మారుతి శతకము
శా. శ్రీమద్రామ పదారవిందయుగళిన్ సేవించి, యస్మద్గురు
స్వామిన్ వేడ్క భజించి, సత్కవి నమస్కారంబుఁ గావించి, వా
గ్భూమప్రౌఢిమ నీకు నొక్క శతకంబున్ భక్తి నర్పించెదన్
నా మీదం గృపజేసి కైకొను మమందప్రీతితో మారుతీ! 1
మ. అనఘా! నీవు జనించి నప్పుడె సముద్యద్భూరితేజంబునన్
వినువీథిం గనుపట్టు బాలరవి సద్బింబంబు నీక్షించి, యె
ఱ్ఱని పండంచు గ్రసింప బత్రిపతిలీలన్ వేడ్క మున్నూరు యో
జనముల్ మింటికి దాటితౌఁ ద్రిభువనశ్లాఘ్యుండవై మారుతీ! 2
మ. నిజగర్భస్థితశైవతేజము, సమున్నిద్రాత్మ తేజంబుఁ గూ
డ జగత్ప్రాణుఁ డమోఘ కేసరివనాటక్షేత్రమందర్థి నిం
చ, జయశ్రీ మహిమాప్తి నయ్యుభయతేజంబుల్ రహిన్ మిశ్రమై
త్రిజగంబుల్ గొనియాడ బుట్టితివి గాదే నీవిలన్ మారుతీ! 3
మ.అనిమేషేభము తెల్లపండనుచు బాల్యక్రీడలన్ మ్రింగ నొ
య్యన డాయం బవిచే బలారి నిను మూర్ఛాక్రాంతునిం జేయ బూ
ర్వనగాధిత్యక మీఁద వామహనువున్ భగ్నంబుగా వ్రాలినన్
హనుమంతుండను పేరు నాడమరె నీకన్వర్థమై మారుతీ! 4
మ. అపుడా గంధవహుండు నీదయిన మూర్ఛావస్థ వీక్షించి, తా
గుపితుండై నిజమూర్తి వైభవము సంకోచింపఁగాఁ జేయ న
చ్చపు గూర్మిన్ నిఖిలాస్త్రశస్త్రముల బంచత్వంబు లేకుండ స
త్కృపతో నీకు వరంబులిచ్చిరిగదా బృందారకుల్ మారుతీ! 5
మ. ఒక పాదంబు మహోదయాచలముపై నొప్పారఁగా నుంచి వే
ఱొక పాదం బపరాద్రి మీఁద నిడి యయ్యుష్ణాంశుచే బల్విడిన్
సకలామ్నాయము లభ్యసించిన భవచ్చాతుర్య మేమందు దా
పక దివ్యోరుతర ప్రభావము నుతింపన్ శక్యమే? మారుతీ! 6
మ. బలవంతుండగు వాలి ప్రోలు వెడలింపం, బత్నిఁ గోల్పోయి మి
క్కిలి దుఃఖంబున ఘోరకాననములం గ్రీడించి వర్తించు నా
జలజాప్తాత్మజు నొజ్జ పట్టి యని యశ్రాంతంబుఁ జేపట్టి యా
బలభిత్సూతికిఁ జిక్కకుండ ననుకంపం బ్రోవవే మారుతీ! 7
మ. తనపత్నిం దిలకింపుచున్ నిబిడకాంతారోర్వి వర్తించు రా
మ నరేంద్రోత్తము పాలి కర్కజుఁడు పంపం భిక్షువేషంబునన్
జని, సుగ్రీవుని చందముం దెలిపి యా క్ష్మానాథు దోడ్తెచ్చి, మె
ల్లన నయ్యిద్దఱకుం ధనంజయుని మ్రోలన్ సఖ్యసంబంధమున్
వినయం బొప్ప ఘటింపఁ జేసినది నీవే కాదొకో మారుతీ! 8
మ. మనుజగ్రామణి సత్కృపాత్త కపిసామ్రాజ్య స్థితుండయ్యు భూ
తనయాన్వేషణ కార్యమున్ మఱచి కందర్పక్రియామత్తుఁడై
తనివిం జెందక యున్న భానుజునిఁ దత్కాలార్హ నీత్యుక్తయు
క్తిని బోధించిన నీతిశాలివి నినుం గీర్తించెదన్ మారుతీ! 9
శా. లేరా కీశులనేకులుం? ద్రిజగముల్ వీక్షించి రా నేర్పరుల్
గారా? రాముఁడు జానకిన్ వెదక వీఁకన్ గీశులం బంపుచో
నారూఢిన్ భవదీయ దివ్యమహిమ వ్యాపారముల్ సూచి కా
దా! రత్నాంగుళి భూషణం బిడియె నీ హస్తంబునన్ మారుతీ! 10
మ. వనజాప్త ప్రియపుత్రుఁ డెంత ధిషణావంతుఁడొ, సర్వంసహా
తనయాన్వేషణ మాచరింప గపులం దా బంపుచో, గార్యసా
ధనమందీ వతి దక్షిణుండవని కాదా! నేర్పుతో దక్షిణం
బునకున్ నిన్నధికారిఁ జేసి పనిచెన్ మోదంబునన్ మారుతీ! 11
శా. సీతన్ గానక, దప్పిచే బడలి గాసిం జెందు శైలాట సం
ఘాతంబుం గొని, శైలగహ్వర సుధా కల్పాంబువుల్, సత్ఫల
వ్రాతంబుం దనివార నందఱ భుజింపంజేసి, తద్దేవతా
ఖాతశ్వభ్రము వెల్వరించితివి యోగప్రౌఢిచే మారుతీ! 12
మ. జనకక్ష్మాపతిపుత్రి యున్నవిధమున్ సర్వంబు సంపాతిచే
విని, నీలాంగదముఖ్యవానరుల్ వేగంబె ప్రాయోపవె
శమున్ మాని భవత్సమేతులగుచున్ సంప్రీతితో నా మహేం
ద్ర నగారోహణ మాచరించి రఁట విన్నాణంబుగా మారుతీ! 13
మ. శరధిం గాంచి యలంఘనీయ మని తత్సంతారణాదక్షులై
వరుసన్ గీశులు భీతిచేఁ గళవళింపన్ వారి వారించి ని
న్నురుపాథోధి విలంఘన క్షమునిఁగా నూహించి ధీమంతుఁడా
పరమేష్ఠి ప్రియపుత్రుఁ డంచితగతిన్ బ్రార్థింపఁడే మారుతీ! 14
శా. "ఏలా మీకు భయంబు నేఁ గలుగ, మీ రిందుండుఁ డేనొక్కఁడన్
వాలాయంబు పయోధి దాటి యనువొందన్ లంకలో జానకిం
బోలం గన్గొని వత్తు, నిత్తు బరమామోదంబు మీ" కంచు ధై
ర్యాలాపంబులు వల్కి తేర్చితివి గాదా కీశులన్ మారుతీ! 15
మ. బలి బంధించిన నాఁటి వామన తనుప్రాబల్యముం దాల్చి, యు
జ్జ్వల చంద్రోదయవేళఁ బొంగు తటినీశస్ఫూర్తి నుప్పొంగి, ఘో
ర లయాభ్రంబు తెఱంగునన్ భయద గర్జారావముం జేసి, త
జ్జలధిం దాటఁగఁ బూనితీవు పరమోత్సాహమ్మునన్ మారుతీ! 16
మ. స్థిరసత్త్వంబున శైలరాజము ధరిత్రిం గ్రుంగఁ బాదంబులూ
ది, రహిన్ భూరిభుజోరు వేగమున ధాత్రీజాతముల్ పెల్లగి
ల్లి రయంబారఁగఁ దోడ రా, గగనమున్ లీలాగతిన్ మ్రింగ సు
స్థిరశక్తిం జనుమాడ్కి దాటితివి గాదే నింగికిన్ మారుతీ! 17
మ. అగజాలావృతమూర్తివై భుజరయోద్యద్వారివాహంబు లొ
ప్పుగ నిర్వంకల నంటి రా గదలి యంభోరాశిమధ్యంబునన్
గగనాధ్వంబున నేగు నిన్నమిషుల్, గంధర్వులున్ లంబప
క్ష గిరీంద్రంబును బోలె జూచిరికదా సంభ్రాంతులై మారుతీ! 18
శా. లోకాలోకగుహాముఖంబులు బదుల్ మ్రోయంగ నుద్వృత్తి న
స్తోకధ్వానమొనర్చి, వజ్రనిభ వక్షోఘట్టనస్ఫూర్తి మై
నాకంబున్ సుడిబెట్టి దాని పిదపన్ మన్నించి కేలూది ప్ర
త్యేకం బా బలవైరిచేత నభయంబిప్పింపవే మారుతీ! 19
మ. గరిమన్ వేల్పులు నీదు శక్తి దెలియం గాంక్షించి, నాగాంబయౌ
సురసం బంపిన వ్యాపితాస్య యగుచుం జొప్పాగి పోనీక ముం
దఱఁ దోతెంచిన, సూక్ష్మమూర్తివగుచుం దద్వక్త్రముం జొచ్చి గ్ర
మ్మర నేతెంచిన యోగసిద్ధుని నినుం బ్రార్థించెదన్ మారుతీ! 20
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.