అన్ని కాలములలోను అన్ని దేశములలోను
సర్వసమర్పణము గావించిన ధీరుల
ఈచిన్ని పుస్తకమును అంకితమిచ్చు చున్నాను.
తొలిపలుకు
సుప్రసిద్ధదేశమగు అమెరికా సంయుక్త రాష్ట్రముల చరిత్రమును ఆంధ్రమహాజనులకు అర్పించుకొనుచున్నాను. అమెరికా సంయుక్త రాష్ట్రముల స్థాపనము, వీరాంగ్లేయ రాజ్యముపై తిరుగబడి స్వతంత్రమును సంపాదించుట, స్వతంత్రమును పొందిన తరువాత రాజులు ప్రభువులులేని సంపూర్ణ ప్రజాపాలనమును స్థాపించుకొనుట, స్వరాజ్యమునందు అమెరికాపౌరుల స్వతంత్రములు, స్వరాజ్యము యొక్క ఫలితముగ అత్యాశ్చర్యకరమగు సర్వతోముఖమైన అభివృద్ధి ఇవి యీచరిత్రమున ప్రధానాంశములు. వీరు పాతకాపురస్తులగు ఎర్ర ఇండియనుల నేమిచేసిరి? తమదేశములోని నల్లవారి నెటులచూచుచున్నారు? అను ప్రశ్నలుకూడ చర్చించబడినవి. అమెరికావారి పాలనముక్రిందనున్న ఫిలిప్పైంస్ ద్వీపములు ఎట్టి రాచకీయ హక్కులు పొందుచున్నవో ఆవిషయముకూడ వ్రాడబడినది.
ఈ పుస్తకములోని తప్పులు మన్నించి గుణలేశమును గ్రహింతురని పాఠక మహాశయులను ప్రార్ధించుచున్నాను.