శ్రీ గీతామృత తరంగిణి/విశ్వరూపసందర్శన యోగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
శ్రీమద్భగవద్గీతా (మూల శ్లోకములు) శ్రీ గీతామృత తరంగిణి(తెలుగు పద్యములు)

శ్రీ పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రి (1948-1952)

గీతా మకరందము(తెలుగు తాత్పర్యము)

శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి, శ్రీ శుకబ్రహ్మాశ్రమము కాళహస్తి(1979)

అర్జున ఉవాచ|
అనుష్టుప్.
మదనుగ్రహాయ పరమం
గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్|
యత్త్వయోక్తం వచస్తేన
మోహోऽయం విగతో మమ|| 11-1 ||

అర్జును వాక్యము.
కందము.
నీ కరుణ వలన గోప్యము
సాకల్యము గాఁగ వింటి , సందియ మెదియున్
లేకుండ , వివేకముఁ గని ,
చీకటి దుర్మోహమిపుడు చెదరె , ముకుందా ! ౧

అర్జునుడు చెప్పెను.

( శ్రీకృష్ణమూర్తీ ! ) నన్ననుగ్రహించుటకొఱకై , సర్వోత్తమమై , రహస్యమై , అధ్యాత్మమను పేరుగలదై నట్టి ఏ వాక్యమును ( బోధను ) నీవు చెప్పితివో , దానిచే నా అజ్ఞానము పూర్తిగ తొలగిపోయినది .

అనుష్టుప్.
భవాప్యయౌ హి భూతానాం
శ్రుతౌ విస్తరశో మయా|
త్వత్తః కమలపత్రాక్ష !
మాహాత్మ్యమపి చావ్యయమ్|| 11-2 ||

కందము.
భూతోత్పత్తి లయంబుల
రీతులు వినఁగలిగె , కృష్ణ ! కృపఁజూపుచు , నీ
ఖ్యాతి మహోన్నతిఁ దెలియ వి
భూతి వినం జెప్పినావు ; పుష్కలము హరీ ! ౨

ఏలయనగా కమలనేత్రుడవగు ఓ కృష్ణా ! నీవలన ప్రాణులయొక్క ఉత్పత్తి వినాశములగూర్చి , నీయొక్క మహాత్మ్యమును ( మహిమను ) గూర్చి సవిస్తరముగ వింటిని.

అ.
ఏవమేతద్యథాత్థ త్వ
మాత్మానం పరమేశ్వర|
ద్రష్టుమిచ్ఛామి తే రూప
మైశ్వరం పురుషోత్తమ|| 11-3 ||

కందము.
తేజ స్వరూపమును న
వ్యాజకృపన్ దెలుప , నది యదార్థమటంచున్
బూజింతు , నీ స్వరూపము
నేఁ జూడఁగ మనసు వుట్టె , నీరజనేత్రా ! ౩

ఓ పరమేశ్వరా నిన్ను గూర్చి నీవు చెప్పినదంతయు సరియేయని నేను విశ్వసించుచున్నాను. ఓ పురుషోత్తమా ! నీ యొక్క ఈశ్వరసంబంధమైన విశ్వరూపమును నేనిపుడు చూడదలంచుచున్నాను.

అ.
మన్యసే యది తచ్ఛక్యం
మయా ద్రష్టుమితి ప్రభో|
యోగేశ్వర తతో మే త్వం
దర్శయాత్మానమవ్యయమ్|| 11-4 ||

తేటగీతి.
అవ్యయంబగు నీరూప మఱయనాకు
శక్యమని తలంతువ యేని , సారసాక్ష !
చూపు మియ్యెడ నీ దివ్యరూప మెల్ల ,
నఱసి ముదమంద , యోగీశ్వరా ! ముకుంద ! ౪

ప్రభూ ! ఆ నీ స్వరూపమును జూచుటకు నాకు సాధ్యమగునని నీవు తలంతువేని , ఓ యోగీశ్వరా ! నాశరహితమైన ఆ నీ (విశ్వ ) రూపమును ఇక నాకు జూపుము.

శ్రీభగవానువాచ|
అ.
పశ్య మే పార్థ ! రూపాణి
శతశోऽథ సహస్రశః|
నానావిధాని దివ్యాని
నానావర్ణాకృతీని చ|| 11-5 ||

శ్రీ భగవానుల వాక్యము.
కందము.
వందల కొలదులు , మఱి పది
వందల కొలదులు గలట్టి వర్ణంబులతో
చందము లనేక సంఖ్యను
గందువె , నాయందు నిందుఁగల రూపంబుల్ . ౫

శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు.

ఓ అర్జునా ! అనేక విధములుగనున్నవియు , అలౌకికములై నవియు , వివిధ వర్ణములు ఆకారములు కలవియు , అసంఖ్యాకములుగ వర్తించునవియునగు నాయొక్క రూపములను గాంచుము .

అ.
పశ్యాదిత్యాన్వసూన్రుద్రా
నశ్వినౌ మరుతస్తథా|
బహూన్యదృష్టపూర్వాణి
పశ్యాశ్చర్యాణి భారత|| 11-6 ||

కందము.
ఆదిత్యుల , వసురుద్రుల ,
నాది భిషగ్వరుల , మారుతాళినిఁ గనుమా !
నా దివ్య రూపముం గన
రా దేరికి , బహు విచిత్ర రాసి , కిరీటీ ! ౬

ఓ అర్జునా 1 సూర్యులను, వసువులను , రుద్రులను , అశ్వినీ దేవతలను , మరుత్తులను చూడుము . అట్లే ఇదివఱ కెన్నడును నీవు చూడని పెక్కు ఆశ్చర్యములను గాంచుము.

అ.
ఇహైకస్థం జగత్కృత్స్నం
పశ్యాద్య సచరాచరమ్|
మమ దేహే గుడాకేశ
యచ్చాన్యద్ ద్రష్టుమిచ్ఛసి|| 11-7 ||

కందము.
ప్రకృతి చరాచర జగతిని ,
నకలంకము వివిధమౌ పదార్థచయము , మా
మక దేహంబున నొకయెడఁ
బ్రకటితమౌఁ జూడుమా ! పరంతప ! యిచటన్ . ౭

ఓ అర్జునా ! ఈ సమస్త చరాచర ప్రపంచమును , ఇంకను దేనిదేనిని జూడదలంచుచున్నావో దానిని ఈ నాశరీరమందు ( అవయవమువలె ) ఒకచోటనున్న దానినిగా ఇపుడు చూడుము.

అ.
న తు మాం శక్యసే ద్రష్టు
మనేనైవ స్వచక్షుషా|
దివ్యం దదామి తే చక్షుః
పశ్య మే యోగమైశ్వరమ్|| 11-8 ||

ఉత్పలమాల.
ప్రాకృత చక్షులన్ గనఁగరాదు కిరీటి ! మదీయమైన ది
వ్యాకృతిఁ జూడగా ; ముదము నందెద వన్నచొ , దివ్య చక్షులన్
నే కృపనిత్తు నీకు , మహనీయపు యోగ మహత్త్వమెల్ల , నా
నాకృతి విశ్వరూపము గనంబడఁ జేతు , నదృష్టపూర్వమున్ . ౮

ఈ నీ మాంసమయ నేత్రములతో నీవు నా విశ్వరూపమును గాంచజాలవు . కావున దివ్యదృష్టిని ( జ్ఞాన నేత్రమును ) నీకు ప్రసాదించుచున్నాను. దానిచే ఈశ్వరసంబంధమైన నా యోగమహిమను జూడుము.

సఞ్జయ ఉవాచ|
అ.
ఏవముక్త్వా తతో రాజన్
మహాయోగేశ్వరో హరిః|
దర్శయామాస పార్థాయ !
పరమం రూపమైశ్వరమ్|| 11-9 ||

సంజయుని వాక్యము.
ఆటవెలది.
అటుల యోగీశ్వరుండు శ్రీహరి వచించి ,
పార్థుఁ గృపఁ జూచి , దివ్య స్వరూప
దర్శన మొసంగెఁ గురురాజ ! ధన్యుడతఁడు ,
వ్యాస భగవానుఁ గృపఁ గొంత నఱయగంటి ! ౯

సంజయుడు చెప్పెను.

ఓ ధృతరాష్ట్రమహారాజా ! మహాయోగేశ్వరుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారముగ వచించి తదుపరి సర్వోత్తమమైన ఈశ్వరసంబంధమగు ( విశ్వ ) రూపమును అర్జునునకు జూపెను.

అ.
అనేకవక్త్రనయన
మనేకాద్భుతదర్శనమ్|
అనేకదివ్యాభరణం
దివ్యానేకోద్యతాయుధమ్|| 11-10
అ.
దివ్యమాల్యామ్బరధరం
దివ్యగన్ధానులేపనమ్|
సర్వాశ్చర్యమయం దేవ
మనన్తం విశ్వతోముఖమ్|| 11-11 ||

ఉత్పలమాల.
వేనకు వేలు నేత్రములు , వేలు ముఖంబులు నద్భుతంబు , నా
నా నవచిత్రములు , నాయుధ పంక్తులు , దివ్యభూషలున్ ,
సూన వితాన మాల్యములు , శోభిత దివ్య నవాంబరంబులున్ ,
మేని సుగంధ లేపన సమృద్ధములున్ , స్వవికాసతేజముల్ . ౧౦
కందము.
వింతలకుఁ దావలంబై ,
యంతునుఁ బొంతేమి లే , కనంతమ్మై , యా
శాంతముల నధిగమించె , న
నంతుడు శ్రీహరియె తానెయై యెల్లెడలన్ . ౧౧

( అత్తఱి ) పెక్కుముఖములు , నేత్రములు గలదియు , అనేకములగు అద్భుత విషయములను జూపునదియు , దివ్యములైన పెక్కు ఆభరణములతో గూడినదియు , ఎత్తబడియున్న అనేక దివ్యాయుధములు గలదియు , దివ్యములైన పుష్పమాలికలను వస్త్రములను ధరించినదియు , దివ్యమగు గంధపూతతో గూడియున్నదియు , అనేక ఆశ్చర్యములతో నిండియున్నదియు , ప్రకాశమాన మైనదియు , అంతము లేనిదియు , ఎల్లెడల ముఖములు గలదియు నగు తన విశ్వరూపమును భగవాను డర్జునునకు జూపెను.

అ.
దివి సూర్యసహస్రస్య
భవేద్యుగపదుత్థితా|
యది భాః సదృశీ సా స్యా
ద్భాసస్తస్య మహాత్మనః|| 11-12 ||

కందము.
రవి కోటి యొక్క పరి దివి
గవసి , ప్రభాసింపఁ గల యఖండ ద్యుతి , యా
దవు దవుల సరి సమానం
బవునని చెప్పంగవచ్చు , నా తేజముతోన్ .౧౨

ఆకాశమందు వేలకొలది సూర్యులయొక్క కాంతి ఒక్కసారి బయలుదేరినచో ఎంత కాంతి యుండునో అది ఆ మహాత్మునియొక్క కాంతికి బోలియున్నది.

అ.
తత్రైకస్థం జగత్కృత్స్నం
ప్రవిభక్తమనేకధా|
అపశ్యద్దేవదేవస్య
శరీరే పాణ్డవస్తదా|| 11-13 ||

తేటగీతి.
అపుడు పార్థుఁడు చూచె , నా హరి శరీర
మందుఁ బలు విధంబులు భిన్నమౌ చరా చ
ర ప్రకరముల నొక చోట , రాశియౌచుఁ
గృష్ణభగవానునందు నేకీకృతముగ . ౧౩

అప్పు డర్జునుడు నానా విధములుగ విభజింపబడియున్న సమస్తజగత్తును దేవదేవుడగు శ్రీకృష్ణభగవానునియోక్క శరీరమున ( అవయవమువలె ) ఒక్కచోట నున్నదానినిగ చూచెను.

అ.
తతః స విస్మయావిష్టో
హృష్టరోమా ధనఞ్జయః|
ప్రణమ్య శిరసా దేవం
కృతాఞ్జలిరభాషత|| 11-14 ||

కందము.
కలితోన్నత రూపముఁ గని ,
పులకాంకిత దేహుఁడై , ప్రమోదంబున దో
సిలియొగ్గి , శిరము వంచియుఁ ,
బలికె నరుఁడు హరినిఁ గూర్చి బహుభావములన్ . ౧౪

అటుపిమ్మట ఆ యర్జునుడు ఆశ్చర్యముతో గూడినవాడును , గగుర్పాటు కలవాడును అయి విశ్వరూపమును ధరించిన భగవానునకు శిరస్సుచే నమస్కరించి చేతులు జోడించుకొని ( ఈ ప్రకారముగ ) పలికెను.

అర్జున ఉవాచ|
ఉపజాతి.
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్|
బ్రహ్మాణమీశం కమలాసనస్థ-
మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్|| 11-15 ||

అర్జును వాక్యము.
ఉత్పలమాల.
దేవ మహానుభావ ! భవదీయ శరీరమునందుఁ గంటి , నే
దేవతలన్ , సమస్త జగతీతల భూత చయమ్ములన్ , అహి
ప్రావృత సంకులమ్ము , పృథులాబ్జమునం దల బ్రహ్మదేవునిన్ ,
ఏవొ , మరేవొ , లెక్కకుగ మించిన వన్నియు కానుపించెడున్ . ౧౫

దేవా ! నీ శరీరమందు సమస్త దేవతలను , అట్లే చరాచర ప్రాణికోట్ల సమూహములను , కమలాసనుడైన సృష్టికర్త యగు బ్రహ్మదేవుని , సమస్త ఋషులను , దివ్యములగు సర్పములను చూచుచున్నాను.

ఉపజాతి.
అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోऽనన్తరూపమ్|
నాన్తం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప|| 11-16 ||

ఉత్పలమాల.
లెక్కకుమించు బాహువులు , లెక్కకు నందకనుండు నేత్రముల్
పెక్కు మహోదరంబులును , లెక్కిడరాని ముఖంబులుండి , యే
దిక్కులఁ జూడ నీవయి , తుదిన్ మొదలున్ గనరాకయున్న , నీ
యక్కజమైన రూపము మహాద్భుత దృశ్య , మనంత మయ్యెడున్. ౧౬

ప్రపంచమునకు అధిపతి యైనవాడా ! జగద్రూపుడా ! నిన్ను సర్వత్ర అనేక హస్తములు , ఉదరములు , ముఖములు , నేత్రములు గలవానినిగను అనంతరూపునిగను నేను చూచుచున్నాను . మఱియు నీయొక్క మొదలుగాని , మధ్యముగాని , తుదనుగాని నేను గాంచలేకున్నాను .

ఉపజాతి.
కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్|
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్|| 11-17 ||

చంపకమాల.
గదలు, కిరీటచక్రములు , కౌస్తుభదివ్య విభూషణ ద్యుతుల్ ,
గదసి మహానలార్క రుచిర ప్రతిభాసము లా దిగంతముల్ ,
చదల కనంతమై చెదరె , శక్యముఁగా దెఱుగంగ నిన్ను బె
ట్టిదము త్వదీయ రూప మెవఁడేనియుఁ గానగ దుర్ని రీక్ష్యమౌ . ౧౭

నిన్ను ఎల్లెడలను కిరీటము గలవానినిగను , గదను ధరించినవానినిగను , చక్రమును బూనినవానినిగను , కాంతిపుంజముగను , అంతటను ప్రకాశించువానినిగను , జ్వలించు అగ్ని , సూర్యులవంటి కాంతిగలవానినిగను , అపరిఛిన్నునిగను , ( పరిమితి లేనివానినిగను ) చూచుచున్నాను .

ఉపేంద్రవజ్ర.
త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే|| 11-18 ||

సీసము.
వేదితవ్యంబీవె , వేదాంతమును నీవె ;
       పరమపురుషుఁడీవె , బ్రహ్మ వీవె ;
అఖిల జగంబుల కాధారమును నీవె ;
       అక్షరుండవ్యయుం డగుదు వీవె ;
దుష్టశిక్షణఁ జేసి , శిష్టరక్షణఁ జేయు
       శాశ్వత ధర్మ రక్షకుఁడ వీవె ;
నాశన రహిత సనాతనుండవు నీవె ;
       పరమ దివ్య పురాణ పురుషుఁ డీవె ;
తేటగీతి.
నిన్నుఁ దెలుపఁగ మాటలు నేరవెవ్వి ;
నీవు పరమాత్మ వంచని నేఁ దలంతు ;
పరమ పురుష ! పరంధామ ! పతిత పావ
నా ! పరేశ ! దివ్య ప్రభావా 1 పరాత్మ ! ౧౮

నీవు తెలియదగిన సర్వోత్తమ అక్షరపరబ్రహ్మవు . నీవీజగత్తునకంతటికి గొప్ప ఆధారభూతుడవు . నీవు నాశరహితుడవు . శాశ్వతములగు ధర్మములను కాపాడువాడవు . నీవు పురాణపురుషుడవు - అని నా అభిప్రాయము .

ఉపజాతి.
అనాదిమధ్యాన్తమనన్తవీర్య-
మనన్తబాహుం శశిసూర్యనేత్రమ్|
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం
స్వతేజసా విశ్వమిదం తపన్తమ్|| 11-19 ||

ఉత్పలమాల.
ఈవె యనాది మధ్యలయుఁ డీవె , యనంత పరాక్రముండవౌ
దీవె , యనంత బాహుఁడవు నీవె , హుతాశన వక్త్ర దీప్తుఁడౌ
దీవె , శశి ప్రభాకర సదృగ్ద్వయ భూరి కళాప్రపూర్ణుఁడౌ
దీవె , స్వతేజమున్ భువి తపింపగఁ జేయుటఁ గంటి శ్రీహరీ ! ౧౯

ఆదిమధ్యాన్తరహితునిగను , అపరిమిత సామర్ధ్యముగలవానినిగను , అనేక హస్తములుగలవానినిగను , చంద్రసూర్యులు నేత్రములుగ గలవానినిగను , ప్రజ్వలించు అగ్నిహోత్రునివంటి ముఖముగలవానినిగను , స్వకీయ తేజస్సుచే ఈ ప్రపంచమును తపింప జేయుచున్నవానినిగను నిన్ను చూచుచున్నాను .

ఇంద్రవజ్ర.
ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః|
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్|| 11-20 ||

ఉత్పలమాల.
ఆకసమున్ , జగంబును , దిగంతములన్నియు నొక్కరుండ వీ
యాకృతితో గ్రసించిన భయంకర మద్భుతమైన దృశ్యముల్
వీకడగించి , భీతి గొలిపెన్ , నినుఁ జూడగ దుర్నిరీక్ష్యమౌ ,
లోకములెల్ల బెగ్గిలి విలోలతగా వివశమ్ములై హరీ ! ౨౦

ఓ మహాత్మా ! భూమ్యాకాశములయొక్క ఈమధ్యప్రదేశమంతయును దిక్కులన్నియును నీయొక్కనిచేతనే వ్యాపింపబడియున్నవిగదా . మఱియు భయంకరమైనదియు , ఆశ్చర్యకరమైనదియు నగు నీ యీ రూపమును జూచి ముల్లోకములున్ను మిగుల భీతిని బొందియున్నవి .

ఉపజాతి.
అమీ హి త్వాం సురసఙ్ఘా విశన్తి
కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణన్తి|
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసఙ్ఘాః
స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః|| 11-21 ||

చంపకమాల.
సురలు త్వదీయ దేహమును జొచ్చుచుఁ గొందఱు భీతి బొందుచున్ ,
గరములు మోడ్చి ప్రస్తుతు లొనర్తురు ; సిద్ధులు నా మహర్షులున్
వరుసను స్వస్తిఁ జెప్పెదరు , వర్ణన సేయుచు నీ విభూతి వి
స్తరణ విశేష సంపదల , సన్నుతిఁ జేయుచుఁ బుష్కలంబుగాన్ . ౨౧

ఈ దేవతాసమూహములు నీయందు ప్రవేశించుచున్నవి ( మఱి ) కొందఱు భీతిల్లి చేతులు జోడించుకొని ( నిన్ను ) స్తుతించుచున్నారు . మహర్షులయొక్కయు , సిద్ధులయొక్కయు సమూహములు ( లోకమునకు ) క్షేమమగుగాక ! యని పలికి సంపూర్ణములగు స్తోత్రములచేత నిన్ను పొగడుచున్నారు .

ఇంద్రవజ్ర.
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా
విశ్వేऽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ|
గన్ధర్వయక్షాసురసిద్ధసఙ్ఘా
వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే|| 11-22 ||

తేటగీతి.
వసువు , లాదిత్య , విశ్వదేవతలు , రుద్రు ,
లసుర , గంధర్వ , సాధ్యు , లాయక్ష , సిద్ధు ,
లశ్వినీ దేవతలు , పిత , లనిల గణము
లందఱును విస్మితమున నిన్ గందురు హరి ! ౨౨

రుద్రులును , సూర్యులును , వసువులును , సాధ్యులును , విశ్వేదేవతలును , అశ్వినీ దేవతలును , గంధర్వులయొక్కయు , యక్షులయొక్కయు , అసురుల యొక్కయు , సిద్ధులయొక్కయు సంఘములును , వీరందఱును ఆశ్చర్య చకితులై నిన్ను చూచుచున్నారు .

ఉపజాతి.
రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్|
బహూదరం బహుదంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్|| 11-23 ||

కందము.
నానా ముఖములు , చక్షులు ,
నానా బాహూరు పాద నానోదరమై ,
నానా దంష్ట్రా కరాళ
మౌ , నీరూపమ్ము కడు భయానక మయ్యెన్ . ౨౩

గొప్ప భుజములుగల ఓకృష్ణా ! అనేక ముఖములు . నేత్రములు గలిగినట్టియు అనేకములగు హస్తములు , తొడలు , పాదములు , గలిగినట్టియు , పెక్కు కడుపులు గల్గియున్నట్టియు , అనేకములైన కోఱలచే భయంకరమైనట్టియు , నీయొక్క గొప్పరూపమును జూచి జనులందఱును మిగుల భయపడుచున్నారు . నేనున్ను అట్లే భయపడుచున్నాను .

ఉపజాతి.
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్|
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో|| 11-24 ||

కందము.
భీకరము , భయానక , మీ
యాకృతి భువనములకున్ భయాస్పద మగుచున్ ,
వ్యాకులము నొందఁ దొడఁగెను ,
నాకును నొడ లడఁచుచున్ వణంకె , ముకుందా ! ౨౪

ఓ విష్ణుమూర్తీ ! ఆకాశమును తాకుచున్నవాడవును , ప్రకాశించుచున్నవాడవును , పెక్కు రంగులు గలవాడవును , తెఱవబడిన నోరులు గలవాడవును , జ్వలించుచున్న విశాలములైన నేత్రములు గలవాడవునునగు నిన్ను జూచి మిగుల భీతిల్లిన మనస్సు గలవాడనై ధైర్యమును , శాన్తిని నేను పొందజాలకున్నాను .

ఉపజాతి.
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని|
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస|| 11-25 ||

తేటగీతి.
నభము స్పృశియించు వ్యాత్తాననంబు తోడ ,
ప్రజ్వలితమైన దీర్ఘ నేత్రములతోడ ,
వర్ణము లనేకమైన రూపమునుఁ గాంచి ,
ధృతి శమమ్ములుఁ గోలుపోయితి ముకుంద ! ౨౫

కోరలచే భయంకరము లైనవియు , ప్రళయాగ్నినిబోలినవియునగు నీముఖములను జూచి , నేను దిగ్భ్రమజెందియున్నాను . సుఖమునుగూడపొందకయేయున్నాను . కావున ఓ దేవదేవా ! జగదాశ్రయా ! ప్రసన్నుడవగుము ( నన్ననుగ్రహింపుము ) .

ఉపజాతి.
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసఙ్ఘైః|
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః|| 11-26
ఇంద్రవజ్ర.
వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానకాని|
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సన్దృశ్యన్తే చూర్ణితైరుత్తమాఙ్గైః|| 11-27||

ఉత్పలమాల.
అనిశితమ్ములైన వికృతాకృత దంష్ట్ర పరీతకాల దా
వానల దీప్తమౌ ముఖచయమ్ములఁ జూచి , భయమ్ముఁ దోచి , నా
మేను వడంకుచున్నయది ; మేకొనలేను సుఖంబు నింతయున్ ,
భూనభముల్ దిగంతములఁ బొల్పు కనంబడకున్నదో , హరీ ! ౨౬
మత్తేభము.
అదె కౌరవ్యులు , భీష్ముడున్ , గురుఁడు , నంగాధీశుఁ డా , సూతుఁడ
ల్లదె , సర్వాంగ బలంబులన్ గలుగు యోధాగ్రేసరుల్ దత్తరం
బొదవన్ , గొందఱు నీ ముఖంబులను నోహో మాయగా జొచ్చి చ
చ్చెద ; రాదంతములన్ దగుల్కొనుచుఁ , దచ్ఛీర్షములుం జూర్ణ మై . ౨౭

ఈ ధృతరాష్ట్రుని కొమారులందఱును , భీష్ముడును , ద్రోణుడును , కర్ణుడును , వారి సేనయందలి సమస్త రాజసమూహములును , అట్లే మనసేనయందలి సైనిక ప్రముఖులును , నిన్ను త్వరితముగ జేరుచున్నవారై కోరలచే భయంకరములుగ నున్నట్టి నీ నోళ్ళయందు ప్రవేశించుచున్నాను . ( వారిలో ) కొందఱు నీ పండ్లసందులయందు చిక్కుకొనినవారై పొడుముచేయబడిన శిరస్సులతో కనుపించుచున్నారు.

ఉపెంద్రవజ్ర.
యథా నదీనాం బహవోऽమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవన్తి|
తథా తవామీ నరలోకవీరా
విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి|| 11-28
ఉపేంద్రవజ్ర.
యథా ప్రదీప్తం జ్వలనం పతఙ్గా
విశన్తి నాశాయ సమృద్ధవేగాః|
తథైవ నాశాయ విశన్తి లోకాస్-
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః|| 11-29 ||

ఉత్పలమాల.
వేగ మహార్భటుల్ సెలగ , వేనకువేలు నదీ నదమ్ములున్
సాగరమందు డిందెడి వెసన్ , జ్వలితానల కీలలన్ మహో
ద్వేగ పతంగ రాశుల గతిన్ భవదీయ ముఖాగ్నులం బడం
గాఁ గమకింతు రెల్లరును , నాశన మందగ సర్వ వీరులున్ .౨౮

ఏ ప్రకారము అనేక నదీప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందుప్రవేశించుచున్నవో , ఆప్రకారమే ఈమనుష్యలోకమందలి వీరులు ( రాజులు ) లెస్సగ జ్వలించుచున్న నీ నోళ్ళయందు ప్రవేశించుచున్నారు . ఏప్రకారము మిడతలు వినాశము కొఱకు మిక్కిలి వేగముతో గూడినవై బాగుగ మండుచున్న అగ్నియందు ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే జనులున్ను మిగులవేగముతో గూడినవారై నాశము కొఱకు నీ నోళ్ళయందు ప్రవేశించుచున్నారు .

ఇంద్రవజ్ర.
లేలిహ్యసే గ్రసమానః సమన్తాల్-
లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః|
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో|| 11-30 ||

తేటగీతి.
జ్వలిత వదనాగ్ని కీలల జగము నెల్ల
నింపి , దిక్కుల నాకి , గ్రసింపుచుంటి ,
అనల కాంతిచ్ఛటల్ జగం బాక్రమించి ,
పరితపింపఁగఁ జేసెడుఁ బరమపురుష ! ౨౯

ఓ విష్ణుమూర్తీ ! మండుచున్న నీయొక్క నోళ్ళచే జనులందఱిని అంతటను మ్రింగుచున్న వాడవై ఆస్వాదించుచున్నావు . నీ యొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సులచేత జగత్తునంతను వ్యాపించి మిగుల తపింప జేయుచున్నవి .

ఉపజాతి.
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోऽస్తు తే దేవవర ప్రసీద|
విజ్ఞాతుమిచ్ఛామి భవన్తమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్|| 11-31 ||

తేటగీతి.
ఓ మహాప్రభూ ! దేవ మహోగ్రరూప !
నీ యుదంతమ్ము , సర్వంబు , నెఱుఁగఁ దలతుఁ
గృపఁ దలంచి , చెప్పుమ , నమస్కృతులు నీకు ;
నీ వెవండవు ? ఎట్టిది నీ ప్రవృత్తి ? ౩౦

దేవోత్తమా ! భయంకరాకారముగల నీ వెవడవో నాకు చెప్పుము . ఏలయనగా - నీ ప్రవృత్తిని ఎఱుంగకున్నాను . కనుక ఆదిపురుషుడవగు నిన్నుగూర్చి తెలిసికొన గోరుచున్నాను . నీకు నమస్కారము . నన్ననుగ్రహింపుము .

శ్రీభగవానువాచ|
ఉపజాతి.
కాలోऽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః|
ఋతేऽపి త్వాం న భవిష్యన్తి సర్వే
యేऽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః|| 11-32 ||

శ్రీ భగవానుల వాక్యము.
ఉత్పలమాల.
కాలుఁడ నేను , లోకములఁ గాల్చి , హరింప దలంతు , నేడు ప్రా
ల్మాలిరి ; శత్రువీరులు సమాప్తము నేటికి , సుంతయైన నీ
కేలుఁ గదల్చకుండ , పరికించిన సందియమిందు లేదు , నే
నీ లయకృత్యము , న్నెఱపు టెంతయు నిశ్చయ మిద్ది యర్జునా ! ౩౧

శ్రీ భగవంతుడు చెప్పెను .

( నేను ) లోకసంహారకుడనై విజృంభించిన కాలుడను అయియున్నాను . ప్రాణులను సంహరించు నిమిత్త మీ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను . ప్రతిపక్షసైన్యమునందుగల వీరులు నీవు లేకపోయినను ( యుద్ధము చేయకున్నను ) జీవించియుండరు ( మృతినొందక తప్పరు ) .

ఉపజాతి.
తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుఙ్క్ష్వ రాజ్యం సమృద్ధమ్|
మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్|| 11-33 ||

ఉత్పలమాల.
కావున లెమ్మికన్ , రిపులఁ గాలనుఁ గ్రుమ్మి , యశమ్ము రాజ్య ల
క్ష్మీ విభవమ్ముఁ దోగుచు , సుఖింపుము ; వీరుల , శత్రులన్ , గత
గ్రీవులఁ గాగ మున్నె యొనరించితి , సందియ మొందఁ బోకుమా !
నీవు నిమిత్త మాత్రమయి నిల్చి , రణం బొనరింపు , మర్జునా ! ౩౨

కాబట్టి నీవు లెమ్ము . శత్రువులను జయించి కీర్తిని బడయుము . పరిపూర్ణమగు ( నిష్కళంకమగు ) రాజ్యము ననుభవింపుము . వీరందఱును ఇదివరకే నా చేతనే చంపబడిరి . కావున ఓ అర్జునా ! నీవు నిమిత్తమాత్రముగ నుండుము .

ఉపజాతి.
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్|
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్|| 11-34 ||

ఉత్పలమాల.
ద్రోణుడు , భీష్మకర్ణులు , విరోధి జయద్రథు , లాది శత్రు సే
నా నివహమ్ములన్ గలుగు నాయకు లెల్లరు ; పూర్వమే గత
ప్రాణులు నాకతంబున , పరంతప ! భీతిల నేల , నీవనిన్
బూనుము , సవ్యసాచి ! జయముం గొనలెమ్ము , నిమిత్తమాత్రమై . ౩౩

నాచేత ( ఇదివఱకే ) చంపబడిన ద్రోణాచార్యుని , భీష్మాచార్యుని , జయద్రథుని , కర్ణుని అట్లే ఇతర యుద్ధవీరులనుగూడ నీవు చంపుము . భయపడకుము . యుద్ధముచేయుము . శత్రువులను గెలువగలవు .

.సఞ్జయ ఉవాచ|
విపరీతపూర్వ.
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాఞ్జలిర్వేపమానః కిరీటీ|
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య|| 11-35 ||

సంజయు వాక్యము.
తేటగీతి.
కేశవుని పల్కు లాలించి , క్రీడి మిగులఁ
గంపితుండయి , డగ్గదికంబుఁ దోప ,
ప్రణతు లొనరించి , భీతిని వణకుచుండి,
పలికె నిట్టుల హరికి , నంజలి ఘటించి. ౩౪

సంజయుడు చెప్పెను.

అర్జునుడు శ్రీ కృష్ణమూర్తియొక్క ఈ వాక్యములను విని వణకుచున్నవాడై చేతులు జోడించుకొని శ్రీకృష్ణునకు నమస్కరించి మిగుల భయపడినవాడగుచు వినమ్రుడై గద్గద స్వరముతో నిట్లు పలికెను .

అర్జున ఉవాచ|
ఉపజాతి.
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ|
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
సర్వే నమస్యన్తి చ సిద్ధసఙ్ఘాః|| 11-36 ||

అర్జును వాక్యము.
తేటగీతి.
ఓ హృషీ కేశ ! భువి ముదమొందె నేడు ;
ప్రీతి నొందెడు నీ కీర్తి విభవమునకు ;
రక్కసులు పాఱి రేదిక్కొ పిక్కబలిమి ,
ప్రణతు లొనరింతు , రా సిద్ధగణము లెల్ల . ౩౫

అర్జునుడు చెప్పెను.

ఓ శ్రీకృష్ణా నీయొక్క నామము నుచ్చరించుట చేతను , మాహాత్మ్యమును లెస్సగ కొనియాడుట చేతను లోకము మిగుల సంతోషించుచున్నది . మిక్కిలి ప్రీతిఁ బొందుచున్నది .( నిన్ను జూచి ) రాక్షసులు భయపడినవారై దిగంతములకు పరుగిడుచున్నారు .సిద్ధుల సమూహములన్నియు నీకు నమస్కరించుచున్నవి .ఇవి యన్నియు నీ మహిమకు తగియే యున్నవి .

విపరీతపూర్వ.
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్
గరీయసే బ్రహ్మణోऽప్యాదికర్త్రే|
అనన్త దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్|| 11-37 ||

తేటగీతి.
ఆది దేవుండ వీవె బ్రహ్మాదులకును ,
నెవరు నీకంటెఁ బూజార్హు లవుదురయ్య !
సత్త సత్తగు నీ ప్రపంచమున కవధి
యౌ , యనంతుఁడ వీవె , మహానుభావ ! ౩౬

మహాత్మా ! అనంతరూపా ! దేవదేవా ! జగదాశ్రయా ! సత్ , అసత్తులకు ( స్థూలసూక్ష్మజగత్తుల రెండింటికిని ) పరమైనట్టి అక్షర ( నాశరహిత ) పరబ్రహ్మవు నీవే అయియున్నావు . బ్రహ్మదేవునకుకూడ ఆదికారణుడవును , కనుకనే సర్వోత్కృష్టుడవును నగు నీకేల సమస్కరింపకుందురు ? ( వారి నమస్కారములకు నీవు తగుదువు అని భావము ) .

ఉపజాతి.
త్వమాదిదేవః పురుషః పురాణస్-
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్|
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప|| 11-38 ||

తేటగీతి.
ఆది దేవుండవు , ననంతుఁ డౌదు వీవె ;
జగతికి నిధానమీవె విశ్వమయుఁ డీవె ;
తెలియఁ దగు వాఁడ వీవె , యా తెలివి నీవె ,
అక్షరుండవు నీవె , యనంత రూప ! ౩౭

అనంతరూపుడవగు ఓ కృష్ణా ! నీవు ఆదిదేవుడవును , సనాతన పురుషుడవును , ఈ ప్రపంచమునకు శ్రేష్ఠమైన ఆధారమున్ను , సమస్తమును తెలిసికొనినవాడవును , తెలియఁదగినవాడవును , సర్వోత్తమస్థానమును అయియున్నావు . నీచేతనే ఈ ప్రపంచమంతయును వ్యాపింపబడి యున్నది .

విపరీతపూర్వ.
వాయుర్యమోऽగ్నిర్వరుణః శశాఙ్కః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ|
నమో నమస్తేऽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోऽపి నమో నమస్తే|| 11-39 ||

తేటగీతి.
అనిలుఁ , డనలుఁడు , వరుణ , కశ్యప , శశాంక
బ్రహ్మమొదలు సమస్త దేవతల పితవు ;
శతసహస్రమ్ములగు నమస్కృతు లొనర్తు ,
మఱల , మఱల నొనర్తు , ముమ్మరముగాను . ౩౮

వాయువును , యముడును , అగ్నియు , వరణుడును , చంద్రుడును , బ్రహ్మదేవుడును , బ్రహ్మదేవునకు తండ్రియును నీవే అయియున్నావు . నీ కనేకవేల నమస్కారములు . మఱల మఱల నీకు నమస్కారము !

ఉపజాతి.
నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోऽస్తు తే సర్వత ఏవ సర్వ|
అనన్తవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోऽసి సర్వః|| 11-40 ||

ఉత్పలమాల.
వందన మాచరించెదను ప్రాఙ్ముఖ పృష్ఠ ముఖంబులందు , నెం
దెందుల దిక్కులన్ గలుగు నెల్ల ముఖంబుల , సర్వతో ముఖం
బెందును నీవె , విశ్వమయుఁడీవె , యనంత పరాక్రమా ! జగ
ద్వందిత యాచరించెదను , వందలు వేలగు వందనమ్ములన్ . ౩౯

సర్వరూపుడవగు ఓ కృష్ణా ! ఎదుటను , వెనుకను నీకు నమస్కారము . మఱియు అన్నివైపులను నీకు నమస్కారమగు గాక ! అపరిమిత సామర్థ్యము , పరాక్రమము గలవాడవగు నీవు సమస్తమును లెస్సగ వ్యాపించియున్నావు . కనుకనే సర్వ స్వరూపుడవై యున్నావు .

ఉపజాతి.
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ హే యాదవ హే సఖేతి|
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ప్రణయేన వాపి|| 11-41
ఉపజాతి.
యచ్చావహాసార్థమసత్కృతోऽసి
విహారశయ్యాసనభోజనేషు|
ఏకోऽథవాప్యచ్యుత తత్సమక్షం
తత్క్షామయే త్వామహమప్రమేయమ్|| 11-42 ||

ఉత్పలమాల.
నిన్ను సముండవంచు మది నేనిటు " యాదవ ! కృష్ణ ! " యంచు ని
న్నెన్ని యయుక్తులన్ పలికి , యే నపహాస్యము లెన్నొ చేసితిన్
నిన్ను సమగ్రమున్ దెలియ నేరక , నీ చనువుం దలంచుచున్ ,
మన్నన సేతువే , నను ప్రమాదములన్ క్షమియించి , శ్రీహరీ ! ౪౦
ఉత్పలమాల.
ఆటలఁ , బాటలన్ , గుడుచు నప్పుడు , శయ్యలఁ జేరునప్పుడున్ ,
దోటలలో , విహారములఁ దోగినయప్పుడు నెల్లవేళలన్ ,
నోటికి వచ్చినట్లనుచు , నొవ్వఁగ నాడితి , మేల మాడి నా
నోటి కొలంది , సైతువె , ననుం గరుణించి , క్షమింతువే , హరీ ! ౪౧

నాశరహితుడవగు ఓ కృష్ణా ! నీయొక్క ఈ మహిమను తెలియక పొరపాటునగాని , చనువువలనగాని , సఖుడవని తలంచి " ఓ కృష్ణా , ఓ యాదవా , ఓ సఖా " యని అలక్ష్యముగ నిన్నుగూర్చి నేనేది చెప్పితినో మఱియు విహారము సల్పునపుడుగాని , పరుండునపుడుగాని , కూర్చుండునపుడుగాని , భుజించునపుడుగాని , ఒక్కడవుగ నున్నపుడుగాని , లేక ఇతరులయెదుటగాని పరిహాసము కొఱకు ఏ అవమానమును గావించితినో ఆ యపరాధము లన్నిటిని అప్రమేయుఁడవగు నీవు క్షమింప వేడుచున్నాను .

ఉపజాతి.
పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్|
న త్వత్సమోऽస్త్యభ్యధికః కుతోऽన్యో
లోకత్రయేऽప్యప్రతిమప్రభావ|| 11-43 ||

తేటగీతి.
లోకములకెల్లఁ బితవు , ముల్లోక పూజి
తుండవు , జగద్గురుండ వౌదువు ; సముం డె
వండు లేడన్న , నధికుఁ డెవ్వాఁడు నీకు ?
నప్రమేయాఢ్య ! అప్రతిమ ప్రభావ ! ౪౨

సాటిలేని ప్రభావముగల ఓ కృష్ణమూర్తీ ! నీవు చరాచరాత్మకమైన ఈ ప్రపంచమునకంతకును తంఢ్రివి అయియున్నావు . మఱియు నీవు పూజ్యుడవును , సర్వశ్రేష్ఠుడవగు గురువును అయి వెలయుచున్నావు . ముల్లోకములందును నీతో సమానమైనవాడు లేడు . ఇంక నిన్ను మించినవాడు మఱియొక డెట్లుండగలడు ?

విపరీతపూర్వ.
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్|
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్|| 11-44 ||

తేటగీతి.
సుతుని పిత యట్లు , సఖుని స్నేహితుని పగిది ,
ప్రియుఁడు ప్రియురాలి నెట్టులఁ బ్రేమ జూపు ,
నీవు నట్టులె నన్ను మన్నింపు , కృపను ;
ప్రణుతిఁ గావించెదను , నీకుఁ బరమ పురుష ! ౪౩

అందువలన నేను శరీరమును భూమిపై సాష్టాంగముగ బడవైచి నమస్కరించి , ఈశ్వరుడవును , స్తుతింపదగినవాడవునగు నిన్ను అనుగ్రహింప వేడుచున్నాను . దేవా ! కుమారుని ( అపరాధమును ) తండ్రివలెను , స్నేహితుని ( అపరాధమును ) స్నేహితుడువలెను , ప్రియురాలి ( అపరాధమును ) ప్రియుడువలెను ( నాయొక్క అపరాధమును ) నీవు క్షమింపుము .

ఉపేంద్రవజ్ర.
అదృష్టపూర్వం హృషితోऽస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే|
తదేవ మే దర్శయ దేవ రూపం
ప్రసీద దేవేశ జగన్నివాస|| 11-45 ||

ఉత్పలమాల.
మున్నెపుడేనిఁ గానని , యపూర్వ మహత్తరమైన దృశ్యమీ
మిన్నులు మన్ను లేకమయి మించిన రూపముఁ ; జూడ లేనికన్ ,
గ్రన్నన దొంటి రూపుఁ గనగా గరుణింపవె , దేవ దేవ ! యా
పన్న శరణ్య ! సౌమ్యతఁ , గృపారతిఁ జూపి యనుగ్రహింపవే ? ౪౪

ఇదివరకెన్నడును జూడనట్టి ఈ విశ్వరూపమును జూచి ఆనందమును బొందితిని . కాని భయముచే నా యొక్క మనస్సు మిగుల వ్యథ నొందుచున్నది . కావున దేవా ! ఆ మునుపటి ( సౌమ్య ) రూపమునే నాకు జూపుము . దేవ దేవా ! జగదాధారా ! అనుగ్రహింపుము !

ఉపజాతి.
కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ|
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే|| 11-46 ||

చంపకమాల.
గదలుఁ గిరీట చక్రములు , కౌస్తుభ రత్న రవి ప్రభాస సం
పదలు , మయూరపింఛమును , మంజులమౌ చిరునవ్వు లొప్పగన్
యదుకుల భూషణుండవగు నా వసుదేవ సుతాకృతిన్ మదిన్
గుదురు వడంగఁ జూపి , కడుఘోరపు రూపు పసంహరింపవే ! ౪౫

( ఓ కృష్ణమూర్తీ ) నేను నిన్ను మునుపటివలెనే కిరీటము , గద , చక్రము చేత ధరించినవానినిగ జూడదలచుచున్నాను . అనేక హస్తములుగలవాడా ! జగద్రూపా ! నాలుగు భుజములుగల ఆ పూర్వరూపమునే మఱల ధరింపుము .

శ్రీభగవానువాచ|
ఉపజాతి.
మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్|
తేజోమయం విశ్వమనన్తమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్|| 11-47
ఉపజాతి.
న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్-
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః|
ఏవంరూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర|| 11-48||

శ్రీ భగవానుల వాక్యము.
ఉత్పలమాల.
నీపయి ప్రేమఁ జూపి , మహనీయ మహత్తర విశ్వరూప మేఁ
జూపితిఁ గాని , మున్నెవ్వరుఁ జూడఁగ లేదు కిరీటి ! వేద వి
ద్యా పరిపూర్ణులై , క్రతు శతంబులుఁ జేసిన వారలున్ , దపో
ద్దీపితులైన వారలు , నుదీర్ణ మనస్క వదాన్యు లై ననున్. ౪౬

శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు .

అర్జునా ! ప్రకాశముచే పరిపూర్ణమైనదియు , జగద్రూపమైనదియు , అంతము లేనిదియు , మొదటిదియు , నీవుతప్ప ఇతరునిచే నిదివఱ కెన్నడును జూడబడనిదియు నగు ఏ యీ సర్వోత్తమమైన విశ్వరూపము గలదో , అయ్యది ప్రసన్నుడనగు నాచే స్వకీయ యోగశక్తివలన నీకు జూపబడినది . కురువంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా  ! ఈనా విశ్వరూపమును నీవుతప్ప మఱియొక రెవరును ఈ మనుష్యలోకమున చూచియుండలేదు ( నా యనుగ్రహముచే నీవు చూడగల్గితివి ) . మఱియు వేదాధ్యయన , యజ్ఞాధ్యయనములచే గాని , దానములచేగాని , ( అగ్ని హోత్రాది , శ్రౌతస్మార్తాది ) క్రియలచేగాని , ఘోర తపస్సులచేగాని , ఇట్టి ( విశ్వరూపుడనగు ) నన్ను చూచుటకు శక్యముకాదు .

ఉపజాతి.
మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్|
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య|| 11-49 ||

కందము.
ఈ విశ్వరూప ముడిపితి ,
నీ వికను భయమ్ము వీడు , మెప్పటి యటులన్
నా వాసుదేవ రూప మి
దే వీక్షింపుము ముదంబు దీపింప , సఖా ! ౪౭

ఇటువంటి భయంకరమైన నా ( విశ్వ ) రూపమునుజూచి నీవు భయమునుగాని , చిత్తవికలత్వమునుగాని , పొందకుము . నీవు నిర్భయుడవును , ప్రసన్నచిత్తుడవును అయి నా పూర్వరూపమునే , మఱల బాగుగ జూడుము .

సఞ్జయ ఉవాచ|
ఉపజాతి.
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః|
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా|| 11-50 ||

సంజయు వాక్యము.
ఆట వెలది.
వాసు దేవుఁ డిటుల వలికి , యర్జును భీతి
డించి , మిగుల ననునయించెఁ గృపను ,
శ్యామలాంగుఁ డగుచు , సౌమ్య రూపముఁ దాల్చె , ,
మందహాస రుచులు చిందు లొంద . ౪౮

సంజయుడు చెప్పెను .

( ఓ ధృతరాష్ట్రమహారాజా ! ) ఈ ప్రకారముగ శ్రీకృష్ణు డర్జునునకు జెప్పి ఆ ప్రకారమే తన ( పూర్వపు ) రూపమును మఱల జూపెను . మహాత్ముడగు ఆ శ్రీకృష్ణమూర్తి మఱల తన సౌమ్యరూపమును వహించి , భయపడియున్న అర్జునుని ఓదార్చెను .

అ.
అర్జున ఉవాచ|
దృష్ట్వేదం మానుషం రూపం
తవ సౌమ్యం జనార్దన|
ఇదానీమస్మి సంవృత్తః
సచేతాః ప్రకృతిం గతః|| 11-51 ||

అర్జును వాక్యము.
తేటగీతి.
జనులఁ జేరితి మఱల , సౌజన్యమైన
నీ స్వరూపమ్ముఁ గాంచి నే నిపుడు , కృష్ణ !
నిర్మల మనంబుఁ గాంచి , ధీనిశిత మొదవి
నే నెవండనొ తెలిసితి , దీన బంధు ! ౪౯

అర్జునుడు చెప్పెను .

ఓ కృష్ణా ! నీయొక్క ప్రశాంతమైన ఈ మనుష్యరూపమునుజూచి యిపుడు నా మనస్సు కుదుటపడినది . మఱియు నేను స్వస్థతను బొందితిని .

శ్రీభగవానువాచ|
అ.
సుదుర్దర్శమిదం రూపం
దృష్టవానసి యన్మమ|
దేవా అప్యస్య రూపస్య
నిత్యం దర్శనకాఙ్క్షిణః|| 11-52 ||

శ్రీ భగవానుల వాక్యము.
కందము.
నా దివ్య విశ్వరూపము
సాదింపఁ దలంచి , మునులు , సంయములున్ , దే
వాదులు దీక్ష వహించెద ;
రీ దర్శన భాగ్యమబ్బె నీ కొకరున కే ! ౫౦

శ్రీ భగవానుడు చెప్పెను .

నాయొక్క ఏ రూపమును నీవిపుడు చూచితివో అది మహాదుర్లభమైనది . దేవతలుకూడ నిత్యము నద్దానిని దర్శనము చేయ గోరుచుందురు .

అ.
నాహం వేదైర్న తపసా
న దానేన న చేజ్యయా|
శక్య ఏవంవిధో ద్రష్టుం
దృష్టవానసి మాం యథా|| 11-53 ||

ఉత్పలమాల.
వేదములన్నియున్ నెమరువేసిన , నుగ్రతపంబుఁ జేసినన్ ,
భూధన ధేనుకాంచన సమూహము దానము చేసినన్ , శ్రుతి
ప్రోదిత యజ్ఞకర్మల విభూతి కడుంగడు నందియున్న , న
న్నీ దృశ విశ్వరూప మెవఁడేని కనుంగొన లేడు , ఫల్గునా ! ౫౧

నన్ను ఏ రీతిగ నీవు చూచితివో , అటువంటి రూపముగల నేను వేదములచే ( వేదాధ్యయన పరులచే ) గాని , తపస్సుచేగాని , దానముచేగాని , యజ్ఞముచేగాని చూచుటకు శక్యుడనుగాను .

అ.
భక్త్యా త్వనన్యయా శక్య
అహమేవంవిధోऽర్జున|
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన
ప్రవేష్టుం చ పరన్తప|| 11-54 ||

కందము.
ఏకాంత భక్తి యుతుఁడై ,
యే కాలమునందు నన్భజించిన వాఁడే ,
చేకొను నన్నీ విధమున
సాకల్యముగాగఁ దెలియఁ జాలి , కిరీటీ ! ౫౨

శత్రువులను తపింపజేయువాడా ! ఓ అర్జునా ! ఈ విధమగు రూపముగల నేను అనన్యభక్తిచేత మాత్రమే యథార్థముగ తెలిసికొనుటకును , చూచుటకును , ప్రవేశించుటకును , సాధ్యమైనవాడ నగుచున్నాను .

అ.
మత్కర్మకృన్మత్పరమో
మద్భక్తః సఙ్గవర్జితః|
నిర్వైరః సర్వభూతేషు
యః స మామేతి పాణ్డవ|| 11-55 ||

ఉత్పలమాల.
నాకుఁ బ్రియంబుఁ గూర్చెడి మనంబునఁ గర్మల నాచరించి , యే
కై క మనోత్సుకంబున నఖండముగా భజియించి , సర్వ భూ
తాకృతు లేనె యంచని ప్రియం బొనరించి , నిజాంగనా సుతా
నీక విరాగియై సుగతి నే ననువానికి , నే లభించెదన్ . ౫౩

అర్జునా ! ఎవడు నా కొఱకే కర్మల జేయునో [ లేక నా సంబంధమైన ( దైవసంబంధమైన ) కార్యములనే చేయునో ] , నన్నే పరమప్రాప్యముగ నమ్మియుండునో , నాయందే భక్తిగల్గియుండునో , సమస్త దృశ్యపదార్థములందును సంగమును ( ఆసక్తిని , మమత్వమును ) విడిచివేయునో , సమస్తప్రాణులందును ద్వేషము లేకయుండునో అట్టివాడు నన్ను పొందుచున్నాడు .

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విశ్వరూపదర్శనయోగో నామైకాదశోऽధ్యాయః|| 11 ||

ఓం తత్ సత్
ఇట్లు శ్రీ పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రిచే అనువదింపబడిన
శ్రీ గీతామృత తరంగిణి యందు
శ్రీ విశ్వరూప సందర్శన యోగమను ఏకాదశ తరంగము
సంపూర్ణం. శ్రీ కృష్ణ పరబ్రహ్మార్పణమస్తు.

ఇది ఉపనిష్ప్రతిపాదకమును , బ్రహ్మనిద్యయు , యోగశాస్త్రమును ,

శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విశ్వరూపసందర్శన యోగమను పదునొకండవ అధ్యాయము. ఓమ్ తత్ సత్


శ్రీ గీతామృత తరంగిణి
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము