భద్రాద్రిరామ శతకము -- రెండవ భాగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

-: రాధాముద్రలయయోగలక్షణము :-

51. ఱెప్పలు వ్రాల్పక రెండుఁజూపులఁ గను, బొమలమద్యమునందుఁ బొందనిలిపి కర్ణరంధ్రములుఁ గదియంగ బిగియించి, నంతరజ్ఞప్తిచే నాలకించి గజ్జమువ్వలనాదుఘంటారవము శంఖ, వీణతాళధ్వనుల్వేణుభేరి మర్ధలమేఘూదిమహనీయదశవిధ, నాదము ల్విని చాల మోదమంది

నందులోపలఁ దదనాదమందు మనసు లయముజేసిన యోగి విలక్షణుండు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: షణ్ముఖీముద్రహఠయోగలక్షణము :-

52. అంగుష్ఠములను గర్ణాంగంబులను మూసి, చక్షులు మధ్యతర్జనులమూసి నాసికాయుగ్మమనామికంబుల మూసి, ఘనవక్త్రము కనిష్ఠకమున మూసి పాదమూలమున వాయూపస్థలనుమూసి, నాధారమున వాయు నపుడులేపి షట్ఛక్రములనున్నసంజ్ఞలకడతేరి, యాజ్ఞాసుచక్రమం దమర నిలపిఁ

జూపు పవనంబు యామన స్సొకటిఁజేసి ధ్యాన మొనతించి హఠయోగి ధన్యుఁడగును రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: శాంభవీముద్రరాజయోగలక్షణము :-

53. సురచిరశాంభవిఁ జూడంగఁ జూడంగ, చంద్రసూర్యాగ్నులు నింద్రధనువు నవరత్నములభాతి నక్షత్రములరీతి, బిరుసుగాల్చిన యట్లు మెరుపువలెను మండుమంటలభంగి నిండుచీకటిఁబోలు, మెండువెన్నెలకాంతి యెండవలెను ఇదిజలమాదిగా ని ట్లనేకము పుట్టి, నణఁగిన పిమ్మట నమల మగును

బట్టబయ లైన బ్రహ్మంబు గట్టిగాను వెలియు లోపలఁ గనుపడువేత్తలకును రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఆధారచక్రనిర్ణయము :-

54. ఆసనస్థానమం దాధారచక్రము, నందు నాలుగురేకు లమరియుండు వశషస లనుయెడివర్ణము ల్నాల్గుండు, నర్ధచంద్రాకార మమరియుండు కుంకుమవర్ణంబు కింకిణీనాదంబు, నార్నూరుహంసలు నాడుచుండు సద్భక్తియును క్రియాశక్తియు వర్తించు, ఘనతరంబున నన్ని గలిగినట్టి

కమలమందున బ్రేమతో విమలమైన నీవు గణపతిరూపమై నిలచినావు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: స్వాధిష్ఠానచక్రనిర్ణయము :-

55. ఆధారమునకు రెండంగుళాలకుమీద, రంగస్థలం బుండు రంగుగాను స్వాధిష్ఠచక్రము షడ్దళంబులఁ ద్రికో, నాకారమై యందు నమరియుండు బభమయరల లుండు పాటిల్లు నైష్ఠిక, భక్తి వీరము జ్ఞానశక్తి యుండు విమలవిద్యుత్కాంతి వీణారవంబును, నార్వేలుహంసలు నాడుచుండు

ప్రకటితంబుగ వికసితపద్మ ముండు నీవు బ్రహ్మస్వరూపమై నిలచినావు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: మణిపూరకచక్రనిర్ణయము :-

56. మఱియు నాభిస్థానమణిపూరకం బది, దశదళంబులతోడ దనరియుండు డఢలాదిఫాంతముదృఢతనక్షరములు, పది వేణునాదంబు ప్రబలియుండు శ్యామలవర్ణ మిచ్ఛాశక్తి షట్కోణ, మగ్నిభూతంబు రా నంటియుండు నవధానభక్తియు నచట కుందలిమీద, నార్వేలహంసలు నాదుచుండు

నిన్నయుండినచక్రమం దిష్టముగను నీవు విష్ణురూపమై నిలచినావు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: అనాహతచక్రనిర్ణయము :-

57. హృదయస్థలమ్మునం దిరవై యనాహత, పద్మమందున దళాల్ పదియు రెండు కఖగాదిపాంతము ఘనతరాక్షరములు, పదిరెండుయుండును బాగుగాను వర్తులాకారము వాయుభూతము నాది, శక్తియుండును భవభక్తి యుండు శతకుంభపుకాంతి శంఖారవంబును, నార్వేలహంసలు నాడుచుండు

భరితమై యున్నచక్రాధిపత్యముగను నీవు రుద్రస్వరూపమై నిలచినావు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: విశుద్ధచక్రనిర్ణయము :-

58. తాలుమూలలయందు స్థానంబుగా విశు, ద్ధాంభోజ ముండు సుందరముగాను పదియారుదళములు బాగుగా షోడశ, స్వరము లుండును పరాశక్తియుండు స్ఫటికవర్ణం బందు స్వానందభక్తియు, నాకాశభూతంబు నమరియుండు మోదంబుతో మేఘనాదంబు మ్రోయంగ, హంసలు దశశతం బాడుచుండు

భాసురంబుగ నానందభరిత మగుచు నీవు యీశ్వరరూపమై నిలచినావు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఆజ్ఞాచక్రనిర్ణయము :-

59. నాసాగ్రవీథిని నయనద్వయంబుల, నడుమ నాజ్ఞేయంబు నమరియుండు రెండురేకులు దానికుండు మీదను రెండు, హంక్షంబు లనియెడి యక్షరములు నద్భినాదంబు మహాతత్వభూతంబు, మాణిక్యకాంతి సమరసభక్తి గంగాసరస్వతీసంగమస్థానంబు, హంసలు పదినూర్లు నాడుచుండు

శ్రీకరంబుగ నట సదాశివవిలాస రూపమైనావు నీవు నిరూఢముగను రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: సహస్రారచక్రనిర్ణయము :-

60. సరససహస్రారచక్రంబు మూర్ధస్థ, లం బందు యుండు విలక్షణముగ నందువేరేకు లింపొందుగా వర్తించు, సాక్షిభూతము సహజాత్మశక్తి ఓంకారబీజము ఝుంకారనాదము, బహుచిత్రవర్ణముల్ పరమభక్తి నమృతంబు నెప్పుడు నతివృష్టి గురియంగ, హంసలు దశశతం బాడుచుండు

నందు నిరుపమసచ్చిదానందముగను నీవుసద్గుణరూపమై నిలచినావు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

61. కొండమీదను పద్దగుండు నొక్కటియుండు, గుండునడుమను నల్లగుండ్లు రెండు గుండ్లుమధ్యను నక్క కూఁత లెట్టుచునుండు, కూఁతలనడుమను నూతియుండు నూతిమధ్యంబున నాతియొకతె యుండు, నాతిమీఁదను నొక్కకోఁతి యుండు కోఁతిమీదను బరంజ్యోతి వెల్గుచునుండు, జ్యోతియే జగమెల్లఁ జూచుచుండు

జూచుచుండెడి దానెందు చోద్యమెరిగి నదియు తా నన యున్నవాఁ డాత్మవిదుఁడు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: పరమాత్మస్థాననిర్ణయము :-

62. విమలచిన్మయనేత్రకమలమధ్యంబున, మార్తాండసోమాగ్ని మండలములు మండలంబులయందు మహనీయముగ నొక్క, నీలమేఘం బుండు నిజముగాను మేఘమధ్యంబున మెరుపుమెరయుచు నుండు, నందు నీవారశూకాగ్ర ముండు శూకాగ్రమున నతిసూక్ష్మస్వరూపమై, బహిరంతరంబులఁ బ్రజ్వరిల్లి

వెలుఁగుచున్నాఁడ వేకమై వెరపులేక నిర్మలాకార నిరుపమ నిర్వికార రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: ప్రకృతిలక్షణము :-

63. జ్ఞానేంద్రియము లైదు కర్మేంద్రియము లైదు, ప్రాణాదు లైది శబ్దాదు లైదు ఘనమనోబుద్ధ్యహంకారచిత్తంబులు, నాల్గును నిరువదీనాల్గుతత్త్వ ములఁగూడి ధవళాశ్యామలరక్తపీతవ, ర్ణములు నాలుగుగల్గిగి నదియె ప్రకృతి యది క్షరం బది క్షేత్ర మదిజడం బది దృశ్య, మది యవిద్యాజ్ఞాన మదియ నాత్మ

నదియె జీవంబు నది దేహ మది జగంబు నదియు సంసార మది బంధనరక మదియు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: అక్షరస్వరూపలక్షణము :-

64. శ్వేతరక్తసిత పీతవర్నంబుల, నడునుసునీలవర్ణంబునుండు నిది నీలతోయద మగు దావినడుమని, ర్వాతదీపముకాంతిరీతినుండు వదియు విద్యుల్లేఖ నదియు నాపోజ్యోతి, నదియు నోకారంబునక్షరంబు నది మేరుశిఖరంబు నదియు@ గైలాసంబు, నది సత్యలోకంబు నాశ్రయంబు

నదియు వైకుంఠపదము తత్పదము నదియు నదియు త్వంపద మరి యంతరార్థ మదియు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: పరమాత్మనివాసస్థలనిర్ణయము :-

65. శ్వేతరక్తాసితపీతనీలంబుల, నడుమ నిదాస మైనావు నీవు మానితాదిత్యసోమాగ్నిమండలముల, నడూమ నివాస మైనావు నీవు పొందుగాఁ గళనాదబిందుత్రయంబుల, నడుమ నివాస మైనావు నీవు విమలభాగీరథీ యమునా సరస్వతి నడుమ నివాసమైనావు నీవు

అందపిండాండబ్రహ్మాండములను నడుమనున్నావు నీవు శానందముగను రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఆత్మసర్వగతలక్షణము :-

66. ధరణిలోఁ దిలయందుఁ దైలముండినతీరు, దారువునం దున్నదహమురీతి నాణెమౌ దధియందు నవనీత మున్నట్లు, పుష్పమందున గంధ మున్నయట్లు రంజిల్లు ఫలమందు రసము లుండినభంగి, జేలమం దున్నటి నూలుభంగి తారహారాదులదార ముండినతీరు, నిసుకరాళ్ళందున్న యినుముతీరు

నఖిలజగముల సకలదేహంబులందు నిండియున్నాఁడ వీరితి నిజముగాను రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: దేహేంద్రియవిలక్షణము :-

67. నాతల్లి నాతండ్రి నాసతు ల్నాసుతు, ల్నాపశుసంఘంబు నాగృహంబు నాభూషణంబులు నావాహనంబులు, నాక్షేత్రపాత్రము ల్నాజనంబు నాధ్యాన మని పల్కినపుడు పురుషుండు, తానవిగాక వేఱైన విధము నాశరీరంబును నాయింద్రియంబులు, నాజీవధర్మము ల్నాగుణంబు

లనుచు బల్కిన దేహేంద్రియాదులకును నీవు వేఱుగ నుందువు నిశ్చయముగ రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఎఱుకనిర్ణయము :-

68. ఇదిఘటం బిదిపటం బిది మఠం బిదిశఠం, బిదిహఠం బిదిపటం బిది యటంచు నిదిమనం బిదిజనం బిదిధనం బిదిఘనం, బిదిదినం బిదివనం బిది యటంచు నిదిహయం బిదిప్రియం బిదిప్రయం బిదినయం, బిదిజయం, బిదిభయం, బిది యటంచు నిదిశిరం బిదికరం బిదినరం బిదిమదం, బిదిపరం బిదిస్థిరం బిది యటంచు

నదియు నిదియును నేదియు నది యటంచు నెఱుఁగుచుండిన యెఱుకలో న్ర్ఱుక నీవు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

69. ఇది యపశబ్దంబు నిది సుశబ్దం బని, యెఱిగిన యెఱుకలో నెఱుక వీవు ఇది యుష్ణ మిదిశీత మిది మృదుత్వం బని, యెఱిగిన యెఱుకలో నెఱుక వీవు ఇదిశుక్ల మిదిరక్త మిదియుఁ గృష్ణం బని, యెఱిగిన యెఱుకలో నెఱుక వీవు ఇది మధురం బాంల మిది లవణంబబి, యెఱిగిన యెఱుకలో నెఱుక వీవు

ఇది సుగంధంబు దుర్ఘంధ మిది యటంచు నెఱుగుచుండిన యెఱుకలో నెఱుక వీవు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: నేతినేతియనిమహావాక్యలక్షణము :-

70. నీవు పృథ్వివిగావు నీరగ్నులునుగావు, మారితము మఱి వ్యోమంబుగావు శ్రోత్రత్వక్కులుగావు నేత్రజిహ్వలుగావు, ఘ్రూణంబుగావు వక్త్రంబుగావు పాదపాణులుగావు పాయుపస్థలుగావు, ప్రాణముల్గావు శబ్దంబు గావు స్పర్శరూపులుగావు పరగరసముగావు, గంధంబుగావు చిత్కళలుగావు

మానసాదులుగావు కర్మములుగావు సచ్చిదానందరూపాత్మసాక్షి వీవు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

71. షట్చక్రములుగావు షడ్వర్గములుగావు, కామాదిశత్రువర్గములుగావు షట్కోణములుగావు షడ్భ్రమంబులుగావు, షడ్వికారంబులసరణి గావు షట్కసంపత్తుల షడ్గుణంబులు గావు, వరషడూర్ములుగావు క్షరముగావు షణ్మతంబులు గావు షట్ఛాస్త్రములుగావు, షట్కర్మములుగావు సత్తుగావు

సప్తధాతువులునుగావు సప్తకోటి మంత్రములుగావు నానందమయుఁడ వీవు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

72. అష్టతనులుగావు అష్టాత్మలునుగావు, అష్టాంగయోగాదినిష్ఠగావు అష్టమూర్తులుగావు యష్టపురంబులు, గా వష్టమతములు గావు నీవు అష్టాబ్జములుగావు యష్టపాదంబులు, యష్టస్థలంబులు నరయ గావు దశరంధ్రములుగావు దశనాడులునుగావు, దశవాయుగుణవికార్ములుగావు

పంచశక్తులు గా వాదిప్రకృతిగావు సర్వపరిపూర్ణచైతన్యసాక్షి వీవు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: సర్వం ఖల్విదం బ్రహ్మ యను శ్రుతిపద్ధతి :-

73. తత్పదంబును నీవు త్వంపదంబును నీవు, నసిపదంబును నీవు నాత్మ నీవు అండాండములు నీవు పిండాండములు నీవు, బ్రహ్మాండములు నీవు బ్రహ్మ నీవు సత్తచిత్తులు నీవు సాక్షిరూపము నీవు, క్షరుఁడవు నీవు నక్షరుఁడ వీవు క్షేత్రంబులును నీవు క్షేత్రజ్ఞుఁడవు నీవు, కర్మంబులును నీవు జ్ఞాన మీవు

స్థూలదీర్ఘంబులును నీవు సూక్ష్మమీవు నీవునేనను నీవైన భావమీవు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

74. విశ్వసృష్టివి నీవు విశ్వేశుఁడవు నీవు, విశ్వవంద్యుఁడ వీవు విశ్వ మీవు వేదవేద్యుఁడ వీవు బేదాంతకుఁడ వీవు, వేదస్థుఁడవు నీవు వేద మీవు యజ్ఞకర్తవు నీవు యజ్ఞభోక్తవు నీవు, యజ్ఞరూపుఁడ వీవు యజ్ఞ మీవు వేదవేద్యుఁడ వీవు వేదాత్మకుఁడ వీవు, దైవజ్ఞుఁడవు నీవు దైవ మీవు

శిష్యుఁదవు నీవు పరమదేశికుఁడ వీవు సగుణనిర్గుణములు నీవు సాక్షి నీవు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచభూతములైక్యనిర్ణయము :-

75. అవని నీరంబులో నైక్యంబుగాఁజేసి, యానీర మగ్నిలో నైక్యపఱచి నాయగ్ని వాయువం దైక్యంబుగాఁజేసి, యావాయు గగనమం దైక్యపఱచి గగనంబు మహదహంకారంబులోఁ గల్పి, తదహంకృతియు మహాతత్వమందు నైక్యంబుగాఁజేసి యామహాతత్వంబు, నద్వయబ్రహ్మమం దైక్యపఱచి

నట్టి యోగీంద్రుఁ డద్వయుం డప్రమేయుఁ డప్రమత్తుఁ డనంతుండు నఖిలసముఁడు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: జ్ఞానియగు లక్షణము :-

76. బ్రహ్మందాత్మైక్యభావంబు దెలిసిన, నజ్ఞానవృత్తులు నణఁగుచుండు నజ్ఞానవృత్తులు నణిఁగిన పిమ్మట, నవివేకవృత్తులు నణఁగుచుండు నవివేకవృత్తులు నణఁగిన పిమ్మట, నభిమానవృత్తులు నణఁగుచుండు నభిమానవృత్తులు నణఁగిన పిమ్మట, రాగాదులెల్ల విరాగమౌను

రాగములు బోయినప్పుడు కర్మములు దొలఁగు కర్మములు బోవ నిర్మలజ్ఞాని యగును రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: ప్రజ్ఞానం బ్రహ్మయనే శక్తి లక్షణము :-

77. శ్రవణేంద్రియములశబ్దము ల్వినుచుండు, చర్మేంద్రియంబున స్పర్శనెఱుఁగు చక్షురింద్రియముల వీక్షించు రూపముల్, రూఢిగా జిహ్వచే రుచుల నెఱుఁగు ఘ్రూణరంధ్రంబుల గంధమాఘ్రాణించు, వాక్కున వచియించు వాక్యములను యేజ్ఞానమున నిన్నియ్ర్ఱిఁగె నాజ్ఞానంబు, ప్రజ్ఞానమని శ్రుతు ల్బలుకుచుండు

నట్టిప్రజ్ఞానలక్ష్యార్థ మనుభవంబు నీస్వరూపంబు నిక్కంబు నిజముగాను రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: తత్త్వమసి యనేశక్తి లక్షణము :-

78. మఱియు సృష్టికి పూర్మందు ద్వితీయమై, నామరూపక్రియ లేమిలేక యేకమై యచలమై యేదియుండునొ యది, తత్పదలష్యతాత్పర్య మిదియుఁ దనవివేకమున సాధనచతుష్టయములు, గల్గినపూర్ణాధికారియందు ధీమనోచిత్తదిదేహేంద్రియముల క, తీతమై సాక్షియై తేజరిల్లు

నదియు త్వంపదలక్ష్యార్థ మనఁగ నొప్పు నసిపదార్థంబు నీరెంటి నైక్యమధిప రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: అయమాత్మశక్తి యను బ్రహ్మలక్షణము :-

79. స్వచ్ఛమై సత్యమై స్వప్రకాశంబునై, యుపరోక్షమై సదా యమల మగుచు నాద్యాంతరహితమై యచలమై నిత్యమై, శుద్ధమై బుద్ధమై సిద్ధ మగుచు నిర్వ్యాజియైనట్టి నిర్గుణంబయి యాత్మ, పదమునకు లక్ష్య తాత్పర్య మిదియు ప్రతిలేనిదై నిరుపద్రవంబై స్వతః, పరిపూర్ణమైనట్టి బయలు నగుచు

జగదధిష్ఠానమై చరాచరములందు బాధితము లేక యున్నదే బ్రహ్మమగుచు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

80. అలచతుర్వేదమహాకావ్యములయందు, నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు ఉపనిషద్భాష్యంబు లూహించి వెదకిన, నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు యోగశాస్త్రములలో యుక్తిసాధించిన, నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు మంత్రశాస్త్రంబులు మర్మము ల్దెలిసిన, నీవె బ్రహ్మవు బ్రహ్మ వీవె యనుచు

వేదవేదాంతసిద్ధాంతవేద్యులెల్ల నిశ్చయింతురు నిత్యంబు నిగమవినుత రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

81. వరబ్రహ్మక్షత్రియవైశ్యాదివర్ణము, ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ నలబ్రహ్మచర్యాదియాశ్రమధర్మము, ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ స్వగతివిజాతిస్వజాతిభేదంబులు, ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ కులరూపనామము ల్గోత్రసూత్రంబులు, ల్నీకు నెన్నఁడు లేవు నిశ్చయముగ

ఖేదమోదంబులును భేదవాదములును ల్నీకు నెన్నఁడు లేవుగా నిశ్చయముగ రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: అంటి అంటనిలక్షణము :-

82. జలజపత్రమునందు సలిల మంతనియట్లు, నద్దమందున రూప మంతనట్లు బురద యాకుమ్మరపురుగు కంతనియట్లు, నాజ్యంబు జిహ్వయం దంటనట్లు భువి చింతపండుపై బొబ్బరంటనియట్లు, బలుచల్లలో వెన్న గలయనట్లు చిత్రభానుండును చీఁక టంటనియట్లు, నాకాశమున వాయు వంటనట్లు

బ్రహ్మవేత్తలు మాయాప్రపంచమునందు నఖిలవ్యవహారములు జేసి యంత రధిప రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

-: పరిపూర్ణబోధ :-

83. ఈయుత్తబట్టబయలేమి లే దనుచును, ద్వాదశాక్షరి చాల దలఁచలేను మూలమింతయు లేక మేలుగా నెఱిఁగెడి, నీశరీరద్వయ మేమిలేదు అని గురువాక్యము విని సతతము మది, నుంచంగవలె నిది కొంచ మనఁగ నిది నిశ్చయముజేసి యిది విడిపించిన, పరిపూర్ణమైయుండు బాధలెక

రాకపోకలు రెండును లేకనుండు నట్టిసూత్రంబు దెలిసిన నచలమగును రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

84. అవనిలో నీరులో నగ్నిహోత్రంబులో, మారుతమునను వ్యోమంబులోను సురలలో నరులలో గిరులలో చరులలో, దరులలో హరులలో కరులలోను ఊళ్ళలో గూళ్ళలో రాళ్ళలో రోళ్ళలో, వేళ్ళలో గోళ్ళలో తేళ్ళలోను ఇండ్లలో గుండ్లలో బండ్లలో నోళ్ళలో, చీమలో దోమలో పాములోను

అచలమైయుండు కాలత్రయంబులందు బాధితములేక కేవల బ్రహ్మముండు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

85. సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు, సృష్టి యున్నప్పుడు సృజనలేక ప్రాగ్దక్షిణంబులుఁ బశ్చిమోత్తరముల, నాల్గుమూలలమీఁద నడుమక్రింద నిష్కళంకంబయి నిర్వికారంబయి, ఘనతేజమై స్వప్రకాశ మగుచు నచలమై స్వచ్ఛమై యాద్యంతశూన్యమై, పరిపూర్ణమై బట్టబయలుగాను

నేకమై యుండు నేబాధ లేక నుండు నట్టివస్తువు కేవలాత్మనఁగఁబడును రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

86. సగుణనిర్గుణములు సదసత్తులును నిరా, కారసాకారము ల్గానిదేదొ క్షేత్రజ్ఞక్షేత్రము ల్జీవజంగంబులు, కారణకార్యము ల్గానిదేదొ పాపపుణ్యంబులు బంధమోక్షంబులు, జ్ఞానకర్మంబులు గానిదేదొ క్షరమక్షరంబులు సత్య మసత్యము, ల్ఖండ మఖండము గానిదేదొ

రాకపోకలఁ జెప్పంగ రానిదేదొ యదియుఁ గేవలపరిపూర్ణ మనఁ నొప్పు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

87. వసుధలో నణఁగదు వార్ధిలో మునుఁగదు, గాఢాగ్ని చేత దగ్ధంబుగాదు గాలుకిఁ గూలదు కరములఁ జిక్కదు, పాషాణములనైనఁ బగిలిపోదు వానకుఁ దడవదు వడగండ్ల నొవ్వదు, యస్త్రశస్త్రంబుల హతముగాదు ఎండకు నెండదు నేండ నీడకురాదు, ఘనపాశములనైనఁ గట్టుపడదు

చలికి వణఁకదు భయముల కులికిపడదు యచలమై యున్న పరిపూర్ణ మమలచరిత రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

88. బాధితంబైన యీప్రకృతిద్వయము లేని, కేవల పరిపూర్ణభావమినను స్థూలదేహము లేదు సూక్ష్మదేహము లేదు, కారణదేహసంఘటన లేదు ఘనమహాకారణఘటము లేనేలేదు, లేదు జాగ్రదవస్థ లేదు లేదు లేదు స్వప్నావస్థ లేదు నిద్రావస్థ, లేది తుర్యావస్థ లేదు లేదు

సర్వ మీశ్వరతను చతుష్టయము లేదు విశ్వకై నిట్టి ప్రాజ్ఞాదివిభులు లేదు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

89. పుట్టదు గిట్టదు పట్టదు ముట్టదు, కొట్టదు తిట్టదు కట్టుపడదు యెఱుఁగదు మరుగదు కరుగదు పెరుగదు, పరగదు విరగదు తరుగుపడదు ఆడదు పాడదు వాడదు వీడదు, వేడదు గూడదు జూడపడదు అదరదు బెదరదు గదురదు చెదరదు, ముదరదు పదరదు గదలఁబడదు

చనదు పెనఁగదు చినుగదు వినదు గనదు ఖేదమోదద్వయము లేని కేవలాత్మ రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

90. సార్వకాలము చలించక నొక్కతీరుగాఁ, బరిపూర్ణమై యున్నబట్టబయలు పతిగాదు సతిగాదు రతిగాదు బ్రతిగాదు, స్తుతియుఁ గా దుత్పత్తిస్థితియుఁ గాదు మృతిగాదు స్మృతిగాదు శ్రుతిగాదు ధృతిగాదు, కృతిగాదు వికృతిగాదు హంకృతియుఁగాదు క్షితిగాదు మతిగాదు మితిగాదు ద్యుతిగాదు, యతిగాదు మూలప్రకృతియుఁగాదు

గతియు దుర్గతియును లసద్గతియుగాదు గతము విగతము గాదు నాగతముగాదు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

91. నేత్రజిహ్వఘ్రూణ శ్రోత్రత్వగింద్రియం, బుల కెవలాత్మను దెలియరాదు పీతవర్ణముగాదు శ్వేతవర్ణముగాదు, కృష్ణపీతసునీలములునుగాదు కటులవణాంలతిక్తకషాయ మధురాది, రస రుచి వస్తువర్గములుగావు వీణారవముగాదు వేణునాదము గాదు, తాళమృదంగాది ధ్వనులుగావు

విమల పరిమళ మిళితద్రవ్యములు గాదు గఠినశీతోష్ణమృదుసదాగతులుగాదు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

92. ఆద్యంతములులేని యచలము రెండు ప్ర, కారంబు లెన్నఁడు గకయుండు క్రిందటగాలేదు ముందరగాబోదు, నిప్పుడుగాలేదు నిఁకనుగాదు సర్వకాలం బేకసరణిగాఁ గదలక, మెదలక వదలక జెదరకుండు నీప్రపంచమున కీపరిపూర్ణంబు, నకును సంబంధ మెన్నటికి లేదు

చావు పుట్టువు గలిగుండు జగమునకును చావు పుట్టువు లేనిదే కేవలాత్మ రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

93. ఆదిమధ్యాంతశూన్యంబైన దానెందు, పంచభూతములు జన్మించలేదు బంధముక్తులులేని పరిపూర్ణమందు నీ, పంచకోశము లుద్భవించలేదు జ్ఞానకర్మంబులు లేనివస్తువునందుఁ, బ్రకృతిస్వయంబు లుత్పత్తిలేదు అచలమునందు మాయావిద్యలాదియు, పాధిద్వయంబు లుద్భవములేదు

జగము జీవులు స్థావరజంగమములు బట్టబయలందు నెన్నఁడు బుట్టలేదు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

94. సురలు రాక్షసులు భూసురులువైశ్యులు శూద్ర, నరులు మౌనులు దిగంబరులు ఋషులు యోగులు భోగులు రోగులు త్యాగులు, తరులు ఖేచరులు వానరులు గిరులు రాజులు మంత్రులు రథతురంగంబులు, శరచాపధరులు భీకరులు కరులు కలలో ననేక మెక్కడినుండి బచ్చెనో, గాని మేల్కొనిన నొక్కటియు లేదు

నీప్రపంచంబు నారీతి నేమిలేదు బట్టబయలైన యచల మెప్పటికి నుండు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

95. క్షర మక్షరంబుల సగుణనిర్గుణములు, సత్య మసత్యముల్ సత్తుచిత్తు కారణకార్యముల్ జ్ఞానకర్మంబులు, పురుషుండు బ్రకృతియు నెఱుకమఱపు పాపపుణ్యంబులు బంధమోక్షంబులు, జననంబు మరణంబు జడ మజడము క్షేత్రజ్ఞక్షేత్రము ల్జీవదేహంబులు, మానాభిమానము ల్మంచి నెబ్ర

యట్టి ప్రకృతిద్వయంబులు గట్టుగాను బట్టనయలందు నెన్నఁడు బుట్టలేదు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

96. చైతన్యమని యన్న క్షేత్రజ్ఞుఁ డని యెన్న, జ్ఞానము నెన్న హంకార మెన్న సద్రూప మని యెన్న చిద్రూపమని యెన్న, స్వస్వరూపం బన్న సాక్షి యెన్న ఈశ్వరుఁ డని యెన్న నిల విష్ణుం వని యెన్న, పరమాత్మ వని యెన్న బ్రహ్మ యెన్న ఆదిశక్త్యని యెన్న నానంద మని యెన్న, పరమబంధం బెన్న బ్రక్రుతి యెన్న

మాయకేగల్గు నీనామధేయంబులును బట్తబయలందు నొకపేరు బుట్టలేదు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

97. కర్తృత్వ భోక్తృత్వస్మృత్యత్వ మంత్రత్వ, ములు కేవలాత్మకుఁ గలుగ వెపుడు జ్ఞాతృత్వ శ్రోతృత్వ ద్రుష్టృత్వ వక్తృత్వ, ములు కేవలాత్మకుఁ గలుగ వెపుడు ధాతృత్వ జేతృత్వ పాత్రత్వ యంత్రత్వ, ములు కేవలాత్మకుఁ గలుగ వెపుడు శత్రుత్వ మిత్రత్వ జైత్రత్వ భేదిత్వ, ములు కేవలాత్మకుఁ గలుగ వెపుడు

గోత్రసూత్రపవిత్రాదిగాత్రములను కేవలాత్మకు గలుగఁగాఁ బోవు సుమ్మి రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

98. ఈయుత్తబట్టబై లేమి లే దనువాడు, రాగిగాఁ డతఁడు విరాగిగాఁడు నెఱిఁగి శరీరంబు నేమిలేదనువాఁడు, జ్ఞానిగాఁ డతఁడు నజ్ఞానిగాఁడు నున్న దున్నట్టుగా నుండఁజూచినవాఁడు, కర్మిగాఁ డతఁడు దుష్కర్మిగాఁడు లేమి మాయావిద్య లేమిలేదనువాఁడు, ఘనుఁడుగాఁ డతఁడు కుంచనుఁడుగాఁడు

అనుమతంబైన జగము లేదన్నవాఁడు బంధమోక్షద్వయంబులఁ బడనివాఁడు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

99. ఈయుత్తబట్టబై లేమిలేదనుస్వధా, పరిపూర్ణమై యుండు బ్రకృతిలెదు కలలోనఁ గనుఁగొన్న గజమేమి లేనట్టి, యెఱుఁగశరీరము నేమిలేదు ఇదిగురువాక్యంబు నింతకంటెను మహా, వాక్యరహశ్య మెందైనలేదు ఇదిరాజమార్గంబు నిది యనాయాసంబు, నిది భ్రాంతిరహితంబు నిది స్థిరంబు

నిదియు నమ్మినవారికే యెగ్గులేదు లేదు జన్మంబు మరణంబు లేదు లేదు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

100. భారతీపతి రమాపతి పార్వతీపతి, వాసవాద్యఖిలదేవతలయందు మానవాశ్వగవాది మశకపిపీలికాం, తము జీవులందుఁ జైతన్య మొకటి యట్టిచైతన్యమే యాత్మబ్రహ్మం బను, పదముకు లక్ష్యార్థభావ మిదియుఁ గమలజాదిపిపీలికాంతశరీరముల్, వాచ్యార్థ మని వాని వదలితేని

యాపరబ్రహ్మచైతన్య మాత్మలనెడు వాదభేదంబులేకాని వస్తు వొకటి రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

101. బ్రహ్మకల్పంబులు ప్రతుయుగంబులుగాదు, సంవత్సరములు మాసములుగాదు పక్షముల్ తిథివారనక్ష్త్రములుగాదు, గ్రహయోగకరణలగ్నములుగాదు పర్వముల్ ఋతువులు పగలు రాత్రులుగాదు, వెలుగు చీకటి మేఘములునుగాదు యుదయాస్తమయములు నుపరాగములుగాదు, త్రివిధకాలముగాదు దిశలుగాదు

నాదబిందుకళల్గాదు నభముగాదు జీవనిర్జీవులును గాదు కేవలాత్మ రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

102. పరిపూర్ణమైయున్న పరమాత్మబ్రహ్మవి, ద్యకు యోగమైన కాయంబు నిందు బుద్ధికి సాక్షియై స్ఫురియింపుచున్నది, యహమనుపదమున కేథమగును ప్రతిలేనిదై స్వతఃపరిపూర్ణపరమాత్మ, బ్రహ్మశబ్దమున కర్థంబు నిదియు నహ మేవ బ్రహ్మ బ్రహ్మైవాహ మని యున్న, నస్మనేపదమున కర్థమనుచు

నెఱిఁగి వాచ్యార్థములనెల్లఁ బరిహరించి యనిభవజ్ఞాని పొందు లక్ష్యార్థమందు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

103. దయభయధైర్యశ్రద్ధాలజ్జశమదమ, దర్పహంకారేచ్ఛదంభదైన్య మదలోభమోహకామక్రోధమత్సర, సుఖదుఃఖక్ష్యవృద్ధిక్షుత్పిపాస సంశయ నిశ్చయ సంకల్ప వైకల్ప్య, కంపనాకుంచన గమన చలన శ్వాసబిశ్వాసవిసర్గవ్యాపకరాగ, ద్వేషకుటిలగర్వవేషభాష

వినయమానాభిమానాదివిషయసంఘ ములును నిజకేవలాత్మకు గలుగవెపుడు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

104. బ్రాహ్మణోత్తములైన పరగక్షత్రియులైన, వైశ్యశూద్రులునైన వాంఛ గలిగి ఈపద్యముల నన్ని యింపుగా విని వ్రాసి, చదివినజనులకు సౌఖ్యముగను ధనధాన్యములు వస్త్రకనకభూషణములు, సుతసతుల్ హితబంధుసోదరులును గజతురంగంబులు ఘనమైన పశువర్గ, మాందోళనము శుభం బతిధిపూజ

లాయురారోగూ మైశ్వర్య మమరి సుఖము గలిగియుందురు మోక్షంబు గలిగి నిజము రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

105. శ్రీకరలోకప్రసిద్ధుఁడై పరశు రా, మాన్వయాంభోధిహిమాంశుఁడైన కూలంకషజ్ఞానకోటేశ్వరునకు శ్రీ, సుబ్బమాంబకు నేను సుతుడ నయ్యు నరసింహదాసుండ నని పేరు విలసిల్లి, యమలకంభాలూరి యప్పగురుని కరుణాకటాక్షంబు గలిగి వేదాంతార్థ, సారము లెస్సగా సంగ్రహించి

భరితముగ నూటనెనిమిదిపద్యములను బ్రేమతోఁ జెప్పి మీకు నర్పించినాను రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

106. ఇంపుగా జెప్పిన యీనూట యెనిమిది, మహనీయపద్యముల్ మౌక్తికములు ప్రాసవిశ్రమములు బంగారుకొలుకులు, కూర్మిసబ్దంబులు గూర్చుటయగు పరమతత్త్వార్థముల్ పచ్చలపతకంబు, మీయంకితంబును మేరుపూస యీరీతి మౌక్తికహారంబు జేసి నే, ముదముతో నర్పించి మ్రొక్కినాను

కంఠమందున ధరియించి ఘనతమెఱసి నన్నురక్షించు నిను సదా నమ్మినాను రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

107. దశరథసుకుమార దానవసంహార, మందరనగధీర మంగళంబు నీరజదళనేత్ర్ నీలతోయదగాత్ర, మౌనిజనస్తోత్ర మంగళంబు భానుజవర్ధన భక్తజనార్ధన, భవలోకపరిహార మంగళంబు కమలామనఃఖేల కాంచనమయచేల, మహనీయకులశీల మంగళంబు

మన్మధాకార రఘువీర మంగళంబు మాధవానంద గోవింద మంగళంబు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

108. ఈపద్యశత మెవ్వ రింపుతోడఁ బఠించి, యావార్యుకరుణచే నమలమైన స్వానుభూతివహించి సరవిఁ జెన్నొందుదు, రట్టివారలు భువి నహరహంబు వాక్కుచే వర్ణింప వశము గానిదియును, నాత్మలోఁ దలఁపరానట్టిదియును దేశకాలాదులం దిమడనట్టిదియును, నంతటఁ దానయై యలరునదియు

నగుచుఁ దన కన్యమును లేక యలవిగాక నిట్టిదట్టిది యని నిర్ణయింపరాని బట్టబయలైనబ్రహ్మంబుఁ బడయగలరు రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య కామ కరుణాలలామ లోకాభిరామ

సమాప్తము


శతకములు
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము