కాశీమజిలీకథలు/ఉత్తరఖండానుబంధము/31వ మజిలీ

వికీసోర్స్ నుండి

కాశీమజిలీ కథలు


ఉత్తరఖండానుబంధము. 31 వ మజిలీ.


కాదంబరి.


శూద్రకమహారాజుకథ.

గీ. పుడమిఁగలిభయమునఁ బ్రోగుపడిన కృత యు
    గంబనఁగ సర్వధర్మ ప్రకాశమగుచు
    సారవేత్రవతీనదీతీరమందు
    విదిశయను రాజధాని సంపదలఁబొదలు.

అప్పట్టణంబున కధినాయకుండై శూద్రకుండను రాజు సకల నృపశిరస్సంధానితశాసనుండై ఱెండవ పాకశాసనుండువోలె భూమండలమంతయు నేకాతపత్రముగఁ బాలించుచుండెను.

అన్నరవరుం డనవరతదానజలార్ద్రీకృతకరుండై దిగ్గజంబువోలెఁ బ్రతిదివసోపజాయమానోదయుండై ప్రభాకరుని చందమున నొప్పుచు సర్వశాస్త్రములకు దర్పణమనియుఁ గళల కుత్పత్తిస్థానమనియు సుగుణములకుఁ గులభవనమనియు మిత్రమండలమున కుదయశైలమనియు రసికులకాశ్రయుఁడనియు ధనుర్ధరులకుఁ బ్రత్యాదేశమనియుఁ బొగడ్త కెక్కెను. మఱియు, దృఢముష్టినిష్పీడనంబునంబయలు వెడలిన జలధారయుంబోలె నాభూపాలు కేలంగ్రాలు కరవాలంబు కరికటతటగళిత మదజలాసారదుర్దినములగు సంగరసమయములయందు వీరభటకవచ సహస్రాంధకార మధ్యవర్తినియైయున్న జయలక్ష్మి నభిసారికవోలెఁ బెక్కుసారులతనిచెంతకుఁ దీసికొనివచ్చినది.

అయ్యవనీపతి కువలయభరంబు వలయంబువోలె నవలీలనిజ భుజాగ్రంబున భరించుచుఁ బలుమారు నీతిశాస్త్రములెల్ల నవలోకించి బుద్ధిబలముచే బృహస్పతి నై నంబరిహసించుచుఁ బ్రబుద్ధులనివాడుక జెందిన కులక్రమాగతులగు మంత్రులు సేవింప సమానవయోవిద్యా విభూషితులు ప్రేమానురక్తహృదయులు నసమసమరక్రీడాభిరతులు నగు రాజసుతులతోఁ గూడికొని క్రీడించుచుఁ బ్రధమవయస్సు సుఖముగా వెళ్ళించెను.

సీ. అతులస్వరంబు లుప్పతిలంగ వీణగై
                 కొనిపాడు హాయిగాఁ గొంతసేపు
    మహితప్రబంధనిర్మాణ క్రియారత
                 స్వాంతుఁడై యలరారుఁ గొంతసేపు
     దర్శనాగతతసోధనజనారాధనా
                 కుతుకాత్ముఁడై యుండుఁ గొంతసేపు
     చర్చించు సకలశాస్త్రప్రసంగంబులఁ
                 గోవిదావళిఁగూడి కొంతసేపు

గీ. కోర్కెచిత్తరువులు వ్రాయుఁ గొంతసేపు
    గురుపురాణము లాలించుఁ గొంతసేపు
    జంతుసంతతినాడించుఁ గొంతసేపు
    అంగనాభోగవిముఖుఁడై యనుదినంబు.

మిగుల సుందరుఁడగు నానృపనందనుండుఁఁ ప్రధమవయస్సున స్త్రీజనమును దృణముగాఁ జూచుచు సంతానార్ధులగు మంత్రులచే బోధింపఁబడియు సురతసుఖంబు నందలి విరోధంబునంబోలె దార సంగ్రహం బనుమతింపఁ డయ్యెను.

ఒకనాఁడు ప్రొద్దుట నప్పడమి రేడాస్థానమంటప మలంకరించి యున్నసమయంబున నంగనాజనవిరుద్థముగ వామకక్షమునఁ గౌక్షేయకమిడికొని సన్నిహితపన్నగం బగు చందనలతవోలె భీషణరమణీయమగు నాకారముతో బ్రతీహారి యరుదెంచి జానుకరకమలంబులు పుడమిసోక మ్రొక్కుచు నిట్లనియె.

దేవా ! కుపితుండగు దేవేంద్రుని హుంకారంబున నేలంబడిన త్రిశంకుని రాజ్యలక్ష్మియోయన దక్షిణదేశమునుండి మాతంగకన్యక యోర్తు పంజరముతో నొకచిలుకను దీసికొనివచ్చి ద్వారదేశమునఁ నిలువంబడి దేవరతో నిట్లు విజ్ఞాపన చేయుచున్నది. భువనతలంబున గల రత్నములకెల్లఁ గల్లోలినీ వల్లభుండువోలె దేవరయే యేకభాజన మని తలంచి యాశ్చర్యభూతమగు నీవిహంగమరత్నము నేలికపాద మూలమును జేర్చు తలంపుతో నరుదెంచితిని. దర్శనసుఖంబను భవింపఁగోరుచున్న దాన.

అని తత్సందేశ మెఱింగించిన ప్రతిహారి వచనంబులు విని యాభూనేత కుతూహలోపేతుఁడై యాసన్నవర్తులగు మిత్రులమోము లుపలక్షించుచు దీనందప్పేమియున్నది, ప్రవేశపెట్టుడని యాజ్ఞాపించుటయు నాప్రతీహారి సత్వరమ యఱిగి యమ్మాతంగ కుమారిం దీసికొని వచ్చినది.

ముదిమిచేఁ బండిన శిరముగలిగి నేత్రకోణము లెఱ్ఱని జీరలతో నొప్పుచుండ జవ్వనముడిగినను బరిశ్రమ గలుగుటచే శిధిలముకాని మేని బింకముతోఁదెల్లనివస్త్రములు ధరించి వృదమాతంగుఁడొకఁడు ముందు నడుచుచుండఁ బైడిశలాకలచే రచింపఁబడినను జిలుకరెక్కల కాంతులచే మరకతమయమైనది వోలెఁ బచ్చవడియున్న పంజరమును జేతంబూని కాకపక్షంబులు చలింపనొక చండాల బాలకుఁడు తోడరానసురాపహృతంబగు నమృతంబు వేల్పులకిడ నవధరించిన మధుసూదనుని మోహినీరూపమును బురడించుచు మీగాళ్లదనుక మేలిముసుగు వైచికొనుటచే సంచరించు నింద్రనీలపుబొమ్మవలెనొప్పుచు సంతతము వెన్నుని యురమందు వసించుటఁ దదీయశ్యామప్రభాసంక్రమణంబున నల్లబడిన మహాలక్ష్మియుంబోలె బలరాముని హలాపకర్షణ భయంబునఁ బారివచ్చిన యమున చాడ్పునఁ గుపితహరనయన దహ్యమానుండగు మదనుని ధూమమున మలినీకృతయగు రతిననుకరించుచు నచిరోపారూఢ యౌవనయై వచ్చుచున్న యామాతంగ కన్యక నిముషలోచనుండై యారాజమహేంద్రు డీక్షించి విస్మయా వేశితహృదయుఁడై యిట్లు తలంచెను.

అన్నన్నా ! తగనిచోట హాటకగర్భున కక్కజమగు రూపు గల్పించు ప్రయత్న మేమిటికిఁ గలుగవలయును. అక్కటా ! నిరతి శయసౌందర్యవిశేషంబునం బొలుపొందు నియ్యిందువదనను ముట్టరాని నికృష్టకులంబునం బుట్టించెగదా ? మాతంగజాతిస్పర్శభయంబున ప్రష్ట ముట్టకయే యిప్పూబోణిని నిర్మించెనని తలంచెదను. కానిచోఁ దదీయకరతలస్పర్శ క్లేశితములగు నంగముల కింత వింత కాంతియు లావణ్యము గలిగియుండునా ! ఇసిరో ! సరసిజభవుండెప్పుడు నసదృశ సంయోగమునే చేయుచుండును గదా ? అతిమనోహరాకృతిగల యీనాతి క్రూరజాతియం దుదయుంచుటచే నిందిత సురతయై యసుర సంపదవలె నభోగ్యమైయున్నదని నా డెందము మిక్కిలి పరితాపము జెందుచున్నది.

అనియతండు తలంచుచుండ నక్కన్యారత్నము మ్రోలకువచ్చి యించుకవంగి ప్రోడవలె నమస్కరించి యమ్మణికుట్టిమంబుననోరగా గూరుచున్నంత నావృద్ధ మాతంగుఁడు పంజరములోనుండగనే చిలుకను చేతితోనంటి సవరించుచు గొంచెము దాపునకువచ్చి ఱేనికిం జూపుచు నిట్లనియె. దేవా ! యీ చిలుక సకలశాస్త్రార్థములు గుర్తెఱుంగును. రాజనీతియందును పురాణకధాలాపమునందును దీనికి మంచి నై పుణ్యముగలదు. కావ్యనాటకాలంకార గ్రంథములు జదువుటయే కాక స్వయముగా రచింపఁగలదు. వీణావేణుమురజప్రభృతి వాద్య విశేషముల సారమిదియే చెప్పవలయును. చిత్రకర్మయందు ద్యూత వ్యాపారమునందును గజతురగ స్త్రీలక్షణ జ్ఞానమందును దీనిని మించిన వారు లేరు. ప్రణయకలహకుపితులగు కాముకులం దేర్చు నేర్పు దీనికే కలదు. పెక్కు లేల ? యాపతత్రిప్రవరంబు సకలభూతల రత్న భూతమని చెప్పనొప్పును. దీనిపేరు వై శంపాయనము. సర్వరత్నములకు జలనిధి వోలె దేవర ముఖ్యభాజనమనితలంచి మా భర్తృదారిక యీచిలుకను మీపాదమూలమునకుఁ దీసికొని వచ్చినది. దీనిం దయతోఁ బరిగ్రహింపుఁ డని పలుకుచు నాపంజర మానృపకుంజరుని ముందర నిడి యావృద్ధుం డించుక యెడమగాఁ బోయెను.

అప్పు డప్పతంగ పుంగవము రాజాభిముఖముగా నిలువంబడి కుడిచరణమెత్తి మిక్కిలి స్పష్టములగు వర్ణస్వరములచే సంస్కరింపఁ బడిన వాక్కులతో జయశబ్దపూర్వకముగా నీపద్యముఁ జదివినది.

గీ. అనఘ ! భవదరి నృపవధూస్తన యుగంబు
    చిత్తగత శోకదహనంబు చెంత నిలిచి
    యశ్రుజలపూరమునఁ దీర్థమాడి మరి వి
    గతమహా హారమై ప్రతిస్థితిదనర్చు.

ఆచిలుక పలుకులు విని యానృపతిలకుండు వెఱఁగు జెందుచు ______________________________________________________________________

శ్లో || స్తనయుగమశ్రుస్నాతం సమీపతరవర్తిహృదయశోకాగ్నె ! సంతసముతోఁ జెంతనున్న కుమారపాలితుం డను వృద్ధమంత్రింజూచి ఆర్యా ! యాచిలుక పలుకులయందలి స్పష్టతయు మాథుర్యమును వింటివా ? ఇది వర్ణమాత్రానుస్వారస్వర సంకరము గాకుండ నభి వ్యక్తముగాఁ బలుకుటయే మొదటిఁ జిత్రము. మఱియు మనుజుండు వోలె బుద్ధిపూర్వకమగు ప్రవృత్తితో నభిమతవిషయమై కుడి చరణమెత్తి జయశబ్దపూర్వకముగా నతిపరిస్ఫూటాక్షరముగా పద్యము జదువుటఁ గడుంగడు నబ్బురము గలుగఁజేయుచున్నది. తరుచు పక్షులును, బశువులును నిద్రాహారమైధునభయసంజ్ఞామాత్రవేదులు గదా ?

అని పలుకుటయు గుమారపాలితుఁ డించుక నవ్వుచు దేవా ! ఇది యేమిచిత్రము. శుకశారికాప్రభృతి విహంగమ విశేషములు మనుష్యులచేఁ జెప్పబడిన మాటలం బల్కుచుండుట దేవర యెఱుంగనిదియా ? పూర్వము చిలుకులు మనుజులువలె బలుకుచుండునవి. అగ్ని శాపంబునం జేసి శుకవచనము లపరిస్ఫుటములైనవి.

అని యతండు సమాధానము జెప్పుచుండఁగనే ఛండకిరణుం డంబరతల మధ్యవర్తి యయ్యెనని తెలుపు భేరినినాదముతోఁ గూడ మాథ్యాహ్నిక శంఖధ్వని బయలు వెడలినది.

ఆధ్వని విని యమ్మహారాజు స్నానసమయమయ్యెనని తటాలున సింహాసనమునుండి లేచి రాజలోకమెల్ల సంభ్రమోత్సేకముతో గద్దియలు విడిచి వినయవినమితో త్తమాంగులై నిలువంబడిన శిరఃకంపమున వారికిఁ బోవుట కనుజ్ఞ నిచ్చుచు నచ్చండాల కన్యకతో మేము వచ్చినందాక నిందుండు మని నియమించి యచ్చిలుకను లోపలకుఁ దీసికొనిపోయి స్నానపానాశనాదివిధులం దీర్పుమని తాంబూలకరండ వాహినికిం జెప్పి సముచిత మిత్రలోకము సేవింప నభ్యంతరమందిరమున కరిగెను. అందు స్నానసంధ్యావందన దేవపూజాది నిత్యక్రియాకలాపములు నిర్వర్తించుకొని రాజబంధువులతోఁగూడ నభిమతరసాస్వాదంబున బ్రీతుండగుచు భోజనముగావించి ప్రతీహారిమార్గ మెఱింగింప మనోహరాలంకారమండితంబైన విశ్రమమంటపమునకుఁ బోయి శయనతలంబునఁ గూర్చుండి తాంబూలము వైచికొనుచు నాప్తవర్గంబు చుట్టునుం బరివేష్టించి వినోదకథలచే చిత్తము రంజింపఁ జేయుచుండ నిండు వేడుకలతోనుండి యాభూమండలాఖండలుఁడు వైశంపాయనమును దీసికొనిరమ్మని ప్రతిహారి కాజ్ఞాపించుటయు నదివోయి యత్యంత శీఘ్రముగా నాజిలుక పంజరము దెచ్చి రాజుమ్రోలబెట్టెను. అప్పు డా భూపతి చిలుకంజూచి పతంగపుంగవా ! అభిమతభోజనంబున దృప్తుండవైతివే ? యని యడిగిన నదిదేవా ! సమదకోకిలలోచనరుచిం బురడించు జంబూఫలంబు లెన్నేని యాస్వాదించితిని. హరినఖరభిన్న మాతంగకుంభార్ద్రంబులగు ముక్తాఫలంబులం బోలిన దాడిమీబీజంబుల రుచి యేమనవచ్చును ? అన్నన్నా ! నళినీదళంబులు వోలె హరితములగు ద్రాక్షఫలముల మాధుర్య మెప్పటికైన మరువవచ్చునా ? అయ్యారే ! ప్రాచీనములగు నుసిరికకాయల పస యనుభవించి తీరవలయును. పెక్కేల భవదంతఃపురకాంతలు స్వయముగాఁ గరతలములచే నాకుఁ దినిపించినవన్నియు నమృతాయమానంబులై యున్న వని పెద్దగాఁ బొగడెను.

ఆమాట లాక్షేపించుచు నాక్షితిపతి పక్షీంద్రమా ! యది యట్లుండనిమ్ము. నీవేదేశమునం జనించితివి ? నీ తలిదండ్రు లెవ్వరు ? నీకు వేదశాస్త్రపరిచయ మెట్లుకలిగినది ? ఇతరవిద్యావిశేషము లెట్లు గ్రహించితివి ? జన్మాంతరానుస్మరణమా ! లేక వరప్రదానమా ? అదియునుంగాక శుకరూపము దాల్చి ప్రచ్ఛన్నముగాఁ దిరుగుచున్న యొకానొక దివ్యుఁడవా ? నీకెన్ని యేండ్లున్నవి ? యింతకు ముందు నీ వెందుంటివి ?

నీకీ పంజరబంధము చండాలకన్యకాహస్తప్రాప్తియు నెట్లు కలిగినది. నీవృత్తాంతము విన మిక్కిలి కుతూహల మగుచున్నది. యెఱింగించెదవే యని యడిగిన నాపతంగప్రవరమాత్మగతంబున నించుక ధ్యానించి యిట్లనియె.

చిలుక కథ.

దేవా ! నాయుదంతము కడు పెద్దది. వినుటకు దేవర కిష్టమేని వక్కాణించెద నాకర్ణింపుఁడు. వింధ్యారణ్యాంతర్భాగం బగు దండకారణ్యమునఁ బ్రసిద్ధిజెందియున్న పంచవటీతీరమున కనతిదూరములో నున్న పంపాసరోవరము పశ్చిమభాగంబున శ్రీరామశరప్రభంజితములగు సప్తతాళముల ప్రక్క నొక్క వృద్ధశాల్మలీ వృక్షము గలదు.

అ త్తరువరంబు మూలంబు దిక్కరి కరంబులంబోని జరదజగరంబుచేఁ జుట్టుకొనఁబడి యాలవాలము గట్టఁబడినట్లొప్పుచు శాఖా సమూహములచేఁ దిగంతముల నావరించి విలయవేళాతాండవ ప్రసారిత భుజుండగు శంకరు ననుకరించుచు సాగరజలంబులం గ్రోలి యిటు నటు సంచరించుచుఁ బక్షులవలె శాఖాంతరములయం దణఁగియున్న మేఘంబులచేతఁ గూడ నావరింపబడని యగ్రభాగముగలదై రవితురంగముల కవరోధము గలుగఁజేయుటచే నలయిక జెందిన యవ్వారు నంబుల ముఖములనుండి వెల్వడు ఫేనపుంజమో యనఁబడు సితతూలికామాలికలచే నగ్రశాఖలు ప్రకాశింప నాకల్పస్థాయియగు నున్నత స్కంధముతో నొప్పుచు నబ్బూరుగు మేరువువలెఁ బ్రఖ్యాతిఁజెంది యున్నది. మఱియు నత్తరువు విస్రబ్ధముగా జనులకారోహింపశక్యము కాని దగుట ఘాతుకులవలనఁ దమ కపాయము రాదని తలంచి శాఖాంతరములయందునుఁ గోటరోదరములయందునుఁ బల్లవాంతరముల యందును జీర్ణవల్కల వివరములయందును మిగుల నవకాశము గలిగి యుండుటచేత నానాదేశముల నుండి వచ్చి శుకసంతతులు గూడులు కట్టుకొని హాయిగా సుఖించుచున్నయవి.

అందొక జీర్ణకోటరమందు జాతిపులుగులతోపాటు కులాయము నిర్మించుకొని భార్యతోఁ గూడ మాతండ్రి చిరకాలము సుఖించెను. విధివశంబున నతనికి ముదిమియందు నేనొక్కరుండ పుత్రుండ నుద యించితిని. నేను బుట్టిన యాక్షణమునందే యతిప్రబలమగు ప్రసవ రోగంబున మా తల్లి పరలోకమున కతిథిగా నఱిగినది.

అభిమతజాయావినాశ శోకంబున స్రుక్కు చుండియు మా తండ్రి సుతస్నేహంబున నాశోక మడచికొని తానొక్కరుండ యే కొరంతయు రానీయకుండ నన్నుఁ బెనుచుచుండెను.

నాతండ్రి మిగుల వృద్ధుడగుట శిధిలములగు రెక్కలతో నెగర లేక వణకుచు స్రుక్కినముక్కు కొనచేత ఫలములజీర నశక్తుండై పర నీడములక్రింద నక్కడక్కడ జారిపడిన ఫలశకలంబులును తండుల కణంబులునుదెచ్చి నాకిచ్చుచు మద్భుక్తావశిష్టములచేఁ దాను సైత మాకలియడంచుకొనుచుఁ కొన్నిదినములు గడిపెను.

ఇట్లుండ నొకనాఁడు ప్రాఃతకాలమున లేతయెండచే వనతరు శిఖరపల్లవంబులు వింతకాంతిఁ బ్రకాశింపుచుండ గొన్నిచిలుకలు మేత కై దిక్కుల కరుగ మఱికొన్ని పిల్లలతోఁగూడ గూడులయం దణఁగి యుండ నిశ్చబ్దంబున నవ్వనస్పతి శూన్యమైనదివోలె నొప్పుచుండెను.

అప్పుడు నా తండ్రియు నన్ను రెక్కలలోఁ బెట్టుకొని ముద్దాడుచుండ నేనును బాల్యంబున నెగురుటకు రెక్కలురామిం జేసి యతని















` యక్కులోఁ జిక్కి మిక్కిలిసంతోషముతో నుంటిని. అట్టిసమయమున నవ్వనమందు నాకస్మికముగా గుహాసుప్తంబులగు మృగేంద్రంబులు దద్దరిల్ల వనచరంబులుపరవ వరాహంబులార్వ శార్దూలాది క్రూర మృగసమూహంబు వెరవునంబార గంగాప్రవాహంబు ననుకరించుచు.

సీ. ఇటు రండు గజములిచ్చటనుండు తుండవి
       ధ్వస్తపంకేజ గంధంబు వెడలె
    నిందుఁ దప్పక వసియించుఁ గ్రోడములవి
       నమలుముస్తల వాసనలు గడంగె
    వనమహిషంబులవ్వలనుండు, ఱేఁగెగొ
       మ్ములఁ జిమ్ము వల్మీకముల రజంబు
    కరికలభంబు లక్కడఁ గూడు, సల్లకీ
       రసకషాయామోదమెసఁగ నెసఁగె.

గీ. రుధిరపాటల కరికుంభ రుచిన మౌక్తి
   కాంచితాంభీపదంబు లిందులరు సింహ
   గణములవె చూడుఁడభినవఘాసకభళ
   హరిణరోమంధ సేనసంహతులుదోచె.

చ. ఇదె చమరీమృగాళి వసియించెడు తావిట నాభివాసనల్
    బొదలెడుఁ బారుచున్న వవె మూకలుగా మొకముల్ సమంబుగా
    వదలుఁడు వేటకుక్కలను భద్రమువింట శరంబుగూర్చుఁడ
    ల్లదె మెక మేదియోచనె రయంబునఁ గొట్టుఁడు పట్టుడుద్ధతిన్.

అని యుండొరులతోఁ బలుకుచున్న వేటకాండ్ర ఘోష మొండు వినంబడినది.

అశ్రుతపూర్వమగు నారోద విని నేను బాలుండనగుట చెవులు బీటలువార భయముచేత మేను గడగడవడంక వివశత్వమునొంది సమీపమునందున్న తండ్రియొక్క జరాశిధిలములగు రెక్కలసందున దూరితిని.

అప్పుడా యరణ్యమంతయుఁ బారుచున్న గ్రూరసత్వముల యార్పులచే నల్లకల్లోలమైనది. మఱికొంతసేపునకా రొదయంతయు నణఁగి యయ్యడవి కల్లోలశూన్యమగు సాగరములాగున నిశ్చబ్దమై యొప్పినది.

అట్టిసమయమున నేను శైశవచాపలంబునం జేసి యదియేమియో యని మాతండ్రి రెక్కలసందునుండి బైటికివచ్చి కంఠముచాచి భీతిచే గదలుచున్న తారకలతో యారొదవచ్చినదెసకే దృష్టిబరికించితిని.

అప్పుడావంకనుండి కార్తవీర్యార్జున భయంబున బారి వచ్చు చున్న నర్మదానైది పగిది జంఝామారుతవికీర్ణమగు తమాలకాననము పడువున నేకీభూతమగు కాళరాత్రిసంఘూతముభాతి సూర్యకిరణాకులమైన యంధకారము తీరున నయ్యరణ్యమంతయుఁజీకటిఁగలుగఁ జేయుచు ననేకసంఖ్యాకమగు శరభసైన్యము నా కభిముఖముగా వచ్చుచుండఁ జూచితిని.

ఆ సైన్యమధ్యంబున నుక్కుచే రచియింపబడినవో యనునట్లు కర్కశములగు నవయవములు గలిగి శ్యామలదేహ ప్రభాప్రవాహంబున నయ్యడవి యంతయు నిండింపుచు నెఱ్ఱని దృష్టులు వింధ్యశిలాతల విశాలంబగు నురంబును మెఱయ స్ధూలవరాటికా మాలికలచే నలంకరింపంబడి పతులం జంపవలదని తన్నుఁ బ్రతిమాలికొనవచ్చిన యాఁడు సింగంబులో యనఁ గౌలేయకటుంబినులననుసరించి రాఁ జమరీ వాలంబులు గజదంతంబులు కరిగండముక్తాఫలంబులు మయూర పింఛంబులు పిసితాహిరంబులు గైకొని శబరపరిజనులు వెంట నడువఁగృతాంతుని యంశావతారమన మహామోహిని సోదరునివలె వొప్పుచుఁ బ్రధమవయసుననున్న మాతంగుడను పుళిందనాధుం గాంచితిని. వారాడుకొనుమాటలు వినుటచే వానిపేరు మాతంగుఁడని యెఱింగితిని.

ఆహా! వీని జీవితము మోహప్రాయము. చరితము సాధుజన గర్హితము. ఆహారము మద్యమాంసాదికము. పరిశ్రమయంతయు జీవ హింసయంద త్రాగుటయే యుత్సవము. చెరబట్టిన యుత్తమస్త్రీలే కళత్రములు. మృగములతో సహవాసము. పశురక్తంబున దేవతార్చనము. మాంసమున బలికర్మ ఇట్టి వీనికిఁ గరుణ యెట్లు కలుగును. శాంతిపేరైనం దెలియునా? క్షమకెంతదూరము. వీనికి వివేకమెన్నఁడైనఁ గలుగునేమో అని నే నాలోచించుచుండఁగనే యమ్మాతంగుఁ డరణ్యసంచార ప్రయాసమననయించుకొనటకై యా బూరుగు నీడ కరుదెంచి కోదండ మెక్కుడించి పరిజనోపనీతంబగు పల్ల వాసననంబునఁ గూరుచుండెను.

అప్పుడు శబరయువకుఁ డొకండు వడివడి నాసరోవరంబున కరిగి చేతులతో జలంబుపై నున్న మలినంబు విడఁద్రోయుచుఁ గమలినీపత్రపుటంబున నీరు వట్టి బిసతంతువులఁ గొన్నిటి కోసికొనివచ్చి యాయేలిక కర్పించెను. వాఁడాజలంబులం గ్రోలి చంద్రకిరణంబులం గ్రసియించు రాహువువలెఁ దామరతూడుల నమలి క్షుత్పిపాసల నపనయించుకొనియెను. వాఁడట్లు మాచెట్టునీడఁ గొంతసేపు విశ్రమించి పిమ్మటఁ పుళిందసేనాపరినృతుండై యెందేనింబోయెను.

వారిలో నొక్కవృద్దపుళిందుఁడు తినుటకు మాంసమబ్బమింజేసి యాఁకలిగొని వారితోఁబోవక యత్తరుమూలమున ముహూతన్‌ కాలము జాగుజేసి మా యాయువులఁ గ్రోలువాడువలె నెఱ్ఱనిగుడ్లుగల దృష్టులతో నావృక్షమెక్క నిశ్చయించి యా మూలచూడముగాఁ దల పైకెత్తి చూచెను.

ఆ చూపు వలననే శుకకులముల ప్రాణములు కుత్క్రాంత సమయమైనది, కటకటా, అక్కటికములేని వారికిఁజేయరాని కృత్యము లుండునా? అనేకతాళోఛ్రాయముగల యాపాదపమును సోపానములు గలదానివలె సులభముగానెక్కి యెగిరీయెగరని పిల్లలను, ఎగరనున్న నిసువులను, గొన్నిదినములక్రిందటఁ బుట్టినపిట్టలను, రెక్కలువచ్చుచున్న కానలును శాల్మలీకుసుమ శంకాజనకములగు పోతముల నరసి యరసి శాఖాసందులనుండియు, గోటరములనుండియు, వేరు వేరు ఫలములను వలె పెక్కురకముల శుకశాబకముల గ్రహించి ప్రాణములను పోగొట్టి నేలం బడవైచుచుండెను.

అప్పుడు మాతండ్రియు నకాండమునఁ దటస్తించిన యప్రతీకారము ప్రాణహరము నగు నుపద్రవమునుజూచి మరణభయంబున మేను గంపమునొంద నుద్భ్రాంతదృష్టులతో నలుమూలలు సూచుచుఁ దాలువులెండ నన్నురక్షించు నుపాయంబుగానక తన రెక్కలసందున నిముడ్చుకొని గత౯వ్యతామూఢుఁడై ముక్కుగరచుకొనియుండెను.

పిమ్మట నప్పాపాత్ముఁడు క్రమమ్మునఁ గొమ్మలపై కెక్కి మే మున్న తొర్రలో యమదండమునుంబోలు తన బాహుదండమును జొనిపి సారెకు ముక్కుకొనచేఁ గరచుచు నరచుచున్న మాతండ్రిని గట్టిగఁ బట్టి పైకిఁదీసి గొంతువునులిమి ప్రాణములుబోఁగెట్టెను.

మిగుల నల్ప దేహము గలిగి భయముచేఁ దండ్రిరెక్కలసందున నడఁగియున్ననన్నువాఁడాయుశ్శేషముగలుగఁబట్టి బరిశీలింపడయ్యెను.

ప్రాణములువిడచి తలవ్రాలవైచిన నా తండ్రిని యా నిర్దయుండు అధోముఖముగా నేలంబడవిడచెను. నేనును మాతండ్రితోఁ గూడ నేలంబడితినికాని దైవవశంబున జేసి రాశిగానున్న యాకులపై బడుటచే నా కింతయేని యాయాసము గలిగినదికాదు.

అక్కిరాతుండు చెట్టుదిగకమున్న నేను బాలుండ నగుట దండ్రి చావుగణింపక ప్రాణపరిత్యాగ యోగ్యమగు కాలంబున సైత మించుక ఱెక్కలు విదళించుచుఁ గొంచెము కొంచెమెగిరి కృతాంత ముఖకుహరమునుండి వెల్వడినట్లు నాతిదూరములో నున్న యొకతమాల విటసింగాంచిదట్టమైన యాచెట్టు మొదలుచేరి పక్షసవణన్‌ములగు పణ౯ములసందున డాగియుంటిని.

అక్కిరాతుఁడు గ్రమముగా నా చెట్టునంగల పిట్ట్లనెల్లఁబట్టి చెట్టుదిగి యసువులూడి క్రిందఁబడియున్న చిలుక సిసువులను జిక్కములోఁ బెట్టుకొని మాతంగుఁడఱిగిన తెరవుబట్టి యతివేగముగాఁ బోయెను.

తరువాత నేనించుక తలయెత్తిచూచుచు నాకుకదలినను వాఁడే వచ్చుచున్నవాఁడని బెదరుచు పితృమరణశోక ఖిన్నుఁడనై మిగుల దాహమగుచుండు నీరుండతావరయుచు నామూలమునుండి యెగర దొడంగితిని. ఱెక్కలతోనెగరలేక పాదములతో నడచుచు ననభ్యాసంబునం జేసి యడుగడుగునకు నేలఁబడుచు నెగరబోయి యడ్డముగా బడి యొంటిఱెక్కతో నానుచు నొగర్పుచు మేనెల్లధూళిగాఁగఁ నిట్లాయాసముతోఁ గొంచెముదూరమైనను నడువలేక మిక్కిలి దాహము వేధింప మనంబున నిట్లుతలంచితిని.

ఆహా? అతికష్టములైన యవస్థలయందుగూడఁ బ్రాణులకు జీవితమందు నిరపేక్షిత్వము గలుగదు కదా? జంతువులకు జీవితముకన్న నభిమతమైన వస్తువు వేరొండులేదు. నాయందు మిగులనను రాగముగల తండ్రి పరలోకగతుండైనను నాకు జీవితాశ వదలకున్నది. కటకటా! నాహృదయమెంత కఠినమైనదో? అతండు నాతల్లిపోయినది మొదలు సకల క్లేశములుపడి నన్నుఁబెనిచెనే? అట్టివాని ప్రేముడియంతయు గడియలో మరచిపోయితిని. నా ప్రాణము లెంత కృపణములో? ఉపకారము జేసిన తండ్రి ననుగమించినవికావు. ఇట్టి సమయములో సైతమునన్ను జలాభిలాష బాధింపుచున్నయది, పితృమరణమును లెక్క సేయని పాతకమునన్నిట్లు బాధింపుచున్నది కాబోలు అయ్యో! జలములు దాపునలేవు. నాలుక యెండిపోవుచున్నది. నడువలేను. వనభూమియంతయు నాతపముచేఁ దప్తమైయున్నది. దాహమునకు నిమిషము తాళజాలను. చూపులకుం జీకటిగ్రమ్ముచున్నది. కటకటా! విధియెంతఖలుఁడో నాకు వేగము మరణమైనను గలుగజేయ కున్నాఁడని యనేకప్రకారములఁ దలపోయుచుంటిని.

ఆ ప్రాంతమందు జాబాలియను మహర్షి యాశ్రమముగలదు. అతనికుమారుఁడు హతీతకుండనువాఁడు. సకలవిద్యాపారంగతుండు. సవయస్కులగు మునికుమారులతోఁ గూడుకొని రెండవమార్తాండుని వలె దపస్తేజంబున వెలుంగుచు నమ్మార్గంబున స్నానార్ధమై పంపా సరస్సునకుఁ బోవుచు దాహపీడితుఁడనై నోరు తెరచుకొని దారిలో నొగర్చుఁచుఁ బడియున్న నన్నుఁజూచెను.

సత్పురుషుల హృదయములు కరుణాబంధురములు గదా! అట్టి యవస్థతోనున్న నన్నుఁజూచి యమ్మహాత్ముం డంతరంగంబునఁ బరితపించుచుఁ దోడిమునికుమారునితో వయస్యా! అటు చూడుము, ఆ శుకపోతము అజాతపత్రమై తలవాల వైచుకొని యున్నది. శ్యేనాదికము దీనిం బాధింపఁబోలు. దీని ప్రాణములు కంఠగతములై యున్నవి. నీటికొరకుఁగాబోలు మాటిమాటికి నొగర్చుచు నోరుదెరచుచున్నది. పాపము దీని ప్రాణములు వాయకమున్న జలప్రదేశమును జేర్పుదము లెమ్ము. దీని ప్రాణములు కాపాడిన కడుపుణ్యము రాగలదని పలుకుచు మెల్లన నన్ను మృదులమగు హస్తములతోఁ బట్టికొని యా సర స్త్సీరము జేర్చి దండకమండలము లొకచోటం బెట్టి యతి ప్రయత్నముతో ముక్తాఫలంబులంబోని జలబిందువులఁ గొన్నిటి నా నోటం బోసెను.

అప్పుడు నామేనంతయుఁ జల్లబడినది. పోయిన ప్రాణములు తిరిగివచ్చినవి. శరీరమున దారుఢ్యము గలిగినది. పిమ్మట నన్నొక చెట్టునీడ నిలిపి తాను స్నానము గావించి నిర్వర్తితనిత్యక్రియాకలాపుండై యమ్ముని కుమారుండు మిత్రవర్గముతో జలమువెడలి నన్నొకచేత బట్టికొని తన యాశ్రమమునకుఁ బోయెను.

అధికమహిమాస్పదంబగు నయ్యాశ్రమమున గురుతరయోగ నిష్ఠాగరిష్ఠుండై యున్న జాబాలిం జూచి నేనంతర్గతంబున నిట్లుతలంచితిని.

ఆహా తపఃప్రభావము! ఈమునిమార్తాండుని యాకారము శాంతమయ్యు మెఱపుతీగెయుఁబోలెఁ జూట్కులకు మిరుమిట్లు గొలుపుచున్నయది. ఇమ్మహర్షి యుదాసీనుండైనను ప్రభావసంపన్నుఁడగుట మొదటఁజూచినవానికి వెరపుగలుగకమానదు. మహాత్ముల నామము స్మరించినంత నెట్టిపాపములైనం బోవుననుచో దర్శనమునవచ్చు సుకృతము మాట జెప్పనేల? సకలవిద్యలు నీ మహర్షిముఖమున నటించుచున్నయవి. అన్నన్నా? ఈముదిమి కెంత భయములేదో యా మహానుభావుని జటాకలాపమును సైతము తెలుపుజేసినది. తేజశ్శాలులలో నీతండగ్రేసరుఁడు. ఈ ముని కుంజరుఁడు కరుణారసప్రవాహము. సంసార సముద్రమునకు సేతువు, సంతోషామృతసారము, శాస్త్ర రత్నములకు నికషపాషాణము, ఈ పుణ్యాత్ముని తపోమహిమచేతఁ గదా! మృగములిందు జాతివైరముమాని సంచరింపుచున్నవి. అయ్యారే? మహాత్ముల ప్రభావము ఎంతవిచిత్రమైనది. అని పెక్కుభంగుల నతని మహిమ నభినుతించుచున్న సమయంబున నన్నాహరీతకుఁడు రక్తాశోకతరు మూలమునకుం దీసికొనిపోయి యొకచోట నిలిపి తండ్రికి నమస్కరించి తానొక మూలఁ గూర్చుండెను.

అప్పు డచ్చటనున్న మునులు నన్నుఁజూచి శంకించుచు దీని నెచ్చటనుండి తెచ్చితివని హరీతకు నడిగిన నతండిట్లనియే నేను స్నానార్థమై పద్మసరస్సునకు బోవుచుండఁగా దారిలో నొక చెట్టుక్రిందఁ నెండతాపమున వాడి, దుమ్ములో నోరు దెఱచుకొని యొగర్చుచు నీ శుకపోతము నాకుఁ గనంబడినది.

అప్పుడు నాకు దయపుట్టి దీనిని సరస్సునకుఁ దీసికొనిపోయి తోయము ద్రాగించి సేదదీరినంత నిచ్చటికిఁ దీసికొనివచ్చితిని. ఱెక్కలు వచ్చువఱకు నిందొక తరుకోటరమున నిడి, నీవారకణ నికరముల చేతను వివిధఫలరసములచేతను నేనును నీ మునికుమారులును దీనిం బోషించువారము. ఱెక్కలువచ్చిన తక్షణము గగనతలమున కెగిరి యిష్టము వచ్చిన చోటికిఁ బోవునది. ఇదియే నా యభిప్రాయమని పలికిన విని జాబాలి యించుక వేడుకతోఁ దలయెత్తి పుణ్యజలముల చేతఁ బవిత్రముచేయువాడుంబలె నిర్మలమైన దృష్టులచే నన్నుపలక్షించుచు సారెసారెకు సాభిప్రాయముగా వితర్కించి నన్నుఁజూచి తలయూచి తానుఁ జేసికొన్న యవినయమునకు ఫలం బనుభవించు చున్నాఁడని పలికెను.

తపఃప్రభావసంపన్నంబగు దివ్యదృష్టిచేత సకల ప్రపంచమునంగల కాలత్రయ విశేషములు కరతలామలకముగాఁ జూడనోపిన యమ్మహానుభావుఁ డట్లుపలికినతోడనే యందున్న మునులందరు వెరగుపడి మహాత్మా? ఇది పూర్వజన్మమందెవ్వరు? ఎట్టియవినయ కృత్యము జేసి యిట్టిజన్మమెత్తినది? దీని పే రేమి? ఈ వృత్తాంతము వినుటకు మాకు మిగులఁ గుతూహలముగా నున్నది. వివరింపవే యని ప్రార్థించిన నతండు మునులారా! దీని చరిత్రము కడువింతయైనది. మనకు స్నానసమయమగుచున్నది. మీరును నిత్యానుష్టానములు దీర్చుకొని ఫలహారములఁ దృప్తులై రండు. రాత్రి సావకాశముగా నుడివెదనని పలుకగా వారందరు సంతసించి వడిగాఁబోయి కాల్యకరణీయములం దీర్చుకొని తత్కధాశ్రవణకౌతూహలముతోఁ గ్రమ్మరం జనుదెంచి యమ్మహాముని సమక్షమందు యధానిర్దిష్టముగాఁ గూర్చుండిరి. అర్ధయామావశిష్టమగు రాత్రియందు సుధాకర కిరణములచే జగంబంతయు వెండిపూసినట్లు ప్రకాశింపుచుండ మలయమారుతములు మేనులకు హాయిసేయ హరీతకుఁడు మధురఫలరసంబుల నన్నుఁ దృప్తుంజేసి మునులతోగూడ నతనియొద్దకుఁ దీసికొనిపోయి వేత్రాసనంబునం గూర్చుండి జాలపాదుఁడను శిష్యుండు పవిత్రపాణియై మెల్లగాఁ దాళ వృంతమున వీచుచుండ ఱెండవపరమేష్టివలె నొప్పుచున్న యా జాబాలికి నమస్కరించి నన్నెదుర నిలిపి వినయంబున నిట్లనియె.

తండ్రీ! యీ మునులందరు నీ చిలుక వృత్తాంతము వినుటకు మిక్కిలి వేడుక పడుచ్చున్నారు. ఇది తొలిజన్మమందెవ్వరు? ఎందుండునది? ఏమికారణమున నిట్టిజన్మమెత్తినది? సవిస్తరముగా నుడువుఁడని యడిగిన నజ్జడదారి సంతసించుచు వారినందరను గలయఁ గనుంగొని యిట్లని చెప్పదొడంగె.

తారాపీడుని కథ

క|| కలదుజ్జయినీ నగరం
     బిలను మహాకాళ నామకేశ్వరలింగా
     మలదీప్తి దీపితాలయ
     కలితంబై చారుసౌధ కమనీయంబై||

అవ్వీటి కధినాయకుండై తారాపీడుండను రాజు రాజ్యంబు సేయుచుండెను. అతండు నృగ, నల, నహుష, భరత, భగీరధ, ప్రభుతు లగు పూర్వనృపతుల నతిశయించిన కీర్తిగలవాఁడై నీతి శాస్త్రపారంగతుండును, ధర్మజ్ఞుండును, యజ్ఞపూత విగ్రహుండునునై రెండవధర్మదేవతవలెఁ బ్రజలం బాలింపుచుండెను.

అతనియొద్ద సకలకలానిపుణుం డగు శుకనాశుండను మంత్రి ముఖ్యుండు గలఁడు. అతండు బ్రాహ్మణుండయ్యును క్షాత్రంబున నత్యంత ప్రసిద్ధిఁ జెందియుండెను. చంద్రునకు వెన్నెలవలె నమ్మహారాజునకు నలంకారమై విలాసవతి యను విలాసినీ లలామంబు మహిషీ పదం బధిష్టించి యెక్కుడు మక్కువగలుగఁ జేయుచుండెను.

ఆరాజు సప్తద్వీపముద్రితంబైన ధరావలయం బంతయు భుజబలంబున జయించి మంత్రి న్యస్తరాజ్యభారుండై యచ్చరలం బురడించు మచ్చెకంటులం గూడికొని గృహదీర్ఘికలయందును శృంగార సరోవరంబులయందును కేళికోద్యానములయందును గ్రీడాశైలముల యందును నభీష్టకాముఁడై విహరింపుచు యౌవనమున ననవద్యమగు సుఖం బనుభవించెను.

ఒకనాఁ డా యెకిమీడు విలాసవతీ భవనంబున కరుగుటయు నప్పు డప్పడతి చింతాస్థిమితదీనదృష్టులతో శోకంబున మూకభావము వహించి చుట్టును బరిజనంబు బరివేష్టింపఁ గన్నీళ్ళచేఁ దుకూలము దడుపుచు నెడమచేతిపై మో మిడుకొని శయ్యపైఁ గూర్చుండి చింతించుచు భర్తరాకఁ దెలిసికొని ప్రత్యుదానాదివిధులం దీర్చినది.

అప్పుడా నరపతి యాసతీవతంసంబును దొడపై నిడుకొని కన్నీరు దుడుచుచు దేవీ! నీ'వేమిటి కిట్లు' ముక్తాఫలజాలంబులఁ బోని యశ్రుబిందుసందోహంబుల రెప్పల గుప్పుచుంటివి? కృశోదరీ! ఏమిటి కలంకరించుకొంటివి కావు? నీ విరక్తికిఁ గారణమేమి? నేను నీకెద్దియేని యనిష్టమైన పనిఁ, గావించితినా చెప్పుము. నా జీవితము రాజ్యము నీ యధీనమై యున్నవి. వేగము విచారకారణం బెఱింగింపుమని బ్రతిమాలుకొనియెను.

అప్పుడయ్యంబుజాక్షి తాంబూలకరండవాహిని మకరికయను నది మెల్లన నాభూవల్లభుని కిట్లనియె. దేవా! దేవర దేవిగారివిషయమై కొఱఁత యేమియుఁ జేసియుండలేదు. వినుండు. నాకీమహారాజుతో సమాగమము విఫలమైనది గదా యని యమ్మగారు చింతించు చుండఁగనే చాలకాలముగగతించినది. శయనాసనస్నానభోజనభూషణ పరిగ్రహాదులగు దివసవ్యాపారములఁ బరిజనప్రోత్సాహంబున నెట్ట కే కష్టంబునఁ గావింపుచుండునది. అట్టి వికార మెన్నఁడును హృదయ పీడాజిహీర్షచేఁ దెలియనిచ్చినదికాదు. నేఁడు శివరాత్రి యను మహాకాళనాధు నారాధింప దేవళమున కఱిగినది. అందొకచో మహాభారతము జదువుచుండఁ గొండొకసేపు కూర్చుండి యాలకించినది. అందు సుతులు లేనివారికి గతులు లేవనియుఁ బున్నామ నరకము బుత్రులు గాని తప్పింపలేరనియు లోనగు వృత్తాంతముల విని యింటికి వచ్చినది మొదలావిషయమే ధ్యానించుచు మే మెంత బ్రతిమాలినను గుడువక కట్టక ప్రత్యుత్తర మీయక యిట్లు దుఃఖించుచున్నది. ఇది యే యీమె శోకకారణమని పలికి మకరిక యూరకొన్నది.

ఆ కథవిని యొడయం డొక్కింతతడవు ధ్యానించి వేడినిట్టూర్పు నిగుడింపుచు నిట్లనియె. దేవీ! యూరడిల్లుము. దైవాయత్తమగు కార్యమునుగురించి మన మేమిచేయగలము. దేవతలకు మనయెడఁ గనికరములేకపోయినది. వెనుకటిజన్మమున మంచికర్మ చేసితిమికాము. ఇటుపిమ్మట మనుష్యులకు శక్యమైన పనులెల్లఁ గావింతముగాక. గురుభక్తి నిబ్బడిగాఁజేయుము. దేవపూజలు విశేషముగాఁ గావింపుము. మునిజనసపర్యల నాదరముతోఁ జేయుము. వారు దుర్లభములైన వరముల నీయఁగలరు. చండకౌశిక ప్రసాదంబున బృహద్రధుండు జరాసంధుండను పుత్రుం బడయలేదా? దశరధుండు వృద్ధుండయ్యు విభండకనందను నారాధాంచియే కాదా! రామలక్ష్మణభరత శత్రుఘ్నులను పుత్రులం గాంచెను. మునిజనసేవ యెన్నఁడును వ్యర్ధము కాఁజాలదు. దేవీ! నీకేమని వక్కాణింతును. రాత్రింబగళ్ళు ననపత్యతాదుఃఖాగ్ని నన్ను దహించుచున్నది. రాజ్యంబును జన్మంబును విఫలమని తలంతును. తలోదరీ! కమల గర్భుండు మనకు ప్రసన్నుఁడుగాడయ్యెను. నేనేమి జేయుదును. నీ శోకానుబంధము విడువుము ధైర్యమవలంబింపుము. బుద్ధిని ధర్మకార్యములందుఁ బ్రవేశబెట్టుము. అని శోకాపనోద నిపుణంబులగు ప్రియవాక్యంబులచే నత్తలోదరి నాశ్వాసించి కొంతతడనందుండి యతండు నిజభవనంబున కఱిగెను.

అది మొదలమ్మదవతియు దేవతారాధనములయందు బ్రాహ్మణ పూజలయందును వెనుకటికన్నఁ బెద్దగా నాదరముగలిగియుండెను. పుత్రోదయ హేతుభూత మగు వ్రత మెవ్య రెట్టిది చెప్పినను గష్టముల కోర్చి యట్టిదిగావించునది. చండికాయతనంబుల శయనించి యనేకోపవాసములఁ గావింవినది. వృద్ధగోపవనితలు మన్నింప సర్వలక్షణ సంపన్నంబులగు గోవుల పొదుగులదాపున నిలచి సర్వౌషథీమిశ్రితంబులగు పాలతో స్నానంబు గావించినది. కనకమణి వినిర్మితములగు తిలపాత్రముల దానములిచ్చినది. అనేకసిద్థాయతనముల సేవించినది. ప్రసిద్ధములగు నాగహ్రదంబుల మునింగినది. అశ్వద్ధప్రభృతివనస్పతులకుఁ బ్రదక్షిణము లొనర్చినది. నడివీధుల దథ్యోదనము వాయసములకు బలివైచినది. భక్తితో నగ్నక్షపణకాదుల నెందరినో ప్రశ్నలడిగినది. నిమిత్తజ్ఞుల నారాధించినది. వృద్ధులు జెప్పిన రహస్యక్రియలన్నిటిని గావించినది. ఉపశ్రుతుల నాలించినది. నిమిత్తముల గ్రహించినది. తనకువచ్చు స్వప్నవిశేషంబులు గురువులకు నివేదించునది.

ధృతవ్రతయై యయ్యువతి యట్లు చేయుచుండ నొకనాఁడు తారాపీడుండు అల్పావశేషమగు రాత్రియందు సమున్నత సౌధాగ్ర వర్తినియై యున్న విలాసవతీదేవి మొగంబున సకల కలాపరిపూర్ణుం డగు చంద్రుడు బ్రవేశించుచున్నట్లు కలఁ గాంచెను. దిగ్గున లేచి సంతోషాతిశయముతో నాక్షణమునందే శుకనాసుని రప్పించి యా వృత్తంత మెఱింగించుటయు హర్షపులకిత గాత్రుండై యతం డిట్లనియె.

దేవా! శీఘ్రకాలములో మనప్రజల మనోరథములు సఫలములుఁ గాగలవు. కొలఁదిదినములలోఁ గుమారముఖావలోకన సుఖంబనుభవింపఁగలము. మద్ధర్మపత్ని యగు మనోరమ తొడయందొక బ్రాహ్మణుండు దివ్యవస్త్రాలంకారభూషితుండై యరుదెంచి సహస్రదళశోభితంబగు పుండరీక మిడినట్లు నాకును నిన్నరాత్రియే కల వచ్చినది. మంచి నిమిత్తములు గనఁబడుచున్నవి. శుభోదర్కము దాపుననే యున్నదని పలుకుటయుఁ దారాపీడుం డతనిచేయి బట్టుకొని హృదయానందమును వెల్లడించుచు నంతఃపురమునకుఁ దీసికొనిపోయి యిరువుర స్వప్నవృత్తాంతములును విలాసవతి కెఱింగించి సంతోష సముద్రములో నోలలాడించెను.

మఱికొన్నిదినంబులు గతించినంత దేవతాప్రసాదంబున విలాసవతి గర్భవతియయ్యెను. కులవర్ధన యను ప్రథానదాసి యొకనాఁడావృత్తాంతము శుకనాశునితో ముచ్చటించుచున్న ఱేని చెవిలో వైచినది. అశ్రుతపూర్వమగు నవ్వాక్యము విని యజ్జనపతి మేనంబులకలుద్భవిల్ల సంతసమభినయించుచు శుకనాశుని మొగ ముపలక్షించెను. శుకనాసుండయ్యుత్సవము గ్రహించి దేవా! మనకు వచ్చిన కలలు సత్యములైనవా యేమి? వినుదనుక నా హృదయము తొందరపడుచున్న దని యడిగిన నతండు సంతోషముతో దాది చెప్పిన మాటల నెఱింగించెను.

రాజప్రధాను లిరువురు నిరతిశయసంతోష సముద్రమున మునుంగుచు నప్పుడే శుద్దాంతమున కఱిగి యావార్త సత్యమని తెలిసికొని బ్రాహ్మణులకు షోడశమహాదానంబులును గావించిపుత్రోదయసమయ మరయుచుండిరి.

అంతఁ గాలక్రమంబునఁ బ్రసవసమయము సంపూర్ణమైనంత నద్ధరాకాంతు నిల్లాలు శుభదినంబున నుత్తమలగ్నంబున నంబుద మాలిక యిరమ్మదమునుబోలే సకలలోక హృదయానందకరుం డగు కుమారుం గాంచినది.

అప్పు డంతఃపురజనులు భూమిచలింప నిటునటు పరుగులిడు వారును మంగళగీతముల మ్రోగించువారును తూర్యనినాదములు వెలయించువారునై కోలాహలధ్వనులచే నాదేశమునెల్ల నిండింపఁ జేసిరి. ఆనగరమందే కాక యా దేశమందెల్ల జనులుత్సవములు సేయం దొడంగిరి.

తారాపీడుఁడు శుకనాసునితోఁగూడ బుత్రుం జూచు వేడుక ప్రబలదూర్వాప్రవాళమాలాలంకృతంబైన సూతికా గృహంబున కరిగి యందుఁ దొలుత నుదకము నగ్నిని స్పృశించి పిమ్మట విలాసవతి తొడపై దీపమువలెఁ బ్రకాశించుచున్న కుమారు దూరవిస్ఫారితములగు నేత్రములచేఁ బానము జేయువాఁడుంబోలె నీక్షించుచు మిక్కిలి సంతోషించెను. తన్నుఁ గృతకృత్యునిగాఁ దలంచు కొనియెను.

అప్పుడు శుకనాసుం డాబాలకుని యవయవములన్నియు నిరూపించుచు నిట్లనియె. దేవా! చూడుము. గర్భసంపీడనవశంబునం జేసి యంగశోభ స్ఫుటము గాకున్నను జక్రవర్తిచిహ్నములఁ బ్రకటన జేయుచున్నవి.

సంధ్యాకిరణరక్తుండగు బాలశశిరేఖంబురడించు లలాటపట్టిక యందు నళినీతంతువులం బోలిన సూక్ష్మ రేఖలెట్లు ప్రకాశించుచున్నవో పరిశీలింపుము. ఆకార్ణాంతవిశాలములై పుండరీకమువలెఁ దెల్లనై కుటిలములైన కనుబొమ్మలచే ముద్దులు మూటగట్టుచు వెలికాంతుల వెదజల్లుచున్న వీని కన్నులగంటివా?

సీ. కరతలంబులు సుకోకనదకుట్మలలోహి
              తములు చక్రాదిచిహ్నములనొప్పె
    బదయుగంబమరద్రు పల్లవమృదులంబు
              కులిశధ్వజాది రేఖలఁదలిర్చె
    ఫాలంబు శిశునిశాపాలాభిరామంబు
              సార్వభౌమాంకలక్షణతమెఱసె
    గనుఁగవ సితపద్మ కమ్రంబు త్రిభువన
              ప్రభుతానుభావ వైభవముదెలిపె.

గీ. గంటివే వీని రూపముత్కంఠవొడమె
   నోనరేశ్వర! వింటివే వీనికంఠ
   రవము దుందుభివలె సుస్వరతనెసంగె
   వీఁడు బ్రోవఁగఁజాలు నీవిశ్వమెల్ల.

అని యబ్బాలకశిఖామణి యంగశోభావిశేషముల వర్ణించుచున్న సమయంబున ద్వారస్థులనెల్లఁ ద్రోసికొనుచు నతిరయంబున నొకపురుషుం డరుదెంచి ఱేనికిమొక్కి దేవా! విజయమగుఁగాక, శుకనాసునిభార్య మనోరమకు రేణుకకుఁ పరశురాముండు వోలెఁ గుమారుం డుదయించె నని యెఱింగించెను.

అమృతోపమితములగు నప్పలుకులు విని యజ్జనపతి బాష్పపూరితనయనుండై యోహో! కల్యాణపరంపర! మిత్రమా! శుకనాస! విధి సమానసుఖదుఃఖత్వమును సూచింపుచు నీడ వోలె నన్ననుగమించెంగదా? అని పలుకుచు నా వార్త తెచ్చిన పురుషునకపరిమితముగాఁ బారితోషికమిచ్చి యప్పుడ యప్పుడమియొడయఁడు స్రగ్గడతోఁగూడ నతనియింటికరిగి తత్సుతముఖదర్శనంబు గావించి పుత్రో త్సవముపంచి పెట్టించెను.

క్రమంబునఁ బురుటిరాత్రులు గడిచినంత మహావైభవముతో యధావిధి జాతకర్మాది విధుల నిర్వర్తించి, స్వప్నంబునఁ జంద్ర మండలము సతీముఖంబునం బ్రవేశించుచున్నట్లు చూడఁబడుటం జేసి రాచపట్టికిఁ జంద్రాపీడుఁ డని పేరుపెట్టెను.

శుకనాసుఁడును, రాజానుమతి బ్రాహ్మణకులోచితములైన విధులన్నియుం దీర్చి కుమారునకు వైశంపాయను డని నామకరణము జేసెను.

కాలక్రమంబున నాఁబాలునకు శైశవ మతిక్రమించినంతఁ దారాపీడుఁడా నగరమున కనతిదూరములో మనోహర మణిశిలా లలితమగు విద్యామందిరము గట్టించి సకలవిద్యాపారంగతు లగు నుపాధ్యాయులఁ బెక్కండ్ర నియమించి వైశంపాయనునితోఁ గూడఁ జంద్రాపీడుం జదివింపుచుండెను.

రాజపుత్రుఁడు మంత్రిపుత్రునితోఁగూడ ననన్యగతమానసుండై యచిరకాలములో నాచార్యులవలన మణిదర్పణముల వలె నశ్రమముగా సమస్తవిద్యలుం గ్రహించెను.

సీ. మఱి పదవాక్యప్రమాణంబులను శబ్ద
               శాస్త్రమ్మున దర్ధశాస్త్రమందు
    నయశాస్త్రముల నభినయశాస్త్రములఁ జాప
               చక్ర కృపాణాది సాధనముల
    రజతురంగాది శిక్షలఁ జిత్రరత్న ప
               రీక్షల యంత్రతాంత్రికములందు
    గావ్యనాటకవరాఖ్యాయికాదుల సర్వ
               లిపి సర్వభాషా విలేఖనముల.

గీ. గ్రంథరచనల శిల్పకర్మల నశేష

     కళల శృంగారరస దలంకారములను
     సకలవిద్యల నక్కుమారకుల కపుడు
     కలిగె నత్యంత పాండిత్య కల్పనంబు.

మఱియు నా రాజపుత్రునకు బాల్యమునందె సర్వలోక విస్మయ జనకమగు మహాబలంబు గలిగియుండె.

యదృచ్ఛముగా నెదురుపడిన కరికలభంబుల చెవులు పట్టుకొని వంచిన నవి సింహపోతభంజితములవలెఁ గదలలేక నిలువంబడునవి.

కదళీకాండములవలెఁ దాళవృక్షముల నొక్కవ్రేటున నరికి వైచును. పరశురాముండువలె నతం డేయు బాణములచేఁ బర్వతములు గూడఁ జిల్లులుపడుచుండును. పదుగురు మోయలేని యినుపదండ మవలీలఁ గేలం దాల్చి గిరగిరఁ ద్రిప్పును.

ఒక మహాశక్తి తక్క తక్కిన విద్యలన్నియుఁ జంద్రాపీడునితో సమముగా వైశంపాయనుఁడు గ్రహించెను. విద్యాపరిచయ బహుమానంబున శుకసాసునియందుఁ గల గౌరవమునఁ బుట్టినది మొదలు పాంశుక్రీడ లాడుచు నేకముగాఁ బెరుగుట లోనగు కారణములచే రాజపుత్రునకు వైశంపాయనుఁడు రెండవహృదయమువలె విస్రంభపాత్రమగు మిత్రమై యొప్పుచుండెను. నిమిషమైన వాని విడిచి యొక్కఁడు వసింపఁడు.

వైశంపాయనుఁడును సూర్యునిదివసమువలె విడువక సంతత మనుసరించి తిరుగుచుండును. అట్లు విద్యాభ్యాసము చేయుచుండ బ్రదోషమునకుఁ జంద్రోదయమువలె సముద్రున కమృతరసమట్లు కల్పపాదమునకు ప్రసూనోద్గమముభంగి కమలవనమునకు సూర్యోదయము భాతి సౌందర్యమున కధికశోభ దెచ్చుచు నా నరేంద్ర నందనునకు యౌవనోదయమైనది.

సమయము నరసి మన్మధుఁడు సేవకుఁడువలెనే వారినాశ్రయిం చెను. లక్ష్మీతోగూడ వక్షస్థ్సలము విస్తరించెను. ఇట్లు వారు సమారూఢయౌవనులునుఁ సమాప్తసకలవిద్యగులు నగుచుండ వారివార్తవిని తారాపీడుఁడు మిగులసంతసించుచు బలాహకుః డను సేనాపతిఁబిలిచి శుభముహూర్తమున వారిం దోడ్కొని రమ్మని యాజ్ఞాపించెను.

అతండును విద్యాగృహమునకుఁ బోయి వైశంపాయనునితో విద్యాభ్యాసము చేయుచున్న చంద్రాపీడునిం గాంచి నమస్కరించి తదానతి నుపవిష్టుండై యిట్లనియెను.

భర్తృదారక! నీవు సకలవిద్యలయందును బ్రౌఢుడవైనట్లు విని తారాపీడుఁ డెంతేని సంతసించి చంద్రదర్శనమునకు సముద్రుండు వలె నిన్నుఁ జూచుటకుఁ గోరుచున్నవాఁడు. మీరు విద్యాభ్యాసమునకుఁ బ్రారంభించి పది సంవత్సరములయినది. ఆరవయేటఁ బ్రారంభించుటచే నేటికిఁ బదియారేఁడుల ప్రాయముగలిగియుంటిరి. మీ తల్లులు మిమ్ముఁ జూచుటకు మిగుల వేడుకపడుచున్నారు. యౌవన సుఖముతోఁగూడ రాజ్యభోగ మనుభవింపుము. రాజలోకమును సన్మానింపుము. బ్రాహ్మణులఁ బూజింపుము. ప్రజలఁ బరిపాలింపుము. ఇంద్రాయుధమను తురగరత్నమిదిగో యధిష్టించిరమ్ము. మీతండ్రి గారికి దీనిఁ బారశీకదేశపురాజు సముద్రములోఁ బుట్టినదనియు నతి వేగము గలదనియుఁ గానుకగాఁబంపెను. దీనిం జూచి పరీక్షించిన వారు ఉచ్చైశ్రవమునకుఁగల చిహ్నములున్నవని చెప్పుచున్నారు. చూడుఁడని పలుకగావిని యా రాజకుమారుఁడు వైశంపాయనునితోఁ గూడ నా యశ్వలక్షణములన్నియుం బరీక్షించి వెరగందుచు నది యమానుషమని చెప్పుచు దానికి ముమ్మారువలగొని యాగుఱ్ఱ మెక్కెను.

అప్పు డత్తత్తడి సంతసించు దానివలె తోక నాడించుచు సకిలించినది. అదియే శుభశకునముగాఁ దలంచి విద్యాగృహము బయలువెడలి వైశంపాయనుఁడును వేరొక తురగమెక్కి తోడరా రాజమార్గంబున నడుచుచుండెను.

రాజపుత్రుండు సమాప్తసకలవిద్యుండై విద్యాగృహమునుండి వచ్చుచున్నవాఁడను వార్త విని పౌరకాంతలెల్ల నుల్లము లుత్సుకోత్ఫుల్లములై యొప్పదెప్పున నప్పురుషరత్నముం జూడ వేడుక పడుచు సగముసగముగా నలంకరించుకొనియుఁ బూర్తికాకుండఁగనే చేసెడి పనుల విడిచి పరుగుపరుగునఁ జరణనూపురరవముఖరితంబుగ సౌధాం తరంబుల జేరి మరకతవాతాయన వివరములనుండి యానరేంద్రనందను నీక్షింపఁదొడంగిరి.

అప్పుడా మేడలనుండి మకరధ్వజవిజయనినాదము ననుకరింపుచు రమణీమణుల మణిభూషణఘోషము శ్రోత్రపర్వముగాఁబయలు వెడలినది. ముహూర్తకాలములో నంతఃపురములన్నియు యువతిజన నిరంతరము లగుట స్త్రీమయము లైనట్లు ప్రకాశించినవి.

కౌతుకప్రసారితనయనలై చూచుచున్న యమ్మగువల హృదయంబు లద్దములవలె నారాజసూనుని యాకృతి నాకర్షించినవి. అప్పు డావిర్భూత మదనరసావేశహృదయులై యమ్మదవతు లొండొరులు సపరిహాసముగా సాక్షేపముగా సాభ్యసూయముగా సోత్ప్రాసముగా నిట్లు సంభాషించుకొనిరి.

ఓసీ! వేగముగాఁ బరిగిడుచుంటివి. నేనుగూడ వచ్చెదఁ గొంచెము నిలువుము.

ఆహా! నీ మోహము. రాజపుత్రుంజూచినతోడనే యున్మత్తురాలవై పోయితివే? యుత్తరీయము స్వీకరింపుము.

చపలురాలా! మోముదమ్మిం గ్రమ్ముచున్న యలకమ్ముల ముడిచికొని మరియుం జూడుము.

మూఢురాలా! శిరముపై చంద్రలేఖ వ్రేలాడుచున్నది. సవరించుకో. జవ్వనీ! ఏమి నీయౌవనమదము నన్ను నొక్కిస్రుక్కఁ జేయుచుంటివి. వెనుకకు జరుగుము.

  • సిగ్గులేనిదానా! కట్టినదుకూలము జారుచున్నది చూచుకొమ్ము.
  • మత్సరురాలా! ఎంతసేపు చూచెదవు? నీకుకాని యితరులకు వేడుక లేదనుకొంటివి కాబోలు తొలగి నాకుఁ జోటిమ్ము.
  • అమ్మా! కాణాచివి. నీవే ముందరకు రమ్ము.
  • నీవొక్కరితవే గవాక్షమరికట్టితి వెట్లు?
  • ఓహోహో! నీ మిధ్యావినీతత్వ మెఱింగితినిలే. ఈవారచూపు లేల? విస్రబ్థముగాఁ జూడుము.
  • ముగ్ధురాలా! మదనజ్వరపులకజాలము మేనం బొడమినది. కప్పికొనుము.
  • అనంగపరవశురాలా! నాకట్టిన వస్త్రము నుత్తరీయముగాఁ బూనుచుంటివి విడువుము?
  • శూన్యహృదయురాలా! నీవిప్పు డెక్కడ నుంటివో తెలిసికొన లేకుంటివే?
  • అత్తగారు చూచి యాక్షేపించుననియా? పరుగిడి లోపలికి బోవుచుంటివి?
  • లఘుమతీ! రాజపుత్రుం డవ్వలకుఁ బోయెఁ గన్నులం దెరవుము.
  • ఓహో! పతివ్రతాశిరోమణీ! చూడఁదగిన వస్తువుల జూడక నీకన్నుల వంచించుచుంటివిగదా!
  • ప్రియసఖీ! పరపురుష దర్శనపరీహారవ్రతము విడిచి త్రిలోక మోహజనకుండు రతివిరహితుండు నగృహీతమకరధ్వజుండు నగు నీ మకరధ్వజు నీక్షింపుము. ధన్యురాల వగుదువు.

ఆహా! ఆమోము అయ్యారే? ఆతళ్కు జెక్కులు, బాపురే? ఆబాహువులుఁ భళిరే! పేరురంబు. ఈ సుకుమారునిఁ బుత్రునిగాఁ గనిన విలాసవతి యెంతధన్యురాలో వీనిం భత౯గాఁ బడయఁబోవు పూవుఁబోడి యెంత తపంబు గావించినదియో? అని యంతఃపుర కాంతలెల్లస్తుతియింపుచుండఁ జిత్రగమనంబులఁ బెక్కండ్రు వారు నపురౌఁతులు చుట్టునుం బరివేష్టించి నడుచుచుండఁ గ్రమంబునఁ బోయిపోయి యాస్థాన సమీపమున కరిగి ద్వారదేశమునందే గుఱ్ఱమును దిగి వైశంపాయనుని కైదండఁ గైకొని బలాహకుఁడు వినయముతో ముందు నడచుచు దారిజూపుచుండఁ గక్షాంతరములు గడచి కైలాసగిరి విలాసమునం బ్రకాశించు గృహసభామంటపంబు చేరంజని యందు,

సీ. కనకవేత్రములఁ గైకొని దర్పము దలిర్ప
              ద్వారపాలురు బరాబరులు సేయ
    ఆహిదీప్త పాతాలగుహలట్లు పొలుచు నా
              యుధశాలలను యోధులోలగింప
    జము నోలగమున నొజ్జల వోలెఁ దగులేఖ
              కులు శాశన సహస్రములు లిఖింప
    క్షితినాధ దర్శనాగతపర్వదేశభూ
              పతితతిస్తవ రవార్భటులు సెలఁగ.

గీ. వేశ్యలిరువంక చామరల్ వీచుచుండఁ
    గవులు గాయక వందిమాగధ విబూష
    కులు భజింపఁ నిలింపయుక్తుఁడు మహేంద్రు
    కరణిఁ గొలువున్న ధరణీంద్రుఁ గనియె నతఁడు.

కర వినమ్రుఁడై నమస్కరించుచున్న పుత్రుం జూచి తండ్రీ! రమ్ము రమ్మని చేతులు సాచుచు నానందబాష్పపూరిత లోచనుండై రాజు మేనం బులక లుద్భవిల్ల పుత్రుం కౌగలించుకొనియెను. తరువాత సుతనిర్విశేషుం డగు వైశంపాయనునిం గూడ గాఢాలింగనము గావించి ముహుత౯కాలము వారిం బరీక్షించి చూచుచు వత్సా! మీతల్లి నిన్నుఁ జూచుటకై పరితపించుచున్నది. సత్వర మామెయొద్ద కరుగుమని నియమించుటయుఁ దండ్రికి నమస్కరించి వైశంపాయనునితోఁ గూడ విలాసవతీదేవి యంతఃపురమున కరిగి యామెకు నమస్కరించెను.

ఆమెయుఁ తొందరగా చేచి పరిజనమున్నను తానే యవతరణ మంగళకృత్యముల నిర్వర్తించి తదభివృద్ధి నభిలషించుచు శిరసు మూర్కొని గాఢాలింగనము గావింపుచు నానందబాష్పములచే నతని శిరంబు దడిపినది. తరువాత వైశంపాయనునిఁ గూడ నాదరించి కరతలంబునఁ గుమారకుని శిరంబు దువ్వుచు వత్సా! నీతండ్రి కడు గఠినుఁడు సుమీ? నిన్నింతకాలము నాకుఁ గనఁబడకుండ దూరముగా నునిచి కష్టపరచెనే? కఠినమగు తండ్రిగారి యాజ్ఞ నీవెట్లు కావించితో తెలియదు. నీవు పిల్లవాఁడవైనను నీ హృదయము శిశుజన క్రీడాకౌతుకలాఘవముగాదు. ఎట్లయినను గురుప్రసాదంబున సమస్త విద్యాయుక్తుండవై చూడఁబడితివి. ఇఁక ననురూపవధూ యుక్తుండవగు నట్లు చూడఁగోరుచుంటినని పలుకుచు లజ్జాస్మితావనత ముఖుండై యున్న పుత్రుని చెక్కులు ముద్దుపెట్టుకొన్నది.

చంద్రాపీడుం డట్లు కొంతసేపందుండి తల్లి యానతి బూని వైశంపాయనునితోఁగూడ నటనుండి శుకనాసుని భవనమున కరిగి యందనేక నరపతి సహస్రమధ్యవతి౯ యగు శుకనాసునికి వినయముతో దూరమునుండియే యవనతమౌళియై నమస్కారము గావించెను.

అమ్మంత్రి సత్తముం డతని లేవనెత్తి యానందబాష్పపూరిత నయనుండై వైశంపాయనునితోఁ గూడ గాఢాలింగనము గాచించెను. రాజపుత్రుండును, మంత్రి పుత్రుండును సముచితాసనోప విష్టులైయున్న సమయంబున నందున్న సామంతరాజులెల్లఁ దమపీఠాంబుల విడిచి నేలం గూర్చుండిరి. అప్పుడు మేనం బొడమిన పులకలచే హృదయగతహష౯ ప్రకష౯ము వెల్లడించుచు శుకనాసుండిట్లనియె.

తాత! చంద్రాపీడ! సమాప్తవిద్వుండవు సమారూఢయౌవనుండవు నగు నిన్నుఁ జూచుటచే; నిప్పటికి మాఱేనికి భువనరాజ్య ఫల్రప్తా కలిగినది. గురుజనాశీర్వాదము లన్నియు నిప్పటికి ఫలించినవి. అనేకజన్మోసాజి౯తమగు సుకృతము నేఁటికి పండినది. కులదేవత లిప్పటికిఁ బ్రసన్నులైరి. పుణ్యహీనులకు మీవంటి యుత్తములు పుత్రులుగా జన్మింతురా? నీ వయసెంత? అమానుషశక్తి యెంత? విద్యాగ్రహణసామర్ధ్య మెంత? ఆహా! ఈదేశప్రజలందఱు ధన్యులు గదా? ఈ భూభారమంతయు దంష్ట్రచే మహావరాహమువలెఁ దండ్రితోఁ గూడ వహింపుము.

అని పలుకుచు స్వయముగాఁ గుమారుకులకుఁ గుసుమాభరణాంగ రాగాదు లొసంగి యాదరించెను. తరువాత నాతనియనుమతివడసి రాజపుత్రుండు మిత్రునితోఁగూడ మంత్రిపత్ని మనోరమంజూచి యామె దీవెనల నంది యటఁ గదలి తండ్రిగారిచేఁ గ్రొత్తగాఁ దమకై నిర్మింపబడిన రాజకులముయొక్క ప్రతిచ్ఛందకము వలె నున్న మేడకుం బోయెను.

మరకతమణులచేఁ దోరణములుగట్టఁబడినవి. అనేక కనకదండచిత్రపతాకము లెగురుచుండెను. తూర్యనాదము మ్రోగించిరి. మహా వైభవముతో నమ్మేడలోఁ బ్రవేశించి చంద్రాపీడుఁడు వైశంపాయనునితోఁ గూడ వేడుకగాఁ గొన్నిదినములు గడిపెను.

మఱియొకనాఁడు కైలాసుండను కంచుకి పత్రలేఖయను నంబుజ నేత్రను వెంటఁ బెట్టికొని యచ్చటికి వచ్చెను. శక్రగోపకాతుల్యమగు నరుణాంశుకము ముసుంగుగావైచికొని బాలాతపమునఁ బ్రకా శించు తూర్పుదిక్కువలె మెఱయుచు రాజకులసంవాసప్రగల్భయయ్యు వినయమును విడువక రాహుగ్రాసభయంబునఁ జంద్రకిరణములవిడిచి పుడమికవతరించిన జ్యోత్స్నయోయన లావణ్యయుక్తమగు తెల్లని దేహకాంతి గలిగి సర్వాంగసుందరియు సకలాభరణభూషితయునై తొలిప్రాయంబున నొప్పుచున్న యా యొప్పులకుప్పంజూచి రాజపుత్రండు వెరగుపాటుతో నీవెవ్వండ వీబాలిక నేమిటికిఁ దీసికొనివచ్చితివని యడిగినఁ గైలాసుండు వినయముతో నమస్కరించుచు నిట్లనియె.

కుమారా! విలాసవతీ మహాదేవిగారు తమ కిట్లాజ్ఞాపించుచున్నారు. ఈ చిన్నది కులూ తేశ్వరుని కూఁతురు. దీనిపేరు పత్రలేఖ. మీ తండ్రిగారు దిగ్విజయము సేయుచుఁ గులూతరాజధానిం జయించి వందిజనముతోఁగూడ నీచేడియం దీసికొనివచ్చి యంతఃపురపరిచారికామధ్యంబున నుంచిరి.

నేనీ బాలికామణి వృత్తాంతము విని యనాధ యని జాలి గలిగి రాజపుత్రికయని గౌరవించుచుఁ బుత్రికానిర్విశేషముగా లాలించుచు నింత దనుకఁ బెనిచితిని. ఇప్పు డిప్పడఁతి నీకుఁ దాంబూల కరండవాహినిగా నుండునని యాలోచించి యమ్మించుబోఁడి నీకడ కనిపితిని. నీవీ పూవుఁబోడిం బరిజనసామాన్య దృష్టిం జూడఁగూడదు. బాలికనువలె లాలింపవలయును. చిత్తవృత్తివలెఁ జపలక్రియల వలన మరలింపవలయును. శిష్యురాలిగాఁ జూడఁదగును. మిత్రుఁడువోలె విస్రంభకార్యములకు నియోగింపవలయును. పెనిచినమోహంబునం జేసి కన్నబిడ్డలయందువలె నాకు దీనియం దెక్కుడు మోహము గలిగియున్నది. మహారాజ కులప్రసూత కావున గౌరవింపనర్హురాలు. కొలఁది దినములలో దీని సుగుణసంపత్తి నీకేతెలియఁగలదు. దీనిశీలమెఱుఁగవు కావున నింతగాఁ జెప్పుచుంటిని.

అని చెప్పి కైలాసుఁ డూరకున్నంతఁ దనకు నమస్కరించు చున్న యాచిన్న దాని నొక్కింతతడవు ఱెప్పవాల్పక చూచి రాజపుత్రుండు కైలాసా! అమ్మగా రెట్లాజ్ఞాపించిరొ యట్లు కావింతునని చెప్పుము. పొమ్ము. అని పలికి వానినంపెను.

అది మొదలమ్మదవతియు నిద్రించుచున్నను, మేల్కొన్నను, దిఱుగుచున్నను రాత్రిం బగలు నీడవలె రాజపుత్రుని పార్శ్వము విడువక సేవింపుచుండెను. చంద్రాపీడుండును జిత్రలేకం జూచినదిమొదలామెయందుఁ బ్రతిక్షణము వృద్ధిజెందుచున్న ప్రీతిగలవాఁడై తన హృదయముతో సమానముగజూచుచు విస్రంభకార్యములకు నియోగింపుచుండును.

అట్లు కొన్నిదినములు గడచినంత నాభూ కాంతుఁడు పుత్రకుని యౌవరాజ్య పట్టభద్రునిఁగా జేయఁదలంచి సంబారములన్నియు సమకూర్చుచుండెను. అప్పుడొకనాఁడు దర్శనార్థమై వచ్చిన చంద్రాపీడునింజూచి శుకనాసుఁడు సంతసించుచు రాజనీతి నిట్లుపదేశించెను.

రాజనీతి

తాత చంద్రాపీడ! సమస్తశాస్త్రములు నభ్యసించి వేదితవ్య మంతయు గురుతెఱింగిన నీకు మేమేమియు నుపదేశింపనవసరము లేదు. స్వభావముచేతనే వ్యాపించిన యౌవనతమము సూర్యప్రభచేతను రత్నకాంతులచేతను, దీపరుచులచేతనుఁ బోవునదికాదు. లక్ష్మీమదముసైతము దారుణమైనదే, యైశ్వర్యతిమిరాంధత్వము అంజన సాధ్యమైనదికాదు. దర్పదాహజ్వరము శిశిరోపచారముల నుపశమింపదు. విషయవిషాస్వాదనమోహము మంత్రబలంబున నశించునదికాదు. రాగమలావలేపనము స్నానంబునం బోవునదిగాదు. గర్భేశ్వరత్వము, యౌవనత్వము, అనుపమసౌందర్యత్వము, నొక్కొ క్కటియె యవినయమునకుఁ దావలమగుచుండ నన్నియు నొక్కచో నుండు నప్పుడేమి చెప్పఁదగినది?

యౌవనారంభమందు శాస్త్రజలములచేఁ గడఁగబడినను బుద్ధికాలుష్యము నొందకమానదు. తరచుమౌనులదృష్టి రాగముతోఁ గూడుకొని యుండును. నీవంటివారే యుపదేశమున కర్హులు. స్ఫటికమణియందుఁ జంద్రకిరణములువలె నిర్మలమగు మనంబున నుపదేశ గుణములు ప్రవేశించును. గురువాక్యము నిర్మలమైనను జలమువలె దుర్జనులకు శ్రవణగతమై శూలను గలుగఁజేయును. అనాస్వాదిత విషయ సుఖుండవగు నీకిదియే యుపదేశసమయము. కుసుమశర ప్రహార జఝు౯రిత హృదయులగు వారికుపదేశము జలమువలెనే నిలువక జారిపోవును. చందనవృక్షమునఁ బుట్టినయగ్ని మాత్రము దహింప కుండునా? బడబాగ్ని యుదకముచేత నడంగునా? జనులకు గురూప దేశము ప్రక్షాళనజలమువంటిది. విశేషముగా రాజుల కుపదేశించు వారులేరు. జనులు ప్రతిధ్వనివలెనే రాజవాక్యముల ననుసరించి పలుకుదురు.

ధనమదులు దర్పవ్రణపూరితములగు చెవులుగలవారై గురూప దేశములను వినరు. వినినను గజములవలె గన్నులుమూయుచు నుపదేష్టలను బాధింపుచుందురు. ధనము ఆళూకాభిమానములఁ గల్పించును. రాజ్యలక్ష్మి తంద్రీప్రదమైనది. రాజ్యలక్ష్మి సరస్వతీయుతుండగువాని నసూయంబోలె జూడనీయదు. గుణవంతు నపవిత్రునిపగిది ముట్టనీయదు. సుజను నున్మత్తునివలెఁ బరిహసించును. వినీతు మహాపాతకుపగిది దాపుఁజేరనీయదు. అది తృష్ణావిషవల్లులకు సంవర్ధనధార, ఇంద్రియమృగములకు వ్యాధగీతి, మోహదీర్ఘనిద్రకు విభ్రమశయ్య, ధనమదపిశాచములకుఁ దిమిరసంహతి, అవినయమున కుత్పత్తిస్థానము. అన్నన్నా! రాజ్యలక్ష్మిచేత నాలింగితులగు రాజులొడలెఱుంగుదురా? అభిషేకసమయమందే మంగళకలశ జలములచే దాక్షిణ్యము కడగఁబడు చున్నది.

అగ్నికార్యధూమముచేత హృదయము మాలిన్యము బొందుచున్నది. పురోహితుని కుశాగ్ర సమ్మార్జనముచేత క్షాంతి పోవుచున్నది. చామరపననముచేతనే సత్యవాదిత యెగిరిపోవుచున్నది.

అతిచంచలమగు రాజ్యసంపదలను జూచుకొని గర్వించుచు రాగమగ్నులై అరుదైనను ననేక సహస్రములుభాతిదోచు నింద్రియ సుఖములచేత వివశత్వము నొందుదురు. ఆహా! ధనమదులు ఆసన్న మృత్యులువలె దగ్గిరనున్న బంధువులను సైతము గురుతెరుంగరు. ముఖరోగులు వలె గష్టముగా మాట్లాడుదురు. అంధులువలె దాపున నున్నవారి సైతము జూడలేరు.

జూదము వినోదమనియు, వేట పాటవమనియు, పానము విలాసమనియు, స్వదారపరిత్యాగము అవ్యసనత్వమనియు, నృత్యగీతవేశ్యాప్రసక్తి రసికతయనియు దోషములను సైతము గుణములుగా వర్ణించుచు స్వార్ధనిష్పాదనపరులు ధనపిశితగ్రాసగృధ్రులు నగు వంచకుల మాటలకు సంతసించు రాజుల శిరి యల్పకాలములో నశించును.

అమానుషషోచితములగు స్తోత్రవాక్యములు విని యాత్మారోపణము చేసికొనువారు సర్వజనులకుఁ బరిహాసాస్పదు లగుదురు. కుమారా! నీవెన్నఁడును ఇట్టి దుర్వృత్తులజిత్తమునుఁ జొరనీయకుము. వంచకుల నంతికమునకుఁ జేరనీయకుము. సర్వదా సజ్జనగోష్ఠిని మెలంగుము. సాధులఁదిరస్కరింపకుము. కర్ణేజవులమాటల వినకుము. పరిచారకులకుఁ జనువీయకుము. రాగలోభాదుల హృదయంబున నంటనీయకుము. అభిజాతునైనను, పండితునైనను, ధీరునైనను రాజ్యలక్ష్మి దుర్వినీతుల జేయుంగావున నీకింత సెప్పితిని. నీకు నా బోధ యేమియునవసరములేదు. రాజ్యభారమువహింపుము. ప్రజలదయతోఁ బాలింపుమని రాజనీతి యంతయు నతని కుపదేశించెను.

అప్పుడు చంద్రాపీడుఁడు శుకనాసుని వాక్యాంబువులచేతఁ బ్రక్షాళితుండువోలె నభిషిక్తుని పదిగి నభిలిప్తుని చందమున నలంకృతునిభాతిఁ ప్రీతహృదయుండై కొండొకవడి ధ్యానించి యతని యనుమతి నాత్మీయభవనమునకుఁ బోయెను.

అంతటఁ దారీపీడుఁడు శుభముహూర్తమునఁ జతుస్సముద్ర జలంబులందెప్పించి బ్రాహ్మణాశీర్వాద పురస్సరముగాఁ జంద్రాపీడుని యౌవరాజ్య పట్టభద్రునింజేసెను.

అప్పుడు ప్రజలందరు నానందసాగరమున నీదులాడిరి. చంద్రాపీడుఁడు సింహాసనమెక్కిన గొద్దిదినముల కే తండ్రియనుమతివడసి శుకనాసుని శాసనప్రకారము చతురంగ వాహినీ పరివృతుండై వైశంపాయనుఁడు తోడరాఁ జిత్రలేకతోఁగూడ దిగ్విజయయాత్ర వెడలి క్రమంబునఁ బూర్వదక్షిణ పశ్చిమోత్తరదేశములఁ దిరిగి శరణాగతుల రక్షించుచు దుర్మార్గుల శిక్షించుచు భీతుల నోదార్చుచు రాజపుత్రుల కభిషేకము జేయించుచు రత్నముల స్వీకరించుచు నుపాయనములఁ గైకొనుచుఁ బన్నులఁ దీసికొనుచు విజయచిహ్నము లాయాచోటుల స్థాపించుచు శాసనముల లిఖింపుచు బ్రాహ్మణులఁ బూజించుచు మునుల కాశ్రమములఁ గల్పించుచు బరాక్రమమును వెల్లడించుచు గీర్తిని వెదజల్లుచు భూమండలమంతయు దిరిగి విజయస్థంభంబుల నాఁటి మరలి తన పురంబున కరుదెంచుచు నొకనాఁడు కైలాస సమీపమునఁ జరించెడు హేమజటులను కిరాతులకు నివాసస్థానమై పూర్వసముద్రమున కనతిదూరములోనున్న సువర్ణపురమును జయించి స్వీకరించెను.

మఱియు రాజపుత్రుఁడు ఆ నగరమందు నిఖిల ధరణితల పర్యటనమువలన నలసిన తనబలమునకు విశ్రాంతి గలుగుటకై కొన్ని దినములు వసించెను.

కిన్నరమిధునము కథ

ఆరాజకుమారుం డొకనాఁడు ప్రాతఃకాలమున నింద్రాయుధ మెక్కి యొక్కరుఁడ విహారాధ౯మై యాప్రాంతారణ్యమునకుఁ బోయి యందందు సంచరించుచు దైవయోగంబున నొకచోఁబర్వత శిఖరమునుండి దిగుచున్న కిన్నరమిధునమునుఁ జూచెను.

అపూర్వవస్తు విశేషదశ౯నంబున మిగులసంతసించుచు నతం డమ్మిధునమునుఁ బట్టుకొనఁదలంచి తురగమును మెల్లగా దానిదాపునకుఁ బోనిచ్చెను.

అప్పు డెప్పుడును జూడని పురుషునింగనుటచే నమ్మిథునంబు వెరవుగదురఁ గాలికొలఁది పరువెట్టదొడంగెను.

చంద్రాపీడుండును మడమలచేఁగొట్టుచు నత్తత్తడి వడిగాఁ బరుగిడ సేనానివేశమునువిడచి యమ్మిధునమువెంట నొక్కరుండ మిక్కిలి దూరముగాఁ బోయెను.

అతనితురగ మతివేగముగాఁ బోవుచుండుటచే నమ్మిథునము దొరకునట్లే కనంబడుచు నెక్కడను జిక్కక యొక్క ముహూత౯ ఘాత్రములోఁ బదియేనామడ నడచి యతండు చూచుచుండగనే యందున్న పర్వతశిఖర మెక్కినది.

అంతవరకు నొక్కడుగులాగువచ్చి యచ్చటఁ బ్రస్తరశకలము లత్తురగ గమనమున కంతరాయము గలుగఁజేయ శ్రమజెంది మేనెల్లఁ జెమ్మటలుగ్రమ్మ నడుచుచున్న గుఱ్ఱమునునిలిపి తనకుఁదా నవ్వుకొనుచు నతం డాత్మగతంబున నిట్లు తలంచెను. అన్నన్నా? పిన్నవాఁడువలె నేనీకిన్నర మిధునము వెంటవచ్చి యూరక శ్రమపడితిని. దొరికినను దొరకకున్నను దీనితో నా కేమి ప్రయోజనమున్నది. బాపురే? నిరర్థకవ్యాపారమున నాకింత యాసక్తి యేలపుట్టవలయును? చేసినకార్యము లేమైనం దీనజెడిపోవుచున్నవా? లేక మిత్రులకుఁ జేసినయుపకృతి నిలుపఁబడుచున్నదా? అయ్యారే! విచారింప దీనివెంటనేనింతదూరమెందులకు వచ్చితినో తెలియకున్నది. తలంచుకొన నాకే నవ్వువచ్చుచున్నది. అయ్యయ్యో, ఇచ్చటికి నాబలమెంత దూరములోనున్నదియో తెలియదు. నాతురగము నిమిషములోఁ బెక్కుదూరము నడువనోపును. నేను గిన్నర మిధునమంద దృష్టియిడి యతివేగముగా వచ్చుటచేనిప్పుడు తిరుగా నేదారినిఁ బోవలయునో తెలియకున్నది. ఈయరణ్యములోఁ బ్రయత్నముతోఁ వెదకినను దారినెఱిగించు మనుష్యుఁ డెవ్వడు గనంబడకున్నాఁడు. యిది దేవభూమివలె దోచుచున్నది. ఇందు మనుష్యసంచార ముండదు. ఇది యుత్తరదేశముగావున నేను దక్షిణముగా బోయిచూచెదను. తానుజేసిన కర్మలయొక్క ఫలము తానేయనుభవింప వలయునుగదా? అని యూహింపుచు మెల్లగాఁ దురగమును దక్షిణదిశకు మరలించెను.

అట్లు మరలించి అయ్యో, యిప్పుడు సూర్యుఁడంబరతలమధ్యవతి౯యై యున్నవాఁడు. ఈఘోటకమును మిక్కిలి యలసినది. యిది కొంచెము మేసినతరువాత నీరుద్రావించి నేనును నీరుద్రాగి యలసట దీర్చుకొని ముహూత౯ కాలము విశ్రమించి పిమ్మటఁబోయెదను.

అనినిశ్చయించి నీరుండు తావరయుచుండ నొకదండ జలపక్షు లెగురటయుం గనిపెట్టి యమ్మాగ౯ంబున బోఁవబోవ మనోహర తరుషండ మండితమగు నచ్చోదమను సరోవరమొండు గనంబడినది. చూచినంతమాత్రమున మాగా౯యానమంతయు నపనయింపఁజేసిన యక్కాసారంపు శోభంజూచి యతండాత్మగతంబున నిట్లుతలంచెను. ఆహా? కిన్నరమిధునానుసరణము నిష్ఫలమైనను ఇప్పుడీసరోవరము గనఁబడుటచే సఫలమనియే తలంతును. నాకుఁగన్నులు గలిగినందులకుఁ జూడదగినవస్తువును నేఁటికిఁజూచితిని. రమణీయమగు వానిలో నిదిచివరిదిగా భావింతును. దీనిసృష్టించిన స్రష్ట తిరుగా నమృత సరస్సేమికి నిర్మించెనోతెలియదు. ఇదియమృతమువలె సకలేంద్రియముల నాహ్లాదపెట్టుచున్నది. దీనింజూచియే భగవంతుఁడగు వాసుదేవుండు జలశయనమును విడువకున్నాడు. అన్నన్నా, అమ్మహానుభావుం డిట్టిదాని విడిచి లవణరసపరుషములగు జలధి జలముల నేటికి శయనించెనో తెలియదు. నిక్కము. ప్రళయకాలమం దిందలి జలలేశము గ్రహించి మహావలాహకములు భూమినంతయు ముంచు చున్నయవి.

అనియిట్లు విచారించుచు సికతాలతా వికసితమగు తదీయ దక్షిణతీరమునఁ దురగమును దిగి దానినీరుద్రాగించి యొక తరుమూలమునఁగట్టి యత్తటాకతీరమున మొలచిన దుర్వా ప్రవాళ కబళములఁగొన్ని స్వయముగాఁబెరికితెచ్చి దానిముందువై చెను.

తరువాత నాతడందుదిగి కరచరణములగడిగికొని చాతకమువలె జలముగ్రోలి స్మరశరాతురుండు బోలె నళినీదళముల నురమున దాల్చుచు గొంతసేపవ్విలాసమంతయుంజూచి తలయూచి మరలఁ దీరము జేరి యందొకశిలాతలంబునఁ దూఁడులతోఁగూడ నళినీదళంబులం గొన్ని బెరికికొనివచ్చి యాస్తరణముగావైచి యందు శిరంబునం జుట్టికొన్న యుత్తరీయము పరచి కూర్చుండెను.

ముహుత౯కాలమట్లు విశ్రమించినంత నాప్రాంతమున మేయుచున్న యింద్రాయుధము మేతమాని చెవులు నిక్కబెట్టుకొని యట్టె నిక్కి చూచుటయుఁ దత్కారణమరయ నతనిచెవులకు వీణాతంత్రీ ఝుంకారమిశ్రితమగు నమానుషగీత మొండు వినంబడినది. విగతమర్త్యసంపాతముగల యీప్రదేశమునందు నిట్టి గీతధ్వని పుట్టుటకుఁ గారణమెద్దియో? యని శంకించుచు నక్కమలినీపత్రసంస్త రణమునుండి లేచి యతండు ఆగీతానాదము లేతెంచిన దిశకు దృష్టి ప్రసరింపఁజేసెను. ఆప్రదేశ మతిదూరముగా నుండుటచేఁ బ్రయత్నముచేతఁ జూచినను నేమియుఁ గనంబడినదికాదు. అనవతరమాగాన స్వానము మాత్రము వినంబడుచున్నది. అప్పుడా గీతకారణమరయుటకు మిక్కిలి కౌతుకమందుచు నారాజకుమారుఁడు ఇంద్రాయుధము నెక్కి గీతప్రియత్వమున ముందుగా బయలువెడలిన వనహరిణములు మార్గమునుజూపుచుండ నేలా లనంగ లవలీలతాలోల కుసుమ వాసితములకు సప్తచ్ఛద తరువులచే మనోహరమైన తత్తటాక పశ్చమతీరము ననుసరించి యఱిగెను.

అట్లు పోవంబోవఁ దదుత్తరతీరంబున మనోజ్ఞతరులతావేష్టితమైన సిద్ధాయతనమొండు అతనికి నేత్రపర్వము గావించినది. స్ఫటిక శిలావినిర్మతమగు నమ్మంటపమధ్యభాగంబున మందాకినీ పుండరీకములచే నర్చింపఁబడిన స్ఫటికలింగ మొండు విరాజిల్లుచున్నది.

అమ్మహాలింగమునకు దక్షిణభాగంబున బ్రహ్మాసనము వైచుకొని హంస శంఖ ముక్తాఫల గజదంత పాదరసాది ధవళవస్తు జాతమును గరగించి యమృతరసముతోఁ బదునువెట్టి చంద్రకరకూర్చలచే సవరించి పోసెనోయనఁ దెల్లనిమేనికాంతి దీపింప బాలార్కప్రభాసదృశములగు జటామాలిక లుత్తమాంగమున ముడివైచికొని నక్షత్ర క్షోదముంబోని భస్మము లలాటమున మెఱయ నమలకీఫలస్థూలములగు ముక్తాఫలములచేఁ గట్టబడిన యక్షసూత్రము గంఠమునం గట్టికొని కుచమధ్యంబునం బిగియంగట్టిన కల్పతరులతావల్కలోత్తరీయము ఏకహంసమిధున సనాధ యగు శ్వేతగంగం బురడింప స్వభావముచేఁ దెల్లనిదైనను బ్రహ్మాసనమందుత్తానముగానిడిన చరణకాంతి సంక్రమించుటచే లోహితాయమానమగు దుకూలముచేత నావృతమగు నితంబము గలిగి నఖమయాఖములు ప్రతిఫలింప దంతమయమైన వీణను దక్షిణకరంబునం బూని మూర్తీభవించిన గాంధర్వదేవతయోయనఁ దంత్రీనాదములతోఁ గంఠస్వానము మేళగించి పాడుచుఁ బాశుపతవ్రత మనుసరించి దివ్యాకృతితో నొప్పుచున్న యొక చిన్నదానిం గాంచి మేనువులకింప నానృపనందనుఁడు సంభ్రమముతో నాతురంగమును డిగి యావారువమును చేరువ నొకతరుమూలమునంగట్టి యమ్మహాలింగము చెంతకుంబోయి నమస్కరించుచు నక్కాంతారత్నము ననిమేషదృష్టుల మరల నిరూపించి చూచి తదీయ రూపాతిశయమునకుఁ గాంతివిశేషమునకును వెరగందుచు నిట్లు తలంచెను. అన్నన్నా! జంతువులకు నప్రయత్నముననే వృత్తాంతాంతరములు దోచుచుండునుగదా! నేనుయదృచ్ఛముగా వేటకు వెడలినంత గిన్నరమిధునమునుఁ దివ్యజనసంచారయోగ్యమగు ప్రదేశమును గానంబడినది. అందు సలిలము వెదకుచుండ సిద్దజనోప స్పృష్ట జలమగు సరోవరము జూడనయ్యె. తత్తీరమున విశ్రాంతివహించి యుండ నమానుషగీతము విననయ్యె, దానిననుసరించి రాగా నిందు మానుష దర్శన దుర్లభయగు నీచిన్నది కన్నులకు విందుగావించినది.

ఇక్కురంగనయన దివ్యాంగనయని తదాకారమే చెప్పుచున్న యది. ఆహా! మనుష్యాంగనల కిట్టి సౌందర్యమును గాంధర్వమును గలిగియుండునా? దైవవశంబున నీ యోషారత్న మంతర్ధానముజెందనియెడ నీవెవ్వతెవు? నీ పేరేమి? ప్రథమవయస్సున నిట్టివ్రత మేమిటికిఁ బూనితవని యడిగెదనుగదా! అనితలంచుచు నాస్ఫటిక మంటపములో వేరొక స్థంభము మాటునం గూర్చుండి యనాతిగీత సమాప్త్యవసరము ప్రతీక్షించుచుండెను.

ఆనాతియుఁ గీతావసానమున వీణంగట్టి లేచి యమ్మహాలింగ మునకుఁ బ్రదక్షిణముచేయుచు నొకమూల వినమ్రుఁడై యున్న యారాజకుమారుని నిర్మలమగు దృష్టి ప్రసారములచేతఁ బవిత్రము చేయునదివోలె వీక్షింపుచు నిట్లనియె.

అతిధికి స్వాగతమే? ఈమహాభాగుఁడీభూమి కేటికివచ్చెనో? అతిధి సత్కారమంద లేచి నాతో రావలసియుండునుగదా? యని పలికినవిని యచ్చంద్రాపీడుండు తత్సంభాషణ మాత్రమునకే తన్నను గ్రహించినట్లు తలంచుకొనుచు భక్తితో లేచి నమస్కరించి భగవతీ! భవదాజ్ఞానుసారంబున మెలంగువాఁడ నని వినయమునుఁ జూపుచు శిష్యుండువోలె నయ్యించుబోణి ననుగమించి నడచుచు నిట్లు తలంచెను. మేలుమేలు? నన్నుఁ జూచి యీచిన్నది యంతర్ధానము నొందలేదు. ఇదియు మదీయహృదయాభిలాష కనుకూలించియే యున్నది. తపస్విజన దుల౯భమగు దివ్యరూపముగల యీ కలకంఠికి నాయందెట్లు దాక్షిణ్యము గలుగునో యట్లు మెలంగువాఁడ. అడిగినచోఁ దనవృత్తాంత మిత్తన్వి నాకుఁ జెప్పకమానదు. కానిమ్ము. సమయమరసి యడిగెద నని తలంచుచు నూరడుగులు అప్పడఁతి వెంటనడిచెను.

పగలైననుఁ దమాలతరుచ్ఛాయలచే రాత్రిం బలెదోచు సమ్మార్గంబున నడువ మణికమండలు శంఖమయభిక్షాకపాల భస్మాలాబుకాదివస్తువులచే నొప్పుచుఁ భ్రాంతనిర్ఘ రీజల కణములచేఁ జల్లనైయున్న గుహాయొకటి గానంబడినది.

అయ్యిందుముఖ యచ్చాంద్రాపీడుని గుహాముఖశిలయందుఁ గూర్చుండఁ గను సన్నజేయుచు నవ్విపంచిని వల్కలతల్ప శిరోభాగమందుంచు పణ౯పుటంబున నిఝు౯రజలంబుబట్టి యఘ్యముగా నిచ్చుటయు నతండు భగవతీ చాలుచాలు అత్యాదరమును విడువుము నీకటాక్షలేశమే మదీయ పాపసముదాయముల బోగొట్టినది. శిష్యుననుగ్రహింపుమని పలుకుచున్నను విడువకచ్చేడియ బలాత్కారముగా నతనికతిధిసత్కారముదీర్చినది. అతండును వంచిన శిరస్సుతో నతివినయముగా నయ్యాతిధ్యమందుకొనియెను.

అట్లాతిధ్యమిచ్చి యచ్చేడియ వేరొక శిలాతలమునఁ గూర్చుండి యొక క్షణ మూరకొని పిమ్మట నతని నాగమనకారణం బడుగుటయు నారాజపుత్రుఁడా పద్మనేత్రకు తాను దిగ్విజయయాత్రకు వెడలినది మొదలు కిన్నరమిథునాను సరణముగా వచ్చి యచ్చిగురుబోడిం జూచువరకు జరిగిన వృత్తాంతమంతయుం జెప్పెను.

అతని వృత్తాంతమంతయును విని యాజవ్వని సంతసించుచు భిక్షాకపాలమును గైకొని యవ్వనతరువులయొద్దకుఁ బోయెను.

అప్పుడు స్వయంపతితములైన ఫలములచే నా పాత్ర నిండినది. వానిం గొనివచ్చి యచ్చిన్నది యుపయోగింపుఁడని చంద్రాపీడు నొద్ద నుంచినది.

ఆచిత్రమంతయుం జూచి యతండు తలయూచుచు అన్నన్నా! తపంబునకసాధ్యమైనది లేదుగదా? అచేతనములగు నీవృక్షములు గూడ నీమె దయనుఁ గోరుచున్నవిపోలె వినమ్రతతో ఫలములనిచ్చినవి. ఆహా! ఇంతకన్న నబ్బురమెద్ది? అదృష్టపూర్వములగు నాశ్చర్యములం గంటినని మిగుల విస్మయముజెందుచు లేచి యచ్చటి కింద్రాయుధమును దీసికొని వచ్చి యనతిదూరమునఁ గట్టి యందున్న నిఝు౯రజలంబున స్నానము జేసి యమృతరసమధురములగు నా ఫలముల దిని చల్లని నీరు గ్రోలి నాయువతిగూడ ఫలహారము చేసి వచ్చువఱకు నేకాంతప్రదేశమునం గూర్చుండెను.

నిత్యక్రియాకలాపములు దీర్చుకొని ఫలరసముల ననుభవించి యాయించుబోడియు నొకశిలాతలంబునం గూర్చుండునంత నాప్రాంతమునకుఁ బోయి చంద్రాపీడుఁడు ననతిదూరంబునం గూర్చుండి యతి వినయముతో నిట్లనియె.

భగవతీ! భగవదనుగ్రహప్రాప్తిప్రేరకమైన సంతోషముచేతఁ దొట్రుపడుచు మానుషసులభమైన లాఘవము నన్ను నిచ్చలేకున్నను బ్రశ్నకర్మకుఁ బ్రోత్సాహపరచుచున్నది. ప్రభువుల యనుగ్రహ లేశము గూడ నధీరులకుఁ బ్రాగల్భ్యముగలుగఁజేయును. సహవాసము కొంచమైననుఁ బరిచయమును గలుగజేయకమానదు. ఉపచార పరిగ్రహ మల్పమైనను ప్రణయ మారోపించును. నీకు ఖేదకరము కాదేని నాయడుగు ప్రశ్నమున కుత్తరమియ్యవేడెదను. నిన్నుఁ జూచినదిమొదలు నాకీ విషయమై మిగుల కౌతుకము గలిగియున్నది. సురముని గంధర్వ గుహ్యకాదులలో నీజన్మముచేత నెవ్వారి కులము పావనమైనది? కుసుమకోమలమగు నీవయసున నిట్టి కఠిన వ్రత మేమిటికిఁ బూనితివి? అన్నన్నా! ఈప్రాయమేడ? యీయాకారమేడ? యీలావణ్య మేడ? యీతపమేడ? నాకుమిక్కిలి యక్కజముగా నున్నది?

సురలోక సౌఖ్యములు గల యాశ్రమములను విడిచి నిర్జనమగు నీ యడవిలో నొంటిగా నేమిటికి వసించితివి? యిట్టి చిత్రములు నే నెచ్చటను జూచి యుండలేదు. నీవృత్తాంతమంతయు నెఱింగించి నాసందియమును దీర్పుమని మిక్కిలి వినయముతోఁ బ్రార్థించెను.

అతనిమాటలు విని యవ్వనిత యెద్దియో హృదయంబున ధ్యానించి ముహూర్తకాల మూరకొని నిట్టూర్పులు నిగిడింపుచు ముక్తాఫలంబులఁబోలిన యశ్రుజలబిందువులు నేత్రకోణంబులనుండి వెల్వడి స్తనవల్కలమునుఁ దడియఁజేయఁ గన్నులు మూసికొని వెక్కి వెక్కి యేడువఁదొడంగినది.

అట్లకారణముగా విచారింపుచున్న యాయన్ను మిన్నంజూచి వెరగందుచు నతఁ డాత్మగతంబున నిట్లు తలంచెను. అన్నన్నా! వ్యసననిపాతములు దుర్నివారము లైనవికదా? మనోహరమగు నిటువంటి యాకృతులను సైతము దమవశముఁ జేసికొనుచున్నయవి. శరీరధర్మముగలవారి నుపతాపము లంటకమానవు. సుఖదుఃఖముల యొక్క ప్రవృత్తిబలమైనది. ఈమెగన్నీరు గార్చుటచే నేతత్కారణ మరయ నాకు మఱియుం గుతూహల మగుచున్నది. అల్పకారణంబున నిట్టివారు శోకింపరు. క్షుద్రునిఘా౯తపాతంబున భూమి గదలునా? అని యిట్లు తద్విధం బరయదలంచి తదీయ శోకస్మరణమునకుఁ దానే కారణమని భయపడుచు లేచి యంజలిచేఁ బ్రస్రవణోదకము దెచ్చి మొగము గడిగికొమ్మని యమ్మగువ కందిచ్చెను.

అయ్యింతి సంతతముగాఁగారుచున్న యశ్రుధారచేఁ గలుషములగు నేత్రముల నాయుదకంబునఁ గడిగికొని వల్కలోపాంతముచే నద్దుకొనుచు నుష్ణముగా నిట్టూర్పులు నిగిడించుచు మెల్లగా నతని కిట్లనియె.

రాజపుత్రా! మందభాగ్యురాల నగు నా వృత్తాంతముతో నీ కేమిలాభమున్నది! అయినను వేడుకపడుచుంటివి. కావునఁ నాకణి౯ంపుము.

మహాశ్వేత కథ

దక్షునిప్రసిద్ధి నీవు వినియేయుందువు. అతనికి మనియు నరిష్ట యనియు నిరువురు పుత్రికలు జనించిరి, అందు మనికిఁ జిత్రరధుండను కుమారుం డుదయించెను. ఆ చిత్రరధుండు సమస్తగంధర్వులకు నధినాయకుండై యింద్రునితో మైత్రి సంపాదించి యీశ్వరప్రసాదంబున మనోహరముగా నిందు చైత్రరధమను పేర నీయుద్యానవనమును అచ్ఛోదమను నీసరస్సును నిర్మించెను.

అరిష్ట కొడుకు హంసుఁడనువాఁడును ద్వితీయ గంధర్వకులమునకుఁ బ్రభువగుచు గౌరి యను కన్యకను జంద్రకిరణములం బుట్టిన దానినిం బెండ్లియాడి యాకాంతామణితో సంసారసుఖము లనుభవింపుచుండెను.

ఆదంపతులకు సమస్తదుఃఖములకు భాజనమైన నే నొక్కరితన పుత్రికగా నుదయించితిని. నాతండ్రియు ననపత్యుఁడగుటచే నప్పుడు సుతజన్మాతిరిక్తమగు నుత్సవమును జేయుచు మిక్కిలి సంతోషించుచు జాతకర్మానంతరమునందు నాకు మహాశ్వేత యని పేరుబెట్టెను.

నేను బిత్రుగేహంబును మధురములగు మాటలచే బంధువులకు సంతోషము గలుగఁజేయుచు నవిదతశోకాయాస మనోహరమగు శైశవము సుఖముగా వెళ్ళించితిని.

అంతఁగాలక్రమంబున నామేన వసంతసమయంబునఁ బుష్పాంకురమువలె యౌవనము బొడసూపినది. సమారూఢ యౌవననైయున్న నేనొక్క వసంతకాలమునఁ దల్లితోఁగూడ స్నానార్ధమై యీసరోవరమునకుఁ జనుదెంచి యందందు శిలాతలముల వ్రాయఁబడిన శంభుమూర్తులకు నమస్కరించుచుచుఁ గుసుమోపహార రమ్యములగు లతా మంటపములను పుష్పించిన సహకారతరువులును వనదేవతాప్రేంఖలనశోభనములగు లతాడోలికలును కుసుమరజఃపటల మృగములగు కలహంస పదలేఖలచే మనోహరములగు తీరభూములునుం జూచినంత మనంబున నుత్సాహంబు దీపింప గొంపసేపు ప్రియవయస్యలతో నేనందు విహరింపుచుంటిని. అట్టిసమయమునఁ గానన కుసుమవాసనలం బరిభవింపుచు ననాఘ్రాతపూర్వమగు పరిమళమొండు వనానిలానేతమై నాకు నాసాపర్వము గావించినది.

ఓహో! అమానుషలోకోచితమగు నీసౌరభము నా కెట్లు కొట్టినది? యని వెరగందచు గన్నులు మూసికొని యాసుగంధ మాఘ్రాణించి యాఘ్రాణించి శిరఃకంపముచేయుచుఁ దదుత్పత్తిస్థాన మరయుతలంపుతో లేచి నూపుర రవఝుంకారమునకు నరఃకలహంసల ననుసరించి రాఁగా గొన్నియడుగులు నడిచి నలు మూలలు పరికించి చూచితిని.

అప్పుడొకవంక నఖిలమండలాధిపత్యమును గైకొన ధృతవ్రతుండయిన శశాంకుండోయనఁ ద్రిలోచనుని వశముఁజేసికొనఁ దపం బొనరించుచున్న కుసుమశరుని పగిది మనోహరాకారముతో నొప్పుచు మందారవల్కలములుదాల్చి హస్తంబున దండకమండలములు మెరయ ఫాలంబున విభూతిరేఖయు కటీతటి మౌంజీమాలికయు గరంబున స్ఫటికాక్షమాలికయుం ధరించి మూతీ౯భవించిన బ్రహ్మచర్యము భాతి బుంజీభవించిన శ్రుతి కలాపమట్లదీపించుచు దేహ కాంతులచేఁ బ్రాంతభూజముల బంగారుమయములుగాఁ జేయుచు సవయస్కుఁడగు మునికుమారుతోఁగూడ స్నానాథ౯మై యరుదెంచిన దాపసకుమారుం డొకండు నాకన్నులకుఁ బండువ గావించెను. అతనిచెవియందుఁ గృత్తికానక్షత్రమునుం బోలిన యదృష్టపూర్వమగు పుష్పమంజరి యొండు అమృతబిందువుల శ్రవించుచు విరాజిల్లుచున్నది. దానిం జూచినేను ఓహో! మదీయఘ్రాణమునుఁ దృప్తిపరచిన సౌరభ మీ గుచ్ఛంబునఁబుట్టినదే యని నిశ్చయించుచు వెండియు నత్తపోధన కుమారు నీక్షించి మనంబున నిట్లు వితర్కించితిని

అయ్యారే! చతుర్ముఖుని రూపాతిశయ వస్తునిర్మాణకౌశల మెంతచిత్రముగానున్నది. మొదటఁ ద్రిభువనాద్భుతరూప సంభారుఁడగు మన్మధుని సృష్టించి వానికన్న నెక్కువరూపముగలవానిఁ జేయు సామర్థ్యము కలదో లేదో యను తలంపుతో మునిమాయచేత రెండవ సుమకోదండునిగా నితవిఁ జేయఁబోలు. మున్కుమున్ను గజదానంద కరుండగు చంద్రుని లక్ష్మీలీలాభవనములగు పద్మములను సృజించుట బరమేష్టి కీతని మొగముజేయు పాటవము నేర్చుకొనుట కే యనితలంచెదను. కానిచో నతనికి సమానవస్తు సృష్టితోనేమి ప్రయోజన మున్నది. బహుళపక్ష క్షపాకరుని కిరణములను దరుణుండు హరించు చున్న వాఁడను మాట యళీకము. ఇమ్మునికుమారుని శరీరమందే యణంగుచున్నవి. కానిచోఁ గ్లేశబహుళమగు తపంబున నొప్పుచున్నను వీనిమేనింత లావణ్యభూయిష్టమై యుండనేల?

అని ఇట్లు విచారించుచున్న నన్ను రూపైకపక్షపాతి యగు కుసుమశరుఁడు పరవశనుగాఁ జేసెను.

నిట్టూర్పులతోఁగూడఁ గుడికన్నించుక, మూసి తిర్యగ్దృష్టిచే నతనిరూపము పానము చేయుదానివలె నెద్దియో యాచించుదానివలె నీదాననైతినని పలుకునట్లు హృదయమర్పించుపగిది మనోభవాభి భూతురాల నగు నన్ను రక్షించుమని శరణుజొచ్చుమాట్కి నీహృదయంబు నాకవకాశ మిమ్మని కోరుతీరునఁ జూచుచు అన్నన్నా! ఇది యేమిమోసము కులస్త్రీవిరుద్ధమగు బుద్ధిపుట్టినది ఇది గహి౯తమనియె ఱింగినదాననైనను నింద్రియప్రవృత్తుల మరలించు కొన వశముకాక స్థంభింపఁబడినట్లు వ్రాయబడినట్లు మూర్ఛబొందిన చందమున నవయవములు కదల్పలేక యట్టె నిలువంబడితిని. అప్పటియవస్థ యిట్టిదని చెప్పుటకు శక్యముకాదు. పూర్వము శిక్షింపబడినదికాదు.

తద్రూపసంపత్తుచేతనో మనస్సుచేతనో మన్మధునిచేతనో యౌవనముచేతనో యనురాగముచేతనో దేనిజేతను జేర్పబడితినో కాని యట్టియవస్థ నేనెన్నఁడు నెఱుంగను.

అట్లు పెద్దతడవుచూచి యెట్ట కేలకుఁ జిత్తమును దృఢపరచుకొంటి. అప్పు డతని హృదయమున నిల్చుట కవకాశమిచ్చుటకుఁ గాబోలు నిశ్వాసమారుతములు బయలువెడలినవి. హృదయాభిలాష దెలుపుచున్నదివోలె గుచయగళము గగుర్పొడిచినది. సిబ్బితిం గరుగుచున్నట్లు మేనెల్ల జమ్మటలు గ్రమ్మినవి. మదనశరపాతభయంబునఁ బోలె గంపము వొడమినది. అట్టిసమయమున మనంబున నే నిట్లుతలంచితిని.

అయ్యయ్యో! సురతవ్యతిరేక స్వభావుండును మహానుభావుండు నగు నిమ్మునికుమారునియందు దుర్మదుండగు మన్మధుండు నా కిట్టి యనురాగము గలుగఁజేయుచున్నవాఁడేమి? అనురాగము విషయయోగ్యత్వమును విచారింపదు, స్త్రీహృదయంబెంతమూఢ మైనదోకదా! పాకృతజనులచేఁ బొగడఁబడుచుండెడు మన్మధవిలాసము లెక్కడ? తపోమహత్వ మెక్కడ? మన్మధవికారములచేఁ దొట్రుపడుచున్న నన్నుఁజూచి యీతండు చిత్తంబున నెట్లు తలంచునో? అట్లెఱింగియు నీ వికారమణగింప లేకున్నదాన నెంతచిత్రమో? ఇది మదీయచిత్తదోషముకాదు. తదీయరూపవిశేషమం దిట్టి మహిమ యున్నది. ఈతఁడు నా వికారములఁ జూడకమున్నందుండిలేచి పోవుట యుక్తము. అప్రియములగు స్మరవికారములఁ జూచి కోపముతో శాపమిచ్చునేమో? మునిస్వభావము పరిభవమును సహింపదుగదా.

అని మరలిపోవుటకు నిశ్చయించియు నతని యాకృతివిశేషము పదములకు నిగళమైతగులుకొని కదలనీయమిం జేసి మునిజాతి యశేష జనపూజనీయమయినదికదా! నమస్కరించి యఱిగెద, దీనం దప్పేమి యని యప్పుడు దాపునకుఁబోయి అతనిమొగమునందు చూపులిడుచు బాదంబులకు నమస్కరించితిని. దుర్లంఘ్యశాసనుం డగు మదనుం డప్పుడు మద్వికార దర్శనంబున నపహృతధైర్యుఁ డగు నతనిహృదయమును గూడ పవనుండు దీపమువలెనే చాంచల్య మందఁజేసెను.

యౌవనము అనినయబహుళమైనదికదా! అప్పు డతనికి గ్రొత్తగాఁ జిత్తమును జొచ్చుచున్న మదనుని నెదుర్కొనుచున్నట్లు రోమాంచము పొడమినది. నాయొద్దకు వచ్చుచున్న హృదయమునకు దారిజూపుచున్నట్లు నిట్టూర్పులు వెడలినవి. వ్రతభంగమున భయపడుచున్నదివోలె గరతలమందున్న జపమాలిక జారిపడినది.

అప్పుడు నేనతని వికారమును జూచి హృదయంబున మదనావేశము రెట్టింప నిట్టిదని చెప్పుటకు నలవికాని యవస్థం జెందుచు డెందమున నిట్లు తలంచితిని.

అనేక సురత లాస్య లీలావిశేషముల నుపదేశింప నుపాధ్యాయుండగు మన్మధుండే విలాసములను నేర్పునుగదా! లేనిచోశృంగార చేష్టలయందుఁ బ్రవేశింపని బుద్ధిగల యీమునికుమారుని దృష్టిప్రసారమింత మనోహరముగా నెట్లుండును?

ఈతని హృదయాభిలాషనంతయు నతని చూపులే చెప్పుచున్నవి. అని తలంచుచు దాపుగాఁబోయి యతని సహచరుండగు ఱెండవ మునికుమారునితోఁ బ్రణామపూర్వకముగా నిట్లంటిని.

ఆర్యా! యీమునికుమారుని పే రేమి? యెవ్వనికుమారుండు? ఈయన శ్రవణాభరణముగా ధరించిన పుష్పమంజరి యే కుంజమునఁ బుట్టినది? దీనిసౌరభమాఘ్రాణించినది మొదలు నాహృదయమెం తేని సంతసమందుచున్నది. ఇట్టి సుమమెన్నడును జూచి యుండలేదని పలుకుగా విని యమ్ముని కుమారుం డించుక నవ్వుచు నాకిట్లనియె.

బాలా! నీప్రశ్నముతోఁ బ్రయోజనమేల? కౌతుకమేని వక్కణించెద వినుము.

పుండరీకుని కథ

దేవలోకంబున శ్వేతకేతుఁడను మహాముని కలఁడు. అతని యాకారము త్రిభువనసుందరమైనది. అమ్మహాముని యొకనాఁడు దేవతార్చన కుసుమములఁ గోయుటకు మందాకినీనదికిఁబోయెను. అందు బద్మములు గోయుచున్న యమ్మునిపుంగవునిం జూచినంత పద్మసన్నిహితయైన లక్ష్మీకిఁ జిత్తచాంచల్యమైనది.

ఆలోకమాత్రంబుననే సురతసమాగమసుఖం బనుభవించిన యమ్మహాదేవికిఁ బీఠంబుగానున్న యప్పద్మంబు నంద కుమారుండుదయించెను.

ఆశిశువును గ్రహించి యాలక్ష్మి దేవ? యీతండు నీకుమారుండు గైకొనుమని పలుకుచు వాని నాశ్వేతకేతున కిచ్చినది. అమ్మునియు బాలజనోచితకృత్యము లన్నియు వానికి నిర్వర్తించి యతుండు పుండరీకమునం బుట్టుటచేఁ బుండరీకుఁ డని నామకరణముచేసి యతనికి సమస్తవిద్యలును నేర్పెను. ఆశ్వేత కేతునూనుండే యీతండు. మఱియు నీసుగుమగుచ్ఛము క్షీరసముద్రజాతమగు పారుజాతతరువునం బుట్టినది. పత్రవిరుద్ధముగా నీపూవీతని శ్రవణసంగత మెట్లయ్యె నదియుం జెప్పెద నాకణి౯ంపుము. ఈదివసము చతుర్దసియని యీతండును నేనును దేవలోకమునుండి కైలాస గతుఁడగు శితికంఠు నారాధించుటకై నందనవనము మీదుగా బోవుచుంటిమి.

అప్పుడా నందనవనలక్ష్మి యీపారిజాతమంజరిని హస్తమున ధరించి వచ్చి యీతనికి మ్రొక్కుచు నిట్లనియె. ఆర్యా! త్రిభువన దర్శనాభిరామమగు నీరూపమున కిది యనురూపమైనది. దీని శ్రవణా వతంసముగాఁ దాల్పుము. పారిజాతము, జన్మము సాద్గుణ్యము నొందునని పలుకగా నితం డాత్మస్తుతివాదమునకు లజ్జించుచుఁ గన్నులు మూసికొని యామెమాటఁ బాటింపక నడువఁదొడంగెను.

అప్పుడాదేవియు నీపూవుందాల్చి విడువక వెంట వచ్చుచుండుటఁ జూచి, నేను మిత్రుఁడా? దీనదోషమేమి? యిది యద్దేవియనుగ్రహపరిగ్రహముకాదా! గైకొనుమని పలుకుచు నితం డిచ్చగింపకున్నను నేనుఁ బుచ్చుకొని బలాత్కారముగా దీని నతని శ్రవణాభరణముగా నిడితిని. ఇదియే దీని వృత్తాంతమని చెప్పి యతఁ డూరకుండెను.

పిమ్మట నప్పుండరీకుఁడు మందహాసోపశోభిత వదనారవిందుఁడై నన్నుఁజూచి కామినీమణీ! నీ కీ ప్రశ్నాయాసముతోఁ బనియేమి? కావలశినచో నీపుష్పగుచ్ఛమును బుచ్చుకొమ్మని పలుకుచుఁ దన చెవియందున్న లతాంతమును దీసి నాశ్రవణపుటంబున నుంచెను.

నాకప్పుడు తత్కరతల స్పర్శలోభంబునంజేసి యవతంసస్తానమున నాపూవు రెండవహృదయములాగున దోచినది. అతండును మత్కపోలతలస్పర్శసుఖంబున వడంకుచున్న కరతలంబునుండి జారిపడిన జపమాలికను సైతము సిగ్గుచేత గురు తెరుంగడు.

నేనప్పుడా జపమాలికను నేలంబడకుండ గ్రహించి విలాసముగాఁ దద్భుజపాశములచేఁ గూర్పఁబడిన కంఠగ్రహసుఖం బనుభవించు దానివలెఁ గంఠాభరణముగా మెడలో వైచుకొంటిని.

అట్టిసమయమున ఛత్రగ్రాహిణి నాయొద్దకు వచ్చి రాజపుత్రీ! మీతల్లి స్నానముజేసినది. ఇంటికిఁబోవు సమయమగుచున్నది. కావున వేగమ స్నానము చేయుమని పలికినది. ఆ మాట విని నేను గుండె దిగ్గుమన నిష్టములేకున్నను నతిప్రయత్నముతో నతనిమొగము నుండి దృష్టి మరలించుకొనుచు స్నానము చేయుటకుఁ బోయితిని. పిమ్మట రెండవమునికుమారుఁడు ఆప్రకారము ధైర్యస్థలితుఁడైన యప్పుండరీకుం జూచి యించుక యలుక మొగంబునఁ దోపనిట్లనియె.

మిత్రుడా! పుండరీక! క్షుద్రజనులచేఁ ద్రొక్కంబడినయీ మార్గమునీకుఁ దగినది కాదు. సాధులు ధైర్యధనులుకదా ప్రాకృతుండువోలె వివశంబగు చిత్తము నరికట్టవేమి? ఇప్పుడు నీకపూర్వమైన యింద్రియచాంచల్యము గలిగినదే? ధైర్యము, వశీత్వము, ప్రశాంతి బ్రహ్మచర్యనియమము, ఇంద్రియ పరాఙ్ముఖత, యౌవనశాసనత్వము మొదలగు నీసుగుణము లన్నియు నెందుబోయినవి? నీచదువంతయు నీటఁగలిపితివే, నీవివేకమంతయు నిరధ౯కమైనదే, అయ్యయ్యో కరతలమునుండి జారిపడిన జపమాలికను సైతము గురుతెఱుఁగకుంటివి? యేమి నీమోహము? ఒకవేళ బ్రమాదముచే బుద్ధి చాంచల్యమంది నను వివేకముతో మరల్చుకొనరాదా? యున్మత్తునిక్రియ వతి౯ంచుచుంటివేయని పలికిన విని యించుక సిగ్గు జెందుచునతనితోఁ బుండరీకుం డిట్లనియె.

వయస్యా! కపింజల! నన్ను మఱియొకలాగునఁ దలంపకుము. నే నట్టివాఁడను కాను. దుర్వినీతయగు నీనాతి నాజపమాలికను గ్రహించిన యపరాధమును నేను మరచిపోయితి ననుకొంటివా? చూడుమని యళీకకోపముదెచ్చుకొని యతిప్రయత్నముతో భ్రూభంగము గావింపుచుఁ జుంజనాభిలాషఁ బోలెఁ బెదవిగఱచుచు నాకడకు వచ్చి యిట్లనియె.

చపలురాలా! నాజపమాలిక నాకియ్యక యిందుండి యెందు వోయెదవు? ఇచ్చి కదులుమని పలుకగా విని నేనును నా మెడనుండి యేకయష్టిగల ముత్తెపుపేరును దీసి, ఆర్యా! ఇదిగో! మీమాలికను స్వీకరింపుఁ డని పలుకుచు మన్ముఖమునందు దృష్టినిడి శూన్య హృదయుఁడై చూచినయతని చేతియందమ్మాలనిడి స్వేదసలిలస్నాత నయినను వెండియు స్నానముచేయుటకుఁ దటాకమునకుఁ బోయితిని.

అందుఁ గ్రుంకి తల్లితోఁగూడ మెరైకకుఁబోవు ప్రవాహము వలె నతిప్రయత్నముతో నింటికివెళ్ళి కన్యాంతఃపురము ప్రవేశించి యతనిన్వరించుచు నది మొదలు విరహవిధురనై యిట్లు తలంచితిని.?

అయ్యో! నేనచ్చటనే యుండక యింటి కేమిటికి వచ్చితిని? ఆ! రాలేదు. నేనచ్చటనే యుంటి. కాదు యిది గృహమే? ఇప్పుడు నేను నిద్రబోవుచున్నానేమో! స్వప్నములో నిట్లు కనంబడినది కాబోలు. అయ్యో! నాకన్నులు తెరవఁబడియే యున్నవి. స్వప్న మెట్లు వచ్చును? ఇది రాత్రియా? పగలా? నాకీతాపమురోగమేమో? నేనిప్పుడెచ్చట నుంటిని? యెచ్చటికిఁ బోవుదును? ఎవ్వరితోఁ జెప్పుకొందును? దీనికిఁ బ్రతీకారమెద్ది? అని పెక్కు తెరంగుల నున్మత్తవలెఁ బలవరించుచు నంతఃపురమున కితరుల రాకుండ నియమించి యొంటిగా నొకగవాక్షముదాపునఁ గూర్చుండి ఆదిక్కునే మిక్కుటమయిన దానిగాఁ దలంచుచు నాదిశనుండి గాలి వచ్చినను మనోహరమయినదానిగాఁ నెంచుచు మౌనమవలంబించి యాతనిరూపమును లావణ్యమును, యౌవనమును మాటిమాటికి స్మరించుకొనుచు మేనం బులకలు బొడమఁ దత్కరతలస్పర్శసుఖం బభినయించుకొనుచు క్షణ మొక యుగములాగున గడుపుచుంటిని.

అంతలో నాతాంబూలకరండ వాహిని తరళిక యనునది నా యొద్దకువచ్చి నాయవస్థ యంతయుం జూచి చింతించుచు నిట్లనియె.

రాజపుత్రీ! అత్తటాకమునుండి స్నానము జేసి నీవు నన్నుఁ బరామర్శింపక ముందుగా నింటికి వచ్చితివికదా! నీవు వచ్చిన తరువాత నొకవిశేషము జరిగినది. యాకర్ణింపుము. దివ్యాకారములతో నిరువురు మునికుమారులు అచ్ఛోదసరస్తీరంబున మనకుఁ గనంబడిరి కదా! వారితో నీకీపుష్పమంజరి నిచ్చినయతండు ఱెండవవానికిఁ గనంబడకుండఁ బుష్పించిన లతావితానములమాటుగా నాయొద్దకు వచ్చి బాలికా! యిప్పు డిక్కడ స్నానముచేసిన కన్యక యెవ్వని కూఁతురు? పేరేమి? యెచ్చటికిఁ బోయినదని నన్నడిగెను.

అప్పుడు నేను వినయముతో ఆర్యా? యీచిన్నది హంసుఁ డను గంధర్వరాజు కూఁతురు. దీనిపేరు మహాశ్వేత. యిప్పుడాత్మీయ నివాసస్థానమైన హేమకూటమనుపర్వతమునకుఁ బోయినదని చెప్పితిని.

నామాటవిని యతండు ముహూర్తకాలమూరకొని యెద్దియో ధ్యానించుచు దేనినో యాచించువాఁడుంబలె రెప్ప వాల్పక నన్నుఁ జూచుచు సానునయముగా వెండియు నాకిట్లనియె.

కల్యాణీ! నీవు చిన్నదానవైనను నీరూపము నీ గౌరవమును, యోగ్యతను వెల్లడిచేయుచున్నది. నిన్నొండు యాచించుచున్నవాఁడ, కాదనక యాచరింతువే యనుటయు నేను వినయముతో నంజలి ఘటింపుచు మెల్లన నిట్లంటి.

మహాభాగ! మీరట్లు పలుకుటకు నే నెవ్వతెను. త్రిభువన పూజనీయు లగు మీవంటి మహాత్ములు పూర్వపుణ్యవశంబునం గాక యట్టి కృతులయందు దృష్టిప్రచారమైనఁ బరగింపరనుచో నాజ్ఞాపించుమాటఁజెప్పనేల? దాసురాలయెడఁగనికరముంచి చేయఁదగిన కార్య మెద్దియో చెప్పుడు. నమ్మకముగాఁ జేసి యనుగ్రహపాత్రురాల నగుదునని పలికితిని.

అప్పుడు నన్నతండు సఖురాలిగా మన్నించుచు సంతసముతో నాప్రాంతమందున్న తమాలతరుపల్లమును దెచ్చి తీరప్రస్తరముపై వైచి నలిపి రసముదీసి యారసమున వల్కలోత్తరీయమింతజించి దానియందు కనిష్టికానఖ శిఖరముతో నెద్దియో వ్రాసి, కనకగాత్రీ! నీవీ పత్రికం గొనిపోయి యారాజపుత్రి కేకాంతముగా నున్నప్పుడిమ్ము. పొమ్మని పలుకుచు నది నాకిచ్చెను. నేనును దానిం బదిలముగా దెచ్చితి నిదిగో చూడుమని తాంబూలభాజనమునుండి యాపత్రికం దీసి నాకందిచ్చినది.

నేనును దత్సంభాషణములచేతనే మేన రోమోద్గమము జనింప నతనిముట్టినట్లు సంతసించుచు నాపత్రిక నందుకొని తల్లిఖితాక్షరంబులం జూచి కన్నుల నద్దికొనుచు మదనావేశముతో నిట్లు పఠించితిని.

ఉ|| తామరతూడువోలె విశ ♦ దంబగు ముత్తెపుపేరుచేత నా
      హా! మహిలోభ పెట్టబడు ♦ హంసవింధబున నాశఁజెంద నెం
      తో మదుదారమానస స ♦ ముద్భవభూరితరాభిలాష నీ
      చే మహిళావతంసమ? రు ♦ చింగొనిపోఁబడెజూవెఁదవ్వుగాన్||

అట్టి పద్యముజదివించినంత నాలుకగోసిన మూగవానివలెఁ గలుద్రావిన యున్మత్తునిపగిది స్మరాతురమగు నాహృదయము ప్రవాహముచేత వ్యాకులమయిన సరిత్తువలె విహ్వలత్వము గైకొనినది.

మఱియు, నాపత్రికంజూచుటచేఁ ద్రిలోకరాజ్యవైభవ మనుభవించినట్లు సంతసించుచు దానిఁ గపోలములయందును అలకలయందును బెట్టుకొనుచుఁ దరళికా! చెప్పుము, చెప్పుము. అతండు నీచే నెట్లు చూడబడియెను? ఏమేమి చెప్పెను? నీయొద్ద నెంతసేపు నివసించెను? అని పలుమారు దానినడుగుచు నెట్ట కేలకు నాదివసముగడిపితిని.

పిమ్మట నాహృదయముతోఁ గూడ సూర్యబింబము కృతరాగ సంవిభాగముగలదియై యొప్పినది. అప్పుడు ఛత్రగ్రాహిణివచ్చి రాజపుత్రీ! అమ్మునికుమారులలో నొకఁడు వచ్చి ద్వారముననిలిచి జప

_________________________________________________________________________

శ్లో|| దూరంముక్తాలతయా బిససితయాప్రలోభ్యమావోమె
      హంసఇవదర్శితాశో మానసజన్మా త్వయానీతః||

తా! ముత్తెపుపేరును చూచి తామరతూడనుకొని యాసతో దూరముగాఁబోయిన హంసవలెనే నీచేత నామనోరథము దవ్వుగా దీసికొని పోయితివని తాత్పర్యము. మాలిక నడుగుటకు వచ్చియున్నానని చెప్పుచున్నాడు. అనుజ్ఞ యే మని యడుగగా నేను మునికుమారనామ గ్రహణముచే మిగులఁ దొందరపడుచు నతనిరాక శంకించుకొనుచు వేగమ తీసికొనిరమ్మని యాజ్ఞాపించితిని.

అమ్మునికుమారుని వయస్యుఁడయిన కపింజలుని నది వోయి తీసికొనివచ్చినది. అతనియాకారముఁజూడ విషాదముతోఁ గూడినట్లు కనఁబడినది. అప్పుడు నేను దటాలున లేచి నమస్కరించి యాదరముతో స్వయముగాఁ బీఠముదెచ్చివైచితిని. పీఠోపవిష్టుండయిన యతని యడుగులను వలదనుచుండ బలాత్కారముగాఁ గడిగి యుత్తరీయాంశుకుముచేఁ దడియొత్తి యతనికిఁ దాపుగాఁ గూర్చుంటిని.

అతం డట్లొక ముహూర్తమాత్రము విశ్రమించి యెద్దియో చెప్పఁదలచుకొని నాదాపుననున్న తరళికపై దృష్టి నెరయించెను. దాన నతని యభిప్రాయము గ్రహించి దేవా! యిది నాశరీరము వంటిది. వక్తవ్యాంశము నిస్సంశయముగాఁ జెప్పవచ్చునని పలుకగాఁ గపింజలుఁ డిట్లనియె.

రాజపుత్రీ! నేనేమని చెప్పుదును? సిగ్గుచేత నావాక్కు వక్తవ్యాంశమును గ్రహింపకున్నది. కందమూలములం దినుచు శాంతముగా నడవులఁ గ్రుమ్మరు మునిజనమేడ? మన్మధవిలాసములేడ? అంతయు విపరీతముగానే యున్నది. దైవమెట్లుచేయుటకు సంకల్పించెనో చూడుము. భగవంతుఁ డప్రయత్నముచేతనే పురుషునిఁ బరిహాస్పదునిగాఁ జేయునుకదా! ఇది యేధర్మోపదేశమో నాకుఁ దెలియకున్నది. నాసందేశము చెప్పక తప్పదు. మఱియొకయుపాయ మేదియు గనంబడకున్నది. కొండొకప్రతిక్రియయుఁదోచదు. ప్రాణ పరిత్యాగముచేతనయినను మిత్రుని రక్షింపఁదగినదని చెప్పుచున్నాను వినుము. నీదాపుననే నిష్ఠురముగా నిట్లు కోపపడి యట నుండక పుష్పములు కోయుట మాని మఱియొకచోటికిం బోయితిని. పిమ్మట నీవు నింటికిఁ బోయితివికదా! అప్పుడు నే నితండొక్కండు నేమిచేయుచున్నవాఁడో చూతమని మరలివచ్చి యచ్చటి కొమ్మలసందున డాగి యాప్రదేశమును జూచితిని కాని యంతండందు గనంబడ లేదు.

మే మిరువురము పుట్టిననాఁటనుండియు నొకక్షణమైన నెడఁబాసి యుండలేదు. కావున సుహృత్స్నేహతరత్వంబున హృదయంబు దొట్రుపడుచుండ నిట్లు తలంచితిని.

అయ్యో! నామిత్రుఁడు మదనపరాయత్తచిత్తుండై యామత్త కాశిని వెంటఁబోయి తిరిగి నాయొద్దకు వచ్చుటకు సిగ్గుపడియెఁగాఁబోలు, లేక కోపముచేత నన్నువిడిచి యెచ్చటికేనింబోయెనేమో! ధైర్యస్ఖలనవిలక్షణుఁడైన యతం డేమైపోయెనోకదా యని యమంగళము తలంచుకొనుచుఁ దరులతాగహనములు, చందనవీధులు, లతామంటపములు, సరఃకూలములు మొదలగు ప్రదేశములు పెద్దతడవు తద్దయు శ్రద్ధతో వెదకినది.

అంత నొకసరస్సమీపమందు లతామంటపమున చిత్తరువు మాడ్కి స్తంభితునిపగిది యోగస్థునిభంగి కదలక మన్మధశాప భయంబునఁబోలె నణఁగి నిష్పందనిమీలితమగు కందోయినుండి బాష్పజలము ధారగా వెడలుచుండ హృదయమునఁ బ్రజ్వరిల్లు మదనాగ్ని జ్వాలను గైకొని వెడలు నిట్టూర్పు గాడ్పులచేఁ బ్రాంతలతాకుసుమ కేసరముల వాడఁజేయుచు వామకరతలంబునఁగపోలం బిడుకొని యున్మత్తునిక్రియఁ బరాయత్త చిత్తుండై యున్న పుండరీకుం గంటిని.

అపగతనిమేషము లగు చక్షుస్సులచేఁ దదవస్థ యంతయుం జూచి హృదయంబున విషాదంబు జనింప నిట్లు తలంచితిని.

మన్మధుఁడు దుర్విషహవేగముగలవాఁడు కదా! నిమిషములో నితనిదీర్ప రానియవస్థ పాలుచేసెను. అన్నన్నా! జ్ఞానరాసియంతయు నొక్కమాటు వ్యర్థమయినదే అయ్యారే! ఎంతచిత్రము. ఈతండు పిన్ననాటనుండియు ధీరస్వభావుండు. అస్ఖలితచిత్తవృత్తిగలవాఁడై మాబోటులకు సైతము నీతి కరవుచుండువాఁడు. అట్టివాఁ డిప్పుడితరుండువోలే జ్ఞానము లెక్క సేయక తపఃప్రభావము నున్మూలించి గాంభీర్యాదిగుణంబులు మట్టుపరచి మన్మధునిచేత జడీకృతుండయ్యె. కానిమ్ము. ఇది యౌవనమహిమకదా యని తలంచుచు నేను మెల్లగా వాని దాపునకుఁబోయి యా శిలాతలమందు వెనుకగాఁ గూర్చుండి భుజముమీఁద జేయి వై చుచు సఖా! పుండరీక! ఇట్లుంటివేమని యడిగితిని.

అప్పు డతం డతిప్రయత్నముతోఁ గన్నులు దెరచి మందరమగు దృష్టితో నన్నుఁజూచి ఇస్సురని నిట్టూర్పు నిగుడించుచు సిగ్గుచేత విరాళాక్షరములు గలుగు మాటలతో వయస్యా? కపింజలా? నావృత్తాంతమెరింగియు నీ విట్లడిగిన నే నేమి చెప్పుదునని మెల్లగాఁ బలికెను.

అప్పు డతని యవస్థ జూచి త్రిప్పరానిదని నిశ్చయించియు మిత్రుని సన్మార్గప్రవృత్తునిగాఁ జేయుట యుచితము, శక్తికొలది చెప్పి చూచెదంగాక యని తలంచి వెండియు నిట్లంటిని.

పుండరీక! నీవృత్తాంతమెఱుంగబట్టియే యిట్లడుగుచున్నవాఁడ. నీవవలంబించిన వ్యాపారము గురూపదిష్టమా, శాస్త్రపఠితమా, నియమవిశేషమా, ముక్తిప్రాప్తికారణమా, మనస్సుచేతనయిన స్మరింపఁ దగినదేమో చెప్పుము. అజ్ఞానుండులోలె, మన్మధహతకునిచేతఁ బరిహాసాస్పదత్వమును బొందింపఁ బడుచుఁ దెలియకుంటివేమి? ప్రాకృత జనాభి మతములగు నింద్రియవిషయంబుల సుఖాభిలాష నీకెట్లు కలిగినది. పరిణయవిరసంబులగు నింద్రియసుఖంబుల బుద్ధిజొనుపుట మహారత్నమును భ్రాంతితో నంగారము ముట్టినట్లగునని యెఱుఁగవో? విషయతత్వముల నెఱింగియు స్ఖలితమయిన జ్ఞానముద్ధరింపవేమి? ఇంద్రియముల నివారింపవేల? చిత్తమును నియమింపవేమి? ఈమన్మధుఁ డన నెంతవాఁడు ధైర్యమవలంబించి వానిని పరిభవింపుము అని నేను బలుకుచుండగనే నామాటల నాక్షేపించుచుఁ గన్నీరుదుడుచుకొనుచు నా చేయిపట్టుకొని యతం డిట్లనియె.

కపింజలా! పెక్కుమాటలతోఁ బ్రయోజనమేమి? ఆశీవిష వేగముగల విరితూపుల పోటుపడనివాఁడెన్నేని బరుల కుపదేశింప వచ్చును. ఇంద్రియములు మనంబును నెవ్వనికిఁ గలిగియుండునో శుభాశుభవివేచన మెవ్వఁడెఱిఁగి యుండునో వాఁడుపదేశమునకుఁ దగినవాఁడు. నాకవి యన్నియు దవ్వైనవి. యుపదేశకాల మతిక్రమించినది. జ్ఞానము నిలుపుకొనుసమయము మించిపోయినది. నీకంటె నాకు సన్మార్గముపదేశించువాఁడు లేడు. నీయుపదేశము నేను వినఁదగినదే కాని నామానసవికారము మరలించుకొనుటకు శక్యము కాకున్నది. నేనేమిచేయుదును? మదనసంతాపముచే నా యంగము లన్నియు నుడికిపోవుచున్నవి. దీని కెద్దియేని ప్రతిక్రియ యెఱుంగుదువేని యాచరించి నీ ప్రియమిత్రునిఁ బ్రతికించుకొమ్మని పలికి యూరకుండెను.

అప్పుడు నేను మరల నతని మతిమరలింపఁదలంచి శాస్త్రదృష్టాంతములు నితిహాస నిదర్శనములు నగు మాటలచే నెం తేని నీతి నుపదేశించితిని. కాని యతం డేమియుఁ జెవియొగ్గి వినకపోయెను.

ఇఁక నుపదేశములతోఁ బ్రయోజనము లేదని నిశ్చయించి నేను లేచి యత్తటాకములోనికిఁబోయి తామరతూడులను, కమలినీ దళములను, గలువలను, పద్మములనుం గోసికొనివచ్చి యందున్న లతామంటపమునందలి శిలాతలంబునం బాన్పుగా బరచి యతనినందు బరుండఁబెట్టి చందనతరుపల్లవంబులం దెచ్చి రసముతీసి స్వభావసురభియగు నారస మాపాదమస్తకముగా నతనిమేనం బూసి కదళీదళంబున వీచుచుంటి. మిక్కుటమగు తాపముచే నాచేయు శైత్యోపచారములన్నియుఁ నిష్ఫలములగుచుండం జూచి నేనిట్లు తలంచితిని. అన్నన్నా! మన్మధునికి సాధ్యముకానిది లేదుకదా! హరిణమువలెఁ గ్రుమ్మరుచు స్వభావముగ్ధు డగునీతండేడ? వివిధవిలాస రసరాశియగు గంధర్వ రాజపుత్రియేడ? యెట్లు సంఘటించునో చూడుము. సాగర గంభీరుఁడగు నితని దృణమువలెఁ దేలికపరచెనే? యింతకన్న ప్రౌఢిమ యేమిగలదు. అన్నిగతులచేతఁ దీర్పరాని యాపద తటస్థించినది. ఏమి చేయుదును? ఎక్కడఁజొత్తును? ఎవ్వరితోఁ జెప్పుదును? యెట్లు వీని ప్రాణములు నిలుచును? ఉపాయమెద్ది? కర్తవ్యమేమి? యని యనేక ప్రకారములఁ దలంచుచు అయ్యో యీ వెఱ్ఱియాలోచనలతోఁ బని యేమి? తత్కాంతాసమాగముకన్న వేరొండుసాధనమున వీఁడు బ్రతుకఁడు అట్టిపనియే చేయందగినది. తాపసజనులకిది యనుచితమని నేనిప్పు డూరకుంటినేని యేకోచ్ఛ్వాసజీవితుం డగు నితండు కాలమును సహింపక మృతినొందఁగలఁడు. గర్హితకృత్యముచేతనయినను మిత్రాసువుల రక్షింపఁదగినదికదా! కావున నేనిప్పు డన్నిగతుల చేత నానాతియొద్దకుఁ బోవుటయే యుచితముగా నున్నయది. ఇతని యవస్థ యంతయు నాయింతి కెఱింగించెద నని నిశ్చయించుకొనుచు నెన్నఁడును దుర్వృత్తియందుఁ బ్రవేశింపని యతండు నన్నుఁ జూచి సిగ్గుతో నావృత్తి మరలించుకొనునేమో యని యెద్దియో మిషబన్ని యతనితోఁ జెప్పక యచ్చోటు బాసి నీయొద్దకు వచ్చితిని. తరువాత చేయందగిన కృత్యమెద్దియో యాలోచింపు మని పలికి నా మొగంబునఁ జూట్కి నిలుపుచు నామాట విను తాత్పర్యముతో నూరకొనియెను.

అతని మాటలు విని నేను సుఖామృతమయమగు హ్రదంబున మునిఁగినదానివలె సంతసించుచున్నప్పుడు బొడమిన సిగ్గుచేతఁ దల వాల్చుకొని కన్నుల నానందబాష్పములు గ్రమ్మ మనమ్మున నిట్లు తలంచితిని. పాపము, మన్మధుఁడు నన్నుఁబలెనే యాతనింగూడఁ బరితాపము నొందజేయుచు నాకు మంచియుపకృతి గావింపుచున్నవాఁడు. అతం డట్టి యవస్థ ననుభవింపుచున్నాఁడను మాట నిక్కువము. స్వప్నమందైనను గపింజలుఁడు అసత్య మాడువాఁడుకాడు. ఊరికింత దూరమువచ్చి యేల ప్రయాసము జెందును. ఇప్పుడీతనికి నేనేమని చెప్పుదును? ఏమికావింపఁదగినది? యుపాయమెద్ది? యని యనేక ప్రకారములఁ దలంచుచున్న సమయంబునఁ బ్రతీహారి వచ్చి రాజపుత్రీ! నీవస్వస్థతగా నుంటివనుమాట విని నిన్నుఁ జూచుటకై మీ యమ్మగారు వచ్చు చున్నారని చెప్పెను.

ఆమాట విని కపింజలుడు మహాజనసమ్మర్దభయంబున నట నుండవెరచి లేచి, రాజపుత్రీ! సూర్యుండస్తమించుచున్న వాఁడు. నేనుఁ బోయివచ్చెద; మిత్రప్రాణముల రక్షించుటకై యిదిగో యంజలి ఘటింపుచున్నవాఁడ. కర్తవ్యమెద్దియో యోచించి యట్లు కావింపుమనిపలుకుచుఁ బ్రత్యుత్తరమును బొందకయే బయలుదేరి పెక్కండ్ర పరిచారికలతో నామెతల్లి వచ్చుచున్నది కావున నాసమ్మర్దములోఁ దప్పించుకొని యెట్లో దాటిపోయెను.

మజ్జననియు నాపజ్జకువచ్చి కొంతసేపు నినసించి తిరిగివెళ్ళి పోయినది. ఆమె నాయెద్దకువచ్చి యేమిచేసినదో యేమిపలికినదో శూన్యహృదయ నైన నేనేమియు నెఱుంగను.

అంతలో సాయంకాలమగుటయు నప్పుడు కర్తవ్యమెద్దియో తెలియక తరళికతో నిట్లంటిని. తరళికా! నాహృదయ మాకులమయినదనియు నింద్రియములు వికలములయినవనియు నీవెఱుంగవా యేమి? ఇప్పుడేమి చేయఁదగినదో నాకుఁదెలియకున్నది. కపింజలుఁడు చెప్పినమాటలన్నియు నీవు వింటివికదా! చక్కగా నాలోచించి నాకుపదేశింపుము. నేనితరకన్యలవలె సిగ్గును విడిచి జనాపవాద మును లెక్కింపక సదాచార మతిక్రమించి తండ్రి యనుమతి వడయక యచ్చటికిఁబోయి యప్పుండరీకునిం గలసికొంటినేని గురుజనాతిక్రమణదోషంబున నధర్మము రాగలధు.

ధర్మోపరోధభయంబున నేను బోకుంటినేని తప్పక మృత్యువునే యంగీకరింతును. దానంజేసి క్రొత్తగా స్నేహముగలసిన కపింజలు తోడఁ బ్రణయరసభంగముకాగలదు. అదియునుంగాక నాయందాసయుంచుకొనిన పుండరీకుఁడుసైతము ప్రాణ పరిత్యాగముచేయును. దాన మునిజనవధమహాపాతకము రాఁగలదు. ఈఱెంటిలోఁ నేది యుత్తమమో నిరూపింపుమని పలుకుచుండఁగనే చంద్రోదయమైనది.

రతికలహ కుపిత రోహిణీచరణాలక్త కరనలాంఛితుండు వోలె నుదయకాలంబున నెఱ్ఱఁబడిన చంద్రునిఁజూచి విహ్వలనై తరళికోత్సంగంబున శిరంబడి తదీయకిరణజాలంబులు చల్లనివైనను దాహజ్వరఖిన్నునిపై నిప్పులవష౯ము గురిసినట్లు సంతాపము గలుగఁజేయ మూర్ఛపోతిని.

అప్పుడు తరళిక నన్నుఁ బలుమారు పిలిచి పలుకకుండుట గ్రహించి తొట్రువడుచు శైత్యోపచారము లెన్నియేని గావించినది. అప్పుడు నాకించుక తెలివివచ్చి కన్నులందెరచితిని.

చందనపంకార్ద్రంబులగు కరంబులు జోడింపుచుఁ దరళిక నన్నుఁజూచి, దేవీ! నీవిక సిగ్గుపడిన లాభములేదు. ధర్మమునకు వెరచితివేని ప్రమాదము రాకమానదు. నీసంతాపమంతకన్న నెక్కుడగు చున్నది. నాయందు దయయుంచి పుండరీకుఁడున్న చోటికిఁ పోవుదము లేమ్ము. తదీయబాహునాళములఁ బెనవైచినప్పుడుకాని నీ మేనికాక తగ్గదని వినయముగాఁ బలుకుచున్న తరళికంజూచి ఓసీ! మదనుని మాట జెప్పనేల? ఇప్పుడీ శశాంకుఁడే ప్రాణములను హరింపుచున్నవాఁడు. అట్లే పోవుదములెమ్ము. అతి ప్రయత్నముతోఁ బోయి హృద యవల్లభుని సంతోషపెట్టెదనని పలుకుచు మూర్ఛాఖేద వివశములగు నవయవములచే నెట్టకేలకుఁ దరళికం బట్టుకొని బయలుదేరితిని.

అట్టి సమయంబున నాకుఁ గుడికన్నదరినది. అయ్యో దైవ మిదియేమి యిట్టి సూచన గావింపుచున్నాడు. మరియు నేమిచేయఁదలఁకొనెనో కదా యని శంకించుకొనుచుఁ బరిజనమునకు సైతము తెలియకుండ దాంబూలాంగరాగాది సుగంధ ద్రవ్యములు గైకొని తరళిక వెంటరా నాపారిజాత మంజరియే ధరియించి యామేడ వెడలి నీలపటావకుంఠనముతో రహస్యమాగ౯మున నయ్యచ్చోద సరస్సమీప వనమునకుఁ వచ్చుచుంటిమి.

ఆహా? అడుగు గదిపినఁ బెక్కండ్రు పరిచారికలు వెంటనడచి వచ్చుచుండు నేనట్లు తరళికా సహాయినినై పోవుచుండ నించుకయు వెరవులేక పోయినది. ప్రియునింగూర్చి యేకాంతముగా బయలు వెడలువారికి నారోపితశరాసనుండై పుష్పబాణుండు సహాయముగా వచ్చుచుఁ బరిచర క్రియల నుపదేశింపు చుండునుగదా.

లజ్జను వెనుకకుఁద్రోసి నాకంటె ముందుగా నింద్రియములతోఁ గూడ హృదయము పరుగిడఁ దొడంగినది. అప్పుడు నేను తరళికం జూచి సకియా! యీ యిందుహతకుఁడు నన్నుఁబలె బుండరీకుని సైతము గరంబులంగట్టి యభిముఖముగాదీసికొని రాఁడుగదా! యని పలికిన నదియు నవ్వుచు, రాజపుత్రీ? నీవు ముద్దరాలవు సుమీ? ఇతని కతనితోఁబ్రయోజనమేమి? మదనాతురుండువోలెనీయందట్టి చేష్టలం గావింపుచున్నవాఁడు చూడుము. ప్రతిబింబకైతవంబున స్వేదకణికాంచితమగు నీకపోలముఁ జూపించుచున్నవాఁడు. లావణ్యభూయిష్టమగు కుచభారంబునం బడుచుండెను. కాంచీరత్నముల గరంబుల నంటుచుండె, నిదిగో నఖలగ్న మూతి౯యై చరణంబులం బడుచున్న వాఁడు, మఱియుం దాపంబున నతని మేను శుష్కచంద లేపపాండు రత్వము వహించియున్నదో లేదో నిదానింపుము అని మఱియుంబెక్కుతెరంగులఁ దత్కాలోచితముగా నర్మసంభాషణములఁ గావింపుచుఁ గ్రమంబునఁ దత్ప్రదేశమునుఁ జేరితిమి.

అట్టిసమయమున నాసరోవరము పశ్చిమతీరంబున దవ్వగుటచే ననతివ్యక్తముగాఁ పురుష రోదనధ్వని యొకటి వినంబడినది. కుడికన్నదరినది మొదలు శంకించుచున్న నాహృదయమాధ్వని వినినంత మిక్కిలి తొట్రుపడుచుండ, తరళికా? యిదియేమని వెరపుతోఁ బలుకుచు మేను గంపమునొంద నతిత్వరితముగా దదభిముఖముగాఁ బోయితిమి.

ఆ సమయము నిశ్శబ్దముగా నుండుటచే దూరమయినను మఱియు నాధ్వని యిట్లు విననయ్యె.

హా పుండరీక! హా ప్రాణమిత్ర! హా! మహాభాగ! మన్మధ హతకుఁడు నీ కెట్టి యుపద్రవము సంఘటించెనురా! అన్నన్నా! దుర్వినీతయగు మహాశ్వేత మూలముననేకదా? యింతపుట్టినది. కటకటా! శ్వేతకేతున కెంతవచ్చినది? ధమ౯మా! నిన్నిఁకఁ నివ్వరు స్వీకరింతురు? తపంబా! ఇఁక నీకాశ్రయమెవ్వరు? సరస్వతీ! విధవవైతివే? సత్యమా! నిన్ననాధఁగాఁదలంచెదను. మీయాశ్రఁయుండన్యలోకమునకుఁ బోయె. అయ్యో మిత్రమా? నన్నుఁజూడవేమి? నిన్ను విడిచి యొకనిమిషమయిన నుండఁగలనా? నన్ను విడిచిపోవుట నీకు న్యాయమా? యొక్కసారి మాట్లాడుము నాకుమిక్కిలి వేడుకగానున్నది. ఇఁక నేనెక్కడికిఁ బోవుదును, ఎవ్వరితో దిరుగుదును? నాయందుగలసుహృత్స్నేహ మంతయు నెందుబోయినది? ఎప్పుడును నవ్వుచునే మాట్లాడు వాఁడవే, ఆప్రజ్ఞయంతయు నెందుబోయినది! అయ్యయ్యో. అక్కటా! హా! హా! అనియీరీతి గపింజలుఁడు విలపించు చున్నట్లు వినంబడినది. అప్పుడు నాఁకు బ్రాణములు పోయినట్లేయైనవి. ప్రయత్నముతో నడచుచున్నను నిమ్నోన్నతముల నరయలేక అడుగులు తడఁబడుచుండ నెవ్వఁడో బలాత్కారముగాఁ దీసికొని పోవునట్లెట్ట కేల కాప్రదేశముజేరి మణిశిలాతలంబున వనకుసుమములచే విరచింపఁబడి యున్న శయ్యయందు దీఘ౬నిద్రా ముద్రిత నయనుండై చందన రస చర్చితమగు నవయవముల మృణాళనాళముల నలంకారములుగా ధరియించి మన్మధవ్యధ సహింపజాలక నిశ్చేతనుండై సుఖించుచున్నట్లు అపూర్వప్రాణాయోగం బభ్యసించుచున్నట్లు అనంగయోగ విద్య నవధరించుచున్నట్లు విగతజీవితుండయినను దేజంబుదప్పక పడియున్న పుండరీకుని మహాపాపాత్మురాలనగు నేఁను జూచితిని.

కపింజలుఁడు నన్నుఁజూచి రెట్టించిన శోకముతో నతని కంఠమును గౌఁగలించుకొని మఱియు నెక్కుడుగా విలపింపఁదొడంగెను. అప్పుడు నేను మూర్ఛాంధకార వివశనగుట నేమని విలపించితినో యేమయితినో యెఱుంగను. నామేనినుండి ప్రాణములు సైత మేమిటికిఁ బోయినవికావో నాకుఁదెలియదు. మఱికొంతసేపటికి నాకుఁ దెలివివచ్చినది. అప్పుడు నాదేహమును నగ్నియందుబడినట్లు అసహ్యశోకదహ్యమానమై నేలంబడి కొట్టుకొనుచుండఁ జూచితిని.

హా! యిదియేమి యుపద్రవము, ఇట్లు వచ్చినదని పెద్దయెలుంగున హా! అంబ! హా! తాత! హా! సఖులారా! యనియరచుచు, హా! నాధ! జీవితనిబంధన! నన్నొంటిమైవిడిచి యెక్కడికిఁ బోయితివో చెప్పుము, నీనిమిత్త మెట్టియవస్థ ననుభవించితినో తరళికనడుగుము. దివసమొక్కటియే సహస్రయుగ ప్రాయముగా గడిపితిని.

ఒక్కసారి మాటుడుము? భక్తవత్సలత్వము జూపుము. నా మనోరధము పూరింపుము. భక్తురాల, ననురక్త, బాల, ననాధ, మదనపరిభూత, నిట్టి నాయందేటికి దయసేయవు? నేనేమి యపరాధము చేసితిని? అయ్యో, నీవు నాకతంబున నెట్టియవస్థబొందితివి. నాకీ బ్రహ్మహత్యా పాతకంబెట్లు పోవును. నేను మహాపాతకురాలను. ఇట్టి నిన్ను విడిచి ఇంటికిఁ బోయితిని. ఇఁకనాకు దల్లిదండ్రులతోఁ బ్రయోజనమేమి? బంధువులేమిటికి? దైవమా, నన్ననుగ్రహింపము; వనదేవతలారా, అనాధను రక్షింపరా? తల్లీఁ! భూవి! లోకానుగ్రహకారిణి! నా యందు నీకైనం దయలేదా? యని యనేకప్రకారముల నేమియుందెలియక గ్రహావిష్ణురాలి చందమునఁ బ్రేలుచు విలసింపఁ దొడంగితిని; మఱియుఁ దచ్ఛరీరంబునంబడి కపోలములు ముట్టుచు జటాకలాపములు సవరించుచు హృదయంబున నిడిన నళినీదళంబులఁ దీసివేయుచు మాటిమాటికి మోముచుంబించుచు సారెసారెకు గంఠ గ్రహణముచేయుచు, ఆర్యా, యీతనిం బ్రతికింపుమని కపింజలుని పాదంబులంబడుచు, దరళికం గౌఁగలించుకొనుచుఁ బెక్కుగతుల విలపించితిని.

అప్పుడు నానోటనుండి అశ్రుతపూర్వములు ననుపదిష్టములు నగుచాటూక్తులెన్నియేని వెడలినవి. తలంచుకొన నాకావిలాపవచనము లెట్లు వచ్చినవో నాకే చిత్రమగుచున్నది. అదియొక యనస్థ గదా. జలయంత్రమువలె నశ్రుప్రవాహములు బయలు వెడలుచుండెను. నోటినుండి యంకురించుచున్నట్ల ప్రలాపములు వచ్చుచుండెను. అన్నన్నా, ఆయవస్థ తలంచుకొనినంత మేను గంపము నొందుచున్న దని పలుకుచున్న యామహాశ్వేత చేతనమును మూర్ఛ హరించినది.

తద్వేగంబునం బడుచున్న యామెను జంద్రాపీడుఁడు కరంబులనాని పట్టుకొని యశ్రుజలములచేతఁ దడసిన తదుత్తరీయముచేతనే మెల్లగా వీచుచుఁ గొంతసేపునకుఁ దెలివివచ్చి కన్నులు దెరచిన యామెఁజూచి దైన్యంబుదోప నిట్లనియె.

భగవతి! నాకతంబున నీకీశోకము వెండియు దాపము గలుగఁ జేసినది. ఇఁకపైనఁ జెప్పకుము, విరమింపుము, నేను సైతము వినఁజాలకున్నాను. గతించినవైనను సుహృజ్జనదుఃఖములు స్మరించినప్పుడు అనుభవ సమమగు వేదనం గలుగజేయునుగదా. అతిప్రయత్నముతో ధరించిన యీప్రాణముల శోకానములకు నింధనములుఁ జేయకు మని పలికిన విని యక్కలికయు నిట్టూర్పు నిగిడింపుచుఁ గన్నుల నశ్రువులు గారుచుండ విషాదముగా నిట్లనియె.

రాజపుత్రా! అట్టిదారుణ శోకసమయమందే విడువని యీ కృపణప్రాణములు నన్నిప్పుడేలవిడుచును? నిక్కము, పాపాత్మురాలనగు నాకంతకుఁడు సైతము దర్శన మీయవెరచు చున్నాడు. కఠినాత్మురాలనగు నాకిప్పుడీ శోకమేమిటికో? ఇదిశోకమా? అళీకము, సిగ్గు లేనివారలలో నేను మొదటిదానను. వజ్రమయమగు హృదయముతో నట్టిదుఃఖ మనుభవించితిని. కాని యనుభూతమయినదానిం చెప్పిన నేమిలెక్క యున్నది. తదనంతరవృత్తాంత మాకర్ణింపుము.

నేనట్లు పెక్కు తెరంగులఁ బలవరింపుచుఁ దరళికం జూచి, బోటీ! ఇఁక నాజీవితమేటికి? జింతయేమిటికి? చితి రచింపుము, అగ్నింబడి ప్రాణేశ్వరుం గలిసికొందునని పలికితిని.

అట్టి సమయమున నంతరిక్షమున జంద్రమండలము నుండి వెల్వడి యమృత డిండీరపాండురమగు నుత్తరీయాంశుకము అంసదేశమున వ్రేల మనోహరాలంకారభూషితుండైఁ మహాపురుష లక్షణోపేతుండై దివ్యాకృతితో నొప్పు నొక్క మహానుభావుడు ధవళదేహ ప్రభావితానములు దిగంతముల వ్యాపింపమెల్లన నచ్చటికి వచ్చి అతి శీతల స్పర్శములుగల నంగుళులతో నొప్పు నైరావతకరపీపరములగు బాహువులచే నందు గతాసుఁడై పడియున్న పుండరీకుని దేహము నెత్తుచు నన్నుద్దేశించి దుందుభినాదగంభీరమగు స్వరముతో వత్సా! మహాశ్వేఅత! నీవిప్పుడు ప్రాణములు విడువకుము. నీకితనితో వెండియు సమాగమముకాగలదు. అని తండ్రివలె నన్నోదార్చి యతండు పుండరీక శరీరముతోఁగూడ గగనతలమున కెగసి యరుగుచుండెను.

అప్పుడు నేను భయవిస్మయ కౌతుకంబులు చిత్తంబుత్తలపెట్టఁ దలపై కెత్తిచూచుచు, ఆర్యా! ఇదియేమి యద్భుతమో చెప్పుమని కపింజలు నడిగితిని.

అతండు నాకేమియుఁ బ్రత్యుత్తర మియ్యకయే తొందరగా లేచి అంతకా! దురాత్మా! నామిత్రు నెచ్చటికిఁ దీసికొనిపోవుచున్న వాఁడవని యలుకతోఁ బలుకుచు, నుత్తరీయవల్కలము నడుమునకు బిగించి యమ్మహాపురుషుననుగమించి యంతరిక్షమున కెగసెను. మేము చూచుచుండగనే వారునక్షత్రమండలములలోఁ బ్రవేశించి యంతర్థానము నొందిరి.

ప్రియతమ మరణంబునం బోలెఁ గపింజలుగమనంబున శోకం బిబ్బడింప నాహృదయం బప్పుడు ఖేదిల్లినది. అప్పుడు కింకర్తవ్యతా మూఢత్వంబునం దరళికంజూచి, యోసీ! ఇప్పుడు నా కేమియుం దెలియకున్నది, యెఱింగితివేని నీవు నాకుఁ దెల్లముగా వక్కాణింపుమని యడిగిన నదియు మదీయమరణమున సహింపక నాకిట్లనియె.

దేవి! పాపాత్మురాల నా కేమియుం దెలియదు. ఐనను నీ దివ్యపురుషుఁడు నున్నుఁ దయతోఁ దండ్రియుంబోలె నోదార్చుటఁ జూడమిక్కిలి వింతగానున్నది. ఆలోచింప నసత్యముగానిట్లు పలుకుట కేమియుఁగారణము గన్పడదు. కావున నిప్పుడు ప్రాణపరిత్యాగ వ్యవసాయమునుండి మరలుటయే యుత్తమము. ఆపురుషుఁ ననుసరించి కపింజలుఁడుగూడఁ బోయెనుగదా! అతనికట్లు పలుకుట కేమి యవసరమో యించుక యాలోచింపుము. మరణమున కేమి తొందర పిమ్మట బొందవచ్చును. కపింజలుఁడు మరల వచ్చువరకైనఁ బ్రాణములు దాల్చియుండుము. తరువాతఁ జూచుకొనవచ్చునని పలుకుచు నా పాదంబులం బడినది.

జీవితాశ యెల్లరకు దుర్లంఘ్యమయినది. కావున నే నట్లు చేయుటయే యుత్తమమని తలంచి జీవితమును విడువఁజాలక కపింజలుని రాక గోరుచు నతిదారుణమైన యారాత్రి తరళికాసహాయినినై సహస్రయుగప్రాయముగా వెళ్ళించితిని.

మరునాఁ డరుణోదయంబుమున నాసరస్సులో స్నానముచేసి పుండరీకునికిఁ బ్రీతిగాఁ దత్కమండలము తద్వల్కలము దజ్జపమాలికను ధరించి సంసారమసారమనియు వ్యసననిపాతము లప్రతీకార సాధ్యములనియు శోకము దుర్ని వారమైనదనియు దైవము నిష్ఠురుఁడనియు సుఖములనిత్యములనియు నిశ్చయించి తల్లిదండ్రుల లెక్క సేయక పరిజనములతోఁగూడక సకలబంధుజనులను మనసుచేత నిరసించి యింద్రియసుఖములయందుఁ జొరకుండ చిత్తమును నియమించి బ్రహ్మచర్యవ్రతమును గైకొని భక్తజనతత్పరుం డగు నీ పురహ నారాధింపఁ దొడంగితిని.

నావృత్తాంతమును విని సకలబంధుపరివృతుండై నాతండ్రి వచ్చి యింటికి రమ్మని యెంతేని బ్రతిమాలెను కాని నామనము తిరిగినది కాదు. పుత్రికాస్నేహంబున నతండు పెద్దతడవు నాకొరకు నిరీక్షించుకొని చివరకు నిరాశుడై దుఃఖముతో నింటికిఁబోయెను.

నాటంగోలె నేనిందు నమ్మహాపురుషుని కశ్రుమోక్షణమాత్రంబున కృతజ్ఞత జూపించుకొనుచు జపవ్యాజమునఁ దద్గుణముల లెక్కించుకొనుచు బహువిధములగు నియమములచేత శరీరమును వాఁడజేయుచు నీత్ర్యంబకుని సేవింపుచు నాతరళికతోఁగూడ నీగుహ యందు వసించియుంటిని.

మహాభాగ! ఆబ్రహ్మహత్యాపాతకురాలను నేనే. ఇదియే నావృత్తాంత మని పలికి యక్కలికి వల్కలోపాంతభాగంబున మోముదమ్మిం గప్పికొనుచు దుర్నివారమైన బాష్పవేగము నద్దుకొనుచు నుచ్చస్వరముతో నేడువఁదొడంగినది.

చంద్రాపీడుఁడు తదీయ వృత్తాంతమంతయు విని యా కృతజ్ఞతావిశేషమున కత్యంతము సంతోషింపుచు మెల్లగా నిట్లనియె. భగవతీ! క్లేశభీరుఁడు నకృతజ్ఞుడు నగు జనుండు స్నేహసదృశమైన కార్యమును జేయలేక నిష్ఫలమైన యశ్రుపాతమాత్రముచేతనే మైత్రిం బ్రకటించుకొనును.

అట్లుకాక క్రియచేతనే కృతజ్ఞతను వెల్లడించెడి నీవును నిట్లు నిందించుకొనియెద వేటికి? అతని నిమిత్తము మహైశ్వర్య సుఖములన్నియుఁదృణముగానెంచి విడిచితివి! తల్లిదండ్రులకెడమైతివి. వనితాజనదుష్కరము లగు నియమములచే గాయమును గ్లేశపరచుచుంటివి.

ఇదియునుంగాక శోకాభిభూతులచేత నాత్మ యనాయాసముగా వినబడుచున్నది. అతిప్రయత్నమున గాని క్లేశముల యందుంచబడదు. మరణమనునది యపండితులు గావింపుచుందురు. తండ్రిగాని, తల్లిగాని, భర్తగాని, మిత్రుఁడుగాని మృతినొందినపుడు తానును మృతినొందుటకంటె యవివేకములేదు. దీనివలన వాని కేమైన నుపకారము జరుగునా? తిరుగాఁ దీసికొనివచ్చునా? పరలోకసౌఖ్య మిచ్చునా? దర్శన మిచ్చునా? యేమియుం జరుగదు. ఆత్మహత్యా పాతకమొండుమాత్రము వేధించి నిరయమునొందఁజేయును.

బ్రతికియుండి జలాంజలిదానాది విధులచే నుపకృతి జేయ వచ్చును. రతీదేవి వృత్తాంతము స్మరించుకొనుము. ప్రియుండు హరనయన హుతాశనదగ్థుండైనను దాను మృతినొందక వేరొకరీతి నాతని పొందు గలిగియున్నది. మఱియుం బెక్కండ్రు కాంతలు ప్రియులు లోకాంతరగతులైననుఁ బ్రాణములువిడువక నిలిచియుండి సుఖించు చుండుట వినియుండలేదా? అదియునుంగాక భగవతిచే స్వయముగానే పునస్సమాగమ సూచకమగు వచనము వినఁబడినది కాదా? ఆమాట వితధమెట్లగును? నిస్సంశయముగా నమ్మహానుభావుండు తిరుగా సురలోకమునుండి రాగలఁడు. మహాత్ముల ప్రభావమచింత్యమైనది. పరలోకమునకేగి మరల వచ్చిన చరిత్రలు పెక్కు మనము పురాణముల వినుచున్నవారము. పుండరీకిండు నట్లు రావచ్చును. రాకున్నను నేమిచేయగలము? ఎవ్వరి నిందింపము? విధిబలవంతమైనది. దైవ హతకుని విలాసము లతిపిశునములు. ఆయతస్వభావములు దుఃఖములు. అనాయత స్వభావభంగురములు సుఖములు. ఒకజన్మము నందు సమాగమము, జన్మాంతర సహస్రములయందు విరహము గలుగుచుండును. ఆత్మను నిందించుకొనరాదు. సంసారమే యతి గహనమైనది. దీని ధీరులుగాని దాటలేరుకదా!

అని యిట్లు మృదువులైన సాంత్వన వచనములచే నామె నోదార్చుచుఁ జంద్రాపీడుఁడు వెండియు నిఝు౯ర జలంబుదెచ్చి బలాత్కారముగా నశ్రుజలకలుషితమగు నామె మొగమును గడిగించెను.

అంతలో మహాశ్వేత వృత్తాంతమును వినుటచే శోకించువాఁడుంబలె దివసవ్యాపారము విడిచి రవి యధోముఖుం డయ్యెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు గోపా! యిప్పుడు వేళ యతిక్రమించినది. తర్వాతివృత్తాంతము విస్తారముగా నున్నయది కావున ముందటిమజిలీలో దర్వాతికథ జెప్పెద నిప్పుడు లేచి కట్టెలం దెమ్ము. వంటఁజేసికొని భుజింతమని పలికి యెట్ట కేలకు వాని సమాధానపరచి యట్లు కావించెను.

మఱియు నయ్యతీశ్వరుని వెంట గావడి మోచుకొని నడుచుచు వాఁడు నడుమ నడుమ అయ్యా! అమ్మహాశ్వేతతోఁ బుండరీకుఁడు వెండియు గలిసికొనునా? చంద్రాపీడుఁడు తరువాత నేమిచేసెను? ఎచ్చటికిఁబోయెను? ఏమిజరిగినది? అని యడుగుచుండ హస్త సంజ్ఞచే వారింపుచు నెట్ట కేలకా పారికాంక్ష తరువాత మజిలీ చేరి తదనంతరోదంత మిట్లెఱింగించెను.


కాశీమజిలీ కథలు


32 వ మజిలీ కథ


కాదంబరి కథ


అట్లు సాయంకాలమగుటయు మహాశ్వేత మెల్లగా లేచి పశ్చిమసంజఁనుపాశించుచుఁ గమండలు జలంబులఁ బాదములఁ గడిగికొని వల్కలతల్పమున నతికష్టముగా గూర్చుండెను.

చంద్రాపీడుండును సంధ్యాప్రణామములు గావించి ఱెండవ శిలాతలమున మృదులతాపల్లవములచేత శయ్య గల్పించుకొని కూర్చుండి యమ్మహాశ్వేత వృత్తాంతమునే పలుమారు తలంచుకొనుచు మన్మధప్రభావమునకు వెరగుపడుచు వినయముతో వెండియు నామె కిట్లనియె.

భగవతీ! వనవాస వ్యసనమిత్ర మగు నీ పరిచారిక తరళిక యెందుబోయినది? అని యడుగుటయు నాసాధ్వి మహాభాగా! చెప్పెద వినుము. గంధర్వకులనాయకుఁడగు చిత్రరధుని ప్రసిద్ధి మీరు వినియుందురు. అతనికిఁ గాదంబరి యను కూఁతురు కలదు. అబ్బాలిక నాకు రెండవహృదయమువంటిది. పిన్ననాటినుండియు నశనపానశయనాదు లేకముగానే మాయిరువురకు జరిగినవి. శిశుక్రీడలను నృత్త