Jump to content

అధ్యాయము - ౧౦

వికీసోర్స్ నుండి
భాగవతము - ప్రధమ స్కంధము
అధ్యాయాలు
1. ప్రారంభము
2. అధ్యాయము - ౧
3. అధ్యాయము - ౨
4. అధ్యాయము - ౩
5. అధ్యాయము - ౪
6. అధ్యాయము - ౫
7. అధ్యాయము - ౬
8. అధ్యాయము - ౭
9. అధ్యాయము - ౮
10.అధ్యాయము - ౯
11.అధ్యాయము - ౧౦
12.అధ్యాయము - ౧౧
13.అధ్యాయము - ౧౨
14.అధ్యాయము - ౧౩
15.అధ్యాయము - ౧౪
16.అధ్యాయము - ౧౫
17.అధ్యాయము - ౧౬
18.అధ్యాయము - ౧౭
19.అధ్యాయము - ౧౮
20.అధ్యాయము - ౧౯

ఆ.

ధనము లపహరించి తనతోఁడ జెనకెడు

నాతతాయి జనుల నని వధించి

బంధు మరణ దుఃఖభరమున ధర్మజుఁ

డెట్లు రాజ్యలక్ష్మి నిచ్చగించె. 227


వ. అనిన సూతుండిట్లనియె. 228


క.

కురుసంతతికిఁ బరీక్షి

న్నరవరు నంకురము సేసి నారాయణుఁ డీ

ధరణీ రాజ్యమునకు నీ

శ్వరుఁగా ధర్మజుని నిలిపి సంతోషించె. 229


వ.

ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబు గాని స్వతంత్రంబు గా దనునది మొదలగు

భీష్ముని వచనంబుల హరి సంభాషణంబుల ధర్మ నందనుండు ప్రవర్ధమాన

విజ్ఞానుండును నివర్తిత శంకాకళంకుండునునై నారాయణాశ్రయుండైన

యింద్రుండునుం బోలెఁ జతుస్సాగర వేలాలంకృతంబగు వసుంధరామండలంబు

సహోదరసహాయుండై యేలుచుండె. 230

సీ.

సంపూర్ణ వృష్టిఁ బర్జన్యుండు గురియించు నిల యెల్లఁ గోర్కుల నీనుచుండు

గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు ఫలవంతములు లతా పాదపములు

పండు సస్యములు దప్పక ఋతువులనెల్ల ధర్మమెల్లెడలను దనరి యుండు

దైవ భూతాత్మ తంత్రములగు రోగాది భయములు సెందవు ప్రజల కెందుఁ

ఆ.

గురుకులోత్తముండు కుంతీతనూజుండు దాన మాన ఘనుఁడు ధర్మజుండు

సత్యవాక్యధనుఁడు సకల మహీరాజ్య విభవ భాజి యైన వేళయందు. 231


శ్రీకృష్ణుండు ద్వారకానగరమున కరుగుట

[మార్చు]

వ.

అంతఁ గృష్ణుండు చుట్టాలకు శోకంబు లేకుండం జేయుకొఱకును సుభద్రకుం

బ్రియము సేయుకొఱకును గజపురంబునం గొన్ని నెలలుండి ద్వారకానగరంబు

నకుం బ్రయాణంబు సేయందలంచి ధర్మనందనునకుం గృతాభివందనుండగుచు

నతనిచే నాలింగితుండై యామంత్రణంబు వడసి కొందఱు దనకు నమస్కరించినం

గౌఁగిలించుకొని కొందఱు దనుం గౌఁగిలింప నానందించుచు రథారోహణంబు

సేయు నవసరంబున సుభద్రయు ద్రౌపదియుఁ గుంతియు నుత్తరయు

గాంధారియు ధృతరాష్ట్రుండును విదురుండును యుధిష్ఠిరుండును యుయుత్సుండును

గృపాచార్యుండును నకులసహదేవులును వృకోదరుండును ధౌమ్యుండును

సత్సంగంబువలన ముక్త దుస్సంగుండగు బుధుండు సకృత్కాల సంకీర్య్త

మానంబై రుచికరంబగు నెవ్వని యశంబు నాకర్ణించి విడువనోపఁడట్టి హరి తోడి

వియోగంబు సహింపక దర్శన స్పర్శనాలాప శయనాసన భోజనంబులవలన

నిమిషమాత్రంబును హరికి నెడలేనివారలైన పాండవులం గూడికొని హరి

మరలవలె నని కోరుచు హరి చనిన మార్గంబు చూచుచు హరివిన్యస్త చిత్తులై

లోచనంబుల బాష్పంబు లొలుక నంతనంత నిలువంబడిరి. అయ్యవసరంబున. 232


సీ.

కనకసౌధములపైఁ గౌరవకాంతలుఁ గుసుమవర్షంబులు గోరి కురియ

మౌక్తికదామ సమంచిత ధవళాత పత్రంబు విజయుండు పట్టుచుండ

నుద్ధవ సాత్యకు లుత్సాహవంతులై రత్నభూషిత చామరములు వీవ

గగనాంతరాళంబు గప్పి కాహళభేరి పణవశంఖాది శబ్దములు మొరయ

ఆ.

సకల విప్రజనులు సగుణనిర్గుణరూప భద్రభాషణములు పలుకుచుండ

భువన మోహనుండు పుండరీకాక్షుండు పుణ్యరాశి హస్తిపురము వెడలె. 233


వ.

తత్సమయంబునం బౌరసుందరులు ప్రాసాద శిఖరభాగంబుల నిలిచి గోపాల

సుందరుని సందర్శించి మార్గంబుల రెండుదెసలఁ గరారవిందంబులు సాచి

యొండొరులకుం జూపుచుం దమలోనం దొల్లిటం బ్రళయంబున గుణంబులం

గూడక జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు ప్రవర్తింపని సమయంబునఁ

బ్రపంచాత్మకుండు నద్వితీయుండు నగుచు మేలై దీపించు పురాణపురుషుం

డీతం డనువారును జీవులకు బ్రహ్మత్వంబు గలుగ లయంబు సిద్ధించుట యె

ట్లనువారును జీవోపాధిభూతంబు లైన సత్వ్తాది శక్తుల లయము జీవ లయ

మనువారును గ్రమ్మఱ నప్పరమేశ్వరుండు నిజ వీర్యప్రేరితయై నిజాంశభూతంబు

లైన జీవులకు మోహినియైన సృష్టి సేయ నిశ్చయించి నామరూపంబులు లేని

జీవులందు నామరూపంబులు గల్పించు కొఱకు వేదంబుల నిర్మించి మాయాను

సరణంబుసేయు ననువారును నిర్మల భక్తిసముత్కంఠా విశేషంబుల నకుంఠితులై

జితేంద్రియులగు విద్వాంసు లిమ్మహానుభావు నిజరూపంబు దర్శింతు రనువారును

యోగమార్గంబులం గాని దర్శింపరా దనువారునై మఱియు. 234


మ.

రమణీ! దూరము వోయెఁ గృష్ణురథము¦ రాదింక వీక్షింప నీ

కమలాక్షుం బొడగానలేని దినముల్ గల్పంబులై తోఁచు గే

హములం దుండఁగనేల పోయి పరిచర్యల్ సేయుచు¦ నెమ్మి నుం

దము రమ్మా! యనె నొక్క చంద్రముఖి గందర్పాశుగభ్రాంతయై. 235


మ.

తరుణీ! యాదవరాజు గాఁడితడు వేదవ్యక్తుఁడై యొక్కఁడే

వరుస¦ లోకభవ స్థితి ప్రళయముల్ వర్తింపగాఁజేయు దు

స్తర లీలారతుఁడైన యీశుఁడితని¦ దర్శించితిం బుణ్యభా

సుర నే నంచు నటించె నొక్కతె మహా శుద్ధాంతరంగంబున¦. 236


క.

తామస గుణులగు రాజులు

భూమిం బ్రభవించి ప్రజలఁ బొలియింపఁగ స

త్వ్తామలతనుఁడై యీతఁడు

భామిని! వారల వధించుఁ బ్రతికల్పమున్. 237


సీ.

ఈ యుత్తమశ్లోకుఁడెలమి జన్మించిన యాదవ కులమెల్ల ననఘ మయ్యె

నీ పుణ్యవర్తనుఁ డేప్రొద్దు నుండిన మధురాపురము దొడ్డ మహిమ గనియె

నీ పూరుషశ్రేష్ఠు నీక్షించి భక్తితో ద్వారకావాసులు ధన్యులైరి

యీ మహాబలశాలి యెఱిఁగి శాసింపఁగ నిష్కంటకం బయ్యె నిఖిలభువన

తే.

మీ జగన్మోహనాకృతి నిచ్చగించి పంచశర భల్లజాల విభజ్యమాన

వివశ మానసమై పల్లవీ సమూహ మితని యధరామృతము గ్రోలు నెల్లప్రొద్దు. 238


ఉ.

ఈ కమలాక్షు నీ సుభగు నీ కరుణాంబుధిఁ బ్రాణనాథుఁగాఁ

జేకొని వేడ్కఁ గాఁపురము సేయుచునుండెడి రుక్మిణీముఖా

నేక పతివ్రతల్ నియతి నిర్మలమానసలై జగన్నుతా

స్తోక విశేష తీర్థములఁ దొల్లిటిబాముల నేమి నోఁచిరో! 239


వ.

అని యిట్లు నానావిధంబులైన పురసుందరీ వచనంబు లాకర్ణించి కటాక్షించి

నగుచు నగరంబు వెడలె. ధర్మజుండును హరికి రక్షకంబులై కొలిచి నడువం

జతురంగంబులం బంపినఁ దత్సేనాసమేతులై తన తోడి వియోగంబునకు

నోర్వక దూరంబు వెనుతగలిన కౌరవుల మఱలించి కురు జాంగల పాంచాల

శూరసేన యామున భూములం గడచి బ్రహ్మావర్త కురుక్షేత్ర మత్స్య సారస్వత

మరుధన్వ సౌవీరాభీర విషయంబు లతిక్రమించి తత్త ద్దేశనివాసు లిచ్చిన

కానుకలు గొనుచు నానర్త మండలంబు సొచ్చి పద్మబంధుండు పశ్చిమసింధు

నిమగ్నుండైన సమయంబునఁ బరిశ్రాంత వాహుండై చని చని. 240




భాగవతము స్కందములు భాగవతము స్కందములు
భాగవతము - ప్రధమ స్కంధము | భాగవతము - ద్వితీయ స్కంధము | భాగవతము - తృతీయ స్కంధము | భాగవతము - చతుర్ధ స్కంధము | భాగవతము - పంచమ స్కంధము | భాగవతము - షష్ఠ స్కంధము | భాగవతము - సప్తమ స్కంధము | భాగవతము - అష్టమ స్కంధము | భాగవతము - నవమ స్కంధము | భాగవతము - దశమ స్కంధము | భాగవతము - ఏకాదశ స్కంధము | భాగవతము - ద్వాదశ స్కంధము