కర్మసన్యాస యోగము
Wikisource నుండి
| భగవద్గీత - తెలుగు అనువాదము (కర్మసన్యాస యోగము) | సంస్కృత శ్లోకములు→ |
[మార్చు] సంన్యాసం కర్మణాం కృష్ణ
అర్జునుడు ఇలా అడిగాడు: - ఓ కృష్ణా ఒకసారి కర్మ సన్యాసాన్ని, మరొకసారి కర్మ యోగాన్ని పొగుడుతున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో దానిని నాకు తెలుపుము.
[మార్చు] సంన్యాసః కర్మయోగశ్చ
శ్రీ కృష్ణుడన్నాడు: - కర్మసన్యాసమూ, కర్మయోగమూ రెండూ కూడా ఉత్తమమైన ఆనందానికి తీసుక వెళతాయి. ఐతే ఈ రెండింటిలో కర్మ యోగము కర్మసన్యాసము కంటే మెరుగైనది.
[మార్చు] జ్ఞేయః స నిత్యసంన్యాసీ
ఎవరైతే ద్వేషించకుండా, కాంక్షించకుండా ఉంటారో, అతడే నిత్యసన్యాసీ అని తెలుసుకో. ఓ మహాబాహూ! ద్వందాలు లేనివాడే బంధాలనుండి తేలికగా విడుదల పొందుతాడు.
[మార్చు] సాంఖ్యయోగౌ పృథగ్బాలాః
పసివారు (అజ్ఞానులు) మాత్రమే సాంఖ్యమూ, యోగమూ వేరు వేరు అని అంటారు. విద్వాంసులు అనరు. ఎవరైతే ఒకదానిలో సరిగా నిలబడ్డారో అతడికి రెండింటి ఫలం దొరుకుతుంది.
[మార్చు] యత్సాంఖ్యైః ప్రాప్యతే
సాంఖ్యులచేత ఏస్థానం పొందబడుతుందో, ఆస్థానమే యోగులుచేత పొందబడుతుంది. సంఖ్య యోగాన్ని ఒకటిగా ఎవరు చూస్తున్నారో వాళ్ళే నిజమైన దృష్టి కలిగిన వారు.
[మార్చు] సంన్యాసస్తు మహాబాహో
ఓ మహాబాహో! కర్మయోగం చెయ్యని వాళ్ళకు కర్మసన్యాసాన్ని సాధించడం కష్టం. కర్మ యోగంతో కూడిన మానవుడు త్వరలోనే తేలికగా బ్రహ్మమును చేరుకుంటాడు.
[మార్చు] యోగయుక్తో విశుద్ధాత్మా
కర్మ యోగంతో కూడుకుని, విశుద్ధం ఐన బుద్ధితో మనస్సు, ఇంద్రియాలను జయించి, అన్ని ప్రాణులలోని ఆత్మను తన ఆత్మగా తెలుసుకున్న వాడు కర్మలను చేసినా బంధంలో చిక్కుకోడు.
[మార్చు] నైవ కించిత్కరోమీతి
పరమసత్యాన్ని ఎరిగిన యోగయుక్తుడు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృసిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకుంటున్నఫ్ఫుడు, ఊపిరి పీలుస్తున్నప్పుడు
[మార్చు] ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి
మాట్లాడుతున్నప్పుడు, వదిలేస్తున్నప్పుడు, పట్టుకుంటున్నప్పుడు. కనురెప్పలు తెరుస్తూ మూస్తున్నప్పుడు ఇంద్రియాలు విషయాలలో సంచరిస్తున్నాయని తాను ఏమీ చేయడం లేదనీ భావిస్తాడు.
[మార్చు] బ్రహ్మణ్యాధాయ కర్మాణి
ఎవరైతే కర్మలను బ్రహ్మముకు అర్పించి, సంగభావాన్ని వదిలి పనిచేస్తారో, అట్టివాడు నీటిలో ఉన్న తామరాకు ఎలా నీటివలన తాకబడదో అలాగే పాపం చేత తాకబడడు.
[మార్చు] కాయేన మనసా బుద్ధ్యా
యోగులు తమ అంతఃకరణ శుద్ధి కోసం సంగభావాన్ని వదిలి కేవలం శరీర, మనో, బుద్ధి. ఇంద్రియాలతో మాత్రమే కర్మలు చేస్తారు.
[మార్చు] యుక్తః కర్మఫలం త్యక్త్వా
యోగయుక్తుడైన వాడు కర్మఫలాన్ని వదిలి పెట్టి శాశ్వత మైన శాంతిని పొందుతాడు. యోగికానివాడు కోరికల కారణంగా కర్మఫలానికి అతుక్కు పోయి బంధింప బడతాడు.
[మార్చు] సర్వకర్మాణి మనసా
మానసికంగా అన్ని కర్మల్ను సన్యసించి, పూర్తిగా తనను తాను స్వాధీనంలో ఉంచుకున్న దేహధారి, తొమ్మిది ద్వారాల పురంలో తాను ఏమీ చేయకుండా, ఎవరిచేత చేయించ కుండా సుఖంగా ఉంటాడు.
[మార్చు] న కర్తృత్వం న కర్మాణి
భగవంతుడు కర్తృత్వాన్ని గానీ, కర్మలని గానీ సృజించడం లేదు. కర్మ ఫలంతో సంయోగాన్ని ఆయన చేయడు. ప్రకృతే ఆ ప్రకారంగా వ్యవహరిస్తుంది.
[మార్చు] నాదత్తే కస్యచిత్పాపం
భగవంతుడు పాపాలను కాని, పుణ్యాలని కాని స్వీకరించడు. జ్ఞానం అజ్ఞానంచేత కప్పబడుతుంది. అందుచేత ప్రాణులు భ్రాంతులౌతారు.
[మార్చు] జ్ఞానేన తు తదజ్ఞానం
ఎవరిలో ఐతే సమగ్రమైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం చేయబడినదో వారిలో ఆ పరమాత్మ జ్ఞానము సూర్యునివలె ప్రకాశింప బడుతుంది.
[మార్చు] తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః
ఆత్మలోనే బుద్ధిని నిలిపి, ఆత్మభావంతో మనసు నింపి, ఆత్మనే అంతిమ లక్ష్యంగా పెట్టుకుని అత్మాభాసం చేసేవాళ్ళు పాపములు నశింప బడిన వారై తిరిగిరాని స్థిని పొందుతారు.
[మార్చు] విద్యావినయసంపన్నే
మహాత్ములు విద్యా వినయాలతో కూడిన బ్రాహ్మణుడిలో, గోవులో, ఏనుగులో, కుక్కలో, కుక్కమాంసాన్ని వండుకుని తినే చంఢాలునిలో కూడా పండితులు సమాన తత్వాన్నే చూస్తారు.
[మార్చు] ఇహైవ తైర్జితః సర్గో
ఎవరి మనస్సు సామ్యస్థితిలో నిలిచి ఉంటుందో, వారు ఈ శరీరంలో ఉండగానే సంసారాన్ని జయిస్తారు. నిర్దోషమైన బ్రహ్మము అన్నింటా సమంగా ఉన్నందున వాళ్ళు కూడా బ్రహ్మమంలోనే నిలిచి ఉంటారు.
[మార్చు] న ప్రహృష్యేత్ప్రియం
స్థిరమైన బుద్ధితో, బ్రాంతి రహితుడై బ్రహ్మతత్వంలోనిలిచి ఉన్న బ్రహ్మజ్ఞాని ప్రియమైనది లభించినపుడు సంతోషించడు అప్రియమైనది లభించినప్పుడు ఉద్వేగాన్ని పొందడు.
[మార్చు] బాహ్యస్పర్శేష్వసక్తాత్మా
బాహ్య స్పర్శలో తగుల్కోనివాడు, ఆత్మలో ఉండే సుఖాన్ని పొందుతాడు. బ్రహ్మతత్వానుసంధానంలో నిలిచిన ఆ యోగి అనంతమైన ఆనందాన్ని పొందుతాడు.
[మార్చు] యే హి సంస్పర్శజా భోగా
కుంతీకుమారా! బాహ్య విషయ స్పర్శలవల్ల జనించేభోగాలన్నీ దుఃఖాలకు మూలమే. ఆది, అంతములతో కూడుకున్న ఆ క్షణిక సుఖాలలో వివేకవంతుడు రమించడు.
[మార్చు] శక్నోతీహైవ యః సోఢుం
ఏవరైతే ఈ శరీరం ఉండగానే కామక్రోధాల నుండి పుట్టిన ప్రేరణలని తట్టుకోవడానికి సమర్ధుడౌతాడొ, అతడే యోగి, అతడే సుఖవంతుడు ఔతాడు.
[మార్చు] యోऽన్తఃసుఖోऽన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ యః
ఎవరైతే తనలోనే సుఖాన్ని పొందుతూ, తనలో తాను ఆనందిస్తూ తనలో నే జ్ఞాన జ్యోతిని నిలుపుకున్న యోగి బ్రహ్మ స్వరూపుడై మోక్షాన్ని పొందుతాడు.
[మార్చు] లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః
కల్మషాలు నశించి, భేదభావం తొలగిపోయి, మనస్సుని నిగ్రహించి, అన్ని ప్రాణుల హితాన్ని కోరే ఋషులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతారు
[మార్చు] కామక్రోధవియుక్తానాం యతీనాం
కామక్రోధాలనుండి విడిపడి, మనస్సును జయించి, ఆత్మ స్వరూపాన్ని ఎరిగిన యతులకు బ్రహ్మ నిర్వాణస్థితి అంతటా ఉంటుంది.
[మార్చు] స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే
బాహ్యస్పర్శలన్నీ అరికట్టి, దృష్టిని భ్రకుటి మీద నిలిపి , నాసికలో సంచరించేప్రాణాపాలనుసమానం చేసి
[మార్చు] యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయ
ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి, మోక్షమే తన అంతిమ లక్ష్యంగా పెట్టుకుని కోరికలను, భయమును, కోపాన్ని వదిలిన ఋషి ఎప్పుడూ ముక్తుడే.
[మార్చు] భోక్తారం యజ్ఞతపసాం
యజ్ఞాలకు తపస్సులకి భోక్తగా, అన్ని లోకాలకు ప్రభువుగా, అన్ని ప్రాణుల హితం కోరేవాడిగా నన్ను తెలుసుకున్న వాడు శాశ్విత శాంతి పొందుతాడు.
[మార్చు] తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
| భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |

