సాంఖ్య యోగము

Wikisource నుండి


భగవద్గీత - తెలుగు అనువాదము (సాంఖ్య యోగము)



[మార్చు] తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణమ్

సంజయుడన్నాడు:

ఆ ప్రకారంగా కరుణతో ఆవహింప బడి, కన్నీటితో నిండి కలత పడుతున్న చూపుతో, విషాదంలోఉన్న అర్జనుణ్ణి చూసి మధుసూదనుడు ఇలా అన్నాడు.

[మార్చు] కుతస్త్వా కశ్మలమిదం. . .

శ్రీ భగవానుడన్నాడు:

ఈ విషమ సమయంలో నీకు ఈ మాలిన్యం ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఆర్యులకు తగినది కాదు. స్వర్గాన్ని కీర్తినీ రెండింటిని చెడగొట్టుతుంది.

[మార్చు] క్లైబ్యం మా స్మ గమః. . .

అర్జునా! బలహీనుడివి కావద్దు. ఇది నీకు శోభించదు. శత్రుసంహారకుడా. క్షుద్రమైన హృదయ దౌబల్యాన్ని విడిచి లేచి నిలబడు.

[మార్చు] కథం భీష్మమహం . . .

అర్జునుడన్నాడు:

మధుసూదనా! -పూజలకి అర్హులైనభీష్మ ద్రోణులకు ఎదురుగా యుద్ధంలో బాణాలు ఎలా వదలగలను?

[మార్చు] గురూనహత్వా హి. . .

మహానుభావులైన గురువులను వధించకుండా ఈ లోకంలో బిచ్చం ఎత్తి అయినా జీవించడమే మేలు. గురువుల్ని వధించి ఆ నెత్తుటితో తడిసిన సంపదలు, భోగాలు ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తాను.

[మార్చు] న చైతద్విద్మః . . .

ఈ రెండింటిలో ఏది మేలో మాకు తెలియడం లేదు. యుద్ధం చేసినా మేము గెలుస్తామో వాళ్ళే గెలుస్తారో, ఎవరిని చంపాక జీవించడానికి ఇష్ట పడమో, ఆధృతరాష్ట్రనందనులే ఎదురుగా నిలబడి ఉన్నారు.

[మార్చు] కార్పణ్యదోషోపహతస్వభావః

కార్పణ్య దోషం చేత నా బుద్ధి దెబ్బ తిన్నది. ధర్మమేదో తెలియని వాడినై నిన్ను అడుగు తున్నాను. ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియ చెయ్యి. నీ శిష్యుడిని, నీ శరణు జొచ్చిన నాకు బోధ చెయ్యి.

[మార్చు] న హి ప్రపశ్యామి . . .

ఇంద్రియాలను దహింపచేసే నాయీశోకాన్ని తగ్గించే దేదో నేను తెలుసుకోలేకుడా ఉన్నాను. భూమిలో ఏకచ్చత్రాధిపత్యం కాని, దేవలోకాధిపత్యం కాని దీనిని తొలగించ లేదు.

[మార్చు] ఏవముక్త్వా హృషీకేశం. . .

ఓ రాజా. అర్జునుడు శ్రీ కృష్ణునితో ఈ ప్రకారంగా చెప్పి, యుద్ధం చేయనని గోవిందునితో పలికి మాట్లాడకుండా ఊరకున్నాడు.

[మార్చు] తమువాచ హృషీకేశః. . .

భారతా! రెండుసేనల మధ్య విషాదంలో పడిన అతణ్ణి చూసి హృషీకేశుడు నవ్వుతున్నట్లుగా ఇలా అన్నాడు.

[మార్చు] అశోచ్యానన్వశోచస్త్వం. . .

శ్రీ భగవానుడన్నాడు.

నీవు విచారించదగని వారికోసం విచారిస్తున్నావు. ప్రజ్ఞావంతుడి వలె మాట్లాడుతున్నావు. చనిపోయిన వారి గురించి కానిబతికి ఉన్న వారి గురించి కాని పండితులు శోకించరు.

[మార్చు] న త్వేవాహం జాతు . . .

నీవుకాని నేను కాని ఈ రాజులు కాని లేని సమయం భూతకాలంలో లేదు, వర్తమానంలో ఉండదు.

[మార్చు] దేహినోऽస్మిన్యథా. . .

ఈ శరీరంలో దేహధారికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఎలాకలుగుతాయో, అలాగే మరోదేహం లభించడం కూడాను. వివేకి ఈవిషయంలో భ్రమపడడు.

[మార్చు] మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ. . .

కుంతీకుమారా! ఇంద్రియాల ద్వారా కలిగే విషయ స్పర్శలే శీతోష్ణ, సుఖదః ఖాలను కలిగిస్తాయి అవి వస్తూ పోతుంటాయి. నిలకడలేనివి. అర్జునా వాటిని సహించాలి.

[మార్చు] యం హి న వ్యథయన్త్యేతే. . .

పురుషశ్రేష్టుడా! సుఖదుఃఖాలలో సమంగా ఉండే ఏ ధీరుణ్ణి ద్వందాలు భాదించవో అతడు అమృతత్వానికి అర్హుడు అవుతాడు.

[మార్చు] నాసతో విద్యతే భావో. . .

అసత్యానికి శక్తి లేదు. సత్యానికి శక్తి లేకపోవడం అంటూ లేదు. ఈరెండింటి అసలు స్వరూపం తత్వ జ్ఞానులచేత దర్శింప బడినది.

[మార్చు] అవినాశి తు తద్విద్ధి. . .

దేని చేత ఈప్రపంచం యావత్తు వ్యాపించబడి ఉన్నదో ఆ సత్తు నాశరహితమైనదని తెలుసుకో. నాశరహితమైన దానిని ఎవరూ నాశనం చేయలేరు.

[మార్చు] అన్తవన్త ఇమే దేహా. . .

నిత్యమైన నాశరహితమైన పరిణామాలులేని శారీరా ధారి అయిన ఆత్మకు ఇవి అంతమయ్యే దేహాలు. అందుచేత అర్జునుడా యుద్ధం చేయి.

[మార్చు] య ఏనం వేత్తి హన్తారం

ఆత్మ చంపుతుంది అని కానీ, చంప బడుతుంది అనికానీ, ఎవరనుకుంటారో వారు అందరూ ఎరుగని వారే. ఆత్మ చంపదు, చంపబడదు.

[మార్చు] న జాయతే మ్రియతే. . .

అతడు ఎన్నడూ పుట్టేవాడు, గిట్టేవాడూ కాదు. నిన్న ఉండి రేపు లేనివాడూ కాదు. పుట్టుకలేని వాడు, నిత్యమైన వాడు, మార్పులేని వాడు, అతడు పురాతన మైన వాడు, అగు ఈ ఆత్మ శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు.

[మార్చు] వేదావినాశినం నిత్యం. . .

జన్మరహితము, నాశరహితము, అవ్యయము అయిన దీనిని ఎవరు ఎరుగునో ఆపురుషుడ ఎలా ఎవరిని చంపిస్తాడు? ఎవరిని చంపుతాడు?

[మార్చు] వాసాంసి జీర్ణాని. . .

మానవుడు జీర్ణమైన వస్త్రాలను విసర్జించి క్రొత్త వాటిని ఎలా ధరిస్తాడో అలాగే దేహధారి జీర్ణమైన శరీరాలను విసర్జించి క్రొత్తవాటిని స్వీకరిస్తాడు.

[మార్చు] నైనం ఛిన్దన్తి శస్త్రాణి. . .

దీనిని శస్త్రాలు చేదించవు, అగ్ని కాచదు, నీరుతడపదు, గాలి ఎండించదు.

[మార్చు] అచ్ఛేద్యోऽయమదాహ్యో. . .

ఇది ఛేధించ రానిది, కాల్చ రానిది, తడప రానిది, ఎండించ రానిది. నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, అచలమైనది.

[మార్చు] అవ్యక్తోऽయమచిన్త్యో. . .

ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. దీనిని నీవు అర్ధం చేసుకుని విచారంచడం విడిచి పెట్టు.

[మార్చు] అథ చైనం నిత్యజాతం. . .

ఇక దీనిని నిత్యం పుట్టేది, నిత్యం గిట్టేదిగా భావించినా మహానుభావుడా|అప్పుడు కూడా ఇలా విచారించ తగదు.

[మార్చు] జాతస్య హి ధ్రువో. . .

పుట్టిన వానికి మరణం ఎలా తప్పదో, అలాగే చనిపోయిన వారికి జన్మ తప్పదు. అందుచేత శోకింపనవసరం లేని దాని కోసం నీవు శోకింప తగదు.

[మార్చు] అవ్యక్తాదీని భూతాని. . .

అర్జునా జీవుని మొదలెక్కడో తెలియదు, మధ్య ఎమిటో తెలియదు, తుది ఎప్పుడో తెలియదు. తెలియని దాని కొరకు విచారించ పనిలేదు.

[మార్చు] ఆశ్చర్యవత్పశ్యతి. . .

దీనిని ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు, ఒకరు ఆశ్చర్యంగా చెబుతాడు, ఒకడు ఆశ్చర్యంగా వింటాడు. అయినప్పటికీ ఎవరూ దీనిని తెలుసుకోలేరు.

[మార్చు] దేహీ నిత్యమవధ్యోऽయం

అర్జునా! అన్ని దేహాలలో ఉన్న దేహి నిత్యమైన వాడు కనుక చంపబడడు. అందుచేత ఎవరిని గురించీ నీవు విచారించతగదు.

[మార్చు] స్వధర్మమపి చావేక్ష్య న. . .

స్వధర్మం దృష్ట్యా చూచినా నీవు కంపించ తగదు. క్షత్రియుడికి ధర్మ యుద్ధంకన్నామేలైనది లేదు.

[మార్చు] యదృచ్ఛయా చోపపన్నం. . .

అర్జునా! యాదృచ్చికంగా లభించినదీ స్వర్గద్వారాన్ని తెరిపించేదీ అయిన ఇలాంటి యుద్ధంలో పాల్గొనే అవకాశం అదృష్టవంతులైన క్షత్రియులే పొందుతారు.

[మార్చు] అథ చేత్త్వమిమం. . .

ధార్మికమైన ఈ యుద్ధాన్ని చేయకపోయ్యావో, దానివల్ల స్వధర్మాన్ని, కీర్తిని వదిలినవాడవై పాపం పొందుతావు.

[మార్చు] అకీర్తిం చాపి భూతాని. . .

ప్రజలు నిన్ను అప్రతిష్టకరంగా మాట్లాడుతారు. మానవంతుడికి అపకీర్తి మరణంకంటే బాధాకరం.

[మార్చు] భయాద్రణాదుపరతం. . .

ఈ మహారధులందరూ భయం వలన నీవు యుద్ధం నుండి పారిపోయావని అనుకుంటారు. నీ వీరత్వాన్ని గౌరవించిన వారే నిన్ను చులకనగా చూస్తారు.

[మార్చు] అవాచ్యవాదాంశ్చ. . .

నీ శత్రువులు నిన్ను గురించి పలురకాలుగా అనరాని మాటలంటారు. నీ సమర్ధతని నిందిస్తారు. అంతకన్నా ఎక్కువ దుఃఖకరమైనది ఉంటుందా?

[మార్చు] హతో వా ప్రాప్స్యసి. . .

చనిపోయావా, స్వర్గాన్ని పోందుతావు. గెలిచావా, రాజ్యాన్ని అనుభవిస్తావు. అందు చేత లే కౌంతేయ; యుద్ధం చేయడానికి కృతనిశ్చయుడువై లేచి నిలబడు.

[మార్చు] సుఖదుఃఖే సమే కృత్వా. . .

సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించి యుద్ధానికి సన్నద్ధుడివికా. ఈ విధంగా నీవు పాపం పొందకుండా ఉంటావు.

[మార్చు] ఏషా తేऽభిహితా సాంఖ్యే. . .

ఇంతవరకు నీకు జ్ఞానాన్ని భోదించడం జరిగింది. ఇక ఈ బుద్ధి యోగాన్ని గురించి వినుము. పార్ధుడా; ఈ జ్ఞానం తోడూ ఉంటే కర్మ బంధాన్ని ఛేదిస్తావు.

[మార్చు] నేహాభిక్రమనాశోऽస్తి. . .

ఇందులో ఆరంభం నిష్ఫలం కావడం కానీ విపరీత ఫలితాలు కానీ ఉండవు. ఈ ధర్మం ఏకొంచం ఆచరించినా భయం నుండి రక్షిస్తుంది.

[మార్చు] వ్యవసాయాత్మికా . . .

కురునందనా! ఇక్కడ నిశ్చయంతో కూడిన బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా ఉంటుంది. నిశ్చయం లేనివారికి బుద్ధులు అనేక శాఖలుగా చీలి అసంఖ్యాకంగా ఉంటాయి.

[మార్చు] యామిమాం పుష్పితాం. . .

అర్జునా; అజ్ఞానులు వేద వాక్యాలలో ఆసక్తి ఉన్న వాళ్ళు స్వర్గం కంటే వేరేది లేదని పువ్వుల్లాంటి మధురమైన ఈ మాటని చెప్తారు.

[మార్చు] కామాత్మానః స్వర్గపరా. . .

కోరికలతో నిండినవాళ్ళూ, స్వర్గమే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళూ, జన్మలనూ, స్వర్గాదులను ఇచ్చేవి, వాటిని సాధించే అనేక కర్మ విశేషాలతో నిండినవీ, భోగైస్వర్యాలను కలిగించేవి అయిన పువ్వుల్లాంటి మధురమైన వచనాలను చెప్తారు.

[మార్చు] భోగైశ్వర్యప్రసక్తానాం. . .

భోగైశ్వర్యాలలో తగుల్కొని ఆ మధుర వాక్యాలకు లోబడి పోయినవారికి అంతఃకరణలో నిశ్ఛయ జ్ఞానం ఏర్పడదు

[మార్చు] త్రైగుణ్యవిషయా వేదా. . .

అర్జునా! వేదాలు త్రిగుణాత్మకమైన సంసార విషయాలకు చెందినవి నీవు వాటికి అతీతుడైనై, సుఖదుఃఖాది ద్వందాలని వదిలి, నిత్యముశుద్ధ సత్వములో నిలిచి, యోగక్షేమాలను నర్జించి(వదిలి), ఆత్మజ్ఞానివి కా.

[మార్చు] యావానర్థ ఉదపానే. . .

అంతటా జలం పొంగుతున్నప్పుడు జలకాల శాల ఉపయోగం ఎంతవరకో అనుభవజ్ఞుడైన బ్రహ్మజ్ఞానికి అన్ని వేదాల ఉపయోగం అంతవరకే.

[మార్చు] కర్మణ్యేవాధికారస్తే. . .

కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలపైన ఎప్పుడూ లేదు. కర్మ ఫలానికి కారకుడివి కావద్దు. అలాగని కర్మలు చెయ్యడము మానవద్దు.

[మార్చు] యోగస్థః కురు కర్మాణి. . .

ధనంజయా! యోగంలో నిలిచి, సగం వదిలి, కర్మఫలితాలు సిద్ధించడం, సిద్ధించకపోవడం ఈ రెంటినీ సమంగా భావించి కర్మలు చెయ్యి. ఆ సమత్వమే యోగమని చెప్పబడుతుంది.

[మార్చు] దూరేణ హ్యవరం కర్మ. . .

