అమెరికా సంయుక్త రాష్ట్రములు/మొదటి అధ్యాయము
అమెరికా
సంయుక్త రాష్ట్రములు.
మొదటి అధ్యాయము
ఉపోధ్గాతము
(1)
ప్రస్తుతము ప్రపంచమున నైశ్వర్యమునకును, ప్రకృతి శాస్త్రములకును, పరిశ్రమలకును, నవనాగరికతకును ప్రసిద్ధిచెంది, ప్రభుత్వములలో రాష్ట్రములు మిగుల పలుకుబడికలిగియున్న, అమెరికా సంయుక్త రాష్ట్రములు (United States of America) మూడు వందల సంవత్సరములకు పూర్వము లేవు. అపుడచట అరణ్యము లెక్కువగనుండి కొద్ది నాగరితగల తామ్రవర్ణపుజాతులు నివసించియుండిరి. గడచిన మూడువందల సంవత్సరములనుండియు యూరపుఖండవాసులగు తెల్లవారు అచటికి వలసవచ్చి, అదివరకచట కాపురముండిన యెర్రజాతులను చాలవరకు నాశనముజేసి దేశమునంతను ఆక్రమించుకొని సుప్రసిద్ధమగు నీ సంయుక్త రాష్ట్రముల నేర్పరచిరి. అచటికి వచ్చిన తెల్లజాతులవారిలో ఇంగ్లాండు నుండి వచ్చిన ఆంగ్లేయు లధిక సంఖ్యాకులగుటచే నీవలస రాష్ట్రములు 1775 వ సంవత్సరము వరకును ఇంగ్లాండు యొక్క, పాలనముకింద నుండెను. అపుడు తూర్పు సముద్రతీరమున పదమూడు రాష్ట్రములు మాత్రముండెను. తక్కిన ప్రదేశమంతయు నప్పటికి ఎర్రజాతుల యధీనమందుండెను. 1775 వ సంత్సరమున ఆంగ్లేయ ప్రభుత్వమువారు వేసిన యధిక పన్ను ల నిచ్చుటకు నిరాకరించి యాపదమూడు రాష్ట్రము లవారును ఆంగ్లేయ ప్రభుత్వము పై తిరుగుబాటుచేసిరి. ఆంగ్లేయ ప్రభుత్వమువారు యుద్ధమునకు రాగ వలస రాష్ట్రముల వారు వారినోడించి స్వాతంత్ర్యమును పొంది, అమెరికా సంయుక్త రాష్ట్రములకు రాజులేని సంయుక్తప్రజాస్వామ్యము నేర్పరచుకొనిరి. అప్పటినుండియు తెల్లవారు పడమటి సముద్రమువరకును గల యావత్తు దేశమును స్వాధీనమును పొంది 52 రాష్ట్రములుగ చేసికొనియున్నారు. వీరిని సాధారణముగ మనము అమెరికా వారని చెప్పుదుము.
(2)
అమెరికా యొక్క స్వతంత్రముకొరకై జరిగిన ఈ యుద్ధము చరిత్రలో చాల ప్రాముఖ్యమయినది. నవీన ఆమెరికా స్వతంత్ర కాలమున మాతృదేశముమీద వలసరాజ్యము తిరుగబడి స్వతంత్ర్యమును పొందుటకిదే ప్రధమ నిదర్శనము. ఈ మార్గమునే యనుసరించి పరాసు దేశముపైనను, స్పైన్ దేశము పైనసు వాటి క్రింద నుండిన అమెరికాలోని వలసరాజ్యములు తిరుగబాటు చేసి స్వతంత్ర ప్రభుత్వముల నేర్పరచుకున్నవి.
మెక్సికోలోను, పెరూలోను, స్వతంత్రముగనుండిన గొప్ప ఎర్రయిండియసు రాజ్యములు "తెల్లజాతులచే నాశనము
చేయబడిన తరువాత, అమెరికాఖండమున, యూరపుఖండము లోని ప్రభుత్వములకు లోబడక, స్వతంత్రముగ స్థాపింపబడిన మొదటి ప్రభుత్వ మీయమెరికా సంయుక్త రాష్ట్రములే.
అమెరికాఖండమున ఇంగ్లాండు ముఖ్యమగు నీవలస రాజ్యములను పోగొట్టుకొనిన తరువాత, తూర్పుఖండములగు ఆసియూ, ఆఫ్రికాలలో తన రాజ్యమును విస్తరింపజేయుటకు తీవ్రమగు కృషిని సలిపినది.
అమెరికా వారు స్వతంత్ర భావములను ఫ్రాన్సునుండి గ్రహించి ముందుగ కార్యరూపముగ పరిణమింపజేయుట వలనను, వీరు స్వాతంత్ర్యమునకై సలిపిన పోరాటములో పరాసువారు చాలగ తోడ్పడుటవలనను, పరాసుదేశములో కూడ ప్రజాస్వాతంత్ర విప్లవము శీఘ్రముగ జరుగుటకు విశేషముగు పోద్బలము కలిగెను. పరాసువిప్లపము వలన దేశాభి మానము, ప్రజాస్వాతంత్ర్యము, మానవ సమానత్వము,మొదలగు భావములు వ్యాపించి క్రమముగ యూరోపుఖండము యొక్కయు మానవకోటి యొక్కయు రాజకీయ సాంఘిక జీవితమంతయు గొప్పమార్పును చెందినది.
అమెరికా సంయుక్త రాష్ట్రముల రాజ్యంగ విధానము వలన మానవ చరిత్రలో గొప్ప సంయుక్త ప్రజా, ప్రభుత్వమేర్పరచుకొనుటకు ప్రధమమనుభపము కలిగినది. దీని తరువాత దీని ననుకరించి యనేక దేశములలో సంయుక్తప్రభుత్వ ముల నేర్పరచుకొని యున్నారు,