శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము

వికీసోర్స్ నుండి

శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వరశతకము


తాళ్లపాక అన్నమాచార్యుఁడు


ఈతఁడు 15-వ శతాబ్దమువాఁడు. తండ్రి నారాయణసూరి, తల్లి లక్కాంబ. జన్మస్థానము రాజంపేటతాలూకాలోని తాళ్ళపాక. ఈకవి సాళువ నరసింహదేవరాయల కాలములో నున్నవాఁడు. ఆంధ్రద్రవిడకర్ణాటభాషలలో సంకీర్తనపద్ధతి కీతఁడే సృష్టికర్త. సరససంగీతవిలాసములతో సర్వజనసులభముగా, సంకీర్తనాత్మకముగా నాంధ్రవేదాంతము నవతరింపజేసినాఁడు. ఈతనికి సంకీర్తనాచార్యుఁడని, హరికీర్తనాచార్యుఁడని, పదకవితాపితామహుఁడని, ఆంధ్రవేదాంతకర్తయని బిరుదులు గలవు. ఆధ్యాత్మసంకీర్తనలు, శృంగారసంకీర్తనలు, వేంకటెశ్వరశతకము, శృంగారమంజర్యాదులు లభించినవి. సంకీర్తనలక్షణము (సంస్కృతము), శ్రీవేంకటాచలమాహాత్మ్యము, రామాయణము మొదలైన గ్రంథములు రచించినట్లు ఈతని మనుమడు చెప్పెను. కాని పైగ్రంథములు కానవచ్చుటలేదు.

1. ఉ. శ్రీసతి నీల జాంబవతి శ్రీయమునాసతి సత్యభామ ధా
త్రీసతి రుక్మిణీరమణి దేవియిలాసతి వీర లందఱున్‌
జేసినసేవ చేసెదను జేకొను శ్రీయలమేలుమంగ నీ
మూసినముత్యమై యురము ముంగిటఁ జెంగట వేంకటేశ్వరా!

2. ఉ. కన్నులుగల్గి కొమ్మ నిను గప్పముఁ జేకొన లేఁతనవ్వు నీ
కెన్నఁడు మోవి నిచ్చినదో యేగతి మెచ్చితో యెట్టులుండెనో
యన్నిట, నేనెజాణ నని యుందువు శ్రీయలమేలుమంగకే
మన్నన నెట్టు లిచ్చితివో మాటలఁ జిక్కవు వేంకటేశ్వరా!

3. చ. కిలకిల నవ్వు నవ్వి తిలకించితి మంచి సుధారసంబు నీ
పలుకులతేనెలన్‌ విభునిఁ బట్టముఁ గట్టితి నీదుకౌఁగిటన్‌
వలదని చెప్పినన్‌ వినవు వద్దు సుమీ యలమేలుమంగ నీ
కెలవు లటంచు నెచ్చెలులు కీర్తన సేతురు వేంకటేశ్వరా!

4. ఉ. నీవును దాను గూడెఁ దరుణీమణి శ్రీయలమేలుమంగ నా
నావిధవైభవంబుల ననారతముం జెలువొందు నేఁడు నీ
వావలిమోము చేసి తన యప్పటినుండియుఁ బల్కవిట్టులా
దేవర చిత్తమెవ్వరికిఁ దేర్పఁగ శక్యమె వేంకటేశ్వరా!

5. ఉ. ఓలలితాంగి! యోకలికి! యోయెలజవ్వని! యోవధూటి! యో
గోల! మెఱుంగుఁజూపుకనుఁగోనల నోయలమేలుమంగ మ
మ్మేలినతల్లి నీవిభున కించుక మాదెసఁ జూపు మంచు నీ
పాలికిఁ జేరి మ్రొక్కుదురు పద్మభవాదులు వేంకటేశ్వరా!

6. చ. చికురభరంబుచే (నదిమి) శ్రీలలితాంగివి నీవు నాగుణా
ధికునియురంబుపై రతులఁ దేలుచు శ్రీయలమేలుమంగ నీ
లికుచకుచ ప్రభావమున లేఁతవయస్సున నింత నేతురా
వెకలి వటండ్రు నెచ్చెలులు వేడ్కల నీసతి వేంకటేశ్వరా!

7. చ. ఒకమఱి నీవు కన్గొనల నొయ్యనఁ జూచిన నీవిభుండు లోఁ
గకవికఁ దర్చుఁ జేరునట కౌఁగిటి కోయలమేలుమంగ నీ
వికచవిలాస మంచు నరవిందమరందపుఁ దేనెపల్కులన్‌
బికశుకపంక్తి నీకుఁ దలఁపించును నీసతి వేంకటేశ్వరా!

8. ఉ. కూరిమి సానవట్టిన చకోరపుఁ గన్నుఁగొనన్‌ దళుక్కునన్‌
జేరువ మించులై మెఱయఁ జిమ్ములబొమ్మలఁ బంపు నవ్వు దై
వారఁగఁ గాంచి నీతరుణి వన్నెల శ్రీయలమేలుమంగ నీ
సారపు నేర్పుఁ జక్కగొనెఁ జక్కని మోమున వేంకటేశ్వరా!

9. ఉ. ఆయలసంబు లానడపు లాకనుఁగ్రేవల ముద్దుచూపు లా
యాయెలనవ్వు మాటల ప్రియంబులు నీ కలమేలుమంగ నీ
మాయలొ ప్రాణవల్లభుని మక్కువ చేఁతలొ చెప్పు మంచు లేఁ
బ్రాయపు నీసతిం జెలులు పల్కిరి పల్మఱు వేంకటేశ్వరా!

10. ఉ. కిన్నెర మీటి పులకించి తలంచి మనోజలీలఁ దా
నున్న తెఱంగు నెచ్చెలుల కొయ్యనఁ జెప్పఁగబూనుఁ జెప్పరా
కన్నువ సిగ్గుతో నలరు నల్లన శ్రీయలమేలుమంగ నీ
వన్నెలసేఁత లెట్టివో సువాళము లెట్టివో వేంకటేశ్వరా!

11. చ. సరసిజసంభవాది దివిజప్రకరంబులసంపదల్‌ సువి
స్తరములు గాఁగఁ గన్గొనలఁ జల్లెడు శ్రీయలమేలుమంగ నీ
తరుణీయురంబునం జెలఁగఁ దన్మయ మందెడు నీకు బ్రాఁతియే
పరమపద ప్రభుత్వము నపారమహత్త్వము వేంకటేశ్వరా!

12. చ. తరుణి! మహానిధానమ! సుధామయకూపసమస్త వైభవా
భరణమ! దేవదేవుని కృపామతి! యోయలమేలుమంగ! నీ
కరుణయ చాలు లోకములఁ గావఁగ నంచు మునీంద్రులున్‌
సురల్‌ నిరతి నుతించి మ్రొక్కుదురు నీ ప్రియకాంతను వేంకటేశ్వరా!

13. చ. చెదరిన చిన్ని లేఁగురులు చెక్కున జాఱఁగ ముద్దుమోముతో
వదలినకొప్పుతోడ నిడువాలిక కన్నులు నిగ్గు దేఱఁగా
నుదుటున నిన్నుఁగూడి మహిమోన్నతితో నలమేలుమంగ నీ
యెదుట మనోజసంపదల నేగతి నుండెనొ వేంకటేశ్వరా!

14. చ. తొలకరించు తొయ్యలి వధూమణి చక్కనితల్లి మానినీ
తిలకమ దేవదేవుని సతీమణి యోయలమేలుమంగ నీ
సొలపులచూపులే విభునిచూపులవిందు లటంచు నెచ్చెలుల్‌
పలుకఁగ నిన్నుఁ జూచి నగుఁ బైకొని నీసతి వేంకటేశ్వరా!

15. చ. తలఁచుఁ గరంగు మైమఱచుఁ దన్మయ మందును జిత్తజాగ్ని ని
న్నలయుచు దూరు నుస్సురను నర్మిలితో నలమేలుమంగ నీ
వలిగిననంతనే కడుఁ బ్రియంబిఁక నేమని చెప్ప నేఁడువో
కలిగినప్రేమ మింతయుఁ బ్రకాశము తోఁచెడు వేంకటేశ్వరా!

16. ఉ. నించిన పంచదారలును నేతుఁలు దేనెలు గమ్మ గాఁగఁ దా
లించినకూరలున్‌ బరిమళించగ నయ్యలమేలుమంగ వ
డ్డించిన నిర్మలాన్నములు డెంద మెలర్పఁగ నారగింతు నీ
మించిన వేయుచేతులును మేలములాడుచు వేంకటేశ్వరా!

17. ఉ. ఆతఁడె నీవు, నీ వనఁగ నాతఁడు, నీ పలుకే తలంపఁగా
నాతనిపల్కు నీ హృదయ మాతఁడె పో యలమేలుమంగ నీ
చేతిదె సర్వజంతువుల జీవన మంతయు నంచు సన్ముని
వ్రాతము సన్నుతించు ననివారణ నీసతి వేంకటేశ్వరా!

18. ఉ. లోలవిలోలనేత్రకుఁ దళుక్కున ఱెప్పలు వంచి యెత్తినన్‌
మేలిమిఁ జెక్కుటద్దముల మేలములై యలమేలుమంగకున్‌
నీలపయోదపుందుఱుము నిగ్గుతటిల్లతలే యటంచు ను
న్మీలనిమీలనంబులకె మెత్తువు నీవును వేంకటేశ్వరా!

19. ఉ. పక్ష్మలనేత్ర! యోచిలుకుపల్కులకల్కి! సరోజవల్లి! యో
లక్ష్మి! లతాంగి! యోబహుకళావతి! యోయలమేలుమంగ! నీ
సూక్ష్మవివేకలీలలకుఁ జొక్కితి నంచు నఖేందువల్లికా
లక్ష్మివికాసతన్‌ సతిఁ జెలంగఁగఁజేతువు వేంకటేశ్వరా!

20. చ. లలితపుఁగంకణాంగదకలధ్వని ఘల్లని మ్రోయ నుంగరం
బులు మణినీల కాంతుల ప్రభుత్వముతో నలమేలుమంగ గు
బ్బల పెనువ్రేఁగుతోఁ దుఱుముభారముతో నినుఁ జేరవచ్చు నం
దెలు మొలనూలు ఘంటలుఁ బ్రతిధ్వను లీనఁగ వేంకటేశ్వరా!

21. ఉ. కుంకుమకస్తురీ ప్రభ బుగుల్కొనఁ జెక్కుల జాఱ దివ్యతా
టంకమణిప్రభాప్రతివిడంబముతో నలమేలుమంగ భ్రూ
జంకెల నందలింపఁగనె జల్లనెఁ జిత్తము నీకు నంతలో
నంకన మించు మిమ్ముఁ బులకాంకురకోటులు వేంకటేశ్వరా!

22. ఉ. కస్తురి పచ్చకప్పురముఁ గమ్మనిపుప్పొడి ధూళ్లు హత్తి శ్రీ
హస్తమునందుఁ దట్టిపునుఁగందుచు శ్రీయలమేలుమంగ భా
రస్తనవైభవంబులఁ గరంగుచు నిన్ను గఱంగ మెత్తు నీ
కౌస్తుభరత్న సౌధమునఁ గౌఁగిటిపాన్పున వేంకటేశ్వరా!

23. ఉ. అందవు కోసి యిమ్ము విరు లంచును జే రలమేలుమంగ ని
న్నందగఁగోరఁ జెక్కులటు నొక్కిన నాకును నందవంచు న
య్యిందుముఖిం బ్రియంబలర నెత్తుచుఁ బువ్వులు కోయఁజేయ ని
ష్యందమరందఘర్మరససంగతు లబ్బెను వేంకటేశ్వరా!

24. ఉ. ఒక్కొకనాఁటి రాత్రి సకలోన్నతుఁడైన ఖగేంద్ర మూర్తిపై
నెక్కి వినోదలీలఁ జరియించుచు నయ్యలమేలుమంగ మో
మక్కునఁ జేర్చుచున్‌ బహువిహారములన్‌ వనవీథులంబ్రియం
బెక్కువగాఁ జెలంగువిధ మే మని చెప్పుదు వేంకటేశ్వరా!

25. ఉ. దుగ్ధపయోధికన్య జలధుల్‌ జగముల్‌ దనకుక్షినున్న సు
స్నిగ్ధకృశోదరాంగి తులసిం బ్రియురాలలమేలుమంగ యీ
... ... ... ... ... ... నుచు నిన్ను మునీంద్ర కన్యకల్‌
దిగ్ధరణీధరంబుల నుతింతురు నవ్వుచు వేంకటేశ్వరా!

26. ఉ. పాయని జాజిపువ్వులనె పట్టుక బాయు ... ... ...
... ... ... రాహుతుఁడవైనపు డాయల మేలుమంగ ని
శ్శ్రేయసలక్ష్మి నీశరము చెంగట నొప్పెఁ దురుష్క దేశబి
బ్బీయెలపువ్వు పయ్యెదనె ప్రేమపునవ్వున వేంకటేశ్వరా!

27. ఉ. ఓచెలి! యోలతాప్రతిమ! యోమృగలోచ! యోచకోరిరో!
యోచదురాల! యోచిలుక! యో ... ... ... యలమేలుమంగ నీ
చూచినచూపులే విభుఁడు చూచినచూపు లటంచు నీసతిన్‌
ఖేచరసిద్ధకామినులు కీర్తనసేతురు వేంకటేశ్వరా!

28. ఉ. మంగళ మమ్మకున్‌ సకల మంగళ మంబుజ నేత్రకున్‌ జయా
మంగళ మిందిరాసతికి మంగళ మీయలమేలుమంగకున్‌
మంగళమందు నే మఱియు మంగళమందును దేవలోక ది
వ్యాంగన లెల్ల నీసతికి నారతు లిత్తురు వేంకటేశ్వరా!

29. ఉ. వెలదిఁ మహాపరాధములు వేయును జేసితిఁ గావుమన్న నీ
పులకలు మేనిఘాతలును బూఁతలు జూ చలమేలుమంగ నీ
యలకలు దీర్చి చెక్కు చెమ టల్లన గోళ్లను జిమ్మి పయ్యెదన్‌
బలుచనినవ్వుతో విసరుఁ బై చెమ టారఁగ వేంకటేశ్వరా!

30. ఉ. ఏచతురత్వ మేమహిమ మేమి విలాస మదేమి విభ్రమం
బీ చెలువంపు సంపదయు నిందుముఖుల్‌ జగదేకమోహినుల్‌
చూచి తలంట వేడ్కపడి చూతురు నీయలమేలుమంగ లీ
లాచికురంపుఁ గ్రుమ్ముడి కెలంకుల నిగ్గులు వేంకటేశ్వరా!

31. చ. పరిమళమో కదంబమొ ప్రభల్‌ విడ నించిననిగ్గొ నిర్మలా
భరణమొ నిత్యవైభవమొ భాగ్యమొ శ్రీయలమేలుమంగ భూ
ధరునకు నాదిలక్ష్మి యని తత్త్వమహత్త్వ రహస్యవేత్తలం
బరమున నుండి నీవనితఁ బ్రస్తుతి సేతురు వేంకటేశ్వరా!

32. చ. తిరుమగు మంచి కుందనపుఁ దీగపయిన్‌ ఘనచక్రవాకముల్‌
పరగినరీతిఁ జన్నుఁగవ భావముతో నలమేలుమంగ నీ
యురముపయిం జెలంగఁగని యోగిజనంబులు నీలమేఘవి
స్ఫురణముతోడి మిం చనుచుఁ జూచి నుతింతురు వేంకటేశ్వరా!

33. చ. కొలఁదికిమీఱుఁ గ్రొవ్విరులు కొప్పునఁ జాఱఁగఁ జూపుకన్నులన్‌
గులుకుచు నుండ నెన్నుదుటికుంకుమతో నలమేలుమంగ వె
న్నెలనునుఁదీఁగయై కళలునించినఁపుత్తడి బొమ్మయై నినుం
గలికి కరంబునం జెనయఁగంటిరిగా తమి వేంకటేశ్వరా!

34. చ. పెడమర చూచి చూపు జళిపించిన నెట్లు ధరింతువో ప్రియం
బడరఁగఁ గౌనుదీగ నులియన్‌ ... ... ... ... ... నన్‌
సడివడి యెంతవేఁగుదువొ చక్కని శ్రీయలమేలుమంగ నీ
వెడవగు మోముఁజూచి నగి వెన్నెల చల్లిన వేంకటేశ్వరా!

35. ఉ. ... ... ... ... ... గుజ్జెన గూళ్ళును బైఁడిపొళ్ళు మా
యమ్మకు బొమ్మరిళ్లు లలితాంగికి మాయలమేలుమంగకున్‌
బొమ్మలు బొమ్మపొత్తికలు బోనపుదొంతు లటంచు నీసతిన్‌
నెమ్మి భజించి మ్రొక్కుదురు నిర్జరకాంతలు వేంకటేశ్వరా!

36. ఉ. కొమ్మకు గోరుముద్దలును గుజ్జెనగూళ్ళును, బేడపొళ్ళు మా
యమ్మకు, బొమ్మరిళ్లు లలితాంగికి, మాయలమేలుమంగకున్
బొమ్మలు బొమ్మపొత్తికలు బోనపుదొంతు, లటంచు నీసతిన్
నెమ్మిభజించి మ్రొక్కుదురు నిర్జరకాంతలు వేంకటేశ్వరా!

37. ఉ. ఓ కమనీయ1కంజముఖి! యోవలరాయనితల్లి! యోసుధా
సైకతచాతురీజఘన చక్రిణి! యోయలమేలుమంగ! నీ
వే కరుణించి కావుమని వేడ్కల నింద్రపురంధ్రు లందఱున్‌
బైకొని నీలతాప్రతిమ బ్రస్తుతిసేతురు వేంకటేశ్వరా!

1 చంద్ర


38. ఉ. జాగరమేల చేసెదవు చంద్రనిభానన పవ్వళింపు నీ
భోగపరిశ్రమంబులకు భూషణమై యలమేలుమంగ నీ
యోగవియోగలీల లని యోగికన్యలు నీవధూటి నా
యాగతి బుజ్జగింతురు మహావినయంబున వేంకటేశ్వరా!

39. ఉ. పల్లవపాణి విశ్వగురుభామిని యిట్టి ప్రపంచ మంతకున్‌
దల్లి సమస్తజీవులనిధానమ శ్రీయలమేలుమంగ నీ
చల్లనిచూపు చిల్కి వెదచల్లఁగఁ బుణ్యులమైతి మండ్రు భూ
మెల్లను నీ వధూమణి ననేకవిధంబుల వేంకటేశ్వరా!

40. చ. చెఱఁ గిడఁగా నదల్చెదవు చేరినఁ దిట్టెదు కౌఁగిలించినన్‌
గొఱఁతలె యెన్నఁజూచెదవు కోపము న ద్దలమేలుమంగ నా
వెఱ పిఁకనైనఁ దీర్పుమని వేడ్కల నీవు మనోజలీలలన్‌
దఱితఱి నింతిఁ గూడుటలుఁ దత్తఱపాటులు వేంకటేశ్వరా!

41. ఉ. రాపుగ మమ్ము నేయునపరాధశతంబుల సంతముల్‌ సదా
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
... ... ... ... ... ... ... ... ... ... ... ... ... ...
కాపురమున్‌ నిరంతము గల్కితనంబును వేంకటేశ్వరా!

42. చ. వెలయ వసంతవేళ వనవీథుల సంపగిపువ్వుటిండ్లలో
నలరుచుఁ బుష్పవృష్టి నలపార్చుచు నీ వలమేలుమంగతో
నలరఁగ నేఁగి వచ్చి యలపారఁగఁ గస్తురినీట మజ్జనం
బెలమి వహించి గంధతతు లన్నియుఁ గ్రమ్మఱ మజ్జనంబు పెం
పొలయఁగ నాడు తీర్థముల నుబ్బు పయోధులు వేంకటేశ్వరా!

43. చ. వెలయఁగ వేంకటాచలమువీథులఁ గమ్మనిపుష్పవృష్టి కిం
పలరఁగ నేఁగి వచ్చి యలపారఁగ నయ్యల మేలుమంగతో
నలరఁగఁ గోరకమ్ముల లతాంగన లిమ్ముల సేసఁ జల్లఁగాఁ
గలకల నవ్వు మిమ్ముఁ గలకంఠశుకావళి వేంకటేశ్వరా!

44. ఉ. ఎక్కడి కేఁగి వచ్చితి రమేశ్వర నీతనుదివ్యగంధ మే
చక్కనియింతిమేని దని సారెకు నీయలమేలుమంగ నీ
చెక్కు గళంబు గోళ్లవడిఁ జేర్చుచు నీయలపార్చి వేఁడుటల్‌
మక్కువగల్గుకాంతలకు మర్మరహస్యము వేంకటేశ్వరా!

45. ఉ. ... ... ... ... లును బబ్బిలికాయలు పైఁడిమట్టియల్‌
మోద మెలర్ప నందియలు మ్రోయఁగనయ్యలమేలుమంగ క
త్యాదరలీలఁబాడ బలువంచును వేదము ... ... ...
... ... ... ... ... ... ... ... ... ... ను వేంకటేశ్వరా!

46. ఉ. కాంచనరత్న నూత్న కటకంబులు సందులదండలున్‌ బ్రభల్‌
ముంచిన మేఖలావళులు మ్రోయగ నయ్యలమేలుమంగ నే
త్రాంచలగర్వవీక్షణ సుహాసముతో నినుఁ గోరి భ్రూలతన్‌
వంచినఁ దియ్యవిల్లు కడవంచు మరుండును వేంకటేశ్వరా!

47. ఉ. ఒప్పగు తూఁగుటుయ్యెలల నూఁగుచు నీ వలమేలుమంగతో
నప్పుడు కౌఁగిట న్రతుల నాఁకటిపెల్లున నప్పళించుచున్‌
ఱెప్పలనవ్వుతో మనసుఱిచ్చలతో నఱగన్నులార్చుచున్‌
దెప్పలఁదేలు సౌఖ్య మిదె దేవరహస్యము వేంకటేశ్వరా!

48. ఉ. గీసినగోళ్లచేఁ బసిఁడి కిన్నరకంపితముల్‌ కదల్చుచున్‌
రాసెడిగుబ్బచన్నులభరంబున నయ్యలమేలుమంగతో
మూసియు మూయ కక్షు లరమోడ్చుచు ఱెప్పలఁ దేలఁజే
యఁగా నాసల నీవు తన్మయము నందుట చిత్రము వేంకటేశ్వరా!

49. చ. దొరలిన మేనిగందపొడిధూళి వసంతము ఘర్మవారిపైఁ
జఱచినపువ్వుఁదేనెల వసంతము నీ కలమేలుమంగకున్‌
నెఱసి కరంగు చిత్తముల నీళ్లవసంతము మీకు మీకు నీ
యొఱపులు నీప్రియంబులు మహోన్నతు లెట్టివో వేంకటేశ్వరా!

50. ఉ. చక్కనితల్లికిన్‌ నవరసంబుల వెల్లికిఁ బుష్పవల్లికిం
జక్కనిమోవిముత్తియపుజల్లికి శ్రీయలమేలుమంగకున్‌
జెక్కులు మించుటద్దములు చేతులు క్రొత్తమెఱుంగుఁదీగ లా
క్రిక్కిరిగుబ్బలే పసిఁడికిన్నరకాయలు వేంకటేశ్వరా!

51. చ. అరిసెలు నూనెబూరియలు నౌఁగులుఁ జక్కెరమండిగల్‌ వడల్‌
బురుడలు పాలమండిగ లపూపముల య్యలమేలుమంగ నీ
కరుదుగ విందువెట్టు పరమాన్నచయంబులు సూపకోటియున్‌
నిరతి వినిర్మలాన్నములు నేతులసోనలు వేంకటేశ్వరా!

52. ఉ. కానిక లిచ్చె నీవిభుఁడు కౌఁగిటఁ బాన్పునఁ గమ్మవల్పుపూఁ
దేనెల ఘర్మబిందువుల దేహమునం దలమేలుమంగ నీ
వానగుమోముతో విభుని కంచుఁదలిర్చినఁ గాని తన్మయం
బైనను బాయ దంచుఁ జెలు లందురు నీసతి వేంకటేశ్వరా!

53. చ. పెనఁగకుమమ్మ! చిమ్ము జళిపించిన చూపుల గర్వరేఖ రాఁ
జెనకకు మమ్మ! లేఁ జెమటచెక్కుల నోయలమేలుమంగ నీ
ఘనుఁడు కళావినోది రతికాంత విలాససహస్రమూర్తి వ
ద్దని పొలయల్క దీర్తురు లతాంగులు నీసతి వేంకటేశ్వరా!

54. చ. కులుకకుమమ్మ చిమ్మజిలుకుం గొనచూపుల బిత్తరంబుగా
నులుచకుమమ్మ బొమ్మముడి నూల్కొనఁగోపము లేఁతనవ్వు గా
సొలయకుమమ్మ కలి నునుసోఁగల నోయలమేలుమంగ నీ
చెలువున నంచు నెచ్చెలులు చేర్తురు నీసతి వేంకటేశ్వరా!

55. ఉ. చాఁగు బళా జగత్పతికి జాఁగు బళా జగదేకమాతకున్‌
చాఁగు బళా రమేశునకుఁ జాఁగు బళా యలమేలుమంగకున్‌
జాఁగు బళా యటంచుఁ గడుఁ జక్కని కాంతను వీథివీథిమీ
రేఁగఁగ నిత్తు రారతు లనేకవిధంబుల వేంకటేశ్వరా!

56. చ. చొచ్చితిఁ దల్లి నీమఱుఁగు సొంపుఁగ నీకరుణాకటాక్ష మె
ట్లిచ్చెదొ నాకు నేఁడు పరమేశ్వరి! యోయలమేలుమంగ నీ
మచ్చిక నంచు నీతరుణి మన్నన నే నినుఁ గంటి నీకు నా
బచ్చెనమాట లేమిటికిఁ బ్రాఁ తిదె చూడఁగ వేంకటేశ్వరా!

57. ఉ. ఎచ్చరికమ్ము పాదములు నిందిరసింధురయాన తమ్మిపూ
నెచ్చెలి క్రొత్తక్రొత్తపలునిగ్గులతో నలమేలుమంగ నీ
వచ్చిన దాఁక నీవిభుఁడు వంచిన మోమును నెత్తఁడంచు నీ
మచ్చిక యింతి నింతులు మమత్త్వము నెంతురు వేంకటేశ్వరా!

58. చ. కనకపుఁబీఠి నెక్కి రతికాంతశరాకృతి నీవు వీథులం
జనునెడ నీదు చెంగటఁ బ్రసన్నతతో నలమేలుమంగ కాం
చననవకింకిణీరవము సన్నపుఁదాళగతిన్‌ రచింపఁగాఁ
గనుఁగవ మోడ్చి మోడ్చి రతిఁ గౌఁగిటఁ జేర్తువు వేంకటేశ్వరా!

59. చ. ఒఱపగుమీ విహారతతు లుప్పనబట్టెలు బిల్లటీపు ల
చ్చెరువుగ బల్లకోటులు ప్రసిద్ధిగ నయ్యలమేలుమంగకున్‌
మెఱుపులు ముచ్చటల్‌ రతులమ్రొక్కులుఁ దక్కులు వచ్చి వచ్చి మీ
చిఱునగవుం బ్రమోదములు చెక్కులనొక్కులు వేంకటేశ్వరా!

60. ఉ. చక్కెర బొమ్మ చెక్కులనె సానలు పట్టిన పువ్వుటమ్ములో
గ్రుక్కినజవ్వనంబు పెనుగుబ్బలో శ్రీయలమేలుమంగ నీ
వక్కునఁ జేర్చి పట్ట సకలాధిప సౌఖ్యము నీకు నబ్బెఁగా
కెక్కువ లంటు కందువల యింపుల సొంపుల వేంకటేశ్వరా!

61. చ. పరిమళముం బ్రభావము శుభస్థితి నిత్యవిభూతి విభ్రమ
స్ఫురణము దివ్యవైభవము భోగము శ్రీయలమేలుమంగ నీ
యురమున నంచు సన్మునులు యోగిజనంబులు మెచ్చి మెచ్చి నీ
వరవనితాశిరోమణి నవారణఁ గొల్తురు వేంకటేశ్వరా!

62. చ. కులికెడు పండుటామనులఁ గోయిలకూఁతల గుండె ఝల్లనన్‌
జెలువము గల్గు రాకలను జెంగట శ్రీయలమేలుమంగ కో
విలకలనాదకోటులచవిం బచరింపఁగ నెట్టు లోర్తువో
వలపులవార్ధిలోన ననివారణఁ దేలుచు వేంకటేశ్వరా!

63. చ. తొలఁకెడుకొప్పులో నెరులొ తుమ్మెదదాటులొ చూపువంపులో
గులుకులొ మంచివెన్నెలల గుంపులొ శ్రీయలమేలుమంగకున్‌
బలుకులు పచ్చకప్పురపుఁ బల్కులు తావులె దివ్యగంధముల్‌
పలుచనినవ్వులే విరులపాన్పులు నీకును వేంకటేశ్వరా!

64. ఉ. అందము చూతు రుప్పవడమై ఘను లాయలమేలుమంగ మో
మందము గాఁగఁ జూతువు ప్రియంబున మెల్లన నీవటుండఁబో
యందఱి మోముటద్దములు నవ్వల నవ్వుల గోటికొండలై
యందములోన నందములునై వెలుగొందుచు వేంకటేశ్వరా!

65. చ. తలఁచిన గుండె జల్లనును దల్లడమందెడు నేమిసేతు నా
చెలువుఁడు రాఁడటంచు లలసీనవి వో యలమేలుమంగ నీ
తొలకరిమించు నెమ్మనముతొయ్యలిఁ జూడక యెట్టులోర్తువో
యలుగకు మన్న మాన విఁకనైనను నెన్నఁడు వేంకటేశ్వరా!

66. ఉ. ఆయలమేలుమంగ కమలాననయుం గలుహార నేత్రియుం
బాయక తానయై చెలఁగుబద్మ హితాక్షముఁజంద్ర నేత్రమున్‌
సోయగలీల మించు నెటుచూచినఁ బొందిక నెద్ది నిద్ర నీ
కేయెడ మేల్కొనంగఁ దఱి యెయ్యది చూడఁగ వేంకటేశ్వరా!

67. చ. నెఱి నలమేలుమంగకును నీకును పద్మభవాండభాండమే
మెఱసిన బొమ్మరిల్లు తగుమేడలు మీఁదటిలోకముల్‌ ప్రభల్‌
తెఱలఁగ మించు నయ్యినుఁడె దీపము గుజ్జనఁగూడు చంద్రుడే
తొఱలిన దేవసంఘములె తొత్తులు బంట్లును వేంకటేశ్వరా!

68. చ. వడి నలమేలుమంగ నిడువాలికచూపునివాళి నీపయిన్‌
సుడిసిన తమ్మిరేకులంబ్రసూనశరంబులు గల్వరేకులన్‌
బడిబడి మీఁదమీఁద రసభావనగా దిగఁబోసినట్ల పో
పొడవగు పువ్వుజొంపముల పూజలు నీకును వేంకటేశ్వరా!

69. చ. నిను నలమేలుమంగ ఘననీరజపంక్తులు దాఁక నేసినన్‌
జనుఁగవ నొత్తినట్లు కెరజంబుల వాండ్లును నొత్తినట్లు ని
గ్గునఁగనుదోయితామరలఁ గొంకక సారెకు నొత్తినట్లు మైఁ
జెనకి మరుండు బాణములు చిమ్మినయట్లగు వేంకటేశ్వరా!

70. చ. అపు డలమేలుమంగ పొలయల్కలు వద్దని చాఁటి చెప్పినన్‌
గపటపుటల్క లల్లితివి గర్వితనంబునఁ గాంత కోరమే
రపమునఁ జూతుగా కలుక రాజసలీలల నింత దీఱునా
విపులవియోగతాపమున వేడుకకూటమి వేంకటేశ్వరా!

71. చ. ఇల నలమేలుమంగ నిను నేమని తిట్టునొ యేకతంబునన్‌
గలికి మెఱుంగుడాలు తెలికన్నులజంకెన నద్దలింపుచున్‌
బలుకులముద్దు లింపొలయ భారపుగుబ్బల దూర నెత్తుచున్‌
జలజల కొప్పుసంపెఁగలు జాజులు రాలఁగ వేంకటేశ్వరా!

72. చ. తగు నలమేలుమంగకును దన్మయమందెడునీకు మేనిలో
బగటులు బచ్చిమాటలను బచ్చెనయెచ్చరికల్‌ వివేకముల్‌
మొగముల లేఁతనవ్వులను మోవులనాటులుతమ్మితూటులున్‌
జగడపుఁబొందులున్‌ రతులసంపదవిందులు వేంకటేశ్వరా!

73. చ. సరి నలమేలుమంగకును జక్కనిమీకును మీకుమీకు లో
నరుదుగ నేకతస్ఫురణ నమ్ముడు వోయితి రొక్కరొక్కరున్‌
ఇరువురు నింక నేటితెలి వెక్కడినేరుపు లేటిసైరణల్‌
గిరపులపుచ్చె మేనఁ బులకింతలు వింతలు వేంకటేశ్వరా!

74. చ. ఒకయలమేలుమంగ మహిమోన్నతిఁ జిక్కితి యోగలీలచేఁ
జికురభరంబు జాఱ నలసెన్‌ నిఖిలోన్నతుఁ డంచు నీకృపన్‌
బ్రకటములైన కాంత ... ... యింతురు శీతల క్రియన్‌
మొకముల నిగ్గు దేఱఁగను ముచ్చటలాడుచు వేంకటేశ్వరా!

75. చ. నగ వలమేలుమంగకును నాటవవల్కలు నీకు మాటలన్‌
బగ డలమేలుమంగకును బచ్చెనగర్వము నీకుఁ జూపులన్‌
జిగి యలమేలుమంగకును శ్రీమల వేడుక నీకు నిట్ల పో
మిగిలిన మోహసంపదలు మీరును మీరును వేంకటేశ్వరా!

76. ఉ. ఈయలమేలుమంగ మణిహేమకటీరశనాకలాపముల్‌
రాయఁగఁ రాలుఁ బైఁడిపొడి రంతులు మీఱినవజ్రపుంబొడిన్‌
శ్రీయలరారుకొప్పునఁ బ్రసిద్ధిగ రాలెడు కమ్మపుప్పొడిన్‌
నీయనుఁగుంగవుంగిటికి నిచ్చె వసంతము వేంకటేశ్వరా!

77. ఉ. ఓయలమేలుమంగ యిది యొక్కటిపో జగదేక భర్తకున్‌
బాయనినీకునుం గడమ ప్రాణము ప్రాణము నేకమాయె నీ
కాయము కాయముం గలసెఁ గౌఁగిటకాంక్ష యటంచు నీసతిన్‌
బ్రాయము నిండుజవ్వనముఁ బల్మఱు మెత్తురు వేంకటేశ్వరా!

78. చ. ఇతఁ డలమేలుమంగ విభుఁ డీతఁడె1వో కలశాబ్ధికన్యకున్‌
సతతముఁ జిత్త మిచ్చిన రసజ్ఞుఁడు ప్రాజ్ఞుఁడు సర్వవైభవో
న్నతుఁడు రమాసతీ ప్రియుఁడు నందకశార్ఙ్గధరుం డటంచు ని
న్నతివలు మెచ్చి మెచ్చి కొనియాడుదు రెప్పుడు వేంకటేశ్వరా!

1 పో


79. ఉ. మాయలమేలుమంగ చలమా యలయించెద వెంతసేసినన్‌
దోయజగంధి నీకు మతితోడనె తక్కిన దల్క నోపు నా
చేయఁగ నేర్చుచేఁత లివె చేయుదుగాక లతాంతసాయకుం
డీయెడఁ జేయు వేదన లకిన్నియుఁ దోడుగ వేంకటేశ్వరా!

80. చ. మతి నలమేలుమంగకును మంతనమాడెడు నీవిలాసముల్‌
తతిఁ దలపోఁతలై సురతతాండవసంభ్రమలీలలై సమం
చిత సరసప్రసంగములు చిమ్మనిదొంతరలై ప్రియంబులై
వితతమనోజవిద్యల నవీనము లైనవి వేంకటేశ్వరా!

81. చ. కసిగలచూపు చిమ్ముదును కంకణహస్తము సాఁచి కుంచెచే
విసరకు రమ్మనంగ వడి వెన్నెలమోమున ముద్దుగుల్కెడిన్‌
రసికున కంచుఁ జక్కనిపురంధ్రిని నీయలమేలుమంగతో
ముసిముసినవ్వు నవ్వుదురు ముచ్చటలాడుచు వేంకటేశ్వరా!

82. ఉ. నాఁడలమేలుమంగ జననంబుకై కలశాబ్ధిఁద్రచ్చియీ
మూఁడుజగంబులందును బ్రమోదము నించితి వట్ల నుండుచో
నాఁడుఁదనంపుబృంద ముదయంబును బొందఁగ నిత్యసంపదల్‌
నేఁ డిఁక నేమిటం గడమ నీకృప వారికి వేంకటేశ్వరా!

83. ఉ. ఈతరుణీమణీ విభునియిచ్చకుఁ జాలుతలంప నీయనా
యీతని మోహినీగజము యీవని కాయలమేలుమంగ నేఁ
డీతనువల్లి చక్కఁదనము ... ... ... ... చెలువంబు చాలదా
యీ తెలిమిం చటంచు నుతియింతురు నీసతి వేంకటేశ్వరా!

84. చ. మణుల వెలుంగు దీపవనమాలికలై పొగడొందఁ గంకణ
క్వణనము మేఖలావళులఘంటలు శ్రీయలమేలుమంగకున్‌
బ్రణయవినోద సంపదకుఁ బాయక నీ కొనరించుపూజకై
ప్రణుతనుతప్రభావముల భాగ్యము లైనవి వేంకటేశ్వరా!

85. చ. కదిసిన సేసము తైముల కంఠసరుల్‌ ఘనరత్న కంకణాం
గదరశనా ... ... నికాయము శ్రీయలమేలుమంగకున్‌
బొదివి వివాహవేళ దిగఁ బోసిన ముత్తెపుఁ బ్రాల నందమై
ముదమగు నీకుఁ గన్నుఁగవ ముందఱ నెప్పుడు వేంకటేశ్వరా!

86. చ. నిగిడి పయోధిఁ ద్రచ్చు నెడ నిర్జరసంఘము నిక్కి చూడఁగా
ధగధగ యంచు దిక్కుల నుదగ్రతటిల్లత లుల్లసిల్లఁగాఁ
దగ నుదయించి మించిన సుధాప్రతి మీయలమేలుమంగ నీ
మగువ యటంచు మెత్తురు సమస్తమునీంద్రులు వేంకటేశ్వరా!

87. చ. నడవకుమమ్మ పాదనలినంబులు గందెడి, మాట బెట్టుగా
నొడువకుమమ్మ, చెక్కునును నొక్కులతో నలమేలుమంగ నీ
వెడనగ కీమొగంబునకు వెన్నెలలాయె నటంచు నీసతిన్‌
బడఁతులు మేలమాడుదురు పల్కుల తేనెల వేంకటేశ్వరా!

88. ఉ. బూతలబండ్లనే వలపుఁబుక్కిట నించితి వాఁడిగోళ్లనే
ఘాతలు గాఁగఁ జించితివి కాయముపై నలమేలుమంగ నీ
చేతిదె యంచు నీతరుణి చెంతలఁ దట్టపునుంగుఁ గస్తురిన్‌
జాతుదు రోలి నీదు పరిచారిక కాంతలు వేంకటేశ్వరా!

89. ఉ. పచ్చల సందిదండలును బాహుపురుల్‌ మణినూపురంబులున్‌
మచ్చరికంబులుం బసిఁడిమట్టెలమ్రోతలుఁ బెల్లు మ్రోయఁగా
నెచ్చెలు లోలిఁ గొల్వఁ దరుణీమణి శ్రీయలమేలుమంగ నీ
ముచ్చట దీర్చు నొక్కపరి ముందఱ నిల్చిన వేంకటేశ్వరా!

90. ఉ. ఏచిన పాతకంబులకు నిన్నిటికి న్నిరవైనవాఁడ నేఁ
గాచినకష్టవృత్తి కరిగాఁపనె యోయలమేలుమంగ నీ
చూచుకృపానిరీక్షణమె చూచెద నంచును నీప్రియాంగనన్‌
బూచిన వాక్ప్రసూనములఁ బూజలు సేసెద వేంకటేశ్వరా!

91. ఉ. యోగ్యతలేనికష్టుఁడ నయోగ్యుఁడ నన్నిటఁ జూడ గర్భని
ర్భాగ్యుఁడ నీకృపామతికిఁ బ్రాప్తుఁడ నోయలమేలుమంగ నా
భాగ్యము నీగృపాకరుణఁ బ్రాప్యము కావుమటంచు సారెనీ
భాగ్యవతీ శిరోమణినిఁ బ్రస్తుతిసేసెద వేంకటేశ్వరా!

92. చ. తుఱు మఱవీడెఁ బయ్యెదయుఁ దోడనె జాఱె మెఱుంగు ఱెప్పలన్‌
బరవశభావ మేర్పడియెఁ బాయక నీ వలమేలుమంగ నీ
వరునిఁ దలంచితో యనుచు వాసనమేనుల దేవ కామినుల్‌
సరగున నీలతాంగి కుపచారము సేతురు వేంకటేశ్వరా!

93. ఉ. రాజసలీల నన్నును గరంబునఁ బట్టకు చూప వేల నీ
తేజము నాకటంచు సుదతీమణి శ్రీయలమేలుమంగ ని
న్నీ జగదేకనాయకుని నింపొలయించుచు సారెసారెకున్‌
జాజులకొప్పువీడ సరసంబున వీచును వేంకటేశ్వరా!

94. ఉ. చక్కదనంబు రాశి నునుసానలన్‌ బట్టినపువ్వుటమ్ములోఁ
జక్కెర నించి చేసిన రసస్థితి శ్రీయలమేలుమంగ నీ
మక్కువఁ జిక్కి మాతలభ్రమం దగులై కలవంత నిట్ల నీ
వక్కుఁనఁ జేర్పఁగా నలరె నన్నువ కౌఁగిట వేంకటేశ్వరా!

95. ఉ. మానవతీశిరోమణికి మంజులవాణికి మోవితేనియల్‌
కానిక లిచ్చినాఁడవట కౌఁగిట నాయలమేలుమంగకున్‌
మీనచకోరనేత్రి నిను మెచ్చి మదంబునఁ గౌఁగిలించి నీ
పానుపుమీఁది చేఁత లివి పచ్చితలంపులు వేంకటేశ్వరా!

96. చ. ధళధళ మించు కన్నుఁగవ తమ్ముల మిమ్ములఁ జూపు చిమ్మినన్‌
గళవళమందకుండుదురె గ్రక్కున శ్రీయలమేలుమంగకున్‌
సళువుల నవ్వుఁ గొంత నునుసోనలగర్వముఁ గొంతనవ్వుఁగా
కెలపులఁ గొంతకొంత పులకింతలు వింతలు వేంకటేశ్వరా!

97. ఉ. దర్పక రాజ్యసంపదలు తన్మయకోటులు రాగిలోకసం
తర్పణముల్‌ లతాధరసుధాపరిధానము లాననవ్రతుల్‌
కర్పురగంధసౌఖ్యములు గ్రక్కున శ్రీయలమేలుమంగకున్‌
మార్పడు దేహసంగతుల మర్మిపుఁజేతలు వేంకటేశ్వరా!

98. ఉ. అంబరమెల్లఁ జంద్రమయ మైనటులామదనాంకముల్‌ మెయిన్‌
బంబిన నేడ వంచు సిరి పల్కిన నయ్యలమేలుమంగ పా
దంబుల యానవెట్టితివి తమ్మియిగుళ్లని నీకు బొంకులే
నెంబళమాయె నెవ్వరికిఁ జెల్లవు రంతులు వేంకటేశ్వరా!

99. చ. చెఱఁగులు చూపి క్రొవ్విరులు చిందెడు తేనెలు నాల్గువంకలన్‌
వఱదలువాఱె ఘర్మములు వాహినులై యలమేలుమంగతోఁ
గఱఁగుచు నీవు కౌఁగిట సుఖస్థితిఁ గూడుచు బంధుసంగతిన్‌
దెఱ దిగనేసి వేడుకలు తెప్పలఁ దేలఁగ వేంకటేశ్వరా!

100. ఉ. వాలికనేత్రపద్మములు వంచినయావదనంబు పద్మినీ
పాల జనింపనందుననె పద్మినియై యలమేలుమంగ గో
పాలకచక్రవర్తి నినుఁ బాయనికౌఁగిట భోగలీలఁ బాం
చాలునిఁ జేసె పుష్పశరశాస్త్రవిదగ్ధుని వేంకటేశ్వరా!

101. ఉ. అమ్మకుఁ దాళ్లపాకఘనుఁ డన్నఁడు పద్యశతంబుఁ జెప్పెఁగో
కొమ్మని వాక్ప్రసూనములఁ గూరిమితో నలమేలుమంగకున్‌
నెమ్మది నీవు చేకొని యనేకయుగంబులు బ్రహ్మకల్పముల్‌
సమ్మది మంది వర్ధిలను జవ్వన లీలల వేంకటేశ్వరా!

వనరులు[మార్చు]


శతకములు
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము