అధ్యాయము - ౨

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
భాగవతము - ప్రధమ స్కంధము
అధ్యాయాలు
1. ప్రారంభము
2. అధ్యాయము - ౧
3. అధ్యాయము - ౨
4. అధ్యాయము - ౩
5. అధ్యాయము - ౪
6. అధ్యాయము - ౫
7. అధ్యాయము - ౬
8. అధ్యాయము - ౭
9. అధ్యాయము - ౮
10.అధ్యాయము - ౯
11.అధ్యాయము - ౧౦
12.అధ్యాయము - ౧౧
13.అధ్యాయము - ౧౨
14.అధ్యాయము - ౧౩
15.అధ్యాయము - ౧౪
16.అధ్యాయము - ౧౫
17.అధ్యాయము - ౧౬
18.అధ్యాయము - ౧౭
19.అధ్యాయము - ౧౮
20.అధ్యాయము - ౧౯

సూతుండు నారాయణ కథాప్రశంస చేయుట[మార్చు]

వ.

అని యిట్లు మహనీయగుణగరిష్ఠులయిన శౌనకాదిమునిశ్రేష్ఠులడిగిన రోమహర్షణ

పుత్రుండై యుగ్రశ్రవసుండను పేరనొప్పి నిఖిలపురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండు 52


మ.

సముఁడై యెవ్వఁడు ముక్తకర్మచయుఁడై సన్న్యాసియై యెంటిఁబో

వ మహాభీతి నొహోకుమార యనుచున్ వ్యాసుండు సీరంగ వృ

క్షములుం దన్మయతం బ్రతిధ్వనులు సక్కంజేసె మున్నట్టి భూ

తమయున్ మ్రొక్కెద బాదరాయణిఁ దపోధన్యాగ్రణిన్ ధీమణిన్. 53


సీ.

కార్యవర్గంబును గారణసంఘంబు నధికరించి చరించు నాత్మతత్త్వ

మధ్యాత్మ మనఁబడు నట్టి యధ్యాత్మముఁ దెలివి సేయఁగఁజాలు దీపమగుచు

సకలవేదములకు సారాంశమై యసాధారణమగు ప్రభావ

రాజకంబైన పురాణమర్మంబును గాఢసంసారాంధకారపటలి

తే.

దాఁటఁగోరెడి వారికి దయదలిర్ప నే తపోనిధి వివరించె నేర్పడంగ

నట్టి శుకనామధేయు మహాత్మగేయు విమలవిజ్ఞాన రమణీయ వేడ్కఁగొలుతు. 54


క.

నారాయణునకు నరునకు

భారతికిని మ్రొక్కి వ్యాసు పదములకు నమ

స్కారము సేసి వచింతు ను

దారగ్రంథంబు దళితతనుబంధంబున్. 55


వ.

అని యిట్లు దేవతాగురు నమస్కారంబుచేసి యిట్లనియె. మునీంద్రులారా! నన్ను

మీరలు నిఖిలలోకమంగళంబైన ప్రయోజనం బడిగితిరి. ఏమిటం గృష్ణ సంప్రశ్నంబు

సేయంబడు నెవ్విధంబున నాత్మ ప్రసన్నంబగు నిర్విఘ్నయు నిర్హేతుకయునైన హరి

భక్తి యే రూపమునంగలుగు నది పురుషులకుఁ బరమ ధర్మంబగు. వాసుదేవునియందుఁ

బ్రయోగింపబడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులం బుట్టించు. నారాయణ కథల

వలన నెయ్యేధర్మంబులు దగుల వవి నిరర్థకంబులు. అపవర్గపర్యంతంబైన ధర్మంబున

కర్థంబు ఫలంబుగాదు. ధర్మంబునందవ్యభిచారియైన యర్థంబునకుఁ గామంబు ఫలంబుగాదు.

విషయభోగంబైన కామంబున కింద్రియప్రీతి ఫలంబుగాదు. ఎంతదడవు జీవించు

నంతియ కామంబునకు ఫలంబు. తత్త్వజిజ్ఞాసగల జీవునకుఁ గర్మములచేత నెయ్యది

సుప్రసిద్ధంబదియు నర్థంబుగాదు. తత్త్వజిజ్ఞాస యనునది ధర్మజిజ్ఞాస. కొందఱు

ధర్మంబె తత్త్వమని పలుకుదురు. తత్త్వవిదులు జ్ఞానమనుపేర నద్వయమైన యది

తత్త్వమని యెఱుంగుదురు. ఆ తత్త్వంబౌపనిషదులచేతం బ్రహ్మమనియు

హైరణ్యగర్భులచేతం బరమాత్మ యనియు సాత్వతులచేత భగవంతుడనియును బలుకంబడు.

వేదాంత శ్రవణంబున గ్రహింపంబడి జ్ఞాన వైరాగ్యములతోడం గూడిన

భక్తిచేతఁ దత్పరులైన పెద్దలు క్షేత్రజ్ఞుండైన యాత్మయందుఁ బరమాత్మం బొడగందురు.

ధర్మంబునకు భక్తి ఫలంబు. పురుషులు వర్ణాశ్రమ ధర్మభేదంబులంజేయు

ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయె సిద్ధి. ఏక చిత్తంబున నిత్యంబును

గోవిందు నాకర్ణింపను వర్ణింపనుదగు. చక్రాయుధధ్యానమను ఖడ్గంబున వివేకవంతు

లహంకారనిబద్ధంబైన కర్మంబు ద్రుంచివైతురు. భగవంతునియందు శ్రద్ధయు

నపవర్గదంబగు తత్కథాశ్రవణాదులం దత్యంతాసక్తియు పుణ్యతీర్థావగాహన

మహత్సేవాదులచే సిద్ధించు కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచను కథలం

దెవ్వండు రతి సేయు, విననిచ్చగించు, వాని కితరంబులెవ్వియు రుచి పుట్టింపనేరవు.

పుణ్యశ్రవణకీర్తనుండైన కృష్ణుండు దన కథలు వినువారి హృదయంబులందు

నిలిచి శుభంబు లాచరించు. అ శుభంబులు నిరసించు. అ శుభబులు నష్టంబులయిన

భాగవతశాస్త్ర సేవావిశేషంబున నిశ్చలభక్తి యుదయించు. భక్తిగలుగ రజస్తమోగుణ

ప్రభూతంబులైన కామలోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్త్వగుణంబునఁ బ్రసన్నంబగు.

ప్రసన్న మనస్కుండైన ముక్తసంగుండగు. ముక్తసంగుండైన నీశ్వర తత్త్వజ్ఞానంబు దీపించు.

ఈశ్వరుండు గానంబడినఁ జిజ్జడగ్రథన రూపంబైన యహంకారంబు భిన్నంబగు.

అహంకారంబు భిన్నంబైన నసంభావనాది రూపంబులగు సంశయంబులు విచ్ఛిన్నంబులగు.

సంశయవిచ్ఛేదంబైన ననారబ్ధఫలంబులైన కర్మంబులు నశించుం గావున. 56


క.

గురుమతులు దపసు లంతః

కరణంబులు శుద్ధి సేయ ఘనతరభక్తిన్

హరియందు సమర్పింతురు

పరమానందమున భిన్నభవబంధనులై 57


తరల.

పరమపూరుషుఁడొక్కఁడాద్యుఁడు పాలనోద్భవ నాశముల్

సొరిదిఁజేయు ముకుంద పద్మజశూలిసంజ్ఞలఁ బ్రాకృత

స్ఫురిత సత్త్వరజస్తమంబులఁ బొందు నందు శుభస్థితుల్

హరి చరాచరకోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై. 58


వ.

మఱియు నొక విశేషంబు గలదు. కాష్ఠంబు కంటె ధూమంబు, ధూమంబుకంటెఁ

ద్రయీమయంబైన వహ్నియెట్లు విశేషంబగు నట్లు తమోగుణంబుకంటె రజోగుణంబు,

రజోగుణంబుకంటె బ్రహ్మప్రకాశకంబగు సత్త్వగుణంబు విశిష్టంబగు. తొల్లి మునులు

సత్త్వమయుండని భగవంతు హరి నధోక్షజుం గొలిచిరి. కొందఱు సంసారమందలి

మేలుకొఱకు నన్యుల సేవించుచుందురు. మోక్షార్థులైన వారలు ఘోరరూపులైన

భూతపతుల విడిచి, దేవతాంతర నిందసేయక శాంతులై నారాయణ కథలయందే ప్రవర్తించుదురు.

కొందఱు రాజసతామసులై సిరియు నైశ్వర్యంబును బ్రజలనుంగోరి

పితృభూతప్రజేసాదుల నారాధించుదురు. మోక్షమిచ్చుటంజేసి నారాయణుండు సేవ్యుండు.

వేద యాగ యోగ క్రియాజ్ఞానతపోగతి ధర్మంబులు వాసుదేవ పరంబులు. నిర్గుణుండైన

పరమేశ్వరుండు గలుగుచు లేకుండుచు గుణంబులతోడం గూడిన తన మాయచేత

నింతయు సృజియించి గుణవంతుని చందంబున నిజ మాయావిలసితంబులైన

గుణంబులలోఁ బ్రవేశించి విజ్ఞానవిజృంబితుండై వెలుంగు. అగ్ని యొక్కరుండయ్యుఁ

బెక్కుమ్రాఁకులందు దేజరిల్లుచుఁ బెక్కండ్రై తోఁచు తెఱంగున విశ్వాత్మకుండైన

పురుషుండొక్కఁడు తనవలనం గలిగిన నిఖిల భూతంబులందు నంతర్యామి రూపంబున దీపించు.

మనోభూత సూక్ష్మేంద్రియంబులతోడంగూడి గణమయంబులైన భావంబులం

దనచేత నిర్మితంబులైన భూతంబులందుఁ దగులువడక తద్గుణంబు లనుభవంబుసేయుచు

లోకకర్తయైన యతండు దేవతిర్యఙ్మనుశ్యాదిజాతులందు లీల నవతరించి లోకంబుల రక్షించునని

మఱియు సూతుఁ డిట్లనియె. 59
భాగవతము స్కందములు భాగవతము స్కందములు
భాగవతము - ప్రధమ స్కంధము | భాగవతము - ద్వితీయ స్కంధము | భాగవతము - తృతీయ స్కంధము | భాగవతము - చతుర్ధ స్కంధము | భాగవతము - పంచమ స్కంధము | భాగవతము - షష్ఠ స్కంధము | భాగవతము - సప్తమ స్కంధము | భాగవతము - అష్టమ స్కంధము | భాగవతము - నవమ స్కంధము | భాగవతము - దశమ స్కంధము | భాగవతము - ఏకాదశ స్కంధము | భాగవతము - ద్వాదశ స్కంధము