గుణత్రయవిభాగ యోగము
Wikisource నుండి
| భగవద్గీత - తెలుగు అనువాదము (గుణత్రయవిభాగ యోగము) | సంస్కృత శ్లోకములు→ |
[మార్చు] పరం భూయః ప్రవక్ష్యామి
శ్రీభగవానుడిట్లనియెను: సర్వ మునీశ్వరులును ఏ ఙ్ఞానమునెరుంగుట చేత సర్వోత్కృష్ఠమైన చిదానంద స్వరూప సిద్ధిని పొందిరో అట్టి అనంతమైన ఙ్ఞానములన్నిటిలో నుత్తమమైన చిదాకాశఙ్ఞానమును మరల చెప్పుచున్నాను.
[మార్చు] ఇదం జ్ఞానముపాశ్రిత్య
ఈ ఙ్ఞానమును పొంది నాలో నేకమై శోభిల్లువారు సృష్టికాలమున జన్మించరు. ప్రళయ కాలమున దు:ఖ పడరు. అనగా మృతినొందరు.
[మార్చు] మమ యోనిర్మహద్బ్రహ్మ
ఓ అర్జునా! మహద్బ్రహ్మయని చెప్పబడు నామూల ప్రకృతి యోనియందు నేను చైతన్య బీజ రూపమున జీవుని ఉంచుచున్నాను. అందువలన సర్వ భూతముల ఉత్పత్తి కలుగుచున్నది.
[మార్చు] సర్వయోనిషు కౌన్తేయ
ఓ కౌంతేయా! దేవమానవ పశు పక్ష్యాది సకల యోనులందు పుట్టు దేహములన్నింటికిని, మహద్బ్రహ్మయగు మూల ప్రకృతి తల్లి యనియు, పరమేశ్వరుడనైన నేను అందు బీజమునుంచు తండ్రిననియు తెలియుము.
[మార్చు] సత్త్వం రజస్తమ
ఓ అర్జునా! ప్రకృతివలన బుట్టిన సత్త్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములును నాశరహితుడైన గగనాత్మను అనగా దేహిని నశించు దేహదృష్టిలోనే బంధించుచున్నది.
[మార్చు] తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్
పాపరహితుడవగు ఓ అర్జునా! సత్త్వరజస్తమోగుణములలో మొదటిదగు సత్త్వగుణము నిర్మలమైనదగుటచేతను ప్రకాశింపజేయునదై, ఆరోగ్యకరమైనదై, ప్రపంచసుఖములలో సంగమము కలిగించుటచేతను, శాస్త్రఙ్ఞానములో ఆశక్తిని, తృప్తిని కలిగించుటచేతను అంతవరకే ఉంచి బంధించుచున్నది.
[మార్చు] రజో రాగాత్మకం విద్ధి
ఓ అర్జునా! రజోగుణము ఆశాపాశముచే కలిగి ధనాది లోకవిషయములయెడ రాగము కలుగజేయునని ఎరుంగుము. అందుచే రజోగుణము దేహమందున్న ఆత్మను ఐహిక సుఖములందాసక్తిని కలిగించి వాటికై అనేక కర్మలను చేయించి బంధించుచున్నది.
[మార్చు] తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం
హే భారతా! తమోగుణమన్నచో అఙ్ఞానముచే జనించిన దానినిగ నెరుంగుము. అది సర్వజీవులకు మోహమును, భ్రమను కలిగించి, అజాగ్రత్త, సోమరితనము, అతినిద్ర అనువానిచె ఆత్మను బంధించుచున్నది.
[మార్చు] సత్త్వం సుఖే సంజయతి
ఓ అర్జునా! సత్త్వగుణము శాంతిసుఖములను కలిగించుచున్నది. రజోగుణము భోగములకై బాహ్య కర్మాడంబరములను కలిగించుచున్నది. తమోగుణమన్నచో మంచిపనిని చేయించక చెడును చేయించి ప్రమాదమును కలిగించుచున్నది.
[మార్చు] రజస్తమశ్చాభిభూయ
హే భారతా! సత్త్వగుణము రజస్తమోగుణముల కంటే శక్తితోనున్నపుడు వాటిని అణచి ఙ్ఞానసుఖాదులను కలిగించును. అట్లే రజోగుణము సత్త్వతమస్సులకంటే బలముగనున్నపుడు వాటిని అణచి అనేక కర్మలయందు ఆశక్తిని కలిగించును. అట్లే తమోగుణము సత్త్వరజోగుణములకంటే అధికముగ నున్నపుడు ఙ్ఞాన శూన్యతతో ప్రమాదములను కలిగించును.
[మార్చు] సర్వద్వారేషు దేహేऽస్మిన్ప్రకాశ
ఈ దేహమందున్న సర్వేంద్రియములద్వారా విఙ్ఞాన ప్రకాశమే ప్రసరించుచున్నప్పుడు సత్త్వగుణము బాగా వృద్ధి చెంది శోభిల్లిచున్నదని తెలియవలెను.
[మార్చు] లోభః ప్రవృత్తిరారమ్భః
ఓ అర్జునా! రజోగుణము వృద్ధిలోనున్నపుదు లోభత్వము, కామ్యకర్మల నారంభించి వాటిలో మునిగి వర్తించుట, ఇంద్రియనిగ్రహము, మనశ్శాంతిలేకుండుట, మిక్కుటమైన ఆశ మొదలైనవి కలుగుచున్నవి.
[మార్చు] అప్రకాశోऽప్రవృత్తిశ్చ ప్రమాదో
హే కురునందనా! తమోగుణము వృద్ధిలో నున్నపుడు బుద్ధిమాంద్యము, అఙ్ఞాన భ్రమతో కూడిన ప్రమాదములు కలుగుచున్నవి.
[మార్చు] యదా సత్త్వే ప్రవృద్ధే తు
దేహధారియగు జీవుడెపుడు సత్త్వగుణము అభివృద్ధిలో నుండగా మరణించునో, అపుడు ఉత్తమ ఙ్ఞానులు పొందెడు నిర్మలమైన లోకములను పొందుచున్నాడు.
[మార్చు] రజసి ప్రలయం గత్వా
రజోగుణము అభివృద్ధిలో నున్నపుడు మరణించినచో కామ్య కర్మాశక్తులగు మనుష్యుల కుటుంబములందు తిరిగి జన్మించుచున్నాడు. తమోగుణము అభివృద్ధిలోనున్నపుడు మృతినొందినచో ఙ్ఞానహీనులైన మూఢుల వంశమునందుగానీ, పశుపక్ష్యాదులలోగానీ పుట్టుచున్నాడు.
[మార్చు] కర్మణః సుకృతస్యాహుః
సాత్త్వికములైన మంచి కర్మలను చేయుటచే నిర్మల శాంతిసుఖములే ఫలమనియు, రజోకర్మలను చేయుటచే సాంసారిక సుఖదు:ఖములే ఫలమనియు, తామసి కర్మలచే అఙ్ఞానమే ఫలమనియు తత్వవేత్తలు చెప్పిరి.
[మార్చు] సత్త్వాత్సంజాయతే జ్ఞానం
సత్త్వగుణమువలన వివేకముతో కూడిన ఙ్ఞానము కలుగుచున్నది. రజోగుణమువలన తరగని ఆశయను లోభము జనించుచున్నది. తమోగుణముచే అఙ్ఞాన ప్రమాదములు కలుగుచున్నవి.
[మార్చు] ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా
సత్వగుణమందున్నవారు స్వర్గాది ఊర్ధ్వలోకములను పొందుచున్నారు. రజోగుణము కలవారు మధ్యమమగు మనుష్యలోకమును పొందుచున్నారు. నీచగుణవృత్తులు గల తమోగుణము కలవారు అధోలోకమును అనగా మనుష్యులలో హీనులుగాగానీ పశుపక్ష్యాదులుగగానీ జన్మించుచున్నారు.
