కుమార శతకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


1. శ్రీ భామినీ మనొహరు
  సౌభాగ్య తయా స్వభావు సారసనాభున్
  లోఁ భావించెద; నీకున్
  వైభవము లొసగుచుండ, వసుధఁ గుమారా

ఓ కుమారా!సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి మనసును ఆకర్షించినవాడును, ఐశ్వర్య భోగభాగ్యములను దయతో ఇచ్చు స్వభావము కలవాడును, నాభియందు పద్మము కలవాడును, అయిన విష్ణుమూర్తి, సంపదలనిచ్చే శ్రీ హరిని ప్రార్ధించుచున్నాను.

2. పెద్దలు వద్దని చెప్పిన 
  పద్దుల బోవంగరాదు పరకాంతల నే
  పొద్దే నెద బరికించుట
  కుపదేశింపగఁ గూడ దుర్విఁ గుమారా!

ఓ కుమారా! పెద్దలు వద్దని చెప్పిన పనులను పంతములకు పోయి చేయరాదు. ఇతర స్త్రీలను ఎన్నడునూ మనసులో తలంచుట మంచిది కాదు. ఈ విషయములను మనసులో నుంచుకొని భూమిపై మెలగుము.

3. అతి బాల్యములో నైనను
  బ్రతికూలపు మార్గములఁ బ్రవర్తింపక స
  ద్గతి మీర మెలగ నేర్పిన
  నతనికి లోకమున సౌఖ్యమగును గుమారా!

ఓ కుమారా! మిక్కిలి చిన్నతనములో కూడా చెడు మార్గములయందు నడువరాదు. మంచిమార్గములో నడచిన వానికి లోకమందు సుఖమే ప్రాప్తించును.

4. తనపై దయ నుల్కొనఁ గన్
  గొన నేతెంచినను శీల గురుమతులను వమ్
  దనముగఁ భజింపందగు
  మనమలరగ నిదియ విబుధ మతము కుమారా!

ఓ కుమారా! దయతో తనకు మంచి చేయ బూనిన వారిని గౌరవించి, నమస్కరింపుము. వారి మనస్సు సంతోషపడునట్లు చేయుటయే నీవు వారి పట్ల చూపించదగు మర్యాద. పెద్దలనుసరించే మంచి పద్ధతి యిదియే.


5. ఉన్నను లేకున్నను పై
  కెన్నడుమర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
  కన్న తల్లిదండ్రుల యశం
  బెన్నఁబడెడు మాడ్కిందిరుగు మెలమిఁ గుమారా!


ఓ కుమారా! నీకు ఉన్నా లేకపోయినా నీ కుటుంబ రహస్యాలను ఇతరులకు తెలియనీయకుము. నిన్ను కన్నవారికి పేరు ప్రఖ్యాతులు వచ్చునట్లు. నలుగురు గొప్పగా పొగిడే విధంగా సంతోషముతో మసలుకొనుము.

6. పెద్దలు విచ్చేసినచొ
  బద్ధకముననైన దుష్ట పద్ధతి నైనన్
  హద్దెరిగి లేవకున్నన్
  మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!

ఓ కుమారా! మన ఇంటికి పెద్దలు వచ్చినచో మర్యాదగా లేచి నిలబడవలెను. బద్ధకమువలనగాని, పొగరుతనంతోగాని, పెద్ద చిన్న భేదములు గ్రహింపక మొండిగా లేవకున్నచో, నిన్నందరూ మూర్ఖునిగా పరిగణిస్తారు.

7. పనులెన్ని కలిగి యున్నను
  దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై
  వినగోరుము సత్కథలను;
  కాని విబుధులు సంతసించు గతినిఁ గుమారా!

ఓ కుమారా! నీకెంత తీరికలేకున్ననూ, ఎన్ని పనులున్ననూ, మంచి బుద్ధిగలవాడివై ప్రతీ రోజు జ్ఞానమునిచ్చే మంచి కథలను వినవలెను. నీవట్లు చేసినచో నీ ప్రజ్ఞ పెరిగి, నిన్ను బుద్ధిమంతులందరూ సంతోషముతో మెచ్చుకొంటారు.


8. కల్లలగు మాట లాడకు
  మెల్లజనంబులకు వేగ హృదయము కడు రం
  జిల్లగఁ బల్కుము నీ కది
  తెల్లము రహి గీర్తిఁగాంచు దెరగు కుమారాఁ!

ఓ కుమారా ! అసత్యములాడరాదు. మనుషులందరూ మెచ్చుకొనేటట్లు వారి మనస్సులు సంతోషపడునట్లు మాట్లాడుము. మహిలో నీకది ఆనందమును కీర్తిని ప్రసాదించును.

9. ఏనాడైనను వినయము
  మానకుమీ మత్సరమున మనుజేశులతోఁ 
  బూనకు మసమ్మతయు బహు
  మానమునను బొందు మిదియె మతము కుమారా!

ఓ కుమారా! ఎన్నడునూ వినయ స్వభావమును వీడరాదు. ఈర్ష్యా అసూయలతో తమ కంటే పెద్దవారితో కలహించుట పనికిరాదు. పేదవారి కోపం పెదవికి చేటు అనే నానుడిని మనస్సునందుంచుకొని మెలగుము.అట్లు చేసినచో నీకు సంఘంలో గౌరవ మర్యాదలబ్బును. సన్మానాలు జరుగును.

10. తనకు విద్యాభ్యాసం
   బును జేసినవానికన్న బొలుపుగఁ బదిరె
   ట్లను దూగు దండ్రి వానికి
   జననియుఁ బదిరెట్లుఁ దూగు జగతిఁ గుమారా!

ఓ కుమారా! ఈ లోకమందు విద్యాభ్యాసము నేర్పి తీర్చిదిద్దిన గురువు కంటే కన్నతండ్రి పదిరెట్లు ఎక్కువ. కన్నతండ్రి కంటే కన్నతల్లి పదిరెట్లు ఎక్కువ. ఈ సత్యమును తెలుసుకొని మసలుకొనుము

11. తమ్ములు తమయన్న యెడ భ
  యమ్మును భక్తియును గలిగి యారాధింపన్
  దమ్ముల నన్నయు సమ్మో
  దమ్మునఁ బ్రేమింపఁ గీర్తి దనరుఁ కుమారా!

ఓ కుమారా! పిన్నవారు పెద్దవారిపట్ల భయభక్తులను కలిగి యుండాలి. తమ్ముళ్ళూ అన్నపట్ల గౌరవమర్యాదలను ప్రదర్శించాలి. అన్నకూడా తమ్ముళ్ళను అదే భావముతో చూడాలి. ఇటువంటి అన్నదమ్ములు, లోకమున పేరు ప్రఖ్యాతులు పొందగలరు.


12. తనయుడు చెడుగై యుండిన
   జనకుని తప్పన్నమాట సతమెఱుగుదు గా
   వున నీ జననీ జనకుల
   కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!

ఓ కుమారా! కొడుకు చెడ్డవాడైన తండ్రి తప్ప. ఇది అందరకు తెలిసినదే. గావున ఈ సత్యమును గుర్తెరింగి నీ తల్లిదండ్రులకు చెడ్డపేరు రాకుండునట్లు నడుచుకొనుము

13. మర్మము పరులకు దెలుపకు
  దుర్మార్గుల చెంత నెపుడు దూఱకు మిల దు
  ష్కర్మముల జేయ నొల్లకు ;
  నిర్మల మతినుంట లెస్స నిజము కుమారా!

ఓ కుమారా! నీ రహస్యములెన్నడును ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహము చేయవద్దు. ఈ భూమియందు చెడ్డపనులను చేయుట మానుకో. స్వచ్చమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో.

14. తల్లిని దండ్రిని సహజల
   నల్లరి బెట్టినను వారలలుగుచు నీపై
   నుల్ల మున రోయు చుందురు
   కల్లరి వీడనుచుఁ గీర్తిఁ గందం గుమారా!

ఓ కుమారా! కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని అల్లరి పెట్టరాదు. అట్లు చేసినచో వారు నీపై కోపించి నిన్ను అబద్ధములాడువానిగా చిత్రించి మనస్సునందు కోపపడుదురు. దానివలన నీకు అపకీర్తి వచ్చును. కావున అట్లు చేయరాదు.

15. అపం దన తల్లిగ మే
   లొప్పంగని జరుపవలయు నుర్వీస్థలి జి
   న్నప్పుడు చన్నిడి మనిసిన 
   యప్పడతియు మాతృతుల్యయండ్రు కుమారా!

ఓ కుమారా! తన అక్కను తల్లివలె భావించాలి. అమ్మ తరువాత అక్కయ్యే మనకు తల్లి.కావున అక్కను తల్లిగా పూజించాలి. ఆమె మనసును బాధింపకు. ఆమె దీవెనలే మనకు సోపానమార్గాలు. అట్లే తనను ఎత్తుకొని పోషించినవారిని (దాదితో సహా) కూడా తల్లితో సమానంగా గౌరవించాలి.


16. ఆకులత బడకు మాపద
   నేకతమునఁ జనకు త్రోవ నింతికి దగు నం
   తేకాని చన వొసంగకు
   లోకులు నిన్నెన్న సుగుణలోల! కుమారా!

సుగుణాశక్తి గల కుమారా! ఆపదసమయమందు ఆందోళన పడరాదు. తోడులేనిదే ఒంటరిగా పోరాదు. భార్యకు తగినంత చనువును మాత్రమే ఇయ్యవలయును. ఎక్కువ ఇచ్చినచో నిన్ను తక్కువ చేయును . ఈ విషయములన్నింటిని తెలిసికొని మసలుము.

17. తనుజులనుం గురు వృద్ధుల 
   జననీ జనకులను సాధుజనుల నెవడు దా
   ఘను డయ్యు బ్రోవడో యా
   జనుడే జీవన్మృతుండు జగతి కుమారా!

ఓ కుమారా! మనిషి తానెంత గొప్పవాడైనను తన ఆలుబిడ్డలను, తల్లితండ్రులను, గురువులను, పెద్ద్దలను, మంచివారిని ఆదరించాలి. అట్లు చేయనివాడు బ్రతికి యుండినను చనిపోయిన వానితో సమానము.


18. దుర్జనుల నైనఁ దిట్టకు
   వర్జింపకు సుజన గోష్టి; పరులను నెల్లన్
   నిర్జింతుననుచుఁ ద్రుళ్ళకు;
  దుర్జనుడండ్రు నిను నింద దోప కుమారా!

ఓ కుమారా! చెడ్డవారిని కూడా దూషింపరాదు. మంచివారున్న చోటును వదలరాదు. మంచివారున్న చోటును వదలరాదు. శత్రువులను చంపుతానని విర్రవీగరాదు. అట్లు చేసినచో నిన్ను చెడ్డవాడని అంటారు. నిందలు వేస్తారు. నీకు చెడ్డ పేరు వస్తుంది.

19. సంపద గల వారిని మో
   దింపుచు జుట్టుకొని యందు రెల్లప్పుడు న
   త్సంపద తొలంగిన నుపే
   క్షింపుడు రవివేక జనులు క్శితిని కుమారా!

ఓ కుమారా! లోకమందు ధనమే నిత్యమని తెలివి లేనివారు భావిస్తారు. డబ్బున్నవారినే ఆశ్రయించి తమ పబ్బము గడుపుకొంటారు.సంపదలు పోయిన వెంటనే మరల వారినే దూషిస్తారు. ఎంత అవివేకులు ఈ జనులు.


20. సద్గోష్ఠి సిరియు నొసగును
   సద్గోష్ఠ్యె కీర్తి బెంచు సంతుష్టిని నా
   సద్గోష్ఠియె యొనగూర్చును
   సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!

ఓ కుమారా! సజ్జనులు, సత్ఫురుషుల సభలయందే మంచి జ్ఞానమును సంపదింతురు. దానివలన సిరి సిద్ధించును సద్గోష్ఠి వలన కీర్తి పెరుగును, సంతృప్తి కలుగుతుంది. సద్గోష్ఠి వలన సర్వపాపములు సమసిపోవును.


21. ధనవంతు లైన బహు స
   జ్జనులైనను నీకు మిగుల సమ్మతులై యు
   న్నను సతి జనకుని గృహమం
   దున నుండుట తగదు కీర్తి తొలగు కుమారా!

ఓ కుమారా! అత్తవారెంత అధికులైననూ, సంపన్నులైనను, సజ్జనులైననూ, నీ పట్ల మిక్కిలి మక్కువ జూపుతున్నను, భార్యను పుట్టినింట యుంచుట మంచిది కాదు. అట్లు చేసినచో కీర్తి నశించును.


22. సభలోపల నవ్విన యెడ
   సభవా ర్నిరసింతు రెట్టి జనుని న్నెరి నీ
   కభయం బొసంగె నేనియు
   బ్రభు కరుణను నమ్మి గర్వపడకు కుమారా!

ఓ కుమారా! సభలలొ నవ్వరాదు. సభలో నవ్విన వారెంతటివారైననూ వారిని చిన్నచూపు చూచెదరు. నీ తెలివిని మెచ్చుకొని నిన్ను రక్షించిన రాజుదయను నమ్ముకొని గర్వపడరాదు.

23. పెరవారలుండ ఫలముల 
   నరయంగా వారికిడక యాతడె మెసవన్
   సరిగాదు విసపు మేతకు
   సరియౌనని తలపు మానసమున కుమారా! 


ఓ కుమారా! ఇతరులు ఉన్న సమయములో ఒక్కడవే పండ్లు ఫలములు తినరాదు. వారికి పెట్టకుండా తినుట మంచి పద్ధతి కాదు. నీ ఎదుట ఉన్నవారికి పెట్టకుండా తినుట వలన నీవు తిన్నది విషముతో సమానముగునని తలంచుము.

24. మును స్నానము సేయక చం
   దన మలదుట యనుచితం;
  బుదకయుంత వస్త్రం
   బును విదలించుట కూడదు
   మనమున నివి తెలిసి మనుము మహిని కుమారా!

ఓ కుమారా! ముందుగా స్నానం చేసిన పిదప శరీరమునకు గంధమును పూసుకోవాలి. స్నానము చేయకుండ గంధము పూసుకొనుట మంచిది కాదు. నీళ్ళతో కూడిన బట్టను విదిల్చుట కూడ తగని పని. దానివలన దరిద్రము అంటుకొనును. ఈ విషయములను మనస్సుఅన్ందుంచుకొని ప్రవర్తించవలెను.


25. అవయవ హీనుని సౌంద
   ర్యవిహీను, దరిద్రు, విద్యరాని యతని సం
   స్తవనీయు, దేవు, శ్రుతులన్
   భువి నిందింప దగదండ్రు బుధులు కుమారా!

ఓ కుమారా! వికలాంగులను, అందములేనివారిని, దరిద్రులను, విద్యలేనివారిని, గౌరవనీయులను, భగవంతుని, వేదములను, పండితులను, నిందింపరాదని విజ్ఞానులు చెప్పుచున్నారు. ఈ పనులను జేయరాదని అనుచున్నారు.


26. గరళము పెట్టెడు వాని 
   న్బరు జంప దలంచువాని బనులెల్ల బయ
   ల్పరచెడివానించ్ బరధన
   హరుని నృపతి చంపి పుణ్యుడగును కుమారా!

ఓ కుమారా! విషము పెట్టి చంపువారిని, ఇతరులు చంపజూతురు. హంతకులను, రహస్యముల బయటపెట్టేవారిని, దొంగలను, రాజు నిర్దయతో చంపవలెను. అట్లు చేయుటవలన రాజునకు పుణ్యగతి ప్రాప్తిల్లును. పేరు ప్రఖ్యాతులు వృద్ధి పొందును.

27. సత్తువగల యాతడు పై 
   నెత్తిన దుర్భలుండు తస్కరించు నతండున్ 
   విత్తము గోల్పడు నతడును
   జిత్తని పీడితుండు జింతజెందు కుమారా!

ఓ కుమారా! శక్తియున్న బలహీనునిపై దండెత్తిన ఆ బలహీనుడు దొంగలుపడి దోచుకున్న గృహము కలవాడైనట్లు ధనహీనుడగును. శక్తి లెక పీడింపబడతాడు. మనస్సు విచారముతో , నిత్యము బాధలఓ నుండును.

28. ఓరిమియె కలిగి యుండిన
   వారలగని ప్రజ్ఞలేనివారని యెదం
   నారయ సత్పురుషాళికి
   నోరిమియే భూషణంబు రోరి కుమారా!


ఓ కుమారా! మనిషికి ఓర్పు ప్రధానము. సహనము కలవారిని జూచి తెలివిలేనివారిగా జమకడతారు. కాని నిజానికి మనిషికి ఓర్పే భూషణము. ఓర్పువలన కార్యము సాధింపవచ్చును.

29. ఎటువంటి వర కులంబున 
   బటు తరముగ బుట్టెనేని పరగగ మును గ
   న్నటువంటి కర్మఫలముల
   కట కట భోగింప వలయు గాదె కుమారా!

ఓ కుమారా! ఎంతటి గొప్పవంశము పుట్టినను , మనిషి పూర్వజన్మలందు తను జేసిన కర్మఫలంబులను అనుభవింపక తప్పదు కదా! కావున ఈ సత్యము నెఱింగి మసలు కొనుము.


30. పెక్కు జనులు నిద్రింపగ
   నొక్కెం డయ్యెడను నిద్ర నొందక యున్నన్
   గ్రక్కున నుపద్రవంబగు
   నక్కర్మమునందు జొరకుమయ్య కుమారా!

ఓ కుమారా! ఎక్కువమంది నిద్రించుచున్న ప్రదేశమందు తానొక్కడునూ మేలుకొని యుండరాదు. అట్లు మెలకువగా యున్నచో కష్టములు కలుగును. ఒకవేళ నిద్ర రానట్లయిన, నిద్ర నటించుము.


31. ధనవంతుడె కులవంతుడు
   ధనవంతుడె సుందరుండు ధనవంతుండే
   ఘనవంతుడు బలవంతుడు
   ధనవంతుడె ధీరుఢనుచు దలతె? కుమారా!

ఓ కుమారా! ఈ లోకమందు ధనవంతుని అందరూ మంచివానిని గౌరవింతురు. ధనము కలవానిని లోకులు సుందరాంగుడని, గుణవంతుడని, గొప్పవాడని, బలవంతుడని, ధైర్యవంతుడని పలువిధములుగా పొగడుదురు. మనసునందీ విషయాన్నుంచుకొని ధనమును సంపాదింపుము.

32. విను ప్రాణ రక్షణమునన్
   ధనమంతయు మునిగిపోవు తై, పరిణయమం
   దున, గురుకార్యమున, వధూ 
   జన సంగమమునందు బొంక జనును కుమారా!

ఓ కుమారా! వినుము ప్రాణము కాపాడుకొను సమయమందుననూ, ఐశ్వర్యము నశించు సమయమందునను, వివాహ సమయములందుననూ, గొప్ప ప్రజోపకార్యము నెరవేర్చు సమయమందునను, స్త్రీలను సంగమించు సమయమందునను అసత్యము లాడవచ్చును.


33. దీనుండై నను శాత్రవు
   డైనన్ శరణనుచు వేడునపుడు ప్రియత న
   మ్మానవుని కోర్కె దీర్చిన
   వాని సుజనుడాండ్రుబుధులు వసుధ కుమారా!

ఓ కుమారా! దీనుండై శరణు గోరి వచ్చినవాడు శత్రువైననూ, ఆతని ప్రయోజనమును ప్రేమతో నెరవేర్చినచో అతనిని జూచి పండితులు సుజనుడని పొగడుదురు.


34. మిత్రుండు దనకు విశ్వా
   మిత్రము జేసినను గాని మేలనవచ్చును
   శాత్రవుడు ముద్దగొన్నను
   ధాత్రిం దన కదియె కీడు తలప కుమారా!


ఓ కుమారా! లోకమందు మిత్రుడు మనకు కీడు చేసిననూ, దానిని మేలు చేసినట్లుగానే భావింపవలెను. కాని శత్రువు మనయింట భోజనము చేసిననూ మనకు (కీడు) అపకారమే కలుగునని తెలియవలెను.


35. విత్తంబు విద్య కులము
   న్న్మత్తులకు మదంబొసంగు; మాన్యులకున్ స
   ద్వృత్తి నొసంగున్ వీనిన్
   జిత్తంబున నిడి మెలంగ జెలగు కుమారా!

ఓ కుమారా! ధనము, గొప్ప విజ్ఞానము, సద్వంశము, దుర్మార్గులకు గర్వమును ఇచ్చును. ఈ త్రిగుణములే సజ్జనులకు మంచిని కలుగ జేయును. వీనిని గుర్తుంచుకొని ప్రవర్తించుము.


36. ఋణ మధిక మొనర్చి సమ
   ర్పణ చేసిన తండ్రి విద్యరాని కొడుకు ల
   క్షణశాలి రాణి దుశ్చా
   రిణి యగు జననియును దల్ప రిపులు కుమారా!

ఓ కుమారా! కుమారులకు అప్పులను ఆస్థులుగా ఇచ్చిన తండ్రి, విద్యలేని కుమారుడు, అందమైన భార్య, చెడునడాత గల్గిన తల్లి ఆలోచించినచొ వీరందరూ శత్రువులే సుమా!


37. ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల 
   లో జ్ఞానము గలిగి మెలగు లోకులు మెచ్చన్
   బ్రాజ్ఞతను గలిగి యున్నన్
   బ్రాజ్ఞులలొఁ బ్రాజ్ఞుఁడవుగ ప్రబలు కుమారా!


ఓ కుమారా! నిన్ను చేయమని ఆజ్ఞాపించిన పనులను తెలివిగా చేసి మెప్పు పొందుము. ఒక్క బుద్ధి నైపుణ్యమును ప్రదర్శించుటయే గాదు. తెలివైన వారిలో తెలివైన వానిగా పేరు తెచ్చుకొని అభివృద్ధి చెందుము.


38. వృద్ధజన సేవ చేసిన 
   బుద్ధి విశేషజ్ఞుఁ బూత చరితుండున్
   సద్ధర్మశాలియని బుధు 
   లిద్దరఁ బొగిడెదరు ప్రేమయెసగఁ కుమారా!


ఓ కుమారా! పెద్దపట్ల గౌరవము ప్రదర్శించుము. పెద్దలను గౌరవించినచొ వారి దివ్యమైన ఆశీస్సులు పొందుటయే గాక బుద్ధిమంతుడు, ధర్మాత్ముడు, మంచివాడని మెచ్చుకుంటూ ప్రేమతో పొగడుదురు.


39. సతతముఁ బ్రాతః కాలో
   చితవిధులను జరుపు మరసి శీఘ్రముగ నహః
   పతి పూర్వ పర్వతాగ్రా
   గతుడగుటకు మున్నె వెరవు గల్గి కుమారా!

ఓ కుమారా! ప్రతిరోజు సూర్యోదయాత్పూర్వమే మేల్కొనుము. ఉదయమందు చేయవలసిన పనులను తెలుసుకొని ఆ పనులను సూర్యుడు ఉదయించకముందే శ్రద్ధతో చేయుము.


40. పోషకుని మతముఁ గనుం గొని
   భూషింపక గాని ముదము బొందరు మఱియున్
   దోషముల నెంచు చుండును
   దోషివయిన మిగులఁ గీడు దోచుఁ గుమారా!


41. నరవరుడు నమ్మి తను నౌ
   కరిలో నుంచునెడ వాని కార్యములందున్
   సరిగా మెలంగ నేర్చిన
   పురుషుడు లోకమునఁ గీర్తిఁ బొందుఁ గుమారా!

ఓ కుమారా! యజమాని నిన్ను నమ్మి ఒక పనిని అప్పగించినపుడు, ఆ పనులను శ్రద్ధతో చక్కగా చేయుము. అట్లు చేసినచో నీకు లోకమునందు మిక్కిలి కీర్తి సిద్ధించును.

42. ధరణి నాయకు రాణియు
   గురు రాణియు నన్న రాణి కులకాంతను గ
   న్న రమణి దనుగన్నదియును
   ధరనేవురు తల్లులనుచుఁ దలుపు కుమారా!

ఓ కుమారా! భూమియందు ప్రతి ఒక్కరికినీ అయిదుగురు తల్లులుందురు. కన్నతల్లి, యజమాని భార్య,గురుపత్ని, అన్నభార్య(వదిన) భార్య తల్లి (అత్త). ఈ ఐదుగురు గూడా తల్లులనియే భావింపుము.


43. ఆచార్యున కెదిరింపకు
   బ్రోచిన దొర నిందసేయఁ బోకుము కార్యా
   లోచనము లొందఁ జేయకు
   మాచారము విడవఁ బోకుమయ్య ! కుమారా!


ఓ కుమారా! గురువును ధిక్కరించకు, నిన్ను పోషించు యజమానిని నిందింపరాదు. చెయుపనియందు శ్రద్ధ వహింపుము. పెద్దలు నడచిన పద్ధతిని విడువరాదు.


44. నగం గూడదు పరసతిఁ గని
   తన మాతృ సమనమెన్నదగు; నెవ్వరితోన్ఁ
   బగ గూడ, దొరల నిందిం
   పగఁగూడదు, గనుము వృద్ధ పధము కుమారా!

ఓ కుమారా! ఇతరుల భార్యలను చూసి నవ్వరాదు. వారిని కన్నతల్లితో సమానముగా జూడవలయును. ఎవ్వరితోను విరోధము పెట్టుకొనరాదు. ఇతరులను దూషింపరాదు. పెద్దలు ఈ పద్ధతినే అనుసరించిరని తెలియుము.

45. చేయకుము కాని కార్యము
   పాయకుము మఱిన్ శుభం బవని భోజనమున్
   జేయకుము రిపు గృహంబున 
   గూయకు మొరుమనసు నొచ్చుకూత కుమారా!

ఓ కుమారా! చేయకూడని చెడ్డపనులను చేయకుము. శుభకార్యములను విడువరాదు. శతృ గృహములయందు భోజనము చేయరాదు. ఇతరులమనస్సులను బాధించు మాటలు మాట్లడరాదు.

ఓ కుమారా!సిరి సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి మనసును ఆకర్షించినవాడును, ఐశ్వర్య భోగభాగ్యములను దయతో ఇచ్చు స్వభావము కలవాడును, నాభియందు పద్మము కలవాడును, అయిన విష్ణుమూర్తి, సంపదలనిచ్చే శ్రీ హరిని ప్రార్ధించుచున్నాను.

46. పిన్నల పెద్దల యెడఁ గడు
   మన్ననచే మలగు సుజన మార్గంబుల నీ
   వెన్నికొని తిరుగుచుండిన
   నన్ని యెడల నెన్న బడదువన్న కుమారా!

ఓ కుమారా! పిన్నపెద్దల పట్ల కడు గౌరవముతో మెలగుము. నీవు మంచిపద్ధతుల యెన్నుకొని ప్రవర్తించినట్లయితే అన్నింటా నీకు శుభమే కలిగి మంచి పేరు ప్రఖ్యాతులను బడయగలవు.

47. బూటకపు వర్తనము గని
   జూటరి వీడనుచుఁ దప్పఁ జూతురుగా! యా
   బాటను విడి సత్యము మది 
   బాటించి నటించు వాడె నరుడు కుమారా!

ఓ కుమారా! అసత్యమైన బూటకపు నడవడికను మానుకొనుము. దానివలన నీవు అబద్ధములాడువాడని నిన్ను తప్పుగా చూస్తారు. ఆ చెడుమార్గమును వీడి సత్యమును బాటించి మనిషిగా మసలుకొనుము. నీవు సత్యమార్గమున ప్రయాణించినచో నిన్ను లోకులు సత్యవర్తనుడని పొగడుతారు.


48. లోకులు తనుఁ గొనియాడ వి
   వేకి యదియు నిందగాక విననొల్లడు సు
   శ్లోకుల చరితం బిట్టిది
   చేకొనవలె నట్టి నడక చిన్ని కుమారా!


ఓ కుమారా! పండితులు పొగడ్తలకు పొంగిపోరు. ప్రజలు నిందించినపుడెట్లు మనము విననట్లుందుమో పొగడునప్పుడు తెలివికలవాడు పొగడ్తలను వినరు. ఇదియే సుజ్జనుల పద్ధతి. దీనిని గ్రహించి నీవు కూడా మంచి నడత అలవరచుకొనుము.

49. వగవకు గడచిన దానికి
   పొగడకు దుర్మతుల నెపుడు; పొసగని పనికై
   యొగి దీనత నొందకుమీ
   తగ దైవగతిం బొసంగు ధరను కుమారా!

ఓ కుమారా! జరిగిపోయినదానికి విచారించకు. దుర్మార్గులను ఎప్పుడునూ పొగడ రాదు. చేయలేని పనికి చింతింపరాదు. ఈ భూమియందు పనులన్నియు భగవంతుని నిర్ణయము ప్రకారమే జరుగునని తెలుసుకొనుము. తగని పనులను చేయకుము.

50. బరులెవ్వరేని దనతో 
  బరిభాషించినను మేలు పలుక వలయు నా
  దరము గల చోటఁ గీడు
  న్గరము నొనర్పంగరాదు గదర కుమారా!

ఓ కుమారా! ఇతరులతో మాట్లాడునపుడు మంచినే పలుకవలయును. నిన్నాదరించిన వారికి కీడు తలపెట్టకు. ఈ సన్మార్గములను తెలుసుకుని నడుచుకొనుము.


51. సిరి చేర్చు బంధువుల నా
  సిరియే శుభముల నొసంగు చెలువుల గూర్చున్
  సిరియే గుణవంతుండని
  ధరలొ బొగడించునంచు దలపు కుమారా!

ఓ కుమారా! ’ధనం మూలమిధం జగత్ ’ అన్నారు పెద్దలు. మనిషికి ధనమే ముఖ్యమైనది. సంపదలు కలిగినపుడు బంధువులు తమంత తామే వచ్చి చేరుదురు. శుభములన్నియు సిరితో బాటే వచ్చును. స్నేహితులు మనదగ్గర డబ్బున్నంతవరకూ మనచుట్టూ తిరుగుతారు. ధనమువలన సుగుణములతోను, కీర్తి ప్రఖ్యాతులతోను చూడబడతాము. కావున ధనము సంపాదించుట నేర్చుకొనుము.

52. తనదు కులాంగన యాలో 
  చనమున మంత్రియును భుక్తి సమయంబున దా
  జననియు రతిలో రంభా
  వనజేక్షణ యయినఁ బుణ్యవశము కుమారా! 

ఓ కుమారా! లోకమందు పురుషునకు అనుకూలవతియైన భార్య కావలయును. ఆలోచించు సమయమునందు మంత్రివలెను, భోజన సమయమునందు తల్లివలెను, రతి సమయమునందు రంభవలెను,సేవలు చేయు భార్య పొందుట మిక్కిలి అదృష్టమనబడును. అట్టి భార్య లభించడం పూర్వజన్మ ఫలము.


53. అల దేవగృహము కడప యి
  రుల గోవాటముల యందు ద్రోవలలో ర
  చ్చల కొట్టములను నొప్పదు
  మల మూత్ర విసర్జనంబు మహిని కుమారా!

ఓ కుమారా! దేవాలయముల వద్దను, గడపముందటను, గోశాలయందును, రహదారులయందును, నలుగురు కూర్చుండు స్థలముల వద్దను, పశువులు కొట్టములందును, మలమూత్రములను విసర్జించుట ఈ భూమిపై తగదని తెలుసుకొమ్ము.


54. పాపపు బని మది దలపకు 
  చేపట్టిన వారి విడువ జేయకు కీడున్
  లోపల దలపకు, క్రూరుల
  ప్రాపును మది నమ్మబోకు, రహిని కుమారా!

ఓ కుమారా! మనస్సునందు పాపపు పనులను తలంపకు. భార్యపుత్రులను విడిచిపెట్టరాదు. కాపాడుదునన్న వారిని వదలివేయకుము. మనసునందెవ్వరికి కీడు తలంపవద్దు. దుర్మార్గులను మనస్సునందెక్కువగా నమ్మవలదు. ఈ పద్ధతులను తెలుసుకొని మెలగుము.


55. జగడంబులాడు చోటను
  మగువలు వసియించుచోట మదగజము దరిన్
  బగతుండు తిరుగుచోటన్
  మగుడి చనగవలయుఁ జలము మాని కుమారా!

ఓ కుమారా! పొట్లాటలు జరుగు ప్రదేశమందును, స్త్రీలు నివసించు ప్రదేశములందును, మదించిన ఏనుగులున్న స్థానమందును, శత్రువు దిరుగు ప్రదేశములందునూ, నిలువరాదు. అటువంటి ప్రదేశములలో నివసించరాదు. శీఘ్రమే వదలిపోవలెను.


56. తిరుగకు దుర్మార్గులతో
  నరుగకు గహనాంతర స్థలాదుల కొంటన్
  జరుగకు శత్రుల మోల
  న్మరువకు మేల్ హితులయెడల మదిని కుమారా!

ఓ కుమారా! దుర్మార్గులతో కలసి తిరుగకు. ఒంటరిగా కీకారణ్య ప్రాంతములకు పోరాదు. ఎప్పుడూ శత్రువుల పక్షము వహింపకు. నీ మంచిని కోరువారినెపుడూ మరువకు. వారికి మంచిని కలుగజేయుము.


57. తరలాక్షుల యెడనెన్నడు
  బర్హాసాలాపములను పచరింపకుమీ
  బరికించి నిరీక్షించిన 
  నురు దోషంబనుచు దలపుచుండు కుమారా!

ఓ కుమారా! స్త్రీల పట్ల పరిహాసములెన్నడునూ చేయకు. వారిని పరిశీలనగా చూచుట, వారికొరకు నిరీక్షించుటా మిక్కిలి దోషములని ఎరుంగుము.


58. కాయమున నాటు శరములు
  పాయంబున దీయవచ్చు బహునిష్ఠురతన్
  గూయ మదినాటు మాటలు
  పాయవుగా యెపుడు నెగడు పరచు కుమారా!

ఓ కుమారా! శరీరమునకు నాటిన బాణమును ఉపాయముతో తీయవచ్చు. కాని మనసున నాటిన మాటలు మానసిక వ్యధను కలుగజేయును. అటువంటి కఠిన మాటలను వెనక్కు తీసుకొనుట కష్టం. అవి మనస్సును బాధించును.


59. పెనుకోపము గర్వము ను
  బ్బును జపలము దురభిమానము నిర్వ్యాపారం
  బునుఁ జొరవు నునికియును న
  ల్పుని గుణము లటంచు దెలివిబొందు కుమారా!

ఓ కుమారా! మిక్కిలి కోపము, గర్వము, మానసిక చాంచల్యము, పొంగిపోవుట, గర్వపడుట, పనిలేకుండుట, చురుకుదనములేకుండుట, మొదలగునవి అల్పుని గుణములని తెలుసుకొనుము. ఈ గుణములను నీ దరి జేరనీయకుము.

60. విత్తము గూర్చిన మనుజుం
  డుత్తమ దానంబు భోగమొందని యెడ భూ 
  భృత్త స్కర శిఖి గతము వి
  వృత్తికంబగును నట్టి పదవి కుమారా!

ఓ కుమారా! మనిషి ధనమును ఎక్కువగా కూడ బెట్టవలెను. అట్లు ఐశ్వర్యవంతుడైనవాడు దానము జేయుచు, భోగములను అనుభవింపవలెను. తాను దినక , తనవారికి పెట్టక కూడబెట్టిన ధనము చివరకు రాజులపాలో, దొంగలపాలో, అగ్నిపాలో కాక తప్పదు. అటువంటి స్థితిని బొందకుము.

61. జారులతో జోరులతో
  గ్రూరులతో నెపుడు పొత్తు గోరక మది స
  త్ఫూరుష పదాంబు జాతా
  ధారుడవై బ్రతుకు కీర్తి తనరు కుమారా!

ఓ కుమారా! విటులతోనూ, దొంగలతోనూ, క్రూరులతోనూ కలసి స్నేహము చేయకుము. నిత్యము సజ్జనుల పాదపద్మములను మనసునందు నిలుపుకొని మనుగడ సాగించుము.

62. జ్ఞానుల చరితము వీనుల
  నానుచు సత్పురుష గోష్టి ననఘంబనుచున్
  బూనుము : ధర్మపధంబును
  దా నెరిగినయంత మరువదగదు కుమారా!

ఓ కుమారా! జ్ఞానుల చరిత్రలను వినుటయును, సజ్జనుల సభలలో పాల్గొనుట వలననూ, పాపములు నశించునని తెలియుము. కావున నీ శక్తి సామర్ధ్యములున్నంతవరకూ ధర్మమును వీడక ఈ భూమియందు నడచుకొనుము.

63. తన పంక్తి యందు బాంధవ
  జనము లొక విధంబుగా మెసమ్గుచు నుండం
  గను దా సద్రసముల మెస
  గిన విషభోజన సమంబు క్షితిని కుమారా!

ఓ కుమారా! తన పంక్తియందు కూర్చున్న బంధువులొక విధంబున తినుచుండగా తాను మధుర పదార్థములను, షడ్రసోపేతముగా భుజించుట కూడదు. తనట్లు వేరు విధమున భుజించినచో అది విషముతో సమానమగునని తెలియుము.

64. పరజనులు కట్టి విడిచిన 
  వర చేలములైన గట్ట వలదు వలువలన్
  నెరి మాయు మడాత మార్చుచు
  ధరియించుటా యొప్పదండ్రు ధరను కుమారా!

ఓ కుమారా! ఇతరులు కట్టి విడిచిన వస్త్రములెంత విలువగలవియైననూ, ధరింపరాదు. అట్లే ఎంత విలువగలిగిన వస్త్రములనైననూ నలిగిన మడతలు కనబడునట్లు కట్టరాదు. అట్లు చేయుట ఈ భూమియందు కూడని పని.

65. లోకమున సర్వజనులకు
  నా కాలుడు ప్రాణహారియై యుండగ శో 
  భాకృత కార్యముల వడిం
  బ్రాకటాముగ జేయకుండరాదు కుమారా!

ఓ కుమారా! లోకమునందు సర్వజనులకు హరించు యముడున్నాడని తెలుసుకొని చేయదగిన శుభకార్యముల నన్నింటిని ప్రసిద్ధముగా శీఘ్రముగా వెంటనే చేయుము. ఆలస్యము చేసినచొ పనియగుట కష్టము. అనగా ప్రాణం పోకడ వాన రాకడ ఎవరికీ తెలియనట్లే ఈ గాలిబుడగవంటి జీవితం ఎంత కాలం ఉంటుందో ఎవరికీ తెలియదు కావున దీపముండగానే యింటిని చక్కబెట్టుకొనుమన్నట్లు మహిలో మనం జీవించియున్నపుడే మంచి పనులు చేయుమని అర్ధం.

66. ప్రజ్ఞావంతుని చెతను
  ప్రజ్ఞాహీనునకు గడమ వాటిల్లు నిలన్
  బ్రాజ్ఞత గల్గి నటించిన 
  దత్‍జ్ఞు న్నుతియింతురదియు ధనము కుమారా!

ఓ కుమారా! ఈ భూమియందు తెలివైన‍ వారి వలన తెలివి లేనివారికి కష్టములు కలుగును తెలివిగలిగి నటించిన వాని జీవితమును జూసి జనులెల్లరునూ పొగడుదురు. అదియే మానవునికి ధనము.

67. గృహ దాహకునిం బరదా
  రహరుం బంధుహిత కార్య రహితుని దుష్టో
  త్సాహపరుని జంపి నరపతి
  యిహ పరముల యందు కీర్తి నెసగు కుమారా!

ఓ కుమారా! ఇండ్లను తగులబెట్టువానిని, ఇతరుల భార్యలను హరించువారిని, బంధువులు, హితులు మొదలగు వారి పనులను చేయక చెడగొట్టువానిని, చెడుపనులను చేయుట యందుత్సాహము కలవారిని రాజు సంహరించి ఇహపరలోక కీర్తిని పొందుతాడు.

68. జనియించుట పొలియుటకే
  పెను సుఖమొందుటది కష్ట విధినొందుటకే
  విను హెచ్చుట తగ్గుటకే
  యని మనమున నమ్మవలయునయ్య కుమారా!

ఓ కుమారా! మానవులు పుట్టుట గిట్టుట కొరకే ! మిక్కిలి సుఖములనుభవించుట కష్టములు పొందుటకొరకే. పెరుగుట విరుగుట కొరకేయని భావింపుము. పెద్దలు చెప్పిన ఈ సూక్తిని మరువకుము.

69. కులభామల విడువకు వెలి
  పొలతుల వీక్షించి మోహమును బొరలకుమీ
  ఖలు డందు రెట్టివారలు
  గులహీనుడు పుట్టెననుట కొఱలు కుమారా!

ఓ కుమారా! ఎన్నడునూ నీ భార్యను విడువకుము. పరస్త్రీల వ్యామోహములో పడకుము. అట్లు చేసినచో నిన్ను దుష్టుడందురు. కులహీనుడు జన్మించెననుమాట నీ పట్ల యదార్ధమై నిలిచి యుండును.

70. పాపంబులందు నెక్కుడు
  పాపము సుమీ! ధరిత్రిపై క్రోధగుణం
  బే పారు, లోభమును, విని
  యే పురుషుల బెడద గూడ దిలను కుమారా!

ఓ కుమారా! ఎక్కువైన కోపము, లోభము అనే గుణములు పాపములన్నింటిలోనూ మిక్కిలి పాపములు. అందుచే ఎవరికీ బాధ కలుగకుండునట్లు మసలుకొనుము.

71. ధర నొక్క బుద్ధిహీనున్
  దిరముగ రోటనిడి దంచేనేనియు, బెలుచం
  దురు, యగును గాని యతనికి
  సరసత్వము గలుగదండ్రు సతము కుమారా!

ఓ కుమార! బుద్ధిలేనివానిని రోటిలో దంచిననూ బుద్ధిరాదు. వాని బుద్ధిహీనత ఎక్కువ అగును. చతురత మాత్రం వానికి ఎన్నిటికి కలుగదు.

72. పుడమిని దుష్టత గల యా
  తడు లంచంబులు బట్ట దలుచుచు మిడియౌ
  నడవడి విడి యందరి వెం
  బడి ద్రిప్పికొనుచును గీడు వరుప కుమారా! 

ఈ కుమారా! ఈ ఇలలో చెడ్డబుద్ధిగలవారు, గర్వముతో లంచములను పుచ్చుకొనదలంతురు. తమతో అవసరం కల్గిన మనుష్యులకు, కష్టములను కలిగించు స్వభావముతో తమవెంట పలుమార్లు త్రిప్పించుకొందురు.


73. సదమల మతితోఁ బెద్దల
  మదికింపుగ మెలగు, నింద మానుము పరులన్
  మృదు మార్గములను వదలకు 
  విదితంబుగ దాన: గీర్తి వెలయుఁ గుమారా!

ఓ కుమారా! పెద్దలు సంతోషించునట్ల్లు నిర్మలమైన మనస్సుతో మెలగుము. ఇతరులను నిందించుట మానవలెను. మంచిపద్ధతులను విడిచిపెట్టకు. ఈ విధముగ నడుచుకొన్నచో మంచిపేరు వచ్చును.

74. పుట్టినది మొదలు పర సతి
  బట్టగఁ జూచుటయు నింద పద్ధతి యను చు
  న్నట్టి పురుషుండు పుడమిం
  బుట్టిన జనతతుఅలఁ గీర్తిబొందుఁ గుమారా!

ఓ కుమారా! పుట్టినప్పటినుండి ఇతరుల భార్యలను చెరపట్టవలెనని చూచుటవలన నిందల పాలగును. అనుభవమును మనస్సునందుంచుకొని మెలగవలెను. అట్టివాడు ప్రజలచేత గీర్తింపబడును.

75. ధరణిని పరోపకారా
  చరణ వ్రతనిష్ట నెపుడు సలుపుము నీకా
  తెర గుపవాసాది వ్రత 
  వరకర్మము కంటె మేలు వచ్చు కుమారా!

ఓ కుమారా! ఈ భూమి, యందెల్లప్పుడును ఇతరులకు సహాయము చేయుచుండుము. నియమ, నిష్టలతో వ్రతములకు చేయుము. వ్రతములు చేయుట వలన వచ్చు ఫలము కన్ననూ, ఇతరులకు మేలు చేయుటవలన కలుగు ఫలితమే గొప్పదని తెలుసుకొనుము.

76. విను లోకంబున ధర్మం
  బనగఁ గులాచారమట్ల నరసి నడువఁ దా
  గను మాయుః కీర్తుల నిహ
  మునఁ బరమునఁ బొందు సౌఖ్యములను గుమారా!

ఓ కుమారా! లోకమందు కులాచారమును తెలుసుకొని మసలుటయే ధర్మమనబడును. దీనివలన కీర్తిప్రతిష్టలు, ఆయుష్యు, ఇహపరసౌఖ్యములు కలుగును. ఈ విషయమును గమనించి నడుచుకొనుము.

77. సరి వారి లోన నేర్పున
  దిరిగెడి వారలకు గాక తెరువాటులలో 
  సరయుచు మెలగెడి వారికి
  పరు వేటికి గీడె యనుభవంబు కుమారా!

ఓ కుమారా! నీ తోటివారలతో మెలగునపుడు మంచి తెలివితేటలతో మెలగవలెను. సజ్జనుల సాంగత్యము చేయుము. అట్లుగాక దుష్టుల, దొంగల స్నేహము చేయువారికి గౌరవముండదు. చివరకు ఆపదయే సంప్రాప్తించును.

78. మనుజుడు సభ్యుడు దానై
  కనియున్న యదార్థమెల్ల కానిన యట్లా
  మనుజుండు పలుకకున్నను
  ఘనమగు పాతకము నాడు గనును కుమారా!

ఓ కుమారా! ఉచితానుచితములు తెలుసుకొని మనిషి నడుచుకొనవలెను. తను తెలుసుకొన్న సత్యమును నిర్భయముగా చెప్పగలిగి యుండాలి. చూచిన దానిని చూడనట్లుగా పలుకరాదు. అట్లు చేసిన మిక్కిలి పాపములు అంటును.

79. అంగీకార రహితమగు
  సంగతికిం బోవరాదు సామాన్యుల తో
  డం గడు జగడమునకు జన
  వెంగలితనమంద్రు జనులు వినుము కుమారా!

ఓ కుమారా! అంగీకారముకాని విషయముల జోలికి వెళ్ళకుము. సామాన్యులతో పోట్లాడకుము. అట్లు చేసిన జనులు నిన్ను అవివేకియందురు. ఈ విషయమును గ్రహించి మసలు కొనుము.

80. ధీరుడు తనదగు సంపద
  జారిన యెడ జింత నొందజాలక దా ల
  క్శ్మీరమణుని వర చరణం
  భోరుహములు గొలిచి ముక్తిబొందు కుమారా!

ఓ కుమారా! ధైర్యవంతుడు తన సంపదలు పోయిననూ విచారింపడు. నిబ్బరముతో ఉంటాడు. లక్ష్మీరమణుడైన శ్రీమహావిష్ణువుయొక్క పాదపద్మములను సేవించుచూ మోక్షప్రాప్తిని పొందుతాడు.

81. ధరణీజాతము లే యే
  తరి నెట్లట్లను ఫలించుఁ దగనటు పూర్వా
  చరణ ఫలంబు ననుభవము
  గరమను భవనీయమగును గాదె కుమారా!

ఓ కుమారా! ఈ ధరణిపై ఏయే ఋతువులందు ఏయే విధములుగా వృక్షములు ఫలించునో ఆయావిధముగానే మానవులు తమ పూర్వజన్మములందు చేసిన పాపపుణ్యములఫలములు ఈ జన్మమునందు అనుభవింతురు సుమా!

82. ఘనులు విని సమ్మతింపని
  పనులకు జొతబడక పొగడు పనులను జొరు; మెం
  డును బొంకబోక కడ స
  జ్జనములతో గలసి మెలగు జగతి కుమారా!

ఓ కుమారా! పెద్దలు వలదన్న చెడుపనులను చేయకుము. వారల మెప్పు పొందునట్లు మంచిపనులను చేయుము. అసత్యములు పలుకరాదు. పలుకుటకు వెళ్ళరాదు.మంచివారితో స్నేహము చేసి మంచి అనిపించుకొనుము..

83. రోషావేశము జనులకు 
  దోషము తలపోయ విపుల దుఃఖకరము నౌ
  రోషము విడిచిన యెడ సం
  తోషింతురు బుధులు హితము దోప కుమారా!

ఓ కుమారా! ఆలోచించి చూడగా కోపావేశములు మనుజులకు ఎక్కువ పాపమును అంటగట్టును దుఃఖములకు మూలమవియే. అట్టి గుణములను త్యజించిన వారిని పండితులు పొగిడి మెచ్చుకొందురు.

84. గుణవంతుని సంగతి ని
  ర్గుణులకు గుణములు ఘటించు కుసుమాది సమ
  ర్పణమున వస్త్రాదిక మా
  క్షణమున పరిమళము నొందు కరణి కుమారా!

ఓ కుమారా! పువ్వులు,అత్తరులు మొదలగు వానిచే వస్త్రాదులు గుభాళించునట్లు గుణవంతులతొ కూడిన గుణహీనులకు గూడ గౌరవ మర్యాదలు అబ్బును.

85. మును మనుజుడు జన్మాంతర 
  మున చేసిన పుణ్య పాపములు పుడమిని వా
  నిని బొందక విడువవు దే
  వుని నిందింపకుము కీడు వొడుమ కుమారా!

ఓ కుమారా! పూర్వ జన్మములందు మానవుడు చేసిన పుణ్యపాపములవలన ఈ జన్మములో కష్టసుఖాలనేవి సంభవించును. ఆ పుణ్యపాపముల ఫలమును పొందక విడువవు. నీ కష్టములకు కారణము భగవంతుడని దూషింపకుము భగవంతుని అన్యాయముగా నిందించినచో భంగపడుదువు సుమా!

86. అల సరసాన్నంబుల బరి 
  మళము గలుగు వస్తువులను మహితల యానం
  బుల నాసనముల సుబ్బకు
  కలుగుం జను కాలవశముగాను కుమారా!

ఓ కుమారా! ఈ భూమి యందు అన్నపానాదులు, పరిమళద్రవ్యాలు, వాహనములు, ఆసనములు మున్నగునవి కాలముననుసరించి కలుగుచుండును. అ సౌకర్యములను జూచి పొంగిపోకుము. నీ రాత బాగుండదని కాలమున అన్నియు నీ నుండి దూరమగును.

87. మనుజులు తన సౌఖ్యము కొర
  కును సంరక్షణము నవని గోరుదు రొగి నే
  జన పాలుఁడు సంరక్షిం
  పను దగియును బ్రోవ డతడే పాపి కుమారా!

ఓ కుమారా! ఈ భూమిపై మనుజులు సుఖములు గోరి రక్షణ ఏర్పాటు చేసుకొందురు. రక్షింపగలిగిన సామర్ధ్యము ఉండియు రక్షింపనివాడు పాపాత్ముడే.

88. మండలపతి దండార్హుల
  దండింపక యుండరాదు ధారుణి నాత డ
  ఖండల సమానుడైనను
  మెండగు పాపంబు నొంది మెలగు కుమారా!

ఓ కుమారా! ప్రభువు నిందితులను శిక్షింపవలెను. వారిని దండించకుండా విడిచిపెట్టరాదు. నిందితులను దండింపని ప్రభువు ఇంద్రునితో సమానుడైననూ మిక్కిలి పాపమును మూట గట్టుకొనును.

89. కత్తిని చేతం బట్టుచు
  మొత్త దలచి వచ్చువాని ముఖ్యముగా మే
  ల్వత్తించిన నదె ప్ర్రాయ
  శ్చిత్తమతని జంపదగదు చిన్ని కుమారా!

ఓ కుమారా! కత్తిని చేత ధరించి చంపుతానని వస్తున్న వానిని ఎదిరించకుండా వానికి కావలసిన ప్రయోజనములను కలుగజేసినచో అదే అతనికి ప్రాయశ్చితమునిచ్చి మంచివానిగా జేయును. అట్టి వానిని చంపరాదు. పొసగమేలు చేసి పొమ్మనుటే ఉత్తమమైనది.

90. పురుషుం డొనర్పని పనికి 
  నరయగ దైవం బదెట్టు లనుకూలించున్
  సరణిగ విత్తక యున్నను
  వరిపండునె ధరణిలోన వరలి కుమారా!

ఓ కుమారా! భూమి యమ్దు సరిగా విత్తనము నాటాకున్నచో వరిపైరు ఏ విధముగా మంచిఫలితాలను ఇవ్వదో అట్లే మనిషి తన ప్రయత్నము తాను చేయకున్నచో ఆ పనికి భగవంతుడు ఏ విధంగా అనుకూలించును? (అనుకూలించడని భావము.)

91. చము రింకిపోయినను దీ
  పము శామియించిన విధంబు పౌరుష విహీ
  నమె యగును; దైవ మనుకూ
  లము గాకుండినను భూతలమున కుమారా!

ఓ కుమారా! చమురు ఇంకిపోయినపుడు దీపమెట్లు కరమంగా క్షీణించునో అట్లే భగవంతుడు అనుకూలింఫనపుడు మానవుని పరాక్రమము గూడా అట్లే క్షీణించి పోవును.

92. ఘన బీజపు సాయము లే
  కను భూములు నిష్ప్రయోజకంబైన విధం
  బున దైవము తోడిలఁ గా
  కనె పౌరుష కర్మఫలము గలదె కుమారా!

ఓ కుమారా! భూమియందు గొప్పవైన విత్తనములు నాటకపోయినట్లయిన ఆ భూమి నిష్ప్రయోజనమగును. అట్లే భగవంతుని సహాయము లేనిదే పురుషుని పనులు నెరవేరవని భావము. కావున భూమి పండి సత్ఫలితాలను ఇవ్వాలంటే మంచి విత్తనములు ఎట్లు అవసరమో అట్లే మన పనులు నెరవేరాలంటే భగవంతుని సాయం కూడా కావాలి.

93. ధర నే వస్తువులైనన్
  దరగుటకై వృద్ధినొందు దగ బొడవెదుగున్
  విరుగుటకై పాయుటకై
  దరిజేరును వీని మదిని దలతె కుమారా!

ఓ కుమారా! పెరుగుట విరుగుట కొరకే. భూమియందు ఏ వస్తువులైననూ తగ్గుటాకే పెరుగుదలను పొందును. మిక్కిలి పొడవు పెరిగితే విరుగును కదా! దగ్గరకు చేరుట దూరమగుటకేనని తెలియుము. మనసునందు ఈ విషయములను గుర్తించుకొని మెలగుము.

94. మధురంబుల గొననొల్లడు
  బుధజను డేకతమ దారిబోనొల్లడు నీ
  విధ మెఱిగి నీవును మనో 
  రధ సిద్ధుడా వగుచు మెలగరాదె కుమారా!

ఓ కుమారా! పండితులు తీపిపదార్థములను ఒంటరిగా తినరు. ఒంటరిగా ప్రయాణించరు. ఇందలి సూక్షములను గ్రహించి మసలు కొనుము.

95. చపలాత్ముడవని లోపల 
  నపాత్ర జనులకును దాన మందిచ్చుటా హీ
  నపు గుక్క నోటి లోపల
  నిపుణత నెయిపోసినట్లు నెగడు కుమారా!

ఓ కుమారా! ఈ భూమియందు చంచల స్వభావులైనవారు అయోగ్యులైన ప్రజలకు దానము చేయుట నీచమైన కుక్కనోట్లో నేతిని పోసిన విధముగా నగును. యోగ్యాయోగ్యతలను తెలిసి పాత్రాపాత్రదానము చేయవలెను దానిని బట్టే ప్రయోజనములు కలుగును.

96. యోగ్యుల నరయుగలేక య
  యోగ్యులకున్ దానమొసగుచుండుటా యిది స
  ద్భోగ్యసతిన్ షండునకున్
  భాగము గని పెండ్లి చేయు పగిది కుమారా!

ఓ కుమారా! యుక్తవయసుగల వధువును తాంబూలముతో సహా నపుంసకునికిచ్చి వివాహం జేసినచో అది నిష్ప్రయోజనమ్గును. అట్లే యోగ్యులను తెలియక అయోగ్యులకు దానమొసంగినచొ నవయవ్వన సుందరాంగిని నపుంసకునికిచ్చి వివాహం చేసిన చందముతో నుండును.

97. మును గల్గి ధర్మమును జే
  యునతడు పేద పడెనేని యున్నంతకు దో
  చిన భంగి నర్ధులకును ని
  చ్చునతడె బహు పుణ్య పురుషుండు కుమారా!


ఓ కుమారా! తనకు సంపద కలిగినపుడు ధర్మకార్యములను ఎక్కువగా చేయవలెను. లేనపుడు కనీసము యాచకులకైననూ దానము చేయవలెను. అట్లు మసలువానినే పుణ్యపురుషుడందురు.

98. కడు మెల్లన నిడు నుత్తర
  మడచును గోపమును దీక్ష్మ మరయగ దాన
  ప్పుడు నుడివెడు నుత్తర మది
  వడి గోపము బెంచు నరయ వసుధ కుమారా!


ఓ కుమారా! ఆలోచించి చూసినచో ఈ భూమియందు ఎదుటివారికోపము అణచవలెనన్నచో మిక్కిలి శాంతముతో సమాధానమీయవలెను. మనము కూడా కోపగించినచో ఎదుటివాని కోపము తీవ్రమగునే కాని తగ్గదు.

99. పని బూని జనులు సంతస
  మునఁ దాలిమి సత్యశౌచములను బ్రవర్తిం
  చిన యశము నొందుచుందురు
  గనుగొను మిదె దొడ్డ నడకఁ గాగ కుమారా!

ఓ కుమారా! ప్రజలు, తాము చేయు పనులను సత్యమార్గము, సంతోషముతో చిత్తశుద్ధితో ఓర్పు కలిగి చేయవలెను. అట్లు చేసినచో లోకమున కీర్తిని పొందుదురు. ఇదియే మంచిమార్గమని తెలుసుకొనుము.

100. తన సత్కర్మాచరణం
   బున భాగ్యము వేగవృద్ధి బొందు జగత్ప్ర్రా
   ణుని వర సాహాయ్యముచే
   ననలం బెంతైన బెరుగునయ్య కుమారా!

ఓ కుమారా! అగ్నివృద్ధి పొందాలంటే వాయువు ఎట్లు అవసరమగునో మంచిపనులు చేయుటవలన సంపదలు కూడా అట్లే అభివృద్ధి చెందును.


వనరులు[మార్చు]శతకములు
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము

This work was published before January 1, 1928, and is in the public domain worldwide because the author died at least 100 years ago.