దాశరథీ శతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకము. ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటం అన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైన శ్రీరాముడు.

భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించినాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు.

001[మార్చు]

శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం

గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ


భావం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా!

002[మార్చు]

రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ

స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద

శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో

ద్ధామ విరామ భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ!


భావం: జనులను సంతోషింపజేయువాడవు, పరశురాముని జయించినవాడవు, పరస్రీలయందాసక్తి లేనివాడవు, నల్లని మేఘమువంటి శరీర కాంతిగలవాడవు, కాకుత్ స్థ వంశమును సముద్రమునకు చంద్రునివంటి వాడవు, రాక్షసుల సంహరించిన వాడవునైన భద్రాచల రామా!

003[మార్చు]

అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ

విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూత కృ

ద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభా ధగ

ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: సత్యము మాట్లాడువాఁడవు, శరణన్న వారిని రక్ష్మించువాడవు, దయచేతఁ బాపములఁ బోగొట్టువాడవు, బ్రాహ్మణుల సంతోషింపజేయువాడవు, గంగానది పుట్టిన పాదపద్మములు గలవాడవు, మణులచే నిగ నిగ మెఱయు సొమ్ములు గలవాడవు, భద్రాచల రామా!

004[మార్చు]

వితల విటల బ్రోవునడ

రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో

త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స

త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా

తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.


భావం: శత్రువుల సంహరించినవాడవు, గరుత్మంతుడు వాహనముగ గలవాడవు, ఆపదల బోగొట్టువాడవు, రంగనాధునిచే సేవింపబడిన వాడవు, దయతో నొప్పు మనస్సుగలవాడవు, సత్సంగుడవు, సీతాహృదయమును పద్మమునకు తుమ్మెదవంటివాడవు, రాక్షసులకు బీభత్స కరుడవు, శుభాంగుడవునైన భద్రాచల రామా!

005[మార్చు]

శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం

పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా

చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ

తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: సంపదల నిచ్చువాడవు, మునులచే బూజింపబడినవాడవు, కీర్తిమంతుడవు, అన్ని భూతములను పాలించువాడవు, దుఖఃముల బోగొట్టువాడవు, క్షత్రియ కులమును సముద్రమునకు జంద్రుడవు, నృత్యము, గానము వేడుకగా గలవాడవు, భద్ర - నిధీ!

006[మార్చు]

ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా

రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ

కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా

త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: పెద్దల కందఱికి మ్రొక్కి, వంచిన శరీరము గలవాడనై గురువైన రఘునాధభట్టునకు నమస్కరించి, కవిశ్రేష్ఠులను పొగడి, కార్య లాభమునకై యొక శతకంబును వ్రాసెదను. దీని నిష్టముతో గైకొనుము దాశ - నిధీ

007[మార్చు]

మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లు దు

ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా

రసనకుఁ బూతవృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్సుధా

రసములుచిల్క బద్యముఖ రంగమునందునటింప వయ్య సం

తసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: రేగుపండ్లను ముత్తెములుపోసి కొనినట్లు దురాశతో మోసపోయి నా కావ్యములను దుర్మార్గుల కిచ్చితిని; నా నాల్కకు పవిత్రత సులభముగ గల్గునట్లును, పలుకుదేనియలు చిల్కునట్లు నా పద్యము ముఖమును నాట్యరంగమునందు సంతోషముతో నీవు నటింపుము. భద్ర - నిధీ!

008[మార్చు]

శ్రీరమణీయహార యతసీ కుసుమాభ శరీర, భక్త మం

దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో

ద్ధార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం

తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: హారములు గలవాడవు, అవిసెపూవువంటి శరీరకాంతి గలవాడవు, భక్తులకు కల్పవృక్షమవు, వికారములు లేనివాడవు, దేవతాతత్త్వమందు విహరించువాడవు, మూడులోకముల గల ప్రాణులను బోషించువాడవు, పాపముల బోగొట్టువాడవు, ఖరాది రాక్షసారణ్యమునకు గొడ్డలివంటి వాడవు, భద్ర - నిధీ!

009[మార్చు]

దురితలతాలవిత్ర, ఖర దూషణ కానన వీతిహోత్ర, భూ

భరణకళావిచిత్ర, భవ బంధ విమోచన సూత్ర, చారువి

స్ఫురదరవింద నేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం

ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: పాపమను తీగలకు కొడవలివంటివాడవు, ఖరదూషణాదుల నెడి యడవికి యగ్నివంటివాడవు, భూమిని రక్షించుటయందు విచిత్రుడవు, పుట్టుకయను ముడిని విడదీయుటయే విధిగాగలవాడవు, ప్రకాశించు పద్మములవంటి నేత్రములు గలవాడవు, పుణ్యచరిత్రుడవు, మేఘకాంతి వంటి శరీరకాంతి గలవాడవు.

010[మార్చు]

కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స

జ్జనపరిపాలశీల! దివిజస్తుత సద్గుణ కాండ! కాండ సం

జనిత పరాక్రమ! క్రమ విశారద! శారద కందకుంద చం

దన ఘనసార! సారయశ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: బంగారు మయమైన వస్త్రములు గలవాడవు, సంసారమను నడవికి గొడ్డలి మొనవంటివాడవు, సజ్జనుల పరిపాలించెడివాడవు, దేవతలచే బొగడబడినవాడవు, మంచి గుణములు గలవాడవు, బాణవిద్యలో బండితుండవు, శరత్కాలపు మేఘము, మొల్లలు, గంధము పచ్చ కర్పూరము వంటి నిగ్గైన కీర్తిగలవాడవు.

011[మార్చు]

శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి

త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ

పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ

తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ


భావం: రఘువంశమునకు జంద్రునివంటివాడవు, అట్టి నీ చరణముల నుత్పలము, చంపకము మొదలగు పద్యవృత్తములను పూలచే బూజించును. నా పూజలను గైకొనుము.

012[మార్చు]

గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్

సరసులమాడ్కి సంతసిల జాల రదెట్లు శశాంక చంద్రికాం

కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ

ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: మూఢులు గ్రంధములలోని రసముయొక్క కూర్పునకు రసికుల వలె సంతోషింపజాలరు. ఎట్లన చంద్రుని వెన్నెలకు చంద్రకాంత శిలలు కఱగి జాఱునట్లు వింధ్యపర్వతమున నుండు ఱాళ్ళు జాఱవు.

013[మార్చు]

తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స

ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం

బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం

దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నా మాటలలో దప్పులున్నను నీ పేరుతో వ్రాయబడు కావ్యము పవిత్రమైనదే, ఎట్లన గంగానది నీరు వంకరగ బాఱినను, ముఱికిగ మాఱినను దాని గొప్పతన మెక్కడ పోవును?

014[మార్చు]

దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి

స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా

చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ

తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నీ పేరు పాపమను సముద్రమునకు బడబాగ్ని వంటిది, సంసారమను కార్చిచ్చునకు నమృతపు వాన, దుర్మతాచారములకు గొడ్డలి మొన వంటిది.

015[మార్చు]

హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై

కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై

పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం

తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నీ నామ మీశ్వరునకు, విభీషణునకు, పార్వతికిని శ్రేష్ఠమగు మంత్రమైనది. అట్టి పరమ పవిత్రమైన నీ నామము నా నాల్కయం దెప్పుడు నాడునట్లు చేయుము.

016[మార్చు]

ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్

గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్

గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే

తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: ముసలితనమున యమభటులు వాకిట ముందునకు వచ్చి యుండగా, రోగ మెక్కువై కఫము గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుకొన్నప్పుడు మిమ్ము తలతునో తలపలేనో, భజింతునో భజింపలేనో కాబట్టి యిప్పుడే యా పని నెరవేర్చెదను.


017[మార్చు]

పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు

స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా

శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో

త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: దయకు సముద్రమువంటివాడవు, పాపులనుద్ధరించు పేరుగలవాడవు. హరీ యని నిలుకడగల బుధ్ధితో గొలుచు మహాత్ముల కాళ్ళ దుమ్ము నా నెత్తిపై దాల్తును. అప్పుడు యముడు తన భటులను నా జోలికి పోవద్దని యాజ్ఞాపించును.

018[మార్చు]

అజునకు తండ్రివయ్యు సనకాదులకున్ బరతత్త్వమయ్యుస

ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ

భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా

డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: బ్రహ్మకు దండ్రివి, సనకాదులకున్ బరతత్త్వమవు, బ్రాహ్మణులకు, ఋషులకు ముఖ్య దేవుడవు, సూర్యవంశపు రాజులలో నధికుడవు, అట్టి నిన్ను పొగడెదను.

019[మార్చు]

పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా

ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో

దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ

దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ!


భావం: పండిత రక్షకుఁడు, పాపములఁ బోఁగొట్టువాఁడు, బ్రహ్మేంద్రాదులచే బూజింపఁబడినవాఁడు, రావణాసురిని సంహరించినవాడను నీ కీర్తి కన్యకు నా కవిత్వమును బూదండవలెనిత్తును.

020[మార్చు]

శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా

చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము

న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో

ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: లక్ష్మీదేవి సీత, సేవకులు వైష్ణవజనులు, విరజానది, గోదావరి, వైకుంఠము, భద్రాచలము కాగా ప్రాణుల నుధ్ధరించునట్టి విష్ణువుడ నీవు దా - నిధీ!

021[మార్చు]

కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్

గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్

గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ

త్కంటక దైత్యనిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ!


భావం: ఏటిదరిని భద్రాచలమునం దుండుట జూచితిని, సీతను జూచితిని, గొప్పవైన ధనువును, బాణములను, శంఖచక్రముల జూచితిని, మిమ్ము, లక్ష్మణుని జూచి కృతార్ధుడనైతి.

022[మార్చు]

హలికునకున్ హలాగ్రమున నర్థము చేకురుభంగి దప్పిచే

నలమట జెందువానికి సురాపగలో జలమబ్బినట్లు దు

ర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్

దలవు ఘటింపజేసితివి దాశరథీ కరుణాపయోనిధీ!


భావం: రైతునకు నాగేటి చివర ధనమిచ్చినట్లును, దప్పితో బాధ పడువానికి గంగానదీజల మబ్బినట్లును, చెడు మనస్సు గల నాకు నీపై భక్తి కలుగునట్లు చేసితివి.

023[మార్చు]

కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వ భూస్ధలిన్

రంజిల ద్రవ్వి కన్గొనని రామ నిధానము నేడు భక్తి సి

ద్ధాంజనమందు హస్తగత మయ్యె భళీ యనగా మదీయహృ

త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: తర్కవాదముచేనైన గన్గొనరాని రాముడను నిధి, భక్తియను బైరాగుల కాటుకతో నందఱు సెబాసనగా జేజిక్కిన దయ్యెను. ఇంక నా మనస్సునందు స్థావరముగా నిలువుము.

024[మార్చు]

రాముఁడు ఘోరపాతక విరాముడు సద్గుణకల్పవల్లికా

రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో

ద్దాముఁడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం

దామరలే భజించెదను దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: పాపములను పోగొట్టువాడు, మంచిగుణములను కల్పవృక్షపు తీగెలకు దోటవంటివాడు, వికారములను జయించినవాడు, మంచివారిని రక్షించువాడు నైన రాముడే ముఖ్య దేవుడుగా నీ యడుగు లను పద్మముల గొలుతును.

025[మార్చు]

చక్కెరమాని వేము దినజాలినకైవడి మానవాధముల్

పెక్కురు బక్కదైవముల వేమఱుగొల్చెదరట్లు కాదయా

మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ యీవలెం

దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: హీనులనేకులు నిన్ను విడిచి ఇంకొకరిని గొలిచెదరు. అనగా తియ్యని చక్కెరను తినలేక వేప వస్తువగు చేదును తినుటకు నేర్చినట్లున్నది.మ్రొక్క దగినవాడవు నీవే , మోక్షదాయకుడవు నీవే !

026[మార్చు]

'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా'క వాటమై

డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్

గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్

దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: 'రా' యను నక్షరము పాపముల బారద్రోలగా, 'మా' యను నక్షరము వాకిలియై పాపముల జొరనీయకుండును అని పెద్దలైనవారు పై 'రామ' యను నక్షరముల బుద్ధిమంతులు భక్తితో బలుకకుందురే గాని, పలికినట్లైన యాపదలు ప్రపంచ జనుల గ్రమ్ముకొనవు.

027[మార్చు]

రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ

రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ

నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం

ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: రామ హరే యని నీ పేరును గప్ప గొంతుకవలె దలఁచిన జనులు జన్మరహితులై మోక్షము జెందుదురట.

028[మార్చు]

చక్కెరలప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం

జొక్కపు జుంటితేనియకు జొకిలుచుం గనలేరు గాక నే

డక్కట! రామనామమధురామృతమానుటకంటె సౌఖ్యామా

తక్కిన మాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: అయ్యో! ఈ కాలమువారు చక్కెరరాశికిని, యువతి యొక్క పెదవికిని, తేనెటీగలు పెట్టిన తేనెకు నాసపడుచున్నారు. రాముని పేరులో గల తీపిని నెఱుంగలేరు. రాముని పేరులో గల తీయదనము కంటే వానిలో గల తీయదన మంత సుఖమా!

029[మార్చు]

అండజవాహ నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్

కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా

ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మి కై

దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నిన్ను నమ్మి కొలిచినవారి పాపములు కొండలంతటివైనను నశించిపోవును. ఇంద్రవైభవములు కల్గును. మోక్షలక్ష్మి చేయూతనొసంగును.

030[మార్చు]

చిక్కని పాలపై మిసిమిజెందిన మీగడ పంచదారతో

మెక్కిన భంగి మీ విమలమేచక రూపసుధారసంబు నా

మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్

దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: చిక్కని పాలిమీద నిగనిగలాడు మీగడతో జక్కెర గలిపికొని తిన్నట్లుగ నీ రూప మనియెడు నమృతము నా ప్రేమ పాత్రలో దగిన దాస్యమును దోసిలియందు లభించిందని చెప్పి జుఱ్ఱుకొందును.

031[మార్చు]

సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో

దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం

గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో

త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: సంపద లిచ్చుటకు సీత, పీడల పోగొట్టుటకు హనుమంతుడు, ధుఃఖముబాప లక్ష్మణుడు పాపము హరించుటకు రామనామములను గరుణతో మానవుల రక్షిచుటకై యేర్పరుపబడినవి.

032[మార్చు]

హలికులిశాంకుశధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకో

జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ

కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా

తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: శంకచక్రాదులతో బ్రకాశించు పద్మరేఖల వలె చిహ్నములు గలవైన మీ పాదముల నహల్య కొసగినట్లు నా భామునందు గూడ నిలుచునట్లు చేయును.

033[మార్చు]

జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం

దలవడమాటిరక్కసుని యంగముగీటిబలీంద్రునిన్ రసా

తలమునమాటి పార్ధివక దంబముగూల్చిన మేటిరామ నా

తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామాద్యవతారముల నెత్తినట్టి రామా! నా భావమునందు నిలువగా రమ్ము.

034[మార్చు]

భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో

దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్

రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా

డాండ డడాండ డాండ నినదంబులజాండము నిండమత్తవే

దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: దశరథుని కుమారా! దయాసముద్రునివైన ఓ శ్రీరామా! నీవు యుద్ధరంగంలో శత్రుభయంకరుడవు, దుఃఖాలు పొందేవారి పాలిట బంధువువు, కాంతిమంతమైన బాణాలు, అమ్ములపొది, కోదండమును కలిగి, ప్రచండ భుజతాండవంతో ధనుర్విద్యాకళలో కీర్తి పొందిన నీకు సాటివచ్చే దైవం మరొకరులేరని, మదించిన ఏనుగు! నెక్కి ఢంకా మ్రోగిస్తూ భూమండలమంతా వినబడేటట్లు చాటుతాను

10 తరగతిలో తెలుగు పుస్తకంలో వచ్చిన పద్యము ఇది

035[మార్చు]

అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ, జానకీ

కువలయనేత్రి గబ్బిచనుకొండల నుండు ఘనంబ మైథిలీ

నవనవ యౌవనంబను వనంబునకున్ మదదంతి నీవెకా

దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధీ!


భావం: సీత కన్నులను కలువలకు జంద్రుడవు, సీత యొక్క యుబ్బిన స్తనములను కొండల నుండెడి మేఘమవు. సీత యొక్క కొంగ్రొత్త యౌవన మను వనమునకు మదించిన యేనుగువంటివాడవు నీవని యిష్టముతో గొలుతును.

036[మార్చు]

ఖరకరవంశజా విను మఖండిత భూతపిశాచఢాకినీ

జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని

స్పుర దురువజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో

ధ్ధర బిరుదంక మేమఱుకు దాశరథీ కరుణాపయోనిధీ!


భావం: భూత పిశాచాది భయముల బోగొట్టునవైన నీ పాదముల బ్రవేశించితిని. ఇపుడు దీనుల నుద్ధరించువాడవను నీ బిరుదు యొక్క చిహ్నము మఱవకుము.

037[మార్చు]

జుఱ్ఱెదమీక థామృతము జుఱ్ఱెదమీపదకంజతో యమున్

జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు నే

జుఱ్ఱెద జుఱ్ఱుజుఱ్ఱుఁన రుచుల్ గనువారిపదంబు గూర్పవే

తుఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: మీ కధామృతమును మీ పాదపద్మములను జుఱ్ఱుకొందును. రామనామములో గారుచున్న యమృతరసమును జుఱ్ఱెదను. అందలి రుచుల నెఱిగినవారి స్థానమిమ్ము. దుర్మార్గుల స్నేహ మొసగకుము.

038[మార్చు]

ఘోరకృతాంత వీరభటకోటికి గుండెదిగుల్ దరిద్రతా

కారపిశాచ సంహరణ కార్యవినోది వికుంఠ మందిర

ద్వార కవాటభేది నిజదాసజనావళికెల్లప్రొద్దు నీ

తారకనామమెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నీ నామము యమభటులకు గుండె దిగులు కలిగించునది, దరిద్ర పిశాచమును నాశనము చేయునది. నీ భక్తుల కెప్పటికిని వైకుంఠ ద్వారమున గల తలుపులను బ్రద్దలు గొట్టునటువంటిది.

039[మార్చు]

విన్నపమాలకించు రఘువీర నహి ప్రతిలోకమందు నా

కన్న దురాత్ముడున్, బరమ కారుణికోత్తమ వేల్పులందు నీ

కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడు నాకు, వి

ద్వన్నుత నీవె నాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నాకన్న దురాత్ముడు ప్రపంచమున లేడు. నీకన్న మహాత్ముడు దేవతలలో లేడు. కావున నాకు నీవె దిక్కు. మరియొకరు కాదు.

040[మార్చు]

పెంపనుఁదల్లివై కలుష బృందసమాగమ మొందకుండ ర

క్షింపను దండ్రివై మెయి వసించు దశేంద్రియ రోగముల్ నివా

రింపను వెజ్జవై కృప గుఱించి పరంబు దిర౦బుగాఁగ స

త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: పోషించుటలో దల్లివి, పాపముల బొందకుండ రక్షించుటలో దండ్రివి, రోగమును వారించుటలో వైద్యుడవై, దయతో శాశ్వతమోక్ష మొసగి రక్షింపుము.

041[మార్చు]

కుక్షినజాండపం క్తులొన గూర్చి చరాచరజంతుకోటి సం

రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా

పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ

ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: కడుపులో బ్రహ్మాండముల నుంచుకొని చేతనా చేతన జంతువుల బాలించు నీవే నాకు దిక్కు. పాపములెన్ని చేసినను రక్షించు వాడవు నీవే సుమా!

042[మార్చు]

గద్దరి యోగి హృత్కమలగంధ రసానుభవంబుఁజెందు పె

న్నిద్దపు గండుఁదేఁటి, ధరణీసుత కౌఁగిలిపంజరంబునన్

ముద్దులుగుల్కు రాచిలుక, ముక్తినిధానమ రామ, రాఁగదే

తద్దయు నేఁడు నాకడకు, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: మహాత్ముల హృదయ పద్మములనుండు మకరందమును గ్రోలుదుమ్మెదవంటివాడవు, ముక్తికి నిక్షేపమువంటివాడవు నైన, రామ! నేడు దయతో నా కడకు రమ్ము.

043[మార్చు]

కలియుగ మర్త్యకోటి నిను గన్గొనరాని విధంబో, భక్తవ

త్సలత వహింపవో, చటులసాంద్రవిపద్దశవార్ధి గ్రుంకుచో

బిలిచిన బల్కవింతమఱపే, నరులిట్లనరాదుగాక నీ

తలపున లేదె సీతచెఱ, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: ఈ కలియుగములోని మనుష్యులు నిన్ను గనలేకున్నారో లేక నీకు భక్తులపై దయలేదో యెఱుంగను. మిక్కిలి విశేషమైన యాపద లను సముద్రములో బడుచు బిలిచినను బలుకకున్నావు. మే మిట్లనగూడదు, సీత పడిన బాధ నప్పుడే మఱచితివా? (మమ్ములను మఱువకు మనుట.)

044[మార్చు]

జనవర! మీ కథాళి వినసైఁపక కర్ణములందు ఘంటికా

నినద వినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు, ని

న్ననయము నమ్మి కొల్చిన మహాత్ములకేమి యొసంగెదో, సనం

దననుత మాకొసంగుమయ, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నీ కధలు చెవులతో విన నిష్టపడక గంటలమ్రోఁతల నానందపడు ఘంటాకర్ణాదులకు వరము లిచ్చితివి. నిన్నెప్పుడుఁ గొల్చువారి కే మోసంగితివి. మాకు మోక్ష మిమ్ము.

045[మార్చు]

పాపము లొందువేళ, రణపన్నగ భూత భయ జ్వరాదుల౦

దాపద నొందువేళ, భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్

బ్రాపుగ, నీవు దమ్ముడిరుప్రక్కియలన్ జని, తద్విపత్తి సం

తాపము మాన్పి కాతురట దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:

046[మార్చు]

అగణిత జన్మకర్మదురితాంబుధిలో బహుదుఃఖ వీచికల్

దెగిపడ నీదలేక, జగతీధర నీపదభక్తి నావచే

దగిలి తరింపగోరితి పదంబడి, నాదు భయంబు మాన్పవే

తగదని చిత్తమందిడక, దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:

047[మార్చు]

నేనొనరించు పాపములనేకములైనను, నాదు జిహ్వకుం

బానకమయ్యె మీ పరమ పావననామము, దొంటిచిల్క రా

మా ననుగావుమన్న తుదిమాటకు సద్గతిజెందె, గావునన్

దాని ధరింపగోరెదను, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

048[మార్చు]

పరధనముల్ హరించి, పరభామలనంటి, పరాన్నమబ్బినన్

మురిపెము, కాని మీదనగు మోసమెఱుంగదు మానసంబు, దు

స్తరమిది, కాలకింకర గదాహతి పాల్పడనీక, మమ్ము నే

తఱి దరిజేర్చి కాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

049[మార్చు]

చేసితి ఘోరకృత్యముల్, చేసితి భాగవతాపచారముల్,

చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు, నేఁ

జేసిన నేరముల్ దలఁచి చిక్కులు బెట్టకుమయ్య, అయ్య, నీ

దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

050[మార్చు]

పరుల ధనంబుఁజూచిపర భామలజూచి హరింపగోరు మ

ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి

స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు

త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:


051[మార్చు]

సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ

నిలయుడగాను, మీ చరణ నీరజ రేణు మహాప్రభావముం

దెలియ నహల్యగాను, జగతీవర! నీదగు సత్యవాక్యముం

దలపగ రావణాసురుని తమ్ముడగాను, భవద్విలాసముల్

దలచి నుతింప నాతరమె, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: సముద్రమంత దయకలిగిన, ఓ దశరథ కుమార! శ్రావ్యమైన నీ నామ జప సారము తెలుసుకొనుటకు నేను కాశీపుర నివాసుడైన శివుడనుగాను. నీ పాదధూళి యొక్క మహత్యము తెలియుటకు నేను అహల్యను కాను. నీ సత్య పలుకులను తలపగ నేను విభీషణుని అసలే కాను. నీ యొక్క లీలలు స్మరించి పొగడుట నాకు సాధ్యమా!

052[మార్చు]

పాతకులైన మీకృపకు బాత్రులుకారె తలంచిచూడ, జ

ట్రాతికి గల్గె బావన మరాతికి రాజ్యసుఖంబుగల్గె, దు

ర్జాతికి బుణ్యమబ్బె, గపిజాతి మహత్త్వమునొందె, గావునం

దాతవ యెట్టివారలకు, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: సముద్రమంత దయకలిగిన, ఓ దశరథ కుమార!కోరిన కోర్కెలెను ఎటువంటి వారికైనా తీర్చెడివాడవు. కావుననే, దారిలోన రాయివలె పడియున్న అహల్య స్త్రీగా మారి పావనురాలయ్యెను. శత్రువు సోదరుడైన విభీషణునకు రాజ్య సౌఖ్యము కలిగెను. బోయజాతికి చెందిన గుహుడు మొదలగు వారికి పుణ్యము కలిగెను. వానరజాతి యంతటికి మహత్యము కలిగెను.

053[మార్చు]

మామక పాతక వ్రజము మ్రాన్పనగణ్యము, చిత్రగుప్తు లే

మేమని వ్రాతురో? శమనుండేమి విధించునొ? కాలకింకర

స్తోమ మొనర్చుటేమొ? వినజొప్పడ దింతకుమున్నె, దీన చిం

తామణి యెట్లు గాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ!

054[మార్చు]

దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు; నీ

దాసుని దాసుడా గుహుడు తావకదాస్యమొసంగినావు; నే

జేసిన పాపమో వినుతి చేసిన గావవు; గావుమయ్య, నీ

దాసులలోన నేనొకడ దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:


దాసులలోన నేనొకఁడ దాశరథీ కరుణాపయో కాదుగదా. అయినను కరుణతో పాలించినావు. గుహుడు నీ దాసునికి దాసుడు కాకపోయినను నీ సేవాభాగ్యము నిచ్చితివి. నేను నీ స్తోత్రమే గాని ఎట్టి పాపము చేయలేదు. నన్నేల నీ దాసునిగ చేసికొనవు. అనగా నాకు మోక్షము ఇవ్వమని ప్రార్ధన.

055[మార్చు]

దీక్షవహించి, నాకొలది దీనుల నెందఱి గాచితో, జగ

ద్రక్షక! తొల్లి యా ద్రుపదరాజతనూజ తలంచినంతనే

యక్షయమైన వల్వలిడితక్కట! నా మొఱ జిత్తగించి

ప్రత్యక్షము గావదేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: సముద్రమంత దయకలిగిన, ఓ దశరథ కుమార! జగత్ రక్షకుడైన నీవు, నా వంటి దీనులనెందరినో కాపాడుటమె ఒక దీక్షగ వహించినావు. అలనాడు, ద్రుపదరాజ పుత్రికైన ద్రౌపది నిన్ను తలచిన వెంటనే క్షయము కాని వస్త్రములనిచ్చి రక్షించినావు. అయ్యో! మరి నా యొక్క ప్రార్ధనను విని ఎందుకు ప్రత్యక్షమవ్వవు?

056[మార్చు]

నీలఘనాభమూర్తివగు నిన్ను గనుంగొన కోరివేడినన్

జాలముసేసి దాగెదవు, సంస్తుతి కెక్కిన రామనామ మే

మూలను దాచుకోగలవు, ముక్తికి ప్రాపది, పాపమూలకు

ద్దాలముగాదె మా యెడల, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

057[మార్చు]

వలదు పరాకు భక్తజనవత్సల, నీ చరితంబు వమ్ముగా

వలదు పరాకు, నీ బిరుదు వజ్రమువంటిది, గావకూరకే

వలదు పరాకు, నా దురిత వార్ధికి దెప్పవుగా, మనంబులో

దలతుమె, కా నిరంతము దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

058[మార్చు]

తప్పులెఱుంగ లేక దురితంబులు సేసితినంటి నీవుమా

యప్పవుగావు మంటి నికనన్యులకున్ నుదురంటనంటినీ

కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బటవంటి నా

తప్పుల కెల్ల నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:


059[మార్చు]

ఇతడు దురాత్ముడంచు జనులెన్నఁగ నాఱడిఁగొంటి, నేనెపో

పతితుఁడ నంటిపో, పతిత పావనమూర్తివి నీవుగల్గ, నే

నితరుల వేఁడనంటి, నిహమిచ్చిననిమ్ము పరంబొసంగుమీ,

యతులిత రామనామ మధురాక్షరపాళి నిరంతరంబు హృ

ద్గతమని నమ్మికొల్చెదను, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

060[మార్చు]

అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో

క్షించిన జాలు; దాన నిర సించెదనాదురితంబు లెల్లదూ

లించెద వైరివర్గ మెడలించెద గోర్కుల నీదుబంటనై

దంచెద, గాలకింకరుల దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

061[మార్చు]

జలనిధు లేడునొక్క మొగిఁ జక్కికి దెచ్చె శరంబు, ఱాతినిం

పలరఁగ జేసె నాతిగఁ బదాబ్జపరాగము, నీ చరిత్రముం

జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం

దలప నగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

062[మార్చు]

కోతికిశక్యమా యసురకోటుల గెల్వను, గెల్చెబో నిజం

బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివింత? మా

సీతపతివ్రతా మహిమ, సేవకు భాగ్యము, మీ కటాక్షమున్

ధాతకు శక్యమా పొగడ? దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

రాక్షసులను గెలవటం కోతికి(హనుమంతునికి) సాధ్యమా? అగ్నిదేవుడు హనుమ వంటికి చల్లదనం చేకూర్చుట ఎంత వింత? యిది అంతయు పతివ్రత అయిన సీతమ్మ తల్లిని సేవించి హనుమ పొందిన కటాక్ష భాగ్యము వలన సాధ్యమైనది, అట్టి సీతమ్మను పొగడ బ్రహ్మకు కూడా శక్యము కాదయ్య ఓ కరుణ అనె నీటితో నిండిన సముద్రమంతటి వాడా, దశరధుని కుమారుడా (ఓ రామా).

063[మార్చు]

భూపలలామరామ, రఘుపుంగవరామ, త్రిలోక రాజ్య సం

స్ధాపనరామ, మోక్షఫలదాయక రామ, మదీయ పాపముల్

పాపగదయ్యరామ, నిను బ్రస్తుతి చేసెదనయ్యరామ, సీ

తాపతిరామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

064[మార్చు]

నీ సహజత్వంబు సాత్వికము, నీవిడిపట్టు సుధాపయోధి, ప

ద్మాసనుడాత్మజుండు, గమలాలయ నీ ప్రియురాలు, నీకు సిం

హాసనమిద్ధరిత్రి; గొడుగాకసమక్షులు చంద్రభాస్కరుల్,

నీ సుమతల్పమాదిఫణి, నీవె సమస్తము, గొల్చునట్టి నీ

దాసుల భాగ్యమెట్టిదయ, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

065[మార్చు]

చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవింత, సు

స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ

స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ

ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నీ పాద స్పర్శ మాత్రమున శిల స్త్రీ రూపు దాల్చి అహల్య అయినది. శిలా పర్వతములు సముద్రముపై స్టిరముగ తేలినవె. ఇట్టి వింతలు జరుగగా నీ స్మరణ చేయు భక్తులు మోక్ష్మము పొందట వింత ఏమియుగాదు.

066[మార్చు]

దైవము తల్లిదండ్రి, తగుదాత గురుండు సఖుండు, నిన్నెకా

భావన చేయుచున్నతఱి, పాపములెల్ల మనోవికార దు

ర్భావితు చేయుచున్నవి, కృపామతివై నను గావుమీ, జగ

త్పావనమూర్తి! భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

067[మార్చు]

వాసవ రాజ్యభోగ సుఖవార్ధినిదేలు ప్రభుత్వమబ్బినా

యాసకుమేరలేదు, కనకాద్రిసమాన ధనంబు గూర్చినంఁ

గాసును వెంటరాదు, కని కానక చేసిన పుణ్యపాపముల్

వీసరబోవనీవు, పదివేలకుఁ జాలు, భవంబునొల్ల, నీ

దాసునిగాగ నేలుకొను, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

068[మార్చు]

సూరిజనుల్, దయాపరులు, సూనృతవాదులలుబ్ధమానవుల్,

వీరపతివ్రతాంగనలు, విప్రులు, గోవులు, వేదముల్, మహీ

భారముదాల్పగా, జనులు పావనమైన పరోపకార స

త్కార మెఱుంగలేరకట! దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:

069[మార్చు]

వారిచరావతారమున వారిధిలో జొఱబాఱి, క్రోధ వి

స్తారగుడైన యా నిగమతస్కరవీరనిశాచరేంద్రునిం

జేరి వధించి, వేదముల చిక్కెడలించి, విరించికిన్ మహో

దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

070[మార్చు]

కరమనురక్తి, మందరము గవ్వముగా, నహిరాజుద్రాడుగా

దొరకొని, దేవదానవులు దుగ్ధపయోధి మథించుచున్నచో,

ధరణిచలింప, లోకములు తల్లడమందగ, గూర్మమై ధరా

ధరము ధరించితీవెకద! దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

071[మార్చు]

ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుడ

వ్వారిధిలోనదాగినను వానివధించి వరాహమూర్తివై

ధారుణిదొంటికై వడిని దక్షిణశృంగమునన్ ధరించి వి

స్తార మొనర్చితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

072[మార్చు]

పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంతర ప్రభా

పటలము గప్ప నుప్పతిలి భండనవీధి నృసింహ భీకర

స్ఫుటపటు శక్తి హేమకశిపున్ విదళించి సురారిపట్టి నం

తట గృప జూచి తీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

073[మార్చు]

పదయుగళంబు భూ గగన భాగములన్ వెసనూని, విక్రమా

స్పదుడగు నబ్బలీంద్రు నొకపాదమునందలక్రిందనొత్తి, మే

లొదవ, జగత్త్రయంబు బురుహూతునకియ్య వటుండవైన, చి

త్సదమలమూర్తి వీవెకద! దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

074[మార్చు]

ఇరువదియొక్కమాఱు ధరణీశులనెల్ల వధించి, తత్కళే

బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి, భూ

సురవర కోటికిన్ ముదము సొప్పడ, భార్గవరామమూర్తివై

ధరణి నొసంగి తీవెకద! దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

075[మార్చు]

దురమున దాటకందునిమి, ధూర్జటి విల్ దునుమాడి, సీతనుం

బరిణయమంది, తండ్రిపనుపన్ ఘనకాననభూమికేగి, దు

స్తరపటు చండకాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ

ధరముల గూల్చితీవెకద! దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

076[మార్చు]

అనుపమ యాదవాన్వయ సుధాబ్ధి సుధానిధి, కృష్ణమూర్తి నీ

కనుజుడుగా జనించి, కుజనావళి నెల్ల నడంచి, రోహిణీ

తనయుడనంగ, బాహుబల దర్పమునన్, బలరామమూర్తివై

తనరిన వేల్ప వీవెకద! దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

077[మార్చు]

సురలు నుతింపగా ద్రిపుర సుందరులన్ వరియింప బుద్ధ రూ

పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించునప్పుడా

హరునకు దోడుగా వర శరాసన బాణ ముఖోగ్రసాధనో

త్కర మొనరించితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

078[మార్చు]

సంకరదుర్గమై, దురిత సంకులమైన జగంబుజూచి, స

ర్వంకషలీల, నుత్తమ తురంగమునెక్కి, కరాసిబూని, వీ

రాంక విలాసమొప్ప, గలికాకృతి, సజ్జనకోటికి నిరా

తంక మొనర్చితీవుకద! దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

079[మార్చు]

మనమున నూహాపోహణలు మర్వకమున్నె, కఫాది రోగముల్

దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె, నరుండు మోక్ష సా

ధన మొనరింపఁగావలయుఁ, దత్త్వవిచారము మానియుండుట

ల్తనువునకున్ విరోధమది, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:"దశరథరామా! మనస్సునకు ఆలోచించే శక్తి నశించడానికి పూర్వమే, శ్లేష్మ కఫాది వ్యాధులు దేహములో వ్యాపించి దాని బలమును హరించడానికి ముందే, మనుష్యుడు పరమాత్మను గురించి విచారము చేసి, మోక్షసాధనకు తగిన ఉపాయములను అన్వేషించవలెను. తర్వాత ఇటువంటి ప్రయత్నం చేయుట సాధ్యం కాదు" అంటున్నాడు రామదాసు.

080[మార్చు]

ముదమున కాటపట్టు, భవమోహమద్వదిరదాంకుశంబు, సం

పదల కొటారు, కోరికల పంట, పరంబున కాది, వైరుల

న్నదన జయించుత్రోవ, విపదబ్ధికి నావ గదా, సదా భవ

త్సదమల నామసంస్మరణ! దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

081[మార్చు]

దురిత లతానుసార భయ దుఃఖ కదంబము రామనామభీ

కరతర హేతిచేఁ దెగి కకావికలై చనకుండ నేర్చునే

దరికొని మండుచుండు శిఖ దార్కొనినన్ శలబాది కీట కో

త్కరము విలీనమై చనవె దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

082[మార్చు]

హరిపదభక్తినింద్రియజ యాన్వితుడుత్తముఁడింద్రిమంబులన్

మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారశ్యుడై

పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా

దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:


083[మార్చు]

వనకరి చిక్కె మైనసకు, వాచవికింజెడిపోయె మీను, తా

వినికికిఁజిక్కెఁజిల్వ, గనువేఁదుఱుఁ జెందెను లేళ్ళు, తావిలో

మనికి నశించెఁ దేటి, తరమా యిరుమూఁటిని గెల్వ, నైదు సా

ధనముల నీవె కావదగు! దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

084[మార్చు]

కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ

స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ

యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో

త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:


085[మార్చు]

చిరతరభక్తిన్, ఒక్క తులసీదళమర్పణ సేయువాడు, ఖే

చర గరుడోరగ ప్రముఖ సంఘములో వెలుగన్, సదా భవత్

స్ఫురదరవింద పాదముల పూజలొనర్చిన వారికెల్ల, త

త్పరమరచేతి ధాత్రిగద! దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:

086[మార్చు]

భానుడు తూర్పునందు గనుపట్టినఁ బావక చంద్రతేజముల్

హీనత జెందినట్లు, జగదేక విరాజితమైన, నీ పద

ధ్యానము సేయుచున్నఁ బరదైవమరీచులడంగకుండునే,

దానవ గర్వనిర్దళన! దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

087[మార్చు]

నీమహనీయతత్త్వ రస నిర్ణయ బోధ కథామృతాబ్ధిలో

దామును గ్రుంకులాడక వృథా తను కష్టము జెంది మానవుం

డీ మహిలోక తీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ

త్తామసపంకముల్ విడునె దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

088[మార్చు]

కాంచన వస్తుసంకలిత కల్మషమగ్నిపుటంబువెట్టి వా

రించినరీతి, ఆత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం

బంచిత భక్తియోగ దహనార్చిఁ దగుల్పక పాయునే, కన

త్కాంచనకుండలాభరణ! దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

089[మార్చు]

నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషంబుగా

నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై

నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజించినఁ గల్గకుండునే

దాసులకీప్సి తార్థములు దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

090[మార్చు]

వారిజపత్రమందిడిన వారి విధంబున, వర్తనీయ మం

దారయ రొంపిలోన దనువంటని కుమ్మరిపుర్వురీతి, సం

సారమునన్ మెలంగుచు విచారగుడై పరమొందుగాదె, స

త్కారమెఱింగి మానవుడు! దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

091[మార్చు]

ఎక్కడ తల్లిదండ్రి, సుతులెక్కడివారు, కళత్ర బాంధవం

బెక్కడ, జీవుఁడెట్టి తనువెత్తిన, పుట్టుచుఁ బోవుచున్న వా

డొక్కడె, పాపపుణ్య ఫలమొందిన నొక్కడె, కానరాడు వే

ఱొక్కడు వెంటనంటి, భవమొల్లనయా, కృపజూడవయ్య, నీ

టక్కరి మాయలందిడక, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

092[మార్చు]

దొరసినకాయముల్ముదిమి తోచినఁజూచి, ప్రభుత్వముల్సిరు

ల్మెఱపులుగాగజూచి, మఱి మేదినిలో తమతోడివారు ముం

దరుగుటజూచిచూచి, తెగు నాయువెఱుంగక, మోహపాశము

ల్దరుగని వారికేమిగతి? దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

093[మార్చు]

సిరిగలనాఁడు మైమఱచి, చిక్కిననాఁడుదలంచి, పుణ్యముల్

పొరిఁబొరి చేయనైతినని పొక్కినఁ గల్గునె, గాలిచిచ్చుపైఁ

గెరలిన వేళఁ, దప్పికొని కీడ్పడు వేళ, జలంబు గోరి త

త్తరమునఁ ద్రవ్వినం గలదె, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

094[మార్చు]

జీవనమింకఁ పంకమున జిక్కిన మీను చలింపకెంతయున్

దావున నిల్చి, జీవనమె తద్దయుఁ గోరువిధంబు చొప్పడం,

దావలమైనఁగాని గుఱి తప్పనివాఁడు తరించువాఁడయా

తావకభక్తి యోగమున, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

095[మార్చు]

సరసునిమానసంబు సరసజ్ఞుడెరుంగును, ముష్కరాధముం

డెఱిఁగి గ్రహించువాడె, కొలనేక నివాసముగాగ దర్దురం

బరయఁగ నేర్చునెట్లు, వికచాబ్జ మరందరసైక సౌరభో

త్కరము మిళిందమొందుక్రియ, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:సరసుని మనసును సరసజ్ఞుదె తెలుసుకొగలదు

096[మార్చు]

నోఁచినతల్లిదండ్రికిఁ దనూభవుఁడొక్కడెచాలు మేటిచే

చాఁచనివాడు వేఱొకఁడు చాచిన లేదన కిచ్చువాఁడునో

రాఁచినిజంబకాని పలు కాడనివాఁడు రణంబులోన మేన్

దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

097[మార్చు]

శ్రీయుతజానకీరమణ చిన్మయరూప రమేశరామ నా

రాయణ పాహిపాహియని బ్రస్తుతిఁ జేసితి నా మనంబునం

బాయక కిల్బిషవ్రజ విపాటనమందఁగ జేసి సత్కళా

దాయి ఫలంబు నాకిడవె దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

098[మార్చు]

ఎంతటి పుణ్యమో శబరి యెంగిలి గొంటివి వింతగాదె, నీ

మంతన మెట్టిదో యుడుత మైని కరాగ్రనఖాంకురంబులన్

సంతసమందఁ జేసితివి, సత్కులజన్మమదేమి లెక్క, వే

దాంతముగాదె నీ మహిమ, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

099[మార్చు]

బొంకనివాఁడె యోగ్యుడరి బృందములెత్తినచోట జివ్వకుం

జంకనివాఁడె జోదు, రభసంబున నర్థి కరంబుసాఁచినం

గొంకనివాఁడె దాత, మిముఁగొల్చి భజించినవాఁడె పో నిరా

తంక మనస్కుఁడెన్నగను, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

100[మార్చు]

భ్రమరముగీటకంబుఁ గొని పాల్పడి ఝాంకరణో కారియై

భ్రమరముగానొనర్చునని పల్కుటఁ జేసి భవాది దుఃఖసం

తమసమెడల్చి భక్తిసహి తంబుగ జీవుని విశ్వరూప త

త్త్వమునధరించు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

101[మార్చు]

తరువులు పూచి కాయలగు, తత్కుసుమంబులు పూజగా, భవ

చ్చరణము సోకి, దాసులకు సారములౌ ధనధాన్యరాశులై,

కరిభట ఘోటకాంబర నికాయములై, విరజానదీ సము

త్తరణ మొనర్చు, చిత్రమిది! దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:

102[మార్చు]

పట్టితి భట్టరార్య గురుపాదము లిమ్మెయి నూర్ధ్వపుండ్రముల్

వెట్టితి, మంత్రరాజ మొడిబెట్టితి, నయ్యమకింకరాళికిం

గట్టితిబొమ్మ, మీ చరణ కంజములందుఁ దలంపుపెట్టి, బో

దట్టితిఁ బాపపుంజముల, దాశరథీ కరుణాపయోనిధీ.


భావం:

103[మార్చు]

అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ, కం

చెర్ల కులోద్భవుండన ప్రసిద్ధుడనై, భవదంకితంబుగా

నెల్లకవుల్ నుతింప రచియించితి, గోపకవీంద్రుడన్, జగ

ద్వల్లభ, నీకు దాసుడను! దాశరథీ కరుణాపయోనిధీ!


భావం:


వనరులు[మార్చు]


శతకములు
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము

This work was published before January 1, 1928, and is in the public domain worldwide because the author died at least 100 years ago.