[మార్చు] నాన్యం గుణేభ్యః కర్తారం
ఎవడు సర్వకర్మలను ప్రేరేపించి చేయునది త్రిగుణాత్మిక ప్రకృతితప్ప అన్యమెవరూ కాదనియు, తానీప్రకృతికంటె వేరైన గగనాత్మ స్వరూపునిగ నెపుడు తెలియునో అపుడు వాడు నా అనంత చిదాకాశ విశ్వగర్భస్వరూపమునే పొందుచున్నాదు.
[మార్చు] గుణానేతానతీత్య త్రీన్దేహీ
దేహోత్పత్తికి కారణభూతములైన ఈ త్రిగుణముల నతిక్రమించి జీవుడు జనన మరణ వార్ధక్య దు:ఖములనుండి విముక్తుడై జననమరణములులేని అమృత చిదాకాశ దైవస్వరూపమును పొంది శాశ్వతముగ శోభిల్లుచున్నాడు.
[మార్చు] కైర్లిఙ్గైస్త్రీన్గుణానేతానతీతో
అర్జునుడిట్లనియెను: హే ప్రభో! సత్త్వరజస్తమోగుణములను మూడింటిని అతిక్రమించినవాడు ఏ లక్షణములతో నుండును? వాని వర్తన ఎట్లుండును? ఈ త్రిగుణములను వాడెట్లు అతిక్రమించుచున్నాడు?
[మార్చు] ప్రకాశం చ ప్రవృత్తిం చ
శ్రీ భగవానుడిట్లనియెను: హే పాండవా! సంప్రాప్తములైన సత్త్వగుణ సంబంధమగు ప్రకాశమును, రజోగుణ సంబంధమగు కర్మప్రవృత్తిని, తమోగుణ సంబంధమగు మోహమును ఎవడు ద్వేషింపడో, ఇవి విడిచిపోయినచో వీటిని తిరిగి కోరడో అట్టివాడు త్రిగుణాతీతుడగును.
[మార్చు] ఉదాసీనవదాసీనో గుణైర్యో
ఎవడు ప్రకృతిగుణములే ప్రవర్తించుచున్నవని తెలిసి, ఉదాసీనుడై ఉండి, త్రిగుణములచే చలింపక చిదాకాశ స్వరూపస్థితిలో సదా విలసిల్లుచుండునో వాడే త్రిగుణాతీతుడు.
[మార్చు] సమదుఃఖసుఖః స్వస్థః
సమ దు:ఖ. . . అనంత చిదాకాశ స్వరూపమందు స్థిరుడై, సుఖదు:ఖములందు సమముగనుండి, మట్టిని, రాతిని, బంగారమును సమముగ జూచుచు, ఇష్టానిష్ట వస్తుప్రాప్తితో సమచిత్తమునే కలిగి దూషణభూషణములందు చలింపక, ధీరుడై ఎవడు విలసిల్లునో వాడే త్రిగుణాతీతుడు.
[మార్చు] మానాపమానయోస్తుల్యస్తుల్యో
మానావమానములందు సమచిత్తముతోనుండి, శత్రుమిత్రులందు సముడై సర్వ కర్మలను పరిత్యజించి ఎవడు సర్వదా చిదాకాశ దైవప్రఙ్ఞతో ప్రకాశించుచుండునో వాడే త్రిగుణాతీతుడని చెప్పబడుచున్నాడు.
[మార్చు] మాం చ యోऽవ్యభిచారేణ
ఎవడు అచంచలమైన భక్తియోగముతో నన్నే సేవించుచున్నాడో వాడే ఈ త్రిగుణములను సులభముగ నతిక్రమించి బ్రహ్మాకాశ విశ్వగర్భస్వరూపమును పొందుటకఱుడగుచున్నాడు.
[మార్చు] బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య
బ్రహ్మణో. . . అవ్యయమైన, అమృతమైన, శాశ్వతమైన, ధర్మ స్వరూపమైన, అఖండానంద స్వరూపమైన బ్రహ్మస్వరూపమునకు ఉనికిపట్టుగ మూలాధార్ముగ నున్నది నేనే కదా.
[మార్చు] ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
| భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |