శ్రీ గీతామృత తరంగిణి/దైవాసురసంపద్విభాగ యోగము

వికీసోర్స్ నుండి
శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)

శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)

గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)

శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

శ్రీభగవానువాచ|
అనుష్టుప్ .
అభయం సత్త్వసంశుద్ధిః
జ్ఞానయోగవ్యవస్థితిః|
దానం దమశ్చ యజ్ఞశ్చ
స్వాధ్యాయస్తప ఆర్జవమ్|| 16-1
అనుష్టుప్ .
అహింసా సత్యమక్రోధ
స్త్యాగః శాన్తిరపైశునమ్|
దయా భూతేష్వలోలుత్వం
మార్దవం హ్రీరచాపలమ్|| 16-2
అ.
తేజః క్షమా ధృతిః శౌచ
మద్రోహో నాతిమానితా|
భవన్తి సమ్పదం దైవీ
మభిజాతస్య భారత|| 16-3 || ||||

శ్రీ భగవానుల వాక్యము .
తేటగీతి .
దానము , దమమ్ము , యజ్ఞమ్ము , జ్ఞాననిష్ఠ ,
అధ్యయన , మార్జవమ్ము , సత్యవ్రతమ్ము ,
త్యాగము , నహింస , శాంతి , దయాగుణమ్ము ,
మార్దవము , లజ్జ , అభయమ్ము , మహిత తపము , ౧


తేటగీతి .
తేజము , శౌచ , మలోలత , ధృతియు , క్షమయు ,
పరుల కీడెంచకునికి , యపై శున మ్మ
చాపల , మ్మమానిత స్వాంత సరళి
సత్త్వ సంశుద్ధియును దైవ సంపదలివి . ౨

ఓ అర్జునా ! 1. భయము లేకుండుట 2. అంతఃకరణశుద్ధి 3. జ్ఞానయోగమునందుండుట 4.దానము 5.బాహ్యేంద్రియనిగ్రహము 6. (జ్ఞాన) యజ్ఞము 7.( వేదశాస్త్రముల ) అధ్యయనము 8.తపస్సు 9.ఋజుత్వము 10.ఏప్రాణికిన్ని బాధ గలుగజేయకుండుట ( అహింస ) 11. సద్వస్తువగు పరమాత్మ నాశ్రయించుట, లేక , నిజము పలుకుట (సత్యము), 12.కోపము లేకుండుట 13.త్యాగబుద్ధిగలిగియుండుట 14. శాంతిస్వభావము 15.కొండెములు చెప్పకుండుట 16. ప్రాణులందు దయగలిగియుండుట 17.విషయలోలత్వము లేకుండుట 18.మృదుత్వము (క్రౌర్యము లేకుండుట) 19. (ధర్మ విరుద్ధ కార్యములందు) సిగ్గు 20.చంచల స్వభావము లేకుండుట 21.ప్రతిభ (లేక, బ్రహ్మతేజస్సు )22. ఓర్పు(కష్ట సహిష్ణుత) 23. ధైర్యము 24.బాహ్యాభ్యంతర శుచిత్వము 25.ఎవరికిని ద్రోహముచేయకుండుట (ద్రోహచింతనము లేకుండుట) 26. స్వాతిశయము లేకుండుట (తాను పూజింపదగినవాడనను అభిమానము, గర్వము లేకుండుట) - అను నీ సుగుణములు దైవసంపత్తియందు పుట్టిన వానికి కలుగుచున్నది . (అనగా దైవసంపత్తిని పొందదగి పుట్టినవానికి కలుగుచున్నవని భావము).

అ.
దమ్భో దర్పోऽభిమానశ్చ
క్రోధః పారుష్యమేవ చ|
అజ్ఞానం చాభిజాతస్య
పార్థ సమ్పదమాసురీమ్|| 16-4 ||

తేటగీతి .
అసుర భావమ్మునన్ బుట్టుకంది క్రోధ
దంభములు దర్ప మతిమానితమ్ము పరుష
ములు వచించుట యవివేకంబున మెలంగు
టారు గుణముల సతము దూగాడుచుంద్రు . ౩

ఓ అర్జునా ! డంబము, గర్వము, అభిమానము ( దురభిమానము ), కోపము, ( వాక్కు మున్నగువానియందు )కాఠిన్యము, అవివేకము అను నీ దుర్గుణములు అసురసంపత్తియందు పుట్టినవానికి కలుగుచున్నవి .( అనగా అసురసంపత్తిని పొందదగి జన్మించినవానికి కలుగుచున్నవని భావము )

అ.
దైవీ సమ్పద్విమోక్షాయ
నిబన్ధాయాసురీ మతా|
మా శుచః సమ్పదం దైవీ
మభిజాతోऽసి పాణ్డవ|| 16-5 ||

తేటగీతి .
దైవ సంపదలే మోక్షదాయకమ్ము
లసుర సంపద సంసార మందు గట్టు
దైవ సంపదతోఁ బుట్టినావు గాన
వలదు దుఃఖింప నీవు వివ్వచ్ఛ ! సుంత . ౪

ఓ అర్జునా ! దైవీసంపద పరిపూర్ణ (సంసార) బంధనివృత్తిని ; అసురీసంపద గొప్ప (సంసార) బంధమును గలుగ జేయునని నిశ్చయింపబడినది . నీవు దైవీసంపదయందే (దైవీసంపదను పొందదగియే) జన్మించినాడవు కావున శోకింపనవసరము లేదు .

అ.
ద్వౌ భూతసర్గౌ లోకేऽస్మిన్
దైవ ఆసుర ఏవ చ|
దైవో విస్తరశః ప్రోక్తః
ఆసురం పార్థ ! మే శృణు|| 16-6 ||

తేటగీతి .
ద్వివిధ సంపదతో నుద్భవించు సృష్టి
గల జనంబులు పార్థ ! నే దెలిపి తింత
వట్టు దైవసంపదయందు వారి తెఱగు
నసుర భావులఁ జెప్పెద నాలకింపు . ౫

ఓ అర్జునా ! ఈ ప్రపంచమున దైవసంబంధమైన గుణము కలది యని అసురసంబంధమైన గుణము కలదియని రెండు విధములగు ప్రాణులు సృష్టులు కలవు . అందు దైవసంబంధమైన దానినిగూర్చి నీకు విస్తరముగ తెలిపితిని . ఇక అసురసంబంధమైనదానినిగూర్చి నావలన వినుము .

అ.
ప్రవృత్తిం చ నివృత్తిం చ
జనా న విదురాసురాః|
న శౌచం నాపి చాచారో
న సత్యం తేషు విద్యతే|| 16-7 ||

చంపకమాల .
తెలియరు శాస్త్ర చోదిత గతిన్ బురుషార్థము లెందు సుంతయున్
దెలియ రనర్థ హేతువగు తెన్నుల నైన శుచిత్వమన్న లో
వెలుపల గూడ సున్నయగు వీసము సత్య మెఱుంగ బోరు పె
ద్దలు జనుత్రోవ బ్రోవరు యథార్త ప్రవర్తన రాదు వీరికిన్ . ౬

అసుర స్వభావముగల జనులు ధర్మ ప్రవృత్తినిగాని అధర్మప్రవృత్తినిగాని యెఱుంగరు. వారియందు శుచిత్వముగాని ఆచారము(సత్కర్మాచారము) గాని సత్యముగాని యుండదు .

అ.
అసత్యమప్రతిష్ఠం తే
జగదాహురనీశ్వరమ్|
అపరస్పరసమ్భూతం
కిమన్యత్కామహైతుకమ్|| 16-8 ||

చంపకమాల .
జగమనృతంబు ధర్మముల సత్యము లీశ్వరుఁడన్న నెవ్వఁడీ
యగుపడరాని వేల్పు జగమన్న ని కేమియు లేదు కామ పుం
దగులము , పురుషాంగనల ద్వంద్వపు సంపద గాని సృష్టికిన్
మిగులు సమస్త ధర్మములు మిథ్యగ నెంతురు మూఢ మానవుల్ . ౭

వారు జగత్తు అసత్యమనియు ( వేదాదిప్రమాణరహితమనియు ) , ప్రతిష్ఠ ( ధర్మాధర్మవ్యవస్థలు ) లేనిదనియు, ( కర్తయగు ) ఈశ్వరుడు లేనిదనియు, కామమే హేతువుగాగలదై స్త్రీపురుషులయొక్క పరస్పరసంబంధముచేతనే కలిగిన దనియు, అదిగాక ఈ జగత్తునకు వేఱుకారణమేమియు లేదనియు చెప్పుదురు .

అ.
ఏతాం దృష్టిమవష్టభ్య
నష్టాత్మానోऽల్పబుద్ధయః|
ప్రభవన్త్యుగ్రకర్మాణః
క్షయాయ జగతోऽహితాః|| 16-9 ||

తేటగీతి .
కన్నుఁ గానని తమకమ్ము గ్రమ్ముకొని మ
హోగ్ర కర్మకు వెనుదీయ కుంద్రు విషయ
భోగలాలసులౌచు బాగోగు లేక
జగతికి నరిష్టమున్ గూర్పదగుదు రెపుడు . ౮

( వారు ) ఇట్టి నాస్తిక దృష్టిని అవలంబించి , చెడిన మనస్సు గలవారును , అల్పబుద్ధితో గూడియున్నవారును , క్రూరకార్యములను జేయువారును , ( జగత్తునకు ) శత్రువులును ( లోకకంటకులును ) అయి ప్రపంచముయొక్క వినాశము కొఱకు పుట్టుచున్నారు .

అ.
కామమాశ్రిత్య దుష్పూరం
దమ్భమానమదాన్వితాః|
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్
ప్రవర్తన్తేऽశుచివ్రతాః|| 16-10 ||

ఉత్పలమాల .
ఆరగ రాని కామ్య బడబానల కీలలు పెల్లు రేగ దు
ర్వార మదోద్ధతింగని దురాగ్రహ దంభ వచో నికృష్ట క
ర్మారతి దోగుచుందురు నిరంతర దుర్వ్రత నిష్టనుందు రీ
క్రూర మహోగ్ర కర్మఠులు కూళ మదాన్విత దుష్టమానవుల్ . ౯

వారు తనివి తీరని కామము నాశ్రయించి , డంబము , అభిమానము , మదము గలవారై , అవివేకము వలన చెడుపట్టుదలల నాశ్రయించి , అపవిత్రములగు వ్రతములు

( నీచ వృత్తులు ) గలవారై ప్రవర్తించుచున్నారు .

అ.
చిన్తామపరిమేయాం చ
ప్రళయాన్తాముపాశ్రితాః|
కామోపభోగపరమా
ఏతావదితి నిశ్చితాః|| 16-11
అ.
ఆశాపాశశతైర్బద్ధాః
కామక్రోధపరాయణాః|
ఈహన్తే కామభోగార్థం
మన్యాయేనార్థసఞ్చయాన్|| 16-12 ||

కందము .
కామమ్మె సర్వ మనియెడు
నీమమ్ము గలట్టి దుష్ట నీచులు దుశ్చిం
తా మేయ భోగలాలసు
లై ముద మందెదరు చచ్చునంతకు నెపుడున్ . ౧౦
కందము .
అడియాస రజ్జులంబడి
గడియింప దలంత్రు ధనముఁ గామితములకున్ ,
దడిగుడ్డ గొంతు కోతకు
జడియరు వీరెట్టి కార్య సరళికి నైనన్ . ౧౧

మఱియు వారు అపరిమితమైనదియు , మరణమువఱకు ( లేక , ప్రళయకాలమువఱకు ) విడువనిదియునగు విషయచింతను ( కోరికలను ) ఆశ్రయించినవారును , కామోపభోగమే పరమపురుషార్థముగ దలంచువారును , ఇంతకుమించినది వేఱొకటి లేదని నిశ్చయించువారును , పెక్కు ఆశాపాశములచే బంధింపబడినవారును , కామక్రోధములనే ముఖ్యముగ నాశ్రయించినవారును , అయి కామముల ననుభవించుట కొఱకు గాను అన్యాయమార్గములద్వారా ధనసమూహములను కోరుచున్నారు .

అ.
ఇదమద్య మయా లబ్ధ
మిమం ప్రాప్స్యే మనోరథమ్|
ఇదమస్తీదమపి మే
భవిష్యతి పునర్ధనమ్|| 16-13
 అ.
అసౌ మయా హతః శత్రు
రర్హనిష్యే చాపరానపి|
ఈశ్వరోऽహమహం భోగీ
సిద్ధోऽహం బలవాన్సుఖీ|| 16-14
అ.
ఆఢ్యోऽభిజనవానస్మి
కోऽన్యోऽస్తి సదృశో మయా|
యక్ష్యే దాస్యామి మోదిష్య
ఇత్యజ్ఞానవిమోహితాః|| 16-15
అ.
అనేకచిత్తవిభ్రాన్తా
మోహజాలసమావృతాః|
ప్రసక్తాః కామభోగేషు
పతన్తి నరకేऽశుచౌ|| 16-16 ||

కందము .
ఇది నా ధన మిది యార్జిత
మదియె మదీయేప్సితమ్ము ప్రాపించె ననున్
ముదమొంద ధనము లొదవును
పదిలక్షలు కోటి సంఖ్య పరిపూర్ణమనున్ . ౧౨
కందము .
ఈ శత్రుఁడీల్గె నేడిక
నాశత్రుఁడుఁ గూలు రేపు నావల నా కీ
యాశా చక్రము లోబడు
నీశుఁడ బలవంతుఁడేనె యేనె సుఱి ననున్ . ౧౩
కందము .
నాకంటెఁ నధికుఁ డెవ్వఁడు
నాకంటెఁ గులీనుఁ డెవఁడు నా కెవఁ డీడౌ
నాకంటెఁ గడు సమర్థుఁడు
నాకంటె వదాన్యుఁ డెవఁడు నాక జగములన్ . ౧౪
తేటగీతి .
అనుచు నజ్ఞాన మోహాంబుధిని మునింగి
చిత్త చాంచల్యమున శివమెత్తి విషయ
లాలసులరై చరించి కాలమ్ముఁ గడపి
నారకమ్మున దొరలుచున్నారు వీరు . ౧౫

"ఈ కోరికను ఇపుడు నేను పొందితిని , ఈ కోరికను ఇకమీదట పొందగలను ; ఈ ధనము ఇపుడు నాకు కలదు ; ఇంకను ఎంతయో ధనము నేను సంపాదింప గలను ; ఈ శత్రువును నేనిపుడు చంపితిని ; తక్కిన శత్రువులను గూడ చంపగలను ; నేను ప్రభువును ; సమస్త భోగములను అనుభవించువాడను ; తలంచిన కార్యమును నెర వేర్ప శక్తి కలవాడను ; బలవంతుడను ; సుఖవంతుడను ; ధనవంతుడను ; గొప్ప వంశమున జన్మించినవాడను ; నాతో సమానమైనవాడు మఱియొకడెవడు కలడు ? నేను యజ్ఞములఁ జేసెదను ; దానముల నిచ్చెదను ; ఆనందము ననుభవించెదను" - అని ఈ ప్రకారముగ అజ్ఞానముచే మోహము ( భ్రమ ) నొందినవారును , అనేకవిధములైన చిత్త చాంచల్యముతో గూడినవారును మోహము ( దారాపుత్రక్షేత్రాదులందు అభిమానము ) అను వలచే బాగుగ గప్పబడినవారును , కామముల ననుభవించుటయందు మిగుల యాసక్తి గలవారును అయి , ( వారు అసుర ప్రవృత్తి గలవారు ) అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు .

అ.
ఆత్మసమ్భావితాః స్తబ్ధా
ధనమానమదాన్వితాః|
యజన్తే నామయజ్ఞైస్తే
దమ్భేనావిధిపూర్వకమ్|| 16-17
అ.
అహంకారం బలం దర్పం
కామం క్రోధం చ సంశ్రితాః|
మామాత్మపరదేహేషు
ప్రద్విషన్తోऽభ్యసూయకాః|| 16-18 ||

తేటగీతి .
ఆత్మ సంస్తుతితో ముదమంది ధనమ
దాంధ దుర్నీతి పరులయి దంభమునకు
విధి విహీనపు కర్మలు వినుతిఁగాంచ
నామ మాత్రమ్ము సలుపు చున్నారు వీరు . ౧౬
కందము .
దివిముట్టు నహంకారముఁ
దెవులును దర్పమ్ము బలముఁ దెగివడు క్రోధం
బవశతఁగని సకల స్థితు
నవమానము సలుపుచుందు రనిశ మసూయన్ . ౧౭

తమ్ము తాము గొప్పగా దలంచువారును , వినయము ( మర్యాద ) లేనివారును , ధనము కలదని అభిమానముతోను , మదముతోను గూడియుండువారును , అహంకారమును, ( పరపీడాకరమగు ) బలమును , గర్వమును , కామమును , క్రోధమును బాగుగ ఆశ్రయించినవారును , తమశరీరములందును , ఇతరుల శరీరములందును ( సాక్షిగ ) నున్న నన్ను మిగుల ద్వేషించువారును , అసూయాపరులైయుండు వారు నగు (అసురసంపదగల ) వారు డంబముతో శాస్త్రవిరుద్ధముగ నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుందురు .

అ.
తానహం ద్విషతః క్రురా
న్సంసారేషు నరాధమాన్|
క్షిపామ్యజస్రమశుభా
నాసురీష్వేవ యోనిషు|| 16-19
అ.
ఆసురీం యోనిమాపన్నా
మూఢా జన్మని జన్మని|
మామప్రాప్యైవ కౌన్తేయ
తతో యాన్త్యధమాం గతిమ్|| 16-20 ||

చంపకమాల .
తులువలు ద్వేషభావులు మదోత్కట దుష్టనరాధముల్ జగ
ద్విలయ దురాగ్ర హోద్ధతులు వేమరు నాసుర యోనులందు నే
గలుగఁగఁ జేతు జన్మల నఖండ గతి న్ననుఁగాన లేరు మూ
ఢు లిటుల నెన్న డైనను గడుంగడు దుర్గతి నొందు చుండుటన్ . ౧౮ ||

( ఆ ప్రకారము ) సమస్త ప్రాణులలో గల ఆత్మయగు నన్ను ద్వేషించు వారును , క్రూరులును , అశుభ ( పాప ) కార్యములను జేయువారును నగు అట్టి మనుజాధములను నేను మరణ రూపములగు ఈ సంసార మార్గములందు అసురసంబంధమైన నీచజన్మలందే యెల్లప్పుడు త్రోచివై చెదను . ఓ అర్జునా ! అసురసంబంధమైన ( నీచ ) జన్మమును పొందినవారలగు మూఢులు ప్రతి జన్మయందును నన్ను పొందకయే , అంతకంటె ( తాము పొందిన జన్మకంటె ) నీచతరమైన జన్మమును పొందుచున్నారు .

అ.
త్రివిధం నరకస్యేదం
ద్వారం నాశనమాత్మనః|
కామః క్రోధస్తథా లోభ
స్తస్మాదేతత్త్రయం త్యజేత్|| 16-21 ||

తేటగీతి .
నారక మ్మొందగల కారణములు మూడు
త్రివిధ మార్గమ్ములని చెప్పనవును పార్థ !
కామమును క్రోధ లోభముల్ గాన వీని
దరికి రాకుండ త్యజియింపఁ దగు కిరీటి ! ౧౯

కామము , క్రోధము , లోభము అను నీ మూడును మూడువిధములగు నరక ద్వారములు . ఇవి తనకు ( జీవునకు ) నాశము కలుగజేయును - కాబట్టి ఈ మూడిటిని విడనాడవలెను . ( లేక , కామము , క్రోధము , లోభము అను మూడు విధములగు ఈ అసురసంపద నరకమునకు ద్వారము - అనియు చెప్పవచ్చును ) .

అ.
ఏతైర్విముక్తః కౌన్తేయ !
తమోద్వారైస్త్రిభిర్నరః|
ఆచరత్యాత్మనః శ్రేయ
స్తతో యాతి పరాం గతిమ్|| 16-22 ||

తేటగీతి .
ఈ తమో ద్వారముల మూటి కాతలఁ బడి
తప్పుకొనువారె సత్కర్మ కొప్పు వారు
నిర్మల మనమ్ము నిష్కామ నిరతిగాంచి
సద్గతిని గాంత్రు తుదికి నిశ్చయము పార్థ ! ౨౦

ఓ అర్జునా ! ( కామక్రోధలోబములనునట్టి ) ఈమూడు నరక ద్వారములనుండి బాగుగ విడువబడిన మనుజుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు . అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుచున్నాడు .

అ.
యః శాస్త్రవిధిముత్సృజ్య
వర్తతే కామకారతః|
న స సిద్ధిమవాప్నోతి
న సుఖం న పరాం గతిమ్|| 16-23 ||

ఉత్పలమాల .
కామమె ధర్మ శాస్త్ర విధిఁగాగ మదించి చరించి శాస్త్రముల్
నీమములన్ శ్రుతి స్మృతుల నీతి నెఱుంగని స్వేచ్ఛ జీవులౌ
పామరు లిందు నందును శుభం బెనయంగను లేక వ్యర్థులై
కామ పరాయణోగ్ర విశిఖానల కీలల మ్రగ్గి కుందరే . ౨౧

ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచిపెట్టి తన యిష్టమువచ్చినట్లు ప్రవర్తించునో , అట్టివాడు పురుషార్థసిద్ధినిగాని , సుఖమునుగాని , ఉత్తమగతియగు మోక్షమునుగాని పొందనేరడు .

అ.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే
కార్యాకార్యవ్యవస్థితౌ|
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం
కర్మ కర్తుమిహార్హసి|| 16-24 ||

తేటగీతి .
సాంగముగ శ్రుతి స్మృతుల విచార మఱసి
కార్య నిర్ణయముం జేయ గడగ వలయు
సద్వివేకులు పెద్దలు జనిన సరణి
స్వీయమౌ ధర్మ మీ యనిసేయు మయ్య ! ౨౨

కావున నీవు చేయదగినదియు, చేయరానిదియు నిర్ణయించునపుడు శాస్త్రము ప్రమాణమైయున్నది . శాస్త్రమునందు చెప్పబడినదానిని తెలిసికొని దాని ననుసరించి నీ వీ ప్రపంచమున కర్మమును జేయదగును .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
దైవాసురసమ్పద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః|| 16 ||

ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే అనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందలి శ్రీ దైవాసుర సంపద్విభాగ యోగము
అను షోడశ తరంగము సంపూర్ణం . శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు .

ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మ విద్యయు , యోగశాస్త్రమును ,

శ్రీకృష్ణార్జున సంవాదమునగుశ్రీ భగవద్గీతలందు దైవాసుర సంపద్విభాగ యోగమను పదునాఱవ అధ్యాయము సంపూర్ణము.


శ్రీ గీతామృత తరంగిణి
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము