అధ్యాయము - ౯

వికీసోర్స్ నుండి
భాగవతము - ప్రధమ స్కంధము
అధ్యాయాలు
1. ప్రారంభము
2. అధ్యాయము - ౧
3. అధ్యాయము - ౨
4. అధ్యాయము - ౩
5. అధ్యాయము - ౪
6. అధ్యాయము - ౫
7. అధ్యాయము - ౬
8. అధ్యాయము - ౭
9. అధ్యాయము - ౮
10.అధ్యాయము - ౯
11.అధ్యాయము - ౧౦
12.అధ్యాయము - ౧౧
13.అధ్యాయము - ౧౨
14.అధ్యాయము - ౧౩
15.అధ్యాయము - ౧౪
16.అధ్యాయము - ౧౫
17.అధ్యాయము - ౧౬
18.అధ్యాయము - ౧౭
19.అధ్యాయము - ౧౮
20.అధ్యాయము - ౧౯

క.

అని యిట్లు ధర్మసూనుఁడు

మొనసి నిరాహారభావమున దేవనదీ

తనయుఁడు గూలినచోటికిఁ

జనియెఁ బ్రజాద్రోహ పాపచలితాత్ముండై 203


ధర్మరాజు శ్రీకృష్ణసహితుండై శరతల్పగతుండగు భీష్మునికడ కేగుట[మార్చు]

వ.

అయ్యవసరంబునం దక్కిన పాండవులును ఫల్గునసహితుండైన పద్మలోచనుం

డును కాంచన సమంచితంబులైన రథంబులెక్కి ధర్మజుం గూడి చన నతండు

గుహ్యక సహితుండైన కుబేరుభంగి నొప్పె. ఇట్లు పాండవులు పరిజనులు

గొలువఁ బద్మనాభ సహితులై కురుక్షేత్రంబున కేగి దివంబునుండి నేలం గూలిన

దేవత తెఱంగున సంగ్రామ పతితుండైన గంగానందనునకు నమస్కరించిరి.

అంత బృహదశ్వ భరద్వాజ పరశురామ గౌతమ పర్వత నారద బాదరాయణ

కశ్యపాంగిరస కౌశిక ధౌమ్య సుదర్శన శుక వశిష్ఠాద్యనేక రాజర్షి దేవర్షి

బ్రహ్మర్షుల శిష్యసమేతులై చనుదెంచినం జూచి సంతసించి దేశ కాల విభాగ

వేది యైన భీష్ముండు వారలకుం బూజనంబులు సేయించి. 204


క.

మాయాంగీకృత దేహుం

డై యఖిలేశ్వరుఁడు మనుజుఁ డైనాఁడని ప్ర

జ్ఞాయత చిత్తంబున గాం

గేయుఁడు పూజనము సేసెఁ గృష్ణు జిష్ణు. 205


వ.

మఱియుం గంగానందనుండు వినయ ప్రేమ సుందరులైన పాండునందనులం

గూర్చుండ నియోగించి మహానురాగ జనిత బాష్పసలిల సందోహ సమ్మిళిత

లోచనుండై యిట్లనియె. 206


ఆ.

ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగాఁ

బ్రతుకఁదలఁచి మీరు బహు విధముల

నన్నలార! పడతి రాపత్పరంపర

లిట్టి చిత్రకర్మ మెందుఁ గలదె! 207


ఉ.

సంతస మింతలేదు మృగశాప వశంబునఁ బాండు భూవిభుం

డంతము వొంది యుండ మిము నర్భకులం గొనివచ్చి కాంక్షతో

నింతటివారిఁగాఁ బెనిచె నెన్నఁడు సౌఖ్యముపట్టు గాన దీ

కుంతి యనేక దుఃఖములఁ గుందుచు నున్నది భాగ్యమెట్టిదో! 208


ఉ.

వాయు వశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం

బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై

పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు కాల మన్నియుం

జేయుచునుండుఁ గాలము విచిత్రము దుస్తర మెట్టివారికి. 209


ఉ.

రాజఁట ధర్మజుండు సురరాజు సుతుండఁట ధన్వి శాత్రవో

ద్వేజకమైన గాండివము విల్లఁట సారథి సర్వభద్ర సం

యోజకుఁడైన చక్రి యఁట యుగ్రగదాధరుఁడైన భీముఁడ

య్యాజికిఁ దోడు వచ్చునఁట యాపద గల్గుట యేమి చోద్యమో! 210


ఆ.

ఈశ్వరుండు విష్ణుఁ డెవ్వేళ నెవ్వని

నేమిసేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు?

నతని మాయలకు మహాత్ములు విద్వాంసు

లణఁగి మెలఁగుచుందు రంధులగుచు. 211


వ.

కావున దైవ తంత్రం బైన పనికి వగవం బనిలేదు. రక్షకులులేని ప్రజల

నుపేక్షింపక రక్షింపఁ బుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు

తేజోనిరూఢుండు గాక యాదవులందు గూఢుండై తన మాయచేత లోకంబుల

మోహాతిరేకంబు నొందించును. అతని రహస్యప్రకారంబులు భగవంతుండైన

శివుం డెఱుంగు. మఱియు దేవర్షియగు నారదుండును భగవంతుడగు కపిల

మునియు నెఱుంగుదురు. మీరు కృష్ణుండు దేవకీపుత్రుండని మాతులేయుండని

తలంచి దూత సచివ సారథి బంధు మిత్ర ప్రయోజనంబుల నియమించుదు రిన్నిటం

గొఱంతలేదు. రాగాది శూన్యుండు నిరహంకారుం డద్వయుండు సమదర్శనుండు

సర్వాత్మకుండు నైన యీశ్వరునకు నతోన్నతభావ మతివైషమ్యంబు లెక్కడివి?

లేవు. అయిన భక్తవత్సలుండు గావున నేకాంత భక్తులకు సులభుండై యుండు. 212


సీ.

అతిభక్తి నెవ్వనియందుఁ జిత్తముఁ జేర్చి యెవ్వనినామ మూహించి పొగడి

కాయంబు విడుచుచుఁ గామ కర్మాది నిర్మూలనుండై యోగి ముక్తినొందు

నట్టి సర్వేశ్వరుం డఖిల దేవోత్తంసుఁ డెవ్వేళఁ బ్రాణంబు లేను విడుతు

నందాక నిదె మందహాసుఁడై వికసిత వదనారవిందుఁడై వచ్చి నేఁడు

తే.

నాల్గుభుజములుఁ గమలాభనయనయుగము నొప్పఁ గన్నులముందట నున్నవాఁడు

మానవేశ్వర నా భాగ్యమహిమఁ జూడు మేమి సేసితినో! పుణ్యమితనిఁగూర్చి. 213


వ.

అని యిట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుండైన కురుకుంజరుని వచనంబులు

వినయంబున నాకర్ణించి మునులందఱు వినుచునుండ ధర్మనందనుండు మందాకినీ

నందనువలన నరజాతి సాధారణంబులగు ధర్మంబులును వర్ణాశ్రమ ధర్మంబులును

రాగ వైరాగ్యోపాధులతోఁ గూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును దాన ధర్మంబులును

రాజధర్మంబులును స్త్రీధర్మంబులును శమదమాదికంబులును హరితోషణంబులగు

ధర్మంబులును ధర్మార్థ కామ మోక్షంబులును నానావిధోపాఖ్యానేతిహాసంబులును సంక్షేప

విస్తార రూపంబుల నెఱింగె. అంత రథిక సహస్రంబులకు గమికాఁడైన భీష్ముండు

స్వచ్ఛందమరణులైన యోగీశ్వరులకు వాంఛితంబగు నుత్తరాయణంబు చనుదెంచిన

నది దనకు మరణోచిత కాలంబని నిశ్చయించి. 214


శా.

ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ

గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి తత్కారుణ్యదృష్టిన్ విని

ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి భీష్ముండు సం

శీలం బొప్ప నుతించెఁ గల్మష గజశ్రేణీ హరిన్ శ్రీహరిన్. 215


వ.

ఇట్లు పరమేశ్వరుండైన హరియందు నిష్కాముండై ధారణావతియైన బుద్ధిని

సమర్పించి పరమానందంబు నొంది ప్రకృతివలన నైన సృష్టిపరంపరలఁ బరిహ

రించు తలంపున మందాకినీనందనుం డిట్లనియె. 216


భీష్ముఁడు శ్రీకృష్ణుని స్తుతించుట[మార్చు]

మ.

త్రిజగన్మోహన నీలకాంతి తను వుద్దీపింపఁ బ్రాభాతనీ

రజ బంధుప్రభమైన చేలము పయి రంజిల్ల నీలాలక

వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా

విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడు. 217


మ.

హయ రింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై

రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో

జయముం బార్థున కిచ్చువేడ్క నని నా శస్త్రాహతిం జాల నొ

చ్చియుఁ బోరించు మహాభావు మదిలోఁ జింతింతునశ్రాంతము. 218


మ.

నరుమాట ల్విని నవ్వుతో నుభయసేనా మధ్యమక్షేణిలోఁ

బరు లీక్షింప రథంబు నిల్పి పర భూపాలావళిం జూపుచుం

బర భూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ

పరమేశుండు వెలుంగుచుండెడు మనః పద్మాసనాసీనుఁడై. 219


క.

తనవారిఁ జంపఁ జాలక

వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంక

ఘన యోగవిద్యఁ బాపిన

మునివంద్యుని పాదభక్తి మొనయు నాకు. 220


సీ.

కుప్పించి యెగసినఁ గుండలముల కాంతి గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న జగముల వ్రేఁగున జగతి గదలఁ

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ బైనున్న పచ్చని పటము జాఱ

నమ్మితి నాలావు నగుఁబాటు సేయక మన్నింపు మని క్రీడి మఱలఁ దిగువఁ

తే.

గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు

విడువు మర్జున! యనుచు మద్విశిఖవృష్టిఁ దెరలి చనుదెంచె దేవుండు దిక్కునాకు. 221


మ.

తనకు భృత్యుఁడు వీనిఁ గాచుట మహాధర్మంబు వొమ్మంచు న

ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁజోద్యంబుగాఁ బట్టుచు

మునికోలన్వడిఁ జూపి ఘోటకముల న్మోదించి తాటింపుచు

జనుల న్మోహము నొందఁజేయు పరమోత్సాహుం బ్రశంసించెద. 222


క.

పలుకుల నగవుల నడపుల

నలుకల నవలోకనముల నాభీరవధూ

కులముల మనముల తాలిమి

కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలో. 223


ఆ.

మునులు నృపులు సూడ మును ధర్మజుని సభా

మందిరమున యాగమండపమునఁ

జిత్రమహిమతోడఁ జెలువొందు జగ దాది

దేవుఁ డమరు నాదు దృష్టియందు. 224


మ.

ఒక సూర్యుండు సమస్త జీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో

లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ

న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ

పకుఁడై యెప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై. 225


వ.

అని యిట్లు మనో వాగ్దర్శనంబులం బరమాత్మయగు కృష్ణుని హృదయంబున

నిలిపికొని నిశ్వాసంబులు మాని నిరూపాధికంబైన వాసుదేవ బ్రహ్మంబునందు

గలసిన భీష్మునిం జూచి సర్వజనులు దినావసానంబున విహంగంబు లూరక

యుండు తెఱంగున నుండిరి. దేవ మానవ వాదితంబులై దుందుభి నినదంబులు

మెరసె. సాధుజనకీర్తనంబులు మెఱసె. కుసుమ వర్షంబులు గురిసె. మృతుండైన

భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించి ముహూర్త మాత్రంబు

దుఃఖితుండయ్యె. అంత నచ్చటి మునులుఁ గృష్ణునిఁ దమ హృదయంబుల నిలిపి

కొని సంతుష్టాంతరంగు లగుచుఁ దదీయ దివ్యనామంబులచే స్తుతియించి స్వాశ్ర

మంబులకుఁ జనిరి. పిదప నయ్యుధిష్ఠిరుండు కృష్ణసహితుండై గజపురంబునకుం

జని గాంధారీసహితుండైన ధృతరాష్ట్రు నొడంబఱచి వారి సమ్మతంబున

వాసుదేవానుమోదితుండై పితృ పైతామహంబైన రాజ్యంబుగైకొని ధర్మ

మార్గంబునం బాలనంబు సేయుచుండె నని సూతుండు చెప్పిన విని శౌనకుండిట్లనియె. 226





భాగవతము స్కందములు భాగవతము స్కందములు
భాగవతము - ప్రధమ స్కంధము | భాగవతము - ద్వితీయ స్కంధము | భాగవతము - తృతీయ స్కంధము | భాగవతము - చతుర్ధ స్కంధము | భాగవతము - పంచమ స్కంధము | భాగవతము - షష్ఠ స్కంధము | భాగవతము - సప్తమ స్కంధము | భాగవతము - అష్టమ స్కంధము | భాగవతము - నవమ స్కంధము | భాగవతము - దశమ స్కంధము | భాగవతము - ఏకాదశ స్కంధము | భాగవతము - ద్వాదశ స్కంధము