పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/వరుణునినుండి తండ్రి దెచ్చుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-954-సీ.
నందుఁ డేకాదశినాఁ డుపవాసంబు-
చేసి శ్రీహరిఁబూజ చేసి దనుజ
వేళ యెఱుంగక వేగక ముందర-
ద్వాదశీస్నానంబుఁ గ నొనర్ప
మునాజలము చొర నందొక్క దైత్యుండు-
నందుని వరుణుని గరమునకుఁ
గొనిపోవఁ దక్కిన గోపకు లందఱు-
నందగోపకునిఁ గాక కలంగి

తెభా-10.1-954.1-తే.
రామకృష్ణులఁ బేర్కొని వము సేయఁ
గృష్ణుఁ డీశుండు తమ తండ్రిఁ గికురుపెట్టి
రుణభృత్యుండు గొనిపోయి రుణుఁ జేర్చు
టెఱిఁగి రయమున నచ్చోటి కేఁగె నధిప!

టీక:- నందుడు = నందుడు; ఏకాదశి = ఏకాదశితిథి; నాడు = దినమున; ఉపవాసము = నిరాహారుడైయుండుట; చేసి = చేసి; శ్రీహరి = విష్ణుమూర్తి; పూజన్ = పూజను; చేసి = చేసి; దనుజవేళ = రాక్షసులు సంచరించువేళ; ఎఱుంగక = తెలియక; వేగక = తెల్లవారక; ముందర = ముందే; ద్వాదశీ = ద్వాదశినాటి; స్నానంబున్ = స్నానమును; తగన్ = శీఘ్రముగా; ఒనర్పన్ = చేయుటకై; యమునా = యమునానది; జలమున్ = నీటియందు; చొరన్ = ప్రవేశించగా; అందున్ = ఆ సమయము నందు; ఒక్క = ఒకానొక; దైత్యుండు = రాక్షసుడు; నందునిన్ = నందుడిని; వరుణుని = వరుణదేవుని; నగరమున్ = పట్టణమున; కున్ = కు; కొనిపోవన్ = తీసుకుపోగా; తక్కిన = మిగతా; గోపకులు = గొల్లవారు; అందఱున్ = అందరు; నందగోపకునిన్ = నందుడిని; కానక = కనిగొనలేక; కలంగి = కలతపొంది.
రామ = బలరాముని; కృష్ణులన్ = కృష్ణుని; పేర్కొని = పేరుపెట్టి పిలిచి; రవము = రోదనధ్వని; చేయన్ = చేయగా; కృష్ణుండు = కృష్ణుడు; ఈశుండు = కృష్ణుడు {ఈశుడు - సర్వాధికారి, విష్ణువు}; తమ = వారి యొక్క; తండ్రిన్ = తండ్రిని; కికురుపెట్టి = మోసపుచ్చి; వరుణ = వరుణదేవుని; భృత్యుండు = సేవకుడు; కొనిపోయి = తీసుకు వెళ్ళి; వరుణున్ = వరుణదేవుని వద్దకు; చేర్చుట = చేరవేయుట; ఎఱింగి = తెలిసికొని; రయమునన్ = వేగముగా; ఆ = ఆ యొక్క; చోటి = స్థలమున; కిన్ = కు; ఏగెన్ = వెళ్ళెను; అధిప = రాజా.
భావము:- పరీక్షన్మహారాజా! నందరాజు ఒక ఏకాదశి నాడు ఉపవాసం చేసి, విష్ణుపూజ చేసాడు. అసురవేళ అయిందని గమనించక తెల్లవారక ముందే ద్వాదశీస్నానం చేయడాని కని యమునానదికి వెళ్ళి, నీటిలో దిగాడు. అప్పుడు వరుణుని దూత నందుడిని వరుణపట్టణము శ్రద్ధావతికి పట్టుకు పోయాడు. మిగిలిన గోపకు లందరూ నందగోపుడు కనబడక కలత చెందారు. వారు బలరామకృష్ణులను వద్దకు వచ్చి గోలపెట్టారు. అప్పుడు, శ్రీకృష్ణుడు తమ తండ్రిని మోసగించి వరుణభృత్యుడు వరుణుడి దగ్గరకు పట్టుకుపోయినట్లు తెలుసుకున్నాడు. వెంటనే తాను కూడా అక్కడకి వెళ్ళాడు.

తెభా-10.1-955-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = అప్పుడు.
భావము:- అలా తండ్రికోసం వచ్చిన శ్రీకృష్ణుడు వరుణుడి వద్దకు వచ్చినప్పుడు. . . .

తెభా-10.1-956-క.
చ్చిన మాధవుఁ గనుఁగొని
చెచ్చెర వరుణుండు పూజ చేసి వినతుఁడై
చ్చుగ నిట్లని పలికెను
"విచ్చేసితి దేవ! నా నివేశంబునకున్,

టీక:- వచ్చిన = వచ్చినట్టి; మాధవున్ = కృష్ణుని; కనుగొని = చూసి; చెచ్చెరన్ = శీఘ్రముగా; వరుణుండు = వరుణదేవుడు; పూజన్ = పూజించుట; చేసి = చేసి; వినతుడు = వినయముగా వంగినవాడు; ఐ = అయ్యి; అచ్చుగన్ = స్వచ్ఛముగ; ఇట్లు = ఇలా; అని = అని; పలికెన్ = చెప్పెను; విచ్చేసితి = వచ్చితివి; దేవ = భగవంతుడ; నా = నా యొక్క; నివేశంబున్ = నివాసమున; కున్ = కు.
భావము:- వరుణుడు తన నగరానికి విచ్చేసిన రమాపతిని చూసి, శీఘ్రంగా పూజించి, నమస్కరించి “ప్రభూ! నా గృహానికి తమరు నిజంగా విజయం చేసారా!” అని ఆప్యాయంగా పలకరించి ఇలా అన్నాడు.

తెభా-10.1-957-ఉ.
విభు పాదపద్మరతు లెన్నఁడు నెవ్వరుఁ బొందలేని పెం
ద్రోవఁ జరింతు రట్టి బుధతోషక! నీ వరుదెంచుటం బ్రమో
దావృత మయ్యెఁ జిత్తము కృతార్థత నొందె మనోరథంబు నీ
సేవఁ బవిత్రభావమునుఁ జెందె శరీరము నేఁడు మాధవా!

టీక:- ఏ = ఏ యొక్క; విభు = దేవుని; పాద = పాదములనెడి; పద్మ = పద్మములలందు; రతులు = ఆసక్తికలవారు; ఎన్నడున్ = ఎప్పుడును; ఎవ్వరున్ = ఇతరమార్గాసక్తులెవ్వరు; పొందలేని = పొందజాలని; పెంద్రోవన్ = ముక్తి {పెంద్రోవ - పెన్ (గొప్ప) త్రోవ (స్థితి), మోక్షము}; చరింతురు = మెలగెదరు; అట్టి = అటువంటి; బుధ = జ్ఞానులను; తోషక = సంతోషపెట్టువాడ; నీవు = నీవు; అరుదెంచుటన్ = వచ్చుటవలన; ప్రమోద = సంతోషముచేత; ఆవృతమయ్యెన్ = ఆవరింపబడినది; చిత్తము = మనసు; కృతార్థతన్ = ధన్యతను; ఒందెన్ = పొందినది; మనోరథంబు = మనోవాంఛలు; నీ = నిన్ను; సేవన్ = కొలచుటవలన; పవిత్ర = పరిశుద్ధమైన; భావమున్ = విధమును; చెందెన్ = పొందెను; శరీరము = దేహము; నేడు = ఇవాళ; మాధవా = శ్రీకృష్ణా.
భావము:- “శ్రీపతీ! కృష్ణా! పండితులకు సంతోషపెట్టేవాడా! ఏ ప్రభువు యొక్క పాదపద్మాల యందు ఆసక్తి కలవారు ఎప్పుడూ ఎవ్వరూ పొందలేని గొప్పస్థానాన్ని పొందగలరో, అటువంటి నీవు రావడం వలన నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. నాకోరిక సఫలమైంది. నీ సేవ వలన నా తనువు పావనమైంది.

తెభా-10.1-958-ఉ.
రమేశ్వరున్ జగములిన్నిటిఁ గప్పిన మాయ గప్పఁగా
నోక పారతంత్ర్యమున నుండు మహాత్మక! యట్టి నీకు ను
ద్దీపిత భద్రమూర్తికి సుధీజన రక్షణవర్తికిం దనూ
తాము వాయ మ్రొక్కెద నుదార తపోధన చక్రవర్తికిన్.

టీక:- ఏ = ఏ యొక్క; పరమేశ్వరున్ = భగవంతుని {పరమేశ్వరుడు - సర్వోత్కృష్టమైన సర్వనియామకుడు, విష్ణువు}; జగములు = లోకములు; ఇన్నిటిన్ = ఈ అన్నింటిని; కప్పిన = ఆవరించిన; మాయ = మూలప్రకృతి; కప్పగానోపక = ఆవరింపలేక; పారతంత్ర్యమునన్ = లోబడినదై; ఉండున్ = ఉండునో; మహాత్మక = విరాటస్వరూపక; అట్టి = అటువంటి; నీ = నీ; కున్ = కు; ఉద్దీపిత = ప్రకాశించెడి; భద్రమూర్తి = కల్యాళస్వరూపి; కిన్ = కి; సుధీజన = సజ్జనుల; రక్షణ = రక్షించుటందు; వర్తి = మెలగెడివాని; కిన్ = కి; తనూ = దేహసంబంధమైన; తాపమున్ = తాపత్రయములను {తాపత్రయము - 1ఆధ్యాత్మిక 2ఆధిదైవిక 3ఆధిభౌతిక రూపములైన తాపములు (బాధలు, ఇక్కట్లు)}; పాయన్ = తొలగించుట కోసము; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; ఉదార = అధికమైన; తపస్ = తపస్సు అనెడి; ధన = సంపదచేత; చక్రవర్తి = సార్వభౌముని; కిన్ = కి.
భావము:- ఓ మహాత్మా! సకల లోకములనూ కప్పివేయగల మాయ, పరమేశ్వరుడ వైన నిన్ను కప్పలేక నీకు అధీనమై ఉంటుంది. నీవు సర్వాంగసుందరంగా ప్రకాశించే మంగళ మూర్తివి. సద్బుద్ధికలవారిని సర్వదా సంరక్షించే వాడవు. మహా తపస్సే ధనముగా గల సాధువులకు నీవు సార్వభౌముడవు. అట్టి నీకు నా శరీరతాపం తొలగటం కోసం నమస్కరిస్తున్నాను.

తెభా-10.1-959-చ.
ఱుఁగఁడు వీఁడు నా భటుఁ డొకించుక యైన మనంబులోపలం
దెకువ లేక నీ జనకుఁదెచ్చె; దయం గొనిపొమ్ము; ద్రోహమున్
వుము; నన్ను నీ భటుని న్నన చేయుము; నీదు సైరణన్
లుదుఁ గాదె యో! జనకత్సల! నిర్మల! భక్తవత్సలా! "

టీక:- ఎఱుగడు = తెలిసినవాడుకాదు; వీడు = ఇతను; నా = నా యొక్క; భటుడు = సేవకుడు; ఇంచుక = అతికొంచెము; ఐనన్ = అయినను; మనంబు = మనసు; లోపలన్ = అందు; తెఱకువ = తెలివితేటలు; లేకన్ = లేకపోవుటచేత; నీ = నీ యొక్క; జనకున్ = తండ్రిని; తెచ్చెన్ = తీసుకు వచ్చెను; దయన్ = దయతో; కొనిపొమ్ము = తీసుకొని వెళ్ళిపొమ్ము; ద్రోహమున్ = కీడును; మఱవుము = మరచిపొమ్ము; నన్నున్ = నన్ను; నీ = నీ యొక్క; భటుని = సేవకుడను; మన్ననచేయుము = మన్నింపుము; నీదు = నీ యొక్క; సైరణన్ = ఓర్పుచేత; వఱలుదున్ = వర్తించెదను; కాదె = కదా; ఓ = ఓ; జనక = తండ్రియెడల; వత్సల = వాత్సల్యము కలవాడ; నిర్మల = పరిశుద్ధుడా; భక్త = భక్తుల యెడ; వత్సలా = వాత్సల్యము కలవాడ.
భావము:- పితృభక్తి పరాయణా! క్షమాగుణ శోభితా! నిర్మల హృదయం కల భక్తుల యందు ప్రేమ కలవాడా! ఏ మాత్రం తెలివి లేకుండా నా భృత్యుడు వీడు నీ తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చాడు. దయచేసి నీ తండ్రిని తీసుకు పొమ్ము. చేసిన తప్పు మన్నించి, నన్ను నా భటుణ్ణి రక్షించు.”

తెభా-10.1-960-వ.
అని ఇట్లు పలుకుచున్న వరుణునిం గరుణించి, తండ్రిం దోడ్కొని హరి తిరిగివచ్చె; నంత నందుండు తన్ను వెన్నుండు వరుణ నగరంబున నుండి విడిపించి తెచ్చిన వృత్తాంత బంతయు బంధువుల కెఱింగించిన వారలు కృష్ణుం డీశ్వరుండని తలంచి; రఖిలదర్శనుం డయిన యీశ్వరుండును వారల తలంపెఱింగి వారి కోరిక సఫలంబు చేయుదునని వారి నందఱ బ్రహ్మహ్రదంబున ముంచి యెత్తి.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = విన్నవించుచున్న; వరుణునిన్ = వరుణదేవుని; కరుణించి = అనుగ్రహించి; తండ్రిన్ = తండ్రిని; తోడ్కొని = తీసుకొని; హరి = కృష్ణుడు; తిరిగి = వెనుకకు మరలి; వచ్చెన్ = వచ్చెను; అంత = అంతట; నందుండు = నందుడు; తన్ను = అతనిని; వెన్నుండు = కృష్ణుడు {వెన్నుడు (వి) - విష్ణువు (ప్రకృతి)}; వరుణ = వరుణుని; నగరంబున్ = పట్టణమున; నుండి = నుండి; విడిపించి = విడుదలచేయించి; తెచ్చిన = తీసుకొని వచ్చిన; వృత్తాంతంబు = విషయము; అంతయున్ = సమస్తము; బంధువుల = చుట్టముల; కున్ = కు; ఎఱింగించినన్ = తెలుపగా; వారలు = వారు; కృష్ణుండు = కృష్ణుడు; ఈశ్వరుండు = భగవంతుడు; అని = అని; తలంచిరి = భావించిరి; అఖిలదర్శనుండు = సర్వమును సాక్షిగా చూచుచుండువాడు; అయిన = అయిన; ఈశ్వరుండు = కృష్ణుడు {ఈశ్వరుడు - సర్వనియామకుడు, విష్ణువు}; వారల = వారి యొక్క; తలంపు = భావన; ఎఱింగి = తెలిసి; వారి = వారి యొక్క; కోరికన్ = కోరికను; సఫలంబుచేయుదును = తీర్చెదను; అని = అని; వారిన్ = వారిని; అందఱన్ = అందరిని; బ్రహ్మ = బ్రహ్మ అనెడి, గొప్ప; హ్రదంబునన్ = మడుగునందు; ముంచి = మునగజేసి; ఎత్తి = పైకితీసి.
భావము:- అని చెప్తున్న వరుణుడిని కృష్ణుడు కరుణించాడు. అయన తన తండ్రిని తోడ్కొని గోకులానికి తిరిగివచ్చాడు. అంతట నందుడు కృష్ణుడు వరుణపురి శ్రద్ధావతి వచ్చి తనను విడిపించుకుని వచ్చిన విషయమంతా చుట్టాలకు చెప్పాడు. వారు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని అనుకున్నారు. సర్వజ్ఞుడైన పరమాత్ముడు తన బంధువుల భావం గ్రహించాడు. వారి మనోరథము తీర్చడాని కని వాళ్ళను బ్రహ్మకుండంలో ముంచి ఎత్తాడు. దానితో. . .

తెభా-10.1-961-ఆ.
ప్రకృతిఁ గామకర్మ రవశమై యుచ్చ
నీచగతులఁ బొంది నెఱయ భ్రమసి
తిరుగుచున్న జనము తెలియనేరదు నిజ
తివిశేష మీ జగంబు నందు.

టీక:- ప్రకృతిన్ = మాయలోపడి; కామ = కోరికలు; కర్మ = కర్మములు చేయుటలో; పరవశము = లోబడుట; ఐ = చెంది; ఉచ్చ = ఉత్తమ; నీచ = అధమ; గతులన్ = పునర్జన్మల మార్గమును; పొంది = చెంది; నెఱయన్ = నిండుగా; భ్రమసి = భ్రమలోపడిపోయి; తిరుగుచున్న = సంచరించుచున్నట్టి; జనము = వారు; తెలియనేరరు = తెలిసికొనలేరు; నిజ = నా నిజమైవ; గతిన్ = స్థిత; విశేషము = విశిష్టతను; ఈ = ఈ యొక్క; జగంబున్ = లోకము; అందున్ = లో.
భావము:- ప్రకృతి సంబంధ మైన కామకర్మలలో తగులం వహించి ఉత్తమాధమ స్థితులను పొంది భ్రాంతిలో చరిస్తున్న ఈ జనులు ఇహలోకంలో అసాధరణమైన నా నిజస్థితి విశేషాలను గ్రహించలేకుండా ఉన్నారు. అని తలంచాడు

తెభా-10.1-962-మ.
ని చింతించి దయాళుఁడైన హరి మాయాదూరమై, జ్యోతియై,
నిరూప్యంబయి, సత్యమై, యెఱుకయై, యానందమై, బ్రహ్మమై,
ఘాత్ముల్ గుణనాశమందుఁ గను నిత్యాత్మీయ లోకంబు గ్ర
క్కునఁ జూపెం గరుణార్ద్రచిత్తుఁ డగుచున్ గోపాలకశ్రేణికిన్.

టీక:- అని = అని; చింతించి = ఆలోచించి; దయాళుడు = దయగలవాడు; ఐన = అయిన; హరి = కృష్ణుడు; మాయా = ప్రకృతిని; దూరము = మీరినది; ఐ = అయ్యి; జ్యోతి = ప్రకాశవంతమైనది; ఐ = అయ్యి; అనిరూప్యంబు = నిరూపించరానిది; అయి = ఐ; సత్యము = నాశరహితమైనది {సత్యము - సర్వకాలసర్వావస్థలందు మార్పులేనిది}; ఐ = అయ్యి; ఎఱుక = జడరహితమైనది; ఐ = అయ్యి; ఆనందము = నిర్విషయానందమైనది; ఐ = అయ్యి; బ్రహ్మము = సర్వపరిపూర్ణమైనది {బ్రహ్మము - దేశకాలవస్తువులచే విభాగింపరానిది}; అనఘాత్ముల్ = పాపరహితులు; గుణ = త్రిగుణాత్మకప్రకృతి; నాశము = నశించిన; అందున్ = పిమ్మట; కను = కనుగొనెడి; నిత్య = శాశ్వతమైనది {నిత్యాత్మీయలోకము - శాశ్వతమైనట్టి తనది (విష్ణునిది) అయినట్టి లోకము, వైకుంఠము}; ఆత్మీయ = తనదైన; లోకంబున్ = లోకమును, వైకుంఠము; గ్రక్కునన్ = చటుక్కున; చూపెన్ = కనబరచెను; కరుణా = దయారసముచేత; ఆర్ద్ర = కరగిన; చిత్తుడు = మనసు కలవాడు; అగుచున్ = ఔతు; గోపాలక = యాదవుల; శ్రేణి = సమూహమున; కిన్ = కు.
భావము:- అలా భావించి, దయాస్వభావుడైన కృష్ణ పరమాత్మ మాయకు అతీతమై జ్యోతిస్వరూపమై ఇట్టి దని వివరింప రానిదై, సత్యమై, జ్ఞానందమయమై, పరబ్రహ్మమై, పుణ్యాత్ములు త్రిగుణరాహిత్యమున దర్శించే శాశ్వతమైన తన లోకాన్ని కరుణామయ హృదయంతో గోపకు లందరికీ చూపించాడు

తెభా-10.1-963-వ.
ఇట్లు హరి ము న్నక్రూరుండు పొందిన లోకమంతయుం జూపి, బ్రహ్మలోకంబునుం జూపినం జూచి, నందాదులు పరమానందంబునుం బొంది వెఱఁగుపడి హంసస్వరూపకుండైన, కృష్ణునిం బొడగని పొగడి పూజించి; రంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; హరి = కృష్ణుడు; మున్ను = ఇంతకు పూర్వము; అక్రూరుండు = అక్రూరుడు; పొందిన = దర్శించగలిగిన; లోకము = పుణ్యాలోకము; అంతయున్ = ఎల్లను; చూపి = కనబరచి; బ్రహ్మలోకంబున్ = బ్రహ్మదేవుని లోకమును; చూపినన్ = కనబరచగా; చూచి = చూసి; నంద = నందుడు; ఆదులున్ = మున్నగువారు; పరమ = నిరతిశయ; ఆనందంబున్ = ఆనందమును; పొంది = పొంది; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; హంస = పరమాత్మ; స్వరూపకుండు = స్వరూపమైనవాడు; ఐన = అయినట్టి; కృష్ణునిన్ = కృష్ణుని; పొడగని = కనుగొని; పొగడి = స్తుతించి; పూజించిరి = అర్చించిరి; అంత = అప్పుడు.
భావము:- ఇలా శ్రీహరి పూర్వం అక్రూరుడు పొందిన బ్రహ్మలోకాన్ని చూపగా, నందుడు మొదలైనవారు దర్శించారు. పరమానందం చెందారు. హంసస్వరూపుడైన శ్రీకృష్ణుడిని వారు ఆశ్చర్యంతో వీక్షించి, అభినుతించి, అర్చించారు. పిమ్మట. . .