width=220శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు)
|
శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)
|
గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)
శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము
కాళహస్తి(1979)
|
అర్జున ఉవాచ|
అ.
కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం
కిం కర్మ పురుషోత్తమ|
అధిభూతం చ కిం ప్రోక్త
మధిదైవం కిముచ్యతే|| 8-1
అనుష్టుప్
అధియజ్ఞః కథం కోऽత్ర
దేహేऽస్మిన్మధుసూదన|
ప్రయాణకాలే చ కథం
జ్ఞేయోऽసి నియతాత్మభిః|| 8-2 ||
|
అర్జును వాక్యము.
తేటగీతి.
మాధవా ! బ్రహ్మ మధ్యాత్మమౌ న దేమి ?
కర్మయన నేమి ? యధి భూత మర్మమేమి ?
దేహమున నధియజ్ఞ మదేమొ , దేహ
పాతమున నిన్నెటులఁ గనువాఁడొ , తెలియఁ
బలుకు మధిదైవ మననేమొ , సలలితముగ .౧
|
అర్జును డడిగెను.
పురుష శ్రేష్ఠుడవగు ఓ కృష్ణా ! ఆ బ్రహ్మ మేది ? అధ్యాత్మ మెయ్యది ? కర్మమనగా నేమి ? అధిభూతమని ఏది చెప్పబడినది ? అధిదైవమని దేనిని చెప్పుదురు ? ఈ దేహమందు అధియజ్ఞు డెవడు ? అతనిని తెలుసుకొనుట ఎట్లు ? ప్రాణప్రయాణ సమయమందు నియమితచిత్తులచే నీ వెట్లు తెలిసికొనబడగలవు ?
|
శ్రీభగవానువాచ|
అ.
అక్షరం బ్రహ్మ పరమం
స్వభావోऽధ్యాత్మముచ్యతే|
భూతభావోద్భవకరో
విసర్గః కర్మసంజ్ఞితః|| 8-3 ||
|
శ్రీ భగవానుల వాక్యము.
తేటగీతి.
బ్రహ్మ మన నాత్మ యక్షర భావమౌను ,
జీవభావమ్ము నధ్యాత్మగా వచింత్రు ,
భూతకోటుల సృష్టికి హేతువైన
యల విసర్గయే కర్మ యంచనగఁ బరగు . ౨
|
శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు.
సర్వోత్తమమైన ( నిరతిశయమైన ) నాశరహితమైనదే బ్రహ్మమనబడును . ప్రత్యగాత్మ భావము అధ్యాత్మమని చెప్పబడును . ప్రాణికోట్లకు ఉత్పత్తిని గలుగజేయు
( యజ్ఞాదిరూపమగు ) త్యాగపూర్వకమైన క్రియ కర్మమను పేరు కలిగియున్నది .
|
అనుష్టుప్.
అధిభూతం క్షరో భావః
పురుషశ్చాధిదైవతమ్|
అధియజ్ఞోऽహమేవాత్ర
దేహే దేహభృతాం వర|| 8-4 ||
|
తేటగీతి.
తెలియు మధిభూతమనఁ బుట్టుకలును , నాశ
నమ్ముఁ గల వస్తుతతి యంచు నమ్ముమయ్య ;
పురుషుఁడది దైవమని , దేహములను సకల
యజ్ఞములఁ బ్రీతినొందు వాఁడగుదు నేను . ౩
|
దేహధారులలో శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! నశించు పదార్థము అధిభూత మనబడును. విరాట్పురుషుడు లేక హిరణ్యగర్భుడే అధిదైవతమనబడును . ఈ దేహమందు నేనే ( పరమాత్మయే ) అధియజ్ఞుడనబడును.
|
అ.
అన్తకాలే చ మామేవ
స్మరన్ముక్త్వా కలేవరమ్|
యః ప్రయాతి స మద్భావం
యాతి నాస్త్యత్ర సంశయః|| 8-5 ||
|
తేటగీతి.
మరణ కాలమ్మునన్ గూడ మఱువకుండ
నన్ను స్మరియించు నెవ్వాడొ నన్నెఁ జేరు ,
శాశ్వతానంద సుస్థిర స్వాంత మంది ;
సందియము లేదు , నిక్కమ్ము సవ్యసాచి ! ౪
|
ఎవడు మరణకాలమందుకూడ నన్నే స్మరించుచు శరీరమును విడిచిపోవుచున్నాడో , అతడు నాస్వరూపమును పొందుచున్నాడు . ఇట సంశయమేమియును లేదు .
|
అ.
యం యం వాపి స్మరన్భావం
త్యజత్యన్తే కలేవరమ్|
తం తమేవైతి కౌన్తేయ
సదా తద్భావభావితః|| 8-6 ||
|
మత్తేభము.
తను వున్నప్పుడుఁ , బోవునప్పుడెటులన్ ధ్యానించు భావంబు నం
దనువౌ జన్మలఁ గాంచుచుందు రెపుడున్ స్వాంతమ్ములన్ గామ్యముల్
గనునందాక , పునః పునాగమముగా కర్మాను బంధమ్ములై ,
వెనువెంటన్ జను నీచయోనుల గతిన్ వెన్నాడుచున్ ఫల్గునా ! ౫
|
అర్జునా ! ఎవడు మరణకాలమున ఏయే భావమును ( లేక రూపమును ) చింతించుచు దేహము వీడునో వాడట్టి భావముయొక్క స్మరణచే గలిగిన సంస్కారము గలిగియుండుట వలన ఆ యా రూపమునే పొందుచున్నాడు .
|
అ.
తస్మాత్సర్వేషు కాలేషు
మామనుస్మర యుధ్య చ|
మయ్యర్పితమనోబుద్ధి
ర్మామేవైష్యస్యసంశయః|| 8-7 ||
|
తేటగీతి.
పార్థ ! నీ మనోబుద్ధు లర్పణముఁ జేసి ,
సర్వ కాలమ్ములన్ నన్నె సంస్మరించి ,
ధర్మ యుద్ధమ్ముఁ జేయు , మాదటను వాసు
దేవున నె పొందెదవు , సందియము లేదు. ౬
|
కాబట్టి ఎల్లకాలములందును నన్ను స్మరించుచు ( నీ స్వధర్మమగు ) యుద్ధమునుగూడ చేయుము . ఈ ప్రకారముగ నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు గలవాడవైనచో నీవు నన్నే పొందగలవు . ఇట సంశయము లేదు .
|
అ.
అభ్యాసయోగయుక్తేన
చేతసా నాన్యగామినా|
పరమం పురుషం దివ్యం
యాతి పార్థానుచిన్తయన్|| 8-8 ||
|
తేటగీతి.
ఇతర విషయమ్ములకు మనం బేగకుండ ,
ధ్యాననిష్ఠా గరిష్ఠుఁడౌ మౌనివరుఁడు ,
పరమ పురుషు పరంజ్యోతి నిరుపమాన
మైన జ్ఞాన సంపూర్ణుఁడౌ వాని గనును . ౭
|
ఓ అర్జునా ! అభ్యాసమను యోగముతో గూడినదియు , ఇతర విషయములపైకి పోనిదియునగు మనస్సుచేత , అప్రాకృతుడైన ( లేక స్వయంప్రకాశ స్వరూపుడైన ) సర్వోత్తముడగు పరమపురుషుని మరల మరల స్మరించుచు మనుజుడు అతనినే పొందుచున్నాడు .
|
ఉపజాతి.
కవిం పురాణమనుశాసితార-
మణోరణీయంసమనుస్మరేద్యః|
సర్వస్య ధాతారమచిన్త్యరూప-
మాదిత్యవర్ణం తమసః పరస్తాత్|| 8-9
ఉపజాతి.
ప్రయాణకాలే మనసాऽచలేన
భక్త్యా యుక్తో యోగబలేన చైవ|
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
సతం పరం పురుషముపైతి దివ్యమ్|| 8-10 ||
|
ఉత్పలమాల.
నన్ను జగన్నియంతను , సనాతను , సత్కవి , నింద్రియాళికిన్
గన్నులకున్ మనంబునకుఁ గానగరాని యచింత్యరూపునిన్ ,
సన్నుత సర్వదాతను , నిశాపర దివ్య రవి ఫ్రభాసు , భ
క్తి న్ని రతాశ్రయుండయి , గతించిన యప్డు స్మరింపనయ్యెడున్. ౮
తేటగీతి.
మరణ కాలమ్మునందు సమాధి యోగ
యుక్తుఁడై , భక్తి ప్రాణవాయువుల నెల్ల
భ్రూసమమ్మున నిలిపి , సంపూర్ణమనము
నం దలంచెడువాఁడు , నన్నొందు , నిజము . ౯
|
ఎవడు భక్తితో గూడుకొనినవాడై అంత్యకాలమునందు యోగబలముచే ( ధ్యానాభ్యాస సంస్కారబలముచే ) ప్రాణవాయువును భ్రూమధ్యమున ( కనుబొమ్మలనడుమ ) బాగుగ నిలిపి , ఆ పిదప సర్వజ్ఞుడును , పురాణపురుషుడును , జగన్నియామకుడును , అణువుకంటెను మిగుల సూక్ష్మమైనవాడును , సకలప్రపంచమునకు ఆధారభూతుడును ( సంరక్షకుడును ) , చింతింప నలవికాని స్వరూపము గలవాడును , సూర్యుని కాంతి వంటి కాంతిగలవాడును ( స్వయంప్రకాశ స్వరూపుడును ) , అజ్ఞానాంధకారమునకు ఆవలనుండువాడు నగు పరమాత్మను నిశ్చలమనస్సుచే ఎడతెగక చింతించునో అతడు దివ్యరూపుడైన సర్వోత్తముడగు ఆ పరమాత్మనే పొందుచున్నాడు .,
|
ఉపజాతి.
యదక్షరం వేదవిదో వదన్తి
విశన్తి యద్యతయో వీతరాగాః|
యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే|| 8-11 ||
|
తేటగీతి.
వేదవిదు లక్షరంబని వినుతిఁ జేయు
దురు , జితేంద్రియు లెద్ది పొందుదురు , బ్రహ్మ
చారు లెదియొంద జతనమ్ము సలుపుచుందు ,
రా పథంబునుఁ దెలిపెద , నాలకింపు . ౧౦
|
వేదవేత్తలు దేనిని నాశరహితమైనదానినిగ జెప్పుచున్నారో , రాగరహితుడగు ( కోరికలు నశించిన ) యత్మశీలురు ( జితేంద్రియులు ) ఎద్దానియందు ప్రవేశించుచున్నారో , దేనిని అభిలషించుచు జనులు బ్రహ్మచర్యము ననుష్ఠించుచున్నరో , అట్టి ( పరమాత్మ ) పదమునుగూర్చి నీకు సంక్షేపముగ జెప్పెదను .
|
అ.
సర్వద్వారాణి సంయమ్య
మనో హృది నిరుధ్య చ|
మూధ్న్యా|ర్ధాయాత్మనః ప్రాణ
మాస్థితో యోగధారణామ్|| 8-12
అ.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ
వ్యాహరన్మామనుస్మరన్|
యః ప్రయాతి త్యజన్దేహం
స యాతి పరమాం గతిమ్|| 8-13||
|
కందము.
విజితేంద్రియుఁడై హృదయాం
బుజమందునె మనసు నిలిపి , మూర్ధమునందున్
నిజప్రాణానిలమును న
క్కజముగ బంధించి , యోగగతికిఁ జరించున్. ౧౧
కందము.
ఓ మిత్యే కాక్షరమును
నీమమున ననున్ స్మరించి , నిర్గమ మొందన్ ,
మామకమౌ సుస్థిరమగు
ధామమ్మునుఁ జేరునతఁడు , తథ్యము పార్థా ! ౧౨
|
ఎవడు ఇంద్రియద్వారము లన్నిటిని బాగుగ అరికట్టి , మనస్సును హృదయమందు ( ఆత్మయందు ) లెస్సగా స్థాపించి , శిరస్సునందు ( బ్రహ్మరంధ్రమందు ) ప్రాణవాయువును ఉంచి , ఆత్మనుగూర్చిన ఏకాగ్రచింతనము ( యోగధారణ ) గలవాడై పరబ్రహ్మమునకు వాచకమైన ' ఓమ్ ' అను అక్షరమును ఉచ్ఛరించుచు నన్ను ఎడతెగక చింతించుచు శరీరమును వదలునో అతడు సర్వోత్తమస్థానమును ( మోక్షమును ) బొందుచున్నాడు .
|
అ.
అనన్యచేతాః సతతం
యో మాం స్మరతి నిత్యశః|
తస్యాహం సులభః పార్థ !
నిత్యయుక్తస్య యోగినః|| 8-14 ||
|
కందము.
ఏకాగ్ర చిత్తగతుఁడై
యే కాలమునందు నన్ స్మరింపుచునుండున్ ,
ఏకైక నిరత భక్తున
కే , కైవస మొందుచుందు , నిటు సులభుఁడనై. ౧౩
|
ఓ అర్జునా ! ఎవడు అనన్యచిత్తుడై నన్నుగూర్చి ప్రతిదినము నిరంతరము స్మరించుచుండునో అట్టి నిరంతరధ్యానపరులకు నేను సులభముగ పొందబడువాడనై యున్నాను.
|
అ.
మాముపేత్య పునర్జన్మ
దుఃఖాలయమశాశ్వతమ్|
నాప్నువన్తి మహాత్మానః
సంసిద్ధిం పరమాం గతాః|| 8-15 ||
|
తేటగీతి.
నను భజించుచు , నా పథమ్మును గమించు
నా మహాత్ములు దుఃఖమెందైనఁ గనరు ;
చావు పుట్టుక నొందు సంసార వార్ధి
నుత్తరింతురు , తిరిగి రాకుందు రెపుడు . ౧౪
|
సర్వోత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందినవారై మరల - దుఃఖనిలయమై అనిత్యమైనట్టి - జన్మను ఎన్నటికిని పొందనేరరు .
|
అ.
ఆబ్రహ్మభువనాల్లోకాః
పునరావర్తినోऽర్జున|
మాముపేత్య తు కౌన్తేయ !
పునర్జన్మ న విద్యతే|| 8-16 ||
|
తేటగీతి.
బ్రహ్మలోకమ్ము మొదలు స్వర్గమ్ము వరకు
సకలముల్ పుట్టి మఱల నాశమ్ములగును ;
దివ్యమౌ నా పథంబు నొందిన నరుండు ,
తిరిగి పుట్టుకఁ జావులఁ దెలియఁ బోడు . ౧౫
|
ఓ అర్జునా ! బ్రహ్మలోకమువఱకుగల లోకములన్నియు తిరిగివచ్చెడి స్వభావము కలవి ( అనగా వానిని పొందినవారు మరల జన్మ మెత్తవలసియే వచ్చుదురు ) . నన్ను పొందినవారికో మరల జన్మయే లేదు .
|
అ.
సహస్రయుగపర్యన్త
మహర్యద్ బ్రహ్మణో విదుః|
రాత్రిం యుగసహస్రాన్తాం
తేऽహోరాత్రవిదో జనాః|| 8-17 ||
|
తేటగీతి.
వేయి యుగములు పగలును , రేయియటులె
వేయి యుగములు ; బ్రహ్మకు రేయి , పగలు ;
పగట ప్రభవించి , రాత్రి యా ప్రకృతి యడగుఁ
జర్వితము సృష్టి యిట్టుల సంచరించు . ౧౬
|
ఏ జనులు బ్రహ్మదేవునియొక్క పగటిని వేయి యగముల పరిమితిగలదానిగను , అట్లే రాత్రిని వేయియుగముల పరిమితిగలదానిగను ఎఱుగుదురో , అట్టివారు రాత్రింబగళ్ళయొక్క తత్త్వమును బాగుగ నెఱింగిన వారగుదురు .
|
అ.
అవ్యక్తాద్ వ్యక్తయః సర్వాః
ప్రభవన్త్యహరాగమే|
రాత్ర్యాగమే ప్రలీయన్తే
తత్రైవావ్యక్తసంజ్ఞకే|| 8-18
అ.
భూతగ్రామః స ఏవాయం
భూత్వా భూత్వా ప్రలీయతే|
రాత్ర్యాగమేऽవశః పార్థ !
ప్రభవత్యహరాగమే|| 8-19 ||
|
తేటగీతి.
పూర్వకల్పమ్ము నందున్న భూతచయము
బ్రహ్మదేవు సుషుప్తి కాలమ్మునందు
లయము నొందుచు , మఱలను ప్రభవమొందు
బ్రహ్మదేవు ప్రబోధ కాలమ్మునందు . ౧౭
|
బ్రహ్మ దేవుని పగలు ప్రారంభమగునపుడు అవ్యక్తము ( ప్రకృతి ) నుండి సమస్త చరాచరవస్తువులు పుట్టుచున్నవి . మరల రాత్రి ప్రారంభమగునపుడు ఆ అవ్యక్తమునందే లీనమగుచున్నవి. ఓ అర్జునా ! ఆ యీ ( పూర్వకల్ప మందలి ) ప్రాణి సమూహమే కర్మపరాధీనమై పుట్టిపుట్టి ( బ్రహ్మదేవుని ) రాత్రియొక్క ప్రారంభమున ( మరల ) విలయమొందుచున్నది . తిరిగి ( బ్రహ్మదేవుని ) పగటియొక్క ప్రారంభమున పుట్టుచున్నది .
|
అ.పరస్తస్మాత్తు భావోऽన్యోऽ
వ్యక్తోऽవ్యక్తాత్సనాతనః|
యః స సర్వేషు భూతేషు
నశ్యత్సు న వినశ్యతి|| 8-20
అ.
అవ్యక్తోऽక్షర ఇత్యుక్త
స్తమాహుః పరమాం గతిమ్|
యం ప్రాప్య న నివర్తన్తే
తద్ధామ పరమం మమ|| 8-21
అ.
పురుషః స పరః పార్థ !
భక్త్యా లభ్యస్త్వనన్యయా|
యస్యాన్తఃస్థాని భూతాని
యేన సర్వమిదం తతమ్|| 8-22||
|
చంపకమాల.
ఎది సతతమ్మున న్నిలుచు , నెయ్యది యేప్రళయంబు లందునన్
అదియె సనాతనమ్మయిన యవ్యయ భావ మటంచెఱుంగుమా !
సదమల మక్షరంబగుచు , శాశ్వతమైన , మదీయ ధామ మ
య్యది , లభియింప రారు , తిరుగాడగఁ బుట్టుక చావు లందగన్ . ౧౮
సీ.
ఎవ్వాని సంకల్పమే జగంబులకెల్ల ,
ప్రభవ కారణమౌచుఁ బరగుచుండు ;
నెవ్వాని కనుచూపు నెల్ల లోకములఁ గ
ల్యాణమై , సంపద లలము కొనును ;
యెవ్వాడు కనుమూసి పవ్వళించిన తోడ ,
ప్రళయంబులై జగంబులు నశించు ;
నెవ్వాని క్రీడకై యీ రేడు జగములు ,
పూచెండుల విధానఁ దోచుచుండు ;
ఆటవెలది.
నా మహాత్మునిఁ గన నలవికా దెవ్వరి ;
కితర సాధనముల నెన్నియైనఁ ,
ద్రికరణముల నెపుడు , స్థిరమైన యేకాంత
భక్తివలనె , పట్టు వడును , పార్థ ! ౧౯
|
ఏ పరమాత్మ వస్తువు ఆ అవ్యక్తము ( ప్రకృతి ) కంటె వేరైనదియు , ఉత్తమమైనదియు , ఇంద్రియములకు వ్యక్తము కానిదియు , పురాతనమైనదియునగునో , అయ్యది సమస్త ప్రాణికోట్లు నశించినను నశించకయే యుండును . ఏ పరమాత్మ ( ఇంద్రియములకు ) అగోచరుడనియు , నాశరహితుడనియు చెప్పబడెనో , అతనినే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా వేదవేత్తలు చెప్పుచున్నారు . దేనిని పొందినచో మరల ( వెనుకకు తిరిగి ఈ సంసారమున ) జన్మింపరో , అదియే నాయొక్క శ్రేష్ఠమైన స్థానము ( స్వరూపము ) అయియున్నది . ఓ అర్జునా ! ఎవనియం దీప్రాణికోట్లన్నియు నివసించుచున్నవో , ఎవనిచే ఈ సమస్త జగత్తున్ను వ్యాపింపబడియున్నదో , అట్టి పరమపురుషుడు ( పరమాత్మ ) అనన్యమగు ( అచంచలమగు ) భక్తి చేతనే పొందబడగలడు .
|
అ.
యత్ర కాలే త్వనావృత్తి
మావృత్తిం చైవ యోగినః|
ప్రయాతా యాన్తి తం కాలం
వక్ష్యామి భరతర్షభ|| 8-23 ||
|
ఆటవెలది.
మరణించు పిదప నెవ రే
స్థిర చరమగు లోకములనుఁ జేరి కొనెదరో ,
యెఱిగింతు ధనంజయ ! విను
పరమ రహస్యమ్ము కాలపరిమితి నెల్లన్ . ౨0
|
భరతకుల శ్రేష్ఠుడవగు ఓ అర్జునా ! ఏ కాలమందు ( లేక , ఏ మార్గమందు ) ( శరీరమును విడిచి ) వెడలిన యోగులు మరల తిరిగిరారో ( జన్మము నొందరో ) , ఏ కాలమందు వెడలిన యోగులు మరల తిరిగి వచ్చుదురో ( జన్మించుదురో ) , ఆ యా కాల విశేషములను చెప్పుచున్నాను .
|
అ.
అగ్నిర్జోతిరహః శుక్లః
షణ్మాసా ఉత్తరాయణమ్|
తత్ర ప్రయాతా గచ్ఛన్తి
బ్రహ్మ బ్రహ్మవిదో జనాః|| 8-24 ||
|
తేటగీతి.
ఆరుమాసమ్ము లౌ నుత్త రాయణమ్ము ,
శుక్ల పక్ష మగ్నిర్జ్యోతి చొప్పుగనుచు ,
మరణ మొందిన జ్ఞానులు తిరిగిరారు ,
బ్రహ్మ కల్పాంతమున బ్రహ్మ భావమంది . ౨౧
|
అగ్ని , ప్రకాశము , పగలు , శుక్లపక్షము , ఆఱు నెలలుగల ఉత్తరాయణము , ఏ మార్గమందుగలవో , ఆ మార్గమున వెడలిన బ్రహ్మవేత్తలగు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు .
|
అ.
ధూమో రాత్రిస్తథా కృష్ణః
షణ్మాసా దక్షిణాయనమ్|
తత్ర చాన్ద్రమసం జ్యోతి
ర్యోగీ ప్రాప్య నివర్తతే|| 8-25 ||
|
తేటగీతి.
ఆరు మాసమ్ము లౌ దక్షిణాయనమ్ము
కృష్ణ పక్షమ్ము ; ధూమ రాత్రిని గతించు
యోగివర్యులు , చంద్రలోకోన్నతిఁ గని
తిరిగి వత్తురు , పుణ్యమ్ము తరుగఁ గానె . ౨౨
|
పొగ , రాత్రి , కృష్ణపక్షము , ఆఱునెలలుగల ధక్షిణాయనము ఏ మార్గమునగలవో ఆ మార్గమున ( వెడలిన ) సకామకర్మయోగి చంద్రసంబంధమైన ప్రకాశమునుబొంది మఱల వెనుకకు వచ్చుచున్నాడు ( తిరిగి జన్మించుచున్నాడు ) .
|
అ.
శుక్లకృష్ణే గతీ హ్యేతే
జగతః శాశ్వతే మతే|
ఏకయా యాత్యనావృత్తి
మన్యయావర్తతే పునః|| 8-26
అ.
నైతే సృతీ పార్థ జాన
న్యోగీ ముహ్యతి కశ్చన|
తస్మాత్సర్వేషు కాలేషు
యోగయుక్తో భవార్జున|| 8-27 ||
|
ఉత్పలమాల.
దారులు రెండిటిన్ దెలియు ధన్యులు మోహము నందకుండ , సం
సార పరీత దుఃఖపు సానువులన్ జరియింపఁ బోవ , రా
ధీరులు జ్ఞానభాస్కర సదృక్తపనీయులు గాన , పార్థ ! యా
తీరునె , నీవు యోగ నిరతిం గనుచుండుము , సర్వకాలమున్ . ౨౩
|
ఈ శుక్ల కృష్ణమార్గములు రెండును జగత్తునందు శాశ్వతముగ నుండునవిగ తలంపబడుచున్నవి . అందు మొదటిదానిచే జన్మరాహిత్యమును , రెండవ దానిచే మరల జన్మమును యోగి పొందుచున్నాడు . ఓ అర్జునా ! ఈ రెండుమార్గములను ఎఱుఁగునట్టియోగి యెవడును ఇక మోహమును బొందడు . కాబట్టి నీ వెల్లకాలమందును ( దైవ ) యోగయుక్తుడవు కమ్ము .
|
ఇంద్రవజ్ర.
వేదేషు యజ్ఞేషు తపఃసు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్|
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్|| 8-28 ||
|
ఉత్పలమాల.
వేదములన్ పఠించిన , వివేకము యజ్ఞతపంబులంది , సం
పాదితమైన సత్ఫలముఁ , బావన తీర్థములందు దాన ధ
ర్మాది ప్రపూత కర్మల ఫలంబుల పుణ్యమతిక్రమించి , య
య్యాది కవీంద్రు బ్రహ్మ పథమందెడు యోగివరుండు , ఫల్గునా ! ౨౪
|
యోగియైనవాడు దీనిని ( ఈ అధ్యాయమున చెప్పబడిన అక్షరపరబ్రహ్మతత్త్వము మున్నగువానిని ) ఎఱిఁగి వేదములందును , యజ్ఞములందును , దానములందును , తపస్సులందును ఏపుణ్యఫలము చెప్పబడియున్నదో , దానినంతను అతిక్రమించుచున్నాడు . ( దానిని మించిన పుణ్యఫలమును పొందుచున్నాడు ) . మఱియు అనాదియగు సర్వోత్తమ ( బ్రహ్మ ) స్థానమును బొందుచున్నాడు .
|
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
అక్షరబ్రహ్మయోగో నామాష్టమోऽధ్యాయః|| 8 ||
|
ఓం తత్ సత్
శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిచే యనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందలి
శ్రీ అక్షర పరబ్రహ్మ యోగము అను అష్టమ తరంగము
సంపూర్ణం .
శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.
|
ఇది ఉపనిషత్ప్రతిపాదితమును , బ్రహ్మవిద్యయు ,
యోగ శాస్త్రమును , శ్రీ కృష్ణార్జున సంవాదమునగు
శ్రీ భగవద్గీతలందు అక్షర పరబ్రహ్మ యోగమను
ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము .
ఓమ్ తత్ సత్.
|