కాశీమజిలీకథలు/ఉత్తరఖండానుబంధము/32వ మజిలీ

వికీసోర్స్ నుండి

ఎచ్చటికిఁబోయెను? ఏమిజరిగినది? అని యడుగుచుండ హస్త సంజ్ఞచే వారింపుచు నెట్ట కేలకా పారికాంక్ష తరువాత మజిలీ చేరి తదనంతరోదంత మిట్లెఱింగించెను.


కాశీమజిలీ కథలు


32 వ మజిలీ కథ


కాదంబరి కథ


అట్లు సాయంకాలమగుటయు మహాశ్వేత మెల్లగా లేచి పశ్చిమసంజఁనుపాశించుచుఁ గమండలు జలంబులఁ బాదములఁ గడిగికొని వల్కలతల్పమున నతికష్టముగా గూర్చుండెను.

చంద్రాపీడుండును సంధ్యాప్రణామములు గావించి ఱెండవ శిలాతలమున మృదులతాపల్లవములచేత శయ్య గల్పించుకొని కూర్చుండి యమ్మహాశ్వేత వృత్తాంతమునే పలుమారు తలంచుకొనుచు మన్మధప్రభావమునకు వెరగుపడుచు వినయముతో వెండియు నామె కిట్లనియె.

భగవతీ! వనవాస వ్యసనమిత్ర మగు నీ పరిచారిక తరళిక యెందుబోయినది? అని యడుగుటయు నాసాధ్వి మహాభాగా! చెప్పెద వినుము. గంధర్వకులనాయకుఁడగు చిత్రరధుని ప్రసిద్ధి మీరు వినియుందురు. అతనికిఁ గాదంబరి యను కూఁతురు కలదు. అబ్బాలిక నాకు రెండవహృదయమువంటిది. పిన్ననాటినుండియు నశనపానశయనాదు లేకముగానే మాయిరువురకు జరిగినవి. శిశుక్రీడలను నృత్త గీతాది కళాపరిచయము మాకొక్కచోటనే కలిగినది. ఆరీతి మాయిరువురచేతను బాలభావము గడుపఁబడినది.

ఆకాంత యిప్పుడు నావృత్తాంతమును విని మిక్కిలి శోకించుచుఁ దానుగూడ నిట్లు శపథముచేసినది. నావయస్యయైన మహాశ్వేత దుఃఖించియుండగా నేను బెండ్లియాడను. మాతండ్రినాకు బలవంతముగా బెండ్లిచేసినచో రజ్జు, సర్ప, విష, సావకాదుల మృతినొందు దాన నని సఖులచెంత పల్కుపలుకులు కర్ణాకర్ణికగా విని దానితండ్రి చిత్రరథుఁడు మిక్కిలి పరితపించుచు నేకాపత్యుఁడగుటచే నేమియు దానిని మందలింపలేక వితర్కించి మఱియొకయుపాయ మేమియుం గానక నాయొద్దకు క్షీరోదుఁడను కంచుకి నంపి వత్సా! మహాశ్వేత, నీ నెచ్చెలి కాదంబరి సంపూర్ణయౌవన యయ్యు వివాహమాడనని మూర్ఖముచేయుచున్నది. యెవ్వరు చెప్పినను వినకున్నది. నీకన్న దానిచిత్తమును మరల్పువారు లేరు. ఎట్లైన నీవీ కష్టమును మాకుఁ దొలగింపు మని నాకు వార్తనంపెను. నేనావార్తవిని గురువచనమందలి గౌరవముచేతను సఖురాలియందలి మక్కువచేతను అయ్యో కాదంబరీ! దుఃఖించుచున్న నన్ను మిక్కిలి దుఃకింపజేయుచున్నా వేమి? నాకు సంతోషము గలుగజేయు తాత్పర్యము నీకుఁ గలిగియున్నచో నామాట విని తండ్రిచెప్పిన చొప్పున నడువుము. ఇదియే నాకుఁ బ్రియము.

అని నామాటగా చెప్పుమని తరళికను క్షీరోదునివెంట నీదినముననే యంపితిని. అదివెళ్ళిన కొంచెముసేపునకే దేవర దయచేసితిరని పలికి యూరకుండెను.

అంతలోఁ జంద్రోదయమైనది. అప్పుడు మహాశ్వేత వల్కల తల్పంబునం బరుండి నిద్రబోయినది. చంద్రాపీడుఁడును మనంబున అయ్యో యిప్పుడు వైశంపాయనుఁ డేమిచేయుచుండునో నన్నుఁ గానకెంత చింతించుచుండునో పత్రలేఖ యేమనుకొనునో రాజపుత్రు లేమందురో యని ధ్యానించుచునే నిద్రబోయెను.

నిశావసానంబున మేల్కాంచి మహాశ్వేతయు నారాజపుత్రుఁడును కాలకృత్యములు నిర్వర్తించిరి. ఇంతలో మనోహరమైన వేషముతో గేయూరకుఁడను గంధర్వకుమారునితోగూడఁ దరళిక యచ్చటికి వచ్చినది. ఆప్రాంతమందుఁ గూర్చునియున్న రాజపుత్రునింజూచి యాతరళిక విస్మయమందుచుఁ దదీయరూప మక్షులం గ్రోలుచున్నట్లు సవిత్కరముగా జూచిచూచి తల యూచుచుఁ బిమ్మట మహాశ్వేత యొద్దకుఁబోయి నమస్కరించి తదీయ జపావసానమువరకుఁ దాపున గూర్చుండెను.

మహాశ్వేతయు జపము ముగించినవెనుక తరళికంజూచి, బోటీ కాదంబరి సుఖముగా నున్నదా? నామాటలం జెప్పితివా? యేమన్నది? సమ్మతించెనా? యని యడిగిన విని యవ్వనితయు వినయముతో శిరమువంచి రాజపుత్రీ! నేనువోయి కాదంబరిని జూచితిని. ఆమె సుఖముగా నున్నది. నాసందేశమంతయు వినిపించితిని. కన్నీరు గార్చుచుఁ గేయూరకుఁడను తన వీణావాహకుని కెద్దియో చెప్పి యిచ్చటికంపినది. సర్వము నతండె నివేదించునని పలికి యూరకుండెను.

అప్పుడు కేయూరకుఁడు లేచి నమస్కరించుచు దేవి! మా రాజపుత్రి నీకిట్లు విజ్ఞాపనజేయు మని నన్నంపినది. వయస్యా! ఇప్పుడు తరళిక చెప్పిన మాటలన్నియు వింటిని. నా చిత్తమును బరీక్షించుటకో లేక గృహవాసాపరాధమును గురించి నిపుణముగా నధిక్షేపించుటయో, స్నేహపరిత్యాగమో కాక కోపమో కాని యిట్టివాత౯ నంపుట నాకు మిక్కిలి వ్యసనముగా నున్నది. మిత్రురాలు చింతించుచు నటవిఁ గ్రుమ్మరుచు వ్రతములఁ గృశించి కష్టముల ననుభవింపుచుండ నాకు ఆహా! సుఖమెట్లనుభవింపనగును? నిర్వృతి యెట్లుగలుగును? సంభోగమెట్లు రుచ్యమగును? పెక్కేల నవ్వుసైతము వచ్చునా?

క్రూరుఁడగు మన్మధుఁడు నిన్నిట్టి యవస్థ నొందజేసెనే? అట్టి కాముని సకామునిగా నెట్లుచేయుదును? పద్మినులు దివసకరాస్తమయ విధురములగుచుండ సహవాస పరిచయంబునం జేసి చక్రవాకయువతి సైతము సమాగమసుఖమును విడుచుచున్న దే? నీయందలిప్రేముడిచేఁ గుమారికాజన విరుద్ధమగు స్వాతంత్ర్యమంగీకరించితిని. గురువచనము తిరస్కరించితిని. లోకాపవాదము గణింపనైతిని. స్త్రీలకు మండన మగు సిగ్గు విడిచితిని. ఇప్పుడు తిరిగి యెట్లు స్వీకరింతును?

అంజలిఘటించి ప్రార్థించుచున్నదాన, నన్ననుగ్రహింపుము. నాజీవితముతోడనే నీవు వనములోఁ బ్రవేశించితివి. కోపముసేయక యీవిషయము నన్నెప్పుడు మందలింపవలదు. నాచిత్తము మరలదు. అని చెప్పి కేయూరకుఁ డూరకుండెను.

ఆతనిమాటలు విని మహాశ్వేత గొంచెముసేపాలోచించి తల యూచుచుఁ గానిమ్ము. కేయూరక! నీవు బొమ్ము. నేను వచ్చి పరిశీలించెద నని పలికి యతని నంపి చంద్రాపీడునింజూచి, రాజపుత్రా! కింపురుష రాజధానియైన హేమకూటమున కిప్పుడు బోవలసియున్నది. అదియు నిచ్చటికి దాపుగనే యుండును. అదృష్టపూర్వములగు పట్టణవిశేషములం జూడ వేడుక గలిగియున్నచోఁ జూచి వత్తువు కాని రమ్ము. మద్విశిష్ట యగు కాదంబరిని సైతము చిత్తవిభ్రమమునుండి తొలగింపనగు నొక దివసమేయుండి పోవచ్చును. అకారణబంధుండనగు నిన్నుఁ జూచినదిమొదలు నాహృదయ పరితాప మొకింత తొలంగినది. సజ్జనసమాగమము శోకమును బోగొట్టును కదా! మీవంటివారు పరులకు సుఖముగలుగుటయే చింతించుచుందురని బలికిన విని చంద్రాపీడుఁ డచ్చేడియ కిట్లనియె. భగవతీ! నిన్నుఁజూచినది మొదలు నాకును హృదయమున నెద్దియో యపూర్వమగు నుత్సాహము గలుగుచున్నది. నిశ్శంకముగాఁ గర్తవ్యములకు నన్ను నియోగింపుము. అన్యునిగా భావింపకు మని పలికి యతండు హేమకూటమునకు వచ్చుట కంగీకరించెను.

మహాశ్వేతయుఁ జంద్రాపీడునితోఁగూడ శుభముహూర్తంబునఁ బయలుదేరి క్రమంబున హేమకూట రాజధానికిం జని గంధర్వ రాజకులము నతిక్రమించి కాంచనతోరణ విరాజమానములగు కక్ష్యాంతరముల నేడిటఁ దాటి కాదంబరీ కన్యకాంతఃపుర ద్వారదేశమును జేరెను.

అందు మహాశ్వేతం జూచినతోడనే తొందరగా దూరమునుండియే ప్రతీహారిజనము వేత్రలతాయుక్తములగు హస్తములతో మ్రొక్కుచు మార్గమెఱిగింప నసంఖ్యేయ కన్యకా సహస్రములచే నిండియున్న లోపలఁబ్రవేశించి యంగనాద్వీపమువలె మెఱయుచున్నయం దద్భుతలావణ్య పూర్ణవిగ్రహులై దివ్యాలంకార శోభితలై యిటునటు తిరుగుచున్న గంధర్వస్త్రీలం గాంచి రాజపుత్రుండది స్వప్నమోయని భ్రాంతిజెంది యామెవెంట నడుచుచుండెను.

అందున్న గంధర్వ కన్యకా జనమునకు సఖిసస్తావలంబనములే పాణిగ్రహణ మహోత్సవములు, వేణువాద్యములయందే చుంబన వ్యతికరములు వీణలయందే కరరుహవ్యాపారములు కందుకక్రీడల యందే కరతలప్రహారములు భవనలతానేక కలశకంఠములయందే భుజలతా పరిష్వంగములు లీలాడోలికయందే జఘన స్తన ప్రేంఖితములు అశోకతరుతాడనముల యందే చరణాభిఘాతములు కాని సురతవిలాసములేమియు నెఱుంగరు. తత్తత్క్రయలచే శృంగారచేష్టల నభ్యసించుచున్నట్లు కనంబడుచుండిరి.

అట్టి వినోదములం జూచుచుఁ జంద్రాపీడుఁడు మహాశ్వేత వెంట నరుగుచు మఱికొంతదూరము బోయి నంతఁ గాదంబరీ ప్రత్యాసన్నలగు పరిజనుల మాట లిట్లు వినంబడినవి.

లవలికా! కేతకీకుసుమధూళులచే లవలీలతల కాలవాలములు గట్టుము.

సాగరికా! గంధోదక కనకదీర్ఘికలయందు రత్నవాలుకల జిమ్ముము.

మృణాలికా! కృతిమపద్మలతలయందుఁ గుంకుమజల్లి చక్రవాక మిథునముల విడువుము.

మకరికా! గంధపాత్రములఁ గర్పూరపల్లవరసంబునఁ బరిమళింపఁజేయుము.

రజనికా! భవనదీర్ఘి కలయందలి తమాలవృక్షములచేఁ జీఁకటిగా నుండుతావుల మణిదీపములఁ జేర్పుము.

కుముదినికా! దానిమ్మపండ్లను బక్షులు దినకుండ ముత్తెపు పేరులం జుట్టుము.

నిపుణికా! మణిసాలభంజికల కుచములయందు కుంకుమరస పత్రభంగముల రచింపుము.

ఉత్పలికా! కనకసమ్మార్జనులచేఁ గదళీగృహములయందలి మణివేదికలం దుడువుము.

మాలతికా! సిందూరేణువులచేఁ గామదేవగృహదంతవలభికకు రంగువేయుము.

కేసరికా! భవనకలహంసలకుఁ గమల మధురసం బొసంగుము.

కదళికా! గృహమయూరముల దారాగృహము జేర్చుము.

కమలినికా! చక్రవాకశిశువులకు మృణాళక్షీరరసం బిడుము.

లవంగికా! చకోరపంజరములయందుఁ బిప్పలీతండుశకలంబులఁ బోయుము. మధురికా! కిన్నరమిథునములను సంగీతశాలల విడువుము.

అట్టి వినోదసంభాషణములన్నియు నాలింపుచుఁ గ్రమంబునఁ బోయి కాదంబరీ భవనసమీపమును జేరిరి. అందు సేవార్థమై యరుదెంచి యుభయపార్శ్వముల వసించియున్న యన్నుమిన్నల మణికనక విభూషణకిరణ జాలంబులు నదీ ప్రవాహమువలె వ్యాపించుచుండెను. దివ్యరూపసంపన్నులగు గంధర్వ కన్యకలు మండలముగాఁ జుట్టునుం బరివేష్టించి కూర్చుండ దివ్యమణిప్రభాధగద్దగితమగు శ్రీమంటప మధ్యంబున నీలాంశుక విరచితంబగు హంసతూలికాతల్పంబునఁ దెల్లనితలగడపైఁ జేతులాని మహావరాహ దంష్ట్రావలంబిత యగు భూదేవివలె నొప్పుచు దేహప్రభాజాలజలంబు పెచ్చుపెరుగ భుజలతా విక్షేప పరిభ్రమణములచే విదలించుచుండిరో యనఁ జామరగ్రాహిణు లిరువంక వీచుచుండ నొయారముగాఁ బండుకొని సఖులతో ముచ్చటింపుచుఁ బర్యంకము దాపున నేలం గూర్చుండి కేయూరకుఁడను వీణావాహకుఁడు మహాశ్వేతయొద్దకు వెళ్ళివచ్చిన వత౯మానములం జెప్పుచుండ నచ్చెరువుతో నాలింపుచున్న కాదంబరీతరుణీలలామంబు చంద్రాపీడునకు నేత్రపర్వము గావించినది.

భూలోకములో మహాసుందరులని పేరు పొందిన యిందుముఖులు గంధర్వకన్యలకు దాస్యము సేయఁబనికిరారు. అట్టి గంధర్వ కాంతలలో నిరుపమానసౌందర్యశాలిని యని ప్రఖ్యాతి వడసి గంధర్వకుల చక్రవర్తి కూఁతురై నిరతిశయభాగ్యవైభవంబులఁ బ్రకాశించు కాదంబరి నా దివ్యస్త్రీల నడుమఁ గనకమణి శ్రీమంటపమధ్యమున హతాత్తుగాఁ జూచినంతఁ జంద్రాపీడుని హృదయ మెట్లుండునో వ్రాయుట దుర్ఘటము. తద్భూషణమణి కిరణజాలంబులు కన్నులకు మిరిమిట్లు గొలుప విభ్రాంతుండై యొక్కింతతడవేమియుం దెలియక మోహముతోనుండి యంతలోఁ దెప్పిరిల్లి ఆహా! నాకన్ను లెట్టి పుణ్యము సేసికున్నవో? ఇట్టి లోకైకసుందరి ననివార్యముగాఁ జూడఁగలిగినవి. అయ్యారే! నిరించి సర్వరమణీయవస్తువులనేరి యీ నారీరత్నమును సృజించెనని తలంచెదను. ఓహోహో! అక్క మలగర్భుండు రూపాతిశయపరమాణువుల నిన్నిటి నెక్కడ సంపాదించెనో? తెలియదు.

నిక్కమీకాంచనఁగాత్రిని నిర్మించుచున్న విరించనుని కరతల పరామశన్‌శ్లేశంబున నామె కన్నులనుండి జారిపడిన జలబిందువుల నుండియే భూమియందుగల కుముద కమలసౌగంధికాది వస్తువులుత్పన్నంబులైనవి. బాపురే! ఇపూఁబోడి మోమంతయుఁ గన్నులుగానే కనంబడుచున్నది? ఇది కొమ్మయా? బంగరుబొమ్మయా? అని విత్కరించుచున్న యన్నరనాధసూనుని దృష్టిప్రసారము కాదంబరీ నయన యుగంబున వ్యాపించినది.

అమ్మదవతియు నదరుపాటుతో నతనింజూచి రూపాతిశయ విలోకనమువలనం గలిగిన విస్మయముచే రెప్పవాల్పకుండ సూటిగాఁ జూపులతనిపై వ్యాపింపఁజేసినది. తల్లోచన ప్రభావ్యాప్తిచేఁ దెల్లఁబడి కాదంబరీ దశ౯న విహ్వలుండై యతండు కాదంబరీ దశ౯న విహ్వలుండగు బలరామునివలెఁ బ్రకాశించెను.

కాదంబరి యట్లా రాజపుత్రు నబ్బురపాటుతోఁజూచి మేను గగుర్పొడువ భూషణరసమేసార నట్టెలేసి మేనెల్లం జెమ్మటలుగ్రమ్మఁ గంపముతో నతికష్టంబునఁ గొన్నియడుగు లెదురువోయి చిరకాల దశ౯సమువలనఁ గలిగినయుత్కంఠతో నాకలకంఠినిఁ గంఠాశ్లేషము గావించినది.

మహాశ్వేతయుఁ బ్రత్యాశ్లేషము గావించుచు సఖీ! ఈతండు రక్షిత ప్రజాపీడుండగు తారాపీడుండను భూలోకచక్రవర్తి కుమారుండు నిజభుజాస్తంభ విశ్రాంత విశ్వంభరాపీడుండు చంద్రాపీడుండను వాఁడు. విజయయాత్రాప్రసంగమున నీభూమి కరుదెంచెను. చూచినదిమొదలు నాకితండు నిష్కారణబంధుఁడై యొప్పెను. పరిత్యక్త సకలసంగనిష్టురమైనను నాచిత్తవృత్తి స్వభావసరళము లగు సుగుణములచే నితం డాకషి౯ంచెను. దాక్షిణ్య పరవశుండు నకృత్రిమ హృదయుండు విదగ్ధుండనగు నిని౯ మిత్త మిత్రుండు దొరకుట దుర్ఘటము గదా?

నేనువోలె నీవుగూడ నీసుకుమారునించూచి వాణీధవుని నిర్మాణకౌశలము పృధివికిఁ గల వాల్లభ్యసౌఖ్యము మర్త్యలోకము సురలోకమును మించుటయు మనుజస్త్రీలయొక్క నేత్రసాఫల్యము సర్వకళలు నొక్కచోటనుండు విధముం దెలిసికొనఁగలవని బలవంతముగా నీతని నిచ్చటికిఁ దీసికొని వచ్చితిని. నిన్ను గుఱించి యీతనితోఁ జాల చెప్పియున్నదానఁ గావున నితండు క్రొత్తవాఁడని సిగ్గు పడక అవిజ్ఞాతశీలుఁడని శంకింపక నాయందెట్టి ప్రీతిగలిగి యుంటివో వీని యందుఁగూడనట్లే వర్తింపవలయును.

ఈతఁడే మనకుఁ బరమమిత్రుఁడు. ఈతఁడే మనకు దగ్గిర చుట్టము. ఈతఁడే మనకు నమ్మఁదగిన పరిజనుఁడు అని చెప్పినది. అప్పుడు చంద్రాపీడుఁడు. కాదంబరికి నమస్కారము గావించెను.

అట్లు నమస్కరించిన చంద్రాపీడు నత్యంత ప్రీతిపూర్వకముగా వార చూపులచేఁ జూచుచున్న కాదంబరియొక్క నేత్రకోణములనుండిఁ శ్రమజలకణములవలె నానందబాష్పబిందువులు రాలినవి. మొగంబున సుధాధవళము లగు స్మితజ్యోత్స్న లించుక వ్యాపించినవి ప్రతి ప్రణామంబున నతని సత్కరింపు మని శిరంబున కెఱింగించునవివోలె భ్రూలతలు పై కెగసినవి.

అప్పు డందున్న గంధర్వకన్యకలు తిర్యగ్విలోకనముల నతని సోయగము బరికింపం దొడంగిరి. కాదంబరి సంభ్రమముతో నతనికి నమస్కరించి మహాశ్వేతతోఁగూడఁ బర్యంకమునఁ గూర్చుండెను. పిమ్మటఁ బరిజనులచేఁ దొందరగాఁ బర్యంకశిరోభాగ ప్రాంతమున వేయ బడిన హేమపాదాంకితమగు రత్నపీఠంబునఁ జంద్రాపీడుఁడు పవిష్టుం డయ్యెను.

అప్పుడు ప్రతిహారులు కాదంబరీ మహాశ్వేతల సంవాదప్రకారము విను తలంపుతో సంవృతముఖ వ్యస్తహస్తలై హస్తసంజ్ఞలచే వేణువీణాది గీతధ్వనులు వంధిమాగధ జయశబ్దముల నంతటను నాపివేసిరి.

అంతలో గాదంబరిలేచి పరిజనోపనీతమగు నుదకముచే మహాశ్వేతపాదములు గడిగి యుత్తరీయాంశుకమునఁ దడియెత్తి వెండియుఁ దల్పంబునఁ గూర్చుండెను.

పిమ్మటఁ గాదంబరికిఁ బ్రాణసఖురాలు. అనురూపరూపలేఖ, మదలేఖ యనునది రాజపుత్రుం డిచ్చగింపకున్నను బలవంతమున నతని పాదంబులం గడిగి తడియొత్తినది.

అప్పుడు మహాశ్వేత కర్ణాభరణ మణికిరణ కిమ్మారిత మగు కాదంబరియొక్క భుజముపైఁ జేయివైచి చోమరపవనంబునఁ జారుచున్న కుసుమంబు వెండియు వేణికాబంధంబునం గూర్చుచు సఖీ! కాదంబరీ! కుశలముగా నుంటివా? అని యడిగిన గాదంబరియు నిజగృహనివాసంబున నపరాధము జేసినదివోలె సిగ్గుపడుచు నిట్లుత్తరము చెప్పినది.

చ|| ప్రియసఖి నార చీరల ధరించి భయంకర భూరికందరా
     లయమునుండి యాకలములన్ భుజియింపుచు దారుణ వ్రత
     క్రియలను గాలము న్గడుప హ్రీరహితాత్మకనైన నాకనా
     మయమున కేమిలోటిట సమస్తభోగములన్ భజింపఁగన్||

వ|| అని పలికి,

గీ|| కలికి తత్కాలజనిత శోకప్రవృత్తి
    బ్రియవయస్యనుఁ జూచుచుండియుఁ గడంక
    నాపలేదయ్యఁ దనచూపు లతనిమీదఁ
    బడక యుండఁగ నెన్ని యుపాయములను||

అశ్రుజలపూరితనయనయై యజ్జలజనయన ముహూర్తకాల మూరకొని యంతలోఁ దనకుఁ దాంబూలమీయఁబోవుఁడు వారించుచు మహాశ్వేత యిట్లనియె. సఖీ! మనమందరము క్రొత్తచుట్టమైన యీరాజకుమారు నారాధింపవలయును. కావున ముందుగా నతనికిఁ దాంబూల మిమ్మని పలికిన విని యక్కలికి యించుక యడ్డముగా మొగము వంచి సన్ననియెలుంగున ప్రియసఖీ! పరిచయము లేకపోవుటచే నిచ్చుటకు నాకు సిగ్గగుచున్నది. దీనింగైకొని నీవే వారికిమ్ముఅనవుఁడు మహాశ్వేత ముఖరసనా చలన సంజ్ఞచేవారించుచు నట్లనకుము. నీవే యీయవలయునని పలుమారు బోధింప నెట్టకే యంగీకరించినది.

మహాశ్వేత మొగమునుండి దృష్టుల నాకిష౯ంపకయే మేను గంపమునొందఁ గన్నులుమూసికొని నిట్టూర్పులు నిగుడించుచు నొడలంతయుఁ జెమ్మటలు గ్రమ్మ సాధ్వసపరవశయై యతిప్రయత్నముతో నప్పల్లవపాణిఁ తాంబూలగర్భ హస్తపల్లవము చాచినది.

అప్పుడు చంద్రాపీడుండును ధనుర్గుణాకర్షణకృత కిణశ్యామలమయ్యు స్వభావపాటలమై యరుణనఖకిరణ లలితములగు నంగుళులచేఁ బొలుపొందు కరతలంబు తాంబూల మందికొనుటకై చాచెను.

అప్పుడు తద్విలాసములం జూచుటకు వేడుకకలవియుం బోలె నెక్కడినుండియోవచ్చి రసములన్నియు నామెయందుఁ బ్రవేశించినవి.

శ్వేదజలపాతపూర్వకముగా మన్మధునిచేత నీదాసజనము నీకీయఁబడినది. స్వీకరింపుమని తన్నర్పించుకొనునట్లు ఇది మొదలు మదీయజీవితము నీహస్తమందుండఁగలదని స్థాపించుచున్నట్లు కాదంబరి యతనిచేఁ దాంబూలమిడినది. పిమ్మట భుజలతానుసారముగాఁ గరకిసలయమును లాగికొనుచు ననంగశరభిన్నమధ్యమగు హృదయమువోలెఁ జేతనుండి జారిపడిన రత్నవలయమునుఁ దెలిసికొనఁ జూఁడదయ్యెను.

మఱియొకతాంబూలము మహాశ్వేత కిచ్చి యచ్చేడియ పచ్చ విల్తుని రాయింబడియున్న సమయంబున నొకశారిక వారికడ కరుదెంచి తన్నుఁ దరిమికొనివచ్చిన చిలుకం జూపుచుఁ గాదంబరి కిట్లనియె.

భర్తృదారికా! కాదంబరీ! నన్ను బాధింపుచున్న యతి దుర్వినీతుఁ డగు నీపతంగాధము నేమిటికి వారింపవు? వీనిచేఁ బరిభవింపఁబడుచున్న నన్నిఁక నుపేక్షించితివేని నీపాదములార తప్పక ప్రాణముల విడిచెదను జుమీ! అని పలికినంతఁ గాదంబరి యించుక నవ్వినది.

అప్పుడు మహాశ్వేత విస్మయముతో నీశౌరిక యేమనుచున్నదని మదలేఖనడిగిన నప్పడఁతి యిట్లనియె. దేవీ! యీశారికను గాళిందియను పేరుపెట్టి మారాజపుత్రికయే పెంచుచుఁ బరిహాసమును పేరుగల యీచిలుకకు స్వయముగాఁ బెండ్లిజేసి భార్యాభర్తలగాఁ బిలుచుచున్నది. నేఁటి ప్రాతఃకాలమునఁ గాదంబరీ తాంబూల కరందవాహిని యగు నీ తమాలికతో నేకాంతముగా నేదియో మాటాడుచుండ నాచిలుకం జూచినదఁట. అప్పటినుండియు నీర్ష్యారోష కషాయితమతియై యీశారిక యీచిలుకంజూడదు. మాటాడదు, చేరనీయదు. మేమెంత బ్రతిమాలినను బ్రసన్నురాలు కాకున్న దిదియే దీనివృత్తాంత మని చెప్పిన విని మందహాసము గావించుచుఁ జంద్రాపీడుఁ డిట్లనియె.

అగు నగు నీవాతన్ నిదివఱకే మేము వినియుంటిమి. కాదం బరిదేవియొక్క తాంబూలకరండ వాహినియగు తమాలికను వరించి పరిహాసమను చిలుక విరహవేదనచెందుచున్నదని లోకమున జనులు చిత్రముగాఁ జెప్పుకొనుచున్నారు. ఈవృత్తాంతము కర్ణపరంపరచే రాజకులమంతయు వ్యాపించియున్నది. సిగ్గుమాలిన యీతమాలిక మూలమున పతత్రము కళత్రమును విడుచుట వామాచారమై యున్నది అది యట్లుండనిండు. చపల యగు నీదుష్టదాసినిఁ గాదంబరి యేమిటికి మందలింపదు? అగు నీశారిక నీచిలుకకుఁ బెండ్లిజేయునప్పు డెన్నియో బుద్ధులు గఱపియేయుండు నని నిలిచియున్నవియా? స్త్రీలకు సాపత్నీపరిభవంబు ప్రథానకోపకారణంబు పెద్దవివాదహేతువుగదా? ఇట్టి పరాభవములయందుఁ దఱుచు స్త్రీలు విషయమైనందిందురు అగ్గి నైనంబడుదురు. ఈశారిక గట్టిదియే అట్టిపని యేదియుం జేయలేదు. ఇప్పుడు మనమీ చిలుకచే నీతప్పు గావుమని దీనిం బ్రతిమాలింపఁ జేయుదము. అప్పుడు ప్రసన్నురాలై భత౯ను మన్నించుగాక. అట్లు మన్నింపదేని యీశారికదే తప్పుగా గణించి దీని విడిచివేయుదము. పరాభవము జేసి విడిచిన దీని నెవ్వరాలాపింతురు? యెవ్వరు మన్నింతురు? ఎవ్వరు పోషింతురు? ఇదియే దీనికిఁ బ్రాయచిత్తమని పలికిన విని కాదంబరీ పరిచారక లెల్లఁ దత్ర్కీడాలాపము గ్రహించి నవ్వుకొనిరి.

అప్పుడాచిలుక యతని నర్మాలాపము లాలించి యిట్లు పలికినది. దూత౯! రాజపుత్రా! యీశారిక రాజకుల సంపర్కము వలనఁ జతురమతియైయున్నది. నీవుగాని, యితరులుగాని దీనిని భయపెట్టజాలరు. ఇవి పరిహాసజల్పిదము లని తెలిసికొనఁగలదు. ఈవక్రోక్తులు దీనిముందరఁ బనికిరావు. కోపప్రసాదములయొక్క కాల కారణ ప్రమాణవిషయంబులఁ బాగుగా నెఱుంగును. శృంగారభాషితముల కిది నెలవని పలుకుచున్న సమయంబునఁ గంచుకి యరుదెంచి ఆయుష్మతీ! మహాశ్వేతా! చిత్రరధుండును భార్య మదిరా మహాదేవియు నీరాక విని మిగుల నానందించుచున్నారు. నీతో ముచ్చటించుటకుఁ దొందరపడుచు వేగఁ దీసికొని రమ్మనిరని పలికినది.

అప్పుడు మహాశ్వేత కాదంబరీ! నేను నీ తలిదండ్రులఁ జూడఁ బోవుచున్నాను. నేను వచ్చుదనక నీతం డెందుండవలయు నని యడిగిన నప్పుడంతి స్త్రీలహృదయస్థానములయందని మనసున ననుకొని ప్రకాశముగా నిట్లనియె. సఖీ! నీవు నన్నిట్లడిగెదవేల? చూచినది మొదలు శరీరమునకు, భవనమునకు విభవమునకు నీతండే పరివృఢుండని తలంచుచుంటి ప్రియసఖీ! హృదయమునకుఁ గాని యాయనకుఁ గాని యెందిష్టమో యందే యుండవచ్చునని చెప్పిన మహాశ్వేత యిట్లనియె.

సఖీ! అట్లయిన నీమేడ సమీపమందున్న ప్రమద వనమునందలి క్రీడాపర్వతమునఁ గట్టఁబడిన మణివేశ్మమందు నివసింపఁజేయుమని యుపదేశించి మహాశ్వేత గంధర్వసార్వభౌముం జూడఁబోయినది.

చంద్రాపీడుండును మహాశ్వేతతోడనే బయలుదేరి వీణావాదినులు వేణువాద్యనిపుణులు సంగీత విద్యాపారంగతలగు గంధర్వకన్యకలు పెక్కండ్రు కాదంబరీ సమాదిష్టలై తన్ననుసరించి రాఁ బూర్వ పరిచితుండగు కేయూరకుండు ముందు నడుచుచు మాగ౯ము జూపుచుండ ఱెండవజయంతమువలె నొప్పుచున్న యమ్మణి మందిరమున కరిగెను.

పిమ్మటఁ గాదంబరియుఁ బరిజనములెల్ల విడిచి యొక్కరితయే మేడ యెక్కి తల్పంబునం బండుకొని యాత్మీయంబులగు వినయ ముగ్ధతా కుమారభావ కులమర్యాదాది విశేషంబులం దలంచుకొని యగ్గలంబగు సిగ్గు జెందుచు నిట్లు విచారించినది.

అయ్యో! మోహాంథురాలనై యిప్పుడు నే నెట్టి పని గావిం చితిని? అతం డదృష్టపూర్వుండు. కనబడఁగూడదని యించుకయు శంకింపనైతి. నన్ను లోకులు లఘుహృదయంగాఁ దలంతు రని నిర్లజ్జనై యాకలింప నైతిని. గురుజనములకు వెరవక లోకాపవాదమునకు భయపడక మహాశ్వేత దుఃఖితయైయున్న దనుమాట యాలోచింపక పరిజనము జూచునని తెలియక సష్టచేతననై దుష్టమగు పని కావించితిని నాప్రమాదము స్థూలబద్ధులుగూడఁ జులకనగాఁ దెలిసికొనఁ జాలుదురనిన ననుభూతకందర్పవృత్తాంతయగు మహాశ్వేతయు సకల కులాకుశలలగు సఖురాండ్రును రాజకులసంచారచతురలగు పరిజనులును, గ్రహించుట యేమియబ్బురము? అంతఃపుర దాసు లిటువంటిపనులఁ దెలిసికొన నతినిపుణదృష్టిగలవారుగదా?

అన్నివిధముల నే నిప్పుడు భ్రష్టురాలనైతిని. నాకిప్పుడు మరణమే శ్రేయము. బ్రతుకుట లజ్జాకరము. ఈవృత్తాంతము విని నా తల్లిదండ్రు లేమందురో! ఏమిజేయుదును? ఇందులకుఁ బ్రతీకార మేది? ఏయుపాయమున నీస్ఖలితమును గప్పికొందును. నాయింద్రియచాపల్య మెవ్వరితోఁ జెప్పికొందును.

అయ్యయ్యో! నాసఖుల ముందరఁ బెండ్లియాడనని శపధముఁ జేసియావత౯ కేయూరక ముఖముగా మహాశ్వేతకుఁ దెలియజేసితినే? ఆమాట యించుకయు జ్ఞాపకము లేకపోయినది. శఠవిథి యా చంద్రాపీడు నాకడ మేమిటికిఁ దీసికొనిరావలయును? అతఁ డెవ్వఁడు? ఎప్పుడైన జూచితినా? వింటినా? తలంచితినా?


వానిం జూచినంతనే నాయింద్రియము లన్నియు విత్తమిచ్చికొనఁబడినట్లు తద్వశములై పోయినవే? తెలిసికొంటి. నాచపలునితో నాకేమియుం బనిలేదు. అని క్షణకాలము ధ్యానించి యంతలో మన్మథునిచేతఁ బాణములతోఁగూడ నీధైర్యావలేప మపనయించెదఁ జూడుమ భయపెట్టఁబడినదివోలెఁ గ్రమ్మరఁ దనహృదయమ్ముఁ

కాశీమజిలీకథలు/ఉత్తరఖండానుబంధము/89-96 పుటలు

నేమియు మాటాడఁజాలకున్నవాఁడు. ఇతని వృత్తాంతమేమియుం దెలియక రాజచక్రము తొట్రుపడుచుండును. దూరమందున్నను బద్మినీపద్మబాంథవులకుఁ బోలె బ్రళయపర్యంతము మీయిరువురకు నీప్రీతి స్థిరమై యుండకమానదు. ఈకుమారున కరుగుట కనుజ్ఞ యిమ్మని పలికిన విని కాదంబరి నెచ్చలీ! పరిజనయుక్తముగా నీజన మీకుమారునకు తనయంతరాత్మవలెనే స్వాధీనమైయుండ నిందుల కనురోధ మేమి? అట్లే పోవచ్చునని పలుకుచు గంధర్వకుమారులం జీరి వీరి స్కంథావారమును జేర్పుఁడని యాజ్ఞాపించినది.

అప్పుడు చంద్రాపీడుఁడు లేచి తొలుత మహాశ్వేతకు నమస్కరించి తరువాతఁ గాదంబరికి మ్రొక్కి ప్రేమపూరితమగు తదీయ దృష్టిచేతను, మనసు చేతను గ్రహింపఁబడుచు దేవీ! ఏమందును? లోకమున బహుభాషకులనాదరింపరుగదా? నన్నుఁ బరిజనకథల యందు స్మరింపుచుండ వలయు నిదియే నాకోరిక యని పలికి యతండ య్యంతఃపురమునుండి బయలుదేరెను.

అప్పుడు కాదంబరితక్క తక్కిన యంతఃపురకాంత లందఱు తద్గుణగౌరవముచే నాకషి౯ంపఁబడి పరవశలై బహిర్ద్వారమువఱకు నతని ననుగమించి యరిగిరి. అందరివలనను నామంత్రణము వడసి యతండు కేయూరకానీతమగు నింద్రాయుధ మెక్కి గంధర్వకుమారులతోఁ గూడికొని నడుచుచున్న యతనికి హృదయమందే కాక యన్నికడలను గాదంబరి యున్నట్లు కనంబడుచుండెను. అతనిమనంబు తన్మయంబగుటఁ బోవలదని వెనుకనుండి లాగుచున్నట్లును ముం దడ్డము వచ్చినట్లును దోచుచుండెను. అట్టి విరహముతో నతండు క్రమంబున మహాశ్వేతాశ్రమము మీదుగా నచ్ఛోదసర స్త్సీరమున కరిగి యందుండి యింద్రాయుధ ఖురపుబానుసారముగా స్కంధావారమును జేరి గంధర్వకుమారుల నంపివేసెను. తన్నుఁజూచి మ్రొక్కు చున్న రాజలోకమును మన్నించుచు నెదురువచ్చిన వైశంపాయనునిఁ గౌఁగలించుకొని పత్రలేఖ నాదరించి లోపలిభవనమును బ్రవేశించి యేకాంతముగాఁ బత్రలేఖ వినుచుండ వైశంపాయనునితోఁ దాను జూచివచ్చిన విశేషములన్నియుఁ జెప్పుచుఁ దత్కధాలాంములతోడనే యారాత్రి సుఖముగా వెళ్ళించెను.

మఱునాఁడుదయకాలమున రాజపుత్రుఁడు సభాభవనమలంకరించి కాదంబరినే థ్యానించుచుండ నంతలో ద్వారపాలుని వెంట వచ్చుచునన కేయూరకునిఁ జూచెను. అతఁడు దూరమునుండియే మౌళిచుంబితధరాతలుండై నమస్కారము గావించుటయుఁ రాజపుత్రుండోహోహో! గంధర్వపుత్రా! రమ్ము రమ్ము. అని పలుకుచుఁ జేతులు సాచి గాఢాలింగనము జేసి తనసమీపమందే కూర్చుండఁ బెట్టుకొని వత్సా! పరివారయుక్తముగాఁ గాదంబరి సుఖి యైయున్నదా? మహాశ్వేతకు భద్రమా! అని యడిగిన నతం డిట్లనియె.

దేవా! అందఱును సుఖులై యున్నారు. కాదంబరి యంజలి వట్టి దేవర నర్చించుచున్నది. మహాశ్వేతయు కుశలవాక్యపూర్వకముగ నమస్కరించుచున్నది. మదలేఖయుఁ దమాలికయుఁ బాదప్రణామ పూర్వకముగా నారాధించుచున్నారు మఱియు మహాశ్వేత దేవర కిట్లు విన్నవింపుచున్నది నీవెవ్వరికిఁ జక్షుర్గోచరుఁడ వగుచుంటివో వారు ధన్యులు. నీసమక్షమునఁ జంద్రకిరణములవలెఁ జల్లనైననీ గుణములు వియోగమందుష్ణకర కిరణములై బాధించుచున్నవి. ఇందలి జనంబులు నిన్నటిదివసంబు సమకితోదయవాసరంబువోలె స్మరించుచున్నారు. నీచే విడువబడిన యీగంధర్వరాజనగరంబు విని వృత్త మహోత్సవమైనదిగాఁ దోచుచున్నది. నన్ను సకల సంగపరిత్యాగురాలని యెఱుంగుదువుగాదా? అయిన నకారణబంథుఁడవగు నిన్నుఁజూచుటకు నాహృదయ మిచ్చగించుచున్నది. అదియునుం గాక భవదీయస్మేరానన విలాసముల స్మరించుచుఁ గాదంబరి యస్వస్థి శరీరయైయున్నది. కావునఁ బునద౯శ౯న గౌరవంబున నామెను సన్మానింపఁగోరుచున్నాను. ఇట్టిసందేశ మనుచితమైనను నీసుజనత్వమే మాకిట్టి ప్రాగల్భమును గలుగఁ జేయుచున్నది. ఇదిగో కాదంబరి నీకర్పించిన శేషాహారమును దల్పంబున మరచిపోయితివి. దీనిం బంపితిఁ గైకొనవలయునని తదీయసందేశ మెఱిగించుచుఁ గాదంబరిచే నంపఁబడిన బిసతంతువులచేఁ గట్టఁబడియున్న తామరాకు దొన్నె నతనియెదుట విప్పి యందభిజ్ఞానముగా నుంచఁబడిన యాకులును, బోకలును, కర్పూరమును మృగదామోద మనోహరం బగు చందన విలేపనంబునుం దీసి రాజకుమారున కర్పించెను.

అప్పుడు చంద్రాపీడుండును ఆహా! నాభాగ్యము పరిజనకథల యం దైన స్మరింపఁదగని నన్నుఁ గాదంబరి మిక్కిలి గౌరవింపుచున్నది. ఇదియంతయు మహాశ్వేతయొక్క పాదసేవవలనఁ గలిగిన ఫలమని పలుకుచు నావస్తువుల నాదరముతో గ్రహించి వామకరంబున నతని బుజము బట్టికొని రాజలోకమునెల్ల విడిచి మెల్లగా గంధమాదనమను నేనుఁగను జూడఁబోయెను. అందొకింతకాలము నిలిచి యటనుండి వాజశాలకుఁ బోయి యందలిగుఱ్ఱములు బరీక్షించుచు నింద్రాయుధపృష్ఠభాగమునందలి యవకుంఠనపటం బొకింత జారుటయు సవరించుచుఁ దన్ముఖంబున దృష్టినిరోధముగా వ్రేలాడుచున్న కేసరముల నెగదువ్వుచు నమ్మందిర దారువునకుఁ జేరఁబడి కౌతుకముతో నిట్లనియె.

కేయూరకా! నేను వచ్చిన తరువాత నయ్యంతఃపురమున యేమిజరిగినది? కాదంబరి యావాసరమెట్లుగడపినది? మహాశ్వేత యేమిజేసినది? మదలేఖ యేమిభావించినది? నన్నుగుఱించి యంతః పురకాంతలెల్ల నేమిజెప్పికొనిరి. సవిస్తరముగాఁ జెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

దేవా! వినుండు. దేవర యరిగినవెనుకఁ బరిజనముతోఁ గూడఁ గాదంబరి సౌధమెక్కి తురగఖరధూళిరేఖా థూసరమగు మీమార్గమాలోకించుచు మీరు తిరోహితులైనంత మదలేఖయొక్క బుజంబున శిరంబిడి ప్రీతిచే నాదిగంతమునే చూచుచుఁ బెద్దతడవందే యున్నది. తరువాత నతికష్టమున నామేడ దిగి యాస్థానమంటపమున క్షణకాలము గూర్చుండి యంతలో లేచి మీరు నివసించిన క్రీడా పర్వతమున కరిగినది.

అందుఁ బరిజనులు రాజకుమారుఁ డీలతా మంటపమున నీచలవఱాతఁ గూర్చుండెను. నీమణిశిలయందున స్నానముగావించెను. నిందునిందుధరు నారాధించె, నిందు భుజించె. నిందుశయనించె నని యెఱింగింపుచుండ నాయాచిహ్నముల విలోకింపుచు నాపగలు గడపినది. సాయంకాలమున మహాశ్వేత బలవంతముసేయ నెట్టకే నాశైలశిలాపట్టమున భుజించినది అంతలోఁ జంద్రోదయ మగుటయు శశికరంబులకుఁ గపోలములపైఁ గరంబు లడ్డము పెట్టుకొని కన్నులు మూసి యేదియో థ్యానించుచు క్షణకాలమందుండి యంతలో లేచి శయ్యాగృహమున కేగి పండుకొనినది.

అది మొదలు ప్రబలమగు శిరోవేదనయు దాహరూపంబగు జ్వరంబును బాధింప నేదియో వ్యాథిచేఁ గొట్టికొనుచు నెట్టకే నా రాత్రి వేగించినది. నేఁటియుదయంబు నన్నుఁజేరి మీసేమము దెలిసికొనుటకై సోపాలంబముగా మీకడకనిపినది. ఇదియే యక్కడి వాత౯లని యెఱింగించిన నాలించి రాజనందనుఁడు తొందరగానందుఁ బోఁ దలంచి గుఱ్ఱము గుఱ్ఱమని కేకపెట్టెను. అప్పు డశ్వరక్షకుఁడు జీను గట్టి యింద్రాయుధము నెదురఁబెట్టుటయు పత్రలేఖను వెనుకఁ గూర్చుండఁబెట్టుకొని వైశంపాయనుని స్కంధావారమున నుండ నియమించి వేరొక గుఱ్ఱమెక్కి కేయూరకుండు వెంటరా నాహయంబెక్కి యతిరయంబున నాహేమకూటమున కరిఁగి కాదంబరీ భవనద్వారంబున గుఱ్ఱమునుదిగి పత్రలేఖవెంట నడువ లోపలకుఁ బోవుచు నెదురుగా వచ్చుచున్న మఱియొక గంధర్వకుమారునిఁ గాదంబరి యెందున్నదని యడిగెను.

అతఁడు నమస్కరించుచు దేవా! క్రీడాపర్వతము క్రిందుభాగమునఁ గమలవనదీర్ఘికాతీరంబున రంచిపఁబడిన హిమగృహంబున వసించియున్నదని యెఱింగించెను. ఆమాటవిని కేయూరకుఁడు ముందు నడుచుచు మాగ౯ము దెలుపఁ బ్రమదవనము నడుమనుండి పోవుచు నందలి కదళీవన ప్రభలచే రవి కిరణంబులు పచ్చనగుట వింతగాఁ జూచుచు నవ్వనమధ్యంబున నళినీదళములచేఁ గప్పఁబడిన హిమసదనంబుచెంత కరిగెను.

సీ. లలితమృణాళదండములును బిసతంతు
               మయములై యొప్పుచామరలఁ బూని
   కదళీదళంబులు కమలినీ పత్రముల్
               బూలగుత్తులు ఛత్రములుగఁ బట్టి
   మలయజరసముతో మెలసి మర్దించిన
               కర్పూరధూళి పంకంబుదాల్చి
   తతకేతకీగర్భ దళదీపిత తమాల
               కిసలయ మాలికల్ కేలబూని

గీ. చెలులు శైత్యోపచారముల్సేయుచుండ
   హిమగృహంబునఁ బుష్పతల్పమునఁ బండుఁ
   కొని దురంత వియోగ వేదన దపించు
   చిత్రరధపుత్రిఁగాంచె నాక్షితిపసుతుఁడు

అంతకు ముందుగాఁబోయి తదాగమన మెఱింగించుచున్న పరిజనముతో ఆ! ఏమీ? నిజముగా నతండు వచ్చెనా? మీరు చూచితిరా? ఎంతదూరములో నున్నవాఁడని యడుగుచుండఁగనె యతండు గన్నులంబడుటయుఁ దెలిచూపులతనిపై వ్యాపింపఁజేయుచు జారిన యుత్తరీయాంశుకము హారమును నురంబున సవరించుచు నావిరిబోఁడి పూసెజ్జనుండి యట్టెలేచినది.

చంద్రాపీడుండును సమీపించి పూర్వమువలెనే మహాశ్వేతకుఁగాదంబరికి నమస్కారములు గావించెను. కాదంబరి ప్రతిప్రణామముగావించి యాపుష్పశఁయ్యయందుఁ గూర్చుండెను. అప్పుడు ప్రతిహారి జాంబూనదపీఠంబొండు దెచ్చి వైచుటయు నది కాలితో ద్రోసి చంద్రాపీడుండు వినయమభినయించుచు నేలయందేకూర్చుండెను.

అప్పుడు కేయూరకుఁడు దేవీ? ఈచిన్నది యీరాజకుమారుని తాంబూలకరండవాహిని. యీమెపేరు పత్రలేఖ. వీరికి మిక్కిలి యనుగ్రహధాత్రియని యెఱింగించెను. కాదంబరియు నాకన్యం జూచి యెహో? మానుషస్త్రీలయందుఁ బ్రజాపతికింత పక్షపాతమున్నదా? అని తద్రూపాతిశయమున కచ్చెరువందుచు నమస్కరింపుచున్న యాయన్నుమిన్నను రమ్మురమ్మని సాదరముగాఁ బిలుచుచుఁ దనవెనుక ప్రకంగూర్చుండఁ బెట్టుకొని పరిజనులెల్ల వెరగుపాటుతోఁ జూచుచుండఁ గరకిసలయమున స్పృశించుచుండెను.

చంద్రాపీడుండు నట్టి యవస్థ నున్నఁ గాదంబరిం జూచి అయ్యో? నాహృదయమింత మొద్దువారినదేమి? యిప్పుడుకూడ సందేహమే చెందుచున్నది. కానిమ్ము నేర్పుగా నడిగి తెలికొందునుగాక. అని తలంచి ప్రకాశముగా నిట్లనియె.

దేవీ! ఆవిళసంతాపతీవ్రంబగు నీవ్యాధి నీకెట్లు కలిగినది? భవదంగభవపరితాపంబు జూడ సత్యము జెప్పుచున్నాను. నీకంటె నన్నెక్కుడుగా బాధించుచున్నది. పెక్కేల? దేహమిచ్చియైననిన్ను స్వస్థురాలిగాఁ జేయఁదలచుకొంటి నిందులకు నాహృదయము మిక్కిలి తొందరపడుచున్నది. అయ్యయ్యో! మన్మథునికి శరీరభూతములగు నీభుజలతను సంతాపదృష్టులచే గందజేయుచుంటివి? అశ్రుబిందు పాతంబున ముక్తాభరణత్వము గలిగి య్పొప్పుచుంటివి. పరాహ౯ములగు మంగళప్రనాదముల వహింపుము. నవలత సకుసుమశిలీముఖయై శోభించునుగదా? అని యడిగిన విని కాదంబరి బాలయు స్వభావ మగ్ధయనై నను గందర్పునిచే నుపదేశింపబడిన ప్రజ్ఞచేఁ దద్వాక్యము లందలి శ్లేషాధ౯మును గ్రహించియు నేమియుఁబ్రత్యుత్తర మీయక యన్యాపదేశముగా మందహాసము గావించినది. అప్పుడు మదలేఖ రాజకుమారా! ఏమందును. ఈసుందరి సంతాపమకధనీయమై యున్నది. సుకుమారభావముతోఁ గూడిన యీచేడియ కేది సంతాపముగాకుండెడిది? పద్మినికి వెన్నెలయు నెండగా నుండుంగదా? కిసల యతాళవృంతమున విసరుకొనుచున్న యీపూఁబోడి మనోభవభేద మేమిటికి తెలిసికొనజాలవు? ఈమెకు ధీరత్వమే ప్రాణసంధారణ హేతువు అని ప్రత్యుత్తర మిచ్చుటయు నాయాలాపములే యతని మాటలకు సరిపడియున్నవని కాదంబరి హృదయంబునం దలంచినది.

చంద్రాపీడుండు నమ్మాటలయందుఁగూడ నధ౯ద్వయము గలిగియుండఁ బట్టి తన డెందంబున గలిగిన సందియము దీరమింజేసి పరిపరివిధంబులం దలంచుచుఁ బ్రీత్యుపచయచతురములు మధురాలాపగర్భములు నగు కథలచే మహాశ్వేతతోఁగూడఁ కొంత గాలక్షేపము జేసి యతిప్రయత్నముతో నామెను విడిచి స్కంధావారమునుఁ బోవుటకు బయలుదేరెను.

గుఱ్ఱమెక్కఁబోవు సమయంబున గేయూరకుం డరుదెంచి దేవా! మదలేఖ యిట్లు విజ్ఞాపన జేయుచున్నది. ప్రధమదశ౯న ప్రీతిచేఁ బత్రలేఖ నిందుంచి వెళ్ళమని కాదంబరి కోరుచున్నది. వెనుక నంపఁగలదు దేవర చిత్తమేమనవుఁడు రాజనందనుఁడు కేయూరకా! మాపత్రలేఖ ధన్యురాలు. దుర్లభమైన దేవీప్రసాదమునకుఁ బాత్రురాలగుచున్నది. అట్లే యుంచుకొండని పలుకుచుఁ నామెను విడిచి తురగ మెక్కి యతివేగముగా సేనా నివేశమునకుఁ బోయెను.

అంతకుముందు తండ్రియొద్దనుండివచ్చి యున్న లేఖావాహకుం జూచి యీరాజపుత్రుఁడు దూరమునందుండియే గురుతుపట్టి యోరీ! మహరాజు కుశలుఁడే అంబకు భద్రమా? రాష్ట్రమంతయు సుఖముగా యున్నదా? యని యడిగినవాఁడును వినమ్రుఁడై చిత్తము చిత్తమని పలుకుచుఁ దన చేతనున్న పత్రికాద్వయ మతని కందిచ్చెను. అతండా పత్రిక విప్పి యిట్లు చదివెను.

స్వస్తిశ్రీ మహారాజాధిరాజ! తారాపీడమహారాజ మార్తాండుఁడు శ్రీమంతుఁ జంద్రాపీడు నుత్తమాంగమున ముద్దిడుకొనుచు వ్రాయునది.

ప్రజలు సుఖులై యున్నవారు. నీవు దిగ్విజయ యాత్రకుఁబోయి చిరకాలమయినది. నిన్నుఁ జూచుటకు మాహృదయము మిక్కిలి యుత్కంఠ నొందుచున్నది. నీతల్లియు నంతఃపురకాంతలతోఁ గూడ గృశించియున్నది. యించుక జాగుసేయక యీపత్రికం జదివి ముగించిన సమయమే ప్రయాణకాలముగాఁ జేసికొని రావలయును.

శుకనాసుఁడు వ్రాసిన రెండవపత్రికలోఁగూడ నట్లేయున్నది. వైశంపాయనుఁడు సైతమట్టి యథ౯ముతోఁ దనకును వచ్చిన యుత్తరముల నతనికిఁ జూపెను.

అప్పుడు చంద్రాపీడుఁడు మిక్కిలి తొందరపడుచు వెంటనే ప్రయాణభేరి గొట్టింప నాజ్ఞాపించెను. మేఘనాథుఁడను సేనాధిపతినిజేరి యోరీ! నీవిందుండుము. ఇచ్చటికిఁ బత్రలేఖను గేయూరకుఁడు దీసికొని వచ్చును. దానితోఁగూడ నీవింటికి రమ్మనిపలికి వెండియు నిట్లనియె.

మానవజాతి దుష్ప్రకృతిగలది. నీయుపచారములన్నియు నాత్మార్పణముచేసి నీ యకారణసత్పలత గణింపక వాజ్మౌనసములకు భిన్నాధ౯త్వము గలుగజేసితి నని తలంచెదు కాబోలు. ఆస్థానమం దెక్కుడు దయఁజూపిన నీసాధుత్వ మెన్నటికేని మరువఁదగినదే? నా గుణముల నీయొద్ద మిక్కిలిగా స్తుతిజేసిన మహాశ్వేత నిప్పు డెత్తిపొడుచు చుందువని నా హృదయము మిక్కిలి సిగ్గుజెందుచున్నయది నే నేమి చేయుదును. తండ్రి యాజ్ఞ యెక్కుడుదిగదా! అది శరీరమాత్రమునకే యుపయోగించును. హేమకూట నివాసవ్యసనముగల నామనస్సు చేత జన్మాంతర సహస్రములయందు నీకు దాస్యము చేయుదునని బట్టము వ్రాసి యియ్యఁగలను.

ఇప్పుడు తండ్రియాజ్ఞ నుజ్జయినికిఁ బోవుచున్నవాఁడ. యీ కృతఘ్నునిఁ బరిజన ప్రసంగమునందైన స్మరింపుచుండవలయును. బ్రతికియుండిన నెప్పటికైన వెండియు దేవీ చరణారవింద వదన సుఖుంబనుభవించువాఁడ, మఱియు మహాశ్వేతా పదపద్మములకు శిరంబున మ్రొక్కువాఁడ మదలేఖ సేమమడిగితిని తమాలికనుఁ గౌఁగిలించు కొంటిని.

అని యిట్లుత్తరమువ్రాసి మడిచి యీ పత్రికం గేయూరకముఖముగాఁ గాదంబరి కందింపుమని మేఘనాథునితోఁ జెప్పుచు, వైశంపాయనుని స్కంథావారముతో మెల్లగా రమ్మని నియమించి తానతి జనంబున నింద్రాయుధ మెక్కి వారువపురౌతులు సేవింప కతిపయ ప్రయాణముల నుజ్జయినికిఁ బోయెను.

ఆకస్మికముగా నతండు వచ్చుటచేఁ బౌరులు సంభ్రాంతులై సంతసించుచు నెదురువచ్చి నమస్కరింపుచుండఁ గైకొనుచు నతం డతర్కితుండై రాజనగరిఁ బ్రవేశించెను.

అప్పుడు ద్వారపాలు రతని వాత౯ఱేనికి సహమహమికఁగాఁ బోయిచెప్పిరి. యీ వృత్తాంతము విని తారాపీడుఁడు పట్టరాని సంతోషముతో నతనికిఁ గొంతదూర మెదురేగెను.

చంద్రాపీడుఁడును దూరమునందే తండ్రిం జూచి తురగమును దిగి యతని పాదంబుల సాష్టాంగముగా బడిఁ నమస్కరించెను.

అతండు పుత్రకుని గ్రుచ్చియెత్తి గాఢముగా గౌఁగలించుకొనుచు నప్పుడే విలాసవతీ భవనమునకుఁ దీసికొనిపోయెను.

ఆమెయుఁ బుత్రునింజూచి యపార సంతోషముతో వదనము వికసింప నాలింగనము చేసుకొని యాత్రామంగళములు దీర్చుచు దిగ్విజయ యాత్రా సంబద్ధములగు కథలచేఁ బెద్దతడవందుంచుకొనియెను.

చంద్రాపీడుఁడు పిమ్మట శుకనాసున యింటికిఁబోయి వైశంపాయనుండు స్కంథావారముతో వచ్చుచున్నాడని చెప్పి, మనోరమకుఁ,బ్రీతి గలుగఁజేసి యాదివసమంతయుఁ తల్లియొద్దనేయుండి మరునాఁడు తనదగు కుమారభవనమునకుఁ బోయెను.

అతి మనోహరమగు నమ్మందిరము కాదంబరీ వియోగ చింతా సంతాపంబునఁ దొట్రుపడుచున్న యక్కుమారుని హృదయమునకు శూన్యంబువలె దోచినది.

అట్టి పరితాపముతో నతండు గొన్నిదినములు గడిపినంత నొకనాఁడు మేఘ నాధునితోఁ గూడ పత్రలేఖ హేమకూటము నుండి వచ్చుటయు దూరమునంద చూచి మోము వికసింప నమస్కరింపుచున్న దాని గ్రుచ్చియెత్తి మిక్కిలి గారవింపుచు నించుబోణి! కాదంబరీ మహాశ్వేతలు సుఖులేకదా యని యడిగిన నప్పడఁతియు వారి యనామయము జెప్పి, వెండియుం గాదంబరి తమసేమ మడిగినదని వక్కాణించెను. అప్పు డతఁడయ్యింతి చేయి బట్టుకొని యభ్యంతర మందిరమునకుఁ బోయి యందు స్థలకమలినీ పలాశచ్ఛాయచేఁ జల్లనై యున్న మరకత శిలామంటపమున నిద్రించు మరాళమిథునమును దోలి యందు గూర్చుండి యల్లన దానితో నిట్లనియె.

పత్రలేఖా! నేను వచ్చిన తరువాత నచ్చట జరిగిన విశేషము లెట్టివి? నీవందెన్నిదినము లుంటివి? నిన్నెట్లు చూచినది? యేమేమి గోష్ఠివచ్చినది? కాదంబరి నామాట యెప్పుడైన స్మరించినదా? యని యడిగిన నబ్బోటి దేవా! దేవర వచ్చిన తరువాత నందు జరిగిన విశేషములం జెప్పెద దత్తావధానులై వినుండని యిట్లనియె.

మీరల్ల నాఁడుదయంబునఁగదా! అఱిగితిరి. మీరు వెళ్ళిన గొంతసేపటికి కాదంబరి పరిజనుల విడిచి నన్ను బాలోద్యానవనమునకుఁ దీసికొనిపోయి అందుమరకత సోపానములచే దీపించు ప్రమదవన వేదికయందు మణిస్థంభమూతగాఁ గూర్చుండి ముహూత౯కాల మూరకొని యెద్దియో పలుక నిశ్చయించి రెప్పవేయక పెద్దతడవు నా మొగము చూచినది.

అప్పుడు నేనామె యభిప్రాయము గ్రహించి, అయ్యో! తొయ్యలీ! భయపడియెదవేల? యెద్దియేని జెప్పవలసియున్నఁ జెప్పుము. నన్నన్యఁగా దలంపకు మని పలికిన విని యక్కలికి పాదాంగుష్ఠంబున నేల వ్రాయుచు మాటిమాటికి నలుమూలలు సూచుచు జెప్పఁదలఁచుకొనియు సిగ్గుపెంపునఁ గంఠము గద్గదికబూన నెలుంగు రాక యూరకొని తలవంచి కన్నులనుండి ప్రవాహంబుగా నీరు గార్చినది.

మఱియు నేను పలుమారు మగువా? నీకిది తగునా? కారణ మెద్దియో చెప్పుము. ఊరక కన్నీరు నించెదవేలనని యడుగగా నతి ప్రయత్నముతోఁ గన్నీరు దుడిచికొనుచు వక్తవ్యాంశమును నఖ శిఖరములచేఁ గేతకీదళములఁ వ్రాసి యంతలో జించివైచి తెగువమై సిగ్గుదిగద్రోచి తలయెత్తి యత్తన్వి సారెసారెకుఁ గన్నులప్పళించుచు నా కిట్లనియె.

సఖీ! పత్రలేఖా! నిన్నుఁ జూచినదిమొదలు నా హృదయము వయస్యలందరికన్న నీయందు విశ్వాసము గలిగియున్నది. కారణ మేమియో తెలియదు. బోఁటీ! నాపరిభవ మెవ్వరితోఁ జెప్పుకొందును? నా దుఃఖము పంచుకొని యనుభవించువారెవ్వరు? ఇప్పుడు నా ప్రాణసంకట మెఱిగింప నీకన్న నాకాప్తులు గనంబడలేదు. కాంతా! నాసంతాపమంతయు నీ కెఱింగించి జీవితము విడుచుచున్నదాన, నిష్కళంకమైన కులము కలంకపరచి కులక్రమాగతమగు సిబ్బితి మబ్బుచేసి సామాన్యకన్యవలె నాబోటి బోఁటి చిత్త చాంచల్యమందఁ దగినదా! అన్నన్నా! అనాధవలె నీచవలెఁ బలాత్కారముగాఁ జంద్రాపీడుని కారణంబున నిందాపాత్రురాలనయితినే! అయ్యో! గొప్పవారికిట్లు చేయుట దగునేమో చెప్పుము. పరిచయమున కిదియా ఫలము అభినవబిస సుకుమారమగు నామనం బతండిట్లు పరిభవింప వచ్చునా? కటకటా! యూనులకుఁ గుమారికాజనము పరిభవింపఁ దగినదే? సఖీ! నాహృదయము దహించుచున్నది. ఇఁక నేను బ్రతుకజాలను. జన్మాంతరమందైన నీసాంగత్యమే కోరుచున్నదాన. నీవంటి వయస్య నాకులేదు. నాకళంకమును ప్రాణపరిత్యాగ ప్రాయశ్చిత్తంబునఁ గడిగికొనియెదనని పలికి యూరకుండెను.

అప్పుడు నేనవ్విధమేమియు నెఱుఁగమింజేసి మిక్కిలి భయపడుచు విషాదముగా నిట్లంటి.

దేవీ! చంద్రాపీడుఁడేమి యపరాధము జేసెను? కుసుమ కోమలమగు నీమనంబు నేయవినయమున ఖేదపెట్టెను? వినుటకిచ్చ యించుచున్నదాన వడిగాఁజెప్పుము? విని మొదట నేను మేనుబాసిన తరువాత నీవు జీవితము విడుతువుగాక యని యడిగిన నత్తరుణి యిట్లనియె.

బోఁటీ! వినుము. ఆధూర్తుండు కలలో వచ్చివచ్చి శుకశారికలచే రహస్యసందేశముల నంపుచుండెను. వ్యధ౯మనోరధ మోహితుండై నిజానురాగంబునంబోలె నాచరణముల నలక్తకరసంబున రజింపఁజేయును. గపోలస్వేదమును ముఖమారుతమునఁ బోగొట్టు చుండును. ఉపవనంబున నేనొంటిగాఁ గ్రుమ్మరుచు గ్రహణ భయంబునఁ బారిపోవ నడ్డమువచ్చి బిగ్గరగా గౌఁగలించును. స్తనతటంబునఁ బ్నత్రరచనలు చేయును. కచగ్రహణముచేసి సురాగండూషములఁ బలుమారు నాముఖంబున నిడుచుండెను.

పత్రలేఖా! ఆ నిశ్చేతను నేనెట్లు పట్టుకొందునో చెప్పుము. అనుటయు నేనామె మాటలు విని చిత్తంబున అన్నా! యీ చిన్నది చంద్రాపీడుని గురించి మన్మధునిచే మిక్కిలి దూరముగా నావషి౯ంపఁబడినది. "నిక్క మీ చక్కెరబొమ్మ మూలమున నతండును పుష్ప కోదండుని బాగింబడియుండెను."

అని మనంబునఁ దలంచుచు యువతీ! నీవిధమెఱింగితిని కోపము విడువుము. కామాపరాధంబున మాచంద్రాపీడుని నిందింపకుము. ఈ చేష్టలన్నియు శకుండగు మన్మధునిచే కాని మాదేవరవికావు. అని పలికిన నక్కలికి సంతసించుచు మోమెత్తి యిట్లనియె.

కామినీ! కాముఁడన నెవ్వఁడు? వాని రూపమెట్టిది? వానిచేష్ట లెట్టివో! చెప్పుమన నేను తరుణీ! వానికి రూపములేదు. శరీరము లేకయే దహింపఁగలఁడు. జ్వాలావళిజూపకయే సంతాపము గలుగఁజేయును. పొగ లేకయే కన్నీరు పుట్టించును. అట్టి భూతమీ భువన త్రయంబునను లేదు. ఎట్టి ధైర్యముగలవారినైన బారింబడిరేని వేధింపక మానఁడు. మఱియు నతనిచేత నావేశింపఁబడిన స్త్రీలకు గగన మంతయు ప్రియుని ముఖచంద్రులుగానే తోచుచుండును. భూమియంతయు దయితాకారములే కనంబడును. వారిచర్యలు కడు విపరీతములుగా నుండునని పలికిన విని యత్తన్వి శిరఃకంపము చేయుచు నాకిట్లనియె.

పత్రలేఖా! నీవిప్పు డెట్లు చెప్పితివో మన్మథుఁడు నన్నట్లు వేపుచున్నవాఁడు. నీవు నాకుఁ బ్రాణమువంటిదానవు కావున నడుగుచుంటిని. ఇప్పుడు నేనేమిచేయఁదగినదో చెప్పుము? ఇంతకుమున్నిట్టి వృత్తాంతము లేమియు నేనెఱుంగను. ఎవ్వరికినిఁ జెప్పరానియిట్టి కష్టములఁ బడుటకంటె మృతినొందుటయే మేలని నాహృదయంబునఁ దోచుచున్నదేమి? చెప్పుమని యడుగగా నేనిట్లంటి.

దేవీ! వలదు వలదు అకారణమరణముతో నీకేమి? ఆరాధింపకయే ప్రసన్నుఁడగు మన్మధుఁడే నీకార్యము జక్కపెట్టును. స్వయంవర విధులచేఁ బతులవరించిన సతుల నెందరం జెప్పను. నీమనంబునం బుట్టినతలంపు అనధ౯మైనదికాదు. శాస్త్రసమ్మతమైనది. దేవీ! మరణోద్యోగమును విడువుము. నీపాదములతోడు వేగ పోయి యాతనిం దీసికొనివచ్చెదను. నన్నుఁ బంపుమని పలికిన విని యక్కలికి ప్రీతిద్రవార్దములగు చూపులచేఁ నన్ను జూడుచు సిగ్గు విడిచి యుత్తరీయము సవరించుచు మెడనుండి ముక్తాహారమును దీసి చేతం బూని ప్రహష౯వివశయై యిట్లనియె.

నాతీ! నీప్రీతి నేనెఱుంగుదును. శిరీషమృదుప్రకృతిగల కన్యకాజనమునకుఁ బ్రగల్భవాక్యము లెట్లువచ్చును. ఇప్పుడు నేనేమని చెప్పవలయునో నాకుఁ దెలియదు. నీవు నాకతిప్రియుండ వైతివంటినేని పునరుక్తిదోషముకదా. నాకు నీయం దనురాగ మెక్కుడనిఁన వేశ్యాలాపమగును. నీవు లేక నేను జీవింపనన ననుభవవిరోథము. నన్ను మన్మధుఁడు ఫీడించుచున్నవాఁడనిన నాత్మదోషోపాలంభము నన్ను బలత్కారముగా వారించితివనిన బంధకీధాష్ట్యము తప్పక రావలయుననిన సౌభాగ్యగర్వమగును నేనవచ్చుచున్నదాన వంటి నేని స్త్రీచాపల్యముగదా అనన్యరక్తసన స్వభక్తినివేదన లాఘవ దోషమువచ్చును. మదీయ మరణంబున నాకు నీయందుఁగల ప్రీతినిఁ దెలిసికొనఁగలవు. అనినసంభావము గదా!*[1] (ఇంతవరకు కాదంబరీ పూర్వభాగము. ఇంతవరకే బాణకవి కవిత్వము.)

కావున నేమన్నను దోషమే కనంబడుచున్నది. నాఁడు అంబరంబునఁ గళానిధిజ్య్నోత్స్నావితా నంబున దెసల వెదజల్లుచుఁ బ్రకాశింపుచుండఁ గ్రీడాపర్వత కనితంబంబు నందలి కాసారతటంబున శిలాపట్టణమునఁ బ్రకాశించు హిమగృహంబునఁ బుష్పశయ్యయందుఁ బండికొని యక్కుమారునిచేఁ జూడఁబడితిని. ఱెండుసారులువచ్చినా యపస్థయంతయుం జూచి యుపేక్షజేసిపోయెనే? ప్రియసఖీ! నీతో నేమందును? కూర్చున్నను, దిరుగుచున్నను, నిద్రించుచున్నను, మేల్కోన్నను, రాత్రింబగలాశ్రీమంటపమున నాయుద్యానవనమున నాలీలాదిఘి౯కయందుఁ గ్రీడాపర్వతమందా కుమారునిఁ జూచుచునే యుంటి నామాటయే నీకుఁ జెప్పుచుంటిఁ దదానయనకథతో నిఁకఁ జాలు. ఎక్కడిరాక. అని పలికి యక్కలికి శోకవేగంబున భుజలతల యందు శిరము వంచి మూర్ఛవోయినది వోలెనూరకున్నది.

నేనామాట వీని ఆహా! వియోగులు జీవించుట కష్టము గదా? సంకల్పమయుండగు ప్రియుండు గులాంగనల బాధించును. సంకల్పక్రీడలతోఁ బొద్దుపుత్తురు. అని నేను దలంచుచుండఁగనే సూర్యాస్తమయమైనది. అప్పుడు బాలికలు పెక్కండ్రువచ్చి వింత వింతగాఁ దీపములు వెలిగించిరి. నేనామెం జూచి దేవీ! నీవు

 ఇంతవరకు రచించి బాణకవి “స్వర్గస్దుడయ్యెను. తరువాత జివరకు నతని కుమారుడు రచించెను. 

దుఃఖింపకుము. నేను వేగమపోయి యారాజకుమారునిఁ దీసికొని వచ్చెదనని పలికినంత భవదీయ నామసంకీత౯నముచేత విషాపహరణ మంత్రంబున సర్పదష్టుండువోలె గన్నులందెరచి స్పృహతో నన్నుఁ జూచుచు నెవ్వరక్కడనని బరిజనమును బిలిచినది అప్పుడు పెక్కండ్రు జవరాండ్రు ఏమియాజ్ఞ అని పరిగెత్తుకొని వచ్చిరి. వారియందుఁ జూపుల వ్యాపింపఁజేయుచు మరకతశిలాతలమున గూర్చుండి నాకిట్లనియె.

పత్రలేఖా! ఇది ప్రియమని చెప్పుట కాదు. నీరాక జూచుచుఁ బ్రాణముల ధరించియుండెదను. శీఘ్రముగాఁగార్యము సాధించుకొని రమ్మని పలుకుచు నాహారము నామెడలోవైచి తాంబూలాంబరా భరణాదు లొసంగి నన్నుఁ బంపినది. అని చెప్ప పత్రలేఖ యించుక తల వంచుకొని వెండియు నిట్లనియె.

దేవ! సూతనమగు కాదంబరీ ప్రసాదాతిశయంబునం గలిగిన ప్రాగల్భ్యముచేత దుఃఖించుచు విజ్ఞాపన జేయుచున్నదాన. దేవరకు సైతమట్టి యవస్థలోనున్న గంధర్వరాజపుత్రిక నుపేక్షించి వచ్చుట యుచితముకాదు. ఆసన్నవత్సలులగు మీరు తగనికార్యము జేసితిరి. అని యాక్షేపించుటయుఁ జంద్రాపీడుఁడు లలితమైనను బ్రౌఢమైన తదాలాప మాలించి రెప్పవేయక ఇంచుక యాలోచించి బాష్పోపప్రుత నేత్రుఁడై స్వభావధీరుండైనను వ్యాకుల చిత్తుండై బాష్పవిక్షేపంబునం వ్యాకులమైన యక్షరములు గలుగునట్టుగాఁ బెద్ద యెలుంగున నిట్లనియె.

పత్రలేఖా! నేనేమిజేయుదును? శృంగారలీలల నుపదేశించెడు చెడుగు సచ్చవిల్తునమూలమున నామచ్చెకంటి తన హృదయంబునఁ బొడమిన వికారముల నాకుఁ దెల్లముగా నివేదించినది కాదు. దేవతా స్త్రీలయొక్క రూపానురూప లీలా సంభావనాధుల దృష్ట పూర్వము లగుట నదియంతయు సహజానురాగ మేమో యని సందేహడోలిక యెక్కి యూగుచు నాప్రోయాలి విరహాగ్ని పాలుసేసి నీచే నిట్లు నిందింపఁబడితిని.

మఱియు నాకీ మనోవ్యామోహము గలుగుట శాపదోష మేమో యని యాలోచించుచుంటిని. కానిచో నాచిన్నది యతిస్ఫుటముగా నదనచిహ్నములఁ బ్రకటింపుచుండ నే నెందులకుఁ దెలిసి కొనలేక పోయితిని. నాబుద్ధి సురిగిపోయినది. పోనిమ్ము స్మితావలోకన లీలావిశేషము లతి సూక్ష్మములగుటఁ దెలిసికొనుట కష్టము. మరియొక కారణము వలనం బుట్టుచుండును.

చిరకాలమునుండి తన కంఠమందున్న రత్నహారము నూరక నా మెడయందువైచునా? అప్పుడైనం దెలిసికొనరాదా? అదియునుం గాక హిమగృహక వృత్తాంతము నీవుగూడఁ జూచినదేగదా! అప్పుడైనఁ బ్రణయకోపమునం గాబోలు శ్లేషగానే పలికినది కాని స్పష్టముగాఁ జెప్పినదికాదు. అదియంతయు నామెదోషమే కాని నాదికాదు.

పత్రలేఖా! ఇప్పుడు గతమునకు వగచినఁ బ్రయోజనము లేదు. నా హృదయ మెట్లామెకుఁ దెలియునో యట్లు ప్రవతి౯ంచువాఁడ నన పలుకుచుండఁగనే ప్రతిహారి జనుదెంచి నమస్కరించుచు, దేవా! విలాసవతీ! మహాదేవి పత్రలేఖతోఁగూడ మిమ్ము రమ్మని యాజ్ఞాపించుచున్నది. పత్రలేఖ దేశాంతరమునుండి వచ్చినదని విన్నదఁట వేగరండని విన్నవించుటయుఁ జంద్రాపీడుఁడామాటవిని అయ్యో! నాజీవితము సందేహడోల యెక్కి యూగుచున్నది. నాతల్లి నిమిషమైన నన్నుఁ జూడకుండలేదు.కాదంబరి యవస్థ పత్రలేఖ యెఱింగించినది. జననీ స్నేహమా జన్మక్రమాహితమగుట బలమైనది.

పితృశుశ్రూషయు నట్టిదే. గంధర్వ రాజసుతానురాగ మంతకన్న బలమైనది. జన్మభూమి విడువందగినదికాదు. కాదంబరియుఁ బరిగ్రహింపఁదగినది. ఇప్పుడేమి చేయుదును? అని యాలోచించుచుఁ బత్రలేఖ చేయిపట్టుకొని తల్లియొద్దకుఁ బోయెను.

విలాసవతియు వారిం గారవించి మీరు నిత్యమొక్కసారి యెప్పుడో వచ్చి నాకన్నులం బడుచుండవలయు లేనిచో నేనోపఁజాలనని పలుకుచు నాదివసమెల్లఁ దనయొద్ద నుంచుకొని యంపినది. చంద్రాపీడుఁడది మొదలు కాదంబరీ విరహవేదనాకులుండై మదనాగ్నిచే బాధింపఁబడును శుష్కించిపోవు గడియయొక్క యేఁడుగా గొన్నిదివసములు గడిపెను.

మఱియొకనాఁ డతండు పత్రలేఖవెంట రాఁ బాదచారియై బాహ్యోద్యానవనంబున కరిగి యందు విహరింపుచుండఁ గొండొక దూరములో విచిత్రగమనంబుల వారువములు నడిపించుచు వచ్చు చున్న యొకరౌతు నేత్రపర్వము గావించుటయు నతం డెవ్వఁడో చూచి రమ్మని యొకపరిచారకు నంపి తద్వాత౯ నరయుటకై యెదురు చూచుచుఁ బత్రలేఖా! అతఁడు గేయూరకుఁడువలెఁ గనంబడుచున్నాడు. చూడుమని పలుకుచుండఁగనే యతం డచ్చట కరుదెంచి గుఱ్ఱమును డిగ్గనురికి రాజపుత్రునికి నమస్కరించెను.

చంద్రాపీడుఁడు ప్రీతిచేఁ జేతులు సాచి రమ్ము రమ్ము. అని పలుకుచు నతని గాఢాలింగనము జేసికొని కేయూరకా! నీదశ౯నముచేతనే కాదంబరి సేమముగా నున్నదని తెలియఁబడుచున్నది. నీయాగమనకారణము విశ్రాంతి వహించి యెఱింగింతువు గాక అని పలుకుచుఁ బత్రలేఖా కేయూరకులతోఁ గూడ నొక యేనుఁగనెక్కి నిజభవనంబునకుం బోయెను.

లోపలి కెవ్వరిని రానీయవలదని ద్వారాపాలురకు నియమించి పత్రలేఖా కేయూరకులతోఁగూడ గృహారామము లోనికిం బోయి యందున్న పరిజనులఁ దూరముగా బొమ్మని రాజపుత్రుండు కేయూ రకుని కిట్లనియె. గంధర్వపుత్రా! కాదంబరియొక్కయు మహాశ్వేతయొక్కయు మదలేఖయొక్కయు సందేశ మేమియో యెఱుంగఁ జెప్పుమని యడిగిన నతం డిట్లనియె..

రాజపుత్ర! అచ్చటి విశేషములు వినుము? బత్రలేఖను దీసికొనివచ్చి మేఘనాధుని కప్పగించి తిరుగాఁపోయి దేవరయొక్క యుజ్జయినీ గమసవృత్తాంతము చెప్పి మీయుత్తరము చేతికిచ్చితిని. అది చదివి మహాశ్వేత తలయెత్తి యెద్దియో యాలోచించి నిట్టూర్పు నిగుడించుచు విచారముతో లేచి తపంబుజేయుటకై వెండియుం దన యాశ్రమమునకుఁ బోయినది.

కాదంబరియు నీవాత౯ విని హృదయము బాదుకొనుచు నెత్తి మోదుకొనుచు మూర్ఛ మునింగి నేలంబడి యంతలో లేచిమహాశ్వేత యఱిగిన విధమెఱుఁగక కన్నులం దెరచి శిరఁకంపముచేయుచుఁ గేయూరకా! యీసంగతి మహాశ్వేతతోఁ జెప్పుమనియు మదలేఖా! చంద్రాపీడుఁ డెట్టి పని చేసెనో చూచితివే! యిట్టివాఁ డెందేనిం గలడా యనియు సోపహాసముగాఁ బలుకుచు లేచి పరిజనుల విడిచి యొక్కతియ యేకాంతగృహమునకుఁ బోయి తల్పంబున మేను జేర్చి ముసుఁగువైచుకొని మదలేఖతో సైతము మాటాడక తత్పరితాపము లోపలనే యనుభవింపుచు నాదినము గడపినది.

అమ్మరునాఁడుదయమున నే నామె సమీపమున కేగినంత ఆహా! మీయట్టి యాప్తులు గలిగియున్నను, నేనిట్టి యుత్కృష్టకష్టములం జెందుచుంటినేయని యాక్షేపించునదియుంబోలెఁ బాష్పపూరోద్రేకముచేఁ బర్యాకుల మగు దృష్టిచే నన్నట్టెచూచినది.

ఆచూపులవలననే తదీయహృదయాభిప్రాయము గ్రహించి యామెతోఁజెప్పకయే దేవరం జూడవచ్చితిని. మీనిమిత్తమాత్త కాశిని మిక్కిలి బాధపడుచున్నది. ఆమె పడెడు నిడుములఁ జెప్పనలవి కాదు. అబలాజనముయొక్క హృదయము మృదువైనను ముక్తాఫలత్వము నొందిన జలమువలె నుత్కంఠితమయి కఠినమగునని తలంచెదను. కానిచో నామెచిత్త మెన్ని వ్యసనములు జెందినను నశింపకున్నది. ఆహా! స్త్రీలకు వల్లభసమాగమాశ దురంతమయినదికాదా! అట్టి కష్టములతోడ నయిన బ్రాణముల ధరించియున్నది.

రాజకుమారా! అత్యుత్కటమైన యాకలకంటి యుత్కంఠ నీతో నేమి చెప్పుదును? ఏయుపాయంబునఁ బ్రదశి౯ంతును? దేనితోఁ బోల్చి చెప్పుదును? ఆమె తాపంబు ప్రచండ దినకర సహశ్రాతపమును మించియున్నది. శయనముగా వేఁయబడిన పద్మపత్రము లెండిచూణ౯ములై పోవుచున్నది. కామునిచే మధింపఁబడు నా యా చేష్టలం జేయుచున్నది. వినుండు మదనవేదన సహింపఁజాలక పరితపించుచుండి సఖులు కుసుమశయనంబునఁ బరుండఁబెట్టి కిసలయ తాళవృంతముల వీచుచు సంతాపముచేఁ జూణ౯మైన యలక్తకరసంబున నెఱ్ఱఁబడిన శయనకుసుమంబులం జూచి కుసుమశర ప్రహార జనిత రక్తమని యడలుచుందురు. మీపేరు తలపెట్టినంత మేనఁగవచమువలె రోమాంఛము వహించును. ఆమె యవస్థయంతయుం జెప్పుటకుఁ బది దినములు పట్టును. పెక్కులేలా? అక్కడి కథలన్నియుఁ ద్వదాలాపముఖరితములై యున్నవని యెఱింగించుటయుఁ జంద్రాపీడుఁడు కేయూరకా! చాలు చాలు. పైనఁ జెప్పకుము. వినలేకున్నానని పలుకుచుఁ గన్నులు మూసికొని మూర్ఛయావేశింపఁ గాదంబరిని ధ్యానించుచున్నవాఁడుం బోలె. ముహూత౯కాలము మేనెఱుంగక యంతలో దెలిసిగద్గదాక్షరముగా నతని కిట్లనియె.

కేయూరక! పత్రలేఖవలననే కాదంబరీ సంతాపమంతయుఁ దెలిసినది. నేనేమి చేయుదును? కాదంబరియొక్క యాజ్ఞనే నిందింపుము. అధరస్పందమాత్రముననే నియోగములను జేయుచున్న నా విషయమై యిన్నిచిక్కులు పడనేమిటికో విచారింపుము. ఆయువతి లజ్జావతి యైనచో బరిజనమున కంతఁ వ్యామోహమేల? ఆలలనకు మదలేఖ రెండవ హృదయముకదా! తన్ముఖంబున నయినఁ దెలుప రాదా.

అన్నన్నా! నిష్కారణము అమ్మదవతి మదనునిచేఁ బ్రాణసంకటము నొందుచున్నదే! ఇది యాముదితకుఁ బ్రారబ్ధముగాఁ దలంచెదను. కానిచో నేనశ్వముఖానుసారముగా దేవభూమి కెట్లుపోవుదును? పోయియు మహాశ్వేత నెట్లు కాంతును? కనియు మరలక హేమకూటమేటికిఁ బోవుదును? పోయియుఁ గాదంబరి జూడనేల? చూచియు వితర్కింపక వ్యధ౯మనోరధుండనై యింత దూర మేల వత్తును? ఇదియంతయు దైవహతకుని కపటముకాని మఱియొకటి కాదు. కావున వేగమ పోయి యాయింతి నోదార్చుటకు యత్నింప వలయునని పలుకుచుండగా మార్తాండుం డపరగిరిశిఖర మధిష్టించి కిరణ సహస్రముపసంహరించుకొనియెను.

అప్పుడు చంద్రాపీడుఁడు గేయూరకునితోఁగూడ దనమేడకుఁబోయి కాల్యకరణీయములం దీర్చి చంద్రోదయ సమయంబునఁ జంద్రమణి శిలాతలంబున శయనించి కేయూరకుఁడడుగు లొత్తుచుండ నతనితోఁ గేయూరకా! మనము పోవువరకుఁ గాదంబరి ప్రాణంబుల దాల్చియుండునా? మదలేఖ యామెనోదార్చుచుండదు? మహాశ్వేత తద్వృత్తాంతమువిని వచ్చి ధైర్యము గరపకుండునా? హరిణ శోబకాయతేక్షణమగు నమ్మగువ నెమ్మోము గ్రమ్మరఁజూడఁగలుగునా? యని యడుగ నతండు దేవా! ధైర్యమవలంబింపుము వెరవకుము వేగమ గమనయత్నము చేయుమని బలికెను.

అప్పు డతం డాత్మగతంబున అయ్యో! ఇప్పుడు మాతల్లి దండ్రుల కెఱింగింపక పోయితినేని వారు పుత్రశోకంబునం గుందుచు నన్నరయుట కై వెడలి పుడమియంతయుఁ ద్రవ్వుదురె. అట్టివారిం గష్ట పెట్టుట నాకేమి శ్రేయము? పోకున్నఁ గాదంబరి ప్రాణత్యాగము చేయును. ఱెండు విధంబులచేతఁ బ్రత్యవాయమే తోచుచున్నది యేమిచేయుదును? ఎవ్వరితోఁ చెప్పుదును? ప్రాణతుల్యుండగు వైశంపాయనుం డైన దావునలేడే? యని యనేకప్రకారములఁ దలపోయుచు నారాత్రి నెట్ట కేలకుగడిపెను.

అతండు మరునాఁడుదయంబున లేచి స్కంధావారము సమీపమునకు వచ్చియున్నదను మాట వినియెను. అప్పుడు మిక్కిలి సంతసించుచు గేయూరకా! మనకార్యసిద్ధి హస్తగతమయినదానిగా భావింపుము. నాబ్రాణమిత్రుఁడు వైశంపాయనుఁడు వచ్చుచున్న వాఁడని పలికెను.

పిమ్మట గేయూరకుఁడు ఆరాజకుమారుని మ్రొక్కుచు దేవ! దేవర వైశంపాయనుఁడు వచ్చువరకుఁ గాలక్షేపము చేయఁదగియే యున్నది. అచ్చటిసంగతి మీకు విశదపరచితినికదా! దేవర తత్సందే తాపము గ్రహించితిరి. కావున నన్ను ముందు బంపుఁడు. నేను బోయి భవదీయ వృత్తాంతమంతయు నాకాంత కెఱింగించి జీవన ధారణోపాయ మాకలించెద. మీవాతా౯శ్రవణమూతగాఁబూని యానెలంతఁ బ్రాణములు థరించు ననుగ్రహింపుఁ డని పలుకగా విని యారాజనందనుండు వెనుకగూర్చునియున్న పత్రలేఖం జూచు మేఘనాధుఁ డెక్కడనని యడిగెను.

అంతలో మేఘనాథుం డెదుర నిలఁబడుటయు నతనిం జూచి యోరీ! నీవు వెనుక పత్రలేఖం దీసికొనివచ్చుట కెందుంటివో యిప్పు డచ్చటకీ పత్రలేఖం దీసికొని కేయూరకునితోఁగూడ ముందుగాఁ బొమ్ము. నేనును వైశంపాయనునితో మాట్లాడి వెనుక వచ్చెద! నని నియమించి కేయూరకా! నీవు కాదంబరీ సణదేశమునాకుఁ దీసికొని రాలేదు. నేనే నీచేత నామెకు సందేశము పంపుచుంటిని. అళీకమగు సిగ్గుయొక్క భారమును వహించుటచే నిన్నాయాసపెట్టుచున్నాను. అని దేవితో విజ్ఞాపన చేయుము. తక్కినసంగతులన్నియుఁ బత్రలేఖ యెఱిగింపఁగలదు. అని పలుకుచు నమంగళశంకచే నశ్రుజలంబు నరికట్ట యత్నించుటయు నాపలేక కన్నీరు గార్చుచుఁ దన పాదంబులకు నమస్కరింపుచున్న పత్రలేఖ దిక్కు మొగంబై యంజలి పట్టి యిట్లనియె.

పత్రలేఖా! ఈయంజలితో మత్సిరప్రణామము లర్పించి కాదంబరి కిట్లు విజ్ఞాపనజేయుము. దయగలదగుట ప్రధమదశ౯నమందే యనుగ్రహాతిశయమును జూపిన యాపెను నమస్కారముచేతనైన గౌరవింపక విడిచివచ్చిన కృతఘ్నుండ నగు నాసుగుణ మేదిజూపి తిరుగాఁ బరిగ్రహింపు మని ప్రార్ధింతును. ఆమెమాత్ర మెట్లంగీకరించును? ప్రకృతిపేశలమగు నామె హృదయమపహరించి వెళ్ళ లేదనియా? ప్రాణసంకటమగు నవస్థ జూచియు నుపేక్షచేయలేదనియా? సర్వదోషాశ్రయుఁడనైనను బలుమారామె పాదసేవ జేసితిననియా? సర్వగుణహీనుండనైనను నామె సుగుణంబులే నన్నవలంబించు నని యాసగలిగి యుంటిని. పాదపతితుండ నగు నన్ను దద్వాత్సల్యము భయపెట్టఁదని తలంతును. సిగ్గులేనివాఁడనై తిరుగా నామె మొగంబు జూచుటకు యత్నించుట తత్సుగుణంబులే కారణములు. ఆమె సెలవులేకయే దూరముగా వచ్చిన నన్ను బలాత్కారముగాఁ దత్సుగుణములే వెండియు నామె పాదమూలమును జేర్చు చున్నవి. ఇష్టములేని గమనాజ్ఞాచే వెడలిపోయితినని యేవాక్కుచే విజ్ఞాపనజేసికొనుచుంటినో? ఆవాక్కే నీకిట్లు చెప్పుచున్నది. ఇటుపైన మదాగమన మెట్లు వ్యధ౯ముగాదో జగమెట్లు శూన్యముగాదో యట్లు దేవి యాత్మనిలుపుకొనుట కాత్మచేతనే యత్నముచేయ వలయును. అని చెప్పుమని చెప్పి వెండియు నతండు ప్రియసఖీ! నీవు దారిలో మద్వియోగపీడచేఁ గుందుచు శరీరసంస్కార ముపేక్ష జేయుదువు సుమీ! సమయమున కాహారమును గుడుచుచుఁ దెలియని దారిం బోవక విమర్శించి బస జేయుచుండవలయును. ఏమి జేయుదును? నీకంటెఁ గాదంబరీ ప్రాణములు ప్రియములని నిన్నొంటిగాఁ బంపుచున్నాను. నాప్రాణములు నీ చేతిలో నున్నవి కావున నీయాత్మ జాగరూకతతోఁ గాపాడికొనుమని పలుకుచు నాలింగనము జేసికొని కేయూరకుని కప్పగించి నన్ను వెండియు మహాశ్వేతాశ్రమములో గలిసికొనవలయునని యుపదేశించి వారి నంపెను.

వారు వోయినవెనుక నతండు వీరు వేగముగా నందుఁ బోవుదురా? దారిలో నేదియైన యంతరాయమురాదుగదా! ఎన్నిదినములకుఁబోయి యామె నూరడింతురు? అని యాలోచించుచు శూన్య హృదయుండై క్షణమందు వసించి స్కంధావార మెంత దూరమం దున్నదియో తెలిసికొని రమ్మని వాతా౯హరునిఁ బంపి వైశంపాయను నెదుర్కొనుటకుఁ దన్నుఁ బంపుమని యాచించుటకై తండ్రిగారి యొద్ద కరిగెను.

దూరమందె నమస్కరించుచున్న పుత్రుంజూచి తారాపీడుఁడు నిభ౯రస్నేహగర్భమగు స్వరంబున వత్సా! రమ్ము. రమ్ము. అని చేతులు సాచుచుఁ గౌగలించుకొని దాపునఁ గూర్చుండఁ బెట్టికొని ప్రత్యవయవము పాణిచే స్పృశించుచు దాపుననున్న మంత్రి ముఖ్యునితో నిట్లనియె.

ఆర్యా! శుకనాస! ఆయుష్మంతుఁడగు చంద్రాపీడునిం జూచితివా? ఇతని మేన యౌవనము పొడసూపినది. వివాహయోగ్యమగు దశవహించి యున్నవాఁడు విలాసవతితో నాలోచించి వీనికిఁ దగిన రాజకన్యక నరసి పెండ్లి చేయవలయుననుటయు శుకనాసుఁడు దేవా! దేవర లెస్సగా నాలోచించితిరి. ఇతండు విద్యలన్నియు గ్రహించెను. దిగ్విజయము చేసెను. ప్రజల కుత్సాహము గలుగఁ జేసెను. ఇఁక మిగిలిన కృత్యము పరిణయమే కదా! అవస్యము దానిగురించి యాలోచింపవలయునని పలికెను.

అట్టిసమయమునఁ జంద్రాపీడుఁడు సిగ్గుచే తల వాల్చుకొని యాత్మగతంబున భళిరే! వీరిసంవాదము కాదంబరీ సమాగమమునకు నుపశ్రుతివలెఁ దోచినది. నావిషయమై మాతండ్రి కిప్పు డిట్టి బుద్ధి పుట్టుట సముద్రంబునఁ బడినవానికి యానపాత్రము దొరికినట్లుగా నున్నది. అని పెక్కు తెరంగుల నాలోచించు నంతలో వైశంపాయనుని ప్రస్తావన వచ్చుటయు నతని నెదుర్కొనుటకు ననుజ్ఞ యిమ్మని చంద్రాపీడుఁడు శుకనాసముఖముగాఁ దండ్రికిఁ విజ్ఞాపనజేసి కొనియెను.

తారాపీడుఁడు వైశంపాయను నెదుర్కొనుటకు బుత్రునకాజ్ఞ యిచ్చుటయు నతని డత్యంత సంతోషముతో నారాత్రి వేగించి సుహృద్ధర్శనలాలసుండై వేగుజాముననే లేచి ప్రాతఃకాలకృత్యముల నిర్వతి౯ంచి యుచిత పరివారముతో నింద్రాయుధమెక్కి యతివేగముగా సేనాముఖమునకుఁ బోయెను.

స్కంధావారమును ప్రవేశించినతోడనే గుఱ్ఱముపైనుండియే యత్యాతురముతో వైశంపాయనుఁ డెచ్చట నున్నవాఁడని యడిగెను. ఆమాట విని యందున్న స్త్రీలు కొంద రెద్దియో పని తొందరలో నుండి యతని గురుతుపట్టఁజాలక కన్నీరు విడుచుచు, అయ్యో! ఇం కెక్కడి వైశంపాయనుఁడు? ఆతని నడిగెదరేటి కని పలికిరి.

ఆమాటలు విని ఆ, పాపులారా! అట్లనియెద రేల? యనిహృదయంబు ఝల్లుమన వారినదలించుచు, మఱియొకరినడుగక భయపడుచు గుంపువీడిన లేడిపిల్లవలె బెదరుచు నేమియుం జూడక యేమియు మా టాడక యేమియును వినక యెవ్వరింజీరక హా! యిప్పుడు నేనెక్కడ నుంటిని? యెక్కడికి వచ్చితిని? యేమిటికి వచ్చితిని? యెక్కడికిఁ బోవలయును? యేమిచేయవలయును? అని తలంచుచు నంథునివలె మూకునిపగిది జడునుభాతి నందుఁ గ్రుమ్మరుచుండెను.

అప్పుడు తురగమును గురుతుపట్టి రాజకుమారులు చంద్రాపీడుఁడు చంద్రాపీడుఁ డని పిలుచుకొనుచుఁ దొందరగా నతనిం జుట్టు కొనుటయు నతండు వారిని వైశంపాయనుఁ డెక్కడ నున్నవాఁడని గద్గదస్వరముతో నడిగెను. వారు దేవా! సర్వము నివేదింతుము. గుఱ్ఱము దిగి యీవృక్షచ్ఛాయను విశ్రమింపు డని దీనముఖులై పలుకుటయు నట్లుచేసి తదీయవాగ్ధోరణిం గనిపెట్టి యతండు చిత్తము విభ్రాంతి వహింపఁ బెక్కు తెరంగులఁ దలంచుచు నపరాధము చేసిన వాడుం బోలెఁ దల వాల్చుకొని మెల్లగా వానితో నిట్లనియె.

నేను పోయినవెనుక దారిలో సంగ్రమము తటస్థించినదా? లేక శీఘ్రములో నసువుల గ్రసియించు వ్యాథియెద్దియేని వచ్చినదా? పిడుగుపడినట్లు వైశంపాయనుని కింత యుపద్రవ మేల రావలయును? వేగమ చెప్పుడనుటయు వారందరు చెవులుమూసికొని శివశివా! అట్లనియెదరేల? పాపము వైశంపాయనుండు జీవించియే యున్నవాఁడు. ఇఁక నూరేండ్లు బ్రతుకునని పలుకగా విని యారాజనందనుండు డెందం బానంద సాగరంబునమునుంగ వారిఁ గంఠగ్రహణముజేయుచు వెండియు నిట్లనియె.

వైశంపాయనుండు బ్రతికియుండిన నాయాజ్ఞమీరి మఱియొక చోటికిఁ బోవువాఁడు కాడని యట్లంటి మంచిమాట జెప్పితిరి. అతం డిప్పు డెచ్చటికిఁ బోయెను? ఇచ్చటి కేల రాడు? అతనివిడిచి మీరేమిటికి వచ్చితిరి? వినువరకు నాచిత్తముత్తలమందుచున్నది. వేగమ చెప్పుఁడని యడిగిన నమస్కరించుచు వారిట్లు చెప్పఁదొడంగిరి.

వైశంపాయనుని కథ

దేవా! యవధరింపుము వైశంపాయనునితోఁగూడ మీరు మెల్లగా రండని మాకు జెప్పి దేవర యరిగితిరిగదా! ఆదినము మేము ప్రయాణసాధనముల సవరించుకొని మరునాఁ డుదయంబునఁ బ్రయాణభేరిని గొట్టించి నంతలో వైశంపాయనుండు వచ్చి వారించుచు నీప్రాంతమందచ్ఛోదమను పుణ్యసరస్సు గలదు. అందు దీధ౯మాడి శంభునర్చించి రేపుపోవుదము. ఈపుణ్యభూమి కిప్పుడైనను వత్తుమా? యని పలుకుచుఁ బదగమనముననే తానయ్యచ్ఛోదమునకుఁబోయెను.

ఆప్రదేశమంతయు రమణీయముగా నుండుటచే నందందు దృష్టి బరగింపుచు నందందు మెలంగుచు నవ్వనవిశేషములఁజూడఁ గ్రుమ్మరుచున్నంత నత్తటాకప్రాంతమున మణిశిలామంటపమొండు గనంబడినది.

దానిని జిరకాలమునకు గనంబడిన సోదరునివలెఁ బుత్రకుని భాతిమిత్రుని చందమున నత్యంతప్రీతితో రెప్పవాల్పక చూచుచు స్థంభితుని యట్ల కదలక నిర్వికారహృదయుఁ డై యెద్దియో థ్యానించుచు నథోముఖముకా నందుఁ గూర్చుండటయు మే మతనిం జూచి మనోహర దేశాలోకంబునం జేసి తదీయచిత్తమట్లు వికృతి బొందినదని తలంచి కొంతసే పూరకొంటిమి.

ఎప్పటికిని రాకున్న మేము దాపునకుఁ బోయి ఆర్యా! వేళ యతిక్రమించుచున్నది. స్నానము చేయుము. పయనమునకు సైనికులు మీరాక వేచియున్నారు. ఈప్రదేశ మెంతసేపు చూచినను జూడవలయుననియే యుండును. ఆలస్యము చేయక లెం డని పలికిన మామాటలు వినిపించుకొనక కదలక మాకేమియుఁ బ్రత్యుత్తరము జెప్పఁడయ్యెను. ఆ లతామంటపమును మాత్రము రెప్పవేయక నిశ్చల దృష్టితోఁ జూచుచుండెను. పలుమారు మేము తొందరపెట్టుటయు నెట్టకేలకు మమ్ము జూడకయే నేను రాను. మీరిందుండరాదు. అతండరిగి పెద్దతడవయినది. వేగమ పొండని పలుకగా విని అయ్యో! యీతం డకారణముగా వైరాగ్యమును జెందెనే యని శంకించుకొనుచు సానునయముగా బోధించియు, నిష్ఠురముగాఁ బలికియు నీకీ మోహము తగదు. వడిగా రమ్ము. చంద్రాపీడుఁడు నిన్నువిడిచి వచ్చిన మమ్ము జండించునని యెన్నియో రీతులం జెప్పిన నెట్టకేలకు విలక్షణహాసయుక్తమగు మొగముతో మా కిట్లనియె.

ఇప్పుడు నాకేమియుం దెలియకున్నది. నన్ను మాటిమాటికి గమనమునకు మీరు బోధన చేయుచున్నారు. నేను చంద్రాపీడుని విడిచి యెప్పుడైన నుంటినా? అంతయు నాకెఱుక యగుచున్నది కాని నేనేమియుం జేయలేను. తెలిసినను జేయుటకు శక్తుఁడకాకుంటిని చూచుచున్నను నాదృష్టి మఱియొకచోటికిఁ బ్రసరింపదు. పాదములు గదలవు. ఇచ్చట స్థాపనజేయఁబడినదివోలె నాతనువు కదలకున్నది. కావున నేను వచ్చుటకు సమధు౯డను కాను నన్నొక వేళ మీరు బలాత్కారముగాఁ దీసికొనిపోయెదరేని నామేనఁ బ్రాణములు నిలుపనని తోచుచున్నది. ఇచ్చటనే యుండినచో నాహృదయంబున నెట్లో యున్నది. ప్రాణములు ధరింతునని ధైర్యమున్నది. కావున మీరు నన్ను నిర్భంధింపకుఁడు మీరువోయి యావజ్జీవము చంద్రాపీడమఖదర్శన సుఖం బనుభవింపుఁడు. నాకట్టి సుఖములేకుండ దైవము విడదీసి నని పలికిన మేమడలుచు నదికైతవనునుకొని అయ్యో! యిట్లు పలికెదరేల? చంద్రాపీడుని దావునకు రారాయని నిర్బంధముగా బెక్కుసారు లడిగిన నతం డిట్లనియె.

అక్కటా! మీరూరక నన్ను నిర్బంధించెదరేల? చంద్రాపీడుని జీవితముతోడు నా కేమియుఁ దెలియకున్నది. నేను వచ్చుటకు సమధు౯ఁడను కాను. కారణము నాకుఁ దెలియదు. మీరు చూచుచునే యడిగెదరేల? మీరు పొండు పొండని పలికి ముహూత౯కాల మూరకొని యందు రమ్యములైన లతాగృహములు సరస్త్సీరములు గ్రుమ్మరుచు నాదేవాయతనమున నెద్దియో మరచిపోయినట్లు నెదకుచు నితరదృష్టిలేక తిఱుగుచుండెను.

మేము పొదలమాటుననుండి ఱెండుయామములవరకు నతని చేష్టలం గనిపెట్టి తిరిగిపోయి రమ్మని నిర్బధింప నతఁ డయ్యో! నన్నిట్లు వేపెదరేల? నాకు నాజీవితముకన్నఁ జంద్రాపీడుని ప్రాణములు ప్రియములుకదా! అవి యతని విడిచి బలత్కారముగా నా యొద్దకు వచ్చినను గార్యము లేదని తోచుచున్నది. ఇంక మీరేల వేడెదరు? పొండని పలికి లేచి యందు స్నానము చేసి కందమూల ఫలము లాహారముగాఁ బుచ్చుకొని వనవాసోచితవ్యాపారమును గైకొనియెను.

అప్పుడు మేము విస్మయమందుచు మూఁడహోరాత్రములు వేచియుంటిమి కాని యతనిబుద్ధి తిరిగినదికాదు. అప్పుడు నిరాశులమై యందుఁ గొందరఁ గావలియుంచి మేము బయలుదేరి వచ్చితిమి.

అని యెఱింగించిన వారి మాటలు విని చంద్రాపీడుఁడు చింతా విస్మయము లొక్కమాటు చిత్తం బుత్తలపెట్ట నిట్లు తలంచెను.

అయ్యో! వైశంపాయనుని కింతలో వై వృత్తిబూనుటకుఁ గారణమేమియుం గనంబడదు. తారాపీడుఁ నన్నుఁబలె వానిని సైతము గారవించును. ప్రజలకు సైతము నాయందుకన్న వాని యందె మిక్కుటమగు మక్కువగలిగియున్నది. శుకనాసుఁడు మనోరమయు నతని నేవిషయములోను మందలించి యెఱుఁగరు. అతనికిఁ బ్రశాంతికైన నిది సమయముకాదు ఇదివరకు విద్యజ్జనోఁచితమైన గావా౯స్థ్యమందే ప్రవేశింపలేదు. ఇదియేమియో యని పెక్కు తెరం గులఁ దలంచుచు నతివేగముగా నచ్చోటికి బోవఁదలంచియుఁ దల్లిదండ్రుల కెఱిగింపకపోరాదని నిశ్చయించి యప్పుడే తురగమెక్కి యత్యంతరయంబునఁ దనపట్టణమునకు వచ్చెను.

ఆవీటిలోఁ బ్రజలందరు గుంపులుగాఁ గూడుకొని వైశంపాయనుని వృత్తాంతమే చెప్పుకొనువారును, వినువారును, అడుగువారును, విచారించువారునై వీథులయం దుండుటఁ జూచి చంద్రాపీడుఁడు అక్కటా! యీవాత౯ నాకన్న ముందర పట్టణములోనికి వచ్చినది. మాతండ్రిగారికిని శుకనాసునికిఁగూడఁ దెలిసియేయుండును వైశంపాయనునిగురించి బాహ్యజనంబే యింత విచారింపుచుండఁ దల్లిదండ్రుల కెట్లుండునో? నన్నేమని శంకింతురో యని పెక్కు తెరంగులఁ దలపోయుచుఁ గ్రమంబున బహిర్ద్వారము దాపునకుఁబోయి యందు గుఱ్ఱమును దిగి యాస్థానమునకుఁ బోవుచున్నంతఁ దారాపీడుఁడు విలాసవతితోఁగూడ శుకనాసునిగేహములందున్న వాఁడను వాత౯ వినంబడినది.

అప్పు డతండును మరలి తానుగూడ నచ్చటికిఁ బోవుచుండ సమీపముగా నిట్టిధ్వని వినంబడినది.

హా! వైశంపాయన? హా! వంశపావన! మదీయాంకసీమ యందు లాలింపఁబడుచుండెడి నీవిప్పుడు వ్యాళశతభీషణమయిన కాంతారములో నొంటిగా నెట్లుంటివి? అందు శరీరరక్ష నీకెట్లు జరుగుచున్నది? నీకు నిద్రాశుకమిచ్చుశయ్య నెవ్వరు గల్పించుచున్నారు? నీయాకలి గనిపెట్టి యన్న మిడువారెవ్వరు? పట్టీ! ఎట్టియవస్థవచ్చినది. అయ్యో! నీవు వచ్చినతోడనే మీతండ్రితోఁజెప్పి తగినకన్యకను వివాహము జేయవలయునని తలంచియుంటినే మందభాగ్యురాలనగు నాకట్టి యదృష్ట మెట్లు పట్టును? నన్నును మీతండ్రిని నీవున్న చోతికి దీసికొని పొమ్ము. నిన్ను విడిచి మేము నిమిషమైనఁ దాళ లేము. ఇంత నిష్ఠురత్వము నీవేటికి బూనితివి? చంద్రాపీఁడునిఁవిడిచి క్షణమైనఁనుండువాడవు కావే తద్వియోగమిప్పు డెట్లు సైచితివి? ఆస్నేహమంతయు నేమయిపోయినది? నీవట్టివైరాగ్యము బూనుటకుఁ గారణమేమి? అయ్యయ్యో! ఎంతవచ్చినది? ఏమిచేతును? పుత్రా! యని యీరీతి పెక్కు తెరంగులఁ బుత్రశోకంబున విలపించుచున్న మనోరమగంఠధ్వనివిని యతండు విహ్వలుఁడై మూర్ఛవోయియంతలో దెప్పిరిల్లి క్రమంబునఁ దండ్రియొద్దకుఁ బోయి యతనిం జూచుటకు సిగ్గుపడుచుఁ దల వంచుకొని నమస్కరింపుచు దూరముగాఁ గూర్చుండెను.

ఆరాజు పుత్రుం జూచి బాష్పగద్గదస్వరుండయి వత్సా! చంద్రాపీడ! నీకు వైశంపాయనునియందు జీవితముకన్న నెక్కుడు ప్రీతియని యెఱుంగుదును కాని యతనివృత్తాంతము వినినది మొదలు నాహృదయము నీయెడ ననుమానము జెందుచున్న దేమని; పలికిన విని యతనిమాట లాక్షేపించుచు శుకనాసుం డిట్లనియె.

దేవ! అగ్నిచల్లబడినదనినను సూర్యుని నంధకారము గ్రమ్మినదనినను సముద్రమింకినదనినను నమ్మవచ్చును కాని చంద్రాపీడుఁ డట్టిదోషమును జేయునని తలంపరాదు. కృతయుగావతారమని చెప్ప నోపిన చంద్రాపీడుని సుగుణముల విమశి౯ంపక మిత్రఘాతకునిగా సూచించితిరేల? విచారింపవైశంపాయనుఁడే దుజ౯నుఁడని తలంచెదను. లోకంబునఁ బుత్రులంగనుట వంశవృద్ధికొరకుఁగదా! తండ్రి యానతిఁబూనక నేనెట్లు వైరాగ్యమును బూనుదునని యించుకంతయు వానిస్వాంతమునఁ బుట్టినదికాదే? అట్టిదుర్మాగు౯ని విషయమై దయదలపఁనేటికి? వాఁడు పెంచినచిలుకవలె దేవరచేఁ బోషింపఁబడి యంతయు మరచి యిప్పుడు కృతజ్ఞత దలంప విడిచి వెళ్ళెనే. ఆత్మద్రోహము చేసినవానితో మనకేమి? అప్పాపాత్ముని జననము మనకు శోకమునకే కారణమైనది అని పలికి కన్నీరు నించుచు నిట్టూర్పులు నిగుడించెను.

అప్పుడు తారాపీడుఁ డతనిం జూచి యార్యా! యూరడిల్లుము. వ్యజనానిలముచేత వాయువును వృద్ధిజేసినట్లుకదా! మీకు మేము బోధించుట! బహుశ్రుతుండైనను బ్రాజ్ఞుండైనను వివేకియైనను ధీరుండయినను దుఃఖాతిపాతంబునఁ జిత్తచాంచల్యమందకమానఁడు. మనస్సు చెడినవానికేమియుం దెలియదుకదా! వైశంపాయను గురించి కోపావేశముతోఁ బలుకుచున్న నీమాటలు వినుటచే నాకు మిక్కిలి వ్యసముగానున్నది. యతనియెడఁ గోపమును విడువుము. వాఁడు మిక్కిలి గుణవంతుఁడు కారణ మరయక వానినిందింపరాదు. చంద్రాపీడునంపి వానిశీఘ్రముగా నిచ్చటికి రప్పించి యట్టి విరక్తి నేమిటికిఁ బూనెనో యరయుదముగాక యరసినపిదప యధాన్యాయముగా నాచరింతమని పలికిన విని వెండియు శుకనాసుం డిట్లనియె.

దేవ! నీకు వైశంపాయనుని యందు గల మక్కువచే నిట్లనుఁ చున్నావు. నీయౌదార్యమట్టిదయే కాని యువరాజును విడిచి యాత్మేచ్ఛచేనుండుట గష్టమని పలికిన విని చంద్రాపీడుఁడు తండ్రియన్న మాట హృదయంబున ములికిపోలికనాఁటియుండ గన్నీరునించుచు గూర్చుండియే మెల్లగా దాపునకుఁ బోయి శుకనాసునకిట్లనియె.

ఆర్య! వైశంపాయనునివిషయమైన నావలన నేమియు దోసము లేదని చెప్పకపోయినను నేనెఱుంగుదు, అయినను మాతండ్రిగారి కనుమానము దోచుచున్నదని పలికిరికదా! లోకులు సైతమట్లే భావింతురు. అసత్యమయినను లోకాపవాదము భరించుట గష్టము. అయశఃప్రసిద్ధి లోకంబున వ్యాపించెనేని పరలోకహాని కాగఁలదు. కావున దీనికిఁ బ్రాయశ్చిత్తముగా వైశంపాయనుని దీసికొని వచ్చుటకు నన్ను నియమింపుము. మఱియొకరీతి నాకు నిష్కృ గలుగదు. తురగ యావంబునఁబోయిన నాకేమియు నాయాసము గలుగదు. గమనాభ్యనుజ్ఞ యిమ్ము. నేనుబోయి ప్రియమిత్రునిం దీసికొని వత్తును. అతండు రానిచో నేనుసైత మచ్చటనే యుండెదనని పలికిన విని శుకనాసుఁడు తారాపీడునితో దేవా! యువరాజుగ మనమునకు విజ్ఞాపనజేసికొను చున్నవాఁడు. సెలవేమియని యడిగిన నతం డిట్లనియె.

ఆర్యా! మనమొకటి దలఁచి కొనియుండ దైవము వేరొకటి తెచ్చిపెట్టెను. కానిమ్ము. వైశంపాయను నవశ్యముగా యువరాజు దీసికొనిరావలయును. అతని విడిచి యీతఁ డొక నిమిషమైనఁ తాళలేఁడు. తప్పక పోవలసినదే. యతని దీసికొనివచ్చుటకు నాయుష్మంతుని మాట జెప్పనేల. విలాసవతినైనఁ బంపెదను సుమీ యని పలికి దైవజ్ఞులరప్పించి యప్పుడే ప్రయాణమునకు ముహూర్తము నిశ్చయించి పిమ్మటఁ జంద్రాపీడునిం జూచి రాజు వత్స! నీవీ వార్త మీ తల్లికిం జెప్పి వేగపొమ్మని పలుకుచు శుకనాసునితోఁగూఁడ దన భవనమునకుఁ బోయెను.

తరువార నా రాజకుమారుఁడు తల్లియొద్దకుఁబోయి నమస్కరించుచు దాపునం గూర్చుండి మిక్కిలి విచారింపుచున్న మనోరమ కిట్లనియె. తల్లీ! నీవుల్లంబునఁ జింతిల్లకుము. వైశంపాయనుని దీసికొని వచ్చుటకు మా తండ్రి నా కానతిచ్చెను. నేనువెళ్ళి యలఁతికాలములో నాతనిం దెచ్చెదను. నీవుగూడ ననుజ్ఞయిమ్ము. పోయివచ్చెదననుటయు నామె యిట్లనియె.

వత్సా! నేను వెళ్ళెదనను మాటచే నాకు శోకోవశమనము జేసెదవేల? నాకు నతనియందుకన్న నీయందు మక్కువ మెండు. నీవు పోయిన నెవ్వరిజూచికొని ధైర్యమవలంభింతును? నీవు పోవలదు. దైవానుగ్రహము గలిగిన వాఁడెరాగలఁడు. లేక మఱియెవ్వనేని బంపుదురు. కాకయని పలికినవిని విలాసవతి యిట్లనియె. సఖీ! మన యిరువురకు వారిరువురయందును సమాన ప్రేమగలిగి యున్నది. వానిం జూడక నేనుమాత్రము సైరింపగలనా! వారింపఁకుము మనము వారించినను జంద్రాపీడుఁడు నిలుచువాఁడుకాడు. యనుజ్ఞ యిమ్మని పలికిన నక్కలికియు నెట్టకేలకు సమ్మతించినది.

అంతలో సాయంకాలమగుటయుఁ జంద్రాపీడుఁడు ఆ రాత్రి భోజనముచేసి తల్పంబున శయనించి సంకల్పశతములచే మనోరధములఁ బూరించుకొనుచు నిట్లు తలంచెను.

నేను ముందుగా నచ్ఛోద సరస్సునకుఁబోయి యందు వెనుక వెనుకగా నరిగి వైశంపాయనుని కంఠగ్రహణముచేసి నీవి కెందు బోవఁ గలవని పలికిన నతండు నామాట ద్రోయనేరక నాతో వచ్చునుగదా. పిమ్మట మహాశ్వేత యాశ్రమమున కరిగి యందుఁ బరిజనము నునిచి యామెతోఁ గూడ హేమకూటమునకుఁ బోయెదను.

అందు నన్నుంజూచి కాదంబరి పరిజనము తొందరగా నిటునటు తిరుగుచు నమస్కరింపుచుండఁ గ్రమంబునఁ గాదంబరి యున్న తావరసి యరిగిన నత్తరుణియు నా రాక సఖులచే నెఱింగి తటాలునఁ బుష్ప శయ్యనుండి లేచి యత్యాతురముతో స్వాంగాలంకారముల సవరించు కొనుచు సిగ్గుచేఁ దలవంచుకొని శయ్యాసమీపంబున నిలువంబడియున్న యన్నారీలలామమునుగాంచి కన్నులకలిమి సార్ధకము గావించెదను కదా.

తరువాత మదలేఖను పత్రలేఖను గేయూరకుని యధోచిత గౌరవంబున మన్నించుచు సాహసముతో వివాహప్రయత్నము చేయుటకు జిత్రరధునకు వార్త నంపెదను. పిమ్మట నా కొమ్మను శుభముహూర్తమునం బెండ్లియాడి బహుళకుసుమదామ భూషానులేపనాది వస్తుమండితమగు భవనంబునఁ బుష్పశయ్యపై మత్సమీపమున గూర్చుండి వయస్య లరిగిన వెనుక తానును మొగమువంచి యరుగఁబోవు నయంబున బలత్కారముగా సందిటిలో నిమిడ్చికొని తల్పంబునఁజేర్చి పిమ్మటఁ దొడయం దిడుకొని యెడమచేతితోఁ గేశపాశముగైకొని కుడిచేతిలో నధరము పుడుకుచుఁ గపోలములఁ జుంబించుచు సురలకు సైతము దుర్లభమయిన యధరామృతము తనివితీరఁ గ్రోలెదను.

అంత నింతింతనరాని సంతసముతోఁ గంతుసంతాపమునఁ గృశించియున్న యవయవములకు గాఢాలింగన సుఖరస భరంబున నుబ్బుగలుగఁ జేయుచుం దరువాత నా నాతితోఁగూడ మదనాగ్ని నార్పునదియు నింద్రియములకు సుఖమిచ్చునదియుఁ బెక్కుసారు లనుభవించుచున్నదైనను గ్రొత్తదానివలె దోచునదియు నిట్టిదని చెప్పుటకు నలవికాని సంతోషము గలుగజేయునదియు నిర్వాణ సుఖసాదృశ్యము గలదియు సచింత్యమయినదియు నగు సుఖ మనుభవించుచు నిమిషమైనను విడువక రమ్యప్రదేశములఁ గ్రీడింపుచు యౌవనమునకుఁ దృప్తి గలుగఁ జేసెదను.

ఆ రీతిఁ గాదంబరికి సంతోషము గలుగఁజేసి మదనలేఖను వైశంపాయనునకుఁ బెండ్లిచేసెదను. అని యిట్లు పెక్కు తెరంగుల నంతరంగమ్మునఁ దలపోయుచు మేను గరువుజెంద ననుభూతుఁడైన వాఁడుంబోలె నారాత్రి నిద్దురంజెందక తృటిలాగునగడిపి యుదయంబునలేచి సముచిత పరివారంబు సేవింప నింద్రాయుధమెక్కి యక్కుమారుం డప్పురము వెడలి కతిపయప్రయాణంబుల నచ్ఛోదసరస్త్సీరమునకుఁ బోవుచు నించుకదూరములో నెదురుపడిన మేఘనాధునింజూచి యత్యాతురముగా నిట్లనియె. మేఘనాధ! అచ్ఛోదస్సరస్త్సీరంబున నీకు వైశంపాయనుఁడు కనంబడియెనా? చూచి మాట్లాడితివా? ఏమనియెను? ఇప్పటికైనం పశ్చాత్తాపముజెంది యింటికి రావలయునని తలంచుచున్నవాఁడా! నా మాటయేమైనం దెచ్చెనా, యని తల్లిదండ్రులు జ్ఞాపకముండిరా యని యడిగిన నతం డిట్లనియె.

దేవా! దేవర ఇదిగో నేను వైశంపాయునితో మాట్లాడి నీ వెనుకనే వత్తునని చెప్పితిరికదా. మేమట్లుపోయి మీ రాక వేచియుండ నెప్పటికి వచ్చితిరికారు. అప్పుడు పత్రలేఖయుఁ గేయూరకుఁడు నన్నుఁ జూచి మన చంద్రాపీడుని వర్షాకాలమగుటచేఁ దల్లితండ్రులు రానిచ్చిరి కారు. నీవిచ్చోట నొక్కరుఁడ వుండనేల ఇంటికిఁ బొమ్మని పలికి వారిరువురు హేమకూటమునకుఁ బోయిరి.

నేను మఱికొన్ని దినములందుండి తిరుగానింటికి వచ్చుచున్నవాఁడ. నింతియకాని వైశంపాయనుని వార్త నా కేమియుం దెలియదు. అతం డచ్ఛోదసరస్సునకుఁ బోవుటయే నేనెఱుఁగనని చెప్పినవిని యా రాజకుమారుఁడు వెండియు వానితో నోరీ! అట్లైన సరియేకాని పత్రలేఖ యిప్పటికి హేమకూటముజేరునో లేదో చెప్పఁగలవా యని యడిగిన వాఁడిట్లనియె.

దేవా! దైవికమైన యంతరాయమేదియు రాకుండిన నది యాలస్యము చేయునదికాదు. కావున నేఁటి కబ్బోఁటి హేమకూటము జేరుననియె. నా యభిప్రాయము అనిచెప్పిన సంతసించుచుఁ జంద్రాపీఁడుడు వానితోఁగూడఁ గ్రమంబున వైశంపాయనింజూచు వేడుకతో నచ్ఛోదసరస్సునకుఁ బోయి యందు గుఱ్ఱపురౌతుల కిట్లనియె.

వైశంపాయనుఁడు వైరాగ్య వృత్తిబూని యీ వనములో నెచ్చటనో యణఁగియున్న వాఁడు. మనలనుజూచి పారిపోవును. కావున మీరందఱు గుర్రములనుండియే లతాగహనములను తరుమూలములు లతామంటపములు మొదలగు ప్రదేశములలో విమర్శగా నరయుఁడని పలుకుచుఁ దాను మిక్కిలి శ్రద్ధాపూర్వకముగా నతని వెదకెనుకాని యెందును అతనిచిహ్నము లేమియుం గనబడినవికావు.

అప్పు డతడు పెక్కుతెరంగులఁ జింతించుచు వైశంపాయనుని వార్త మహాశ్వేతకేమైనం దెలియునేమోయనియుఁ గాదంబరీ విశేషములుగూడఁ దెలియబడుననియు నూహించి తురగసైన్యమంతయు దదీయాశ్రమమున కనతిదూరంబున నుండ నియమించి సముచితపరివారముతోఁ దానింద్రాయుధమెక్కి యామె యాశ్రమమునకుఁబోయి గుహాముఖంబున వారురవమునుడిగి సన్ననివస్త్రములుదాల్చి యక్కందరాంతరమునకుఁ బోయెను.

అందు శోకవేగంబున నవయవంబులు చలింప గన్నులనుండి ధారగా నీరుగార్చుచుఁ గాలివానతాకుడున వాడినతీగెయుంబోలె మొగమువంచి తరిళికకేలు బట్టుకొనఁబడియున్న మహిశ్వేతంజూచి యతండు విభ్రాంతుండై అయ్యో కాదంబరి కెద్దియేని యప్రియము జరిగియుండఁబోలుఁ గానిచో నిమ్మానిని యిట్లుండదు. ఏమి దైవమా యని ప్రాణంబులెగిరిపోయినట్లు సారెసారెకుఁ దొట్రుపడుచు మెల్లగాఁ దాపునకుఁబోయి బోటీ యీమె యిట్లున్న దేమి యని తరళిక నడిగిన నప్పడతియు నేమియుంజెప్పక యట్టి యవస్థలోనున్నను మహాశ్వేత మొగముజూచినది. అప్పు డాసాధ్వియే క్రమంబున శోకవేగం బడంచుకొని గద్గదస్వరముతో నన్నరవరసూతి కిట్లనియె.

మహాభాగ! సిగ్గులేని యీపాపాత్ము రాలేమిడిఁకి జెప్పకుండును? వినుండు. కేయూరక ముఖముగా భవదుజ్జయినీగమన వృత్తాంతమునువిని మనమెఱియ అయ్యో మదిరాచిత్రరధుల మనోరధమును దీర్పలేక పోయితిని. కాదంబరికోరికయు సఫలము చేయలేకపోయితిని. యారాజకుమారుని యబీష్టము తీరినదికాదు. నేనువచ్చి యేమిచేసితినని సిగ్గుపడుచుఁ గాదంబరీ స్నేహపాశములంగోసి వెండియు దపంబు జేయుటకై యీ యాశ్రమమునకువచ్చి యిచ్చట దేవరఁబోలియున్న యొక్కబ్రాహ్మణకుమారుం డెద్దియో వెదకుచున్నట్లు శూన్యహృదయుఁడై నలుమూలలు జూచుచుండ గంటిని.

అప్పు డతండు నాయొద్దకు మెల్లగావచ్చి యదృష్టపూర్వుండై నన్ను నెన్నఁడో యెఱిఁగిన వాడుంబోలె నాముఖము రెప్పవాల్పక చూచుచు నాకిట్లనియె.

శోభనాంగీ! లోకంబున నెవ్వరును జన్మకును వయసునకును రూపమునకునుం దగినట్లు మెలంగిరేని నిందాపాద్రులుకారు. నీవట్లుగాక తగనివ్రయము చేయుచుంటివేమి? కుసుమసుకుమారమగు నీమైదీగె నుత్కృష్టతపఃకరణక్లేశంబున నిట్లు వాడఁజేయనేమిటికి? సుమనోమనోహరంబగు లతయుంబోలె నీయాకృతి ప్రాయములకుఁ దగినయట్లుగా రసాశ్రయమగు ఫలముతోఁ గూడుకొనకుండుట లెస్సయే. తపంబు పరలోకసుఖప్రదంబు. రూపగుణహీనులు సైత మైహికసుఖంబు లనుభవించుచుందురు. ఆకృతిమంతులమాటఁ జెప్పనేల? తుషారబిందుపాతంబునఁ పద్మినీలతయుంబోలె స్వభావసుందరమగు నీశరీరమిట్లు తపఃక్లేశంబునం గృసియించుట జూచిన నాకు మిక్కిలి విచారమగుచున్నయది. మఱియొక నీవంటివాల్గంటియే యింద్రియసుఖంబుల నిరసించి వైరాగ్యమును బూనియుండ నిఁక దర్పకుని పుష్పసాయక ధారణము వ్యర్థము సుమీ, చంద్రోదయముతోఁ బనియేమి? వసంతమలయా నిలముల రాక నిరర్ధకమే! కువలయకల్హార కమలాకర విలసనములు నిష్ప్రయోజనములు మనోహరోధ్యాన భూము లెవ్వరికిఁ గావలయునని పెక్కు తెరంగుల వక్కాణించెను. పుండరీకునికథ జరిగినది మొనలు నేనుత్సాహముడిగి యుంటిని కావున వానిమాటలువిని నీవెవ్వఁడవు? నీపేరేమి? నీవృత్తాంతమెట్టిది? నన్నిట్లు పలికెదవేలయని యడుగకయే యచ్చటినుండి మఱియొక చోటికి బోయి దేవతార్చన పుష్పములంగోయుచున్న తరళికంజీరి యిట్లంటిని.

తరుణీ! యీతరుణండెవ్వఁడే వీని యాకారముజూడ బ్రాహ్మణకుమారుఁ డట్లతోచుచున్నయది. నన్నుజూచినంత వీనిస్వాంతమున వెఱ్ఱిచేష్ట లంకురించుచున్నయవి. కావున వాని నిచ్చటికి వెండియు రాకుండునట్లు చేయుము. కూడఁగూడ తిరుగుచున్నవాఁడు. నివారించి నను వచ్చెనేని తప్పక యమంగళమును జెందగలఁ డని పలికితిని.

అదియు నతనితోఁ దగినట్లు చెప్పినది కాని మదనహతకునివృత్తి దుర్నివారమైనదగుటచే వానిచిత్తము మరలినదికాదు.

మఱికొన్నిదినములు గడచినంత నొకనాఁడురాత్రి జ్యోచ్స్నాపూరముచే జగంబంతయు నిండియుండ సంతాపంబువాయనే నీశిలా తలంబున శయనించి మందమందముగా నచ్చోదానిల పోతములు వీచుచుండఁ బుండరీకుని వృత్తాంతమే స్మరించుకొనుచు నిద్రపట్టమింజేసి యిందుబింబవిలాస మరయుచుఁ గన్నులుమూయక యట్టెచూచుచుంటిని.

అట్టిసమయమున నాబ్రాహ్మణకుమారుఁడు మదనావేశితహృదయుండై మెల్లగా నడుగులిడుచు నాయొద్దకువచ్చెను. నిస్పృహురాలనైనను వానిఁజూచినంతనే స్వాంతమున భయము జనింప నిట్లు తలంచితిని. అయ్యో! మంచియాపద తటస్థించినదే వీఁడు నన్నుముట్టినంత మాత్రమునఁ బ్రాణములు విడువవలసినదేకదా. పుండరీకునిరాక నిరీక్షించి యిన్నిదినములు ప్రాణములు దాల్చినది వ్యర్థమైపోవునే యని యాలోచించుచున్న సమయమున నతండునాదాపునకువచ్చి యిట్లనియె. ఇందుముఖీ! కందర్పునితోఁగూడి నన్నిప్పు డీచందురుఁడు చంపుటకుఁ బ్రయత్నించుచున్నవాఁడు కావున నిన్ను శరణు జొచ్చితిని. అనాథునాతు౯ నవ్రతీకారాక్షు భవదాయత్తు నన్ను రక్షింపుము, శరణాగత పరిత్రాణము తపస్వీజన ధమ౯మేకదా. నీవిప్పుడు నన్నాత్మ ప్రదానంబున రక్షింపవేని తప్పక నీకు బ్రహ్మహత్యాపాతకము గాఁ గలదని పలికెను.

వానిమాటలువిని నేను రోషానలంబున భస్మము చేయుదానివలె బాష్పస్ఫులింగదృష్టిచే వానింజూచుచు నావేశించిన దానివలె నొడలెఱుంగక కోపవేగ రూక్షాక్షరముగా హుమ్మనిపలుకుచు నిట్లంటి.

ఓరిపాపాత్ముడా! నన్ను నీవిట్లన నీతల పిడుగుపడినట్లు నూఱు వ్రక్కలయినదికాదేమి? నీజింహ లాగికొనిపోలేదే? సకలలోక శుభా శుభ సాక్షీభూతములగు పంచభూతములు నీయందులేవాయేమి? వాని చేతనయిన మడియవైతివే? మూఢుఁడా! ఇట్టి కామవృత్తిగలిగిన నీవు తిర్యగ్జాతియందుబుట్టక యిట్లేల పుట్టితివి? వక్రముఖానురాగముగలిగి స్వపక్షపాతమాత్ర ప్రతృత్తితో నొప్పుచు స్థానాస్థాననిరూపణ విధం బెఱుంగక చిలుకవలె హాతవిధిచేఁ బలికింపఁబడితివి. శుకజాతియందైనఁ బుట్టకపోయితివేమి? ఆత్మవచనానుగుణమగు జాతియందుఁ బుట్టితివేని యిట్లు నన్నుఁ గామింపకపోవుదువుకదాయని పలుకుచుఁ జంద్రమండలమున దృష్టియిడి దేవా! సకలలోకచూడామణీ! లోకపాల! నేను బుండరీకునిఁ చూచినదిమొదలు యితరదృష్టిలేక యతనినే ధ్యానించు దాననైతినేని వీఁడు నామాటచే హీనజాతియందుఁ బుట్టునని పలికితిని.

అప్పుడతండు మదీయశాపముననో మదనజ్వర వేగముననో పాప విపాకముననో తెలియదుకాని నేనట్లు పలికినతోడనే నరకబడిన తరువువలెఁ జేతనముబాసి నేలంబడియెను. అతం డట్లు గతాసుండగు టయుఁ దత్పరిజనము పెద్దయెలుంగున రోదనముజేసెను. అయ్యాక్రందము వలననే యతండు దేవర మిత్రుఁడని తెలియవచ్చినదని పలికి తలవంచుకొని మిక్కుటమగు నశ్రుధారచే భూమినిఁ దడిపినది.

అట్టి మాటలువిని చంద్రాపీడుఁడా కారణాంత విశాలమగు నేత్రములు మూయుచు భగవతీ! కాదంబరితో నన్ను గూర్చుటకు నీవు తగిన ప్రయత్నముచేసితివి. మందభాగ్యుండనగు నా కట్టియోగ్యత లేనప్పుడు నీవేమిచేయగలవు. ముందుజన్మమునకైనఁ గాదంబరీ చరణ పరిచర్యాసుఖము గలుగు నట్లనుగ్రహింపుమని పలుకుచునే హృదయము భేదిల్ల నట్టె నిలువంబడి ప్రాణముల విడిచెను.

చంద్రాపీడుఁడు వయస్యుని మరణవార్తను వినినతోడనే డెందము పగిలి జీవితము వాయుటఁజూచి తరళిక మహాశ్వేతను విడిచి యతనిం బట్టుకొని అయ్యో! చేడియా! యింకను సిగ్గేమిటికే యీతఁడు ప్రాణములను విడిచినట్లు తోచుచున్నది. మెడనిలుపక వాల వైచెను. చూడుము శ్వాసమారుతలేమియు వెడలుట గనంబడదు. కన్నులు మూయఁబడియున్నవి. హా! చంద్రాపీడ! కాదంబరీప్రియ యిప్పు డప్పడతిని విడిచి యేడకుఁబోయితివి. యా ప్రేముడియంతయు నెందుఁ బోయెనని పెద్దయెలుంగున నేడ్చుచుండజూచి మహాశ్వేతయు నతని మొగమునఁ జూట్కినిలిపి వైవరణ్యమును గనిపెట్టి గాఢశోకంబున జేష్టతక్కి పడియుండెను.

అప్పు డతని పరిజన మా వృత్తాంత మెఱింగి హాహాకారములతోఁ బెక్కు తెరంగుల నమ్మహాశ్వేతను దూరుచు నుచ్ఛస్వరంబున హా! రాజకుమార! హా వైశంపాయన! హా! తారాపీడ ! హా! శుకనాస! హా! విలాసవతి! హా! మనోరమ! మీకెట్టి యాపద సంప్రాప్తించినది. కటకటా! ప్రజలెంత భాగ్యహీను లయ్యెయో! ధరిత్రి యనాధయయ్యెఁ గదాయని యనేక ప్రకారంబుల విలపింపఁ దొడంగెను.

అతని గుఱ్ఱము దైన్యముగా సకిలింపుచు బలుమారతని మోము చూచుచు ఖురపుటాఖాతంబున భూతల రేణువు లెగర విచారంబు సూచింపుచుఁ జిందులు ద్రొక్కఁ దొడంగినది.

అని చెప్పువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుండు పై మజిలీజేరి తదనంతర వృత్తాంతమిట్లు చెప్పందొడంగెను.


శ్రీరస్తు

శుభమస్తు అవిఘ్నమస్తు

కాశీమజిలీకథలు

ముప్పదిమూఁడవ మజిలీ కథ

వత్సా! వినుము. అంతనక్కడఁ కాదంబరియుఁ బత్రలేఖచే చంద్రాపీడాగమన వృత్తాంతమునువిని చంద్రోదయమునసాగర వేలయుఁ బోలె నలరుచుఁ దల్లితండ్రుల కెద్దియో మిషజెప్పి వెండియు సుందరముగా నలంకరించుకొని పెక్కండ్రు పరిచారికలు సురభిమాల్యానులేపనాద్యుపకరణములు గైకొని తోడరాఁ కేయూరకుఁడు మార్గముజూపఁ బత్రలేఖ కైదండగొని నడుచుచు మదలేఖతో బోఁటీ! యీ పత్రలేఖ చెప్పినమాటలు వింటివా? అతని విషయమై నేను యశ్రద్ధ జేసితినఁట. నా యవస్థయంతయుం జూచియు హిమగృహంబున నైపుణ్యముఁగా బలికిన యతని వక్రభాషితములు నీకు జ్ఞాపకములేదా? నీవుసైత మప్పుడు నవ్వుచుఁ జూచి యతని మాటలకుఁ దగినట్లు ప్రత్యుత్తరముఁ జెప్పితివి. అట్టివాఁడిప్పుడు మాత్రము నన్ను విమర్శించునా, పయనము మాట దలపెట్టక పాపము నా నిమిత్త మీమత్తకాశిని యుత్తల మందు

  1. *ఇంతవరకు రచించి బాణకవి స్వగ౯స్థుఁ డయ్యెను. తరువాతఁ జివరకు నతని కుమారుఁడు రచించెను.