వేంకటేశ శతకము
వేంకటేశశతకము
తాళ్ళపాక పెదతిరుమలార్య
సీ. శ్రీదేవి యురమున శిరసునఁ దులసి భూ
కాంతవీఁపుఁన బదాగ్రమున గంగ
కమలాసనుఁడు నాభిఁగాముండు మనసున
సవ్యవామాక్షుల శశియు రవియు
ధ్వజమున గరుడుండు తపసుల కాంతుల
సకలవాయువులు నాసాపుటముల
జగములు కుక్షిని జలధులు తరులందు
ఘనరోమముల దేవగణము లెల్లఁ
తే. గలిగి శోభిల్లు నీమూర్తిఁ దలచి నీకు
సీసశతకంబు చెప్పెదఁ జిత్తగింపు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ధర్మంబుగలచోటఁ దలకొను జయమెల్ల
దయగలచో సుకృతంబు నిలుచు
సత్యంబుగలచోట సమకూరు శుభములు
నేమంబుగలచోట నిలుచు సిరులు
పాడిగల్గినచోటఁ బంతంబులీడేఱు
దాక్షిణ్య మున్నచోఁ దగులు మైత్రి
భక్తిచేసినచోట ఫలమిచ్చు దైవంబు
మనసు నిల్పినచోట మలయు సుఖము
తే. లితరమగుచోట వెదకిన నేలయుండు
సొరదినీదైనకృపగలచోటఁగాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. పరమనాస్తికునకు భక్తివాదము లేల
షండున కేటికి సతుల పొందు
పాపకర్మున కేల వరపురుషార్థంబు
ధనలోభి కేల బాంధవము చింత
మూర్ఖునకేటికి మొదలనే మొగమాట
మనృతవాదికిని మర్యాద యేల
వెట్టివానికి నేల విమలవిచారంబు
పరదూషకున కేల పరముచింత
తే. సరసునకుఁగాక వివరింప సద్గుణంబు
లెందుఁజూచిన మందున కేల గలుగు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. తపసికి నేటికిఁ దలపోయ రోషంబు
బ్రాహ్మణునకు నేల పాపచింత
బుద్ధిమంతునకేల పొసఁగని సఖ్యంబు
పరమయోగికి నేల ప్రజలరచ్చ
మహిరాజునకునేల బహుజనద్వేషంబు
కార్యవంతునకేల కడుఁ జలంబు
కీర్తికామునకేల కెరలినలోభంబు
మంచివానికి నేల మంకుగుణము
తే. కీడుమేలును మతివితర్కించి చూచి
భవ్యగుణములను గొల్చి బ్రతుకవలయు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. మరణంబు లేకుండ మందుచేఁ గలిగినఁ
గాలునకేటికిఁ గలఁగ బాఁఱఁ
బాయంబు చెడని యుపాయంబు దొరకిన
నేయెడ ముదిమికి నేలతలఁకఁ
గామితార్థము లిచ్చు కామధేనువు గల్గఁ
గఱవున కేటికి వెఱచి యొదుఁగ
వజ్రదేహంబు గా వరము సిద్ధించిన
శస్త్రాస్త్రముల కేల జలదరింప
తే. శరణుసొచ్చిన యటువంటి జనులకెల్లఁ
గావఁ బ్రోవఁగఁ దాతవు గలవు నీవు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. కులమువారల కియ్యకో లైన దిల్లాలు
వరుసతో రక్షించువాఁడు తండ్రి
ప్రియముతోఁ జన్నిచ్చి పెంచినయది తల్లి
తనకుఁ దోడగువాఁడు తమ్ముఁడరయ
నాపదం బెడఁబాపునాతండు బంధుండు
వంచన సేయనివాఁడె భటుఁడు
మోక్షమార్గము చూపు ముఖ్యుండె యాచార్యుఁ
డాత్మకు నిష్టమౌనతఁడు సఖుఁడు
తే. ఎఱిఁగి వీరలతోఁ బొందునెఱపవలయు
గుఱుతెఱింగిన సద్వివేకులకు నెల్ల
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. శౌర్యంబు గలుగుట జన్మసాఫల్యంబు
శాంత మాత్మవివేక సాధనంబు
మానంబు దనకును మహనీయ సంపద
సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు
సవినయవచనంబు సర్వవశ్యకరంబు
వెలయునాచారంబు వెనుబలంబు
దానంబు సేయుట తన కది దాఁచుట
సజ్జనసంగతి సౌఖ్యమొసఁగు
తే. గాన బుధులీ గుణంబులు మానకెపుడు
తగిలి మిమ్ముభజింతురు తలఁచితలఁచి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ధరదేవతాలయ ద్రవ్యసక్తుఁడు గాక
తొడిఁబడ బ్రాహ్మణద్రోహి గాక
చెనసి పతివ్రతాజనకాముకుఁడు గాక
వాఁడిమి నగరఁ గొండీఁడు గాక
గర్వముతోడ నొక్కట మదాంధుడు గాక
పరఁగ నవిశ్వాసపరుఁడు గాక
కుటిలవర్తనమునఁ గ్రూరచిత్తుఁడు గాక
సకలశాస్త్రములందు శఠుఁడుగాక
తే. మెలగనేర్చిన యట్టి ధార్మికునకెందుఁ
గలుగు శుభములు మీ కటాక్షంబువలన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. గడుసరిఁ దాటోటుఁ గష్టు వేడుకకానిఁ
గలహప్రియుని ధూర్తుఁ గపటచిత్తు
సుంకరి జూదరి జూటు ననాచారి
మునిముచ్చుఁ జలపాది ముడియవిడుపుఁ
గుచ్చితు నపకారిఁ గుటిలాత్ము నవివేకిఁ
గైలాటకానిఁ డక్కరిఁ దుటారి
వేఁటకానిఁ బిసాళి వెఱ్ఱి నప్పులపోతు
మాయదారిని జారుమద్యపానిఁ
తే. జేరవలదు మఱిపొందుసేయఁ దగదు
మానవున కర్థితోఁ గలలోననైన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. జలకంబు తగుపాటి జపము దేవార్చన
బ్రాహ్మణసేవ పురాణగోష్ఠి
దానంబు చోరశాత్రవ వినిగ్రహచింత
స్వజనగజాశ్వరక్షణము గణన
యాప్తమంత్రి పురోహితాలోచనంబులు
రాజ్యాధిధనవిచారంబు భుక్తి
సంగీతసాహిత్య సౌఖ్యానుభవములు
గూఢచారుల కొల్వు గుప్తనిద్ర
తే. సలుపవలయును బ్రతిదివసంబునందు
నయమెరింగినయట్టి భూనాయకుండు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. అసలు విడిచిన నలమటలే లేవు
నిర్ధనికుండైన నిర్భయంబు
పరహింస మానినఁ బాపంబు చెందదు
భోగ మొల్లకయున్న బుద్ధి చెడదు
వెసఁ బరాధీనత విడిచిన ముడిరాదు
ధరఁ గోరకున్న బంధంబు లేదు
మగువల రోసిన మరుబాధ లడరవు
మమత మానిన విచారములు లేవు
తే. గాన సకలంబుఁ దలపోసి ఘనతమెఱసి
చెలఁగుపురుషుండె మిగుల నిశ్చింతుఁడరయ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. వలవనివైర మెవ్వరితోడఁ గొఱగాదు
మెలఁగి ధూర్తులయిండ్లు మెట్టఁజనదు
బుధుల నుదాసీనబుద్ధిఁ జూడఁగరాదు
పాపంబు సొమ్మని పట్టఁ దగదు
బంధువిరోధంబు పాటింపఁ జెల్లద
యేలిక కెదురాడ నెపుడు వలదు
ఆత్మ నమ్మిన వారి నపహరించుట కీడె
యని మొన నోడిన నదియ కొఱఁత
తే. పదరఁ బనిలేదు నీతిసంపన్నునకును
బలిమినొయ్యన నానాఁట బ్రబలవలయు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. పలుమాఱు శపథము ల్పలికెడు నాతండు
పూటలు వడునట్టి పోటువాడు
కూటసాక్షులకును గురియైనయాతండు
నట నింటివారితో నలుగువాడు
విభుని రహస్యము ల్వెలిపుచ్చునాతండు
పరులచే లంచము ల్పట్టువాఁడు
కుడుచునింటికిఁ జేటు కోరెడునాతండు
మహినుపకారంబు మఱచువాఁడు
తే. పడునధోగతి నిహమును బరములేక
కొఱకునకుఁబోయు బడిగంటఁగూలుకరణి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. కోపంబు నడఁచిన గురుతరాధ్వరఫల
మింద్రియజయము మహేంద్రపదవి
చలము వారించుట సామ్రాజ్యవిభవంబు
చాంచల్య ముడుగుట సకలసిద్ధి
వెస నహంకారంబు విడుచుట భాగ్యంబు
దైన్యవర్జనమె యుత్తమగుణంబు
నిందఁబాసినయున్కి నిరుపమలాభంబు
ఋణవిముక్తుండౌట హృదయసౌఖ్య
తే. మింతకంటెను మేలు లే దెంచి చూడ
మహిత నీతిజ్ఞులైనట్టి మానవులకు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ఆచారవంతుఁ డౌనతఁడె విప్రోత్తముఁ
డఖిలంబు రక్షించునతఁడు రాజు
వరుసతోఁ గార్యనిర్వాహకుఁడే మంత్రి
రుచిరవర్తనుఁడె పురోహితుండు
కడుఁ దిట్ట దీవింపగలవాఁడె సత్కవి
యమృతహస్తుఁడు వైద్యుఁ డఖిలదిశలఁ
బోటజ్జయెఱిఁగిన పురుషుండు దళవాయి
గణితజ్ఞుఁ డగువాఁడు కరణ మరయ
తే. బురుషరత్నంబులని యండ్రు బుధులు వీరి
నితరు లెల్లను సామాన్యు లెంచిచూడ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. తినఁదిన జిహ్వకుఁ దీపైన మొగచాటు
సారెకుఁ బలుకుట చప్పదనము
కాంతలు పిక్కినఁ గడు వేసటైతోఁచు
నెంతసంపదగల్గె నంతచింత
కడువేఁడఁ జొచ్చినఁ గడఁగు లాఘవమెల్లఁ
బాసలు దప్పినఁ బాటి చెడును
ఇంటింటి కేఁగిన నెడయుఁ బెద్దఱికంబు
తనవాసి విడిచినఁ దఱుఁగు వన్నె
తే. మట్టుమీఱక లోకసమ్మతముగాఁగ
గుట్టుతోడుత మెలఁగినఁ గోటిసేయుఁ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. పరకాంతకై సింహబలుఁడట్లు మృతుఁడయ్యె
రాజ్యలోభమునఁ గౌరవుఁ డులిసె
బరుషోక్తులను శిశుపాలుఁడు హతుఁడయ్యె
మహినిజూదమున ధర్మజుఁడు నొగిలె
నల పాండురాజు వేఁటాడి శాపమునొందె
మును రావణుఁడు చలముననె సమసెఁ
గ్రూరదండంబునఁ గూలెను వేనుండు
చదిసెఁ బానమున రాక్షసగురుండు
తే. ఘనవివేకులు వీరలగతులు దెలసి
వ్యసనములు మాని నడువంగవలయు నిలను
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. తన పురాకృతముచేఁ దగులపోరాదు
బ్రహ్మవ్రాఁతకు మాఱు పలుకరాదు
పంచాస్త్రునస్త్రము ల్పట్టి చూడఁగరాదు
ప్రకృతిస్వభావ మాఁపంగరాదు
దైవికం బెల్లను దప్పింపగారాదు
కాల మెవ్వరికినిఁ గడపరాదు
పోయినప్రాణంబు పొదపెట్టి తేరాదు
గతజలంబుల నడ్డకట్టరాదు
తే. ఏమిచేయఁగవచ్చు సర్వేశ్వరాజ్ఞ
వరుస నెంతటివారికి వగవవలదు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. కామాతురత్వంబు కడుసిగ్గుపడనీదు
భూతంబు సోఁకిన బుద్ధిలేదు
ఆకఁట నలఁగిన నచట నెక్కడిలావు
రోగంబు బలసిన రుచులు దలఁగుఁ
గడఁగి శోకపువేళఁ గలుగదు హర్షంబు
యాజ్ఞ కెంతయును సౌఖ్యంబు దూర
మాఁడుబిడ్డలఁగన్న యపుడె పంతంబు వీడు
నుత్సాహ మెడలిన నుడుగుబలిమి
తే. యెందులకునౌను సంసారి యేమిసేయుఁ
గలిగినది తొంటి తన కర్మ ఫలముగాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ఇల దొమ్మరిది జాతిహీనత యెంచదు
పూటకూళ్లది పుణ్యమునకుఁ జొరదు
జారకామిని తన చావు చింతింపదు
నొరిసి లంజియ మొగమాటపడదు
విరహిణి మదిలోన వెఱపు వాటింపదు
చెలఁగి దూతిక కడు సిగ్గుపడదు
పరగృహవాసిని పరనింద కోడదు
వడి సంతబసివి యెవ్వరిది గాదు
తే. ధర్మవిదుఁ డిట్టివారల దగులకెపుడు
వెలయ సన్మార్గవర్తియై మెలగవలయు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. కవితోడ నలిగినఁ గానిపద్యముజెప్పుఁ
గడుముచ్చుఁ దడవినఁ గన్న పెట్టు
ధనికుతోఁ బోరినఁ దను జట్టిగాఁగొను
బశుకర్ము నొరసినఁ బదరిపొడుచు
బట్టుతోఁ గినిసినఁ బలు తెఱంగులఁ దిట్టు
మూర్ఖుని జెనకిన మురియఁగొట్టు
జేరి యమాత్యు మించిన భంగమండరించు
మర్మజ్ఞుఁ దొడరిన మద మడంచు
తే. నట్లు గావున నసమాన మైనవైర
మెట్టివారికిఁ దగవుగా దెంచి చూడ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ప్రాయంబు గలనాఁడె పంతంబు లీడేఱు
బలిమి గల్గిననాఁడె పరఁగు జయము
సంపదగలనాఁడె జరగు సౌఖ్యములెల్లఁ
దనువుగల్గిననాఁడె ధర్మ మెసఁగుఁ
బిలుపుగల్గిననాఁడె ప్రియములు సిద్ధించుఁ
బోఁడిమిగలనాఁడె పొసఁగుమాట
మన్ననగలనాఁడె మనవిజేకూరును
జనవుగల్గిననాఁడె సరస మమరు
తే. మోసపోయిన మఱిరాదు మొదలిచంద
మెఱిఁగి నడచినవాఁడెపో యెక్కుడెందు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ధరణిదారిద్ర్యంబు దైన్యంబు నొందించు
బహుభీతి కార్పణ్యపడఁగఁ జేయు
శంక యూరకయైన సరిదోడు వెదకించుఁ
బలులంపటుత్వము ల్భంగపఱుచుఁ
దనసిగ్గు దనుదానె తలవంచికొనఁ జేయుఁ
జేసిననేరమి చింతఁ గొలుపు
దడి నీచకృత్యంబు దహమాన మొదవించుఁ
జెందివృద్ధత్వంబు శిథిలపఱుచుఁ
తే. దనువిదారంబు లివియపో దర్పమణఁచు
నవ్వినట్లనె యెట్టిమానవునినైన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. సంసారి కనుచరించకపోవ దధిపుల
నంగనాసహితుల కడఁగ రాదు
పుత్త్రవంతునకును బోదు యాచింపక
భువి గృహస్థున కాడి బొంకరాదు
క్షుధితున కేమేనిఁ గూడఁ బెట్టకపోదు
క్షేత్రవంతున కప్పు సేయరాదు
బంధుపోషకునకు భారమానకపోదు
దేహధారికిఁ గాంక్ష ద్రిప్పరాదు
తే. నరులకెల్ల వైరాగ్యంబునడచుటెట్లు
రమణతో నినుగొల్చు వారలకుఁగాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. సుముఖుఁ డౌటకు నవ్వుచూపులే యిక్కువ
యింపొంది మెచ్చుటకీగి గుఱుతు
కూడియుండుట కోర్చుకొనుటయ సూచన
మన్నించుటకు మంచిమాటయెఱుక
వెస నమ్ముటకుఁ జాడి వినకయుండుటె చిహ్న
చేపట్టుటకుఁ బొరసినది సన్న
దయదలంచుటకును దప్పు మానుటెసాక్షి
లలినేలుటకు నింపు లక్షణంబు
తే. స్వామియగువాఁడు భటునకుఁ జనవులొసఁగి
మనుపఁ దలఁచిన యట్టి సన్మార్గమిదియ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. దయతోడదీనుని దైన్యంబు వాపుట
చెడినమానవుని రక్షించికొనుట
పేదకునర్థంబు పిలిచి తానిచ్చుట
కడలేని యార్తుని గాచికొనుట
శరణుఁ జొచ్చినవాని జనవిచ్చి మనుపుట
యెదుటఁ బడ్డయనాథు నేలికొనుట
చంపఁ దెచ్చినవాని చావుమాన్పించుట
యగతికుం డగురోగి నరసికొనుట
తే. లింతకంటెను బుణ్యంబు లెందుఁగలవు
ధరణిపతులకు నరయ భూతలమునందు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. చెఱుపరానిమనుష్యుఁ జెల్లదు కోపింప
వాఁడు చేఁజిక్కిన వదలఁ జనదు
విశ్వాసి యగువాని విడుచుట యవినీతి
ద్రవ్యాపహారిని దగదు మనుపఁ
బాపాత్ముఁ డైనట్టి బంటు నేలఁగరాదు
ధర్మాత్ము నలఁగింపఁ దగవుగాదు
బుద్ధిచెప్పినవాని బోలదు భర్జింప
నపరాధరహితుపై నలుక వలదు
తే. వరుసనారసి యధిపులు వారి వారి
గుణములెఱుఁగుచుఁ గార్యంబు గొనఁగఁవలయు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. సముఁడైన శత్రుతో సంధిచేయుట కార్య
మెక్కుడైనను గప్పమిడఁగవలయుఁ
దఱి నల్పదళమైన దండెత్తగాఁదగుఁ
దొలఁగి దాఁగినను బోద్రోలవలయు
నిద్దఱైనను భేద మెసఁగఁజేయుట యొప్పుఁ
గాకగగ్గోలుగాఁ గడపవలయుఁ
జనకున్న శత్రువు సంహరించుటలెస్స
యొండె ముట్టడి చేసి యుండవలయు
తే. రమణ నీరీతిఁ దలపోయ రాజనీతి
యిట్లునడచిన విభుఁడిల యెల్లనేలు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. గరిమ నేలికలేనికయ్య మేడకు నెక్కు
నానాజ్ఞలేని రాజ్యంబు జడియు
బహుధనంబులు లేక బల మేపనికివచ్చు
బలములేని ధనంబు బ్రాఁతిగాఁదు
ధర్మంబు లేని యాస్థానమంతయు వృథ
సామునేరనిపోటు సరవిగాదు
సవరణలేని విశాలదుర్గమంబేల
గట్టితాణెము లేనిగడి నశించు
తే. లంకెలొకటికినొకటి లాగుదెలియ
వరుసదప్పక ధరయేలువాఁడెరాజు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. చెఱయుఁగొల్లయు లూటి సీమలోలేకుండ
దండెత్తవలయు శాత్రవులమీఁద
గడ్డియు దవసంబుఁ గడు నీరు గల్గుచోఁ
టరసి పొందుగ విడియంగవలయుఁ
గైకొన్న భూములఁ గాఁపుగాఁ దాణెంబు
లొనరించి మరి యవ్వ లొత్తవలయు
గజము గుఱ్ఱము బంటు గాసి పొందకయుండ
లలిఁబోరఁబరగఁ గెల్వంగవలయు
తే. బుద్ధిఁబదరక యెప్పుడు భూవిభుండు
మెల్లనే బాహుశౌర్యంబు మెఱయుటొప్పు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. తనకుఁగా మును చెడ్డజనులను రక్షించి
యిల మేలు గోరినహితులఁ బ్రోచి
వడిఁ దోడు నవసినవారిని మన్నించి
బడిదిరిగినవారిఁ బ్రభులఁ జేసి
మిగుల దూఱులు వడ్డ మిత్రులఁ బోషించి
సరి నర్థమిచ్చిన సఖుల మనిపి
యచటనుండి సహాయు లగువారి బ్రదికించి
ప్రాఁతవారలకు సంపద లొసంగి
తే. యెల్లవారలు జయవెట్ట నేలుచుండి
వినుతి కెక్కిన యధిపుఁడు ఘనుఁడు దలఁప
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. పతికి మాఱాడక పలుమాఱు నేడ్వక
యలుగక మిగుల గయ్యాళిగాక
తనుఁ దిట్టికొనక కాతాళించి గొణఁగక
మ్రుచ్చిలింపక పాపమునకుఁ జొరక
పొరుగింటి కేఁగక పరు నాత్మఁ దలపక
కుపిత గాక పరానుకూల గాక
యదువదాఁచక మర్మ మవ్వలఁ జెప్పక
బొంకక నిద్దురపోతు గాక
తే. కాఁపురముసేయు కామినిగలిగెనేని
పలుకులేటికిఁ బురుషుని భాగ్యమహిమ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ప్రాణంబుతో లంకెపాటిది తనసతి
ధనఋణంబుల లంకె తనయుఁ డరయ
సుఖదుఃఖముల లంకె సొరిదిఁ దల్లియుఁ దండ్రి
వారికి లంకెలు భ్రాతలెందు
భువి మానరక్షణంబునకు లంకె మఱంది
మెలఁత నొసఁగ లంకె మేనమామ
మేలు మీఁదటి లంకె మిత్రవర్గం బెల్ల
హర్షంబునకు లంకె యల్లుఁ డెపుడు
తే. వారివారికిఁ దగినట్టి వరుస దెలిసి
యరయ వలయును యజమానుఁడైనవాఁడు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ఇహము సాధించుట యిల గీర్తివడయుట
సర్వంబు దెలియుట చదువుకొనుట
యనుభవించుట భోగమఖిలపూజ్యుండౌట
నిధులుమెట్టుట కార్యనిపుణుఁడౌట
యర్థమార్జించుట యధికుతో సఖుఁడౌట
నుతికెక్కబ్రదుకుట చతురుఁడౌట
పుత్త్రులఁ గాంచుట పుణ్యంబుసేయుట
మురహరుఁ గొలుచుట ముక్తిఁగనుట
తే. యిట్లుమెఱయనిగరజన్మమేమిబ్రాఁతి
సజ్జనులు నేర్తు రీమంచి సరవిఁ దిరుగఁ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. శక్తికిఁ దగనిదుర్జనము సేయఁగరాదు
చదువక తర్కింపఁ జనదు సభల
నేనుఁగుతో వల దేలాట మాడంగ
నెనయనిబాంధవం బెపుడు వలవ
దాయంబులేనివ్యయము చేయనొల్లదు
సోపద్రవపుభూమి నుండఁ జనదు
గడుసరి లోభిని నడుగుట కష్టంబు
దైవంబుమీఁద గ్రోధంబు చెల్ల
తే. దెంత మాత్రంబు తన శక్తి యంతమాత్ర
మరసి యొనరించు నాతండె యర్హుడెందు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ఇల నేటిదరిమ్రాని కెప్పుడు చలనంబు
నరనాథుపొరుగిల్లు నమ్మరాదు
పాముతో నటుపొందు పాటింపఁ గారాదు
దుర్జనసంగతి దూఱుముట్టు
కడఁగిదయ్యముతోడి కాఁపురంబది కీడుఁ
మహిదొంగతోఁ గొల్వుమరణ మొదవుఁ
బరికింప నోడపైబ్రతుకు సందేహంబు
ఘనునితో సరసంబు గాదు జరప
తే. నరసి కానివి వర్జించి యైనపనుల
నరుఁడు వర్ధిల్లవలయు నున్నతివహించి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ఏలికతోడిపా టేమియైనను మేలు
తనయంతనున్న వచ్చినదిమేలు
సజ్జనగోష్ఠి నెచ్చట నిల్చినను మేలు
పరఁగ నందఱతోడి బ్రతుకుమేలు
నిజమాడ నెవ్వరు నిందించినను మేలు
వినయంబు గలుగు జీవనము మేలు
ధరమీఁద నిహపరార్థము చరించినమేలు
చిరపుణ్య మెంత చేసినను మేలు
తే. దుష్టబుద్ధులు మెలఁగెడి త్రోవ వలదు
నియతవర్తన మెలఁగెడి నేర్పరులకు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. మావటీనికిని మై మఱవరా దెప్పుడు
నలయంగఁ గూడదు యాచకునకు
వేగులవానికి వేసట చెల్లదు
జోగికిఁ గాణాచి చోటువలదు
వెలిజాతివానికి వీరు వా రనలేదు
వెట్టివానికిఁ గూలి వేఁడఁ దగదు
జాజరకానికి సంకోచపడరాదు
మొగమోట దూతకుఁ దగవుగాదు
తే. తగిన తమతమవర్తనఁ దగినపాటి
నేర్చినట్లన బ్రతుకుట నీతి యెపుడు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. తనభక్తి నిజమైన దైవంబు మెచ్చును
మన సొక్కటైనను మలయు సుఖము
మాట మంచిదియైన మగువలు వలతురు
సాహసియైన నుత్సాహ మొనరు
బుద్ధి శాశ్వతమైన భువి యెల్లి నేలును
బ్రతుక నేర్చినను శుభంబు లొదవు
సరి నీవి గలిగిన జగమెల్లి వశమౌను
నుద్యోగపరుడైన నొదవు ధనము
తే. చతురుఁ డగువాని కెప్పుడు జగము లోనఁ
జంజరింపక మెలఁగిన సకలజయము
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. నడుమంత్రమా యిది యీకర్మంబు
నేఁటిదా జగము వర్ణించి చూడ
నెంచఁగ వశములా యేండ్లెవ్వరికైన
నుడిగెనా జన్మంబు లొల్ల మనిన
సాలీనిపోగులా సంసారపాశంబు
లల్పమా బ్రహ్మాండ మరసి తెలియ
నీటిపై వ్రాఁతలా నీరజాసను వ్రాత
లెఱిఁగెనా తత్త్వంబు లింతలోన
తే. నెంతవారికిఁ దెలియంగ నెట్లువచ్చు
నీప్రభావంబు లన్నియు నీక కాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. మాంధాతకొనిపోఁడు మహిచేరెడైనను
గొనిపోఁడు రారాజు కొలుచుగొన్ని
నరుఁడు గొంపోవఁడు నవరత్న మొకటైన
శిబి కొనిపోఁడొక్క చిన్నమైనఁ
గొనిపోఁడు ఖచరుండు గోవునొక్కటియైన
వస్త్రంబుగొనుచుఁ బోవఁడు యయాతి
గుఱ్ఱమొక్కటినైనఁ గొనిపోఁడు నహుషుండు
గజముగొంపోవఁ డొక్కటిని సగరుఁ
తే. డింక నేరికి సతములౌ నేల సిరులు
తా నొనర్చిన ధర్మంబె దక్కుఁ గాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. సుఖదుఃఖములఁ నుబ్బు స్రుక్కులఁ బొరయక
వనధికైవడినుండు వాఁడు యోగి
పంచేద్రియముల పాల్పడి చలియింపక
గగనంబువలెనుండు ఘనుఁడు యోగి
యజ్ఞాన రహితుఁ డై యంధకారముఁ బాసి
యాదిత్యువలెనుండు నతఁడు యోగి
పరిపూర్ణుఁ డై యుండి భావింపఁ జోద్యమై
పవనునివలెనుండు బలుఁడు యోగి
తే. బహువిధంబుల నీపాద భక్తిగలిగి
నెదరకుండిన యతఁడెపో సిద్ధ యోగి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. అత్యలసత యెందు నంటనీయఁడు శీలి
గుణములన్నిటిఁ బాపు గోపబుద్ధి
పిసిడితనం బది పిమ్మటఁ దిట్టించు
గడు నహంకారంబు కష్టపఱుచు
ముదిమియెవ్వరికైన ముందుదోపగఁ నీదు
బాల్య ముద్దండతఁ బ్రబలజేయుఁ
ధనకాంక్ష మిక్కిలిదయతోడఁ బెడఁబాపుఁ
జలము కార్యవిచారసరణిఁ జెఱుచు
తే. ఘనులుదలపోసి యిటువంటి గతులుమాని
బ్రతుకుదురు దాము సన్మార్గ పదమునందు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. తగిలి తాఁ జేసినధర్మంబు తలగాఁచు
దైవంబు గొలిచినఁ దన్నుమనుచు
జితకామునితపంబు శీఘ్రమె ఫలియించు
సత్యమెక్కడనైన జయముఁ జూపు
బ్రియవాక్యమందఱఁ బెనచిచుట్టము సేయు
మరితన్నుఁ బొగడించు మంచితనము
కడిగండమణఁగించుఁ గలితాన్నదానంబు
జపము పాతకముల సడలఁ జేయు
తే. నెఱిఁగి నడచిన సిద్ధించునిహముఁ బరము
సులభమిన్నింట నినుగొల్చు సుజనులకును
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. బహుపుణ్యుఁ డగువానిబ్రదుకది మంచిది
మనసు గెల్చినవాని మహిమమేలు
జ్ఞానంబు గలవాని జన్మము సఫలంబు
తప్పుఁజెప్పని వాని తగవు లెస్స
సమబుద్ధి గలవాని చరితంబు సమ్మతి
యుపమరి యగువాని యునికి బాగు
వావి గల్గినవాని వర్తన శుభమిచ్చు
మే లెఱింగిన మెచ్చు మెచ్చు
తే. భువికినిటువంటి మనుజుండు భూషణంబు
గలుగునీకృప నీరీతి ఘనులకెపుడు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. చాడికాఁడగువాఁడు నటలెల్లబోధించు
నందున కొరులపై నలుగవలదు
పాతకుండగువాఁడు పరులను దూషించు
వెఱ్ఱియై తానవి వినఁగ వలదు
వెడదొంగయగువాఁడు విత్తంబు లీవచ్చు
బ్రమసి యాసల నివి పట్టఁ దగదు
మాయావియగువాఁడు మందు మంత్రము నేర్పు
మఱచి తప్పియు నవి మరగవలదు
తే. కర్తయగువాఁడు కపటుల గతులు దెలిసి
యేమఱక రాజ్యమెప్పుడు నేలవలయు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. మోపరియెంతైన మోవ వేసారఁడు
సొరది నాదాయమే చూచుఁ గాని
మహిగృహస్థుం డలమటలకు నోడఁడు
సొలవ కేపనికైనఁ జొచ్చుఁ గాని
కాలరినరుఁడు సుఖంబులఁ గోరఁడు
పరువుచే మే నలవఱుచుఁ గాని
యటమటీఁ డెప్పుడు నల్పులఁ దెగితీయు
నుసరాన దిద్దక జుణుఁగుఁ గాని
తే. కడఁగి వీరల కీయోజఁ గర్మవశము
కర్మములు నిన్నుఁ గొలిచినఁ గాని తెగవు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ఒకఁడు దాఁచినయర్థ మొక్కండు భుజియించు
నొకసతిమగఁడు వేఱొకతె కగును
గాయంబు నిలువదు కడుబ్రహ్మకైనను
జాయగొన్నాళ్ళది జవ్వనంబు
చదివినచదువులు సరి శరీరముతోనె
తలఁపులు మఱచినందనుక నుండుఁ
గులముదారిద్ర్యంబు గొంచెంబుగాఁ జేయు
వలపు వేసట యైన వదలివిఱుగు
తే. నేలబ్రమయంగ నెవ్వరికేది నిజము చెలఁగి
మిముఁ గొల్చు వారిది చెడనిపదవి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. శత్రులమాటలు సతమని నమ్మక
కాంతలకును గుట్టుఁ గాననీక
సమయమ్ముగాండ్రకుఁ జనవు చెల్లింపక
తోడుఁబోతుల నిల్లు ద్రొక్కనీక
ఘనతరద్రోహిఁ గొల్వునకు రానీయక
మొదలువంచకునకు మొగముగాక
పిఱికిఁ బోట్లాటకుఁ బెనపెట్టి కొనితేక
దొరయని హీనునితోడ నగక
తే. వదల కెచ్చరి యుండెడువాఁడు రాజు
జగతి వర్ధిల్లునట్టి విచారపరుఁడు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. మానంబె యెక్కుడు మఱియుఁ బ్రాణముకంటెఁ
దనకీర్తియెక్కుడు ధనముకంటె
సాహసం బెక్కుడు సాముసేయుటకంటెఁ
బంత మెక్కుడు ప్రతాపంబుకంటె
నిలలో నుదారత్వ మెక్కుడు సిరికంటె
బీర మెక్కుడు తనబిరుదు కంటె
సమరంబె యెక్కుడు సంధిమాటలకంటె
ధైర్య మెక్కుడు దొరతనముకంటె
తే. వెలయనిటువంటి గుణముల వీరవరుఁడు
కలఁడు వేయింటి కొక్కడు కడమలేఁడు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. నయకోవిదులు తప్ప నడచిరేనియు వారి
వరుసగా దది కర్మవశముగాని
ధనికులు భోగింపఁ దలఁపఁ జాలమి వారి
బాగుఁ గా దది జన్మఫలముగాని
పుణ్యులు పాపంబుపొంతఁ బోయిన వారి
గతులు గా వవి దైవికములుగాని
సుజనులు లోకనిష్ఠురు లైన నది వారి
జాడ గా దుత్పాతసరణిగాని
తే. యెఱిఁగి నడువంగ వారలయిచ్చగాదు
ధర్మదేవత మెలఁగుచందంబు గాని
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. చెలులసంగడి నున్నఁ జిత్తంబు చలియించుఁ
గనకంబుఁ బొడఁగన్నఁ గడఁగునాస
సురియ చేపట్టిన శూరత్వములు రేఁగు
నీచవర్తనుపొందు నిందకొలుపు
నేలికతో మేల మెప్పుడు విషమించుఁ
బడుచుతో నవ్విన భంగపఱుచు
సభలోనఁ జొచ్చిన సడియెల్లఁ బైకొను
విటులఁ గూడినను వివేక మెడయు
తే. నెఱిఁగి యన్నియు వర్జించి యేకతమున
నిన్నుఁ దలపోయునాతండు నిపుణుఁ డండ్రు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. కొన్నిభూముల నెండ కొన్నిభూములఁ జలి
యొక్కనిమేలు వేఱొకనికీడు
వెలయుఁజుక్కలు రేయి వేగుఁబ్రొద్దునమాయుఁ
గొంతకాలముకల్మి కొంతలేమి
కప్పుమేఘము మింటఁ గడపట బయలౌను
జవ్వనంబగు మేను జదిసి ముదియుఁ
గాయలై యున్నవే కడపటఁ బం డ్లౌను
గడుహీను లధికులై కానిపింతు
తే. రెంచిచూచిన వెనుకముందెటులునుండుఁ
గలగ వలవదు సహజంబు కాలగతులు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. భుజియించి నప్పుడే పోవు నాహారము
ల్పూసినగందంబు పొళ్ళురాలుఁ
గట్టినప్పుడెమాయు ఘనవస్త్రచయములు
ముడిచినప్పుడె వాడు ముడిఁగివిరులు
కలసినప్పుడె విడుఁ గాంతలతోఁ దమి
తొడిగినఁ వ్రేగులై తోఁచు సొమ్ము
లెక్కినఁ గడఁ నలయించు వాహనములు
వసము గానిధనంబు వడ్డి తొడుగు
తే. కలుగనేర్చునె నిత్యసౌఖ్యంబులిందు
నిన్నుఁ గొలిచిన సుఖములు నిలుచుగాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. తనకాప్తులగువారి దండ నుంపఁగఁ గదు
నధికశూరులదండు లంపదగును
మఱి ధనాఢ్యులకును మణివంబు లీఁదగు
హితుల వాకిలి గావ నిడఁగఁదగును
ఘనకార్యపరుల దుర్గములఁ బెట్టఁగఁ దగు
నిపుణుల నుడిగల నిలుపఁదగును
సముచితజ్ఞుల వ్రాయసము వ్రాయుఁడనఁ దగు
మాయావులఁదలార్లఁ జేయఁదగును
తే. మఱచి యల్పులఁ దానమ్మి మనుప వలదు
గరిమధరలెల్ల నేలెడు ఘనున కెపుడు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ఏనుగులా వెంత యిల మావటీఁ డెంత
తిమిరంబుబల మెంత దీప మెంత
ఘనసముద్రం బెంత కర్ణధారకుఁ డెంత
బహుకాననం బెంత పరశు వెంత
పాఱెడునీ రెంత పర్వతంబది యెంత
హరుఁ డెంత మృదులపుష్పాస్త్ర మెంత
భీకరఫణి యెంత వాకట్టువే రెంత
బహురాజ్య మెంత భూపాలుఁ డెంత
తే. యెవ్వరికి దొడ్డుకొంచెంబు లెంచరాదు
నడుచు నిటువంటి వెల్ల నీనాటకములు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. సరసులు పంతము ల్సభలోన నాడరు
వీఁగరు రణమున వీరవరులు
కలఁగ రేపట్టున ఘనవివేకులు మదిఁ
దప్పరు నీతి యుత్తములు పనులఁ
దలఁపరు పాపము ల్ధన్యులు గలనైన
నలయ రాచారంబునందు బుధులు
నిందింప రొరులను నిపుణులు వాక్రుచ్చి
తలఁపరు పరులకాంతల సుజనులు
తే. వదల రెప్పుడుఁ దమయిలువరుస గుణము
వసుధ వీరలు నీప్రభావంబుకతన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. పేలెన్ని పుట్టినఁఁ బెద్దగా బ్రదుకవు
చీమలు పొడమి నశించిపోవుఁ
జెదలు పుట్టలు వెట్టి శీఘ్రమె యడఁగును
మిడుతలు వైళమె మించి మడియు
నీఁగలు వడి మూఁగు నీడేఱ వెంతైన
నల్లులు జనియించి నలిసిపోవు
దోమ లుద్భవ మంది తోడనే పొలియును
గణుఁదుర్లు తుట్టలుగట్టి సమయుఁ
తే. బరఁగ నీరీతి దుర్జను ల్ప్రబలు లైనఁ
బరులఁ బీడించి చెడుదురు పాపములను
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. మలసి యేఁటేఁటఁ బల్మఱును గూనలఁ బెట్టుఁ
గంటిమా ధరఁబిల్లికదుపు నొకటిఁ
బాము గ్రుడ్లనుబెట్టుఁ బదియు నిర్వదియును
బ్రదికెనా భూమిపైఁ బౌఁజులగుచు
బులులు పిల్లల నీనుఁ బొసఁగనాల్గును నైదు
నున్నవా మందలై యుర్వియందు
మకరంబు లెన్నైన మడుగులోఁ బుట్టు
నెగడెనా గుంపులై నేలమీఁదఁ
తే. గ్రూరసంతతి వెలయునే కొంచెపడక
విరివిగా ధర్మసంతతి వెలసినట్లు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. పెంచంగఁ బెరిఁగెనా పృథివిపైఁ గొండలు
విత్తిరా యడవుల వివిధగతులఁ
గాలువ ల్వెట్టిరా ఘనసముద్రములకు
నేతంబు లెత్తిరా యేఱులకును
మేఁతలు వెట్టిరా మృగముల కెందైన
మఱి యీఁత నేర్పిరా మత్స్యములకుఁ
బెండ్లిండ్లు సేసిరా బెరయంగఁ బక్షులఁ
బూసిరా వాసనఁ బుష్పములకుఁ
తే. నెవ్వరెవ్వరిఁ బోషించి రెంచి చూడఁ
దలప నీదైన రక్షకత్వమునఁ గాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. అధముని మొఱయైన నాలకించుట యొప్పు
వినకున్న నానాజ్ఞ విఫలమగును
మెట్టి చూచుట యొప్పు మితిలేని రాజ్యంబుఁ
బోకున్న నలజడిఁ బొందుచుండుఁ
దనసొమ్ము పలుమాఱుఁదలఁచి కన్గొనుఁటొప్పుఁ
గాకున్నఁ దెలియదు కలిమిలేమి
కలయు టొప్పును గులకాంతల వరుసతో
మానినఁ బాపంబు తోన కలుగు
తే. మత్తుఁడై యున్నఁ గార్యంబు మట్టుపడదు
వలసియొల్లమి సేయఁగ వలదు పతికి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. పతిసేయు కార్యంబు భటులచేఁ గూడదు
భటుల కృత్యంబు భూపతికిఁ దగదు
మగనిస్వతంత్రంబు మగువకుఁ జెల్లదు
మెలఁత విధంబు పెన్మిటికి వలదు
మంత్రియెన్నండు సామాన్యుఁడుండఁగ రాదు
సామాన్యుగతి నుండజనదు మంత్రి
కరణంబుతోఁ బగ కాఁపువానికిఁ గాదు
కాఁపుతోఁ బగ గాదు కరణమునకు
తే. నధికకృత్యంబు లధమునకమరవెందు
నధమకృత్యంబు లధికున కమరవెందు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. పదుగు రాడినమాట పాటియై ధరఁ జెల్లు
నొక్క డాడినమాట యెక్కదెందు
నుఱక యుండినవాని కూరెల్ల నోపదు
నిజముముందఱఁ గల్ల నిలువ దెపుడు
చేసినచేఁత దాఁచినను బుట్టకపోదు
దేవతలకు నైనఁ దీఱ దాస
రాజు చేసినది ధర్మంబై ప్రవర్తిల్లుఁ
గపటాత్ముతోఁ బొందు కడకుఁ గీడు
తే. పుడమిలోకులు మెచ్చంగ నడవవలయుఁ
జలముసాధింపఁ జెల్లదు సభలలోన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. పరువంబు మీఱిన బహుపుష్పజాతులు
పదను దీసినయట్టి పరిమళంబు
నలువదియేండ్లపై నరసినవనితలు
పొంతఁ జల్లాఱిన భోజనంబు
మిగులఁ బెక్కుదుకూలమీఁదిటి వస్త్రంబు
వెలయఁ దొంబదియేండ్ల వృద్ధగజము
ప్రాఁతపంచారమై పరఁగెడుగుఱ్ఱంబు
వెసఁ గార మెడలిన వీడెములును
తే. ఘనునకవియెల్ల భోగయోగ్యములు గావు
... ... ... ...
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. నిర్మలు నొకధూర్తు నిందించుఁ గాకేమి
త్రోవలఁ గూయదే తొఱ్ఱఁ బులుఁగు
అధముండు సత్కవియండ నుండినయేమి
దొరలదే విరులలోఁ దుంగపోఁచ
కడఁగి యల్పుఁడు ఘనుఁ గారించుఁ గాకేమి
కఱవదే యొక దోమ గంధగజము
దొరతోడ నీచుండు దొడరఁ జూచిన నేమి
ప్రాకదే బలుమేడ బల్లిపిల్ల
తే. యీడుగాకున్న పనులవి యేలయెంచ
నందునకు నేమి తారతమ్యములు లేవె
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. దుష్టు సూర్యునిదెస దుమ్మెత్తి చల్లినఁ
దనపైనె పడుఁగాక దాని కేమి
కొండతోఁ దగరు డీకొని యెంతతాఁకినఁ
దలవ్రక్కలగుఁ గాక దాని కేమి
మిడుతలు చిచ్చుపై వడి నెంతయెగసినఁ
దామె పొక్కెడుఁగాక దాని కేమి
వలఁ బడ్డ మీ నెంతవడిదాఁక బొరలినఁ
దనుఁ జుట్టుకొనుఁగాక దాని కేమి
తే. యెదిరిసత్త్వంబు తనసత్త్వమెఱుఁగలేక
పోరువాఁడెందు నవివేక బుద్ధియండ్రు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. చెలఁగి యొక్కనిఁ జెఱచినవానిబ్రతుకును
గ్రూరుఁడై బలిమిఁ జేకొన్న పెండ్లి
కల్లలు పచరించి గడియించిన ధనంబు
దూఱులఁ బడునట్టి దొరతనంబుఁ
గపటవృత్తికిఁ జొచ్చి కైకొన్న రాజ్యంబు
దయలేక యుండెడు తపసితపము
నాసతోఁ గైకొన్న యట్టి సన్న్యాసంబుఁ
గపటాత్ము దేవాధికారవృత్తి
తే. మనుపనెంతైన నేరదు మరలి మరలి
తొలఁగనీయక దుర్గతిఁద్రోచుఁగాని
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ఎలమిఁ బతివ్రత నెవ్వండుగోరినఁ
జెదలంటునే నిప్పుసీమలోన
ఘనజితేంద్రియుని నేకాంత డగ్గఱినను
గలుఁగునే జలరాశి కప్పచేత
ధర్మవర్తనుని బాతకు లేమఱించిన
నేఱునిద్రించునే యెందునైన
ధీరాత్ము నితరుండు తెమలింపఁ గడఁగిన
గాలి యొక్కనిచేతఁ గట్టువడునె
తే. యెందునను ధార్మికులకుఁ గీడేల కలుగు
నిజగుణంబులు బలిమిమై నిలుచుఁగాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. పుచ్చకాయలు దిన్నఁ బోయెడిమంత్రంబు
లిచ్చునే ఫలము లెందేరి కైనఁ
గడప దాఁటఁగ లేనిబడుగైన గుఱ్ఱంబు
లెక్కునే పౌఁజుపై నెందునైన
నాఁకలి యుడుపనియట్టి యాహారంబు
బలియించునే మేను పటువుగాను
దగ విరజానది దాఁటనిదేవర
లొసఁగుదురే మోక్ష మూరకైన
తే. ధరణి నన్నిటి సామర్థ్య మరసిచూచి
బలువుగలవెల్లఁ జేపట్టి వెలయవలయు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. జీలువు పెరిఁగిన మాలెకంబము గాదు
గొడ్డుఁ బెంచినఁ బాఁడిగోవు గాదు
ధరఁ బంచితం బెంత ద్రచ్చిన నేయిగా
దెండమావులును నీళ్ళెపుడు గావు
పరఁగ నుల్కలు నూఱు బండిమోకిలఁ గాదు
కూరయెంతైనను గూడుగాదు
ఎనుపోతు ఘనమైన నెద్దుతో సరిగాదు
కడు నశుద్ధపు వాఁగు గంగ గాదు
తొండంబు గలిగిన దోమ యేనుఁగు గాదు
కోడి కోయిల గాదు కూత లిడినఁ
తే. బ్రబలి చూపట్టినవి యెల్లఁ బనికి రావు
ధీరుఁడగు నాతఁ డొక్కఁడే వీరుఁడరయ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. గోడపై సున్నంబు గోఁకినఁ బనికిరా వా
దొడలిపై వాసన యూర్చ రాదు
చేతఁ బట్టినయట్టిజిడ్డు లెక్కకు రాదు
కోకఁ బెట్టినగంజి కూర్పరాదు
విసనకఱ్ఱలవన్నె విడిచిన నిల్వదు
బచ్చెనగచ్చు చొప్పడదు తివియ
ముగ్గు వెట్టినపిండి మొనని యట్లకు రాదు
మీసలపైఁ దేనె మ్రింగ రాదు
తే. చూడఁ జూపట్టుసిరులెల్ల జూబులగుచుఁ
గొలఁదివెట్టినఁ దొంటిబాగులకురావు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. కనకంబు పెంపొక్కగతి గానె భావించి
కామంబు క్రోధంబు గట్టపెట్టి
తిట్టినతిట్టులు దీవనల్గా విని
యలశత్రు మిత్రుఁ గా నాత్మఁ దలఁచి
యట భూమి హేమపర్యంకంబుగాఁ బండి
భిక్షాన్నతృప్తిమైఁ బెంపు మిగిలి
కాషాయ వస్త్రంబు కౌశేయముగఁ గట్టి
నిరతబ్రహ్మధ్యాననిరతుఁ డగుచు
తే. నేకతంబున మౌనియై యిలఁ జరించు
నతఁడు సన్న్యాసియని యెంచనర్హుఁ డగును
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. బలుమాలవాడలో బాఁపనిల్లుండునే
నిర్దయులో నేల నిలుచుఁ గరుణ
కప్పకా టెందును గల దని వింటిమే
పిఱికివానికి నేల బిరుదు గలుగు
బొగ్గునం దైలంబు పుట్టంగ నేర్చునే
యిలమీఁద మోడు సిగ్గేల తలఁచుఁ
గెరలింప రాతికి గిలిగింత గలుగునే
కఠినచిత్తుం డేల కరఁగ నేర్చుఁ
తే. గలరు మఱి యిట్టివారలు కష్టజనులు
స్రవిఁ దప్పింపవచ్చునే జన్మఫలము
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. గాడిద యెఱుఁగదు గందంబువాసన
లే దూరఁబందికి లీల రోఁత
వాడకోడికి నాదివారంబు వలవదు
గ్రోఁతికి మఱి తాళిగోణమేల
చిఱుతని కేటికి శీలవంతులయున్కి
యెద్దడుకులచవి యెఱుఁగలేదు
వరుసతోఁ గుక్క దేవరబోన మెఱుఁగదు
మొసలికిఁ బడిసెంబు మొదల లేదు
తే. సహజమూఢులు నిటువంటిజాడవారె
వానిగుణములు దిద్దంగ వలవ దెపుడు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. పోలించి దయ్యంబు పుణ్యంబు లెంచునే
భయపడ్డవారలఁ బట్టుగాఁక
పాఱునే జేతచేఁ బడి దంచనపుగుండు
తనసూటిఁ దప్పక తాఁకుఁగాక
చి చ్చెంతఁ బోయిన సింగార మెంచునే
తనగాలివైపున దాఁటుఁగాక
తొలుకరివానలు దొరతనం బెంచునే
తగిలి బయట నున్నఁ దడుపుఁ గాక
తే. నీవు నెఱపిన మహిమలే నిఖిలమెల్ల
నట్లు గావలె నప్పటి కట్లయుండు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. మచ్చరించినవాఁడు మంచి మాటాడిన
వెంగె మైతోఁచును వెగటుపోవ
దపనమ్మి కైనవాఁ డటు దుడ్డు వట్టిన
మందుఁడందురుగాని మనసు గొల్ప
దొడఁబాటు గానవాఁ డూరక మ్రొక్కిన
సందేహపడుఁ గాని సహజమెంచఁ
డనుమాన మైనవాఁ డర్థంబు లిచ్చిన
వళుకుఁగా నెంచు విశ్వాసపడఁడు
తే. ఏమి చేసినఁ గపటికి హితవుగాదు
మాఱు మలసినఁ బనులెల్ల మట్టుబడును
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. అపవాది యగువాని నటుచంప వలవదు
తా నాడుకల్లలే తన్నుఁ జెఱచుఁ
సర్వకంటకు నెందు సాధింప వలవదు
వసుధవారలగోడు వానిఁ జెఱుచు
నతిమూర్ఖుఁ డగువాని నదలింప వలవదు
తనలోనికోపమే తన్నుఁ జెఱుచుఁ
గడునహంకారిని గా దనవలవదు
మేనిపైగర్వంబె మిగులఁ జెఱుచుఁ
తే. జెప్పవలవదు బుద్ధు లీచెనఁటులకును
సత్యవిదులకు ధర్మమే జయముగాన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. కామినీరతుల లోకమువారు నమ్మరు
పతితుల విడుతురు బంధుజనులు
గుణవిహీనుని వివేకులు మెచ్చ రింతైన
వేడబో రర్థులు విగతయశుల
హింసాపరులతోడ నెనయరు సాధువు
ల్పురుషాధములపొంత బోరు బుధులు
విద్యారహితులను విద్వాంసు లొరయరు
నృపులు చేపట్టరు చపలమతుల
తే. నుర్విమీదట నుత్తము లొక్కరాశి
యథము లొకరాశియౌ గాదెయరసిచూడ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. కోరి దవ్వుల జూడ గొండలు నున్నన
చేరి డగ్గఱినను జెట్లు రాళ్ళు
బూరుగు ఫలవేళఁ బుట్టించు నాసల
నెక్కి కోసినఁ బండ్లనెగయుదూది
మిడుగుఱుఁ బురుగులు మెఱుఁగులైయుండును
గరఁచిచూచినను బంగారుగాదు
కప్పచిప్పలు వెండికరణిఁ గాంతులు మించుఁ
బుటము వెట్టించిన బూది చిక్కు
తే. నెదుటివారలసంపద లెన్నియైన
నడుగఁ బోయిన ఫలియింప వధములకును
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. అపవిత్రమగునట్టి యన్నంబు గొనుకంటె
నడవిలోఁ దినుబలుసాకు లెస్స
హితశత్రువై యలయించు చుట్టముకంటెఁ
గైవసం బగుశునకంబు లెస్స
బహుదుర్గతులఁ ద్రోచు పరధనముకంటెఁ
న్యాయార్జితము తారమైన లెస్స
యపకీర్తిభాజనంబగు భోగములకంటెఁ
జిత్తంబులో నాత్మచింత లెస్స
తే. సజ్జనులుమెత్తు రిటువంటిసరవు లెల్లఁ
దక్కినవియెల్ల రుచులగుఁ దామసులకు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. భూమియే దేహంబు పోలించిచూచిన
రాజుప్రాణంబు శౌర్యంబు శిరము
గడియించినధనంబు ఘనతరాయుష్యంబు
మతి సత్ప్రధాని ధర్మంబు జోడు
కరచరణాదులు కరితురంగంబులు
ఘనవిచారమునీతి కరుణదేవి
బలు పైనదుర్గము ల్పంచేద్రియంబులు
సరవిఁ జైతన్యంబు సర్వబలము
తే. కాలపురుషుండవై నీవుఘటనమెఱసి
చేయుచుండుదు రాజ్యంబు చెలగిచెలగి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ఇచ్చకం బాడిన హిత మౌను విభునికి
మఱి దిసంతడచిన మనసు విఱుగు
నొదిగివర్తించిన నొడబడి దయపుట్టు
బంతంబు మెఱసిన బగలు రేగు
నోర్పుతో గొలిచిన నొసగజూచు ధనంబు
లడుగగోరిన వేసటగును మిగుల
దలపుతో మెలగిన వెలయు సంతోషంబు
లెరవెరవై యున్న నెడయుభక్తి
తే. మంత్రియగువాడు కార్యక్రమముననిట్లు
తెలిసి నడచిన శుభములు తేటపడును
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. అడుసు చేతుల దివియగవచ్చు నొకవేళ
బలిసి యెండిన గడ్డపాఱ వలయు
నాకటివేళనే యన్నంబు రుచియగు
దనిసిన నోకిలింతలు గడంగు
తతితోడ విత్తిన దఱచుగా బండు జే
నెప్పుడైన విత్తిన నీచబోవు
బంటు నాయావేళఁ బనిగొనవలె గాని
యలవాటు దప్పిన నడచిపడును
తే. వేళవేళల గార్యము ల్వెలయజేయు
వలయు నొకయింత దప్పిన వశము గావు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. అడవిలోపలిరాజ్య మదియొల్ల మనరాదు
బలువుఁడు పైకొన్న బాధసేయుఁ
గ్రూరవర్తనునైన గూర్చియేలుటదగుఁ
బగఱగూడిన వాడుభయమొనర్చు
గడినున్నవానితోఁ దొడరుచుండుట యొప్పు
నూరకుండిన నతండొత్త జూచు
బలుమాఱు బంటుల బౌజు జూచుట మేలు
గర్వింతురిటువలె గాకయున్న
తే. నృపుల కేమఱి యుండుట నీతిగాదు
బహువిధంబుల నెచ్చరి బ్రతుకవలయు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. దానపాత్రుల కిచ్చుద్రవ్యంబు ఫలియించు
విటుల కొసంగిన విఫలమగును
మంత్రపూతాగ్ని హోమము తన్ను రక్షించు
బూడిదలో వేల్మి పున్నె మీదు
కాలోచితం బగుకర్మ మీడేఱించు
వేళదప్పినసంధ్య విధికి వెలితి
యొరులకునుపకార మొనరింప శుభమిచ్చు
బరపీడ చేసిన నరక మొదవు
తే. నెఱిగిచేసిన ధర్మంబు లెపుడు మనుపు
నెఱుక మాలినకృత్యంబు లేమిబ్రాతి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. హితబుద్ధి నడుగుమహీశుండు గల్గిన
దెలివి బోధించుమంత్రియును గలుగు
వెఱ పేమియును లేనివీరుండు గలిసిన
దగుపరివారంబు దానె కలుగు
బొందు సేయగ నేర్చు పురుషుండు గలిగిన
ఘనుడైన చెలికాడు గలిగియుండు
ఘనరసస్థితి యెఱిగినవాడు గలిగిన
గడు మెచ్చ జెప్పెడు కవియు గలుగు
తే. వేసరక మంచివారిని వేడవలయు
దలచి చూచిన నివియెల్ల దైవఘటన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. తొల్లి పెట్టనిమేలు తొరలి యిప్పుడు రాదు
కావలసినపను ల్గాక పోవు
చేసినకర్మంబు చెందక మానదు
రాగలయర్థంబు రాకపోదు
దైవసంకల్పంబు తప్ప దెంతైనను
దనువికారంబులు తగులు నెపుడు
లోకధర్మమునకు లోనుగా మనరాదు
తగిన భోగంబులు తామె కలుగు
తే. వేగిరింపఁగ వలవదు విమలమతికి
సకలమున కోర్చియుండిన సౌఖ్యమొదవు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. నిక్కంబువలె నుండు నిండుసంసారంబు
మొలచినయట్లుండు మంచిసిరులు
కాయంబుదక్కినగతి నుండు దలపోయ
దనది యైనట్లుండు నొనరిగృహము
సతములైనట్లుండు సరసాన్న పానము
ల్పాయనియట్లుండు బాంధవంబు
లమరినట్లుండుదు రట బుత్త్రపౌత్రులు చేఁ
జిక్కినట్లుండుఁ జిత్తమెపుడు
తే. నింద్రజాలంబొ స్వప్నంబొ యిదియునొక్క
సిద్ధవిద్యయొ కంటి నీ చేతలెల్ల
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ధరలోన నావులు తమదూడలకునెల్ల
బెట్టెనా వాములు ప్రియముతోడ
బొక్కలు త్రవ్విచ్చి పోయెనా నక్కలు
తమపిల్లలకు నిరంతము నుండ
దలచి దప్పిక నీళ్ళుత్రావ గూనలకును
గట్టెనా చెఱువులు కప్పలెల్ల
బ్రియముతో రతిసల్పి బిడ్డల గనుమని
చెప్పెనా సింహంబు శిశువులకును
తే. వట్టిభ్రమతల దమపుత్రవర్గమునకు
దల్లిదండ్రులు దలతురు ధనముగూర్ప
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ముదిమి తీగెలువాఱి ముంచినకైవడి
గడు మేన నరములు గానిపించు
దనమేను గనుగొని తానె నవ్వెడుక్రియ
మీసలు గడ్డంబు మిగుల నరయుఁ
బంచేంద్రియములకు బరగనోడితి నని
వెన్నుచూపినరీతి వీపు వంగు
నుప్పతిల్లినమద ముబ్బు దీసినరీతి
నేర్పెడు బుడువులై యెమ్ము లెల్ల
తే. నిట్టిజరచేత జిక్కియు నెడ్డెనరుడు
మనసుదనియక భోగించు మనసువెట్టి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. కల్పవృక్షమునెంచి కలివెచె ట్టెంచుట
తర మెఱుంగనివారి తగవుగాక
కావేరినది నెంచి కాలువ లెంచుట
పురుషుల యవివేక బుద్ధి గాక
కౌస్తుభమణి నెంచి కాచంబు నెంచుట
జడుల యజ్ఞానంపుసరవిగాక
మందరాచల మెంచి మఱితిప్ప లెంచుట
తప్పు దెల్పినవారి తగవుగాక
తే. ఘనుల నల్పుల నీరీతి గలయ గూర్చి
పలుకుచుండెడి వారల భ్రాంతిగాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. సత్సంప్రదాయుడై శాస్త్రపారీణుడై
యాగమజ్ఞుం డైనయతడు గురుడు
పరమదయాళుడై పాపనిర్ముక్తుడై
యాచారవంతు డౌనతడు గురుడు
భూరిసుజ్ఞానియై బోధింపశక్తుడై
యతిశాంత చిత్తుడౌనతడు గురుడు
కడు దపోనిష్ఠుడై ఘనమంత్రసిద్ధుడై
యాధ్యాత్మవేత్తయౌనతడు గురుడు
తే. తెలిసి యిటువంటిగురు జేరివెలయవలయు
సుజనులగువార లీడేఱ జూచిరేని
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. అర్థంబు దేహంబు నాచార్యుసొమ్మని
యా నాజ్ఞ దప్పక యాస్థ గలిగి
తగిన శుశ్రూషకు దను వలవడజేసి
మతి గల్గి యేప్రొద్దు మఱపు విడిచి
యుపదేశ మిచ్చి నట్లూహలం దలపోసి
యాహారనిద్రల కాసపడక
వేసర కాత్మలో విశ్వాస మెడలక
హరిభక్తి గురుభక్తినధికు డగుచు
తే. నున్నయాతండె శిష్యుడి ట్లుర్విమీద
బరగుశుభమూర్తి యతిలోకపావనుండు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. దైవంబు గురుఁడును ధరఁ గల రని నమ్మి
తలపోసి మనుట యుత్తమమతంబు
కలగు వేదము ముక్తిగలదు పుణ్యుల కని
మఱి భక్తిసేయుట మంచిమతము
యజ్ఞాదికర్మంబు లఖిలప్రపంచంబు
సత్యంబు లనుట నిశ్చలమతంబు
హరి మాయచేఁ జిక్కఁ డాతఁడే సర్వజ్ఞుఁ
డని భజియించుట యాదిమతము
తే. చదివి తెలిసిన పెద్దలసమ్ముఖమున
నెఱుఁగువారికి సఫల మౌ నీమతంబు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. ఆఁకలివహి మౌని యై యుండనిచ్చునే
పిండియైనను దినిపించుఁ గాక
శీతోష్ణములు కడుసిగ్గుతో నిల్పునే
ప్రేమఁ గంబళముఁ గప్పించుఁగాక
సరసకామము బ్రహ్మచర్యంబు నిల్పునే
పొంచి యొక్కతెఁ దగిలించుఁగాక
కోరి యాసలు మంచిగుణములు నేర్పునే
పాపచర్యకు నొడఁబఱుచుగాక
తే. యెంతవారికిఁ బంతంబు లెట్లు జరగు
మీకు శరణని బ్రతుకుటే మిగుల నేర్పు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. కుశలుఁడై ప్రతిమఁ జేకొని తీర్పనగుఁ గాని
తనరూపు చక్క దిద్దంగరాదు
మగువల వలపింప మందు గలదు గాని
మఱి దుర్గుణము మాన్ప మందు లేదు
క్రొత్తగా నొకజన్మ మెత్తఁగ దగుఁగాని
మహిఁ బూర్వదేహంబు మగిడిరాదు
కొలుచులు కృషిసేసి కూర్పఁబన్పడుఁగాని
భుజియించినవి గాదెఁ బోయరాదు
తే. దైవకృత్యంబు లివియేల తప్పనిచ్చుఁ
నుఱకలోకులు భ్రాంతి సేయుదురుగాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. సరకులు గొనవచ్చు సాధించి తేవచ్చుఁ
గోరి సుజ్ఞానంబు గొనఁగరాదు
తపము సేయఁగవచ్చు ధనముఁ జేకొనవచ్చు
భువి నగ్రజన్ముఁడై పుట్టరాదు
కాశికిఁ బోవచ్చుఁ గ్రమ్మఱి రావచ్చుఁ
దెలిసి సుషుమ్న భేదింపరాదు
మౌని గావచ్చు నేమములు చూపఁగవచ్చుఁ
బాఱెడుమనసు నిల్పంగరాదు
తే. నేర్పు లేగతి నెవ్వరు నేర్చిరైన
సరవితో బ్రహ్మవేత్తల సరికి రారు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. కాంచనపాదము ల్గజ్జెలు నందియ
ల్గడు మించుమొలఁ జంద్రకావిదట్టి
పీతాంబరముమీఁదఁ బిల్లలమొలనూలు
బిగియించి కట్టిన పెనుకటారి
వరదానకరము నుజ్జ్వలకటిహస్తంబు
పటుశంఖచక్రోరుబాహుయుగము
నొఱపైననాభియు నుదరబంధ మురంబు
నలమేలుమంగతో హారములును
తే. శిరసుమకుటంబు తిరుమణి చిత్రమకర
కుండలమ్ములుఁ గలమిమ్ముఁ గోరితలఁతు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
సీ. మాధవ గోవింద మధుసూదనాచ్యుత
వామన ప్రద్యుమ్న వాసుదేవ
కృష్ణ దామోదర కేశవ శ్రీధర
హరి విష్ణు పురుషోత్తమా నిరుద్ధ
సంకర్షణాధోక్షజ త్రివిక్రమ పద్మ
నాభ జనార్దన నారసింహ
శౌరి హృషీకేశ నారాయణోపేంద్ర
తాలాంకముఖనామ తాళ్ళపాక
తే. యన్నయాచార్యసుత తిమ్మయాహ్వయుండఁ
బ్రణుతిఁ జేసితి రహిఁ గొమ్ము పద్యశతము
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ
విమల రవికోటిసంకాశ వేంకటేశ.
వనరులు
[మార్చు]