Jump to content

సుమతీ శతకము - రెండవభాగం

వికీసోర్స్ నుండి


తన యూరి తపసి తపమును,
తన పుత్రుని విద్య పెంపు, దన సతి రూపున్‌,
దన పెరటి చెట్టు మందును,
మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతీ

భావం: తన యూరిజనుల తపోనిష్టయును, తన కుమారుని విద్యాధిక్యమును, తన భార్యయొక్క సౌందర్యమును, తన ఇంటి వైద్యమును ఎట్టి మనుజులును గొప్పగా వర్ణించి చెప్పరు.

తన కలిమి యింద్ర భోగము,
తన లేమియె స్వర్గలోక దారిద్ర్యంబున్‌,
దన చావు జల ప్రళయము,
తను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ!

భావం: తన యొక్క ఐశ్వర్యమే దేవలోక వైభవము, తన దారిద్ర్యమే సమస్తమైన లోకములకు దారిద్ర్యము, తన చావే ప్రపంచమునకు ప్రళయము, తాను ప్రేమించినదే రంభ. ఈ విధముగా మనుజులు భావింతురు. నిజము ఇది.

తన వారు లేని చోటను,
జనమించుక లేని చోట, జగడము చోటన్‌,
అనుమానమైన చోటను,
మనుజునకును నిలువ దగదు మహిలో సుమతీ

భావం: తనకు కావలసిన చుట్టములు లేనిచోటునను, తనకు చెల్లుబడి లేని తావునను, తగువులాడుకొను చోటునను, తను అనుమానించు ప్రదేశమునను మానవుడు నిలువరాదు.

తమలము వేయని నోరును,
విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్‌,
గమలములు లేని కొలకును,
హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ

భావం: తాంబూలము వేయని నోరును, దుర్మార్గులతో స్నేహము చేసి బాధపడు బుద్ధియును, తామరపూవులులేని చెఱువును, చంద్రుడు లేని రాత్రియును శోభిల్లవు.

తలనుండు విషము ఫణికిని,
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్‌,
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

భావం: సర్పమునకు విషము తలయందుండును, తేలునకు తోకయందుండును. దుష్టునకు విషము తలతోక యనకుండ శరీరమంతనుండును.

తలపొడుగు ధనము పోసిన
వెలయాలికి నిజము లేదు వివరింపంగా
దల దడివి బాస జేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ

భావం: విచారింపగా నిలువెత్తు ధనమిచ్చినప్పటికిని వేశ్య నిజము పలుకదు. కావున తలమీద చేయి పెట్టి ప్రమాణము చేసినప్పటికి వేశ్యను విశ్వసించరాదు.

తల మాసిన, నొలు మాసిన,
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్‌
గులకాంతలైన రోతురు
తిలకింపగ భూమిలోన దిరముగ సుమతీ! 

భావం: పరిశీలింపగా భూలోకములో, తలమాసినను, శరీరమునకు మురికిపట్టినను, ధరించెడి బట్టలు మాసిపోయినను చేసుకొన్న భర్తనైనను ఇల్లాండ్రు ఏవగించుకొందురు.

తాను భుజింపని యర్థము
మానవ పతి జేరు గొంత మఱి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ!

భావం: అరణ్యమునందు తేనేటీగలచే కొడబెట్టిన తేనె కడకు ఇతరుల పాలైనట్లు లోభివాడు తాను నోరుకట్టుకొని కూడబెట్టిన ధనము కొంత ప్రభువులపాలును కొంత భూమి పాలునగును.

దగ్గఱ కొండెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి దా
నెగ్గు బ్రజ కాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ!

భావం: రాజు తన మంత్రి చెప్పెడి చాడీ మాటలకు లోబడి మంచి చెడ్డలు తెలుసుకొనజాలక జనులను హింసించుట, బొగ్గుల కొఱకు కోరిన కోరిక లొసగెడి కల్పవృక్షమును నఱకి వేసుకొనుటవంటిది.

ధనపతి సఖుడైయుండగ
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్‌;
దన వారి కెంత గలిగిన
దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ!