ధనంజయా! సమత్వ బుద్ధితో కూడిన కర్మ కంటే కామ్యకర్మ చాలా అల్ప మైనది. కాబట్టి ఆసమ బుద్ధిని ఆశ్రయించు. కర్మఫలానికి కారకులయ్యేవారు పిసిని గొట్టులు.

[మార్చు] బుద్ధియుక్తో జహాతీహ. . .

సమబుద్ధితో కూడిన వ్యక్తి ఈ జన్మలోనే పుణ్య పాపాలని రెంటినీ వదులుతాడు. అందుచేత నీవు యోగంకోసం ప్రయత్నించు. యోగమంటే కర్మలలో కౌశలమే.

[మార్చు] కర్మజం బుద్ధియుక్తా హి. . .

సమబుద్ధితో కర్మనుండి జనించే ఫలితమునందు ఆసక్తి త్యజించే వివేకులు జన్మబంధం నుండి పూర్తిగా విముక్తులై దుఃఖరహితమైన పదాన్ని పదాన్ని చేరుకుంటారు.

[మార్చు] యదా తే మోహకలిలం. . .

ఎప్పుడు నీబుద్ధి మోహమనే బురదని అధిగమిస్తుందో, అప్పుడు వినదగిన, వినిన విషయాలనుండి విముక్తుడివి అవుతావు.

[మార్చు] శ్రుతివిప్రతిపన్నా తే . . .

విన్నవాటితో వేసారిపోయిన నీబుద్ధి సమాధిలో నిశ్చలంగా నిలిచి ఉన్నప్పుడు నీవు యోగాన్ని పొందుతావు.

[మార్చు] స్థితప్రజ్ఞస్య కా భాషా. . .

అర్జునుడు ఇలా అడిగాడు: కేశవా సమాధి కలిగిన స్తితప్రజ్ఞుడి లక్షణం ఏమిటి? స్థిరబుద్ధి కలిగినవాడు ఎలా మాట్లాడుతాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుచుకుంటాడు?

[మార్చు] ప్రజహాతి యదా కామాన్సర్వాన్పార్థ. . .

భగవానుడు ఇలా బదులిచ్చాడు: అర్జునా! మనస్సులోని అన్ని కోరికలని ఎప్పుడు విసర్జిస్తాడొ, ఎప్పుడు తనలో తాను తుస్టిని(ఆత్మానందాన్ని) పొందుతాడో, అప్పుడు స్తితప్రజ్ఞుడు అనిపించుకుంటాడు.

[మార్చు] దుఃఖేష్వనుద్విగ్నమనాః. . .

ధుఃఖాలలో ఉద్వేగం పొందనివాడు, సుఖాలకోసం తహతహ పడనివాడు, రాగ భయ, క్రోదాలని విడిచినవాడు మననశీలుడు, స్థితప్రజ్ఞుడు అనిపించుకుంటాడు.

[మార్చు] యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య. . .

ఎక్కడా దేనికీ తగుల్కోకుండా, శుభాశుభాలను పొందినప్పుడు ఆనందించక, ద్వేషించక నిలిచివుంటాడో అతడి ప్రజ్ఞ స్థిరమైనది.

[మార్చు] యదా సంహరతే చాయం. . .

తాబేలు తన అంగాలను ఉప సంహరించు కున్నట్లుగా, ఇతడు తన ఇంద్రియాలను విషయ వస్తువులనుండి ఎప్పుడు ఉప సంహరించు కుంటాడో అప్పుడు అప్పుడు ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది.

[మార్చు] విషయా వినివర్తన్తే. . .

ఆహారాన్ని విడిచిపెట్టిన పురుషుడి నుండి విషయ వస్తువులు దూరంగా పోతాయి. కాని, అభిరుచి అలాగే ఉంటుంది. పరమాత్మ దర్శనంతో ఆ అభిరుచి కూడా పోతుంది.

[మార్చు] యతతో హ్యపి కౌన్తేయ. . .

అర్జునా! పండితుడి ఇంద్రియాలు కూడా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ క్షోభ పెడుతూ మనస్సును విషయాల మీదికి లాగి వేస్తాయి కదా;

[మార్చు] తాని సర్వాణి సంయమ్య. . .

వాటినన్నింటిని బాగా నిగ్రహించి, యుక్తుడై నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో అతడి ప్రజ్ఞే నిలకడగా ఉంటుంది.

[మార్చు] ధ్యాయతో విషయాన్పుంసః. . .

విషయధ్యానం చేసే పురుషుడికి వాటితో సంగమం ఏర్పడుతుంది. సంగమం వలన కామము, కామం వలన క్రోధం జనిస్తాయి.

[మార్చు] క్రోధాద్భవతి సంమోహః . . .

క్రోధం వలన విభ్రాంతి కలగుతుంది. విభ్రాంతితో మతిమరపు, దానితో బుద్ధి నాశనం కలిగి, బుద్ధి నాశనంతో వ్యక్తి సర్వనాశనం అవుతాడు.

[మార్చు] రాగద్వేషవియుక్తైస్తు . . .

రాగద్వేషాలనుండి విడివడి, స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలతో, స్వాధీనమైన మనస్సుతో విషయ వస్తువులలో సంచరించే మానవుడు ప్రశాంతతని పొందుతాడు.

[మార్చు] ప్రసాదే సర్వదుఃఖానాం. . .

మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు అతడికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. ప్రసన్నచిత్తుడికి బుద్ధి త్వరలో పూర్తిగా స్థిరత్వం చెందుతుంది.

[మార్చు] నాస్తి బుద్ధిరయుక్తస్య న. . .

నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు. యుక్తుడుకానివానికి ధ్యానం కూడా కుదరదు. ధ్యానం లేనివాడికి శాంతి లేదు. శాంతి లేనివాడికి సుఖమెక్కడ?

[మార్చు] ఇన్ద్రియాణాం హి చరతాం. . .

ఏమనస్సు సంచరించే ఇంద్రియాలకు లోబడి వాటిననుసరిస్తుందో, అది నీటిలో పడవని గాలి లాగివేసినట్లు పురుషుని ప్రజ్ఞని లాగి వేస్తుంది.

[మార్చు] తస్మాద్యస్య మహాబాహో. . .

అందు వలన ఓ మహానుభావుడా! ఎవరి ఇంద్రియాలు విషయ వస్తువుల నుండి అన్ని విధాలుగా నిగ్రహింపబడి ఉంటాయో, అతడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది.

[మార్చు] యా నిశా సర్వభూతానాం. . .

అందరికి ఏది రాత్రియో, సంపూర్ణ నిగ్రహ వంతుడైన మహాత్ముడు ఆ స్థితిలో మేల్కొని ఉంటాడు. ఏ స్థితిలో ప్రాణులు ప్రాణులు మేల్కొని ఉంటారో జ్ఞాని అయిన మునికి అది రాత్రి.

[మార్చు] ఆపూర్యమాణమచలప్రతిష్ఠం. . .

పరిపూర్ణంగా స్థిరంగా నిలిచి ఉండే సముద్రాన్ని నీళ్ళు ఎలాచేరుకుంటాయో, ఎవరిలోకి అన్ని కోరికలు ప్రవేశించి విలీనమౌతాయో, శాంతిని పొందుతాడు. కోరికలకు దాసుడైనవాడు పొందలేడు.

[మార్చు] విహాయ కామాన్యః సర్వాన్

అన్ని కోరికలను వదిలి, అహంకార మమకారాలు వీడి సంచరించే పురుషుడు శాంతిని పొందుతాడు.

[మార్చు] ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ

ఆర్జునా ఇదే బ్రాహ్మీస్థితి, దీనిని పొందాక ఇక భ్రమించడు. ఇందులోచివరి సమయంవరకు నిలిస్తేబ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు.



భగవద్గీత - తెలుగు అనువాదము




భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము
పేజీకి సంభందించిన లింకులు
ఓ పుస్తకాన్ని సృష్టించండి