అధ్యాయము - ౮

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
భాగవతము - ప్రధమ స్కంధము
అధ్యాయాలు
1. ప్రారంభము
2. అధ్యాయము - ౧
3. అధ్యాయము - ౨
4. అధ్యాయము - ౩
5. అధ్యాయము - ౪
6. అధ్యాయము - ౫
7. అధ్యాయము - ౬
8. అధ్యాయము - ౭
9. అధ్యాయము - ౮
10.అధ్యాయము - ౯
11.అధ్యాయము - ౧౦
12.అధ్యాయము - ౧౧
13.అధ్యాయము - ౧౨
14.అధ్యాయము - ౧౩
15.అధ్యాయము - ౧౪
16.అధ్యాయము - ౧౫
17.అధ్యాయము - ౧౬
18.అధ్యాయము - ౧౭
19.అధ్యాయము - ౧౮
20.అధ్యాయము - ౧౯

వ.

ఇట్లశ్వత్థామం బ్రాణావశిష్టుం జేసి వెడలనడిచి పాండవులు పాంచాలీసహితులై

పుత్రులకు శోకించి మృతులైన బంధువులకెల్ల దహనాది కృత్యంబులు సేసి జల

ప్రదానంబు సేయుకొఱకు స్త్రీల ముందల నిడుకొని గోవిందుండునుం దామును

గంగకుం జని తిలోదకంబులు సేసి క్రమ్మఱ విలపించి హరిపాదపద్మజాత

పవిత్రంబులైన భాగీరథీజలంబుల స్నాతులై యున్నయెడం బుత్రసోకాతురు

లైన గాంధారీ ధృతరాష్ట్రులను గుంతీ ద్రౌపదులను జూచి మాధవుండు

మునీంద్రులుం దానునుం బంధుమరణ శోకాతురులైన వారల వగపు మానిచి

మన్నించె నివ్విధంబున. 174


శా.

పాంచాలీ కబరి వికర్షణ మహాపాప క్షతాయుష్కులం

జంచద్గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి

ప్పించె రాజ్యము ధర్మపుత్రునకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁ జే

యించె మూఁడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. 175


శ్రీకృష్ణుం డుత్తరా గర్భస్థుండగు పరీక్షితునిఁ దన చక్రంబుచే రక్షించుట[మార్చు]

వ.

అంత వాసుదేవుండు వ్యాసప్రముఖ భూసురపూజితుండై యుద్ధవ సాత్యకులు

గొలువ ద్వారకాగమన ప్రయత్నంబునఁ బాండవుల వీడ్కొని రథారోహణంబు

సేయు సమయంబునం దత్తరపడుచు నుత్తర సనుదెంచి కల్యాణ గుణోత్తరుం

డైన హరి కిట్లనియె. 176


మ.

ఇదె కాలానల తుల్యమైన విశిఖం బేతెంచె దేవేశ! నేఁ

డుదరాంతర్గత గర్భ దాహమునకై యుగ్రాకృతిన్ వచ్చుచు

న్నది దుర్లోక్యము మానుప శరణ మన్యం బేమియు లేదు నీ

పదపద్మంబులె కాని యెండెఱుఁగ నీ బాణాగ్ని వారింపవే. 177


క.

దుర్భర బాణానలమున

గర్భములోనున్న శిశువు ఘన సంతాపా

విర్భావంబును బొందెడి

నిర్భర కృపఁ గావుమయ్య! నిఖిలస్తుత్యా! 178


క.

చెల్లెలి కోడల నీ మే

నల్లుఁడు శత్రువులచేత హతుఁడయ్యెను సం

ఫుల్లారవిందలోచన!

భల్లాగ్ని నణంచి శిశువు బ్రతికింపఁగదే. 179


ఆ.

గర్భమందుఁ గమలగర్భాండ శతములు

నిముడుకొన నటించు నీస్వరేశ!

నీకు నొక్క మానినీ గర్భరక్షణ

మెంత బరువు నిర్వహింతు గాక. 180


వ.

అనిన నాశ్రిత వత్సలుండైన పరమేశ్వరుండు సుభద్రకోడలి దీనాలాపంబు

లవధరించి యిది ద్రోణనందనుండు లోకమంతయు నపాండవం బయ్యెడు నని

యేసిన దివ్యాస్త్రమని యెఱింగె. అంతఁ బాండవుల కభిముఖంబై ద్రోణనందను

దివ్యాస్త్ర నిర్గత నిశిత మార్గణంబు డగ్గఱిన బెగ్గడిలక వారును

ప్రత్యస్త్రంబు లందుకొని పెనంగు సమయంబున. 181


మ.

తన సేవారతిచింత గాని పరచింతా లేశము లేని స

జ్జనులం బాండుతనూజుల మనుపు వాత్సల్యంబుతో ద్రోణనం

దను బ్రహ్మాస్త్రము నడ్డపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా

దన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధశ్చక్రముం జక్రము. 182


మ.

సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ

క్ష్మకళుం డచ్యుతుఁ డయ్యెడన్ఁ విరటజా గర్భంబుఁ దాఁ జక్రహ

స్తకుఁడై వైష్ణవమాయఁ గప్పి కురుసంతానార్థియై యడ్డమై

ప్రకటస్ఫూర్తి నణంచె ద్రోణతనయ బ్రహ్మాస్త్రము లీలతో. 183


వ.

ఇట్లు ద్రోణతనయుండేసిన ప్రతిక్రియా రహితంబైన బ్రహ్మశిరం బనియెడి

దివ్యాస్త్రంబు వైష్ణవతేజంబున నిరర్థకంబయ్యె. నిజమాయా విలసనమున సకల

లోక సర్గస్థితి సంహారంబు లాచరించునట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు

విచిత్రంబుగాదు. తత్సమయంబున సంతసించి పాండవ పాంచాలపుత్రికా

సహితయై గొంతి గమనోన్ముఖుండైన హరిం జేరవచ్చి యిట్ట్లనియె. 184


కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట[మార్చు]

క.

పురుషుం డాఢ్యుఁడు ప్రకృతికిఁ

బరుఁ డవ్యయుఁ డఖిల భూత బహిరంతర్భా

సురుఁడు నవలోకనీయుఁడు

పరమేశ్వరుఁడైన నీకుఁ బ్రణుతు లగు హరీ. 185


వ.

మఱియు జవనిక మఱువున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా

జవనికాంతరాళంబున నిలువంబడి మహిమచేఁ బరమహంసలు నివృత్త రాగ

ద్వేషులు నిర్మలాత్ములు నైన మునులకు నదృశ్యమానుండవై పరిచ్ఛిన్నుండవు

గాని నీవు మూఢదృక్కులు గుటుంబవతులు నగు మాకు నెట్లు దర్శనీయుండవయ్యెదు?

శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద!

పంకజనాభ! పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశ చరణ!

హృషీకేశ! భక్తియోగంబునంజేసి నమస్కరించెద నవధరింపుము. 186


సీ.

తనయులతోడనే దహ్యమానంబగు జతుగృహంబందును జావకుండఁ

గురురాజు వెట్టించు ఘోరవిషంబుల మారుత పుత్రుండు మడియకుండ

ధార్తరాష్ట్రుఁడు సముద్ధతిఁ జీరలొలువంగ ద్రౌపదిమానంబు దలఁగకుండ

గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డ లనిలోన నలఁగకుండ

తే.

విరటుపుత్రిక కడుపులో వెలయు చూలు ద్రోణనందన శరవహ్నిఁ ద్రుంగకుండ

మఱియు రక్షించితివి పెక్కు మార్గములను నిన్ను నేమని వర్ణింతు నీరజాక్ష! 187


మత్తకోకిల.

బల్లిదుండగు కంసుచేతను బాధ నొందుచునున్న మీ

తల్లిఁ గాచిన భంగిఁ గాచితి ధార్తరాష్ట్రులచేత నేఁ

దల్లడంబునఁ జిక్కకుండఁగఁ దావకీన గుణవ్రజం

బెల్ల సంస్తుతి సేసి చెప్పఁగ నెంతదాన జగత్పతీ! 188


క.

జననము నైశ్వర్యంబును

ధనమును విద్యయును గల మదచ్ఛన్ను కిలకెం

చన గోచరుఁడగు నిన్నున్

వినుతింపఁగ లేరు నిఖిల విబుధస్తుత్యా! 189


వ.

మఱియు భక్తధనుండును, నివృత్త ధర్మార్థ కామ విషయుండును, ఆత్మా

రాముండును రాగాది రహితుండును కైవల్యదాన సమర్థుండును కాలరూపకుండును

నియామకుండును నాద్యంత శూన్యుండును విభుండును సర్వసముండును సకలభూత

నిగ్రహానుగ్రహకరుండు నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము.

మనుష్యుల విడంబించు భవదీయ విలసనంబు నిర్నయింప నెవ్వఁడు

సమర్థుండు? నీకుం బ్రియాప్రియులు లేరు. జన్మ కర్మ శూన్యుండవైన నీవు

తిర్యగాది జీవులయందు వరాహాది రూపంబులను మనుష్యులందు రామాది

రూపంబులను ఋషులయందు వామనాది రూపంబులను జలచరంబులయందు

మత్స్యాది రూపంబులను నవతరించుట లోకవిడంబనార్థంబు గాని జన్మ కర్మ

సహితుండవగుటం గాదు. 190


ఉ.

కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో

గోపిక ద్రాటఁ గట్టిన వికుంచిత సాంజన బాష్ప తోయధా

రా పరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చ నూర్చుచుం

బాపఁడవై నటించుట గృపాపర! నా మదిఁ జోద్యమయ్యెడిన్. 191


క.

మలయమునఁ జందనము క్రియ

వెలయఁగ ధర్మజునికీర్తి వెలయించుటకై

యిలపై నభవుఁడు హరి యదు

కులమున నుదయించె నండ్రు గొంద ఱనంతా! 192


క.

వాసుదేవ దేవకులు దా

పసగతి గతభవమునందుఁ బ్రార్థించిన సం

తసమునఁ బుత్రత నొందితి

వసురుల మృతికంచుఁ గొందఱండ్రు మహాత్మా! 193


క.

జలరాశిలో మునింగెడి

కలముక్రియన్ భూరిభార కర్మిత యగు నీ

యిలఁ గావ నజుఁడు గోరినఁ

గలిగితి వని కొంద ఱండ్రు గణనాతీతా! 194


తే.

మఱచి యజ్ఞాన కామ కర్మములఁ దిరుగు

వేదనాతురులకుఁ దన్నివృత్తిఁ జేయ

శ్రవణచింతన వందనార్చనములిచ్చు

కొఱకు నుదయించి తండ్రు నిన్ గొందఱభవ! 195


మ.

నినుఁ జింతింపుచుఁ బాడుచుం బొగడుచున్నీ దివ్యచారిత్రముల్

వినుచుం జూతురుగాక లోకు లితరాన్వేషంబులం జూతురే?

ఘన దుర్జన్మ పరంపరా హరణ దక్షంబై మహాయోగి వా

గ్వినుతంబైన భవత్పదాబ్జ యుగమున్ విశ్వేశ! విశ్వంభరా! 196


దేవా! నిరాశ్రయులమై భవదీయ చరణారవిందముల నాశ్రయించి నీవారలమైన

మమ్ము విడిచి విచ్చేయనేల? నీ సకరుణావలోకనంబుల నిత్యంబును జూడవేని

యాదవ సహితులైన పాండవులు జీవునిం బాసిన యింద్రియంబుల చందంబునఁ

గీర్తిసంపదలు లేక తుచ్ఛత్వంబు నొందుదురు. కల్యాణలక్షణ లక్షితంబులైన

నీ యడుగులచేత నంకితంబైన యీ ధరణీమండలంబు నీవు వాసిన శోభితంబు

గాదు. నీ కృపావీక్షణామృతంబున నిక్కడి జనపదంబులు గుసుమ ఫల

భరితంబులు నోషధి తరులతాగుల్మ నదనదీ నగసాగర సమేతంబులునైయుండు. 197


ఉ.

యాదవులందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి

చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ

పాదసరోజ చింతనముపై ననిశంబు మదీయబుద్ధి న

త్యాదరవృత్తితోఁ గదియు నట్లుగఁ జేయఁగదయ్య! యీశ్వరా! 198


శా.

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నకరా!

లోకద్రోహి నరేంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా

నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా!

నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యాసుకంపానిధీ! 199


వ.

అని యిట్లు సకల సంభాషణంబుల నుతియించు గొంతి మాటలకు నియ్యకొని

గోవిందుడు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబు నొందించి

రథారూఢుండై కరినగరంబునకు వచ్చి కుంతీ సుభద్రాదులన్ వీడ్కొని తన

పురంబునకు విచ్చేయ గమకించి ధర్మరాజుచేఁ గించిత్కాలంబు నిలువుమని

ప్రార్థితుండై నిలిచె. అంత బంధువధ శోకాతురుండైన ధర్మజుఁడు నారాయణ

వ్యాస ధౌమ్యాదులచేతఁ దెలుపంబడియుఁ దెలియక మోహితుండై నిర్వివేకంబున

నిట్లనియె. 200


మ.

తన దేహంబునకై యనేక మృగసంతానంబుఁ జంపించు దు

ర్జను భంగి గురు బాలక ద్విజ తనూజ భ్రాతృసంఘంబు ని

ట్లనిఁ జంపించిన పాపకర్మునకు రాజ్యాకాంక్షికి నాకు హా

యన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగము ల్మానునే. 201


వ.

మఱియుఁ బ్రజా పరిపాలన పరుండైన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల

వధియించినఁ బాపంబు లేదని శాస్త్రవచనంబు గలదు. అయిన నది విజ్ఞానంబు

కొఱకు సమర్థంబు గాదు. చతురంగంబుల ననేకాక్షౌహిణీ సంఖ్యాతంబులం

జంపించితి. హతబంధు లైన సతుల కేను జేసిన ద్రోహంబు దప్పించుకొన

నేర్పులేదు. గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగమేధాది యాగంబులచేతం

బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబులవలన విడివడి నిర్మలుండగు నని నిగమం

బులు నిగమించు. పంకంబునఁ బంకిల స్థలంబునకును మద్యంబున మద్యభాండమున

కును శుద్ధి సంభవింపని చందంబున బుద్ధి పూర్వక జీవహింసనంబులైన యాగంబుల

చేతం బురుషులకుఁ బాపబాహుళ్యంబ కాని పాపనిర్ముక్తి గాదని శంకించెద. 202

భాగవతము స్కందములు భాగవతము స్కందములు
భాగవతము - ప్రధమ స్కంధము | భాగవతము - ద్వితీయ స్కంధము | భాగవతము - తృతీయ స్కంధము | భాగవతము - చతుర్ధ స్కంధము | భాగవతము - పంచమ స్కంధము | భాగవతము - షష్ఠ స్కంధము | భాగవతము - సప్తమ స్కంధము | భాగవతము - అష్టమ స్కంధము | భాగవతము - నవమ స్కంధము | భాగవతము - దశమ స్కంధము | భాగవతము - ఏకాదశ స్కంధము | భాగవతము - ద్వాదశ స్కంధము