అధ్యాయము - ౩

వికీసోర్స్ నుండి
భాగవతము - ప్రధమ స్కంధము
అధ్యాయాలు
1. ప్రారంభము
2. అధ్యాయము - ౧
3. అధ్యాయము - ౨
4. అధ్యాయము - ౩
5. అధ్యాయము - ౪
6. అధ్యాయము - ౫
7. అధ్యాయము - ౬
8. అధ్యాయము - ౭
9. అధ్యాయము - ౮
10.అధ్యాయము - ౯
11.అధ్యాయము - ౧౦
12.అధ్యాయము - ౧౧
13.అధ్యాయము - ౧౨
14.అధ్యాయము - ౧౩
15.అధ్యాయము - ౧౪
16.అధ్యాయము - ౧౫
17.అధ్యాయము - ౧౬
18.అధ్యాయము - ౧౭
19.అధ్యాయము - ౧౮
20.అధ్యాయము - ౧౯

సీ.

మహదహంకార తన్మాత్ర సంయుక్తుఁడై చారుషోడశకళా సహితుఁడగుచుఁ

బంచమహాభూత భాసితుండై శుద్ధసత్త్వుఁడై సర్వాతిశాయి యగుచుఁ

జరనోరుభుజముఖ శ్రవణాక్షినాసా శిరములు నానాసహస్రములు వెలుఁగ

నంబరకేయూర హారకుండలకిరీతాదుల పెక్కువే లమరుచుండఁ

తే.

ౠరుషరూపంబు ధరియించి పరుఁడనంతుఁ డఖిలభువనైక కర్తయై యలఘగతిని

మానితాపార జలరాశిమధ్యమునను యోగనిద్రావిలాసియై యొప్పుచుండ 60


భగవంతునియేకవింశత్యవతారములు[మార్చు]

వ.

అది సకలావతారంబులకు మొదలిగనియైన శ్రీమన్నారయణ దేవుని విరాజమానంబైన

దివ్య రూపంబు. దానిం బరమయోగీంద్రులు దర్శించుదురు. అప్పరమేశ్వరు నాభీకమలంబువలన

సృష్టికర్తలలోన శ్రేష్ఠుండైన బ్రహ్మయుదయించె. అతని యవయవ స్థానంబులయందు

లోకవిస్తారంబులు గల్పింపబడియె. మొదలు నద్దేవుండు కౌమారాఖ్యసర్గంబు నాశ్రయించి

బ్రాహ్మణుండైదుశ్చరంబైన బ్రహ్మచర్యంబు చరియించె. రెండవమాఱు జగజ్జననంబు

కొఱకు రసాతలగతయైన భూమినెత్తుచు, యజ్ఞేశుండై వరాహదేహంబుఁదాల్చె.

మూఁడవతోయంబున నారదుండను దేవఋషియై కర్మనిర్మోచకంబైన వైష్ణవ తంత్రంబుసెప్పె.

నాల్గవపరి ధర్మ భార్యాసర్గమునందు నరనారాయణాభిధానుండై దుష్కరంబైన తపంబుసేసె.

పంచమావతారంబునం గపిలుండను సిద్ధేశుండై యాసురియను బ్రాహ్మణునకుఁ దత్త్వసంఘ

నిర్ణయంబుగల సాంఖ్యంబు నుపదేశించె. ఆఱవ శరీరంబున ననసూయాదేవి యందు

నత్రిమహామునికిఁ గుమారుండై యలర్కునికిఁ బ్రహ్లాదముఖ్యులకు నాత్మవిద్యఁ దెలిపె.

ఏడవ విగ్రహంబున నాకూతియందు రుచికి జన్మించి యజ్ఞుండనఁ బ్రకాశమానుండై యామాది

దేవతలతోడంగూడి స్వాయంభువమన్వంతరంబు రక్షించె. అష్టమ మూర్తిని మేరుదేవియందు నాభికి

జన్మించి యురుక్రముండనం బ్రసిద్ధుండై విద్వజ్జనులకుఁ బరమహంస మార్గంబు ప్రకటించె.

ఋషులచేతం గోరంబడి తొమ్మిదవ జన్మంబునఁ బృథుచక్రవర్తియై భూమిని ధేనువుం జేసి

సమస్త వస్తువులంబిదికె. చాక్షుస మన్వంతర సంప్లవంబున దశమంబైన మీనావతారంబు

నొంది మహీరూపమగు నావనెక్కించి వైవస్వతమనువు నుద్ధరించె. సముద్ర మథనకాలంబునం

బదునొకండవమాఱు కమఠాకృతిని మందరాచలంబు దన పృష్ఠకర్పరంబున నేర్పరియై నిలిపె.

ధన్వంతరియను పండ్రెండవ తనువున సురాసురమథ్యమాన క్షీరోపాథోధి

మధ్యభాగంబున నమృతకలశ హస్తుండై వెడలె. పదమూఁడవదియైన మోహినీ వేషంబున

నసురులమోహితులంజేసి సురల నమృతాహారులం గావించె. పదునాలుగవదియైన

నరసింహరూపంబునం గనకశిపుని సంహరించె. పదియేనవది యైన కపటవామనావతారంబున

బలిని బదత్రయంబు యాచించి మూఁడు లోకముల నాక్రమించె. పదియాఱవది యైన

భార్గవరామాకృతినిఁ గుపితభావంబు దాల్చి బ్రాహ్మణద్రోహులైన రాజులనిరువదియొకమాఱు

వధియించి భూమిని క్షత్రియశూన్యంబుగావించె. పదియేడవదియైన వ్యాసగాత్రంబున

నల్పమతులైన పురుషులం గరుణించి వేద వృక్షంబునకు శాఖలేర్పరించె. ఫదునెనిమిదవదైన

రామాభిధానంబున దేవకార్యార్థంబు రాజత్వంబు నొంది, సముద్రనిగ్రహాది పరాక్రమంబు లాచరించె.

ఏకోనవింశతి వింశతితమంబులైన రామకృష్ణావతారంబులచే

యదువంశంబున సంభవించి విశ్వంభరాభరంబు నివారించె. కలియుగాద్యవసరంబున

రాక్షస సమ్మొహనంబు కొఱకు కీకటదేశంబున జినసుతుండై యేకవింశతితమంబైన బుద్ధ

నామధేయంబునం దేజరిల్లు. యుగసంధియందు వసుంధరాధీశులు చోరప్రాయులై సంచరింప

విష్ణుయశుండను విప్రునికి కల్కియను పేర నుద్భవింపంగలండని యిట్లనియె. 61


మ.

సరసిం బాసిన వేయికాలువల యోజన్ విష్ణునందైన శ్రీ

కర నానా ప్రకటావతారము లసంఖ్యాతంబు లుర్వీశులున్

సురలు బ్రాహ్మణ సంయమీంద్రులు మహర్షుల్ విష్ణునంశాంశముల్

హరికృష్ణుండు బలానుజన్ముఁ డెడలే దా విష్ణుఁడౌ నేర్పడన్. 62


క.

భగవంతుడగు విష్ణువు

జగముల కెవ్వేళ రాక్షసవ్యథ గలుగున్

దగ నవ్వేళ దయతో

యుగయుగమునఁ బుట్టి కాచు నుద్యల్లీలన్. 63


ఆ.

అతిరహస్యమైన హరిజన్మ కథనంబు

మనుజుఁడెవ్వఁడేని మాపురేపుఁ

జాల భక్తితోడఁ జదివిన సంసార

దుఃఖరాశిఁ బాసి తొలగిపోవు. 64


వ.

వినుండు. అరూపుండై చిదాత్మకుండై పరఁగు జీవునికిఁ బరమేస్వరు మాయా

గుణంబులైన మహదాదిరూపంబులచేత నాత్మస్థానంబుగా స్థూలశరీరంబు విరచితం

బైన, గగనంబునందుఁ బవనాశ్రిత మేఘసమూహంబును, గాలియందు బార్థివధూళి

ధూసరత్వంబును, నేరితి నట్లు ద్రష్టయగు నాత్మయందు దృశ్యత్వము బుద్ధిమంతులు గాని

వారిచేత నారోపింపబడు. ఈ స్థూలరూపముకంటె నదృష్టగుణంబై యశ్రుతంబైన

వస్తువగుటంజేసి వ్యక్తంబుగాక సూక్ష్మంబై కరచరణాదులులేక జీవునికి

నొండొకరూపము విరచితమైయుండు. సూక్ష్ముండైన జీవుని వలన నుత్క్రాంతి గమనాగమనంబులం

బునర్జన్మంబు దోఁచు. ఎపుడీ స్థూల సూక్ష్మరూపంబులు రెండు విద్యంజేసి యాత్మకుఁ గల్పింపబడె

ననియెడి హేతువు వలన స్వరూపసమ్యగ్ జ్ఞానంబునఁ ప్రతిశేధింపఁబడు నపుడ జీవుండు బ్రహ్మయగు.

సమ్యగ్ జ్ఞానంబ దర్శనంబు, విశారదుండైన యీస్వరునిదై క్రీడించు నవిద్యయనంబడుచున్న

మాయ యెప్పుడు విద్యారూపంబునం బరిణతయగు నప్పుడు జీవోపాధియైన స్థూలసూక్ష్మరూపంబు

దహించి, కాష్ఠంబులేక తేజరిల్లు వహ్నిచందంబునఁ దాన యుపరతయగు. అపుడు జీవుండు బ్రహ్మ

స్వరూపుండై పరమానందంబున విరాజమానుండగు. ఇట్లు తత్త్వజ్ఞులు సెప్పుదురని సూతుండిట్లనియె. 65


చ.

జననములేక కర్మములజాడలఁ బోక సమస్తచిత్త వ

ర్తనుఁడగు చక్రికిన్ గవులుదారపదంబుల జన్మకర్మముల్

వినతులు సేయుచుండుదురు వేదరహస్యములందు నెందుఁ జూ

చిన మఱిలేవు జీవునికిఁ జెప్పినకైవడి జన్మకర్మముల్. 66


మ.

భువనశ్రేణి నమోఘలీలుఁడగుచున్ బుట్టించు రక్షించు నం

తవిధింజేయు మునుంగఁడందు బహుభూతవ్రాతమం దాత్మతం

త్ర విహారస్థితుఁడై షడింద్రియ సమస్తప్రీతియున్ దవ్వులన్

దివిభంగిన్ గొనుఁ జిక్కఁడింద్రియములన్ ద్రిప్పున్ నిబంధించుచున్. 67


చ.

జగదధినాథుఁడైన హరి సంతతలీలల నామరూపముల్

దగిలి మనోవచోగతులఁ దార్కికచాతురి యెంతగల్గినన్

మిగిలి కుతర్కవాది దగ మేరలుచేసి యెఱుంగనేర్చునే

యగణిత నర్తనక్రమము నజ్ఞుఁడెఱింగి నుతింపనోపునే. 68


ఉ.

ఇంచుక మాయలేక మది నెప్పుడు వాయని భక్తితోడ వ

ర్తించుచు నెవ్వఁడేని హరి దివ్యపదాంబుజ గంధరాశి సే

వించు నతం డెఱుంగు నరవిందభవాదులకైన దుర్లభో

దంచితమైన యా హరి యుదార మహాద్భుత కర్మమార్గముల్. 69


మ.

హరిపాదద్వయభక్తి మీవలన నిట్లారూఢమై యుండునే

తిరుగంబాఱదు చిత్తవృత్తి హరిపై దీపించి మీ లోపలన్

ధరణీదేవతలార మీరలు మహాధన్యుల్ సమస్తజ్ఞులున్

హరిచింతన్ మిముఁ జెందవెన్నఁడును జన్మాంతర్వ్యథాయోగముల్. 70


శ్రీమద్భాగవత రచనాది వృత్తాంతములు[మార్చు]

సీ.

పుణ్యకీర్తనుఁడైన భువనేశుచరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము

సకలపురాణరాజము దొల్లి లోకభద్రముగఁ బుణ్యముగ మోదముగఁ బ్రీతి

భగవంతుఁడగు వ్యాసభట్టారకుఁ డొనర్చి శుకుఁడనియెడు తన సుతునిచేతఁ

జదివించె నింతయు సకల వేదేతిహాసములోపలనెల్ల సారమైన

ఆ.

యీ పురాణమెల్ల నెలమి నా శుకయోగి గంగనడుమ వచ్చి ఘనవిరక్తి

యొదవి మునులతోడ నుపవిష్టుఁడగ పరీక్షిన్నరేంద్రుఁ డడుగఁ జెప్పె వినుఁడు. 71


వ.

కృష్ణుండు ధర్మజ్ఞానాదులతోడం దనలోకంబునకుం జనిన పిమ్మటం గలికాల

దోషాంధకారంబున నష్టదర్శనులైన జనులకు నిప్పుడీ పురాణంబు గమలబంధుని

భంగి నున్నది. నాఁడందు భూరితేజుండై కీర్తించుచున్న విప్రఋషివలన నేఁ

బఠించిన క్రమంబున నా మదికి గోచరించినంతయు వినుపించెద ననిన సూతునకు

మునివరుండైన శౌనకుం డిట్లనియె. 72




భాగవతము స్కందములు భాగవతము స్కందములు
భాగవతము - ప్రధమ స్కంధము | భాగవతము - ద్వితీయ స్కంధము | భాగవతము - తృతీయ స్కంధము | భాగవతము - చతుర్ధ స్కంధము | భాగవతము - పంచమ స్కంధము | భాగవతము - షష్ఠ స్కంధము | భాగవతము - సప్తమ స్కంధము | భాగవతము - అష్టమ స్కంధము | భాగవతము - నవమ స్కంధము | భాగవతము - దశమ స్కంధము | భాగవతము - ఏకాదశ స్కంధము | భాగవతము - ద్వాదశ స్కంధము