భావం: గొప్ప ధనవంతుడైన కుబేరుడు తనకు మిత్రుడై యున్నను శివుడు బిచ్చమెత్తవలసి వచ్చెను. కావున తాను సంపాదించుకొన్న (తన దగ్గరున్న) భాగ్యమే తనకు సహాయ పడవలయును కాని తన దగ్గర నున్నవాడికడ నెంత భాగ్యమున్నను నిష్ప్రయోజనము.

ధీరులకు జేయు మేలది
సారంబగు నారికేళ సలిలము భంగిన్‌
గౌరవమును మఱి మీదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ!

భావం: బుధ్ధిమంతుడైన వారికి చేసెడు మేలు, కొబ్బరికాయయందలి నీరు వలె మిక్కిలి శ్రేష్టమైనదియును, ప్రియమైనదియును, గొప్ప సుఖమునకు స్థానమైనదియును అగును.

నడువకుమీ తెరువొక్కట,
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్‌,
ముడువకుమీ పరధనముల,
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ

భావం: తోడులేక మార్గమందు ఒంటరిగా పోకుము, విరోధియింట ప్రీతితో భుజింపకుము, ఇతరుల ధనమును దగ్గరనుంచుకొనకుము, ఇతరుల మనస్సు నొచ్చునట్టుగా మాట్లాడకుము.

నమ్మకు సుంకరి, జూదరి,
నమ్మకు మొగసాల వాని, నటు వెలయాలిన్‌,
నమ్మకు మంగడి వానిని,
నమ్మకు మీ వామ హస్తు నవనిని సుమతీ!

భావం: పన్ను వసూలు చేయువానిని, జూదమాడువానిని, కంసాలివానిని, నటకుని, వేశ్యను, వర్తకుని, ఎడమచేతితో పనులు చేయువానిని విశ్వసింపుకుము.

నయమున బాలుం ద్రావరు,
భయమునను విషమ్మునైన భక్షింతురుగా;
నయమెంత దోషకారియొ,
భయమే జూపంగ వలయు బాగుగ సుమతీ!

భావం: మెత్తని మాటలచే పాలు కూడ త్రాగరు. భయపెట్టినచో విషమునైనను త్రాగుదురు. మృదుత్వ మెప్పుడును చెడునే కలిగించును. కావున చక్కగా భయమునే చూపుచుండవలయును.

నరపతులు మేఱ దప్పిన,
దిరమొప్పగ విధవ యింట దీర్పరి యైనన్‌,
గరణము వైదికుడైనను,
మరణాంతక మౌనుగాని మానదు సుమతీ!

భావం: రాజు హద్దుమీరి వర్తించినను, శాశ్వతముగా విధవ ఇంట పెత్తనదారి ఐనప్పటికిని, లేఖకుడ నియొగికాక వైదికుడైనప్పటికిని ప్రాణము మీదికి వచ్చును తప్పదు.

నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ!

భావం: తొమ్మిది రసములతో కూడిన మంచి భావములతో శృంగారింపబడిన కవిత్వ సంబంధమైన సంభాషణమును, కమ్మని సంగీతమును జ్ఞానహీనునకు వినిపించుట, చెవిటివాని యొద్ద శంఖమును ఊదినట్లుండును.

నవ్వకుమీ సభ లోపల;
నవ్వకుమీ తల్లి, దండ్రి, నాథుల తోడన్‌;
నవ్వకుమీ పరసతితో;
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ 

భావం: సభలలో నవ్వరాదు. తల్లిని, తండ్రిని, భర్తను, ఇతరుల భార్యను, బ్రాహ్మణులను చూచి నవ్వరాదు.

నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్‌
నారియె నరులకు రత్నము
చీరయె శృంగారమండ్రు సిద్ధము సుమతీ!

భావం: ఎల్లవారికిన్ బ్రతుకుటకు ఆధారమైనది నీరే. నవరసముల తోడను నిండునట్టి మాటలన్నింటికి ఆధారమైనది నోరే, నరులకు స్త్రీయే రత్నమువంటిది, వేష అలంకారాలలో చీరకట్టే శృంగారానికి అందం, అని తెలిసినవారు చెప్తూంటారు.

పగవల దెవ్వరి తోడను,
వగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్‌,
దెగ నాడ వలదు సభలను
మగువకు మనసియ్య వలదు మహిలో సుమతీ

భావం: భూమియందెవ్వరితోదను విరోధము మంచిది కాదు. దారిద్ర్యము వచ్చిన పిదప విచారింపరాదు. సభలో ఎవ్వరిని దూషింపరాదు. స్త్రీకి తన యొక్క హృదయము తెలియనీయరాదు.

పతికడకు, దన్ను గూరిన
సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్‌,
సుతుకడకు రిత్తచేతుల
మతిమంతులు చనరు నీతి మార్గము సుమతీ!

భావం: ప్రభువు కడకును, భార్యకడకును, భగవంతుని సన్నిధానమునకును, గురుదేవుని దగ్గరకును, కుమారుని కడకును వట్టిచేతులతో బుద్ధిమంతులు పోరాదు. ఇదియే నీతిమార్గము.

పనిచేయునెడల దాసియు,
ననుభవమున రంభ, మంత్రి యాలోచనలన్‌,
దనభుక్తి యెడల దల్లియు,
నన్‌ దన కులకాంత యుండు నగురా సుమతీ! 

భావం: ఇంటిపనులు చేసుకొనునప్పుడు దాసిగాను, భోగించునప్పుడు దేవతాస్త్రీయగు రంభగాను, సలహా లొసంగునపుడు మంత్రిగాను, భోజనము పెట్టునపుడు తల్లిగాను వర్తింపగలిగినదిగా భార్యయుండవలయును.

పరనారీ సోదరుడై,
పరధనముల కాసపడక, పరులకు హితుడై,
పరులు దను బొగడ నెగడక,
పరు లలిగిన నలుగ నతడు పరముడు సుమతీ!

భావం: ఇతర స్త్రీలను తోబుట్టువులుగా చూసుకొంటూ, ఇతరుల ధనానికి ఆశపడకుండా, అందరికీ ఇష్టుడై, ఇతరులు పొగుడుతుంటే ఉప్పొంగక, కోపం ప్రదర్శించినప్పుడు బాధ పడకుండా ఉండేవాడే శ్రేష్టుడు.

పరసతి కూటమి గోరకు,
పరధనముల కాసపడకు, బరునెంచకుమీ,
సరిగాని గోష్టి సేయకు,
సిరిచెడి చుట్టంబు కడకు జేరకు సుమతీ

భావం: ఇతరుల స్త్రీలతోడ కలయికను కోరకుము, ఇతరుల భాగ్యములకు నాసక్తిపడకు, ఇతరులయొక్క దోషములను లెక్కింపకుము. మంచిది కాని సంభాషణ చేయకుము, భాగ్యము పోయినప్పుడు బంధువులకడకు చేరవలదు.

పరసతుల గోష్ఠి నుండిన
పురుషుడు గాంగేయుడైన భువి నింద పడున్‌,
బరసతి సుశీలయైనను
బరుసంగతి నున్న నింద పాలగు సుమతీ!

భావం: పరస్త్రీలతో సరససల్లాపములాడుచుండిన భీష్ముడైనను భూమియందు నిందము పొందును. ఇతర స్త్రీయెంత సుస్వభావయైనను పరపురుషునితో స్నేహం చేసిన అపకీర్తి పాలగును.

పరులకు నిష్టము సెప్పకు,
పొరుగిండ్లకు బనులు లేక పోవకు మెపుడున్‌,
బరు గదిసిన సతి గవయకు,
మెఱిగియు బిరుసైన హయము లెక్కకు సుమతీ

భావం: ఇతరులకు అప్రియములైనవానిని పలుకకుము. పనులులేక పొరుగిండ్లకు పోకుము. ఎప్పుడును పరుని పొందిన భార్యను కలియకుము. తెలిసియుండియు పొగరుబోతైన గుర్రమును ఎక్కకుము.

పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్వింప నాలి బెంపకు,
నిర్వహణము లేని చోట నిలువకు సుమతీ 

భావం: పుణ్యదినములలో స్త్రీలను కలియకుము, ప్రభువుల దయను నమ్మి మనస్సునందు ఉప్పొంగిపోకుము. గర్వమును పొందిన భార్యను పోషింపకుము. సాగుదల లేనిచోట నిలువకుము.

పలు దోమి సేయు విడియము,
తలగడిగిన నాటి నిద్ర, తరుణులయెడలన్‌
బొల యలుక నాటి కూటమి
వెల యింతని చెప్పరాదు వినరా సుమతీ!

భావం: ధంతధావము చేసుకొని, తాంబూలమును వేసుకొని, తలంటుకొనినవాడు పోయిన నిద్రయును, స్త్రీలతోడ ప్రణయకలహం వచ్చిననాటి పొందును అంత్యంత సౌఖ్యప్రదములు, వాటి విలువ ఇంతని చెప్పజాలము.

పాటెఱుగని పతి కొలువును,
గూటంబున కెఱుకపడని కోమలి రతియున్‌,
బేటెత్త జేయు చెలిమియు,
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ

భావం: శ్రమను తెలుసుకొంజాలని ప్రభువును సేవించుటయును, కలయికకు తెలివిలేని స్త్రీతోడి సంభోగమును, వెంటనే భగ్నమగునట్లుగా చేయు స్నేహమును ఆలోచింపగా నదీప్రవాహమునకు ఎదురీదినట్లుగా నుండును.

పాలను గలసిన జలమును
పాల విధంబుననె యుండు బరికింపంగా
పాల చవి జెఱచు గావున
పాలసుడగు వాని పొందు వలదుర సుమతీ

భావం: పాలతోగలిసిన నీరు పాలవలెనే పైకి కనబడును, పరిశీలించినచో పాలయొక్క రుచిని చెడగొట్టును. అట్లే చెడ్డవారలతోడి స్నేహము స్వగౌరవము కూడ పోగొట్టజాలును. కావున అట్టి స్నేహము కూడదు.

పాలసునకైన యాపద
జాలింబడి తీర్ప దగదు సర్వజ్ఞునకున్‌
తేలగ్ని బడగ బట్టిన
మేలెఱుగునె మీటు గాక మేదిని సుమతీ

భావం: తేలు నిప్పులో పడినప్పుడు, వానియందు జాలిపడి దానిని బయటకు తీయుటకు పట్టుకొనినచో కుట్టును. కాని మనము చేయబోవు మేలును తెలుసుకొనజాలదు. ఆ విధముగనే జాలిపడి మూర్ఖునకు ఆపదయందు అడ్దుపడజూచిన తిరిగి మనకపకారము చేయును కావున అట్లు చేయరాదు.

పిలువని పనులకు బోవుట,
గలయని సతి గతియు, రాజు గానని కొలువుం,
బిలువని పేరంటంబును,
వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ

భావం: తన్ను పిలువని కార్యములు చేయబోవుటయును, హృదయములు కలియని స్త్రీతోడ సమాగమును, పాలకులు చూడని సేవను, పిలువని పేరంటమును కోరని స్నేహమును చేయతగదు

పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని బొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!

భావం: తండ్రికి కుమారుడు పుట్టగానే సంతోషము కలుగదు. ప్రజలు ఆ కుమారుని జూచి మెచ్చిన రోజుననే ఆ సంతోషము కలుగును.

పురికిని ప్రాణము గోమటి,
వరికిని ప్రాణంబు నీరు వసుమతి లోనన్‌,
గరికిని ప్రాణము తొండము,
సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతీ!

భావం: ఈ లోకములో పట్టణమునకు వైశ్యుడూ, వరిసస్యమునకు నీళ్ళును, ఏనుగునకు తొండమును, ఐశ్వర్యమునకు స్త్రీయును జీవము నొసగువారై యుందురు.

పులి పాలు దెచ్చి యిచ్చిన,
నలవడగా గుండె గోసి యఱచే నిడినన్‌,
దలపొడుగు ధనము బోసిన,
వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ!

భావం: దుస్సాధ్యమైన పులిపాలు దెచ్చి యిచ్చినను, హృదయమును కోసి యామె అరచేతబెట్తినను, నిలువెత్తు ధనమును ముందు పోసినను వేశ్యకు నిజమైన ప్రేమలేదు.

పెట్టిన దినముల లోపల
నట్టడవులనైన వచ్చు నానార్థములున్‌,
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ! [85]

భావం: అదృష్టము మంచిదైన దినములలో అరణ్య మధ్యములకు పోయినను అక్కడకే సంపదలు వచ్చును. దురదృష్ట దినములలో బంగారు పర్వతము నెక్కినను ఏమియును లభింపదు.

పొరుగున బగవాడుండిన,
నిరవొందక వ్రాతకాడె యేలిక యైనన్‌,
ధర గాపు కొండెమాడిన,
గరణాలకు బ్రదుకు లేదు గదరా సుమతీ!

భావం: తన యింటి ప్రక్క శత్రువున్నను, బగుగా వ్రాయగలిగినవాడే ప్రభువైనను, గ్రామ పెత్తనదారు కొండెములు చెప్పువాడైఅను గ్రామ లేఖరుక్కు జీవితము జరుగదు.

బంగారు కుదువ బెట్టకు,
సంగరమున బాఱిపోకు సరసుడవైతే,
నంగడి వెచ్చము వాడకు,
వెంగలితో జెలిమి వలదు వినరా సుమతీ

భావం: బంగారు నగలను తాకట్టు పెట్టకుము. యుధ్ధభూమినుండి వెన్నిచ్చి పారిపోకుము. దుకాణము నుండి సరుకులు అరువు తెచ్చుకొనకుము, మూఢునితో స్నేహము చేయకుము.

బలవంతుడ నాకేమని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా;
బలవంత మైన సర్పము
చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ!

భావం: నేను బలవంతుడను నాకేమి భయమున్నది అని చాలా మందితో నిర్లక్ష్యము చేసి పలికి విరోధము తెచ్చుకొనుట మంచిదికాదు. అది యెప్పుడూ హానిని కలిగించును. మిక్కిలి బలము కలిగిన సర్పము కూడా చలి చీమలకు లోబడి చచ్చుటలేదా?

మదినొకని వలచి యుండగ
మదిచెడి యొక క్రూర విటుడు మానక తిరుగున్‌
బది చిలుక పిల్లి పట్టిన
జదువునె యాపంజరమున జగతిని సుమతీ

భావం: పిల్లి పంజరమును పట్టిన, పంజరము మధ్యనున్న చిలుక మాటాడునా! అట్లే మనసులో నొకని ప్రేమించిన స్త్రీ మరియొక విటునెంత బ్రతిమాలినను ప్రేమించదు.

మండల పతి సముఖంబున
మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్‌
గొండంత మదపు టేనుగు
తొండము లేకుండినట్లు దోచుర సుమతీ

భావం: కొండంత పెద్దదైన యేనుగైనప్పటికిని తొండములేకపోయిన యెడల ఏలాగున శోభాహీనమై తోచునో ఆ విధముగనే గొప్ప దేశమును పరిపాలుంచురాజుకడ సమర్ధుడైన మంత్రి లేకున్నచో నాతని పాలన శోభావిహీనమగును.

మంత్రిగలవాని రాజ్యము
తంత్రము సెడకుండ నిలుచు దఱచుగ ధరలో
మంత్రి విహీనుని రాజ్యము
జంత్రపు గీలూడినట్లు జరుగదు సుమతీ!

భావం: సమర్ధుడైన మంత్రి కలిగిన రాజుయొక్క దొరతనం ఉపాయములు(సామ, దాన, భేద, దండములు) పాడుకాకుండా సాగిపోవును. అట్టి మంత్రిలేని పాలనను కీలూడిపోయిన యంత్రమువలె సాగిపోనేరదు.

మాటకు బ్రాణము సత్యము,
కోటకు బ్రాణంబు సుభట కోటి, ధరిత్రిన్‌
బోటికి బ్రాణము మానము,
చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

భావం: నోటిమాటకు సత్యమును, పెద్ద దుర్గమునకు గొప్ప సైన్య సమూహమును, స్త్రీకి అభిమానమును, పరమును చేవ్రాలును ముఖ్యమైన ఆధారములు.

మానధను డాత్మధృతి చెడి
హీనుండగు వాని నాశ్రయించుట యెల్లన్‌
మానెడు జలముల లోపల
నేనుగు మెయి దాచినట్టు లెఱుగుము సుమతీ!

భావం: అభిమాన శ్రేష్టుడు మనోధైర్యముచెడి అల్పుని ఆశ్రయించుట మానెడు నీళ్ళలో ఏనుగు తన శరీరమును మఱుగు పరచినట్లుండును.

మేలెంచని మాలిన్యుని,
మాలను, మొగసాలెవాని, మంగలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేల గలసి పోవుగాని నెగడదు సుమతీ!

భావం: ఉపకారమును జ్ఞప్తియందుంచుకొనని దుర్మార్గుని, పంచముని, కమసాలవానిని, మంగలిని, హితులనుజేసుకొని పాలించు రాజు యొక్క రాజ్యము మట్టిలో కలసి నాశనమగును కాని కీర్తిని కాంచదు.

రాపొమ్మని పిలువని యా
భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే
దీపంబు లేని యింటను
జేపున కీళ్ళాడినట్లు సిద్ధము సుమతీ!

భావం: దీపములేని గృహమునందు చేవుణికీళ్ళాట ఆడుకొనుట ఎట్లు నిశ్ప్రయోజనమో (ఆనంద ప్రదము ఎట్లుకాదో) ఆ విధముగనే రమ్మనిగాని, పొమ్మని కాని చెప్పని రాజును సేవించుటవలన జీవనమూ లేదు. మోక్షమూ లేదూ వట్టి నిశ్ప్రయోజనము.

రూపించి పలికి బొంకకు,
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలో,
గోపించు రాజు గొల్వకు,
పాపపు దేశంబు సొఱకు పదిలము సుమతీ!

భావం: సాక్షుల మూలముగా నిర్ధారణ చేసి అబద్ధమును నిజమని స్థిరపరచుట, ఆప్తబంధువులను నిందించుట, కోపినిని సేవించుట పాపభూమికి వెళ్ళుట ఇవి తగని పనులు. కాన ఈ విషయములలో జాగ్రత్త వహింపుడు.

లావుగలవాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!

భావం: పెద్ద పర్వతమంతటి ఏనుగుకంటెను చిన్నవాడైననూ మావటివాడు అట్టిదానిని లోగొని ఎక్కుచున్నాడు కావున గొప్పవాడు. అట్లే శరీరబలము కలవానికంటే బుద్ధిబలము కలవాడె నిజముగా బలవంతుడు.

వఱదైన చేను దున్నకు,
కఱవైనను బంధుజనుల కడ కేగకుమీ,
పరులకు మర్మము చెప్పకు,
పిరికికి దళవాయి తనము పెట్టకు సుమతీ!

భావం: వరద ముంచిన చేనును దున్నకుము, కూడు కఱవైనను బంధువుల దగ్గరకు పోకుము. ఇతరులకు రహస్యమును తెలుపకుము. పిఱికివానికి సేనానాయక పదవిని ఇయ్యకుము.

వరిపంట లేని యూరును,
దొర యుండని యూరు, తోడు దొరకని తెరువున్‌,
ధరను పతి లేని గృహమును
నరయంగా రుద్రభూమి యనదగు సుమతీ!

భావం: ధాన్యము పంటలేని గ్రామమును , రాజు వసియింపని నగరమును, సహాయము దొరకని మార్గమును, భర్త (రాజు) లేని గృహమూ ఆలోచింపగా స్మశానముతో సమానమని చెప్పవచ్చును.

వినదగు నెవ్వరు జెప్పిన
వినినంతనె వేగ పడక వివరింప దగున్‌
కని కల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ!

భావం: ఎవరేమి చెప్పినప్పటికిని వినవచ్చును. వినిన తక్షణమే తొందరపడక బాగుగా పరిశీలన చేయవలెను. అట్లు పరిశీలన చేసి కల్ల నిజములను తెలుసుకొనిన మనుజుడె ధర్మాత్ముడు.

వీడెము సేయని నోరును,
జేడెల యధరామృతంబు సేయని నోరున్‌,
పాడంగరాని నోరును
బూడిద కిరవైన పాడు బొందర సుమతీ!

భావం: తాంబూలమును వేసుకొనని, స్త్రీల యధరామృతమును పానము చేయని, గానము చేయని నోరు పెంటబూడిద పోసుకొనెడి గోయి సుమా.

వెలయాలి వలన గూరిమి
గలగదు, మఱి గలిగెనేని కడతేఱదుగా;
బలువురు నడచెడు తెరువున
మొలవదు పువు, మొలిచెనేని పొదలదు సుమతీ!

భావం: పెక్కురు నడిచెడి మార్గమునందు పచ్చగడ్డి మొలవదు. ఒకవేళ మొలిచినను వృద్ధినొందదు. ఆ విధముగనే వేశ్యవలన ప్రేమ లభింపదు. ఒకవేళ లభించినను చాలా కాలము నిలువదు.

వెలయాలు చేయు బాసలు,
వెలయగ మొగసాల బొందు వెలమల చెలిమిన్‌,
గలలోన గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ!

భావం: వేశ్యా ప్రమాణములును, విశ్వబ్రాహ్మణుని స్నేహమును, వెలమదొరల జతయు, కలలో చూసిన సంపదయు, స్పష్టముగా నమ్మరాదు.

వేసరపు జాతి గానీ,
వీసము దా జేయనట్టి వీరిడి గానీ,
దాసి కొడుకైన గానీ,
కాసులు గల వాడె రాజు గదరా సుమతీ!

భావం: నీచ జాతి వాడైనను, కొంచమైనను చేయలేని నిష్ప్రయోజకుడైనను, దాసీపుత్రుడైనను ధనము గలవాడే యధిపతి.

శుభముల పొందని చదువును,
నభినయముగ రాగరసము నందని పాటల్‌,
గుభ గుభలు లేని కూటమి,
సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ [105]

భావం: మంగళములను పొందని విద్యయును, నటనముతోడను, సంగీత సామరస్యముతోడను కూడిన పాటలును, సందడులులేని కలయికయును, సభలయందు మెప్పును పొందని మాటలును, రుచివంతములు కావు. (చప్పనైనవి)

సరసము విరసము కొఱకే,
పరిపూర్ణ సుఖంబు లధిక బాధల కొఱకే,
పెరుగుట విరుగుట కొఱకే,
ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ!

భావం: హాస్యపు మాటలు విరోధముకొరకే, సంపూర్ణమైన సౌఖ్యములు విస్తారమైన బాధలకే, పొడవుగా ఎదుగుట విరిగిపోవుటకే, ధరవరులు ఎక్కువగా తగ్గుట మరల అభివృద్ధి పొందుటకొరకేనని మనుజుడు తెలుసుకొనవలయును.

సిరి తా వచ్చిన వచ్చును
సరళముగ నారికేళ సలిలము భంగిన్‌,
సిరి తా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ!

భావం: సంపద కలిగినప్పుడు కొబ్బరికాయలోనికి నీరువచ్చిన విధముగనే రమ్యముగా కలుగును. సంపద పోయినపుడు ఏనుగు మ్రింగిన వెలగపండులోని గుంజు మాయమగు విధముగనే మాయమైపోవును.

స్త్రీల యెడ వాదులాడకు,
బాలురతో జెలిమిచేసి భాషింపకుమీ,
మేలైన గుణము విడువకు,
మేలిన పతి నింద సేయ కెన్నడు సుమతీ!

భావం: స్త్రీలతో గొడవ పడకు, పిల్లలతో స్నేహం చేసినా వారి వలె మాట్లాడకు, నీలో ఉన్న మంచి గుణములను విడవకు, అధికారుల/ప్రభువుల గురించి చెడుగా మాట్లాడకు.

అడియాసకొలువు గొలువకు
గుడిమణియము సేయబోకు కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు
మడవిని దొడరయ కొంటి నరగకు సుమతీ!

భావం: ప్రయోజనములేని చోట పని/శ్రమ చేయకు, గుడిని ఆక్రమించకు, చెడువారితో స్నేహం చేయకు, అడవి దారిలో నగరానికి (ఆపదలు ఉన్న మార్గంలో) ఒంటరిగా నడవకు.

కనకపు సింహాసనమున
శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమున
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ!

భావం: బంగారు సింహాసనమున కుక్కను ఓ శుభ ముహూర్తములో కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినా దాని అసలు బుద్ధి మారదు అని భావం.

వనరులు

[మార్చు]


శతకములు
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | కామేశ్వరీ శతకము

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.