కృష్ణ శతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శతకం:

శ్రీ రుక్మిణీశ కేశవ

నారద సంగీత లోల నగధర శౌరీ

ద్వారక నిలయ జనార్ధన

కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా||1||


నీవే తల్లివి దండ్రివి

నీవే నా తోడునీడ నీవే సఖుడౌ

నీవే గురుడవు దైవము

నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా||2||


నారాయణ పరమేశ్వర

ధారాధర నీలదేహ దానవ వైరీ

క్షీరాబ్ధిశయన యదుకుల

వీరా ననుగావు కరుణ వెలయగ కృష్ణా||3||


హరి యను రెండక్షరములు

హరియించును పాతకముల నంబుజనాభా

హరి నీ నామ మహాత్మ్యము

హరి హరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా||4||


క్రూరాత్ముడజామీళుఁడు

నారాయణ యనుచు నాత్మనందను బిలువన్

ఏ రీతి నేలుకొంటివి

యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా||5||


చిలుక నొక రమ఩ణి ముద్దులు

చిలుకను శ్రీరామయనుచు శ్రీపతి పేరుం

బిలిచిన మోక్షము నిచ్చితివ

వలరగ మిము దలఁచు జనులకరుదా కృష్ణా||6||


అకౄరవరద! మాధవ!

చక్రాయుధ! ఖడ్గపాణి! శార్జ్గ్ని! ముకుందా!

శక్రాది దివిజ సన్నుత!

శుక్రార్చిత! నన్ను గరుణ జూడుము కృష్ణా!||7||


నందుని ముద్దుల పట్టిని

మందరగిరిధరుని హరిని మాధవు విష్ణున్

సుందరరూపుని మునిగణ

వందితు నిను దలంతు భక్తవత్సల! కృష్ణా!||8||


ఓ కారుణ్య పయోనిధీ!

నా కాధారంబ వగుచు నయముగ బ్రోవన్

నాకేల ఇతర చింతలు

నాకాధిప వినుత! లోకనాయక కృష్ణా!||9||


వేదంబులు గననేరని

యాది పరబ్రహ్మమూర్తి యనఘ! మురారీ;

నా దిక్కు జూచి కావుము

నీ దిక్కే నమ్మినాను నిజముగ కృష్ణా!||10||


పదునాలుగు భువనంబులు

కుదురుగ నీ కుక్షి నిల్పుకుని నేర్పరివై

విదితంబుగ నా దేవకి

యుదరములో నెట్టు లొదిగి యుంటివి కృష్ణా! ||11||


అష్టమి రోహిణి ప్రొద్దున

నష్టమ గర్భమునఁ బుట్టి యా దేవకికిన్

దుష్టునిఁ గంసు వధింపవె

సృష్టి ప్రతిపాలనంబు సేయఁగ కృష్ణా! ||12||


అల్ల జగన్నాథుకు రే

పల్లియ క్రీడార్థ మయ్యెఁ బరమాత్మునకున్

గొల్ల సతి యా యశోదయుఁ

తల్లియునై చన్నుఁ గుడిపెఁ దనరగ కృష్ణా! ||13||


అందెలు గజ్జెలు మ్రోయఁగఁ

జిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా

నందునిసతి యా గోపిక

ముందఱ నాడుదువు మిగుల ముఱియుచు కృష్ణా! ||14||


హరిచందనంబు మేనునఁ

గర మొప్పెడు హస్తములను గంకణరవముల్

ఉరమున రత్నము మెఱయఁగ

పరఁగితివో నీవు బాలప్రాయము కృష్ణా ||15||


పాణి తలంబున వెన్నయు

వేణీమూలంబునందు వెలయఁగఁ బింఛం

బాణీముత్యము ముక్కున

జాణువునై దాల్తు శేషశాయివి కృష్ణా! ||16||


మడుఁగుకుఁ జని కాళింగుని

పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెలయం

గడు వేడుకతో నాడెడు

నడుగులు నే మదిని దాల్తు నచ్యుత! కృష్ణా! ||17||


బృందావనమున బ్రహ్మా

నందార్భకమూర్తి వేణు నాదము నీవున్

మందార మూలమున గో

విందా! పూరింతు వౌర! వేడుక కృష్ణా! ||18||


వారిజనేత్రలు యమునా

వారిని జలకంబు లాడ వచ్చిన నీవుం

జీరలు మ్రుచిలి తెచ్చితి

నేరుపురా యిదియు నీకు నీతియె కృష్ణా! ||19||


దేవేంద్రుఁ డలుకతోడను

వావిరిగా ఱాళ్లవాన వడిఁ గురియింపన్

గోవర్థనగిరి యెత్తితి

గోవుల గోపకులఁ గాచు కొరకై కృష్ణా! ||20||


అండజవాహన! విను బ్ర

హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీవున్

గొండల నెత్తితి వందురు

కొండికపని గాక దొడ్డ కొండా! కృష్ణా! ||21||


అంసాలంబితకుండల!

కంసాంతక! నీవు ద్వారకాపురిలోనన్

సంసారిరీతి నుంటివి.

సంసాదిక వైరి! సత్ప్రశంసిత! కృష్ణా! ||22||


పదియాఱు వేల నూర్వురు

సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్

విదితంబుగ బహురూపుల

వదలక భోగింతు వౌర! వసుధను కృష్ణా! ||23||


అంగన పసుపున దోవతి

కొంగున నటుకులను ముడిచి కొనివచ్చిన యా

సంగతి విని దయ నొసఁగితి

రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా! ||24||


హా వసుదేవకుమారక!

కావుము నా మానమనుచుఁ గామిని వేఁడన్

ఆ వనజాక్షికి నిచ్చితి

శ్రీవర! యక్షయ మటంచుఁ జీరలు కృష్ణా! ||25||


శుభ్ర మగు పాంచజన్యము

నభ్రంకషపగిది మ్రోవ నాహవ భూమిన్

విభ్రము లగు దనుజసుతా

గర్భంబులు పగులఁజేయు ఘనుఁడవు కృష్ణా! ||26||


జయమును విజయున కీయవె

హయముల ములుగోల మోపి యదలించి మహా

రయమున ఱొప్పవె తేరును

భయమున రిపుసేన విఱిగి పాఱగ! కృష్ణా! ||27||


దుర్జనులగు నృపసంఘము

నిర్జింపఁగ వలసి నీవు నిఖిలాధారా!

దుర్జనుల సంహరింపను

నర్జునునకుఁ బ్రేమ సారథైతివి కృష్ణా! ||28||


శక్రసుతుఁ గారుకొఱకై

చక్రముఁ జేఁబట్టి భీష్ముఁ జంపఁగఁ జను నీ

విక్రమ మేమని పొగడుదు

నక్రగ్రహ! సర్వలోక నాయక కృష్ణా! ||29||


దివిజేంద్రసుతునిఁ జంపియు

రవిసుతు రక్షించినావు రఘురాముఁడవై

దివిజేంద్ర సుతుని గాచియు

రవిసుతుఁ బరిమార్చి తౌర! రణమున కృష్ణా! ||30||


దుర్భర బాణము రాఁగా

గర్భములోనుండి యభవ! గావుమటన్నన్

నిర్భర కృప రక్షించితి

వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా! ||31||


గిరులందు మేరు వౌదువు

సురలందున నింద్రుఁడౌదు చుక్కలలోనన్

బరమాత్మ! చంద్రుఁడౌదువు,

నరులందున నృపతివౌదు నయముగ కృష్ణా! ||32||


చుక్కల నెన్నగ వచ్చును

గ్రక్కున భూ రేణువులను గణుతింపనగున్

జొక్కపు నీ గుణజాలము

నక్కజ మగు లెక్కబెట్ట నజునకు కృష్ణా! ||33||


కుక్షిని నఖిల జగంబులు

నిక్షేపముఁజేసి ప్రళయ నీరధి నడుమన్

రక్షక! వటపత్రముపై

దక్షతఁ బవళించినట్టి ధన్యుఁడ కృష్ణా! ||34||


విశ్వోత్పత్తికి బ్రహ్మవు

విశ్వము రక్షింపఁదలఁచి విష్ణుఁడ వనగా

విశ్వముఁ జెఱుపను హరుఁడవు

విశ్వాత్మక! నీవె యగుచు వెలయుదు కృష్ణా! ||35||


అగణిత వైభవ! కేశవ!

నగధర! వనమాలి! యాది నారాయణ! యో

భగవంతుఁడ! శ్రీమంతుఁడ!

జగదీశ్వర! శరణు శరణు శరణము కృష్ణా! ||36||


మగమీనమవై జలనిధిఁ

జగతుని సోమకుని జంపి పద్మభవునకున్

నిగమములు దెచ్చియిచ్చితి

సుగుణాకర! మమ్ముఁ గరుణఁ జూడుము! కృష్ణా! ||37||


అందఱు సురలును దనుజులు

పొందుగ క్షీరాబ్ధిఁ దరుప పొలుపున నీ వా

నందంబగు కూర్మమవై

మందరగిరి యెత్తితౌర! మాధవ కృష్ణా! ||38||


ఆదివరాహుఁడ వయి నీ

వా దనుజు హిరణ్య నేత్రు హతుఁ జేసి తగన్

మోదమున సురలు పొగడఁగ

మేదిని వడి గొడుగు నెత్తి మెరసితి కృష్ణా! ||39||


కెరలి యఱచేతఁ గంబము

నదురుగ వేయుటయు వెడలి యసురేశ్వరునిన్

ఉరమును జీరి వధించితి

నరహరి రూపావతార! నగధర కృష్ణా! ||40||


వడుగవువై మూడడుగుల

నడిగితివౌ బలిని బళిర యఖిల జగంబుల్

దొడిగితివి నీదు మేనున

గడుచిత్రము నీ చరిత్ర ఘనుఁడవు కృష్ణా! ||41||


ఇరువదొకమాఱు నృపతుల

శిరములు ఖండించితౌర! చేగొడ్డంటన్

ధరఁ గశ్యపునకు నిచ్చియు

బరఁగవె జమదగ్ని రామ భద్రుఁడ కృష్ణా! ||42||


దశకంఠుని బరిమార్చియు

గుశలముతో సీతఁదెచ్చి కొనియు నయోధ్యన్

విశదముగఁగీర్తినేలిన

దశరథ రామావతార! ధన్యుఁడ కృష్ణా! ||43||


ఘనులగు ధేనుకముష్టిక

దనుజులఁ జెండాడితౌర తగ భుజశక్తిఁ

అనఘాత్మ! రేవతీపతి

యనఁగా బలరామమూర్తి వైతివి కృష్ణా! ||44||


త్రిపురాసుర భార్యల నతి

నిపుణతతో వ్రతముచేత నిలిపితి కీర్తుల్

కృపగల రాజవు బళిరే

కపటపు బుద్ధావతార ఘనుఁడవు కృష్ణా! ||45||


వలపుల తేజీ నెక్కియు

నిలపై ధర్మంబు నిలువ హీనులఁ ద్రుంపన్

గలియుగము తుదిని వేడుక

కలికివి గానున్న లోక కర్తవు కృష్ణా! ||46||


వనజాక్ష! భక్తవత్సల

ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై

కన నీ సద్గుణజాలము

సనకాది మునీంద్రు లెన్నఁ జాలరు కృష్ణా! ||47||


అపరాథ సహస్రంబుల

నపరిమితములైన యఘము లనిశము నేనున్

గపటాత్ముఁడనై చేసితిఁ

జపలుని ననుఁగావు శేషశాయివి కృష్ణా! ||48||


నరపశువ మూడచిత్తుఁడ

దురితారంభుఁడను మిగుల దోషగుఁడను నీ

గుఱు తెఱుఁగ నెంతవాఁడను

హరి నీవే ప్రాపు దాపు నౌదువు కృష్ణా! ||49||


పరనారీ ముఖపద్మము

గురుతుఁగ గుచకుంభములను గొప్పును నడుమున్

అరయంగనె మోహింతురు

నిరతిని నిను భక్తిఁ గొల్వ నేరరు కృష్ణా! ||50||

పంచేంద్రియ మార్గంబుల

కొంచెపు బుద్ధినిఁ జరింతుకొన్ని దినంబుల్

ఇంచుక సజ్జన సంగతి

నెంచగ మిమ్మెఱిఁగినాఁడ నిప్పుడు కృష్ణా! ||51||


దుష్టుఁడ దురాచారుఁడ

దుష్ట చరిత్రుఁడను జాల దుర్బుద్ధిని నే

నిష్ట నినుఁ గొల్వనేరను

కష్టుఁడను ననుఁ గావు కావు కరుణను కృష్ణా! ||52||


కుంభీంద్ర వరద! కేశవ!

జంభాసుర వైరి దివిజ సన్నుత చరితా!

అంభోజనేత్ర! జలనిధి

గంభీరా? నన్నుగాఁవు కరుణను కృష్ణా! ||53||


దిక్కెవ్వరు ప్రహ్లాదుకు

దిక్కెవ్వరు పాండు సుతుల దీనుల కెపుడున్

దిక్కెవ్వరయ్యహల్యకు

దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా! ||54||


హరి! నీవె దిక్కు నాకును

సిరితో నేతెంచే మకరి శిక్షించి దయన్

బరమేష్టి సురలు పొగడఁగఁ

గరిఁగాచినరీతి నన్నుఁ గావుము కృష్ణా! ||55||


పురుషోత్తమ! లక్ష్మీపతి!

సరసిజగర్భాదిమౌని సన్నుత చరితా!

మురభంజన! సురరంజన!

వరదుఁడ వగు నాకు భక్తవత్సల! కృష్ణా! |56||


క్రతువులు తీర్థాగమములు

వ్రతములు దానములు సేయవలెనా లక్ష్మీ

పతీ! మిముఁ దలచినవారికి

నతులిత పుణ్యములు గలుగుటరుదా? కృష్ణా! ||57||


స్తంభమున వెడలి దానవ

డింభకు రక్షించినట్టి ఠీవిని వెలయన్

అంభోజ నేత్ర! జలనిధి

గంభీరుఁడ! నన్నుఁగావు కరుణను కృష్ణా! ||58||


శతకోటిభాను తేజుఁడ!

యతులిత సద్గుణగణాఢ్య యంభుజనాభా!

రతినాథ జనక! లక్ష్మీ

సతిహిత! ననుగావు భక్తవత్సల కృష్ణా! ||59||


మందుఁడ నేదురితాత్ముఁడ

నిందల కొడిగట్టినట్టి నీచుని నన్నున్

సందేహింపక కావుము

నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా! ||60||


గజరాజ వరద! కేశవ!

త్రిజగత్కల్యాణమూర్తి! దేవమురారీ!

భుజగేంద్ర శయన! మాధవ

విజయాప్తుఁడ! నన్నుఁగావు వేడుక కృష్ణా! ||61||


గోపాల దొంగ మురహర

పాపాలను బాఱఁద్రోలు ప్రభుఁడవు నీవే

గోపాలమూర్తి! దయతో

నా పాలిటఁ గలిగి ప్రోవు నమ్మితి కృష్ణా! ||62||


దుర్వార చక్రధర కర!

శర్వాణీ ప్రముఖ వినుత! జగదాధారా!

నిర్వాణనాథ! మాధవ!

సర్వాత్మక! నన్ను గావు సరుగున కృష్ణా! ||63||


సుత్రామనుత! జనార్దన!

సత్రాజిత్తనయనాథ! సౌందర్యకళా

చిత్రావతార! దేవకి

పుత్రా! ననుఁగావు నీకుఁ బుణ్యము కృష్ణా! ||64||


బల మెవ్వఁడు కరిబ్రోవను

బల మెవ్వఁడు పాండుసుతుల భార్యను గావన్

బలమెవ్వఁడు రవిసుతునకు

బలమెవ్వఁడు నాకు నీవు బలమౌఁ కృష్ణా! ||65||


పరుసము సోఁకిన యినుమును

వరుసగ బంగారమైన వడుపున జిహ్వన్

హరి నీ నామము సోకిన

సురవందిత! నేను నటుల సులభుఁడ కృష్ణా! ||66||


ఒకసారి నీదు నామము

ప్రకటముగాఁ దలఁచువారి పాపప్ము లెల్లన్

వికలములై తొలఁగుటకును

సకలాత్మ యజామిళుండు సాక్షియె కృష్ణా! ||67||


హరి సర్వంబునన్ఁ గలఁడని

గరిమను దైత్యుండు పలుక గంబములోనన్

ఇరవొంద వెడలి చీల్పవె

శరణనఁ బ్రహ్లాదకుండు సాక్షియె కృష్ణా! ||68||


భద్రార్చిత పదపద్మ! సు

భద్రాగ్రజ! సర్వలోకపాలన! హరి! శ్రీ

భద్రాధిప! కేశవ! బల

భద్రానుజ! నన్నుఁబ్రోవు భయహర కృష్ణా! ||69||


ఎటువలెఁ గరిమొఱ వింటివి

యెటువలెఁ బ్రహ్లాదు కభయ మిచ్చితి కరుణన్

అటువలె నను రక్షింపుము

కటకట! నిను నమ్మినాఁడ గావుము కృష్ణా! ||70||


తటపట లేటికిఁ జేసెదు

కటకట పరమాత్మ నీవు ఘంటాకర్నున్

ఎటువలె నిపుణునిఁ జేసితి

నటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా! ||71||


తురగాధ్వరంబు జేసిన

పురుషులకును వేఱె పదవి పుట్టుట యేమో

హరి! మిముఁ దలచిన వారికి

నరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా! ||72||


ఓ భవనంధ విమోచన!

యో భరతా గ్రజ! మురారి! యోరఘు రామా!

యో భక్త కామధేనువ!

యో భవహర! నన్నుఁగావుమో హరి కృష్ణా! ||73||


ఏ తండ్రి కనక కశ్యపు

ఘాతకుఁడై యతని సుతుని గరుణను గాచెన్

బ్రీతి సురకోటి పొగడఁగ

నా తండ్రీ! నిన్ను నేను నమ్మితి కృష్ణా! ||74||


ఓ పుండరీకలోచన!

యో పురుషోత్తమ! ముకుంద! యో గోవిందా!

యో పురసంహార మిత్రుడ!

యో పుణ్యుఁడ! నన్నుఁ బ్రోవు మో హరికృష్ణా! ||75||


ఏ విభుఁడు ఘోర రణమున

రావణు వధియించి లంక రాజుగ నిలిపెన్

దీవించి యా విభీషణు,

నా విభు నేఁ దలఁతు మదిని నచ్యుత కృష్ణా! |76||


గ్రహభయదోషముఁ బొందదు

బహుపీడలు చేర వెఱచుఁ బాయును నఘముల్

ఇహపర ఫలదాయక విను,

తహతహలెక్కడివి నిన్నుఁ దలచిన కృష్ణా! ||77||


గంగ మొదలైన నదులను

మంగళముగఁ జేయునట్టి మజ్జనమునకున్

సంగతి గలిగిన ఫలములు

రంగుగ మిముఁ దలచుఁ సాటి రావుర కృష్ణా! ||78||


ఆ దండ కావనంబునఁ

గోదండముఁ దాల్చినట్టి కోమలమూర్తీ!

నాదండ కావరమ్మీ

వేదండముఁ గాచినట్టి వేల్పవు కృష్ణా! ||79|


చూపుము నీ రూపంబును

బాపవు దుష్కృతములెల్లఁ బంకజనాభా!

పాపుము నాకును దయతో

శ్రీపతి! నిను నమ్మునాఁడ సిద్ధము కృష్ణా! ||80||


నీ నామము భవహరణము

నీ నామము సర్వసౌఖ్య నివహకరంబున్

నీనామ మమృత పూర్ణము

నీ నామము నేఁ దలంతు నిత్యము కృష్ణా! ||81||


పరులను నడిగిన జనులకుఁ

గురుచ సుమీ ఇది యటంచు గు!రుతుగ నీవున్

గురుచ్ఁడవై వేడితి మును

ధ్రఁ బాదత్రయము బలిని దద్దయు కృష్ణా! ||82||


పాలను వెన్నయు మ్రుచ్చిలఁ

ఱోలను మీ తల్లి గట్ట రోషముతోడన్

లీలావినోదివైతివి

బాలుఁడవా బ్రహ్మఁగన్న ప్రభుఁడవు కృష్ణా! ||83||


రఘునాయక నీనామము

లఘుమతితోఁ దలఁపఁగలనె లక్ష్మీరమణా!

అఘములఁ బాపుము దయతో

రఘురాముఁడ వైన లోక రక్షక కృష్ణా! ||84||


అప్పా! యిత్తువు దయతో

నప్పాలను నతిరసంబు లనుభవశాలీ

అప్పా! ననుఁ గను్గొనవే

యప్పా! ననుఁ బ్రోవు వేంకటప్పా! కృష్ణా! ||85||


కొంచెపువాఁడని మదిలో

నుంచకుమీ వాసుదేవ! గోవింద! హరీ!

యంచితముగ నీ కరుణకుఁ

గొంచెము నధికంబు గలదె కొలతయు కృష్ణా! ||86||


వావిరి నీ భక్తులకున్

గావరమున నెగ్గు సేయు గర్వాంధులనున్

దేవ! వధించుట వింటివి

నీ వల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా! ||87||


అయ్యా! పంచేంద్రియములు

నుయ్యాలల నూచినట్టు లూచఁగ నేనున్

జయ్యన్ గలుచుఁచు నుంటిని

గుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగ కృష్ణా! ||88||


కంటికి రెప్పవిధంబున

బంటుగదా యనుచు నన్నుఁ బాయక యెపుడున్

జంటయు నీవుండుట నే

కంటక మగు పాపములను గడచితి కృష్ణా! ||89||


యమునకు నిఁక నే వెఱువను

కమలాక్ష! జగన్నివాస! కామితఫలదా!

విమల మగు నీదు నామము

నమరఁగఁ దలఁచెను వేగ ననిశము కృష్ణా! ||90||


దండమయా! విశ్వంభర!

దండమయా! పుండరీక దళనేత్ర హరీ!

దండమయా! కరుణానిధి!

దండమయా! నీకు నెపుడు దండము కృష్ణా! ||91||


నారాయణ! లక్ష్మీపతి!

నారాయణ! వాసుదేవ! నందకుమారా!

నారాయణ! నిను నమ్మితి!

నారాయణ! నన్నుఁ బ్రోవు నగధర కృష్ణా! ||92||


తిరుమణి దురితవిదూరము

తిరుమణి సౌభాగ్యకరము త్రిజగములందున్

తిరుమణి పెట్టిన మనుజుఁడు

పరమ పవిత్రుండు భాగ్యవంతుంఁడు కృష్ణా! ||93||


శ్రీలక్ష్మీనారాయణ!

వాలాయము నిన్నుఁ దలఁతు వంద్యచరిత్రా!

ఏలుము నను నీ బంటుగఁ

జాలఁగ నిను నమ్మినాను సరసుఁడ కృష్ణా! ||94||


శ్రీధర! మాధవ! యచ్యుత!

భూధర! పురుహూత వినుత! పురుషోత్తమ! నీ

పాద యుగళంబు నెపుడు

మోదముతో నమ్మినాఁడ ముద్దుల కృష్ణా! ||95||


శిరమున రత్నకిరీటము

కరయుగమున శంఖచక్ర ఘనభూషణముల్

ఉరమున వజ్రపుఁ బతకము

సిరినాయక! యమరవినుత శ్రీహరి కృష్ణా! ||96||


అందెలఁ బాదము లందును

సుందరముగ నిల్పినావు సొంపమరంగా

సుందర! మునిజనసన్నుత!

నందుని వరపుత్ర! నిన్ను నమ్మితి కృష్ణా! ||97||


కందర్పకోటి సుందర!

మందరధర! భానుతేజ! మంజుల దేహా!

సుందర విగ్రహ! మునిగణ

వందిత, మిముఁ దలతు భక్తవత్సల కృష్ణా! ||98||


దుర్మతిని మిగుల దుష్టపుఁ

గల్మషములు జేసినట్టి కష్టుండ ననున్

నిర్మలునిఁ జేయవలె ని

ష్కర్ముఁడ నిను నమ్మినాను సతతము కృష్ణా! ||99||


అనుదినము కృష్ణశతకము

వినినఁ బఠించినను ముక్తి వేడుకఁ గలుగున్

ధనధాన్యము గోగణములు

తనయులు నభివృద్ధి బొందుఁ దద్దయ కృష్ణా! ||100||


భారద్వాజసగోత్రుఁడ

గారవమున గంగమాంబ కరుణాసుతుఁడన్

పేరు నృసింహ్వాయుఁడను

శ్రీరమయుత! నన్నుఁ గావు సృష్టిని కృష్ణా! ||101||

వనరులు[మార్చు]


శతకములు
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము

This work was published before January 1, 1928, and is in the public domain worldwide because the author died at least 100 years ago.