కాశీమజిలీకథలు/ఉత్తరఖండానుబంధము/ఉపోద్ఘాతం
ఇందు వచ్చు పాత్రలు
పురుషులు
1. శూద్రకమహారాజు - కథానాయకుని యపరావతారము
2. తారాపీడుఁడు - కథానాయకునితండ్రి.
3. శుకనాసుఁడు - తారాపీడుని మంత్రి
4. చంద్రాపీడుఁడు - కథానాయకుడు.
5. పుండరీకుఁడు - మహాశ్వేతచే వరింపఁబడినవాఁడు.
6. కపింజలుఁడు - పుండరీకుని మిత్రుఁడు
7. హంసుఁడు - మహాశ్వేత తండ్రి
8. చిత్రరధుడు - కాదంబరి తండ్రి.
9. వైశంపాయనుఁడు - పుండరీకుని యపరావతారము.
10. కేయూరకుఁడు - కాదంబరి వీణావాహకుఁడు.
11. మేఘనాధుఁడు - కథానాయకుని సేనాధిపతి.
12. జాబాలి - ఈకథ చెప్పిన మహషి౯.
13. హరీతకుఁడు - జాబాలి కుమారుఁడు.
స్త్రీలు.
1. కాదంబరి - కథానాయకురాలు.
2. మహాశ్వేత - కాదంబరి స్నేహితురాలు.
3. విలాసవతి - కథానాయకుని తల్లి.
4. మనోరమ - వైశంపాయనుని తల్లి.
5. పత్రలేఖ - చంద్రాపీడుని తాంబూలదాయిని.
6. మదలేఖ - కాదంబరి సఖురాలు.
7. తరళిక - మహాశ్వేత సఖురాలు.
8. మదిర - కాదంబరి తల్లి.
9. గౌరి - మహాశ్వేత తల్లి.
పీఠిక.
ఈ ప్రబంధమును సంస్కృతమున గద్యముగా రచించినవాఁడు బాణకవి. ఇతఁడు శ్రోత్రియ బ్రాహ్మణుఁడు. వాత్స్యాయన సగోత్రుఁడు, హర్ష వర్ధనుని యాస్థానకవి. మయూరకవికి మేనమామ. శోణానదీకూలముననున్న ప్రీతికూటమితని జన్మభూమి. తల్లి రాజదేవి. తండ్రి చిత్రభానుఁడు. తాత యర్ధపతి. ముత్తాత కుబేరుఁడు. ఇతండు జనించిన యాఱవదినమునఁ దల్లియుఁ బదునాలుగువ వత్సరమునఁ తండ్రియు మృతినొందిరి. ఈకవి హర్ష చరిత్రమను మఱియొక గద్య కావ్యమునఁ దనచరిత్రయంతయుఁ దెల్లముగాఁ జెప్పికొనియెను.
హర్ష వర్ధనుఁ డాఱవశతాబ్దములో రాజ్యము చేయుచున్నట్లు పెక్కు నిదర్శనము లుండుటచే బాణకవియు నాఱవశతాబ్దము చివరగాని, యేడవశతాబ్దము మొదటఁగాని యుండవలయును. కావున నిప్పటి కించుమించుగాఁ బదమూఁడువందల సంవత్సరముల క్రితము వాఁడని తోఁచుచున్నది. ఇతఁ డంత్యదశయందీ గ్రంథమును రచించెను. కాదంబరి, పత్రలేఖచేఁ జంద్రాపీడునకు సందేశము పంపునప్పుడు 1724 గద్యము 'జ్ఞాస్యసి మరణేన ప్రీతిమిత్యసంభావ్యం' అని వ్రాసి యందుఁగల యశ్లీల దోషంబున నతండు హటాత్తుగా మరణము నొందెనని చెప్పుదురు.
బాణకవి కుమారుండు తరువాతికథఁ బూర్తిజేసెను. దానికే యుత్తరభాగమనిపేరు. బాణకవి కథాసరిత్సాగరములోని శక్తి యశోలంబకమునందలి మూఁడవతరంగమున గోముఖుఁడనువాఁడు నరవాహనదత్తునకు వినోదమునకై చెప్పినకథనే కాదంబరిగా రచించెను. రశ్మిమంతునికిఁ బుండరీకుఁడనియు, సోమప్రభునకుఁ జంద్రాపీడుఁడు, మనోరథ ప్రభకు మహాశ్వేత, మకరందికకుఁ గాదంబరి, యనియుఁ బేరులుమాత్రము మార్చి వ్రాసెను. ఇట్టి ఫ్రౌఢకవి ప్రత్యేకము తానొక కథను గల్పించి వ్రాయక యొకరు వ్రాసినకథనే తీసికొని రచించుటకుఁ గారణము మృగ్యమైయున్నది. కథ అదియేయైనను పాత్రోచితమైన సంబాషణములు స్వభావవర్ణనలు శయ్యా రీతి పాకాదు లిట్టివి మరియొక గ్రంథమునఁ గనంబడవు. దేనివర్ణించినను నెదురఁబెట్టి కన్నులకుం జూపునట్లు స్వభావోక్తిగాఁ దెలియఁజేయును. ఈగ్రంథము రచించుటచేతనే 'బాణోచ్చిష్ఠం జగత్సర్వం' అను వాడుక వచ్చినది.
ఇందుఁ గాదంబరీ మహాశ్వేతలను గంధర్వ రాజపుత్రికల చారిత్రము విప్రలంభశృంగారరసపూరితముగా వర్ణింపఁబడియున్నది. గ్రంథమంతయుఁ జదివినఁగాని యిందలి కథాచమత్కారము తెలియంబడదు. దీని సమముగాఁ దెలిగించినచోఁ జదువరులకు సులభగ్రాహ్యముగాదని విశేషవర్ణనల వదలి కథమాత్రమే వ్రాసితిని.
కథాసంగ్రహము.
దేవలోకములో శ్వేతకేతుఁడను మహార్షి ఆకాశగంగలో దేవతార్చనకుఁ బద్మములు గోయుచుండఁగాఁ బద్మసన్నిహితయైన లక్ష్మి కతనిఁజూచినతోడనే చిత్తచాంచల్య మైనందున సద్యోగర్భంబునఁ బుండరీకుఁడను కుమారుఁ డుదయించెను. సుందరరూపుఁడగు నతఁ డొకనాఁడు కపింజలుఁడను మునికుమారునితోఁగూడ నచ్ఛోద సరస్సునకు స్నానమునకై యరిగెను. అక్కడికే తల్లితోఁగూడ స్నానమునకై వచ్చిన మహాశ్వేత యనుగంధర్వకన్యక పుండరీకునిమోహించి యతని మరులుకొలిపి భావమువ్యక్తపరచియు మాటాడక తల్లితో నింటికిఁబోయినది. మరణతుల్యమగు పుండరీకుని విరహవేదన జూచి కపింజలుఁ డమ్మహాశ్వేతయొద్దకుఁబోయి తెలియఁజేసెను. ఆరాత్రియే తరళిక యను పరిచారికను వెంటఁబెట్టుకొని మహాశ్వేత పుండరీకునొద్దకు వచ్చినది. ఈలోపుగనే చంద్రోదయమైనంతఁ బుండరీఁకుడు విరహబాధఁ బడలేక నీవుకూడఁ బుడమిం జనించి నావలెనే విరహతాపంబున మృతినొందుమని చంద్రుని శపించెను. చంద్రుఁ డతని నట్లే మరల శపించెను. మహాశ్వేతయు మృతుఁడైయున్న పుండరీకుని జూచి శోకించుచు నాకాశవాణిచే నూరడింపఁబడి యోగినియై యా సరస్త్సీరమందే తపంబుఁజేయుచుండెను.
పుండరీకునిచే శపింపఁబడిన చంద్రుఁడు తారాపీడుని కుమారుండై యుదయించి చంద్రాపీడుఁడనుపేరుతో పుండరీకావతారమైన వైశంపాయనుఁ డను మంత్రి పుత్రునితో గూడికొని దిగ్విజయయాత్ర జేయుచు నొక యరణ్యమధ్యంబున సేనల నిలిపి కిన్నెర మిధున మూలముగఁ జంద్రాపీఁడు డా యచ్ఛోదసరస్సునకుఁ బోయి మహాశ్వేతం గాంచి తన కథచెప్పి యామె వృత్తాంతమును విని యోదార్చును. మఱియు మహాశ్వేత సఖురాలు కాదంబరి యనుచిన్నది సఖురాలిమూలమునఁ దాను వివాహమాడనని శపథము జేయుటయు దానితండ్రి మందలింపుమని మహాశ్వేతకు వర్తమానమును బంపెను.
అప్పుడు మహాశ్వేత కాదంబరిని బెండ్లియాడుమని మందలించుటకుఁబోవుచు ఒకనాఁడు చంద్రాపీడునిగూడ వెంటఁబెట్టికొని పోయినది. కాదంబరి చంద్రాపీడునిఁజూచి మోహపరవశయై శపథములు మరచి శృంగారలీలలు ప్రకటించినది. సందిగ్ధంబగు తద్భావముల గ్రహింపక యొకనాఁడు మాత్రమేయుండి చంద్రాపీడుఁడు తనసేనానివేశమున కరిగెను. అమ్మరునాడు క్రమ్మర నతని తీసికొనిరమ్మని కాదంబరి కేయూరకుఁడను తన వీణావాహకు నంపినది. ఆ వార్తవిని చంద్రాపీడుఁడు పత్రలేఖతోఁగూడ నమ్మరునాఁడు కాదంబరియొద్ద కరిగెను.
నాఁడుగూడ వారిభావములు సిగ్గుచే నొండొరులకుఁ దెల్లమైనవికావు పత్రలేఖ నందుంచి చంద్రాపీడుఁడు తనస్కంధావారమునకుఁ బోయెను. అప్పుడే తనతండ్రియొద్దనుంచి వచ్చినయుత్తరము జూచి తత్తరముతో మేఘనాధుఁడను సేనాధిపతి నందుండి పత్రలేఖను వచ్చినతరువాతఁ తీసికొనిరమ్మనిచెప్పి కాదంబరికొక యుత్తరము వ్రాసియిచ్చి వైశంపాయనుని స్కంధావారముతో రమ్మని తానుజ్జయినికిం బోయెను.
తరువాతఁ బత్రలేఖయుఁ గేయూరకుఁడునువచ్చి చంద్రాపీడునకు గాదంబరి విరహాతురత్వ మెఱింగించిరి. ఆమె తన్నుగుఱించి పరితపించు చున్నదని విని చంద్రాపీడుఁ డిల్లు కదలు నుపాయ మాలోచించుచు వైశంపాయనుఁడు సేనలతో రాక యచ్ఛోద సర'స్త్సీరమున విరక్తిఁ జెందియున్నాఁడను వార్తవిని ముందుగాఁ దనరాక కాదంబరికిఁ దెలియఁజేయుటకై పత్రలేఖను కేయూరకుని హేమకూటమున కనిపి తానుబోయి వైశంపాయనుని దీసికొని వత్తునని తండ్రి కెఱింగించి తదనుమతి బయలుదేరి తిన్నగా నచ్చోదసరస్సునకుఁబోయి యాప్రాంతముల నతని వెదకుచుఁ పిమ్మట మహాశ్వేతయొద్దకుఁ బోయెను.
మహాశ్వేత యతనిం జూచి దుఃఖించుచు వైశంపాయనుఁడు తన్నుఁ గామించి శప్తుండై మృతుం డయ్యెనని యాకథ యెఱింగించినది. ఆమాట వినినతోడనే చంద్రాపీడుఁడు ప్రాణములువిడిచి నేలంబడిపోయెను. అక్కడఁ గాదంబరియుఁ బత్రలేఖచేఁ దెలుపఁబడి చక్కగా నలంకరించుకొని మహాశ్వేతాశ్రమమునకు వచ్చి చచ్చియున్న చంద్రాపీడునింజూచి దుఃఖించుచు మహాశ్వేతవలెనే యశరీరవాణీచే నూరడింపఁబడి తద్దేహ మర్చించుచుఁ గొంతకాలము గడిపినది. పుండరీకునిచే శపింపఁబడి చందృఁడు చంద్రాపీడుఁడై పుట్టెను. చంద్రాపీడుఁడు అట్లు ప్రాణములు విడిచి శూద్రకమహారాజై యుదయించి రాజ్యమేలుచుండెను. చంద్రునిచే శపింపఁబడిన పుండరీకుఁడు రెండవజన్మమునందు వైశంపాయనుఁడై మూడవజన్మమునందు మహాశ్వేతచే శపింపఁబడి చిలుకయై యుదయించి జాబాలి యను మహర్షి యాశ్రమమున జాతిస్మృతిగలిగి మహాశ్వేతయొద్దకుఁ బోవుచుండ నతనిదుర్వృత్తి వారించుటకై వానితల్లి లక్ష్మి మాతంగకన్యక రూపమున వెలసి యాచిలుకం బట్టి తెప్పించి యనుతాపము గలుగఁ జేసి శాపావసానమున శూద్రకునియొద్ద కా చిలుకను దీసికొనివచ్చి యప్పగించినది. ఆరాజు చిలుకవలనఁ దమప్రాక్తన జన్మకథయంతయు విని విరాళిజెందుచుఁ జిలుకతోఁగూడ నాదేహము విడిచెను. అక్కడఁ జంద్రాపీడుఁడు జీవించి లేచి కాదంబరిం గౌఁగలించుకొనియెను. పుండరీకుఁడును గపింజలుని కేలుపట్టుకొని మహాశ్వేతకడకు వచ్చెను. తరువాత మహాశ్వేతను బుండరీకుడును గాదంబరినిఁ జంద్రాపీడుడును బెండ్లియాడి దివ్యభోగము లనుభవించిరి. ఇదియే కథావిధానము. ఇందలి తప్పుల మన్నించి యొప్పుల గ్రహింప సజ్జనులు ప్రార్థితులు.
ఉ. రెండవ కూర్పునం దనుసరించి మదీయ తృతీయ జాయధీ
మండన రాజ్యలక్ష్మి యసమాన కథా విభవాభిరామమై
యుండిన దీని నిప్డు సమయోచిత రీతులఁ బెంపుసేయఁ బా
గుండు నటంచుఁ దెల్పె నుపయుక్తముగా నిది యట్లు చేసితిన్.
ఇట్లు,
మధిర సుబ్బన్న దీక్షితకవి.
రాజమండ్రి,
24 - 11 - 1922.
మంగళాచరణము
చ. నిరతము లోకసంతతి జనింపఁగ వర్థిల ద్రుంగహేతువై
నిరుపమనిత్యపూర్ణ శుభనిర్మల సచ్చిదనంతమూర్తియై
గురుతర యోగదూరుల కగోచరమై గుణరూపశూన్యమై
పరఁగెడు నాత్మతత్త్వమును భక్తి భజింతు నభేదబుద్ధితోన్.
సీ. ఆసించునే శక్తి యనుకంప జనియింపఁ
జతురాసనాది నిర్జర గణంబు
గురునిష్ఠ నేదేవి చరణము ల్భజియించి
స్థిరకీర్తి వడసెఁ గౌశికమహర్షి
మూఁడుకన్నులు గల్గు మోములైదైదు వ
న్నెలనొప్పునే మహనీయ రుచికి
దివ్యసాథనముల దీపించునే యంబ
పతిచేతు లురువర ప్రదము లగుచు
విప్రజనముల పాలింటి వేల్పుగిడ్డి
రమణ నిరువదినాల్గువర్ణముల మనువు
మనుచు నెద్దేవి యవ్వేద మాత మాత
నభి నుతించెద గాయత్రి నాత్మ నెపుడు.
క. మోదం బలరఁగ నీ దగు
పాదంబుల నమ్మి భక్తి పరతంత్రుఁడనై
కాదంబరిఁ దెనిగింపం
గాఁ దొడఁగితి వేదమాతృకా ! ప్రోవఁగదే.
ఉ. చేసితి నీకృపారసవిశేషమునం గడు సారసత్కథా
భాసురముల్ ప్రబంధములు భవ్యవచోరచనా చమత్కృతిం
జేసి ననుం జనుల్ బొగడఁజేసితి నమ్మ భవత్పదాబ్జ సే
వా సుసమాహితాత్ము లిల వాసితకీర్తులు గారె మాతృకా !
శా. భవ్యాలంకరణోరు భావమృదుల వ్యంగార్ధ సంయుక్తమై
దీవ్యద్బాణకవి ప్రణీతమయి సందీపించు కాదంబరీ
కావ్యంబర్ధముసేయఁ బండితులకుం గాదన్న చో నాకహా ?
సువ్యక్తంబుగఁ దెల్గు సేయనగునే సూరుల్ విచారింపరే !
చ. గనిఁ గని సాధ్యరత్నములఁ గైకొనువాని విధంబునన్ ఫలిం
చిన మహిజంబుజేరి తనచేతుల కందినపండ్లఁ గోయు న
ట్లనుపమ శబ్ద వారినిధియై తగు దీన స్ఫురించి నంత గై
కొని తెలిగించితిన్ సదనుకూలకథాగతి దప్పకుండఁగన్.
చ. మృదుపద వాక్యవైభవ సమేతమునై సదలంకృతి ప్రభా
స్పదమగుచున్ శుభధ్వనుల భాసిలి కోమలభావ దీప్తమై
పొదలెడు నీకథారచన పూతగతిన్ సుజనాళికర్థ సం
పద పొలుపొంద మారమణి మాట్కి ముదం బొనరింపకుం డునే.
కథా ప్రారంభము.
గీ. అవధరింపుము మణిసిద్ధ యతివరుండు
కాశికేగుచు శిష్యయుక్తంబుగాఁగ
నెలమి ముప్పదియొకటవ నెలవునందు
దనయనుష్ఠానమును దీర్చుకొనినపిదప.
గోపాలుని రాక నరయుచున్నంతఁ గొంతసేపునకు వాఁ డరుదెంచి నమస్కరింపుచు స్వామీ ! యీవీట మేటిదేవళము ప్రహరి గోడచుట్టును బెక్కుచరిత్రములు దెలుపు విగ్రహములు వ్రాయఁబడి యున్నవి. వాని నెల్లం దెలిసికొంటిని కాని యొకచోట శాటీపటముల ధరించిన నలువురు స్త్రీలు వ్రాయఁబడిరి. వారిలో నొకతె విగ్రహము నర్చించుచున్నట్లును నొకతె గుహాముఖమునం గూర్చుండి జపము జేసికొనుచున్నట్లును ఇరువు రూరక నిలువంబడియున్నట్లు వ్రాసిరి. ఆకథ యేమియో తెలిసినదికాదు. నేఁటికా యుదంత మెఱింగింపుఁడని కోరిన నప్సారికాంక్షి మణిమహిమ నత్తెరం గెఱింగి యిట్లు చెప్పఁ దొడంగెను.
విషయ సూచిక
31వ మజిలీ
1 |
8 |
18 |
34 |
38 |
46 |
52 |
32వ మజిలీ
74 |
123 |
33వ మజిలీ
143 |