అధ్యాయము - ౧౧
భాగవతము - ప్రధమ స్కంధము | |||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మ.
జలజాతాక్షుఁడు శౌరి డగ్గఱె మహాసౌధాగ్ర శృంగారక¦
గలహంసావృత హేమపద్మ పరిఫూ కాసారకన్ దోరణా
వళి సంఛాదిత తారక¦ దరులతా వర్గానువేలోదయ
త్ఫల పుష్పాంకుర కోరక¦ మణిమయ ప్రాకారక¦ ద్వారక¦. 241
వ.
ఇట్లు తన ప్రియపురంబు డగ్గఱి. 242
మత్తకోకిల.
అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తె యదూత్తముల్
ధన్యులై వినఁ బాంచజన్యము దారితాఖిల జంతు చై
తన్యము¦ భువనైకమాన్యము దారుణస్వన భీత రా
జన్యమున్ బరిమూర్ఛితాఖిలశత్రు దానవసైన్యమున్. 243
శా.
శంఖారావము వీనుల న్విని జనుల్ స్వర్ణాంబర ద్రవ్యముల్
శంఖాతీతము గొంచు వచ్చిరి దిదృక్షా దర్పితోత్కంఠన
ప్రేంఖ ద్భక్తులు వంశ కాహళ మహాభేరీ గజాశ్వావళీ
రింఖారావము లుల్లసిల్ల దనుజారిం జూడ నాసక్తులై. 244
క.
బంధులు పౌరులు దెచ్చిన
గంధేభ హయాదు లైన కానుకలు దయా
సింధుఁడుఁ గైకొనె నంబుజ
బంధుఁడు గొను దత్త దీపపంక్తుల భంగిన్. 245
వ.
ఇట్లాత్మారాముండు పూర్ణకాముండు నైన యప్పరమేశ్వరునికి నుపాయనంబు
లిచ్చుచు నాగరులు వికసిత ముఖులై గద్గద భాషణంబులతోడ డయ్యకుండ
నడపు నయ్యకు నెయ్యంపుఁ జూపుల నడ్డంబులేని బిడ్డలచందంబున మ్రొక్కి
యిట్లనిరి. 246
శా.
నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా! నీ సేవ సంసార సం
తాప ధ్వంసినియౌఁ గదా! సకల భద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతు గదా! ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబుని
ర్వ్యాపారంబు గదయ్య! చాలరుగదా! వర్ణింప బ్రహ్మాదులున్. 247
క.
ఉన్నారము సౌఖ్యంబున
విన్నారము నీ ప్రతాప విక్రమ కథలన్
మన్నారము ధనికులమై
కన్నారము తావక్రాంఘి కమలములు హరీ! 248
క.
ఆరాటము మది నెఱుఁగము
పోరాటము లిండ్లకడలఁ బుట్టవు పురిలోఁ
జోరాటన మెగయదు నీ
దూరాటన మోర్వలేము తోయజనేత్రా! 249
ఉ.
తండ్రులకెల్లఁ దండ్రియగుఁ ధాతకుఁ దండ్రివి దేవ! నీవు మా
తండ్రివి తల్లివిం బతివి దైవమవు¦ సఖివి¦ గురుండ వే
తండ్రులు నీక్రియం బ్రజల ధన్యులఁ జేసిరి? వేల్పులైన నో
తండ్రి! భవ న్ముఖాంబుజము ధన్యతఁ గానరు మా విధంబున¦. 250
క.
చెచ్చెరఁ గరినగరికి నీ
విచ్చేసిన నిమిషమైన వేయ్యేండ్లగు నీ
వెచ్చోటికి విచ్చేయక
మచ్చికతో నుండుమయ్య! మా నగరమునన్. 251
ఆ.
అంధకారవైరి యపరాద్రి కవ్వలఁ
జనిన నంధమైన జగము భంగి
నిన్నుఁ గానకున్న నీరజలోచన!
యంధతమస మతుల మగుదుమయ్య! 252
వ.
అని యిట్లు ప్రజ లాడెడి భక్తియుక్త మధుర మంజులాలాపంబులు గర్ణకలా
పంబులుగా నవధరించి, సకరుణావలోకనంబులు వర్షించుచు హర్షించుచుం
దనరాక విని మహానురాగంబున సంరంభ వేగంబుల మజ్జన భోజన శయనాది
కృత్యంబు లొల్లక, యుగ్రసేనాక్రూర వసుదేవ బలభద్ర ప్రద్యుమ్న సాంబ
చారుదేష్ణ గద ప్రముఖ యదుకుంజరులు గుంజర తురగ రథారూఢులై దిక్కుం
జరసన్నిభం బైన యొక్క కుంజరంబు ముందఱ నిడుకొని సూతమాగధ నట
నర్తక గాయక వందిసందోహంబుల మంగళభాషణంబులును, భూసురాశీర్వాద
వేదఘోషణంబులును, వీణా వేణు భేరీ పటహ శంఖ కాహళ ధ్వానంబులును,
రథారూఢ విభూషణ భూషిత వారయువతీ గానంబులును నసమానంబులై
చెలంగ నెదురుకొని, యథోచిత ప్రణామ నమస్కార పరిరంభ కరస్పర్శన
సంభాషణ మందహాస సందర్శనాది విధానంబుల బహుమానంబులు సేసి, వారలుం
దానును భుజగేంద్ర పాలితంబైన భోగవతీనగరంబు చందంబున స్వసమానబల
యదు భోజ దాశ్హార కుకురాంధక వృష్ణి వీర పాలితంబును, సకలకాల సంపద్య
మానాంకుర పల్లవ కోరక కుట్మల కుసుమ ఫలమంజరీ పుంజభార వినమిత లతా
పాదపరాజ విరాజితోద్యాన మహావనోపవనారామ భాసితంబును, వనాంతరాళ
రసాల సాల శాఖాంకుర ఖాదన క్షుణ్ణ కషాయకంఠ కలకంఠ మిథున కోలాహల
ఫలరసాస్వాద పరిపూర్ణ శారికా కీరకుల కలకల క్హలారపుష్ప మకరందపాన
పరవశ భృంగభృంగీ కదంబ ఝంకార సరోవర కనకకమల మృదుల కాండఖండ
స్వీకార మత్త పరటాయత్త కలహంసనివహ క్రేంకారసహితంబును, మహోన్నత
సౌధజాలరంధ్ర నిర్గత కర్పూరధూప ధూమపటల సందర్శన సంజాత జలధర
భ్రాంతి విభ్రాంత సముద్ధూత పింఛ నర్తనప్రవర్తమాన మత్తమయూర కేకారవ
మహితంబును, ముక్తాఫల విరచిత రంగవల్లికాలంకృత మందిరద్వార
గేహళీ వేదికా ప్రదేశంబును, ఘనసార గంధసార కస్తూరికా సంవాసిత వణిగ్గేహ
గేహళీ నికర కనకగళంతికా వికీర్యమాణ సలిలధారా సంసిక్త విపణిమార్గంబును,
ప్రతినివాస బహిరంగణ సమర్పిత రసాలదండ ఫల కుసుమ గంధాక్షత ధూప
దీప రత్నాంబరాది వివిధోపహారంబును, ప్రవాళ నీల మరకత వజ్ర వైఢూర్య
నిర్మిత గోపురాట్టాలకంబును, విభవనిర్జిత మహేంద్రనగరాలకంబును నైన
పురవరంబు ప్రవేశించి రాజమార్గంబున వచ్చు సమయంబున. 253
మత్తకోకిల.
కన్నులారఁగ నిత్యము¦ హరిఁ గాంచుచున్ మనువారల
య్యు న్నవీన కుతూహలోత్సవయుక్తి నాగరకాంత ల
త్యున్నతోన్నత హర్మ్యరేఖలనుండి చూచిరి నిక్కి చే
సన్నలం దమలోనఁ దద్విభు సౌకుమార్యము సూపుచు¦. 254
సీ.
కలుముల నీనెడి కలకంఠి యెలనాఁగ వర్తించు నెవ్వని వక్షమందు
జనదృక్చకోరక సంఘంబునకు సుధా పానీయపాత్ర మే భవ్యుముఖము
సకల దిక్పాలక సమితికి నెవ్వని బాహుదండంబులు పట్టుఁగొమ్మ
లాశ్రితశ్రేణి కే యధిపతి పాద రాజీవయుగ్మంబులు చేరుగడలు
ఆ.
భువన మోహనుండు పురుషభూషణుఁ డట్టి కృష్ణుఁడరిగె హర్మ్యశిఖర
రాజమానలగుచు రాజమార్గంబున రాజముఖులు గుసుమరాజిఁ గురియ. 255
మ.
జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళ చ్ఛత్రంబుతోఁ జామరం
బులతోఁ బుష్పపిశంగ చేలములతో భూషామణి స్ఫీతుఁడై
నలినీబాంధవుతో శశిద్వయముతో నక్షత్రసంఘంబుతో
జలభిచ్చాపముతోఁ దటిల్లతికతో భాసిల్లు మేఫూకృతి¦. 256
వ.
ఇట్లు తల్లిదండ్రుల నివాసంబు సొచ్చి దేవకీప్రముఖలైన తల్లుల కేడ్వురకు
మ్రొక్కిన. 257
క.
బిడ్డఁడు మ్రొక్కినఁ దల్లులు
జడ్డన నంకముల నునిచి చన్నులతుదిఁ బా
లొడ్డగిలఁ బ్రేమభరమున
జడ్డువడం దడసి రక్షిజలముల ననఫూ! 258
వ.
తదనంతరం బష్టోత్తరశతాధిక షోడశసహస్ర సౌవర్ణసౌధ కాంతంబైన శుద్ధాం
తంబు సొచ్చి హరి తన మనంబున. 259
మ.
ఒక భామాభవనంబు మున్ను సొర వేఱొక్కర్తు లోఁ గుందునో!
సుకరాలాపము లాడదో! సొలయునో! సుప్రీతి నీక్షింపదో!
వికలత్వంబున నుండునో! యనుచు నవ్వేళన్ వధూగేహముల్
ప్రకటాశ్చర్య విభూతిఁ జొచ్చె బహురూప వ్యక్తుఁడై భార్గవా! 260
వ.
ఆ సమయంబున. 261
క.
శిశువులఁ జంకలనిడి తను
కృశతలు విరహాగ్నిఁ దెలుప గృహగేహళులన్
రశనలు జాఱఁగ సిగ్గుల
శశిముఖు లెదురేగి రపుడు జలజాక్షునకు¦. 262
మ.
పతి నా యింటికి మున్ను వచ్చె నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా
గతుఁడయ్యెన్ మును సేరెఁ బో దొలుత మత్కాంతుడు నాశాల కే
నితరాలభ్య శుభంబు గంటి నని తా రింటింట నర్చించి ర
య్యతివల్ నూఱుఁ బదాఱువేలు నెనమం డ్రవ్వేళ నాత్మేశ్వరు¦. 263
వ.
వారలం జూచి హరి యిట్లనియె. 264
మ.
కొడుకుల్ భక్తివిధేయు లౌదురుగదా? కోడండ్రు మీ వాక్యముల్
కడవం బాఱక యుందురా? విబుధ సత్కారంబు గావింతురా?
తొడవుల్ వస్త్రములం బదార్థ రస సందోహంబులు జాలునా?
కడమల్ గావు గదా? భవన్నిలయముల్ గల్యాణ యుక్తంబులే? 265
సీ.
తిలక మేటికి లేదు? తిలకినీ తిలకమ! పువ్వులు దుఱుమవా? పువ్వుఁబోణి!
కస్తూరి యలఁదవా? కస్తూరికాగంధి! తొడవులు తొడవవా? తొడవు తొడవ!
కలహంసఁ బెంపుదే? కలహంస గామిని! కీరంబుఁ జదివింతె? కీరవాణి!
లతలఁ బోషింతువా? లతికా లలితదేహ! సరసి నోలాడుదె? సరసిజాక్షి!
ఆ.
మృగికి మేఁతలిడుదె? మృగశాబ లోచన! గురుల నాదరింతె? గురువివేక!
బంధుజనులఁ బ్రోతె? బంధుచింతామణి! యనుచు సతుల నడిగె నచ్యుతుండు. 266
వ.
అని యడిగిన వారలు హరిం బాసిన దినంబులందు శరీర సంస్కార కేళీవిహార
హాస మందిరగమన మహోత్సవ దర్శనంబు నొల్లని యిల్లాండ్రు గావున. 267
మ.
సిరి చాంచల్యము తోడి దయ్యుఁ దనకుం జిత్తేశ్వరుండంచు నే
పురుషశ్రేష్ఠు వరించె నట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులన్
గరయుగ్మంబులఁ గౌఁగిలించిరి సతుల్ గల్యాణ బాష్పంబు లా
భరణ శ్రేణులుగాఁ బ్రతిక్షణ నవప్రాప్తాను రాగంబుల¦. 268
మత్తకోకిల.
పంచబాణుని నీఱుచేసిన భర్గునిం దనవిల్లు వ
ర్జించి మూర్ఛిలఁ జేయఁజాలు విశేష హాస విలోకనో
దంచితాకృతు లయ్యుఁ గాంతలు దంభచేష్టల మాధవు¦
సంచలింపఁగఁ జేయ నేమియుఁ జాలరైరి బుధోత్తమా! 269
వ.
ఇవ్విధంబున సంగ విరహితుండైన కంసారి సంసారికైవడి విహరింప నజ్ఞాన
విలోకులైన లోకులు లోకసామాన్య మనుష్యుండని తలంతురు. ఆత్మాశ్రయ
యైన బుద్ధి యాత్మయందున్న యానందాదులతోడం గూడని తెఱంగున నీశ్వరుండు
ప్రకృతితోడం గూడియు నా ప్రకృతిగుణంబులైన సుఖదుఃఖంబులఁ
జెందక యుండు. పరస్పర సంఘర్షణంబులచే వేణువుల వలన వహ్నిఁ బుట్టించి
వనంబుల దహించు మహావాయువు చందంబున, భూమికి భారహేతువులై
యనేకాక్షౌహిణులతోడం బ్రవృద్ధతేజు లగు రాజుల కన్యోన్య వైరంబులు
గల్పించి, నిరాయుధుండై సంహారంబుసేసి, శాంతుండై పిదపం గాంతామధ్యంబునఁ
బ్రాకృత మనుష్యుండునుం బోలె, సంచరింపుచుండె నా సమయంబున. 270
క.
మతు లీశ్వరుని మహత్వ్తము
మిత మెఱుఁగని భంగి నప్రమేయుఁడగు హరి
స్థితి నెఱుఁగక కాముకుఁడని
రతములు సలుపుదురు తిగిచి రమణులు సుమతీ! 271
క.
ఎల్లపుడును మా యిండ్లను
వల్లభుఁడు వసించు మేమ వల్లభలము శ్రీ
వల్లభున కనుచు గోపీ
వల్లభుచే సతులు మమతవలఁబడి రనఫూ! 272
వ.
అని చెప్పిన విని సూతునకు శౌనకుం డిట్లనియె. 273