శ్రీ గీతామృత తరంగిణి/సాంఖ్య యోగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
శ్రీమద్భగవద్గీతా
(మూల శ్లోకములు)
శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

సఞ్జయ ఉవాచ|
అనుష్టుప్.
తం తథా కృపయా22విష్ట
మశ్రుపూర్ణాకులేక్షణమ్|
విషీదన్త మిదం వాక్య
మువాచ మధుసూదనః|| 2-1 ||

 సంజయు వాక్యము|
తేటగీతి|.
చటుల విహ్వల హృదయుఁడై యటమటించి
కంట దడివెట్టు పార్థునిఁ గలయఁ జూచి
మందహాసమ్ముఁ జేసి ముకుందుఁ డంత
బలికె గంభీరమైన వాక్కులను నిటుల. ౧|

సంజయుని వాక్యము-

ఆ ప్రకారముగా కనికరముతో గూడుకొని కంటనీరు పెట్టుకొనినవాడై వ్యాకులత్వము జెంది దుఖించుచున్న అర్జునునిజూచి శ్రీకృష్ణు డిట్లు పలికెను.

అ.
శ్రీభగవానువాచ|
కుతస్త్వా కశ్మలమిదం
విషమే సముపస్థితమ్|
అనార్యజుష్టమస్వర్గ్య
మకీర్తికరమర్జున|| 2-2 ||

అ.
క్లైబ్యం మా స్మ గమః పార్థ !
నైతత్త్వయ్యుపపద్యతే|
క్షుద్రం హృదయదౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరన్తప|| 2-3 ||

శ్రీ భగవానుల వాక్యము|
కందము.
అపకీర్తి భాజనమ్మిది
చపలమ్ము నకార్య కార్య సరణిం జన హే
యపు నరకమె సిద్ధించును
కృప కాదిది కలుషిత మ్మిదెటుల గలిగెనో.౨
తేటగీతి|.
రాచ పుట్టువు బుట్టియు మాచకమ్మ
సాటి గాల్సాసుదే సవ్యసాచి ! యిటుల
హృదయ దౌర్బల్యమున్ క్షుద్ర మీ భయమ్ము
విడిచి లెమ్మోయి అనిసేయ వీరవర్య ! ౩

శ్రీ భగవానుడు చెప్పెను.

ఓ అర్జునా ! పామరు లవలంబించు నదియు, స్వర్గ ప్రతిబంధకమును, అపయశస్సును గలుగ జేయునదియు నగు ఈ మోహము ఈ యొడుదుడుకు సమయమున నీ కెక్కడినుండి దాపురించినది ?

ఓ అర్జునా ! అధైర్యమును పొందకుము. ఇది నీకు తగదు. నీచమగు మనోదుర్బలత్వమునువీడి యుద్ధము చేయుటకు లెమ్ము.

అర్జున ఉవాచ|
అ.
కథం భీష్మమహం సఙ్ఖ్యే
ద్రోణం చ మధుసూదన|
ఇషుభిః ప్రతియోత్స్యామి
పూజార్హావరిసూదన|| 2-4 ||

అర్జును వాక్యము|
కందము.
గురు భీష్ములు పూజార్హులు
కరములుఁ గీలించి మ్రొక్కగా దగువారిన్
శరచాప ధరుడనై సం
గర సీమ నెదుర్కొనంగ గలనె ముకుందా !౪

అర్జునుడు పలికెను.

ఓ కృష్ణా ! భీష్మ ద్రోణు లిరువురును పూజింపదగినవారు, అట్టివారిపై బాణములను వదలి నే నెట్లు యుద్ధము చేయగలను ?

ఉపజాతి.
గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే|
హత్వార్థకామాం స్తు గురూనిహైవ
భుఞ్జీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్|| 2-5 ||

ఉ.
గురునిఁ బితామహున్ గృపునిఁ గూరిమి మిత్రుల జంపుకంటె నేఁ
దిరిపెమునన్ దినమ్ముఁ గడదేర్చుట మేలనిపించుగాని నె
త్తురుఁ గలయంపి కూడుఁ దిన దూషితమౌ కులమున్ యశంబు సు
స్థిరమె ముకుంద ! రెండిట నిషిద్ధ మదెయ్యదొ తెల్పు మాధవా ! ౫

మహానుభావులైన గురువులను చంపక ఈ లోకమునందు భిక్షాన్నమైనను భుజించుట మంచిది. వారిని చంపినచో అత్తఱి వారి రక్తముతో తడిసిన ధనసంపదలనే, (కామ్య భోగ్యములనే) అనుభవించవలసి యుండును.

ఉ.
న చైతద్విద్మః కతరన్నో గరీయో,
యద్వా జయేమ యది వా నో జయేయుః|
యానేవ హత్వా న జిజీవిషామస్-
తేऽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః|| 2-6 ||

ఉత్పలమాల.
నెత్తురు కూటి కాసపడి నేను రణం బొనరింప నిందు నేఁ
జత్తునొ వారలే తుదకుఁ జచ్చెదరో యిరువాగులన్ ధ్వజం
బెత్తి జయించు వార లెవ రేర్పడఁ జెప్ప నెఱుంగరాని యీ
మిత్తికి దూకనేల గురుమిత్రుల బాంధవులన్ వధింపగాన్. ౬

పైగా ఈ యుద్ధమున మనము గెల్చుదుమో లేక వారే గెల్చుదురో చెప్పలేము. ఈ రెండిటిలో మనకేది శ్రేష్ఠమో కూడ తెలియదు. ఎవరిని చంపి మనము జీవించగోరమో అట్టి భీష్మాదులు యుద్ధమున మన యెదుట నిలిచి యున్నారు.

ఇంద్రవజ్ర.
కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః|
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేऽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్|| 2-7 ||

చంపకమాల.
కలుషితమయ్యె నా హృదయ కంజము కార్యవిచక్షణమ్ము నే
సలిపెడి బుద్ధిలేశము విచారముతో నడుగంటి పోయె ని
శ్చలతఁ గనంగ లేను సురసౌఖ్యములున్న ద్రిలోక్య రాజ్యముల్
గలిగినఁ గాని డెందము వికాసము నొందక డింది కుందెడున్.౭

(ఓ కృష్ణా ! ) కృపణత్వము (ఆత్మజ్ఞాన శూన్యత) అను దోషముచే కొట్టబడినవాడనగుటచే ధర్మ విషయమున సందేహము గలిగి నిన్నడుగుచున్నాను. ఏది నిశ్చయముగ శ్రేయస్కరమో దానిని చెప్పుము - నేను నీకు శిష్యుడను ; శరణు బొందిన నన్ను ' ఈ ప్రకారముగ నడువుము ' - అని శాసింపుము.

ఉ.
న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్|
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్|| 2-8 ||

ఉత్పలమాల.
సంగర మే యొనర్చి నిజ సంతతి గొంతులఁ గోసి పూజ్యు భీ
ష్ముం గురుదేవులన్ దునుము మూర్ఖతయే పరమార్థమౌనొ భి
క్షం గొని పొట్టపోసికొనఁగా నుచితమ్మగు కార్యమౌనొ శి
ష్యుం గరుణించి తెల్పు మరిసూదన ! పాదము లంటి వేడెదన్. ౮

ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును (స్వర్గమున) దేవతలయొక్క ఆధిపత్యమును పొందియుగూడ, ఇంద్రియములను శోషింప జేయుచున్న ఈ నా దుఃఖము నేది పోగొట్టగలదో దానిని కనుగొనజాలకున్నాను.

సఞ్జయ ఉవాచ|
అ.
ఏవముక్త్వా హృషీకేశం
గుడాకేశః పరన్తప|
న యోత్స్య ఇతి గోవిన్ద
ముక్త్వా తూష్ణీం బభూవ హ|| 2-9 ||

సంజయు వాక్యము|
కందము.
వ్యాకులమౌ చిత్తమున గు
డాకేశుం డిటుల బలికి డగ్గుత్తికతో
వీక జెడి నిరూత్తర తూ
ష్ణీ కారత నుండె ననికిఁ జింతఁ బొగులుచున్, ౯

ఇవ్విధముగ అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి ' నేను యుద్ధము చేయన ' ని పలికి యూరకుండెను.

అ.
తమువాచ హృషీకేశః
ప్రహసన్నివ భారత|
సేనయోరుభయోర్మధ్యే
విషీదన్తమిదం వచః|| 2-10 ||

తేటగీతి|..
అటుల ననిసీమ మధ్యమం దటమటించు
కంపమానాంగుఁ బార్థునిఁ గలయఁ జూచి
మందహాసమ్ముఁ జేసి గోవిందుఁ డిటుల
ధీరవాక్కుల ననియె సందియము దీర. ౧౦

ఓ ధృతరాష్ట్ర మహారాజా ! రెండు సేనల మధ్య విలపించుచున్న ఆ యర్జునుని జూచి శ్రీ కృష్ణుఢు నవ్వుచున్నవానివలె ఈ (క్రింది) వాక్యములను బలికెను.

శ్రీభగవానువాచ|
అ.
అశోచ్యానన్వశోచస్త్వం
ప్రజ్ఞావాదాంశ్చ భాషసే|
గతాసూనగతాసూంశ్చ
నానుశోచన్తి పణ్డితాః|| 2-11 ||

శ్రీ భగవానుల వాక్యము|
ఉత్పలమాల.
ధీరులుఁ బండితుల్ పలుకు తీరు వచింతువు లెమ్ము దీనతన్
జారియు భీష్ముఁడున్ గురుఁడుఁ జత్తురటంచు విచారమేల యీ
తీరున ధీరు లేడ్వరు గతించిన వారికి నున్నవారికిన్
వారలకున్ సమం బెపుడు వచ్చుచుబోవు శరీరకాష్ఠముల్ ౧౧

శ్రీ భగవంతుడు చెప్పెను.

( ఓ అర్జునా ! ) నీవు శోకింపదగని వారినిగూర్చి శోకించితివి. పైగా బుద్ధివాదముతో కూడిన వాక్యములనుగూడ పలుకు చున్నావు. జ్ఞానులగువారు మరణించినవారిని గుఱించిగాని, జీవించియున్న వారిని గుఱించిగాని యెన్నటికిని దుఃఖింపరు.

అ.
న త్వేవాహం జాతు నాసం
న త్వం నేమే జనాధిపాః|
న చైవ న భవిష్యామః
సర్వే వయమతః పరమ్|| 2-12 ||

ఉత్పలమాల.
నీవును నేను ముందట మరిప్పు డొకప్పుడు నున్నవార మం
చీవు గ్రహింపు మిచ్చటి నరేంద్రులుఁ గూడఁ ద్రికాల జీవులై
చావును బుట్టుకల్ గలిగి జన్మ పరంపర నొందు వారలే
కావునఁ బండితుల్ దిగులుఁ గాంచరు దీని నెఱింగి యర్జునా ! ౧౨

అర్జునా నేనుగాని, నీవుగాని, (యుద్ధభూమియందుగల) రాజులుగాని, ఒకప్పుడును లేనివారము కాము. ముందును లేకపోవువారము కాము.

అ.
దేహినోऽస్మిన్యథా దేహే
కౌమారం యౌవనం జరా|
తథా దేహాన్తరప్రాప్తి
ర్ధీరస్తత్ర న ముహ్యతి|| 2-13 ||

కందము.
యౌవన కౌమారములు జ
రావస్థల కెటుల ప్రకృతమౌ దేహంబుల్
ఆ విధి దేహాంతరము న
కై విలపింపరు బుధాగ్రగణ్యులు పార్థా ! ౧౩

జీవున కీ శరీరమునందు బాల్య, యౌవన, వార్ధక్యములను అవస్థ లెట్లు కలుగుచున్నవో అట్లే మరణానంతరము మఱియొక శరీరమును బొందుటయు తటస్థించుచున్నది. కావున నివ్విషయమున జ్ఞానియగువా డెంతమాత్రమును మోహమును(శోకమును) జెందడు.

అ.
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ
శీతోష్ణసుఖదుఃఖదాః|
ఆగమాపాయినోऽనిత్యా
స్తాం స్తితిక్షస్వ భారత|| 2-14 ||

కందము..
శీతోష్ణము సుఖ దుఃఖము
శ్రోత్రా దీంద్రియ వికార చోదితములె యౌ
భీతి యుడుగు యోగవియో
గాతురము లనిత్యముల్ గదా కౌంతేయా ! ౧౪

ఓ అర్జునా ! ఇంద్రియములయొక్క శబ్దస్పర్శాది విషయసంయోగములు ఒకపుడు శీతమును, ఒకపుడు ఉష్ణమును, ఒకపుడు సుఖమును, మరియొకపుడు దుఃఖమును

గలుగజేయు చుండును. మఱియు నవి రాకపోకడలు గలవియై, అస్థిరములై యున్నవి. కాబట్టి వానిని ఓర్చుకొనుము.

అ.
యం హి న వ్యథయన్త్యేతే
పురుషం పురుషర్షభ|
సమదుఃఖసుఖం ధీరం
సోऽమృతత్వాయ కల్పతే|| 2-15 ||

కందము.
సమముగ సుఖదుఃఖమ్ములు
గమనించి చలింపకుండ గలుగు నరుండున్
సమబుద్ధిన్ ద్వంద్వమ్ముల
గమియించెడు వాఁడె ముక్తి గాంచెడు పార్థా ! ౧౫

పురుష శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఎవనిని ఈ శబ్దస్పర్శాదులు బాధింపవో (చలింపజేయవో), సుఖదుఃఖములందు సమభావముగల అట్టి ధీరుడే మోక్షమున కర్హు డగును.

అ.
నాసతో విద్యతే భావో
నాభావో విద్యతే సతః|
ఉభయోరపి దృష్టోऽన్త
స్త్వనయోస్తత్త్వదర్శిభిః|| 2-16 ||

తేటగీతి.
సత్తు లేకుందఁ బోవ దసత్త దెప్పు
డున్న దనరాదు జ్ఞాను లీయుభయ తత్త్వ
ములను బాగుగాఁ దెలిసికోగలరు సుమ్ము
అస్థిరత్వమ్మునకు మోహమందకుండ. ౧౬

అసత్యములై (నామరూపాత్మకములై, నశించు స్వభావముగలవియై) నట్టి దేహాదులకు ఉనికి లేదు. సత్యమైనట్టి ఆత్మకు లేమి లేదు. తత్త్వజ్ఞానులగువారీ రెండిటియొక్క నిశ్చయమును బాగుగ తెలిసికొనియున్నారు.

అ.
అవినాశి తు తద్విద్ధి
యేన సర్వమిదం తతమ్|
వినాశమవ్యయస్యాస్య
న కశ్చిత్కర్తుమర్హతి|| 2-17 ||

ఉత్పలమాల.
ఏది వినాశముం గనక నెల్ల జగంబుల నిండి యున్నదో
పోదది నిత్యమం చెఱుగఁబోలుఁ గిరీటి ! వికారమందగా
లేదది సంహరింపగను లేశము శక్యముఁ గాని దాత్మగా
మేదిని నిండియున్నది య మేయ మహత్తరమైన సత్త్వమై. ౧౭

ఓ అర్జునా ! ఈ సమస్తప్రపంచమున్ను ఏ పరమాత్మచేత వ్యాపింపబడి యున్నదో, అది నాశరహితమై యున్నదని యెఱుఁగుము. అవ్యయమగు అట్టి ఆత్మకు వినాశము నెవడును కలుగజేయ జాలడు.

అ.
అన్తవన్త ఇమే దేహా
నిత్యస్యోక్తాః శరీరిణః|
అనాశినోऽప్రమేయస్య
తస్మాద్యుధ్యస్వ భారత|| 2-18 ||

ఆటవెలది.
నిర్వికారి దేహి నిత్యమ్ము ప్రత్యక్ష
మౌ నిదర్శనముల కలవి కాడు
దృశ్య రూపముల్ శరీరముల్ నాశముల్
గనును పార్థ యుద్ధమునకు లెమ్ము. ౧౬

ఓ అర్జునా ! నిత్యుడును, నాశరహితుడును, అప్రమేయుఁడునగు దేహి (ఆత్మ) యొక్క ఈ దేహములు నాశవంతములుగ జెప్పబడినవి.(ఆత్మయే శాశ్వతుడు). కాబట్టి (ఆత్మను గూర్చి కాని, దేహమును గూర్చికాని, శోకమును వదలి ) నీవు యుద్ధము చేయుము.

అ.
య ఏనం వేత్తి హన్తారం
యశ్చైనం మన్యతే హతమ్|
ఉభౌ తౌ న విజానీతో
నాయం హన్తి న హన్యతే|| 2-19 ||

ఉత్పలమాల.
ఏరి వశమ్ముగాదు వధియింపగ దేహిని దేహి యెన్న డె
వ్వారలచే వధింపబడు వాఁడును కాడటులన్ దలంచు న
వ్వారుభయుల్ వివేక లవంబు నెఱుంగరు తత్త్వేమేమియున్
జేరవు కర్తృ భోక్తృతలు జీవిని యెన్నడు సుంత యేనియున్. ౧౯

ఎవడీ యాత్మను చంపువానినిగ నెఱుఁగునో లేక ఎవడు చంపబడువానినినగ భావించునో వారిరువురును వాస్తవమెఱిఁగినవారు కాదు. యథార్థముగ ఈ యాత్మ దేనిని చంపుట లేదు, దేని చేతను చంపబడుట లేదు.

ఉ.
న జాయతే మ్రియతే వా కదాచిన్
నాయం భూత్వా భవితా వా న భూయః|
అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే|| 2-20 ||

ఉత్పలమాల.
పుట్టదు గిట్ట దెప్పుడును బుట్టుక జావులు హానివృద్ధు లే
పట్టున నంటరావు నిరపాయము శాశ్వతమైన దాత్మ ; యీ
పుట్టుకఁ జావులన్నియు విభూతి యధోగతు లెంచిచూడ నీ
కట్టియ కే యటంచు బుధ గణ్యు లెఱుంగుదు రో పరంతపా ! ౨0

ఈ ఆత్మ ఎప్పుడును పుట్టుట లేదు. చచ్చుట లేదు. ఇదివఱకు లేకుండి మరల క్రొత్తగా కలుగువాఁడుకాదు. (ఉండి మరల లేకుండువాఁడునుకాదు.) ఈతడు జననమరణములు లేనివాడు ; శాశ్వతుడు. పురాతనుడు. శరీరము చంపబడినను ఈతడు చంపబడుట లేదు.

అ.
వేదావినాశినం నిత్యం
య ఏనమజమవ్యయమ్|
కథం స పురుషః పార్థ
కం ఘాతయతి హన్తి కమ్|| 2-21 ||

ఉత్పలమాల.
దేహి సనాతనుండు పరిదృశ్య శరీరగతుం డొకండె యం
చూహ నెఱుంగు తాత్త్విక మహోదయు లెల్లరు నద్వితీయమౌ
దేహి వధించు నెవ్వరి వధింపబడున్ మరి యేరిచే సదా
దేహమె కర్తృ భోక్తృత గతిన్ జరియించు నటం చెఱుంగరే ౨౧

ఓ అర్జునా ! ఈ ఆత్మ నెవడు జననమరణములు లేనివానిగను, నాశరహితునిగను, నిత్యునిగను ఎఱుఁగునో, అట్టివా డెట్లు ఒకనిని చంపించగలడు, తాను చంపగలడు ?

ఉ.
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోऽపరాణి|
తథా శరీరాణి విహాయ జీర్ణా-
న్యన్యాని సంయాతి నవాని దేహీ|| 2-22 ||

చంపకమాల.
మలినపు వస్త్రముల్ విడిచి మంచి దుకూలములన్ ధరించు టె
ట్లలవడి యున్నదో నరున కట్లె కృశించు శరీర పంజరం
బుల విడనాడి నవ్యములఁ బొందుట దేహికి సాజవృత్తియౌ;
కలత వహింపఁ బోరు గుణ గణ్యులు దీని నెఱింగి యర్జునా !౨౨

చినిగి పోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరములగు క్రొత్త బట్టలనెట్లు ధరించుచున్నాడో, అట్లే దేహి యగు ఆత్మయు శిథిలములైన పాత శరీరములను వదలి క్రొత్త శరీరములను ధరించుచున్నాడు.

అ.
నైనం ఛిన్దన్తి శస్త్రాణి
నైనం దహతి పావకః|
న చైనం క్లేదయన్త్యాపో
న శోషయతి మారుతః|| 2-23 ||

అనుస్టుప్
అచ్ఛేద్యోऽయమదాహ్యోऽయ
మక్లేద్యోऽశోష్య ఏవ చ|
నిత్యః సర్వగతః స్థాణు
రచలోऽయం సనాతనః|| 2-24

అ.
అవ్యక్తోऽయమచిన్త్యోऽయ
మవికార్యోऽయముచ్యతే|
తస్మాదేవం విదిత్వైనం
నానుశోచితుమర్హసి|| 2-25 ||

ఉత్పలమాల.
నేరవు శస్త్రముల్ దునుమ, నేరఁడు పావకుఁడున్ దపింపగా,
నేరవు నీరముల్ దడుప, నేరదు గాలియు నారఁ జేయగా,
నేరవు పంచభూతములు నిష్కృతిఁ జేయ ; సనాతనమ్ము సు
మ్మారయ నిత్యమై యచలమై జగమంతయు నాత్మ నిండెడున్.. ౨౩
కందము.
ఇంద్రియములకు నగోచర
మంద్రు, మనంబునకు నయిన నందక, దృటియై
నం, ద్రపనొందని యాత్మకు
నింద్రసుతా ! తగదు వగవ నీ విమ్మాడ్కిన్ ౨౪

ఈ ఆత్మను ఆయుధము లెవ్వియును ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి యెండింపజాలదు.ఈ ఆత్మ ఛేదింపబడజాలడు, దహింపబడజాలడు, తడుపబడజాలడు, ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థిరస్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు.ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానివాడు, మనస్సుచే చింతింప శక్యము కానివాడు, వికారములు బొందింపదగనివాఁడునని చెప్పబడుచున్నాడు. కావున ఈ ప్రకారముగ తెలిసికొని నీవు దుఃఖపడకుము.

అ.
అథ చైనం నిత్యజాతం
నిత్యం వా మన్యసే మృతమ్|
తథాపి త్వం మహాబాహో
నైవం శోచితుమర్హసి|| 2-26 ||

ఉత్పలమాల.
దేహికిఁ జావుపుట్టుక ల దేపనిగాఁ గలవంచు నెంచు నీ
యూహయె సత్యమన్నను వియోగము యోగము రెండు నిత్యమౌ;
దేహికినై వగం బొగులు దేల వచింపుము నాకు నో మహా
బాహ ! ధనంజయా ! తగదు వంతను బొందుట మాను మియ్యెడన్. ౨౫

ఓ అర్జునా ! ఒకవేళ ఈ ఆత్మ (దేహముతో పాటు) నిరంతరము పుట్టుచు చచ్చుచు నుండువాఁడని తలంచినను, అట్టి స్థితియందుగూడ నీవీ ప్రకారము శోకించుట తగదు.

అ.
జాతస్య హి ధ్రువో మృత్యు
ర్ధ్రువం జన్మ మృతస్య చ|
తస్మాదపరిహార్యేऽర్థే
న త్వం శోచితుమర్హసి|| 2-27 ||

చంపకమాల.
జననము నొంది చచ్చుట నిజమ్మగుఁ, జచ్చిన తోడనే పున
ర్జననము నొందుచుంటయు నిజమ్మగు, జర్విత చర్వణమ్ముగా
ననుదిన సంభవమ్ములను, నావలి చావుల నెవ్వరున్ నివా
రణ మొనరింప నేరరు ; పరంతప ! దీనికి వంత యేటికిన్. 26

(ఒకవేళ నీ వీ యాత్మను చావుపుట్టుకలు కలవానినిగ తలంచెదవేని అత్తఱి) పుట్టినవానికి చావు తప్పదు. చచ్చిన వానికి పుట్టక తప్పదు. తప్పనిసరియగు ఆ విషయమున నీవిక శోకించుట యుక్తము కాదు.

అ.
అవ్యక్తాదీని భూతాని
వ్యక్తమధ్యాని భారత|
అవ్యక్తనిధనాన్యేవ
తత్ర కా పరిదేవనా|| 2-28 ||

కందము.
తుదియేదొ మొదల దెయ్యదొ
మది నూహింపంగ రాక , మధ్యస్థితియే
విదితమగు ; దేహముల బు
ద్బుదములకై వగను బొగుల బోలునె పార్థా !

ఓ అర్జునా ! ప్రాణికోట్లన్నియు పుట్టుకకు పూర్వము కనబడకయు, పుట్టినపిదప (దేహముతోగూడి) కనబడుచును, మరణించిన పిదప మరల కనబడకయు నుండుచున్నవి. అట్టివాని విషయమై శోకింపనేల ? ( మొదట కనబడక, మరల కనబడి, తిరిగి అంతరించిపోవు భ్రాంతిరూపములైన ఈ దేహములకొఱకై దుఃఖింపనేలయని భావము. లేక, ఆదియందు ఏ అవ్యక్తరూపము గల్గి యున్నవో, అట్టి అవ్యక్త రూపమునే తిరిగి అంత్యమున ధరించుచుండ నిక దానికై శోకింపనేల ? అనియు చెప్పవచ్చును.)

ఇం.
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన-
మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః|
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్|| 2-29 ||

కందము.
వింతగఁ జూతురు కొందఱు ;
వింతగఁ బల్కెదరు దీని వివిధ విధములన్ ;
వింతగ వినియును, నాత్మ ర
వంతైనన్ దెలియఁజాల రా యర్థంబున్. 28

ఈ ఆత్మను ఒకానొకడు ఆశ్చర్యమైనదానినివలె చూచుచున్నాడు. మఱియొకడు ఆశ్చర్యమైనదానినివలె ( దీనిని గూర్చి) చెప్పుచున్నాడు. అట్లే వేఱొకడు ఆశ్చర్యమైన దానినివలె దీనిని గూర్చి వినుచున్నాడు. అట్లు వినియు, చూచియు, చెప్పియు గూడ ఒకడును దానిని సరిగా తెలిసికొనుటలేదు ( సాక్షాత్తుగ అనుభవించుటలేదు) .

అ.
దేహీ నిత్యమవధ్యోऽయం
దేహే సర్వస్య భారత|
తస్మాత్సర్వాణి భూతాని
న త్వం శోచితుమర్హసి|| 2-30 ||

తేటగీతి.
దేహముల యందు నుండు నీ దేహి యెపుడుఁ ;
జంపఁ బడుటయు లే దేరిఁ జంప లేడు ;
దేహము లనిత్య మనియు, నా దేహి నిత్య
మని, యెఱుంగుము నీవు పృథాతనూజ ! ౨౯

అర్జునా సమస్తప్రాణికోట్లయొక్కయు దేహములందు వసించియున్నఈ ఆత్మ యెన్నడును చంపబడడు . కావున ఏ ప్రాణిని గూర్చియు నీవు శోకింపదగదు.

అ.
స్వధర్మమపి చావేక్ష్య
న వికమ్పితుమర్హసి|
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోऽన్యత్
క్షత్రియస్య న విద్యతే|| 2-31 ||

ఉత్పలమాల.
ఆజి స్వధర్మ మౌట విజయా ! యని సేయుము, ధర్మయుద్ధమే
రాజుల సంప్రదాయమయి రాజిలు ; నుత్తమ ధర్మమైన దీ
యోజ, భయాన్వితుండవయి యుద్ధము మానుట పాడిగాదు ; నీ
తేజముఁ గీర్తియున్ దొలగు, దీనతకున్ దగ విట్టు లర్జునా  ! ౩౦

మఱియు ఓ అర్జునా ! స్వకీయమగు క్షత్రియధర్మమును విచారించుకొనినను యుద్ధమునకు వెనుదీయుట నీకు సరియైనదిగాదు ఏలయనిన,

క్షత్రియునకు ధర్మయుద్ధముకంటె, శ్రేయస్కరమైనది మఱియొకటి లేదుకదా !

అ.
యదృచ్ఛయా చోపపన్నం
స్వర్గద్వారమపావృతమ్|
సుఖినః క్షత్రియాః పార్థ !
లభన్తే యుద్ధమీదృశమ్|| 2-32 ||

కందము.
కోర క యాచితముగ నీ
తీరునఁ బై పడిన రణముఁ దెగడకు ; స్వర్గ
ద్వారమ్ము నిరాఘాట
మ్మై, రాజులు సుఖము గనుదు రమరత్వంబున్. ౩౧

ఓ అర్జునా ! అప్రయత్నముగనే లభించినట్టిదియు, తెఱవబడిన స్వర్గద్వారము వంటిదియు (స్వర్గమును గలుగజేయునదియు) నగు ఇట్టి యుద్ధమును ఏ క్షత్రియులు పొందుదురో వారు నిక్కముగ సుఖవంతులే యగుదురు.

అ.
అథ చేత్త్వమిమం ధర్మ్యం
సంగ్రామం న కరిష్యసి|
తతః స్వధర్మం కీర్తిం చ
హిత్వా పాపమవాప్స్యసి|| 2-33 ||

అ.
అకీర్తిం చాపి భూతాని
కథయిష్యన్తి తేऽవ్యయామ్|
సమ్భావితస్య చాకీర్తి
ర్మరణాదతిరిచ్యతే|| 2-34 ||

ఉత్పలమాల.
ఈ విటు యుద్ధమున్ దొలగుదేని గడించిన నీ యశమ్ము మ
న్నౌ; విధికృత్యమున్ విడువ నాయఘ మెల్లను జుట్టు ముట్టగా,
వానిని యెల్లరున్ మిగుల వాకొను చుందురు నీ యకీర్తి నే ;
చావు ఘటింప మే లపయశస్సు భరించుట కంటె నర్జునా  ! ౩౨

ఇక నీవు ధర్మయుక్తమగు ఈ యుద్ధమును చేకొందువేని, దానిచే నీవు స్వధర్మమును నిరసించినవాడవై, కీర్తిని బోగొట్టుకొని పాపమును పొందగలవు. మఱియు లోకులు నీ యొక్క అపకీర్తిని చిరకాలమువఱకు చెప్పుకొను చుందురు. గౌరవముగ బ్రతికినవానికి అపకీర్తి చావుకంటెను అధికమైనది.

అ.
భయాద్రణాదుపరతం
మంస్యన్తే త్వాం మహారథాః|
యేషాం చ త్వం బహుమతో
భూత్వా యాస్యసి లాఘవమ్|| 2-35

అ.
అవాచ్యవాదాంశ్చ బహూ
న్వదిష్యన్తి తవాహితాః|
నిన్దన్తస్తవ సామర్థ్యం
తతో దుఃఖతరం ను కిమ్|| 2-36||

ఉత్పలమాల.
నాటి నృపుల్ మహారథులఁ జంపగ నీ యని సొచ్చి, కాళ్ళకున్
బాటన మబ్బఁ జేయ నగుఁ బాటున నిన్నికఁ గేలి సేయరే ?
నోటికి వచ్చినట్లనుచు న్యూనతఁ జూడరె నీదు శాత్రవుల్ ?
గాటపు దుఃఖమయ్యెడరు కంటె నికున్న దె సంస్మరింపగాన్. ౩౩

మఱియు ఇంతవఱకు ఏ మహారథులందు నీవు ఘనముగా భావింపబడుచుంటివో, వారెల్లరు నిన్నిపుడు చులకన జేసి భయముచే యుద్ధమునుండి మఱలిన వానినిగ నిన్ను దలంతురు. (ఇంతియేకాక అత్తఱి) శత్రువులు నీయొక్క సామర్థ్యమును దూషించుచు పెక్కు దుర్భాషణలనుగూడ పలుకగలరు. దానిని మించిన దుఃఖ మేమి కలదు ?

అ.
హతో వా ప్రాప్స్యసే స్వర్గం
జిత్వా వా భోక్ష్యసే మహీమ్|
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ
యుద్ధాయ కృతనిశ్చయః|| 2-37 ||

కందము.
చచ్చిన స్వర్గముఁ జొచ్చెద,
విచ్చటి యుద్ధమ్మునన్ జయించినచో రా
లచ్చిఁ గొని సుఖింతువు, వి
వ్వచ్చ! భయమ్ముడిగి లెమ్ము భండనమునకున్. ౩౪

అర్జునా ! ఒకవేళ నీ వీ ధర్మయుద్ధమందు శత్రులచే చంపబడినచో స్వర్గమును బొందెదవు. అట్లుగాక నీవే జయించినచో భూలోకరాజ్యము ననుభవించెదవు. ఈ ప్రకారముగ రెండు విధముల మేలే. కావున లెమ్ము, యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము.

అ.
సుఖదుఃఖే సమే కృత్వా
లాభాలాభౌ జయాజయౌ|
తతో యుద్ధాయ యుజ్యస్వ
నైవం పాపమవాప్స్యసి|| 2-38 ||

కందము.
సమముగ సుఖదుఃఖమ్ములు
సమదృష్టి జయాప జయము సమమని యని సే
యుము, పాప తతుల నంటవు
సమముగ లాభ మ్మలాభ సరణిం గనుచున్. ౩౫

సుఖదుఃఖములందును, లాభనష్టములందును, జయాపజయములందును సమబుద్ధిగలిగి యుద్ధమునకు సంసిద్ధుడవగుము. ఇట్లు చేసితివేని నీవు పాపమును పొందకుందువు.

అ.
ఏషా తేऽభిహితా సాఙ్ఖ్యే
బుద్ధిర్యోగే త్విమాం శృణు|
బుద్ధ్యా యుక్తో యయా పార్థ !
కర్మబన్ధం ప్రహాస్యసి|| 2-39 ||

కందము.
పరమార్థమౌ రహస్యము
నెఱిగించితి నీకు సాంఖ్య మియ్యది దీనిన్
నెరపగల కర్మ యోగముఁ
గఱపెద విను కర్మ బంధకములు దొలంగన్ ౩౬

ఓ అర్జునా ! ఇంతవఱకు సాంఖ్య శాస్త్రమున జెప్పబడిన ఆత్మతత్త్వనిశ్చయమును దెలిపియుంటిని. ఇక యోగశాస్త్రమందలి కర్మయోగసంబంధమైన వివేకమును నీకు దెలుపబోవుచున్నాను. అద్దాని నెఱిఁగినచో నీవు కర్మబంధము నుండి లెస్సగ విముక్తుడవు కాగలవు. కాబట్టి శ్రద్ధతో నాలకించుము.

అ.
నేహాభిక్రమనాశోऽస్తి
ప్రత్యవాయో న విద్యతే|
స్వల్పమప్యస్య ధర్మస్య
త్రాయతే మహతో భయాత్|| 2-40 ||

కందము.
ఈ కర్మ యోగ కృషికిన్
జేకూరవు మొదలు తుదల చెడు ఫలితమ్ము;
ల్లే కించుక నొనరించినఁ
దాకవు సంసారభయద తాపత్రయముల్. ౩౭

ఈ కర్మయోగము ప్రారంభింపబడినది నిష్ఫలమెన్నటికిని కానేరదు. పూర్తియగుటకు ముందుగా ఏ కారణముచేనైనను మధ్యలో నిలిచిపోయినను దోషము లేదు. ఈ కర్మానుష్ఠానమను ధర్మము ఒకింతైనను గొప్పదైన ( జననమరణప్రవాహరూపమైన ) సంసారభయము నుండి రక్షించుచున్నది.

అ.
వ్యవసాయాత్మికా బుద్ధి
రేకేహ కురునన్దన|
బహుశాఖా హ్యనన్తాశ్చ
బుద్ధయోऽవ్యవసాయినామ్|| 2-41 ||

ఆటవెలది.
కర్మ యోగ మార్గ గామియౌ వానికి
స్థిరత గలిగి బుద్ధి తేజరిల్లు;
నితర విషయలోలు రీ శాంతిఁ గనక న
నేక గతుల బుద్ధి సేకరింత్రు. ౩౮

అర్జునా ! ఈ కర్మయోగానుష్ఠానమున నిశ్చయముతో గూడిన బుద్ధి ఒకటియే. నిశ్చయము లేనివారల బుద్ధులు పలువిధములుగను అనంతములుగను ఉన్నవి.

అ.
యామిమాం పుష్పితాం
వాచం ప్రవదన్త్యవిపశ్చితః|
వేదవాదరతాః పార్థ !
నాన్యదస్తీతి వాదినః|| 2-42 ||

అ.
కామాత్మానః స్వర్గపరా
జన్మకర్మఫలప్రదామ్|
క్రియావిశేషబహులాం
భోగైశ్వర్యగతిం ప్రతి|| 2-43 ||
అ.
భోగైశ్వర్యప్రసక్తానాం
తయాపహృతచేతసామ్|
వ్యవసాయాత్మికా బుద్ధిః
సమాధౌ న విధీయతే|| 2-44 ||

ఉత్పలమాల.
కోరిక లూరు మానవు లకుంఠిత భోగవిలోలతన్ ప్రసం
గా రతి వేదవాక్కులని కామపరాయణులై మనోజ్ఞ వి
స్ఫారిత పుష్పగుచ్ఛ సదృశమ్మగు పల్కులఁ బల్కుచుందు ; రీ
నీరస భావు లెందుగన నేర్తురె మహనీయ తేజమున్ ? ౩౯
కందము.
భోగైశ్వర్యములకునై
రాగిలు హృదయాంతరమ్ము రగులును కార్యో
ద్వేగపు డోలలఁ దోగుచు,
రాగ రహిత కర్మయోగ రమ్యత గనునే ? ౪౦

ఓ అర్జునా ! వేదమునందు ఫలమునుదెలుపు భాగములం దిష్టముకలవారును, అందుజెప్పబడిన స్వర్గాది ఫలితములకంటె అధికమైనది వేఱొకటియెద్దియు లేదని వాదించువారును, విషయవాంఛలతో నిండిన చిత్తముకలవారును, స్వర్గాభిలాషులు నగు అల్పజ్ఞులు, జన్మము, కర్మము, తత్ఫలమునొసంగునదియు, భోగైశ్వర్యసంపాదనకై వివిధ కార్యకలాపములతో గూడినదియు, ఫలశూన్యమైనదియు నగు ఏ వాక్యమును చెప్పుచున్నారో, అద్దానిచే నపహరింపబడిన చిత్తము కలవారును ( ఆ వాక్యమును నమ్మి దృశ్యవ్యామోహమందుపడువారును ) భోగైశ్వర్యప్రియులునగు జనులకు దైవధ్యానమందు ( సమాధినిష్టయందు ) నిశ్చయమైన ( ఏకాగ్రమైన ) బుద్ధి కలుగనే కలుగదు.

అ.
త్రైగుణ్యవిషయా వేదా
నిస్త్రైగుణ్యో భవార్జున|
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో
నిర్యోగక్షేమ ఆత్మవాన్|| 2-45 ||

తేటగీతి.
విషయ జాలమ్ము బోధించు వేదకర్మ ;
నిర్వికార నిర్ద్వంద్వత్వ నియతి గనుచు,
నప్రమత్తత సత్త్వగుణప్రధాన
నిరతిఁ గాంచుము నీవు కుంతీ కుమార ! ౪౧

ఓ అర్జునా ! వేదములు ( అందలి పూర్వభాగమగు కర్మకాండము ) త్రిగుణాత్మకములగు ( సంసార ) విషయములను తెలుపునవిగా నున్నవి. నీవు త్రిగుణములను వదలినవాడవును, ద్వంద్వములు లేనివాడవును, నిరంతరము శుద్ధసత్త్వము నాశ్రయించినవాడవును, యోగక్షేమములదృష్టి లేనివాడవును, ఆత్మజ్ఞానివియు కమ్ము.

అ.
యావానర్థ ఉదపానే
సర్వతః సమ్ప్లుతోదకే|
తావాన్సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః|| 2-46 ||

కందము.
కూపోద పాన జలముల
బ్రాపించు ప్రయోజనమ్ము, లాపుష్కరిణిన్
లోపించునె ? బ్రహ్మవిదుం
డీ పురుషార్థముల నెఱుగఁడే కౌంతేయా ! ౪౨

స్నాన పానాదుల కుపయుక్త మగు స్వల్ప జలముగల బావిమొదలగువానియందెంత ప్రయోజనముకలదో, అంతప్రయోజనము అంతటను నీటితోనిండియున్న మహత్తరజలప్రవాహమునం దిమిడియున్న చందమున వేదములందు జెప్పబడిన సమస్త కర్మములందును ఎంతప్రయోజనముకలదో అంత ప్రయోజనము పరమార్థతత్త్వమునెఱిఁగిన బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమున నిమిడియున్నది.

అ.
కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన|
మా కర్మఫలహేతుర్భూ
ర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి|| 2-47 ||

ఉత్పలమాల.
కర్మల నాచరించు నధికారమెయున్నది కాని, సుంతయున్
గర్మ ఫలంబులందు నధికారము లేదిక ; వ్యర్థమౌ తృషన్
గర్మకు దూకగా వల, దకర్మ తెఱంగునఁ బోకు మెన్నడున్ ;
నిర్మమకార కర్మ ధృతి నించుము నీ మనమందు నర్జునా ! ౪౩

( అర్జునా ! ) నీకు కర్మనుచేయుటయందే అధికారము కలదు. కర్మఫలములనాశించుటయం దేనాడును నీ కధికారము లేదు. కర్మఫలములకు నీవు కారణభూతుడవు కాకుము. మఱియు కర్మలు మానుటయందును నీ కాసక్తి కలుగకుండు గాక !

అ.
యోగస్థః కురు కర్మాణి
సఙ్గం త్యక్త్వా ధనఞ్జయ|
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా
సమత్వం యోగ ఉచ్యతే|| 2-48 ||

కందము.
ఫలతృష్ణ లేకఁ , గార్యం
బుల జేసి, ఫలాఫలంబుల పొంతఁ గనకు మీ ;
తుల దృష్టి సమతయే ని
స్తుల యోగ మటంచుఁ బల్కుదురు ధీమంతుల్. ౪౪

ఓ అర్జునా ! నీవు యోగనిష్ఠయందుండి , సంగమును త్యజించి, కార్యము ఫలించినను, ఫలించకపోయినను సమానముగ నున్నవాడవై కర్మలను జేయుము. అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును.

అ.
దూరేణ హ్యవరం కర్మ
బుద్ధియోగాద్ధనఞ్జయ|
బుద్ధౌ శరణమన్విచ్ఛ
కృపణాః ఫలహేతవః|| 2-49 ||

చంపకమాల.
ఫలముల కాసఁజెంది, తృష వర్ధిలు కార్యకలాప వహ్నిలోఁ
దలపడబోకు, యోగ నిరతాశ్రయముం గొని యుండుమా ! నికృ
ష్టుల విధి, గామ్యకర్మముల చొప్పున నేగకు ; గర్హ్యమైన తె
న్నులు సుమ ! కాముకాంధ కృపణుల్ జనుత్రోవ గమింప బోకుమా ! ౪౫

ఓ అర్జునా ! (పైన దెల్పిన) సమత్వబుద్ధితో గూడిన నిష్కామకర్మముకంటె ఫలాపేక్షతో గూడిన కామ్యకర్మము చాల తక్కువైనది గదా ! కావున సమత్వరూపమైన అట్టి నిష్కామకర్మానుష్ఠానబుద్ధినే నీ వాశ్రయింపుము. ఫలమును గోరువారు అల్పులు ( దీనులు ).

అ.
బుద్ధియుక్తో జహాతీహ
ఉభే సుకృతదుష్కృతే|
తస్మాద్యోగాయ యుజ్యస్వ
యోగః కర్మసు కౌశలమ్|| 2-50 ||

అ.
కర్మజం బుద్ధియుక్తా హి
ఫలం త్యక్త్వా మనీషిణః|
జన్మబన్ధవినిర్ముక్తాః
పదం గచ్ఛన్త్యనామయమ్|| 2-51 ||

చంపకమాల.
సమత నెఱుంగు కర్తకు విచారములుండవు, పాపపుణ్య లే
శములు రవంత యంటవు ; ప్రశాంత మనమే లభించుఁ, గ
ర్మముల చమత్కృతిన్ గనుము ; మాన్యుల పండిత మర్మమైన క
ర్మముల పథమ్ము నేగిన, నిరామయ సుస్థిర ధామ మందనౌ. ౪౬

సమత్వబుద్ధిగలవాడు పుణ్యపాపముల రెండిటిని ఈ జన్మయందే తొలగించుకొనుచున్నాడు. కావున నట్టి సమత్వబుద్ధియుక్తమగు నిష్కామకర్మయోగము కొఱకు యత్నింపుము. కర్మయందలి నేర్పరితనమే యోగమనబడును. సమత్వబుద్ధితో గూడిన వివేకవంతులు కర్మముల నొనర్చుచున్నను వాని ఫలమును త్యజించివైచి జననమరణరూప మను బంధమునుండి విడుదలను బొందినవారై దుఃఖరహితమగు మోక్షపదవిని బొందుచున్నారు.

అ.
యదా తే మోహకలిలం
బుద్ధిర్వ్యతితరిష్యతి|
తదా గన్తాసి నిర్వేదం
శ్రోతవ్యస్య శ్రుతస్య చ|| 2-52 ||

తేటగీతి.
కలుషరహితుండు నిర్మోహ కర్మయోగి
బుద్ధి సుస్థిరమై , పలు పోక లుడిగి ,
వినదగిన దానియందును , విన్నదాని
యందు వైరాగ్యభావమే యొందుచుండు. ౪౭

అర్జునా ! నీ బుద్ధి యెపుడు అజ్ఞానమను మాలిన్యమును దాటివేయునో ( తొలగించుకొని పరిశుద్ధమగునో ) అపు డిక వినవలసినదానిని గూర్చియు , వినిన దానిని గూర్చియు , నీవు విరక్తిని కలిగియుందువు.

అ.
శ్రుతివిప్రతిపన్నా తే
యదా స్థాస్యతి నిశ్చలా|
సమాధావచలా బుద్ధిస్తదా
యోగమవాప్స్యసి|| 2-53 ||

తేటగీతి.
కర్మ ఫలముల సక్తి పోకడ లడంగి ,
నిశ్చలమ్మయి బుద్ధి వినిర్మలమగు ;
నాత్మ సాదృశ్య నిర్మలానంద మొంది
యచలమై స్థాణువై యలరారుచుండు.

నానా విధములగు శ్రవణాదులచే కలతజెందియున్న నీ బుద్ధి యెపుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగ నిలిచియుండునో, అపుడు నీ వాత్మ సాక్షాత్కారమును బొందగలవు.

అర్జున ఉవాచ|
అ.
స్థితప్రజ్ఞస్య కా భాషా
సమాధిస్థస్య కేశవ|
స్థితధీః కిం ప్రభాషేత
కిమాసీత వ్రజేత కిమ్|| 2-54 ||

అర్జును వాక్యము:
తేటగీతి.
ఈ స్థిత ప్రజ్ఞు నెట్టుల నెఱుగవలయు ,
నెటుల భాషించు, మనమెట్టి యెడకుఁ బోవు,
నెట్టి యాకృతి గూర్చుండు , నెటుల జెపుమ
సర్వము న్నాకు గేశవా ! సాంగముగను. ౪౯

ఓ కృష్ణా ! సమాధియందున్న స్థితప్రజ్ఞుడగు జీవన్ముక్తునియొక్క లక్షణ మేమి ? ఆత డెట్లు మాట్లాడును ? ఏ రీతిగ నుండును ? ఎట్లు సంచరించును ?

శ్రీభగవానువాచ|
అ.
ప్రజహాతి యదా కామా
న్సర్వాన్పార్థ మనోగతాన్|
ఆత్మన్యేవాత్మనా తుష్టః
స్థితప్రజ్ఞస్తదోచ్యతే|| 2-55 ||

శ్రీ భగవానుల వాక్యము.
చంపకమాల.
మనమునఁ గామ్య రాశి పరిమార్చి, హృదంతరమందు బాహ్య లాం
ఛన ఫలముల్ త్యజించియుఁ, బ్రశాంత మనంబును గాంచి, యాత్మ నా
త్మనుఁగని, తుష్టితో నిరుపమాన సుఖంబును గాంచుచుండు, నా
జనుండె స్థిత ప్రధీరుఁడగు సంయమి యంచు వచింత్రు పండితుల్. ౫౦

ఓ అర్జునా ! ఎప్పుడు మనుజుడు తన మనస్సునందున్నట్టి కోరికలన్నిటిని సంపూర్ణముగ వదలివేయునో, మఱియు ఆత్మయందే ఆత్మచే ( నిర్మల చిత్తముతో ) నిరంతరము సంతుష్ఠిని బొందుచుండువో , అప్పు డాతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.

అ.
దుఃఖేష్వనుద్విగ్నమనాః
సుఖేషు విగతస్పృహః|
వీతరాగభయక్రోధః
స్థితధీర్మునిరుచ్యతే|| 2-56 ||

కందము.
వంతలకు వగవకుండును ,
కాంతా సుత చందనములఁ గమనీయ సుఖ
భ్రాంతి ద్వేషముల భయా
క్రాంతుఁడు గాకుండు ; స్థిరత గాంచు నతండున్. ౫౧

దుఖములందు కలత నొందని మనస్సుగలవాడును, సుఖములందు ఆసక్తి లేనివాడును అనురాగము, భయము, కోపము తొలగినవాడు నగు (ఆత్మ) మనన శీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును.

అ.
యః సర్వత్రానభిస్నేహ
స్తత్తత్ప్రాప్య శుభాశుభమ్|
నాభినన్దతి న ద్వేష్టి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-57 ||

తేటగీతి.
ఎవఁడు దేహ జీవితరక్తి కవశు డగునొ ,
యశుభ శుభముల ప్రాప్తి దుఃఖాతి తోష
ములను జెందక, ధీర నిశ్చలత గాంచు,
నతఁడె స్థిత ధీరుఁడని చెప్ప నగును పార్థ ! ౫౨

ఎవడు సమస్తవిషయములందును ( దేహ, బంధు, భోగాదులు ) అభిమానములేకయుండునో , ఆయా ప్రియాప్రియములు సంభవించినను సంతోషమునుగాని, ద్వేషమునుగాని బొందకుండునో అట్టివాని జ్ఞానము మిగుల స్థిరమైనది యగును( అట్టివాడే స్థితప్రజ్ఞుడు ).

అ.
యదా సంహరతే చాయం
కూర్మోऽఙ్గానీవ సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్య
స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-58 ||

చంపకమాల.
స్వవశత నొంది కూర్మము నిజాంగములన్ ముకిళించు నెట్టు, ల
ట్లెవఁడు నిజేంద్రియాళి విషయేచ్ఛలకున్ విముఖంబు జూపునో,
యెవఁ డనురాగ తాపముల యేడ్తెరకున్ జలియింపకుండునో,
యెవని సుహృద్రసమ్ము పర మేశ విలుప్తమొ, వాఁడె ధూరుడౌ. ౫౩

తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు, యోగి యెపుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థములను విషయములనుండి సర్వత్ర

వెనుకకు మరల్చుచున్నాడో, అపు డాతని జ్ఞానము మిగుల స్థిరమైనది యగును. ( అతడు స్థితప్రజ్ఞుడు )

అ.
విషయా వినివర్తన్తే
నిరాహారస్య దేహినః|
రసవర్జం రసోऽప్యస్య
పరం దృష్ట్వా నివర్తతే|| 2-59 ||

అ.
యతతో హ్యపి కౌన్తేయ
పురుషస్య విపశ్చితః|
ఇన్ద్రియాణి ప్రమాథీని
హరన్తి ప్రసభం మనః|| 2-60 ||

అ.
తాని సర్వాణి సంయమ్య
యుక్త ఆసీత మత్పరః|
వశే హి యస్యేన్ద్రియాణి
తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-61 ||

చంపకమాల.
తెలిసిన జ్ఞానియు న్నొ కొక తేప హఠాత్తున నీ ప్రమాద మం
దలము కొనున్ , దురంత విషయానల కీలల ; గాన , నన్నె ని
శ్చల హృదయమ్మునన్ నిలిపి , సర్వము నేనె యటంచు నెంచు , ని
ర్మల మగు చిత్తమున్ గనిన , మౌని యటందురు వాని బండితుల్. ౫౪

శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవునకు , ఆ విషయములు తొలగుచున్నవే కాని, వానిఁగూర్చిన వాసన పోవుటలేదు. పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతోపాటు తొలగిపోవుచున్నది. ఓ అర్జునా ! ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలయనిన, ఆత్మావలోకనముకొఱకు యత్నించుచున్నట్టి విద్వాంసుడగు మనుజునియొక్క మనస్సునుగూడ నయ్యవి బలాత్కారముగ ( విషయములపైకి ) లాగుకొని పోవుచున్నవి. ( బలవత్తరములగు ) అట్టి యింద్రియములన్నిటిని చక్కగ వశపఱచుకొని సాధకుడు మనః స్థిరత్వము ( సమాధి ) గలవాడై నాయందే ( ఆత్మయందే ) ఆసక్తమైన మనస్సు గల్గి యుడవలయును. ఏలయనగా , ఎవని యింద్రియములు స్వాధీనమునందుండునో , ఆతని జ్ఞానమే సుస్థిరమై వెలయగలదు.

అ.
ధ్యాయతో విషయాన్పుంసః
సఙ్గస్తేషూపజాయతే|
సఙ్గాత్సఞ్జాయతే కామః
కామాత్క్రోధోऽభిజాయతే|| 2-62 ||

అ.
క్రోధాద్భవతి సమ్మోహః
సమ్మోహాత్స్మృతివిభ్రమః|
స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో
బుద్ధినాశాత్ప్రణశ్యతి|| 2-63 ||

ఆటవెలది.
అనిశ విషయ చింత నాసక్తి రేకెత్తు,
సక్తి వలనఁ గామారక్తి కలుగు,
రక్తి వలనఁ గలుగు రాగంబు, క్రోధంబు,
క్రోధమందు మోహ కుమతి పుట్టు , ౫౫
తేటగీతి.
కుమతి దుర్మోహమున స్మృతి భ్రమము కలుగు ;
స్మృతి నశించిన బుద్ధి నశించిపోవు ;
పిదప సర్వనాశమ్ము ప్రాప్తించు, నిజము ;
యీ జుగుప్సకు విషయముల్ బీజములగు ! ౫౬|

మనుజుడు శబ్దాదివిషయములను చింతించుచుండుటవలన ఆ విషయములయం దాసక్తి జనించుచున్నది. అట్టి యాసక్తిచే దానియం దాతనికి కోరిక ఉదయించుచున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచున్నది. కోపము వలన అవివేకము, అవివేకము వలన మఱపు, మఱపు వలన బుద్ధినాశము క్రమముగ సంభంవించుచున్నవి. బుద్ధినాశముచే తుదకు పూర్తిగ చెడినవాడగుచున్నాడు.

అ.
రాగద్వేషవిముక్తైస్తు
విషయానిన్ద్రియైశ్చరన్|
ఆత్మవశ్యైర్విధేయాత్మా
ప్రసాదమధిగచ్ఛతి|| 2-64 ||

ఉత్పలమాల.
ఈయతి యింద్రియాళి విషయేచ్ఛల దృక్ర్శుతులశ్నమాది కా
ర్యాయతమై చరించి, యిసుమంతయు రాగిలకుండు ; హృద్గతం
బీ యవరోధముల్ నధిగమించును స్వీయ వశానువర్తియై ;
ధీయుతుఁడీ విధేయ సుహృదింగని స్వాస్థత గాంచు నర్జునా ! ౫౭

కాని, స్వాధీనమైన మనస్సు కలవాడు, రాగద్వేషరహితములును, తనకు అధీనములై యున్నవియగు ఇంద్రియములచే ( దేహయాత్రోపయుక్తములగు ) అన్నపానాది విషయములను అనుభవించుచున్న వాడైనను మనోనిర్మలత్వమును ( మనశ్శాంతిని ) బొందుచున్నాడు.

అ.
ప్రసాదే సర్వదుఃఖానాం
హానిరస్యోపజాయతే|
ప్రసన్నచేతసో హ్యాశు
బుద్ధిః పర్యవతిష్ఠతే|| 2-65 ||

ఆటవెలది.
సర్వ దుఃఖ హరము నిర్వహింపంబడు
స్వస్థచిత్తమునకె ప్రాభవమున ;
నిర్మలాంత రంగ నియతుఁడౌ వాఁడె సూ
పరమ పథము నందు వాఁడు పార్థ ! ౫౮

మనోనిర్మలత్వము కలుగగా దానివలన మనుజునకు సమస్తదుఃఖములున్ను ఉపశమించిపోవుచున్నవి. నిర్మలమనస్కునకు బుద్ధి శీఘ్రముగ (పరమాత్మ యందు) స్థిరత్వమును జెందుచున్నది.

అ.
నాస్తి బుద్ధిరయుక్తస్య
న చాయుక్తస్య భావనా|
న చాభావయతః శాన్తి
రశాన్తస్య కుతః సుఖమ్|| 2-66 ||

ఉత్పలమాల.
రాగవశేంద్రియుండయిన ఱాగకు బుద్ధి నశింప , భావనో
ద్వేగము నాస్తియౌనట , వివేక వివేచన శూన్యమై, దురు
ద్యోగ పథంబులంబడి యయోమయమైన యశాంతి గాంచు ; నిం
కే గతి సౌఖ్య మందగలడీ విషయైక విలోలుఁ డెత్తరిన్. ౫౯

ఇంద్రియనిగ్రహము, మనస్సంయమము లేనివానికి వివేకబుద్ధి కలుగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేనివానికి శాంతి లభించదు. శాంతి లేనివానికిక సుఖమెచట ?

అ.
ఇన్ద్రియాణాం హి చరతాం
యన్మనోऽనువిధీయతే|
తదస్య హరతి ప్రజ్ఞాం
వాయుర్నావమివామ్భసి|| 2-67 ||

కందము.
తన కవశ్యమ్మై యింద్రియ
వినయుండౌ వాని మనసు వివిధ విధము బు
ద్ధిని హరియించు , మహార్ణవ
మున గాలిం దొరలు నావ పోల్కిన్ పార్థా ! ౬౦

విషయములందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో నెద్దానిని మనస్సు అనుసరించిపోవునో , అయ్యది మనుజునియొక్క వివేకమును - జలమందు ఓడను ప్రతికూలవాయువు పెడదారికి లాగుకొని పోవునట్లు - హరించివేయుచున్నది.

అ.
తస్మాద్యస్య మహాబాహో
నిగృహీతాని సర్వశః|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్య
స్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా|| 2-68 ||

కందము.
కావున నింద్రియ నిగ్రహ
మీ వొందగ వలయు ; నెవ్వఁ డింద్రియములకున్
గైవసమై చరియింపఁడొ
కైవల్య పథమ్ము ప్రజ్ఞఁ గాంచు నతండే. ౬౧

కాబట్టి ఓ అర్జునా ! ఎవడు తన యింద్రియములను విషయములపైకి పోనీయక , సర్వనిధముల అరికట్టుచున్నాడో , అతని జ్ఞానమే మిగుల స్థిరమై యుండును.

అ.
యా నిశా సర్వభూతానాం
తస్యాం జాగర్తి సంయమీ|
యస్యాం జాగ్రతి భూతాని
సా నిశా పశ్యతో మునేః|| 2-69 ||

ఉత్పలమాల.
అనిశ సర్వభూత నిచయమ్ములు నిద్రను మున్గియుండగా ,
మౌని వరుండు మేలుకొని మానితమౌ వెలుగొందుచుండు ; నా
దైనిక జీవరాసులు యథాతథ జాగ్రదవస్థ నుండగా ,
జ్ఞాని స్థితప్రధీరుఁడు నిశాగతిఁ జూచి సుషుప్తి నుండడే / ౬౨

సమస్త ప్రాణులకును ( సామాన్యజనులకు ) ఏది ( పరమార్థతత్త్వము ) రాత్రియై (దృష్టికి గోచరముకాక ) యున్నదో , దానియందు ఇంద్రియనిగ్రహపరుడగుయోగి మేలుకొని యుండును (ఆత్మావలోకనము జేయుచుండును ) . దేనియందు ( ఏ శబ్దాది విషయములందు ) ప్రాణులు మేలుకొనియున్నారో ( ఆసక్తితో ప్రవర్తించుచున్నారో ) అది ( విషయజాలము ) పరమార్థత్త్వమును దర్శించు మునీంద్రునకు రాత్రిగా నుండును. ( దృష్టిగోచరముకాక యుండును ).

ఉ.
ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్|
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ|| 2-70 ||

ఉత్పలమాల.
అంతట నిండియున్ ; అచలమౌ జలరాశి నదీనదమ్ము , లే
పొంతనొ లీనమై సమసిపోయెడు నట్టులె ; కామ్యరాసు లే
వంతను గూర్పలేవు , మునివర్యునకున్ ; నిరత ప్రసాంత భా
స్వంతుఁడు వాఁజు ; కామికెటు శాంతి ఘటిల్లును సుంత యేనియున్ ; ౬౩

జలములచే సంపూర్ణముగ నిండింపబడినదియు , నిశ్చలమైనదియు నగు సముద్రమును నదీజలము మున్నగునవి యేప్రకారము ప్రవేశించుచున్నవో , ఆ ఫ్రకారమే భోగ్యవిషయములన్నియు ఏ బ్రహ్మనిష్ఠునిపొంది ( అతనిని వికృతము చేయలేక ) అణగిపోవుచున్నవో , ఆతడే శాంతిని పొందునుగాని విషయాసక్తి కలవాడు కాదు.

అ.
విహాయ కామాన్యః సర్వా
న్పుమాంశ్చరతి నిఃస్పృహః|
నిర్మమో నిరహఙ్కారః
స శాన్తిమధిగచ్ఛతి|| 2-71 ||

తేటగీతి.
సర్వకర్మ సంవ్యాసియు , సంయమీంద్రుఁ
డీషణ త్రయంబుల మోహమేమి లేక ,
నిర్మమత నిరహంకార నియతి గనుచు ,
ప్రథిత సుస్థిర పథమును నధిగమించు. ౬౪

ఎవడు సమస్తములైన కోరికలను , శబ్దాదివిషయములను త్యజించి వానియందేమాత్రము ఆశలేక , అహంకారమమకారవర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందును.

అ.
ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ
నైనాం ప్రాప్య విముహ్యతి|
స్థిత్వాస్యామన్తకాలేऽపి
బ్రహ్మనిర్వాణమృచ్ఛతి|| 2-72 ||

తేటగీతి.
ఇదియె బ్రహ్మీస్థితి యటంచు నెఱుఁగ వలయు ;
నంత్య కాలాన నీ యాత్మ నటుల నిలుప ,
బ్రహ్మభావమ్ముఁ గనుచు , దివ్య ప్రభావ
బ్రహ్మ నిర్వాణ మొందెదు , పార్థ ! నిజము. ౬౫

అర్జునా ! ఇదియంతయుబ్రహ్మసంబంధమైన స్థితి ; ఇట్టి బ్రాహ్మీస్థితిని బొందినవాడు మఱల నెన్నటికిని నిమోహమును చెందనేరడు. అంత్యకాలమునందుగూడ అట్టి స్థితియందున్నవాడు బ్రహ్మానందరూపమోక్షమును బడయుచున్నాడు.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే సాఙ్ఖ్యయోగో నామ ద్వితీయోऽధ్యాయః|| 2 ||

ఓం తత్ సత్

ఇట్లు శ్రీపూడిపెద్ది కాశీవిశ్వనాథశాస్త్రిచే అనువదింపబడిన శ్రీగీతామృత తరంగిణి యందలి శ్రీ సాంఖ్యయోగమను ద్వితీయ తరంగము సంపూర్ణము.
శ్రీ కృష్ణపరబ్రహ్మార్పణమస్తు.

ఇతి ఉపనిష్ప్రతిపాదికమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు సాజ్ఖ్యయోగమను రెండవ అధ్యాయము సంపూర్ణము.
ఓమ్ తత్ సత్.


శ్రీ గీతామృత తరంగిణి
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము