈ క్షేత్రక్షేత్రజ్ఞ విషయము మహర్షుల చేత అనేక విధాలుగా వివరింపబడినది. పెక్కు శాఖలు కలిగిన వేదాలలో ఇది పలు విధములుగా విభజించి నిరూపించబడినది. బ్రహ్మసూత్ర పదాలు దీనిని గురించి హేతు బద్ధంగా నిశ్చయించి చెప్పాయి.

[మార్చు] మహాభూతాన్యహంకారో

మహాభూతాలు(ఐదు)అహంకారము, బుద్ధి, అవ్యక్తము(అష్టవిధ ప్రకృతి), ఇంద్రియాలు పది, మనస్సు, ఇంద్రియ గోచరవిషయాలు ఐదూ(మొత్తం 24క్షేత్రాలు)

[మార్చు] ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం

ఇచ్చ, ద్వేషం, సుఖఅం, దుఃఖం, శరీరం, చేతనత్వం, పట్టుదల ఇవి వికారాలతో కూడిన క్షేత్రం అని సంగ్రహంగా చెప్పడమైంది.

[మార్చు] అమానిత్వమదమ్భిత్వమహింసా

తనని తాను పొగడక పోవడం, ఢంభము లేకుండా ఉండడమూ, అహింసా, ఓర్పూ, నిజాయితీ, గురు శుశ్రూష, శుచిత్వమూ, స్తిరత్వమూ, ఆత్మనిగ్రహమూ.

[మార్చు] ఇన్ద్రియార్థేషు వైరాగ్యమనహంకార

ఇంద్రియ విషయాలలో వైరాగ్యమూ అహంకారము లేకపోవడము , పుట్టుకలో, చావులో, ముసలితనంలో, రోగంలో, దుఃఖాన్ని, దోషాన్ని నిత్యమూ చూడటమూ,

[మార్చు] అసక్తిరనభిష్వఙ్గః

ఆసక్త భావము లేకపోవడము, పుత్రులు-భార్య గృహము మొదలైన వాటితోతాధాత్మ్యము చెందక పోవడము, ఇష్టాలు ప్రాప్తించినా, ఇష్టం కానిది ప్రాప్తించినా మనస్సుని సమస్థితిలో ఉంచుకోవడమూ,

[మార్చు] మయి చానన్యయోగేన

ఇంకా, నాలోఅనన్య యోగంతో ఉండే వ్యభిచరించని భక్తీ, ఏకాంతంలో గడపడమూ, జనసమర్ధంలో అభిరుచి లేకపోవడమూ,

[మార్చు] అధ్యాత్మజ్ఞాననిత్యత్వం

నిత్యమూ ఆధ్యాత్మ జ్ఞానము ఉండడమూ, తత్వ జ్ఞానము యొక్క లక్ష్యాన్ని దర్శించడము జ్ఞానమని చెప్పబడింది. దానికి భిన్నమైనది అంతా అజ్ఞానము.

[మార్చు] జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి

దేనిని తెలుసుకోవడము వలన జీవుడు అమృతత్వాన్ని పొందుతాడో ఆ జ్ఞేయ వస్తువుని గురించి చెబుతాను. అది లేనిది పరబ్రహ్మము. అది సత్తు కాదని, అసత్తు కాదని చెప్పబడుతుంది.

[మార్చు] సర్వతః పాణిపాదం

దానికి అంతటా చేతులు, కాళ్ళూ, కళ్ళు, తలలూ, నోళ్ళు, చెవులు ఉండి, అది లోకంలో సర్వాన్ని ఆవరించి ఉంటుంది.

[మార్చు] సర్వేన్ద్రియగుణాభాసం

అపర బ్రహ్మము ఇంద్రియాల లక్షణాల ద్వారా ప్రకాశించేది, ఏ ఇంద్రియాలు తనలో లేనిది, దేనిని అంటకుండానే అన్నింటినీ భరించేది, గుణ హీనమైనా కూడా గుణాలను భోగించేది.

[మార్చు] బహిరన్తశ్చ భూతానామచరం

అది(జ్ఞేయము)జీవుళ్ళకు బయటా, లోపలా ఉండేది, కదిలేది కదలనిది కూడా ఐనా, సూక్ష్మము ఐనందువలన తెలియబడదు. (అవిద్వాంసులకు)దూరంగానూ, విద్వాంసులకు దగ్గరగాను ఉన్నది.

[మార్చు] అవిభక్తం చ భూతేషు

ఆ పరబ్రహ్మము విభాగములు లేనిదైనా, జీవుళ్ళలో విభజింపబడి నట్లుగానూ, జీవులను భరించేది, సృష్టి సంహారాలను చేసేదిగా తెలియాలి.

[మార్చు] జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః

వెలుగలకు వెలుగది. (అజ్ఞానమనే)చీకటికి ఆవల ఉన్నదని చెప్పబడుతుంది. అదే జ్ఞానమూ, జ్ఞేయమూ, జ్ఞాన గమ్యమూ అందరి హృదయాలలో సిద్ధించి ఉన్నది.

[మార్చు] ఇతి క్షేత్రం తథా జ్ఞానం

క్షేత్రం, జ్ఞానం, జ్ఞేయం సంగ్రహంగా చెప్పబడినాయి. నా భక్తుడు దీనిని తెలుసుకొని నాభావాన్ని(మోక్షాన్ని) పొందుతాడు.

[మార్చు] ప్రకృతిం పురుషం చైవ

ప్రకృతి పురుషులిద్దరూ అనాది అని తెలుసుకో. వికారాలూ, గుణాలూ ప్రకృతి నుండి పుట్టాయని తెలుసుకో.

[మార్చు] కార్యకరణకర్తృత్వే

కార్యకార్యాల తయారీకి ప్రకృతి కారణము అని చెప్పబడుతుంది. సుఖదుఃఖాల అనుభవాలకు కర్త పురుషుడని చెప్పబడతాడు.

[మార్చు] పురుషః ప్రకృతిస్థో హి

ప్రకృతిలో నిలిచిన పురుషుడు ఆ ప్రకృతి నుండి పుట్టిన గుణాలను అనుభవిస్తాడు. గుణాలతో అతడి సంయోగమే అతడు మంచీ, చెడు జన్మలెత్తడానికి కారణము.

[మార్చు] ఉపద్రష్టానుమన్తా చ భర్తా

ఈ శరీరంలో పరమ పురుషుడు సాక్షి అనీ, అనుమతించేవాడనీ, భరించేవాడనీ, భోగించేవాడనీ, మహేశ్వరుడనీ పరమాత్మ అనీ చెప్పబడుతున్నాడు.

[మార్చు] య ఏవం వేత్తి పురుషం

పూర్వము చెప్పిన విధంగా పురుషుణ్ణీ, గుణాలతో సహా ప్రకృతినీ ఎవరు తెలుసుకుంటారో, అతడు ఎలా ప్రవర్తించినా తిరిగి పుట్టడు.

[మార్చు] ధ్యానేనాత్మని పశ్యన్తి

కొందరు ధ్యానము ద్వారా తమలోనే తమ ఆత్మని ఆత్మ ద్వారా చూస్తారు. కొందరు జ్ఞాన యోగము ద్వారాను, మరి కొందరు కర్మ యోగము ద్వారాను ఆత్మను చూస్తారు.

[మార్చు] అన్యే త్వేవమజానన్తః

ఈ ప్రకారంగా తెలుసుకోలేని వారు కూడా అన్యుల ద్వారా విని, అలా విన్న దానిపై గురి ఉంచిన వారు కూడా సంసారాన్ని తప్పక తరిస్తారు.

[మార్చు] యావత్సంజాయతే

భరతశ్రేష్టుడా ! స్థావర జంగమ రూపమగు ప్రాణికోటి ఏదైతే ఉందో అది క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వలననే పుడుతుందని తెలుసుకో.

[మార్చు] సమం సర్వేషు భూతేషు

నశించిపోయే వాటిలో నశించని తత్వముగా, అన్ని భూతాలలో సమంగా ఉన్నపరమేశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, నిజమైన దృష్టి కలవాడు.

[మార్చు] సమం పశ్యన్హి సర్వత్ర

సర్వత్ర సమంగా ఉన్న ఈశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే, తనని తాను హింసించుకోనివాడు. అతడు దానివలన పరమ గతిని చేరుకుంటాడు.

[మార్చు] ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని

అన్ని విధాలైన కర్మలు ప్రకృతివలననే జరుగుతున్నాయని, ఆత్మ ఏమీ చెయ్యదనీ తెలిసినవాడే నిజమైన చూపు కలవాడు.

[మార్చు] యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి

ఎప్పుడైతే(మానవుడు)వేరు వేరుగా కనిపించే ప్రాణికోటి ఏకత్వము మీద ఆధారపడి ఉన్నదని, అక్కడినుండే విస్తరించిందని నిరంతరము చూడగలుగుతాడో అప్పుడు బ్రహ్మాన్ని పొందుతాడు.

[మార్చు] అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః

ఆది లేని వాడు నిర్గుణుడు కనుక, ఈ పరమాత్మ అవ్యయుడు. కౌంతేయా! శరీరంలో ఉన్నా అతడు కర్మ చెయ్యడు. ఆ కర్మ ఫలంతో మలినపడడు.

[మార్చు] యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం

ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్న ఆకాశం సూక్ష్మ తత్వం వలన దేనిచేతా అంటబడదో, అలాగే దేహమంతటా వ్యాపించి ఉన్న ఆత్మ అంటబడదు.

[మార్చు] యథా ప్రకాశయత్యేకః కృత్స్నం

ఓ భారతా! ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ యావత్తు లోకాన్ని ప్రకాశింప చేస్తాడో, అలాగే ఈ యావత్తు క్షేత్రాన్ని క్షేత్రధారి ఒక్కడే ప్రశింప చేస్తాడు.

[మార్చు] క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం

ఈ ప్రకారంగా క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని, భూత ప్రకృతి నుండి మోక్షం పొందే పద్ధతిని జ్ఞాన దృష్టితో ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు పరమ పదాన్ని చేరుకుంటారు.

[మార్చు] ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

భగవద్గీత - తెలుగు అనువాదము




భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము
పేజీ లింకులు