శ్రీ గీతామృత తరంగిణి/కర్మసన్యాస యోగము

వికీసోర్స్ నుండి
శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)

శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)

గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)

శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

అర్జున ఉవాచ|
అనుష్టుప్.
సంన్యాసం కర్మణాం కృష్ణ !
పునర్యోగం చ శంససి ! |
యచ్ఛ్రేయ ఏతయోరేకం
తన్మే బ్రూహి సునిశ్చితమ్|| 5-1 ||

అర్జును వాక్యము.
తేటగీతి.
కర్మ సన్న్యాసమే యధికమ్మటంచు ,
నొక్కపరి కర్మయోగమే యెక్కుడనుచుఁ ,
జిక్కు వాక్యములను జెప్పఁ జిత్త మెరియు ;
నిశ్చితి శ్రేయమేది మన్నించి చెపుమ. ౧

అర్జునుడు పలికెను

ఓ కృష్ణమూర్తీ ! నీవొకప్పుడు కర్మలయొక్క త్యాగమును ( కర్మ త్యాగ పూర్వకమగు జ్ఞానమును ) , మఱియొకప్పుడు కర్మయోగమును ప్రశంసించుచున్నావు . కావున ఈ రెండిటిలో నేది శ్రేష్ఠమైనదో బాగుగ నిశ్చయించి ఆ ఒక్కదానిని నాకు చెప్పుము .

శ్రీభగవానువాచ|
అనుష్టుప్.
సంన్యాసః కర్మయోగశ్చ
నిఃశ్రేయసకరావుభౌ|
తయోస్తు కర్మసంన్యాసా
త్కర్మయోగో విశిష్యతే|| 5-2 ||

శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి.
కర్మ సంన్యాస , కర్మయోగ , ద్వయమ్ము
జ్ఞాన సాధనములె యంచుఁ గనుము పార్థ !
జ్ఞాన రహిత సంన్యాసంబు కంటె , కర్మ
యోగమే శ్రేష్ఠమౌ మార్గమో , కిరీటి ! ౨

కర్మత్యాగము ( కర్మత్యాగ పూర్వకమగు జ్ఞానయోగము ) , కర్మయోగము అను రెండును మోక్షమును గలుగజేయును . అయితే , ఆ రెండిటిలోను ( ప్రారంభమున ) కర్మత్యాగమున కంటె కర్మయోగమే శ్రేష్ఠమైనది .

అ.
జ్ఞేయః స నిత్యసంన్యాసీ
యో న ద్వేష్టి న కాఙ్క్షతి|
నిర్ద్వన్ద్వో హి మహాబాహో !
సుఖం బన్ధాత్ప్రముచ్యతే|| 5-3 ||

తేటగీతి.
ఎవఁడు సుఖదుఃఖముల రెంటి కవశుఁ డగునొ ,
ద్వంద్వముల యందు సమభావ మంద గనునొ ,
కర్మఁ జేసియు వాఁడె నిష్కర్మి యగుచుఁ
గర్మ సంన్న్యాసి తుల్యుఁడౌ కర్మయోగి. ౩

గొప్ప బాహువులు కల ఓ అర్జునా ! ఎవడు ( ఏ కర్మయోగి ) దేనినిగూడ ద్వేషింపడో , దేనినిగూడ కోరడో అట్టివాడు ఎల్లప్పుడును సన్న్యాసి ( త్యాగి ) యేయని తెలియదగినది. ఏలయనగా ( రాగద్వేషాది ) ద్వంద్వములు లేనివాడు సులభముగ సంసారబంధమునుండి విముక్తుడు కాగలడు.

అ.
సాఙ్ఖ్యయోగౌ పృథగ్బాలాః
ప్రవదన్తి న పణ్డితాః|
ఏకమప్యాస్థితః సమ్య
గుభయోర్విన్దతే ఫలమ్|| 5-4 ||

ఆటవెలది.
జ్ఞాన కర్మలం దసంబద్ధ భావమ్ము
పండితుం డెవండు పలుకఁ బోడు ;
జ్ఞానకర్మ యుగపు స్థానమ్ము లేకమ్ము,
సాధనాంతరములె , సవ్యసాచి ! ౪

( కర్మసన్న్యాసపూర్వకమగు ) జ్ఞానయోగము , కర్మయోగము వేఱు వేఱని ( వేఱు వేఱు ఫలములు కలవని ) అవివేకులు పలుకుదురే కాని వివేకవంతులు కాదు. ఆ రెండిటిలో ఏ ఒక్కదానినైనను బాగుగ అనుష్ఠించినచో రెండిటి యొక్క ఫలమును ( మోక్షమును ) మనుజుడు పొందుచున్నాడు.

అ.
యత్సాఙ్ఖ్యైః ప్రాప్యతే స్థానం
తద్యోగైరపి గమ్యతే|
ఏకం సాఙ్ఖ్యం చ యోగం చ
యః పశ్యతి స పశ్యతి|| 5-5 ||

తేటగీతి.
సాంఖ్య యోగులు చెందెడి సత్ఫలంబు ,
కర్మయోగులు సాధింపగలరు సుమ్ము !
జ్ఞాన కర్మల యుగళమేకమ్మటంచుఁ
దెలిసికొనువాఁడె , బాగుగాఁ దెలియువాఁడు. ౫

జ్ఞానయోగులచే ఏ స్థానము ( మోక్షము ) పొందబడుచున్నదో, అది కర్మయోగులచేతను పొందబడుచున్నది. జ్ఞానయోగమును, కర్మయోగమును ఒక్కటిగ ( ఒకే ఫలము గలుగజేయునదిగ ) చూచువాడే నిజముగ చూచువాడగును.( తెలిసిన వాడగును ).

అ.
సంన్యాసస్తు మహాబాహో !
దుఃఖమాప్తుమయోగతః|
యోగయుక్తో మునిర్బ్రహ్మ
నచిరేణాధిగచ్ఛతి|| 5-6 ||

తేటగీతి.
కర్మ సంన్యాస సాధన కష్టమగును ,
యోగయుక్తుండుఁ గాకుండనే గమింపఁ ;
గాన , నిష్కామ కర్మ యోగమ్ము నెఱప ,
నచిర కాలమ్మునన్ బ్రహ్మమంద నవును. ౬

గొప్పబాహువులుకల ఓ అర్జునా ! ( కర్మ సన్న్యాస రూపమగు ) జ్ఞానయోగమైతే కర్మయోగము లేకుండ పొందుటకు కష్టతరమైనది . కర్మయోగముతో గూడిన ( దైవ ) మననశీలుడు శీఘ్రముగ ( లక్ష్యమగు ) బ్రహ్మమును పొందుచున్నాడు.

అ.
యోగయుక్తో విశుద్ధాత్మా
విజితాత్మా జితేన్ద్రియః|
సర్వభూతాత్మభూతాత్మా
కుర్వన్నపి న లిప్యతే|| 5-7 ||

కందము.
తనయందు సర్వభూతము
లనుఁ గనుచును , భూతచయములన్ దన యాత్మన్
గనియెడి , విజితాత్మను బం
ధన మంటదు , కర్మఁ జేసినను , గౌంతేయా !

( నిష్కామ ) కర్మయోగము నాచరించువాడును, పరిశుద్ధమైన హృదయము గలవాడును, లెస్సగ జయింపబడిన మనస్సు గలవాడును, ఇంద్రియములను జయించినవాడును, సమస్త ప్రాణులయందుండు ఆత్మయు, తన ఆత్మయు నొకటేయని తెలిసికొనినవాడు నగు మనుజుడు కర్మలను జేసినను వానిచే నంటబడడు.

అ.
నైవ కిఞ్చిత్కరోమీతి
యుక్తో మన్యేత తత్త్వవిత్|
పశ్యఞ్శృణ్వన్స్పృశఞ్జిఘ్ర
న్నశ్నన్గచ్ఛన్స్వపఞ్శ్వసన్|| 5-8
అ.
ప్రలపన్విసృజన్గృహ్ణ
న్నున్మిషన్నిమిషన్నపి|
ఇన్ద్రియాణీన్ద్రియార్థేషు
వర్తన్త ఇతి ధారయన్|| 5-9 ||||

ఉత్పలమాల.
చూచియుఁ , దాకి వాసనల సోకి, భుజించి, గమించి, నిద్రమేన్
జాచియు, యూపిరిన్ విడిచి, శ్వాసమొనర్చియు, మాటలాడి, చే
సాచి, గ్రహించియున్, విడిచి, చక్షుల విచ్చియు, మూసి, యింద్రియా
ళీ చలనమ్ము నొందు, విషయేచ్ఛల నంచుఁ దలంచు, భిన్నుఁడై. ౮

పరమార్థతత్త్వము నెఱిఁగిన యోగయుక్తుడు ( ఆత్మయందు నెలకొనిన చిత్తముగలవాడు ) చూచుచున్నను, తాకుచున్నను, వాసన జూచుచున్నను, తినుచున్నను, నడచుచున్నను, నిదురించుచున్నను, ఊపిరివిడుచుచున్నను, మాట్లాడుచున్నను, విడుచుచున్నను, గ్రహించుచున్నను, కండ్లను తెఱచుచున్నను, మూయుచున్నను, ఇంద్రియములు ( వాని వాని ) విషయములందు ప్రవర్తించుచున్నవని నిశ్చయించినవాడై నే నొకింతయైన ఏమియు చేయుటలేదు - అనియే తలంచును ( ఆ యా కార్యములందు కర్తృత్వబుద్ధి లేకుండును ).

అ.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి
సఙ్గం త్యక్త్వా కరోతి యః|
లిప్యతే న స పాపేన
పద్మపత్రమివామ్భసా|| 5-10 ||

కందము.
జలజాతాసను కర్పిత
ములొనర్చి, ముముక్ష కామమును లేని నరున్
జల మంట కుండ, నీరజ
దళ మట్టులె, పాపతతులు దవులవు పార్థా ! ౯

ఎవడు తాను జేయు కర్మలను పరమాత్మ కర్పించి సంగమును ( ఆసక్తిని ) విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడనట్లు, పాపముచే నంటబడకుండును.

అ.
కాయేన మనసా బుద్ధ్యా
కేవలైరిన్ద్రియైరపి|
యోగినః కర్మ కుర్వన్తి
సఙ్గం త్యక్త్వాత్మశుద్ధయే|| 5-11 ||

కందము.
త్రికరణముల నింద్రియములు
నకలంకత విహిత కర్మలందుఁ జరింపన్ ,
సుకరమయి చిత్తశుద్ధిని
వికసిల్లెడు , కర్మయోగ విదుఁ డిటు పార్థా !

( నిష్కామ కర్మ ) యోగులు చిత్తశుద్ధికొఱకై ఫలాసక్తిని విడిచి శరీరము చేతను, మనస్సు చేతను, బుద్ధి చేతను, అభిమానములేని వట్టి ఇంద్రియముల చేతను కర్మలను జేయుచున్నారు.

అ.
యుక్తః కర్మఫలం త్యక్త్వా
శాన్తిమాప్నోతి నైష్ఠికీమ్|
అయుక్తః కామకారేణ
ఫలే సక్తో నిబధ్యతే|| 5-12 ||

చంపకమాల.
ఫలముల కాసఁ జెందకయె, బ్రహ్మ సమర్పణ మాచరించి, క
ర్మల నొనరించు జ్ఞానికి, నిరంతర శాంతి ఘటిల్లుఁ; గామ్య క
ర్మలఁ జరియించు మూఢుఁడు, నిరంతర దుర్భరమౌ మనో వ్యథల్
జెలగి, యశాంతినిన్ దొరలుఁ జిత్త పరిభ్రమణానిపాతమై. ౧౧

యోగయుక్తుడు ( నిష్కామ కర్మయోగి ) కర్మలయొక్క ఫలమును విడిచిపెట్టి ( చిత్తశుద్ధి వలన ) ఆత్మనిష్ఠాసంబంధమైన శాశ్వతమగు శాంతిని బొందుచున్నాడు. యోగయుక్తుడు కానివాడు ( ఫలాపేక్షతో కర్మలను జేయువాడు ) ఆశచే ప్రేరితుడై కర్మఫలమందాసక్తిగల్గి బద్ధుడగుచున్నాడు

అ.
సర్వకర్మాణి మనసా
సంన్యస్యాస్తే సుఖం వశీ|
నవద్వారే పురే దేహీ
నైవ కుర్వన్న కారయన్|| 5-13 ||

తేటగీతి.
సర్వకర్మల వీడి, నిస్సంగుఁడగుచు,
మనసు పరిపక్వమంది, కర్మను నకర్మ
మఱి యకర్మలో గర్మను నఱయు దేహి,
దేహమునఁ జిన్మయుండయి తేజరిల్లు. ౧౨

ఇంద్రియనిగ్రహముగల దేహధారి మనస్సుచే సమస్త కర్మలను ( కర్మ ఫలములను ) పరిత్యజించి, ఏమియు చేయనివాడై, చేయింపనివాడై, తొమ్మిది ద్వారములుగల పట్టణమగు శరీరమందు హాయిగా నుండుచున్నాడు.

అ.
న కర్తృత్వం న కర్మాణి
లోకస్య సృజతి ప్రభుః|
న కర్మఫలసంయోగం
స్వభావస్తు ప్రవర్తతే|| 5-14 ||

తేటగీతి.
నిఖిల జగముల నిండిన యఖిల సత్తు
తానెయంచని తెలిసిన జ్ఞాని, యాత్మ
ధృతినిఁ గనఁబోడు కర్తృభోక్తృతలు ప్రాణి
తతుల యందు నజ్ఞాన చోదితము లగుట. ౧౩

భగవంతుడు ( ఆత్మ ) జీవులకు కర్తృత్వమునుగాని, కర్మములనుగాని, కర్మఫలములతోటి సంబంధముగాని కలుగజేయుటలేదు . మఱేమనిన, ప్రకృతియే ( ప్రకృతిసంబంధమువలన గలిగిన జన్మాంతర సంస్కారమే ) ఆయా కర్తృత్వాదులను గలుగ జేయుచున్నది .

అ.
నాదత్తే కస్యచిత్పాపం
న చైవ సుకృతం విభుః|
అజ్ఞానేనావృతం జ్ఞానం
తేన ముహ్యన్తి జన్తవః|| 5-15
అ.
జ్ఞానేన తు తదజ్ఞానం
యేషాం నాశితమాత్మనః|
తేషామాదిత్యవజ్జ్ఞానం
ప్రకాశయతి తత్పరమ్|| 5-16 ||

ఉత్పలమాల.
వ్యక్తుల పాపపుణ్యములఁ బాలుఁ గొనం డిసుమంతయైన ; నీ
వ్యక్తిగత ప్రభేదముల వక్తృత కార్య కలాపమెల్ల న
వ్యక్త మవిద్య, జ్ఞానమును సాంతముగాఁ గబళింపగల్గు ధీ
రిక్తత యే కతంబని, యెఱుంగెడు ధీయుతుఁ డీ రహస్యమున్. ౧౪

పరమాత్మ యెవనియొక్కయు పాపమునుగాని, పుణ్యమునుగాని స్వీకరింపడు . అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడియున్నది. అందుచేత జీవులు భ్రమనొందుచున్నారు. ఆత్మజ్ఞానముచే యెవరియొక్క అజ్ఞానము నశింపజేయబడినదో , అట్టివారి జ్ఞానము సూర్యునివలె ఆ పరబ్రహ్మస్వరూపమును ప్రకాశింపజేయుచున్నది (స్వస్వరూపానుభవమును గలుగ జేయుచున్నది ) .

అ.
తద్బుద్ధయస్తదాత్మాన
స్తన్నిష్ఠాస్తత్పరాయణాః|
గచ్ఛన్త్యపునరావృత్తిం
జ్ఞాననిర్ధూతకల్మషాః|| 5-17 ||

కందము.
జ్ఞానాసిని నజ్ఞానపు
న్యూనావృతమెల్లఁ దొలగ నుక్కడగింపన్ ,
భానూజ్వల దీప్తి నిభం
బై నెగడును జ్ఞానమున్ దనంతటఁ దానై. ౧౫

ఆ పరమాత్మయందే బుద్ధిగలవారును, ఆపరమాత్మయందే మనస్సును నెలకొల్పినవారును, ఆ పరమాత్మయందే నిష్ఠగలవారును , ఆ పరమాత్మనే పరమగతిగ నెంచువారును జ్ఞానముచే నెగురగొట్టబడిన పాపముగలవారై పునరావృత్తిరహితమగు (పునర్జన్మవర్జితమగు ) శాశ్వత మోక్షపదవిని బొందుచున్నారు .

అ.
విద్యావినయసమ్పన్నే
బ్రాహ్మణే గవి హస్తిని|
శుని చైవ శ్వపాకే చ
పణ్డితాః సమదర్శినః|| 5-18 ||

ఉత్పలమాల.
కోవిదుఁడైన బ్రాహ్మణుని, గోవును, హస్తిని, జాగిలంబులన్ ,
జీవ కళేబరంబుల భుజించెడి మాలల , హీన జాతి దు
ర్జీవుల నెల్లవారి సమదృష్టిఁ గనుం గొనఁ గల్గు సత్త్వ సం
భావ సమన్వితుండెవఁడొ , పండితుఁడందురు వాని ఫల్గునా ! ౧౬

విద్య, వినయము కలిగియున్న బ్రాహ్మణునియందును , గోవునందును , ఏనుగునందును , కుక్కయందును , కుక్కమాంసము వండుకొని తిను చండాలునియందును సమదృష్టిగలవారే ( వారిని సమముగ జూచువారే ) జ్ఞానులు ( ఆత్మానుభవముగలవారు ) అని చెప్పబడుదురు .

అ.
ఇహైవ తైర్జితః సర్గో
యేషాం సామ్యే స్థితం మనః|
నిర్దోషం హి సమం బ్రహ్మ
తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః|| 5-19 ||

కందము.
సమ భావమె నిర్దోషము,
సమతయె బ్రహ్మమ్ము సుమ్ము, సమభావమునన్
గమియించెడు బ్రహ్మ విదుం
డమరుఁడు, జీవించి యీ యిహమ్ము నె పార్థా ! ౧౭

ఎవరియొక్క మనస్సు సమభావమందు ( నిశ్చల సమస్థితియందు, లేక సర్మప్రాణులందును ఆత్మను సమముగ జూచుటలో ) స్థిరముగనున్నదో, అట్టివారీజన్మమునందే జననమరణరూప సంసారమును జయించినవారగుదురు . ఏలయనిన, బ్రహ్మము దోషరహితమైనది, సమమైనది కావున ( సమత్వమందు స్థితిగల ) వారు బ్రహ్మమునందున్నవారే యగుదురు .

అ.
న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య
నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్|
స్థిరబుద్ధిరసమ్మూఢో
బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః|| 5-20 ||

చంపకమాల.
సమతను నొందు ధీయుతుఁడు సంతసమొందడు, కుందకుండు, నీ
నిమిష ప్రియా ప్రియమ్ములకు నిస్తులమౌ సమభావ మంది, బ్ర
హ్మముఁ గని, కార్య శూన్యుఁడగు; మానిత కర్మ కృతార్థుఁడైన సం
యమి సుమవాఁడు, బ్రహ్మపథ మందుఁ జిర స్థిరమైన సద్గతిన్. ౧౮

స్థిరమగుబుద్ధిగలవాడును, మోహరహితుడును, బ్రహ్మమందు నిలుకడ కలవాడునగు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినపుడు సంతోషమునుగాని, అనిష్టమైనదానిని పొందినపుడు దుఃఖమునుగాని పొందకుండును .

అ.
బాహ్యస్పర్శేష్వసక్తాత్మా
విన్దత్యాత్మని యత్సుఖమ్|
స బ్రహ్మయోగయుక్తాత్మా
సుఖమక్షయమశ్నుతే|| 5-21 ||

తేటగీతి.
స్పర్శ శబ్దాది విషయ వాంఛల విరక్తి
నంది, హృదయమ్ము తన యాత్మయందు నిలిచి,
బ్రహ్మ నిష్ఠాగరిష్ఠుఁడౌ వాని యాత్మ
శాశ్వతానంద మొంది, నిశ్చలతఁ గాంచు. ౧౯

బాహ్యమునగల శబ్దాది విషయములం దాసక్తి లేనివాడు ఆత్మయందెట్టి ( నిరతిశయ ) సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు . అతడు బ్రహ్మనిష్ఠయను సమాధితో గూడుకొనినవాడై ( బ్రహ్మానుసంధానపరుడై ) అక్షయమగు సుఖమును బడయుచున్నాడు .

అ.
యే హి సంస్పర్శజా భోగా
దుఃఖయోనయ ఏవ తే|
ఆద్యన్తవన్తః కౌన్తేయ !
న తేషు రమతే బుధః|| 5-22 ||

కందము.
భోగ సుఖమ్ములు క్షణిక
మ్మౌగద, కౌంతేయ ! దుఃఖమగుఁ దుదికెల్లన్ ;
రాగిలఁడు బుధుఁడెవండును,
భోగములకు, వచ్చిపోవు బుద్బుదములకున్. ౨౦

అర్జునా ! ( ఇంద్రియ ) విషయసంయోగమువలన కలుగు భోగములు దుఃఖహేతువులును, అల్పకాలముండునవియు, నయియున్నవి. కావున విజ్ఞుడగువాడు వానియందు క్రీడింపడు ( ఆసక్తి గొనడు ).

అ.
శక్నోతీహైవ యః సోఢుం
ప్రాక్శరీరవిమోక్షణాత్|
కామక్రోధోద్భవం వేగం
స యుక్తః స సుఖీ నరః|| 5-23 ||

కందము.
కామక్రోధో ద్వేగం
బే మనుజుఁడు నిగ్రహించి, యెసగు సుఖమునన్,
ఈ మనికినె ముక్తుండగు
ధీమంతుఁడతండె, పో, జితేంద్రియుఁ డగుటన్. ౨౧

ఎవ డీశరీరమును విడుచుటకు పూర్వమే యిచ్చోటనే ( ఈజన్మయందే ) కామక్రోధముల వేగమును అరికట్టగలుగుచున్నాడో, అతడే యోగియు ( చిత్తోపరతి కలవాడును ) , సుఖవంతుడు నగును .

అ.
యోऽన్తఃసుఖోऽన్తరారామ
స్తథాన్తర్జ్యోతిరేవ యః|
స యోగీ బ్రహ్మనిర్వాణం
బ్రహ్మభూతోऽధిగచ్ఛతి|| 5-24 ||

ఆటవెలది.
ఆత్మ యందె సుఖము, నాత్మయందే క్రీడ,
ఆత్మయందె దీప్తి, నఱయు వాఁడు,
సర్వసాక్షి బ్రహ్మ నిర్వాణ మిచ్చటే
కనుచు, ముక్తినందుఁ దనువు నందె. ౨౨

ఎవడు లోన ఆత్మయందే సుఖించుచు, ఆత్మయందే క్రీడించుచు ఆత్మయందే ప్రకాశము గలవాడై యుండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మసాక్షాత్కారమును ( మోక్షమును ) బొందును

అ.
లభన్తే బ్రహ్మనిర్వాణ
మృషయః క్షీణకల్మషాః|
ఛిన్నద్వైధా యతాత్మానః
సర్వభూతహితే రతాః|| 5-25 ||

కందము.
భూత హిత ప్రియుఁ డింద్రియ
చేతమ్ముల నిగ్రహించు ; స్థిత ధీరవరుం
డీతనువు నందె గను, జల
జాతాసను భావపథము ; సంశయమేలా ? ౨౩

పాప రహితులును, సంశయవర్జితులును, ఇంద్రియమనంబులను స్వాధీనపఱచుకొనినవారును, సమస్త ప్రాణులయొక్క క్షేమమందాసక్తిగలవారునగు ఋషులు ( అతీంద్రియ జ్ఞానులు ) బ్రహ్మసాక్షాత్కారమును (మోక్షమును ) బొందుచున్నారు .

అ.
కామక్రోధవియుక్తానాం
యతీనాం యతచేతసామ్|
అభితో బ్రహ్మనిర్వాణం
వర్తతే విదితాత్మనామ్|| 5-26
అ.
స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాం
శ్చక్షుశ్చైవాన్తరే భ్రువోః|
ప్రాణాపానౌ సమౌ కృత్వా
నాసాభ్యన్తరచారిణౌ|| 5-27
 అ.
యతేన్ద్రియమనోబుద్ధి
ర్మునిర్మోక్షపరాయణః|
విగతేచ్ఛాభయక్రోధో
యః సదా ముక్త ఏవ సః|| 5-28||||

తేటగీతి.
బాహ్యవిషయముల్ మనమునఁ బట్టనీక,
తనదు చూపులు భ్రూమధ్యమున గుదించి,
శ్వాస నిశ్వాసములు రెండు సమముఁ జేసి,
యతి జితేంద్రియుఁ డిటు మోక్ష మధిగమించు. ౨౪తేటగీతి.
బుద్ధి కర్మేంద్రియంబుల పోకలుడిపి,
క్రోధ కామాది వేగముల్ గుదియఁ గట్టి,
ధ్యాననిష్ఠా గరిష్ఠుడౌ , మౌనివరుఁడు
కాలము గ్రసించు, ముక్తి సంగతినిఁ గాంచు. ౨౫

కామక్రోధాదులు లేనివారును, మనోనిగ్రహము గలవారును, ఆత్మతత్త్వము నెఱిగినవారునగు యత్నశీలురకు బ్రహ్మసాయుజ్యము ( మోక్షము, బ్రహ్మానందము ) అంతటను ( శరీరమున్నప్పుడును, లేనపుడును సర్వత్ర ) వెలయుచునే యున్నది . ఎవడు వెలుపలనున్న శబ్దస్పర్శాది విషయములను వెలుపలికే నెట్టివైచి ( లోన ప్రవేశింపనీయక ), చూపును భ్రూమధ్యమందు నిలిపి, నాసికాపుటములందు సంచరించు ప్రాణాపానవాయువులను సమముగ జేసి, ఇంద్రియమనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛా భయ క్రోధములు లేనివాడై, మోక్షాసక్తుడై ( ఆత్మ ) మననశీలుడై యుండునో అట్టివా డెల్లప్పుడును ముక్తుడే యగును .

అ.
భోక్తారం యజ్ఞతపసాం
సర్వలోకమహేశ్వరమ్|
సుహృదం సర్వభూతానాం
జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి|| 5-29 ||

ఉత్పలమాల.
కర్తను భోక్తగా యజనకర్మ తపంబుల యందు, నే జగ
ద్భర్తను, సర్వభూత హిత దాత, యటంచు నెఱుంగు ధీర స
ద్వర్తనులైనవారు, నిరతంబును శాంతి పథంబునన్ నిరా
వర్తన సుస్థితిన్ గని ప్రభాసితులై వసియింతు రెప్పుడున్. ౨౬

యజ్ఞములయొక్కయు, తపస్సులయొక్కయు భోక్త ( ఫలములనుభవించువాడు ) గను , సమస్తలోకములయొక్క ఈశ్వరుడు ( ప్రభువు, శాసకుడు )గను, సమస్తప్రాణులయొక్క హితకారిగను, నన్నెఱిఁగి మనుజుడు శాంతిని బొందుచున్నాడు .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
సంన్యాసయోగో నామ పఞ్చమోऽధ్యాయః|| 5 ||

ఓం తత్ సత్.
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే అనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందు
శ్రీ కర్మసంన్యాస యోగమను పంచమ తరంగము
సంపూర్ణం.
శ్రీ కృష్ణపరబ్రహ్మార్పణమస్తు.

ఇది ఉపనిషత్ప్రతిపాదితమును, బ్రహ్మవిద్యయు,

యోగశాస్త్రమును, శ్రీ కృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు కర్మసన్న్యాసయోగమను ఐదవ అధ్యాయము. ఓమ్ తత్ సత్.


శ్రీ గీతామృత తరంగిణి
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము