భద్రాద్రిరామ శతకము

వికీసోర్స్ నుండి


శ్రీభద్రాద్రిరామ శతకము - పరశురామ నృసింహదాసు

(సీసపద్య శతకము)

1.

శ్రీగణాధీశుని సేవించి వినుతించి, భారతీనాథుని బ్రస్తుతించి
శ్రీపతిపాదముల్ చిత్తంబులోనుంచి, సాంబమూర్తిని సదా సంస్మరించి
వాసవాద్యఖిలదేవతలను బ్రార్థించి, సనకాదిమౌనుల సన్నుతించి
గురుపదాంభోజముల్ గొనియాడి పూజించి, వేదాంతవేద్యుల విన్నవించి

ఆంధ్రగీర్వాణకవుల నేనాశ్రయించి
చేయఁబూనితి శతకంబు చిత్తగించు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

2.

శ్రీజానకీరామ సేవకసుత్రామ, రఘుకులాంబుధిసోమ యఘవిరామ
పతితపావననామ భవ్యపరంధామ, కరుణాలలామ సంగ్రామభీమ
వారివాహశ్యామ వరతులసీధామ, యమితవిక్రమ త్రిలోకాభిరామ
విజితభార్గవరామ వినతమౌనిస్తోమ, సంపూర్ణకామ సత్సార్వభౌమ

భక్తమందార నగధీర భయవిదూర
దనుజసంహార విమల వేదాంతసార
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

3.

 వేదము ల్వివరించి విన నేర్చుకొనలేదు, శాస్త్రపురాణము ల్చదువలేదు
యాంధ్రగీర్వాణంబు లభ్యసింపఁగలేదు, వేదాంతమార్గము ల్వెదకలేదు
చూచి ఛందంబులు శోధింపఁగాలేదు, సాధుజనులపొందు సలుపలేదు
విలసదలంకారవిధము చూడఁగలేదు, కావ్యనాటకములు గానలేదు

మీకటాక్షంబు నాయందు మిగులఁ గలుగఁ
జేయఁబూనితి నే నొకసీసశతము
తప్పులేకుండ దయఁజేసి ధరణియందు
గవిజనంబులు మెచ్చ విఖ్యాతిసేయు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

4.

 నీలమేఘముతీరు నీశరీరంబును, బద్మరాగఛాయ పదయుగ్మమ్ము
పన్నగేంద్రసమానబాహుదండంబులు, సింహమధ్యమును హసించునడుము
తిలపుష్పమునుబోలు తీరైననాసిక, శ్రేష్ఠవిద్రుమసదృశోష్ఠములును
గమలంబులను మించు విమలనేత్రంబులు, పున్నమచంద్రునిబోలు మోము

మదనశతకోటి సుందరమైన చక్కఁ
దనము వర్ణింప బ్రహ్మకుఁదరముగాదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

5.

 కేశవ గోవింద కృష్ణ దామోదర, నారాయణాచ్యుతనారసింహ
మధుసూధన త్రివిక్రమజనార్ధనముకుంద, వఈకుంఠవామనవాసుదేవ
పుందరీకదళాక్ష పురుషోత్తమోపేంద్ర, పరమాత్మ పరమేశ పద్మనాభ
మాధవాధోక్షజ మధువైరి శ్రీహరి, విష్ణు విశ్వంభర విశ్వనాథ

శ్రీధరానంతచిద్రూప శ్రీనివాస,
పుణ్యచారిత్ర సురనుత పుణ్యపురుష
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

6.

నిత్యనిరాకార నిరుప్రదవాఖండ, నిర్మల నిర్గుణ నిష్కళంక
నిష్కర్మ నిష్క్రియా నిస్సంగ నిర్వంద్య, నిరుపమనీరంధ్ర నిర్వికల్ప
నిష్ప్రపంఆవ్యయ నిర్ద్వంద్వ నిశ్శబ్ద, నిర్విచానంద నిర్వికార
నిర్విశేషాచింత్య నిరతిశయానంద, స్వస్వరూపంబు నిస్సంశయంబుగ

వారిజాసనకైలాసవాసవాస
వాదులకు నైన వర్ణింప నలవి యగునె
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-:ప్రపంచోత్పత్తిలక్షణము :-

7.

ఆత్మయందు ననేకమాకాశ ముదయించె, నాకాశమున వాయు వపుడు పుట్టె
ననిలంబువలనను నగ్నిహోతముపుట్టె, నగ్నిహోత్రమువల్ల నప్పు పుట్టె
నప్పులవలన మహావనీస్థలి పుట్టె, నవనియం దోషధు లమరఁ బుట్టె
నోషధులందున నొనర నన్నము పుట్టె, నన్నమందును నరులాది సకల

జంతుజాలంబు లాయె నీజగతియుగము
లాయె నీరీతిఁ బరమాత్మ మాయవలన
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: నరప్రమాణసూత్రము :-

8.

 నరుఁడు తొంబదియాఱు నంగుళా లెనిమిది, జేనలపొడవునా ల్జేనలెళుపు
నిట్లు ముప్పదిమూఁడుకోట్లరోమంబులు, వెలయు డెబ్బదిరెండువేలనాళ్ళు
నెముక లఱువదియాఱు నమరు తొంబది రెండు, కీళ్ళు ముప్పదిమూఁడు మూళ్ళప్రేగు
సేరుగుండెలు నర్ధసేరును రుధిరంబు, మణువు నాలుగుసేర్లు మాంసముండు

సోలపైత్యంబు శ్లేష్మ మరసోలె డుండు
నీప్రకారంబు దేహంబు లెంచిచూడ
జంతుజాలంబు లాయె నీజగతియుగము
లాయె నీరీతిఁ బరమాత్మ మాయవలన
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: తొంబదియారుతత్త్వములు :-

9.

 జ్ఞానేంద్రియము లైదు కర్మేంద్రియము లైదు, శబ్దాదు లైదు కోశంబు లైదు
కరణము ల్నాల్గు రాగాదు లెన్మిది పది, నాళ్ళు వాయువులు పద్నాల్గు నేడు
థాతువు లైదు భూతము లాఱు చక్రాలు, మలముల మూఁడవస్థలును నైదు
మూఁడుమందలములు మూఁడీషణంబులు, మూఁడువ్యాధులు గుణా ల్మూఁడు రెండు

తనువులనుగూడి షణ్ణవీత్యాదితత్వ
సాక్షిరూపుఁడవైనావు సత్యముగను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచభూతలక్షణము :-

10.

వసుధాజలం బగ్ని వాయు వాకాశంబు, లివి పంచభూతము ల్వీనియందు
రక్తశుభ్రాసితయుక్తధూమ్రసునీల, ములు గంధరసరూపములను స్పర్శ
శబ్దంబులును గ్రియాశక్తి జ్ఞానేచ్ఛాది, శక్తులు పరపరాశక్తు లమర
నాయుజవిష్ణువు త్ర్యంబకేశ్వరసదా, శివులు నొండొంటికి స్థిరముగాను

వర్ణగుణశక్తి బీజదేవతలు నుండు
నీకు నే గుణములు లేవు నిర్మలుఁడవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచభూతగుణములు :-

11.

రూఢిశబ్దస్పర్శరూపముల్ రసగంధ, ములు నైదు పృధివియందమరియుండు
స్ప్ర్శరసమురూపశబ్దము ల్నాగును, జనితమై జలమారు చెలఁగియుండు
నగ్నిహోత్రమునందు నమరి రూపస్పర్శ, శబ్దము ల్మూఁడు నిశ్చయముగాను
వాయు వందస్పర్శవరశబ్దములు రెండు, నంబరం బందు శబ్దంబు నొకటి

యొక్కటియు లేక దిక్కులు పిక్కటిలఁగ
వెలుగుచున్నావు లోపల వెలుప లనక
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచీకరణలక్షణము :-

12.

ఆకాశపంచక మంతరింద్రియములు, ప్రాణాదులును వాయుపంచకంబు
జ్ఞానేంద్రియములు వైశ్వానరపంచక, మప్పు పంచకము శబ్దాదు లైదు
కర్మేంద్రియము లైదు కడుభూమిపంచక, మిటు లిరువదియయిదింద్రియములు
యివి యాత్మగాదని యిన్నిటి నెఱిఁగెడి, యెఱుకయే పరమాత్మ యని యెఱిఁగి

సాంఖ్యాయోగంబు సాధించి సజ్జనుండు
ముక్తి జెందును మీపాదభక్తితోను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచభూతాంశము :-

13.

 జ్ఞానసమానము ల్వీనులు శబ్దంబు, పాస్స్యోమయంశము ల్పరుసనాయ
మనసువ్యానము చర్మమును స్పర్శకరములు, వాయుయంశంబులు వరుస నాయ
రూఢిబుద్ధియు దాన రూపాక్షిపాదము, ల్వహ్నియంశంబులు వరుస నాయ
చిత్తంబు ప్రానంబు చిహ్నశిశ్నిరసంబు, వారియంశంబులు వరుస నాయ

గంధహంకారము లపానఘ్రుణగుదము
లాయ భూయంశ లిట్లు నీమాయవలన
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచభూతాంశగుణములు :-

14.

 నరము లస్థులు చర్మనఖరోమమాంసము, ల్భూగుణంబులు స్వేదమూత్రరక్త
ములు శుక్లశోణితంబులు వారిగుణములు, క్షుత్పిపాసాలస్యసుప్తిసంగ
ములు వహ్ని గుణములు చలనధావనకంప, నాకుంచనప్రసార్యాదికములు
పవమానగుణములు భయవికారంబులు, క్రోధలజ్జయు నభోగుణము లవియుఁ

బంచభూతాంశగుణములఁ బాఱదోలి
నీస్వరూపంబు గనువాడు నిర్మలుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ<poem>

-: పంచకోశముల నిర్ణయము :-

15.<poem> అన్నరసంబుతోనైన శోణితశుక్ల, మయమైన యాదేహ మన్నమయము
పంచప్రాణంబులు ప్రబలికర్మేంద్రియ, పంచకమును గూడి ప్రాణమయము
జ్ఞానేంద్రియము లైదు మానసం బొక్కటి, కూడియైనవి మనోకోశమయము
చెలగి జ్ఞానేంద్రియములు బుద్ధియునుగూడి, విజ్ఞానమయమున విద్యయందు

మనసు కలసిన యానందమయము నిట్లు
పంచకోశములకు సాక్షిపరుఁడ వీవ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: పంచప్రానములస్థాననిర్ణయము :-

16.

 ప్రాణుండు హృదయాబ్జమందు నావాసమై, నాణిమస్వానము ల్నడుపుచుండు
పాయుపస్థలయం దపానుండు మలమూత్ర, ముల విసర్జనఁజేసి మెలగియుండు
నాభినందున సమానమునుండి సమముగా, నాళ్ళయందున నన్నింటిని నడపుచుండు
ఘనుఁ డుదానుండును కంఠమందుననుండి, వైఖరిపలుకులు పలుకజేయు

వ్యానపవనుండు దేహసర్వావయముల
నిండిశీతోష్ణస్పర్శల నెఱుకఁజేయు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఉపవాయువులలక్షణము :-

17.

నాగుండు నుద్గారుణంబు సేయుచునుండు, మేలుగాఁ గూర్ముఁ డన్మీలనంబు
జేయించుఁ హృకరుండు జేరి తుమ్మించును, జితదేవదత్తుఁడు జృంభణంబు
మరణదేహములందు సరవి ధనంజయుం, డతిశోభము ఘటించి యడఁగఁజేయు
ఘనముగాంతర్యామియును ప్రపంచకుఁడను, వాయువు ల్వరుసకు వాహనముగ

నుండు వజ్రుండు ముఖ్యుండు నొనరుగాను
కీలికీలందు నుండును జీలపగిది
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: సప్తధాతువులనిర్ణయము :-

18.

మఱి రసరుధిరము ల్మాంసము మేదస్సు, మజ్జాస్థిరేతస్సుమానితముగ
నివి సప్తధతువు ల్నిబిడీకృతంబుగా, దేహికావరణంబు దేహమాయ
పాదాదిమస్తకపర్యంతమును నిండి, ప్రకృతిభేదంబుల ప్రబలమాయ
స్థూలమై దీర్ఘమై సూక్ష్మమై నటియించి, యందెందు మరణంబు జెందుచుండు

నిట్టి దేహంబులం దాస లేమిలేక
నిన్ను గనువాడు మునిజనసన్నుతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: శరీరత్రయలక్షణము :-

19.

 జ్ఞానేంద్రియంబులు కర్మేంద్రియంబులు, నంతరింద్రియవిషయేంద్రియములు
ప్రాణాదులనుగూడి పరగ నిర్వదియాఱు, తత్త్వంబులను స్థూలతనువు నయ్యె
బాహ్యేంద్రియంబులు పదిప్రానములు నైదు, ధీమనంబుల సూక్ష్మదేహ మయ్యె
నీశరీరద్వయహేతువై యాద్యవి. ద్యాశ్రుతమై కారణాంగమయ్యె

మూఁడుదేహంబులకు నాదిమూలమైన
క్షరున కక్షరునకు బిలక్షణుఁడ వీవు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: చతుర్దశేంద్రియవిషయములు :-

20.

 శబ్దంబు చెవులకు స్పర్శ చర్మంబున, కక్షికి రూపు జిహ్వకు రసంబు
ముక్కుకు గంధంబు వాక్కుకు వచనంబు, కరమున దానంబు చరణములకు
గమనంబు గుదమునకు గలుగు విసర్జన, గుహ్యము కానందగుణము గలుగు
మనసు చలించును మతి నిశ్చయించును, చిత్తంబుఁ జింతించు మొత్తముగను

మఱి యహంకారన కభిమానపడును
నిన్నిటెఱిఁగిన తెలివి దా నెఱుఁగవలయు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: చతుర్దశేంద్రియములకు అధిదేవతలు :-

21.

 శ్రవణంబులకును దిక్చర్మంబునకు వాయు, చక్షువులకు జగచ్చక్షు వరుణుఁ
డును జిహ్వకును ఘ్రూణమున కశ్వినీసుతు, ల్వాగీంద్రియమునకు వహ్నిహస్త
ములకు నింద్రుడు పాదములకు నుపేంద్రుండు, గుదమును మృత్య్వు గుహ్యమునకు,
చతురాననుడు మానసమునకు జంద్రుండు, బుద్దికి పరమేష్ఠి శుద్ధచిత్త

మునకు జీవుం డహంకారమునకు శివుఁడు
తెలియవలె నీచతుర్దశదేవతలను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: జాగ్రదవస్థలలక్షణము :-

22.

పంచవిశంతి తత్వపరిపూర్ణ మైనట్టి, స్థూలదేహమునందు సురుచిరముగ
రసస్పర్శలనరూపరసగంధవచనదా, నగమనోత్సర్జనానందములను
మానసాహంకారమతిచిత్తములఁగూడి, జీవుండు ముఖమునఁ జేరి నిలిచి
విశ్వనామముఁ జెంది వేర్వేర విభజించి, సకలవ్యాపారము ల్సలుపుచుండు

నదియు జాగ్రదవస్థయు ననుదినంబు
జనితమై జనుచుండును జన్మమునను
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: స్వప్నావస్థలక్షణాము :-

23.

శబ్దాదివిషయపంచకము వాక్యాదిపం, చకము నీపదియు నచ్చటను నిలిపి
మానసాహంకార మతిచిత్తములఁ గూడి, సప్తదశకతత్త్వసంజ్ఞసూక్ష్మ
దేహమందున కంఠదేశంబుననుజేరి, నిలిచి కొంచెముసేపు నిదురఁజెంది
జాగ్రత్తయందు తా జరిపినట్టుగఁ గ్రియ, ల్జేసి మేల్కొని జూడ లేశమైన

లేదు గనుకను స్వప్నంబు నాదిపురుష
సత్య మిదిగాదు జనితమై చనుచునుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: సుషుప్త్యవస్థలక్షణము :-

24.

కంఠదేశమునహంకారచిత్తము లుంచి, ధీమనంబుల రెండి దీసికొనియు
కారణదేహహృత్కమలమందునఁ జేరి, యజ్ఞానసన్నిదియందు నిలిచి
నది సుషిప్త్యనఁబడు నచట రెంటిని నుంచి, తానవిద్యనుగూడి లీనమైన
నదియు గాఢసుషుప్తి యనఁబడు మహిమీద, సర్వంబు నెడబాసి స్మరణతప్పి

యుండ తుర్యం బటంచును యోగివరులు
చాటుచుందురు జనితమై జనుచు నుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: సాత్వికగుణలక్షణము :-

25.

సత్యవ్రతాచారసంపన్నుఁడై యుండు, సత్కర్మక్రియలెల్ల సలుపుచుండు
తపము మౌనంబు నిత్సాహంబు గతినుండు, ధర్మమార్గంబులు దలపుచుండు
శమదమంబులు శాంతి శ్రద్ధలు గలిగుండు, శాస్త్రపురాణము ల్సలుపుచుండు
ధ్యాన సుజ్ఞానసన్మానము ల్గలిగుండు, శ్రేష్ఠదానంబులు సేయుచుండు

ధైర్యనిశ్చయబుద్ధి సద్భక్తినుండు
సకలభూతసముండు సాత్వికయుతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: రాజసగుణలక్షణము :-

26.

 కామంబు క్రోధంబు గర్వంబు గలుగుట, కామ్యసంగతులహంకారపడుట
పరరాష్ట్రములమీఁద బంతంబుసేయుట, పరధనంబులఁ జూచి భ్రాంతిపడుట
వారకాంతల మెండు వాంఛించుచుండుట, నేరము లెన్నైనఁ గోరి వినుట
డంబ ముద్యోగమార్గంబుల మెలఁగుట, యుద్ధరంగమున సన్నద్ధమగుట

భోగభాగ్యంబుఁ గోరుట పొగడుకొనుట
లాలితంబుగ రాజసలక్షణములు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: తామసగుణలక్షణములు :-

27.

 అజ్ఞానవృత్తి మోహాంధకాతయుతుండూ, భూరినిద్రాసక్తి బొందియుండు
ఎదురు తన్నెఱుఁగక విదళించి యదలించుఁ, గోయును తోయును గోపఁబడును
అతిభోజనప్రియుం డతిపానధర్ముండు, పాతకంబుల పట్టుఁబడుచు నుండు
దూషించుచుండు దుర్భాషలు భాషించు, రోషములాడిన రోయకుండు

బుద్ధిలోలుండు సంసారబద్ధకుండు
కుటిలసంగుండు తామసగుణరతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: గుణత్రయవిభాగలక్షణము :-

28.

సాత్వికగుణునికి సగము రాజసము రా, జసములో సగము తామసమునుండు
రాజసగుణుని కర్ధము సత్వమందుండు, సత్వంబులోను దామసము సగము
తామసగుణుని కర్ధము రాజసము రాజ, సమునకు సత్వంబు సగమునుండు
త్రిగుణములీరీతి దేహములందుండు, సాత్వికగుణ ముండు సజ్జనుండు

గురుముఖంబున మీరూప మెఱుఁగుచుండు
త్రిగుణరహితుండు వర్ణింప నగణితుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: దశనాడులస్థాననిర్ణయము :-

29.

 గాంధారిహస్తిని ఘననాళములు రెండు, నేత్రద్వయంబుల నిలిచియుండు
నమరిన యూర్మిళ లనునాళములు రెండు, కర్ణద్వయంబులఁ గలసియుండు
పరజిహ్వనాడియు వక్త్రంబునందుండు, నాభిని శంఖినీనాళముండు
కులహాసినీ వాలికూడి రత్నాహ్వయ, గుదగుహ్యములయందుఁ గుదిరియుండు

కంఠమందున యశ్విని గలిగియుండు
క్షుధయుఁ దృప్తియునెఱింగించుచుండు నెపుడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఇడాపింగళసుషమ్ననాడులలక్షణము :-

30.

ఇడయు పింగళయును గుడియెడమలనుండు, నడుమ సూక్ష్మసుషమ్న నాడియుండు
నీనాడి రంధ్రమధ్యమునందు సూర్యసో, మాగ్నివిద్యాక్షరమాయ యాత్మ
సప్తసముద్రము ల్సప్తపర్వతములు, చతురాగమంబులు శాస్త్రములును
పంచభూతములు సప్తద్వీపములు లోక, ములు గుణంబులు మంత్రములు కళలును

బిందునాదము దిగ్వాయుబీజమాది
సకలదృశ్యపదార్థము ల్సమతనుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: చతుర్ధలోకస్థులనిర్ణయము :-

31.

అతలంబు పాదము ల్వితలంబు గుల్ఫలు, జంఘలు సుతలంబు జానులందు
నుండు తలాతం బూరువులందు భూ, తలము గుహ్యము రసాతలమునుండు
కటిని పాటాళలోకము నాభిభూలోక, ముండు భువర్లోక ముదరమందు
స్వర్గంబు హృదియుఁబక్షము మహర్లోకంబు, ఘనజనుర్లోకంబు గళము బొమల

మధ్యమందు తపోలోక మమరు మూర్ధ్ని
సత్యలోకము నీనివాసస్థలంబు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అష్టదిక్పాలకులస్థలనిర్ణయము :-

32.

భ్రూమధ్య జంభారిపురంబుండు మఱియును, నగ్నిహోత్రునిపురం బక్షియందు
దక్షణకర్ణమం దంతకుపురముండుఁ, దత్పార్శ్వమున యాతుధానపురము
పరగఁ బృష్ఠమునందు వరుణునినగరంబు, పవనపురంబు నాపార్శ్వమందు
వామకర్ణమునందు వరకుబేరపురంబు, హరునిపురము దక్షిణాక్షియందు

శిరమునడుమను నుండు సుస్థిరముగాను
కుంఠితము గాన నీదు వైకుంఠపురము
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: షడూర్ములలక్షణము :-

33.

పృథివి జీవులకెల్ల క్షుధతృష్ణలును రెండు, ప్రాణధర్మములని పలుకఁబడెను
శోకమోహంబులు శోధింపఁగా మనో, ధర్మంబు లని వాని దలఁపవలయు
జననంబు మరణంబు జడరూపమైనట్టి, దేహధర్మములని తెలియఁబడెను
ఇవి షడూర్ము లటంచు వివిధమార్గంబుల, వివరించి వీనిని విడచి నిన్ను

సద్గురూక్తంబుగాఁ గన్నసజ్జనుండు
నిష్కళబ్రహ్మమై యుండు నిగమవినుత
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అష్టమదములలక్షణము :-

34.

ఎక్కవకులమందు నేజనియించితి నాదు, కుల మెక్కు వనుటయుఁ గులమదంబు
సకలనిష్ఠాచారసంపంన్నుఁడను నేను, శ్రేష్ఠుఁడ ననుటయు శీలమదము
ద్రవ్యంబు నావద్ద దండిగా నున్నది, యని గర్వపడుటయు ధనమదంబు
ధరను నావంటి సుందరుఁడు లేఁడని నిక్కి, రూఢిగాఁ దిరుగుట రూపమదము

మదములన్నియు నీదేహమందు విడచి
భక్తినీమీద గలవాఁడు ముక్తుడగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

35.

 బలవంతుఁడ వయసుగలవాఁడ వైరుల, న్వధియింతు ననుట యౌవనమదంబు
సకలశాస్త్రంబులు చదివి వంచించిన, నధికుఁడ ననుట విద్యామదంబు
అఖిలదేశాధిపత్యము నాకు గలదని, రంజిల్లుచుండుట రాజ్యమదము
స్నానసంధ్యాద్యనుష్ఠానుండ నేనని, మదియుబ్బుటయుఁ దమోమదము సుమ్మి

యష్టమదముల నణఁచి ననిష్ఠపరుఁడు
పుణ్యపురుషుండు వైకుంఠపురము నుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అష్టపాశముల నిర్ణయము :-

36.

తల్లిదండ్రియు భార్య తనయులు మిత్రులు, ధనము సహోదరు ల్తనువులైన
అష్టపాశంబులు నమరి బంధనములచేఁ, దగిలుండు నరులు నీధరణియందు
అత్తమామల బావ లల్లుండు కోడండ్రు, వదినెలు మఱదండ్రు మఱఁదు లనుచు
తాపత్రయంబులఁ దగిలి వర్తించుచు, మత్తులై మనుజులు మందమతిని

సాధుసజ్జనసంగతి సలుపలేక
మోక్షమార్గంబు నెఱుఁగరు మోహరహిత
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: మలత్రయలక్షణము :-

37.

పరమాత్మ మెఱుఁగక తెరుపు మరుపుచేత, గాత్రపుత్రకళత్రమిత్రులందు
సక్తుఁడై కడలేని సంసారవార్ధిలో, మునిగితేలుట నెల్ల యణవమలము
పరద్రవ్యమాపేక్షపడి పరజనులకు, నపకృతిసేయు మాయామలంబు
పుణ్యపాపములచేఁ బుట్టుచావులను ని, ర్మించుచుండుటయుఁ గార్మికమలంబు

మూఁడుమలముల విడువక ముక్తిపథము
గాన లేరైరి పామరమానవులును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: తాపత్రయలక్షణము :-

38.

తాపత్రయంబుల ధర్మముల్వేర్వేఱ, వివరించి చెప్పెద విమలచరిత
దేహజన్యము లైన త్రివిధరోగంబుల, తాపదుఃఖంబు లధ్యాత్మికంబు
వ్యాళవృశ్చికచోరవ్యాఘ్రాదిభూతసం, భవదుఃఖములు నాధిభౌతికంబు
వర్షాశనీపాతయాయురగ్నిశిలాప, తనదుఃఖములు నాధిదైవకంబు

నిట్టితాపత్రయంబులఁ గొట్టివేసి
ధీరుఁ డగువాఁడు మోక్షాధికారియగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఈషణత్రయలక్షణాము :-

39.

కామధర్మార్థము ల్గలుగుటకై భార్య, నిచ్చ నుంచుటయు దారేషణంబు
సుతులు లేకున్న సుగతులు లేవనుచుఁ బు, త్రేచ్ఛనుండుటయ పుత్రేషణంబు
దానధర్మములచే తరియింతు నని ద్రవ్య, మిచ్చయించుటయు ధనేషణంబు
దారాది కేషణత్రయములచేతను, నవనిలో సౌఖ్యంబు లనుభవించి

పుణ్యలోకంబు లెల్లనుఁ బొందవచ్చు
గాన మీలోన నైక్యమార్గములు గావు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: వాసనత్రయలక్షణము :-

40.

లోకానుసారియై లౌకికవృత్తుల, వసియించుటయు లోకవాస నండ్రు
శాస్త్రపద్ధతి తమోజపక్రతువ్రతముల, వర్తించుటయు శాస్త్రవాస నండ్రు
దేహశోషణఁ జేసి తీర్థయాత్రల కెల్ల, వడితిరుగుట దేహవాస నండ్రు
ఈమూఁడువాసన లిచ్ఛయించక దేశి, కులసేవ చేసి షడ్గుణము లణఁంచి

తత్త్వమస్యాదివాక్యతాత్పర్య మెఱిఁగి
తన్ను తాఁ గన్నపురుషుఁడ ద్వైతుఁడగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: వ్యాధిత్రయలక్షణాము :-

41.

 వాతంబునం దుద్భవం బైన రోగము, ల్బాగుగా నెనిమిదిపదులు నయ్యె
పైత్యమం దుద్భవం బైనరోగంబులు, దండిగా నెనుబదిరెండునయ్యె
శ్లేష్మందున జనించినరోగములును ని, న్నూటనిర్వదినాల్గు నుచితమయ్యె
త్రివిధరోగంబు లీతీరున మున్నూట, నెనఁబదినారును నెన్నికయ్యె

నట్టివ్యాధుల కాధారమైన దేహ
భ్రాంతి విడచినవాఁడు సద్భ్రహ్మవిదుఁడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: జన్మహేతులక్షణము :-

42.

 ఆత్మయందున మాయ యారోపితంబయ్యె, మాయయం దజ్ఞాన మపుడు గలిగె
నజ్ఞానమునఁ దోచె నవివేక మవివేక, మందున నభిమాన మమరఁ బుట్టె
నభిమానమందు రాగాదు లుద్భవమయ్యె, రాగాదులందుఁ గర్మములుఁ బొడమె
కర్మలవలనను గడలేని సుఖదుఃఖ, మూలమైనశరీరములఁ జనించె

నీవిధంబున దేఖంబు లెత్తి జనులు
నిన్నుఁ గనలేరు నిరుపమ నిర్మలాత్మ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

43.

రాతిరిపడియున్న రజ్జు వంతటఁ జూచి, భ్రమసి పామని భయపడినయట్లు
శూక్తి దూరంబునఁ జూచి వెండి యటంచు, ప్రబలినయాశచే భ్రమసినట్లు
దండకారణ్యమం దెండుమొద్దును జూచి, దొంగవాఁడని భీతి దోఁచినట్లు
కలలోన వస్తువు ల్గని మేలుకొనలేచి, నావస్తువుల వెదుకాడినట్లు

నరులు సత్యయు జగమని నమ్మినారు
జ్ఞానపథమందు నిజరూపు గానలేక
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అనాత్మలక్షణము :-

44.

జన్మాస్థివృద్ధులు క్షయపరిణామ నా, శములు షడ్విధవికారముల నాత్మ
ఘనబాల్యయౌవనకౌమారవార్ధక, ములు జాగ్రదాద్యవస్థలును నాత్మ
కమనీయమహదహంకారభూజలహుతా, శనసమీరాంతరిక్షముల నాత్మ
త్రిగుణముల్ స్థూలాదిదేహత్రయములన్న, మయమాదిపంచకోశముల నాత్మ

యంతరింద్రియబాహ్యేంద్రియముల నాత్మ
దృశ్యరూఅంబు శ్రుతమును దృక్కనాత్మ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: సాధనచతుష్టయసంపత్తిలక్షణము :-

45.

 సత్యంబు బ్రహ్మం బసత్యంబు సర్వప్ర, పంచంబ యని విమర్శించువాఁడు
ఇహపరసౌఖ్యంబు లిచ్ఛయింపకయుండి, పాపపుణ్యంబులఁ బడనివాఁడు
శమదమంబులు శాంతిశ్రద్ధోపరతితితీ, క్షలు సతతంబును గలుగువాఁడు
మోక్షంబుమీఁద నాపేక్షవిస్తారమై, కాని యేయాపేక్షలేనివాఁడు

గురుకటాక్షంబుచేతను గురుతెఱింగి
నసిపదం బగునీయందు నైక్యమగును
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: శమదమాదిషట్కసంపత్తిలక్షణము :-

46.

అంతరేంద్రియనిగ్రహంబు శమంబగు, బహిరింద్రియములనిగ్రహము దమము
నపవర్గషట్కంబు లణఁచుట శాంతియు, సుఖదుఃఖములకు నోర్చుట తితీక్ష,
వేదాంతశాస్త్రము ల్విని విమర్శించి స, ద్గురువందు భక్తిగల్గుటయు శ్రద్ధ
కర్మంబులను బ్రహ్మ కల్పించి హృత్పర, బ్రహ్మసంగం బుపరతి యటంచు

నెఱిఁగి నడచినవాడు యోగిశ్వరుండు
నతడు ముక్తుండు నాద్యుండు నచ్యుతుండు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: అరిషడ్వర్గములలక్షణము :-

47.

 కోరుట కామంబు కోరినయర్ధంబు, కొనసాగకుండిన క్రోధమగును
వచ్చిన ద్రవ్యంబు వదలకుండును లోభ, మాధనాపేక్ష మోహంబ యగును
ధనమున్నదని మోదమున నుబ్బి నాకేమి, కొదువని గర్వించినది మదంబు
తనద్రవ్య మపహరింతమనెడిజనులందు, మది నీర్ష్యయుంచుట మత్సరంబు

గనుక నీశత్రువర్గషట్కముల నణఁచి
శాంతిఁ బొందినపురుషుండు సర్వసముఁడు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఉపదేశమయ్యెడుక్రమము :-

48.

సాధనచత్వారిసంపత్తియును గలిగి, పరిపూర్ణుఁ డైనసద్గురినిఁ జేరి
ద్వాదశాష్టాంగదండంబుల నర్పించి, తనుమనఃప్రాణము ల్ధారఁబోసి
భక్తితో నాత్మాంగభావసుస్థాన శు, శ్రుషలుఁజేసి సంతోషపఱిచి
నట్టి శిష్యునిమెచ్చి గట్టిగా గురుమూర్తి, త్రివిధదీక్ష లొనర్చి దివ్యముగను

హస్తమస్తకసంయోగమంచితముగఁ
జేసి నిజకేవలాత్మోపడేశ మొసఁగు
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ఉపదేశించుక్రమము :-

49.

యమము నియమము నాసనము ప్రాణాయామ, మమరప్రత్యాహారమంచితముగ
ధ్యానధారణసమాధ్యష్టాంగయుతమంత్ర, యోగము లయహఠయోగములను
రాజయోగంబు తారకము సాంఖ్యామాన, సమును ముద్రలు లక్ష్యసాధకములు
వరతత్వమస్యాదివాక్యము ల్జీవేశ్వ, రైక్యసంధానము ల్రాజితముగ

శిష్యునికిఁ దెల్పి గురుమూర్తి స్థిరముగాను
పూర్ణభావంబుఁ బొందించు బుధులు మెచ్చ
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ

-: ధ్యానముద్రమంత్రయోగలక్షణము :-

50.

భూసురుం డెవడైనఁ బుణ్యశీలుఁడు మహా, నదులతోయముల స్నానంబుఁజేసి
శుభ్రవస్త్రముగట్టి శుచియైనస్థలమందుఁ, గ్రమముతోఁ గూర్మచక్రము లిఖించి
దర్భకృష్ణాజినధవళాసనములపై, పద్మాసనస్థుఁడై పదిలముగనుఁ
గన్నులు బిగియించి కడువెన్ను నిక్కించి, నాసాగ్రమునఁ జూపుఁ జూచి మనసు

కష్టమైనట్టి మంత్రంబు నిష్ఠతోను
జపము సేసినయోగి సజ్జనుఁడు సుమ్మి
రమ్యగుణధామ భద్రాద్రిరామ సత్య
కామ కరుణాలలామ లోకాభిరామ


శతకములు
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము