Jump to content

అధ్యాయము - ౫

వికీసోర్స్ నుండి
భాగవతము - ప్రధమ స్కంధము
అధ్యాయాలు
1. ప్రారంభము
2. అధ్యాయము - ౧
3. అధ్యాయము - ౨
4. అధ్యాయము - ౩
5. అధ్యాయము - ౪
6. అధ్యాయము - ౫
7. అధ్యాయము - ౬
8. అధ్యాయము - ౭
9. అధ్యాయము - ౮
10.అధ్యాయము - ౯
11.అధ్యాయము - ౧౦
12.అధ్యాయము - ౧౧
13.అధ్యాయము - ౧౨
14.అధ్యాయము - ౧౩
15.అధ్యాయము - ౧౪
16.అధ్యాయము - ౧౫
17.అధ్యాయము - ౧౬
18.అధ్యాయము - ౧౭
19.అధ్యాయము - ౧౮
20.అధ్యాయము - ౧౯

ఉ.

ధాతవు భారతశ్రుతిత్విధాతువు వేదపదార్థజాత వి

జ్ఞాతవు గామముఖ్యరిపుషట్కవిజేతవు బ్రహ్మతత్త్వని

ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే

కాతరు కైవడి వగవఁ గారణమేమి పరాశరాత్మజా? 87


వ.

అనినఁ బారాశర్యుం డిట్లనియె. 88


క.

పుట్టితి వజుతనువునఁ జే

పట్టితివి పురాణపురుషు భజనము పదముల్

మెట్టితివి దిక్కులం దుది

ముట్టితివి మహా ప్రభోధమున మునినాథా! 89


వ.

అదియునుంగాక నీవు సూర్యునిభంగి మూఁడులోకములం జరింతువు. వాయువు

పగిది నఖిల జనులలోన మెలంగుదువు. సర్వజ్ఞుండ వగుటంజేసి. 90


క.

నీకెఱుఁగరాని ధర్మము

లోకములనులేదు బహువిలోకివి నీవున్

నాకొఱఁత యెట్టి దంతయు

నాకున్ వివరింపుమయ్య నారద! కరుణన్. 91


వ.

అనిన నారదుం డిట్లనియె. 92


ఉ.

అంచితమైన ధర్మచయ మంతయుఁ జెప్పితి వందులోన నిం

చించుకగాని విష్ణుకథలేర్పడఁ జెప్పవు ధర్మముల్ ప్రపం

చించిన మెచ్చునే గుణవిశేషము లెన్నినఁగాక నీకు నీ

కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా! 93


మ.

హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ

సురుచిభ్రాజితమైన మానస సరస్స్ఫూర్తిన్ వెలుగొందు శ్రీ

హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీ

కరమైయుండ దయోగ్య దుర్మదనద త్కాకోల గర్తాకృతిన్. 94


మ.

అపశబ్దంబులఁ గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపా

ప పరిత్యాగము సేయుఁగావున హరిన్ భావించుచుం బాడుచున్

జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబు గీర్తింపుచున్

దపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్త్వజ్ఞ! చింతింపుమా. 95


వ.

మునీంద్రా! నిర్గతకర్మంబై నిరుపాధికంబైన జ్ఞానంబు గలిగినను హరిభక్తి

లేకున్న శోభితంబుగాదు. ఫలంబు గోరక కర్మమీశ్వరునకు సమర్పణంబు సేయకున్న

నది ప్రశస్తంబై యుండదు. భక్తిహీనంబులైన జ్ఞానవాచా కర్మకౌశలంబులు

నిరర్థకంబులు. కావున మహానుభావుండవు యథార్థదర్శనుండవు సకలదిగంత

ధవళ కీర్తివి సత్యరతుండవు ధృతవ్రతుండవు నగు నీవు నిఖిల బంధమోచనంబు కొఱకు

వాసుదేవుని లీలావిశేషంబులు భక్తితోడ వర్ణింపుము. హరివర్ణనంబు సేయక

ప్రకారాంతరంబున నర్థాంతరంబులు వీక్షించి తద్వివక్షాకృతరూప నామంబులంజేసి

పృథగ్దర్శనుండైన వాని మతి పెనుగాలి త్రిప్పునంబడి తప్పంజను నావచందంబున

నెలవు చేరనేరదు. కామ్యకర్మంబులందు రాగంబుగల ప్రాకృత జనులకు నియమించిన

ధర్మంబులు సెప్పి శాసకుండవగు నీవు వగచుట తగదు. అది యెట్లనిన వార లదియే

ధర్మంబని కామ్య కర్మంబులు సేయుచుఁ దత్త్వజ్ఞానంబు మఱతురు. అదిగావున

తత్త్వజ్ఞుండవై వ్యథా వియోగంబు సేయుమని మఱియు నిట్లనియె. 96


చ.

ఎఱిగెడువాఁడు కర్మచయ మెల్లను మని హరిస్వరూపమున్

నెఱయనెఱింగి యవ్వలన నేరుపుచూపు గుణానురక్తుఁడై

తెఱకువలేక క్రుమ్మఱుచు దేహ ధనాద్యభిలాషయుక్తుఁడై

యెఱుఁగని వానికిం దెలియ నీశ్వరులీల లెఱుంగఁజెప్పవే. 97


చ.

తనకులధర్మమున్ విడిచి దానవవైరి పదారవిందముల్

పనివడి సేవసేసి పరిపాకము వొందక యెవ్వఁడేనిఁ జ

చ్చిన మఱుమేననైన నది సిద్ధివహించుఁ దదీయసేవఁ బా

సినఁ గులధర్మగౌరవము సిద్ధి వహించునె యెన్నిమేనులన్. 98

వ.

అది గావున నెఱుకగలవాఁడు హరిసేవకు యత్నంబు సేయందగు. కాలక్రమంబున

సుఖదుఃఖంబులు ప్రాప్తంబులైనను హరిసేవ విడువందగదు. దానంజేసి

బ్రహ్మస్థావరపర్యంతంబు దిరుగుచున్న జనులకు నెయ్యది పొందరా దట్టిమేలు సిద్ధించు

కొఱకు హరిసేవ సేయవలయు. హరిసేవకుండగువాఁడు జననంబు నొందియు నన్యునిక్రియ

సంసారంబునం జిక్కఁడు. క్రమ్మఱ హరిచరణస్మరణంబుఁ జేయుచు భక్తిరస

వశీకృతుండై విడువ నిచ్చగింపడు. మఱియును. 99


సీ.

విష్ణుండు విశ్వంబు విష్ణునికంటెను వేఱేమియును లేదు విశ్వమునకు

భవవృద్ధి లయములా పరమేశుచేనగు నీవెఱుంగుదుగాదె నీ ముఖమున

నెఱిఁగింపఁబడ్డది యేకదేశమున నీ భువనభద్రమునకై పుట్టినట్టి

హరికళాజాతుండ వని విచారింపుము కావున హరి ప్రకారములెల్ల

ఆ.

వినుతిసేయు మీవు వినికియుఁ జదువును దాన మతులనయముఁ దపము ధృతియుఁ

గలిమికెల్ల ఫలము గాదె పుణ్యశ్లోకుఁ గమలనాభుఁబొగడఁ గెలిగెనేని. 100


నారదుని పూర్వజన్మ వృత్తాంతము

[మార్చు]

వ.

మహాత్మా! నేను పూర్వ కల్పంబునం దొల్లిటి జన్మంబున వేదవాదుల యింటి

దాసికిం బుట్టి పిన్ననాఁడు వారలచేఁ బంపంబడి యొక వానకాలంబునఁ జాతు

ర్మాస్యంబున నేకస్థలనివాసంబు సేయ నిశ్చయించు యోగిజనులకుం

బరిచర్య సేయుచు. 101


క.

ఓటమితో నెల్లప్పుడు

పాటవమునఁ బనులుసేసి బాలురతో నే

యాటలకుఁ బోక నొక జం

జాటంబును లేక భక్తి సలుపుదు ననఘా! 102


క.

మంగళ మనుచును వారల

యెంగిలి భక్షింతు వాన కెండకు నోడన్

ముంగల నిలుతును నియతిని

వెంగలిక్రియఁ జనుదు నే వివేకముతోడన్. 103


వ.

ఇట్లేను వర్షాకాల శరత్కాలంబులు సేవించితిని. వారును నాయందు గృప సేసిరంత. 104

శా.

వారల్ కృష్ణచరిత్రముల్ చదువఁగా వర్ణింపఁగాఁ బాడఁగా

నా రావంబు సుధారసప్రతిమమై యశ్రాంతమున్ వీనులం

దోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నే నంతటన్

బ్రారంభించితి విష్ణుసేవ కితర ప్రారంభ దూరుండనై. 105


వ.

ఇట్లు హరిసేవారతింజేసి ప్రపంచాతీతుండైన బ్రహ్మరూపకుండైన నాయందు

స్థూలసూక్ష్మంబైన యీ శరీరంబు నిజమాయాకల్పితం బని యమ్మహాత్ములగు

యోగిజనుల మూలంబున రజస్తమోగుణ పరిహారిణియైన భక్తి సంభవించె. అంతఁ

జాతుర్మాస్యంబు నిండిన నయ్యోగిజనులు యాత్రసేయువారలై యివ్విధంబున 106


మ.

అపచారంబులు లేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై

చపలత్వంబును మాని నేఁ గొలువఁగా సంప్రీతులై వారు ని

ష్కపటత్వంబున దీనవత్సలతతోఁ గారుణ్యసంయుక్తులై

యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదార విజ్ఞానము. 107


వ.

ఏనును వారి యుపదేశంబున వాసుదేవుని మాయానుభావంబు దెలిసితి.

ఈశ్వరునియందు సమర్పితంబైన కర్మంబు దాపత్రయంబు మాన్ప నౌషధంబగు.

ఏద్రవ్యంబువలన నేరోగంబు జనియించె నాద్రవ్య మారోగంబును మానుపనేరదు.

ద్రవ్యాంతరంబుచేత నైన చికిత్స మానుపనోపు. ఇవ్విధంబునఁ గర్మంబులు

సంసారహేతుకంబులయ్యు నీశ్వరార్పితంబులై తాము తమ్ముఁ జెఱుపుకొన నోపియుండు.

ఈశ్వరునియందుఁ జేయఁబడు కర్మంబు విజ్ఞానహేతుకంబై యీశ్వర

సంతోషణంబును భక్తియోగంబునుం బుట్టించు. ఈశ్వర శిక్షంజేసి కర్మంబులు

సేయువారలు గృష్ణుగుణనామవర్ణన స్మరణంబులు సేయుదురు. ప్రణవపూర్వకంబులుగా

వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణానిరుద్ధమూర్తి నామంబులు నాలుగు భక్తింబలికి

నమస్కారంబుసేసి మంత్రమూర్తియు మూర్తిశూన్యుండునైన యజ్ఞపురుషునిం

బూజించు పురుషుండు సమ్యగ్దర్శనుండగు. 108


క.

ఏ నివ్విధమునఁ జేయఁగ

దానవకులవైరి నాకు దనయందలి వి

జ్ఞానము నిచ్చెను మదను

ష్ఠానము నతఁడెఱుఁగు నీవు సలుపుము దీని 109


క.

మునికులములోన మిక్కిలి

వినుకులు గలవాఁడ వీవు విభుకీర్తులు నీ

వనుదినముఁ బొగడ వినియెడి

జనములకును దుఃఖమెల్ల శాంతింబొందు. 110




భాగవతము స్కందములు భాగవతము స్కందములు
భాగవతము - ప్రధమ స్కంధము | భాగవతము - ద్వితీయ స్కంధము | భాగవతము - తృతీయ స్కంధము | భాగవతము - చతుర్ధ స్కంధము | భాగవతము - పంచమ స్కంధము | భాగవతము - షష్ఠ స్కంధము | భాగవతము - సప్తమ స్కంధము | భాగవతము - అష్టమ స్కంధము | భాగవతము - నవమ స్కంధము | భాగవతము - దశమ స్కంధము | భాగవతము - ఏకాదశ స్కంధము | భాగవతము - ద్వాదశ స్కంధము